10, జూన్ 2010, గురువారం

మంచి మాట


హిత వచనమ్ . కామ్ లో భారతంలో చెప్ప బడిన రాజ నీతి ధర్మాలు చూస్తున్నాం కదా.
ఇప్పడు మరి కొన్ని యుద్ధనీతి ధర్మాలు చూదాం ... శాంతి పర్వం ద్వితీయాశ్వాసం నుండి ....


రాజు తన మూల బలం ( అంటే, చతురంగ బలాలలో ప్రధాన సైన్యం) శత్రుసంహారార్ధం అని భావించి, దానిని ప్రేమగా చూడాలి. శత్రువు అసమర్ధుడుగా ఉన్నాడని గ్రహించి నప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. ఈ దండ నీతి వలన రాజునకు మిక్కిలి శుభం కలుగుతుంది.

యుద్ధం ఒక సాహస కృత్యం.యుద్ధం చేసి, శత్రు సంహారం వలన సంపాదించిన సిరి సంపదలు మేలు కలిగించవు సుమా ! రాజు అహంకారాన్నీ, కోపాన్నీ తగ్గించుకోవాలి. అలాంటి రాజునకు శత్రువులు ఉండరు. రాజు ఎదిరి రాజు తనంతటి వాడని గ్రహించి నప్పుడు తగిన సామోపాయంతో ప్రవర్తించాలి.

ఒక్కో సారి తన సైన్యం లోనే అంత: కలహాలు చెల రేగుతూ ఉంటాయి. అలాంటప్పుడు రాజు యుద్ధానికి బయలు దేర కూడదు. శత్రువు ఎంత బలహీనుడయినా సరే, అతనికి ధనం ఇచ్చి సంతృప్తి పరచి వశం చేసు కోవడమే ఉత్తమం.

ఇలా సామ దాన దండోపాయాలనే మూడింటికి అవకాశం లేనప్పుడు శత్రువు బలహీనతలను గమనించి, అవకాశం చిక్కి నప్పుడు శ్రద్ధతో రాచ కార్యాన్ని చేయ గల సమర్ధుని నియోగించి భేదోపాయానికి ప్రయత్నించాలి.

శుక్రాచార్యుడి మతం ప్రకారం సామ దాన భేద దండోపాయాలే కాక, ఉపేక్షా భావ మనే మరో ఉపాయం కూడ ఉంది. దానిని ఎలా ప్రయోగించాలో చూడండి ...

తమలో తమకే వైరం కలిగి సతమతమయే రాజుని ఉపేక్షించాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి. కొందరు మంత్రులు రాజుకి ఆపదలు కలిగించడానికి చూస్తూ ఉంటారు. వారి పట్ల కూడ కొంత కాలం ఉపేక్షాభావం వహించి, అదను చూసి వారిని తొలిగించాలి.

మరి కొంత యుద్ధ నీతి చూడండి ...

యుద్ధంలో శత్రువు పైన్యంతో ఎదుర్కొంటే, నువ్వూ సైన్యం తోనే ఎదిరించాలి. శత్రవు ఎక్కటి కయ్యానికి తలపడితే నీవూ అదే చేయాలి.శత్రువు మాయోపాయాలతో యుద్ధం చేయడం ప్రారంభిస్తే నీవు కూడ కపటోపాయంతోనే ఎదిరించాలి.
శత్రువు వెన్ను చూపి పారిపోయినా, అజాగ్రత్తగా ఉన్నా, అతని ఆయుధం భగ్నమయినా, శరణు వేడినా, మ్రొక్కినా, శత్రువు గుర్రాలు నేల కూలినా, పారి పోయినా, శత్రువు వేరొకడితో యుద్ధం చేస్తున్నా, ఎట్టి పరిస్థితులలోనూ శత్రువుని చంప కూడదు సుమా ! అది యుద్ధ నీతి కాదు. అధర్మంగా యుద్ధంలో శత్రువుని చంపడం కంటె చావడం మంచిది.

మరొక విషయం ... యుద్ధంలో వాడే ఆయుధాల గురించి ... చివర ములికిని ఉంచి తయారు చేసిన ఆయుధాన్ని కానీ, లేదా, విషం పూసిన ఆయుధాన్ని కానీ ఎలాంటి శత్రువు మీద కూడ ప్రయోగించ కూడదు. అలా చేస్తే రాజునకు నరకం ప్రాప్తిస్తుంది.
అలాగే యుద్ధలో తనకు సహాయంగా వచ్చి, ఘోరంగా గాయాలబారిన పడిన వారిని పట్టించు కోకుండా ఉండ కూడదు.అది చాల పాప హేతువు.

శత్రువుపై దండెత్తి, అతని రాచ నగరుని వశం చేసుకుని, నాశనం చేయడమూ, అక్కడి ప్రజలను బాధించడమూ కూడ తగదు. అలాగే బ్రాహ్మణుల యిళ్ళను, దేవాలయాలను కొల్ల గొట్టడం కూడా సరి కాదు. అది రాజునకు తగని పని.

భీష్ముడు ఈ యుద్ధ నీతిని బోధించగా విని, ధర్మ రాజు ‘‘ మొత్తానికి రాజ ధర్మం కంటె మరొక పాప కార్యం లేనట్టుంది. ఎలా చూసినా రాజునకు నరకం తప్పేలా లేదు.’’ అంటూ కించ పడ్డాడు.

రాజ్యాంతే నరకం ధృవమ్ అని పెద్దలు చెప్ప లేదూ ?

మరి కొన్ని తదుపరి హిత వచనమ్ . కామ్ లో చూదాం ...

స్వస్తి.


7, జూన్ 2010, సోమవారం

మంచి మాట


ఆంధ్ర మహా భారతం ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం ( తిక్కన కృతం) శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో ఒక అపూర్వ మయిన పద్యం ఉంది.

సారపు ధర్మమున్ విమల సత్యముఁబాపము చేత బొంకుచేఁ
బారముఁబొంద లేక చెడఁబాఱినదైన యవస్థ దక్షు లె
వ్వార లుపేక్ష సేసి రది వారల చేటగుఁగాని ధర్మని
స్తారక మయ్యు సత్య శుభ దాయక మయ్యును దైవముండెడిన్

ఉత్తమ మయిన ధర్మం, నిర్మల మయిన సత్యం పాపం చేతను, అసత్యం చేతను దరి చేర లేక చెడబారి పోవడానికి సిద్ధ మయిన తరుణంలో వాటిని రక్షించ గలిగే సమర్ధత కలిగి ఉండి కూడ ఎవరు ఉపేక్ష చేస్తారో, అది వారికే కీడు కలిగిస్తుంది. కాని, ధర్మాన్నీ, సత్యాన్నీ కాపాడే దైవం ఉంటాడు సుమా!

