సరదాకి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సరదాకి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, డిసెంబర్ 2013, మంగళవారం

నే చదివినవి రెండు ముక్కలు ...






ప్రహ్లాదుడిని చండామార్కుల వద్ద చదివిస్తే ఎక్కువ మార్కులు వస్తాయని తలచి హిరణ్య కశిపుడు కొడుకును వారి వద్ద చేర్చాడు.

గురువుల చదివించారు. హోమ్ సిక్ లేకుండా చేదామని కొడుకుని ఒక సారి ఇంటికి రప్పించు కున్నాడు హిరణ్యకశిపుడు.

‘‘ ఎలా ఉందిరా అబ్బీ, నీ చదువు ? ’’ అనడిగేడు.

‘‘ బావుంది నాన్నా ’’ జవాబిచ్చేడు కొడుకు.

‘‘ సరే గానీ గురువులు చదివించిన దానిలో ఓ రెండు ముక్కలు చెప్పు చూదాం ’’ అనడిగేడు.

కొడుకు తడుము కోకుండా అన్నాడు : ‘‘ తెలంగాణా ... సమైక్యాంధ్ర ’’

రాజు గారితో పాటూ, గురువులకీ, అక్కడున్న తతిమ్మా వారికీ మతులు పోయాయి.



‘‘ఏఁవిటేఁవిటీ ? ’’ అనడిగేడు రాజు

కొడుకు మళ్ళీ అవే మాటలు ,ప్పాడు.

ఎవరు ఎన్ని సార్లు అడిగినా ఆ రెండు మాటలూ తప్ప వాడు మరో మాట మాట్లాడడం లేదు. తండ్రికి ఎక్కడో కాలింది.

‘‘అన్ని టెర్ముల ఫీజులూ దొబ్బి ఇదా మీరు నేర్పించింది ? ’’ అని రాజు గురువుల మీద మండి పడ్డాడు

‘‘చండా మార్కుల వారూ, మీ నిర్వాకం ఇంత ఛండాలంగా ఉందేఁవిటండీ ;’’  అని రెచ్చి పోయాడు  ఓ మంత్రి. చాలా రోజులనండీ గురువుల మీద ఎంచేతో ఉన్న అక్కసుని వెలిగ్రక్కుతూ ...

గురువులు గజగజ వణికి పోయారు.

‘‘ ప్రభూ ! మా తప్పేమీ లేదు. నీ కుమారుడికి మేము మంచి విద్యలే నేర్పించాము. బిట్ బ్యాంకులు కంఠోపాటం పట్టించాము. గైడ్లు నూరి పోసాము. పాత క్వశ్చన్ పేపర్లని వందేసి సార్లు వేళ్ళు తిమ్మెర్లు ఎక్కేలా ఆన్సరు చేయించాము. డైలీ పరీక్షలు కాదు ... పూట పూటకీ పరీక్షలు పెట్టి వాడి తాట తీసాము. రాత్రీ పగలూ నిద్ర లేకుండా చేసి చదివించాము. మరి ఈ రెండు ముక్కలే ఎలా పట్టుబడ్డాయో తెలియడం లేదు. ...’’ అన్నాడు వణికి పోతూ ...

ఇంతలో అక్కడున్న  మరో  మంత్రి కలుగ జేసుకుని ‘‘ మీ స్కూల్లో, అదే, మీ గురుకులంలో తెలుగు డైలీ పేపర్లూ అవీ తెప్పిస్తూ ఉంటారా ? ’’ అనడిగేడు.

‘‘ ఓ ! అన్ని తెలుగు పేపర్లూ వస్తాయి సార్ ... పిల్లకాయలకి జనరల్ నాలెడ్జీ వద్దూ ? లోకం పోకడ తెలీ వొద్దూ ? ’’ అన్నారు గురువులు.

‘‘ టీ. వీ. ఉందా ? తెలుగు న్యూస్ చానెల్లు వస్తాయా ?’’ మంత్రి అడిగేడు.

‘‘ అన్నీ వస్తాయి సార్ ! వాటిలో చర్చల పేరిట ఒకరి మాట ఒకరికి వినబడకుండా తిట్టు కోవడం చూసి మా విద్యార్ధులు తెగ సరదాపడి పోతూ ఉంటారు. ’’ అన్నాడు గురువు.

మంత్రి అన్నాడు : ‘‘ అదీ సంగతి ! రోజూ ఆ పత్రికలను చదివి ... చానెల్లు చూసి వీడికి ఆ రెండు మాటలే బుర్రలో తిరుగుతున్నాయి. వీడి తలలో ఆ రెండు పదాలే కోట్లాదిగా ఆక్రమంచుకుని, మరో వాటికి చోటు లేకుండా పోయింది. అందు చేత తక్షణం గురుకులంలో తెలుగు దిన పత్రికలను తెప్పించడం కొన్నాళ్ళు ఆపెయ్యండి.టీ.వీ. కనెక్షను తీయించెయ్యండి ’’ అన్నాడు.

‘‘అలా చెయ్యండి .. పొండి ’’ అన్నాడు హిరణ్యకశిపుడు.

‘బతుకుజీవుడా ! ’ అని గురువులు అక్కడి నుండి బయటకు నడిచారు.



నీతి : తినగ తినగ బెల్లం చేదుగా నుండు.




13, నవంబర్ 2013, బుధవారం

శునక పురాణం



‘‘ ఛీ ! కుక్క వెధవా ! ’’ అని ఎవరి మీద నయినా కోపం వొచ్చి నప్పుడు తిడతాం కానీ, శునక పురాణం చదివితే శునక జాతిని అలా కించ పరుస్తూ తిట్టడం ఎంత తప్పో తెలుసు కుంటాం. మానవ జాతి చరిత్ర మనుషుల కున్నట్టే, కుక్కల చరిత్ర కుక్కలకూ ఉంటుంది.ఆ కుక్కల చరిత్ర అంతా వాటికి వన్నె తెచ్చేదే కాక పోయినా వాటికంటూ ఓ చరిత్ర ఉంది కదా. ఆ సంగతి తెలుసు కోవాలి.

శునక పురాణం అనే శీర్షికను చూసి కథా మంజరి తిక్కల బ్లాగరు అష్టాదశ పురాణాలనూ అపనిందలపాలు చెయ్య బోతున్నాడని మాత్రం అనుకో వద్దు. ఇది కేవలం శుకములను గూర్చిన గుది గుచ్చిన భోగట్టాల సమాహారం. అంతే.


కుక్కకు చాలా సర్యాయ పదాలు ఉన్నాయి. చూదాం. కుక్క. శునకము,జాగిలము, నాయి. వే(బే)పి లాంటి తెలిసిన పదాలే కాక, శ్వానము,అలిపకము,అస్తిభిక్షము,కుక్కురము ,సారమేయము

.సూచకము,జిహ్వానము,కౌలేయకము,కంకశాయము వృకరాతి ... లాంటి చాలా పదాలకు కుక్క అనే అర్ధం.దులో మరీ, అడ కుక్కకి కుక్కురి, శుని అని పేర్లున్నాయి. వేట కుక్కకయితే ఆఖేటికము,ఉడుప కుక్క,మోరపడము లాంటి పేర్లున్నాయి.కుక్క భౌ భౌ అని అరుస్తుందని మనకు తెలుసు కానీ, కుక్క అరుపును భషణము, మొఱగుడు అని కూడా అంటారు. వీటి మాట కేం గానీ, కుక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. చాలా జాతులు ఉన్నాయి
, దేశవాళీ కుక్కలు, విదేశీ జాతుల కుక్కలూ కూడా ఉన్నాయి. విదేశీ కుక్కలకే మన్నన ఎక్కు కదా !సౌమ్యాకారులూ, అతి భీకరాకరులూ అయిన కుక్కలూ ఉంటాయి. జాతి కుక్కలూ, వీధి కుక్కలూ. గజ్జి కుక్కలూ , పిచ్చి కుక్కలూ లాంటి శునక జాతి భేదాలూ ఉంటాయి.. పిల్లల కున్నన్ని కాక పోయినా కుక్కలకూ చాలా వరైటీ పేర్లు ఉంటాయి. అందులో టామీ అనే పేరు మన అప్పారావు అనే పేరులాగా చాలా ప్రసిద్ధం.
 కుక్కలు చాలా విశ్వాస  పాత్రమైన  జంతువులు అన్నమాట నిజమే కానీ అవి ఎంచేతనో తమ విశ్వాస గుణాన్ని కాస్సేపు ప్రక్కన పెట్టి, యజమానినే కరచిన సంఘటనలూ అక్కడక్కడ చోటు చేసుకోవడం కాదన లేని సత్యం.కారణాల కోసం పెద్దగా అన్వేషించ నక్కర లేదు. ఎంతయినా కుక్క బుద్ధి కుక్క బుద్ధే కదా ?!


మొరిగే కుక్క కరవదని ఒక సామెత. దీనికి రుజువులూ సాక్ష్యాలూ చూపడం కష్టం. మొరిగే కుక్కల దగ్గరకి వెళ్ళి కరుస్తుందో, లేదో గమనించే సాహసం చెయ్యలేం కదా,

కొన్ని కుక్కలు విస్సాకారంగా మన మీద ఓ లుక్కు వేసి ఊరుకుంటాయే కానీ మొరగవు. బోలెడు డబ్బులు పోసి పెంచు కుంటున్నా, జబ్బుల లొస్తే కుక్కల ఆసుపత్రులకు తీసికెడుతున్నా అవి మాత్రం కిమన్నాస్తిగా ఉండి పోతాయి. చిన్న గుర్రు కూడా పెట్టవు. దొంగలను చూసి మొరగని కుక్కలు అవేం కుక్కలు ? తిండి దండగ
 కాకపోతే.

వెనుకటికి వో చాకలి ఇంట ఓ కుక్కా, గాడిదా ఉండేవిట. యజమాని తనకి సరైన తిండి పెట్టకుండా. సరిగా చూడకుండా ఉన్నాడనే ఉక్రోషంతో ఓ రాత్రి చాకలి ఇంట దొంగలు పడితే మొరగ కుండా ఉండి పోయిందిట. దాంతో కుక్క చేయ వలసిన డ్యూటీ గాడిద తన నెత్తిన వేసుకుని యజమానిని నిద్ర లేపుదామని ఓండ్ర పెట్టిందిట. చాకలి నిద్రా భంగమైనందుకు కోపంతో గాడిదని చావబాదాడట. ఈ కథ వలన తెలుసుకోవలసిన నీతి మాట అటుంచితే, పెంపుడు కుక్కలకు కూడా కోపతాపాలు ఉంటాయనీ, యజమానికి అవి సర్వ కాల సర్వావస్థల లోనూ విశ్వాస పాత్రంగా ఉంటాయనీ గుడ్డిగా నమ్మడం కూడా పొరపాటే అని గమనించాలి.

కుక్కలకు ఏకైక ప్రబల శత్రువు మ్యునిసిపాలిటీ వారి కుక్కకల బండి. వీధిలో కనిపించే ప్రతి ఊర కుక్కనీ బండిలో  పడేసి పట్టుకు పోతూ ఉంటారు

గొప్పింటి వారు తమ ఇళ్ళ గేట్ల ముందు ‘‘ కుక్క లున్నవి జాగ్రత్త ’’ అని బోర్డులు  వేలాడదీస్తూ ఉంటారు.

పోస్టు జవాన్లకూ, పేపరు కుర్రాళ్ళకూ అలాంటి ఇళ్ళలో ఉండే కుక్కల వలన ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది.

పోలీసు కుక్కలు ప్రత్యేక శిక్షణ  పొందిన కుక్కలు . నేర ప్రాంతాన్ని మూచూసి, వాసన పసిగట్టి నేరస్థులను పట్టు కోవడంలో ఇవి రక్షక భటులకు సహకరిస్తాయి

ఇన్ని కుక్కల గురించి చెప్పి, పాత కాలం నాటి హిజ్ మాస్టర్స్ వాయిస్ గ్రామ ఫోను ముందు కనిపించే కుక్క గురించి చప్పక పోతే భౌ ! భౌ ! మని కసురు కోదూ ?

మహా భారతంలో కనిపించే కుక్క పేరు సరమ. రాక్షసులనుండి తమ గోగణానికి కాపలాగా దేవేంద్రుడు సరమ అనే కుక్కను ఉంచేడు. అయితే రాక్షసులు దానికి పాలు పోసి మచ్చిక చేసుకుని గోవులను అపహరించుకు పోయే వారు. దానితో ఇంద్రుడు గోవులు ఏమౌతున్నాయని సరమను అడిగేడు. అది చెప్పడానికి భయపడి పోయింది. దానితో ఇంద్రుడు దాని డొక్కలో తంతే పాలన్నీ కక్కీసి, పారి పోయింది.ఇంద్రుడు దానిని తరుము కుంటూ హిమాలయాల వరకూ వెళ్తే అక్కడ రాక్షులు కనిపించేరు. వారిని వధించేడు. ఇదీ కథ. దీని వలన కూడా కుక్కలు మరీ అంత విశ్వాస పాత్రులైనవి కావేమో అనే సందేహం కలుగక మానదు. పైచ్చు అవి శత్రువు నుండి లంచాలు మేయడానికి కూడా సిద్ధ పడి పోతాయని అనిపిస్తోంది.

అందుకే లంచాలు మేసే వెధవలంతా కుక్కలతో సమానమని కథా మంజరి బ్లాగరు తీర్మానించు కున్నాడు.

మహా భారతంలో మరొక కుక్క ప్రస్తావన సుప్రసిద్ధమే. పరీక్షిత్తుకు పట్టం కట్టేక ధర్మరాజాదులు బొందితో కైలాసానికి బయలు దేరారు. వారిని ఓ శునకం వెంబడిస్తూ నడిచింది, మార్గ మధ్యంలో మొదట ద్రౌది, తరువాతసహ దేవుడు, నకులుడు,భీముడూ అర్జునుడూ వరసగా నేలకు కుప్పకూలి పోయేరు. ధర్మ రాజు వెను తిరిగి చూడ లేదు. వారంతా అలా పడి పోవడానికి ఎవరి కారణాలు వారికున్నాయి. ఇంద్రుడు ఎదురొచ్చి తన నగరుకి రమ్మని ధర్మరాజుని ఆహ్వానించేడు. తన వెంట వస్తున్న కుక్కని విడిచి రాననీ. అది పాపమనీ ధర్మరాజు పలికేడు. అప్పుడా కుక్క తన నిజరూపు చూపి నిలిచింది. అతడే ధర్ముడు. ధర్మజుడు ధర్మ తత్పరుడు కనుక ధర్మం అతని తుదకంటా నిలిచిందని ఫలితార్థం.

కాల భైరవ స్వామి అంటే శునక రూపంగా భావించ కూడదు. కాలము అంటే నలుపు. నల్లని రూపు కలవాడు. విశ్వాసానికి పేరందిన ఒక కుక్క స్వామి వాహనం శునకం.

దత్తాత్రేయ స్వామి వారి వద్ద ఎప్పుడూ నాలుగు కుక్కలు ఉంటాయి. ఇవి నాలుగు వేదాలకు ప్రతీకలు. స్వామి వేద మూర్తి. స్వామి మూడు ముఖాలూ  సృష్టి, స్థితి, లయకారుల స్వరూసాలు

బళ్ళారి రాఘవ ఒకసారి గుడివాడలో హరిశ్చంద్ర నాటకం వేస్తున్నప్పుడు కాటి సీనులో ఎక్కడి నుండో ఒక కుక్క స్టేజీ మీదకు అకస్మాత్తుగా ప్రవేశించిందిట. అంతా అవాక్కయి పోయేరు. ప్రేక్షకులు గొల్లున నవ్వేరు. రాఘవ సమయస్ఫూర్తితో నాటకంలో లేని ఓ డైలాగు ... ‘‘ ఓ శునక రాజమా !నీకును నేను లోకువయిపోతినా; పొమ్ము ’’ అని దానిని అదిలించే సరికి అది అక్కడి నుండి పారి పోయిందిట. ఈ విధంగా మహా నటుడు రాఘవ ఆ నాటి నాటకం రసాభాసం కాకుండా చేసారుట.

