
అపురూపం నా కథల సంపుటి. ఈ కథా సంపుటానికి ముందు మాట శ్రీ కె.ఎన్.వై. పతంజలి గారు రాసారు. ఈ కథల సంపుటి 1998 లో ప్రచురించ బడింది.ఇందులో కథలు : 1. గుండె తడి2. ఎక్కడున్నావు గొంగళీ౩ గోవు మా లచ్చికి కోటి దండాలు ౪. మసి మరకలు. అపురూపం 6. తూర్పు వెళ్ళని రైలు 7. వరద 8. ఇబ్బందే9. మడత నలగని కోరిక 10. దారికట్టు 11. అమ్మా బళ్ళోకివెళ్ళనే 12.అనాధలు కావలెను. 13 కర్ణుడి చావు 14.క్షమించు నేస్తం 15. చింతలు తీరని చీకట్లు 16. సహనావవతు 17. పతనం 18.కనబడుట లేదు 19. గెలుపు 20. గోడ 21 ఇంటికి పోదాం 22. నరమేధం జరుగుతోంది. 23.విస్తరాకు 24. బొమ్మల చొక్కా 25. కొత్త జీవితానికో కొండ గుర్తు 26 .శిక్ష 27. అంచనా 28. వేడుక 29. పందెం 30. ఆ గూటి చిలుక ఈ కథల సంపుటం ప్రోగ్రసివ్ కమ్యూనికేషన్స్ వారి ప్రచురణ. ప్రచురణ కర్త : శ్రీ నామాల విశ్వేశ్వరరావు అంకితం అమ్మ : పార్వతమ్మకి, నాన్న : సత్య నారాయణ మూర్తి గార్లకి.
మనం నిత్యం ఎదుర్కొనే ఒక యిబ్బంది గురించి ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దామా?కిక్కిరిసిన సిటీ బస్ లో ప్రయాణం చేస్తున్నాం. ఒంటి కాలి మీద ఆపసోపాలు పడుతూ నిలబడి ఉన్నాం. బస్ ఎంతవరకూ వచ్చిందో తెలీదు. కండక్టరు అరచి చెప్పడు. చెప్పినా, ఆ గోలలో వినబడదు. అంతా కంగారు కంగారుగాఉంటుంది.బస్ లో బయటకి సందు చేసుకుని చూస్తాం. నగరం మీకు పాతదే అయినా, ఆ ఏరియా మీకు కొత్త. ఎంత వరకూ వచ్చారో తెలీదు. ఏబోర్డూ ఉండదు. ఎంతకని పక్క వాళ్ళని అడిగి విసిగిస్తాం చెప్పండి.
పరిష్కారం : రోడ్డు ప్రక్క ఉన్న ప్రతి బోర్డు మీదా వాళ్ళ షాపుల పేర్లూ గట్రా రాసుకోవడంతో పాటు ... ఆ షాపున్నఏరియా పేరు విధిగా రాయాలని కట్టడి చేయడం. ఆ ఏరియా పేరు లేని ఏ బోర్డునీ ఉంచడానికి నగర పాలక సంస్థఅంగీకరించక పోవడం. నిర్బంధంగా, బోర్డుల సైజులని బట్టి, అక్షరాల సైజులు ఉండేలా తెలుగు, ఇంగ్లీషు భాషలలోరాసేలా నిబంధనలు పెట్టడం.
బస్ షెల్టర్ల మీద కూడా ఏవో ప్రకటనలే తప్ప ఆ ఏరియా పేరు కనిపించక పోడం ఘోరం కదూ?
ట్రాఫిక్ ఐలెండ్ దగ్గరుండే పోలీస్ సిగ్నల్ ఉండే చోట బంక్ ల మీద కూడా ఆ ఏరియా పేరు కనిపించదు. గమనించేరా?
