27, మే 2010, గురువారం

కదిలేదీ , కదిలించేదీ ....


జ్వలతి చలితేన్ధనోZగ్ని:
విప్రకృత: పన్నగ: ఫణం కురుతే
ప్రాయ: స్వం మహిమానం
క్షోభాత్ ప్రతిపద్యతే హి జన:


ఇది మహా కవి కాళి దాసు రచించిన అభిఙ్ఞాన శాకున్తలమ్ నాటకంలో ఆరవ అంకం లోని శ్లోకం.
దూర్వాస మహా ముని శాపం వలన దుష్యంతుడు శకుంతలను మరచి పోతాడు. తిరిగి అభిఙ్ఞాన దర్శనంతో శకుంతల గుర్తుకు వచ్చి ఖిన్నుడై ఉంటాడు. నిస్తేజుడై ఉంటాడు. పరిపాలనా విముఖుడై ఉంటాడు. అట్టి మహా రాజుని రాక్షస సంహారార్ధం ఇంద్రుని పనుపున ఇంద్రలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఇంద్ర రథ సారధి మాతలి వచ్చి, రాజునకు ఆగ్రహం తెప్పించడం కోసం అతని నర్మ సచివుడు మాఢవ్యుని బాధిస్తాడు.
దానితో రాజునకు ఆగ్రహం కలిగి తిరిగి కర్తవ్యోన్ముఖుడవుతాడు....ఆ సందర్భంలో కవి చెప్పిన శ్లోకం యిది ....

చితుకులు కదిలిస్తే అగ్ని మరింతగా జ్వలిస్తుంది. అపకారం చేయబోతే పాము పడగ విప్పుతుంది. మనిషి కూడ క్షోభ కలిగినప్పుడే తన శక్తి సామర్ధ్యాలు ప్రదర్శిస్తాడు.

ప్రతి మనిషిలోను అంతర్గతమైన శక్తులు చాల ఉంటాయి. అయా ప్రత్యేక పరిస్థితులు కలిగినప్పుడు అవి వెలుగు చూస్తాయి. వ్యథ లోనుండే కదా కథలు ఉద్భవిస్తాయి. వాల్మీకి విషయంలో ఏం జరిగిందో తెలిసిందే కదా? శోకమే శ్లోకమై ఒక మహా కావ్య ప్రాదుర్భవానికి నాంది పలకలేదూ!




‘ కదిలేదీ కదలించేదీ కావాలోయ్ నవ కవనానికి ...’ అని శ్రీ.శ్రీ గారనడంలో కూడ అంతరార్ధం యిదే కదా?






కాళి దాసు శ్లోకానికి కందుకూరి వీరేశ లింగం పంతులు గారు చేసిన పద్యానువాదం కూడ చూడండి మరి ....

చితుకులు కదల్చుటను చెలగి మండు
చెడఁగు చేయుటచేఁబాము పడగ విప్పు
మఱియు క్షోభంబు వలననె మానవుడును
దనదు మహిమంబు చూపును తథ్యముగను.

స్వస్తి.



26, మే 2010, బుధవారం

తెలుగు కథకు తూర్పు దిక్కు చా.సో రాసిన పిడికెడు కవితలు ...






చా.సో గా మనకి తెలిసిన మహా కథా రచయిత చాగంటి సోమయాజులు ( తెలుగు కథకి తూర్పు దిక్కు ) పిడికెడు కవితలు కూడ రాసేరు. ఆతర్వాత కథా రచన మీదనే దృష్టి పెట్టి కవితలు రాయడం తగ్గించారు. లేదా మానీసేరు. రాసినవి చాల కొద్ది పాటి కవితలే అయినా, అవి కవితాభిమానులను ఎంతగానో అలరించాయి. చా.సో కవితలు 1940 ప్రాంతాలలో భారతి, నవ్య సాహిత్య పరిషత్తు వారి ప్రతిభ, అభ్యుదయ రచయితల తెలుగు తల్లి, ఢంకా, కొన్ని దీపావళి ప్రత్యేక సంచికలలోనూ ప్రచురింపబడ్డాయి. కల్పన, అడుగు జాడ గురజాడది, ఆంధ్ర విశ్వ విద్యాలయం వారు వేసిన కవితా సంకలనం లోను చోటు చేసుకున్నాయి.

ఏమయినా, చా.సోని అభిమానించే సాహిత్యాభిమానులు వారి కవితలు కూడ చదివే ఉంటారు. చదవని వారి కోసం ఈ టపా ....

చా.సో రాసిన కొద్ది పాటి గొప్ప కవితల నుండి మీ కోసం ఒక కవిత ....

కాందిశీకుడు

బతకాలని వెళ్ళావు
బాంబుల్లో పడ్డావు
బతికొచ్చినావ
నా నాయనా !

నిరుడెల్లి పోనావు
నేడొచ్చినావు
నడిసొచ్చినావ
నా నాయనా !

కొండలెక్కొచ్చినా
కానల్లొ నడిచినా
కట్టెతోటొచ్చావ
నా నాయనా!

మారు రైతుకు పోయె
మన సాగు భూమిరో
మారు మనుముకు పోయె
నీ బిడ్డ తల్లిరో
నా నేమి సేతురా
నా నాయనా !

నిన్ను నమ్ముకు మేము
నిలబడీ ఉన్నాము
నిప్పు నేకున్నాము
నీ కేటి పెట్టేది
నా నాయానా !


ఈ కవిత సెప్టెంబరు 1945 తెలుగు తల్లి పత్రికలో ప్రచురితమైంది. తర్వాత 1962 లో అడుగు జాడ గురజాడది కవితా సంకలనంలో పునర్ముద్రించబడింది

చా.సో ఈ కవితను 1942 ప్రాంతాలలో రాసి ఉండ వచ్చును.

చా.సో గారి మరిన్ని కవితల కోసం విశాలంధ్ర వారు ప్రచురించిన చా.సో కవితల సంపుటిని చూడొచ్చును. 1996 లో ప్రచురింప బడిన ఈ కవితా సంకలనం ప్రతులు చా.సో కథల పుస్తకం లాగే ఇప్పుడు లభిస్తుందో లేదో, తెలియదు.

చా.సో కథలనీ, కవితలనీ మళ్ళీ ఎవరయినా ప్రచురిస్తే బావుణ్ణు.






21, మే 2010, శుక్రవారం

పట్టు పట్ట రాదు, పట్టి విడువ రాదు .....

మన పూర్వ కవులు మన వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దు కోడానికి ఎన్ని గొప్ప విషయాలనో మంచి మంచి శ్లోకాలలో చెప్పారు.
మంచి మాట అనే టపాలో వీలున్నప్పుడల్లా మీతో పంచుకోవాలనే ప్రయత్నంతో ...

చూడండి ...