శ్రీకృష్ణుడు కురు సభలో పెద్దలందరి ఎదుట పలికిన పలుకులివి.

ఉదాత్తమయిన వ్యంగ్య వైభవంతో, గంభీర భావ ప్రధానమయిన ఈ పద్యం మహా భారతం లోనే ఒక ధర్మ దీపంగా పెద్దలు పేర్కొంటూ ఉంటారు.

ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత నశిస్తున్నప్పుడు దక్షులైన వారు చూస్తూ ఊరుకుంటే, అది వారికే హాని కలిగిస్తుంది. సత్య ధర్మాలను కాపాడడానికి భగవంతుడు ఉంటాడు.

కురు సభలో సత్య ధర్మాలకి చ్యుతి కలుగుతున్నా ఉపేక్ష చేసిన పెద్దలకు ఒక హెచ్చరికగా ఉంటుందీ పద్యం. అలాగే, సత్య ధర్మాలను కాపాడే శ్రీకృష్ణుడు పాండవ పక్షం వహించి ధర్మ రక్షణ చేసి, సత్యాన్ని కాపాడతాడని సూచన కూడ ఇందులో ఉంది.

ఈ పద్యం తిక్కన రచలనలో ఒక అనర్ఘ రత్నంగా భాసిస్తూ ఉంటుంది. మహా భారత కథా తత్త్వానికి ఈ పద్యం ఆత్మ వంటిదని పెద్దలు చెబుతారు.

క్లిష్ట మయిన పరిస్థితులలో భగవంతుడు ధర్మాన్నీ, ధర్మాత్ములను రక్షిస్తాడని, అధర్మాన్నీ, అధర్మ పరులనూ శిక్షిస్తాడనీ నమ్మే తెలుగు వారి విశ్వాసానికి అద్దం పట్టేలా ఉంటుందీ పద్యం.

తదుపరి హిత వచనమ్ . కామ్ లో మరి కొన్ని చూదాం ...

స్వస్తి.


4, జూన్ 2010, శుక్రవారం

మంచి మాట

ఏ ప్రభుత్వమయినా సక్రమంగా నడుస్తూ, అభివృద్ధి పనులు చేయాలంటే ప్రజలు సక్రమంగా పన్నులు కడుతూ ఉండవలసినదే. ప్రజల నుండి పన్నులు వసూలు చేయ వలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ధనాగారాన్ని ఎలా నింపు కోవాలా అనే ఆలోచనతో మరీ క్రూరమయిన విధంగా పన్నులు వేయడం వసూలు చేయడం తగదు.

శ్రీమదాంధ్ర మహా భారతం శాంతి పర్వం ద్వితీయాశ్వాసంలో భీష్ముడు ధర్మ రాజుకి కోశాగారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో చక్కగా వివరించిన సందర్భం ఉంది. సార్వ జనీనమయిన ఆ ఉపన్యాస సారాంశం వచనంలో ...హిత వచనమ్ . కామ్ టపా గా అందిస్తున్నాను .....

భీష్ముడు ధర్మ రాజుతో యిలా చెప్పాడు...

ధర్మ రా జా ! ప్రజల నుండి పన్నులు వసూలు చేసేటప్పుడు రాజు చాల జాగ్రత్త వహించాలి

రాజా ! సావధానంగా విను. పన్నుల రూపంలో రాజునకు ధనం చేకూర్చే వాళ్ళలో రైతులు, వర్తకులు, గోపాలురు ముఖ్యులు.

ధనోత్పత్తికి వర్తక వాణిజ్యాలు ఆధారాలు. అలాగే, ధాన్యాభివృద్ధికి భూమి ఆధారం. అందు వల్ల ఇవి రాజు ఆధీనం లోనే ఉండాలి. వాటికి హాని కలుగ కుండా ఉండే రీతిలో రాజు జాగ్రత్తగా ధనాగారాన్ని అభివృద్ధి చేసుకోడానికి ప్రయత్నించాలి.

ఆకలితో ఉన్న పులి ఈనిన వెంటనే తన పిల్లలను తానే తినేస్తుంది. ఆ విధంగా క్రూరంగా రాజు ప్రజల నుండి పన్నుల వసూలు చేయడం మొదలెడితే పన్నులు సరిగా వసూలు కావు, సరి కదా, కోశాభివృద్ధి ఆగి పోతుంది. అందు వలన ప్రజలకు బాధ కలగనీయకుండా, కష్టం తెలియకుండా జలగ నెత్తురును ఎలా పీలుస్తుందో అలా, రాజు ప్రజల నుండి పన్నులు వసూలు చేయించ గలగాలి. అప్పుడే కోశాగారం కళకళలాడుతుంది.

ప్రజాభి వృద్ధికరమయిన పనులు రాజు చేస్తూ ఉండాలి. మూర్ఖపు పట్టుదలలకు పోకూడదు. చక్కటి ఉపాయాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజలు సక్రమంగా పన్నులు కడతారు. కోశాగారం తప్పకుండా నిండుతుంది. రాజు ఏం చేయాలంటే, ఎవరిని దండించాలో వారిని తగిన సమయంలో దండించాలి. శిక్షార్హులకు సకాలంలో తగిన దండన విధించాలి. వారి సంపదను స్వాధీన పరుచు కోవాలి. అలా చేస్తే ప్రజలు సంతోషిస్తారు. బొక్కసమూ నిండుతుంది.

రాజుకి అసూయ తగదు. ధనవంతులయిన తన ప్రజల సిరిసంపదలను చూసి ఓర్చుకో లేక, బలవంతంగా, అన్యాయంగా వారి సంపదను స్వాధీన పరుచుకో కూడదు. అలా చేస్తే రాజుకి కీడు కలుగుతుంది. అందు వలన రాజు దయతో వ్యవహరించి అందరికీ ఆనందం కలిగించాలి.