నగరంలో అక్కడక్కడా కొన్ని చోట్ల మాత్రమే ఏ రియా పేరు ఏ కొందరో తమ సైన్ బోర్డుల మీద రాసేరు.( ఆ పుణ్యాత్ములకి శత కోటి వందనాలు)
బస్ లో వెళ్ళే వారికే కాదు, నడిచి వెళ్ళే వారికీ, ఇతర వాహనాల మీద వెళ్ళే వరికీ కూడా ఈ యిబ్బంది ఎప్పుడూఎదురవుతూనే ఉంటుంది... ఓ సారి ఓ స్కూటరిస్ట్ నా పక్కకి వచ్చి బండి ఆపి. ‘ ఫలానా ఏరియా ఏదండీ’ అనడిగేడు. ‘అయ్యో, మీరు దాన్ని దాటి చాలా దూరం వచ్చేసారే ! మళ్ళీ వెనక్కి వెళ్ళండి .. ఆరు కిలో మీటర్ల దూరం వెళ్ళాలి. అక్కడ అడగండి.‘ అని చెప్పాను ... బిక్క ముఖం వేసుకుని,యీసురోమంటూ బండిని వెనక్కి తిప్పడం కోసం ముందుకి మరో అర కిలోమీటరు వెళ్ళి ... అతను పడ్డ అవస్థ గురించి యిప్పుడెందుకు లెండి ... ... వాహన చోదకులకి , వాహనాల మీద పయనించే వారికీ, పాద చారులకి, యీ యిబ్బంది తొలిగి పోవాలంటే మార్గమే లేదా?
తెలిసిన వాళ్ళకి ఫరవా లేదు. కొత్త వారికి మాత్రం నరక యాతనే కదూ?
చదువుకునీ, చదువు రాని వాళ్ళలా కొత్త చోట్ల వెర్రి మొహాలు వేయ వలసి రావడం ఎంత దారుణమో ఆలోచించండి ...మీకు తోచిన మరిన్ని మంచి పరిష్కారాలని సూచించండి ...
వేసవి కాలం. మధ్యాహ్నం ఎండ ఫెడీల్మని పేల్చేస్తూ ఉంటే, ఇంట్లో అమ్మో, నాన్నమ్మో, అత్తమ్మో, పెద్దమ్మో, అమ్మమ్మో ... ఎవరో ఒకరు మామిడి కాయలు ఊరగాయ కోసం తరుగుతూ ఉంటే ...ఒకటో, రెండో ముక్కలు లాక్కుని, ఉప్పూ కారం నంచుకుని తింటూ ఉంటే...
వాహ్ ! ఆ రోజులు ఎంత భలేగా ఉండేవో ఓ సారి గుర్తుకు తెచ్చుకోండి...
అంతే కాదు, ఆ తరిగిన ముక్కల పక్కన పెద్దాళ్ళు పారేదామని ఉంచిన మావిడి జీడి కుప్పలోనుండి ఒకటో,రెండో తీసుకుని ... గోడల మీద కొక్కిరిబిక్కిరిగా ...‘‘ దడిగాడు వాన సిరా’’ అని రాయడం గుర్తుకొస్తోందా?ఎటు చదివినా ఒకే మాదిరిగా ఉండే ఈ వాక్యానికి మన తెలిగింటి మట్టి గోడలు గొప్ప ప్రాచుర్యాన్ని యిచ్చాయి కదూ!
మన కవులు కూడ యిలాంటి తమాషా పద్యాలు చాల రాసేరు. వాటిని పాద భ్రమకాలనీ, పద్యభ్రమకాలనీ అనొచ్చు.
ముందుగా పాద భ్రమకం. పద్యంలో ప్రతీ పాదమూ ఎటుచదివినా ఒకేలా కనిపించడం దీని ప్రత్యేకత! చూడండి ...ధీర శయనీయశరధీ
మార విభాను మత మమత మనుభావి రమా
సార సవన నవసరసా
దారదసమతార తార తామ సదరదా !ఇప్పుడు పద్య భ్రమకాన్ని చూద్దామా? పద్యం మామూలుగా మొదటి నుండి చదివినా, చివరి అక్షరం నుండి వెనక్కి చదివినా ఒకేలా ఉండడం దీని ప్రత్యేకత.రాధా నాధా తరళిత
సాధకరధతావర సుత సరసనిధానా
నాధాని సరసత సురవ
తాధర కథసా తళిరత ధానాధారా !ఆగండాగండి, యతి ప్రాసలూ గణాలూ తెలిస్తే, ఎటునుంచెటు చదివినా ఒకేలా ఉండే అక్షరాలను మేమూ పేర్చ గలం అని అనుకో వద్దు సుమా ! ... ఎందుకంటే, యివి రెండూ పూర్తిగా అర్ధవంతాలయిన పద్యాలు....
వీటి అర్ధాలను తెలిసిన వారు ప్రయత్నించి చెప్పమని కోరుతున్నాను ...
వీటి అర్ధం పూర్తిగా తెలుసుకోకుండా, ఈ పద్యాలను కథామంజరి బ్లాగులో ... దడిగాడు వాన సిరా.

