29, డిసెంబర్ 2009, మంగళవారం

వేడుక


ఉత్తరాంధ్రలో మహాలయ అమావాస్యని పోలేరు అమావాస్య అని కూడ వ్యవహరిస్తారు. ఆ రోజున పిల్లలంతా గుర్రం బొమ్మలని చక్రాలున్న గుడబళ్ళ మీద పెట్టుకుని వీధుల్లో సంబరంగా తిరుగుతారు. ఆ గుర్రం బొమ్మలని కుండీ గుర్రాలని అనడం కద్దు.
ఆ మధురోహల నెమరువేతలో ఈ వేడుక కథ ను ఆంధ్ర సచిత్ర వార పత్రిక 11-3 -1988 దీ సంచికలో రాసాను.
దీనిని బ్లాగులో నా
వేడుక కోసం ఉంచుతున్నాను ...




ఇక్కడ దాని మీద అనే వాక్యం తరువాత స్కానింగ్ లో కనిపించకుండా పోయిన ఓ రెండు చిన్న వాక్యాలు :
రాత్రంతా ముసిలాయనతో నాలుగు వీధులూ ఊరేగి, రాత్రంతా కురిసిన వర్షానికి తడిసి, నాని పోయిన గుర్రం బొమ్మ,
ఇప్పుడది - పిడికెడు మట్టి ముద్ద !
Posted by Picasa

రామ గోపాలమ్ !



కోలాచలం పెద్ది భట్టు కవి శ్రీరాముని పరంగానూ, గోపాలుని పరంగానూ చెప్పిన చక్కని శ్లోకమిది ...
య:పూతనా మారణ లబ్ధ వర్ణ:
కా కోదరోయేన వినీత దర్ప:
యస్సత్యభామా సహితస్సపాయా
న్నాధో యదునా మధనా రఘూణామ్.


ముందుగా గోపాలుని పరంగా అర్ధాన్ని చూదామా !

య:, పూతనా,మారణ లబ్ధ వర్ణ: = ఎవడు పూతనను చంపి కీర్తి పొందెనో
యేన కాకోదర: , వినీత దర్ప: = ఎవని చేత కాళీయుని గర్వం అణచి వేయ బడిందో
య:, సత్యభామా సహిత: = ఎవడు సత్యభామతో కూడి ఉంటాడో
యదూనాం నాధ: , స: , పాయాత్ = అట్టి యదువంశ ప్రభువయిన గోపాలుడు కాపాడు గాక !


ఇక, శ్రీరాముని పరంగా అర్ధం పరిశీలిద్దామా !

య: , పూత నామా = ఎవడు పవిత్రమైన పేరు గల వాడో
రణ లబ్ధ వర్ణ: = ఎవడు యుద్ధంలో కీర్తిని గడించాడో
అదర:, కాక: , వినీత దర్ప: = భయం లేని కాకాసురుని గర్వం అణచి వేసాడో
య: , సత్య , భా , మా, సహిత: = ఎవడు సత్యము, కాంతి మరియు లక్ష్మిలతో కూడిన వాడో
స: , రఘూణామ్ నాధ: , పాయాత్ = అట్టి రఘువంశ ప్రభువు కాపా
డు గాక !!
తెలుగు సాహిత్యంలో కూడ ద్వ్యర్ధి , త్ర్యర్ధి కావ్యాలు రాఘవ పాండవీయం వంటివి ఉన్నవి. వీలున్నపుడు వాటిని గురించి ...

బాల గోపాలమ్


కొంటె కృష్ణుని చిలిపి చేష్టలు ఎంత చెప్పుకున్నా తనివి తీరదు కదా?

