15, ఫిబ్రవరి 2010, సోమవారం

పేరు చెబితే చాలదు ...

శాస్త్రాణ్యధీత్యాపి భవంతి మూర్ఖా :
యస్తు క్రియవాన్ పురుష: స విద్వాన్
సు చింతితం ఔషధ మాతురాణాం
నా నామ మాత్రేణ కరోతి శాంతి :

బాగా ఆలో చించి నిర్ణయించిన ఔషధమే అయినా, దాని పేరు చెప్పినంత మాత్రాన రోగం పోదు కదా ? శాస్త్రాలు చదివినా, క్రియాశేలురు కాక పోతే మూర్ఖులుగానే మిగిలి పోతారు.

14, ఫిబ్రవరి 2010, ఆదివారం

వాక్యం రసాత్మకం కావ్యం ...

నిరవద్యాని పద్యాని యద్యనాధస్య కా క్షతి:
భిక్షుణా కక్ష నిక్షిప్త కిమిక్షుర్నీరసో భవేత్ ?


కవి దరిద్రుడయినా, ధనికుడయినా, కవిత్వం రసవంతంగా ఉంటే చాలు. బిచ్చగాని చేతి చంకనున్నంత మాత్రాన చెఱకు గడకు తీపి తరిగి పోదో దు కదా !

12, ఫిబ్రవరి 2010, శుక్రవారం

శివార్పణం - కథ



హర హర ! మహా దేవ !!





తల పైని చదలేటి యలలు తాండవమాడ
నలల త్రోపుడుల క్రొన్నెల పూవు గదలాడ
మొనసి ఫాలముమైన ముంగురులు చెఱలాడ
కను బొమ్మలో మధుర గమనములు నడయాడ
కను పాపలో గౌరి కసి నవ్వు బింబింప
కను చూపులను తరుణ కౌతుకము చుంబింప
కడగి మూడవ కంట గటి నిప్పులు వ్రేల
ధిమి ధిమి ధ్వని సరిద్గిరి గర్భములు తూగ
అమిత సంరంభ హాహాకారములు రేగ

ఆడెనమ్మా శివుడు !
పాడెనమ్మా భవుడు !

కిసలయ జటాచ్ఛటలు ముసురు కొని వ్రేలాడ
బుసలు గొని దల చుట్టు భుజగములు బారాడ
మకర కుండల చకాచకలు చెక్కులబూయ
అకళంక కంఠ హారాళి నాట్యము సేయ
ముకు జెఱములో శ్వాసముల దదడింపంగ
బ్రకట భూతి ప్రభా వ్రజమాచరింపంగ
విటల తటమున చెమట నిండి వెల్లువ గట్ట
తకఝణత యను తాళమానము తోడ
వికచ నేత్రస్యంది విమల చూపుల తోడ

ఆడెనమ్మా శివుడు !!
పాడెనమ్మా భవుడు !!

మహా శివ రాత్రి శుభాకాంక్షలు .. ఈ పర్వ సందర్భంగా సరస్వతీ పుత్ర పుట్ట పర్తి నారాయణాచార్యుల వారి ప్రసిద్ధ కావ్యం శితాండవం నుండి మీది మీగడ తరకలు ...

8, ఫిబ్రవరి 2010, సోమవారం

పులి జూదం







అశ్వం నైవ గజం నైవ
వ్యాఘ్రం నైవచ నైవచ
అజా పుత్రం బలిం దద్యాత్
దైవో దుర్బల ఘాతక:


గుఱ్ఱాన్నీ, ఏనుగునీ బలి యివ్వరు. బలం లేని మేకనే బలి యిస్తారు. దేవుడు దుర్బలులనే శిక్షిస్తాడు కదా !
చరిత్ర గతిని పరిశీలిస్తే , యిది నిజమే అనిపిస్తుంది కదూ ! ఈ పర పీడన పరాయణత్వం అంతటా కనిపిస్తూనే ఉంటుంటుంది.

‘‘ బలవంతులు దుర్బల జాతిని
బలహీనుల కావించారు
ఏ దేశ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వ కారణం ?

నర జాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకు తినడం ... ’’ అని శ్రీ.శ్రీ అన లేదూ ?


