తీపి గుర్తులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తీపి గుర్తులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, మార్చి 2011, ఆదివారం

ఎర్ర డబ్బా ఆకలి కేకలు


ఎర్రగా బుర్రగా, కొంచెం కుదమట్టంగా ఉన్న నేను మీకు తెలుసు కదూ?

నగరాల్లో, పట్నాలలో, పల్లెల్లో నేను అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాను. నన్ను ఆంగ్లంలో ఫొస్ట్ బాక్స్ అనిపిలుస్తారు. తెలుగు వాళ్ళు నన్ను పోస్టు డొక్కు అనీ, తపాల పెట్టె అనీ, ఎర్ర డబ్బా అనీ ముద్దుగా పిలుస్తూ ఉంటారు.

ఒకప్పుడు నా కడుపు నిత్యం నిండుగా ఆకలి బాధ ఎరుగ కుండా ఉండేది. కార్డులు, కవర్లు, ఇన్ లేండ్ కవర్లతో నా కడుపు పొద్దస్తమానం నిండి పోయి ఉండేది. మా తపాల అన్నయ్య ప్రతి రోజు ఠంచనుగా వేళకి వచ్చి, నా నడుం ప్రక్క ఉన్న తాళం తీసి వాటిని సేకరించుకుని వెళ్ళి పోయేవాడు. ఆ తరువాత అవి పోష్టు ఆఫీసుకి చేరి, అక్కడ ముద్రలు వేయించుకుని, ఊర్ల వారీగా వేరు చేయబడి రైళ్ళలో, బస్సుల్లో ఎంచక్కా ప్రయాణం చేసి వెళ్ళి పోయేవి. వెళ్ళి, అవి ఎవరికి చేరాలో వారింట అడుగు పెట్టేవి. ఒకప్పుడు ఆ ఉత్తరాలు తెచ్చే పోస్టు మేన్ కోసం జనాలు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసే వారు.



ఉత్తరాలలో ఎన్ని రకాలో ! కుశలాలు అడిగేవి, కబుర్లు చెప్పేవి, నిష్టూరాలు పలికేవి, నిందలు వేసేవి, సాయం కోరేవి, అభయం యిచ్చేవి, ధైర్యం చెప్పేవి, బెంగలు, బాధలు, చికాకులు, కష్టాలు కలబోసుకునేవి, కన్నీళ్ళు కార్చేవి, నవ్వుతూ కళకళ లాడేవి ... ...

కొన్ని మృదువుగా, కొన్ని కఠినంగా, కొన్ని క్లుప్తంగా, కొన్ని సుదీర్ఘంగా, మరి కొన్ని పెళుసుగా, కుండ బద్దలు కొట్టి నట్టుగా, హెచ్చరికలు, ఓదార్పులు, మంతనాలు, హిత వచనాలు, వేడికోళ్ళు, వెక్కిరింతలు ... ...

శుభ వార్తలను మొసుకొచ్చేవి, దుర్వార్తలను చెప్పేవి. మొదటి వాటికి పసుపు నాలుగు చివర్ల పెట్టే ఆచారం ఉంది. రెండో రకం వాటికి నాలుగు చివర్ల నల్ల సిరా పూసే అలవాటూ ఉంది .

కొన్ని ముత్యాల కోవ వంటి అక్షరాలతో రాసినవి. కొన్ని గొలుసు కట్టు రాతతో చదవడానికే చికాకు పరిచేవి.

కొన్నింట చక్కని కవిత్వం. మరి కొన్నింట అక్షర దోషాలతో ఎంత చదివినా ఏం రాశారో అర్ధం కానట్టు ఉండే వాక్య విన్యాసంతో కూడినవి ...

ఇచ్చట అంతా క్షేమం. అచ్చట మీరంతా క్షేమంగా ఉన్నారని తలస్తాము. లాంటి వాక్యాలతో మొదలై, చిత్త గించ వలెను, తో పూర్తి చేసే వారు.

మహా రాజశ్రీ, అనో, బ్రహ్మశ్రీ వేదమూర్తులయిన అనో, గంగా భాగీరథీ సమానురాలైన ... అనో సంబోధనలు ఉండేవి.

ఇప్పుడా ఉత్తరాలూ లేవు, ఆ రాతలూ లేవు. ఉత్తరాలు రాయాలంటేనే బోర్. సెల్ ఫోన్ లు వచ్చేక మరీనూ. గంటల తరబడి అందులోనే కబుర్లు చెప్పు కోవడం, లేదా ఆకుకీ పోకకీ అతకనట్టు ఎస్సెమ్మస్ లు ఇచ్చు కోవడం. నా పాలిట కొరియర్ సర్వీసులొకటి వచ్చి పడ్డాయి. ఇంక నా ఊసెవరికి పడుతుంది ?

లేఖా రచన గొప్పతనం ఇప్పుడెవరికీ పట్టడం లేదు. సాహిత్యంలో లేఖా సాహిత్యానికి ప్రత్యేకమైన, ఉన్నతమైన స్థానం ఉంది. ప్రముఖుల లేఖలు చదవడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.

విశ్వ కవి రవీంద్రుడు మా ఆఫీసు గురించి పోస్టాఫీసు అనే ఒక గొప్ప కథ రాసిన విషయం మీకు తెలిసిందే కదా ?