యండమూరి వీరేంద్రనాథ్ ఏ కంగా కుక్క అనే ఓ నాటికనే రాసేడు.

రావి కొండల రావు గారి కుక్క పిల్ల దొరికింది నాటిక చాలా మందికి తెలిసిన గొప్ప హాస్య నాటిక.
కుక్కలను విశ్వాసపాత్రంగా చూపించిన రాము లాంటి తెలుగు హిట్ చిత్రాలు కొన్ని ఉన్నాయి.
Ramu-poster.jpg
 అలాగే విఠలాచార్య సినిమాలలో హీరోయో, హీరోయనో అకస్మాత్తుగా కుక్కగా మారిపోయే సందర్భాలూ ఉంటాయి.
విజయా వారి పాతాళ భైరవిలో కూడా ఒక  కుక్క మనకి  గుర్తండే ఉంటుంది. ఇలా తెలుగు సాహిత్యంలో కుక్కల ప్రస్తావన చాలా చోట్ల వస్తుంది.

Telugucinemaposter patalabhairavi 1951.JPG

కుక్కలకి ప్రాధాన్యత ఇచ్చి తీసిన ఇంగ్లీషు  సినిమాలు కొల్లలు కనిపిస్తాయి.




మరి కొన్నింటిని చూద్దాం ...


కనకపు సింహాసనమున
శునకముఁగూర్చుండ బెట్టి శుభ లగ్నమునన్
ఒనరగ పట్టముఁ గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ !

అని. బద్దెన సుమతీ శతకంలో కుక్క బుద్ధిని ఎండ గట్టేడు. ఆ వంకతో కొందరు మనుషులు నైజాన్ని చాటి చెప్పేడన్నమాట.

కుక్కలు చెప్పులు వెతుకును అని ఊరికే మనవాళ్ళు అన లేదు కదా ? అది దాని నైజ గుణం మరి.


భర్తృహరి సుభాషిత త్రిశతిలో ఒక శ్లోకంలో కుక్కల నైజం ఇలా వర్ణించి చెప్పాడు

లాంగూల చాలన మధుశ్చరణావఘాతం
భూమౌ నిత్య వదనోదర దర్శనంచ
శ్వాపిండదస్య కురుతే గజపుంగవస్తు
ధీరం విలోకయతి చాటు శతైశ్చభుక్తే.

దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాద పద్యం చూడండి:

వాలము ద్రిప్పు, నేలబడి వక్త్రము, కుక్షియుఁజూపు, క్రిందట
బడు, ద్రవ్వు పిండదుని కట్టెదుటన్ శునకంబు, భద్రశుం

డాలము శాలితండు లగు పిండంబుల చాటు వచశ్శతంబుచే
నోలి భుజించు ధైర్యగుణయుక్తిఁగఁజూచు మహోన్నత స్థితిన్

దీని భావం ఏమిటంటే, కుక్క తనకి ఆహారం పవడేసే వాడి ఎదుట నానా వికారాలూ పోతుందిట. వాడి ఎదుట నిలబడి తోక ఊపుతుంది. నేల మీద దొర్లుతూ నోరు, కడుపు చూపిస్తుంది. కాలితో నేలను తవ్వుతుంది. కాని భద్ర గజం అలా కాదు. ఆ తినేదేదో మురిపించుకుని మురిపించుకుని మరీ తింటుంది. అదీ ధీరుల లక్షణం అంటాడు కవి.

అంతే కదా, కుక్క కుక్కే , ఏనుగు ఏనుగే. దారంట ఏనుగు పోతూ ఉంటే కుక్కలు ఊఁ... అదే పనిగా మొరుగుతాయి. వాటి వలన ఏనుగుకి వచ్చే లోటు ఏమీ ఉండబోదుకదా,

శ్రీనాథుడు ఓ చాటువులో ఇదే చెప్పాడు

సర్వఙ్ఞ నామధేయము
శర్వునికే, రావుసింగ భూపాలునికే
యుర్విం జెల్లును, తక్కొరు
సర్వఙ్ఞుండనుట కుక్క సామజ మనుటే

ఈ పద్యంలో సర్వఙ్ఞుడనే పేరు శర్వునికే తప్ప సింగభూపాలుడికి చెల్లదనే గూఢార్ధం ఉందని, రాజాగ్రహం చల్లార్చడం కోసం శర్వునికీ, రావుసింగభూసాలునికి మాత్రమే సర్వఙ్ఞుడనే పేరు తగునని కవి సమర్ధన చేసాడనీ అంటారు.

కొంతమంది డబ్బుదేం ఉంది కుక్కను తంతే రాలుతుందనడం కద్దు. నిజానిజాలు పైవాడి కెరుక. పిచ్చి కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు ఇవ్వాలన్నది మాత్రం ఖాయం. అందు వల్ల డబ్బులు రాలడం కోసం కుక్కలను తన్నే సాహసం చెయ్య వద్దని కథామంజరి విఙ్ఞప్తి చేస్తోంది.

సరే, కుక్కల ప్రస్తావన వచ్చిన మరో పద్యం చూడండి:

నక్కలు బొక్కలు వెతుకును
అక్కరతో నూర పంది అగడిత వెదుకున్
కుక్కలు చెప్పులు వెదుకును
తక్కిడి నా లంజ కొడుకు తప్పే వెదుకున్.

కొంత మందికి అన్నింటి లోనూ దోషమే కనబడుతుందతి కానీ ఒక్క మంచీ కనబడదని దీని సారాంశం.

వేమన కూడా

అల్ప బుద్ధి వాని కధికార మిచ్చిన
దొడ్డ వారి నెల్ల తొలగ గొట్టు
చెప్పు తినెడు కుక్క చెఱకు తీపెరుగునా ?
విశ్వదాభిరామ వినుర వేమ

అని చెప్ప లేదూ ? !

శునక: పుచ్ఛమివ వ్యర్ధం లుబ్ధస్య పరి జీవనం
నహి గుహ్యా గోపాయచ, నచ దంశ నివారణే

అంటే, కుక్క తోక దాని సిగ్గును అది దాచు కోడానికీ, ఈగలను తోలుకోడానికీ కూడా పనికి రాదు. అలాగే లోభి వాడి ధనం కూడా ఎందుకూ పనికి రాదు. కుక్క తోక వంకర కదా

ఇదే భావాన్ని మా అన్నగారు పంతుల గోపాల కృష్ణరావు తన కందాలూ, మకరందాలూ లో ఆట వెలదుల అనుబంధంలో ఒక ఆట వెలది పద్యంలో ఇలా చెప్పేరు:

కుక్క తోక చూడ కటిలమై యుండును
దాని శీల మదిమె దాచ లేదు
తోల లేదు ఎపుడు దోమ ఈగలనైన
వ్యర్ధుడైన వాని వైనమింతె.

ఎంత ఇల్లాలయినా. వొసే పెద్దమ్మా, దరిద్ర గొట్టుదానా ! అని నర్మ గర్భంగా పిలిస్తే తెలివైన ఇల్లాలు ఊరుకుంటుందా ? అంతే దీటుగా నర్మ గర్భంగా తల వాచి నోయే లాగున బదులిస్తుంది.

ఆ వైనం చిత్తగించండి ...

పర్వతశ్రేష్ఠ నుత్రిక పతి విరోధి
యన్న పెండ్లాముఅత్తను గన్న తల్లి
పేర్మి మీరిన ముద్దుల పెద్ద బిడ్డ,
సున్నమించుక తేగదే సుందరాంగి

సుష్ఠగా భోంచేసి తాంబూలం వేసుకోవాలనుకున్నాడు భర్త. పెట్టెలో అన్నీ ఉన్నాయి కానీ సున్నం లేదు. భార్యని ఇలా ముద్దుగా కేకేసి అడిగాడు
పర్వత నాజు పుత్రిక పార్వతీ దేవి. మె భర్త శివుడు. అతని విరోధి మన్మధుడు. అతని అన్న బ్రహ్మ. అతని భార్య సరస్వతి. ఆమె అత్త లక్ష్మి మెను కన్నతల్లి గంగ. ఆమె ముద్దుల బిడ్డ పెద్దమ్మ. ఒసే దరిద్రగొట్టు పెద్దమ్మా కాస్త సున్నం తేవే అని దీనర్ధం

ఆవిడ అంతే నర్మ గర్భంగా జవాబిస్తూ సున్నం తెచ్చి మగడికి అందించింది.

శతపత్రంబుల మిత్రుని
సుతుఁజంపిన వాని బావ సూనుని మామన్
సతతముఁదాల్చెడు నాతని
సుతువాహన ! వైరి వైరి సున్నంబిదిగో !

శతపత్రంబుల మిత్రుడు అంటే సూర్యుడు. అతని కుమారుడు కర్ణుడు. అతడిని చంపిన వాడు అర్జునుడు. వాని బావ శ్రీకృష్ణుడు,అతని కొడుకు మన్మధుడు. అతని మామ చంద్రుడు. అతనిని తలపై ధరించే వాడు శివుడు. అతని కొడుకు వినాయకుడు. అతని వాహనం ఎలుక. దానికి విరోధి పిల్లి. దానికి వైరి కుక్క ! ఒరే కుక్క వెధవా సున్నం ఇదిగోరా అని నర్మ గర్భంగా తిట్టి పోసిందా మహా ఇల్లాలు.

శునక పురాణం గురించి చెప్పేటప్పుడు అంతరిక్ష ప్రయాణం చేసొచ్చిన లైకా అనే కుక్క పిల్లను తలచుకోవడం ఎంత అవసరమో, మన పతంజలి గారి బొబ్బిలి అనే కుక్కని గురించి తలుచుకోక పోవడం చాలా దారుణం. దానంత దండగమారి కుక్క లోకంలో మరోటి ఉండబోదు. రాజుల లోగిళ్ళలో పడి తెగ మేసిన పనికిమాలిన కుక్క అది. రాజులతో వేట కెళ్ళి ఎన్ని దొంగ వేషాలు వెయ్యాలో అన్నీ వేసిన కుక్క అది. దాని వైభోగం, దాని బుద్ధికుశలత, దాని యవ్వారం వగైరాల గురించి తెలుసు కోవాలంటే పతంజలి గారి వీర బొబ్బిలి, గోపాత్రుడు చదవాల్పిందే మరి.

ఇక, చివరగా కుక్కల మీ ఉన్న సామెత లేమిటో కొంచెం చూదాం. చాలా ఉన్నాయి లెండి.

1.కుక్క ఇల్లు సొచ్చి కుండలు వెదుకదా
2.కుక్క అతి మూత్రం,బంధువైరం లేకుంటే గంటకు ఆమడ దూరం పోనా అందిట !

కనబడిన చోటెల్లా ఆగి, కాలెత్తి ఉచ్చ పోయడం కుక్కల అలవాటు. అలాగే దారంట కనబడిన ప్రతి కుక్కతోనూ జట్టీ పెట్టు కోవడం కూడా దాని అలవాటు. ( తానొచ్చిన దారి వాసన బట్టి గుర్తుంచు కోవడం కోసం అలా చేస్తుంది) కుక్కకున్న ఈ లక్షణాలను చూసి ఈ సామెత పుట్టింది.
3.కుక్క ఉట్టెలు తెంచ గలదు కాని కుండలు పగులకుండా ఆప గలదా ?
4.కుక్క గోవు కాదు. కుందేలు పులి కాదు.
5.కుక్క కాటుకి చెప్పు దెబ్బ
6.కుక్కకు ఏం తెలుసు మొక్క జొన్నప రుచి ?
7.కుక్కకు ఏ వేషం వేసినా మొరగక మానదు.
8.కుక్కకు కూడా కలసి వచ్చే కాలం ఉంటుంది.
9.కుక్కకు కూడు పెడితే కుండకు ముప్పు
10.కుక్కకు జరీ కుచ్చులు కట్టినట్టు
11.కుక్కలు చింపిన విస్తరిలా ఉంది కాపురం
12. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టు
13.కుక్కను ముద్దు చేస్తే మూతెల్లా నాకుతుంది.
14.కుక్క బుద్ధి దాలికుంటలో ఉనేనంతసేపే
15.కుక్క కనబడితే రాయి దొరకదు. రాయి దొరికితే కుక్క కనబడదు.
16. మొరగ నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అందిట.

ఇవి కాక చివరగా ఓ ఏ సర్టిఫికేటు కుక్కల సామెత కూడా ఉంది.

16. కుక్క ఎక్క లేక కాదు చచ్చేది. పీక్కో లేక !

ఇక, కుక్క బతుకు, కుక్క చావు లాంటి జాతీయాలు మనకి తెలిసినవే.


అయ్యా, ఇదీ శునక పురాణం. చెప్పుకోవాలంటే ఇంకా చేంతాడంత ఉంది.

ఇక శలవ్.












3, సెప్టెంబర్ 2013, మంగళవారం

ఏం దారి దేవుడా ...



కరవ మంటే కప్పకి కోపం

విడువ మంటే పాముకి కోపం

ఏం దారి దేవుడా.



ముందుకో వెనక్కో

ఒక్క అడుగు వేద్దామంటే

ముందు నుయ్యి

వెనుక గొయ్యి

ఏం దారి దేవుడా.



అత్త గారి కోక వొసిలిందంటే

కోపం

వొసల లేదంటే కోపం

ఏం దారి దేవుడా.



గోచీకి తక్కువా

గావంచాకి ఎక్కువా

ఏం దారి దేవుడా.



పది నెలల్లో పరిష్కారం

చెయ్య గలను లెమ్మంటాడు

తాయిలం ఇస్తే కానీ

ఆ కిటుకు లేవో

చెప్పను పొమ్మంటాడు

ఏం దారి దేవుడో.


ఇదిగో వస్తోంది

అదిగో వస్తోంది

మూతుల గుడ్డలు

మూల పడెయ్యొచ్చు

మూసిన తలుపులు తెరిచెయ్యొచ్చు


ఐతే గేరంటీ  లేదుట

ఆ పైన మీ ఖర్మం


ఏం దారి దేడుడా















28, ఆగస్టు 2013, బుధవారం

చొ ... చొ ... చ్చొ ...చ్చొ చ్చొ .. అను .. ఒక రాంగ్ షో కథ !


‘‘జై సమైక్యాంధ్రా ! ’’ అంటూ రాత్రి పడుకున్న భర్త, అర్ధ రాత్రి వేళ ‘‘ జై తెలంగాణా ! ’’అంటూ కలవరిస్తూ ఉలిక్కిపడి లేచాడు. ‘‘కలొచ్చిందా ?’’ అడిగింది భార్య ఆవలిస్తూ, బద్ధకంగా .. ‘‘అవునే, మన అబ్బాయి దగ్గరకి హైదరాబాద్ వెళ్ళినట్టు కలొచ్చిందే .. ’’చెప్పాడు భర్త. ‘‘చాల్లెండి సంబడం. అర్ధ రాత్రి వేళ అంకమ్మ శివాలనీ, ఏఁవిటా నినాదాలూ మీరూనూ ... కళ్ళు మూసుకుని పడుకోండి ’’అంది భార్య. ‘సరే ’అని పడుకున్నాడు భర్త. మరో గంట గడిచేక ‘‘జై రాయల తెలంగాణా ! ’’అంటూ కలవరిస్తూ నిద్ర లేచి కూర్చున్నాడు, ‘‘బావుంది వరస ... ఏఁవిటా కలవరింతలు ; మరో కలేఁవైనా వొచ్చిందేఁవిటి ? ’’ అడిగింది భార్య కాస్త కోపంగా. ‘‘అవునే ఈ సారి అమ్మాయి యింటికి అనంతపురం వెళ్ళినట్టు కలొచ్చిందే ...’’ చెప్పాడు భర్త నీరసంగా. ‘‘సరి..సరి.. ఎవరైనా వింటే నవ్వి పోతారు ..ఈ గొడవలన్నీ ఆలోచించకండి కళ్ళు మూసుకుని పడుకోండి ... ’’అంది భార్య. కాస్త కునుకు పట్టిందో లేదో, భర్త మళ్ళీ ఏదో కలవరిస్తున్నట్టుగా అనిపించి చటుక్కున లేచి కూర్చుంది భార్య. భర్త నిద్రలో ‘ చొ..చొ..చ్చొ..చ్చొ ..’ అంటూ కలవరిస్తున్నాడు. ‘‘ ఏఁవయిందండీ .. ఆ చొచ్చొచ్చో లేఁవిటి ? ’’ అనడిగింది భర్తను తట్టి లేపుతూ .. తుళ్ళి పడి లేచాడు భర్త. ముఖం పీక్కు పోయి ఉంది. దెయ్యం పట్టిన వాడిలా ఉన్నాడు. ‘‘ఈసారి పేకాట రమ్మీ ఆడుతున్నట్టుగా కలొచ్చిందే ’’అన్నాడు నీరసంగా .. ‘‘ఖర్మ ! అయితే ఏఁవిటంటా ? ’’ అడిగింది భార్య. కాస్సేపు నసిగి చెప్పాడు భర్త దిగులుగా : ‘‘రాంగ్ షో డీల్ చూపించీసినట్టు కలొచ్చిందే .. ’’ అన్నాడు. అంతే. ఆ మొగుడూ పెళ్ళాలకి మరింక నిద్ర పట్ట లేదు.

