మంచి పుస్తకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మంచి పుస్తకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, జనవరి 2011, ఆదివారం

జగన్నాధ రధ చక్రాల్ ... ఆ ఙ్ఞాపకాల పేటికలో ఎన్ని గుప్త నిధులో ?!


ఎ.ఎన్.జగన్నాథ శర్మ గారి కొత్త పుస్తకం జగన్నాథ రధ చక్రాల్ ( నవ్య వీక్లీ మొదటి పేజీ) విశాలాంధ్ర వారి ప్రచురణగా 2011 కొత్త సంవత్సరం మొదటి రోజున వెలువడింది. ఈ సందర్భంగా విశాలాంధ్ర వారి కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో కవి శివా రెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.శర్మ గారు ఈ పుస్తకాన్ని తమ అన్నా వదినలు అయలసోమయాజుల గణపతి రావు, నాగ రత్నం దపంతలకి అంకితం చేసారు.

నవ్య వార పత్రిక సంపాదకునిగా బాధ్యతలు స్వీకరించేక జగన్నాథ శర్మ గారు నవ్య వీక్లీ లో హరహర మహా దేవ ! అనే శీర్షికతో మొదలు పెట్టి ఈ మొదటి పేజీ రచనలు చేస్తున్నారు ఇది నవ్య పాఠకులను విశేషంగా అలరిస్తూ వస్తోంది. వీక్లీ చేతిలో పడగానే మొట్ట మొదట ఈ మొదటి పేజీ సంపాదక రచనను చదవనిదే మిగతా పుటల జోలికి వెళ్ళని అసంఖ్యాక పాఠక శ్రేణి తయారయింది. అద్భుతమైన శైలితో వివిధ సామాజికాంశాలను అలవోకగా తడుముతూ సానుకూల దృక్పథంతో పాఠకులను ఈ రచనలు విశేషంగా ఆకట్టు కుంటున్నాయి. జీవితం పట్ల ఒక ఆశాహ దృక్పథాన్ని ప్రోది చేస్తూ, వ్యక్తి చైతన్యాన్ని పెంపొందించేలా ఈ కథనాలు తెలుగు పత్రికా రచనలో ఒక బాధ్యతాయుతమైన పాత్రను నిర్వర్తిస్తున్నాయి. అలా వ్రాస్తున్న మొదటి పేజీ రచనల నుండి ఏర్చి కూర్చిన 92 రచనలతో ఇప్పుడీ పుస్తకం అందంగా వెలువడింది.

పుస్తకాన్ని చూడగానే కొనాలనిపించేంత అందంగా రమణ జీవి గారు భావ స్ఫోరకమైన టైటిల్ డిజైన్ చేసారు.

పుస్తకం వెనుక అట్ట మీద ప్రచురించిన పెద్దల అభిప్రాయాలు చూడండి ...

నవ్య వీక్లీ సంపాదకులుగా జగన్నాథ శర్మ గారు సాగు చేసిన ఙ్ఞాపకాల తోటగా ప్రచురణ కర్తలు

తమ అమూల్యాభిప్రాయం వెలువరిస్తే,

ప్రముఖ రచయిత ముక్తవరం పార్ధ సారధి ఇలా అంటున్నారు:

ఇవి కథలు కావు.వ్యాసాలు కావు. మ్యూజింగ్స్ కూడా కావు. నవ్య వీక్లీకి సంపాదకుడిగా ఉన్న జగన్నాథ శర్మగారు వారం వారం పాఠకులకు సమర్పించిన ఈ మొదటి పేజీ ‘ప్రోజ్ పాయెమ్స్’ ఆయన స్మృతి వల్మీకాలు. ఙ్ఞాపకాలందరికీ ఉంటాయి. కాని వాటిని ఉద్వేగ భరితంగా, గుండె గొంతుకలో అడ్డు పడినట్టు పదాలలో బంధించడం మాత్రం జగన్నాథ శర్మ గారికే సాధ్యం. ఇవి చదువుతూ ఉంటే ఒకసారి ఒళ్ళు జలదరిస్తుంది. మరోసారి మనస్సు కలుక్కుమంటుంది.. లేదా నాస్టాల్జియాతో వెన్నులో చలి పుట్టి ‘ ఇలా ఉండేదా ఆనాటి బతుకు’ అని మనకు తెలియకుండానే మౌనంగా రోదిస్తాం.కనిపించని కన్నీరూ, పంటి కింద బిగపట్టిన బాధా, చిన్ననాటి కలల జలతారు దృశ్యాలూ వీటిలో మనల్ని పలకరిస్తాయి.ఇవి శర్మ గారు మనకిచ్చిన చిరు కానుకలు‘.