మన చిన్నారులకి మనం యిచ్చే మంచి బహుమానం ఓ కొత్త బొమ్మ, ఓ బొ
మ్మల చొక్కా, ఓ పువ్వుల గౌను, ఓ రంగు రంగుల బెలూను, ఓ మంచి పెన్ను, కలర్ పెన్సిల్స్ ... ... ఇలాంటివే కదా?కాదు ... కాదు ... వీటితో పాటు ... ఓ మంచి రంగు రంగుల పిల్లల పుస్తకం ! పెద్దక్షరాల పిల్లల పుస్తకం ! ... అందులో రాక్షసులూ , మాంత్రికులూ, మాట్లాడే చెట్లూ, పలకరించే గాలులూ, తమతో పాటు ఆడుకునే పక్షులూ, పిట్టలూ. జంతువులూ, ఎగిరి పోవడాలూ , మాయమైపోవడాలూ, ప్రత్యక్షమవడాలూ ... యింకా చాలా చాలా ... ఉండాలి ... ఉంటాయి కూడానూ ...అప్పుడు చూడాలి వాళ్ళ కళ్ళలో మెరుపు !
అప్పుడు చూడాలి వాళ్ళ ముఖంలో ఆనందతాండవం !
అప్పుడు చూడాలి వాళ్ళ పెదాల మీద వెన్నెల విరజిమ్మినట్టు చిరు నవ్వు ...చిన్నారి చేతులతో వాటిని అందుకుంటూ, థాంక్యూ మమ్మీ, థాంక్యూ డాడీ ... అంటూ పలికే ఆ చిన్నారుల చిలుక పలుకులని విని పరవశించి పోవాలని మనకుండదూ?ఈ కొత్త సంవత్సరం మొదలవుతూనే, మన పిల్లలకి అపురూప బహుమతిగా యివ్వ తగిన ఒక చక్కని పుస్తకం పాల పిట్ట ప్రపంచ జానపద కథలు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు కొత్తగా వెలువరించారు!
కొత్త సంవత్సరం ( 1 - 1 - 2010 ) రోజున విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ లో ప్రముఖ కవి శ్రీ శివా రెడ్డి ఈ పాల పిట్ట పిల్లల పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఎ.ఎన్.జగన్నాధ శర్మ 27 ప్రపంచ ప్రసిద్ధ జానపద కథలను అందమైన , సరళమైన శైలిలో, పిల్లను అమితంగా ఆకట్టుకునే రీతిలో, చక్కని బొమ్మలతో వెలువరించిన పిల్లల పుస్తకం - పాల పిట్ట.
పత్రికా రచయిత, నవ్య వార పత్రిక సంపాదకులు, నవలా కథా రచయిత, టి.వి, సినిమా రచయితగా ప్రసిద్ధులైన శ్రీ జగన్నాధ శర్మ బాల సాహిత్యం మీద ఎనలేని మక్కువతో ప్రపంచ ప్రఖ్యాత జానపద కథలను పాఠకులకు అందించారు.
ప్రముఖ కవి శివారెడ్డి ఆవిష్కరించిన ఈ పాల పిట్ట పిల్ల పుస్తకం రూ. 90 లకే లభ్యమైతోంది.
‘‘ ఈ పాల పిట్టలోకి అడుగు పెట్టడమంటే, మనం మరిచి పోయిన దేశంలోకి, కొత్తగా అడుగు పెట్టడమే ! కొత్త రుతువులకి రెప రెపలాడే కిటికీలను తెరవడమే!’’ ... అంటున్నారు రమణ జీవి.
‘‘ ఈ కథల్ని పెద్దలు చదివారంటే తమ బాల్యంలోకి వెళ్ళి పోతారు. అమ్మమ్మలూ, నాన్నమ్మలూ చెప్పిన జానపద కథల్లోని మాయాప్రపంచంలో విహరిస్తారు పరుగుల ప్రపంచపు బాధలనుంచి కాస్త ఉపశమనం పొందుతారు ...’’ అంటున్నారు సుంకోజి దేవేంద్రాచారి.
‘‘ నా బాల్యంలో పెద్దలెవరయినా నాకు మంచి మంచి పిల్లల కథలు చెప్తే బావుండునని అనుకునే వాడిని.... కాని, మా కుటుంబ నేపథ్యం కారణంగా ఆ కోరిక సాంతం నెరవేర లేదు ... ఆ కోరిక యిప్పుడిలా తీర్చుకుంటున్నాను! ...