15, ఆగస్టు 2013, గురువారం

హే, భగవన్ !



హన్నా అయ్యారే అను నొక మహనీయుడు దేశమును రిపేరు చేయ దలచి, చాలా తీవ్రముగా ప్రయత్నించి సాధ్యము కాక ఉస్సురని ఉండి పోయెను. ఇక మానవ ప్రయత్నము వలన ఇది సాధ్యము కాదని తలచి, హిమాలయములకు పోయి ఘోరమైన తపస్సు చేసెను, అన్ సీజను కాబోలునేమో, దేవుడు త్వరగానే ప్రత్యక్ష మయ్యెను.

అయ్యారే కనుల ఆనంద బాష్పములు రాలుచుండ ‘‘ హే భగవన్ !నా జన్మ ధన్యమైనది. నాకొక్క వరము ప్రసాదింపుము ’’  అని వేడుకొనెను,

‘‘ భక్తా ! ఏమి నీ కోరిక  ’’ అని భగవంతుడడిగెను.

‘‘ మా దేశమున అవినీతిపరుల యొక్కయు, అసత్యములాడు వారి యొక్కయు తలల తక్షణమే వేయి వ్రక్క లగునట్లు వరము నిమ్ము ’’  అని అయ్యారే అడిగెను.

అది విని భగవానుడు మిక్కిలి ఖిన్నుడయ్యెను.

‘‘ నాయనా ! నీవడిగిన వరములో రెండు క్లాజులున్నవి. అవినీతి పరులను దండింప వలెనన్న చేతులు రాకున్నవి.అన్ని కోట్ల మందిని నేనే సృజించితిని. నాచేతులతో నాశనము చేయుట  ఎట్లో తెలియకున్నది.అట్లయిన ఈ జంబూ ద్వీపమున ఒకరో ఇద్దరో మాత్రమే మిగులుదురు కాబోలు. ఇక నీ వరము లోని రెండవ క్లాజు అసత్యపరులని దండించు మనుట. పొద్దున లేచినది మొదలు మీ ఖండము నంలి దురద దర్శనములందును, చిత్రికలందును ప్రతి వాడును తానే సత్యవాదినని, తాను చెప్పినదే నిజమని చెప్పు చున్పాడు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియక చాలా కన్ఫ్యూజన్ లో ఉంటిని. అందు చేత ఇవి కాక వేరొక వరము వేడి కొనుము. ప్రసాదించెదను.’’  అనెను.

ఇట్టిది కదా నా భాగ్యము అని నిట్టూర్చి, ఏమి చేయుదనని చింతించి తుదకు అయ్యారే వేరొక వరమును వేడెను.

‘‘ హే భగవన్ ! ఈ వరము తప్పక ప్రసాదింపుము. ఏమనిన, స్విస్ బ్యాంకులలో ఉన్న మా వారి నల్ల ధనమంతయు తృటి కాలములో మా దేశ ఖజానాలో పడునట్లు చేయుము. దానితో మా దేశ ప్రజల దరిద్రము తీరి పోయి నీతి నియమములతో, ప్రశాంతముగా బ్రతికెదరు ’’  అని కనులు మూసుకుని వేడుకొనెను.

భగవంతుడు ‘‘ తథాస్తు ! ’’ అని పలికి వరము నిచ్చి అంతర్ధానమొందెను.

అయ్యారే కనులు తెరచి చూచెను. దేవుడు కనిపించ లేదు. అంతియ కాదు. దేశ ఖజానా కూడా ఖాళీగా ఉన్నది.
 దేవుడు తనని మోసగించెనని   అయ్యారే  భావించి,  ఆగ్రహంచెను. తిరిగి ఘోరమయిన తపము  చేయ బోయెను.
,
మరుక్షణమే దేవుడు ప్రత్యక్షమయ్యెను.

‘‘ నాయనా ! తిరిగి ఏవరము కోరి తపము చేయు చున్నావు  అను క్షణము నన్నిట్లు డిస్టర్బు చేయుట నీకు తగునా ? !  ? ’’  అని అడిగెను.

అయ్యారే కోపము దిగమ్రింగుకొని, ‘‘ దేవా ! నన్ను వంచించితివి. నల్లధనమంతయు దేశ ఖజానాలోకి వచ్చు నట్లు చేసెద నంటివి, కనులు తెరచి చూచు నంతలో మాయమైతివి. ఖజానా ఖాళీగా ఉన్నది, ’’ అనెను,

అందుకు దేవుడు నవ్వి ఇట్లనెను. ‘‘ నాయనా ! నీవెంత అమాయకుడవు ? నేను వరమ నిచ్చుట జరిగినది. మీ దేశ ఖజానా ఇబ్బడి ముబ్బిడిగా నిండుట కూడా జరిగినది.’’

మరి ... అడిగేడు అయ్యారే, సందేహంగా ..

‘‘ నీవు కనులు మూసి తెరచు నంత లోన మీ నాయకుల్దానిని క్షణకాలములో హోంఫట్ ! చేసినారు. నేనేమి చేయుదును ?   నల్లధనమును రప్పించమనియే వరమడిగితివి. మీవాండ్లు దానిని వెంటనే చప్పరించి వేసినచో నేనేమి చేయుదును ? ఈ పాటికి అదంతయు వారలకు  అరగి పోయే యుండును ... అదిగో ! ఆవురావురుమను గావు కేకలు నీ చెవిని బడుట లేదా ?’’  అని దేవుడు తన నిస్సహాయతను వెల్లడించెను.

ఫలశృతి :  దేవుని నిస్సహాయత అను నామాంతరము గల  హే, భగవన్ ! అను ఈ కథను చదివిన వారికి ఉన్న రోగములు అధికమగునేమో కానీ కొత్త రోగములు రావు. కుటుంబ నియంత్రణ వలన ఒక్క పుత్రుడు ఉదయించిన ఉదయించ వచ్చును. ఈతి బాధలు తగ్గక పోయిననూ వాటికి అలవాటు పడి పోయెదరు.మీ వంశమున వంద తరముల వారికి సరి పోవునట్లుగా  ధన కనక వస్తు వాహన సౌభాగ్యములు అక్రమ మార్గమున యత్నించిన దక్క వచ్చును. కానీ ముందుగా చర్లపల్లి జైలులోను , మరియు తీహార్ జైలులోనూ వేకెన్సీ పొజిషను వాకబు చేయ వలెను.

స్వస్తి.








20, జులై 2013, శనివారం

చప్పట్ల బాబా ...





చప్పట్ల బాబా నాకో బంపర్ ఆఫర్ ఇచ్చేడు. అదివిని దభీమని నేలమీద దఢాలున స్పృహ తప్పి పడి పోయాను. వంట గదిలో మా ఆవిడ పరిస్థితీ దాదాపు అలాగే ఉన్నట్టుంది. కథా మంజరీ ... ఏఁవండీ కథామంజరీ అంటూ బాబా చప్పట్లు చరిచేరు. చప్పట్ల మహిమ చేత నేను స్పృహ లోకి వచ్చేను.

‘‘నేను విన్నది నిజఁవేనా ? ’’ అడిగేను బేలగా.

‘‘ ఇందులో అబద్ధానికేఁవుంది ? ... తిట్ల బాబాలూ, బెత్తం దెబ్బల బాబాలూ, కాలి తాపుల బాబాలూ లేరూ ? అలాగన్న మాట ! మనం కేవలం చప్పట్ల బాబాలం, మహా అయితే భక్తుల అరచేతులు నొప్పెట్టడం తప్పితే అంతకన్నా అధికంగా హింస ఉండదు. కాలి తాపులూ, బెత్తం దెబ్బలూ వగైరాలు వికటిస్తే, ఆ తన్నులూ. దెబ్బలూ ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. మనకెందుకా బాధ ? మన భక్తవర్యులు చక్కగా, తనివితీరా ఊగిపోతూ చప్పట్లు చరుస్తూ ఉంటారంతే. ఆవిధంగా మనం ముందుకు పోతాం. ఆధ్యాత్మిక సేవ చేస్తాం. మనకెలాగూ ప్రభుత్వోద్యోగాలు వచ్చే సావకాశం లేదు. ప్రైవేటు జాబులూ మన చరిత్ర తెలిసిన వాళ్ళెవరూ ఇవ్వడానికి సాహసించరు. వ్యాపారాలనికీ మనకీ చుక్కెదురు. ఒక్కటీ కలిసి రావడం లేదు. అంచేత సుదీర్ఘంగా ఆలోచించేక చప్పట్ల బాబాగా అవతరించి ఆధ్యాత్మిక సేవ చేసి నాలుగు రాళ్ళు వెనకేసు కోవడమే మంచిదని నిర్ణయానికొచ్చేను. ఉదరపోషణార్ధం బహుకృత వేషమ్ అని పెద్దలు శెలవిచ్చేరు కదా. తప్పు లేదు. ప్రజలు పిచ్చి ముండా కొడుకులవడం మన తప్ప కాదు కదా ? ఎవరి ఖర్మ వాడిది. ఎవడు చేసిన తప్పుకి ఫలితం వాడనుభవిస్తాడు...’’

‘‘ మరి .. బూడిదలూ గట్రా ఇవ్వడం లాంటిది ఏఁవన్నా ఉందా ? ...’’ అడిగేను నంగిగా.

‘‘ అవన్నీ ఓల్డు ఫేషన్ కథామంజరీ ... మనం ఆల్ట్రా మోడ్రన్. అంచేత మనం అలాంటివేవీ ఇవ్వం. వయసులో ఉన్నవారికి అబ్బాయిలయితే సినీతారల ఫోటోలూ, అమ్మాయిలయితే యువ హీరోల ఫోటోలూ ఇస్తాం. పెద్దవాళ్ళకి రాజకీయ నాయకుల ఫొటోలూ, వృద్ధులయితే దేవుళ్ళ ఫొటోలూ ప్రసాదిస్తాం. దీనివలన బహుముఖమైన లాభాలు ఉన్నాయి. యువతరం సంతోషిస్తుంది. రాజకీయ నాయకులూ, సినిమాతారలూ మనపట్ల వ్యతిరేక భావంతో ఉండరు. పాపం, బాబా అభిమానాన్ని మనం ఎందుకు కాదను కోవాలీ అని సమాధాన పడతారు. మన జోలికి రారు. పైపెచ్చు చప్పట్ల భక్త బృందంలో చేరినా చేరే అవకాశమూ ఉంది. దానితో మన పాప్యులారటీ పెరిగుతుంది. మన చుట్టూ ఓ రక్షణ కవచం దానంతట అదే ఏర్పడుతుది. అన్నట్టు దానివలన పోలీసులు కూడా మనపట్ల ఉదాసీనభావంతో ఉంటారు,

ఇక పోతే, ఈ తొక్కలో జర్నలిష్టులు ... టీవీల వాళ్ళూ ... పేపర్ల వాళ్ళూ ... వీళ్ళ వల్ల మాత్రం కొంత ఇబ్బంది ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఇన్విష్టిగేటివ్ జర్నలిజమూ వాళ్ళ పిండాకూడూనూ. అందు చేత మనఁవే ముందుగానే వాళ్ళని చప్పట్లు కొట్టి పిలిచి

మన చప్పట్ల ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకూ తావు లేదనీ వివరిస్తాం. ఏదో మమ్మల్నిలా బతకనివ్వండని కన్నీళ్ళ పర్యంతమై ఆఫ్ ద రికార్డుగా వేడుకుంటాం. వాళ్ళు కనికరించేరో సరేసరి. లేదూ మన గురించి అవాకులూ చవాకులూ ప్రచారం చేస్తే మనకొచ్చే బాధ ఏమీ లేదు. వ్యతిరేక ప్రచారాన్ని మించిన ప్రచారం మరొకటి లేదనే సంగతి తెలిసినదే కదా.

అదలా ఉంచితే, ఈ సినిమా తారల ఫొటోలూ, రాజకీయ నాయకుల ఫోటోలూ పందేరం చేయడమేఁవిటి హన్నా ! అని ఎవరయినా చిందు లేసారనుకుందాం. ఏమీ, భగవంతుడు సర్వాంతర్యామి, నాలో ఉన్నాడు. నీలో ఉన్నాడు. అంతటా ఉన్నాడు. అలాంటి దేవుడు రాజకీయ నాయకులలోనూ. పినిమా తారల లోనూ ఉండడా ? ఉండడనుకోవడం దైవ దూషణ కాదా ? మహా పాపం కాదా ? కళ్ళు పోవా ? అని ఎదురుదాడి చేస్తాం. అప్పటికీ మన పప్పులుడక్క పోతే దుకాణం మూసేస్తాం. అంతే. ’’

ఇంతకీ ఈ చప్పట్ల బాబా ఎవరో ఇంకా చెప్పనే లేదు కదూ ? లోగడ కథామంజరిలో సరదాకి అనే లేబిల్ క్రింద మా తింగరి బుచ్చి అనే వాడి గురించి చాలా చెప్పడం జరిగింది. ఆ తింగరి బుచ్చే ఈ చప్పట్ల బాబా. అసలింతకీ బాబాల గత చరిత్ర గురించి కూపీ తియ్యబోవడమంత పాపం మరొకటి లేదు. ఏరుల జన్మంబు, శూరుల జన్మంబు లాగే బాబాల జన్మంబు ఎవరికీ తెలియదు. తెలీడానికి వీల్లేదు.

ఇక, మన చప్పట్ల బా నాకిచ్చిన బంపరు ఆఫరు గురించి ఇంకా చెప్పవలసే ఉంది కదూ ?

