30, ఏప్రిల్ 2011, శనివారం

చీకటి రోజుల చిరు కవిత


మహా కవి జయంతి నేడు.

చీకటి రోజుల్లో బరంపురం అఖిల భారత రచయితల మహా సభలో మహా కవి ఎదుట చదివి, వారి ఆశీర్వాదాన్ని పొందిన ఈ చిరు కవిత మరోసారి ...

ఈ కవిత చదివేక శ్రీ.శ్రీ నా చేతిలో కవిత ఉన్న కాగితం తీసుకుని దాని మీద తన సంతకం చేసి తిరిగి యిచ్చేరు.
ఉరకలు వేసే ఆ వయసులో అందుకు నేనెంత గర్వించేనో కదా !
అది నా వద్ద ఇంకా పదిలం. మరి ఆ చీకటి రోజుల కవితను చూడండి:

కంఠం మీద కత్తి


కంఠం మీద కత్తి
ఎలుగెత్తి పాడ లేను
ముంజేతికి బాండేజీ
చెల రేగి వ్రాయ లేను.

సిరా బుడ్డిలో సాలీడు
సిగరెట్టు నుసి రాల లేదు

అరరే ! చిక్కులు పడందయ్యా,
ఆలోచనల దారం.

28, ఏప్రిల్ 2011, గురువారం

వలువల విలువలు


ఈ చాటువు విన్నారా ?

చాకి వాని తోడ జగడాలు పడ లేక
సిరి గలాడు పట్టు చీర కట్టె
శివుడు తోలు గట్టె సీ !యని మది రోసి
భైరవుండు చీర పార వైచె.

ఇప్పటి లో లాగా అప్పుడు ధనవంతులకి కూడా బీరువాల నిండా ఇన్నేసి బట్టలుండేవా ఏమిటి ?
కట్టుకో గుడ్డా, విడుపుకో గుడ్డా అన్నట్టుగా ఉండేవి. చాకలి చలువ చేసి బట్టలు తేడానికి చాలా ఆలస్యం చేసే వాడు. దానితో జనం విసిగి పోయే వారు. మనుషులే కాదు, దేవతలు కూడానుట !

అందు చేత, చాకి వానితో తంటాలు పడ లేక సిరి గల వాడు (శ్రీ మహా విష్ణువు - లక్ష్మీ దేవి భర్త) ఇలా లాభం లేదని చెప్పి పట్టు చీర ధరించాడుట. ఆ రోజుల్లో మగ వారు ధరించిన వస్త్ర విశేషానికి కూడా చీర అనే వ్యవహారం ఉండేది. పట్టు బట్ట అయితే చాకలికి వేయ నక్కర లేదు. ఒక సారి దులిపి కట్టుకుంటే చాలును. ఇక, శివుడు తోలు ధరించేడు. గజ చర్మధారి కదా, శివుడు ?
ఇది మరీనూ, మన కాలపు జీను బట్టలాగా ఉతుకులే అక్కర లేదు. అంత వేగం చిరుగులు పడవు కూడా. మాసినా అదో ఫేషను. మరి కాల భైరవుడయితే ఛ ! ఛ! అని విసుక్కుని కట్టిన చీర కాస్త పార వేసి దిగంబరుడైనాడట !

ఎంతయినా, వలువలకు విలువ హెచ్చు కదా ? ఎంత ఖరీదయిన దుస్తులు ధరిస్తే అంత గౌరవం.

ఒక సారి కామన్ వెల్త్ రౌండ్ టేబిల్ సమావేశానికి మహాత్ముడు వెళ్ళ వలసి వచ్చి నప్పుడు ముందు తన అలవాటైన అంగ వస్త్రంతో వెళ్ళాడుట. అతని వాలకం చూసి, కాపలాదారులు లోనికి రానివ్వ లేదుట. సరే , మహాత్ముడు బ్రిటిష్ వారిలాగ కోటూ, బూటూ వేసుకుని వెళ్ళాడుట. ఈ సారి అతనికి రాచ మర్యాదలతో స్వాగతం లభించిందిట. లోనికి వెళ్ళాక, అక్కడ జరిగిన ఒక విందులో బాపూజీ పదాదార్ధాలను తినడం మానేసి తన కోటు మీద జల్లు కోవడం మొదలు పెట్టాడుట. దొరలు ఆ చర్యకి విస్తు పోయి కారణం ఆరా తీసారుట.