నా ఉత్తరాల గురించి బాల గంగాధర తిలక్ పైనికుని ఉత్తరం, తపాల బంట్రోతు లాంటి గొప్ప వచన కవితలు రాసేడు. ఇంకా చాలా మంది నా గురించి , ఉత్తరాల గురించిరాసేరు. అపురూపమైన లేఖా సాహిత్యాన్ని సృజించేరు. అవన్నీ మరో మారు చెప్పుకుందాం.

ఆ మధ్య ఏదో తెలుగు సినిమాలో ఓ కమేడియన్ నా నోట్లో చెయ్యి పెట్టి ఎంతకీ ఊడి రాక గింజుకుంటూ విలవిలలాడుతూ ఊరంతా తిరగడం లాంటి కామెడీ కూడా ఏదో చేసాట్ట. నేను చూడ లేదను కోండి. ...

ఇప్పడు చాల మంది ఉత్తరాలు రాయడానికి బద్ధకం చేతనో, అశక్తత చేతనో, అయిష్టం వల్లనో, చేత కాని తనం చేతనో పూను కోక పోవడం చేత తరుచుగా నా కడుపు అర్ధాకలితో దహించుకు పోతోంది.

సంభాషణలో విప్పి చెప్ప లేని విషయాలను, పరిచి చూప లేని హృదయ స్పందనలను అక్షరం ఆవిష్కరించ గలదనే సత్యాన్ని విస్మరిస్తున్నాం మనం.

అందుకే ఒకప్పుడు ఉత్తరాలతో నిండుగా ఉండే నేను, ఇప్పుడు ఒకటీ అరా ఉత్తరాలతో బోసి పోయి ఉంటున్నాను..

అర్ధాకలితో అలమటించి పోతున్నాను. మరెందుకు లెమ్మని నాకు కొన్ని చోట్ల మా తపాల శాఖ వారు తాళాలు వెయ్యడం కూడా మానుకున్నారు. నన్ను పట్టించు కోవడం మానేసేరు.


చాలా వరకు ఇప్పుడు నేను దుమ్ము పట్టి ఉంటున్నాను. ఫాక్సులూ, ఇంటర్నెట్ లూ వచ్చేక నా పరిస్థితి మరింతగా దిగజారి పోయింది.

నా కేడుపు వస్తోంది. నన్ను పట్టించు కోరూ? ఉత్తరాలతో నా కడుపు నింపరూ? నా ఆకలి కేకలు చెవిని పెట్టరూ?

7, ఫిబ్రవరి 2011, సోమవారం

పెంకె ఘటం, మా పతంజలి


పతంజలి గారు ఓ రోజు ఒక పత్రికాఫీసులో కూర్చొని వుండగా అక్కడికి దండిగా మాత్రమే కధలు రాసిన ఓ విశాఖ రచయిత వచ్చారు. పత్రికాధిపతి ఆయనను పతంజలి గారికి పరిచయం చేసారు. పతంజలి గారు అప్పటికే వీర బొబ్బిలి,రాజుగోరు,దెయ్యం ఆత్మ కధ,పెంపుడు జంతువులులాంటి క్లాసిక్స్ రాసి వున్నారు.ఆ రచయిత పతంజలి గారి వంక దర్పంగా ఓ చూపు చూసి మీ పేరు విన్నట్లు గుర్తు .మీరు కూడా కధలవీ రాస్తారనుకుంటాఅన్నారు.పతంజలి గారు పెంకిగా ఎబ్బెబ్బేనేను అట్లాంటి పనులు చేయను లెండిఅనేసారు.ఈ ఎపిసోడ్ అంతా పతంజలి గారు విశాఖ వర్మకి చెపుతూ చూసావోయ్ ఈ రచయితల గోరోజనం…..”అన్నారు.అపుడు వర్మ రణపెంకిగాఅంతేలెండి మరి అయన రాసిన ఐదువందల కధలు మీరు రాయని ఒక కధతో సమానమనిముక్తాయించారు

పతంజలి గారి హాస్య చతురతికి చక్కని తార్కాణమిది. వర్మ గారి ముక్తాయింపు బావుంది. పతంజలి గడుసు దనానికి మరో చిన్న ఉదాహరణ : విజయనగరంలో ఓ (పెద్ద అనుకునే ) రచయిత ఒక సారి తన పుస్తకాన్ని యిచ్చి అభిప్రాయం కోరేడు పతంజలిని . రెండు రోజులాగి చెప్తానని పతంజలి ఆ పుస్తక రచయితతో చెప్పి పుస్తకం తీసుకున్నాడు.
రెండు, మూడు రోజులయేక పతంజలి ఆ పుస్తకాన్ని అతనికి తిరిగి యిచ్చేస్తూ : ‘‘ పుస్తకం చాలా బావుందండి. చక్కని గెటప్. మంచి ప్రింట్. ఎక్కడా అక్షర దోషాలు లేవ్. వాడిన పేపరు చాలా బాగుంది …’’ లాంటి మాటలేవో మాట్లాడేడు. ఆ రచయిత చాలా సంతోషించి, ధన్యవాదాలు మరీ, మరీ చెప్పి ఆనందంగా వెళ్ళి పోయేడు.
‘‘
ఆయనకి నా అభిప్రాయం సరిగా చెప్ప గలిగేను కదా?’’ అడిగేడు పతంజలి.
‘‘
బ్రహ్మాండంగా పుస్తకం గురించి ఒక్ఖ మాట దొర్లకుండా జాగ్రత్త పడుతూ బాగానే చెప్పారు …’’ అన్నాను, నవ్వుతూ
తర్వాత, యిద్దరం సుబ్రహ్మణ్య విలాస్ లో కాఫీలు తాగుతూ ఎంతగా పగలబడి నవ్వుకున్నామో

- - - - - - - - -

ఈ టపాలో మొదటి సంఘటన విశేషాన్ని జాజిమల్లి గారి మల్లీశ్వరి బ్లాగు టపా పతంజలి రాయని కథ నుండి తీసు కోవడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు. ఆ టపా కోసం ఇక్కడ చూడండి.