‘‘ ఓయి కథామంజరీ, అంచేత నేను చప్పట్ల బాబాగా అవతరించిన తరువాత నువ్వు చప్పట్ల బాబా ప్రవచనాలు అంటూ ఓ నాలుగయిదు చిన్న చిన్న పుస్తకాలు రాసి పెట్టాలి. ఒక్కోటీ పది ఇరవై పేజీలకు మించ నక్కర లేదు. అలాగే చప్పట్ల బాబా మహిమలు అంటూ మరో మూడు నాలుగు పుస్తకాలు రాసి పెట్టాలి. ఆ మహిమల గురించి చదివేక నేనే ఆశ్చర్య పోవాలన్నమాట. ఆ కల్పనా శక్తి నీకుంది నాకు తెలుసు. ప్రవచనాలూ. మహిమలూ అన్నీ నీ ఊహాజనితాలే కావాలి. కొత్తవే రాస్తావో, ఎక్కడినుండయినా ఏరుకొస్తావో అది నీ ఇష్టం. పుస్తకాల ప్రచురణ వ్యయం గురించి నీకేమీ దిగులక్కర లేదు. అదంతా మా చప్పట్ల ఆశ్రమం చూసుకొంటుంది. నీకు రాయల్ట్రీ గట్రా దొరుకుతుంది. మిగతా వాటి సంగతికేం గానీ ఇలాంటి పుస్తకాలు వేడి పకోడీల్లా అమ్ముడయి పోతాయి. నాది గ్యారంటీ. చెప్పు ఈ డీల్ నీకు సమ్మతమేనా ? ఈ ఒప్పనందం ఖరారయితే నీకు మరో బంపర్ ఆఫర్ ఉంది. అదేఁవిటంటే ..మా చప్పట్ల ఆశ్రమానికి చెందే ట్రష్టు బాధ్యతలు నీకే అప్పగిస్తాను. ఆలోచించుకో ...’’

ఆలోచించడానికేమీ లేదు. నా వల్ల కాదు అనీపాను నిక్కచ్చిగా. మరో సారి చెప్పి చూసి నీఖర్మం అని పెదవి విరిచేసాడు ( కాబోయే ) చప్పట్ల బాబా.

చప్పట్ల బాబా భవిష్య ప్రణాళిక వింటూ ఉంటే నాకు చప్పున ఓ పద్యం గుర్తుకు వచ్చింది. అవధరించండి ...

ఎక్కడి మంత్ర తంత్రములవెక్కడి చక్రము లేడ పాచికల్

ఎక్కడి జ్యోతిషమ్ములవి యెక్కడి హేతువు లేడ ప్రశ్నముల్ ?

తక్కిడి గాక పూర్వకృత ధర్మ సుకర్మమె నిశ్చయంబు పో

పెక్కురు పొట్టకూటికిది వేషమయా శరభాంక లింగమా !

అని సరిపుచ్చుకొని. ‘‘ సరే కానీ, బాబా అన్నాక భక్తులకు రవంతయినా ఆధ్యాత్మిక బోధనల చేయాలి కదా ? ... మనకి చూసొచ్చిన సినిమా కథలు చెప్పడఁవే సరిగా రాదు ... ఎలా మేనేజ్ చేస్తావ్ ’’ అనడిగేను.

‘‘ అవును. ఆ విషయమూ ఆలోచించేను. అందు కొంత హోమ్ వర్క్ చేసాను.

సత్యాన్ని మించిన అసత్యం లేదు,

హింసను మించిన అహింస లేదు.

ఙ్ఞానాన్ని మించిన అఙ్ఞానం లేదు,

ఇలాంటి కొత్త భావజాలంతో ఉసన్యసిప్తాం. అర్ధం కావడం లేదు గురూజీ అనే మొండి భక్తుల నోళ్ళు

అర్ధం కాక పోవడమే అర్ధమవడంరా మూఢ భక్తుడా ! అని మూయిస్తాం.

మరో విషయం ... ఎవరికీ చెప్పనంటే చప్పట్ల రహస్యం నీకు చెబుతాను ... విను ...

మన భక్తులు ఊగిపోతూ, తన్మయత్వంతో, ఒకరిని మంచి ఒకరు పెద్దగా చప్పుడు చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారా ! ... అప్పుడు ప్రారంభిస్తామన్నమాట మన తాత్విక బోధనలు. మనం ఉపన్యాసం యిస్తున్నామో, ఊరికే పెదవులు కదిలిస్తున్నామో ఎవరూ పోల్చుకో లేని విధంగా ఉంటుందన్నమాట. దాంతో మన అఙ్ఞానం పదిలంగా ,భద్రంగా, గూఢంగా ఉండి పోతుంది. చప్పట్ల హోరులో ఏఁవీ వినిపించి చావక పోయినా బాబా ఏదో చెప్పి ఉంటారనే భావనతో భక్తులు పట్టించు కోరు. అదీ మన చప్పట్ల రహస్యం...’’ అని ముగించేడు చప్పట్ల బాబా.

నేను నివ్వెర పోయాను. నా ఙ్ఞానాంధకారం నశించి . అఙ్ఞాన కిరణాలు అంతటా ప్రసరించేయి. నా తల వెనుక ఓ తేజో చక్రం కాస్సేపన్నా తిరిగి ఉంటుంది. ధన్యోస్మి.

జై ... బోలో ... చప్పట్ల బాబా మహరాజ్ కీ జై ! ... అంటూ చప్పట్లు కొడుతూ అరిచేను.

చప్పట్ల బాబా తన తొలి భక్తుడిని చూస్తూ చిరు నవ్వులు చిందించారు.



1.































































8, జులై 2013, సోమవారం

ఖర విలాపం ...




ఇదేమయినా బావుందా , చెప్పండి ..‘కట్నం తీసుకునే వాడు  గాడిద ’ అని ఓ టీ.వీ ఛానెల్ అడపా దడపా హెచ్చరించడం మా గాడిదల దృష్టికి వచ్చింది. మా మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

ఏ గాడిదయినా నవ్వి పోతుంది. గాడిదలు కట్నం తీసు కోవడమేమిటి ! గాడిదలు కట్నం తీసుకున్న వైనం ఎక్కడయినా చరిత్రలో విన్నామా ? కన్నామా ? మరి కట్నం తీసుకునే వాడిని మాతో పోలిక తేవమేఁవిటి ? చోద్యం కాక పోతేనూ ! మధ్యలో మా వూసెందుకూ ఎత్తడం మేఁవంటే చులకన కాక పోతేనూ ? వెనుకటి కొక తండ్రి కూడా ఆడిన మాటను తప్పిన కొడుకుని గాడిదా ! అని తిట్టడం, వీడా కొడుకని గాడిద ఏడవటం జరిగింది. ఇలా ప్రతీ వాళ్ళకీ అలుసై పోవడం మాకు చాలా కష్టంగా ఉంది.

అందుకే త్వరలో జరగబోయే మా అఖిల భారత గాడిదల ఓండ్ర మహా సభలో ఈ దారుణాన్ని నిరసిస్తూ ఓ తీర్మానం పెట్టబోతున్నాం. మానవ హక్కుల వారి దృష్టికి ఈ విషయం తీసికెళతాం. హన్నా ! గాడిద లంటే అంత చులకనా ; అంటే కొంత చులకన ఉండొచ్చని అర్ధం కాదు. గానానికి మేఁవూ, అందానికి లొటిపిటనూ చెప్పు కోవాలని మా మధురవాణి అక్కయ్య చెప్ప లేదూ ...ఏఁవిటీ ... వెక్కిరింతగా చెప్పిందంటారా ? ఎలా చెప్పిందని కాదు ... చెప్పిందా లేదా ? అంటే లోకంలో మా అందం గురించి ఎంతో కొంత చర్చ ఉండడం బట్టే కదా ? నిజానిజాలు పైవాడి కెరుక. చూసే అందం చూసే వాడి కళ్ళలో ఉంటుంది. గాడిద పిల్ల గాడిదకి ముద్దు. అలాగే గాడిదల అందం గాడిదలకే సొంతం. మా వినయ గుణమే మాకు అందం. గుర్రాన్నీ గాడిదనూ ఒక తాట కట్టొద్దని చెప్పడం గురించి అంటారూ ? దాని గురించి కూడా మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. గుర్రాల దేం అందం లెద్దురూ . గాడిద గుడ్డు అందం. అదిగో... ఈ ధూర్త మానవుల మాటలు చెవిని పడి పడీ మాకూ అనుకోకుండా అవే మాటలు వచ్చేస్తున్నాయి కదూ ? గాడిద గుడ్డేఁవిటి ? గాడిద గుడ్డు.

గాడ్ ద గుడ్ అనే దానికి వచ్చిన పాట్లు అవి. ఈ మాటని కూడా లోక వ్యవహారం లోనుండి తరిమేసేలా మా అఖిల భారత గాడిదల ఓండ్ర మహా సభ చర్యలు తీసుకుంటుంది.

గంగి గోవు పాలు గరిటడైనా చాలుట. కడివెడైనా ఖరము పాలు శుద్ధ దండగ అంటాడు ప్రజాకవి, గోవు మా లచ్చిమి అంటే మాకూ గౌరవమే కానీ మా పాల గురించి అలా అనడం ఏమన్నా బాగుందా చెప్పండి ? ఏమీ, మా బిడ్డలు మా పాలు తాగి ఏపుగా పెరగడం లేదా ? మమ్ములనూ, , మా పాలనూ హేళన చేస్తూ మా మనోభావాలను కించ పరచడం బాగుందా ?

వసుదేవుడంతటి వాడు మా జాతివాని కాళ్ళు పట్టు కొన్నాడే ! తెలుగు సంవత్సరాలలో ఖరనామ వంవత్సరంగా అజరామరంగా నిలిచేమే ? ఒక దేవజాతి ముఖాకృతిగా కలవారమే ! అట్టి మాకా ఈ దుర్గతి ... మా పట్లనా ఇంత చులకన భావం. ?

అధికారికి ముందూ, గాడిదకు వెనుకా ఉండ కూడదంటారు. అలా వాటంగా వెనక్కాళ్ళు రెండూ ఒకేసారి ఎత్తి తన్నగల మరో ప్రాణి లోకంలో ఉందా చెప్పండి ? అదీ మా ఘనత ! దానిని గుర్తించ రేమీ ?

మాలో కంచర గాడిదలూ, అడ్డ గాడిదలూ ఉన్నాయంటారు, సార్ధవాహుల సామాన్లు మోసే కంచర గాడిదల ఉన్నాయి కానీ నిజానికి అడ్డ గాడిదలంటూ మాలో వేరే జాతి గాడిదలంటూ ఏవీ లేవు. అట్టివి నరజాతిలో ఉన్నట్టు వినికిడి.

ఎందుకంటే, వెనుకటికి ఓ కవి సభలో ఓ సమస్యను పూరిస్తూ, ‘‘ కొందరు భైరవాశ్వములు ... అంటూ చెబుతూ .. కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు అని మమ్మల్ని కూడా పేర్కొన్నాడు. అంచేత నరజాతిలో అడ్డగాడిదలు ఉన్నట్టు రూఢి అయినట్టే కదా !

మునిమాణిక్యం నరసింహారావు గారు బడి పంతులు. ఓ రోజు పిల్లల కాంపోజిన్ పుస్తకాల కట్ట  చంకన పెట్టుకుని వస్తున్నారు. ఓ కొంటె విద్యార్ధి  వారిని అల్లరి పెడదామని, ‘‘ఏఁవిటి మాష్టారూ ? గాడిద బరువు మోస్తున్నారూ ?’’ అన అడిగేడు. దానికాయన వాడి మాడు పగిలేలా జవాబిచ్చేరు. ‘‘  అవున్నాయనా ! ఇది ఒక గాడిద బరువు కాదు నాయనా ! నలభై గాడిదల బరువు ! ’’ అని ...

అలాగే  ఓసారి ముట్నూరు కృష్ణారావు గారి మనవరాలు  చుట్టపు చూపుగా బందరు వచ్చి, తాతగారితో హాస్యమాడదామని, ‘‘ ఏఁవిటి తాతగారూ ! మీ ఊరినిండా గాడిదలే  కనిపిస్తున్నాయి ! ’’ అంది. దానికాయన తాపీగా ‘‘ అవునమ్మా, ఉన్నవి చాలక ఈ మధ్య పై ఊళ్ళ నుండి కూడా వచ్చి చేరుతున్నాయి ... ’’అని జవాబిచ్చి మనవరాలి కోణంగి తనానికి ధీటైన జవాబిచ్చేరు.
చూసారా ? జోకులు బావున్నాయి కానీ, అవీ మాతోనే ముడిపడి ఉన్నాయి.  మా బతుకు అలాంటిది మరి.

మేం మోసేవి పాత బట్టల మూటలే కావొచ్చు. కానీ పాత మాటల మూటలు మోసుకుంటూ గొప్ప కవులమని విర్రవీగుతూ తిరిగే కుకవుల కన్నా మేం గొప్పే కదా ?

మా బాధ్యత మేం చేస్తున్నామంతే.  మనకి చెందని పనుల్లో జోక్యం చేసుకుంటే చావు దెబ్బలు తప్పవని మా జాతి వాడే లోగడ నిరూపించేడు కూడానూ.

గుర్తుందా ? ఒక మడివేలు ఇంట ఓ కుక్క గాడిద ఉండేవి.  ఓ రోజు రాత్రి యజమాని ఇంట దొంగ పడ్డాడు. కుక్కా, గాడిదా కూడా దొంగ  పడడం చూసేయి.  చాకలి తనని బాగా చూడడం లేదనే ఉక్రోషంతో కుక్క తన కర్తవ్యం మరచి, అరవడం మానేసింది.గాడిద ఎంత చెప్పినా కుక్క అరవ లేదు. గాడిద తన యజమానికి మేలు చేయాలనే ఆలోచనతో తనకు మాలిన పనికి పూనుకొని గట్టిగా  ఓండ్ర పెట్టింది. గాఢ నిద్రలో ఉన్న చాకలి దాని అరుపులకి మేల్కొని కోపంతో దుడ్డు కర్ర తీసుకుని దానిని చావమోదాడు. త్యాగశీలి అయిన ఆ గాడిద తాను చావు దెబ్బలు తిని కూడా లోకానికి  ఎంత గొప్ప నీతిని తెలిపిందో కదా ! అలాంటి త్యాగధనుల జాతి మాది.


వెనుకటి రోజులలో ఇళ్ళలో ఆవకాయలు పెట్టేడప్పుడు అమ్మలూ. అత్తలూ. పిన్నమ్మలూ వగైరాలు మావిడి కాయలు ముక్కలుగా తరుగుతూ ఉంటే పిల్లలు వాటి జీళ్ళు పట్టుకు పోయి ఇంట్లో గోడల మీద కుడ్య చిత్రాలు వేసేవారు. గోడ పత్రికలతో  గో డలన్నీ ఖరాబు చేసే వారు.

ఆరాతల్లో దడిగాడు వానసిరా అనే మాట తరచుగా కనిపిస్తూ ఉండేది. వాళ్ళ రాతల్లో మాప్రస్తావన రావడం కొంచెం నొచ్చుకునే అంశమే అయినా, పిల్ల చేష్టలు ఎంతో మురినెం కదా. ఇప్పుడా బాధ లేదు. ఇళ్ళకు

రంగులు  వేద్దామన్న ఆలోచన రాగానే ముందుగా మీటింగ్ పెట్టి గోడల మీద పిచ్చి రాతలు రాసేరో. తాట  ఒలిచేస్తాం గాడిదల్లారా ! అనే హెచ్చరిక మా పేరు సాక్షిగా వెలువడుతుంది.

కరభము, ఖరము, గార్ధభము, గాలిగాడు ... లాంటి చాలా పేర్లు మాకున్నాయి. వాటిలో గాడిద అనే పేరే ముచ్చటగా ఉంటుంది.

అదలా ఉంచితే ...

క్షుద్ర మానవ జాతి మా పేర ఎన్ని సామెతలు పుట్టించిందో  కాస్త చూడండి ...

1.గాడిదకు గడ్డి వేసి, ఆవును పాలిమ్మన్నట్టు.

2.గాడిద కూత ( ఓంఢ్ర ) గాడిదకు కమ్మనిదే కదా

3.గాడిదకు పులి తోలు కప్పితే కఱవ గలదా ?

4.గాడిదకు మంగళ స్నానం చేయిస్తే, బూడిదలో పొర్లిందిట !

5.గాడిద కేమి తెలుసు గంధపు వాసన.

6.గాడిద కొడకా ! అంగే మీరు తండ్రులు, మేము బిడ్డలం అన్నాడట.

7.గాడిద గుడ్డు గరుడ స్తంభం.

8.గాడిదలతో వ్యవసాయం చేస్తూ, కాలి తాపులకు  దడిస్తే ఎలా ?