మహాత్ముడు నవ్వి, ఇక్కడ మనుషుల కన్నా బట్టలకే విలువ అనుకుంటాను. అందు వలన ఈ విందు నాకు గాక నా బట్టలకు ఇస్తున్నట్టుగా భావిస్తున్నాను. అందుకే విందు ఈ సూటు, కోటుకి పెడుతున్నాను అన్నాడుట.

దొరల ముఖాలు మాడి పోయాయని వేరే చెప్ప నక్కర లేదు కదా ? ఈ కథలో నిజమెంతో నాకయితే తెలియదు కానీ, వలువలకు ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వక పోవడ మనేది ఎప్పుడూ ఉన్నదే అన్నది మాత్రం పరమ సత్యం.

వలువల విలువల గురించిన మరో పద్యం చూడండి:

పీతాంబుని బిల్చి పిల్ల నిచ్చిన మామ
గజ చర్మ ధారికి గరళ మిచ్చె

దొర వేషమునకు విందు లొసంగు గేస్తు
చింపి గుడ్డల వాని సీత్కరించె

అద్దె గుడ్డల వాని కర్ధాసనంబిచ్చె
కౌపీన ధారిని కసిరి కొట్టె

జలతారు ముసుగున్న శిలను దైవమ్మనె
త్రోవ కడ్డ మైన తొలగ దన్నె

వలువలను బట్టి లోకాన విలువ హెచ్చు
వలువలకు విలువ హెచ్చు నీ చేతి చలువ వలన
అట్టి నీ చేతి చలువ మహత్య మెఱుగు
ఘనులకు గద నేడు సత్కార సభలు !

పట్టు పీతాంబరాలు కట్టిన శ్రీ మహా విష్ణువుకు సిరి దేవి ఇల్లాలుగా లభించింది. తోలు బట్ట కట్టిన శివుడికి అంతా కలిసి, తాగమని విషం ఇవ్వడం జరిగింది. దొర వేషంలో వస్తే విందులు, చింపిరి గుడ్డలతో వస్తే ఛీత్కారాలు. అద్దె గుడ్డలతో వస్తే అర్ధాసనం, గోచి ధరించి వస్తే కసుర్లు.
రాతి బొమ్మకు దేవుడని చెప్పి జలతారు మేలి ముసుగులు వేయడం,త్రోవకి అడ్డంగా ఉందని మామూలు బండ రాయిని తొలగదన్నడం.

లోకంలో బట్టలను బట్టి కదా మనుషులకు విలువ ! అట్టి బట్టలను చలువ చేసే మడివేలు వల్ల ఆ వలువలకు విలువ ఎక్కువ అవుతోంది. చక్కగా చలువ చేసిన బట్టలు ధరించిన వాడికే కదా సత్కార సభలు జరుగుతూ ఉన్నాయి ?




25, ఏప్రిల్ 2011, సోమవారం

నవ్య కథా నీరాజనంలో నా ఇంటర్వ్యూ ....

గత నెల మొదటి వారంలో నవ్య వార పత్రికలో కథా నీరాజనంలో నా ఇంటర్వ్యూ ప్రచురించారు. దానిని నా కథా మంజరిలో పెట్టమని మిత్రులు కోరేరు. ఎందుకు లెద్దురూ, అని దాట వేసాను.

నా బ్లాగరు మిత్రులు వదల లేదు. నువ్వు పెడతావా . మమ్మల్ని పెట్ట మంటావా ? అని బెదిరించడం మొదలు పెట్టారు.
నిజం చెప్పొద్దూ, బ్లాగులో పెట్టాలనే ఉబలాటం నాకు మాత్రం ఉండదూ.

సరే లెమ్మని, కొంత వినయం, మరి కొంత మొఖమాటం నటించి, ఇంకొంత నిరాసక్తత, వేరొక కొంత సిగ్గు అభినయించి, ఇక
ఆ అభినయాలను చాలించి, ఇదిగో, ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ మీ ముందు పెడుతున్నాను. చూడండి:












ఒక విషయం : ఇంటర్వ్యూ చదవడానికి ఇమేజి పెద్దది కావడం లేదు. కదూ. ఈ లోపం ఎలా సరి చేయాలో దానికి తగిన సాంకేతిక పరిచయం నాకు లేదు.


