25, జనవరి 2010, సోమవారం

ప్రతి పద్య చమత్కారం

ప్రతి పద్యం లొ చమత్కారం చూపిస్తూ, మొత్తం ప్రబంధం రచించిన కవి చేమకూర వేంకట కవి. ఆ కవి వ్రాసిన విజయ విలాసం ఆద్యంత రమణీయం. ఈ ప్రబంధానికి శ్రీ తాపీ ధర్మా రావు రచించిన హృదయోల్లాస వ్యాఖ్య చదివి తీరాల్సిన గ్రంధం.
చేమ కూర కవి గారి పద్య చమత్కారానికి ఒక ఉదాహరణ చూదామా ?

పున్నమ రేలఁ దత్పురము పొంతనె పో శిఖరాళి దాఁకి వి
చ్ఛిన్న గతిన్ సుధారసము చింది యిం దిగవాఱ నంతనుం
డి న్నెల న్నగిల్లు; నది నిక్కము గాదనిరేని యా పదా
ర్వన్నె పసిండి మేడలకు రాఁబని ేమిట సౌధనామముల్ ?


ఇది ఇంద్ర ప్రస్ఠ పుర వర్ణన . అక్కడి మేడలు ఆకాశాన్ని తాకుతున్నాయని కవి వర్ణన చేస్తున్నాడు.
అక్కడి మేడలన్నీ జాళువా మేలి పసిడి సోయగపు సౌధాలేనట. వాటికి సౌధాలు అనే పేరు రావడానికి కవి చమత్కారంగా హేతువులు చూపుతున్నాడు.
పున్నమి రాత్రులలో చంద్రుడు అటు వేపు వస్తూ ఆ మేడల శిఖరాలు తగులు కొని గాయ పడ్డాడుట. అతను సుధాకరుడు కదా? అతని లోని సుధ అంతా ఆ మేడల మీద కారి పోయింది. సుధ అంటే అమృతం అనే అర్ధమే కాక సున్నం అనే అర్ధం కూడా ఉంది . కనుక, ఆ మేడలకు సౌధాలు అని పేరు కలిగిందని కవి గారి చమత్కారం. నమ్మకం కుదరడం లేదా? తన లోని సుధ అంతా కారి పోవడం వల్లనే కదా , చంద్రుడు అప్పటి నుండి ( పున్నమి నాటి నుండి ) క్ష్క్షీణించి పోతున్నాడు ? అంటాడు కవి.
అసలింతకీ సౌధము అంటే సున్నం తో కట్ట బడినది. కాని, సౌధానికి గల నానార్ధాలను చక్కగా వినియోగించుకుని కవి గారు ఎంత చమత్కారమయిన పద్యాన్ని రచించారో చూసారా?
ఆ పట్టణం లో మేడలు అంత యెత్తుగా ఉన్నాయని భావం.

19, జనవరి 2010, మంగళవారం

మానవ తప్పిదాలతో మరణ శాసనాలు ...


అమ్మా, ఇక్కడంతా చీకటిగా ఉందమ్మా,
భయమేస్తోందమ్మా .
మాతృగర్భంలో చీకటి గుయ్యారంలో ఉన్నా,
ఎప్పుడూ యింత భయం వేయ లేదే అమ్మా.
అప్పుడెంత వెచ్చగా, నిబ్బరంగా ఉండేదని !
ఇప్పుడేంటమ్మా,
చీకటి భయ పెడుతోందమ్మా.
ఆకలేస్తోందే అమ్మా,
ఊపిరాడడం లేదే అమ్మా !

భయం వేస్తోందే, అమ్మా !
గుండెలు అవిసి పోతున్నాయే అమ్మా !

మానవ తప్పిదానికీ, నిర్లక్ష్యానికీ, మూర్ఖత్వానికీ, సిగ్గు లేని తనానికీ
నిదర్శనంగా
అనాచ్ఛాదిత మృత్యు గహ్వరంలో
ఒక్కడినీ పడి ఉన్నానే అమ్మా.

ఆడుకుందామని వొచ్చేను
నాకేం తెలుసు !

మీ మతి లేనితనం
నా కోసం నిలువెల్లా నోరు చేసుకుని ఉందని !
నన్ను కబళించ బోతోందని.

భయం వేస్తోందమ్మా,
దేవుడి పిలుపయిందని కాదు -
మీ తెలివి తక్కువ తనంతో
మీ పతనానికి మీరే
ఇంత కన్నా ఎంత లేసి అగాధాలు
తవ్వుకుంటారో అని .

భయం వేస్తోందే, అమ్మా !
ఊపిరాడడం లేదే అమ్మా ...అమ్మా ...అమ్ ..మా ...అమ్ ..మా ...

-- -- -- --- --- ---

బోరు బావిలో కన్ను మూసిన చిన్నారి మహేశ్ తలుచుకుని ....

18, జనవరి 2010, సోమవారం

తెలుగింగ్లీషు ... మణి ప్రవాళమ్ ... అదో తుత్తి !!!