మా చిన్నారి మనవరాలు చిరంజీవి లాహిరికి ఎన్నో మంచి మంచి , గొప్ప గొప్ప పిల్లలల అద్భత కథలు చెప్పాలి. నా బాల్యాన్ని మళ్ళీ వెతుక్కోవాలి ... అందుకే ఈ పాల పిట్ట కథలు రాసాను ...’’ అని రచయిత ఆవిష్కరణ సభలో ఒకింత ఉద్వేగానికి లోనవుతూ చెప్పారు ...మరి, యింత మంచి పుస్తకాన్ని మనమూ మన పిల్లలకి బహుమతిగా కొని యిద్దామా?
అల్పులు ఎప్పుడూ తక్కువ ఆలోచనలేచేస్తూ ఉంటారు. ఉన్నతమయినఆలోచనలు వారికి రావు, మరి ! పద్యంచూడండి ...నక్కలు బొక్కలు వెదుకును
అక్కరతో నూరపంది అగడిత వెదుకున్
కుక్కలు చెప్పులు వెదుకును
తక్కిడి నా లంజ కొడుకు తప్పే వెదుకున్చూసారు కదూ? అందుకే కదా అన్నారు, ‘‘ పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా? అని !
ఈ రకమయిన అల్పత్వాన్నే ప్రదర్శించిన ఓ బకరాజు వృత్తాంతం చూడండిదిగో ...
‘ ఎవ్వడవీవు? కాళ్ళు మొగ మెఱ్ఱన?’ ‘హంసను’. ‘ఎందునుందువో?’
‘దవ్వుల మానసంబునను’ ‘దాన విశేషములేమి తెల్పుమా?’
‘మవ్వపు కాంచనాబ్జములు మౌక్తికముల్ గలవందు ’ ‘నత్తలో?!’
‘అవ్వి ఎరుంగమ’న్న నహహాయని నవ్వె బకంబులన్నియున్.
ఓ రాయంచ మానస సరోవరం నుండి ఎలా వచ్చిందో, ఓ కొంగలుండే కొలను దగ్గరికి వచ్చింది దానిని చిత్రంగా చూసాయి, అక్కడున్న కొంగలన్నీ. కుతూహలంగా హంసను అడిగాయి : ‘‘ భలే ! నీ కాళ్ళూ, ముఖం ఎర్రగా ఉన్నాయి...నీ ఊరేది? ఎక్కడుంటావు? అక్కడి విశేషాలు చెప్పు .’’ అని.
రాయంచ బదులిచ్చింది : ‘‘ నేను హంసను. నా నివాసం మానస సరోవరం. అబ్బో అదిక్కడికి చాలా దూరం లెండి ...’’
‘‘ అలాగా ! మరక్కడ విశేషాలో?’’
రాయంచ పొంగి పోతూ తమ ప్రాంతం విశేషాలను గొప్పగా చెప్పింది : ‘‘ వాహ్ ! అక్కడ బంగారు పద్మాలూ, మంచిముత్యాలూ ఉంటాయి తెలుసా ?! ’’ అని..
కొంగలు చప్పున అడిగేయి : ‘‘ చాల్లే, సంబడం ! ... ఇంతకీ, అక్కడ నత్తలుంటాయా? అది చెబుదూ ముందు ... ’’
రాయంచ తెల్లబోయింది. అమాయికంగా బదులిచ్చింది : ‘‘ నత్తలా ! వాటి సంగతి మాకు తెలీదే ! ’’ అని.
దాంతో కొంగలన్నీ పక పకా ( బక బకా అని అందామా?) నవ్వి, రాయంచని‘ ఓసి వెర్రి మొహఁవా’ అన్నట్టుగా చూసివెక్కిరించాయిట !ఇలాంటి బడుద్ధాయిలను చూసే కదా, మన ప్రజాకవి వేమన ...అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
విశ్వదాభిరామ ! వినుర వేమ ! అని చెప్ప లేదూ !ఎలాగూ హంసల గురించీ , కొంగల గురించీ వచ్చింది కనుక, బాతుల గురించి కూడా చెప్పుకుందాం...శ్రీకృ ష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యదలో ఓ చక్కని పద్యాన్ని గుర్తు చేసుకుందాం ...
