బావా మరుదులిద్దరూ సంత కెళ్ళారు. మంచి ఆవు నొకదానిని బేరం చెయ్యడానికి. బావ గారు అక్కడున్న ఆవులలో ఒక దానిని చూసి, బేరమాడమన్నాడు. మరిది గారికి అక్కడున్న వాటిలో ఒక్కటీ నచ్చినట్టు లేదు. ‘‘ పదరా, బావా పోదాం’’ అంటూ అక్కడి నుండి కదిలాడు....ఒక భాషలో చెబితే చాలదన్నట్టు మొత్తం ఐదు భాషలలో పోదాం పద రమ్మన్నాడు... పద్యంలో ఉన్న దాన్ని ‘‘ ఏ ఆవురా బావా’’ అని మారిస్తే ఆ భాషా పదాలు కనిపిస్తాయి...అన్నింటికీ రమ్మనే అర్ధం !!
ఏ - మరాఠీ ఆవు - ఉర్దూ రా - తెలుగు బా - కన్నడం వా - తమిళం
శివ పరమైన అర్ధం : పన్నగ ధారి కరాగ్ర: = చేతిలో పాముని ధరించిన వాడు గంగా , ఉమా లక్షిత: = గంగా పార్వతులచే కోరబడిన వాడు అంగదోగ్రభుజ: = భుజాల మీద బాహుపురులు, స్వర్ణాభరణాలు ధరించిన వాడు శశిఖండ శేఖర: = చంద్ర రేఖను శిరోభూషణంగా కలవాడు ఉమా పరిగ్రహ: = పార్వతీ దేవిని భార్యగా స్వీకరించిన వాడు అనాది: = పుట్టుక లేని వాడు ముహు: త్వాం అవతు = సదా మిమ్ములను కాపాడు గాక !
ఇక, విష్ణు పరమై అర్ధాన్ని చూదామా? ముందుగా పై శ్లోకంలోనివిశేఫణ పదాల నుండి తొలి అక్షరాలను తొలిగించి చదవండి ... నగధారి కరాగ్రహ: = గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడు గోమాలక్షిత: = భూమి, గోవులు, లక్ష్మీ దేవి - వీరిచే కోర బడిన వాడు గదాగ్ర భుజ:= భుజాన కౌమోదకి అను గదను దాల్చిన వాడు శిఖండ శేఖర: = శిరసున నెమలి పింఛము కలవాడు మా పరిగ్రహ: = లక్ష్మీ దేవిని భార్యగా పొందిన వాడు అనాది: = తొలి అక్షరాలు తొలిగించగా మిగిలిన విశేషణములు కల వాడైన శ్రీ మహా విష్ణువు ముహు:త్వాంఅవతు = సదా మిమ్ములను కాపాడు గాక !
lనా శ్రీమతి ముచ్చటగా మూడు కథలు మాత్రమే రాసిందని చెప్పాను కదూ ? మొదటి కథ *బరువు* బ్లాగులో ఉంచాను ... ఇది రెండోది. ... మూడోది త్వరలో పెడతాను ... వీటికి వచ్చే స్పందనలు చూసైనా ఆమె మళ్ళీ కలం విదిలిస్తారేమో చూడాలి !
వెనుకటి రోజులలో కొన్ని బ్రాహ్మణ కుటుంబాలలో భర్తలు భార్యలను ‘‘ వొసే ’’ ,, ‘‘ వొసేయ్ ’’ అని పిలవడం ఉండేది. గురజాడ వారి కన్యాశుల్కం ఓ సారి గుర్తుకు తెచ్చు కోండి ...
ఈ పిలుపును గురించి శ్రీ చెల్ల పిల్ల వేంకట శా స్త్రి గారు చక్కని పద్యం చెప్పారు. చూడండి ...