రెండు భాషలు కలగలిపి కవిత్వం చెప్తే దానిని మణి ప్రవాళ రచనగా పేర్కొంటారు. తెలుగునీఆంగ్లాన్నీ కల గలపి పద్యాలూ , కవితలూ వ్రాసి, మన కవులు కొందరు చాలా తమాషాలుచేసారు.
మచ్చుకి కొన్నింటిని చూద్దాం ...
ముందుగా కన్యా శుల్కంలో మన గిరీశం గారు వెలగ బెట్టిన రాగ వరసను చూడండి
నీ సైటు నా డిలైటు
నిన్ను మిన్ను కాన కున్న
క్వైటు రెచడ్ ప్లైటు,
మూను లేని నైటు ...
పొటిగరాప్పంతులు పంపిన మనిషిని చూడనట్టుగా,హుషారుగా చెప్పిన తెలుగింగ్లీషుకవిత ( ? )
ఫుల్లు మూను లైటటా
జాసమిన్ను వైటటా
మూను కన్న మొల్ల కన్న
నీదు మోము బ్రైటటా
టా ! టా ! టా !

మరి, శ్రీ. శ్రీ గారి కందాన్ని చూడండి ...

గోల్డ్వ్యామోహం చెడ్డది
మైల్డ్వ్యాయామం శరీర మాద్యం ఖలుడా,
చైల్డ్వ్యాపారం కూడదు,
ఓల్డ్వ్యూలను హోల్డు చేయకుండుముర, జరూ !

మరి కొన్ని పద్యాలను చూదామా ?

కనులం జూడదు భార్య యేనియును, నీ కాలస్థితింబట్టి, జ
ర్మను తైలమ్ము, జపాను సబ్బమెరికా క్రాఫున్, వియన్నా సులో
చనముల్, స్వీడను చేతి బెత్తమును, స్విడ్జర్లాండు రిస్ట్ వాచి, ఫా
రెను డ్రస్, ఫ్రెంచి కటింగ్ మీసమును, ఫారిన్ ఫ్యాషన్ లేనిచో నిలన్.

( మాధవ పెద్ది బుచ్చి సుందర రామ శా స్త్రి )

ఇన్స్యూరు లేని లైఫును
సెన్సార్ గానట్టి ఫిల్ము, సీక్రెట్ ట్రూతున్
వైన్సర్వు కాని ఫీస్టును
విన్సే లేనట్టి టీము వేష్టుర బ్రదరూ !
, ... 

లైఫన నౌవెడే నసలు రైటని చెప్పగ లేము, బెడ్డులో
నైఫును, బోలెడెత్తు ప్రతి నైటును డేయును ఫాలో యవగా
వైఫును, సన్సు, డాటరుల ప్రాపరు రక్షణ ప్రొటెక్షనిచ్చెడిన్
లైఫుకు యిన్సురెన్సు బహుళంబుగ, ప్రాంప్టు ప్రొటెక్షనిచ్చెడిన్.

( మీది రెండు పద్యాలు ఇలపావులూరి సుబ్బారావు గారివి, )

ఇక, విశ్వనాథ కవి రాజు గారి పద్యం చూదామా ?

రామది కింగ్సు సన్ను వితు లక్ష్మణ ఎండ్ వితు సీత క్రాస్డు దీ
ఫేమసు దండకాసు బిగు ఫీల్డును మోస్టు లెబోరియస్లి, దెన్
కేము విరాధ విత్తు హిజు క్రూయలు వర్డ్సు, బివేరు ఫూల్సు నో
టైము టు లూజయాము వెరి టైర్డయి వాంట్మయి బ్రేకు ఫాస్టు సూన్.

చూసారా, తెలుగింగ్లీషు పద్యాలు ... అదో తుత్తి ! ...ఇలాంటి తమాషా మణి ప్రవాళ రచనలు చాల మంది కవులు చేసారు. తెలిసిన వారు తెలిసింది తెలుసుకుని చెప్తే తెలుసుకుని
వెరీ గ్లేడంటాను. ..




17, జనవరి 2010, ఆదివారం

గంజాయి మీద పద్యం ...


కాశీ కృష్ణమాచార్యులు గంజాయి మీద చెప్పిన సీస పద్యం ...

తన్నుఁబట్టిన వారిఁదాఁబట్టి నవ్వించు
పచ్చి
బోగము లంజ పాడు గంజ
తనుఁద్రావు వారి నందరి నటేశులఁజేసి
యాడింపఁగల
లంజ పాడు గంజ
తుది మొదల్లేని యున్మదపు పల్కుల పంట
పండ
బారిన గింజ సాడు గంజ
పలు తావులకుఁబారు బైరాగులను మంద
పసుల గట్టెడు గుంజ పాడు గంజ

త్రావు వారికి గుడ గుడ ధ్వనులఁదనదు
జాడ సూచింప గల రుంజ పాడు గంజ
తప్పద్రావిన వారల తలల మిత్తి
పాదు కొల్పిన కుడియంజ పాడు గంజ !!