సింహ: శిశురపి మదమలిన కపోల భిత్తిషు గజేషు
ప్రకృతిరియం సత్త్వవతాం న ఖలు వయస్తేజసాం హేతు:

విదిలింప వుఱుకు సింగపుఁ
గొదమయు మద మలిన గండ కుంజరములపై
నిది బలశాలికి నైజము
గద ! తేజోనిధికి వయసు కారణమగునే ?

సింహం పిల్ల కూడ రెచ్చ గొడితే ఊరు కోదు. మద గజం మీదనయినా పడి తన సత్తా చాటుతుంది. ఇది బలవంతునికి నైజ గుణం కదా ! తేజోవంతునికి వయసుతో పని లేదు.

ప్రకృతిలో సకల చరాచరాలూ ఈ లక్షణాన్నే కలిగి ఉంటాయి. చూడండి ...

ఛిన్నోZపి రోహతి తరు: క్షీణోప్యుపచీయతే పునశ్చంద్ర:
ఇతి విమృశన్తస్సన్త: సన్తప్యన్తే నవిప్లుతాలోకే



ఖండితంబయ్యు భూజంబు వెండి మొలచు
క్షీణుఁడయ్యును నభివృద్ధిఁజెందు సోముఁ
డివ్విధమున విచారించి యొడలుఁదెగిన
జనములనుఁదాప మొందరు సాధు జనులు.

చెట్టుని చూడండి. నరికినా తిరిగి చిగురిస్తుంది. చంద్రుడూ అంతే కదా? కృష్ణ పక్షంలో కళలు క్షీణించినా, తిరిగి శుక్ల పక్షంలో పుంజుకుని, పూర్ణిమ నాటికి నిండే జాబిల్లిగా అవతరిస్తాడు. ఇలాగే సాధు జనులు ఓటమిని , ఆపదని, గాయాలను సరకుగొనరు. తిరిగి లేచి తమ ప్రతాపం చూపెడతారు.

ఇదే విషయం ఒక మంచి పోలికతో చెబుతున్నాడు కవి ...

యథా కందుక పాతే నోత్పతత్యార్య: పతన్నపి
తథా త్వనార్య: పతతి మృత్పిండ పతనం యథా



కందుకము వోలె సుజనుడు
గ్రిందంబడి మగుడ మీఁదికిన్నెగయుఁజుమీ !
మందుడు మృత్పిండము వలె
గ్రిందబడి యడగి యుండుఁగృపణత్వమునన్

బంతి నేలకేసి కొడితే ఎలా తిరిగి మీదికి లేస్తుందో, సజ్జనుడు కూడ ఒక వేళ ఓటమి పాలయినా, తిరిగి పుంజుకుని లేస్తాడు.
తెలివి తక్కు వాడు మాత్రం నేల కేసి కొట్టిన మట్టి ముద్ద లాగా మరింక పైకి లేవడు.


ఐతే, మరో విషయం ...దైవానుగ్రహం లేనిదే మనం ఏదీ సాధించ లేం. అలాగే, దైవానుగ్రహం ఉన్నప్పటికీ మానవప్రయత్పం చేయక తప్పదు.

గజేంద్రోపాఖ్యానం కథలో కరి రాజు వేల యేండ్లు మొసలితో పోరాడిన పిదప కానీ హరి కరుణించ లేదు కదా ? మానవ ప్రయత్నం చేయ వలసిన ఆవశ్యకతని ఆ కథ మనకి తెలుపుతోంది ...

నదైవమేవ సంచిత్య త్యజేదుద్యోగమాత్మన:
అనుద్యోగేన తైలాని తిలేభ్యో నాప్తుమర్హతి

దైవం మీద భారం వేసి. మన ప్రయత్నం మనం చేయకుండా ఉండడం తగదు. ప్రయత్నం చేయనిదే తిలలనుండి తైలం రాదు కదా?

ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ:
దైవేన దేయమితి కాపురుషా వదంతి
దైవం నిహత్య కురు పౌరుషమాత్మ శక్త్యా
యత్నే కృతే యది న సిద్ధ్యతి కోZత్ర దోష: ?

ప్రయత్నం చేసే వాడికే విజయం వరిస్తుంది. అన్నీ దేవుడే యిస్తాడు కదా అని, ఏ పనీ, ఏ ప్రయత్నమూ చేయకుండా ఉండండం నీచుల లక్షణం. ఒక వేళ నీ ప్రయత్నం నీవు చేసినా, విజయం లభించ లేదనుకో, దాని వలన నీ తప్పేమీ లేదు. దైవానుగ్రహం అంతే అనుకోవాలి.

యథాహ్యేకేన చక్రేణ నరథస్య గతిర్భవేత్
ఏవం పురుష కారేణ వినా దైవం నసిద్ధ్యతి

ఒకే ఒక చక్రంతో రథం నడవదు కదా ? అలాగే, దైవానుగ్రహం లేక పోతే, మానవ ప్రయత్నం సిద్ధించదు.

దైవం అనుకూలించక పోతే, మనం ఏమీ చేయ లేం ...

కాకతాళీయవత్ ప్రాప్తం దృష్ట్వాZపి నిథి మగ్రత:
న స్వయం దైవమాదత్తే పురుషార్ధ మపేక్షతే

దైవానుగ్రహం లేక పోతే, ఎదురుగా ఉన్న నిధి కూడా మన కంట పడదు.

అందు వలన దైవానుగ్రహాన్ని అపేక్షిస్తూ, మానవ ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన ప్రయత్నం మనం చేయనిదే ఏదీ మనలకు తనంతట తాను చేకూరదు.

ఏదీ తనంత తానై నీదరికి రాదూ ... శోధించి సాధించాలి .. అదియే ధీర గుణం ... అని సినిమా కవి చెప్ప లేదూ !





ఉద్యమేనహి సిద్ధ్యంతి కార్యాణి, నమనో రధై:
నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా :

కోరిక ఉంటే చాలదు. అది నెర వేర్చుకునే ప్రయత్నమూ చేయాలి. కేవలం మనోరధంతోటే పనులు చేకూరవు. నిద్రిస్తున్న సింహం నోటి లోకి ఆహారంగా జంతువులు వాటంతట అవి వచ్చి పడవు కదా? ఎంత మృగరాజయినా తన ఆహారసముపార్జనకు వేటాడి తీర వలసినదే కదా !


ఒక్కోసారి మన ప్రయతం ఫలించకకూ పోవచ్చు ...

యదశక్యం న తచ్ఛక్యం, యచ్ఛక్యం శక్యమేవతత్
నోదకే శకటం యాతి నచ నౌర్గచ్ఛతి స్థలే

ఏది చేయడానికి సాధ్య పడదో, అది జరగమన్నా జరగదు. జరిగేది జరుగకా మానదు.
నీటి మీద బండినీ, నేల మీద నౌకనీ నడప లేం కదా !!