భాస్కర శతకంలోని పద్యం అదే చెబుతోంది కదూ !

తగిలి మదంబుచే నెదిరిఁదన్ను నెఱుంగక దొడ్డ వారితోఁ
బగఁగొని పోరుటెల్ల నతి పామరుడై చెడు ; టింతెఁగాక, తా
నెగడి జయింప నేరడిది నిక్కము ; తప్పదు ; ధాత్రి లోపలన్
దెగి యొక కొండతోఁదగరు ఢీ కొని తాకిన నేమి భాస్కరా !


తన బలమేమిటో గ్రమించుకో లేక, ఎదిరి బలాన్ని ( శత్రువు బలాన్ని) అంచనా వేసుకోకుండా, బలవంతుడితో ఢీకొట్టి పోరుకి సిద్ధ పడిన వాడు చెడి పోతాడనడంలో సందేహం లేదు...
లోకంలో కొండని మదంతో ఢీ కొట్టిన పొట్టేలు ఏమవుతుందో చూస్తూనే ఉన్నాం కదా ! కొండ అలాగే ఉంటుంది. పొట్టేలు మాత్రం ఛస్తుంది.

ఈ చెప్పిన విషయాలు కొంత నిరాశా వాదాన్ని ప్రోది చేస్తున్న వేమో అనుకునే పని లేదు. వ్యష్టి శక్తి సమిష్టి శక్తిగా రూపు దాల్చడం జరుగని రోజులవి. అయినా, దోపిడీ వర్గ స్వభావాన్నీ, బలాన్నీ చక్కగానే అంచనా వేసాయనే చెప్పాలి.
చీమలు పెట్టిన పుట్టలు పాముల ఆక్రమణకి లోను కావడం ఈ దోపిడీనే తెలియ జేస్తుంది.

అయితే, మన బద్దెన కవి హెచ్చరిక చేయనే చేసాడు కదూ ! ...


బలవంతుఁడ నాకేమని
బలువురితో నిగ్రహించి పలుకుట మేలా ?
బలవంతమైన సర్పము
చలి చీమల చేతఁజిక్కి చావదె సుమతీ !

7, ఫిబ్రవరి 2010, ఆదివారం

అధికారాంతమునందు చూడవలె ....







ఒక చక్కని శ్లోకం చూదామా?

ప్రాప్య ప్రమాణ పదవీం కోనామూస్తే తులేవ లేపస్తే
వయసి గరిష్ఠ మధస్తాత్ లఘుతరముచ్ఛైస్తరాం కురుషే


ఈ శ్లోకంలో కవి అన్నిటినీ తూచే త్రాసుని ఏమని నిందిస్తున్నాడో చూడండి ...

ఓ త్రాసా ! నీ కెంత గర్వం ! తూచే పదవిని పొందాను కదా అనే గర్వం తల కెక్కి గురుతరమయిన వాటిని ( బరువైన వాటిని ) క్రిందికి నొక్కి వేస్తున్నావు ... తేలికయిన వాటి నేమో మీదికి ఎత్తుతున్నవు కదా !

త్రాసు చేసే పని అదే కదా ? బరవు ఉన్న తక్కెడ క్రిందికీ, తేలిక వస్తవులున్న తక్కెడ మీదికీ లేవడం సహజమే కదా ...
అల్పులకి అధికారం వస్తే ... సమర్ధులని అణగ ద్రొక్కి , అసమర్ధులని అందలాలెక్కిస్తారని కవి యిందులో భంగ్యంతరంగా చెబుతున్నాడన్నమాట !


ఎలాగూ సందర్భం వచ్చింది కనుక, నీచులకి భాగ్యవాశాత్తు అధికారం దొరికితే ఎలా ఉంటుందో చక్కని పద్యం ఒకటి చూడండి మరి ...

విధి సంకల్పముచే నొకానొకడు తా విశ్వంబు పాలించుచో
బధిరంబెక్కువ , చూపు తక్కువ , సదా భాషల్ దురూక్తుల్, మనో
వ్యధతో మత్తత తోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం చెందు న
య్యధి కారాంతమునందు చూడ వలె నయ్యంగారి సౌభాగ్యముల్ !