గంజాయి ప్రభావం ఎలాంటిదో చూడండి ...అది సేవిస్తే ఒకటే నవ్వడం ! నవ్వే నవ్వు ! పిచ్చి నవ్వు !!
ఇక వారి తైతక్కలకి అంతే ఉండదు.
పిచ్చి వాగుడు వాగుతూనే ఉంటారు.
బైరాగులయితే, ఒక చోట చేరి గంజాయి దమ్ము సేవిస్తూ గడుపుతూ ఉంటారు. గుడ గుడ ధ్వనులతో తనని పట్టిచ్చేపాడు గంజాయి సేవించడం దేనికి ? ప్రాణం మీదకి తెచ్చు కోవడం దేనికి ?!

16, జనవరి 2010, శనివారం

చలి పులిని తరిమి వేయునట్టి విధంబెట్టిదనిన ....


















గాథా
సప్త శతి లోని రమణీయమైన ఈ ప్రాకృత గాథని చూడండి ...


విక్రీణీతే మాఘ మాసే పామర: ప్రావరణం బలీవర్దేన
నిర్ధూమం ముర్ముర నిభేశ్యామల్యా: స్తనౌ పశ్యన్.



మాఘ మాసపు చలి వణికిస్తున్నది. చలి పులిలా మీద పడింది ...ఎద్దులు కొనుక్కోవాలని ఓ రైతు తన కంబళీని అమ్ముకున్నాడుట ! ఓ వెర్రి బాగులోడా ! ఎద్దుల కోసం ఈ చలి కాలంలో నీ దగ్గరున్న కంబళీ అమ్ముకుంటావూ ? మరి చలికి ఏం చేస్తావయ్యా ?! అని ఎవరో అడిగేరు. ఏముందీ, నా భార్య కౌగిలిలో పొగ రాని పొయ్యలున్నాయి కదా ! అని, జవాబిచ్చేడుట, ఆ సరసుడు ...

ఈ ప్రాకృత గాథకు శ్రీనాధుని చాటు పద్యం అందాలు కూడా చూడండి మరి ...


మాఘ మాసంబు పులి వలె మలయుచుండ
పచ్చడంబమ్ముకున్నాడుసరమునకు
ముదిత చన్నులు పొగ లేని ముర్మురములు
చలికి నొర గోయకేలుండు సైరికుండు.

ఎవరివయ్యా, వచ్చినావూ ?!




కస్త్వం ? శూలీ. మృగయ భిషజం. నీల కంఠ ప్రియేహం
కేకామేకం కురు. పశు పతిర్నైవ దృశ్యే విషాణే
స్థాణుర్ముగ్ధే నవదతి తరు: జీవితేశశ్శివాయ:
గచ్ఛాటవ్యాం ఇతి హత వచ: పాతువశ్చంద్రచూడ:

శివ పార్వతులు సరస సంవాదాలు ఎంత హృద్యంగా ఉన్నాయో చూడండి ....
తలుపు అవతల శివుడు. లోన పార్వతీ దేవి....
పార్వతి : కస్త్వం ? ( ఎవరయ్యా నువ్వు ? )
శివుడు : శూలీ ( శివుడిని )
పార్వతి : మృగయ భిషజం ( అలాగయితే వైద్యుడి దగ్గరకి పో ! ఇక్కడికెందుకొచ్చావూ ? ( శూలి అంటే తల నొప్పి అనే
అర్ధం కూడ ఉంది
కదా ! )
శివుడు : నీల కంఠ ప్రియేహం ( అయ్యో, ప్రియా, నేను నీల కంఠుడిని )
పార్వతి : కేకామేకం కురు ( ఓహో ! నెమలివా ! అలాగ అరువ్ చూదాం ! )
శివుడు : పశుపతి: ( నేను పశుపతిని )

పార్వతి : నైవ దృశ్యే విషాణే ( పశు పతివా , మరి కొమ్ములేవీ ?)
శివుడు : స్థాణు: ముగ్ధే ( ముద్దరాలా ! నేను స్థాణువును.)
పార్వతి: వదతి. తరు: ( మరింక చెప్పకోయీ ! చెట్టువన్న మాట ! )
శివుడు : జీవితేశశ్శివాయ ( కాదు . కాదు. నీ జీవితేశ్వరుడిని. శివుడిని )
పార్వతి : గచ్చాటవ్యాం ( అలాగా ! అయితే అడవుల్లో తిరుగు నీకిక్కడేం
పని ! ..శివా అంటే నక్క అని కూడ అర్ధం ఉంది కదా, అందుకే పార్వతి యిలా మేలమాడింది.
ఇతి హత వచ: పాతువశ్చంద్రచూడ: = ఇలా తన సతి పార్వతీ దేవితో మాటల్లో ఓడిపోయిన శివుడు మమ్ము కాపాడు
గాక !









14, జనవరి 2010, గురువారం

తగునా యిది మీకూ ?!