చూడండి ...
మాత:కిం యదునాధ: దేహి చషకం, కింతేన?పాతుంపయ:
తన్నాస్త్యద్య, కదాస్తినా? నిశి ! నిశా కావా? అంధకారోదయో
అమీల్యాక్షి యుగం నిశాప్యుపగతా దేహేతి మాతు: ముహు:
వక్షోజాం శుక కర్షణోద్యత కర: కృష్ణ :సపుష్ణాతువ:
చిన్ని గోసాలుడు యశోదమ్మని అడుగుతున్నాడు ‘‘ అమ్మా, పాత్ర యివ్వు, పాలు త్రాగుతా ’’
యశోద: ‘‘ ఇప్పుడొద్దు, రాత్రికి త్రాగుదువులే’’
గోపాలుడు: ‘‘ రాత్రి ఎప్పుడొస్తుందమ్మా?’’
తల్లి: ‘‘చీకటి పడినప్పుడు వస్తుంది నాయనా !’’
తల్లి యిలా చెప్పగానే నంద నందనుడు కనులు రెండూ మూసుకుని ‘‘ చీకటి పడి పోయిందమ్మా !’’ అంటూ తల్లి పైట లాగుతూ మారం చేస్తున్నాడుట!
అట్టి బాల గోపాలుడు మిమ్ములను కాపాడు గాక ! అని, కవి ఆశీర్వదిస్తున్నాడు.

28, డిసెంబర్ 2009, సోమవారం

పారవశ్యం



ఒక మంచి, అందమైన శ్లోకం చూదాం.ప్రణయ పారవశ్యాన్ని ఎంత మనోహరంగా కవి వర్ణించాడో చూడండి.
రాధా పునాతు జగదచ్యుత దత్త చిత్తా
ధా
మం మా కలయతి దధి రిక్త భాండే
తస్యా: స్తనస్తబక చంచల లోల దృష్టి:
దేవో అపి దోహన ధియా
వృషభం నిరుంధన్







ఇక శ్లోకార్ధం ... నల్లనయ్య మీద లగ్న చిత్తయై రాధ ఖాళీ కుండలో కవ్వం ఉంచి చిలుకుతోందిట!
ఆమె వక్షోజ విన్యాసాలు చూస్తూ మైమరిచి పోయిన గోపాలుడు పాలు పితకడానికి ఎద్దు కాళ్ళకి బంధాలువేస్తున్నాడుట !!

ప్రేమ పారవశ్యం అంటే ఇదే కదా?

27, డిసెంబర్ 2009, ఆదివారం

రామ ! రామ !!



రాముడు హనుమంతుని చేత హత మైతే, సీత సంతోషించిందిట !
రాక్షసులు దు:ఖించారుట !! హవ్వ !! ఇదేం చోద్యం అనుకుంటున్నారా? శ్లోకం చూడండి మరి ...

హతో హనుమతో రామ
సీతా సా హర్షనిర్భరా
రుదంతి రాక్షసాస్సర్వే
హా హా రామ హతోహత:

హనుమతే , ఆరామ అని విరిచి చదువుకుంటే ఏ గొడవా లేదు ! లంకా పట్టణంలో హనుమచే నాశనమైన ఆరామాన్ని (వనాన్ని) చూసి సీత ఆనందించడంలోనూ, రక్కసులు విచారించడంలోనూ అసజం ఏమీ లేదు కదా?

మన పూర్వ కవులు యిలాంటి చమత్కార రచనలు చాలా చేసారు.

మూడు కథల బంగారం - 3

26, డిసెంబర్ 2009, శనివారం

బావా ! బావా పన్నీరు !!

అత్త గారింటికి వచ్చిన బావగార్లను ‘‘ బావా బావా పన్నీరు, బావని పట్టుకు తన్నేరు, వీధీ వీధీ తిప్పేరు, వీశెడు గంధం పూసేరు’’ అని ఆట పట్టించే ఘట్టం మన పిల్లల తెలుగు వాచక పుస్తకాలలో కపిసిస్తూ ఉంటుంది. ఆ గడుగ్గాయిల అల్లరి గేయ రూపంలో ఉంటే , బావగారి రూపు రేఖా విలాసాలు కొంటెగా వర్ణించిన ఓ చిన్న పద్యం మన వాళ్ళు చెబుతూ ఉంటారు ..దానిని చూడండి ...