నీచుడికి అధికారం వస్తే, వాడికి (మంచి ) మాటలేవీ వినబడవు. ఆ విషయంలో బధిరుడవుతాడు, చూపు మందగిస్తుంది.. అంటే మంచిని గ్రహించడు. ఎప్పుడూ చెడ్డ మాటలే మాట్లాడుతూ, చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు ...
ఐతే, ఆ అధికారం పోయాక చూడాలయ్యా, ఆ అయ్య గారి వాలకం ! అని కవి దెప్పి పొడుస్తన్నాడు.
లంచ గొండులూ, కఠినాత్ములూ, పరుషంగా మాట్లాడే వారూ, పెద్ద హోదాలో ఉన్నంత కాలం విర్ర వీగడం , పదవీ విరమణ చేసాక నాగు పాము కాస్త మంటి బొక్కడం లాగా మారిపోవడం మనకి తెలిసిందే కదా !
మహా కవి కాళి దాసు శాకున్తలం లో అధికారం ఎలాంటిదో వివరిస్తూ చెప్పిన గొప్ప శ్లోకం ఉంది ...

ఔత్సుక్య మాత్ర మవసాదయతి ప్రతిష్ఠా
క్లిశ్నాతి లబ్ధ పరిపాలన వృత్తిరేనం
నాతి శ్రమాపనయనాయ న చ శ్రమాయ
రాజ్యం స్వహస్త ధృత దండమివాత పత్రమ్

రాచరికం సకల సంపదలతో, విలాసాలతో, భోగ భాగ్యాలతో, గౌరవ మర్యాదలతో కూడినదే అయినా, అది తన చేతితో పట్టుకున్న ఆత పత్రంలాగా సుఖాన్ని కలిగిస్తూనే ఉంటుంది కాని, అంత సుఖకరం కాదు ...

అధికారంలో ఉండే ప్రభువు ఎంత జాగురూకుడై ఉండాలో, సుపరిపాలన ఎలా చేయాలో నారదుడు ధర్మ రాజుకి వివరించే గొప్ప పద్యాలు మహాభారతంలో ఉన్నాయి ...
సభా పర్వంలో నారదుడు పాండవులకి చెప్పిన రాజనీతి ధర్మాలు సర్వ కాలాలలోనూ. సకల దేశాలలోనూ ప్రభువులకి చక్కని మార్గదర్శకాలని చెప్పాలి.
మచ్చుకి ఒక్క పద్యం ...

కడుఁజనువాఁడునై పురుషకారియు దక్షుఁడు నైన మంత్రి పెం
పడరగ రాజ పుత్త్రుల మహా ధనవంతులఁజేసి, వారితో
నొడబడి పక్షమేర్పడఁగ నుండడుగా , ధన మెట్టి వారికిం
గడుకొని చేయకుండునె ! జగన్నుత ! గర్వము దుర్విమోహమున్.
ఎక్కువ పలుకుబడి కలిగి, క్రియాశీలి, సమర్ధుడు అయిన మంత్రి - ఇతర రాజకుమారులని మహో ధనవంతులుగా చేసి, వారితో చేతులు కలిపి, నీకు వ్యతిరేక వర్గంగా ఏర్పడేట్లు చేయడం లేదు కదా ! ఎందుకంటే, ధనం ఎలాంటి వారికయినా దురాశనూ, గర్వాన్నీ కలిగిస్తుంది కదా !

అధికారం కోసం వెంపర్లాడే మన రాజకీయ నాయకమ్మన్యులు ఇలాంటి రాజనీతి ధర్మాలని ఆకళింపు చేసుకోవాలి. కాని, అది, పేరాశ కదూ !


6, ఫిబ్రవరి 2010, శనివారం

చిలుకా పలకవే ....





సద్విద్యా యది కా చింతా
వరా కోదర పూరణే
శుకోప్యశన మాప్నోతి
రామ రామేతి చాబ్రువన్


ఎంత చక్కని శ్లోకమో చూడండి ...
రామ రామ అనే రెండు మాటలు నేర్చిన చిలుకే తన తిండిని తాను సంపాదంచుకో గలుగుతోంది. హాయిగా బ్రతుకుతోంది.
మరి, బాగా చదువుకున్న వారికి ఎందుకంత బెంగ ?