ఇక, రెండవ సంఘటన గురించి నేను జాజిమల్లిగారి పతంజలి రాయని కథ టపాకు నేను అప్పట్లో ఉంచిన వ్యాఖ్య . ( మొదటి సంఘటన నాకు శృత పూర్వం కాడం చేత, రెండో దానిలో నా ప్రత్యక్ష భాగస్వామ్యం ఉండడం చేత టపా పెట్టే ముందు జాజిమల్లి గారి టపా గురించి పేర్కొనడంలో ఏమరుపాటు జరిగింది.)

ఈ రోజు పతంజలి సమగ్ర సాహిత్య రచనలు మరోసారి ( బహుశా పదో సారి) చదువుతూ ఉంటే ఆ టపా, దానికి నేను పెట్టిన వ్యాఖ్య గుర్తొచ్చి మరోసారి బ్లాగులో నా ముచ్చట కొద్దీ పెట్టాను.

ఇది టపాల పునరక్తి కావచ్చు, కానీ మా పతంజలి గురించి ఎన్ని సార్లు చెప్పినా నాకు తనివి తీరదు.

ఇక్కడ నా ఈ టపాకి వ్యాఖ్య పెట్టి, నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేసిన మల్లి (Malli) గారికి కృతఙ్ఞతలు తెలుపు కుంటున్నాను.. .

కె.ఎన్.వై.పతంజలి రచనలూ,ఫోటోలు కోసం ఓసారి ఇక్కడ నొక్కి చూస్తే ఓ పనైపోతుంది.

0

0


2, డిసెంబర్ 2010, గురువారం

నా 200 వ టపా ... ( విరమణ .. ... కాదు ... ... విరామం )


ఇది నా 200వ టపా. ఈ సందర్భంగా నేను రాసిన వాటిలో కొన్ని టపాలు ఒకే చోట చూడండి ...






























































కథా మంజరిలో నా కథల టపాలు:

















పుస్తక పరిచయాలు:







7. జగన్నాథ రధ చక్రాల్ ... ! ఆ ఙ్ఞాపకాల పేటికలో ఎన్ని గుప్త నిధులో ?!


ఇతరాలు:








నవలిక


మా శ్రీమతి కథలు




ప్రత్యేకం


నన్ను బ్లాగు లోకానికి పరిచయం చేసిన శ్రీమతి వలభోజు జ్యోతి, శ్రీ చింతా రామ కృష్ణారావు, డాక్టర్ శ్రీమతి సుధా రాణి గార్లకు మరో సారి కృతఙ్ఞతలు తెలుపు కుంటున్నాను.

కౌముది వెబ్ పత్రికలో అనగనగా ఒక మంచి కథ శీర్షికన నా కథలు వేడుక ( జూన్ 2010 ) , గుండె తడి
( నవంబరు2010) ప్రచురించిన కౌముది వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

నా బ్లాగుని చదువరుల చెంతకు చేర్చిన సంకలినులు కూడలి, హారం, జాల్లెడ, మాలిక , సమూహము వీటి బాధ్యులకు మరీ మరీ ధన్యవాదాలు.

నా బ్లాగు టపాలను ఆదరించిన వారందరికీ నా కృతఙ్ఞతలు.

200 టపాలు పూర్తయ్యాయి. ఇక మీదట నాకు గల వేరే వ్యాపకాల వల్ల కొంత విరామం పాటిద్దామనుకుంటున్నాను. ( పాఠక స్వగతం : హమ్మయ్య ! రక్షించేవు నాయనా ! పండుగ చేసుకుంటాం)

ఇది విరమణ కాదు, విరామమే. ( పాఠక స్వగతం: మళ్ళీ ఈ పితలాటకఁవా? హన్నా !! )


ధన్యవాదాలు ... మీ, కథా మంజరి

12, అక్టోబర్ 2010, మంగళవారం

అరుదైన ఆనవాళ్ళు ...

మాసి పోయిన సామ్రాజ్యాలకు చిరిగి పోయిన జెండా చిహ్నం.
అంతరించిన నాగరికతలకు శిధిల కట్టడాలే సాక్షీభూతాలు.

ఉత్తరాంధ్రలో శ్రీకాకుళానికి దాదాపు 20 కి.మీ. దూరంలో గార మండలం గార గ్రామానికి
దగ్గరలోశాలిహుండం అనే ఒక బౌద్ధ సంఘారామం శిధిల కట్టడాలు కనువిందు చేస్తూ ఉన్నాయి.వంశధార నది ప్రక్కనే దాదాపు 2000 సం.ల నాటి ఈ ఇటుకలతో నిర్మించిన కట్టడాలు దాదాపు శిధాలావస్థకు చెంది పోయాయి.బౌద్ధుల ప్రార్ధనలకు, విద్యాభ్యాసానికీ వినియోగించిన ఈ మహా చైత్యం వర్తులాకారంలో నిర్మించబడి ఉంది. చుట్టూ బౌద్ధ సన్యాసులు నివసించడానికి ఉపయోగించిన వర్తులాకారపు విహారాలు ఉన్నాయి. ఈ సంఘారామం మొత్తం నిర్మాణమంతా ధాతుగర్భ నిర్మితమని చెబుతారు. అంటే, బుద్ధుని శారీరక అవశేషాల మీద నిర్మించబడిన కట్టడం అని అర్ధం. బౌద్ధంలో ఈ చైత్యం హీనయాన మత శాఖకు చెందినదని పరిశోధకుల అంచనా. ఇక్కడ లభించిన విగ్రహాలు మున్నగు అవశేషాలతో ఇక్కడ ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది.ఒక చిన్న గుట్ట మీద ఈ స్తూపం వుంది.
ఈ ప్రక్కగా ప్రవహించే వంశధార నది, చుట్టూ పచ్చని పంట పొలాలు, దూరంగా సముద్రంలో కలుస్తున్న వంశధార నది, చూపరులకి ఆహ్లాదం కలిగిస్తాయి.