తలబక్షచ్చటగ్రుక్కి బాతువులు కేదారంపు గుల్యాంతర
స్థలి నిద్రింపగ జూచి యారెకు లుష స్నాతప్రయాతద్విజా
నలిపిండీకృత శాటులన్సవిధతద్వాసంబు జేర్పంగ రే
వుల డిగ్గ న్వెసబారు వాని గని నవ్వు న్శాలిగోప్యోఘముల్.ఎంత అపురూపమైన వర్ణనో చూడండి ...
తెల్ల వారు ఝూమునే లేచి, నదీ తీరానికి పోయి, బ్రాహ్మణులు స్నానాదులాచరిస్తారు కదా? అయితే, వాళ్ళు ఒక్కో సారిఅక్కడ తమ బట్టల పిడుచలు మరిచి పోయి యిళ్ళకి వెళ్ళి పోతూ ఉండం కద్దు. ఓ రోజు, నది ఒడ్డున రెక్కలలో తలలుదూర్చుకుని, నిద్ర పోతున్న బాతుల్ని చూసి, అవి బాపనయ్యల బట్టలనుకుని, వాటిని వారికి తిరిగి యిచ్చేద్దాం అని, ఆరెకులు దగ్గరగా వెళ్ళారు. వాళ్ళు దగ్గరకి రావడంతో, ఆ చప్పుడికి బాతులు నిద్రలేచి,టపటపా ఈదుకుంటూ వెళ్ళిపోయాయిట! ఈ తతంగాన్ని చూసి, అక్కడున్న పైరు కాపరి యువతులు విరగబడి నవ్వారుట !
ఇంత మనోహరంగా వర్ణించడం రాయల వారికే చెల్లింది కదూ !
మన కవులు శ్లోకాలలో, పద్యాలలో అన్య భాషా పద విన్యాసాలతోచాలా తమాషాలు చేసారు. నేను సేకరించిన వాటిలో కొన్నింటినిఇక్కడ ఉంచుతున్నాను. ముందుగా మూల శ్లోకాన్ని చూదాం ...క్షుధాతురాణాం నరుచిర్న పక్వ:అర్ధాతురాణాం నగురుర్నబంధు:నిద్రాతురాణాం న సుఖం న శయ్యాకామాతురాణాం నభయం న లజ్జాదీనికి మరొ కవి గారి పేరడీ చూడండి ...క్షుధాతురాణాం నవుడికర్నవుడక:అర్ధాతురాణాం న చెల్లిర్న చెల్లక:నిద్రాతురాణాం న మెట్టర్నపల్లంకామాతురాణాం నముసిలిర్న పిల్ల:అలాగే, ఒక కవి గారు తన దరిద్రాన్ని గురించి వాపోతూ ...తిండికైతే పదిమంది వసంతితండులాలు గృహమందు నసంతికుండ బొచ్చెలు పరం విలసంతిరండ నా కొడుకులెల్ల హసంతి.ఇందులో అశ్లీల పదం బాధాకరమే, అయినా, దరిద్రం అలా కవి చేత అనిపించింది కాబోలు.పెద్ది భట్టు మురికి బట్టలు వేసుకుని రాజదర్శనానికి వెళ్తూ తన పాండిత్యమే తనకి తోడు అని చెప్పినది ...కిం వాససా చీకిరి బాకిరేణ?
కిం దారుణా వంకరటింకరేణ?దీనికి పెద్ది భట్టు సమాధానం ...శ్రీసింగభూపాల విలోకనార్ధం
వైదుష్యమేకం విదుషా సహాయ:కవులు నిరంకుశులు కదా? గొప్ప ఆత్మాభిమానధనులు కూడ...
‘‘ రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయంబు ..... ’’ అనినా, ‘‘ కావ్య కన్యకన్ కూళులకిచ్చి యప్పడుపు కూడు ....‘‘ తిననొల్లనని ఖండితంగా చెప్ప గలిగినా వారికే చెల్లింది. ‘‘ ఈ యుగం నాది ’’ అని సగర్వంగా ప్రకటించుకో గల ధీమంతులుకూడ వారే కదా !
కాఫీ గురించిన ఈ పద్యం చూడండి ...
తరుణుల మోవి పానకము త్రాగక పోయిన నేమి గాక, యా
సురపతి వీటియందు సుధ జుర్రక పోయిన నేమిగాక, యా
కరుణ గభస్తి బింబ ముదయాచలమెక్కక మున్నె వెచ్చనై
గరగరలాడు కాఫి యొక కప్పిదిగోనని అయ్యరిచ్చినన్ !