ఇతర దేశమ్ముల జనయించుకంటె నాంధ్ర దేశాన జనయించుటార్య హితము ‘వశి వశి’ యటంచు పిలుతురు వారు భార్య నదియు ‘శివ శివ’ యై తుద కఘములడచు !!
వేరే దేశాలలో (ప్రాంతాలలో) పుట్టడం కన్నా ఆంధ్ర దేశంలో పుట్టడం మంచిది. అక్కడి వాళ్ళు భార్యలని వశి వశి ( వొసేయ్ అని అన్న మాట) అని పిలుస్తారు. చివరికదే శివ శివా ! గా మారి పోయి అన్ని పాపాలు పోగొడుతుందిట! మరా మరా అనేది రామ రామ అయినట్టుగానన్న మాట ! శివ నామ స్మరణ పాపాలు పోగొడుతుంది. నిజమే కదా ... భార్యలని అంత అవమానకరంగా పిలిచే ( అందులో ఆత్మీయతానురాగాపాలు ఎక్కువే ననుకోండి ) మగ వాళ్ళకి పాపం చుట్టుకోదూ ! అందు చేత కనీసం ఈ తిరగేసిన నామ స్మరణ వారికి తెలియ కుండానే వారి చేత శివ నామాన్ని పొద్దస్తమానం జపించేలా చేసి, ఆ పాపాన్ని పోగొడుతుందనుకోవాలి మరి !
మన పూర్వ కవి ఒకరు శ్లోకంలో ఎంత చక్కని సెటైరుని విసిరాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి ... రే రే రాసభ ! వస్త్రభారవహనాత్ కుగ్రామ మశ్నాశి కిం ? రాజాశ్వావసధం ప్రయాహి, చణకాభ్యూషా సుఖం భక్షయాన్ సర్వా పుచ్ఛవతో హయా యితి వదంత్యత్రాధికారే స్థితా రాజా తైరుపదిష్టమేవ,మనుతేన సత్యం తటస్థాపరే:
కవి గారు గాడిద పడుతున్న శ్రమని చూసి జాలి పడుతున్నట్టుగా గాడిదని ఉద్దేశించి ఈ మాటలంటున్నాడు:
‘‘ ఓ గాడిదా ! బట్టలు మోసుకుంటూ గ్రామాలు తిరుగుతూ ఎందుకు ఊరికే శ్రమ పడతావు ? రాజుగారి గుర్రాల శాలకి వెళ్ళు. అక్కడ మిగతా గుర్రాలతో పాటు నువ్వూ హాయిగా గుగ్గిళ్ళు తింటూ గడుపు. తోకలున్నవన్నీ గుర్రాలేనని అధికారులంటారులే !! రాజు కూడా అదే నిజమని నమ్ముతాడు !!
అయ్యా, చూసారా !! గాడిదని అడ్డం పెట్టుకుని కవి గారు ఆ కాలం నాటి బ్యరోక్రసి మీదా, ప్రభువుల మీదా ఎంత గొప్ప పెటైరు విసిరాడో ! దీనిని మీరు ప్రస్తుతానికి కూడా అన్వయిస్తామంటే అభ్యంతరం లేదు.
సందర్భం ఎలాగూ వచ్చింది కనుక, గాడిదని పలకరిస్తూ మరో కవి గారు చెప్పిన తమాషా పద్యాన్ని కూడా గుర్తు చేసి చేతులు దులుపుకుంటాను....
బూడిద బుంగలైయొడలు పోడిమిఁదప్పి, మొగంబు వెల్లనై వాడల వాడలం దిరిగి , వచ్చెడు వారలు ‘‘చొచ్చొచో’’ యనన్ గోడల గొందులం దొదిగి, కూయుచునుండెదు కొండ వీటిలో గాడిద !! నీవునుం గవివి కావు కదా ?యనుమాన మయ్యెడిన్.
అవునూ, ఈ పద్యం ఎవరిదో చెప్పుకోండి చూద్దాం. మీకు తెలుసని నాకు తెలుసని మీకు తెలుసు కదూ !