శాలి హుండం అంటే ధాన్యపు గాదె అని అర్ధం.

సచ్చని అందమయిన ప్రకృతి ఒడిలో శాలిహుండం పురా వైభవాలను నెమరు వేసుకుంటూ సేద తీరుతున్నట్టుగా ఉంటుంది.

అంతే కాదు, ఆ అందాలు చూస్తూ ఉంటే, మనం కూడా ఒక అలౌకికానందానుభూతికి లోనై పరవశించి పోక తప్పదు.

శాలిహుండం గురించి డా. ముద్దు వెంకట రమణా రావు తమ ఉదయ కిరణాలు పుస్తకంలో వ్రాసిన చిన్న వ్యాసంలో మరి కొన్ని వివరాలు లభిస్తాయి. చూడండి.

ఇక ఆ అందాల లోకంలో విహారం చేయండి మరి ....

























10, అక్టోబర్ 2010, ఆదివారం

అమ్మని చూస్తున్నట్టే ఉంది ...




దాదాపు మూడు నెలల క్రిందట రావు బాల సరస్వతి పాడిన ఒక పాట గురించి ఎవరికయినా తెలుస్తే చెప్ప గలరా ? అని బ్లాగు మిత్రులకు మెయిల్ చేసి, అడిగాను.

వెంటనే వలబోజు జ్యోతి, ఇనగంటి రవిచంద్ర, పరుచూరి శ్రీనివాస్, సౌమ్య, ఆది లక్ష్మి, స్వరం, తాడే పల్లి బాల సుబ్రహ్మణ్యం గారలు స్పందించారు.

జ్యోతి గారు పాట సాహిత్యాన్ని అందించగా, రవి చంద్ర, పరుచూరి గారలు ఆడియో లింక్ కూడా దయతో అందించి నాకు చాలా సంతోషం కలిగించారు.
శ్రీ పంతుల గోపాల కృష్ణా రావు గారు కూడా ఈ సాహిత్యం నాకు లభించేలా సహకరించారు.

వీరందరికీ నా హృదయ పూర్వకమయిన ధన్యవాదాలు తెల్పు కుంటున్నాను.

ఆ తోటలో నొకటి ...అనే ఈ పాట నేను చాలా చిన్నప్పుడు విన్నాను. అనంతపురం జిల్లా ఉరవ కొండలో మా మాతామహులు ( ముసిలి డాక్టరు గారు) ఉండే రోజులలో మా అమ్మ ( కీ.శే. పార్వతమ్మ) తో పాటు ఉరవ కొండ వెళ్ళే వాడిని. వెళ్ళి నప్పుడల్లా నాలుగయిదు నెలలకు తక్కువ ( అంత కంటె ఎక్కువ రోజులేనేమో ?) కాకుండా అక్కడ ఉండే వాళ్ళం.










మా తాత గారింట్లో ఒక గ్రాం ఫోను ఉండేది. దాని మీద కుక్క కూర్చున్న బొమ్మ నాకెంతో ఇష్టంగా ఉండేది.


అందులో మా అమ్మ తరచుగా ... తరచుగా ఏమిటి, ఆ ఊళ్ళో ఉన్నన్ని రోజులూ కూడా ఈ ఆ తోటలో నొకటి ...
అనే పాట ఎంతో ఇష్టంగా వింటూ ఉండేది. అమ్మకి ఆ పాటంటే ఎంత ఇష్టమో చెప్ప లేను. అమ్మంటే ఇష్టం కనుక నాకూ ఆ పాటంటే ఇష్టంగా ఉండేది. చాలా రోజుల పాటు ఆ పాటంతా నాకు కంఠతా ఉండేది. కాని, క్రమేపీ మరిచి పోయాను.
అమ్మ పోయాక, ఆ పాట కూడా, ఒక్క - ఆ తోటలో నొకటి ... అనే ముక్క తప్ప, నా స్మృతి పథం లోనుండి జారి పోయింది. చాలా కాలం విచార పడ్డాను. అయితే, ఆ పాట బాల సరస్వతి పాడినట్టుగా గుర్తుంది.

రిటైరయ్యేక, అరవైయ్యవ యేట కంప్యూటరు నేర్చుకుని ... నెట్లో బాల సరస్వతి గురించి వెతికాను. చాలా ఉంది. కాని, నాకు కావలసిన ఈ పాట సాహిత్యం మాత్రం దొరక లేదు. ( లేదా, నేను ఓపికగా వెతక లేక పోయానో, యేమో )

అప్పుడు నాకీ పాట పూర్తి పాఠం కావాలని ఒక మెయిలు పెడితే, దయతో , మీద పేర్కొన్న వారు వెంటనే స్పందించారు.
మరో మారు వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

అరవయ్యవ యేట అందిపుచ్చుకున్న ఈ ఆధునిక సాంకేతిక విఙ్ఞాన ఫలితాన్ని మనసారా ఆస్వాదిస్తున్నాను.