రాచరికపు రోజులలో కవులు రాజాశ్రయాన్ని పొంది, తమ కవిత్వంతో రాజు గారిని మెప్పించి వారిచ్చిన తృణమో, పణమో ప్వీకరిస్తూ ఉండే వారు.
అప్పుడు కూడ ఆశించిన దానికన్నా అధికంగా యిచ్చి అబ్బుర పరిచే వారూ, యిస్తారనుకున్నది యివ్వకుండా యిబ్బంది పెట్టే వారూ, యిచ్చిందే చాలు పొమ్మనే వారూ, చాలదని నసిగితే కించ పడకుండా మరి కొంచెం యిచ్చే వారూ ... యిలా అన్ని రకాల వారూ ఉండే వారు ...
ఐతే, కవి చమత్కారానికి సంతోషించి. వారడిగినంతా యిచ్చి, తమ ఔదార్యాన్నీ, వితరణ గుణాన్నీ చాటుకున్న మహా రాజులూ ఉండే వారు. ఈ శ్లోకం చూడండి ...

అనవేల మహీపాల ! స్వస్త్యస్తు తవ బాహవే
ఆహవే రిపురోర్దండ చంద్రమండల బాహవే.


అనవేలు వేమా రెడ్డి ప్రభువుల వద్దకు ఒక కవి వచ్చి ఆశీర్వదిస్తూ ఈ శ్లోకం చెప్పాడు. రాజు గారి శౌర్య సంపదను కీర్తిస్తూ చెప్పిన శ్లోకమిది.
ఓ సారి శ్లోకాన్ని చూస్తే అందులో ‘ వే’ అనే అక్షరాలు మొత్తం నాలుగు ఉన్నట్టు గమనిస్తాం కదూ. అసలు కథ యిక్కడే మొదలయింది ..
కవి గారి కవిత్వాన్ని మెచ్చుకుని, రాజు గారు రెండు వేల వరహాలు యివ్వ బోయేడు.
కవి గారికి కొంటె తనం, లౌక్యం జాస్తి . అందుకే వాటిని తీసుకోకుండా తనకింకా ఎక్కువ కావాలనే విషయాన్ని చమత్కారంగా తెలియ జేసాడు ...వారి మధ్య జరిగిన సంభాషణని చిత్తగించండి.
కవి : ‘‘ అయ్యా, నేను తమకి నాలుగు వేలు యిచ్చాను. తాము నాకు రెండు వేలు యివ్వడం భావ్యమా చెప్పండి ? ( శ్లోకంలో వే అనే అక్షరాలు నాలుగు ఉండడం చూసాం కదా !)
సరేలెమ్మని రాజు మొత్తం అయిదు వేలు యివ్వ బోయాడు
కవి : ‘‘ రాజా ! మేము ఆరువేల నియ్యోగి బ్రాహ్మణులము. మా గౌరవం నిలుప రాదా ?’’
రాజు మరో వరహా కలిపి, మొత్తం ఆరు వరహాలివ్వబోయేడు.
కవి : ‘‘ మాది మాకిచ్చుట న్యాయమా ప్రభూ ! ’’ ( ఆరువేల నియోగి అన్నది బ్రాహ్మణులలో ఒక శాఖ. తమ శాఖ పేరు లోనే ఆరు ‘వే ’ లుండగా రాజు ఆరింటినే యివ్వడం తగదని చమత్కారం

రాజు నవ్వుకుని, మరొకటి కలిపి, మొత్తం ఏడు వరహాలు యిచ్చాడు. దానికీ కవిగారు తలాడించ లేదు.
కవి : ‘‘ ఏడు రోదన సంఖ్య కదా రాజా !’’ అని గునిసాడు. ( ఏడు ఏడుపు గొట్టు సంఖ్య అని చమత్కారం)
కవి చమత్కార భాషణకి రాజు ఎంతగానో సంతోషించి, మొత్తం ఎనిమిది వరహాలిచ్చి కవిని గౌరవించి పంపించేడు !

ఇందులో మరో చిన్న చమత్కారం కూడా యిమిడి ఉందండీ ... రాజు గారి పేరు చూడండి ... అనవేలు వేమా రెడ్డి. ఇందులోనూ రెండు ‘వే’లున్నాయి ! అసలందుకే ప్రభువుల వారు తమ పేరుకి తగ్గట్టుగా మొదట రెండు వేల వరహాలిచ్చాడు !

11, జనవరి 2010, సోమవారం

మహా భారత యుద్ధం - అక్షౌహిణీ సంఖ్య వివరణ.






















