30, నవంబర్ 2010, మంగళవారం

మధ్యలో నన్నెందుకు లాగుతావూ ?!


( నీ హిత వచనమ్ డాట్ కామ్ సిగ్గోసిరి. మధ్యలో నన్నెందుకు
లాగుతావూ ?! హన్నా !!)


ఒక శ్లోకం చూడండి:

అసంభావ్యం న వక్తవ్యం, ప్రత్యక్ష మపి దృశ్యతే
శాలి తరతి పానీయం, గీతం గాయతి వానర:

నువ్వు ప్రత్యక్షంగా చూసినదే అయినా, అది అసంభవమైన విషయం అయితే మట్టుకు దాని రించి ఎప్పుడూ ఎవరితోనూ చెప్ప వద్దు సుమీ !

ఎందుకంటే, ‘ నీటి మీద రాయి తేలింది. కోతి పాటలు పాడింది’ అని చెబుతే ఎవరయినా నవ్వుతారే కాని నీ మాటలు నమ్మరు సుమా ! అని, ఈ శ్లోక భావం.

అసత్యం వ్యాప్తి చెందేంత త్వరగా సత్యం వ్యాప్తి చెందదు మరి. అసత్యానికి వెయ్యి కాళ్ళు, వినడానికి లక్ష చెవులు. తిరిగి వ్యాపింప చేయడానికి కోటి నోళ్ళు ఉంటాయి.

పాపం సత్యానికి అంత సీను లేదు. అలాగని సత్యం పలక వద్దని కాదు సుమా.

సత్యం వద. సత్యమే పలకాలి. ధర్మం చర . ధర్మాన్ని ఆచరించాలి.

24, నవంబర్ 2010, బుధవారం

ఒక పరి దైవం ... ఒక పరి దెయ్యం !


ఉదయాన్నే వచ్చేడు, మిత్రుడు భీమ్ పాపాల శర్మ. వాడిని చూస్తూనే నా గుండె తరుక్కు పోయింది.పది లంఖణాలు చేసిన వాడిలా ఉన్నాడు. మనిషిలో ఉత్సహం ఎక్కడా మచ్చుకయినా లేదు. దెయ్యాలతో సయ్యాట లాడించ గలవాడూ, హత్యలూ, హింస అంటూ నిత్యం కరాళ తాండవం చేసే వాడూ, చరిత్రలో రక్తపు జాడలను రొక్కంగా మార్చ గల చతురత కలవాడూ అయినా , నా మిత్రుడే ఇలా డీలా పడి పోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.

ఏం జరిగిందేం జరిగిందని నేను అడిగే లోపే బెక్కుతూ చెప్పేడు: ‘‘ వెధవ కల ! వెధవ కలా
అని ! వొట్టి పీడ కల ! జడిసి పోయి చచ్చేననుకో !’’ అన్నాడు.

‘‘ ఏమిట్రా, ఆ కల ? ’’ అడిగేను.

‘‘ నా ఖర్మ కాలి, ఓ పేద్ధ కార్పొరేట్ హాస్పటల్ కి వైద్యం కోసం వెళ్ళినుట.’’

‘‘ అయితే ...?’’

‘‘ నా జబ్బు తగ్గ లేదు సరి కదా, వాళ్ళు నన్నూ, నా పర్సునీ, నా క్రెడిట్ కార్డునీ, బేంక్ బ్యాలన్సునీ, మొత్తం ఊడ్చేసారు ...’’

‘‘ పోనీ, నీ రోగం కుదిరిందా ?’’

నా మాటల్లో వ్యంగ్యం ధ్వనించిందేమో, నిష్ఠుర పడుతూ అన్నాడు: ‘‘ నా బొంద తగ్గింది. తగ్గితే, ఇలా ఉంటానూ? .... రాత్రికి రాత్రే ఎవరి కంటా పడకుండా ఇలా పారి పోయి వచ్చేసాను ... ఇంకా ఉంటే, నా గోచీ కూడా మిగల్చ రేమో నని భయం వేసిందనుకో ...’’

‘‘ భయమెందుకురా? ... కలే కదా, సరే, ఇంతకీ ఏం రోగం వచ్చిందని అక్కడికి
వెళ్ళావు ?’’ ఆరాతీసాను.

‘‘ బుద్ధి తక్కువై వెళ్ళాను. కొంచెం జలుబు చేసిందంతే. జండూ బామ్ తో పోయే దానికి, తగుదునమ్మా అని, ముచ్చట కొద్దీ అక్కడికి వెళ్ళానులే .... కలలోనే కదా అని కొంచెం సాహసం చేసినట్టున్నాను.... గుండు గొరిగీసేరు ...కచ్చ దాదాపు ఊడదీసీసేరు ...’’ ఏడుస్తూ చెప్పేడు.

వాడిని ఓదార్చి, సాగనంపేక ఆలోచనలో పడ్డాను.

* * * * * * * * * * * * * * * * * * * *

‘వైద్యో నారాయణో హరి : ’ అన్నారు. కానీ, వైద్య రంగం కలవారికే కానీ, లేని వారికీ, సగటు జనాలకు - అందని మ్రాని పండే అవుతోంది. అక్కరకు రాని చుట్టమే అవుతోంది. అందని గగనమే అవుతోంది. భయ పెడుతోంది. బాధిస్తోంది. పీడిస్తోంది. ధన మదం పట్టిన వైద్య రంగంతో దేశం జబ్బు పడింది.


వైద్యం సరిగా తెలియని వారిని వెక్కిరిస్తూ, ‘ నీ చేతి మాత్ర, వైకుంఠ యాత్ర ’ అనడం కద్దు.

కాని, ఇప్పుడు వైద్య రంగం శత సహస్రదళాలుగా వికసించింది. విస్తరించింది. కాని , ఏం లాభం !
అధిక శాతం జనాభాకి అందుబాటులో ఉండడం లేదు.

అప్పిచ్చు వాడు, వైద్యుడు,
ఎప్పుడు ఎడ తెగక పారు ఏఱును, ద్విజుడున్
చొప్పడిన ఊర నుండుము
చొప్పడ కున్నట్టి ఊరు చొరకుము సుమతీ !

అని, బద్దె భూపాలుడు నెత్తీ నోరూ కొట్టుకుని మరీ చెప్పేడు. ఇప్పుడు దాదాపు ప్రతీ ఊళ్ళోనూ వైద్యులు కనిపిస్తున్నారు. కాని, వారిలో కనిపించని దల్లా రవ్వంత మానవీయ దృక్పథం. అంతే.

అందుచేతనే కదా, ఒక శ్లోకంలో కవి ఇలా అన్నాడు:

వైద్య రాజ నమ స్తుభ్యం, యమరాజ సహోదర !
యమస్తు హరతి ప్రాణాన్, వైద్య:ప్రాణాన్ ధనానిచ.

యముడికి తోడ బుట్టిన వాడి వయిన ఓ వైద్యుడా ! నీకు నమస్కారం. ఎందుకంటే, యముడు కేవలం ప్రాణాలనే తీసుకుని పోతాడు. మరి వైద్యుడో ? ప్రాణాలనూ, ధనాన్నీ కూడా హరిస్తాడు. కనుక, నా జోలికి రాకయ్యా, నీకో నమస్కారం ! అని దీని భావం.

ఈ శ్లోకం చూడండి:

యావత్కంఠగతా: ప్రాణా::, యావన్నశ్యతి చేంద్రియమ్
తావత్ చికిత్సా కర్తవ్యా, కాలస్య కుటిలా గతి:

వైద్యం ఎంత వరకూ చేయాలయ్యా, అంటే,

గొంతులో ఊపిరి ఉన్నంత వరకూ. ఇంద్రియాలలో చైతన్యం ఉన్నంత వరకూ.వైద్యుడు రోగికి చికిత్స చేస్తూనే ఉండాలి. కాల గతి చెప్పరానిది సుమీ ! అని దీని భావం.

కానీ, వాస్తవంలో జరిగేది వేరు. యావత్తైలం, తావద్వ్యఖ్యానమ్ అన్నట్టుగా, రోగి డబ్బులు ఇచ్చేంత వరకే వైద్యుడు చికిత్స చేస్తున్నాడు. తరువాత నీ చావు చావు పొమ్మంటున్నాడు. అవును కదూ?

అయితే, వైద్యుడేమీ భగవంతుడు కాడు కదా, చికిత్స జరిపించ గలడు కానీ, ఆయుర్దాయం నిలప లేడు కదా. క్రింది శ్లోకం అదే చెబుతోంది.

వ్యాధే: తత్త్వ పరిఙ్ఞానం వేదనాయాశ్చ నిగ్రహ:
ఏతద్వైద్యస్య వైద్యత్వం, న వైద్య: ప్రభురాయుష:

వ్యాధి స్వభావం తెలుసు కోవడం, ఉన్న బాధను తగ్గించడానికి ప్రయత్నించడం, ఇంత వరకే వైద్యుడు చేయ గలడు. ఆయుర్దాయం మాత్రం వైద్యుని చేతిలో లేదు కదా ! అని దీని భావం.