మరో రచయిత ఓలేటి శ్రీనివాసభాను ఏమంటున్నారో చూడండి:

పడికట్టు పదాల్లేవు. పనికి రాని ఉపన్యాసాలూ లేవు. ఆరితేరిన కథకుడు తనదైన శైలిలో రాసిన కథనాలు ఇందులో ఉన్నాయి. సంపాకీయం అంటే ఎత్తయిన శిఖరమ్మీదో, ఏకాంతంలోనో కూర్చొని రాసిన ప్రవేశికలు కావివి. కథాకథన శైలిలో ఆవిష్కరించిన అవతారికలివి. వీటిలో ఆశలున్నాయి. ఆకాంక్షలున్నాయి. ఆశయాలూ, అనుభూతులూ ఉన్నాయి. సమస్యల పట్ల సానుభూతితో స్పందించి, సానుకూలమైన పరిష్కారాన్ని అందించడం ఈ‘జగన్నాథ రధ చక్రాల’ విశిష్టత. బియ్యం గింజ మీద అక్షరాలు రాసినట్టుగా గుప్పెడు వాక్యాల్లో గుండెను కమ్ముకునే భావాలకు పటం కట్టి, సంపాదకీయాలకు సరికొత్త పట్టం కట్టిన ప్రవీణ్యం ఇందులో ఉంది. ఎప్పుడు చదివినా జీవితాన్ని ప్రతిబింబించే, మనిషికి ప్రాతినిధ్యం వహించే శాశ్వత విలువలు ఇందులో ఉన్నాయి.

శర్మ గారి ఙ్ఞాపకాల పేటికలో ఎన్ని గుప్త నిధులు ఉన్నాయో ! సూదంటురాయిలా ఆకర్షించే ఈ శీర్షికలే చెబుతాయి. మచ్చుకి కొన్ని చూడండి:

కొమ్మా లేదు ! కోకిలమ్మా లేదు !

మీసాల తాతయ్య పల్లీలు

చిగురు తొడిగిన శ్రమ

పునుకుల పున్నమ్మ

ఆకు పచ్చని ఙ్ఞాపకం

బుడ బుక్కలు

కన్నీరు కూడా వరమే

జజ్జనకరజనారే ! జనకుజన జనారే !

తూనీగ ... తూనీగ

ఙ్ఞాపకాల సన్నజాజులు

పరమ శివుడు, పిల్ల చేష్టలు

వేసవి వెన్నెల

చెట్టెక్క లేని చిన్న తనం ...

ఇలా రాస్తూ పోతే మొత్తం అన్ని శీర్షికలనూ పేర్కొనాలసి వస్తుందేమో !

జగన్నాథ శర్మ గారి గురించి ప్రత్యేకంగా వ్రాయాల్సిన పని లేదు.

13 -4 - 1956 లో విజయ నగరం జిల్లా, పార్వతీ పురంలో పుట్టిన వీరు ప్రవృత్తి రీత్యా రచయిత, వృత్తి రీత్యా పత్రికా రచయిత. దాదాపు అయిదు వందల కథలు, అయిదు నవలలు, అనేక వ్యాసాలు వ్రాసారు.

సినిమా, టీవీ రంగాలలో పనిచేసిన విశేషానుభవం ఉంది. ప్రముఖ టీవీ ఛానెళ్ళలో వీరు రాసిన టీవీ సీరియల్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ప్రస్తుతం నవ్య వార పత్రికకు సంపాదకులుగా ఉంటున్నారు . వెనుకటి తరానికి చెందిన గొప్ప సంపాదకులకు తీసిపోని విధంగా, కాలానుగుణమై మార్పులను ఆమోదిస్తూనే, నిత్యం ఏదో కొత్త దనాన్ని ప్రదర్శిస్తూ, నవ్య వార పత్రికను అటు సగటు పాఠకుల పత్రికగాను, ఇటు రచయితల పత్రికగాను తీర్చి దిద్దుతున్నారు. పురా పత్రికా రంగ వైభవాన్ని గుర్తనకు తెచ్చే లాగున దీపావళి సంచికలు ప్రచురించడం, ఒక శ్రీశ్రీ ప్రత్యేక సంచికను తీసికొని రావడం, వారం వారం నవ్య నీరాజనంతో రచయితలను పరిచయం చేయడమే కాక వారి కథలలో ఒక గొప్ప కథను పునర్ముద్రించడం - సంపాదకునిగా వీరి నిబద్ధతకు కొలబద్దలుగా చెప్పుకో వచ్చును.