ఈ పాట సాహిత్యాన్ని చూస్తున్నా, పాట వింటున్నా, నాకు మా అమ్మను చూస్తున్నట్టే ఉంది.

దాదాపు ఏభై ఏళ్ళ క్రిందట, తడికెల ప్రహరీతో, ఆ మిద్దె ఇంటి మీదకి ఏపుగా అల్లుకున్న
సన్న జాజి పూ పొదలతో ఒక వింత గుబాళింపుతో కలగలిసిన నా బాల్యపు ఆనవాళ్ళు పోల్చుకో గలుగుతున్నాను. చిన్న చిన్న గ్రామ ఫోను ముల్లులు మారుస్తూ, పదే పదే దాని కీ త్రిప్పుతూ, పరవశంగా ఆ గాన మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, దానితో గొంతు కలిపి , సన్నగా మా అమ్మ పాడిన పాట నాకు వినిపిస్తున్నట్టే ఉంది.

అందుకే, ఇదంతా టపాగా వ్రాయాలా , వద్దా అని, మూడు నాలుగు నెలలుగా తటపటాయించి, ఇక ఈ వేళ నా ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను.

సాహిత్యం ఇది:

ఆ తోటలోనొకటి ఆరాధనాలయము
ఆ ఆలయములోని అందగాడెవరే,
అందగాడెవరే, అందగాడెవరే!
మన్మథుండనీ చెలియా
మనసు ఘోషించేనే
మరలీ వచ్చెదమన్నా మరపూ రాకున్నాడే

మరపు రాకున్నాడే II ఆ తోటలో నొకటి II


చంద్రబింబపు ముఖమూ
గండుకోకిల స్వరమూ
పండూ వెన్నెలలోlన
పవ్వాళించేనమ్మా...చెలియా
చుక్కల్లా రేడమ్మా ...సఖియా

చుక్కల్ల రేడమ్మా ... సఖియా

మరుని శరముల చేత మనసు నిలువక నేను

మల్లె మొల్ల మొగలి మాలతి మందార

మాలికను వాని మెడలోన వైచి నానే
మధురామూర్తి మేల్కొని మందహాసముచేయ
మకర కర్ణిక మెరసెనే , చెలియ
మది వెన్న చిల్కినదే , సఖియా
మెరపూ లోనా నేను మైమరచి వెంటనె
పేరేమిటని వాని ప్ర శ్నించినానే'--

పేరేమిటని వాని ప్రశ్నించినానే

మాయాదేవీ సుతునని మధురామూర్తీ పలికె
సిద్ధార్థుడే నాకు సిద్ధించెనే, చెలియా!
మది కోర్కె నెరవేరె, సఖియా!
ఆ తోటలో నొకటి ఆరాధనాలయము
ఆ ఆలయములోని అందగాడితడే...

(ఈ పాట రచయిత 'సాలూరి సన్యాసిరాజు)


ఆడియో వినండి మరి ....




ఈ విడ మా అమ్మ , పార్వతమ్మ (ఈ ఫొటోలో మా అమ్మ వెనుక నిలబడిన వ్యక్తి మా అన్నగారు శ్రీ పంతుల గోపాల కృష్ణా రావు గారు. సాహిత్యాభిమాని. మంచి విశ్లేషకులు. ఇటీవల పద్య రచన మీద ప్రీతితో చక్కని కంద పద్యాలు సరళమైన శైలిలో వ్రాస్తున్నారు.)


నాకు తెలుసులే, నీకిష్టమైన ఈ పాట వింటూ నీలో నువ్వే కమ్మని కంఠంతో పాడుకుంటున్నావు కదూ అమ్మా ?!

* * * *


అమ్మ పోయేక, వచ్చీ రాని రాతలతో నా పందొమ్మిదవ ఏట ఒక నవలిక రాసి పత్రికలో ప్రచురించాను. వీలుంటే, అది కూడా చూడండి. ఇక్కడ నొక్కండి.

మా ఉరవ కొండ ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా.

స్వస్తి.



2, అక్టోబర్ 2010, శనివారం

పొటిగరాప్పంతులు (జూ) తో మాటా మంతీ. ...