24, ఏప్రిల్ 2011, ఆదివారం

విశ్వ ప్రేమ



విశ్వ ప్రేమ

ఏ ప్రేమ మహిమచే నీ ధారుణీ చక్ర
మిరుసు లేకుండనే తిరుగు చుండు

ఏ ప్రేమ మహిమచే నెల్ల నక్షత్రాలు
నేల రాలక మింట నిలచి యుండు

ఏ ప్రేమ మహిమచే పృథివిపై బడకుండ
కడలి రాయుడు కాళ్ళు ముడుచు కొనును

ఏ ప్రేమ మహిమచే నీరేడు భువనాల
గాలి దేవుడు సురటీల విసరు

ఆ మహా ప్రేమ - శాశ్వతమైన ప్రేమ
అద్భుత మఖండ మవ్యక్త మైన ప్రేమ
నిండి యున్నది బ్రహ్మాండ భాండ మెల్ల
ప్రేయసీ ! సృష్టి యంతయు ప్రేమ మయము !!

( కరుణశ్రీ)


సిద్ధి స్సాధ్యే సతామస్తు ప్రసాదాత్తస్య ధూర్జటీ:
జాహ్నవీ ఫేన లేఖేవ యన్మూర్ధ్ని శశిన: కళా

గంగానది నురుగు రేఖయా అను నట్లు ఎవని శిరస్సున చంద్ర కళ కలదో, అట్టి ఈశ్వరుని అనుగ్రహము వలన సత్పురుషులు పనులు సాధించెదరు గాక !

23, ఏప్రిల్ 2011, శనివారం

ఓసింతేనా?!


ఈ పద్యం చూడండి:

హరి కుమారుడై యొప్పునాతడు హరి
హరికి దక్షిణ నేత్రమౌ నాతడు హరి
హరికి శిరము తోడ వరలు నాతడు హరి
హరికి వామాక్షమౌ యొప్పునాతడు హరి

హరికి ( శ్రీ మహా విష్ణువునకు) కొడుకు హరి.

హరికి కుడి కన్ను హరి.

హరికి శిరస్సుతో ఒప్పువాడు హరి.

హరికి ఎడమ కన్ను హరి.

ఏమిటో అంతా గోలగా ఉంది. కదూ. అబ్బే మరేమీ లేదు.


హరి అనే పదానికి విష్ణువు అనే అర్ధమే కాక, కోతి, సూర్యుడు,సింహము, చంద్రుడు అనే యితర అర్ధాలు కూడా ఉన్నాయి. వీటినే నానార్ధాలు అంటారు. వాటి సాయంతో ఇప్పుడు పద్యానికి అర్ధం చూడండి:

ఇప్పుడు చూడండి:

మొదటి పాదంలో తొలి పదం హరికి సూర్యుడు అనీ, పాదం చివర గల హరి అనే పదానికి కోతి అనీ అర్ధం చెప్పుకోవాలి.


ఇప్పుడా పాదానికి హరి కొడుకు హరి. అంటే, సూర్యుని కొడుకు కోతి ( సుగ్రీవుడు ) అనే అర్ధం వస్తుంది. సుగ్రీవుడు సూర్య తనయుడే కదా.

రెండవ పాదం. హరి కుడి కన్ను హరిట. ఈ పాదంలో చివర గల హరి అనే పదానికి సూర్యుడు అని అర్ధం చెప్పాలి.

ఇప్పుడా పాదానికి శ్రీహరికి కుడి కన్ను సూర్యుడు అని అర్ధం వస్తుంది. నిజమే కదా.

మూడవ పాదం లో చివర గల హరి శబ్దానికి సింహం అని అర్ధం చెప్పాలి.

ఇప్పుడా పాదానికి హరికి తలతో ఒప్పు వాడు సింహం అని అర్ధం వస్తుంది.


సింహం తలతో తిరిగే వాడు. నరసింహావతారం. హరి నారసింహుడు అని అర్ధం వస్తుంది.

నాలుగవ పాదంలో చివర గల హరి అనే పదానికి చంద్రుడు అని చెప్పుకోండి.

ఇప్పుడా పాదానికి హరికి ఎడమ కన్ను చంద్రుడు అని అర్ధం సిద్ధిస్తుంది. నిజమే కదా.

అబ్బచ్చా, యిదా అర్ధం ! అనుకుంటున్నారా? ఇలాంటి తమాషాలు మన కవులు చాలా చేసారండోయ్.

స్వస్తి.