ఉచితానుచితాలు తెలిసిన రాజు ఇహ పరాలలో సిద్ధిని పొందడం కోసం సామంత రాజులను ఆదరించాలి. వారితో స్నేహంగా మెలగాలి.కర్షకులను ఊరికే భయభ్రాంతులకు లోను చేయ కూడదు. అదను చూసి వారినుండి పన్నులు వసూలు చేయాలి. ధనాగారం నింపుకోవాలి.

రాజు బొక్కసం నింపుకోడానికి న్యాయమైన మార్గాలనే ఎంచుకోవాలి. అంతే కాని, పన్నులు రాబట్టకోవడం కోసం కపటోపాయాలు పన్నుతూ కుటిలుడై ఉండడం తగదు సుమా.

ఓ ధర్మ రాజా! జాగ్రత్తగా విను. అపాత్ర దానం చేసి, ధనాన్ని నాశనం చేసుకుంటే ఆ ధన సంపాదన వలన ప్రయోజనం లేదు. అయితే పాత్రులయిన వారికి దానం చేసి, సంపదలను వెచ్చిస్తే మాత్రం అది ఆ సంపదకు ప్రయోజనకారి అవుతుంది. అందు వల్ల పాత్రత ఎరిగి దానం చేయాలి.

ఓ ధర్మ రాజా ! ఈ విధంగా నీవు నడుచుకుంటే నీ భాండాగారం వృద్ధి చెందుతుంది. దానితో పాటు నీ మిత్రబృందం , రాష్ట్రం , సైన్యం అభ్యున్నతి పొందుతుంది. కనుక ఈ మార్గం లోనే నడుచుకో. ప్రజలను చక్కగా పరిపాలించు. ప్రజారక్షణ చెయ్యి. యుద్ధాలకు భయ పడ వద్దు. పరాక్రమంతో నీ శత్రువులను సంహరించు. యాగాలు చెయ్యి. దరిద్రులైన బ్రాహ్మణ కుటుంబాలను కాపాడు. మంచి వారిని రక్షించు.

ఉతథ్యుడనే మహర్షి మాంధాత మహా రాజునకు ఇదే విధమయిన హిత వచనాలు చెప్పాడు. అతను చెప్పిన హిత వచనాలేమంటే ...

ధర్మం వల్లనే ప్రాణి కోటి అభివృద్ధి చెందుతుంది. ధన లాభం కలుగుతుంది. రాజనే వాడు ధర్మాన్ని కాపాడడానికే జన్మిస్తాడు. కనుక అతనికి అహంకారం తగదు. కామాన్ని విడిచి పెట్టాలి. ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ధర్మ మార్గంలో రాజ్య పాలన చేయాలి .....

ఇవీ భీష్ముడు ధర్మ రాజుకి చెప్పిన ఆదాయ మార్గాలు.

మరి కొన్ని .... తదుపరి హిత వచనమ్ . కామ్ లో.....

విన్నారా, ... ఆర్ధిక శాఖామాత్యుల వారూ ? !

స్వస్తి..

31, మే 2010, సోమవారం

మంచి మాట


మహా భారతంలో రాజ నీతి విషయాలు, ధర్మాలు, హిత వచనాలు చాల ఉన్నాయి. వాటిని వచనంలో ఇక్కడ పొందు పరుస్తున్నాను. చర్విత చర్వణంగా వాటిని మళ్ళీ రాయడమెందుకయ్యా, అంటే, తెలిసిన వారు లక్షల్లో ఉన్నా, తెలియని పదిమంది చదువరుల కోసం నాకు తెలిసినంతమట్టుకు రాస్తే తప్పు లేదనిపించింది. అదీ కాక, ఆయా పర్వాలలో ఉండే వాటిని అన్నింటినీ ఒక చోట క్రోడీకరించి వచనంలో రాయడం వల్ల యువతరం వారికి భారతేతి హాసం మీద మక్కు వ పెరగ వచ్చును కదా అనిపించింది. ఇక నుండి వరసగా ఈ టపా క్రింద వచనంలో రాదామనుకుంటున్నాను.

మహా భారతం సభా పర్వం ( నన్నయ రచన) మొదటి ఆశ్వాసంలో నారద ముని ధర్మ రాజుని కొన్ని రాజనీతి విషయాల గురించి తరచి తరచి అడుగుతాడు. సార్వకాలీన మయిన ఆ పలుకులివి:
( సభా పర్వం ప్రథమాశ్వాసం 26 -56)

ధర్మ రాజా ! మీ వంశంలో ఎంతో మంది రాజ శ్రేష్ఠులు చక్కని ధర్మ పద్ధతిని ఏర్పరచి ఉన్నారు. నీవు ఆ ధర్మ పద్ధతిని విడిచి పెట్టకుండా ఆచరిస్తున్నావు కదా? ధర్మాన్ని తెలుసుకోవాలి. ధర్మార్ధ కామాలు ఒక దానికొకటి బాధకాలు కాకూడదు.కాలోచితంగా వాటిని విభజించుకుని ధర్మ కామాలని ఆచరిస్తున్నావు కదా? ధర్మం మీదనే మనస్సును నిలిపి, చేయ దగిన పనులను గురించి రాత్రి నిద్రించడానికి ముందు స్వంత బుద్ధితో ఆలోచించుకుంటున్నావు కదూ? నీ కొలువులో రక రకాల ఉద్యోగులను నియమించి ఉంటావు. ఆ ఉద్యోగులలో స్థిర బుద్ధి కల వాళ్ళనీ, యోగ్యులైన వాళ్ళనీ, వారి వారి శక్తి సామర్ధ్యాలు గమనించి వారి గౌరవానికి భంగం లేకుండా, స్థిరంగా నియమించావు కదా?

పుణ్యాత్ములనీ, శాస్త్ర విషయాలు బాగా తెలిసిన వాళ్ళనీ, నీమీద ప్రేమ కల వారిని, మీ పూర్వీకుల నుండి మీ కొలువులో నమ్మకంగా పని చేస్తున్న బ్రాహ్మణోత్తములను రాచ కార్యాలు చేయడం కోసం నీకు మంత్రులుగా నియమించుకున్నావు కదా?

ఓ ధర్మ రాజా ! రాజు విజయానికి మూల మైనది మంత్రాంగం. అంటే రహస్యాలోచన. అట్టి మంత్రాంగాన్ని బయటకి వెల్లడి కాకుండా పదిలంగా కాపాడుతున్నావు కదూ ?