ఈ మధ్య విజయ నగరం వెళ్ళినప్పుడు అలా మూడు లాంతర్ల వరకూ వెళ్తే పొటిగరాప్పంతులు కలిసేడు.
కన్యాశుల్కం మొదటి అంకంలో వచ్చే పొటిగరాప్పంతులు పని వాడుగుర్తున్నాడా?
సాన్దీ గిరీశమూ కలిసి తీయించుకున్న ఫొటోల డబ్బులు వసూలు చేసుకుని రమ్మని వాడిని పంతులు పంపిస్తాడు.
నేను కలిసింది ఆ పొటిగరాప్పంతులు గారి మనవడిని. పొటిగరాప్పంతులు, జూనియర్ నన్న మాట.
‘‘పొటిగరాప్పంతులూ ఎలా ఉన్నావెలా ఉన్నావ్’’ అనడిగేను.
‘‘ ఏం ఉండడంలే, ఏదో, యిలా ...’’ అన్నాడు.
‘‘ అదేం ? ’’
‘‘ మా తాత గారు కాలం చేసే వరకూ గిరీశం గారి బాకీ కోసం మనుషులని పంపించీ, తను కాళ్ళరిగేలా తిరిగీ కూడా ఆ బాకీ రాబట్టుకో లేక పోయేరు. వారి తదనంతరం మా తండ్రి గారూ . తర్వాత నేనూ, కనీసం గరీశం గారి మనవళ్ళెవరయినా కనిపించక పోతారా, వారి తాత గారివ్వాలిసిన బాకీ తీర్చక పోతారా అనే ఆశతో ఇలా విజనగరం వీధులంట తెగ తిరుగుతున్నాను..‘‘
‘‘ ఎవరూ కనిపించ లేదూ?’’
‘‘ కనిపించకేం. కానీ అందరూ ఆ తాత గారి చందమే‘‘
‘‘అదేమిటి?’’
‘‘ అందరూ దాదాపు గిరీశం గార్లాంటి వాళ్ళే తయారయేరు. సానుల్తో ఫొటోలు దిగడం, డబ్బుల కోసం మనిషిని పంపిస్తే ఏవో మాయ మాటలు చెప్పి తప్పించు కోవడం ... పైగా గాయత్రి మీద ప్రమాణాలు చెయ్యడమొకటీ ... బిజినెస్సు దివాళా తీసిందనుకో’’ అన్నాడు విచారంగా.
పాపం. అనుకున్నాను. పొటిగరాప్పంతులు పంపిన మనిషికి టోకరా ఇచ్చి, గిరీశం , శిఫ్యడు వేంకటేశంతో ఆ బడుద్ధాయికి చదువు చెప్పే నెపంతో ఉడాయించడం ..... క్రిష్ణరాయపురం అగ్రహారం వెళ్ళి, అగ్ని హోత్రావధాన్లు ఇంట తిష్ఠ వేయడం..... అన్నీ గుర్తొచ్చాయి,
‘‘ సరే కానీ, విజయ నగరం అందాలు చూపించే ఫొటోలు ఏవయినా ఉంటే ఇద్దూ, మా బ్లాగు మిత్రులకి చూపిస్తాను’’ అనడిగేను.
‘‘ బ్లాగా ? అంటే ...? ’’ అనడిగేడు అనుమానంగా.
‘‘ దాని గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ, ముందు ఫొటోలుంటే ఇవ్వు’’
‘‘సరేలే, నీ ఏడుపేదో నువ్వుఏడువ్. ఏవో కొన్ని ఫొటోలున్నట్టున్నాయి. ఇస్తాను తీసికెళ్ళి ఎలా తగలడతావో నీ ఇష్టం.
ముందు నాకో మాంఛి చుట్ట పీక ఉంటే ఇలా పారెయ్‘‘
‘‘ చుట్ట లేదు కానీ, కింగ్ సైజు ఫిల్టరు సిగరెట్టుంది, కాల్చు’’ అంటూ ఓ సిగరెట్టూ, అగ్గి పెట్టె అందించాను.
చీదరగా ముఖం పెట్టాడు పంతులు.
‘‘ చుట్ట లేదూ? గురజాడ వారు మా గిరీశం నోటంట చుట్ట మాహాత్మ్యం గురించి ఎంత గొప్పగా చెప్పారో అప్పుడే మరిచి పోయేరా వెధవ కక్కకట్టల్లారా.... ’’ అంటూ అయిష్టంగానే సిగరెట్టు వెలిగించి, ఓ దమ్ము లాగి వదిలేడు.
‘‘ మరి నేనడిగిన ఫొటోలో?’’
‘‘ నీ అమ్మ కడుపు కాల. వదలేలా లేవురా. సరే నా దగ్గర కొన్ని ఫొటోలేవో ఉన్నట్టున్నాయి. ఇస్తాను. అప్పటి విజయనగరం కాదురా తండ్రీ. చాలా మారి పోయింది. పండు ముత్తయిదువులా ఎంత బాగుండేదని ... ఇప్పటి రూపంలో మన విజయ నగరాన్ని చూస్తూ ఉంటే కడుపు తరుక్కు పోతుందిరా బాబూ ....నువ్వే చూడు ...’’ అంటూ కొన్ని ఫోటోలు అందించేడు.
ఆత్రంగా వాటినందుకుని, గబగబా చూసేను. ‘‘ అవునూ, ఇంకా చాలా స్థలాలకి చెందిన ఫొటోలు ఉండాలే , ఏవీ,
చా.సో గారి హవేలీ , మచ్చ కొండా, కొట లోని రౌండ్ మహల్, మోతీ మహల్, పెద్ద చెరువు గట్టు మీద రాజుల విగ్రహాలూ, ఏనుగుల తోటా, నారాయణ దాసు గారూ, ద్వారం వారూ, కోడి రామ్మూర్తి గారూ నివసించిన ఇళ్ళూ, వ్యాయామశాల, పూల్ బాగ్, , బాబా మెట్ట , దివాన్ గారి మేడ, రాజారావు మేడ, అంబటి సత్రం, అయ్య కోనేరు గట్టున వెలసిన వేంకటేశ్వర స్వామి వారి చిన్న గుడీ. చిన్న ఆంజనేయ స్వామి వారి కోవెలా, లంక వీధి, కానుకుర్తి వారి సత్రం, అయోధ్యా మైదానం,, రాజు గారి సాని సింహాచలం మేడ ... ఇవన్నీ ఏవీ ? ’’ అడిగేను.
‘‘ నీ ముఖం తగలెయ్య. పైసా విదల్చకుండా ఫొటోలన్నీ దొబ్బుకు పోతూ, మళ్ళీ అవి లేవు, ఇవి లేవు అంటూ సణుగుడొకటా.? ఇప్పటికి ఉన్నవి తీసికెళ్ళు. ఈ సారి మిగతావి దొరికితే ఇస్తానులే. సరే కానీ, ఈ సారి వచ్చి నప్పుడు మంచి చుట్టల కట్ట తేవడం మాత్రం మరిచి పోవద్దు సుమీ....ఇక వెళ్ళు ఆ గిరీశం ఎలానూ ఇక దొరకడు. కనీసం వాడి మనవలో, మునిమనవలో కనిపిస్తారేమో చూడాలి. మా తాత గారు తీసిన పుటిగరాపుల బాకీ వసూలు చేసుకోవద్దూ? అసలప్పుడే మా తాత గారు సౌజన్యారావు పంతులు గారిని కలిసి ఆ గిరీశం మీద దావా పడేద్దామనుకున్నారట కానీ, విశాఖ పట్నం వెళ్ళి రావడానికి ఛార్జీలు లేక ఉండి పోయార్ట. .. సరేలే, వెళ్ళిరా ...’’ అంటూ జనంలో కలిసి పోయేడు.
ప్రవాహంలా సాగి పోతున్న అ జన వాహినిలో ఈ జూనియర్ పుటిగరాప్పంతులుకి వందలాది, వేలాది గిరీశంలాటి వాళ్ళు కనిపిస్తారు.
గిరీశం నేర్పించి పోయిన టక్కరి విద్యలు ఉపయోగించి పంతులుని లాఘవంగా బురిడీ కొట్టించి చక్కా పోతారు.
పంచె కట్టు మానీసి, ఫేంటూ చొక్కాలతో లుబ్ధావధాన్లూ, కరటక శాస్త్రీ , అగ్ని హోత్రావధాన్లూ వగైరాలు కాని ,
వాళ్ళ లాంటి వారు కానీ, కూడా కనిపించ వొచ్చును.
సౌజన్యారావు పంతులు కనిపించడు. కనీసం అలాంటి మహానుభావులూ కనిపించరు.
ఇక మధుర వాణి సంగతంటారా? అక్కడే కాదు యావద్దేశంలోనూ, ఆ మాట కొప్తే యావత్ ప్రపంచం లోనూ పొటిగరాప్పంతులకే కాదు, అసలు ఎవరికీ మరి కనిపించదు. ఎందుకంటే ఆవిడ గురజాడ వారి కాళ్ళొత్తుతూ
ఏ స్వర్గంలోనో అంత గొప్ప పాత్రగా తనని తీర్చి దిద్దిన ఆ మహా రచయిత ఋణం తీర్చుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మరి ....
మరింక పుటిగరాప్పంతులు (జూ) ఇచ్చిన ఫొటోలు చూడండి .......
మహా రాజా వారి కోట. ఇందులోనే రౌండ్ మహల్, మోతీ మహల్ వగైరా భవనాలు ఉన్నాయి. ఇప్పుడీ కోట లోని భవనాలన్నీ రాజుల వితరణ త తో విద్యాసంస్థలకు నెలవులయి విలిసిల్లుతున్నాయి.