అందమునఁజూడ రాము బంటైన వాడు
నాగరికతను జము వాహనమునకీడు
శుచికి హేమాక్షుఁజంపిప శూరు జోదు
వసుధలో లేడు మా బావ వంటి వాడు !!

‘కన్నొక్కటి లేదు గాని కాంతుడు గాదే !’ అని పొగడడంలాంటిదే యిదీనూ !
ఇలా ఏ బావ గారినయినా కోతి,దున్న పోతు, పంది అంటే యింకేమయినా ఉందా చెప్పండి? మన వాళ్ళ సరదాలు బంగారం కానూ !

ప్రహేళిక

గీర్వాణ భాషలో కవులు చమత్కారవంతములైన ప్రహేళికలు కొన్ని రచించారు. ఒక దానిని చూదాం ...

సీమన్తినీషు కా శాంతా
రాజా కోభూత్ గుణోత్తమ:
విద్వద్భి: కా సదా వంద్యా
అత్రైవోక్తం న బుధ్యతే

ప్త్రీలలో మిక్కిలి శాంత స్వభావురాలయిన వారెవరు? రాజులలో గొప్ప గుణ సంపన్నుడెవరు ? బుద్ధిమంతులు దేనిని సతతం అభిలషిస్తారు? ... ఈ మూడు ప్రశ్నలకీ సమాధానాలు శ్లోకంలోనే ఉండడం యిక్కడి చమత్కారం
మూడు ప్రశ్నలకీ వరుసగా మూడు పాదాలలోనూ గల తొలి మరియు చివర గల అక్షరాలను కలిపి చదవాలి...
వరుసగా ... సీత రామ: విద్యా అనే జవాబులు రావడం లేదూ?!

25, డిసెంబర్ 2009, శుక్రవారం

ఏ ఆవురా బావా !!


చిన్న కంద పద్యంలో కవి గారు, ఒకాయన తన బహు భాషా నైపుణ్యాన్ని ఎలా ప్రదర్శించాడో చెప్తున్నారు. చూడండి ...

బావయు మరిదినిగని, యీ
యావులలో నొకటి బేరమాడుమనఁగ ‘‘నే
యావ’’ని యడిగిన వాక్యము
గావలయుంభాషలైదుగా నొక పదమున్.


బావా మరుదులిద్దరూ సంత కెళ్ళారు. మంచి ఆవు నొకదానిని బేరం చెయ్యడానికి. బావ గారు అక్కడున్న ఆవులలో ఒక దానిని చూసి, బేరమాడమన్నాడు. మరిది గారికి అక్కడున్న వాటిలో ఒక్కటీ నచ్చినట్టు లేదు. ‘‘ పదరా, బావా పోదాం’’ అంటూ అక్కడి నుండి కదిలాడు....ఒక భాషలో చెబితే చాలదన్నట్టు మొత్తం ఐదు భాషలలో పోదాం పద రమ్మన్నాడు...
పద్యంలో ఉన్న దాన్ని ‘‘ ఏ ఆవురా బావా’’ అని మారిస్తే ఆ భాషా పదాలు కనిపిస్తాయి...అన్నింటికీ రమ్మనే అర్ధం !!


ఏ - మరాఠీ
ఆవు - ఉర్దూ
రా - తెలుగు
బా - కన్నడం
వా - తమిళం

చమత్కార శ్లోకం

ఈ క్రింది శ్లోకంలో కవి చమత్కారంగా శివుడినీ. విష్ణువునీ కూడ ఎలా స్తుతిస్తున్నాడో చూడండి ...