కానీ, వాస్తవంలో, రోగికే తెలిసి పోతున్న వ్యాధి ఏమిటో కనుక్కునే నెపంతో వైద్యుడు చేయించే పరీక్షలు అన్నీ యిన్నీ కావు.వ్యాధి నిర్ధారణ మాట అలా ఉంచితే, రోగి వాటితోనే సగం దివాళా తీయడం ఖాయం.


అయితే, ఒకటి ... నీ కంటూ కథా మంజరి పేరుతో ఓ దిక్కుమాలిన బ్లాగు ఉంది కనుక, తెలుగులో ఏపిల్ కీ బోర్డుతో టైపు చేయగల నేర్పు ఉంది కనుక, వైద్యుల గురించి అవాకులూ చవాకులూ పేలుతున్నావు, ఎక్కడెక్కడివో శ్లోకాలు ఉటంకిస్తూ రాద్ధంతం చేస్తున్నావు ... మరి వైద్యులూ మనుషులే కదా, వాళ్ళూ బ్రతకొద్దూ? అంటారేమో,

చూడండి:

వైద్యామృతంలో ఒక శ్లోకం ఏమని చెబుతోందో ...

నైవ కుర్వీ లోభేన, చికిత్సా పుణ్య విక్రయమ్
ఈశ్వరాణాం వసుమతాం, లిప్సేతార్ధం తు వృత్తయే.

చికిత్స చేసే వైద్యుడు ఆ పుణ్యాన్ని ధనాశాపరుడై అమ్ముకో కూడదు. చికిత్సను ఒక దైవ కార్యంలాగా చేయాలి. అంతే తప్ప డబ్బుకి అమ్ముకో కూడదు. కాని, వైద్యులు తమ కుటుంబ పోషణ కోసం కాసులు కల వారి వద్ద, ఇవ్వగల స్తోమత కల వారి వద్ద నుండి కోరినది తీసికో వచ్చును. అని దీని భావం.

అంటే, డబ్బున్న వారినుండి డబ్బు తీసుకుని, పేదలకు వీలయితే ఉచితంగానూ. లేదంటే
నామ మాత్రపు వసూలు తోనూ వైద్యం చేసి మానవత్వం చూపించాలని దీనర్ధం.

కాని, దురదృష్టవశాత్తు వైద్యులు అలా ప్రవర్తించడం (ఎక్కడో, ఎవరో కాని ) లేదు. నిజానికి వైద్యుడు నారాయణుడితో సమానం. దైవంతో సమానుడైన వైద్యుడు


కొండొకచో



దెయ్యంగా మారి పోతున్నాడనేదే నా ఫిర్యాదు.

ఈశ్లోకాలు కూడా చూడండి:

జృంభమానేషు రోగేషు, మ్రియమానేషు జంతుషు
రోగ తత్త్వేషు శనకై: వ్యుత్పద్యంతే చికిత్సకా:

ప్రవర్తనార్ధ మారంభే, మధ్యే త్వౌషధ హేతవే
బహుమానార్ధ మంతే చ, జిహీర్షంతి చికిత్సకా:

రోగుల నుండి డబ్బులు గుంజు కోవడంలో వైద్యలకు వారి చిట్కాలు వారికి ఉన్నాయి. ఆ టెక్నిక్కులు , గిమ్మిక్కులు, మేజిక్కుల, వారికి బాగా తెలుసును. ఈ శ్లోకంలో కవి అదే చెబుతున్నాడు. చూడండి:

రోగాలు ముదిరి పోయి ప్రాణాలు కడ తేరి పోతూ ఉంటే, రకరకాల పరీక్షలూ గట్రా చేసి, ప్రయోగాలూ విశ్లేషణలూ జరిపి, (కొందరు) వైద్యులు అప్పుడు మెల్లగా రోగ తత్వం తెలిసిందంటూ చికిత్సకి పూనుకుంటారు.

మొదట రోగ నిదానం చేయడానికి డబ్బు గుంజుకుంటారు. మధ్యలో మందులకని డబ్బు లాగుతారు. చివరలో బహుమానమని (అంటే, రోగం తగ్గింది కనుక సంతోషం కొద్దీ) డబ్బులిమ్మని వేధిస్తారుట. ఇదీ లోక రీతి అని కవి చెబుతున్నాడు. మొత్తానికి ఆది మధ్యాంతాలలో కూడా వైద్యుడు డబ్బులు గుంజుతూనే ఉంటాడని కవి భావన.

ఈ కాలంలో బహుమానం పేరుతో అడక్క పోయినా, రూమ్ ఛార్జీలూ, సేవల ఛార్జీలూ, బెడ్ ఛార్జీలూ, మన్నూ మశానం పేరుతో బాగానే గుంజుతారు. రోగం కుదిరిందన్న ఆనందం హరించుకు పోయి, రోగికి ఈ పీడ ఎక్కువవుతుంది. ఖర్మ కాలి, రోగి టపా కట్టేస్తే, చెప్పే పని లేదు. మృత దేహం ఒప్పగించడానికిన్నూ అధిక మొత్తం చెల్లించాల్సిందే కదా !


చివరిగా మంచి ఆరోగ్యం కోసం మన పెద్దలు ఏం చెప్పారో కూడా చూడండి మరి ...

ఆరోగ్యం భాస్కరా దిచ్చే, ద్ధన మిచ్చేత్ హుతాశన:
ఙ్ఞానం మహేశ్వరా దిచ్చేత్, మోక్ష మిచ్చేత్ జనార్ధనాత్.



సూర్య భగవానుని ఉపాసించడం వలన చక్కని ఆరోగ్యం కలుగుతుంది.
అగ్నిని ఉపాసించడం వలన సంపద కలుగుతుంది.
ఈశ్వరుని వలన ఙ్ఞానం కలుగుతుంది.
జనార్దనుని వలన మోక్షం కలుగుతుంది.

స్వస్తి.









17, నవంబర్ 2010, బుధవారం

అప్పటికి కానీ బుద్ధి రాదు, మరి !


అంధత్వం ఒక అంగ వైకల్యం. దురదృష్టవశాత్తు జన్మత: అంధత్వం కలిగితే, ఆ బ్రతుకంతా ఇక దుర్భరమే.

గ్రుడ్డితనం అనేది మనుషులకు చూపు సరిగా ఉండి కూడా, వేరే విధంగా వచ్చే అవకాశం ఉంది.

కళ్ళుండీ చూడ లేని కబోదులు కొందరుంటారు. వారిదంతా వక్ర బుద్ధి. అందు చేత వారి దృష్టి కూడా వక్ర మార్గాన్నే పడుతుంది.

దయామయుడైన భగవంతుడు రెండు నేత్రాలనూ ఇచ్చినది ప్రకృతిలోని అందాలను తనివి తీరా చూసి తరించేందుకే కదా ! హరిత శోభతో అలరారే చెట్లూ, చేమలూ, లతానికుంజాలూ, సూర్యోదయ సూర్యాస్తమయాల వేళ రాగ రంజితమైన ఆకాశమూ, నదులూ, సెలయేళ్ళూ, ఎగిరే పక్షులూ, పుచ్చ పువ్వులాంటి వెన్నెలా, రంగుల హరివిల్లులూ, కొండ కోనలూ. జలపాతాలూ, చెంగున దుమికే లేళ్ళూ, ... ఇలా ప్రకృతి అందాలు చూడడానికే కదా కళ్ళున్నది, కానీ, కరెన్సీ నోట్లను మాత్రమే చూడగోరే కళ్ళు ఉండీ లేనట్టే. అలాంటి వారు జాత్యంధులతో సమానం.

మహా భారతంలో ధృతరాష్ట్రుడు పుట్టు గ్రుడ్డి. దానికి తోడు అతనికి అలవిమాలిన పుత్ర
వాత్సల్యం అనే గ్రుడ్డితనం కూడా దాపురించింది. దానితో కౌరవ వినాశనానికి అతడే మూల కారకుడయ్యేడు.

సారపు ధర్మం, విమల సత్యం పారము పొంద లేక నాశనమవుతూ ఉంటే, నివారింప గల సమర్ధత కలిగి ఉండి కూడా , ఎవడు ఉపేక్ష చేస్తాడో , అది వాడికే చేటు కలిగిస్తుందని శ్రీకృష్ణుడు మహా భారతంలో హెచ్చరించాడు కదా?

అందు వల్ల కళ్ళు లేక పోవడం దయనీయమే అయినా, కళ్ళుండీ కానక పోవడం మాత్రం క్షంతవ్యం కానేరదు.