రాజా ! నీ పురోహితుడు ఎలాంటి వాడయ్యా? ధైర్యవంతుడేనా? ధర్మాధర్మాలు బాగా తెలిసిన వాడే కదా? వివిధ శాస్త్రాలు బాగా చదువుకున్న వాడేనా? రాగ ద్వేషాలు లేని వాడే కదా?

రాజా ! నీవు ఎన్నొ యఙ్ఞాలు చేస్తూ ఉంటావు. నీ యాజి నిపుణుడే కదా? ప్రయోగ నిపుణత్వం, కర్తవ్యపరాయణత్వం కల వాడే కదా?

ఈ మంత్రులున్నారు చూసావా, పలుకు బడి, సమర్ధతా కలిగి, నీ శత్రు వర్గం రాజ పుత్రులతో చేతులు కలిపి, వాళ్ళకి లంచాలిచ్చి, వారిని మహా ధనవంతులుగా చేసి, నీకు వ్యతిరేకులుగా చేసే అవకాశం కూడా ఉంది. అలా జరుగకుండా చూసుకోవాలి సుమా ! డబ్బు ఎలాంటి వారికయినా, దురాశనూ, గర్వాన్నీ కలిగిస్తుంది.

రాజా ! నీ ఆస్థాన జ్యోతిష పండితులు స్వీయ ప్రతిభతో దేవతా సంబంధాలు, అంతరిక్ష సంబంధాలు, భూ సంబంధాలు అయన ఉత్పాతాలను ముందుగానే కని పెట్టి, వాటికి విరుగుడుగా నీ చేత శాంతి క్రియలు జరిసిస్తున్నారు కదా?

ఇక, ఆయుర్వేద విద్యలో సమర్ధులైన నీ ఆస్థాన వైద్యులు లోకోపకార బుద్ధితో, ప్రజల మీద ప్రేమతో ఎనిమిది శాఖలుగా విస్తరించిన ఆ వైద్య విధానంతో సేవలు చేస్తున్నారు కదా?

పెద్దలను సేవిస్తూ మనోవ్యథలేవయినా ఉంటే తొలగించుకుంటున్నావు కదా? అలాగే నీ ఆరోగ్యాన్ని చక్కని ఔషధాలు సేవిస్తూ కాపాడుకుంటున్నావు కదూ ?

నీ కొలువులో రక రకాల పన్నులు వసూలు చేసే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు నీతి మార్గంలో నడుచుకునే వారే కదా? రాగ ద్వేషాలు లేకుండా అందరి పట్ల సమ బుద్ధి కలవారే కదా? అలాంటి వారిని చక్కగా పరీక్షించి మరీ ఎన్నిక చేసి నీ కొలువులో నియమిస్తున్నావు కదూ ?

ఓ ధర్మ రాజా ! ఉత్తములు, మధ్యములు, అధములు ఉంటారు. ఆయా వ్యక్తుల ఉత్తమ, మధ్యమ, అధమ యోగ్యతలని గుర్తించి, వాళ్ళని ఎవరికి తగినట్టుగా అలా ఉత్తమ మధ్యమ, అధమ కార్య నిర్వహణకి నియమిస్తున్నావు కదా? ఎవరికి తగిన పని వారికి పురమాయించాలి. నీ సేవకులందరకీ తగిన జీతం దయతో సకాలంలో ఇస్తున్నావు కదా?

చేయించుకున్న సేవలకి తగినంత జీతం లేక పోయినా, అది కూడా సకాలానికి అందక పోయినా, సేవకులు దరిద్రంతో బాధలు పడతారు. అలా వారిని బాధించడం దేవేంద్రుడికి కూడా మంచిది కాదు సుమీ !

వంశ పారంపర్యంగా ఎందరో సేవకులు నీ వద్ద పని చేస్తూ ఉంటారు. వారిని ఉచిత రీతిని సన్మానిస్తున్నావు కదా? అలా చేస్తే వాళ్ళు నీ కోసం యుద్ధంలో ప్రాణాలయినా అర్పిస్తారు.

నీ కోసం యుద్ధాలలో పాల్గొని, ఎందరో వీరులు వీర మరణం పొంది ఉంటారు. మరి, ఆ వీర సైనికుల కుటుంబాలకు కూడుగుడ్డలకి లోటు లేకుండా యిచ్చి కాపాడుతున్నావా లేదా?

రాజా ! నీవు రాజకార్యం చేయడం కోసం ఎందరినో నియమిస్తూ ఉంటావు. ధనం పట్ల లోభత్వం కలవాళ్ళనీ, దొంగలనీ,స్నేహానికి తగని వాళ్ళనీ, శత్రుపక్షం వహించే వారినీ ధైర్యం లేని వాళ్ళనీ, దుర్మార్గులనీ అలాంటి పనుల కోసం నియమించడం లేదు కదా?
రాజా ! నీ రాజ్యంలో దొంగల భయం లేకుండా చూసుకుంటున్నావు కదూ? నీ ప్రభుత్వంలో ధనాశాపరులైన లంచ గొండులు ఎవరయినా, ఆ దొంగల నుండి డబ్బు దీసుకుని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసే అవకాశమూ ఉంది. గచనించు.

నీ రాజ్యంలో అనా వృష్టి భయం లేకుండా చెఱువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి కదా?

రాజా ! ఉదార బుద్ధితో రైతులకి ధాన్యపు విత్తనాలు ఇస్తున్నావు కదూ? అలాగే వర్తకులుంటారు. వారికి వ్యాపారం చేసికోడానికి డబ్బు కావాలి. ధర్మ వడ్డీకి, అంటే, నూటికి ఒక రూపాయ వడ్డీ వంతున అప్పులు ఇవ్వాలి. ఆపని నీవు చేస్తున్నావు కదా?

ఇక, రాజ్యంలో ఎందరో అనాథలూ, అంగ వికలురూ ఉంటారు. కుంటి, మూగ, గ్రుడ్డి, ఏ బంధువులూ లేని వారూ... యిలా ఎందరో ఉంటారు. వారిని దయతో పోషిస్తున్నావు కదూ ? యుద్ధంలో శరణు వేడిన వాడు నీ శత్రువయినా వాడిని కాపాడాలి. అలా చేస్తున్నావా?