సిగరెట్లు త్రాగడం మానెయ్యడం చాలా సులభం ! నేను చాలా పర్యాయాలు మానేసాను ! ఇది ఓ ఆంగ్ల మేధావి చతురోక్తిసరే, అదలా ఉంచి మన వాళ్ళు పొగాకు గురించీ, ధూమ పానం గురించీ పద్యాలలో ఏం చెప్పారో చూదాం ... ...ఖగపతి యమృతము తేగా
భుగ భుగమని పొంగి చుక్క భూమిని పడగా
పొగ చెట్టై జన్మించెను
పొగ తాగని వాడు దున్న పోతై పుట్టున్ ! ఇతి గిరీశమ్ ఉవాచ. బృహన్నారదీయం నాలుగో ఆశ్వాశంలో ఉంది, వెతుక్కోండి ...ఇక మరో చక్కని పద్యం ...
భుగ భుగమని పొగలెగయగ
నగణితముగ నాజ్యధారలాహుతి కాగా
నిగమాది మంత్రయుతముగ
పొగతాగని వాడు దున్న పోతై పుట్టున్ !ఓరి! వీడి అసాధ్యం కూలా ! ... మహా మునులు యాగం చేస్తూ వ్రేల్చిన ఆజ్య ధారలు పొగలై మీదికెగసివర్షుకాభ్రుములవుతున్నాయా !
ఋణానందలహరిలో ముళ్ళ పూడి వారి ఋణ సిద్ధాంతం గుర్తుకొస్తోందా ?పరే, మరో కవి గారి పద్యాన్ని కూడా చూదాం ... ఇది మాత్రం ధూమపాన దురలవాటుని ఖండిస్తూ చెప్పినదేనండోయ్!పదపడి ధూమపానమున ప్రాప్తము తా నొనగూడు చేటులున్
మొదలు ధనంబు వోవుట, నపుంసకుడౌట, విదాహమౌటయున్
వెదకుచు జాతి హీనులను వేడుట, తిక్కట చొక్కుటల్, రుచుల్
వదలుట, కంపుగొట్టుట, కళల్ తొలగించుట, రిమ్మ పట్టుటల్
పెదవులు నల్లనై చెడుట, పెద్దకు లొంగుట,బట్ట కాలుటల్ !!డబ్బు పోతుంది, నీరసం కమ్ముకొస్తుంది, దాహం వేస్తుంది, ఓ పిగరెట్ ముక్క కోసం ప్రతీ అడ్డ గాడిదనీ అడుక్కో వలసివస్తుంది, కలవరపాటు కలుగుతుంది, నాలుక్కి రుచీపచీ తెలియదు, నోరూ ఊరూ కంపు కొడుతూ ఉంటుంది, ప్రేత కళముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది, రిమ్మ పడుతుంది, పెదవులు నల్లగా వికారంగా తయారవుతాయిఆత్మన్యూనతాభావం ఎక్కువవుతుంది, ఏమరు పాటు వల్ల బట్ట కూడా కాలుతుంది ...
ఇన్ని అనర్ధాలున్న ఆ కంపు సిగరెట్టు తాగక పోతేనేం?
శ్రీ.శ్రీ గారు సిగెరెట్ మీద పాట రాస్తూ ...‘‘ సరదా సరదా సిగరెట్టూ ...కంపు గొట్టు ఈ సిగరెట్టూ ...’’ అంటూ చివర్లో దీన్నికాల్చకోయి నాపై ఒట్టూ ! అన లేదూ?
స్మోకింగ్ కిల్ల్స్
ఈ పద్యం ఓ సారి చూస్తారూ ?హరి కుమారుడై యొప్పు నాతడు హరి !
హరికి దక్షిణ నేత్రమౌ నాతడు హరి !
హరికి శిరము తోడ వరలు నాతడు హరి !హరికి వామాక్షమై యొప్పు నాతడు హరి !హరికి గల నానార్ధాలను ఉపయోగించకుని కవి ఈ చమత్కార పద్యాన్ని మన ముందుంచాడంతే !
హరి అంటే విష్ణువు , కోతి , సూర్యుడు , సింహము , చంద్రుడు అనే అర్ధాలను కవి ఇక్కడ వాడుకున్నాడు...
ఇప్పుడు పద్యంలో కవి గారి గోల ఏమిటో ఇట్టే తెలిసి పోతోంది కదూ?