చాల మంది ఇలా కళ్ళున్న కబోదులుగా ఎందుకు మారుతున్నారయ్యా అంటే, మదం ముదిరి పోవడం వల్ల, అహంకారం అతిశయించడం వల్ల. అయాచితంగా ఉన్నత పదవీయోగం చేకూరడం వల్ల. తరాల తరబడి తిన్నా తరగని గని లాంటి సంపదలు వచ్చి పడడం వల్ల.

ఇలాంటి వారు పయనించేది పతన మార్గమే. ఇలాంటి వారిని అనుసరిస్తే మనకు పట్టే గతి కూడా అట్టిదే సుమా !

భాగవతంలో పోతనామాత్యుడు చెప్పిన పద్యం తెలిసినదే కదా?

కానని వాని నూత గొని కానని వాడు విశిష్ట వస్తువుల్
గానని భంగి కర్మములు గైకొని కొందఱు కర్మ బద్ధులై
కానరు, విష్ణుఁగొందఱటఁగందు రకించన వైష్ణవాంఘ్రి సం
స్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా !

గ్రుడ్డి వాడు మరొక గ్రుడ్డి వాని చేయి పట్టుకుని వాని సాయంతో ఏ వస్తువునూ చూడ లేడు.
అదే విధంగా, విషయాసక్తులై, కర్మ బంధాలలో చిక్కువడిన వారు శ్రీహరిని చూడ లేరు. కొందరు మహా విష్ణు భక్తులు మాత్రం ఆ స్వామిని కనులారా చూడ గలరు. అంతే కానీ సంసారంలో కొట్టు మిట్టాడుతూ ఉండే వారు భగవంతుడిని ఎన్నటికీ చూడ లేరు.

పుట్టుక చేతనే గ్రుడ్డితనం ప్రాప్తించిన వారిని సాయం తీసికొని మనం సత్యదర్శనం చేయ లేమని పోతన ఇందులో చెప్పాడు. కళ్ళున్న కబోదులను అనుసరించినా మన గతి అంతే అని కూడా అర్ధం చేసుకోవాలి.

కళ్ళున్న కబోదుల గురించి ఒక శ్లోకంలో కవి ఇలా వివరించాడు. చూడండి ...

సంపన్నో2ధవదేవ కించి దపరం నో వీక్షతే చక్షుషా,
సద్భి ర్వర్జితమార్గ మేవ చరతి ప్రోత్సాహితో జాలిశై:
తస్మిన్నేవ ముహు: స్ఖలన్ ప్రతిపదం గర్వాంధకూపే పత,
త్యస్యాంధత్వ నివర్తకైషధ మిదం దారిద్ర్య మేవాంజనమ్ !

మితి మీరిన సంపదలు కలవాడు గ్రుడ్డి వాడితో సమానం. అంధుడి లాగానే, వాడు తన కన్నులతో ఏమీ చూడ లేడు. దుష్టులతో తిరుగుతూ, వారి ప్రోత్సాహంతో సత్పురుషులు ఏవగించుకునే చెడు దారులలోనే సంచరిస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఆ చెడు మార్గం లోనే నడయాడుతూ ఉంటాడు. తమ చెడు ప్రవర్తన వలన చీటికీ మాటికీ అనేకమయిన దెబ్బలు తింటూ ఉంటాడు. అయినా బుద్ధి రాదు. తమ నడవడిక మార్చుకోడు. చివరకి అంధకూపంలోకి కూలి పోతాడు.

మరి, అలాంటి కళ్ళున్న కబోదుల అంధత్వం తొలిగించడానికి మార్గమే లేదా?

ఉంది.

వారి అంధత్వం పోగొట్టాలంటే దానికి దారిద్ర్యం అనేది ఒకటే తగిన అంజనం సుమా !

అంటే, అలాంటి వారి కళ్ళు తెరుచు కోవాలంటే, వారి సంపద ఉన్నదంతా ఊడ్చి పెట్టుకు పోయి, వాళ్ళు దరిద్రులయి పోవాలి, అంతా పోయేక కానీ వారి కళ్ళు తెరచు కోవు అంటున్నాడుశ్లోకంలో
కవి.

అలాగే, అధికార మదం చేత కళ్ళు కనిపించకుండా పోయే వారికి ఆ పదవి ఊడి పోతే తప్ప తిరిగి చక్కని చూపు రాదు. అధికారాంతమున చూడ వలె కదా, అయగారి సౌభాగ్యముల్ ! అని కదా ఓ కవి చెప్పాడు ...

స్వస్తి.

10, నవంబర్ 2010, బుధవారం

నా నరక లోక యాత్ర ... ద్వితీయ భాగం !!


నా నరక లోక యాత్ర మొదటి భాగంలో, నాకు నరకంలో బెర్తు ఖాయమై పోయినట్టే అని చెప్పాను. గుర్తండే ఉంటుంది. ఆ టపా చదవని వాళ్ళూ, గుర్తు లేని వాళ్ళూ ఈ లంకె నొక్కి చూడవచ్చును.

ఇక, ఇందులో నా నరక లోక యాత్రా విశేషాలు పొందు పరుస్తున్నాను ...
* * * * * * * * *

కళ్ళు తెరిచి చూద్దును కదా, నాకు తెలీని వేరే ఏదో లోకంలో ఉన్నాను. అక్కడంతా గలీజుగా ఉంది. నానా కంగాళీగానూ ఉంది. ఆర్తుల హాహాకారాలు మిన్నంటుతున్నాయి. వికటాట్ట హాసాలు కర్ణభేరి బ్రద్దలయ్యే లాగున ప్రతిధ్వనిస్తున్నాయి.సలసల క్రాగే నూనె బాణళుల నుండి వచ్చే ధూమం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొత్తానికి అక్కడ నానా బీభత్సంగానూ ఉంది. (ఐతే, ఒకటి, అదెంత భీకరంగా ఉన్నప్పటికీ హైదరాబాదంత గలీజుగా మాత్రం లేదనిపించడం విషయాంతరం)

కాస్త తమాయించుకుని, ‘‘ నేనిప్పుడెక్కడ ఉన్నాను?‘‘ అనడిగేను.
ప్రక్కనున్న రాక్షసాకారి వికటంగా నవ్వి, ’’ నరకంలో నయ్యా.‘‘ అని బదులిచ్చేడు.

’’ నరకం లోనా ! నన్నిక్కడి కెందుకు తెచ్చేరు? నేనేం పాపం చేసానని?‘‘ అనడిగేను గాభరాగా.

నాప్రశ్నకి వాడు జవాబు చెప్పే లోగానే, మరో ప్రక్క నుండి,’’ నరకానికి రాకేం చేస్తావురా,త్రాష్ఠుడా ! ‘‘ అనే మాటలు వినిపించేయి.

ఉలిక్కిపడి, అటు చూసేను. అక్కడ నా కథ లోని ప్రథాన పాత్రలలో ఒకడైన సర్వేశ్వర శాస్త్రులు కనిపించేడు. మనిషి కొంచె వడిలేడు. పూర్వపు నిగారింపు లేదు. దబ్బ పండులా ఎలా ఉండే వాడు ! పప్పూ. ఆవు నెయ్యీ, గోంగూర, ఆవకాయ పచ్చడీ, కంది గుండా, నువ్వుల నూనె, అప్పడాలూ, ఒడియాలూ, నాలుగు రకాల కూరలూ, పచ్చళ్ళూ, గారెలూ, నూలు పచ్చడీ, నువ్వులుండలూ, ముక్కల పులుసూ ....ఇవేవీ భోజనంలో అమరడం లేదు కాబోలు. కొంచెం జాలేసింది.

‘‘ మహానుభావా! మీరేమిటి ఇక్కడ ? క్రమాంతస్వాధ్యాయులూ, జటా,ఘనా,పనస తిరగేసీ మరగేసీ కూడా ఒప్ప చెప్పగల సమర్ధులూ,నిప్పును నీళ్ళతో కడిగే వంశీయులూ, ఇక్కడకి దయ చేసారేం?’’ అనడిగేను.

శాస్త్రుల వారి ముఖం మరింత దీనంగా తయారయింది.‘‘ నుదుటి రాత నాయనా ! నుదుటి రాత. ఆ వెంకన్న పంతులుగాడూ, వాడి మనుషులూ లేరూ, వాళ్ళ వల్ల వొచ్చింది నాకీ అరిష్టం. వాడు పెట్టిన పేచీయే కదా, నాచేత పాపం చేయించింది? అందుకే నన్నిక్కడికి లాక్కొచ్చేరు ...’’

‘‘ మరి ఆయనో ? ... ఆయనా ఇక్కడే ఉన్నారా? ...’’ అడిగేను, సంశయంగా.

‘‘ వాడి శ్రాద్ధం, ఉండకేం చేస్తాడూ ! అదిగో, ఆమూల అఘోరిస్తున్నాడు , మాష చక్రాలు (గారెలు) ఇక్కడ దొరక్క విలవిలలాడి పోతున్నాడు.’’

‘‘ఇంకా ఎవరెవరొచ్చేరో ...?’’