పన్నగధారి కరాగ్ర: గంగోమా లక్ష్మితో గదాగ్ర భుజ:
శశిఖండ శేఖర ఉమాపరిగ్రహోముహురనాదిరవతుత్వామ్

శివ పరమైన అర్ధం :
పన్నగ ధారి కరాగ్ర: = చేతిలో పాముని ధరించిన వాడు
గంగా , ఉమా లక్షిత: = గంగా పార్వతులచే కోరబడిన వాడు
అంగదోగ్రభుజ: = భుజాల మీద బాహుపురులు, స్వర్ణాభరణాలు ధరించిన వాడు
శశిఖండ శేఖర: = చంద్ర రేఖను శిరోభూషణంగా కలవాడు
ఉమా పరిగ్రహ: = పార్వతీ దేవిని భార్యగా స్వీకరించిన వాడు
అనాది: = పుట్టుక లేని వాడు
ముహు: త్వాం అవతు = సదా మిమ్ములను కాపాడు గాక !

ఇక, విష్ణు పరమై అర్ధాన్ని చూదామా?
ముందుగా పై శ్లోకంలోనివిశేఫణ పదాల నుండి తొలి అక్షరాలను తొలిగించి చదవండి ...
నగధారి కరాగ్రహ: = గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడు
గోమాలక్షిత: = భూమి, గోవులు, లక్ష్మీ దేవి - వీరిచే కోర బడిన వాడు
గదాగ్ర భుజ:= భుజాన కౌమోదకి అను గదను దాల్చిన వాడు

శిఖండ శేఖర: = శిరసున నెమలి పింఛము కలవాడు
మా పరిగ్రహ: = లక్ష్మీ దేవిని భార్యగా పొందిన వాడు
అనాది: = తొలి అక్షరాలు తొలిగించగా మిగిలిన విశేషణములు కల వాడైన శ్రీ మహా విష్ణువు
ముహు:త్వాంఅవతు = సదా మిమ్ములను కాపాడు గాక !

24, డిసెంబర్ 2009, గురువారం

మూడు కథల బంగారం - 2

lనా శ్రీమతి ముచ్చటగా మూడు కథలు మాత్రమే రాసిందని చెప్పాను కదూ ? మొదటి కథ *బరువు* బ్లాగులో ఉంచాను ... ఇది రెండోది. ... మూడోది త్వరలో పెడతాను ... వీటికి వచ్చే స్పందనలు చూసైనా ఆమె మళ్ళీ కలం విదిలిస్తారేమో చూడాలి !


Posted by Picasa

22, డిసెంబర్ 2009, మంగళవారం

చుక్కలూ, చిక్కులూ ....

ఒక తమాషా పద్యాన్ని మీతో పంచుకుంటాను ...

నక్షత్రము గల చిన్నది
నక్షత్రము చేత బట్టి, నక్షత్ర ప్రభున్
నక్షత్రమునకు రమ్మని
నక్షత్రము పైన వేసి నాధుని పిలిచెన్ !!


ఇందులో చమత్కారమంతా కవి గారు కొన్ని నక్షత్రాల పేర్లను ఉపయోగించు కోవడంలోనే ఉంది.

ఆ నక్షత్రాలు యివీ : . ఉత్తర .భరణి . మూల హస్త

వీటి ఆధారంగా పద్యంలోని కవి చమత్కారాన్ని కనుక్కోండి చూద్దాం !!

ఇది పద్మ వ్యూహ ఘట్టానికి చెందిన సందర్భం. ఈ చిన్న క్లూతో మీ శోధన మొదలెట్టండి ...








చుక్కల చిక్కుల పేరిట
చిక్కని పద్యము నొసగఁగ చింతా వారూ !
చక్కగ వివరించిరి కద !
మిక్కిలిగా నాదరింతు మదిలో మిమ్మున్. !

18, డిసెంబర్ 2009, శుక్రవారం

శివ ! శివా !!