ఇంతవరకూ ప్రచురితమైన వీరి పుస్తకాలు:

పాల పిట్ట కథలు (ప్రపంచ బాలల జానపదకథలకు అనుసృజన)

పేగు కాలిన వాసన (కథలు)

మహా భారతం (బాలల కోసం సరళ వ్యావహారికంలో)

రాబోయే వీరి పుస్తకాలు:

మహా భారతం ( తక్కిన సంపుటాలు )

అగ్రహారం కథలు

మా ఊరి కథలు

ఇది విశాలంధ్ర వారి ప్రచురణ. విశాలాంధ్ర వారి అన్ని బ్రాంచీలలోను దొరుకుతుంది.

192 పుటలున్న దీని వెల రు. 90 మాత్రమే.

మరెందుకాలస్యం ? మనమూ వారి ఙ్ఞాపకాల తోటలో విహరిద్దామా !

26, డిసెంబర్ 2010, ఆదివారం

బాలల కోసం ఓ బహుమతి - జగన్నాథ శర్మ గారి సరళ వచన మహా భారతం


బాలల కోసం సరళ వ్యావహారికంలో అయలసోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ రచించిన మహా భారతం (ఆది పభా అరణ్య పర్వాలు ) హైదరాబాద్ పాలపిట్ట బుక్స్ వారు ఇటీవల వెలువరించారు.

పుస్తకం చూడ ముచ్చటగా ఉంది. బాలి వేసిన అందమైన ముఖ చిత్రంతో చూడ గానే ఆకట్టు కునేలా ఉంది. ముద్రాపకులు తమ ముందు మాటలో మరల ఎందుకనగా ... అంటూ, భారతాన్ని మరల ఎందుకు ప్రచురిస్తున్నారో సహేతుకంగా వివరించారు. తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి అనే మాట ఈతరం పిల్లలకు తెలుసా ? అనే ప్రశ్నను ముందుగా సంధించి, ఆబాల గోపాలాన్ని శతాబ్దులుగా అలరిస్తున్న ఈ అధ్బుత పౌరాణిక గాథను మరల మరల ప్రతి తరం చదివి తీరాలని చెబుతున్నారు. ఇప్పటికే వ్యాస ప్రోక్త భారతాన్ని తెలుగులో చాల మంది పద్యంలోను, గద్యం లోను రచించారు. అత్యాధునిక సాంకేతిక ధోరణులు ప్రబలిన ఇరవయ్యొకటో శతాబ్దంలో జీవిస్తున్న వారి చేత సరి కొత్తగా చదివించాల్సిన గ్రంథమిది. భారతాన్ని ఎందరో తిరుగ రాసి నప్పటికీ, ఎప్పటికప్పుడు వచ్చే తరానికి కొత్తగా వినిపించాల్సిన గాథ మహా భారతం. అద్భుత కథన నైపుణ్యం కలిగిన జగన్నాథ శర్మ గారు పిల్లలకు సులువుగా బోధ పడేందుకు గాను, ఈ తరానికి నచ్చేట్టుగాను, వారి మనసు మెచ్చేట్టుగాను, చవులూరిస్తూ చదివించే విధంగా సరళ వచనంలో ఈ రచన చేసారు. నవ్య వార పత్రికలో ధారావాహికంగా వెలువడుతున్న ఈ పిల్లల వచన మహా భారతం అసంఖ్యాక పాఠకుల మనసులు దోచుకుంటోంది. ఎందరో ఎంతగానో ప్రశంసలు కురిపించారు, కురిపిస్తున్నారు. పద్దెనిమిది పర్వాల జగన్నాథ శర్మ గారి వచన భారతం రచనను మొత్తం ఆరు భాగాలుగా వెలువరిస్తున్నట్టుగా ప్రచురణ కర్తలు తెలియ జేస్తున్నారు. ఆ వరసలో వెలువడిన తొలి సంపుటం యిది. ఈ సంపుటిలో ఆది, సభా, అరణ్య పర్వాల కథ ఉంది. శర్మ గారు ఈ వచన భారతాన్ని తమ జననీ జనకులు అయల సోమయాజుల రామ సోదెమ్మ, జగన్నాథం గారలకు భక్తి ప్రపత్తులతో అంకితం చేసారు. ప్రతి ఇంట తల్లి దండ్రులు కొని , తమ చిన్నారులకు బహుమతిగా యిచ్చి వారి చేత చదివించ తగిన చక్కని పుస్తకమిది. పిల్లలకు ఇవ్వ తగిన గొప్ప బహుమతి గా పుస్తకాన్ని చెప్పుకో వచ్చును.

జగన్నాథ శర్మ గారి గురించి ఈ సందర్భంగా ఒకటి రెండు మాటలు .....