‘‘అంతా వచ్చేం నాయనా. బుచ్చి వెంకూ, చయనులూ, సొట్ట జగ్గడూ. బుచ్చబ్బాయీ, సూరిపంతులూ .. ఒహరనేమిటి? అంతా ఇక్కడే ఉన్నాం.’’

‘‘ గౌరీపతి రాలేదో? ...’’

‘‘ నీ పిండం కాకులకు పెట్టా. ఇలాంటి సందేహాలొస్తున్నాయేఁవిటయ్యా, నీకూ ..... గౌరీపతి గాడు రాకేం? మహా రాజు మొగుడిలా వచ్చేడు ... అడిగో ఆ ప్రక్కన జంద్యాలు వొడుకుతూ కూచున్నాడు, చూడు ...’’ అటు చూసేను. నిజఁవే. ఇంద్రుడూ వగైరాలు వెండివో, బంగారానివో జంద్యాలు వేసుకుంటారు కానీ , నూలు జంద్యాలు వేసుకోరు కదా? ఈ గౌరీపతి ఇక్కడ కూడా తాళం బిళ్ళ త్రిప్పుతూ నూలు జంద్యాలు వొడకడం ఎందుకో? నంగిరితనం. జడ్డితనం కాక పోతే, అనిపించింది.

నేనింకా ఏదో అడగబోయే లోగా శాస్త్రి గారే ఖంగున అడిగేరు: ‘‘ ఇక్కడి కొచ్చేటప్పుడు, చేతులూపుకుంటూ రాక పోతే, కాసిన్ని మాష చక్రాలు పట్టుకుని రాక పోయూఁవూ? నీ మొహం యీడ్చ. నోరు ఝలాయించి పోతోంది. ...’’ అన్నారు బాధగా.

‘‘ నాకో బీడీ కట్టయినా తెచ్చి ఉండాల్సింది ..’’ మరో ప్రక్క నుండి వెంకన్న పంతులు గొంతు పీలగా వినిపించింది.

మాట మార్చడానికి, ‘‘ అయితే, అంతా ఇక్కడకే చేరారన్న మాట ! ...’’ అన్నాను.

‘‘అఘోరిచావులే. యేళ్ళు ఎత్తికెట్టి కాల్చ. నీ పుట్టువు బూజు కాను. మేఁవే కాదు, అదిగో ఆ ప్రక్కన చూడు, మీ గురజాడా, వాడెవడూ? తల చెడిన ముండలకి మళ్ళీ పెళ్ళిళ్ళని , అదనీ ఇదనీ మన ఆచారాలని మంట కలిపేడు, వాడు, వీరేశలింగం కాబోలు వాడి పేరు ...వాడూ చాలా కాలమై ఇక్కడే ఉన్నాడు. వాళ్ళే అనేఁవిటి ? మీ కార్లమాక్స్ గాడూ, మావో గాడూ , వాళ్ళంతా ఆ సలసల మరిగే నూనెలో ఎలా వేగుతున్నారో చూడు !’’ అన్నారు అంతా ఉక్రోషంగా ముక్త కంఠంతో.

గాభరాగా అటు చూసేను. అక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళెవరూ లేరు. వీరప్పన్ లాంటి వాళ్ళెవరో కనిపిస్తున్నారు.

నన్నిక్కడికి తీసుకొచ్చిన యమ దూతలలో ఒకడు నా ప్రక్కలో పొడిచి, గుసగుసగా అన్నాడు: ‘‘ వాళ్ళెవరూ ఇక్కడ లేరు. అంతా హాయిగా స్వర్గంలో ఉన్నారు. ఈ ముసిలాయనకి తద్దినం బోయినాలు లేక, మతి భ్రమించి అలా మాట్లాడుతున్నాడు ....’’ అని.

రెండో భటుడు దానికి కొనసాగింపుగా చెప్పేడు: ’’ శాస్త్రి గారి భార్యా, రమణా, పరమేశూ కూడా అక్కడే ఉన్నారు ... నువ్వీయన మాటలు పట్టించు కోకు ... పద,నీ ఎంట్రీ ఇక్కడ రికార్డు చేయించాలి ...’’ అని.

‘‘మరి, మా తెల్లావో?’’ అడిగేను ఆత్రతగా.

ఈ సారి ఇద్దరు భటులూ ఏక కంఠంతో చెప్పారు: ‘‘ దానికేం ! అది కూడా అక్కడే నిక్షేపంగా ఉంది. ఇప్పుడు అసలక్కడ స్వర్గ లోకపు కేంటిన్ లో ఆ తల్లి క్షీరంతోనే కదా, అక్కడ ఇంద్రాదులకు కాఫీలూ గట్రా కాచేది !’’

నేను హమ్మయ్య ! అని ఊపిరి పీల్చుకున్నాను. ఇంతలో అక్కడికి వచ్చిన పురోహిత వర్గమంతా అక్కసు వెళ్ళ గ్రక్కుతూ గబగబా తలో మాటా అనడం మొదలెట్టేరు.

‘‘ మా మీద కథ రాస్తాడూ? అప్రాచ్యపు వెధవ. సలసలా మరిగే నూనె బాణలిలో పడెయ్యండి.‘‘

‘‘ వొళ్ళంతా శూలాలు గుచ్చండి’’

‘‘ కక్కకట్టుకి కొరత వెయ్యండి, తిక్క కుదురుతుంది’’

‘‘ వైతరణి నీళ్ళు బిందెల కొద్దీ త్రాగించండి.’’

‘‘ తెలుగు టీవీ ఛానెళ్ళు రాత్రీ పగలూ విడవకుండా చూపించండి.త్రాష్ఠుడు, కళ్ళు పేలిపోయి ఛస్తాడు.’’

‘‘ దిన పత్రికలలో నానా చెత్తా ఆచివరి నుండి, ఈ చివరి వరకూ అక్షరం విడవకుండా చదివించండి.’’

‘‘ కథా మంజరి బ్లాగు టపాలన్నీ కంఠోపాఠం చెయ్యమనండి.’’

నాకు నరక లోకంలో అమలు కావలసిన శిక్షలను వాళ్ళంతా అలా ఖరారు చేస్తూ ఉంటే నాకు వొళ్ళు కంపరమెత్తి పోయింది. వజవజ వణికి పోయేను.

యమభటులిద్దరూ నా భుజం మీద చరిచి, నాకు ధైర్యం చెబుతూ వాళ్ళతో ఇలా అన్నారు.’’ అబ్బే, అంత సీన్ లేదు లెండి. వీరిని ఆ కథ రాసినందుకు కాక, వేరే కారణం చేత ఇక్కడికి తీసుకుని వచ్చేం. ఇక్కడ అట్టే సేపు ఉంచం. ఇక్కడి రికార్డులలో వీరి పేరూ వివరాలూ మరో తూరి నమోదు చేసి, ఒక పేము బెత్తం దెబ్బ శిక్షతో సరి పుచ్చి, నేరుగా స్వర్గానికి బదిలీ చేస్తాం. అక్కడ కొలువు తీరి ఉన్న గురజాడ, చా.సో, విశ్వనాథ సత్యనారాయణ, దేవుల పల్లి , నండూరి, కవిత్రయం వారూ , పోతన ... ఓ ... ఇలా కోట్ల సంఖ్యలో ఉన్న మహానుభావులను చూసి తరిస్తూ, వారిని సేవించుకుంటూ , వారి దీవెనలు అందుకుంటూ అక్కడే ఉంటారు .......’’

‘‘ మరి మేఁవో ?!’’ ఏడుపు గొంతులతో ఒకేసారి అరిచినట్టుగా అన్నారంతా.

‘‘ మీరిక్కడే ఉండాలి. మీరిందాక చెప్పిన శిక్షలతో పాటు, అలాంటివే కొన్ని వేల వేల శిక్షలు మీకింకా అమలు పరచ వలసి ఉంది. వాటిలో మొదటి శిక్ష కథా మంజరి బ్లాగు టపాలన్నీ అక్షరం పొ్ల్లు పోకుండా కంఠోపాఠం చేసి గడగడా వొప్పగించడం!‘‘

‘‘ ఆఁ!!!‘‘ అంటూ, అంతా నోళ్ళు వెళ్ళ బెట్టీసేరు.

* * * * * * * * * *

నేను మనిషిని ప్రేమిస్తాను. మానవత్వాన్ని ఆరాధిస్తాను. కానీ, మనో రుగ్మతలను అసహ్యించుకుంటాను. మనో వైక్లబ్యాలను ఏవగించుకుంటాను.

వృత్తులను గౌరవిస్తాను. కానీ, ఆయా వృత్తి నిర్వహణలో వ్యక్తులు పోయే ద్వంద్వ ధోరణులూ, విపరీతపు పోకడలూ తిరస్కరిస్తాను. ఎండగడతాను .