9.గాడిదతో స్నేహం కాలి తాపులకే

10.గాడిద పుండుకు బూడిద మందు.

11.గాడిద మోయదా గంధను చెక్కలు ?

12.గాడిదలకు నేల గడ్డముల్ మీసముల్

13. గాడిదల మోత, గుఱ్ఱాల మేత

14, గాడిదలు దున్నితే, దొమ్మరులు పంటకాపులు కారా ?

15. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందిట !

ఇహ చాలు. త్వరలో జరుగబోయే అఖిల భారత గాడిదల ఓండ్ర మహా సభలకు స్వాగత గీతం రాసే పనిలో బిజీగా ఉన్నాను. శలవ్...


26, మే 2013, ఆదివారం

మా తింగరి బుచ్చి తింగిరి ఉపన్యాసమ్ : : .‘‘ గొప్పవాళ్ళ అసంపూర్ణ రచనలు ...’’: :



ముందుగా మీకు మా తింగరి బుచ్చిని పరిచయం చేయాలి.

ఉబుసు పోకనో, యదాలాపంగానో, ఖర్మ కాలో కథా మంజరి బ్లాగు చూసే వారికి ఈ తింగరి బుచ్చి పరిచిత పూర్వుడే ! కొత్త బిచ్చగాళ్ళ కోసం ... మన్నించాలి ! కొత్త పాఠకుల కోసం వాడిని గురించి పునశ్చరణ చేయక తప్పడం లేదు.

ఈ తింగరి బుచ్చి మా ఆవిడకి దూరపు బంధువు. పుట్టింటి వారి తరఫు బంధువనీ, అన్నయ్య వరస అనీ మా ఆవిడ తెగ మురిసి పోతూ ఉంటుంది. పుట్టింటి తరఫు బంధువు అనే మాట ఎలా ఉన్నా, వాడు అతి త్వరలోనే, మా వంటింటి బంధువయి పోయేడు.

పరిచయ మయిన తొలి రోజులలో ‘‘ మరో ఇడ్లీ వెయ్య మంటారా అన్నయ్య గారూ ? ! ’’ అని మా ఆవిడ అడిగితే సిగ్గు , మొహమాటం వగైరా వగైరాలని తెగ అభినయిస్తూ, ‘‘ఒ క్ఖటి ... ఒక్కటంటే ఒఖ్ఖటి ... ’’ అని ఇదై పోయే వాడు. ( ఏదయి పోయే వాడని మీరు నన్ను నిలదీస్తే చెప్పడం కష్టం. )

అలాంటిది, కొంత పరిచయం పెరిగాక ( అంటే వాడే మాతో పెంచు కున్నాక, ) ‘‘ చెల్లాయ్ ! ఇవాళ టిఫి నేమిటో ? ’’ అని ఆరా తీసే స్థాయికి ఎదిగాడు. తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగి పోయి, తనకి ఏ టిఫిను కావాలో అడిగి ( హొటల్లో మాదిరి ) ఆర్డరు వేసి చేయించుకునే స్థాయికి చేరి సోయేడు.

నిజం చెప్పొద్దూ ?! మా తింగరి బుచ్చి గాడు మా ఇంట్లో ఉన్నప్పుడు నాకు, నేను వేరే ఎవరో పరాయి కొంపలో ఉన్నట్టుగా ఉంటుంది !

అంత చనువు సంపాదించేసాడు మాయింట్లో.

వాడి వాలకం నచ్చక మాఆవిడకు నచ్చ చెప్పబోతే, నా మాట వినడం మానేసింది. అందుకు వాడు వేసిన మంత్రం ఏమిటంటే, ‘మా చెల్లాయి చేతి వంట అమృతమే ! ’ అంటూ ఆమెను ఉబ్బేయడమే. అన్నీ అబద్ధాలే ... ఆకాడికి అమృతం వాడేదో రుచి చూసినట్టు అని లాజిక్కు వినిపించాను. ‘‘ ఊరుకోండి ! మీకంతా కుళ్ళు ... మీరు తప్ప నా చేతి వంట ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మెచ్చు కుంటారు ... మీరే ఎంపుళ్ళు పెడతారు ’’ అని మూతి మూడు వంకర్లుతిప్పింది. నాలో పురుషాహంకారం విజృంభించి, ‘‘ ఆకాడికి నీ చేతి వంటని లోకం లోని ప్రజానీకమంతా తిన్నట్టు ! బిల్ గేట్స్ తిన్నాడా ? బిల్ క్లింటన్ తిన్నాడా ?

అక్కినేని నాగేశ్వర రావు తిన్నాడా ? అమితాబ్ బచ్చన్ రుచి చూసాడా ?... ఘంటసాల తిన్నాడా ? పెంటగాన్ ప్రజలు చవి చూసేరా !... చైనా వాడు తిన్నాడా ? నానీ పాట్కర్ తిన్నాడా ! ...’’ అంటూ వర్లించేను. ఆ దెబ్బకి మా ఆవిడ వారం రోజులపాటు నాతో మాట్లాడడం మానీసింది. అప్పటి నుండి మా తింగరి బుచ్చి గాడొస్తే, వొళ్ళు మండి పోతున్నా సరే, ఓర్చుకుని మౌనంగా ఉండడం మొదలెట్టాను. కన్యా శుల్కంలో చెప్పినట్టు పేషెన్ప్ ఉంటే కానీ లోకంలో బతకలేం ! ( పూర్ రిచర్డ్ ఉవాచ. గిరీశం నోటంట)

సరే, అదలా ఉంచితే , తింగరి బుచ్చి గాడి బలహీనతా, బలమూ కూడా ఒక్కటే. ! అది ... వేదికను చూస్తే వెర్రెత్తి పోవడం ! మైకుని చూస్తే మైమరచి పోవడం ! ప్రజా సమూహాన్ని చూస్తే పరవశించి పోవడం !

ఎవరెంత వెనక్కి లాగినా కించ పడకుండా అనర్గళంగా ఉపన్యాసం దంచడం ...

చాలా సార్లు వాడిని జనాలు బలవంతంగా వాడి చేతి లోని మైకుని లాక్కుని, వేదికి మీద నుండి లాగి పడేసారు. దాని కతడు ఏమాత్రమూ అవమాన పడి నట్టు లేదు. పైగా, ‘ఫలించే వృక్షానికే రాళ్ళ దెబ్బ లన్నట్టు ’ అనే ఉదాత్త మయిన ఉపమానంతోనూ. ‘ మొరిగే కుక్కకే కాలి దెబ్బ లన్నట్టూ ’ అనే నీచోపమానంతోనూ సమర్ధించు కునేవాడు.

‘‘ నువ్వు గిరీశానికి తక్కువా, గణపతికి ఎక్కువా నయ్యా ’ అన్నాను ఓసారి నేరక పోయి. దాని కతడు సంతోషించేడు. గిరీశం వంటి మహాను భావుడి సంగతి ప్రక్కన పెడితే గణపతితో సమానం చేసి మన్నించడం నాకు చాలా సంతోషంగా ఉంది కథా మంజరీ !’’ అని ఆనందాశ్రువులు రాల్చేడు. ముద్దొచ్చి నప్పుడల్లా వాడు నన్నలాగే సంబోధిస్తాడు. అప్పటికి గానీ నేనెంత తప్పు చేసానో నాకు స్ఫురించ లేదు. సాహితీ ప్రియుల మనోభావాలు ఎంతగా దెబ్బ తింటాయో కదా ! అని మనసు విలవిల లాడి పోయింది. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా అన్నట్టు ‘‘ అంతే కాదు ... నువ్వు జంఘాల శాస్త్రికి తక్కువా, జన్ని వలస కన్నయ్యకి ఎక్కువానోయీ !’’ అనేసాను. ఈ సారి కూడా వాడు అమందానంద కందళిత హృదయారవిందు డయ్యేడు ....‘‘‘

‘‘ఎంత మాట !

జంఘాల శాస్త్రి గారితోనా పోలిక ! .. అపరాధం ! కానీ, ఆ జన్ని వలస కన్నయ్యగా రెవరోయీ ’’ అన్నాడు తన్మయంగా ... వీడికి వాడి గురించి తెలియక పోవడం నా అదృష్టం.

( వాడో పిచ్చోడు . తనలో తనే ఎప్పుడూ ఏదో వదరుతూ తిరుగుతూ ఉంటాడనే సత్యం నేను తింగరి బుచ్చికి చెప్ప దల్చుకోలేదు. )

అయిందా ?
అలాంటి తింగరి బుచ్చి అనే శాల్తీ నా ప్రారబ్ధం కొద్దీ ఈ ఉదయం మా ఇంటికి ఊడి పడి ... ‘‘ బావా ! ఎలాగయినా నువ్వో అసంపూర్ణ రచన ఒకటి వేగిరం రాసి పడెయ్యాలి !’’ అని భీష్మించుకు కూర్చున్నాడు. నేను అవాక్కయ్యాను. ( కొందరు కొన్ని విపత్కర పరిస్థితులందు ఇట్లు అవాక్కగు చుందురు కదా )

‘‘ అసంపూర్ణ రచనలంటూ ఎవరూ చెయ్యరోయి ! వివిధ కారణాల చేత వారి రచనలలో ఒకటో రెండో అలా అసంపూర్ణంగా మిగిలి పోతూ ఉంటాయంతే ...’’ అని ఙ్ఞాన బోధ చేయ బోయాను.

వాడు నవ్వి, ‘‘ నువ్వెంత అమాయకుడివి బావా ! అవి నిజంగా అసంపూర్ణ రచనలనుకుంటున్నావా ? కాదు ... కాదు ... కమ్మన్నా కాదు ! కొందరు ప్రముఖ రచయితలు మొదట్లో ఎడా పెడా రచనలు చేసి పారేసి, పేరు ప్రఖ్యాతులు సంపాదించీసుకుని, వాటిని కలకాలం పదిలంగా నిలబెట్టు కోవడం కోసం ఓ అసమగ్ర రచన రాసి పారేసి, లోకం మీద పడేస్తారు. కావాలనే ఆ రచనను అసంపూర్ణంగా రచిస్తారు. ఆ లోగుట్టు తెలీక మనం వెర్రి వెంగళప్పల్లాగా, ఫలానా ప్రముఖ రచయిత గారి అసంపూర్ణ రచన యిదీ ! అంటూ లొట్ట లేసుకుంటూ పదే పదే చదువుతాం! తెలుసా !అసలు కంటే కొసరు ముద్దనీ ... ఈ అసంపూర్ణ రచనలే వారు ముందు సంపాయించుకున్న కీర్తి ప్రతిష్ఠలను కలకాలం నిలబెడతాయ్ ఆ రహస్యం తెలియక నీబోటి వాళ్ళు ఆహా, ఓహో ! అంటూ వాటిని చదువుకుంటూ ఊఁ ... ఇదై పోతూ ఉంటారు ! ’’ అని తేల్చేసాడు.

‘‘ గోపీ చంద్ యమపాశం, రావి శాస్త్రి రత్తాలూ రాంబాబూ. అంతెందుకూ, మన అలమండ గాంధీ బాబు, అదే మన పతంజలి రాజుల లోగిళ్ళూ అలా రాసిన అసంపూర్ణ రచనలే ! కాక పోతే వాళ్ళు వాటిని పూర్తి చెయ్ లేకనా ! ’’ అని తీర్మానించీసేడు.

నా నోట్లో తడారి పోయింది. నిలువు గుడ్లేసుకుని ఉండి పోయేను.

ఈ తింగరోడి మాటలకి బదులు చెప్పే సాహసం చెయ్య లేను కదా !



’‘‘ అంతెందుకూ, నీకో పరమ రహస్యం యెబుతాను విను ! అసలు ఆనాడు నన్నయ్యగారూ. పోతన గారూ కూడా ఈ ట్రిక్కు ఉపయోగించే అసంపూర్ణ రచనలు చేసి వదిలారు తెలుసా ? ’’

ఈ వదరుబోతు మాటలకి నా జవజీవాలూ కృశించి పోయేలా ఉన్నాయి.

నా పరిస్థితిని పట్టించు కోకుండా తింగరి బుచ్చి తన ఉపన్యాసం కొనసాగించేడు.

ఆ విధంబెట్టి దనిన ...

‘‘ నన్నయ్య గారు ఆంధ్ర శబ్ద చింతా మణితోనే అఖండ మయిన కీర్తి ప్రతిష్ఠలను మూట కట్టుకుని కూడా దానిని పదిలంగా నిలుపు కోవడం కోసం భారతం అనే అసంపూర్ణ రచన చేసాడు. రెండో, రెండున్నర పర్వాలో రాసి ఊరు కున్నాడు. అలాగే పోతన గారు కూడా ముందుగా రాసిన భోగినీ దండకంతోనే కీర్తి కాంతను స్వంతం చేసుకుని దానిని నిలుపు కోవడం కోసం భాగవతం అనే అసంపూర్ణ రచన చేసాడు ! అయితే, వారి రచనలకు మూల రచనలంటూ ఉండబట్టి ఆతర్వాత భారతాన్ని తిక్కన, ఎర్రనలూ. భాగవతాన్ని పోతన గారి కుమార రత్నమూ, శిష్య రత్నమూ పూర్తి చేసి పారేసారు ! ఆ విధంగా అసపూర్ణ రచనలుగా ఉంచేద్దామనుకున్న వారి ఆశలు కల్ల లయ్యాయి, ఆ విషయం బతికుండగా వారికి తెలియ దనుకో ... గతించేక తెలిసే అవకాశం ఎలానూ లేదు ! ...

అసంపూర్ణ రచనల వల్లనే కిర్తి ప్రతిష్ఠలు చిరకాలం ఎలా నిబెడతాయని నీ సందేహం. అవునా ? !

చెబుతా విను ! ఓ చిన్న ఉదాహరణ చెబుతాను ... విను ...

’’ అని గుక్క తీసు కోడానికి కాస్సేపు ఆగేడు.

ఆసరికి చేతిలో అట్లకాడతో సహా మా ఆవిడ బిగ్గరగా సాగుతున్న వాడి ఉసన్యాస ధోరణికి ముగ్ధురాలై యాంత్రికంగా నడుచుకుంటూ అక్కడకి వచ్చి నిలుచుంది.

వాడు తిరిగి తింగర్యోపన్యాసం మొదలెట్టాడు :

‘‘ నువ్వంతకు ముందెన్నడూ చూడని ఓ ఊరికి వెళ్ళా వనుకో ... అక్కడ అంద మయిన ఓ పదో ఇరవయ్యో ఇళ్ళ వరస కనిపించి. సంతోష పడతావు. ఆ భవన నిర్మాణ కౌశలాన్ని మెచ్చు కుంటావు. సరే వాటి మధ్య ఖర్మ కాలి ఓ అసంపూర్ణ కట్టడం కనిపించిందనుకో. నివ్వెర పోతావు. అయ్యో అనుకుంటావు. సరే, మళ్ళీ ఆఊరెళ్ళే పని నీకు పడక పోయినా ... తర్వాతి రోజులలో ఎప్పటికీ నీకా ఊరు గుర్తుకు వచ్చి నప్పుడల్లా ముందుగా ఆ అసంపూర్ణ కట్టడమే మదిలో మెదులుతూ ఉంటుంది. ఇందులో గొప్ప సైకాలజీ ఉంది. దానికి జర్మన్ లోనో, లాటిన్ లోనో, అధవా ఇంగ్లీషులోనో బారెడు పేరొకటి ఉండే ఉంటుంది. మనకికంకా తెలీదనుకో ! ఙ్ఞానం అసంపూర్ణంగా ఉండడం కూడా మనకి ఓ చక్కని అలంకారమే అనుకో ! ...

అసంపూర్ణ రచనలు చేసి లోకం మీద వదిలేసిన మహా రచయితలంతా ఈ సైకలాజికల్ పాయింట్ మాబాగా పట్టు కొన్నారు.