మహా భారత యుద్ధంలో కౌరవ పాండవులు 18 దినాల పాటు
యుద్ధం చేసారు. భారత యుద్ధం శమంత పంచకం అనే చోట జరిగింది. భారత యుద్ధంలో మొత్తం 18 అక్షోహిణీ సేనలు మోహరించి యుద్ధం చేసాయి. పాండవుల పక్షాన 7 అక్షోహిణులు కౌరవుల పక్షాన 11 అక్షోహిణులు సేన యుద్ధం చేసింది. యుద్ధం మొదలు కాకుండానే యుద్ధ రంగంలో నిలచి ఉన్న తన బంధు వర్గాన్ని చూసి, అర్జునుడు యుద్ధ విముఖుడై దిగాలు పడి పోయాడు. శ్రీకృష్ణుడు గీతా బోధ చేసి, అర్జునుని యుద్ధ సన్నద్ధునిగా చేసాడు.
కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న అక్షోహిణీ సైన్య వివరాలు చాల మందికి తెలిసినవే అయినా, తెలియని వారి
కోసం,తెలుసుకోగోరే వారి కోసం, తెలుసుకోవాలనే ఆసక్తి గల వారి కోసం ఇక్కడ పొందు పరిచాను.
అక్షోహిణి అంటే ? ....
ముందుగా యీ పద్యం చూడండి ...
వరరధ మొక్కండు వారణ మొక్కండు, తురగముల్ మూఁడు కాల్వురును నేవు
రను సంఖ్య గల యది యగుఁబత్తి, యది త్రిగుణంబైన సేనాముఖంబు, దీని
త్రిగుణంబు గుల్మంబు, దీని ముమ్మడుఁగగు గణము, తద్గణము త్రిగుణిత మైన
వాహిని యగు, దాని వడి మూఁట గుణియింపఁ బృతన నాఁబరఁగుఁ దత్ పృతన మూట

గుణిత మైనఁజము వగున్, మఱి దాని ముమ్మడుఁగనీకినీ సమాఖ్య నొనరు,
నదియుఁబదిమడుంగులైన నక్షౌహిణి యౌ నిరంతర ప్రమాను సంఖ్య.

దీని వివరణ:
ఒక శ్రేష్ఠమైన రధం, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, కాల్బలం ఐదుగురు = పత్తి
మూడు పత్తులు = సేనా ముఖం
సేనా ముఖాలు మూడు = గుల్మం
మూడు గుల్మములు = గణము
గణములు మూడు = వాహిని
మూడు వాహినులు = పృతన
మూడు పృతనలు = చమువు
మూడు చమువుల = అనీకిని
అనీకినులు పది = అక్షౌహిణి.
లెక్కన చూస్తే ఒక అక్షొహిణి సేనలో మొత్తం బలం యిలా ఉంటుంది ...
రధములు = 21870
ఏనుగులు = 21870
గుఱ్ఱములు = 65,610
వీర భటులు ( కాల్బలం) = 1,09,350 మంది.
ఇలాంటి అక్షౌహిణీ సేనలు యిరు బలాల వారికీ కలిపి మొత్తం 18 అక్షౌహిణుల సేన కురుక్షేత్ర యుద్ధంలో సమరం
చేసింది.
కురు పాండవుల యుద్ధం శమంత పంచకం అనే చోట జరిగింది. ప్రాంతానికి అందు వల్ల కురుక్షేత్రం అనే పేరు
వచ్చింది.
కురు పాండవులు భండనం చేసిన శమంత పంచకానికి పేరు రావడానికి కారణం ఉంది ...
త్రేతా ద్వాపర యుగాల నడిమి కాలంలో పరశు రాముడు తన గొడ్డలితో సర్వక్షత్రియ హననం చేసి, రక్తం తో
ప్రాంతాన్ని పూర్తిగా తడిపాడు. ఐదు మడుగులుగా చేసి, తన పితృదేవతలకు తర్పణాలు అర్పించాడు. అందు వల్ల ప్రదేశానికి శమంత పంచకం అనే పేరు వచ్చింది.

9, జనవరి 2010, శనివారం

ఓ పాలిటు సూస్తే, మీ సొమ్మేం పోద్ది ?!


గ్రామ్య భాషా పద్య రచనలు - నా సేకరణలో లభించిన వాటిని - మీ ముందుంచుతున్నాను. చూడండి ...
ముందుగా యీ పద్యాలను చూడండి ... మీ ఎరుకన గల పద్యాలను కూడ జోడిస్తే సంతోషం.

మా కొలది జానపదులకు
నీ కవనపు ఠీవి యబ్బునే, కూపనటత్
భేకములకు నాకధునీ
శీకరముల చెమ్మ, నంది సింగయ తిమ్మా !



అని, రామ కృష్ణ కవి సన్నాయి నొక్కుల నొక్కినా,

ఎమిదిని సెపితివొ కపితము
బెమ పడి వెరి పుచ్చ కాయ దిని సెపితో
ఉమితక్కైదిని సెపితొ
అమవసి నిసి అనిన మాట అలసని పెదనా !

అని, పెద్దన కవిని మేలమాడినా ... గ్రామీణ జీవనమూ, అక్కడి జనుల భాషాసంస్కారాలూ, వారి నిసర్గ సుందర స్వభావమూ ఆహ్లాదకరాలు కదా?
సరే, కవి శ్రీనాథుని భయ పెట్టిన అనాగరిక వేష ధారుల గురించీ, గగుర్పాటునకు గురిచేసే వారి వర్తనల గురించీ కూడ చూదాం.

దస్త్రాలున్, మసి బుర్రలుం, గలములుం, దార్కొన్న చింతంబళుల్
పుస్తుల్ గారెడు దుస్తులుం, జెమట గంపు గొట్టు నీర్కావులుం
అస్తవ్యస్తపు గన్నడంబును, భయంబై దోచు గడ్డంబులున్
వస్తూ చూస్తిమి, రోస్తిమిన్, పడమటన్ వ్యాపారులంగ్రూరులన్.