20, ఏప్రిల్ 2011, బుధవారం

ముఖే ముఖే సరస్వతీ ...


ఒక చక్కని దత్తపదిని చూదామా?

పృచ్ఛకుడు అవధానిగారిని పాలు, పెరుగు,నేయి, నూనె అనే పదాలను ఇచ్చి, భారతార్ధంలో పద్యం చెప్పమని కోరాడు.

అవధానిగారి పూరణ చూడండి:

పాలు పంచడు రారాజు పాండవులకు
పెరుగుచున్నది వానిలో దురితము గన
నే యిలను గల్గ దిట్టి యహితము వాని
నూనె మూర్ఖత తప్పదు యుద్ధమింక !

పృచ్ఛకుడు కోరిన నాలుగు పదాలూ పద్యం నాలుగు చరణాలలో మొదటి పదాలుగానే వచ్చేయి కదా?

ఇక భావం చూడండి:

రారాజు ( దుర్యోధనుడు) పాండవులకు పాలు పంచడు. రాజ్య భాగం ఇవ్వడు. ఐదూళ్ళు కాదు కదా, సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వనని తెగేసి చెప్పనే చెప్పాడు కదా?

వానిలో ( ఆ దుర్యోధననునిలో) దురితము నానాటికీ పెరుగుతోంది. దుర్మార్గం ఎక్కువవుతోంది.

ఇలాంటి అహితము ( చెడ్డ నడవడిక) లోకంలో ఎక్కడయినా చూసామా ? (కన నేయిలను?) లేదు కదా !

వానిన్ (మూర్ఖత) ఊనెన్ = వానినూనె మూర్ఖత = వాడిని మూర్ఖత్వం పట్టుకుంది. ఒట్టి మూర్ఖపు ముండాకొడుకయ్యేడు.

యుద్ధం ఇంక తప్పదు

పాలు, పెరుగు, నేయి నూనె అనే పదాలను అవధాని గారు దుర్యోధనుడు పాండవులకు రాజ్యం పాలు పంచడు అనీ,

వాడిలో నానాటికీ అహంకారం పెరుగు తోందనీ,

ఎక్కడయినా ఇలాంటి దుశ్చేష్టితం లోకంలో చూసామా (కన నేయిలన్) అనీ,

ఆ దుర్యోధనుడి మనసులో మూర్ఖత్వం చోటు చేసుకుందనీ (వాని నూనె మూర్ఖత) అనీ

అందు వలన కురు పాండవ సంగ్రామం తప్పదనీ ఎంత చక్కని పద్యం చెప్పాడో చూసారా?



స్వస్తి.

14, ఏప్రిల్ 2011, గురువారం

దండం దశ గుణం భవేత్


దండం దశ గుణం భవేత్ అనే మాట తరుచుగా వింటూ ఉంటాం కదా?
దాని పూర్తి పాఠం చూదాం ...

విశ్వా మిత్రా హి పశుషు, కర్దమేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

వి = పక్షులు
శ్వా = కుక్కలు
అమిత్ర = శత్రువులు
అహి = పాములు
పశు = పశువులు ( వీటిని అదుపు చేయడానికిన్నీ)

కర్దమేషు = బురదలో
జలేషుచ = నీటిలో
అంధే = గుడ్డితనంలో
తమసి = చీకటిలో
వార్ధక్యే = ముసలితనంలో ( సాయంగా ఉండేది కర్ర.)
( ఈ విధంగా)

దండం = కర్ర
దశగుణమ్ = పది విధాలయిన
గుణమ్ = గుణములు కలది
భవేత్ = అగుచున్నది.

అంటే, చేతి కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపులో ఉంచడానికి ఉపయోగ పడుతుంది.

అంతే కాక, బురదలో సజావుగా నడవడానికి, నీటిలో లోతు చూసుకుంటూ దిగడానికీ, చీకటిలో తడుముకుంటూ క్షేమంగా వెళ్ళడానికీ, గుడ్డితనంలో ఆసరాగానూ, ముసలితనంలో ఊతగానూ ఉపయోగపడుతుంది.

ఈ విధంగా చేతి కర్ర పదిరకాలుగా మనకు ఉపయోగ పడుతున్నదన్నమాట.