చేసిన మేలు గుర్తించి, ఆ మేలు చేసిన వ్యక్తిని పెద్దలున్న నీ రాజ్య సభలో తగిన రీతిని సత్కరిస్తున్నావు కదూ? అలా చేసిన రాజే రాజ్యాన్ని చక్కగా పాలించ గలడు. నీకు వచ్చే ఆదాయంలో నాల్గవ భాగాన్ని, లేదా మూడవ భాగాన్ని, లేదా, సగ భాగాన్ని మాత్రమే నీవు ఖర్చు చేయాలి. అంతకు మంిచ చెయ్య కూడదు. నమ్మతగిన వారిని, ప్రభు భక్తి కలవారిని, సమర్ధులను నీ కొలువులో నియమించు కోవాలి. గురువులను, వృద్ధ శిల్పులను, గొప్ప వాణిజ్యవేత్తలను, బంధువులను, ఆశ్రితులను, మంచి వారిని వారికి పేదరికం రాకుండా నువ్వే కాపాడుతూ ఉండాలి.

రాజ్యం లోపల, వెలుపల ... అలాగే కోట లోపల వెలుపల అనేక శత్రువులుంటారు. వారినుండి నిన్ను నీవు సతతం కాపాడు కోవాలంటే నీకు గూఢచారులే శరణ్యం. రాజులు చార చక్షువులు. శత్రు రాజుల ప్రవర్తనలని గూఢచారులు అనే కళ్ళతో నిత్యం గమనిస్తూ ఉండాలి సుమా !

పండితులతో చర్చిస్తూ, రాగ ద్వేషాలు లేకుండా సమ బుద్ధితో లోక వ్యవహారాలు చూస్తున్నావు కదా?


ఓ ధర్మ రాజా ! ప్రపంచమంతా వార్త మీదనే ఆదార పడి నడుస్తోంది. అది లేక పోతే ప్రజలంతా చిమ్మ చీకటిలో మునిగి పోతారు. అందు వల్ల రాజు వార్తను బాగా నడపాలి. అంటే రాజు వార్తా నిర్వహణకి ప్రాధాన్యమివ్వాలి.

రాజా ! భార్యను పొందడానికి ఫలం సంభోగ సుఖం, పుత్రులు పుట్టడం. ధర్మాలు వినడానికి ఫలం సచ్ఛీలం.మంచి ప్రవర్తన సిద్ధించడం. సంపాదించిన దానికి ఫలం దానం చేయడం, అనుభవించడం వేదాలకు ఫలం అగ్ని హోత్రాలు. ఈ సంగతి తెలుసుకో.

రాజా ! కోటని దుర్భేద్యంగానూ ,చక్కగానూ రక్షించు కోవలసి ఉంటుంది సుమా ! నీ రక్షణలో ఉన్న కోటలన్నీ ధన ధాన్యాలతో, ధనుర్బాణాలతో, వివిధ ఆయుధాలతో ఎప్పుడూ నిండి ఉండాలి. అలాగే నీళ్ళకి లోటు రానియ్య కూడదు. పశువులకు గడ్డి నిల్వ చేసి ఉంచాలి. అలాగే ఉప్పు, పులుపు,కారం వంటి ఆహార పదార్ధాలు, వివిధ పానీయాలు, వంట కట్టెలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి సమా !

దైవ బలాన్ని పొంది, కామ క్రోధాదులయిన లోపలి శత్రువులని జయించి, ఇంద్రియాలని జయించి, బలపరాక్రమంతో దుష్టులయిన నీ శత్రువులని జయిస్తున్నావు కదా?

దండయాత్రకి బయలు దేరే ముందుగానే బలవంతులయిన నీ శత్రు రాజుల మీద సామ దాన భేద దండోపాయాలను చక్కగా ప్రయోగిస్తున్నావు కదూ?

రాజా ! ముఖ్యంగా 14 రకాలయిన రాజ దోషాలు ఉన్నాయి. నాస్తికత అసత్యం పలకడం, ఏమరుపాటుగా ఉండడం, సోమరితనం, తెలివి తక్కవ వారితో రాచ కార్యాలు కోసం ఆలోచన చేయడం, అతి కోపం, ఎక్కవగా దుఃఖించడం, చేయ వలసిన పని కోసం చాలా సేపు ఆలోచిస్తూ కాలయాపన చేయడం, ఆలస్యంగా చేయడం, బుద్ధిబంతులని గుర్తించక పోవడం, ప్రయోజనాలను దెబ్బతీసే పనులు చేయడం,చేదామనుకున్న మంచి పనులు చేయక పోవడం, రహస్యాలోచనలని బయటకి పొక్క కుండా కాపాడుకో లేక పోవడం, శుభ కార్యాలను చేయకుండా ఉండడం, నిత్యం ఇంద్రియ సుఖాలలో తేలియాడుతూ గడపడం ... ఇవీ రాజ దోషాలు. వీటిని విడిచి పెట్టావు కదా ?

ఇవీ నారదుడు చెప్పిన రాజ నీతి ధర్మాలు. ఎంత సమకాలీన సత్యాలో ఎంత సార్వజనీనమయిన విషయాలో గమనిస్తే మహా భారతం ఎందుకు భారతీయులకు అంత ప్రామాణిక గ్రంథమయిందో తెలుస్తుంది.
మరో సారి మరి కొన్ని ....

ఇప్పటికి స్వస్తి.




29, మే 2010, శనివారం

అంకెల మర్మం ....


ఒకటిఁగొని, రెంటి నిశ్చల యుక్తిఁజేర్చి,
మూఁటి నాల్గింటఁగడు వశ్యములుగఁజేసి,
యేనిటిని గెల్చి, యాఱింటి నెఱిఁగి, యేడు
విడిచి వర్తించు వాడు వివేక ధనుఁడు



ఈ పద్యం శ్రీమదాంధ్ర మహా భారతము ఉద్యోగ పర్వం లోనిది. తిక్కన రచన.

సంజయ రాయబారం ముగిసింది. ఆ విశేషాలింకా ధృతరాష్ట్ర మహా రాజ చెవిని పడ లేదు. రాజు వ్యాకుల చిత్తుడై ఉన్నాడు. ఆందోళనతో తనకి నిద్ర పట్టడం లేదని, తన మనస్తాపం ఉపశమించేలా నాలుగు మంచి మాటలు చెప్పమనీ విదురుని కోరాడు. ఆ సందర్భంగా విదురుడు కురు మహా రాజుకి బోధించిన హిత వచనాలలో ఇదొకటి ....