ఈ అమ్మో బూచుల సంగతి కాస్త పక్కన పెట్టి మరో పద్యం చూదాం ...

పో!పో !బాపడ ! దోసెడూదలినన్ పోలేక పేరాసలన్
మీ పో జాగితి వేమి? నీ సదువు తిర్నామంబులో, సుద్దులో,
బూపాలంబులో, లంక సత్తెలో, బలా ! బాల్లావు పోట్లాటలో
కా ! పాటింప పటండ్రు బాలిశులు భర్గా ! పార్వతీ వల్లభా !


( కూచిమంచి తిమ్మ కవి - పార్వతీ వల్లభ శతకం)

ఈ కవి గారిదే, మరొకటి ...
అబ్బబ్బ ! కిందటేడప్పయ్య తీర్తాన
జోలె జంగమకిస్తి సోలెడుప్పు
సాతాని జియ్యరు సతికితే పోయిస్తి
కొల్లగా గుల్లెడు సల్ల బొట్టు
లంక సత్తెల వాడు పొంకాన పొగిడితే
మాల దాసరి కిస్తి మానెడూద
వేదాలు వాగితే యెల్లు బొట్టయ్యకు
కొలకుండ దోసెడు కొర్రలిస్తి

ఔర ! తమకన్న కూసుగాడవని నింక
గలడె యను మూర్ఖుడిద్ధర, కామ వైరి
భూసుత విలాస ! పీఠికా పుర నివాస !
కుముద హిత కోటి సంకాశ ! కుక్కుటేశ !


( కుక్కుటేశ్వర శతకం)
మరో పద్యం చంద్ర శేఖర శతకం నుండి ...

గంటము పేర యింటను బగాతము సెప్పితె, ఈదిలోనవో
రెంటిలి సూత్తి నేను, యిను, రేత్రిరమాండెము బాగ సెప్పె మా
యింటి దరోదనుండు బవు యిద్ద మిబీసను సించి లంకలో
మంటెలిగించి వొచ్చెననుమాంద్యుడు మూర్ఖుడు చంద్ర శేఖరా !


రామాయణానికీ, భారతానికీ లంకె పెట్టి, దుర్యోధనుడికీ, విభీషణుడికీ, లంక కాల్చిన హనుమంతుడికీ ఏ గతి పట్టంచాడో చూడండి ...
మరొకటి ...

సంగిత కాడ ! పాడకిక సాలును. నీవది పాడినందుకున్
యింగితమెంచి నేను మరి యిన్నదుకున్ సరి పోయె, నింక పై
హంగుగ నే తలూపినట్టి యప్పుకు తంబుర నీడ పెట్టి పో !
బంగుడ బాప నోడ ! యని పల్కును మూర్ఖుడు చంద్ర శేఖరా !!


రాత్రంతా బాగోతం చెప్పి, ఏఁవైనా యిస్తాడేమో నని గంపెడాశతో చేతులు కట్టుకుని నిలుచున్నాడు ఆ పేద కళాకారుడు.
వాడికి పిసినారి కళాభిమాని ఎలాంటి ఝలక్ యిచ్చాడో చూసారా !
‘‘ చాల్లే వయ్యా, నువ్వు పాడి నందుకూ, నేను విన్నందుకూ ... చెల్లు ! పాయె ! ..మరి నేను మెడ నొప్పెట్టేలాగున తలూపేను కదా ? దానిసంగతేంటి ? ... అంచేత ... నేను తలూపినందుకు నీ తంబురా అక్కడ పెట్టి మర్యాదగా వెళ్ళవయ్యా ....’’

శ్రోత్రియ బ్రామ్మణ కుటుంబాలలో భాషని అనుకరిస్తూ ఓ కవి చెప్పిన పద్యం కూడా చూడండిదిగో ...

అస్సే ! చూస్సివషే ! వొషే ! చెవుడషే !అష్లాగషే !ఏమిషే !
విస్సా వఝ్ఝుల వారి బుర్రి నటయా విస్సాయ కిస్సారుషే
విస్సండెంతటి వాడె, యేళ్ళు పదిషే, వెయ్యేళ్ళకీడేషుమా !
ఒస్సే, బుర్రికి ఈడషే, వొయిషుకేముంచుందిలే, మంచి వొ
ర్చెస్సే, యందురు శ్రోత్రియోత్తమ పద స్త్రీలాంధ్ర దేశమ్మునన్.


( తెలుగు నాడు - దాసు శ్రీరాములు)

కాళ్ళకూరి నారాయణ రావు చింతామణిలో సుబ్బి సెట్టి ...