భాషతో మన వాళ్ళు భలే ఆడుకున్నారు లెండి! క్రింది పద్యం చూడండి ... రజక కవాటముల్ రహి తప్పి యుండుట కేమి వొ దాని నెఱుగ వలయు ఇల్లును, పామును హీనమైయుండుట కేమి హేతువొ నెఱుగ వలయు పాలిచ్చు పశువును, పక్షియు హీనమై యుండుట యేమియోఎఱుగ వలయు సస్యంబు, కుమ్మరి సంతోష వర్జమై యేమిటనుండునో యెఱుగ వలయు దాని యర్ధంబు చెప్పిన దేశికులకు నెలలు పండ్రెండు గడువిత్తు నేర్పు తోడ ఈ కథా మంజరిం గాంచు మీకు నేను విన్నవించెద కారణాలెన్నమనుచు !!
పద్యం నాలుగు చరణాలలోనూ వరుసగా నాలుగు ప్రశ్నలు కవి సంధించేడు ...
వాటికి జవాబులు తెలుసు కోవాలంటే క్రింది తెలుపు భాగాన్ని డ్రాగ్ చేసి చూడండి !!
నాలుగు పాదాలలో కవి వేసిన ప్రశ్నలకి జవాబులు వరుసగా : ౧. ఉతక లేక ౨. కప్ప లేక ౩.చేప లేక ౪. వాన లేక
ఇవి నా కథలకి శ్రీ బాపు వేసిన బొమ్మలు. శ్రీ బాపు జన్మ దిన సందర్భంగా వీటిని మీతో పంచుకోవాలనే వేడుకతో వీటిని మీముందుంచుతున్నాను. ఆ బొమ్మలంటే నాకు నా కథల కన్నా కూడా చాలా యిష్టం !!
తెలుగు రచయితలలో చాలా మందికి తమ కథలు పత్రికలలో ప్రచురించ బడేటప్పుడు దానికి శ్రీ బాపు గారు బొమ్మ వేస్తే బావుణ్ణని మహా ఉబలాటంగా ఉంటుంది. నాకూ అలాంటి ఉబలాటమే. శ్రీరాముని దయ చేతను ఈ క్రింది కథల విషయంలో నా కోరిక తీరింది.
1. గోవు మా లచ్చిమికి కోటి దండాలు ... ఆంధ్ర జ్యోతి వార పత్రిక 2. అనాధలు కావలెను ... స్వాతి వార పత్రిక 3. గెలుపు ... ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక
కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయలనూపు ఓ కూనలమ్మా ! అన్న ఆరుద్ర గారి మాటలు తలుచుకుంటూ, మీకివే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
ఒక్కో సారి ఆపద సమయంలో దొంగ లెక్కలు వేసి, ఆపద గట్టెక్కొచ్చు ! ఐతే, దీనికి యుక్తి, వివేకం కావాలి... మన ప్రాచీన సాహిత్యంలో యుక్తిగా తననీ తన వారినీ చావు నుండి తప్పించిన ఓ యుక్తిపరుని వైనం ఓ చక్కని పద్యంలో ఉంది. చూడండి ... ముందుగా పద్యం చూడండి ...
అరసి వారల నొక శక్తి యశనమునకు సగముఁగోరగ, నవ సంఖ్య జగతి సురుడు చెప్ప ; దొంగలు హతులైరి ; చేటుఁదప్పి, విజయమందిరి యా వేళ విప్రులెల్ల !!