ఒక దానిని స్వీకరించి, రెండింటిని స్థిర పరచుకుని, మూడింటిని నాలుగింటి చేత వశపరచుకుని, ఐదింటిని జయించి, ఆరింటి గురించిన ఎఱుక గలిగి, యేడింటిని ఎవడు విడిచి పెడతాడో, అతడే వివేకధనుడని స్థూలంగా ఈ పద్యం చెబుతోంది ....

ఈ అంకెల మర్మం తెలుసుకుంటే నిగూఢమైన తాత్త్వికార్ధం సుబోధకమవుతుంది.

పెద్దలు ఈ పద్య భావాన్ని ఇలా విడమరిచి చెప్పారు. చూడండి ...

ప్రభుత్వాన్ని చేపట్టి, మంత్రం ( ఆలోచన), ఉత్సాహం అనే రెండింటినీ స్థిరంగా చేసుకుని, మిత్రులు, శత్రువులు, తటస్థులు అనే మూడు వర్గాల వారినీ సామ దాన భేద దండోపాయాల చేత ( ఈ నాలుగింటి చేత) పూర్తిగా వశం చేసుకుని, పంచేంద్రియాలనూ ( త్వక్కు, చక్షువు,శ్రోత్రము, జిహ్వ, ఘ్రాణము) జయించి, సంధి, విగ్రహము, యానము,ఆసనము, ద్వైదీభావము, సమాశ్రయము లను తెలుసుకుని, సప్త వ్యసనాలను ( స్త్రీ, జూదము, పానము, వేట, కఠినముగా మాటలాడుట, తగని వెచ్చము, కఠిన దండము ) విడిచి పెట్టి ఎవడయితే ప్రవర్తిస్తాడో, అతడు వివేకవంతుడు.

దీనికి మన పెద్దలు ఇంకా వేరే విధమైన వ్యాఖ్యానాలు కూడ చేసారు.

ఈ పద్యానికి ఇంకో విధమైన అర్ధం యిలా చెప్పారు ...
బుద్ధిని కలిగి ఉండి, వాక్కు, క్రియ అనే రెండింటినీ నిశ్చలత్వంతో ఒకటిగా చేర్చి, ధర్మార్ధ కామాలనే మూడింటినీ, బ్రహ్మచర్య, గార్హ్యస్థ వానప్రస్థ, సన్యానములనే నాలుగింటితో వశపరచుకుని, వాక్, పాణి,పాదము,,వాయువు, గుహ్యము అనే కర్మేంద్రియాలను అయిదింటినీ గెలిచి, యజన,యాజన. అధ్యయన, ఆధ్యాపన, దాన, ప్రతిగ్రహములు అనే ఆరు స్మార్త కర్మలనీ తెలుసుకుని, పంచభూతాలూ, బుద్ధి, అహంకారం అనే ఏడింటినీ విడిచి వర్తించే వాడు వివేకవంతుడు.

కొన్ని పదముల వివరణలు :

మంత్రము = ఆలోచన
ఉత్సాహమ = ప్రయత్నము
సామము = అనుకూల వర్తనము
భేదము = ఉపాయము. ఇరువురి స్నేహము చెఱచుట
దండోపాయము = శిక్షించుట
త్వక్కు = చర్మము
చక్షువు = నేత్రము
శ్రోత్రము = చెవి
జిహ్వ = నాలుక
ఘ్రాణము = ముక్కు
తగని వెచ్చము = దండగమారి ఖర్చులు చేయడం
యజనము = భుజించు
యాజనము = భుజింప చేయుట


ఇంత చెప్పినా, అంధ రాజుకి కళ్ళు తెరుచుకో లేదు. అంధ రాజు కదా మరి ..



27, మే 2010, గురువారం

కదిలేదీ , కదిలించేదీ ....


జ్వలతి చలితేన్ధనోZగ్ని:
విప్రకృత: పన్నగ: ఫణం కురుతే
ప్రాయ: స్వం మహిమానం
క్షోభాత్ ప్రతిపద్యతే హి జన:


ఇది మహా కవి కాళి దాసు రచించిన అభిఙ్ఞాన శాకున్తలమ్ నాటకంలో ఆరవ అంకం లోని శ్లోకం.
దూర్వాస మహా ముని శాపం వలన దుష్యంతుడు శకుంతలను మరచి పోతాడు. తిరిగి అభిఙ్ఞాన దర్శనంతో శకుంతల గుర్తుకు వచ్చి ఖిన్నుడై ఉంటాడు. నిస్తేజుడై ఉంటాడు. పరిపాలనా విముఖుడై ఉంటాడు. అట్టి మహా రాజుని రాక్షస సంహారార్ధం ఇంద్రుని పనుపున ఇంద్రలోకానికి తీసుకుని వెళ్ళడానికి ఇంద్ర రథ సారధి మాతలి వచ్చి, రాజునకు ఆగ్రహం తెప్పించడం కోసం అతని నర్మ సచివుడు మాఢవ్యుని బాధిస్తాడు.
దానితో రాజునకు ఆగ్రహం కలిగి తిరిగి కర్తవ్యోన్ముఖుడవుతాడు....ఆ సందర్భంలో కవి చెప్పిన శ్లోకం యిది ....

చితుకులు కదిలిస్తే అగ్ని మరింతగా జ్వలిస్తుంది. అపకారం చేయబోతే పాము పడగ విప్పుతుంది. మనిషి కూడ క్షోభ కలిగినప్పుడే తన శక్తి సామర్ధ్యాలు ప్రదర్శిస్తాడు.

ప్రతి మనిషిలోను అంతర్గతమైన శక్తులు చాల ఉంటాయి. అయా ప్రత్యేక పరిస్థితులు కలిగినప్పుడు అవి వెలుగు చూస్తాయి. వ్యథ లోనుండే కదా కథలు ఉద్భవిస్తాయి. వాల్మీకి విషయంలో ఏం జరిగిందో తెలిసిందే కదా? శోకమే శ్లోకమై ఒక మహా కావ్య ప్రాదుర్భవానికి నాంది పలకలేదూ!




‘ కదిలేదీ కదలించేదీ కావాలోయ్ నవ కవనానికి ...’ అని శ్రీ.శ్రీ గారనడంలో కూడ అంతరార్ధం యిదే కదా?