ఇంటిలో కాలెట్ట నిచ్చిందె శాలని
యేలకి యేలు గుప్పేసినాను
పిల్ల సౌత్తాడింది, పెట్టాలి తిళ్ళంటె
బళ్ళతో సావాన్లు పంపినాను
యే పూట కాపూట యెచ్చని సిరు తిళ్ళు
పట్టెగెల్ళి మొగాన కొట్టినాను
మేలాని కెల్లొచ్చి, మెదలక తొంగుంటె
బిడియ మిడిసి కాల్ళు పిసిగినాను
అర్ధ రేతిరి కాడ ఆరికీరికి సీట్లు
మొయ్య మంటే కూడ మోసినాను
యిన్ని సేసిన వోణ్ణి ఈ డ్చి పారేసారు
తక్కినోళ్ళ మాట లెక్క యేంటి ?
యేఁవి లాబఁవట్టి యెదవల కొంపల
కెల్లకండి, యెల్తె తల్లి తోడు !


జరగాల్సిన శాస్తి జరిగేక కానీ , శెట్టికి తత్వం తలకెక్కలేదు, మరి !

‘మగ వాడికయినా ఆడదానికయినా నీతి వుండాలి ...’ ‘ వేశ్య అన గానే అంత చులకనా ...’ ‘సానిదానికి మాత్రం నీతి వుండొద్దూ ? ...’ అనడాని అందరూ మధుర వాణి లాంటి వాళ్ళు కాదు కదా?

8, జనవరి 2010, శుక్రవారం

చుక్కలూ ... చంద్రుడూ ....




















కమ్మని తెలుగు పద్యాలు ఓ రెండు చూద్దామా !!

మన కవుల అందమైన కల్పనలని చవి చూద్దామా !!

సోరణగండ్ల
రాఁ గొదమ చుక్కలు పట్ట సతుల్కవాటముల్
చేరుప మౌక్తికంబులని చిల్లులు వుత్తురు రమ్మటంచుఁబొ
ల్పారు వితాన హారముల యందొగి హారత వ్రేలి ప్రొద్దు పోఁ
గా రతి డస్సి గాడ్పులకు గాఁదెఱవన్జను విచ్చి మేడలన్.

( ఆముక్త మాల్యద - శ్రీ కృష్ణ దేవరాయులు )

మధురా నగరంలో మేడలని వర్ణిస్తూ చెప్పిన పద్యం, మధురా నగరంలో మేడలు ఎంత ఎత్తైనవి అంటే, ఆకాశంలో ఉండే పిల్ల చుక్కలు నగరిలో ఉండే మేడల కిటికీల లోనుండి దూరుతూ ఉంటాయి. అక్కడి స్త్రీలు తమకి దాపుగా వచ్చిన చుక్కలని పట్టు కోవాలని వెంటనే తలుపులు మూసి వేస్తారు. తమని ముత్యాలు కాబోలుననుకొని, హారం కట్టడానికి తమకి ఎక్కడ బెజ్జాలు వేస్తారో అనే భయంతో చుక్కలు కిమ్మనకుండా స్త్రీల హారాలలో వ్రేలాడుతూ ఉంటాయి. అలా ఆపదనుండి గట్టెక్కుతాయన్నమాట ! సరే, రాత్రి గడిచింది. రతి కేళి ముగిసి, చొక్కి, స్త్రీలు రవంత చల్ల గాలి కోసం కిటికీలు తెరుస్తారు. ఇంకేముందీ, మన చుక్కలు బతుకు జీవుడా అనుకుంటూ వెంటనే తమ హార రూపాలను వదిలి, కిటికీల గుండా తుర్రున సారి పోతాయిట !
కవి భావన ఎంత మనోహరంగా ఉందో గమనించేరు కదూ?

చుక్కల చిక్కులు యిలా ఉంటే, పాపం, మన అందమైన జాబిల్లి అవస్థ కూడ గమనిద్దామా?

రేలమృతాంశులో శశము రెమ్ముదమంచుఁదలంచి జాళువా
మేలి పసిండి సోయగపు మేడల గుజ్జెన గూళ్ళ సందడిన్
బాలిక లుండి యావలఁజనం గని, చింతిలి వంట యింటి కుం
దే లిది యెందు బోగలదు ? నేఁటికి నేమని యందురందులన్.

( విజయ విలాసము - చేమకూర వేంకట కవి.)

ఇంద్ర ప్రస్థ పురాన్ని వర్ణిస్తూ అక్కడి మేడలని గురించి కవి అతి శయోక్తిగా చెప్పిన పద్యం యిది ...
పురంలో వెన్నెల రాత్రుల వేళ బాలికలు అక్కడి జాళువా బంగారు మేడల మీద ఆడుకుంటున్నారు. మేడలు ఆకాశమంత ఎత్తైనవి కావడంతో చంద్రుడు తన దారంట తాను పోతూ, మేడల దగ్గరగా వస్తూ ఉండడం కద్దు. సారి చంద్రుడు అలా తమ మేడల దగ్గరకి వచ్చినప్పుడు చంద్రుడిలో ఉండే కుందేలుని పట్టుకుందామని తీర్మానించుకున్నారు. తీరా, తమ గుజ్జన గూళ్ళ ఆట సందడిలో పడి విషయం కాస్త మరిచి పోయేరు. చంద్రడు తమ మేడలోకి దూరి నట్టే దూరి తామంతా కాస్త ఏమరుపాటుగా ఉన్నప్పుడు తమని , మేడలనీ, దాటుకుని వెళ్ళి పోయాడుట. అయ్యో ! అనుకుని విచారించి, అంత లోనే, ఇది వంటయింటి కుందేలే కదా, ఎక్కడికి పోతుందిలే ! అనుకున్నారుట !
చుక్కల గురించీ, చుక్కల్లో చంద్రుని గురించీ మన కవులు వందలాది అందమైన పద్యాలు రచించారు. చక్కని కల్పనలు ఎన్నో చేసారు. ఇప్పటికి రుచి కోసం రెండూ ...