మొదటి పాదంలో వరుసగా హరి అనే పదాలకి సూర్యుడు , కోతి అని అర్దాలు చెప్పుకుంటే, వాక్యార్ధం సూర్యుని కొడుకు సుగ్రీవుడని తెలుస్తోంది.. కోతి కదా?
అలాగే రెండో పాదంలో వరుసగా శ్రీ మహా విష్ణువునీ, సూర్యుడినీ చెప్పుకుందాం, వాక్యార్ధం శ్రీహరికి కుడి కన్ను సూర్యుడే కదా!
మూడో పాదంలో రెండో హరి అనే పదానికి సింహం అని అర్ధం చెప్పుకుంటే నరసింహావతారం గుర్తొచ్చి, అర్ధం అవగతమౌతుంది.
నాలుగో పాదంలో రెండో హరి పదానికి చంద్రుడు అని అర్ధం చెప్పుకుంటే విష్ణువు ఎడమ కన్ను చంద్రుడే కదా !
ఈ పాటి దానికి ఇంత వివరణ కావాలా ! ఏదో నా చాదస్తం కాక పోతే, మరీనూ !

కోలాచలం పెద్ది భట్టు కవి శ్రీరాముని పరంగానూ, గోపాలుని పరంగానూ చెప్పిన చక్కని శ్లోకమిది ... య:పూతనా మారణ లబ్ధ వర్ణ:
కా కోదరోయేన వినీత దర్ప:
యస్సత్యభామా సహితస్సపాయా
న్నాధో యదునా మధనా రఘూణామ్.ముందుగా గోపాలుని పరంగా అర్ధాన్ని చూదామా !య:, పూతనా,మారణ లబ్ధ వర్ణ: = ఎవడు పూతనను చంపి కీర్తి పొందెనో
యేన కాకోదర: , వినీత దర్ప: = ఎవని చేత కాళీయుని గర్వం అణచి వేయ బడిందో
య:, సత్యభామా సహిత: = ఎవడు సత్యభామతో కూడి ఉంటాడో
యదూనాం నాధ: , స: , పాయాత్ = అట్టి యదువంశ ప్రభువయిన గోపాలుడు కాపాడు గాక !ఇక, శ్రీరాముని పరంగా అర్ధం పరిశీలిద్దామా !య: , పూత నామా = ఎవడు పవిత్రమైన పేరు గల వాడో
రణ లబ్ధ వర్ణ: = ఎవడు యుద్ధంలో కీర్తిని గడించాడో
అదర:, కాక: , వినీత దర్ప: = భయం లేని కాకాసురుని గర్వం అణచి వేసాడో
య: , సత్య , భా , మా, సహిత: = ఎవడు సత్యము, కాంతి మరియు లక్ష్మిలతో కూడిన వాడో
స: , రఘూణామ్ నాధ: , పాయాత్ = అట్టి రఘువంశ ప్రభువు కాపాడు గాక !!తెలుగు సాహిత్యంలో కూడ ద్వ్యర్ధి , త్ర్యర్ధి కావ్యాలు రాఘవ పాండవీయం వంటివి ఉన్నవి. వీలున్నపుడు వాటిని గురించి ...
కొంటె కృష్ణుని చిలిపి చేష్టలు ఎంత చెప్పుకున్నా తనివి తీరదు కదా?చూడండి ... మాత:కిం యదునాధ: దేహి చషకం, కింతేన?పాతుంపయ:తన్నాస్త్యద్య, కదాస్తినా? నిశి ! నిశా కావా? అంధకారోదయోఅమీల్యాక్షి యుగం నిశాప్యుపగతా దేహేతి మాతు: ముహు:వక్షోజాం శుక కర్షణోద్యత కర: కృష్ణ :సపుష్ణాతువ: చిన్ని గోసాలుడు యశోదమ్మని అడుగుతున్నాడు ‘‘ అమ్మా, పాత్ర యివ్వు, పాలు త్రాగుతా ’’యశోద: ‘‘ ఇప్పుడొద్దు, రాత్రికి త్రాగుదువులే’’గోపాలుడు: ‘‘ రాత్రి ఎప్పుడొస్తుందమ్మా?’’తల్లి: ‘‘చీకటి పడినప్పుడు వస్తుంది నాయనా !’’ తల్లి యిలా చెప్పగానే నంద నందనుడు కనులు రెండూ మూసుకుని ‘‘ చీకటి పడి పోయిందమ్మా !’’ అంటూ తల్లి పైట లాగుతూ మారం చేస్తున్నాడుట!అట్టి బాల గోపాలుడు మిమ్ములను కాపాడు గాక ! అని, కవి ఆశీర్వదిస్తున్నాడు.