ఈ ప్రదేశాన్ని బొంకుల దిబ్బ అని అంటారు. గురజాడ వారి కన్యాశుల్కం నాటకం మొదటి అంకం లోని మొదటి స్థలం ఇదే. బొంకుల రాయడు గరీశం బొంకుల దిబ్బ దగ్గరే నాటకంలో తొలి సారిగా కనిపిస్తాడు..ఇప్పుడీ ఖాళీ జాగాలో కూరగాయల మార్కెట్టు ఉంది.

దీనిని మూడు లాంతర్ల జంక్షన్ అంటారు. నిజానికిది నాలుగు రోడ్ల కూడలి కాదు. ఇక్కడ మూడు రోడ్ల కూడలి ఉంది. ఒకటి కస్పా బజారు మీదుగా కోట వేపు వెళ్ళే రోడ్డు కాగా, దానికి ఎదురుగా అంబటి సత్రం, పూల్ బాగ్లకి వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఇక, మూడులాంతర్లకి ఎదురుగా పోయే రోడ్డు లో మొదట్లోనే అమ్మ వారి గుడీ, అది దాటేక గంట స్థంభం వస్తాయి. ఆ దారి తిన్నగా రైల్వే స్టేషన్కి దారితీస్తుంది. గంటస్థంభం నుండి మధ్యలో ఎడమ వేపు తిరిగితే పెద్ద చెరువు, రాజుల విగ్రహాలు కనిపిస్తాయి.
ఈ మూడు లాంతర్లు మూడు సింహం బొమ్మలు. వాటి మీద ఒకప్పుడు చవురు దీపాలను వెలిగించే వారుట. తర్వాత తర్వాత ఎలక్ట్రిక్ దీపాలూ ఉండేవి. ఇప్పుడా దీపాలూ లేవు. ఆ వెలుగులూ లేవు. ఒకప్నపుడు రోడ్డుకి ఎత్తుగా మూడు మెట్లతో ఉండే ఈ కట్టడం , రోడ్డు మందంగా బలియడం వల్ల కురచగా మారి పోయింది.
మహా కవి గురజాడ . ఈ విగ్రహం గురజాడ స్మారక గ్రంథాలయం ఆవరణలో ఉంది.
ఇదే అయ్య కోనేరు. కన్యాశుల్కం నాటకం మొదటి అంకంలో పొటిగరాప్పంతులు మనిషి గిరీశం నుండి అతనూ మధురవాణీ తీయించుకున్న ఫొటోల బాకీ డబ్బులు అడగాడానికి వస్తే, గరీశం వినబడనట్టు నటిస్తూ, ‘ అయ్యకోనేటికి తోవ ఇదే’ అంటాడు కదూ? ఆ అయ్య కోనేరు ఇదే.
విజయనగర ప్రభువులు పితృకర్మలు ఇక్కడ చేసే వారట. 1980 వరకూ అనుకుంటాను, దానికి చెందిన శిధిల కట్టడాలు ఇక్కడ కనిపించేవి.
ఈ కట్టడాన్ని గుమ్చీ అంటారు. శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు ఇక్కడ హరి కథలు చెప్పే వారు.
విజనగర రాజుల పరమత సహనానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఈ దర్గా కోటకు అతి సమీపంలో కస్పా బజారుకి వెళ్ళే దారిలో ఉంది.
ఇది కోటకీ, బొంకుల దిబ్బకీ సమీపంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని ముద్దుగా ప్యారిస్ కార్నర్ అని పిలుచుకుంటూ
రోజూ సాయంత్రాల వేళ కవులూ, రచయితలూ కబుర్లతో సందడి చేస్తూ ఉండే వారు.