ఎట్టుగఁబాటు పడ్డ నొకయించుక ప్రాప్తము లేక వస్తువుల్
పట్టుపడంగ నేరవు, నిబద్ధి; సురావళిఁగూడి రాక్షసుల్
గట్టు పెకల్చి పాల్కడలిఁగవ్వము సేసి మధించిరంతయున్
వెట్టియెఁగాక యే మనుభవించిరి వారమృతంబు భాస్కరా !


ప్రాప్తం అంటూ లేక పోతే, ఎంత చేసినా మనకి ప్రయోజనం సిద్ధించదు. అది నిజం. మంధర పర్వతాన్ని పెకలించి, కవ్వంగా చేసుకుని, వాసుకిని తాడుగా చేసుకుని, రాక్షసులు కూడా దేవతలతో పాటు అమృతం కోసం సాగర మథనం చేయ లేదూ !...పాపం, వారి చాకిరీ అంతా వెట్టి చాకిరీ అయిందే తప్ప వారికి అమృతం దక్క లేదు కదా ?

అలాగని, నిరాశతో ఏ పనీ చేయకుండా ఉండడం తగదు. వేమన చెప్ప లేదూ ? ...

పట్టు పట్ట రాదు, పట్టి విడువ రాదు
పట్టెనేని బిగియ పట్ట వలెను
పట్టి విడుచుకన్నఁబడి చచ్చుటయె మేలు
విశ్వదాభిరామ వినుర వేమ.

ఇది అనంతం. కనుక, ఇప్పటికి స్వస్తి.

10, మే 2010, సోమవారం

కమనీయ ఖండ కావ్యం - కాటూరి వారి ‘ పౌలస్త్యహృదయం ’.

కాటూరి వేంకటేశ్వర రావు గారి ఖండ కావ్యము -

‘పౌలస్త్యహృదయం








శ్రీమహా విష్ణువు వైకుంఠంలో కొలువు తీరి ఉండగా సనకసనందనాదులు శ్రీవారి దర్శనార్ధం వచ్చేరు. ద్వార పాలకులైన జయ విజయులు వారిని అడ్డగించారు. మునులు కోపించి, వారిని రాక్షసులుగా పుడుదురుగాక ! అని శపించారు. విష్ణువు మునులకు దర్శనమిచ్చి, జయ విజయులకు అమోఘమైన మునుల మాటలు తథ్యములని చెప్పి, వైరభక్తితో వారు కాలాంతరమున తనతో ఐక్యం కాగలరని వరం ప్రసాదించాడు. అలా జన్మించిన రాక్షప వీరులే హిరణ్యాక్ష హిరణ్య కశిపులు , రావణ కుంభ కర్ణులు , శిశుపాల దంతవక్తృలు . ఈ కథ అందరికీ తెలిసిందే కదా ?

శ్రీరాముడు రావణసంహారార్ధం లంకా నగరం చేరుకునేందుకు సముద్రతీరం చేరుకున్నాడు. వారధిని కపి సేన నిర్మించనారంభించింది.
అక్కడ లంకలో రావణుడు ఎన్నడూ లేనిది సాగరుడు రవంత సంభ్రముడై ఉండడాన్ని గమనించి, అతనితో పలికిన పలుకులివి.

కాటూరి వేంకటేశ్వర రావు గారు ‘‘ పౌలస్త్య హృదయం ’’ కావ్య ఖండికలో ఈ ఘటన అపూర్వంగా చిత్రీకరించారు. మరిచి పోతున్న ఆ మంచి రసవంతములైన పద్యాలను మిత్రులతో మరొక్క మారు పంచుకోవాలని ఇది రాస్తున్నాను ....

ఆ ఖండ కావ్యంలోని పద్యాలను అక్కడక్కడ ఉటంకిస్తూ వచన రూపంలో అందిస్తున్నాను ....

సముద్రుడు ఆనాడు అల్లకల్లోలంగా కనిపిస్తున్నాడు. ఏదో భయోద్వేగంతో నురగలు క్రక్కుతున్నాడు. అది చూసి రావణుడు సాగరుని ఉద్దేశించి ఇలా అంటున్నాడు :

నురుగుల్ గ్రక్కుచు నూర్పు సందడుల
మిన్నుల్ ముట్ట నొక్కుమ్మడిన్
బరుగుల్ ద్రొక్కుచు శీర్ణ కేశముల
నుద్బాహుండవై వచ్చుత
త్తఱమున్ గాంచిన నుత్తలంపడెడిఁ
జిత్తంబీ భయోద్వేగమె
వ్వనిచే నీ కొనగూడె నర్ణవ పతీ !
వాక్రుచ్చవయ్యా వెసన్.

మిన్నంటేలా నురగలు క్రక్కుతూ పరుగులు పెడుతూ తత్తరపాటుతో వస్తున్నావేమయ్యా ? ఎవరి చేతనయ్యా, నీకీ భయోద్వేగం కలిగింది ? ఓ సాగరా ! వేగిరం చెప్పవయ్యా ...

కేవలం కను బొమల కదలిక చేతనే మూడు లోకాలకీ విలయాన్ని చేకూర్చ గల వారలమే !నా అండ నీకుండగా ఎందుకయ్యా ఇంత భయం ?

నాకూ నీకూ భయం అనే మాట ఎన్నడూ విన లేదే ? ఇవాళ నీ విలా వణికి పోతూ ఉండడానికి కారణం కనిపించడం లేదు. సూర్యుడు ఎప్పటిలాగే వెలుగుతున్నాడు. గాలి మునపటిలాగే వీస్తున్నది. ప్రళయ కాల గర్జనలు వినిపించడం లేదు. తారకలు రాలడం లేదు. చంద్ర రేఖ నా చేయి జార లేదు. నీ ఉదరంలో బడబాగ్ని చల్లార లేదు. ఎందుకీ భయమయ్యా , రామ చంద్రుని ధనుష్టంకారం నిన్ను భయకంపితుని చేసినదా యేమి ?

ఏమేమీ ! మళ్ళీ చెప్పూ, రామ చంద్రుడు లంకకి దండెత్తి వస్తున్నాడా ! మరింకేమీ ... భయం విడిచి పెట్టు. రామచంద్ర ప్రభువుకి త్రోవ విడిచి పెట్టు ...అతనికీ అతని తమ్ముడు లక్ష్మణుడికీ, సూర్య తనయుడు సుగ్రీవునకూ, హనుమకీ ఇతర వానర సేనకీ దారి విడువ వయ్యా ...

ఎన్నాళ్ళకు ! ఎన్నాళ్ళకు !
కన్నులు వింశతియు నాకుఁగల్గిన ఫలమా
సన్నమయి వచ్చె ! భుజగ
ర్వోన్నతి చరితార్ధమగు ముహూర్తము వచ్చెన్


నాటికి నేఁడా? తలపున
నాటెను సామికి వికుంఠ నగరోదితమౌ
మాటలు : దీర్ఘ విలంబము
వాటించి విభుండు నన్ను వంచించెఁగదే !