వెనుకటి రోజులలో కొన్ని బ్రాహ్మణ కుటుంబాలలో భర్తలు భార్యలను ‘‘ వొసే ’’ ,, ‘‘ వొసేయ్ ’’ అని పిలవడం ఉండేది. గురజాడ వారి కన్యాశుల్కం ఓ సారి గుర్తుకు తెచ్చు కోండి ...

ఈ పిలుపును గురించి శ్రీ చెల్ల పిల్ల వేంకట శా స్త్రి గారు చక్కని పద్యం చెప్పారు. చూడండి ...

ఇతర దేశమ్ముల జనయించుకంటె
నాంధ్ర దేశాన జనయించుటార్య హితము
‘వశి వశి’ యటంచు పిలుతురు వారు భార్య
నదియు ‘శివ శివ’ యై తుద కఘములడచు !!


వేరే దేశాలలో (ప్రాంతాలలో) పుట్టడం కన్నా ఆంధ్ర దేశంలో పుట్టడం మంచిది. అక్కడి వాళ్ళు భార్యలని వశి వశి ( వొసేయ్ అని అన్న మాట) అని పిలుస్తారు. చివరికదే శివ శివా ! గా మారి పోయి అన్ని పాపాలు పోగొడుతుందిట!
మరా మరా అనేది రామ రామ అయినట్టుగానన్న మాట !
శివ నామ స్మరణ పాపాలు పోగొడుతుంది. నిజమే కదా ... భార్యలని అంత అవమానకరంగా పిలిచే ( అందులో ఆత్మీయతానురాగాపాలు ఎక్కువే ననుకోండి ) మగ వాళ్ళకి పాపం చుట్టుకోదూ !
అందు చేత కనీసం ఈ తిరగేసిన నామ స్మరణ వారికి తెలియ కుండానే వారి చేత శివ నామాన్ని పొద్దస్తమానం జపించేలా చేసి, ఆ పాపాన్ని పోగొడుతుందనుకోవాలి మరి !

17, డిసెంబర్ 2009, గురువారం

మూడు కథల బంగారం - 1

తోకలున్నవన్నీ గుర్రాలే !!


మన పూర్వ కవి ఒకరు శ్లోకంలో ఎంత చక్కని సెటైరుని విసిరాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
చూడండి ...


రే రే రాసభ ! వస్త్రభారవహనాత్ కుగ్రామ మశ్నాశి కిం ?
రాజాశ్వావసధం ప్రయాహి, చణకాభ్యూషా సుఖం భక్షయాన్
సర్వా పుచ్ఛవతో హయా యితి వదంత్యత్రాధికారే స్థితా
రాజా తైరుపదిష్టమేవ,మనుతేన సత్యం తటస్థాపరే:


కవి గారు గాడిద పడుతున్న శ్రమని చూసి జాలి పడుతున్నట్టుగా గాడిదని ఉద్దేశించి ఈ మాటలంటున్నాడు:

‘‘ ఓ గాడిదా ! బట్టలు మోసుకుంటూ గ్రామాలు తిరుగుతూ ఎందుకు ఊరికే శ్రమ పడతావు ?
రాజుగారి గుర్రాల శాలకి వెళ్ళు. అక్కడ మిగతా గుర్రాలతో పాటు నువ్వూ హాయిగా గుగ్గిళ్ళు తింటూ గడుపు. తోకలున్నవన్నీ గుర్రాలేనని అధికారులంటారులే !! రాజు కూడా అదే నిజమని నమ్ముతాడు !!

అయ్యా, చూసారా !! గాడిదని అడ్డం పెట్టుకుని కవి గారు ఆ కాలం నాటి బ్యరోక్రసి మీదా, ప్రభువుల మీదా ఎంత గొప్ప పెటైరు విసిరాడో ! దీనిని మీరు ప్రస్తుతానికి కూడా అన్వయిస్తామంటే అభ్యంతరం లేదు.

సందర్భం ఎలాగూ వచ్చింది కనుక, గాడిదని పలకరిస్తూ మరో కవి గారు చెప్పిన తమాషా పద్యాన్ని కూడా గుర్తు చేసి చేతులు దులుపుకుంటాను....