వివరణ :పూర్వం ఓ దొంగల గుంపు ఒకటి యాత్రీకులైన బ్రాహ్మణులని అడ్డగించి, శక్తి గుడికి తీసుకు పోయేరు. శక్తి వారిలో సగం మందిని తాను తినేస్తానని అంది. ఎవరు బలి కావాలో నిర్ణయించుకోమంది. లేక పోతే అందరినీ తినేస్తానంది. దొంగలు పదిహేను మంది, బ్రాహ్మణులు పదిహేను మంది ఉన్నారు. ఎవరు బలి కావాలి ? దొంగలు బెదిరి పోయేరు. వారికి దిక్కు తోచ లేదు. ఒక బ్రాహ్మణుడు యుక్తితో కేవలం దొంగలు కాని, కేవలం బ్రాహ్మణులు కానీ చావడం న్యాయం కాదనీ, తాము అందరూ ఒక వరుసలో నిలుచుంటామనీ, శక్తి ప్రతి ఆవర్తంలో తొమ్మిదవ వ్యక్తిని బలి తీసుకోమని వేడుకున్నాడు. శక్తి అంగీకరించింది. దొంగలూ ఈ ప్రతిపాదనకి అంగీకరించేరు. ఆ బ్రాహ్మణుడు దొంగలనీ, బ్రాహ్మణులనీ కలగలిపి ఒక వరుసలో నిలుచోబెట్టాడు. శక్తి ప్రతి ఆవర్తంలో తొమ్మిదో వ్యక్తిని బలి తీసుకోవడం మొదలెట్టింది. చిత్రం !!!
ప్రతి ఆవర్తంలోనూ తొమ్మిదో వాడు దొంగే కావడం వల్ల, ఏం జరుగుతోందో గమనించే లోపల దొంగలందరూ శక్తికి బలైపోయేరు ! బ్రాహ్మణులు సురక్షితంగా బయట పడ్డారు!
ఇంతకీ, ఆ తెలివైన బ్రాహ్మణుడు చేసిన యుక్తి ఏమిటి? వేసిన దొంగ లెక్క ( !) ఏమిటో కాస్త కనిపెట్టి చెబుదురూ !
మీ ప్రయత్నం మీరు చెయ్యండి ... సాధ్యం కాక పోతే , జవాబు ఈ క్రిందనే ఉంది. చూడండి. తెలిసి పోతుంది.! మరెందుకు ఆలస్యం ?!
బ్రాహ్మణులు #గుర్తు తోనూ, దొంగలు౦ గుర్తుతోనూ ఉన్నారు. వారందరినీ కలగలిపి, క్రింది వరుసలో నిలబెట్టాడు. శక్తి ప్రతి ఆవర్తంలోనూ తొమ్మిదో వ్యక్తిని బలి తీసుకుంది. అంతే ! ... దొంగలంతా ఖతం !!
ఆ వరుసల వైనం యిదీ : క్రింద తెలుపు భాగాన్ని డ్రాగ్ చేస్తే జవాబు కనిపిస్తుంది ...
కప్పను పట్టుకుని పాము మ్రింగి వేసిందిట! గుర్రం పరిగెత్తడం చూసి, బెదిరి పోయి , కోతి చెట్టెక్కిందిట! చిలుక పలుకులు విని శ్రీ హరి మెచ్చు కున్నాడుట! యమునివాహనందున్నపోతునిచూసిసింహంగర్జించిందిట!
మిత్రులారా, ఈ క్రింది శ్లోకాన్ని కాస్త పరిశీలించండి ...ఇందులో అసంగతం కనబడడం లేదూ !
ఏకాదశ్యా మహా రాత్రే కర్తవ్యం భోజన ద్వయం రాత్రే జాగరణంచైవ, దివాచ హరికీర్తనమ్.
రామ ! రామ!! చూడండి ఎంత అసంగతంమయిన విషయమో ! ...ఏకాదశి నాడు రెండు సార్లు భోజనం చెయ్యాలిట ! ... రాత్రి జాగరణం చెయ్యాలనీ, పగటి పూట హరి కీర్తనం చెయ్యాలనీ సెలవిస్తున్నాడు ... ఇదంతా బాగుంది కానీ ...హవ్వ !!! ఈ రెండు భోజనాల సంగతేంటండీ !