నా ప్రభువుకి నేను ఇప్పుడా గుర్తు కొచ్చాను ? నా రామచంద్రుని కనులారా ఇంతకాలాని చూసుకో గలిగే భాగ్యం కలిగింది కదా ? ఇరువది కనులున్నందుకు ఫలితం నాకీనాడు కలిగింది కదా ! నా భుజ గర్వం చరితార్ధమయ్యే రోజు ఇప్పటికి తస్థించింది కదా.


నా రాముడు నన్నెంత వంచన చేసాడయ్యా ? ఎన్ని అకృత్యాలు చేసాను ? పాతాళ రాజుని అణగద్రొక్కాను. ఇంద్రుని జయించాను. వెండి కొండని, కైలాస పర్వతాన్ని అల్లల్లాడ చేసాను. ఇంత విశ్వ క్షోభం చేసినా నా రాముడు నన్ను సంహరించడానికి రాడేమీ?

శివ ధునువు విరిచాడని వినగానే, అది నా మాధవుని పనే అని తెలుసుకున్నాను. రోజొక ఏడాదిగా ఎన్నో ఘోర కార్యాలు చేసాను.సీతాపహరణం చేసి రామునికి తీవ్రమైన ద్రోహం చేసాను.
అప్పటికీ, దండకారణ్యమంతా దేవి జానకి కోసం పిచ్చి వాడిలా తిరిగాడు. చెట్లనీ, కొండలనీ, పశుసక్ష్యాదులనీ అడిగాడు. ఊరికే విలపించాడు. ఈ ఘోర కృత్యం నేను చేసి ఉంటానని నా విభుడు నన్ను మరిచి పోయాడు కదా !

జటాయువు నోట జానకి జాడ తెలుసుకుని క్రోధంతో ఎలుగెత్తి ‘ రావణా !’ అని నా రాముడు
నన్ను సంహరిస్తానని ప్రతిన చేసినప్పుడు కదా, నాకు మనశ్శాంతి దొరికింది !

పదుగురులోన నన్ గుఱుతు పట్టునొ, లేదొ, యటంచు సర్వ భూ
విదిత పరాక్రముండనయి, వీఱిడి సేతలు పెక్కు సేసితిన్
బదుగురు ‘ వీడు రక్కసు’డనన్ వెడనిందల కగ్గమైతిఁదా
మది మదినుండి నన్ మఱచె, మాధవుడెంతటి క్రూర చిత్తుడో !

అందరిలోనూ నన్ను గుర్తు పడతాడో లేదో అని, లోకాలన్నింటికీ తెలిసిన గొప్ప పరాక్రమవంతుడనయినా, నా రాముడు గుర్తించడం కోసం ఎన్నో పిచ్చి చేష్టలు చేసాను. అందరి చేతా రాక్షసుడననిపించుకుని నిందలు మోసాను.ఐనా, నా రాముడు నన్ను ఇంత వరకూ గుర్తించనే లేదు. ఎంత క్రూరుడో కదా !

రాముడు నన్ను గుర్తు పడతాడు కదా అని ఆశతో తప్ప - మునులను హింసించడం నాకు యిష్టమా చెప్పండి ? ఆడువారిని చెఱచడానికి నేను పశువునా ? నువ్వే చెప్పు ! ఇలా తన సేవకుని బాధించడం ప్రభువికి వినోదం కావచ్చు. ఇంత చేసినా , నాకు మాట దక్క లేదు. మాధవుడు నాకు మంచిని దక్కనీయ లేదు. ఓ సాగరా ! ఏం చెప్పమంటావయ్యా ? తల్లి జానకమ్మని అపహరించక నాకు తప్ప లేదయ్యా !!


స్వామి ద్రోహము కూడ నేర్పెఁదుదకున్ , వైకుంఠుఁడౌరౌర ! తా
నేమో, నాకిడు బాస లోఁదలపఁడాయెన్ గ్రుడ్డి లోకమ్ము త
న్నే మెచ్చెన్, దొసగెల్లఁజాల్పు దలలన్ నిల్పెన్, మహాంభోనిధి
స్వామీ ! మర్త్యుల రాజనీతి నిపుణత్వంబెల్ల విన్నావుగా ?

నాకు నా స్వామి చివరకు స్వామి ద్రోహం చేయడం కూడా నేర్పించాడయ్యా. నాకానాడు ఇచ్చిన మాట తలచనే తలచడు. లోకం గుడ్డిది. అతనినే నమ్ముతుంది. నన్నేమో నిందిస్తుంది. సాగరా ! ఈ మనుషుల నైజం చూసావు కదా ?

నేనేం ఉట్టి కట్టుకుని ఉండి పోతానా ? నాకెందుకు లోక భీతి ? ఆ మంచితనమేదో అతనికే దక్కనీ ! అతడు నన్ను తెలుసుకుంటే నాకదే చాలును.

అంతా తెలిసి కూడ ఏమీ తెలియని వాని వలె ఉంటాడు హరి. తెలిసీ తెలియక నేను మాత్రం జానకీ మాతని అపహరించి మోస పోయాను.

ఇంట (వైకుంఠలో) ఉండేటప్పుడు నా హరికి ఈ మాయ వర్తనలేవీ తెలియవు. దర్శనమిచ్చి, తరింప చేసే వాడు. అదేమిటో, భూలోకానికి దిగి మాయదారి వాడయిపోయినాడు !

తన దగ్గరకి నేను చేరే దారులన్నీ మూసివేసినా, ఓర్చుకున్నాను. ఈ రావణుని పాద ధూళి ముద్రలు కానుపించని తావు లేకుండా, అంతా ఆక్రమించాను కదా, మరి నన్ను చంపడానికి రాకుండా నా ప్రభువు ఎందుకు ఆలస్యం చేసాడో కదా ?

వైర భక్తితో నా ప్రభువుని చేరుకోవాలని ఎంత చేసినా ఫలితం దక్కడం లేదు ... సరే, తన మాయలు నేను చెల్లనిస్తానా ? రావణుడంటే ఏమనుకున్నాడో ...


రావణుఁడన్న కాళ్ళబడు రాయియుఱప్పయుఁగాదు, జాలిమై
గావఁగ నాతి కోతియునుఁగాకియు గ్రద్దయుఁగాదు, లోక వి
ద్రావణుఁగ్ర వీర చరిత ప్రథితుండతి మానియౌ దశ
గ్రీవుడు పోరిలోఁబొడిచి గెల్చును, చచ్చునుఁగాక, వేడునే ? !

రఘువీరుని శౌర్య పరాక్రమాలన్నీ మారీచుడు, శూర్పణఖ, హనుమ, జానకి మున్నగు వారి వలన ముందే
విన్నానులే !