అందుచేతనే, గొప్ప వాళ్ళంతా అధమ పక్షం ఒకటయినా అసంపూర్ణ రచన చేస్తున్నారు. చెయ్యాలి కూడా. మరంచేత, నువ్వూ వెంఠనే ఓ అసంపూర్ణ రచన రాయాలి బావా ! ’’ అని ముగించాడు. ఆ వాగ్ధోరణికి మా ఆవిడ పరవశించి పోయి చప్పట్టు కొట్టింది. దాంతో రెచ్చి పోయి తింగరి బుచ్చి మరి కొంత సేపు  ఇలా ప్రసంగించాడు :

‘‘ ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి రోజూ రుచి కరమైన వంటలు చేసి పెడుతున్నా, ఖర్మ కాలి ఓ రోజు ఉడకని అన్నమో, ఉడికీ ఉడకని కూరో చేసి, ఆ అసంపూర్ణ వంటకాన్ని మన ముఖాన తగ లేసారనుకో ! అదే మనకు చిరకాలం గుర్తుండి పోతుంది !

అసలా బ్రహ్మ దేవుడు కూడా కొన్ని అసంపూర్ణ రచనలు చెయ్య బట్టే, లోకంలో అర్ధాంతర చావులూ ... అల్పాయుష్క మరణాలూ సంభవిస్తున్నాయి. అందరికీ నూరేళ్ళే నుదుటన రచిస్తే, ఇక ఆ వెర్రి బ్రహ్మని తలుచు కునే దెవరు చెప్పు ? ...’’ అని ముగించాడు.
అప్పటికి నా ప్రాణాలు కడతేర్చుకు పోతున్నాయి.

సిగపాయ తీసి తందును కదా ! అనిపించింది కానీ మనకంత ధైర్యమేదీ ?!

అదీ కాక మా అమాయకపు శ్రీమతి వాళ్ళ అన్న గారి దివ్యమైన సలహాకి పొంగి పోయి : ‘‘ అవునండీ ... మీరు కూడా ఓ అసంపూర్ణ రచన చేద్దురూ ! ’’ అని ముందు గోముగానూ , తర్వాత శాసిస్తూనూ నిలదీసేప్రమాదం ఎలానూ పొంచి ఉంది. హతోస్మి !
ఇంతలో ... ... మా ఆవిడకు తటాలున  ఏదో గుర్తుకొచ్చి. కెవ్వున అరచినంత పని చేసి చేతిలో అట్లకాడతో వంటింట్లోకి పరిగెత్తింది.

వెనుక మేమూ గాభరాగా పరిగెత్తాం.
అక్కడ ... ... పెనం మీద ఆవిడ రచించిన ఓ అసంపూర్ణ రచన --- మాడి పోయిన అట్టు రూపంలో పొగలు కక్కుతోంది. ! 



తింగరి ఉపన్యాసమ్  ప్రస్తుతానికి సమాప్తమ్.

ఇట్లు విధేయుడు,

ఖర్మకాలిన కథామంజరి బ్లాగరు, మరియు తింగరి బుచ్చి గాడి బాధితుడు .






























































19, ఏప్రిల్ 2013, శుక్రవారం

జానెడు మీసం ... బారెడు బ్లాగు టపా !





‘ మీసము పస మగ మూతికి ’ అని చెప్పారు పెద్దలు, మగాడికి మీసమే అందం, అది పౌరుష చిహ్నం కూడానూ. . మీసాలూ, గడ్డాలూ ఒక వర్గానికి చెందినవే. కాస్త రూప భేదం కానీ, వేరు కాదు, అయితే గడ్డాలు శాంతికీ, వైరాగ్యానికీ, సాత్విక గుణానికీ ప్రతీకలుగా కనిపిస్తాయి. మీసాలు లేని రాజులనూ, వాటితో పాటూ గడ్డాలూ లేని ఋషులనూ ఊహించు కోలేం ! గడ్డం సాత్విక గుణ ప్రతీక అయితే, మీసం తామస గుణ ప్రతీకగానూ చెప్పు కోవచ్చును, హీరోలకి అందమైన మీస కట్టు ఉంటే, విలన్లకి కోర మీసాలు ఉండడం మనకి తెలిసినదే.
మీసాలలో చాలా రకాలు ఉన్నాయి.



 వెనుకటి రోజులలో ఫ్రెంచ్ కట్ మీసం అంటే గొప్ప క్రేజ్ ఉండేది. ఉత్తరాది సినిమా హీరోలకి మీసాలుండవు. ఎంచేతో ? ఇక మీసాలలో కోర మీసం, గుబురు మీసం, గండు మీసం, కత్తి మీసం, ... లాంటివి . చైనా వాడి మీసం కిందకి వేలాడుతూ భలే ఉంటుంది !

మీసాలు మెలేయడం మగ మహారాజల లక్షణం. దానితో పాటూ తొడ చరచడం కూడానూ. ఒక్కో సారి మీసం మెలేసి, జబ్బలు చరచు కోవడం కూడా ఉంటుంది. మీసాలు మెలేయడాన్నీ, తొడలు చరచు కోవడాన్నీ ఒక కళగా అభివృద్ధి పరచిన వాళ్ళూ ఉన్నారు. ఇంకా వివరాలు కావాలంటే బాలయ్య బాబుని సంప్రదించండి.

మన తరం రాజకీయ నాయకుల్లో గుబురు మీసాలున్న రాజకీయ వేత్త ఎవరూ అనడిగితే తడుము కోకుండా అంతా ఒకే పేరు చెబుతారు.బుర్ర మీసముల వాడు, చిరు నవ్వుల రేడు మన కనుమూరి బాపిరాజు గారు. !
ఇక ఈ మీసాల ప్రస్తావన వచ్చిన సందర్భాలను గురించి చూదాం !ముచ్చట పడి హిమాలయాలకు వెళ్ళిన ప్రవరుడు దారి తప్పాడు. వరూధుని చూసి మరలు కొంది. తన పొందు స్వీకరించ మని పరి సరి విథాల అడిగింది.

కొత్త కొత్త ధర్మపన్నాలు వల్లించింది. అల్లసాని పెద్దన మను చరిత్రలో – కానీ,
ప్రవరుడు కాదు పొమ్మన్నాడు. ఇలాంటి పాండిత్యం నీకు తప్ప మరెవ్వరికీ ఎక్కడా చూడ లేదని వెక్కిరించేడు.కామ శాస్త్ర ఉపాధ్యాయురాలి లాగా చెబుతున్నావు. ఫో! అని కసిరాడు. ఇలాంటి తుచ్ఛ మైన సుఖాల గురించి నాకు చెప్పకు ! ఇవన్నీ మీసాల మీద తేనియలు అంటూ చీదరించు కున్నాడు. ‘‘ చెప్పకు మిట్టి తుచ్ఛ సుఖముల్ మీసాల పై తేనియల్ !’’
ఇక శ్రీనాథ కవి నూనూగు మీసాల నూత్న యవ్వనము వేళ శాలివాహన సప్త శతి రాసానని కంఠోక్తిగా చెప్పు కున్నాడు కదా !

అయితే అడిగిన దానం ఇవ్వాలి. లేదా ఎవరి చేత నయినా ఇప్పించాలి. అలా కాని వాడికి మీసం ఎందుకూ ! అని తిట్టి పోసేడు కుంద వరపు కవి చౌడప్ప. చూడండి:

ఇయ్యా యిప్పించ గల
అయ్యలకే కాని మీస మన్యుల కేలా ?
రొయ్యకు లేదా బారెడు !
కయ్యానకు కుంద వరపు కవి చౌడప్పా !

తిరుపతి వేంకట కవులలో తిరుపతి శాస్త్రి గారికి మీసం ఉండేది కాదు కానీ, చెల్లపిళ్ళ వేంకట శాస్త్రి గారు మాత్రం గుబురు మీసాలు పెంచే వారు ! ఆ మీసాల విషయమై పండితులకిది తగునా అని రచ్చ రచ్చ అయిందిట ఓసారి. అప్పుడు తిరుపతి కవులు ఈ పద్యం చెప్పారు. :


దోస మటంచెఱింగియును దుందుడు కొప్పఁగ బెంచి నార మీ
మీసము – ‘‘రెండు భాషలకు మేమె కవీంద్రుల మంచుఁ దెల్పఁగా
దోసము గల్గినన్ గవి వరేణ్యులు మముం గెల్వుఁడు, గెల్తురేని యీ
మీసముఁదీసి మీ పద సమీపములన్ దలలుంచి మ్రొక్కమే !
అదీ. థిషణ అంటే !

రాయని భాస్కరుడి మీద చెప్పిన పద్యాలలో ఈ మీసం గురించి ఒక చోట ...తిట్ల వర్షం కురిపించేడు కవి ! చూడండి:


వగ కల్గి యర్ధి కీయని
మొగ ముండల కేల మొలిచె మూతిని మీసల్
తెగ గొఱుగుడాయె మంగల
రగడొందఁగ కీర్తి కాంత రాయని బాచా !

ఇక, నాటకాల వాళ్ళకి గడ్డాలూ మీసాలూ ఉంటే ఒక్కో సారి కొన్ని చిక్కులు తటస్థ పడుతూ ఉంటాయండీ.

పాత్ర పరంగా వాటిని తీసేయక తీరదు. వెనుకటి రోజులలో స్త్రీ పాత్రలు ధరించే నటు లయితే మాత్రం తప్పకుండా ఆ మీసాలని తీసెయ్యాల్సి వచ్చేది.
మన నటసార్వ భౌమ నందమూరి తారక రామారావు గారు విజయ వాడలో కాలేజీలో చదివే రాజులలో బాల నాగమ్మ నాటకంలో నాగమ్మగా మీసాలు తీయకుండానే నటించేరుట ! దర్శకులు విశ్వనాథ సత్య నారాయణ. మీసాలు తియ్యాలయ్యా అంటే ఠాఠ్ ! శ్రమపడి అందంగా పెంచు కున్న మీసాలు తీసేది లేదని రామారావు పొమ్మన్నారుట. దాంతో మీసాలతోనే నాగమ్మగా నటించారు, అప్పటి నుండీ ‘‘ మీసాల నాగమ్మ ’’ అనే మాట చరిత్రలో నిలిచి పోయింది.

గుబురు మీసాల వల్ల మనం అవతలి వారిని చూసి నవ్వు తున్నామో, వెక్కిరిస్తున్నామో తెలియదు. ఇదో అదనపు ప్రయోజనం !

ఇక మీసాల వల్ల లబ్ధి పొందే వ్యక్తుల భేషజాలు ఎలా ఉంటాయంటే ...
ఇంట్లో పచ్చడి మెతుకులు కతికి, పంచభక్ష్య పరమాన్నాలూ తిన్నట్టుగా, చివరాఖరిలో మీసానికి కొంచెం పెరుగు పిసరు పూసుకుని మీసం దులుపు కుంటూ వీథి లోకి వస్తారు ! వాళ్ళకి అదో తుత్తి !

ఇక, మీకు గుర్తుందా ? వెనుకటి రోజుల్లో తెలుగు సినిమాలలో హీరోలు మీసం, చిరు గడ్డం పెట్టు కుంటే ఇట్టే పోల్చు కోలేని విధంగా మారి పోయే వారు ! ప్రేక్షకులు తప్ప తోటి పాత్రధారు లెవ్వరూ గుర్తు పట్ట లేక పోయే వారు తెలుసా ! ఏమాశ్చర్యము !

పత్రికల్లో ఆడ బొమ్మలకి మీసాలు దిద్దే సరదా ప్రియులూ ఉంటారు. ఈ మనస్త్తత్వానికి మానసిక వైద్య శా స్త్రంలో

నోరు తిరగని పేద్ధ పేరేదో ఉండే ఉంటుంది !

మీసాల పేరుతో ఒక ఊరు కూడా ఉందండోయ్ ! విజయ నగరం జిల్లా గుర్ల మండలంలో మీసాల పేట అనే ఊరు ఉంది !

మన దేవుళ్ళలో ఒక్క యముడికి తప్ప, తక్కిన వారెవ్వరికీ మీసాలు ఉండవు
‘‘శ్రీకృష్ణుడికి మీసా లుండెడివా ?! ’’ అని ఆరుద్రాదులు ఒకప్పుడు రచ్చ బండ నిర్వహించారు !

లేకేం !

మీసాల కృష్ణుడు మన రాష్ట్రం లోనే ఉన్నాడండీ బాబూ !
మెదక్ జిల్లా దుబ్బాక మండలం లో చెల్లా పూర్ రాజ వేణు గోపాలుడు మీసాల కృష్ణుడే !
ఈ మీసాల కృష్ణుడి గురించి ఒక కథ కూడా చెబుతారు.

దొరల కాలంలో దుబ్బాక ప్రాంతాన్ని ఒక దొర తెగ పీడించే వాడుట. ఇలా కాదని గ్రామస్థులు ఊరిలో ఒక దేవాలయం కట్టేరుట. దొర గారికి దైవ భక్తి జాస్తి. కనీసం ఆ దేవుడిని చూసయినా దొర కొంత తగ్గుతాడని ఊరి వారి ఆలోచనట ! గుడి కట్టడానికి దొర కూడా యథోచితంగా తన వంతు విరాళం కూడా ఇచ్చేడుట !

సరే ... గుడి కట్టడం పూర్తయింది. ఇక విగ్రహ ప్రతిష్ఠే తరవాయి. ఎక్కడా దేవుడి విగ్రహాలు దొరక లేదుట. దాంతో ఆఊరి ప్రజలు ప్రక్క ఊరి లో ఉన్న గుడి నుండి వేణు గాపాలుని విగ్రహాన్ని ఎవరికీ తెలియకుండా ఎత్తుకొచ్చి, తమ ఊరి చెఱువులో కొంత కాలం దాచి ఉంచారుట. అందుకే అక్కడ ఇప్పటికీ కృష్ణమ్మ చెఱువు అనే పేరుతో ఓ చెఱువు ఉంది.
సరే కొన్నాళ్ళు గడిచేక తాము ఎత్తుకు వచ్చిన వేణు గోపాలుని విగ్రహానికి మీసాలు పెట్టి, నెమలి పింఛంతో పాటు కిరీటం ఉంచి, విగ్రహ ప్రతిష్ఘ కావించేరుట.
దాంతో విగ్రహం సొంత ఊరి దార్లు ‘‘ ఈ మీసాల కృష్ణుడు మన ఊరి వాడు కాదు ! ’’ అనుకొని వెళ్ళి పోయేరుట !

ఇక, మీసాల గురించిన సామెతలూ, జాతీయాలూ కొన్ని చూదాం :
1.మీసం మూరెడు ... రోషం బారెడు
2.మీసాలకు సంపెంగ నూనె
3.మీసం పస మగ మూతికి
4.మీసాల పసే గాని, కోస నా బట్ట !
5.మీసాలు పడదిరిగి ఉంటే, బుగ్గలు బటువుగా ఉంటాయా ?
6 మీసాలెందుకు రాలేదురా ! అంటే, మేనత్త చీలిక అనీ. గడ్డం వచ్చిందేమిరా అంటే మేన మామ పోలిక అన్నాట్ట
7. పులి మీసాలు పట్టుకొని స్వారీ చేయడం మంచిది కాదు

8.తీస్తే పోతుంది . తెల్లారితే వస్తుంది ! ఏమిటది ! పొడుపు కథ : జవాబు : మీసం !

మీసాల మీద శ్రీశ్రీ ఓ సినిమా కోసం రాసిన పద్యం చూడండి: ఇది మీసం మీద సీసం !