మరేం లేదండీ ... ఈ శ్లోకంలో పదాలను భో ! జన! అని విరిచి చదువుకోవాలి. అలాగే, ద్వయం కర్తవ్యం అంటే రెండు పనులు చేయాలి అని అన్వయించుకోవాలి... ఇప్పుడు చూడండి ...ఏకాదశి పర్వ దినాన ఓ జనులారా ! మీరు రెండు పనులు చెయ్యాలి సుమండీ ! ...రాత్రంతా జాగరణ చేసి, పగలంతా హరికీర్తనం చేస్తూ గడపండి అని బోధన... అంతే తప్ప రెండు భోజనాలు వరస పెట్టి లాగించెయ్య మని కాదు!!! సరే ...ఈ రెండు భోజనాల గొడవ గురించి చెబుతూ ఉంటే ఎప్పుడో చదివిన ఓ జోక్ గుర్తుకొస్తోంది. అది కూడా వినండి మరి ...
ఓ వ్యక్తి డాక్టరు దగ్గరకి వచ్చి, ‘‘ డాక్టరు గారూ ! నేను రోజుకి ఇరవై సిగరెట్లు తాగడానికి అలవాటు పడి పోయేనండీ ...తగ్గించే ఉపాయం చెప్పండి ...’’ అనడిగేడు. దానికి డాక్టరు ‘‘ దానిదేముందిండీ ... విల్ పవరుండాలంతే ... ఇక నుండీ మీరు భోజనం ముందొక సిగరెట్టూ, భోజనం తర్వాత ఒకటీ తాగడం మొదలెట్టండి ...దెబ్బకి కంట్రోలవుతాయి ...’’ అని చెప్పాడు. చాలా రోజుల తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ వచ్చేడు. ‘‘ సిగరెట్లు తాగే అలవాటు యిప్పుడు కంట్రోలయింది కదూ మీకు ?’’ అడిగేడు డాక్టరు. ఆ మనిషి నీరసంగా ‘‘ ఏం కంట్రోలోనండీ ! ... రోజుకి పది సార్లు భోజనం చెయ్య లేక ఛస్తున్నాను.’’ అంటూ బావురుమన్నాడుట!
ఓ తుమ్మెద తామర పువ్వులో దూరి మకరందం గ్రోలుతోంది. ఇంతలో సూర్యుడు అస్తమించి రాత్రయింది. పద్మం ముడుచుకు పోయింది ! తుమ్మెద అందులో బందీ అయి పోయింది... సరేలే, ఎలాగూ తెల్లారుతుంది, సూర్యోదయం కాగానే పద్మం వికసిస్తుంది. అప్పుడు బయట పడదాం అనుకుంది తుమ్మెద. అంత లోనే వో మదించిన ఏనుగు వచ్చి, ఆ సరోవరంలో దిగి, తామరలనన్నింటినీ పెకిలించి వేసిందిట ! మిగతా పువ్వులతో పాటూ తుమ్మెద బందీగా ఉన్న పద్మాన్ని కూడా పెకిలించి వేసింది. బయట పడదాం అనుకున్న మన తుమ్మెద ఆశ ఎలా అడియాస అయిందో చూసారు కదూ ? మంద భాగ్యుల కథల ముగింపు యిలాగే ఉంటుందేమో, కదూ !!
ఇది చదివేక, తెలుగులో ఓ మంద భాగ్యుని గురించిన పద్యం ఒకటి గుర్తుకొస్తోంది కదూ !!! అదేమిటో గుర్తుకు తెచ్చుకుని రాయండేం?
చిన్న క్లూ యిస్తాను ... పద్యం చివర్లో ...పోవుంగదా యాపదల్ ! అని ఉంటుంది మిత్రుడు చింతా రామ క్రిష్ణారావు చూపిన మార్గంలో నాకు తెలిసిన కొన్ని చమత్కార శ్లోకాలూ , పద్యాలూ సరదాగా మీతో ఇక మీద పంచుకోవాలనుంది. ... మీరు సరే నంటే !
