హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జులై 2010, గురువారం

కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 5


అఙ్ఞాత వాసం ఒక్క ఏడాదీ విరాట మహా రాజు కొలువువలో గడపడానికి పాండవులు ఒక్కరొక్కరూ చేరు కున్నారు. ఇంతకు ముందు ధర్మ రాజు , భీముడు , అర్జునుడు , నకులుడు విరటుని కొలువు లోనికి ఎలా ప్రవేశించారో చూసాం కదా ? ( ఆ వివరాల కోసం ఆయా పేర్ల వద్ద నొక్కండి)

చివరి వాడు సహ దేవుడు. అతడు విరటుని కొలువులో ప్రవేశించిన విధం చూడండి ...సహ దేవుడు గోపవేషంలో పసుల కాపరిగా విరట రాజు కొలువులో చేరడానికి తంత్రీపాలునిగా ప్రవేశించాడు.

అతని రూపం ఎలా ఉందంటే, బయటకి చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. ఆంతర్యంలో మాత్రం పరాక్రమం తేజస్సు ఉట్టి పడుతున్నాయి. ఆ చంద్రుడే మానవాకారంతో వచ్చాడా ? లేదా, అగ్ని దేవుడే ఈ మానవాకారం దాల్చాడా ? అన్నట్లగా ఉన్నాడు.

ఒక ప్రక్క పశువులను కట్టే పలపుల మోపు, మరో ప్రక్క పెయ్య దూడల త్రాళ్ళు ధరించి పసుల కాపరి వేషంలో ఉన్నాడు. ఆహార్యమూ, అభినయమూ కూడ అలాగే ఉన్నాయి. చేతిలో నునుపైన పసుల కాపరి కర్రనొకదానిని పట్టుకుని ఉన్నాడు. అతడి సుందరాకారం విరట రాజుని ఎంతగానో ఆకర్షించింది. చుట్టూ ఉన్న ప్రజల చూపూ అతడి మీదే . చూపు త్రిప్పుకో లేక పోతున్నారు. తామర రేకుల వంటి ఆ కళ్ళలో చలాకీతనం తొంగి చూస్తోంది. అతడి చూపులో ఏదో సంభ్రమం కనిపిస్తోంది. కొద్దిగా భయపడుతున్నట్టుగా కూడ ఉన్నాడు. తడబడే చూపులతో ప్రజలను చూస్తూ సహదేవుడు మెల్లగా అక్కడకి వచ్చాడు.

వచ్చి, విరాట దేశాధీశునకు వినయంగా నమస్కరించాడు , తర్వాత యిలా అన్నాడు.

సహదేవుడు:

‘‘ రాజా ! నీ ఆలమందను కాపాడడానికి నన్ను అధికారిగా నియమించు. నా పర్యవేక్షణలో పశువులకు ఏ రోగాలూ అంటవు. ఇతరులెవరూ నీ ఆలమందను వశపరచుకో లేరు. వాటికి అలసట అసలు ఉండదు. దాహంతో బాధ పడవు.

రాజా ! నన్ను నీ కొలువులో పసుల కాపరిగా కనుక నియమిస్తే నీ పశువులు ఎప్పుడూ తప్పి పోవడం జరుగదు. క్రూర జంతువుల బారిన పడవు. సమృద్ధిగా పాడి లభిస్తుంది. పాడి తగ్గి పోవడం జరుగదు. తోటి పసుల కాపరులు మెచ్చుకుంటారు. నీవు కూడా మెచ్చుకుంటావు. అంత బాగా ఆలమందను కాపాడుతాను. నన్ను ఏలుకో.’’

విరటుడు:

‘‘ఇవేం మాటలు? నీలో పశుల కాపరితనం మచ్చుకయినా కనబడడం లేదు. రాజసం ఉట్టిపడుతోంది. నీ శరీరం చక్కగా ఉంది. నీలో గాంభీర్యం ఉంది. కాంతివంతమయిన దేహంతో ఒప్పుతున్నావు. బాగా ఆలోచిస్తే నువ్వు సూర్య వంశపువాడివిగా తోస్తున్నది. లేదా, చంద్ర వంశస్థుడివయినా కావచ్చును. అంతే తప్ప కేవల పసుల కాపరివి అనిపించడం లేదు.

నీకిష్టమయిన పదవిలో కుదురుకో. నా రాజ్యాన్ని అంతా చక్కబెట్టు. నయ నీతి పరాక్రమాలు ప్రదర్శించగల సమర్ధత నీకు ఉంది. అయినా కూడా ఇటువంటి అల్పమైన జీవనోపాధిని కోరు కోవడం ఎందుకు చెప్పు ?’’