కాళి దాసు శ్లోకానికి కందుకూరి వీరేశ లింగం పంతులు గారు చేసిన పద్యానువాదం కూడ చూడండి మరి ....

చితుకులు కదల్చుటను చెలగి మండు
చెడఁగు చేయుటచేఁబాము పడగ విప్పు
మఱియు క్షోభంబు వలననె మానవుడును
దనదు మహిమంబు చూపును తథ్యముగను.

స్వస్తి.



26, మే 2010, బుధవారం

తెలుగు కథకు తూర్పు దిక్కు చా.సో రాసిన పిడికెడు కవితలు ...






చా.సో గా మనకి తెలిసిన మహా కథా రచయిత చాగంటి సోమయాజులు ( తెలుగు కథకి తూర్పు దిక్కు ) పిడికెడు కవితలు కూడ రాసేరు. ఆతర్వాత కథా రచన మీదనే దృష్టి పెట్టి కవితలు రాయడం తగ్గించారు. లేదా మానీసేరు. రాసినవి చాల కొద్ది పాటి కవితలే అయినా, అవి కవితాభిమానులను ఎంతగానో అలరించాయి. చా.సో కవితలు 1940 ప్రాంతాలలో భారతి, నవ్య సాహిత్య పరిషత్తు వారి ప్రతిభ, అభ్యుదయ రచయితల తెలుగు తల్లి, ఢంకా, కొన్ని దీపావళి ప్రత్యేక సంచికలలోనూ ప్రచురింపబడ్డాయి. కల్పన, అడుగు జాడ గురజాడది, ఆంధ్ర విశ్వ విద్యాలయం వారు వేసిన కవితా సంకలనం లోను చోటు చేసుకున్నాయి.

ఏమయినా, చా.సోని అభిమానించే సాహిత్యాభిమానులు వారి కవితలు కూడ చదివే ఉంటారు. చదవని వారి కోసం ఈ టపా ....

చా.సో రాసిన కొద్ది పాటి గొప్ప కవితల నుండి మీ కోసం ఒక కవిత ....

కాందిశీకుడు

బతకాలని వెళ్ళావు
బాంబుల్లో పడ్డావు
బతికొచ్చినావ
నా నాయనా !

నిరుడెల్లి పోనావు
నేడొచ్చినావు
నడిసొచ్చినావ
నా నాయనా !

కొండలెక్కొచ్చినా
కానల్లొ నడిచినా
కట్టెతోటొచ్చావ
నా నాయనా!

మారు రైతుకు పోయె
మన సాగు భూమిరో
మారు మనుముకు పోయె
నీ బిడ్డ తల్లిరో
నా నేమి సేతురా
నా నాయనా !

నిన్ను నమ్ముకు మేము
నిలబడీ ఉన్నాము
నిప్పు నేకున్నాము
నీ కేటి పెట్టేది
నా నాయానా !


ఈ కవిత సెప్టెంబరు 1945 తెలుగు తల్లి పత్రికలో ప్రచురితమైంది. తర్వాత 1962 లో అడుగు జాడ గురజాడది కవితా సంకలనంలో పునర్ముద్రించబడింది

చా.సో ఈ కవితను 1942 ప్రాంతాలలో రాసి ఉండ వచ్చును.

చా.సో గారి మరిన్ని కవితల కోసం విశాలంధ్ర వారు ప్రచురించిన చా.సో కవితల సంపుటిని చూడొచ్చును. 1996 లో ప్రచురింప బడిన ఈ కవితా సంకలనం ప్రతులు చా.సో కథల పుస్తకం లాగే ఇప్పుడు లభిస్తుందో లేదో, తెలియదు.

చా.సో కథలనీ, కవితలనీ మళ్ళీ ఎవరయినా ప్రచురిస్తే బావుణ్ణు.






21, మే 2010, శుక్రవారం

పట్టు పట్ట రాదు, పట్టి విడువ రాదు .....

మన పూర్వ కవులు మన వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దు కోడానికి ఎన్ని గొప్ప విషయాలనో మంచి మంచి శ్లోకాలలో చెప్పారు.
మంచి మాట అనే టపాలో వీలున్నప్పుడల్లా మీతో పంచుకోవాలనే ప్రయత్నంతో ...

చూడండి ...








సింహ: శిశురపి మదమలిన కపోల భిత్తిషు గజేషు
ప్రకృతిరియం సత్త్వవతాం న ఖలు వయస్తేజసాం హేతు:

విదిలింప వుఱుకు సింగపుఁ
గొదమయు మద మలిన గండ కుంజరములపై
నిది బలశాలికి నైజము
గద ! తేజోనిధికి వయసు కారణమగునే ?

సింహం పిల్ల కూడ రెచ్చ గొడితే ఊరు కోదు. మద గజం మీదనయినా పడి తన సత్తా చాటుతుంది. ఇది బలవంతునికి నైజ గుణం కదా ! తేజోవంతునికి వయసుతో పని లేదు.

ప్రకృతిలో సకల చరాచరాలూ ఈ లక్షణాన్నే కలిగి ఉంటాయి. చూడండి ...

ఛిన్నోZపి రోహతి తరు: క్షీణోప్యుపచీయతే పునశ్చంద్ర:
ఇతి విమృశన్తస్సన్త: సన్తప్యన్తే నవిప్లుతాలోకే



ఖండితంబయ్యు భూజంబు వెండి మొలచు
క్షీణుఁడయ్యును నభివృద్ధిఁజెందు సోముఁ
డివ్విధమున విచారించి యొడలుఁదెగిన
జనములనుఁదాప మొందరు సాధు జనులు.

చెట్టుని చూడండి. నరికినా తిరిగి చిగురిస్తుంది. చంద్రుడూ అంతే కదా? కృష్ణ పక్షంలో కళలు క్షీణించినా, తిరిగి శుక్ల పక్షంలో పుంజుకుని, పూర్ణిమ నాటికి నిండే జాబిల్లిగా అవతరిస్తాడు. ఇలాగే సాధు జనులు ఓటమిని , ఆపదని, గాయాలను సరకుగొనరు. తిరిగి లేచి తమ ప్రతాపం చూపెడతారు.

ఇదే విషయం ఒక మంచి పోలికతో చెబుతున్నాడు కవి ...