మృగరాజు జూలునే తెగనాడ జాలు నీ
ఘన మీసము పసందు కనుల విందు
గండు చీమ కారు మబ్బుల బారు సేరునేలెడి తీరు
కోర మీసము పొందు కోరుకొందు
ల దండు కదలాడినటులుండు
నీ మీసము తెరంగు నీలరంగు
మెలిపెట్టి నిలబెట్టు మీసాల రోసాలు
గగన మండలముపై కాలు దువ్వు

తే. ఎవరు మోయుచున్నారు ఈ అవని భార-
మాదిశేషుడా, కూర్మమా? కాదు, కాదు
అష్టదిగ్గజ కూటమా ? అదియు కాదు
మామ మీసాలె భువికి శ్రీరామ రక్ష

తిక్కన గారి మహా భారతంలో ధర్మరాజుని వర్ణిస్తూ ద్రౌపది చెప్పిన ఎవ్వని వాకిట అనే పద్యానికి పేరడీగా తెలుగు లెస్స అనే బ్లాగులో ఈ సరదా పద్యం కూడా మరో సారి చక్కగా చదువు కోండి !

సీ” ఎవ్వాని మీసము ఏపుగా పెరుగునో
ఊడలా మూతికి సొగసు కూర్ప
ఎవ్వాని మీసము ఎదుగునో రొయ్యలా
బారుగా పౌరుషం పరిఢ విల్ల
ఎవ్వాని మీసము మేఘ సంకాశమై
కన్పట్టు చూపరల్ భయము నంద
ఎవ్వాని మీసము నిమ్మలకాధార
మైభువి ని మిగుల అలరు చుండు

తే.గీ అట్టి సొగసైన గుబురైన నల్లనైన
మామ మీసాలు అవనికి వాసములుగ
అలరు చుండ జనులు భయమంద నేల
మామ మీసాలు మీకుండ అండ దండ
సరే, చివరిగా ... పులి, పిల్లి వంటి జంతువులకి మాత్రమే కాదు, కొన్ని పక్షులకు కూడా మీసాలుంటాయి ! చిలీ లో ఇలాంటి మీసాల పక్షులు కనిపిస్తూ ఉంటాయిట ! ( వీటి ఫొటోలు అందించిన బ్లాగరుకి ( ? క్షమించాలి. పేరు గుర్తు లేదు) ధన్యవాదాలు.










ఇప్పటికి ఈ మీసాల పురాణానికి స్వస్తి.



















































































































































































































































































































































































































































































































































































































10, ఏప్రిల్ 2013, బుధవారం

సూది పురాణమ్ ....





సూదే కదా అనుకుంటామా ? చిన్న సూదికి పెద్ద కథే ఉంది.
అవసర పడి వెతుక్కుంటామా ... ఎక్కడుందో కన బడదు. ఒక వేళ సూది కనబడితే దారం కనిపించదు. రెండూ దొరికి కుడదామని కూచుంటే, సూదిలోకి దారం కళ్ళ జోడు లేనిదే ఎక్కించ లేం !. అదెక్కడ పెట్టామో గుర్తుకు రాదు. దాంతో విసుగొచ్చి సూదీ దారాలని పక్కన పడేస్తాం. తర్వాత కళ్ళ జోడు జాడ కనిపించి, కొంచెం తీరిక దొరికింది కదా అని ఏరాత్రి పూటో కుట్టడానికి కూచుంటామా ! కరెంట్ ఠక్ న పోతుంది. జీవితంలో ఐరనీ ఇదే. మన దినాలు బావుండక పోతే అన్నీ ఇలాగే జరుగుతాయి ! ... సరే, ఈ సోది కాస్సేపు ఆపి, సూది కథలోకి వద్దాం.

సూచి అనే దానికి రూపాంతరమే సూది. దీనికి మరి కొన్ని పర్యాయ పదాలూ ఉన్నాయండోయ్. సేవని,సూచకము, సూచి, సూచిక,సూచిని, సేవతి ... ఈ పదాలన్నింటికీ సూది అనే అర్ధం ! ఇంత ఆయాసం మనం పడ లేం కానీ మనం సూది అనే పిలుచుకుందాం.సూదుల్లో చాలా రకాలు ఉన్నాయి. గుండు సూది. బొంత సూది, కుట్టు సూది, మందు సూది ...వీటిలో గుండు సూదులది రాచహోదా లెండి. ఇవి ఆఫీసుల్లోనూ అక్కడా చక్కా అందమైన ముఖమల్ ఆసనం అలంకరించిన చోట ఉంటాయి. వాటి దర్జాయే వేరు ! బట్టలూ, పుస్తకాలూ, బొంతలూ కుట్టే సూదులు రకరకాల సైజుల్లో ఉంటాయి. ఇవి కాక మిషను సూదులు వేరు. ఆస్పత్రులలో రోగుల జబ్బలకు పొడిచే మందు సూదులను లోగడ మరుగుతున్న నీళ్ళలో శుభ్రం చేసే వారు. స్టెరిలైజేషనంటారు దానిని. ఇప్పుడా బాధ లేదు. హాయిగా వాడి పారేసే మందు సూదులొచ్చేయి. సుఖమే కాక, ఇవి ఆరోగ్యరీత్యా మంచివి కూడానూ

 ఇక సూదుల పెద్దన్న దబ్బనం. వీటితో గోనె సంచులూ గట్రా కుడతారు.
అసలీ సూదులు మన దేశం లోకి విదేశాల నుండి ముందటి రోజుల్లో దిగుమతి అయ్యేవిట ! తర్వాత తర్వాత మనఁవూ సూదులను తయారు చేయడం మొదలెట్టాం.

గాంధీజీకి రోజూ బోలెడు ఉత్తరాలు వచ్చేవిట. ఓ రోజు గుండు సూది గుది గుచ్చి ఎక్కువ కాగితాల బొత్తి వచ్చిందిట. జాతి పిత ఆ ఉత్తరాన్ని పూర్తిగా ఓపికగా సాంతం చదివేక దానికున్న ఆ గుండు సూదిని తీసి జాగ్రత్త చేసి, ఉత్తరాన్ని చెత్త బుట్టలో వేసారుట ! ప్రక్క నున్న వారెవరో ఆశ్చర్య పడి ఇదేమిటని అడిగితే, ఈ ఉత్తరంలో మనకి పని కొచ్చేది ఈ గుండు సూది ఒక్కటే ! అని బదులిచ్చారుట !
మన మహా భారతంలో వచ్చిన సూది ప్రస్తావన అందరికీ తెలిసినదే కదా ! రారాజు పాండవులకి ఐదూళ్ళు కాదు కదా సూది మొన మోపినంత భూభాగం కూడా ఇవ్వనని చెప్పడం వల్లనే కదా భారత యుద్ధం వచ్చింది !
కుట్టు కోడానికే కాదు, సూది హింస కూడా ఒకటుంది. విలన్లూ, కొందరు రక్షక భటులూ నేరస్థుల గోళ్ళలో సూదులు కుక్కి నిజమో అబద్ధమో రాబట్టే, హింసాత్మక చర్యలకూ సూదులే ఉపయోగ పడడం సూదుల జీవితంలో ఒక మాయని మచ్చలా మిగిలి పోతుంది.

సూదిలోకి దారం అవలీలగా ఎక్కించ గలుగు తున్నామంటే మన కంటి చూపు భేషుగ్గా ఉన్నట్టే ! గుండు సూది నుండి ఇక్కడ సమస్తం దొరుకుతాయండీ అని ఏ షాపు గురించయినా చెప్పుకుంటూ ఉంటే ఆ షాపు ఇవాళ్టి మన మాల్ లాంటి దన్నమాట !

గతాన్నీ వర్తమానాన్నీ సమన్వయ పరుస్తూ కుట్టే సూది లేక పోయిందే ! అని కవి నారాయణ రెడ్డి గారు ఓ కవితలో ఖేద పడ్డారు.
పరమానందయ్య గారి శిష్యుల సూది కథ తెలిసినదే కదా. గురువు గారు ఓ సారి ఓ సూది తెండ్రా అని చెప్పారుట. పొలోమని శిష్యులందరూ బయల్దేరారు. వారికి ఓ చిన్న సూదిని అంతమందీ కలిసి తేవడం ఎలాగో తెలిసింది కాదు. సూది తెమ్మని గురువు గారు అందరికీ కలిసి చెప్పారాయె ! అందు వల్ల బాగా ఆలోచించి, ఆ సూదిని ఓ తాటిమానుకి గుచ్చి మోసుకొచ్చేరుట. తీరా , గురువుల దగ్గరకి వెళ్ళే సరికి తాటి దూలం ఒక్కటే మిగిలింది ! సూది దారిలో ఎక్కడో జారి పడి పోయింది !

సూదికి సంబంధించిన సామెతలు కూడా కొన్ని కనిపిస్తాయి. చూడండి ...

1. సూదికి రెండు మొనలు ఉంటాయా!

2. సూది కుతికె, దెయ్యపాకలి. ( పీక సన్నం, ఆకలెక్కువ లాంటిదన్నమాట)

3. సూది కోసం దూలం మోసినట్టు

4. సూది కోసం వెళితే, పాత రంకులు బయట పడ్డాయిట !

5. సూది గొంతు, బాన కడుపు

6. సూది తప్పితే దారం సూటిగా బెజ్జంలో పడుతుందా ?

7. సూది బెజ్జం చూసి జల్లెడ వెక్కిరించి నట్టు !

8. సూదిలా వచ్చి, గడ్డ పారలా మారినట్టు
9. సూదిని మూట కట్టి నట్టు

10.సూది బెజ్జంలో ఒంటె దూర వచ్చును కానీ, భాగ్య వంతుడు స్వర్గం చేర లేడు ( ఇది బైబిల్ సూక్తి)
11. గడ్డి మేటులో సూదిని వెదికినట్టు ! ( వృథా ప్రయాస అన్నమాట ! )

సూదిలొ దారం ... సందులొ బేరం లాంటి సినిమా పాటలు ఉన్నాయి కానీ, వాటిలో అశ్లీలత ఏమన్నా ఉందా అని బుర్ర గోక్కోవడం దండుగ. ఉండక పోతేనే ఆశ్చర్యం కానీ, ఉంటే అబ్బుర మేముంది ?

అన్యోన్యంగా ఉండే భార్యా భర్తలను చిలకా గోరింకాలా ఉన్నారంటారే కానీ సూదీ దారంలా కలిసి పోయారని అనక పోవడానికి కారణం ఏమిటో ; సూది కుట్టేదీ, దారం చుట్టుకు పోయేదీ కనుకనా ? చూడాలి.

ఇప్పటికీ ఇంకా చిన్న చిన్న వూళ్ళలో సూదులోళ్ళు అని చిల్లర వ్యాపారస్తులు కొందరు రోడ్లమ్మట తిరుగుతూ కనిపిస్తారు. చేతిలో ఓ నిడుపాటి గెడ కర్రకు మీద ఆ చివర అట్ట ముక్కలకు తగిలించి సూదులూ, పిన్నీసులూ, బూరలూ, మొలతాళ్ళూ లాంటివి తెచ్చి అమ్ముతూ ఉంటారు.

ఇక, చివరగా చిన్నప్పుడు మా పెద్దాళ్ళు తరుచుగా చెప్పి కడుపారా నవ్వించిన సూది కథ ఒకటి చెబుతాను ...
అనగనగనగా ... ఒక ఊళ్ళో ఒక అవ్వ నూతి గట్టు మీద కూచుని ( నూతి గట్టు మీద కూచోడ మేఁవిటనకండి. అదంతే కథకి కాళ్ళూ చేతులూ లేవు)
చిరిగిన బొంత కుడుతోందిట. ఇంతలో చెయ్యి జారి సూది నూతిలో బుడుంగున పడి పోయిందిట. కుయ్యో, మొర్రో అంటూ , సూదీ సూదీ బేతాళా ! అంది అవ్వ. దారం నూతిలో పడి పోయింది. దారం దారం బేతాళా ! అంది . బొంత పడి పోయింది. బొంతా బొంతా బేతాళా ! అంది ఈ సారి ఏకంగా అవ్వే నూతిలోకి పడి పోయింది ! ....
ఈ కథ ఇంత వరకూ ఇలా సాగుతూ ఉంటుంది. పిల్లలు ఊఁ ... కొడుతూనే ఉంటారు. ఇక్కడ మొదలవుతుంది అసలు కథ. ప్రశ్నలే ప్రశ్నలు !

ఊఁ.. అంటే అవ్వ నూతిలోంచి బయటి కొస్తుందా ?

ఉహూఁ !

ఉహూఁ అంటే వస్తుందా ?

(తల అడ్డంగా తిప్పే వాళ్ళం )

తల తిప్పితే వస్తుందా ?

(పగలబడి నవ్వుతాం)

వెంటనే మరో ప్రశ్న ! నవ్వితే వస్తుందా

మాట్లాడకుండా ఉంటే వస్తుందా ? కథ బాగుందంటే వస్తుందా ? వస్తుందంటే వస్తుందా ? రాదంటే వస్తుందా ! ...
ఇది అనంతం


( కృతఙ్ఞతలు : శ్రీ లతిక )






























8, ఏప్రిల్ 2013, సోమవారం

ఓ పాలేటయినాదంటే ... (బదవద్గీత పెవచనమ్ )




పెకాసం పార్కు తెల్దూ ?అదేటోలయ్య అలగంతావూ ? మా యిజీనారం మూడు నాంతర్ల కాడ్నించి నిబ్బగ గంట స్తంబం కాడి కెలిపో. ఎల్నావా ... ఉప్పుడు కుడి సేతి కాసి సూడు. అల్లద ... ఆ సివర్ల కనిపిస్తందే,అదే పెకాసం పార్కు !

అవుతేటి ?దానూసు ఇప్పు డెందు కెత్తినాఁవూ ? అంతావా ? మరదే,సెప్పేది కడాకూ ఇనవు ...
ఓ పాలేటయినాదంటే ...
మాం సదూకునే రోజుల్లో మా సిన్నతనాన ఓ ఏడు ఏసంకాలం,అలపొద్దులేళ నానూ, నా సంగడి కాల్లూ కబుర్లు సెప్పుకుంట అందిల కూకున్నాఁవా ? మాం అంటే నానూ,మా పీయ్యీబీ సీరామ్మూరితీ ( ఈన కతలు రాస్తాడు నెండి ) మా రవణ మూరితీ ( ఈడు అరికతలు మా బాగా సెపుతాడు ) మరింకా మా రామ జోగారావూ, మా సోమయాజులూ అన్నమాట . ఈ సివరాకరిద్దరూ ఉప్పుడు బూమ్మీద నేరు. పోనారండి. అత్తల్సు కుంతె కడుపు దేవి పోతాదండి. ఏటి సేత్తాం. అదలా గుంచండి ...
మాం కూకున్న కాడికి దగ్గర్నోనే మరో పది మంది దాకా కూకున్నరు. ఆల్లంతా పల్లెటూరి బైతులు నాగున్నరనుకున్నం. ఆల్ల ముందు నున్నగ నించుని రివట నాగున్న వోడు వొకడు సింకి నెక్చరు ఇచ్చెత్తన్నాడు. ఆడు సెప్పేదంతా సుట్టూ సేరినోల్లు సెవులప్ప గించి ఇంతన్నారు.
ఆడేటి సెపుతున్నాడూ ?బదగద్గీత ! ఆడి మాటలు యిని మాం నవ్వాపు కోనేక పోయేం ! పిక్కిరోల్లం కదా,పొగ రెక్కువుంతాది. ఆల్లని పల్లెటూరి బైతుల నాగా సూసి అయ్యేల ఇరగబడి ఇరగబడి నవ్వీసినాం. మరాల్లకి కోపం రాదా ? మమ్మల్ని కొట్టనాని కొచ్చేరు. కక్కా ముక్కా తినీవోల్లు. ఆల్లతోటి మాఁవేటి సాగ్గలం.? గుంటలం. ఓరినాయనో బేగి పరిగెత్తరా నాయన ! అంటూ అక్కడి నుండి పారి పోయినం. ఎలగయితేనేం గండం గడిసింది పిండం బయట పడింన్నట్టుగ మాకు ఆయేల దరువులు తప్పినయ్యి ! ఇయ్యాల పెందిల నెగిసీ నెగడంతోటే ఇదంతా ఎందుకో గుర్తుకొచ్చినాది. , ఆ సోదంతా బరికీసి నా బ్లాగు టపాలో పడీసినాను. ఏటంతే అనండి ఇందల నీతేటో కడాకు సదవండి మీకే తెలుస్తాది ...