వసవల్చు చెక్కిళ్ళ వయసున లజ్జమై
మునియాఙ్ఞ్ల దాటకఁదునుము సొగసు
జునపాలు వ్రేలు నీడున శైవ చాపమ్ము
విఱిచిన శృంగార వీ ర మహిమ
పసుపు బట్టల నిగ్గు పస భార్గవ క్రోధ
సంధ్య మాయించిన శౌర్య సార
మాలిఁబాసిన క్రొత్త యలతమై వజ్రసా
రుని వాలి నొక కోలఁదునుము సటిమ

వింటియే గాని, ఇన్నిటికంటె, రాచ
పట్టము దొరంగి, నారలు గట్టి కాన
మెట్టినట్టి వెక్కసమైన దిట్టతనము
వింటి : సామికే తగుననుకొంటె కాని.

అన్నీ విన్నానులే. శివ ధనువు విరవడం, పరశు రాముని నిలవరించడం, వాలిని ఒకే కోలతో వధించడం అన్నీ విన్నాను. అన్నింటికన్నా, రాచ వలువలు విడిచి నార చీరలు ధరించి వనవాసం చేసిన ఆ గుండె నిబ్బరాన్ని గురించి విన్నాక, నా స్వామికి తగిన వాడిని నేనే అనుకున్నాను.


తోయధీ ! ఎంత భాగ్యవంతులయ్యా, మీరు ! ఆ ముగ్ధ మోహనుని రూపం కనులారా చూడ గలిగేరు... నేనందుకు నోచుకో లేదు.

తోయధీ ! ధన్యుడవు నీవు, తొల్లి మత్స్య
కమఠ రూపత నీదె నీ గర్భము హరి
నేడు వెండియు తరింప నున్నాడు నిన్ను
నెల్లి నినుఁజేరి పవళించు నేమి యెఱుఁగ
నట్టులు తరంగలాలితుండగుచు శౌరి.


ఓ సముద్రుడా ! నువ్వెంత ధన్యుడవయ్యా. లోగడ హరి- మత్స్య . కూర్మ రూపాలలో నీ గర్భంలోనే అవతరించి, నిన్ను తరింప చేసాడు. ఇప్పుడు మళ్ళీ నిన్నే ధన్యుడిని చేస్తున్నాడు. ఆ పిమ్మట తిరిగి నిన్నే చేరి, అలల మీద చల్లగా ఊగుతూ ఏమీ ఎరుగనట్టుగా పాలకడలి మీద శయనిస్తాడు.

మీలాంటి వాళ్ళే చరితార్ధులయ్యా. కాదనను. కానీ, తన మోము ముద్దాడిని తండ్రి కంటె, చనుద్రావించిన తల్లికంటె, తనలో సగమయిన సీత కంటె, సేవలు చేసిన తమ్ముడు లక్ష్మణుని కంటె, ఈ లోకకంటకుడైన రావణునకే స్వామి వశుడు సుమీ, తెలుసా !

ఆలోచించి చూస్తే, ఇప్పుడనిపిస్తోంది. తల్లి జానకిని అపహరించి ఎంత మంచి పని చేసానో కదా ! ఇంత అపరాధం స్వామికి చేయక పోతే అతని దర్శనం నాకెలాగ అవుతుంది చెప్పు ?


యుద్ధాలు నా రామునికి కొత్తా ఏమిటి ? మధు కైటభులని వధించ లేదో? వరాహ నారషింహావతారాలు ఎత్తి దుష్టులను పరిమార్చ లేదో ? నేడు పురుషోత్తమునిగా అవతరించి రావణ వధకి పూనుకున్నాడు.

ఎన్నో వీర కృత్యాలు చేసాను. కాని, నా రామునితో వైరం నేడు గదా సంభవ మవుతోంది. ఇది నాకు నిజంగా పండుగే కదా !

లేదు పతంగ వాహనము, కరంబులఁబాంచజన్య కౌ
మోదకులున్, సుదర్శనము పూనడు , రావణు గెల్వ వచ్చె దా
మోదరుడెంత నేరుపరియో ! పది జంటల చేతులార ! ఆ
కైదువులాజి వేళ హరి కైకొను మాడ్కి పరాక్రమింపుడీ .


పతంగ వాహనము లేదు. పాంచజన్య కౌమోదకాదులు లేవు, సుదర్శన చక్రం ధరించ లేదు. రావణుడిని గెలవడానికి వస్తున్నాడు. నా రాముడు ఎంత వీరుడో కదా ! ఓ పది జతల చేతులారా !
హరి సమర్పితములుగా యుద్ధంలో మీరు పరాక్రమించండి.


ఒంటి విలుకాడవై నన్ను నోర్చు తెగువ
వలదురా ! రాఘవా ! రాఘవా ! దశాస్యు
నక్కటా ! క్రూర విక్రము, స్వాత్మ హనన
పాతకుని చేకుముర ! నీ పాదమాన !

రామా, నీ పాదాలు పట్టుకని వేడుకుంటానయ్యా, ఒంటరి విలుకాడివిగా నాతో యుద్ధానికి రాకయ్యా. అంత తెగువ నీకు వలదు సుమా. క్రూరుడైన ఈ రావణుని తనని తానే సంహరించుకునే పాతకునిగా చేయకయ్యా.

పొమ్ము నెచ్చెలి ! రామ మూర్తికి నెదురేగి
పుట్టు ముత్తియముల మ్రుగ్గు వెట్టి
అత్యున్నతమ్మును, నతి గభీరమ్మైన
గర్భ వీచిమ తల్లి గద్దె వెట్టి
రమ కంటె, కౌస్తుభ రత్నమ్ముకంటె , గా
రామైన మణుల దర్శన మొసంగి,
లంకకుఁబంపు , పౌలస్త్యుండు సిరి కొల్వు
చవిక యౌ వక్షమ్ము చంద్రహాస

దారిత మొనర్చి , ఆ గంటు దారి వెంట
హృదయమున్ జొచ్చి, యేకాంత మిచ్చగించి
స్వాగతముఁబల్కునని విన్నపమ్ము సల్పు
మచటనే పునర్దర్శన మగుత మనకు.


నేస్తమా ! సముద్రుడా ! వెళ్ళి రావయ్యా. రామ చంద్ర మూర్తికి ఎదురేగి, జాతి ముత్యాల ముగ్గులు పెట్టు. గంభీరమైన సాగర తరంగ వీచికల గద్దెమీద కూర్చో పెట్టు. రమ కంటె , కౌస్తుభ రత్నం కంటె కూడ విలువైన మణులను కానుకగా సమర్పించు. లంకానగరానికి సగౌరవంగా పంపించు.
ఈ రావణుడు గుండె నిండా అతని రూపమే కలిగి ఉన్నాడని చెప్పు. ఆ ప్రభువునకు స్వాగతం పలుకుతాడని విన్నవించు. తిరిగి మనం కలిసేది అక్కడేనయ్యా ....