యథా కందుక పాతే నోత్పతత్యార్య: పతన్నపి
తథా త్వనార్య: పతతి మృత్పిండ పతనం యథా



కందుకము వోలె సుజనుడు
గ్రిందంబడి మగుడ మీఁదికిన్నెగయుఁజుమీ !
మందుడు మృత్పిండము వలె
గ్రిందబడి యడగి యుండుఁగృపణత్వమునన్

బంతి నేలకేసి కొడితే ఎలా తిరిగి మీదికి లేస్తుందో, సజ్జనుడు కూడ ఒక వేళ ఓటమి పాలయినా, తిరిగి పుంజుకుని లేస్తాడు.
తెలివి తక్కు వాడు మాత్రం నేల కేసి కొట్టిన మట్టి ముద్ద లాగా మరింక పైకి లేవడు.


ఐతే, మరో విషయం ...దైవానుగ్రహం లేనిదే మనం ఏదీ సాధించ లేం. అలాగే, దైవానుగ్రహం ఉన్నప్పటికీ మానవప్రయత్పం చేయక తప్పదు.

గజేంద్రోపాఖ్యానం కథలో కరి రాజు వేల యేండ్లు మొసలితో పోరాడిన పిదప కానీ హరి కరుణించ లేదు కదా ? మానవ ప్రయత్నం చేయ వలసిన ఆవశ్యకతని ఆ కథ మనకి తెలుపుతోంది ...

నదైవమేవ సంచిత్య త్యజేదుద్యోగమాత్మన:
అనుద్యోగేన తైలాని తిలేభ్యో నాప్తుమర్హతి

దైవం మీద భారం వేసి. మన ప్రయత్నం మనం చేయకుండా ఉండడం తగదు. ప్రయత్నం చేయనిదే తిలలనుండి తైలం రాదు కదా?

ఉద్యోగినం పురుష సింహముపైతి లక్ష్మీ:
దైవేన దేయమితి కాపురుషా వదంతి
దైవం నిహత్య కురు పౌరుషమాత్మ శక్త్యా
యత్నే కృతే యది న సిద్ధ్యతి కోZత్ర దోష: ?

ప్రయత్నం చేసే వాడికే విజయం వరిస్తుంది. అన్నీ దేవుడే యిస్తాడు కదా అని, ఏ పనీ, ఏ ప్రయత్నమూ చేయకుండా ఉండండం నీచుల లక్షణం. ఒక వేళ నీ ప్రయత్నం నీవు చేసినా, విజయం లభించ లేదనుకో, దాని వలన నీ తప్పేమీ లేదు. దైవానుగ్రహం అంతే అనుకోవాలి.

యథాహ్యేకేన చక్రేణ నరథస్య గతిర్భవేత్
ఏవం పురుష కారేణ వినా దైవం నసిద్ధ్యతి

ఒకే ఒక చక్రంతో రథం నడవదు కదా ? అలాగే, దైవానుగ్రహం లేక పోతే, మానవ ప్రయత్నం సిద్ధించదు.

దైవం అనుకూలించక పోతే, మనం ఏమీ చేయ లేం ...

కాకతాళీయవత్ ప్రాప్తం దృష్ట్వాZపి నిథి మగ్రత:
న స్వయం దైవమాదత్తే పురుషార్ధ మపేక్షతే

దైవానుగ్రహం లేక పోతే, ఎదురుగా ఉన్న నిధి కూడా మన కంట పడదు.

అందు వలన దైవానుగ్రహాన్ని అపేక్షిస్తూ, మానవ ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన ప్రయత్నం మనం చేయనిదే ఏదీ మనలకు తనంతట తాను చేకూరదు.

ఏదీ తనంత తానై నీదరికి రాదూ ... శోధించి సాధించాలి .. అదియే ధీర గుణం ... అని సినిమా కవి చెప్ప లేదూ !





ఉద్యమేనహి సిద్ధ్యంతి కార్యాణి, నమనో రధై:
నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగా :

కోరిక ఉంటే చాలదు. అది నెర వేర్చుకునే ప్రయత్నమూ చేయాలి. కేవలం మనోరధంతోటే పనులు చేకూరవు. నిద్రిస్తున్న సింహం నోటి లోకి ఆహారంగా జంతువులు వాటంతట అవి వచ్చి పడవు కదా? ఎంత మృగరాజయినా తన ఆహారసముపార్జనకు వేటాడి తీర వలసినదే కదా !


ఒక్కోసారి మన ప్రయతం ఫలించకకూ పోవచ్చు ...

యదశక్యం న తచ్ఛక్యం, యచ్ఛక్యం శక్యమేవతత్
నోదకే శకటం యాతి నచ నౌర్గచ్ఛతి స్థలే

ఏది చేయడానికి సాధ్య పడదో, అది జరగమన్నా జరగదు. జరిగేది జరుగకా మానదు.
నీటి మీద బండినీ, నేల మీద నౌకనీ నడప లేం కదా !!


ఎట్టుగఁబాటు పడ్డ నొకయించుక ప్రాప్తము లేక వస్తువుల్
పట్టుపడంగ నేరవు, నిబద్ధి; సురావళిఁగూడి రాక్షసుల్
గట్టు పెకల్చి పాల్కడలిఁగవ్వము సేసి మధించిరంతయున్
వెట్టియెఁగాక యే మనుభవించిరి వారమృతంబు భాస్కరా !


ప్రాప్తం అంటూ లేక పోతే, ఎంత చేసినా మనకి ప్రయోజనం సిద్ధించదు. అది నిజం. మంధర పర్వతాన్ని పెకలించి, కవ్వంగా చేసుకుని, వాసుకిని తాడుగా చేసుకుని, రాక్షసులు కూడా దేవతలతో పాటు అమృతం కోసం సాగర మథనం చేయ లేదూ !...పాపం, వారి చాకిరీ అంతా వెట్టి చాకిరీ అయిందే తప్ప వారికి అమృతం దక్క లేదు కదా ?

అలాగని, నిరాశతో ఏ పనీ చేయకుండా ఉండడం తగదు. వేమన చెప్ప లేదూ ? ...

పట్టు పట్ట రాదు, పట్టి విడువ రాదు
పట్టెనేని బిగియ పట్ట వలెను
పట్టి విడుచుకన్నఁబడి చచ్చుటయె మేలు
విశ్వదాభిరామ వినుర వేమ.

ఇది అనంతం. కనుక, ఇప్పటికి స్వస్తి.