ఈ మూడు కోవెళ్ళ లోనే దాసు గారు తరచుగా హరి కథలు చెప్పే వారు.
ప్రభుత్వ మహా రాజా సంస్కృత కళాశాల. ఇక్కడ వేద పాఠశాల, భాషా ప్రవీణ, సాహిత్య విద్యాప్రవీణ, వ్యాకరణ విద్యాప్రవీణ కోర్సలు నిర్వహించే ప్రాచ్య కళాశాల, ఉన్నత పాఠశాల, ఉన్నాయి. దేశం గర్వించే మహా పండితులు మెసలిన చోటు,
ఇది విజయనగర ప్రభువులు నిర్మించి అవిఘ్నంగా నిర్వహిస్తున్న విద్యార్ధి ఉచిత భోజన శాల.
సింహాచల దేవస్థానం చౌలటరీ అంటారు. ఏళ్ళ తరబడి రోజూ వందలాది విద్యార్ధులకి ఉచితంగా కమ్మని భోజనాన్ని సమకూరుస్తూ వారి విద్యాభ్యాసం కుంటు పడకుండా కాపాడుతున్న చల్లని తల్లి.

విజయగరం ప్రభుత్వ మహా రాజ సంగీత కళాశాల.
ద్వారం నాయుడు గారి లాంటి సంగీత దిగ్దంతులు నడయాడిన చోటు. ఘంటసాల సంగీత సాధన జరిగింది ఇక్కడే.

అయ్య కోనేరు తూర్పు గట్టున వెలసిన పెద్ద ఆంజనేయ స్వామి వారి కోవెల.

కోట వెనుక భాగం. కందకం

రాజా వారి డిగ్రీ కళాశాల. గురజాడ చదివినదీ, ఉద్యోగం చేసినదీ ఇక్కడే
గంటస్థంభం. విజనగరానికి ఇది తలమానికం.
పెద్ద చెరువు. వేలాది ఎకరాల నేలకు సాగునీరు అందిస్తున్న పెద్ద చెరువు. దేవుల పల్లి కృష్ణ శాస్త్రి ఓ సారి తమ విజయనగర అనుభవాలను స్మరించుకుంటూ , విజయగరంలోని ఒక్కో ప్రదేశాన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇలా అన్నారు:
‘‘విజయనగరంలో నాకన్నీ ఇష్టం. చివరకి పెద్ద చెరువులో దోమలు కూడా. ’’ అని.
ఈ పెద్ద చెరువు దగ్గర దోమల మందిరం అని ఒకటుండేది. అక్కడ దోమలు ఎక్కవగా ఉండే రోజులలో దాదాపు ఒక నెల రోజుల పాటు పాఠశాలలకి ప్రత్యేకంగా సెలవులు ప్రకటించే వారుట.
శ్రీ పైడితల్లి అమ్మ వారి గుడి. విజయనగర రాజుల ఇల వేలుపు. ఏటా విధిగా జరిగే అమ్మ వారి పండుగలో సిరిమానోత్సవం ఒక ప్రత్యేక ఆకర్షణ.
అమ్మ వారికి చెందిన తొలి గుడి విజయ నగరం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంది. వనం గుడి అని ఆ గుడికి పేరు.
కన్యాశుల్కం, ముత్యాల సరాలు, తెలుగు తొలి కథ దిద్దుబాటు మొదలయిన గురజాడ రచనలు జాతి నోముల ఫలంగా వెలుగు చూసిన చోటు ఇదే.
విద్యార్ధి భోజనశాల
గుమ్చీ ఈ ప్రక్కగా వెళ్తే శంకర మఠం వస్తుంది. కౌముదీ పరిషత్తు తొలి రోజుల కార్యక్రమాలు అక్కడే జరిగేవిట.


ఇవీ జూనియర్ పొటిగరాప్పంతులు నాకిచ్చిన ఫొటోలు. మరోసారి అతను మిగతా ప్రదేశాల ఫోటోలు ఇచ్చాక మీముందు పెడతాను.
ఈ లోగా అతని కోసం మంచి చుట్టలు ఎక్కడ దొరుకుతాయో వాకబు చేయాలి. మరి ఉంటాను.