హోమం : చిన్న ఇత్తడి గిన్నెలు4 హోమం పుల్లలు, ఆవు నెయ్యి
పై వస్తువులన్నీ కార్యక్రమాల వారీగా Packets కట్టుకుంటే గాభరా ఉండదు.కొన్ని common వస్తువులు ex. పెళ్ళి పీట, పూజు. సన్నకల్లు, పూల దండలు లాంటివి Packets లో కట్టలేం కనుక వేరే సిద్ధం చేసుకోవాలి.
వీటిలో సన్నికల్లు, పెళ్ళి పీట, పూజు లాంటివి కేటరర్ తెస్తాడేమో అడగాలి.ఐతే, కేటరర్ పై వాటిలో తాను సమకూరుస్తానని చెప్పిన వస్తువుల గురించి అడిగి, అతని చేతనే భోజనాల మెనూ రాసుకునేటప్పుడే అతను తెస్తానన్న వస్తువుల జాబితా కూడా ఖాయం చేసుకుని Note చేయించాలి.
జీలకర్ర,బెల్లం నూరిన ముద్ద. మంగళ సూత్రాలు, నల్ల పూసలు.
పన్నీరు బుడ్డి, లవండరు, సెంటు, బుక్కా భర్గుండ, చిన్న కర్పూర హారాలు, వివాహ పత్రిక, పటిక బెల్లం ధాన్యం, స్నాతకం సమయంలో అవసరమయితే, ( యివ్వాల్సి వస్తే) ఓ పాత లుంగీ
మొత్తం స్నాతకం,అంకురార్పణ,గౌరీ పూజ, లగ్నం, తలంబ్రాలు, స్థాలీ పాకం కార్యక్రమాలకి గాను బియ్యం సుమారుగా 16 కిలోలు.
అక్షతలు అన్ని వేడుకలకూ తగినన్ని.
సమకూర్చు కోవలసిన బట్టల వివరాలు :
వీటిలో మగ పెళ్ళి వారు, ఆడ పెళ్ళి వారు ముందు అనుకున్న విధంగా బట్టలని సమకూర్చు కోవాల్సి ఉంటుంది.
పెళ్ళి కుమార్తెకి పట్టు చీరలు
తోట లాంఛనం బట్టలు
అప్పగింతల బట్టలు
ఇవి కాక - ఆడ పెళ్ళి వారు సిద్ధం చేయాల్సినవి:
పెండ్లి పీటల మీదకి గావంచాలు
మధుపర్కాలు
తెర సెల్లా దుప్పటి
అలక పానుపు దుప్పటి
ఒడికట్టు చీర
ఉయ్యాల చీర
పురోహితునికి చీర, పంచెల చాపు.
N.B పెండ్లి చేయించే పురోహితుని చేత పెండ్లికి కావలసిన జాబితా రాయించి, పై వాటితో సరిచూసుకోవాలి.
మన తాహతు బట్టి, వేడుకను బట్టి, అవసరాన్ని బట్టి , ఆచారాన్నిబట్టి పై జాబితాలో మరి కొన్ని వస్తువులు చేరనూ వచ్చు, తగ్గనూవచ్చు, మార్పు చెందనూ వచ్చు... ఎలాగంటే ... వెండి వస్తువులబదులు బంగారం వస్తువులు పెట్టుకో వచ్చు కదా ? ... అలాగే, మనసాంప్రదాయాలను అనుసరించి కూడా మారే అవకాశం లేకపోలేదు...ఏమయినా ... పురోహితుని అడిగి , దీనితో చెక్చేసుకోమని సూచన ...బ్రాహ్మణ శాఖలలో ఇది చాలా మందికిసుపరిచితమైన జాబితాయే ... ఏతావాతా , ఇది బ్లాగులో పెట్టడంకేవలం నా సరదా కొద్దీ మాత్రమేనండోయ్ ...