హదేవుడు: ( రాజుకి మ్రొక్కి)

‘‘ రాజా ! నేను హీనకులజుడని. ముందెప్పుడూ నాగరికపు పనుల తీరు ఎరిగిన వాడను కాను. గతంలో మేము కౌరవులకు సేవకులం. పశు గణాన్ని కాపాడే వాడిని. పశువులను కాపాడడం తప్ప వేరే విధంగా బ్రతకడం నాకు తెలియదు. ఇంతకు ముందు ధర్మ రాజు యొక్క పశుగణాన్ని పాలిస్తూ ఉండే వాడిని. ఆ విధంగా ఆ మహారాజు మన్ననకు పాత్రుడనయ్యాను. నా పేరు తంత్రీ పాలుడు. నా హస్తవాసి మంచిది. అందు చేత దూడలు బాగా ఏపుగా పెరుగుతాయి. అతి తక్కువ కాలం లోనే నీ ఆలమందను రెట్టింపు అయ్యేలా చేస్తాను.ఆబోతు మూత్రం వాసన చూసినా, పైగాలి వీచినా సరే, గొడ్డుటావులకు సైతం చూలు నిలవడం ఖాయం. అలా పశువులను కాపాడుతాను. పశువులకు సాధారణంగా వచ్చే ఉంగిడి, అదురు, త్రిక్క అనే రోగాలు నా పేరు చెప్తే దగ్గరకి రావు. పశువులలో రకాలన్నీ నాకు బాగా తెలుసును. వేరే పనికి నేను తగను. ఈ పనిలో మాత్రం నీ మనసునకు నచ్చే విధంగా నడుచుకుంటాను. నా వలన నీకేమయినా ప్రయోజనం ఉందనుకుంటే మరోమాట లేకుండా నన్ను నీ కొలువులో పశుల కాపరిగా నియమించు’’

విరటుడు:

‘‘ సరే. నీకు అదే మంచిదనిపిస్తే అలాగే. నీకు ఇష్టమయితే వేరే పెద్ద పనులను చేయ వచ్చును. లేదంటే నా గోసంపదను శ్రద్ధతో తగిన విధంగా రక్షించు.’’ అని పలికి సహ దేవుడిని విరాటుడు తన కొలువులో పశుగణాలను సంరక్షించే అధికారిగా నియమించాడు.

ఈ విధంగా ధర్మ రాజు , భీముడు, అర్జునుడు , నకులుడు , సహ దేవుడు వరుసగా విరటుని కొలువులో కంకుభట్టు , వలలుడు , బృహన్నల , దామగ్రంథి , తంత్రీ పాలుడు గా అఙ్ఞాత వాసం ఒక ఏడాది పూర్తి చేసుకునే నిమిత్తం మారు వేషాలతో కుదురుకున్నారు.

అఙ్ఞాత వాస కాలంలో తమలో తమకు వ్యవహార నిమిత్తం రహస్యంగా పిలుచుకోడానికి తగిన విధంగా రహస్యనామధేయాలు పెట్టుకున్నారు. అవి: జయుడు (ధర్మ రాజు) జయంతుడు (భీముడు) , విజయుడు (అర్జునుడు) , జయత్సేనుడు ( నకులుడు) , జయద్బలుడు ( సహ దేవుడు )

ద్రౌపదికి మాత్రం సంకేత నామమంటూ ఏమీ లేదు.

ద్రౌపది సైరంధ్రీ వేషంలో విరటుని దేవేరి సుధేష్ణ ను మెప్పించి ఆమె వద్ద పనికి కుదురుకున్నది. ఆ వివరాలు - ద్రౌపది విరటుని కొలువులోకి ఎలా ప్రవేశించిందో రేపటి హిత వచనమ్ డాట్ కామ్ లో చూదాం ...

స్వస్తి

.

30, జూన్ 2010, బుధవారం

కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 4









అఙ్ఞాతవాసం విరట మహా రాజు కొలువులో పూర్తి చేసుకోడానికి నిశ్చయించుకుని, పాండవులు ఒకరొకరూ అక్కడకి చేరుకుంటున్నారు. ముందు టపాలలో ధర్మ రాజు , భీముడు , అర్జునుడు ఎలా వచ్చి కొలువులో ప్రవేశించారో చూసాం ( వివరాలకు వరుసగా ఆయా పేర్ల వద్ద నొక్కండి)

ఇక, నకులుడు విరటుని కొలువులో ఎలా కుదురు కున్నాడో చూదాం ....నకులుడు అశ్వపాలకడిగా దామగ్రంథి పేరుతో వచ్చాడు.

అతడిని చూస్తూనే అక్కడి ప్రజల నేత్రాలు అప్పుడే సూర్యుడిని చూస్తూ వికసిస్తున్న పద్మాల్లా వికాసవంతాలయ్యాయి. నకులుడు విరటుని కొలువు దగ్గరకి వచ్చాడు. అక్కడున్న గుర్రాలను దీక్షగా పరికిస్తున్నాడు. విరటుడు అది చూసి తన పరివారానికి అతడిని చూపించి ఇలా అన్నాడు:

‘‘ ఇతడు గుర్రాలను పరిశీలించే తీరు చూడండి. ఇతనికి అశ్వ శాస్త్రంలో ఎంతో నైపుణ్యం ఉన్నట్టుగా ఉంది.కదూ? ఇతడు బహు సుందరాకారుడే కాదు, గొప్ప పరాక్రమం కలవాడుగా కూడా కనిపిస్తున్నాడు.

ఇతడి పేరు మీలో ఎవరికయినా తెలుసునా? తెలిస్తే చెప్పండి. తెలియక పోతే దగ్గరకి వెళ్ళి అడిగి తెలుసు కోవాలి. ’’

ఇలా రాజు అనుకుంటూ ఉండగా నకులుడు విరాటుని వద్దకు వచ్చి నమస్కరించి ఇలా అన్నాడు.

నకులుడు:

‘‘ రాజా ! నేను రాజవాహనాలయిన గుర్రాలను చాల నేర్పుగా కనిపెట్టి జాగ్రత్తగా చూసుకుంటాను. నా పేరు దాగ్రంథి. నాకు అశ్వ శాస్త్రం బాగా తెలుసును.

అశ్వాల లక్షణాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. చూడగానే ఆ గుర్రాలు ఎంత కాలం బతుకుతాయో చెప్ప గలను.( వాటి ఆయు:ప్రమాణం కనిపెట్టగలను.) అవి చూలుతో ఉన్నాయో కాదో చెప్ప గలను. ఆకారానక్ని బట్టి వాటి స్వభావాన్ని తెలుసుకో గలను. గుర్రాల మేతలు, పోషణ పద్ధతులు, వాటికి ఏమయినా రోగాలు వస్తే నయం చేసే చికిత్సా పద్ధతులు నాకు తెలుసు. ఆ విద్యలన్నీ కావాలంటే నీ ఎదుట ప్రదర్శించా చూపిస్తాను. ఒక వేళ యుద్ధమే కనుక వస్తే అది నా పని కాదని ఊరుకోను. యుద్దంలో నా బలాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తాను ’’

విరటుడు:

‘‘ నీకు తగిన పదవి యిస్తాను. నా సంపదని కాపాడుదువుగానిలే. నీవు కేవలం అశ్వ రక్షకుడివే కాదు. అలా అనడం నీకు తగదు ’’

నకులుడు:

‘‘రాజా! ఎవరయినా వారికి ఏ పనులు తెలుసునో అవి చేస్తూ జీవించాలి. అంతే కాని చేతకాని సేవలకు ఒప్పుకోవడం న్యాయం కాదు.

ఇంత వరకూ ధర్మ రాజు వద్ద పెరిగాను. అశ్వ శాస్త్రంలో నన్ను అతడు కడు నేర్పరిగా చేశాడు. గుర్రాలకు అధిపతిగా చేసాడు. నన్ను తన తమ్ముళ్ళలో ఒకడిగా ఎంతో ప్రీతిపాత్రంగా చూసుకున్నాడు. అయితే, కపట ద్యూతంలో ఓడిపోయి, ఆ రాజు రాజ్యం మీది విముఖతతో వెళ్ళి పోయాడు. చుట్టాలను వదిలి పెట్టాడు. తనకు తోచిన చోట గడిపాడు. పిమ్మట అఙ్ఞాతం లోకి వెళ్ళి పోయాడు. ఇంక నేను ఎక్కడ పొట్ట పోసుకోవాలా అనుకుంటూ ఇక్కడికి వచ్చేను. నిన్ను చూసాను. నాకు తోచిన విధంగా విషయమంతా నీకు విన్నవించుకున్నాను. నాచేత పని చేయించ దల్చుకుంటే సరి. లదూ, నీకు సందేహంగా ఉంటే చెప్పు, నేను వెళ్ళి పోతాను ’’

విరటుడు:

‘‘అశ్వ రక్షణమే నీకు ఇష్టమయితే మా అశ్వశాల లన్నింటికీ నీవే ప్రధానిగా ఉండు.నేను ఇంత వరకూ నా అశ్వ పాలకులను ఎలా చూసే వాడినో నువ్వూ వారిని అలాగే ప్రీతి చూడు. వారిచేత పనులు చేయించుకో ’’

ఇలా పలికి, విరాట మహా రాజు నకులుడిని గౌరవ పురస్సరంగా తన ఆస్థానంలో

అశ్వ రక్షకునిగా నియమించాడు.

ఇక, పాండవులలో చివరి వాడు సహదేవుడు విరటుని కొలువులో ఎలా ప్రవేశించాడో రేపటి హిత వచనమ్ డాట్ కామ్ లో చూదాం ...

స్వస్తి.

29, జూన్ 2010, మంగళవారం

కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 3.

విరాట మహా రాజు కొలువులో అఙ్ఞాత వాస కాలాన్ని గడపడానికి పాండవవులు ఒక్కొక్కరే వచ్చి చేరుతున్నారు. ముందు టపాలలో ధర్మ రాజు, భీముడు వచ్చిన వైనం చూసాం. ఇప్పుడు పాండవ మధ్యముడు అర్జునుడు విరటుని కొలువువు లోనికి ప్రవేశించిన తీరు చూదామా ....

అర్జునుడు పేడి రూపంలో బృహన్నలగా విరటుని కొలువులో కుదురుకున్నాడు...

అర్జునుడు విరటుని కొలువులో చేరడానికి పేడి రూపంలో వస్తున్నాడు. కాళ్ళ అందం కనిపించని విధంగా చీర కట్టాడు. చేతుల అందం కనబడని విధంగా శంఖ వలయాలు ధరించాడు. శరీర కాంతిని మరుగు పరిచే విధంగా కంచుకాన్ని తొడిగికున్నాడు. మెడ అందం తగ్గేలా హేమ పట్టిక, ముఖ సౌందర్యం తగ్గేలా పసుపు పూత, నుదురు కనిపించకుండా ముంగురులు, పాపటి , చెవి అందం సన్నగిల్లే లాగున పగడాలు అందం రాణించని విధంగా తల కట్టు ఉన్నాయి. మొత్తం మీద అతని ఆహార్యం అతని అందాన్ని కప్పి పుచ్చేలా ఉంది. ఊర్వశి శాపానికి తగినట్టుగా పేడి రూపంతో వచ్చాడు. వేషధారి అయిన విష్ణువు లాగానూ ఉన్నాడు.

అర్జునుడిని ఈ రూపంలో చూసిన విరటుడు తన సమీపస్థులతో యిలా అన్నాడు:

విరటుడు:

‘‘చూడండి ... ఇతని వేషం చూస్తే ఆడ వేషం. నడకలో మాత్రం ఆడ పోలిక కనిపించదు. నిదానంగా చూస్తే రాజసం ఉట్టి పడడం లేదూ ? పెద్దరికం కూడ గోచరిస్తోంది. ఆకారంలో ఏ దోషమూ కనబడడం లేదు. సాముద్రిక లక్షణాలన్నీ ఉన్నాయి. ఇతడు లోకమాన్యుడు కావచ్చును. వినోదం కోసం ఈ రూపం ధరించాడు కాబోలు. నాకలాగే అనిపిస్తోంది. మీరూ ఊహించండి. అవును. తేరిపార చూస్తే అలాగే తోస్తున్నది.’’

అతనిలా అంటూ ఉండగానే అర్జునుడు కొలువులోనికి ప్రవేశించి, విరాట మహా రాజుతో యిలా అన్నాడు:

అర్జునుడు:

‘‘ రాజా ! నేను నిన్ను సేవించడం కోసం వచ్చాను .అంత:పుర కన్యలకు ఆటపాటలు నేర్పుతాను.

నా పేరు బృహన్నల.’’

విరటుడు ( ఆత్మగతం):

ఇతడు ఆజాను బాహువు. విశాలమూ, ఉన్నతమూ అయిన వక్ష స్థలం ఉంది. కళ్ళు పద్మాల లాగా ఉన్నాయి. ముఖం ఎంత నిర్మలంగా ఉందో కదా. చూపు తిప్పుకో లేని విధంగా ఉంది. ఇతని తీరు ఎంతో ఉదాత్తంగా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇతని రూపం మన్మధుడిని మించి పోయేలా ఉంది. ఇంద్రుడిని మీరి పోయేలా ఉంది. ఇంతటి విలాసం, వైభవం కలిగించి, ఇతడిని ఆ బ్రహ్మ నపుంసకుడిగా చేసాడు కదా?

ఇలా అనుకుని అర్జునుడితో ఈవిధంగా అన్నాడు:

‘‘నా వద్ద గొప్ప గొప్ప విండ్లున్నాయి. వాటిలో ఒక గొప్ప వింటిని నీకు ఇవ్వాలని ఉంది. కాంతులీనే బాణాలు, బంగారు పూలతో మెరిసే కవచాలు యిచ్చి, సత్కరించాలని ఉంది. మంచి మంచి వాహనాలూ, అలంకరణ ఆభరణ విశేషాలూ మొదలయిన గౌరవ లాంఛనాలన్నీ యిచ్చి మన్నించాలని ఉంది. గొప్ప ఐశ్వర్యవంతుడిగా చేయాలని ఉంది. రాజుగా చేయాలని ఉంది.

నిన్ను మా మత్స్య దేశానికంతటికీ అధికారిగా చేదామనుకుంటున్నాను. అయితే నువ్వు అంత:పుర కాంతలకు నాట్యం నేర్పుతానంటున్నావు. నాకేమో నిన్ను రాజుగా చేయాలని ఉంది. ఎలా కుదురుతుందో మరి....’’

బృహన్నల:

‘‘ రాజా ! నాలో ఆడుతనం అస్సలు లేదు. మగతనం మాత్రం రూపు తప్పింది. శాపవశాత్తు ఇలా నపుంసకత్వం అనుభవించ వలసి వచ్చింది. కర్మ ఫలాన్ని ఎవరూ తప్పించ లేరు కదా? అందు చేత ...

పేడితనం వలన ఏపనీ చేయ లేక పోతున్నాను. చిన్నప్పటి నుండి దండలాసకం, కుండలి, ప్రెక్కణం, పేరణం వంటివన్నీ తెలుసు. ప్రసిద్ధ వాయిద్యాలన్నింటినీ వాయించ గలను. మంచి శ్రుతితో గీతాలు, గతులు నాకు విదితమే. రసవంతాలయిన చక్కని అభినయాలూ నాకు తెలిసినవే.

మరో విషయం. నా నేర్పు ఎలాంటిదో తెలుసునా? ఏ మాత్రం నేర్పు లేని వాళ్ళ చేతనయినా సాధన చేయించి తీర్చి దిద్దుతాను. నాట్యం నేర్పుతూ అంత:పురాలలో ఉంటాను. అంతే కాదు, నాకు నాట్యకత్తెలకు చేసే అలంకరణ విధులు కూడ తెలుసు.’’

బృహన్నల ఇలా చెప్పాక, విరటుడు తన కుమార్తె ఉత్తరను పిలిపించాడు. ఆమె మహా సొగసుగా సభలోనికి అడుగు పెట్టి, తండ్రికి నమస్కరించి చెంతనే నిలబడింది. రాజు కూడ కుమార్తెను పరి పరి విధాల బుజ్జగించి. ముద్దు చేసాడు. తనివి తీరా ముద్దులు కురిపించాడు తరవాత అర్జునుడితో యిలా అన్నాడు :

విరటుడు:

‘‘ బృహన్నలా ! నీవు చాల నిపుణరాలివి. నా కుమార్తె ఉత్తరను నీకు జాగ్రత్తలు చెప్పి మరీ వేరుగా నీకు అప్పగించ వలసిన పని లేదు. అయినా తండ్రి మనసు కదా? అందు చేత చెప్పకుండా ఉండ లేను. మా ఉత్తరకు ఆటలంటే చాల ఇష్టం. ఎప్పుడూ చెలికత్తెలతో ఆడుతూనే ఉంటుంది. హాయిగా విచ్చల విడిగా తిరుగుతూ ఉంటుంది. విద్య నేర్చు కోవడంలో పాటించ వలసిన నియమాలేవీ తెలియవు. శిక్షణ ఏమాత్రం తెలియదు. ఈమె చిన్న పిల్ల. ఈమెకి ఆటల మీద ఉండే మక్కవను కళల మీదకు మరల్చు.చక్కని నాట్య శిక్షణ యివ్వు. ఈమెకు అన్ని విధాల నువ్వే రక్షకుడివి.’’ అని ఉత్తరను బృహన్నలకి అప్పగించాడు. అంతే కాక కూతురికి గురువుని గౌరవంగా చూడమనీ, అతను ఎలా చెబుతే అలా నడచుకో మనీ చెప్పాడు. తమ హోదాకి తగినట్టుగా ఆహారం, గంధం మొదలయిన సుగంధ ద్రవ్యాలు, పూలు అన్నీ నాట్యాచార్యునికి సమకూర్చమని చెప్పాడు.భక్తి శ్రద్ధలతో గౌరవించమని హెచ్చరించాడు.ఇంకా కుమార్తెతో యిలా అన్నాడు:

‘‘ అమ్మాయీ ! నీకు గురువే చుట్టం. తల్లి. తండ్రి. తోడు. చెలి. బలగం అంతా ఇతడే. నీకు ఏలోటూ రాదు.

ఈ బృహన్నల వద్ద తెలివితేటలతో గౌరవప్రదంగా ప్రవర్తించు‘‘

ఇలా విరటుడు ఉత్తరను బృహన్నలకు అప్పగించి, అతనికి అంత:పుర సంచారంలో ఏ నిషేధమూ లేదని, యిచ్చ వచ్చిన విధంగా తిరగ వచ్చునని అనుమతినిచ్చాడు ఈ విధంగా అర్జునుడు విరటుని కొలువు లోనికి ప్రవేశించాడు.

ఇక, నకులుడు విరటురాజు కొలువులోనికి ఎలా ప్రవేశించాడో రేపటి హిత వచనమ్ డాట్ కామ్ లో చూదాం......

స్వస్తి.

28, జూన్ 2010, సోమవారం

కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 2.

అఙ్ఞాత వాస వత్సరాన్ని గడపడానికి కంకుభట్టుగా విరట రాజు కొలువులో ప్రవేశించిన ధర్మ రాజు గురించి నిన్నటి టపాలో చూసాం. ఇప్పుడు భీముడు ఎలా వచ్చేడో చూదాం ...భీముడు వలలుడు అనే పేరుతో వంటల వాడిగా విరటమహా రాజు కొలువులో కుదురు కోడానికి బయలు దేరాడు.

అతని చేతిలో గరిటె ఉంది. కత్తిని చంకకి తగిలించుకున్నాడు. నల్లని వస్త్రాన్ని దట్టీగా బిగించుకున్నాడు. అందులో చుర కత్తి బిగించి ఉంది. ఎడమ చేతిలో పదనైన శూలాలు ఉన్నాయి. రంగు రంగుల లేడి చర్మాన్ని ఉత్తరీయంగా వేలాడదీసుకుని ఉన్నాడు. చూసే వారికి అతని రూపం దుస్సహంగానూ, ఆశ్చర్యం కొలిపేదిగానూ ఉంది.

భీముడు ధర్మ రాజు వచ్చిన దిక్కులో నుండి కాకుండా మరో దిక్కు నుండి విరటుడున్న తావునకు వచ్చాడు. గజగమనంతో గంభీరంగా వచ్చేడు. అలా వస్తున్న భీముడిని దూరం నుండి చూసాడు విరాట రాజు.అతడి మనసులో భయం చోటు చేసుకుంది. ఆశ్చర్యం కలిగింది. అతడి దీర్ఘ బాహువులు, విశాలమైన వక్ష స్థలం రాజుకి పరవశత్వాన్ని కలిగించాయి. మనసులో ఇలా అనుకున్నాడు:

‘‘ ఇతడు మానవ మాత్రుడు కాడు. మానవ రూపం ధరించి భూమి మీదకి వచ్చిన సూర్యుడో, చంద్రుడో, ఇంద్రుడో అయి ఉంటాడు.ఇతనిదేకులమో?పేరేమిటో? నాసేవకులలో ఎవరయినా ఇతనిని గుర్తు పట్టగలరేమో ?’’

విరటుడు ఇలా అనుకుంటూ ఉన్నంతలోనే, భీముడు అక్కడికి వచ్చి జయనాదంతో వినయంగా విరాట మహా రాజునకు నమస్కరించాడు. తర్వాత ఇలా అన్నాడు :

భీముడు:

‘‘ రాజా ! నేను నాలవ జాతి వాడిని. నీకు సేవ చేయాలని ఇక్కడికి వచ్చాను. నీవు మెచ్చుకునేలా వంటలు చేస్తాను. నన్ను మించిన వాడు వంటలు చేయడంలో మరొకడు లేడు.

నా పేరు వలలుడు. నాకు కూడూ గూడూ యిస్తే చాలును. నువ్వు కోరిన వంటకాలు చేసి పెడతాను. భక్తితో నిన్ను సేవిస్తాను. ’’ ఇలా అనగానే రాజు భీముడితో యిలా పలికాడు:

విరటుడు:

‘‘ నిన్ను చూస్తే నాలవ జాతి వాడిలాగా కనబడడం లేదయ్యా. నీ రూపం చూస్తే మొత్తం భూభారాన్ని వహించ గలిగే వాడివిగా కనిపిస్తున్నావు. నువ్వు వంటలు చేయడం ఏమిటి ! నీకు నేను తగిన వాహనం యిస్తాను. పీఠం సమకూరుస్తాను. వెల్ల గొడుగుని సిద్ధం చేయిస్తాను. నీకు నా కొలువులో చనువుగా మెలుగుతూ తిరగ గలిగే పదవి చేకూరుస్తాను. నా గజ సైన్యానికి నిన్ను అథ్యక్షునిగా చేస్తాను. నా ఏనుగులను పర్యవేక్షిస్తూ ఉండవయ్యా.’’

భీముడు: (తల అడ్డంగా తాటించాడు) ‘‘ రాజా ! నాకవన్నీ ఎందుకయ్యా? రాజులకు ఇంపుగా వంట చేస్తాను. నా వంట ధర్మ రాజుకి చాలా నచ్చేది. నీవు పుణ్యాత్ముడివి. అందు చేత ధర్మ రాజుని ఎలా సేవించు కున్నానో, నిన్నూ లాగే సేవిస్తాను.

నేను బలవంతుడను. అడవి దున్నలతో, ఏనుగులతో, పెద్ద పులులతో, సింహాలతో పోరాడుతాను. బలవంతులూ, మల్లురూ, వారితో పోరాడుతాను. ఒక్క గడియలో వారిని చిత్తు చేసి పారేస్తాను. నీకు వినోదం కలిగిస్తాను. నీకిష్టమైతే నన్ను నీ కొలువులో చేర్చుకో.

ఒక వేళ నీకు నా చేత కొలువు చేయించుకోవడం యిష్టం లేక పోతే నన్ను పొమ్మనటం మంచిది. నాకు నచ్చిన చోటుకి వెళ్తాను. నీ ఉద్దేశం ఏమిటో చెప్పు.’’

విరటుడు: (బ్రతిమాలే ధోరణిలో): అయ్యో, నీరూపాన్ని చూసి, నీ పరాక్రమాన్ని అంచనా వేసుకుని నీకు తగిన విధంగా చెప్పాను తప్ప , మరోటి కాదు.నువ్వు ఇక్కడ ఉండడమే మాకు ఇష్టం. సరే, నీవు వంటశాలకు అధికారిగా ఉండు. వంట వాళ్ళంతా నీ అదుసాఙ్ఞలలో ఉంటారు.’’

ఈ విధంగా పలికి, విరటుడు సంతోషంగా భీముడిని తన కొలువులో వంటల వాడిగా ఏలుకున్నాడు.

ఇక, విరటుని కొలువులోనికి పాండవ మధ్యముడు అర్జునుడు ప్రవేశించిన తీరు రేపటి హిత వచనమ్డాట్ కామ్ లో చూదాం ....

స్వస్తి. .

27, జూన్ 2010, ఆదివారం

కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 1.

పాండవులు అఙ్ఞాత వాస సమయం ఒక ఏడాదీ విరాట మహా రాజు కొలువులో గడపడానికి నిశ్చయించుకున్నాక, రాజ పురోహితుడు ధౌమ్యుడు వారికి వివిధ సేవా ధర్మాలు బోధించాడు. వాటిని గత హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లో ఉంచడం జరిగింది.( ఇక్కడ చూడ వచ్చును)

ఇక పంచ పాండవులు, ద్రౌపది - విరటుని కొలువులో ఎలా కుదురు కున్నారో వరసగా చూదాం. ఆ మహా తేజశ్శాలురు ఎంత ఉదాత్త చరితులో వారు విరటుని కొలువు లో ప్రవేశించడంలోనే తెలుస్తుంది.

( తిక్కన సోమయాజి కృత ఆంధ్ర మహా భారతం విరాట పర్వం ఫ్రథమాశ్వాసం నుండి ...)

ధర్మ రాజు :

ధర్మ రాజు ముందుగా యముని ప్రార్ధించాడు. యముని అనుగ్రహం వలన ధర్మ రాజుకి సన్న్యాసి వేషం వచ్చింది. కాషాయం బట్టలు, కమండలం, వచ్చాయి. ధర్మజుడు అచ్చం సన్న్యాసిలా ఉన్నాడు. తమ్ముళ్ళనూ, ధర్మ పత్ని ద్రౌదిని తను వెళ్ళి విరటుని కొలువులో కుదురు కున్నాక, ఒక్కొక్కరినే రమ్మని చెప్పి, తను బయలు దేరాడు.

పాచికల మూట చంకలో పెట్టుకుని మరీ బయలు దేరాడు. దేవుడి దయ వల్ల ఆ రోజు విరాట రాజు అంత:పురంలో కాకుండా, నగరంలో ఆరుబయట కొలువు తీరి ఉన్నాడు.

విరటుడు దూరం నుండి వస్తున్న ధర్మ రాజుని చూసాడు. ఇలా అనుకున్నాడు : ‘ ఆహా! ఈ వచ్చే వ్యక్తి ఎవరో కానీ, ఎంత తేజస్విగా గోచరిస్తున్నాడు ? చూడడానికి మహా ఆశ్చర్యకరంగా ఉన్నాడు. లోకాలన్నింటినీ పాలించే తేజస్సు ఇతనిలో కనిపిస్తోంది. త్రిమూర్తులతో సమానమయిన రూప సౌందర్యం ఇతనిలో ఉంది. యతీంద్రుడిలా ఉన్నాడు, చూసారా?

ఒంటి మీద రత్నాభరణాలేవీ లేవు. అన్నీ తీసి వేసినట్టుగా కనిపిస్తోంది. ఇరు ప్రక్కలా రాజ లాంఛనాలయిన మదజలధారలకి ఎగబడే తుమ్మెదల ఝంకారాలతో మదపుటేనుగులు కూడా రావడం లేదు.మహా రాజు పుర వీధిని వస్తూ ఉంటే ప్రజలను తప్పు కోండి, తప్పుకోండి అని కేకలేస్తూ అదిలించే వేత్రహస్తలూ వెంట రావడం లేదు. ఎందుకో, మరి ! ముత్యాల కాంతులు వెద జల్లే వెల్ల గొడుగులూ ఎవరూ పట్టడం లేదు. ఇతను తప్పకుండా మహా రాజై ఉంటాడు. కాని, ఎందు చేతనో, యేమో, ఏ విధమయిన రాజ లాంఛనాలూ కనబడడం లేదు. ఇతను రాజు మాత్రమే కాదు, సామంత రాజులనేకుల చేత పాద సేవలందుకునే మహా చక్రవర్తి అయి ఉంటాడు.

మన దగ్గరకి ఎందుకు వస్తున్నాడు చెప్మా ? ఈ మహానుభావుడు నన్ను ఏమి ఆఙ్ఞాపించినా కాదనకుండా చేస్తాను.బంగారాన్ని అడగనీ నూతన వస్త్రాలను అడగనీ, మణిమాణిక్యాలను అడగనీ, ఏదడిగినా ఇతడు అడిగిన దానికంటె అధికంగా ఇస్తాను. ఈ మత్స్య రాజు విభవానికి తాను తగిన వానిగా ఈతడు భావిస్తే, గౌరవ పురస్సరంగా అతడిని గౌరవిస్తాను. నా మంత్రులతో, కుమారులతో, స్నేహితులతో, భటులతో, పుర జనులతో సహా ఇతడిని భక్తితో సేవిస్తాను.... అనుకుంటూ విరటుడు సింహాసనం దిగి, కంకు భట్టుకి ( అఙ్ఞాత వాస సమయంలో ధర్మరాజు పేరు) ఎదురు వెళ్ళాడు. నమస్కరించి, అతని దీవెనలు పొందాడు.మర్యాదలు చేసి, ఉచితాసనం మీద కూర్చో పెట్టాడు. వినయంగా అతనితో యిలా అన్నాడు:

‘‘ మహానుభావా ! మీ జన్మ స్థలం ఏది ? ఏ వంశం వారు? ఇదివరకు ఎక్కడ ఉండే వారు? తమ పేరేమిటి? ఇక్కడకి ఏ కారణం చేత వచ్చేరా శలవియ్యండి.’’

కంకుభట్టు:

‘‘ ఓ విరాట రాజా ! ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళు లోకంలో ఎవరున్నారు చెప్పు? ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతారు. ఎవరయినా, ఎటువంటి వారయినా అంతగా పట్టి పట్టి చూస్తారా ఏమిటి ?

ఈ శరీరంపంచభూతాత్మకం. ఇక ఈ మనసు ఉంది చూడు, దీనికి అసలే నిలకడ లేదు. మరి అలాంటి వీటిని ఆధారం చేసుకుని సత్య నిరూపణ చేయడం ఎవరికి వీలు పడుతుంది చెప్పు?

సరేలే, నేను ద్విజుడిని కురు దేశంలో పుట్టాను. ధర్మ రాజు స్నేహితుడిని. అయితే, ఇప్పుడు మాత్రం సన్న్యాసం స్వీకరించాను. రాజులకు తగిన విధంగా వినోదాలను సమకూరుస్తూ ఉంటాను. ( ఇక్కడ, ద్విజుడు అనే పదం బ్రాహ్మణుడు,క్షత్రియుడు అనే రెండు అర్ధాలనూ బోధిస్తుంది. ఉపనయన సంస్కారం బ్రాహ్మణులకీ , రాజులకీ కూడా ఉంటుంది కదా? అందు చేత ధర్మజుడు అసత్యం పలికినట్టు కాదు.)

రాజా ! నాకు కొంచెం జూదం వచ్చు. కాని , కిట్టని వాళ్ళు మోసంతో నా చేతిలోని డబ్బుని అంతా కపట జూదంలో కాజేసారు.అంతే కాదు అవమానించేరు కూడ. దానితో నాకు విరక్తి కలిగింది. నా స్వస్థలం విడిచి వచ్చేసాను.

రాజా! నాకు నీతి విద్య తెలుసు. ఆ నేర్పు నాకు ఉంది. పైగా, ధర్మ బుద్ధి కల వారితో సఖ్యంగా ఉంటాను. నా పేరు కంకుడు. నేను కంకుభట్టును. నేను నీచమయిన కొలువు చేయను సుమా ! అలాంటి కొలువులో ఉండడం నాకు యిష్టం ఉండదు. రాజులందరిలో నువ్వు సజ్జనుడవని విన్నాను. అందు చేత నీ కొలువులో చేరి, నిన్ను సేవించడానితకి వచ్చాను.

మరో విషయం. నాకొక వ్రతం ఉంది. వ్రత కాలం ఓ ఏడాది. ఆఏడాది వ్రతం నీ దగ్గరే పూర్తి చేసుకుంటాను.అలా చేయనిస్తే నీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటాను.ఈ ఏడాది వ్రత కాలం పూర్తయాక నాకు అపకారం చేసిన వారి జయించడానికి ఉత్సాహంగా వెళ్తాను.’’

విరటుడు:

‘‘ అలాగే చేయండి. ఉన్నతమయిన ఆసనాలు, వాహనాలు, బట్టలు ఇంకా ఇతర భోజనాది మర్యాదలూ నాకు ఎలా జరుగుతూ ఉంటాయో, నీకూ అలాగే జరిగేలా జరిపిస్తాను.నా సేవకులలో ఎవడయినా నీ పట్ల భయ భర్తులు లేకుండా ప్రవర్తించాడంటే ఆ నీచుడిని కఠినంగా శిక్షిస్తాను. వాడు ఎంత ప్రసిద్ధుడవనీ దండన తప్పదు.

అంతే కాదు, నువ్వు ఈ మత్స్య దేశాన్ని పాలించడం నాకు సమ్మతం. నువ్వు దేవంద్రుడితో సమానుడివి. నా తమ్ముళ్ళు, బంధువులు, మంత్రులు, నాబలగం, నేనూ నిన్ను అతి భక్తితో సేవించుకుంటాం. ఆ అవకాశాన్ని నీవు మాకు ఇప్పించ వలసిందిగా కోరుతున్నాను.’’

ఆ మాటలకు ధర్మ రాజు నవ్వి యిలా అన్నాడు:

‘‘రాజా !హోమార్హమయిన పవిత్ర పదార్ధాలనే నేను భోజనంగా స్వీకరిస్తాను. నేల మీదనే పడుకుంటాను. నేను వ్రతాచరణం చేసే వాడిని. నాకు నువ్వు చెబుతున్న మర్యాదలేవీ వద్దు.

విరటుడు:

సరే. అలాగే కానివ్వండి. మీ యిష్ట ప్రకారం ఏలా ఉండాలనుకుంటారో అలాగే ఉండండి. నచ్చినన్ని రోజులు ఉండండి. మీరెలా ప్రవర్తించినా నాకు యిష్టమే. మీ హోదాకి తగినట్టుగా సుఖంగా ఉండండి.

జూదం తెలిసిన వాళ్ళంటే నాకు చాలా యిష్టం అదీ కాక, మీరు పెద్దలు. మీ యిష్టమే నా యిష్టం. అదే నాకు ఆనందం.’’

ఇలా, ధర్మజుడు కంకుభట్టు పేరుతో విరాట రాజు కొలువులో ప్రవేశించాడు.


ఇక, పాండవులలో రెండవ వాడు భీముడు విరటుని కొలువులో ఎలా కుదురు కున్నాడో రేపటి హిత ‘వచనమ్’ డాట్ కామ్ లో చూదాం ...

స్వస్తి.