ఆ కథ రాసినందుకు కించ పడిన ఒక వర్గీయులు నన్ను ‘‘ నరకానికి పోతావ్ రా, గాడిద కొడకా!’’ అని ఆశీర్వదించేరు. శాపనార్ధాలు పెట్టేరు. చాలా మంది మాత్రం, భుజం తట్టి ఆశీర్వదించేరు.


నానరక లోక యాత్రకు కారణభూతమయిన ఆ కథనీ, ఆ కథా నేసథ్యాన్నీ చదవాలనుకునే వారు ఈ లింకు నొక్కి చూడ వచ్చును.

శలవ్.

8, నవంబర్ 2010, సోమవారం

నా నరక లోక యాత్ర ... మొదటి భాగం !


ముందుగానే విన్నవించు కుంటున్నాను. ఇది ఏ వర్గాన్నీ కించ పరచడానికి వ్రాస్తున్నది కాదు. పంచతంత్రంలో ఒక శ్లోకం ఉంది. అందులో పురోహితులూ, సన్యాసులూ తప్పకుండా నరకానికి పోయే అవకాశం గురించిన ప్రస్తావన ఉంది.

చూడండి:

నరకాయ తే మతి శ్చేత్,
పౌరోహిత్యం సమాచర
వర్షం యావత్ కిమన్యేన
మఠచింతాం దినత్రయమ్.

ఈ శ్లోకంలో కచ్చితంగా ఎవరు నరకానికి పోతారో బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు శ్లోక కర్త.

వారెవయ్యా, అంటే,

నీకు నరకానికి పోవాలని కోరిక ఉంటే ఒక యేడాది పాటు పౌరోహిత్యం చెయ్యి !

అంతకాలం ఓపిక లేదనుకుంటే దానికీ ఓ మార్గం ఉంది.

ఒక మూడు రోజులు మఠం గురించి ఆలోచించు. మూడు రోజుల పాటు మఠ ప్రవేశం చేసి చూడు. అంతే, నీకు నరకం తథ్యం !

పౌరోహిత్యం చేసే వాళ్ళూ, సన్యాసులూ తప్పులు చేసే అవకాశం పుష్కలంగా ఉంది కనుక, వారు తప్పకుండా నరకానికి పోవలసిన వారే అని దీని భావం.

నాకున్న ఒకటి రెండు అనుభవాలు ఆలోచిస్తే, కనీసం, నాకు అది నిజమే అనిస్తుంది.
నేను ఉద్యోగ రీత్యా పని చేసే ఒక ఊరిలో ఒక పురోహితుడు ఉదయాన్నే, నాతో పాటు గంగయ్య హొటల్ లో పెసరట్టూ ఉప్మా లు తృప్తిగా తిని, వేడి వేడి కాఫీ కులాసాగా సేవించి, ఆతర్వాత, అవి అరిగే వరకూ వీధరుగుల మీద చీట్ల పేకలో తరించి, ప్రొద్దు తిరిగి, మధ్యాహ్నంఏ మూడింటికో తద్దినం పెట్టడానికి తీరికగా బయలు దేరే వాడు. అంత వరకూ, తద్దినం పెట్ట వలసిన ఇంటి యజమాని, వారి బంధుగణం ఉదయం నుండీ అభోజనంతో ఆకలితో నకనకలాడి పోతూ. నీరసాలు ముంచు కొచ్చి, ఇతని కోసం ఎదురు చూపులు చూస్తూ శోష వచ్చి పడి పోయే స్థితికి చేరు కునే వారు...

ఓ సారి మా మామ గారి ఇంట్లో ఒక భోక్త తీరా భోజనానికి కూర్చున్నాక, తిన లేక తిన లేక నాలుగు ముద్దలు నోట పెట్టుకని భళ్ళున అక్కడే వమనం చేసుకున్నాడుట. కారణం మరేమీ కాదు, డబ్బు కక్కుర్తితో అప్పటికే వేరొక చోట ఆ వ్యక్తి భోక్తగా వెళ్ళి కడుపు నిండా తిని రావడమేనని తెలిసింది.

నేను ఓ కుగ్రామంలో పని చేసే రోజులలో ఒక బ్రాహ్మణ కుటుంబీకులు ఇంట్లో పితృకార్యం చేస్తూ సాయంత్రం ఐదయినా, పిలిచిన భోక్తలు ప్రక్క ఊరి నుండి ఎంతకీ రాక పోవడంతోదిగాలు పడి పోయి, చివరకి పెళ్ళయిన బ్రహ్మచారిగా ఆ ఊళ్ళో ఒంటరిగా ఒక గది తీసుకుని ఉంటున్న నన్ను భోక్తగా రమ్మని బ్రతిమాలేరు. అప్పటికే నేను మధ్యాహ్న భోజనం కానిచ్చి, ఏదో పుస్తకం చదువుతూ ఓ కునుకు తీస్తున్నాను. నా భోజనం అయిపోయింది కదా, నేనెలా పనికి వస్తాను ? అనడిగేను. ఆ కుగ్రామంలో మరొక బ్రాహ్మణ నలుసు లేక పోవడం చేత, పాపమో,పుణ్యమో తమ ఇంటికి వచ్చి భోక్తగా తమ తల్లి గారి ప్రసాదం తిని వెళ్ళమని కన్నీళ్ళతో వేడుకున్నారు. నాకిక తప్పింది కాదు.ఆ రోజు నేను వారింటి పితృకార్యంలో నిష్ఠగా పాల్లొన లేదు. వారి బలవంతం చేతనే కావచ్చు, తిండి తినీసి, వారింటికి భోక్తగా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఆచారం మంట కలపేను. ఆ కారణం చేత నాకు నరకం తప్పదని నేను ఇప్పటికే నిర్ణయానికొచ్చీసేను.

ఇప్పుడు చెప్పండి, నిష్ఠగా, శుచిగా, చిత్త శుద్ధితో చేయాల్సిన పురోహిత కార్యాలు మొక్కుబడిగా, అశ్రద్ధగా,తూతూ మంత్రంగా, పిండి కొద్దీ రొట్టె, యావత్ తైలం, తావద్వాఖ్యానమ్ లాగా , ఇచ్చే డబ్బు కొద్దీ చేయించే వారూ నరకానికి పోతారంటే, పోరూ మరి !

అలాగే, నిత్యానంద స్వాముల వంటి వారు మన వెర్రిభారతంలో వేలూ, లక్షలూనూ. వాళ్ళందరూ నరకానికి కాక పోతే, స్వర్గానికి పోతారా ! ఆలోచించండి.

అందుకే, శ్లోక కర్త అథమపక్షం ఓ ఏడాది పాటు పౌరోహిత్యం చేసిన వారూ, కనీసం ఓ మూడు రోజుల పాటు సన్యాసిగా ఉండే వారు సైతం నరకానికి పోవసిందే అని ఢంకా బజాయించి చెబుతున్నాడు ...

తప్పులు చేసే పురోహితులూ, సన్యాసులే కాదు, తాము స్వీకరించిన వృత్తిని ప్రేమించని వారూ, త్రికరణ శుద్ధిగా మెలగని వారూ,తమ వృత్తిని ద్వేషించే వారూ,వృత్తికి న్యాయం చేయని వారూ,న్యాయ మార్గంలో వృత్తి బాధ్యతలు నిర్వహించని వారూ .... వీళ్ళంతా వెళ్ళేది నరకానికే కదా ?!

సరే, అదలా ఉంచితే, నాకు నరక లోకపు బెర్తు ఖాయం అని తేలి పోయింది. ఏం చేస్తాం చెప్పండి. అయితే, నాకు తోడుగా అక్కడ నాకంటె ముందుగానో, కాస్తంత అటూ యిటూ గానో, మిత్రుడు భీమ్ పాపాల శర్మ , కవితా కరవాలాలతో చెండాడే కుకవులూ, భార్యలను ఏడిపించుకుని తినే భర్తలూ, భర్తలను కాల్చుకు తినే భార్యలూ, రేగింగు వీరులూ, కల్తీ మందులూ వస్తువులూ విక్రయించే వ్యాపారులూ, అధిక వడ్డీలు గుంజే అధమాధములూ, ప్రజా సేవ పేరిట ప్రజా కంటకులైన నాయకమ్మన్యులూ ( రాజ్యాంతే నరకం ధృవమ్ కదా ) , పసి పిల్లలను గొడ్డుల్లా బాది పైశాచికానందం పొందే టీచర్లూ, క్షుద్ర సాహితీ సమరాంగణ సార్వ భౌములూ, నాలాగా చేతికొచ్చిన బ్లాగులు పెట్టి బాధించే బ్లాగు పిశాచులూ, హత్యలూ, దోపిడీలూ చేసే వాళ్ళూ, రాంగ్ కాల్స్ చేస్తూ విసిగించే ఫోనాసురులూ ... ... మరింక చెప్ప లేను ... ఇలా చాలా మంది వచ్చి చేరుతారనే నిబ్బరంతో నరక లోక యాత్రకు రెడీ అయి పోతున్నాను, మరి ... నరక లోకపు జాగిలమ్ములు మబ్బు చాటున ఖణేళ్ మన్నాయ్ !!