ఇదీ కాటూరి వారి రసవత్తరమైన ఖండ కావ్యం.
ఇదొక రసఝరి. తేనె వాక. అద్భుత కళాకృతి.

ఈ ఖండ కావ్య పఠనం ఒక అపూర్వానందానుభూతిని కలిగిస్తుంది. రసమయ సాహితీ సాగరాన ఓలలాడిస్తుంది.

స్వస్తి.





7, మే 2010, శుక్రవారం

పలుకే బంగారం !!










సమ్యగ్భాషణం వ్యక్తికి భూషణం. మంచిగా మాట్లాడితే అందరూ మిత్రులే. కఠినోక్తుల వల్ల మనకి అంతా శత్రువులవడం తథ్యం.

ఈ చిన్న కంద పద్యంలో కవి ఆ విషయాన్ని ఎంత చక్కగా వివరించాడో చూడండి ...

కాకేమి తన్నుఁదిట్టెనె ?
కోకిల ధనమేమి తన్నుఁగో కొమ్మనెనే !
లోకము పగయగు బరుసని
వాకున ,జుట్టమగు మధుర వాక్యము కలిమిన్ !

పాపం, కాకి నిన్నేమీ తిట్ట లేదు కదా ? అదంటే అసహ్యించుకుంటావేం ? ఊరికే కాకి గోల ! అంటూ విసుక్కుంటావు. మరి, కాకిలాగా నల్లగానే ఉంటుంది కదా, కోకిల - అది నీకేమీ పెట్టుపోతలు జరిపించడం లేదు కదా ? దాని గొంతువిని మెచ్చుకుంటావు ?

మధురంగా పలకడం చేతనే కదా కోకిలని యిష్ట పడుతున్నావు ?

అందు చేత, మంచిగా మాట్లాడడం వల్ల అందరి ప్రేమనూ పొందవచ్చును. రుస రుసలాడుతూ ఉంటే ఎవరూ హర్షించరు. సరి కదా, చీదరించుకుని, దూరంగా జరిగి పోతారు ....

బద్దె భూపాలుడు సుమతీ శతకంలో ఇతరుల మనసు బాధించకుండా మాటలాడదగునని చెప్పాడు కదా ?

ఎప్పటి కెయ్యది ప్రస్తుత,
మప్పటికా మాటలాడి యన్యుల మనముల్
నొప్పింపకఁదానొవ్వక
తప్పించుక తిరుగు వాడు ధన్యుడు సుమతీ !

ఎప్పుడేది మాట్లాడాలో అప్పుడది మాట్లాడాలి. ఇతరులు మనసులు బాధించ కూడదు. అలా లౌక్యంగా వ్వహరించే వాడు ధన్యుడయ్యా అంటాడు కవి.

అలా అని ఇతరుల మెప్పు కోసం వారికి నచ్చుతుందని చెప్పి నానా చెత్తా పలకమని కాదు ...
పరుషంగా కాక, కాస్త సౌమ్యంగా మాట్లాడమని కవి బోధిస్తున్నాడు...

అయితే , కొందరున్నారు ... ఎంత మంచిగా చెప్పు ... వినరు. తల కెక్కించు కోరు. వాళ్ళకి తెలీదు. చెబితే వినరు.


భర్తృహరి ఎలా వాపోయాడో చూడండి ...

బోద్ధారో మత్సరగ్రస్తా: ప్రభవ: స్మయ దూషితా:
అబోధో పహతశ్చాన్యే జీర్ణమంగే సుభాషితమ్

బాగా తెలిసిన వారికి మదం, మాత్సర్యం జాస్తి. చెబితే వినరు. ప్రభువులా - వారసలే గర్విష్ఠులు. వారికి చెప్ప లేం. ఇక ఇతరులంటారా, వారికి చెప్పినా అర్ధం కాదు. అందుల్ల నాలుగు మంచి మాటలు చెబుదామన్నా నోరు దాటి బయటకి రావడం లేదు.

దీనికి ఏనుగు లక్ష్మణ కవి అనువాదం కూడా చూడండి ...

బోద్ధలగు వారు మత్సర పూర్ణమతులు
ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువు లెన్న
నితర మనుజులబోధోపహతులు గాన
భావమున జీర్ణమయ్యె సుభాషితంబు.




సనాతన ధర్మం చెప్పినది చూడండి ...

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
నబ్రూయాత్ సత్యమప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఏష ధర్మస్సనాతన:

సత్యాన్నే పలకాలి.ప్రియ వచనలాలే పలకాలి. సత్యమయినా, అప్రియాన్ని పలకవద్దు. ప్రియమైన దయినప్పటికీ అసత్యం పలక వద్దు. ఇది సనాతన ధర్మం.

అయితే, తనకి తెలిసిన మంచిని చెప్పక పోవడం కూడ పాపహేతువేనని నన్నయ గారు ...

తనయెఱిఁగిన యర్ధంబొరుఁ
డనఘా ! యిది యెట్లు సెప్పు మని యడిగినఁజె
ప్పని వాడును, సత్యము సె
ప్పని వాడును ఘోర నరక కంపమునఁబడున్.

తనకి తెలిసిన విషయాన్ని, నాకది చెప్పవయ్యా, అని ఎవరయినా కోరితే, తనెరిగిన దానిని చెప్పని వాడూ, సత్యము పలుకని వాడూ పెను నరకంలో పడతాడని నన్నయ్య గారు మహా భారతంలో చక్కగా హెచ్చరించారు ...

ప్రియ భాషణముల గురించి ఎలాగూ చెప్పుకుంటున్నాం కనుక ఇది కూడా చూడండి ...

అనుదిన సంతోషణములు,
జనిత శ్రమ తాప దు:ఖ సంశోషణముల్
తనయులు సంభాషణములు,
జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్

పోతన గారు భాగవతంలో ప్రహ్లాద చరిత్రలో చెప్పిన పద్యమిది.

కొడుకుల ముద్దు మాటలు జనకులకు నిత్యం ఆనందాన్ని కలిగిస్తూ. విచారాలని పోగొడుతూ ఉంటాయి. పిల్లకాయల పలుకులు వారి చెవులకి మంచి అలంకారాలు ...

సభలో సభారంజకంగా మాట్లాడలంటే ఎలాంటివి మాట్లాడాలో కవి చౌడప్ప తన మార్కు పద్యంలో చెప్పాడు. గమనించండి...

పది నీతులు పది బూతులు
పది శృంగారములు కల్గు పద్యములు సభన్
చదివిన వాడే యధికుడు
కదరయ్యా కుంద వరపు కవి చౌడప్పా !

ఆ రోజులలో సభలలో అలాంటి మాటలు గౌరవ ప్రదాలే కాబోలు.

నీతులూ బూతులూ లోకఖ్యాతులని కూడా సెలవిచ్చాడు మరి ...

నీతులకేమి యొకించుక
బూతాడక నవ్వు పుట్టదు ధరలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులురా కుంద వరపు కవి చౌడప్పా !