శ్లోకం అర్ధం ఇలా ఉంటే, మనలో చాలమంది ఎందుకో, దండించడం వల్ల ( శిక్షించడం వల్ల) పదిలాభాలు ఉన్నాయి .. వంటి అర్ధాలు చెబుతూ ఉంటారు. దండం అనే పదాన్ని దండన అనుకోవడం వలన ఈ భావం కలుగుతూ ఉండొచ్చును.

మరయితే, ఈ టపాకి ఎన్నుకున్న చిత్రం అలా ఉందేమిటయ్యా, అని నిలదీయకండి.

ప్రమాదో ధీమతామపి ( బుద్ధిమంతులు కూడ ఒక్కొక్క తూరి పొరబడుతూ ఉంటారు) అని చెప్పడానికి అలా ఉంచానంతే.


11, ఏప్రిల్ 2011, సోమవారం

దేవతలకు కూడా దారిద్ర్యమేనా ?



దేవతలకు కూడా దారిద్ర్యమేనా ? అవుననే అంటున్నారు మన కవులు. కేవలం చమత్కారం కోసమే నండోయ్.

చూడండి:

హలమట బలస్య, ఏకోనడ్వాన్ హరస్య, నలాంగలం
క్రమ పరిమితా భూమిర్విష్ణో: న గౌ ర్న చ లాంగలం
ప్లవహతి కృషి:నాద్యా ప్యేషాం ద్వితీయం గవం వినా
జగతి సకలే నే దృగ్దృష్టం దరిద్ర కుటుంబకమ్.

బలరాముడికి నాగలి ఉంది. కాని ఎద్దులు లేవు.
శివుడుకి ఎద్దు ఉంది. కాని నాగలి, భూమి లేవు.
హరికి మూడడుగుల నేల ( బలి ఇచ్చినది) ఉంది. కానీ, ఎడ్లు, నాగలి లేవు.
ఇంత దరిద్ర కుటుంబం ఎక్కడా చూడ లేదయ్యా ! అంటున్నాడు కవి ఈ శ్లోకంలో.

కేవలం చమత్కారం కోసమే సుమండీ. నాగలి, ఎద్దు, భూమి మొదలయినవి ఆయా దేవతలకి వరుసగా ఆయుధమూ, వాహనమూ, ధర్మ పత్ని గానూ శోభిల్లుతున్నాయి.

కాసుల పురుషోత్తమ కవి కూడా వ్యాజ నిందా రూపమైన తన ఆంధ్రనాయక శతకంలో హరి పరమ దరిద్రుడని వెటకారంగా అన లేదూ?
చూడండి:

ఆలు నిర్వాహకురాలు భూదేవియై
యఖిల భారకుడను నాఖ్యఁదెచ్చె

ఇష్ట సంపన్నురాలిందిర భార్యయై
కామితార్ధదుడన్న ఘనతఁదెచ్చె

కమలఘర్భుడు సృష్టికర్త తనూజుడై
బహు కుటుంబికుడన్న బలిమిఁదెచ్చె

కలుష విధ్వంసిని గంగ కుమార్తెయై
పతిత పావనుడన్న ప్రతిభఁదెచ్చె

ఆండ్రు బిడ్డలుఁదెచ్చు ప్రఖ్యాతి కాని
మొదటి నుండియు నీవు దామోదరుడవె !
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్య భావ !
హత విమత జీవ ! శ్రీకాకుళాంధ్ర దేవ !

శ్రీహరికి అఖిల భారకుడు ( సమస్త లోక భారాన్ని వహించేవాడు), కామితార్ధదుడు ( కోరిన కోరికలు ఇచ్చే వాడు), బహు కుటుంబికుడు ( జగమంత కుటుంబంకలవాడు), పతిత పావనుడు
( పతితులను వారి పాపాలు పోగొట్టి, పుణ్యాత్ములుగా చేసే వాడు) అనే పేర్లు ఉన్నాయి.

అయితే , మన కవి హరికి ఈ పేర్లన్నీ రావడానికివరుసగా అతని భార్యలు భూదేవి, శ్రీ లక్ష్మి, అతని కుమారుడు బ్రహ్మ, కుమార్తె గంగ కారణం తప్ప అతని గొప్పేమీ లేదని వ్యాజ నిందా రూపంలో చెబుతున్నాడు. హరి మొదటి నుండీ (దరిద్ర) దామోదరుడేనుట !

దామోదరుడు అంటే, దామము (పద్మము) ఉదరము నందు కలవాడని అర్ధం. శ్రీహరి నాభిలో కల పద్మం నుండే కదా బ్రహ్మ జనించినది.