నా నరక లోక యాత్ర ద్వితీయ భాగంలో ఆ ముచ్చటలు వివరిస్తాను. మీరంతా చదివి ఆనందించ వచ్చును. మనకి స్వర్గమో, నరకమో ఇతమిత్థంగా ఇంకా తేలని స్థితిలో, ఎదుటి వాడికి నరకం ఖాయమని తేలి పోయేక , మనకి ఆనందం వెయ్యదూ?!




5, నవంబర్ 2010, శుక్రవారం

పేకాట పద్యాలు


గుఱ్ఱం జాషువా చీట్ల పేక శీర్షిక క్రింద వ్రాసిన పేకాట పద్యాలు చూడండి ...


నాలుగు రంగుల వాలజూపుల సాని

అతికాల భుక్తికి నాటపట్టు

గెలిపించి యోడించు కులుకు నవ్వుల పిల్ల

కలహమ్మునకు నిండు కారణమ్ము

వ్యసన వల్లికలకు బలమైన చేయూత

తొలఁగించు కొనరాని జెలగపట్టు

ప్రొద్దెఱుంగని మోహమునకుఁజింతామణి

నలునిల్లు గూల్చిన నంగనాచి

నెత్తి గొరిగి పంపు నెల్లూరి నెఱజాణ

కితవ, జాండములకు బ్రతుకు దెరువు

త్రాగుడునకుఁ గొంత దగ్గఱ చుట్టమ్ము

చేతి డబ్బు పోక చీట్ల పేక !

ఇస్పేటు,ఆఠీను, కళావరు, డైమండ్ ఈ నాలుగూ నాలుగు రంగులలో ఉంటాయి పేక ముక్కలు. ఈ వాలు చూపుల పేక సాని కూడా అన్ని రంగులు, అన్ని హొయలు కలిగినది

.

వేళాపాళా లేని తిండికి పేకాట ఆటపట్టు. పేకాటలో కూర్చుంటే నిద్రాహారాలు గుర్తనకు రావు.

ఓ సారి గెలిపిస్తుంది. మరో తూరి ఓడిస్తుంది. అలా గెలుపోటములతో కులుకు నవ్వుల పిల్ల పేకాట.

తగువులకు పూర్తి కారణం ఇదే. పేకాటలో వచ్చే పేచీలకు కొదవ ఉండదు. వ్యసన మనే లతకు బలమైన చేయూత. వ్యసనాలను పెంచి పోషిస్తుంది.

ఒక సారి పేకాట వ్యసనంగా మారితే, ఆ వ్యసనం జలగలాగా మరి వదలదు.

రేయి పవళులు తెలియ నివ్వ కుండా సుబ్బి శెట్టి సాని చింతామణి వ్యామోహంలో నిండా మునిగి పోయి నట్టు, పేకాటలో కూచున్న వారికి రాత్రీ లేదు, పగలూ లేదు. నలుడంతటి వాడు కూడా ఈ వ్యసనం వల్లనే కదా, ఇల్లు గుల్ల చేసుకున్నాడు?

నెల్లూరి నెఱజాణలాగా తల గొరిగి (అంటే, గుండు చేయించి అని కాదు కానీ, ఉన్నదంతా ఊడ్చుకుని అన్న మాట) మరీ పంపిస్తుంది. పేకాటలో కుదేలయి పోతే , నెత్తిన గుడ్డ వేసుకో వలసినదే కదా?

ఈ పేకాట వ్యసనం మద్యపాన వ్యసనానికి కూడా దగ్గరి చుట్టం. ప్రక్కన మద్యం సీసాలు, గ్లాసులు పెట్టుకుని పేకాట ఆడే జల్సారాయళ్ళు ఎందరో ! చేతి చమురు వదిలి పోయేలా చేస్తుంది, ఈ పేకాట

.

జోకరుగానిఁ దోడుకొని, చుక్కల చక్కదనంబు మీఱ, ‘‘ మూ

డాకులయాట, యెత్తిళులు, నడ్డు, షర’’ త్తని మ్రోయుచున్న యో

పేక బొజంగి ! నన్ను వలపింపకు, మింతట బుద్ధి వచ్చె, నీ

యాకులపాటులో కలుగు నాకుల పాటుఁదలంప సిగ్గగున్.

జోకరు, చుక్కలు, వీటితో కలగలిపి, ఆడే మూడు ముక్కలాట, ( దీనికే కొంపలు ముంచే కంపీ అని ముద్దు పేరు కాబోలు)యెత్తురుపు, అడ్డాట, షరదాట ...వీటితో ఒప్పుతూ ఉండే ఓ విటురాలా, పేక సానీ, నన్ను వలపించ వద్దు. నన్ను నీవలలో పడేలా చేయకు. నాకు బుద్ధి వచ్చింది. పేకాట వ్యసనం వల్ల కలిగే చీకాకు తలుచుకుంటే వొళ్ళు కలవరపాటు చెందుతోంది.

అంగీకార నినాదముల్ పటుతర వ్యాహారముల్, భ్రూకుటీ

భంగాక్షేపణముల్, పరస్పర జయ వ్యామోహ వాద ధ్వనుల్

సంగీతంబులు, కూనిరాగములు, నీలల్, దీర్ఘనిశ్వాసముల్

నింగిన్ దాకుచునుండు, నీదు కేళీతరంగ మధ్యంబునన్.

పేకాటలో కూర్చున్నాక, ఇక మొదలవుతాయి, రకరకాల హావభావ చేష్టలూ, వికారాలూ, విన్యాసాలూనూ. సరేనని ఒప్పుకోవడం, కాదని దెబ్బలాడడం, కను బొమలు ముడి వేసి ఆక్షేపణలు తెలియ జేయడం, ఒకరి గెలుపుని ఒకరు హర్షిస్తూ బాగుంది !బాగుంది ! అనడం.మధ్య మధ్య నోటికొచ్చిన సాటలు పాడడం ( బూతు పాటలయితే మరీ రంజుగా ఉంటాయంటారు, పేకాట రసిక శేఖరులు), లేదా, కులాపాగా కూని రాగాలు తీయడం, ఒక్కో సారి హఠాత్తుగా ఈల పాట రఘురామయ్యలుగా మారి పోతూ వారెవ్వా ! అంటూ ఈలలు వేయడం, మరొకప్పుడు వేడి వేడి నిట్టూర్పులు విడుస్తూ( ముక్క కలవనప్పుడు మరీనూ) ఉండడం,.. మిన్నంటే ఈ చర్యలన్నీ పేకాట మధ్యలో పేకాట రాయళ్ళు చేసే విన్యాసాలు చూసి తీరాల్సిందే కానీ చెప్ప నలవి కావు..

నిఱుపేదన్ గరుణించి పాపమని కానీ, ధర్మ మర్పింపఁ జి

ల్లర లేదంచుఁ దొలంగ లుబ్ధుఁడు, సముల్లాసంబుతో మేటి తెం

పరియై, నూటికి నూరు లొడ్డి విరమింపండక్కటా ! పేక సుం

దరి ! నీ ముక్కలు మోహనాస్త్రములు, చింతాసఔధసోపానముల్.

అయ్యో, పాపం కడు నిరు పేద అని జాలి పడి ఒక్క ఎర్ర ఏగానీ ఇవ్వడానికి చేతులు రావు, కానీ, వందకి వందా ఒడ్డి పేకాటలో ఎంత పోగొట్టు కున్నా, విడువ కుండా ఇంకా ఆట ఆడుతూనే ఉంటారు, కొందరు (పేక) పట్టు వదలని విక్రమూర్ఖులు.) ఓ పేక సుందరీ, నీ పేక ముక్కలు సమ్మోహనం కలిగించే మోహనాస్త్రాలు కదా? చింతాసౌధానికి దారి తీసే మెట్ల దారి కదా?

అనుంగు బిడ్డఁడు బావిలోఁ బడె నన్నా ! లేచి రమ్మన్నఁదె

చ్చున దీ మార్గమెకా యటంచు వచియించున్ జూదగాడందు, రిం

దున సందేహము లేదు, కేవలము మందుండై విషగ్రస్తుఁడై

తనరున్, రంగ మలంకరించిన మహాతత్వఙ్ఞుఁడున్, వ్రేల్మిడన్.

పేకాటలో కూర్చున్న వారికి ఒళ్ళూ మీదా తెలియదు. ముద్దుల కొడుకు బావిలో పడి చచ్చేడయ్యా, ఆ ముక్కలు అలా పారేసి, వేగం రావయ్యా, అని పిలిచినా, పేకాట వదలి లేవడు.పైపెచ్చు, శవాన్ని ఈ దారంటే తెస్తారు కదా, అప్పుడు చూదాం లే అంటాడు. సందేహం లేదు. వట్టి మూర్ఖుడు.మత్తుడు.భవభంధాలను తృణప్రాయంగా చూసే మహా తత్వవేత్త కాబోలు

.