ఒక మంచి, అందమైన శ్లోకం చూదాం.ప్రణయ పారవశ్యాన్ని ఎంత మనోహరంగా కవి వర్ణించాడో చూడండి.
రాధా పునాతు జగదచ్యుత దత్త చిత్తా
ధామంన మా కలయతి దధి రిక్త భాండే
తస్యా: స్తనస్తబక చంచల లోల దృష్టి:
దేవో అపి దోహన ధియా వృషభం నిరుంధన్
ఇక శ్లోకార్ధం ... నల్లనయ్య మీద లగ్న చిత్తయై రాధ ఖాళీ కుండలో కవ్వం ఉంచి చిలుకుతోందిట!
ఆమె వక్షోజ విన్యాసాలు చూస్తూ మైమరిచి పోయిన గోపాలుడు పాలు పితకడానికి ఎద్దు కాళ్ళకి బంధాలువేస్తున్నాడుట !!
ప్రేమ పారవశ్యం అంటే ఇదే కదా?

రాముడు హనుమంతుని చేత హత మైతే, సీత సంతోషించిందిట !
రాక్షసులు దు:ఖించారుట !! హవ్వ !! ఇదేం చోద్యం అనుకుంటున్నారా? శ్లోకం చూడండి మరి ...
హతో హనుమతో రామసీతా సా హర్షనిర్భరారుదంతి రాక్షసాస్సర్వేహా హా రామ హతోహత:హనుమతే , ఆరామ అని విరిచి చదువుకుంటే ఏ గొడవా లేదు ! లంకా పట్టణంలో హనుమచే నాశనమైన ఆరామాన్ని (వనాన్ని) చూసి సీత ఆనందించడంలోనూ, రక్కసులు విచారించడంలోనూ అసజం ఏమీ లేదు కదా?మన పూర్వ కవులు యిలాంటి చమత్కార రచనలు చాలా చేసారు.
అత్త గారింటికి వచ్చిన బావగార్లను ‘‘ బావా బావా పన్నీరు, బావని పట్టుకు తన్నేరు, వీధీ వీధీ తిప్పేరు, వీశెడు గంధం పూసేరు’’ అని ఆట పట్టించే ఘట్టం మన పిల్లల తెలుగు వాచక పుస్తకాలలో కపిసిస్తూ ఉంటుంది. ఆ గడుగ్గాయిల అల్లరి గేయ రూపంలో ఉంటే , బావగారి రూపు రేఖా విలాసాలు కొంటెగా వర్ణించిన ఓ చిన్న పద్యం మన వాళ్ళు చెబుతూ ఉంటారు ..దానిని చూడండి ...అందమునఁజూడ రాము బంటైన వాడునాగరికతను జము వాహనమునకీడుశుచికి హేమాక్షుఁజంపిప శూరు జోదువసుధలో లేడు మా బావ వంటి వాడు !!‘కన్నొక్కటి లేదు గాని కాంతుడు గాదే !’ అని పొగడడంలాంటిదే యిదీనూ !ఇలా ఏ బావ గారినయినా కోతి,దున్న పోతు, పంది అంటే యింకేమయినా ఉందా చెప్పండి? మన వాళ్ళ సరదాలు బంగారం కానూ !
గీర్వాణ భాషలో కవులు చమత్కారవంతములైన ప్రహేళికలు కొన్ని రచించారు. ఒక దానిని చూదాం ...సీమన్తినీషు కా శాంతారాజా కోభూత్ గుణోత్తమ:విద్వద్భి: కా సదా వంద్యాఅత్రైవోక్తం న బుధ్యతేప్త్రీలలో మిక్కిలి శాంత స్వభావురాలయిన వారెవరు? రాజులలో గొప్ప గుణ సంపన్నుడెవరు ? బుద్ధిమంతులు దేనిని సతతం అభిలషిస్తారు? ... ఈ మూడు ప్రశ్నలకీ సమాధానాలు శ్లోకంలోనే ఉండడం యిక్కడి చమత్కారం మూడు ప్రశ్నలకీ వరుసగా మూడు పాదాలలోనూ గల తొలి మరియు చివర గల అక్షరాలను కలిపి చదవాలి...వరుసగా ... సీత రామ: విద్యా అనే జవాబులు రావడం లేదూ?!