1956లో పార్వతీ పురంలో జన్మించిన శర్మ గారు వందలాది కథలు వ్రాసేరు. యువ మాస పత్రికలో వచ్చిన వీరి రాజధాని కథలు, పల్లకి వార పత్రికలో వచ్చిన మా ఊరి కథలు, ఆది వారం ఆంధ్ర జ్యోతిలో వచ్చిన అగ్రహారం కథలు విశేష ప్రాచుర్యం పొందాయి. నవలా రచయితగా, సినిమా, టి.వి. రచయితగా కూడా వీరు ప్రసిద్ధులు. ప్రస్తుతం నవ్య వారపత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. అరణి, అనీలజ, నీలకంఠాచార్య వీరి కలం పేర్లు.

ఇప్పటి వరకు ప్రచురితమయిన వీరి రచనలు ....

తెలుగు లోనికి అనువాదం చేసిన ప్రపంచ ప్రఖ్యాత పిల్లల జాన పద కథలు పాల పిట్ట కథలు. ( వివరాల కోసం ఇక్కడ నొక్కి చూడండి)

పేగు కాలిన వాసన (కథా సంకలనం)

బాలల కోసం సరళ వ్యావహారికంలో రచించిన మహా భారతం ( ఆది సభా అరణ్య పర్వాలు)

త్వరలో వెలువడనున్న పుస్తకాలు ....

జగన్నాథ రధ చక్రాల్ ( నవ్య మొదటి పేజీ)

అగ్రహారం కథలు


1, నవంబర్ 2010, సోమవారం

కొత్త పాళీ గారి కథా సంకలనం - మీరు చదివేరా?





మంచి కథలు ఓ ఇరవై ఒకటి . మీరు చదివేరా? ప్రతి కథా అత్యంత వైవిధ్య భరితం. ఇటీవల ఓ కథా సంకలనాన్ని విడువకుండా ఏకబిగిని నాచేత చదివించిన మంచి సంకలనం ఇది.

ఈ కథల పుస్తకం చదివేక నా స్పందన ఇది. చూడండి:



14, ఆగస్టు 2010, శనివారం

బక్క రైతుల బతుకు గోస - దుక్కి



అచ్చమయిన రైతు కవి చింతా అప్పల నాయుడు. తన చుట్టూ విషాదంగా పరుచుకుని ఉన్న ఛిద్ర జీవితాన్ని రైతు భాషలో వినిపించేడు. శ్రీకాకుళపు బడుగు రైతుల బతుకు గోసని గుండెలు పిండేసే లాగున మనకి వినిపించేడు.
నాయుడు నేనెరిగిన వ్యక్తి. ఎప్పుడూ చిరు నవ్వు నవ్వుతూనే ఉంటాడు. కాని ఆ నవ్వులో ఏదో అనంత విషాద వీచిక కదలాడుతున్నట్టుగా నాకనిపిస్తూ ఉంటుంది.
మట్టి మనుషుల జీవితాలను వారి భాషలోనే చిత్రం కట్టి చూపించేడు. భద్ర జీవుల కలలోకి కూడా రాని బతుకులవి. అనుభవించి పలవరించిన కరకు వాస్తవాలు.
2008 సంవత్సరానికిగాను ఫ్రీవర్స్ ఫ్రంట్ వారి ఉత్తమ కవితా సంకలనానికి యిచ్చే అవార్డు చింతా అప్పల నాయుడు రాసిన దుక్కి కి వచ్చింది.
2009 సంవత్సరానికి గాను అవార్డు యాకూబ్ రాసిన ఎడతెగని ప్రయాణం కి లభించింది.

చింతా పుస్తకం గురించి ... ... ...

మా అయ్యకి వ్యవసాయం వొక వ్యసనం అంటాడు చింతా. అభివ్యక్తి లో కొత్తదనం, సూటిదనం , నిజాయితీ, నిబద్ధత, రవంత అమాయకత్వం, వంతెన కింద రహస్యంగా పారే నీటి పాయలా, అణచు కొంటున్న ఆర్తి కనిపిస్తుంది.

ఆవుకి కుడితెట్టినట్టు
పొలానికి గత్త మేసినట్టు
గడ్డి పరకలని గాలించి నట్టు
బతకడం నీకు బాగా పట్టుబడి పోయింది
బతుకే నీ యెనకాల బేపి కూనై తిరిగేది.