బాగుంది కదూ ! ఇలాంటి చక్కని శ్లోకాల నీ, మంచి పద్యాలనీ ఇక నుండీ ఈ టపాలో మీరు చూడ వచ్చును ...

5, ఫిబ్రవరి 2010, శుక్రవారం

చదరంగం - వడ్ల గింజల లెక్క !





చదరంగం గళ్ళలో , మొదటి గడిలో ఒక వడ్ల గింజను ఉంచి, తర్వాతి గళ్ళలో రెట్టింపు చేసుకుంటూ పోతే, మొత్తం చదరంగం గళ్ళలో ఎన్ని వడ్ల గింజలు పెడతామో తెలుసా ! అనే లెక్క గురించి మనకి తెలిసిందే కదా ? పావులూరి మల్లన సార సంగ్రహ గణితం లో పద్య రూపంలో యీ లెక్కనీ, దాని జవాబునీ యిచ్చాడు . చూదామా ...

మొదలొకట నిల్పి, దానిం
గదియఁగఁదుది దాక రెట్టిగా గూడినచో
విదితముగ బల్కు మాకుం
జదరంగపు టిండ్ల కైన సంకలితమొగిన్

ఇదీ లెక్క. దీనికి జవాబు :

శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియన్నగాగ్ని భూ
ధర గగనాబ్ధి వేద గిరి తర్క పయోనిధి పద్మ జాస్య కుం
జర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తరమగు రెట్టి రెట్టి కగు సంకలితంబు జగత్ప్రసిద్ధికిన్


ఇందులో కవి అంకెలకి బదులుగా కొన్ని సంకేత పదాలు ఉపయోగించాడు. వాటి అర్ధాలు తెలుసుకుని వరుసగా అంకెలు వేసుకుంటూ పోతే జవాబు వస్తుంది . ఐతే, అంకెలను వెనుక నుంచి, అంటే, కుడి నుండి ఎడమకు వేసుకుంటూ వెళ్ళాలి.
పద్యంలోని సంకేత పదాలకి సరైన అంకెలు ...

శరములు = సాయకములు = ఐదు
శశి =చంద్రుడు = తుహినకరుడు = ఒకటి
షట్కము = ఆరు
వియత్తు = గగనము = సున్న
వేదములు = నాలుగు
పద్మజాస్యుడు = నాలుగు ముఖములు గల వాడు =బ్రహ్మ = నాలుగు
రంధ్రములు = నవ రంధ్రములు = తొమ్మిది
అగ్నులు = మూడు
నగములు = భూ ధరములు = గిరులు = ఏడు
తర్కములు = ఆరు
కుంజరములు = అష్ట దిక్కులలో ఉండే ఏనుగులు = ఎనిమిది.

ఈ సంకేత పదాల అర్ధాలను అనుసరించి వెనుక నుండి అంకెలు వేసుకుంటూ పోతే జవాబు వస్తుంది !

ముందు మీరు ప్రయత్నించండి.
లేదా,


జవాబు తెలుసు కోవాలంటే క్రింది తెలుపు భాగాన్ని డ్రాగ్ చేసి చూడాల్సిందే.మరి మీ యిష్టం !

18446744073709551615


4, ఫిబ్రవరి 2010, గురువారం

జఠరాగ్ని - కథ

భోజన ప్రియత్వం మీద రాసిన ఈ కథ ఆంధ్రభూమి దిన పత్రిక నేటి కథ శీర్షికలో ప్రచురణ జరిగింది. బాగా తిన గలిగే రోజులలో లేమి కారణంగా సరైన తిండి దొరక్క పోవడం, కలిమి కలిగిన దినాలలో ఆరోగ్య కారణాల చేత తిండి తిన లేని అశక్తత .., కొందరిలో చూస్తూ ఉంటాం కదూ ! ఈ జీవిత వైచిత్రిని కథా వస్తువుగా స్వీకరించి రాసిన చిన్న కథ యిది !
Posted by Picasa