7, జనవరి 2010, గురువారం

కర్ణుడి చావు ... కథ




భారత కర్ణుడి చావుకి కారణాలు ఆరు ...
నరవర
నీచే నాచే
వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్
ధరచే భార్గవు చేతను
నరయంగా కర్ణడీల్గె నార్వురి చేతన్


విద్యా వ్యవస్థలోని లోపాల వల్ల బాల కర్ణుని చావుకి కారణాలను వెతుకుతూ ...
ఈ కథ190 జూన్ 24 వ తేదీ ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురణ.





Posted by Picasa

6, జనవరి 2010, బుధవారం

లెక్క తేలడం లేదు !



పయస్వినీనాం ధేనూనాం
బ్రాహ్మణ: ప్రాప్య వింశతిమ్
తాభ్యోష్టాదశ విక్రీయ
గృహేత్వైకాం గృహం గత:



శ్లోకంలో కవి - ఒక బ్రాహ్మణుడు ఇరవై ఆవులను దానంగా తీసుకుని, అందులో పద్ధెనిమిది ఆవులను విపణి వీధిలోతన జీవిక కోసం అమ్మేసాడని చెబుతున్నాడు. పోనీ లెండి అన్ని ఆవులని అతడేం చేసుకుంటాడు చెప్పండి ? సరే, అలా ఆవులని విక్రయించి, యింటికి కేవలం ఒక్క ఆవుతో చేరాడుట! లెక్క ఎక్కడో తప్పలేదూ? 20 ఆవులని దానంగాతీసుకుని, 18 ఆవులని అమ్మేస్తే యింటికి రెండు (2) ఆవులతో తిరిగి రావాలి కదూ.?
మరేం లేదు ...
బాపడు దానం పట్టిన ఆవులు 20 కాదండీ ... 19 (పందొమ్మిది మాత్రమే) !
శ్లోకంలో ధేనూనామ్ అనే పదాన్ని ... ధేను: , ఊనామ్ అని చదువుకుంటే సరి ! అంటే, ఒకటి తక్కువ ఇరవై అని అర్ధం ! ఊనామ్ అంటే తక్కువ అని అర్ధం కదా?
ఇప్పుడు లెక్క సరి పోయిందోచ్ !

జీవిత సూత్రాలు

జీవిత సూత్రాలు

దు:ఖం
ఇది అధికార సూత్రం
అంతటా అనువర్తి వస్తుంది
అరుభవించు నరుడా !

ఆదర్శాల సూత్రాలు
అన్ని సమస్యలనూ పరిష్కరించ లేవు
సమత గ్రహణాన్ని
స్వార్ధం సర్వత్రా బాధిస్తోంది.

చూదామన్న బహుళ గ్రహణం చేత
నాయకుల వాగ్దానాల సూత్రంలో
కార్యాచరణ మాత్రం
నిఫేధంగా ప్రవర్తిస్తోంది.

సామాన్య సంసారి జీవితం
లాటరీలో ఏ లడాగమమో వస్తేకానీ
బాగు పడేలా లేదు.

కష్టాలు ఎప్పుడూ ఆగమంగానే వస్తాయి.
దరిద్రానికి రోగాలు
ఆమ్రేడితం
ఆకలి వేసేటప్పుడు
పస్తులతో సంధి నిత్యం!

జీతం అందిన మరునాడే
జేబులు స్వత్వ రూపం ధరిస్తాయి.
పైసలకి లోపం, నెత్తి మీద చుట్టాల సంశ్లేషం
ఒక్క సూత్రంలోనే విధించ బడ్డాయి.

ద్రుతం లాంటి విశ్వాసం
అందరి మీదా ఉండీ లేనట్టుంటుంది.

కార్యం తనదైతే మాత్రం - తప్పకుండా
మాయమై పోతుంది.

నా యిష్టం. ఇది నా కష్టం ! అనేవి
గ్రామ్య ప్రయోగాలు
అది
నీ లక్షణ విరుద్ధ మైన భాష !
తెలుసుకో
సామాన్య మానవుడా !
^ ^ ^

ఈ గేయంలో వాడిన సాంకేతిక పదాలు ... తెలుగు వ్యాకరణానికి చెందినవి. వ్యాకరణ పారిభాషికా పదాలతో పరిచయం ఉన్న వారందరికీ గేయం సుళువుగానే అర్ధం కాగలదు.