బతకడం భారమైనప్పుడు, బతక లేని దుర్భర వాతావరణం క్రూరంగా చుట్టూ వలయంలా, నీ కనబడని శత్రువులు కలిపించి నప్పుడు, బతకాలి కదా, జీవచ్ఛవంలాగానయినా ? అదే చేస్తున్నారు శ్రీకాకుళపు బక్క రైతులు. ఆ దౌర్భాగ్యాన్ని, ఆ పెను విషాదాన్ని అక్షర బద్ధం చేసి చూపించేడు చింతా.
అందుకే మిత్రుడు గంటేడ గౌరు నాయుడు అంటాడు: అప్పల నాయుడు రాసే ప్రతీ వాక్యమూ నాకు కవిత్వంలా కాక , జీవితంలా సాక్షాత్కరిస్తుంది. అని !

లోతుకు పోయిన కళ్ళతో మా అమ్మల ముఖాలు
మసిబారి పోయిన దివ్వ గూళ్ళలా ఉంటాయి.

ప్రపంచీకరణ నేపథ్యంలో ఇనుప గద్దలు వాళ్ళ గుడిసెల ముందు ఎగురుతూనే ఉంటాయి.
వాళ్ళ పశువులు గడ్డి పరకలని కలలు కంటూనే ఉంటాయి.
పండగ పూట కూడా వాళ్ళ నోటికి సీసమే పాయసమౌతుంది ...

అక్కడ కూలీలు కండలు తిరిగిన వస్తాదులా ఏమిటి?
వాళ్ళ చేతుల్లో గదలుంటాయా, గాండీవాలుంటాయా?
చూడండి, కూలీల భార్యల బతుకు గోస:

మా మొగోల్లు కండలు తిరిగిన వస్తాదులా !
ఆల్ల సేతుల్ల గదలున్నాయా? గాండీవాలున్నాయా?

వెదురు బద్దల్లాంటి ఎముకల గూళ్ళు, వాళ్ళ శరీరాలు. పిడికెడు కండ లేని నడయాడే అస్థి పంజరాలు వాళ్ళు.
శ్రీశ్రీ చెప్పిన అస్థి మూల సంజరాలు ... ఆర్తరావ మందిరాలు .. వాళ్ళు .

ఈ పుస్తకాన్ని చదివి ఆనందించడానికి ఏమీ లేదు.

ప్రత్యక్షర విషాదం తప్ప.

కాలి పోతున్న, రంగు వెలసిన ఛిద్ర జీవితాల చిత్రణ తప్ప.

రకరకాల కుట్రలకి కునారిల్లి పోతున్న బతుకు గోస తప్ప.

చింతా అప్పల నాయుడికి బరువెక్కిన గుండెతో అభినందనలు.


































4, ఆగస్టు 2010, బుధవారం

విశ్రాంత నేత్ర వైద్యుని అవిశ్రాంత సాహితీ సేద్యం


శ్రీ ముద్దు వెంకట రమణా రావు విశ్రాంత నేత్ర వైద్య నిపుణులు.

వీరికి తెలుగు, సంస్కృత సాహిత్యాల పట్ల ప్రగాఢ మైన అభిమానం,అభిరుచి. సంగీతంలో కూడ మంచి ప్రవేశం ఉంది. ఎనభై సంవత్సరాల వయసులో కూడ ఉరక లేసే ఉత్సాహంతో సాహితీ సేద్యం చేస్తున్నారు. వివిధ సాహిత్య సంస్థలతోనే కాక, సంగీత సమాఖ్యలతో కూడ సన్నిహితంగా మెలుగుతూ ఆయా సంస్థల కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.

కీ.శే. యం. లక్ష్మణ మూర్తి, సూర్యకాంతం దంపతులు వీరి తల్లిదండ్రులు.

11-09-1930 వ తేదిన ఒరిస్సా గంజాం జిల్లా కాశీనగరంలో పుట్టిన వీరు వైజాగ్ ఆంధ్రా మెడికల్ కాలేజీ నుండి యం.బి.బి.యస్ , యం.యస్.డి.ఒ పట్టాలు పొంది, పి.జి. డిప్లమో చేసారు. ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ గా పదవీ విరమణ చేసారు.

అరవైయ్యవ దశకంలో ఆంధ్ర పత్రిక, ఆంధ్ర జ్యోతి వంటి పత్రికలలో కొన్ని చక్కని కథలు వ్రాసిన ఈ నేత్ర వైద్యులు వృత్తి రీత్యా సమయాభావం వలన అడపా దడపా రచనలు చేస్తున్నా, వాటిని పత్రికలలో ప్రచురించ లేదు. ఉద్యోగ విరమణ చేసాక, తమ చిన్న నాటి ఆత్మీయ మిత్రులు శ్రీ గొర్తి సత్యనారాయణ గారు ఇచ్చిన ప్రేరణతో ఇటీవల తమ రచనలతో వరుసగా ఐదు చక్కని పుస్తకాలను వెలువరించారు.