బూడిద బుంగలైయొడలు పోడిమిఁదప్పి, మొగంబు వెల్లనై
వాడల వాడలం దిరిగి , వచ్చెడు వారలు ‘‘చొచ్చొచో’’ యనన్
గోడల గొందులం దొదిగి, కూయుచునుండెదు కొండ వీటిలో
గాడిద !! నీవునుం గవివి కావు కదా ?యనుమాన మయ్యెడిన్.

అవునూ, ఈ పద్యం ఎవరిదో చెప్పుకోండి చూద్దాం. మీకు తెలుసని నాకు తెలుసని మీకు తెలుసు కదూ !

16, డిసెంబర్ 2009, బుధవారం

దశావతార వర్ణన


మన కవులు ప్రతిభావంతమైనవిచిత్ర కల్పనలు చాలా చేసారు.
ఈ క్రింది పద్యంలో కవి దశావతార వర్ణన ఎంత గొప్పగా చేసాడు. చూడండి :

సలిల విహారులిద్దరును, సంతత కానన చారులిద్దరున్
వెలయగ విప్రులిద్దరును, వీర పరాక్రమశాలులిద్దరున్
పొలతుక డాయు వాడొకడు, భూమి చరించెడు వాడు నొక్కడున్
చెలువుగ మీ కభీష్టములు సిద్ధి ఘటించురనంత కాలమున్.

వివరణ మీ సౌకర్యం కోసం ఈ క్రింద పొందు పరిచి ఉన్నాను. మీ ప్రయత్నం మీరు చేయండి. కాదంటే క్రింద తెలుపు భాగాన్ని డ్రాగ్ చేసి చూడండి.

సలిల విహారులు = మత్స్య,కూర్మావతారాలు
కానన చారులు = వరాహ, నారసింహావతారాలు
విప్రులు = వామన, పరశురామావతారాలు
పరాక్రమశాలురు = శ్రీరామ, క్రిష్ణులు
పొలతుక డాయు వాడు = బుద్ధుడు
భూమి చరించు వాడు = కల్కి అవతారం

బొమ్మల చొక్కా


ఈ కథ ఆంధ్ర జ్యోతి సచిత్ర వార పత్రికలో ప్రచురణ


Posted by Picasa

కారణాలు వెతకండి ....

భాషతో మన వాళ్ళు భలే ఆడుకున్నారు లెండి! క్రింది పద్యం చూడండి ...
రజక కవాటముల్ రహి తప్పి యుండుట
కేమి వొ దాని నెఱుగ వలయు
ఇల్లును, పామును హీనమైయుండుట
కేమి హేతువొ నెఱుగ వలయు
పాలిచ్చు పశువును, పక్షియు హీనమై
యుండుట యేమియోఎఱుగ వలయు
సస్యంబు, కుమ్మరి సంతోష వర్జమై
యేమిటనుండునో యెఱుగ వలయు
దాని యర్ధంబు చెప్పిన దేశికులకు
నెలలు పండ్రెండు గడువిత్తు నేర్పు తోడ
ఈ కథా మంజరిం గాంచు మీకు నేను
విన్నవించెద కారణాలెన్నమనుచు !!


పద్యం నాలుగు చరణాలలోనూ వరుసగా నాలుగు ప్రశ్నలు కవి సంధించేడు ...

వాటికి జవాబులు తెలుసు కోవాలంటే క్రింది తెలుపు భాగాన్ని డ్రాగ్ చేసి చూడండి !!

నాలుగు పాదాలలో కవి వేసిన ప్రశ్నలకి జవాబులు వరుసగా :
. ఉతక లేక
. కప్ప లేక
.చేప లేక
. వాన లేక

  • ఉతక = అడ్డు గడియ
అర్ధం ఇప్పుడు సుబోధకమే కదా !