ఇంతకీ బుద్దిగా తలలూపుతూ యింటున్న ఆల్లందరికీ ఆడేటి సెపుతున్నాడూ ? బదవద్గీత సెపుతున్నాడని సెప్ప నేదా ?
అదెలాగుంటే ....
‘‘కురుచ్చేత్ర యుద్దం మొదలయి పోనాది. యుద్దానికి ముందు దాపలో గుర్రఁవూ ఎలపలో గుర్రఁవూ కట్టి కిసన మూరితి బండి మీద అరుజునుడిని ఎక్కించుకుని అక్కడికి ఎల్లినాడు. అరుజునుడు ఎగస్పార్టీ వోల్లని సూసాడు. ఇంకేటుంది ?ఉచ్చ కార్చీసు కున్నాడు ! ‘అక్కడంతా ఆడికి ఎవులు కనిపించినారు ?తాతియ్యలు,బాయ్యలు,దద్దలు,మాయ్యిలు,... అంతా ఆల్లే ! ఓర్నాయనో ! నా సేతుల్తో మనోల్లని సంపనే నంటూ బానం వొగ్గీసి బండి దిగి పోనాడు.

మరప్పుడు కిసన బగవాను మూరితి ఏటన్నాడో ఎరికా ?

‘ ఓరి పల్లకోరా ! పెద్ద పోటు గాడి నాగ ఈల్లందరినీ నువ్వే సంపీస్తావను కుంతున్నావేటి ?!
పుట్టించినోడినీ నానే ! సంపీ వోడినీ నేనే . సేసే వోడినీ,సేయించే వోడినీ నానే. నానంతే ఎవులను కుంతున్నావు ? బగమంతుడిని. విందిరా గాందీనీ విజీనారం రాజు గోరినీ నానే కదా పుట్టించి నోడిని. ఈడినీ ఆడినీ,మన పోలుపిల్లి గవిరయ్య కూతురు లచ్చుమునీ,మనూరు బుగత బాబునీ,ఆడి కొడుకునీ,అందరినీ నానే కదా పుట్టించి నాను. నాను నోకంలో ఎప్పుడయితే దరమం నాసినఁవై పోతదో అప్పుడు పుడతానన్నమాట ! .......’’ ఇలా సాగి పోనాది ఆడి పెసంగం.
మద్దె మద్దెలో ఆడాడిన బూతు మాటలు తీస్సి సెబుతున్నాను కానీ,సత్తె పెమాణికంగా అయ్యేల ఆడి పెసంగం అచ్చు ఇలాగ్గానే ఉంది.
ఆడి మాటలకు బైతు గాడి మాటలనీ. తాగు ముచ్చోడి కబుర్లనీ మాం పడి పడి నవ్వీసి తన్నులు తినబోయి,తప్పించు కున్నం కానీ, ఇందల ఒక్క అచ్చరం అపద్దం నేదు. మరాడి మాటలు సుట్టూ సేరి నోల్లు ఎలాగ్గ యిన్నారూ ?మన చాగంటి పంతులు గోరు టీ.పీలో సెబుతే మనం ఇంతంన్నాం కామా ! అంత బక్తితో ఇన్నారు. స్రెద్దగా యిన్నారు.
ఇప్పుడు మీరు సెప్పండి. నవ్విన మాం గొప్పోల్లఁవా ?ఆల్ల జీవ బాసలో,ఏ జంకూ గొంకూ నేకండా సాజంగా, అమాయకంగా బూతులు కలిపేస్తూ మాటాడిన ఆడు గొప్పోడా ?ఆడు సెప్పిందంతా గొప్పోడి పెవచనం నాగా స్రెద్దగా,బయ బత్తుల తోటి యింటూ కూకున్న ఆలు గొప్పోల్లా ?ఏటంతారు ?ఆల్లే గొప్పోల్లంతాను.ఆడే గొప్పోడంతాను.

ఆల్లని పల్లెటూరి బైతుల్నాగా సూసి ఎకసెక్కెం ఆడిన మా గుంటకాయల్దే తప్పంతాను. మీరేటంతారు ?


---------------------------------------------------------------------------------------


ఇదంతా కథా మంజరి బ్లాగు టపాగా రాయదలచి నప్పుడు కొంచెం ఆలోచించాను.
వాళ్ళ జీవద్భాషలోనే,ఆ మాండలికం లోనే రాయడం సబవనిపించింది. ప్రయత్నించి చూసేను. అంతే !






26, మార్చి 2013, మంగళవారం

పక్షుల, జంతువుల భాష చాలా వీజీ !!




ఆ మధ్య నేను హిమాలమాలకు వెళ్ళి నప్పుడు (హరిద్వార్ , ఋషీకేశ్ వరకూ మాత్రమే అనుకోండి. ) అక్కడ నాకు ఎదురయిన ఒక మహా ముని వద్ద ( ఆ ముని నన్ను టీ నీళ్ళ కోసం డబ్బులు అడిగిన విషయం ఇక్కడ అప్రస్తుతం అనుకోండి ) పక్షులూ జంతువుల భాష నేర్చు  కున్నాను. ఆ విద్యతోనే యాగంటి కాకుల కథ అనే టపా రాసాను. కావాలంటే దానిని ఇక్కడ చూడండి.

పక్షులూ. జంతువులతో మాట్లాడ గలిగే నా భాషా పటిమను ఉదాహరణ ప్రాయంగా కొంచెం వివరిస్తాను. చూడండి :
నేను : మేకా ! మేకా ! ఏప్రియల్ తరువాత వచ్చే నెల ఏదమ్మా
చెప్పవూ ?
మేక : మే

నేను : ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు మేలు చేసేవే నంటావా ?
కాకి : కావు .. కావు

నేను : పిచ్చుకా ! పిచ్చుకా ! గల గల , వలవల, గడగడ లాంటి జంట పదం మరోటి చెప్పు చూద్దాం !
పిచ్చుక : కిచ కిచ

నేను : ఓ శునక రాజమా ! భ అనే హల్లుకి ఔత్వం ఇస్తే ఏమవుతుంది తెలుసా ?కుక్క :  (ఓస్ !  ఆ పాటి తెలియదనుకున్నావా ?  ... ఇది స్వగతం కానోపు )     భౌ !

నేను : ఓ సన్నగమా ! నీకు తెలిసిన ఓ మాజీ అమెరికా ప్రెసిడెంటు పేరు చెప్పు ?
పాము : బుస్ !

( బుష్ అనే దానికి ఇది వికృతి కావచ్చు ... )

నేను : ఓ పులి రాజా ! ప్రపంచ తెలుగు మహా సభలు ఎట్లు జరిగినవి ?

పులి :  గాండ్రు

( పులి రాజు ఇటీవలే స్పోకెన్ ఇంగ్లీషు తరగతులకు వెళ్తూ ఉండడం చేత కొంచెం  తడబడినట్టుంది. ఎక్కడ కరారావుడు పెట్టాలో తెలియ లేదు పాపం.)

నేను : ధేనువా ! పార్వతికి గల పర్యాయ పదం ఒకటి చెప్ప గలవా ?
ఆవు : అంబ !

నేను : కరిరాజా ! నెయ్యిని హిందీలో  ఏమందురు ?

ఏనుగు : ఘీఁ

నేను : నెమలీ ! నెమలీ ! ఇలాంటి టపాలు రాస్తున్నాడు, ఈ కథా మంజరి గాడికి ఏమయింది ?
నెమలి : క్రాక్ !
.చివరగా ఓ విషయం. నరుడు ద్విపాద జంతువు కనుక అతనితో మాట్లాడితే అందరికీ జంతు భాష వచ్చి
 నట్టే కదా !!
















































































































21, మార్చి 2013, గురువారం

యాగంటి కాకుల కథ .... (సరదాకి ...)


పక్షులు మనకు విపక్షులు కావు. వాటికీ మంచీ చెడూ తెలుసును.  మాట్లాడతాయి కూడానూ. నల దమయంతుల కథలో హంస నలుడితో మాట్లాడడమే కాకుండా నల దమయంతుల మధ్య రాయబారం కూడా నడిపింది కాదూ ?  సీతమ్మ తల్లిని రావణుడు ఎత్తుకు పోతుంటే జటాయువు  వద్దని వారించ లేదూ ? ఆ మూర్ఖుడి చేతిలో చావు దెబ్బ తినీసిందను కోండి ... వెనుకటి కాలంలో పావురాలు కొరియర్ సర్వీసు చేసేవని తెలిసిందే
కదా ? పావురాల వేటతో  పడరాని పాట్లు పడిన సారంగధరుడిని ఓ సారి తలుచుకోండి ...
పక్షుల గురించి చాలా భోగట్టాలు రాయొచ్చు కానీ ప్రస్తుతానికి మన టపా పక్షులలో ఒక్క కాకికి మాత్రమే పరిమితం చేసుకుందాం.
   పక్షులలో కాకికి మాత్రం కొంత చిన్న స్థానం  ఉన్నట్టు తోస్తోంది. ఆబ్దీకాలప్పుడు కాకులను  కొంత మర్యాదగా చూడడం జరిగినా, వాటి పట్ల ఎవరికీ అంత సదభిప్రయం ఉన్నట్టు తోచదు.  కాకులలో మాల కాకి, బొంత కాకి , నీరుకాకి ..ఇలా చాలా రకాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాకులు కోకిల గుడ్లను పొదిగి  పెద్ద చేస్తాయిట.  కనుక కోకిలకు కాకి పెంపుడు అని పేరు ఉంది.  ఉచ్ఛిష్ఠం  తినే కాకి పితరుడెట్టౌనురా అని ఈసడించు కున్న వారూ లేక పో లేదు. కాకమ్మ కబుర్లు , కాకి పిల్ల కాకికి ముద్దు , పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ కాకి మూక,  కాకిలా కలకాలం బతికే కంటే, హంసలా బతకడం మేలు ...కాకీ, కోకిలా రెండూ ఒకేలా ఉన్నప్పటికీ, వసతం కాలం వచ్చే సరికి ఏది కాకో, ఏది కోకిలో తెలిసి పోతుంది , కాకి గోల  ఏకాకి,, లోకులు పలుగాకులు,... ...లాంటి సామెతలు, మాటలు, శ్లోకాలూ  కూడా వాటిని ఈసడంచేవే కదా.

మా చిన్నప్పుడు బడిలో  ఒక అను ప్రాసకి ఉదాహరణగా  కాకీక కాకికి కోక. కేకీక కేకికి కోక. కాకీక కాకికి కాక 
కేకికా ? అని  చెప్పు కునే వాళ్ళం
కాకుల  ప్రవర్తన కూడా అటాగే ఉండడం వల్ల కాబోలు   వాటి  పట్ల మన నిరాదరణకు కారణం కానోపు.
కాకి బంగారానికీ కాకులకీ సంబంధం లేదు. అలాగే చికాకులకీ కాకులకీ సంబంధం అంటగ్గ కూడదు.
కాకితో కబురు చేస్తే రానా ? అనే మాటను బట్టి కాకులు కూడా కొరియర్ సర్వీసు చేస్తాయేమో అను కోవాలి. కాకి అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారని మన వాళ్ళు అను కోవడం కద్దు.

అదలా ఉంచితే కాకుల మీద కలిగిన అపార మయిన సానుభూతితో వాటితో ఇంటర్వ్యూ చేదామనిపించింది. ఇటీవల మేము యాగంటి పుణ్య క్షేత్రానికి వెళ్ళి నప్పుడు అక్కడి కాకులతో కొంత సంభాషించేను.  నేనడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానా లిచ్చేయి. మా సంభాషణ జరిగిన తీరు వివరించే ముందు,  కాస్త యాగంటి గురించి  చెబుతాను. 

ఈ పుణ్య క్షేత్రం కర్నూలు జిల్లా బనగాన పల్లి మండలం లోని ఎర్ర మల కొండల్లో ఉంది. ఉమా మహేశ్వరులు ఏక శిలా రూపంలో స్వయంభువుగా వెలిసిన క్షేత్రం ఇది. అగస్త్యుడు దక్షిణ దేశ యాత్రలు చేస్తూ  వచ్చి, ఇక్కడి అందాలకు పరవశించి పోయి , ఇక్కడ వేంకేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలను కున్నాడుట. తీరా ఆ విగ్రహానికి కుడి కాలి బొటన వేలు విరిగి పోవడంతో విగ్రహ ప్రతిష్ఠకు ఆటంకం కలిగిం.ది. దాంతో దానిని అక్కడే ఒక గుహలో ఉంచి, ముని తపస్సు చేసాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, ముని కోరిక మేరకు అక్కడ  ఏక శిలా రూపంలో వెలిసారుట. అప్పుడు ముని,  వారిని చూసిన ఆనందందలో  యేన్ గంటిన్ ... యేన్ నేను కంటిన్... చూసాను అన్నాడుట. అదే కాల క్రమంలో యాగంటిగా మారిందిట. యాగంటి తప్పకుండా చూడ వలసిన ప్రదేశం. అన్ని అందాలు ఒక్క చోట చూసి పరవశించి పోతాం. . సహజ సిద్ధంగా ఉన్న గుహలు, కోనేరులు చాలా బావుంటాయి ...

ఇంతటి అందమైన చోట, పవిత్రమైన చోట కాకులతో నా సంభాషణా క్రమం బెట్టి దనినిన ...

నేను : ఆకాశాన్నంటిన  ధరలు దిగి వస్తాయనే మాటలు నిజమవుతాయి ?
కాకులు :  కావు ... కావు
నేను : మన రాజకీయాలు బాగు పడతాయనే ఆశలు నెర వేరేవేనా ?
కాకులు : కావు ... కావు
నేను : మన చదువులు  మనకి మంచి నడవడికను నేర్పేవేనా ?
కాకులు : కావు ... కావు
నేను : చలామణీలో ఉన్న నోట్లన్నీ అసలైనవే నంటారా ?
కాకులు : కావు ... కావు
నేను : కార్పొరేటు ఆసు పత్రులలో చిన్న రోగాలకు సైతం చేసే టెస్టు లన్నీ నిజానికి అవసర మైనవే నంటారా ?
కాకులు : కావు... కావు
నేను : తెలుగు సినిమా లన్నీ తెలుగు సినిమాలే నంటారా
కాకులు : కావు ... కావు
నేను : మా చిన్నప్పుడు మొదలైన తెలుగు టి.వి సీరియళ్ళు త్వరలో ముగింపు కొచ్చేవేనా ?
కాకులు : కావు ... కావు

నేను : కథా మంజరి బ్లాగు టపా లన్నీ సీరియస్ గా రాసినవేనా ?
కాకులు : కావు ... కావు

నేను : ఇంతకీ ఈ యాగంటి కాకుల కథలో చెప్పిన వన్నీ నిజాలేనా ?
కాకులు : కావు ... కావు

కాకులు చెప్పింది నిజమే.  ఎందుకంటే అస్సలు యాగంటిలో ఒక్క కాకి కూడా కనిపించదు.
దాని కొక ఐతిహ్యం చెబుతారు. అగస్త్యుడు తపస్సు చేసు కుంటూ ఉంటే, కాకా సురుడనే వాడు  లెక్క లేనన్ని కాకులతో వచ్చి గోల చేసాడుట. దానితో మునికి తపో భంగమయిందిట. అగస్త్యుడు కోపించి ఇక నుండీ యాగంటి పుణ్య క్షేత్రంలో ఒక్క కాకి కూడా ఉండకుండు గాక అని శపించాడుట.

అందు చేత, యాగంటి కాకుల కథ అంటూ నేను రాసిన దంతా ఏదో సరదాకి రాసినదే తప్ప మరోటి కాదు.  ఇందులో ఏవీ నిజాలు కానే కావు ... కావు ... కావు.