అవి:

రమణీయం

సంధ్యారాగం

ఉదయ కిరణాలు

కమనీయం

మహనీయం

భావుకతకూ, లోకవృత్తాలను సహేతుకంగా విమర్శించే డాక్టరు గారి నిపుణతకూ,విస్తారమైన వారి అధ్యయన సాధికారతకూ, నిదర్శన ప్రాయంగా నిలిచే ఈ పుస్తకాలను మీకు ఇక్కడ క్లుప్తంగా పరిచయం చేస్తున్నాను.


1.రమణీయం

ఇదొక అపురూపమైన సాహితీ కదంబమాల అని చెప్పుకో వచ్చును. ఇందులో 48 కవితలు , 8 అనువాద గేయాలు, 07 సాహితీ వ్యాసాలు, వివిధ అంశాల మీద వ్రాసిన వ్యాసాలు 11 , ఇంకా 03 గల్పికలు,08 కథలు పొందుపరిచారు. అంతే కాక వారి అన్న గారి సమస్యాపూరణలు, పద్య రచనలు కూడ చేర్చి వారి పట్ల తమ ఆదర భావాన్ని ప్రకటించుకున్నారు.

వీరి కవితా ధారకి ఉదాహరణ ప్రాయంగా మచ్చుకి:

ఆకలి దప్పుల నల్లలాడిననే

అన్నోదకముల విలువలు తెలియును

సోపాన పంక్తుల నెక్కిననే కద

సౌధోపరి సౌందర్యము కనవిందగు ... అంటూ సాగే సాధన అనే గీతం,

సుభగ శరీర సురభిళా

సుగుణ సౌశీల్యా విరళా

సౌందర్యజిత చంద్రకళా

విరహిణీ, కాంతామణీ, ఊర్మిళా ! ... అంటూ సాగే ఊర్మిళ పద్యాల ఖండ కావ్య రచనా ...

మధుర రసాల వనమనోఙ్ఞమ్ము

కదళీ నారికేళ కేదారమ్ము

కుల్య తటినీ తటాక వికసిత

కుముదవనజ పుష్ప వన నికాయమ్ము ... అని కోనసీమ అందాలను తనివితీరా వర్ణించిన పద్యాలూ ... ఎంతగానో అలరిస్తాయి. అందమయిన పదాల పొందిక, చక్కని మధురమయిన శైలీ విన్నాణమూ, ఈ పద్యాలను, కవితలను ఎంతో రసవంతములుగా అందించేందుకు కవికి ఉపకరించిన ఉపకరణాలు.

అనువాద గేయాల విభాగంలో ...

ముందుగానే తెలిసి ఉంటే

చివరగా మనము చినుకు లోన

కలిసి నడిచే భాగ్యమదియని

ముందుగానే తెలిసి వుంటే

వాన లోనే రాత్రి అంతయు

వదలకుండగ నీ కేలు పట్టి

హృదికి హత్తుకు గడిపియుందును ... అని సాగే మధురమయిన అనువాద రచనలు ఉన్నాయి.

కవి కోకిల దువ్వూరి రామి రెడ్డి, గరిమెళ్ళ , పాల్కురికి సోమన మున్నగు వారి గురించే కాక, మేఘసందేశం, కళల ప్రయోజనం, దళిత కవిత్వం మొదలయిన వాటి మీద విశ్లేషాణాత్మక వ్యాసాలు సాహితీ వ్యాస విభాగంలో కనిపిస్తాయి.

వీరి గల్పికలు, కథలు కూడ చదివించే రచనలు. కథా రచయితగా వీరి సామర్ధ్యాన్ని చాటేవిగా ఉన్నాయి.

శ్రీ ముద్దు నరసింహ మూర్తి , స్వర్గీయ సీతా లక్ష్మి దంపతులు.

శ్రీ రమణారావు గారు తమ రమణీయం గ్రంధంలో తమ అన్నగారయిన నరసింహ మూర్తి గారి పద్య రచనలు కూడ కొన్ని చేర్చి ప్రచురించారు.

తెలుగు భాషాభిమానం, కవిత్వాభిమానం గల వీరి సోదరులు వ్రాసిన కొన్ని

సమస్యాపూరణ పద్యాలు, మరి కొన్ని ఆంగ్ల సామెతలకు తెలుగులో పద్యానువాదాలు ఇందులో అలరిస్తున్నాయి.


ఈ పుస్తకం వారి జననీ జనకులకి అంకితం చేసారు.