గెలుపా ! యూయెల సంశయంబునకు మఒగ్గెన్, బేస్తులా రెండు రూ

కలపై చిలక్కు కుదేళు లిచ్చు కొననింకం బావులా కాని గా

వలె, నీ ఘోర విపత్తు మస్తమున సంప్రాప్తించెనా ! వాఁడు వి

హ్వల నాగేంద్రము పాహి !పాహి !వఱకై యబ్జాక్షుఁడున్ రావలెన్.

గెలుపు కలిగేలా లేదు. బేస్తులు రెండు రూకలకు మించి పోయేలా ఉంది. కుదేలు ఇచ్చు కోవాలంటే పావలా ఐనా కావలె. ఎంత ఆపద వచ్చిందిరా నాయనా.ఈ ఆపద గట్టెక్కించడానికి అలనాడు గజరాజునికాపాడిన శ్రీ మహా విష్ణువే రావాలి కదా. ( ఈ పద్యం లోని పేకాటకి చెందిన సాంకేతిక పదజాలం నాకు బొత్తిగా తెలియక పోవడం వల్ల భావం తోచిందేదో రాసేను.మన్నించాలి,)

పేకయాటలోని పింఛనీదారుండు

చుట్ట త్రాగు కొనుచుఁజూడ వచ్చి

‘‘చెఱచి’’ తనుచు ముక్కు చిట్లించు కొని పోవు

పేకయాట, గుండె పీకులాట.

ఈ పద్య భావం కూడా అందడం లేదు. పేకాట వొట్టి గుండె పీకులాట అనేదే తెలుస్తోంది.

అర్ధమైనంత వరకూ, పేకాట జరిగే చోటుకి ముసలాళ్ళు చుట్టలూ అవీ త్రాగుతూ వచ్చి, కాసేపు ఎవడి ప్రక్కనో చేరి ఆట చూసి, ‘‘ పాడు చేసావోయ్’’ అని విసుక్కుని వెళ్ళి పోతూ ఉంటారు అని కాబోలు.

పేకాట గాళ్ళ ప్రక్కన చేరే వారికి మనం ఏ ముక్క కొట్టినా నచ్చదు.మనం శుద్ధ తెలివి తక్కుగా ఆడుతున్నామని వారి ప్రగాఢ విశ్వాసం. ఊరికే విసుక్కు పోతూ ఉంటారు.వాళ్ళ ఆలోచన మనకి తట్టక పోవడం మన తప్పా, చెప్పండి?


ఇవండీ, పేకాట పద్యాలు.


దపావళి పండుగ పూట, సరదాగా పేకాట ఆడుకుందా మనుకుంటూ ఉంటే, ఇలాంటి టపా పెట్టావేమిటయ్యా, అని కోపగించు కుంటారేమో !

మరందు చేత అందరకీ ...


.

4, నవంబర్ 2010, గురువారం

ప్రయత్నించి చూస్తే పోయే దేముంది ?


విజయ విలాసం లో చేమకూర వేంకట కవి ధర్మ రాజు సుగుణాలను ఎలా వర్ణించాడో చూడండి.

దేవ బ్రాహ్మణ భక్తి ప్రోవు, ప్రియ వక్తృత్వంబు కాణాచి, వి
ద్యా వైదుష్యము దిక్కు, ధర్మమునకున్ దార్కాణ, మర్యాదకున్
ఠా, వౌచిత్యము జీవగఱ్ఱ, హితశిష్ట వ్రాత సంతోషణ
శ్రీ వజ్రాంగి, యజాత శత్రుడు మహీభృన్మాత్రుడే చూడగన్.

దేవ బ్రాహ్మణుల పట్ల అమిత భక్తి శ్రద్ధలు కలవాడు. ప్రియమైన మాటలు పలుకుతాడు. విద్యా వైదుష్యాలకు గతి. ధర్మానికి అతడే ఉదాహరణ ప్రాయుడు. మర్యాద ,ఔచిత్యాలు ఎరిగిన వాడు. మంచి వారినీ, సజ్జనులనూ కాపాడే వాడు, శత్రువులంటూ ఎవరూ లేని వాడు. లోకంలో సాధారణ రాజులలాంటి వాడు కాదు.

ఆవలబోయిన వెన్క నాడుటెన్నడు లేదు
మొగము ముందఱ నంట మొదలె లేదు

మనవి చెప్పిన చేయ కునికి యెన్నడు లేదు
కొదవగా నడుపుట మొదలె లేదు

చనవిచ్చి చౌక చేసినది యెన్నడు లేదు
పదరి హెచ్చించుట మొదలె లేదు

మెచ్చినచో కొంచె మిచ్చుటెన్నడు లేదు
మొక మిచ్చకపు మెచ్చు మొదలె లేదు.

మఱియుఁ దొల్లిటి రాజుల మహిమ లెన్ని
యితఁడె పో సార్వ భౌముఁడత్ప్రతిముఁడనఁగ
బ్రజలఁబాలించె సకల దిగ్భాసమాన
కీర్తి విసరుండు, పాండ వాగ్రేసరుండు

ఎదుట ఒక మాట, వెనుక ఒక మాట అనే దుర్లక్షణం లేదు. కాస్త ముఖం చాటు కాగానే ఆడిపోసుకోడం లేదు. అలాగని ముఖం మీదనే ఫెడీల్మనేలా కటువుగా పలకడం కూడా లేదు.
మనవి చేసుకుంటే, సహాయం చేయక పోవడం ఎప్పుడూ లేదు. అలాగని ఎంతో కొంత ఇచ్చి, చేతులు దులుపు కోవడం కూడ లేదు. ఇచ్చెనా, ఏనుగు పాడి అన్నట్టుగా, ఇవ్వడంలో ఎప్పుడూ తక్కువ చేయడు.

ముందు బాగా చనువు ఇవ్వడం. ఆతరువాత చులకనగా చూడడం ఎన్నడూ లేదు. అలాగే, ఊరికే పొగడ్తలతో ముంచెత్తడం కూడా చేయడు.

మెచ్చు కుంటే ఏదో కొంచెం ఇచ్చి పొమ్మనే రకం కాదు. అలాగని ముఖ ప్రీతి మాటలాడడం, ఇచ్చకాలు పలకడం అసలే లేదు.

వెనుకటి రాజుల గొప్పతనాలు ఎటువంటివో ఆలోచిస్తే, ధర్మ రాజు మాత్రమే చక్రవర్తి అని అర్ధమౌతుంది.

ఎంత లెస్సగ నున్న నంత వేడుక కాని,
ప్రజలకల్మి కసూయ పడుట లేదు

తనుఁగొల్వ వలె నందఱను ప్రియంబె కాని
మానిసి వెగటించుకైనను లేదు

నిచ్చ వేడిన నర్ధి కిచ్చు చిత్తమె కాని
మునుపింత యిచ్చితి ననుట లేదు

రేవగల్ ధర్మ మార్జించు దృష్టియె కాని,
న్యాయంబు దప్పిన నడక లేదు

కలడె యిటువంటి రాజు లోకమున నెందు !
జలధి వలయిత వసుమతీ చక్రమెల్ల
యేల వలె శాశ్వతముగాఁగ నీఘనుండె
యేల వలె నన్యు లన నృపాలుఁడలరె

తన పాలనలో ఉన్న ప్రజలు ఎంత సంపన్నులయితే, ధర్మ రాజు అంతగా సంతోషించే వాడు. అంతే కాని, తన ఏలుబడిలో ఉండే వారికి ఇంత సంపదా ? అని అసూయ పడే వాడు కాదు. అందరూ తన పాలనలో తనని సేవిస్తూ ఉండాలనే రాచరికపు వేడుకే తప్ప, మనుషులంటే ద్వేషం ఎప్పుడూ లేదు. అడిగిన వాడికి అడిగింది ఇవ్వడమే కాని, లోగడ ఇంత ఇచ్చేను కదా, మళ్ళీ అడుగుతావేం !అంటూ కసురు కోవడం లేదు. రాత్రీ పగలూ ధర్మ బద్ధంగా ఉండాలనే ఆలోచనే తప్ప ఎన్నడూ న్యాయ మార్గాన్ని తప్పి ఎఱుగడు.

లోకంలో ఎక్కడయినా ఇంత గొప్ప రాజు ఉన్నాడా? సముద్ర వేలా సర్యంత మయిన ఈ భూమండలాన్ని ఈ ఘనుడైన ధర్మ రాజే శాశ్వతంగా పాలించాలి. వేఱొక ప్రభువు మన కేల? అని ప్రజలు అనుకునే లాగున ధర్మజుడు ఒప్పుతున్నాడు.