ఇది నిందా రూప స్తుతి. అట్టి మహనీయులను పత్నులుగాను, కుమారునిగాను, కుమార్తె గాను కలిగిన హరి మరింత ఘనత వహించిన వాడు కదా. వ్యాజ నిందా రూపంలో హరిని నుతించడానికి కవి అతనికి లేని పోని దారిద్ర్యాన్ని ఆపాదించి చెబుతున్నాడు.

దేవతల దారిద్ర్యాన్ని గురించిన మరొక చాటువు కూడా చూదాం

శివుడద్రిని శయనించుట
రవి చంద్రులు మింట నుంట, రా
జీవాక్షుండ విరళముగ శేషునిపై
బవళించుట నల్లి బాధ పడ లేక సుమీ !

కవి తమాషాగా శివుడు హిమవత్పర్వతం మీద నివాసం ఏర్పరచు కోవడం, సూర్య చంద్రులు ఆకాశంలో ఉండడం, శ్రీహరి నిరంతరం పాలకడలిలో ఆది శేషుని మీద పవళించడం కేవలం నల్లి బాధ పడ లేకనే అని చెబుతున్నాడు.నల్లులూ, దోమలతో వేగాల్సిన దరిద్రం ఆ దేవతలకీ తప్పడం లేదని చమత్కారంగా చెబుతున్నాడు.

పరమేశుడు కాశీ నగరం విడిచి రావడానికి కూడా ఈ దరిద్రమే కారణం కదా.

దేవతల దారిద్ర్యం గురించిన ఈ చమత్కారాలకు ఇక స్వస్తి. మరో టపాలో మళ్ళీ కలుద్దాం.

9, ఏప్రిల్ 2011, శనివారం

కిచిడి శ్లోకమ్


ఒక చమత్కార శ్లోకం చూడండి ...

అంబలి ద్వేషిణం వందే
చింతకాయ శుభ ప్రదమ్
కూరగాయ కృత త్రాసం
పాలనేతి గవాం ప్రియమ్


తెలుగూ, సంస్కృతమూ కలగూరగంపలా కలగలిసి పోయిన ఈ శ్లోకం చూసేరా ? కవిగారి అభావ చేష్ఠ అని పోనీ లెమ్మని సరి పెట్టుకుందామంటే అర్ధం కూడా అదోలా లేదూ?

అంబలిని ద్వేషించే వాడికి వందనమట. చింతకాయ చాలా శుభ దాయకమట. కూరగాయ భయోత్పాతకమట. ఆవు పాల నేయి ప్రియమైనదట. ఏమిటీ కారు కూతలూ అనుకుంటున్నారా ?

అం , బలి = బలిని అణచి వేసిన వాడు

చింతక , ఆయ = నామ స్మరణ చేసే వారికి సకల శుభాలు ఇచ్చేటి వాడు

కు , ఉరగాయ = దుష్ట సర్పమును ( కాళీయుని) అణచి వేసిన వాడు

పాలన , ఇతి = గోవులను కాచునట్టి వాడు (అయినట్టి) ( శ్రీ కృష్ణునికి )

వందే = నమస్కరించుచున్నాను.


ఇది శ్రీ కృష్ణ నామ స్మరణ చేసే శ్లోకం.


3, ఏప్రిల్ 2011, ఆదివారం

ఉగాది ఉదయం ... కథ


అందరికీ ఖర నామ సంవత్సర శుభాకాక్షలు.... మీ కథా మంజరి.

అందరకీ సమస్త శుభాలూ కలగాలని, అందరి మనుగడ హాయిగా సాగాలని కోరుకుంటున్నాను.

తే 27-3-1971 దీ కృష్ణా పత్రిక వార పత్రికలో , ఉగాది సంచికలో వచ్చిన నా కథ ఉగాది ఉదయం సరదాగా మీతో పంచు కోవాలని ఇక్కడ ఉంచుతున్నాను. ఈ కథ ను పెద్ద అక్షరాలలో చదవాలనుకుంటే కథ మీద నొక్కి చూడండి.

ఉగాది పండుగతో ముడి పడి ఉన్న కొన్ని మూఢ నమ్మకాల పర్యవసానాన్ని సున్నితంగా తెలియ జేయడమే ఈ కథ ఉద్దేశం. ఇది నా తొలినాటి కథలలో ఒకటి.