ఇక, రెండో పుస్తకం ...




2.సంధ్యారాగం

ఇది వివిధ విషయాల మీద తన అభిప్రాయాలను క్రోడీకరిస్తూ, తన భావాలను చదువరులతో పంచుకోవాలనే ఆకాంక్షతో వ్రాసిన 56 వ్యాస రచనల సంపుటి.

ఇందులో తెలుగు సాహిత్యం,విదేశీ సాహిత్యం, సంగీతం , చరిత్ర, పర్యటన, వైద్యం, గురించిన వ్యాసాలతో పాటు కొన్ని ఇతర అంశాల గురించినవ్యాసాలు,

7 వ్యాస సదృశ గల్పికలూ చోటు చేసుకున్నాయి.

వీటిలో కుమార సంభవం, శతక రచనలు, బాపు రెడ్డి కవిత్వం, శోభిరాల కావ్య సంపద, వంశధార కథలు, కథా వార్షికలు 2004, 05 ల మీద సమీక్షా వ్యాసాలు మొదలైనవి ఉన్నాయి.

విదేశీ సాహిత్యం గురించిన వ్యాసాలలో ఆంగ్ల సాహిత్యంలో రొమాంటిసిజమ్ , ఫ్రెంచి సాహిత్య పరిచయం చోటు చేసుకోగా, సంగీత విభాగంలో పాశ్చాత్య సంగీతాన్ని గురించీ , సంగీత రావు గారి గురించి వ్రాసినవి ఉన్నాయి.

పర్యటన, వైద్య విభాగాల్లో చేర్చిన వ్యాసాలు వారి అనుభవ సారంగానూ. వారి యాత్రా ప్రియత్వాన్నీ వ్యక్త పరిచేవిగానూ ఉన్నాయి.


రచయిత ఈ పుస్తకాన్ని ఆది దేవుడు సూర్య నారాయణ మూర్తికి అంకితం చేసారు.


3.ఉదయ కిరణాలు

వచన రచనా విభాగంగా వెలువరించిన ఈ పుస్తకం కూడ 45 వ్యాసాల సంకలనమే.

ఇందులో రఘు వంశం , సౌందరనందనం , పౌలస్త్య హృదయం , దీపావళి, ఫిరదౌసి, బసవ రాజు అప్పారావు, మొదలయిన వ్యాస శీర్షికలతో ఆయా కవుల రచనల గురించి పరిచయ పూర్వక విశ్లేషణాత్మక వ్యాసాలు కనిపిస్తాయి. తెలుగు కవులనే కాక, ఈ విభాగంలో షేక్స్పియర్, ఇలియట్ వంటి వారిని గురించిన వ్యాసాలూ ఉన్నాయి. ఇవి కాక, వేదాంతం, మతం , వాణిజ్యం, స్త్రీ స్వేచ్ఛ , గ్లోబలైజేషన్, చారిత్రక ప్రదేశాల పరిచయం, దర్శనీయ క్షేత్రాలు ,మనోవిశ్లేషణ ... యిలా భిన్న భిన్న అంశాల గురించి అలవోకగా వ్రాసిన లఘు వ్యాసాలు మనలని అలరిస్తాయి.

రచయిత ఈ పుస్తకాన్ని తమ ఆత్మీయ బాల్య మిత్రులు శ్రీ గొర్తి వెంకట సత్య నారాయణ మూర్తి గారికి అంకితం చేసారు.


4.కమనీయం

ఇది కవితా సంపుటి. 73 కవితలతో ఈ కవితా సంపుటి వెలువరించారు.ప్రతి కవిత లోనూ వారి కవితా తత్వం, రసభావ బంధురమయిన వారి మనోఙ్ఞమైన శైలి, భాషా విషయకంగా వారి ప్రతిభా సంపద గోచరిస్తూ ఉంది. ఛందో గంధంతో పరిమళించే వారి కవితలు ధారా శుద్ధితో ప్రశంసనీయంగా ఉన్నాయి.

కవి గారు ఈ కవితా సంపుటిని వారి సోదరి, స్వర్గీయ ముద్దు(చుండూరు) శకుంతలకు అంకితం చేసారు.

మచ్చుకి ఒకటి రెండు కవితలు ...

నవాబుల దర్బారు హాలులా

నగరం వ్యాపించివుంది

భారతి మేఖలాపతకంలా ప్రకాశించు నగరం

తెలుగు తల్లి నుదుట తిలకం

తెలుగు చరిత్రకు స్వర్ణ ఫలకం

( భాగ్య నగరం)

ద్వేష దౌర్జన్యపూరిత తీవ్రవాద

కంటకావృత శిధిల మార్గాన నేల

శాంత్యహింసా సుహృజ్జీవ సాధు భావ

సత్య సౌలభ్య పథమున సాగి పొమ్ము

(అనుసరణీయం)

తల్లి వడి లోన వెచ్చగ తనువు మరచి

శాంత్యమాయక భావాల స్వాదు రసము

నీలి కన్నుల రెప్పల నిదుర గ్రమ్మ

చింత లెఱుగని పొన్నారి చిట్టి పాప

(నిద్ర)


5 మహనీయం

ఆ కావ్య సంపుటిలో పద్య విభాగంలో 64 ఛందోసుందరమయిన పద్యరచనలు, గేయ కవితా విభాగంలో 61 గేయాలూ , అనువాద కవితల విభాగంలో 9 అనువాద కవితలూ చేర్చి ప్రచురించారు.

ఈ కవికి మిక్కిలి ప్రీతి పాత్రమైన ప్రకృతి వర్ణన, ఋతు వర్ణనలు ఇందులో సజహజంగానే ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే యాత్రాప్రియులైన వీరు దేశ దేశాలు తిరిగి, తాను చూసిన అందమయిన ప్రదేశాలనీ , ఆ అందాలనీ కూడ మనతో పంచుకోవడం కనిపిస్తుంది.

ఇవే కాక, వివిధ కవుల గురించిన మనోహరమయిన పద్యాలు, కావ్య ప్రశంసలు, భగవదారాధనలు, జాతీయ భావనలు, రాష్ట్ర గానాలూ. సంగీతకారుల ప్రశంసలూ, ... ఇలా ఒకటేమిటి, వైయక్తిక పులకరింతల పలవరింతలూ, అనుభవాల గిలిగింతలూ, తల పోతల కలబోతలూ ... ప్రతి కవితలోనూ అందంగా అక్షరీకరించి మనకి అందించారు.

మచ్చునకు ఒకటి రెండు ...

ఉత్పలమాలికాభరణుజ్జ్వల నీల శరీర తేజుడున్

సత్పరిపాలకాశ్రయుడు, శర్వవిరించి మహేంద్రపూజ్యభా

స్వత్పరిపూర్ణ సద్గుణుడు, సర్వ జగత్పరిపాలకుండు, మా

ఉత్పల వారికిచ్చుత శుభోన్నత జీవన శాంతి సౌఖ్యముల్

(ఉత్పల కవివర్యునికి సమర్పించిన శుభ కామన... ఉత్పల అనే శీర్షికతో ఛందస్సుందర మయిన పద్య కుసుమాలు.)

గ్రంధకర్త ఈ కావ్య సంపుటిని నిత్య కల్యాణ శోభితుడు కొండలరాయునికి అంకితం చేసారు.

ఈ ఐదు పుస్తకాలూ రచయిత ఆంధ్రప్రదేశ్ సాహితీ, సాంస్కృ తిక సమాఖ్య, శ్రీకాకుళం వారి సహకారంతో ప్రచురించారు.

(త్వరలో వెలువడనున్న వీరి రచనలు: ఒక కవితా సంపుటితో పాటు

వెన్నెల వెలుగులు ( సాహిత్య వ్యాసాలు) , ఇంగ్లీషు – తెలుగు మెడికల్ డిక్షనరీ.)

ఇప్పటికి ప్రచురితములయిన ఈ ఐదు పుస్తకాలు చదవాలన్నా, రచయిత గురించి మరిన్ని వివరాలు తెలుసుకోగోరినా, క్రింది చిరునామాలకు సంప్రదించాలి:

డా. యం.వి.రమణారావు, యం.యస్.డి.ఓ.,

రిటైర్డ్ సివిల్ సర్జన్,

ప్లాట్ నెంబర్: 11, శ్రీ కోలనీ,

పుణ్యపు వీధి, శ్రీకాకుళం 532001

ఫోన్: (08942)223243.

లేదా,

శ్రీ రామిశెట్టి, ప్రధాన కార్యదర్శి,

ఆంధ్ర ప్రదేశ్ సాహితీ సాంస్కృతిక సమాఖ్య,

శ్రీ భద్రమ్మ గుడి వెనుక, ఇల్లిసిపురం,

శ్రీకాకుళం 532001

ఫోన్ (08942)278572

ఈ పుస్తకాలు విశాలాంధ్ర వారి అన్ని బ్రాంచీలలోను, బుక్ సెంటర్ (విశాఖ పట్నం) . నవోదయ బుక్ హౌస్, కాచి గూడ, హైదరాబాద్ వారి దగ్గర లభిస్తాయి.