ఐతే, నాకు చక్కగా మాట్లాడడం చాతనవును కదా అని ఎక్కడ పడితే అక్కడ మెప్పించేలా మాట్లాడడం అంత సుళువేమీ కాదు . అదే చెబుతున్నాడు చౌడప్ప ... మరో పద్యంలో ...

నేరుతునని మాట్లాడగ
వారిజు భవునంత వాని వశమా ? తంజా
వూరి రఘు నాధ నాయుని
గారెదెరుగ కుంద వరపు కవి చౌడస్సా .

నాకు బాగా మాట్లాడడం చాతనవునని విర్రవీగుతూ తంజావూరి ప్రభువులు రఘునాథ రాయుని ఎదుట
మాట్లాడడం బ్రహ్మ దేవుడికి కూడా సాధ్యం కాదు సుమీ ! అని కుండ బద్దల కొట్టినట్టుగా చెబుతున్నాడు కవి...

మాట్లాడడం సుళువే కానీ, మాట మీద నిలబడడమే కష్టం పోతన గారు చెప్ప లేదూ ?...

బ్రతు వచ్చు గాక బహు బంధనములైన
వచ్చు గాక లేమి వచ్చుగాక !
జీవ ధనము లైన చెడు గాక పడు గాక
మాట తిరుగ లేరు మాన ధనులు !

కష్టాలు రానీ, దరిద్రం కలగనీ ఏమైనా కానీ మాన ధనులు మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు ....

మంచి వాడు ఎప్పుడూ మంచి మాటలే పలుకుతాడు. కఠినంగా మాట్లాడడు. ఒక వేళ ఎప్పుడినా అతను కఠినంగా పలికినా మేలే జరుగుతుంది తప్ప - కీడు కాదు. చూడండి భాస్కర శతకంలో కవి ...

పలుమరు సజ్జనుండు ప్రియ భాషలె పల్కు , కఠోర వాక్యముల్
పలుకఁడొకానొకప్పుడవి పల్కినఁగీడునుఁగాదు ; నిక్కమే
చలువకు వచ్చి మేఘుఁడొకజాడను దా వడగండ్ల రాల్చినన్
శిలలగునోటు ! వేగిరమె శీతల నీరముఁగాక భాస్కరా !

సజ్జనుడు సదా మంచి మాటలే పలుకుతాడు. ఎప్పుడూ కఠినంగా పలుకడు. ఒక వేళ ఎప్పుడయినా అతని నోటి వెంట కఠినోక్తులు వచ్చినా , దాని వలన మనకి కీడు కలుగదు. మంచే జరుగుతుంది.
ఎలాగంటే, లోకానికి చల్లదనాన్ని ఇవ్వడం కోసం మేఘుడు వచ్చి, వర్షం కురిపిస్తాడు. ఒక్కోసారి వడగళ్ళూ కురిపిస్తాడు. అయితే అవి రాళ్ళలాగా ఉండి పోతాయా ? వెంటే చల్లని నీటిగా కరిగి పోదూ ?

మంచి మాటల గురించి సుమతీ శతకంలోంచి మరో మంచి మాట ...

మాటకుఁబ్రాణము సత్యము
కోటకుఁబ్రాణము సుభట కోటి ధరిత్రిన్
బోటికిఁబ్రాణము మానము
చీటికిఁబ్రాణంబువ్రాలు సిద్ధము సుమతీ !

మాటకి సత్యాన్ని పలకడమే ప్రాణం. కోటకి మంచి భటులు ప్రాణం. శీలమే పడతికి ప్రాణం ( ఆ మాట కొస్తే మగవాడికి కాదా ఏమిటి?) ఇక, సంతకమే చీటీకి ( ఉత్తరం వగైరాలకి ...) అతి ముఖ్యం అంటున్నాడు కవి ...

మాట్లాడకుండా ఉండడం కూడా కొండొకచో శోభిస్తుంది సుమా !

ఎలాగంటే ....

మూర్ఖో2పి శోభతే తావత్సభాయాం వస్త్రవేష్టిత:
తావచ్చ శోభతే మూర్ఖో యావత్కించిన్నభాషతే.


మూర్ఖుడు - అంటే చదువు సంధ్యలు లేని శుంఠ కూడా చక్కని బట్టలు వేసుకుని సభలలో రాణించ గలడు.
ఎంత వరకయ్యా అంటే ..... నోరు విప్పనంత వరకూ !!

మరి ఇప్పటికి స్వస్తి.





5, మే 2010, బుధవారం

చిత్రం ! భళారే విచిత్రం !!










పద్యం ఇదీ:

ఎన్నడు చూడబోయినను యించుక మాయని హాస రేఖ నీ
కన్నుల కానుపించునది కమ్మగ, యిమ్ముగ వెన్నెలంబలెన్ !
మిన్నగు నీదు వర్తనము మెచ్చఁగ హెచ్చగు శక్తి కావలెన్
మన్సన చేసి , నన్నెపుడు మానసమందిడు రామ కృష్ణుఁడా !


ఈ ఫొటో దాదాపు నలభై ఏళ్ళ క్రిందటిది. విజయనగరం వీనస్ ఫోటో స్టూడియోలో మేం సరదాగా తీయించుకున్నది. ( తే 21-11-1971 దీన) అంటే, అప్పుడు మేం విజయనగరం మహా రాజా
సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ మూడో సంవత్సరం చదువుతున్నాం.

ఫొటోలో ఎడమ చేతి వేపు ఉన్నది నేను .

కుడి చేతి వేపు ఉన్నది ఎవరో తెలుసా?

ఆంధ్రామృతం బ్లాగు ద్వారా అందరికీ చక్కని పద్య రచనలతో చిర పరిచితుడైన శ్రీ చింతా రామ కృష్ణా రావు.

క్రింద ఉన్న పద్యం అతని గురించి 21-11-1971 దీన నేను రాసిన పద్యం. నా దగ్గర ఈ ఫొటో లేదు, నేను రాసిన ఆ పద్యమూ లేదు. కాని సహృదయుడైన నా మిత్రుడు రామకృష్ణా రావు వీటిని ఇంత కాలం తన దగ్గర భద్ర పరచి, ఇటీవలే నాకు పంపించేడు.

ఆంధ్రామృతం బ్లాగుని అభిమానించే బ్లాగర్లకందరికీ ఈ ఫొటో సంతోషాన్ని కలిగిస్తుందని భావిస్తున్నాను...

3, మే 2010, సోమవారం

మన కోసం వెలువడింది, ఓ మంచి కథా సంకలనం !


ముఖ పత్రం చూస్తూనే తెలిసి పోతోంది కదూ , ఈ కథలన్నీ రైలు జీవితాలకి చెందిన కథలని.
నిజమే, రైలు నేపథ్యంలో మానవీయ కోణంలో అనేక అంశాలని తాకుతూ హృద్యంగా సాగిన 20 గొప్ప కథలున్న మంచి కథా సంకలనం యిది !