కోపమొకింత లేదు, బుధ కోటికిఁగొంగు పసిండి, సత్య మా
రూపము, తారతమ్యము లెఱుంగు స్వతంత్రుడు, నూతన ప్రియా
టోపము లేని నిశ్చలుఁడిటుల్ కృత లక్షణుఁడై చెలంగగా
ద్వాపర లక్షణుండనఁగ వచ్చునొకో యల ధర్మ నందనున్

కోపం ఇసుమంతయినా లేదు. పండిత వర్గానికి కొంగు బంగారం. సత్యమే ఆకారంగా రూపు దాల్చిన వాడు. మంచి చెడ్డలు, బాగోగులు బాగా తెలిసిన వాడు. ఎవరో చెబితే చెప్పుడు మాటలు తలకెక్కించు కోకుండా స్వతంత్రమైన భావాలు కలవాడు.నూతన ప్రయాడంబరాలు లేని వాడు.రాజానో బహు వల్లభా: కదా? కొత్త రుచుల కోసం వెంపర్లాడే వాడు కాదు.ధృడ చిత్తం కలవాడు. ఇన్ని కృత లక్షణాలు కల ధర్మ రాజుని ద్వాపర లక్షణాలు కల వాడని అనడం ఏమి సబవు? కృత యుగంలో వ్యక్తులకు ఉండే లక్షణాలు అన్నీ సంతరించుకున్న వాడని చమత్కారం.

చూడండి. ధర్మ రాజు ఎన్ని గొప్ప సల్లక్షణాలు కల వాడో ! అందులో అన్నో, కొన్నో మంచి లక్షణాలు మనమూ అలవరుచు కోడానికి ప్రయత్నించి చూస్తే పోయేదేముంది చెప్పండి?

3, నవంబర్ 2010, బుధవారం

వద్దు బాబోయ్ !!


ఈ క్రింది శ్లోకంలో కవి దరిద్రం యొక్క విరాడ్రూపాన్ని ఎంత భయంకరంగా వర్ణిస్తున్నాడో చూడండి:

క్రోశంత శ్శిశవ: స్రవచ్చ సదనం ధూమాయమాన శ్శిఖీ,
క్షారం వారి మలీమసం చ వసనం దీపశ్చ దీస్త్యా జడ:
శయ్యా మత్కుణినీ హవిస్య మశనం పంథాశ్చ పంకావిల:
భార్యాచా2ప్రియవాదినీతి సుమహత్పాపస్య చైతత్ఫలమ్.

ఇంట్లో భరింత లేనంతగా పిల్లల ఏడుపులు. గోల. అల్లరి . ఆగం. పిల్లలు ఇల్లు తీసి పందిరి వేస్తున్నారు.

ఇల్లు కారి పోతోంది. అవును మరి. పై కప్పు చాలా ఏళ్ళయి రిపేరుకి నోచుకో లేదు మరి. కారకేం చేస్తంది? ఇంట్లో ఏ గది లోంచి చూసినా, సూర్య చంద్రులు కనబడుతూనే
ఉంటారాయె !

వంట కట్టెలు సరిగా మండక పోవడం వల్ల, పొయ్యి రాజడం లేదు. అంతా దట్టమన పొగ. కళ్ళు మండి పోయేలా ఇల్లంతా పొగ క్రమ్ముకుంటోంది.

ఇక, ఇంటి పెరటిలో ఉన్న బావి నీరు చెబుదామా, అంటే, ఆ నీరు ఒట్టి ఉప్పు కషాయం.

ఇంట్లో గుడ్డలన్నీ మురికి ఓడుతూ ఉన్నాయి. చాకలి మొగ మరుగని బట్టలాయె. కట్టుకీ, విడుపుకీ కూడా ఒకే బట్టలాయె.

నట్టింట దీపం చమురు లేక కొడిగట్టి పోతోంది. క్షణమో, గడియో దీపం కొండెక్కి పోతుంది. ఇక, అంతా అ:ధకారమే. చీకట్లో తడుములాట తప్పదు, మరి

పడకంతా నల్లుల మయం. యథేచ్ఛగా రక్తాలు పీల్చి వేస్తూ పండుగ చేసుకుంటున్నాయి, నల్లులు. ఈ నల్లుల బాధ పడ లేకనే కదా, శివుడు వెండి కొండ మీదా, రవి చంద్రులు ఆకాశంలో వ్రేలాడుతూ ఉండడం, శ్రీ హరి శేషుని మీద పవళించడం !

ఇక, తిండి మాట చెప్పే పని లేదు. తిండి యఙ్ఞప్రసాదం. ( కొండొకచో వట్టి పిండా కూడు కూడా)

వీధిలోకి వెళ్దామంటే, త్రోవంతా బురద. అంతా రొచ్చు.

ఇక, భార్య సంగతి చెప్పుకోడానికే ఒళ్ళు కంపరమెత్తి పోతుంది. ఆవిడ నోరు పెద్దది. అంతే కాదు, చెడ్డది. నిరంతరం శాపనార్ధాలు పెడుతూ ఉండడమే. గయ్యాళి గంప. వంద మంది సూర్యాకాంతాలూ, మరో వంద మంది ఛాయా దేవీలూనూ.

ఈ పైన చెప్పిన బాధలు ఉన్నాయే, అవి, మహా పాపం చేసుకున్న వారికే సంప్రాప్తిస్తాయి
కదా !

ఈ కష్టాలు పగ వాడికి కూడా వద్దయ్యా బాబూ !

శ్రీనాథుడి చాటువు కూడా ఇక్కడ చెప్పు కోవాలి మరి.

దోసెడు కొంపలో పసుల త్రొక్కిడి, మంచము, దూడ రేణమున్
బాసిన వంటకంబు, పసి బాలుర శౌచము, విస్తరాకులున్
మాసిన గుడ్డలున్, తలకు మాసిన ముండలు, వంట కుండలున్
రాసెడు కట్టెలున్, తలపరాదు పురోహితునింటి కృత్యముల్.

ఇల్లు ఇరకటం, ఆలి మరకటం. అంటే ఇదే కాబోలు. ఇల్లా, ఇరుకు కొంప. కాళ్ళు చాపి పడుకోడానికి లేదు. పశువుల రొచ్చు. కుక్కి మంచం, దూడ పేడ. పాచి పోయిన వంటకాలు, పసి పిల్లల మల మూత్రాదులు. విస్తరాకులు, విధవా స్త్రీలు, మసిబారిన వంట కుండలు, మాసిన గుడ్డలు, మండని కట్టెలు ... పేద పురోహితుని కొంపలో కనిపించే దృశ్యాలు.

కష్టాల గురించి చెబుతున్నాను కనుక, శ్రీ శ్రీ గారి గేయ చరణాలు కూడా చూదాం మరి:

కూలి కోసం, కూటి కోసం
పట్టణంలో బ్రతుకుదామని
తల్లి మాటను చెవిని పెట్టక
బయలు దేరిన బాటసారికి

మూడు రోజులు ఒక్క తీరుగ
నడుస్తున్నా, దిక్కు తెలియక
చండ చండం, తీవ్ర తీవ్రం
జ్వరం వస్తే, భయం వేస్తే
ప్రలాపిస్తే, ప్రకంపిస్తే,

మబ్బు పట్టీ, వాన కొట్టీ
వాన వస్తే, వరద వస్తే,
చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే,
దారి తప్పిన బాటసారికి
ఎంత కష్టం ! ఎంత కష్టం !








2, నవంబర్ 2010, మంగళవారం

గోరంత మేలు - కొండంత కృతఙ్ఞత


ప్రథమవయసి పీతం తోయ మల్పం స్మరంత:
శిరసి నిహితభారా నారికేళా నరాణాం,
సలిల మమృతకల్పం దద్యు రాజీవితాతం
నహి కృత ముపకారం సాధవో విస్మరంతి.

మంచి వారికి ఎంత చిన్న ఉపకారం చేసినా వారు దానిని తమ జీవితాంతం మరిచి పోరు.
కొబ్బరి చెట్టుని చూడండి, ఎప్పుడో చిఱుత ప్రాయంలో మనం పోసే కొద్దిపాటి నీటిని త్రాగి, ఆ మేలు మరి ఎప్పటకీ మరిచి పోదు. బరువైన కాయలను గుత్తులు గుత్తులుగా మోస్తూ, కలకాలం మనుషులకు తీయని నీటిని ఇస్తున్నది కదా !

1, నవంబర్ 2010, సోమవారం

కొత్త పాళీ గారి కథా సంకలనం - మీరు చదివేరా?





మంచి కథలు ఓ ఇరవై ఒకటి . మీరు చదివేరా? ప్రతి కథా అత్యంత వైవిధ్య భరితం. ఇటీవల ఓ కథా సంకలనాన్ని విడువకుండా ఏకబిగిని నాచేత చదివించిన మంచి సంకలనం ఇది.

ఈ కథల పుస్తకం చదివేక నా స్పందన ఇది. చూడండి: