హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, డిసెంబర్ 2010, శుక్రవారం

పొగడ దండలు !!


లోకంలో పొగడ్తకి లొంగని వాడు లేడు. బయటకి ’అబ్బే, మీరు మరీనూ ...‘ అంటూ సన్నాయి నొక్కులు నొక్కినా, లోపల లోపల ఆ పొగడ్తలకి పొంగి పోతూనే ఉంటాడు. మరి కాస్సేపు పొగిడితే బావుండునని అనుకుంటూ ఉంటాడు.తనని పొగిడే వాడి కోసం ఏం చేయడానికయినా సిద్ధ పడి పోతాడు.పొగడ్తల మహిమ అలాంటిది మరి !

ఆడవాళ్ళయితే ఈ పొగడ్తలకి మరింత తేలికగా వశులై పోతారనే అభిప్రాయం కూడా లోకంలో ఉంది. మగరాయళ్ళు ఆ బలహీనతను బాగా ఉపయోగించు కుంటూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.

పూర్వ కాలంలో రాజులు ఈ పొగడ్తలు చెవిని పడనిదే శయ్య దిగే వారు కాదు. కనులు తెరిచే వారు కాదు. భట్రాజులు రకరకాలుగా పొగుడుతూ ఉంటే కాని వారి అడుగు ముందుకి పడేది కాదు.

రాజకీయ నాయకుల చుట్టూ చేరే అనుచర గణం ఆ నాయకుని ప్రతి మాటకీ చర్యకీ వత్తాసు పలుకుతూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. దానితో సదరు నాయకమ్మన్యుడు భూమికి ఓ అడుగు ఎత్తున విహరిస్తూ ఉంటాడు.

పొగడ దలచిన వాడెప్పుడూ స్వీయ ప్రయోజనం నెర వేరాలనే ఆలోచిస్తాడు. ఎవడిని పొగుడు తున్నాడో వాడిలో అతనికి ఏ లోపాలూ కనిపించవు. అన్నీ సుగుణాలే మిల మిలా మెరిసి పోతూ ఉంటాయి. ధగ ధగా వెలిగి పోతూ ఉంటాయి.

కూరిమి గల దినములలో నేరము లెన్నడూ కనిపించవు కదా ! ఆ కూరిమి విరసమై నప్పుడే కదా, అన్ని దోషాలూ కనిపిస్తూ ఉంటాయి.

అందు వలన ఇవాళ పొగిడిన వాడు రేపు పొగుడుతాడనే గ్యారంటీ లేదు. పొగిడినా, మునపటి స్థాయిలో పొగుడుతాడనే భరోసా లేదు.

నీ ప్రభ వెలుగుతున్నంత కాలం నిన్ను పొగడ్తలతో ముంచెత్తిన వాడే రేపు నిన్ను నిర్ధాక్షిణ్యంగా తిట్టి
పోయడానికి వెనుదీయడు.

నువ్వు ఇంద్రుడివనీ, చంద్రుడివనీ, అదనీ ఇదనీ , తెగ పొగిడిన నోరే తెగనాడుతుంది.

నీ ముందు పాదాక్రాంతుడైన వాడే నీ ముఖాన ఛీత్కరించుకు పోతాడు.

సరే, ఇదంతా కాస్సేపు ప్రక్కన పెడితే.

ఎవరెవరిని పొగడాలో ఎవరిని అస్సలు పొగడ కూడదో కవి గారు ఒక శ్లోకంలో చెబుతున్నారు.

చూడండి:

ప్రత్యక్షే గురవ: స్తుత్యా:, పరోక్షే మిత్రబాంధవా:
కర్మాంతే దాసభృత్యాశ్చ, న కదాచన పుత్రకా:

గురువులను ఎదుట పొగడ వచ్చును.
బంధువులను, మిత్రులను వారి పరోక్షంలో మాత్రమే పొగడాలి.
సేవకులను, వారి విధి నిర్వహణ పూర్తయేక పొగడాలి.
పుత్రులను మాత్రము ఎన్నడూ పొగడ కూడదు సుమా !

గురువులు ఙ్ఞాన ప్రదాతలు. వారి గొప్పతనాన్ని వారి సముఖాన పొగిడితే దోషం కాదు. వారు స్థిత ప్రఙ్ఞులు కనుక మనం పొగిడినంత మాత్రాన పొంగి పోరు. పొగడక పోతే చిన్నబుచ్చు కోరు.

బంధువులు . స్నేహితులు ... వీరి గురించి ఎట్ట ఎదుట పొగడ కూడదు. మరీ అంత భజన పనికి రాదు. మరీ పొగుడుతూ ఉంటే వారి కళ్ళు స్థాన భ్రంశం చెందే అవకాశం కూడా ఉంది.

ఇక, పని వాళ్ళని ఎప్పుడు పొగడాలయ్యా, అంటే, వాళ్ళ పని, వాళ్ళు సక్రమంగా పూర్తి చేసిన తరువాత మాత్రమే పొగడాలి.

మా పనమ్మాయి అంత మంచిది, ఇంత మంచిది, అంత పనిమంతురాలు, ఇంత పనిమంతురాలు అంటూ ఆమె పని చేయక ముందే పొగిడితే ఉబ్బి తబ్బిబ్బయి పోయి మనతో పాటు టీ.వీ చూస్తూ కూర్చుంటుంది, కమ్మని కాఫీ ఇస్తే చప్పరిస్తూ ...

చివరిగా ఎవరిని ఎప్పుడూ పొగడ కూడదో కూడా చెబుతున్నాడు కవి, పుత్రులను అసలు ఎప్పుడూ పొగడనే కూడదట.

అలా పొగడడం వారికి ఆయుక్షీణం అని మన వారి నమ్మకం కూడానూ.

పుత్రులను పొగడరాదని చెప్పడానికి ప్రచారంలో ఉన్న ఓ కథని చూదాం ...

కిరాతార్జునీయమ్ వ్రాసిన భారవి గురించిన ఈ కథ లోకంలో ప్రచారంలో ఉంది.

యువకుడైన భారవి కవిత్వాన్ని, గొప్పతనాన్ని మెచ్చు కుంటూ అందరూ తెగ పొగుడుతూ ఉంటే, భారవి తండ్రి మాత్రం కొడుకు గురించి ఒక్క మెచ్చుకోలు మాటా అన లేదుట.

దానితో భారవికి విపరీతమైన కోపం ముంచుకు వచ్చింది. తండ్రి బుర్ర బ్రద్దల కొట్టేద్దామా అన్నంత ఆగ్రహం కలిగింది.

అదే పని మీద ఓ రాత్రి ఒక పెద్ద బండ రాయిని పట్టుకుని అటక ఎక్కి కూర్చున్నాడు. రాత్రి పూట తండ్రి గారి బుర్ర మీద దానిని గిరాటు వేసి, తనని పొగడని తండ్రి గారి మీద తన కసి తీర్చు కోవాలని అనుకున్నాడు.

సరే, రాత్రయింది. భారవి తల్లిదండ్రులు అక్కడకి చేరి మాట్లాడుకుంటున్నారు. అదను కోసం చూస్తున్న భారవి చెవిని ఆ మాటలు పడుతున్నాయి.

‘‘లోకమంతా మన భారవి కవిత్వాన్ని ఇంతలా మెచ్చు కుంటూ ఉంటే, మీరేమిటండీ వాడి గొప్పతనాన్ని గురించి ఒక్క మాటా అనరు ? వాడిని పొగిడితే మీ నోటి ముత్యాలేమయినా రాలి పోతాయా ? ’’ అని నిష్ఠూరంగా పలికింది తల్లి.

దానికాయన, ‘‘ పిచ్చి ముఖఁవా ! ( పెళ్ళాల వెప్పుడూ పిచ్చి ముఖా లే కదా, హత విధీ !!) భారవి గొప్ప తనం నాకు తెలియదుటే? వాడు ఎంత గొప్ప కవిత్వం వ్రాస్తున్నాడో చూస్తున్నాను. వాడి గొప్ప తనం చూసి ఎంతగా పొంగి పోతున్నానో, నీకేం తెలుసు? అయితే, మన బిడ్డని మనం పొగడ కూడదు. అది వాడికి శ్రేయస్కరం కాదు. అంచేత వాడిని పొగడడం లేదు కానీ , వాడంటే ఇష్టం లేక కాదు సుమీ ! ’’ అన్నాడు.

అంతే !

భారవి కవి ఆగ్రహమంతా మంచులా కరిగి పోయింది. పశ్చాత్తాపంతో ఏడుస్తూ తండ్రి కాళ్ళ మీద పడి తను చేయ దలచిన ఘోరకృత్యం గురించి చెప్పి, తన పాపానికి తగిన శిక్ష విధించ మని కోరాడు.
పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని తండ్రి ఎంత చెప్పినా విన లేదు. శిక్ష విధించి తీరాలని పట్టు పట్టేడు.

‘‘సరే, ఓ యేడాది పాటు మీ అత్తారింట గడిపి రా ! ’’ అని తండ్రి శిక్ష విధించాడు.‘ ఇదేం శిక్ష! ’ అనుకుని భారవి ఎగిరి గంతేసి, భార్యతో పాటు అత్తారింటికి వెళ్ళాడు.

కొన్ని రోజు పాటు అత్త వారింట సకల మర్యాదలూ జరిగేయి. తర్వాత మొదలయ్యేయి, విసుక్కోవడాలూ, సణుక్కోవడాలూ, పిల్లి మీదా కుక్క మీదా పెట్టి వ్యంగ్యాస్ర్తాలూ, సూటీపోటీ మాటలూ ...

కవి గారు ఏం చేస్తారు; భరించక తప్పదు, శిక్షా కాలం యేడాదీ ముగిసే వరకూ.

ఇలా ఉండగా భార్య ఏదో నోము చేయాలనుకుంది. చేతిలో ఎర్ర ఏగానీ లేదు. భార్య కోరిక ఎలా తీర్చడం ?

భారవి అప్పుడు తను వ్రాస్తున్న కిరాతార్జునీయమ్ కావ్యం లోనుండి ఓ శ్లోకం ఉన్న తాటాకు తీసి, ఆమెకి ఇచ్చి, ఎవరిదగ్గరయినా దానిని కుదవ పెట్టి ధనం తెచ్చుకుని నోము చేసుకొమ్మన్నాడు.

ఆమె దానిని ఊర్లో ఓ ధనవంతుడయిన ఒక వ్యాపారి వద్ద కుదవ పెట్టింది. అతడు ఆ శ్లోకం చూసి, భారవి కవిత్వం గొప్ప తనం తెలిసినవాడు కనుక, ఆమెకు చాలా ధనం ఇచ్చి పంపించాడు.

తరువాత, అతడు ఆ తాళ పత్రాన్ని ఒక కత్తి ఒర లో ఉంచి, గూట్లో పెట్టాడు. ఆ పిమ్మట ఆ వణిజుడు వర్తకం కోసం చాలా ఏళ్ళపాటు దూర దేశాలకు వెళ్ళాడు.

అలా దేశాలు పట్టి తిరిగి, చాలా ఏళ్ళకి ఇంటి కొచ్చిన అతనికి తమ పడక గదిలో ఎవరో పరాయి మగాడు ఉండడం గమనించి ఆగ్రహం కలిగింది. మరో ఆలోచన లేకుండా గూట్లో ఉన్న ఓర లోనుండి కత్తిని బయటకి లాగేడు. దానితో పాటు, ఎప్పుడో తాను అందులో పెట్టిన తాళపత్రం కూడా బయట పడింది. దాని సంగతే అతను మరిచి పోయాడు. ఏమిటా, అని చదివాడు.

అందులో భారవి వ్రాసిన ఈ శ్లోకం ఉంది:

సహసా విధధీత నక్రియామ్
అవివేక: పరమాపదాం పదాం
వృణుతేహి విమృశ్య కారిణామ్
గుణ లుబ్ధా: స్వయమేవ సంపద:

వేయి విధాలుగా ఆలోచించి కాని ఏ పనీ చేయ కూడదు. చక్కగా ఆలోచించి పని చేసిన వానికి సంపదలు తమంతట తామే సమ కూడతాయి. అని దీని భావం.

ఈ శ్లోకం చదివేక, అతని కోప తీవ్రత కొంత తగ్గింది. కాస్త చల్ల బడ్డాడు. ఈ లోగా భార్య లేచి, అతని రాకను చూసి అమితానందం చెంది, ఆ పురుషుని తమ బిడ్డగా పరిచయం చేసింది.చాలా ఏళ్ళ క్రింట తాను విదేశ గమనానికి సిద్ధ పడిన రోజులలో భార్య గర్భవతి అన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చిందతని.

తొందర పడి కత్తి వేటుకి చేజేతులా భార్యనీ కొడుకునీ కడ తేర్చే వాడిని కదా అని అతడు పశ్చాత్తాపం చెందాడు. తనని తొందర పాటు నుండీ, ఒక మహా విపత్తు నుండీ కాపాడిన ఆ శ్లోక కర్త భారవికి అతడు భూరి కానుకలిచ్చి సత్కరించేడు.


ఇక, పొగడడంలో ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్దతి అనే రకాలు కూడా ఉన్నాయండోయ్. అంటే, పొగుడు తున్నట్టుగా తిట్టడం, తిడుతున్నట్టుగా పొగడడం. వీటినే మన వాళ్ళు వ్యాజ స్తుతి, వ్యాజ నింద అంటారు. ఆ రకమయిన పద్ధతులను గురించి విపులంగా పొగడ దండలు 2 టపాలో చూదాం.

స్వస్తి.

16, డిసెంబర్ 2010, గురువారం

వెర్రి మొర్రి శంకలు

అనుమానం పెనుభూతం అన్నారు. మనకి రాను రాను అన్నీ అనుమానాస్పదాలుగానే తోచడం ఒక విషాదం. తినే తిండి మంచిదో కాదో అనుమానం. తాగే నీరు మంచిదో కలుషితమైనదో భయం. పీల్చే గాలి స్వచ్ఛమైనదో కాదో అనే శంక పీడిస్తూ ఉంటుంది. చదివే చదువుకి సరైన ఉపాథి లభిస్తుందో లేదో తెలియక సతమత మైపోతూ ఉంటాం. దరి చేరిన వాడు మిత్రుడో, సమయం చూసి వెన్ను పోటు పొడుస్తాడో తెలియదు. వొంటికి ఏ రోజున ఏ రోగం వస్తుందో అని హడలి పోయి ఛస్తూ ఉంటాం. సగం రోగాలకి ఆ భయమే కారణం. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మ కూడదో తెలియదు. నమ్మిన వాడు పాల ముంచుతాడో, నట్టేట ముంచుతాడో అర్ధం కాదు. నమ్మక పోతే ఏం అనర్ధమో తెలియదు. ఆఫీసు కెళ్ళిన భర్త / భార్య అక్కడ ఎలా ప్రవర్తిస్తున్నారో అనే అనుమానంతో వ్యథ చెందే అనుమాన పిశాచులూ ఉంటారు. అలాంటి మూర్ఖుల వల్ల వారికీ మశ్శాంతి ఉండదు. వారిని వెన్నంటి ఉండే వారికీ సుఖం ఉండదు. ఇంటికి వేసిన తాళం గడియ ఊడిపోయే లాగున పది సార్లు లాగి చూస్తే కానీ తాళం సరిగా వేసామో, లేదో, అనే శంక తీరదు. ఊరికెళ్ళి వచ్చే సరికి ఇల్లు దోచుకో బడకుండా భద్రంగా ఉంటుందో లేదో అనే అనుమానంతో మనశ్శాంతి కరువవుతుంది. బజారులో కొన్న పచారీ వస్తువులు కల్తీవో, నాణ్యమైనవో గ్రహించడం కష్టమై పోతోంది. విత్తనాలు కొన్న రైతుకి పాపం, అవి మంచివో, నకిలీ విత్తనాలో తెలీదు. పోనీ, పండిన పంట ఏరకమయిన అతివృష్టి, అనావృష్టి లాంటి వేవీ లేకుండా సరిగా చేతి కందుతుందో లేదో తెలీదు. మన వద్ద ఉన్న వంద, అయిదు వందలు, వెయ్యి నోట్లు మంచివో కాదో తెలియక తికమక పడిపోతూ ఉంటాం.బోలెడు డబ్బు పోసి టిక్కెట్లు కొనుక్కుని వెళ్తే సినిమా బావుంటుందో, చీదేస్తుందో తెలియదు.ఇంట్లో కరెంటు ఎప్పుడు టప్పున ఆరి పోతుందో, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినా ఎంత సేపు ఉంటుందో గ్యారంటీ లేదు. ఇంటాయన ఇంటద్దె ఎప్పుడు పెంచేస్తాడో ఏమో అని బెంగ పడుతూ ఉంటాం. సొంత ఇల్లయితే, ఏలిన వారు ఎంత శాతం పన్ను పెంచి పన్నూడ గొడతారో తెలియదు.ముచ్చట పడి కొనుక్కున్న చీర రంగు ఎంత కాలం వెలిసి పోకుండా ఉంటుందో నిర్ధారణగా చెప్పలేం. పత్రికకి పంపిన రచన పడుతుందో, తిరిగొస్తుందో ఎవరికెరుక ? అచ్చేసుకున్న పుస్తకాలు అమ్ముడు పోతాయో, మూలన పడి బూజు పడతాయో తెలియదు. ఎక్క వలసిన రైలు, లేదా విమానం సకాలానికి బయలు దేరుతుందో, రద్దవుతుందో తెలియదు. నల్లా లో నీళ్ళు ఎప్పుడు వదులుతారో ఏమో తెలియదు. వచ్చినా, ఎంత సేపు ఉంటుందో తెలియదు. ఎంత బాగా రాసినా పరీక్షలో ఎన్ని మార్కులు పడతాయో తెలియదు. ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చిన ఉద్యోగం ఎప్పుడు ఊడి పోతుందో నమ్మకం లేదు. కంప్యూటరు ఎప్పుడు మొరాయిస్తుందో ఖర్మ ! మహిళా బిల్లు అమలుకి నోచు కుంటుందో లేదో ? భీమ్ పాపాల శర్మ మన నెత్తి మీదకి మళ్ళీ ఏ సినిమా కథ చెబుతాడో తెలీదు. విప్లవం వస్తుందో రాదో అగమ్య గోచరం. ఏ ఎన్నికలలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టు కుంటుందో ఎవడికీ తెలియదు. పొత్తులు ఎంత కాలం నిలుస్తాయో అసలే తెలీదు. అయోధ్యలో రామాలయం కడతారో లేదో తెలీదు. తెలంగాణా వస్తుందో రాదో తెలీదు. వస్తే, హైదరాబాదు సంగతి ఏం చేస్తారో తెలీడం లేదు. తీరా, తెలంగాణా ఇచ్చేక మరెన్ని చిన్న రాష్ట్రాల కోసం పేచీలు మొదవుతాయో తెలీదు. గెలిపించిన ప్రభుత్వం ఐదేళ్ళూ పాలిస్తుందో, మధ్యంతరానికి దారులు తీస్తుందో చెప్ప లేం. 2012 దాటేక ప్రళయం వస్తుందో ఏమో నని బెంగ. ( ఈ విషయంలో ఇప్పటికే ఘనత వహించిన కొన్ని టీ వీ ఛానెళ్ళు పని కట్టుకుని ఊరికే ఊదర గొట్టేస్తున్నాయి కదా ? )

ఈ కథా మంజరి టపాని ఎంత మంది చదువుతారో తెలీదు. చదివిన వారు ఎంత మంది కామెంట్ లు పెడతారో తెలీదు

ఇది అనంతం. వీటికి అంతం లేదు.....

హితోపదేశంలో కవి ఒక శ్లోకంలో మనకు కలిగే అనేక శంకల గురించి ఉటంకిస్తూ, అన్ని శంకలు పెట్టుకుంటే బతక లేం అని తేల్చి పారేసేడు.

చూడండి:

శంకాభి: సర్వ మాక్రాంతం, అన్నం పానం చ భూతలే
ప్రవృత్తి: కుత్ర కర్తవ్యా, జీవితవ్యం కథం ను వా.

భూమ్మీద అన్ని విషయాలూ అనేక అనుమానాలతో కూడి ఉంటున్నాయి.
చివరకి అన్నం తినడం, నీరు త్రాగడం కూడ అనుమానం వల్ల దుర్భరమవుతోంది. అంటే,
తినడానికీ, త్రాగడానికీ కూడా ఊరికే భయ పడి పోతూ ఉంటున్నాం. ఇలాగయితే బతకడం ఎలాగ ? అని దీని భావం.

ఇన్ని అనుమానాలతో బతకడం కష్టం కనుక మరీ వెర్రి మొర్రి అనుమానాలు పెట్టు కోకుండా ప్రశాంతంగా బతకడం అలవాటు చేసుకోవాలి. ఈ టపా రాయడంలో నేను చెప్ప దలచిన పరమార్ధం అదే.

ఈ విషయం ఎంత మంది సరిగా అర్ధం చేసుకుంటారో కదా, అనేదే నా అనుమానం !!

స్వస్తి.9, డిసెంబర్ 2010, గురువారం

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ !


భోజ రాజు ముఖం చూస్తూనే కవిత్వం పుట్టుకు వస్తుందిట.

ఒక రోజు భోజుడు కొలువు తీరి ఉండగా, భద్ర మణి అనే మహా పండిత కవి అక్కడికి వచ్చేడు. అప్పటికే భోజుని సింహాసనం ప్రక్కన కుడి వేపు కాళి దాస కవి సుఖాసీనుడై కూర్చుని ఉన్నాడు.
విధి లేని సరిస్థితిలో అయిష్టంగానే భద్ర మణి ఎడమ వేపు కూర్చున్నాడు. అది అతనికి అవమాన కరంగా తోచింది. మనసు కుత కుతలాడి పోయింది. ఎడమ వేపు కూర్చోవడంతో తను కాళి దాసు
కన్నా, తక్కువ అనే ఆత్మ న్యూనతా భావం అతనిని కలచి వేసింది. మరి ఉండ లేక ఈ శ్లోక పాదాలు చెప్పాడు:

గృహ్ణోత్యేష రిపో శ్శిర: ప్రతి జనం కర్షత్య సౌవాజినం
ధృత్వా చర్మ ధను: ప్రయాతి సతతం సంగ్రామ భూమావసి
ద్యూతం చైర్య మధ స్త్రియంచ న పదం .జానా వినాయాం కర:

ఈ మూడు శ్లోక పాదాల అర్ధమూ ఇది:

ఎడమ చేయి ముందుగా శత్రువు శిరస్సును పట్టుకుంటుంది. ముందుకూ వెనుకకూ లాగి గుంజుతుంది. బాణం వేసే ముందు విల్లు పట్టు కుంటుంది. జూదం, స్త్రీలను బలాత్కారం చెయ్యడం, పనికి మాలిన శపథాలు చెయ్యడం మొదలయినవి చెయ్యదు.

ఇలా భద్ర మణి ఎడమ చేయి గొప్ప తనాన్ని పొగడడం ద్వారా ఎడమ వేపు కూర్చోవడం వలన తనకి వచ్చిన చిన్న తనం ఏమీ లేదని చాటుకో డానికి ప్రయత్నించేడు.

వెంటనే కాళి దాసు శ్లోకం నాలుగో పాదాన్ని పూరించి, ఆ కవికి తేరుకో లేని గట్టి చురక అంటించేడు.

కాళి దాసు పూరించిన నాలుగో పాదం ఇది:

దానాద్యితరం విలోక్య విధినా శౌచాధి కారి కృత:

ఎడమ చేతికి దానం చేసే అర్హత లేనందు వలన బ్రహ్మ దానికి నీచమైన పనులు చేయమని నియోగించాడు సుమా !

కాళి దాసు పూరించిన శ్లోక పాదం విని కవి గారికి దిమ్మతిరిగి పోయి ఉంటుంటుంది. కదూ?

అంచేత, ఊరికే కుడి ఎడమల తగువులతో సరి పుచ్చక మనకి దక్కగల గౌరవం మనకు దక్కిన స్థానం బట్టి కాక, మన ప్రతిభా వ్యత్పత్తులను బట్టి ఉంటుందని గ్రహించాలి.


స్వస్తి.

7, డిసెంబర్ 2010, మంగళవారం

నస మంజరి


అజాత మృత మూర్ఖాణాం, వర మాద్యౌ న చాంతిమ:
సకృ ద్దు:ఖ కరా వాద్యా, వంతిమస్తు పదే పదే.

ఈ శ్లోకంలో కవి ముగ్గురి గురించి చెబుతున్నాడు.

ఇంకా పుట్టని వాడు , చని పోయిన వాడు, మూర్ఖుడు.

ఈ ముగ్గురిలో కడపటి వాడి కంటె ముందున్న ఇద్దరే మేలు. అంటే, ఇంకా పుట్టని వాడు, చని పోయిన వాడు - వీళ్ళిద్దరూ ఒక్క సారే దు:ఖాన్ని కలిగిస్తారు. కాని ఈ ఆఖరున చెప్పిన వాడున్నాడే, మూర్ఖుడు , వాడు మాత్రం మాటి మాటికి దు:ఖాన్నే కలిగిస్తూనే ఉంటాడు.

అంటే ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటాడు. అని కవి చెబుతున్నాడు.

అలాంటి మూర్ఖులు వంద మంది ఉండడం కన్నా, గుణవంతుడైన ఒక్క కుమారుడు ఉంటే చాలని కూడా చెబుతున్నాడు.

వర మేకో గుణీ పుత్రో, నచ మూర్ఖ శతైరపి
ఏక శ్చంద్ర స్తమో హంతి, నచ తారా గణో2పి చ.

మూర్ఖులైన పుత్రులు వంద మంది కన్నా, మంచి గుణాలు కలిగిన వాడు ఒక్కడు చాలును. కోట్ల నక్షత్రాల కన్నా, చీకట్లు పార ద్రోలే చంద్రుడు ఒక్కడు చాలును కదా అని దీని భావం.

పరి వర్తిని సంసారే, మృత: కోవా న జాయతే
స జాయతో యేన జాతేన, యాతి వంశ స్సమున్నతిమ్

ఈ సంసారము చావు పుట్టుకలతో కూడినది. కనుక ఇచ్చట చని పోయిన వాడు ఎవడు తిరిగి పుట్టడం లేదు ? కాని, యెవని పుట్టుక వలన వంశం కీర్తిని పొందుతూ ఉందో, వాని పుట్టుక మాత్రమే సార్ధకమైనది. అని దీని భావం.

కులము లోన నొకడు గుణ హీనుడుండిన
కులము చెడును వాని గుణము వలన
చెఱకు వెన్ను బుట్టి, చెరపదా తీపెల్ల
విశ్వదాభిరామ వినుర వేమ

ఒక గుణ హీనుడు చాలు, మొత్తం వంశానికంతటికీ చెడ్డ పేరు తీసుకుని రావడానికి. చెఱకు గడ చివర వెన్ను పుడితే దాని తీపి అంతా నశించి పోతుంది కదా అని వేమన చెప్పనే చెప్పాడు కదా.

బద్దెన కూడ దీనినే తిరుగ రాసాడు

కొఱగాని కొడుకు పుట్టిన
కొఱగామియె కాదు, తండ్రి గుణముల చెఱచున్
చెఱకు తుద వెన్ను పుట్టిన
చెఱకున తీపెల్ల చెఱచు కదరా సుమతీ !

కొడుకులు పుట్ట లేదో అని ఏడిచే వారికి హెచ్చరికగా ధూర్జటి ఈ పద్యం చెప్పాడు.

కొడుకుల్ పుట్టరటంచు నేడ్తు రవివేకుల్ జీవన భ్రాంతులై
కొడకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్, వారిచే నే గతుల్
వడసెన్? పుత్రులు లేని యా శకునకున్ వాటిల్లెనే దుర్గతుల్?
చెడునే మోక్ష పదంబపుత్రకునకున్ శ్రీ కాళ హస్తీశ్వరా.

బ్రతుకు మీది మమకారంతో అయ్యో, కొడుకులు పుట్ట లేదే, అని ఏడుస్తూ ఉంటారు. కురుపతికి వంద మంది కొడుకులు పుట్ట లేదా? వారి వలన అతనికి ఏ సద్గతులూ లభించ లేదు. పుత్రులే లేని శుకునికి మంచి గతులే లభించాయి. పుత్రులు లేని వారికి మోక్ష పదవి రాదను కోవడం సరి కాదు .

అందు వలన మందితో పని లేదని తెలుసు కోవాలి.

తెలియని కార్య మెల్ల కడ తేర్చుట కొక్క వివేకి చే కొనన్
వలయు, నట్లైన దిద్దు కొన వచ్చు, ప్రయోజన మాంద్య మేమియున్
కలుగదు, ఫాల మందు తిలకంబిడు నప్పుడు చేత నద్దమున్
కలిగిన చక్క చేసి కొనుగాదె, నరుండది చూచి భాస్కరా.

ఒక తెలివయిన వాని సహకారంతో ఎంతటి దుష్కర కార్యాన్నయినా చక్కగా నిర్వర్తించ వచ్చును.
చేతిలో అద్దం కలిగి ఉంటే, దానిని చూసి చక్కగా తిలకం దిద్దు కో వచ్చును కదా.

ఒక్కడు చాలునని చెప్పడాని మరీ ఇన్ని ఉదాహరణలు చెప్పాలా ! ఒక్కటి చెబితే చాలదూ ?
చాదస్తం కాక పోతే ! కథా మంజరి పేరు మార్చి నస మంజరి అని పెట్టుకో, ఫో అంటారా? తమ దయ. మద్భాగ్యం.

స్వస్తి.

2, డిసెంబర్ 2010, గురువారం

దెబ్బల రాజ్యం లో దబ్బఱ నీతులుఅమాయక గిరిజనులను మైదాన ప్రాంత వ్యాపారులు దోపిడీ చేయడంలో అనేక విధాలయిన మెళకువలు
చూపుతూ ఉంటారు. వాటికి చెందిన ఒక దోపిడీ విధానమే అడ్డకి పడ్డ అనేది.

మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెనుకటి రోజులలో తరుచుగా వినిపించే ఈ మాటకి అర్ధం నాకు తెలిసేది కాదు. మా నాన్న గారు చెప్పిన దాని ప్రకారం, అమాయక గిరిజనులకి మైదాన ప్రాంతీయులు అడ్డ ( వెనుకటి కొలమానం. అడ్డ, తవ్వ, సేరు, కుంచం మొదలయినవి. నాలుగు అడ్డలు ఒక కుంచం అనే వారు) తో వారికి కావలసిన ధాన్యమో, బియ్యమో కొలిచి అప్పుగా ఇచ్చే వారుట. కొంత కాలానికి ఆ అడ్డెడు అప్పుకి వారు తీర్చ వలసిన బాకీని చక్ర వడ్డీతో లెక్క కట్టి, దొంగ లెక్కలు వేసి ఇబ్బడి ముబ్బడిగా పెంచి, అధిక మొత్తంలో బాకీ పడినట్టుగా తేల్చి చెప్పే వారుట. అంత బాకీ చెల్లించ లేని గిరిజనులు తాము తీసుకున్న అడ్డెడు అప్పు నిమిత్తం తమ ఇంటిలో ఉండే ఏ ఆవు పెయ్యనో ( దానినే పడ్డ అనే వారు) ఇచ్చేసే వారుట. ఇదీ అడ్డకి పడ్డ కథ. ఇది దోపిడీకి పరాకాష్ఠ .

అఙ్ఞానం, అమాయకత్వం ఉండే చోట కుటిల వ్యాపారులు తమ మోసపు వ్యాపారపు మెళకువ లన్నీ చూపెడుతూ ఉంటారు.

గ్రామాలలో చిల్లర వ్యాపారులు దినుసులను అమ్మడమే కాక, కొనడం కూడ చేస్తూ ఉంటారు.
ఆ దినుసలను వారు కుంచంతో కొలుస్తూ ఉంటారు. తాము రైతు వారీ నుండి దినుసులను కొనవలసి వచ్చి నప్పుడు ‘‘ పెద్దమ్మీ, కుంచం పట్రా ’’ అని ఇంట్లోకి కేక వేసే వారుట. ఇంట్లో రెండు సైజుల కుంచాలు ఉంటాయిట. ఒకటి పెద్దదీ, రెండోది చిన్నదీనూ. వ్యాపారులు రైతు వారీ నుండి తాము దినుసులు కొనడానికి పెద్దమ్మాయిని కుంచం తెమ్మని కేకెయ్యడంలో కిటుకు, ఇంట్లో ఉన్న పెద్ద కుంచం తెమ్మని అనడం, తమకి కొలతకు ఎక్కువగా దినుసులు రావడం కోసం ఇంట్లోంచి పెద్ద రకం కుంచం తెమ్మని సంకేతం, అదే, తాము అమ్మ వలసిన దినుసుల కొలతకి చిన్న సైజు కుంచమయితే, తమకి లాభం కనుక, ’’ చిన్నమ్మాయ్, కుంచం తే ‘‘ అని, చిన్న కుంచం తెమ్మని సంకేతాన్ని పంపే వారని మా నాన్న గారు చెబుతూ ఉండే వారు.

కుటిల వ్యాపారులు ఎన్ని రకాలుగా మోసం చేస్తూ ఉంటారో తెలియ జేస్తూ ఒక కవి ఈ శ్లోకం వ్రాసేడు. చూడండి:

తులేన కించిత్ తులయా చ కించత్, మానేన కించిత్ శపథేన కించిత్
కించిచ్చ కించిచ్చ హర త్యశేషవ, వణిక్సమో నాస్తి ప్రశస్త చోర:

అసలు త్రాసు లోనే కొంత తిరకాసు ఉంటుంది. తక్కెడ సరిగా ఉండదు. ఎప్పుడు తూచినా, ఆ తక్కెడ అమ్మే వాడికే లాభదాయకంగా తప్పుడు తయారీతో ఉంటుంది. ( సరుకులు వేసే తక్కెడ క్రింద అయిస్కాంతం ముక్క పెట్టడంలాంటి గిమ్ముక్కులు కూడానూ)

ఇక, తూచడంలో కొంత మోసం. దుకాణంలో తూకం సరి పోయి నట్టుగానే అనిపిస్తుంది. ఇంటికి పోయి కొలుచు కుంటే, ఎంతో కొంత తరుగు కనిపిస్తుంది. అదెలా జరిగిందో తెలియక జుట్టు పీక్కోవడమే . ఆ కిటుకు మనకి తెలీనంత ఒడుపుగా చేసే వ్యాపారులుంటారు.

ఇక, కొల మానంలో మరి కొంత మోసం, తన నిజాయితీని నిరూపించుకుంటూ వేసే ఒట్ల తో కొంత, యిలాగ కొంచెం కొంచెంగానే కాజేసి, చివరికి ఏమీ మిగల కుండా చేసే వ్యాపారిని మించిన చోరాగ్రేసరుడు మరొకడు ఉండ బోడని కవి ఈ శ్లోకంలో చెబుతున్నాడు.


టక్కు టమార గజ కర్ణ గోకర్ణ విద్యలు తెలిస్తేనా కదా, అంతంత కూడ బెట్ట గలిగేది?

త్రాసు, తూచడం గురించి చెబుతున్నాను కనుక, మీకు రెండు పిల్లులు, ఒక కోతి కథ గుర్తు చేయడం సమంజసం.

రెండుపిల్లులకు ఒక రొట్టె ముక్క దొరికింది. దానిని పంచు కోవడంలో వాటికి తగాదా వచ్చింది. తగవు ఎటూ తేలక, అవి తగువు తీర్చమని ఒక కోతి దగ్గరకి వెళ్ళాయి.

ఆ కోతి సరేనని ఆ రొట్టె ముక్కని రెండు సమాన భాగాలుగా చేసి. ఇచ్చే మిషతో ఒక త్రాసులో రొట్టె ముక్కలు వేస్తుంది. ఒక సారి అందులో ముక్క పెద్దదయి పోయిందనీ, మరొక తూరి ఇందులో ముక్క చాల లేదనీ కబుర్లు చెబుతూ, ఆ రొట్టె ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా త్రుంచి నోట్లో వేసు కోవడం మొదలు పెట్టింది.

వెర్రి పిల్జలులకు జరుగుతున్న దేమిటో అవగతమయే లోపల ఆ కోతి మొత్తం రొట్టెను చప్పరించీసి, త్రేన్చిందిట.

జెల్ల కొడితే, దెబ్బ తినే వాడు తేరుకోక ముందే జెల్ల కొట్టీవాలి అనేది కుటిల వ్యాపారపు నీతి.

దెబ్బల రాజ్యంలో ఇలాంటి నీతులకి విలువ ఎక్కువ మరి.

మరో విషయం -


కథా మంజరిలో ఇది నా 199 వ టపా. మరి , నా 200 వ టపా రేపే విడుదల !

మనశ్శల్యాలు


లోకంలో మనస్సునకు చాల బాధ కలిగించే ఏడు విషయాల గురించి ఈ శ్లోకంలో కవి చెబుతున్నాడు.

చూడండి ...

శశీ దివస ధూసరో గళిత యౌవనా కామినీ
సరో వితగ వారిజం, ముఖ మనక్షరం స్వాకృతే:
ప్రభు ర్దన పరాయణ:, సతత దుర్గతి స్సజ్జన:,
నృపాంగణగత: ఖలో మనసి సప్త శల్యాని మే.

నాకు లోకంలో ఏడువిషయాలు మనశ్శల్యాలై నన్ను బాధిస్తూ ఉంటాయి అని కవి వాపోతున్నాడు.

అవి ఏమంటే,

తెల్లవారగానే వెల వెల పోయే చంద్రబింబం
యవ్వనం సడలి పోయిన కామిని
పద్మాలు లేనట్టి చెఱువు
అక్షరం ముక్క లేనట్టి సుందర వదనం
ధనాశా పరుడైన ప్రభువు
సత్పురుషుల నిత్య దారిద్ర్యం
అధికారుల దగ్గర ఎప్పుడూ పరమ తుంటరులకే చేరిక ఉండడం.

ఇవీ కవిగారిని బాధించే ఏడు విషయాలు.

రేయంతా నేల మీద అంతటా చక్కగా పరుచు కున్న వెన్నెల తెల్ల వారగానే వెలవెలబారి పోవడం చూస్తూ ఉంటే ప్రకృతిని ఆరాధించే ఎవరికయినా బాధాకరమే.

యవ్వనం సడలి పోయిన కామిని రూపం చూడనలవి కానిదట.
చెఱువులో పద్మాలు ఉంటేనే అందం.
ఎంత అందగాడయినా, నిరక్షర కుక్షి అయితే, వాడి ముఖం చూడాలనిపించదు మరి.
ధనాశా పరుడైన రాజు ముఖం కూడా చూడ్డానికి పరమ దరిద్రంగా ఉంటుంది.
నిత్యం అష్ట కష్టాలు పడుతూ, దరిద్రం ఓడుతూ ఉండే మంచి వారి స్థితి ఎవరికయినా బాధాకరమే.

ఇక, రాజుల కోటరీలో మంచి వారికి అణు మాత్రమైనా చోటు లేకుండా, నేర చరితులకూ, దుష్టులకూ, దగా కోరులకూ, అవినీతి పరులకూ, వంచకులకూ, మాత్రమే చోటు ఉండడం చూస్తే ఆలోచనాపరులైన వారెవరికయినా బాధని కలిగిస్తుంది కదూ?

1, డిసెంబర్ 2010, బుధవారం

ఆ పైన నీ ఇష్టం


బృహత్సంహిత లోని ఈ శ్లోకం చూడండి ...

జయే ధరిత్ర్యా: పుమేవ సారం, పురే గృహం సద్మని చైక దేశ:
తత్రా2పి శయ్యా, శయనే వరా స్త్రీ, రత్నోజ్వలా రాజ్య సుఖస్య సార:

దేశం ఎంత విశాలంగా ఉండనీ, కేంద్రమైనది నగరమే. నగరం ఎంత పెద్దదిగా ఉండనీ, తన ఇల్లే ఎంతో ప్రీతి పాత్రంగా ఉంటుంది. తన ఇల్లు ఎంత పెద్దదిగా ఉండనీ, దానిలో తన పడక గదే శాంతిని కలిగిస్తుంది. ఆ పడక గదిలో కూడ మిక్కిలి విశ్రాంతిని ఇచ్చేది శయ్య. ఆ శయ్యా సుఖం కూడ పూర్తిగా పొందాలంటే స్వీయానురక్తయై, ఉత్తమురాలైన భార్య వల్ల మాత్రమే మనశ్శాంతి చేకూరుతుంది. అని దీని భావం.

అంటే, మహారాజుకైనా స్వగృహం మాత్రమే శాంతిని ఇస్తుందనీ, అందునా, అనురక్త ఐన భార్య మాత్రమే చిత్త శాంతినీ, సౌఖ్యాన్నీ ఇవ్వగలదనీ తెలుసు కోవాలి.

మన ఇంట లేని సౌకర్యాలు ఎన్నింటిని అతిథి మర్యాదలు చేసే చుట్టాలు సమకూర్చినా, మరీ ఎక్కువ రోజులు అక్కడ ఉండాలనిపించక పోవడం అందరకీ అనుభవం లోకి తరుచుగా వచ్చే విషయమే.

ఎప్పుడెప్పుడు ఇల్లు చేరుదామా, మన ఇంట , మన పడక గదలో, మన మంచం మీద సేద దీరుదామా అని ఊరికే ఇదయి పోతాం.

ఇది నాది అను కోవడంలో ఉండే తృప్తితో ఏదీ సాటి రాదు.

అందుకే పెద్దలు గృహమే కదా స్వర్గ సీమ అన్నారు.

దానిని స్వర్గ ధామం చేయడమూ, నరక తుల్యంగా మార్చడమూ కూడ మన చేతుల్లోనే ఉంది. కదూ?
30, నవంబర్ 2010, మంగళవారం

మధ్యలో నన్నెందుకు లాగుతావూ ?!


( నీ హిత వచనమ్ డాట్ కామ్ సిగ్గోసిరి. మధ్యలో నన్నెందుకు
లాగుతావూ ?! హన్నా !!)


ఒక శ్లోకం చూడండి:

అసంభావ్యం న వక్తవ్యం, ప్రత్యక్ష మపి దృశ్యతే
శాలి తరతి పానీయం, గీతం గాయతి వానర:

నువ్వు ప్రత్యక్షంగా చూసినదే అయినా, అది అసంభవమైన విషయం అయితే మట్టుకు దాని రించి ఎప్పుడూ ఎవరితోనూ చెప్ప వద్దు సుమీ !

ఎందుకంటే, ‘ నీటి మీద రాయి తేలింది. కోతి పాటలు పాడింది’ అని చెబుతే ఎవరయినా నవ్వుతారే కాని నీ మాటలు నమ్మరు సుమా ! అని, ఈ శ్లోక భావం.

అసత్యం వ్యాప్తి చెందేంత త్వరగా సత్యం వ్యాప్తి చెందదు మరి. అసత్యానికి వెయ్యి కాళ్ళు, వినడానికి లక్ష చెవులు. తిరిగి వ్యాపింప చేయడానికి కోటి నోళ్ళు ఉంటాయి.

పాపం సత్యానికి అంత సీను లేదు. అలాగని సత్యం పలక వద్దని కాదు సుమా.

సత్యం వద. సత్యమే పలకాలి. ధర్మం చర . ధర్మాన్ని ఆచరించాలి.

24, నవంబర్ 2010, బుధవారం

ఒక పరి దైవం ... ఒక పరి దెయ్యం !


ఉదయాన్నే వచ్చేడు, మిత్రుడు భీమ్ పాపాల శర్మ. వాడిని చూస్తూనే నా గుండె తరుక్కు పోయింది.పది లంఖణాలు చేసిన వాడిలా ఉన్నాడు. మనిషిలో ఉత్సహం ఎక్కడా మచ్చుకయినా లేదు. దెయ్యాలతో సయ్యాట లాడించ గలవాడూ, హత్యలూ, హింస అంటూ నిత్యం కరాళ తాండవం చేసే వాడూ, చరిత్రలో రక్తపు జాడలను రొక్కంగా మార్చ గల చతురత కలవాడూ అయినా , నా మిత్రుడే ఇలా డీలా పడి పోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.

ఏం జరిగిందేం జరిగిందని నేను అడిగే లోపే బెక్కుతూ చెప్పేడు: ‘‘ వెధవ కల ! వెధవ కలా
అని ! వొట్టి పీడ కల ! జడిసి పోయి చచ్చేననుకో !’’ అన్నాడు.

‘‘ ఏమిట్రా, ఆ కల ? ’’ అడిగేను.

‘‘ నా ఖర్మ కాలి, ఓ పేద్ధ కార్పొరేట్ హాస్పటల్ కి వైద్యం కోసం వెళ్ళినుట.’’

‘‘ అయితే ...?’’

‘‘ నా జబ్బు తగ్గ లేదు సరి కదా, వాళ్ళు నన్నూ, నా పర్సునీ, నా క్రెడిట్ కార్డునీ, బేంక్ బ్యాలన్సునీ, మొత్తం ఊడ్చేసారు ...’’

‘‘ పోనీ, నీ రోగం కుదిరిందా ?’’

నా మాటల్లో వ్యంగ్యం ధ్వనించిందేమో, నిష్ఠుర పడుతూ అన్నాడు: ‘‘ నా బొంద తగ్గింది. తగ్గితే, ఇలా ఉంటానూ? .... రాత్రికి రాత్రే ఎవరి కంటా పడకుండా ఇలా పారి పోయి వచ్చేసాను ... ఇంకా ఉంటే, నా గోచీ కూడా మిగల్చ రేమో నని భయం వేసిందనుకో ...’’

‘‘ భయమెందుకురా? ... కలే కదా, సరే, ఇంతకీ ఏం రోగం వచ్చిందని అక్కడికి
వెళ్ళావు ?’’ ఆరాతీసాను.

‘‘ బుద్ధి తక్కువై వెళ్ళాను. కొంచెం జలుబు చేసిందంతే. జండూ బామ్ తో పోయే దానికి, తగుదునమ్మా అని, ముచ్చట కొద్దీ అక్కడికి వెళ్ళానులే .... కలలోనే కదా అని కొంచెం సాహసం చేసినట్టున్నాను.... గుండు గొరిగీసేరు ...కచ్చ దాదాపు ఊడదీసీసేరు ...’’ ఏడుస్తూ చెప్పేడు.

వాడిని ఓదార్చి, సాగనంపేక ఆలోచనలో పడ్డాను.

* * * * * * * * * * * * * * * * * * * *

‘వైద్యో నారాయణో హరి : ’ అన్నారు. కానీ, వైద్య రంగం కలవారికే కానీ, లేని వారికీ, సగటు జనాలకు - అందని మ్రాని పండే అవుతోంది. అక్కరకు రాని చుట్టమే అవుతోంది. అందని గగనమే అవుతోంది. భయ పెడుతోంది. బాధిస్తోంది. పీడిస్తోంది. ధన మదం పట్టిన వైద్య రంగంతో దేశం జబ్బు పడింది.


వైద్యం సరిగా తెలియని వారిని వెక్కిరిస్తూ, ‘ నీ చేతి మాత్ర, వైకుంఠ యాత్ర ’ అనడం కద్దు.

కాని, ఇప్పుడు వైద్య రంగం శత సహస్రదళాలుగా వికసించింది. విస్తరించింది. కాని , ఏం లాభం !
అధిక శాతం జనాభాకి అందుబాటులో ఉండడం లేదు.

అప్పిచ్చు వాడు, వైద్యుడు,
ఎప్పుడు ఎడ తెగక పారు ఏఱును, ద్విజుడున్
చొప్పడిన ఊర నుండుము
చొప్పడ కున్నట్టి ఊరు చొరకుము సుమతీ !

అని, బద్దె భూపాలుడు నెత్తీ నోరూ కొట్టుకుని మరీ చెప్పేడు. ఇప్పుడు దాదాపు ప్రతీ ఊళ్ళోనూ వైద్యులు కనిపిస్తున్నారు. కాని, వారిలో కనిపించని దల్లా రవ్వంత మానవీయ దృక్పథం. అంతే.

అందుచేతనే కదా, ఒక శ్లోకంలో కవి ఇలా అన్నాడు:

వైద్య రాజ నమ స్తుభ్యం, యమరాజ సహోదర !
యమస్తు హరతి ప్రాణాన్, వైద్య:ప్రాణాన్ ధనానిచ.

యముడికి తోడ బుట్టిన వాడి వయిన ఓ వైద్యుడా ! నీకు నమస్కారం. ఎందుకంటే, యముడు కేవలం ప్రాణాలనే తీసుకుని పోతాడు. మరి వైద్యుడో ? ప్రాణాలనూ, ధనాన్నీ కూడా హరిస్తాడు. కనుక, నా జోలికి రాకయ్యా, నీకో నమస్కారం ! అని దీని భావం.

ఈ శ్లోకం చూడండి:

యావత్కంఠగతా: ప్రాణా::, యావన్నశ్యతి చేంద్రియమ్
తావత్ చికిత్సా కర్తవ్యా, కాలస్య కుటిలా గతి:

వైద్యం ఎంత వరకూ చేయాలయ్యా, అంటే,

గొంతులో ఊపిరి ఉన్నంత వరకూ. ఇంద్రియాలలో చైతన్యం ఉన్నంత వరకూ.వైద్యుడు రోగికి చికిత్స చేస్తూనే ఉండాలి. కాల గతి చెప్పరానిది సుమీ ! అని దీని భావం.

కానీ, వాస్తవంలో జరిగేది వేరు. యావత్తైలం, తావద్వ్యఖ్యానమ్ అన్నట్టుగా, రోగి డబ్బులు ఇచ్చేంత వరకే వైద్యుడు చికిత్స చేస్తున్నాడు. తరువాత నీ చావు చావు పొమ్మంటున్నాడు. అవును కదూ?

అయితే, వైద్యుడేమీ భగవంతుడు కాడు కదా, చికిత్స జరిపించ గలడు కానీ, ఆయుర్దాయం నిలప లేడు కదా. క్రింది శ్లోకం అదే చెబుతోంది.

వ్యాధే: తత్త్వ పరిఙ్ఞానం వేదనాయాశ్చ నిగ్రహ:
ఏతద్వైద్యస్య వైద్యత్వం, న వైద్య: ప్రభురాయుష:

వ్యాధి స్వభావం తెలుసు కోవడం, ఉన్న బాధను తగ్గించడానికి ప్రయత్నించడం, ఇంత వరకే వైద్యుడు చేయ గలడు. ఆయుర్దాయం మాత్రం వైద్యుని చేతిలో లేదు కదా ! అని దీని భావం.

కానీ, వాస్తవంలో, రోగికే తెలిసి పోతున్న వ్యాధి ఏమిటో కనుక్కునే నెపంతో వైద్యుడు చేయించే పరీక్షలు అన్నీ యిన్నీ కావు.వ్యాధి నిర్ధారణ మాట అలా ఉంచితే, రోగి వాటితోనే సగం దివాళా తీయడం ఖాయం.


అయితే, ఒకటి ... నీ కంటూ కథా మంజరి పేరుతో ఓ దిక్కుమాలిన బ్లాగు ఉంది కనుక, తెలుగులో ఏపిల్ కీ బోర్డుతో టైపు చేయగల నేర్పు ఉంది కనుక, వైద్యుల గురించి అవాకులూ చవాకులూ పేలుతున్నావు, ఎక్కడెక్కడివో శ్లోకాలు ఉటంకిస్తూ రాద్ధంతం చేస్తున్నావు ... మరి వైద్యులూ మనుషులే కదా, వాళ్ళూ బ్రతకొద్దూ? అంటారేమో,

చూడండి:

వైద్యామృతంలో ఒక శ్లోకం ఏమని చెబుతోందో ...

నైవ కుర్వీ లోభేన, చికిత్సా పుణ్య విక్రయమ్
ఈశ్వరాణాం వసుమతాం, లిప్సేతార్ధం తు వృత్తయే.

చికిత్స చేసే వైద్యుడు ఆ పుణ్యాన్ని ధనాశాపరుడై అమ్ముకో కూడదు. చికిత్సను ఒక దైవ కార్యంలాగా చేయాలి. అంతే తప్ప డబ్బుకి అమ్ముకో కూడదు. కాని, వైద్యులు తమ కుటుంబ పోషణ కోసం కాసులు కల వారి వద్ద, ఇవ్వగల స్తోమత కల వారి వద్ద నుండి కోరినది తీసికో వచ్చును. అని దీని భావం.

అంటే, డబ్బున్న వారినుండి డబ్బు తీసుకుని, పేదలకు వీలయితే ఉచితంగానూ. లేదంటే
నామ మాత్రపు వసూలు తోనూ వైద్యం చేసి మానవత్వం చూపించాలని దీనర్ధం.

కాని, దురదృష్టవశాత్తు వైద్యులు అలా ప్రవర్తించడం (ఎక్కడో, ఎవరో కాని ) లేదు. నిజానికి వైద్యుడు నారాయణుడితో సమానం. దైవంతో సమానుడైన వైద్యుడు


కొండొకచోదెయ్యంగా మారి పోతున్నాడనేదే నా ఫిర్యాదు.

ఈశ్లోకాలు కూడా చూడండి:

జృంభమానేషు రోగేషు, మ్రియమానేషు జంతుషు
రోగ తత్త్వేషు శనకై: వ్యుత్పద్యంతే చికిత్సకా:

ప్రవర్తనార్ధ మారంభే, మధ్యే త్వౌషధ హేతవే
బహుమానార్ధ మంతే చ, జిహీర్షంతి చికిత్సకా:

రోగుల నుండి డబ్బులు గుంజు కోవడంలో వైద్యలకు వారి చిట్కాలు వారికి ఉన్నాయి. ఆ టెక్నిక్కులు , గిమ్మిక్కులు, మేజిక్కుల, వారికి బాగా తెలుసును. ఈ శ్లోకంలో కవి అదే చెబుతున్నాడు. చూడండి:

రోగాలు ముదిరి పోయి ప్రాణాలు కడ తేరి పోతూ ఉంటే, రకరకాల పరీక్షలూ గట్రా చేసి, ప్రయోగాలూ విశ్లేషణలూ జరిపి, (కొందరు) వైద్యులు అప్పుడు మెల్లగా రోగ తత్వం తెలిసిందంటూ చికిత్సకి పూనుకుంటారు.

మొదట రోగ నిదానం చేయడానికి డబ్బు గుంజుకుంటారు. మధ్యలో మందులకని డబ్బు లాగుతారు. చివరలో బహుమానమని (అంటే, రోగం తగ్గింది కనుక సంతోషం కొద్దీ) డబ్బులిమ్మని వేధిస్తారుట. ఇదీ లోక రీతి అని కవి చెబుతున్నాడు. మొత్తానికి ఆది మధ్యాంతాలలో కూడా వైద్యుడు డబ్బులు గుంజుతూనే ఉంటాడని కవి భావన.

ఈ కాలంలో బహుమానం పేరుతో అడక్క పోయినా, రూమ్ ఛార్జీలూ, సేవల ఛార్జీలూ, బెడ్ ఛార్జీలూ, మన్నూ మశానం పేరుతో బాగానే గుంజుతారు. రోగం కుదిరిందన్న ఆనందం హరించుకు పోయి, రోగికి ఈ పీడ ఎక్కువవుతుంది. ఖర్మ కాలి, రోగి టపా కట్టేస్తే, చెప్పే పని లేదు. మృత దేహం ఒప్పగించడానికిన్నూ అధిక మొత్తం చెల్లించాల్సిందే కదా !


చివరిగా మంచి ఆరోగ్యం కోసం మన పెద్దలు ఏం చెప్పారో కూడా చూడండి మరి ...

ఆరోగ్యం భాస్కరా దిచ్చే, ద్ధన మిచ్చేత్ హుతాశన:
ఙ్ఞానం మహేశ్వరా దిచ్చేత్, మోక్ష మిచ్చేత్ జనార్ధనాత్.సూర్య భగవానుని ఉపాసించడం వలన చక్కని ఆరోగ్యం కలుగుతుంది.
అగ్నిని ఉపాసించడం వలన సంపద కలుగుతుంది.
ఈశ్వరుని వలన ఙ్ఞానం కలుగుతుంది.
జనార్దనుని వలన మోక్షం కలుగుతుంది.

స్వస్తి.

17, నవంబర్ 2010, బుధవారం

అప్పటికి కానీ బుద్ధి రాదు, మరి !


అంధత్వం ఒక అంగ వైకల్యం. దురదృష్టవశాత్తు జన్మత: అంధత్వం కలిగితే, ఆ బ్రతుకంతా ఇక దుర్భరమే.

గ్రుడ్డితనం అనేది మనుషులకు చూపు సరిగా ఉండి కూడా, వేరే విధంగా వచ్చే అవకాశం ఉంది.

కళ్ళుండీ చూడ లేని కబోదులు కొందరుంటారు. వారిదంతా వక్ర బుద్ధి. అందు చేత వారి దృష్టి కూడా వక్ర మార్గాన్నే పడుతుంది.

దయామయుడైన భగవంతుడు రెండు నేత్రాలనూ ఇచ్చినది ప్రకృతిలోని అందాలను తనివి తీరా చూసి తరించేందుకే కదా ! హరిత శోభతో అలరారే చెట్లూ, చేమలూ, లతానికుంజాలూ, సూర్యోదయ సూర్యాస్తమయాల వేళ రాగ రంజితమైన ఆకాశమూ, నదులూ, సెలయేళ్ళూ, ఎగిరే పక్షులూ, పుచ్చ పువ్వులాంటి వెన్నెలా, రంగుల హరివిల్లులూ, కొండ కోనలూ. జలపాతాలూ, చెంగున దుమికే లేళ్ళూ, ... ఇలా ప్రకృతి అందాలు చూడడానికే కదా కళ్ళున్నది, కానీ, కరెన్సీ నోట్లను మాత్రమే చూడగోరే కళ్ళు ఉండీ లేనట్టే. అలాంటి వారు జాత్యంధులతో సమానం.

మహా భారతంలో ధృతరాష్ట్రుడు పుట్టు గ్రుడ్డి. దానికి తోడు అతనికి అలవిమాలిన పుత్ర
వాత్సల్యం అనే గ్రుడ్డితనం కూడా దాపురించింది. దానితో కౌరవ వినాశనానికి అతడే మూల కారకుడయ్యేడు.

సారపు ధర్మం, విమల సత్యం పారము పొంద లేక నాశనమవుతూ ఉంటే, నివారింప గల సమర్ధత కలిగి ఉండి కూడా , ఎవడు ఉపేక్ష చేస్తాడో , అది వాడికే చేటు కలిగిస్తుందని శ్రీకృష్ణుడు మహా భారతంలో హెచ్చరించాడు కదా?

అందు వల్ల కళ్ళు లేక పోవడం దయనీయమే అయినా, కళ్ళుండీ కానక పోవడం మాత్రం క్షంతవ్యం కానేరదు.

చాల మంది ఇలా కళ్ళున్న కబోదులుగా ఎందుకు మారుతున్నారయ్యా అంటే, మదం ముదిరి పోవడం వల్ల, అహంకారం అతిశయించడం వల్ల. అయాచితంగా ఉన్నత పదవీయోగం చేకూరడం వల్ల. తరాల తరబడి తిన్నా తరగని గని లాంటి సంపదలు వచ్చి పడడం వల్ల.

ఇలాంటి వారు పయనించేది పతన మార్గమే. ఇలాంటి వారిని అనుసరిస్తే మనకు పట్టే గతి కూడా అట్టిదే సుమా !

భాగవతంలో పోతనామాత్యుడు చెప్పిన పద్యం తెలిసినదే కదా?

కానని వాని నూత గొని కానని వాడు విశిష్ట వస్తువుల్
గానని భంగి కర్మములు గైకొని కొందఱు కర్మ బద్ధులై
కానరు, విష్ణుఁగొందఱటఁగందు రకించన వైష్ణవాంఘ్రి సం
స్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా !

గ్రుడ్డి వాడు మరొక గ్రుడ్డి వాని చేయి పట్టుకుని వాని సాయంతో ఏ వస్తువునూ చూడ లేడు.
అదే విధంగా, విషయాసక్తులై, కర్మ బంధాలలో చిక్కువడిన వారు శ్రీహరిని చూడ లేరు. కొందరు మహా విష్ణు భక్తులు మాత్రం ఆ స్వామిని కనులారా చూడ గలరు. అంతే కానీ సంసారంలో కొట్టు మిట్టాడుతూ ఉండే వారు భగవంతుడిని ఎన్నటికీ చూడ లేరు.

పుట్టుక చేతనే గ్రుడ్డితనం ప్రాప్తించిన వారిని సాయం తీసికొని మనం సత్యదర్శనం చేయ లేమని పోతన ఇందులో చెప్పాడు. కళ్ళున్న కబోదులను అనుసరించినా మన గతి అంతే అని కూడా అర్ధం చేసుకోవాలి.

కళ్ళున్న కబోదుల గురించి ఒక శ్లోకంలో కవి ఇలా వివరించాడు. చూడండి ...

సంపన్నో2ధవదేవ కించి దపరం నో వీక్షతే చక్షుషా,
సద్భి ర్వర్జితమార్గ మేవ చరతి ప్రోత్సాహితో జాలిశై:
తస్మిన్నేవ ముహు: స్ఖలన్ ప్రతిపదం గర్వాంధకూపే పత,
త్యస్యాంధత్వ నివర్తకైషధ మిదం దారిద్ర్య మేవాంజనమ్ !

మితి మీరిన సంపదలు కలవాడు గ్రుడ్డి వాడితో సమానం. అంధుడి లాగానే, వాడు తన కన్నులతో ఏమీ చూడ లేడు. దుష్టులతో తిరుగుతూ, వారి ప్రోత్సాహంతో సత్పురుషులు ఏవగించుకునే చెడు దారులలోనే సంచరిస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఆ చెడు మార్గం లోనే నడయాడుతూ ఉంటాడు. తమ చెడు ప్రవర్తన వలన చీటికీ మాటికీ అనేకమయిన దెబ్బలు తింటూ ఉంటాడు. అయినా బుద్ధి రాదు. తమ నడవడిక మార్చుకోడు. చివరకి అంధకూపంలోకి కూలి పోతాడు.

మరి, అలాంటి కళ్ళున్న కబోదుల అంధత్వం తొలిగించడానికి మార్గమే లేదా?

ఉంది.

వారి అంధత్వం పోగొట్టాలంటే దానికి దారిద్ర్యం అనేది ఒకటే తగిన అంజనం సుమా !

అంటే, అలాంటి వారి కళ్ళు తెరుచు కోవాలంటే, వారి సంపద ఉన్నదంతా ఊడ్చి పెట్టుకు పోయి, వాళ్ళు దరిద్రులయి పోవాలి, అంతా పోయేక కానీ వారి కళ్ళు తెరచు కోవు అంటున్నాడుశ్లోకంలో
కవి.

అలాగే, అధికార మదం చేత కళ్ళు కనిపించకుండా పోయే వారికి ఆ పదవి ఊడి పోతే తప్ప తిరిగి చక్కని చూపు రాదు. అధికారాంతమున చూడ వలె కదా, అయగారి సౌభాగ్యముల్ ! అని కదా ఓ కవి చెప్పాడు ...

స్వస్తి.

4, నవంబర్ 2010, గురువారం

ప్రయత్నించి చూస్తే పోయే దేముంది ?


విజయ విలాసం లో చేమకూర వేంకట కవి ధర్మ రాజు సుగుణాలను ఎలా వర్ణించాడో చూడండి.

దేవ బ్రాహ్మణ భక్తి ప్రోవు, ప్రియ వక్తృత్వంబు కాణాచి, వి
ద్యా వైదుష్యము దిక్కు, ధర్మమునకున్ దార్కాణ, మర్యాదకున్
ఠా, వౌచిత్యము జీవగఱ్ఱ, హితశిష్ట వ్రాత సంతోషణ
శ్రీ వజ్రాంగి, యజాత శత్రుడు మహీభృన్మాత్రుడే చూడగన్.

దేవ బ్రాహ్మణుల పట్ల అమిత భక్తి శ్రద్ధలు కలవాడు. ప్రియమైన మాటలు పలుకుతాడు. విద్యా వైదుష్యాలకు గతి. ధర్మానికి అతడే ఉదాహరణ ప్రాయుడు. మర్యాద ,ఔచిత్యాలు ఎరిగిన వాడు. మంచి వారినీ, సజ్జనులనూ కాపాడే వాడు, శత్రువులంటూ ఎవరూ లేని వాడు. లోకంలో సాధారణ రాజులలాంటి వాడు కాదు.

ఆవలబోయిన వెన్క నాడుటెన్నడు లేదు
మొగము ముందఱ నంట మొదలె లేదు

మనవి చెప్పిన చేయ కునికి యెన్నడు లేదు
కొదవగా నడుపుట మొదలె లేదు

చనవిచ్చి చౌక చేసినది యెన్నడు లేదు
పదరి హెచ్చించుట మొదలె లేదు

మెచ్చినచో కొంచె మిచ్చుటెన్నడు లేదు
మొక మిచ్చకపు మెచ్చు మొదలె లేదు.

మఱియుఁ దొల్లిటి రాజుల మహిమ లెన్ని
యితఁడె పో సార్వ భౌముఁడత్ప్రతిముఁడనఁగ
బ్రజలఁబాలించె సకల దిగ్భాసమాన
కీర్తి విసరుండు, పాండ వాగ్రేసరుండు

ఎదుట ఒక మాట, వెనుక ఒక మాట అనే దుర్లక్షణం లేదు. కాస్త ముఖం చాటు కాగానే ఆడిపోసుకోడం లేదు. అలాగని ముఖం మీదనే ఫెడీల్మనేలా కటువుగా పలకడం కూడా లేదు.
మనవి చేసుకుంటే, సహాయం చేయక పోవడం ఎప్పుడూ లేదు. అలాగని ఎంతో కొంత ఇచ్చి, చేతులు దులుపు కోవడం కూడ లేదు. ఇచ్చెనా, ఏనుగు పాడి అన్నట్టుగా, ఇవ్వడంలో ఎప్పుడూ తక్కువ చేయడు.

ముందు బాగా చనువు ఇవ్వడం. ఆతరువాత చులకనగా చూడడం ఎన్నడూ లేదు. అలాగే, ఊరికే పొగడ్తలతో ముంచెత్తడం కూడా చేయడు.

మెచ్చు కుంటే ఏదో కొంచెం ఇచ్చి పొమ్మనే రకం కాదు. అలాగని ముఖ ప్రీతి మాటలాడడం, ఇచ్చకాలు పలకడం అసలే లేదు.

వెనుకటి రాజుల గొప్పతనాలు ఎటువంటివో ఆలోచిస్తే, ధర్మ రాజు మాత్రమే చక్రవర్తి అని అర్ధమౌతుంది.

ఎంత లెస్సగ నున్న నంత వేడుక కాని,
ప్రజలకల్మి కసూయ పడుట లేదు

తనుఁగొల్వ వలె నందఱను ప్రియంబె కాని
మానిసి వెగటించుకైనను లేదు

నిచ్చ వేడిన నర్ధి కిచ్చు చిత్తమె కాని
మునుపింత యిచ్చితి ననుట లేదు

రేవగల్ ధర్మ మార్జించు దృష్టియె కాని,
న్యాయంబు దప్పిన నడక లేదు

కలడె యిటువంటి రాజు లోకమున నెందు !
జలధి వలయిత వసుమతీ చక్రమెల్ల
యేల వలె శాశ్వతముగాఁగ నీఘనుండె
యేల వలె నన్యు లన నృపాలుఁడలరె

తన పాలనలో ఉన్న ప్రజలు ఎంత సంపన్నులయితే, ధర్మ రాజు అంతగా సంతోషించే వాడు. అంతే కాని, తన ఏలుబడిలో ఉండే వారికి ఇంత సంపదా ? అని అసూయ పడే వాడు కాదు. అందరూ తన పాలనలో తనని సేవిస్తూ ఉండాలనే రాచరికపు వేడుకే తప్ప, మనుషులంటే ద్వేషం ఎప్పుడూ లేదు. అడిగిన వాడికి అడిగింది ఇవ్వడమే కాని, లోగడ ఇంత ఇచ్చేను కదా, మళ్ళీ అడుగుతావేం !అంటూ కసురు కోవడం లేదు. రాత్రీ పగలూ ధర్మ బద్ధంగా ఉండాలనే ఆలోచనే తప్ప ఎన్నడూ న్యాయ మార్గాన్ని తప్పి ఎఱుగడు.

లోకంలో ఎక్కడయినా ఇంత గొప్ప రాజు ఉన్నాడా? సముద్ర వేలా సర్యంత మయిన ఈ భూమండలాన్ని ఈ ఘనుడైన ధర్మ రాజే శాశ్వతంగా పాలించాలి. వేఱొక ప్రభువు మన కేల? అని ప్రజలు అనుకునే లాగున ధర్మజుడు ఒప్పుతున్నాడు.

కోపమొకింత లేదు, బుధ కోటికిఁగొంగు పసిండి, సత్య మా
రూపము, తారతమ్యము లెఱుంగు స్వతంత్రుడు, నూతన ప్రియా
టోపము లేని నిశ్చలుఁడిటుల్ కృత లక్షణుఁడై చెలంగగా
ద్వాపర లక్షణుండనఁగ వచ్చునొకో యల ధర్మ నందనున్

కోపం ఇసుమంతయినా లేదు. పండిత వర్గానికి కొంగు బంగారం. సత్యమే ఆకారంగా రూపు దాల్చిన వాడు. మంచి చెడ్డలు, బాగోగులు బాగా తెలిసిన వాడు. ఎవరో చెబితే చెప్పుడు మాటలు తలకెక్కించు కోకుండా స్వతంత్రమైన భావాలు కలవాడు.నూతన ప్రయాడంబరాలు లేని వాడు.రాజానో బహు వల్లభా: కదా? కొత్త రుచుల కోసం వెంపర్లాడే వాడు కాదు.ధృడ చిత్తం కలవాడు. ఇన్ని కృత లక్షణాలు కల ధర్మ రాజుని ద్వాపర లక్షణాలు కల వాడని అనడం ఏమి సబవు? కృత యుగంలో వ్యక్తులకు ఉండే లక్షణాలు అన్నీ సంతరించుకున్న వాడని చమత్కారం.

చూడండి. ధర్మ రాజు ఎన్ని గొప్ప సల్లక్షణాలు కల వాడో ! అందులో అన్నో, కొన్నో మంచి లక్షణాలు మనమూ అలవరుచు కోడానికి ప్రయత్నించి చూస్తే పోయేదేముంది చెప్పండి?

22, అక్టోబర్ 2010, శుక్రవారం

మౌనంగానే ఎదగమనీ ....


ఒక మంచి శ్లోకం చూదామా?

శరది న వర్షతి గర్జతి, వర్షతి వర్షాసు నిస్వనో మేఘ:
నీచో వదతి నకురుతే, వదతి న సాధు: కరోత్యేన.

శరత్కాలంలో మేఘం గర్జిస్తుంది. కానీ ఒక్క చినుకు నయినా రాల్చదు !
వర్షా కాలపు మేఘం ఏ చప్పుడూ చేయకుండానే ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తుంది !
అలాగే, నీచుడు బడబడలాడుతూ వదరుతాడు. కాని , ఏ పనీ సానుకూల పరచడు. సత్పురుషుడు మౌనంగా పనులన్నీ సానుకూలంగా నిర్వర్తిస్తాడు. అని దీని అర్ధం.

ప్రజాకవి వేమన

అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను
సజ్జనుండు పల్కు చల్ల గాను
కంచు మ్రోగు నల్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ వినుర వేమ

అని చెప్పాడు కదూ?

13, అక్టోబర్ 2010, బుధవారం

అదీ, అలా ఉండాలి !


కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలంటారు.
ఆధునిక కవి కూడా కొడితే కొట్టాలిరా, సిక్సు కొట్టాలీ ... అని తెగేసి చెప్పాడు.

ఈ శ్లోకం చూడండి:

దధతో యుధ్యమానస్య, పఠత: పులకో2థ చేత్
ఆత్మనశ్చ పరేషాం చ , తద్దానం సౌరుషమ్ స్మృతమ్ .

దానమంటూ చేస్తే ఎలా చేయాలయ్యా, అంటే, ఇచ్చే వాడికీ, పుచ్చుకునే వాడికీ, ఇతరులకీ కూడా ఆ దాన వైభోగం చూసి గగుర్పాటు కలగాలి ! ఇంకోలా చెప్పాలంటే తల దిమ్మెత్తి పోవాలి దానం చేడమంటే ఇలాగుండాలి అని ఒక మేలు బంతిలాగ ఉండాలంతే. కుర్రకారు భాషలో చెప్పాలంటే కెవ్వున కేక పెట్టించాలన్న మాట.

అలాగే, యుద్ధం చేస్తే ఆ రణనైపుణ్యం తనకీ, శత్రువుకీ, చూసే వారికీ కూడా ఆశ్చరానందాలను కలిగించేలా ఉండాలి.

అలాగే, దేనినయినా చదివితే చదువరులకు మైమరుపు కలిగించాలి.

అలా ఉండని ఆ దానమూ, ఆ పౌరుషమూ, ఆ పఠనమూ ఒట్టి దండగ మాలి పనులు.

ముందుగా ఒళ్ళు జలదరించే దాన విశేషం గురించి చూదాం ...

వామనుడు రాక్షస రాజు బలి చక్రవర్తిని కేవలం మూడడుగు నేల దానమడిగాడు. సరే ఇస్తానని ఇవ్వడానికి సిద్ధ పడ్డాడు బలి. రాక్షస గురువు శుక్రాచార్యుడు అడ్డు తగిలాడు. అడిగింది ఎవరను కున్నావ్? అడిగింది ఏమిటనుకున్నావ్? అంటూ హెచ్చరించాడు.

మహా దాత బలి వెనక్కి తగ్గ లేదు. ఇలా అన్నాడు. భాగవతంలో పోతన వ్రాసిన గొప్ప పద్యాలలో ఇదొకటి.

ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ దనువుపై నంసోత్తరీయంబుపైఁ
బాదాబ్జములపైఁగపోల తటిపైఁబాలిండ్ల పై నూత్న మ
ర్యాదం జెందు కరంబు గ్రిందగుట, మీదై నాకరంబుంట మే
ల్గాదే ? రాజ్యము గీజ్యమున్ సతతమే ? కాయంబు నాపాయమే !?

ప్రియ సతి లక్ష్మీ దేవి శరీర భాగాలను నూతన మర్యాదతో తాకిన ఆ చేయి ఇప్పుడు దానం స్వీకరించడానికి క్రింద ఉంది. దానమిచ్చే నా చేయి ఇప్పుడు మీద ఉంది. ఇంత కంటె భాగ్యం వేరే ఏముంది? ఈ రాజ్యాలూ గీజ్యాలూ ఎల్ల కాలం ఉండి పోతాయా ? దేహం నశించ కుండా శాశ్వతంగా నిలిచి పోతుందా?

ఎంత గొప్ప దానశీలత్వమో కదూ ! దానం అంటే అలా ఉండాలి.

వచ్చిన వాడు ఇంద్రుడని తెలిసినా , సహజ కవచ కుండలాలను ఇచ్చిన కర్ణుడూ. తన శరీర భాగాన్నే కోసి ఇచ్చిన శిబి, తన వెన్నెముకను ఒక మహత్తర దేవ కార్యం కోసం అర్పించిన దధీచి, చాలా దినాలు క్షుద్బాధను అనుభవించి, తరువాత క్షుధార్తుడయిన తనకు లభించిన ఓగిరాన్ని కూడా అర్ధికి ఇచ్చి వేసిన రంతి దేవుడూ .... వీళ్ళూ దాతలంటే. దానం చేయడమంటే అలాగుండాలి.

ఇక యుద్ధం సంగతి చూదాం.

శ్రీనాథుడు చెప్ప లేదూ?

ఎవ్వనితో నెచ్చోటన్
చివ్వకు చేసాచ వలదు. చే సాచినచో
నివ్వల నవ్వల నెవ్వరు
నవ్వక యుండంగ పగ సనన్ తీర్పదగున్

ఎవరితోనూ ఎక్కడా కూడా యుద్ధానికి తలపడనే వద్దు. ఒక వేళ యుద్ధం చేయవలసిన అక్కర పడితే మాత్రం పగ వాడి అంతు చూడనిదే వదల వద్దు సుమా ! చుట్టు ప్రక్కల ఎవరికీ పరిహాస పాత్రమయ్యే లాగున మాత్రం రణం చేయ వద్దు.
యుద్ధ రంగంలో పగవారికి వెన్ను చూపడం కన్నా హీనం మరొకటి లేదు.

ఉత్తర కుమారుని యుద్ధ ప్రాగల్భ్యం తెలిసినదే కదా ?

యుద్ధం చేయకుండా మగిడి వచ్చిన ఖడ్గ తిక్కనను చూసి, రోసి, అతని తల్లి, భార్య వానికి పౌరుషం కలిగించేలాగున ప్రవర్తించారుట. తానమాడడానికి మరుగు, పసుపు ముద్ద సిద్ధం చేసి అవమానించారుట. భోనాల వేళ విరిగిన పాలు పోసారుట. ఎన్నడూ లేని ఈ అనాదరణకి విస్తు పోయి ఖిన్నుడయిన తిక్కనకు తల్లి సమాధానం చూడండి:
పగరకు వెన్నిచ్చినచో
నగరే నిను మగతనంపు నాయకులెందున్?
ముగురాడవార మైతిమి !
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్ ?!

అసదృశముగ నరివీరుల
మసి పుచ్చక విరిగి వచ్చు మగ పంద క్రియన్
గసవున్ మేయగఁబోయిన
పసులున్ విరిగినవి తిక్క ! పాలున్ విరిగెన్.

యుద్ధంలో పగ వారితో పోరాడ కుండా వారికి వెన్ను చూపి పారి వచ్చిన వాడికి మగతనం ఉండదు కదా నాయనా ! వీరత్వం ఉన్న వారు అలాంటి పందలను మెచ్చుకోరు. ఇప్పుడు ఇంట్లో నీతో కలిపి ముగ్గురం ఆడువారమైనాము కదా ?
ఆడుదానివలె తడికె చాటున ఆ పసుపు రాసుకుని తానమాడి రావయ్యా అని వెటకారం.

పగ వారిని వీరోచితంగా ఉక్కడగించి రానట్టి పిరికి పందని చూసి, పశువుల మనసులు విరిగి పోయాయి. అవి ఇచ్చిన పాలు కూడా విరిగి పోయాయి. ఈవేళకి విరిగిన పాలతో భోజనం కానిద్దూ ! అని అవహేళన.

ఇక, పఠనయోగ్యాలయిన గ్రంథాల గురించి.

మంచి పుస్తకం చదివితే, చదవడం పూర్తయాక కూడా అది మనల్ని వెంటాడి వేధించాలి. ఆలోచింప చేయాలి. అలజడి కలిగించాలి. ఆహా !అనిపించాలి. కానప్పుడు కాల హరణం తప్ప ప్రయోజనం ఉండదు.

అదండీ సంగతి !

స్వస్తి.

9, అక్టోబర్ 2010, శనివారం

స్నేహమేరా జీవితం


స్నేహ మేరా జీవితం
స్నేహ మేరా శాశ్వతం ...

పాట పల్లవి బాగుంది. నీ స్నేహితులని చూసి నువ్వు ఎలాంటి వాడివో చెప్పొచ్చును అంటారు.

అందు చేత మంచి వారితో స్నేహం చేయాలి. అప్పడు మనకి మేలు కలుగుతుంది. చెడు స్నేహాలు ఎప్పుడూ కీడునే కలిగిస్తాయి.

క్షీరేణాత్మ గతోదకాయ హి గుణా దత్తా: పురాతే2ఖిలా:
క్షీరోత్తాప మవేక్ష్య తేన పయసా స్వాత్మాకృశౌ హుత:
గంతుం పావక మున్మనస్త దభవ దృష్ట్వాతు మిత్రాపదాం
యుక్తం తేన జలేన శ్యామతి సతాం మైత్రీ పునస్త్వీదృశీ

పాలతో కలిసాయి నీళ్ళు. ఆ నీటికి కూడ పాల గుణమే వచ్చింది. ఏవి పాలో, ఏవి నీళ్ళో తెలియనంతగా చక్కగా కలిసి పోయాయి ఆ రెండూనూ.

పాలు సలసలా మరగడం చూసి, మిత్రునకు వచ్చిన కష్టం చూసి, ఓర్చుకోలేక బాధతో నీరు అగ్నిలో దుమికింది. మిత్రుడు తన కోసం అగ్నిలో దుమకడం చూసి, అతనికి వచ్చిన ఆపద చూసి కలవర పడి క్షీరం కూడా అగ్నిలో దుమికింది. అంటే, నీళ్ళతో కలిసిన పాలు, పొంగి, అగ్నిలో పడడం జరిగిందన్న మాట. అయితే, నీటితో కలిసిన పాలు అగ్నిలో పడడం వలన
అగ్ని చల్లారి పోయింది. మహాత్ముల మైత్రి ఇలాగే ఉంటుంది మరి.!

పద్యం చూడండి:

క్షీరము మున్ను నీటి కొసఁగెన్ స్వగుణంబులు దన్నుఁజేఱుటన్
క్షీరము తప్త మౌటఁగని చిచ్చురికెన్ వెతచే జలంబు, దు
ర్వార సుహృద్విపత్తిఁగని వహ్నిఁజొరం జనె దుగ్ధ , మంతలో
నీరముఁగూడి శాంతముగ నిల్చు, మహాత్ముల మైత్రి యీ గతిన్.

చెడ్డ వారితో స్నేహం పనికి రాదు సుమీ ! ఎందుకంటే,

పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినమ్
వర్జయేత్తాదృశమ్ మిత్రం విషకుంభ పయో ముఖమ్

ఎదుట పొగుడుతారు. వెనుక గోతులు త్రవ్వుతూ మన పనులు చెడ గొడతారు. అలాంటి పయోముఖ విషకుంభాల వంటి మిత్రులను వెంటనే విడిచి పెట్టాలి. పాల కడవల వంటి విషపు కుండల వంటి వారు సుమా !

అలాగే,

దుర్జన: ప్రియవాదీతి నైతద్విశ్వాస కారణమ్
మధు తిష్ఠతి జిహ్వాగ్రే హృది హాలాహలమ్ విషమ్

ఎంత తియ్యగా మాట్లాడుతున్నా సరే, చెడ్డ వారిని నమ్మ కూడదు. వారి నాలుకల మీద అమృతం ఉంటుంది. మనసులో మాత్రం విషం ఉంటుంది.

దుర్జన: పరిహర్తవ్యో విద్యయా2లంకృతో2పిసన్
మణినా భూషిత: సర్ప: కిమసౌ న భయంకర:

ఎంత విద్యావంతులయినా సరే, చెడ్డ వారితో స్నేహం మానేయాలి. ఎందుకంటే, పడగ మీద మణి ఉన్నంత మాత్రం చేత పాము భయంకరమైనది కాకుండా పోదు కదా ?

మంచి వాళ్ళతో మైత్రి చిరకాలం నిలుస్తుంది. చెడ్డ వారితో స్నేహం కలకాలం నిలవదు.
ఎలాగంటే,

మృద్ఘటవత్ సుఖ భేద్యో దుస్సంధానశ్చ దుర్జనో భవతి
సుజనస్తు కనక ఘటేవ దుర్భేద్య శ్చాసు సంధేయ:

మట్టి కుండ సులభంగా పగిలి పోతుంది. తిరిగి అతికించడం సాధ్యం కాదు. చెడ్డ వారితో స్నేహం అలాంటిదే. త్వరగా చెడి పోతుంది. తిరిగి కలియదు.

మంచి వారితో మైత్రి అలా కాదు. బంగారు కుండని పగుల కొట్టడం ఎంతో కష్టం. కాని అతకడం తేలిక. సాధ్యపడుతుంది కూడా. అలాగే మంచి వారితో స్నేహం ఎన్నటికీ చెడి పోదు.


మంచి మిత్రుని లక్షణాలు ఎలాంటివంటే,

అఘము వలన మరల్చు, హితార్ధ కలితుఁ
జేయు, గోప్యంబు దాచుఁ బోషించు గుణము
విడువఁడాపన్ను లేవడి వేళ నిచ్చు
మిత్రుడీ లక్షణముల మెలఁగుచుండు.


మనలని తప్పులు చేయకుండా సరైన మార్గంలో నడిచేలా చూస్తాడు. మంచి చేస్తాడు. మన రహప్యాలు వెల్లడి చేయకుండా గోప్యంగా ఉంచుతాడు. మన మంచి గుణాలని మెచ్చుకుంటాడు. ఆపదలో మన వెంటే అంటిపెట్టుకుని ఉంటాడు. దూరంగా పారి పోడు.అవసరానికి ఆదుకుంటాడు. మంచి మిత్రుడు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు.

దుర్జనేన సమం వైరం, ప్రీతిం చాపి న కారయేత్
ఉష్ణోదహతి చాంగార:, శీత: కృష్ణాయతే కరమ్

చెడ్డ వాళ్ళతో విరోధమూ వద్దు. స్నేహమూ వద్దు. రెండూ మంచిది కాదు.
బొగ్గులు చల్లగా ఉన్నాయి కదా అని ముట్టుకుంటే చేతులకు మసి అంటుకుంటుంది. వేడిగా ఉన్నప్పుడు తాకితే చేతులు బొబ్బలెక్కుతాయి కదూ?

అందు చేత ఎలాంటి వారితో స్నేహం చేయాలో మనమే నిర్ణయించుకోవాలి.స్వస్తి.

7, అక్టోబర్ 2010, గురువారం

ఇలా ఉండడం మన వల్ల కాదు బాబూ !!


ఎవరయినా తిడితే , వొళ్ళు మండి పోతుంది. వారిని మళ్ళీ తిట్టాలనిపిస్తుంది. చెడామడా దులిపేయాలనిపిస్తుంది.
తిడితే ఊరుకుంటామా చెప్పండి?

దూషణ భూషణ తిరస్కారములు దేహమునకే కాని, ఆత్మకు కావు అనుకునే మహానుభావులూ
ఉంటారు. తిట్ల దండకం తవ్వి పోస్తున్నా, చిద్విలాసంగా నవ్వుతూ, అయితే ఏమిటిటా ! అంటూ
నవ్వ గలగడం చాలా కష్టం సుమా ! అలా ఉండగలిగే వారు అయితే యోగులేనా కావాలి. లేదా మందబుద్ధులేనా కావాలి. కాదంటే బధిరులేనా కావాలి.

ఈ శ్లోకం చూడండి ...

మన్నిందయా యది జన: పరితోష మేతి
నన్వ ప్రయత్న జనితో2య మనుగ్రహో మే,
శ్రేయోర్ధినో హి పురుషా: పరతుష్ఠి హేతో:
దు:ఖార్జితాన్యపి ధనాని పరిత్యజంతి.

నన్ను తిట్టడం వలన జనాలకి ఆనందం కలుగుతోందా !? ఆహా ! ఎంత అదృష్టవంతుడిని !నా భాగ్యం ఎంత గొప్పది ! నా మీద అప్రయత్నమైన అనుగ్రహం చూపించడమే కదా, నన్ను నిందించడమంటే. ఈ విధంగానయినా నన్ను పట్టించుకుంటున్నారంటే నాకు అంత కన్నా ఇంకేం కావాలి? లోకంలో చాలా మంది ఎంతో డబ్బు తగలేసి, ఇతరులకు సంతృప్తిని కలిగించి మరీ వారి కి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు.

మరి నాకో? ఒక్క పైసా ఖర్చు చేయకుండానే ఇతరులకు ఆనందాన్ని కలిగించే భాగ్యం దక్కుతోంది. నన్ను తిట్టడం వలన వారికి అట్టి ఆనందం కలుగుతూ ఉంటే నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పండి !

పాజటివ్ పబ్లిసిటీ కంటె నెటిటివ్ పబ్లిసిటీ వేగిరం వస్తుందని మనకి తెలిసిందే కదా. ( అయితే, అది ఉండడం, ఊడడం వేరే సంగతి)

మీది శ్లోకంలో చెప్పినట్టుగా సంబర పడి పోయే వారిని ఎవరు మట్టుకు ఏమనగలరు చెప్పండి?
ఇంత సహనమూ, సౌజన్యమూ ఉండాలంటే ఎంత చిత్త సంస్కారం కావాలో ఆలోచించండి.

ఎదుటి వారి భావ ప్రకటనను గౌరవించడానికి ఎంతో మానసిక ఔన్నత్యం కావాలి కదూ!

ఈ సందర్భంలో ఒక మంచి కొటేషన్ గుర్తుకొస్తోంది:

నీ అభిప్రాయంతో నేను వంద శాతం అంగీకరించడం లేదు. కాని , నువ్వు స్వేచ్ఛగా నీ అభిప్రాయాన్ని తెలియజేసుకునే నీ హక్కు కాపాడడం కోసం నీ తరఫున నేనూ పోరాడుతాను.
2, జులై 2010, శుక్రవారం

కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 6


అఙ్ఞాత వాసం ఒక్క ఏడాదీ విరాట మహా రాజు కొలువులో గడపడానికి నిర్ణయించుకున్నాక, పాండవులు ఒక్కొక్కరూ మారు వేషాలలో వచ్చి, విరటుని కొలువులో చేరారు.

ధర్మ రాజు , భీముడు , అర్జునుడు , నకులుడు , సహ దేవుడు వరుసగా కంకు భట్టు , వలలుడు ,బృహన్నల , దామగ్రంథి ,తంత్రీ పాలుడు అనే పేర్లతో విరటుని కొలువులో ప్రవేశించారు. (ఆ వివరాల కోసం ఆయా పేర్ల వద్ద నొక్కి చూడండి.)

ఇక, మిగిలింది ద్రౌపది. ఆమె సైరంధ్రీ వేషంలో మాలినిగా విరాట మహా రాజు పట్ట మహిషి సుధేష్ణ కొలువులో వచ్చి చేరింది.

ఆమె తన దేశాచారం ప్రకారం కేశపాశం అంతా విప్పుకుని, కొప్పుగా అమర్చడానికి అనువుగా జడను అల్లుకున్నది. కొప్పు కొద్దిగా కుడి వైపునకు ఒరిగే విధంగా అమర్చుకుంది. కొద్దిగా మాసిన చీర కట్టుకుంది. ముతక నార బట్టతో స్తన మండలాన్ని కప్పుకుంది.

ఆమె తన ఆకారంలో దాసీత్వ లక్షణాన్ని ఉట్టి పడేటట్లు చేసికొంది. దాసీ భావాన్ని స్థిరంగా మనసులో నిలుపు కొన్నది. ఆవిధంగా విరటుని రాచ నగరు లోనికి ప్రవేశించింది.

అలా పైరంధ్రీ వేషంలో వస్తున్న ద్రౌపది మేఘం క్రమ్మడం వల్ల కాంతి తగ్గిన చంద్ర కళలా ఉంది. మంచు కప్పడం చేత వన్నె తగ్గిన పద్మంలా ఉంది. పొగ క్రమ్మడం వల్ల కాంతి తగ్గిన దీప శిఖలా ఉంది. దుమ్ము పడగా నిగ నిగలు తగ్గి, లావణ్యం కొరవడిన తీగ లాగ ఉంది. మొత్తానికి ఈ వేషంలో ఆమె రూపం లోని సహజంగా ఉండే ఉజ్వలత్వం మరుగున పడింది.

అలాంటి వేషంతో వస్తున్నద్రౌపదిని చూసి, పుర జనులు తమలో తాము యిలా అనుకున్నారు:

‘‘ ఈమె రోహిణి కాని , అరుంధతి కాని అయి ఉండాలి. అంతే కాని , మానవ కాంత మాత్రం కాదు. తన రూపలావణ్యం చేత చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతే కాదు, అందరి మన్ననలు పొందుతోంది. మంగళ ప్రదమయిన ఆ శరీర కాంతి చూస్తే సందేహం కలుగుతోంది. ఏ లోకం లోనయినా , యిటువంటి అపురూప రూపవైభవం కలవారు ఉంటారా ?’’ అనుకుంటూ బిలబిలా ఆమె దగ్గరకి వచ్చి చేరారు. ‘‘ నీవెవరు ? ఏ పని మీద ఎక్కడికి పోతున్నావు?’’ అని అడిగారు. అప్పుడు ద్రౌపది సుముఖత, సద్భావం వెల్లడి అయేవిధంగా ఇలా అంది:

ద్రౌపది:

‘‘నేను సైరంధ్రిని. నాకు కూడూ గుడ్డా చాలును. ఎవరు నన్ను దయతో పోషిస్తారో వారి దగ్గర పనులు చేస్తాను ’’

ఆమె మాటలు విని అక్కడి వారు ఆశ్చర్య పోయారు. వారికి కొంచెం సందేహం కూడ కలిగింది, ‘‘ ఈమె కడుపు కూటికి ఎక్కడయినా ఉంటానంటున్నది. ఇది నమ్మదగిన మాటేనా?’’ అనుకుంటూ ఆమెని చూస్తూ చుట్టుముట్టారు.

ఆసమయంలో -

విరాట మహా రాజు పట్టమహిషి సుధేష్ణ తన అనుగు చెలికత్తెలతో అంత:పురం మేడ పైభాగంలో విహరిస్తోంది. ఆ మేడ కిటికీల గుండా సైరంధ్రి పుర వీధిలో రావడం గమనించింది. ఆత్మగతాన యిలా అనుకుంది,

సుధేష్ణ : ( తనలో)

‘‘ఈమె ఎక్కడి నుండి వస్తున్నదో ? ఎక్కడికి వెళ్తున్నదో కదా? ఒంటరిదానిలా ఉంది. ఈమెలో అందం ,ఔన్నత్యం కనిపిస్తున్నాయి. అయినా, ఒక సేవకురాలిలాగా వినయంగా వంగి మాట్లాడుతోంది. నగర ప్రజలు కూడ ఎంతో వింతగా ఆమెను చూస్తూ ఉన్నారు. తొందరగా వెళ్ళి ఆమెను వెవటబెట్టుకుని రండి ’’ అని చెలులను పురమాయించింది. సుధేష్ణ యిలా చెప్పడంతో ఇద్దరు ప్రౌఢాంగనలు బయలు దేరి ద్రౌపది దగ్గరకి వెళ్ళి ‘‘ విరాట మహా రాజుల వారి పట్ట మహిషి సుధేష్ణా దేవి దయతో నిన్ను తన దగ్గరకి తీసికొని రమ్మని మమ్ములను పంపించింది, రా ’’ అని పలికారు. అప్పుడు ద్రౌపది మేలి ముసుగు సవరించుకుంది. వినయమే స్త్రీ రూపం ధరించిందా అన్నట్టుగా ఆ చెలుల వెంట అంత:పురం లోనికి బయలు దేరింది.

ద్రౌపది పాదాలు ఎర్రగా ఉన్నాయి. అందు చేత ఆమె నడుస్తున్నంత మేరా కుంకుమ పోసి నట్టు ఎర్రబడి పోతోంది. ఆమె శరీరం మిలమిలలాడి పోతోంది. అందు చేత ఆమె వస్తూ ఉంటే గోడలూ, అరుగులూ మణులు పొదిగినట్టుగా ప్రకాశిస్తున్నాయి. ఆమె కళ్ళు ఒక వింత కాంతితో మెరిసి పోతున్నాయి. ఆ చూపులు పూలు చల్లినట్టుగా ఉన్నాయి. ఆమె జుట్టు నల్లగా నిగ నిగలాడి పోతోంది. అందు చేత గదుల

పై భాగాన నల్లని పట్టు చాందినీ కట్టినట్టుగా కనిపిస్తోంది. ఆమె అడుగిడగానే విరటుని అంత:పురమంతా ఒక కొత్త కాంతితో మెరిసి పోయింది. ఈ విధంగా ద్రౌపది నెమ్మదిగా సుధేష్ణ ఉన్న మేడ మీదకి ఎక్కి వచ్చింది.

అలా వస్తున్న ద్రౌపదిని విరాటుని దేవేరి చూసింది. ఆమె ముఖంలో ఒక విధమయిన గౌరవభావం కదలాడింది. సాదరంగా చేతులు ముందుకు సాచింది. కనీకనబడనట్టుగా దంతకాంతులు వ్యాపిస్తూ ఉండగా ద్రౌపదిని ప్రేమగా దగ్గరకి రమ్మని పిలిచింది. ద్రౌపది మెల్ల మెల్లగా ఆమె దగ్గరకి చేరి నిలబడింది. సుధేష్ణ ఒక సారి ఆమెను ఆపాదమస్తకం పరిశీలించింది. కుతూహలంతో యిలా అడిగింది:

సుధేష్ణ :

‘‘ తల్లీ, నీకులమేమిటి ? నీవు ఎవరిదానవు? ఏ పని మీద ఎక్కడికి వెళ్దామని బయలు దేరావు? మాకు అంతా వివరంగా చెప్పు.’’

సైరంధ్రి:

‘‘ నేను సైరంధ్రీ జాతి దానను. నా పేరు మాలిని. నాకు అయిదుగురు భర్తలు. ఒకానొక కారణం వలన మా విరోధులు అహంకారంతో నా భర్తల ఎదుటే నన్ను జుట్టు పట్టుకుని లాగి అవమానించారు. నా భర్తలతో కలసి అడవికి వెళ్ళాను. అక్కడ కందమూలాలు తిని కాలక్షేపం చేసాను. బ్రహ్మచర్యాన్ని అవలంబించాను. ఇంక, నాకొక నియమం ఉంది. ఆనియమం ఇంకా ఒక్క ఏడాది మాత్రం ఉంది. నీవు ధర్మపరురాలవని విన్నాను. నీదగ్గరే ఉండాలని వచ్చాను. నావ్రతసంపూర్తి ఇక్కడే చేసుకుంటాను. నా చేతనయిన పనులు చేస్తాను’’

సుధేష్ణ :

‘‘ దేవతలు, గరుడులు, ఖేచరులు, విద్యాధరులు, కిన్నరులు, యక్షులు, సిద్ధులు - వీరికి చెందిన కాంతలలో నీవు ఒకతెవు కావచ్చును. ఈ నగరానికి రావడానికి కారణం ఏమిటో అబద్దమాడకుండా చెప్పు.’’

ద్రౌపది : ( మందహాసం చేస్తూ )

‘‘ నేను ఇంతకు ముందు శ్రీకృష్ణుని భార్య సత్య భామ దగ్గర, ఆ పిమ్మట ద్రౌపది దగ్గర పని చేసే దానిని.

పరిచారికలు చేసే పనులన్నీ నాకు తెలుసును. ఆపనులన్నీ నేను చేసినవే. వాటిని చేయడంలో నాకు చాల సమర్ధత ఉంది. అమ్మా, విను. ద్రౌపది నన్ను ప్రాణప్రదంగా చూసుకునేది. అంతెందుకు? నన్ను తనతో సమానంగా చూసుకునేది.

నీవు కూడ అలాగే చూడాలని కోరుతున్నాను. నీచములయిన పనులకు నేను తగను. ఈ విషయం ముందుగా నీవు తెలుసుకోవాలి. గౌరవమయిన పద్ధతిలో నన్ను స్వీకరించు. నా సైరంధ్రీ జాతి ఆచారానికి విఘాతం కలగని విధంగా నన్ను ఏలుకో.

కలపాలు ( చందనాది సుగంధ ద్రవ్య విశేషాలు) కలపడం నాకు బాగా తెలుసును. రకరకాలయిన తిలకాలు దిద్దడమూ తెలుసును. వింత వింతలుగా పూలమాలలు కట్టడం, ముద్దుగా కొప్పులలో ముడవటం, దండగుచ్చటం అన్నీ నాకు బాగా తెలుసును.’’

ఆమాటలకు సుధేష్ణ ఆశ్చర్యపోతూ ఇలా అంది:

సుధేష్ణ:

‘‘ అమ్మాయీ ! నీ రూపాన్ని చూసి మా రాజు ఆకర్షితుడయి ఉవ్విళ్ళూరడం ఖాయం ! అటువంటిది, నీ చేత నేను ఎలా పనులు చేయించుకుంటాను చెప్పు? మగ వాళ్ళ సంగతి అలా ఉంచు ఆడవారు కూడా నీ అందం చూసి కళ్ళు మరల్చ లేక పోతున్నారు కదా? ఇంకా వేరు మాటలు ఎందుకు?

నిన్ను భరించడం చాల కష్టం తల్లీ ! నీరక్షణ పీత గర్భంలాంటిది ! నిన్ను చేరదీసి, నా వినాశనం నేనే కొనితెచ్చుకున్నట్టవుతుంది. అది తెలివయిన పని కాదు.’’

(ఎండ్రకాయ (పీత) ప్రసవించే సమయంలో పిల్లలు తల్లి గర్భం చీల్చుకుని పైకి వస్తాయి. తల్లి చనిపోతుంది. అందు చేత పీత గర్భం క్షేమకరం కాదు)

అని పలికిన మహారాణితో ద్రౌపది ఇలా అంది.

ద్రౌపది (సైరంధ్రి):

‘‘ అమ్మా, నీవనుకున్న విధంగా ఎన్నటికీ జరుగదు. నా భర్తలు సామాన్యులు కారు. ఉపాయశీలురు. మిక్కిలి బలవంతులు. గొప్ప పరాక్రమం కలవారు. ఒక్క నిమేష కాలమయినా, నావిషయంలో వారు పరాకుగా ఉండరు. నన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు.

నన్ను ఎవడయినా నీచ బుద్ధితో చూస్తే నా భర్తలు ఆ నీచుడిని ఆ రాత్రే కడతేరుస్తారు. హరిహరాదులు అడ్డం వచ్చినా సరే యిదితప్పదు. వారెంత బలమూ, పరాక్రమమూ ఉన్న వారయినా నా భర్తల చేతిలో హతం కావలసిందే.

నన్ను నీచ బుద్ధితో చూసే ఆనీచులకు వందల కొద్దీ బంధువులు ఉండవచ్చును. వాళ్ళు గొప్ప పరాక్రమం కలిగిన వారు కావచ్చును. మదాంధులు కావచ్చును. శక్తి సంపదతో భయంకరులు కానోపును. ఏనుగుల వలె ఉండవచ్చును. అయినా సరే, నా భర్తలు కీళ్ళకు కీళ్ళు విడదీసి వారిని చంపి వేస్తారు. అందు వలన మగవారు నా వేపు తేరిపారి చూడడానికి కూడ భయపడుతారు.

అంతే కాదు. నా మనసు అటువంటి వారికి గోచరించదు. నా పెద్దల శిక్షణ, ఆచారం అలాంటివి. కనుక, ఇటువంటి అల్పమయిన మాటలు మాట్లాడ వద్దు. మనసులో ఇంకేమీ పెట్టుకోకు. నా మీద సందేహం వద్దు. నన్ను నీ సేవకురాలిగా స్వీకరించు. నాగరికమూ, ఉదాత్తమూ అయిన పనులు , నీకు నచ్చిన పనులు, నీకు నచ్చిన పద్ధతిలో భయభక్తులతో చేస్తాను.నా చేతలు పెద్దలు కూడ మెచ్చుకుంటారు. అందరూ ప్రశంసించేలా నా ప్రవర్తన ఉంటుంది.

నన్ను నీచకార్యాలకు పంపని వారిని, ఎంగిలి కూడు నాకు పెట్టకుండా నన్ను గౌరవంతో చూసుకునే వారిని నా భర్తలు కూడా ఎంతో ఆదరంతో చూస్తారు.’’

సైరంధ్రి పలికిన ఈ మాటలతో విరాట మహా రాజు పట్ట మహిషి సుధేష్ణ సంతోషించింది. ఆ మాటలతో ఆమె మనసు కుదుట పడింది. ఆమెను తన వద్ద సేవకురాలిగా చేర్చుకుంది. సైరంధ్రి కూడ అంత:పుర మర్యాదలకు అనుగుణంగా ప్రవర్తించ సాగింది.

ఈ విధంగా పాండవులయిదుగురూ., వారితో పాటు ద్రౌసది మారు వేషాలతో, మారు పేర్లతో విరటుని కొలువులో చేరారు. దీనితో లోగడ ఓ అష్టావధానంలో అవధాని సమస్యను పూరించినట్టు - కుంజర యూథం దోమ కుత్తుకను చొచ్చినట్టయింది !!

తదుపరి హిత వచనమ్డాట్ కామ్ లో మరి కొన్ని ...

స్వస్తి.