ఇందులో ప్రతీ కథా హృదయ సంబంధి. గుండె గూడు పట్లు కదిలించి వేసే కథలివి.
రచయిత శ్రీ ఓలేటి శ్రీనివాస భాను దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ ట్రాఫిక్ ఇనస్పెక్టర్ గా పని చేసే రోజులలో దేశంలో చాలా ప్రాంతాలు ఉద్యోగ రీత్యా చుట్ట బెట్టి వచ్చేరు.

అలా సంపాదించిన అపూర్వానుభవంతో రైలు జీవితాల గురించి అద్భుతమైన కథలు మనకందించేరు.ఈ కథలన్నీ లోగడ నవ్య వార పత్రికలో ధారావాహికంగా వచ్చి విశేషంగా పాఠకులని అలరించాయి.

ఈ రచయిత వివిధ సాహితీ ప్రక్రియల మీద ఎనలేని మమకారం పెంచుకున్న వ్యక్తి. కథారచయితగా దాదాపు అన్ని ప్రముఖ పత్రికలలోను కథలు వెలువరించారు. ఆంధ్ర జ్యోతి ఆదివారం, ఈనాడు ఆదివారం, సితార సంచికలకు ఫ్రీ లాన్సర్ గా అనేక రచనలు చేసారు ; చేస్తున్నారు.

ఈనాడు ఆదివారంలో ప్రాచుర్యం పొందిన ‘ఇది కథ కాదు’ శీర్షికను ‘తేజస్వి’ కలం పేరుతో నిర్వహించారు.
అనేక నృత్య రూపకాలను టీ.వీ ల కోసం రచించారు. ఆకాశ వాణిలో చాలా గేయ రూపకాలు ప్రసారమయ్యాయి. హిందీ, కన్నడ భాషల ధారావాహికలకు తెలుగులో డబ్బింగ్ రచన కూడా చేసారు. నవ్య వీక్లీలో వీరి ‘కలకండ పలుకులు’ శీర్షిక బహుళ జనాదరణ పొందింది. ప్రస్తుతం అదే పత్రికలో ‘వెండి తెర వర ప్రసాదం’ పేరుతో ఎల్వీ ప్రసాద్ జీవిత చరిత్ర మనకి అందిస్తున్నారు ...


ఈ ‘ పొగబండి కథలు ’ చదవడం ఒక అపూర్వమైన అనుభవం కాగలదు.

ఈ కథలకి ప్రముఖ చిత్రకారులు శ్రీ బాలి గారు మనసుకుంచెతో గీసిన చిత్రాలు ఈ కథల పుస్తకంలో మరో అదనపు ఆకర్షణ !


ఈ పుస్తకం గురించి ఎవరేం అంటున్నారో చూడండి ....

శ్రీ శ్రీనివాస భానుగారు రాసిన ‘ పొగబండి కథలు’ రైలు నేపథ్యంగా మానవీయ కోణంలోని అనేక అంశాలని స్పృశిస్తూ హృద్యంగా సాగాయి, జున్ను కోరిన భార్య కోరిక తీర్చడానికి భర్త పడే ఆరాటం, బ్యూరోక్రసీతో వచ్చిన హిపోక్రసీతో గతంలోకి వెళ్ళడం, ఇలా అనేక అంశాలని, అనుభూతులని ఈ పొగబండి మృదువుగా, నిశ్శబ్దంగా మన ముందుకి తెచ్చి, మన లోని అనుభూతులని కూడా తట్టి లేపుతుంది.
పూర్వం కృష్ణాతీరం నేపథ్యంలో వచ్చిన ‘అమరావతి కథలు’ ఒరవడిలో ఎలాంటి బ్రేకులు లేకుండా సాగే ‘పొగబండి కథలు’ మనకందించిన ఓలేటి వారికి అభినందనలు.

- మల్లాది వెంకటకృష్ణమూర్తి

జీవితాన్నీ, జీవిక కోసం చేపట్టిన వృత్తినీ మనసారా ఆస్వాదించ గలిగే వ్యక్తికి మాత్రమే ఆసక్తికరమైన కథనాలతో నలుగురినీ మెప్పించ గలిగే తలపోతలుంటాయి. ఇక, ఆ వ్యక్తి సమర్ధుడైన రచయిత అయితే చెప్పే పని లేదు. తన స్మృతి పేటికలో భద్రపరచిన ఒక్కో ఙ్ఞెపకాన్నీ చక్కని చిక్కని కథగా అక్షర బద్ధం చేయగలుగుతాడు. ఓలేటి శ్రీనివాసభాను ‘పొగబండి కథలు’ అందుకు నిలువెత్తు నిదర్శనం. రైల్వేలకు చెందిన సాంకేతిక విషయాల జోలికి అంతగా పోకుండానే ఆ జీవిత పార్శ్వాలనీ , అపురూప కోణాలనీ ఆర్ద్రంగా చిత్రీకరించిన కథలివి. నిత్య జీవితంలో ఇతర సామాజిక వర్గాలతో కలగలిసి పోతూనే, కాస్త ఎడంగా ఉన్నట్టు తోచే రైలు బతుకుల్లో విస్మయ పరిచే బతుకులెన్నో ఉన్నాయి. వాటిని ఒడుపుగా పట్టుకుని పదే పదే చదివించే కథలుగా మలచడంలో రచయిత సఫలీకృతుడయ్యాడని నా నమ్మకం. ఈ కథలు చదివితే మీరూ ఆ మాట కాదన లేరు .


- పంతుల జోగారావు


‘ పొగబండి కథలు’ పుస్తక రూపంలో వస్తున్నాయంటే నాకు మించిన ఆనందం ఇంకెవరికీ ఉండదేమో ! జీవితంలోంచి వచ్చిన కథలివి. కథే బొమ్మ వేయించు కొంటుంది. అందు వల్ల బొమ్మలూ బాగానే కుదిరాయి. ‘నవ్య’ వీక్లీలో ఇవి వచ్చినన్నాళ్ళూ పాఠకులు అబ్బుర పడ్డారు. తిరిగి ఈ కథలతో పాటు నా బొమ్మలు ఈ రూపంలో పాఠకుల చేతికందడం సంతోషదాయకం.


- శ్రీబాలి.


క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్ వారు ప్రచురించి ఇటీవల విడుదల చేసిన ఈ కథల సంపుటి కథా ప్రియులని ఎంతగానో అలరిస్తుందని చెప్పడానికి ఇందులోనుండి మచ్చుకి ఒక కథ ....















ఈ కథల పుస్తకం మీద నవ్య వార పత్రిక తే 19-5-2010 దీ సంచికలో బుక్ చాట్ శీర్షిక క్రింద వచ్చిన సమీక్ష
చూడండి .....