15, జూన్ 2010, మంగళవారం

మంచి మాట


(మహా భారతం ఆది పర్వం పంచమాశ్వాసం నుండి )

కిందముడు భార్యతో మృగ రూపంలో క్రీడిస్తూ ఉండగా పాండు రాజు వధించాడు. పాండు రాజునకు శాపమిచ్చి మృగ రూపంలోని ఆ ముని దంపతులు మరణించాక పాండు రాజు చింతిస్తూ ఆత్మగతంలో ...
మానవులు ఎంతటి ఉత్తమ వంశంలో పుట్టినా, మంచి చెడ్డలను గురించిన ఙ్ఞానం కలిగి ఉన్నప్పటికీ పూర్వ జన్మ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు.

శరీరం నశించిన వెంటనే అన్ని ఋణాలూ తీరి పోతాయి. కాని పితరుల ఋణం మాత్రం శరీరం నశించినా తీరదు.

దానాలు చేసినా, తపస్సులు చేసినా, భూరి దక్షిణలతో యఙ్ఞాలు చేసినా, సంతానం లేని వారికి పుణ్య లోకాలు లభించవు. సంతానం కల వారే పుణ్యాత్ములు.

సత్యవతితో వ్యాసమహర్షి :

ఆలోచించి చూస్తే ఎండ మావి లాగా ఈ సంసారం అతి చంచలం. సంపదలు అశాశ్వతాలు. రాబోయే రోజుల కంటె గడచి పోయిన రోజులే మేలు.

( షష్ఠాశ్వాసము నుండి కొన్ని హిత వచనాలు,)

కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం సందర్భంగా కర్ణుని కుల గోత్రాలు అడిగిన కృపునితో
దుర్యోధనుడు :

లోకంలో రాజు అనే పేరు ఎవరికి ఉంటుంది? కులం గల వాడికి , శౌర్యం కల వాడికి , అధిక సేవా బలం ఉన్న వాడికి.

ఇదే సందర్భంలో దుర్యోధనుడు భీమునితో పలికిన మాటలు :

శూరుల పుట్టుక , దేవతల పుట్టుక , నదుల పుట్టుక తెలిసి కొనడం సాధ్యం కాదు. దేవేంద్రుని వజ్రాయుధం దధీచి వెన్నెముక నుండి పుట్ట లేదా ? గంగ కుమారునిగా, కృత్తికల కొడుకులగా, అగ్ని కుమారునిగా, రెల్లు పొదలలో కుమార స్వామి పుట్ట లేదా? ధర్మం తెలిసిన కృపుడు రెల్లు గడ్డి వాములో పుట్ట లేదా ? ద్రోణుడు కుంభ సంభవుడు కాదా ? ఉత్తమ క్షత్రియులు బ్రాహ్మణుల వలన పుట్ట లేదా ? మీ ( పాండవుల ) పుట్టుకలు కూడ యిలాంటివే కదా ?

పాండు పుత్రుల పరాక్రమాన్ని ఓర్వ లేక ఖిన్నుడై ఉన్న దుర్యోధనునితో శకుని మంత్రి కణికుడు పలికిన మాటలు. భారతంలో ఇవి కణిక నీతులుగా ప్రసిద్దాలు.

ప్రభువు గొప్ప అధికారం కలవాడై, తగిన విధంగా దండ నీతిని అవలంబిస్తూ, ప్రజలను ధర్మ మార్గాన నడిపించాలి. మంచి ప్రవర్తన కలవాడై ఉండాలి. దండనీతిలో స్వపర భేదాలు చూపించ కూడదు. సమ బుద్ధితో ప్రవర్తించాలి. అలా ఉంటే ప్రజలు కూడ తమ జాతి ధర్మాలు ఉల్లంఘించ కుండా మెలుగుతారు.

ఇవి చేయ దగిన పనులు , ఇవి చేయ కూడని పనుల అని తెలుసుకోవాలి. అలా కాక, చెడు నడవడికతో, ప్రజల మేలు కోరకుండా, ఉంటే అతడు తండ్రయేది, గురువయేది రాజు విడిచి పెట్టకుండా వానిని శిక్షించాలి. ఆ శిక్ష ప్రజలందరికీ తెలిసేలా అమలు చేయాలి.

ఏ పని చేసినా, ముందుగా బుద్ధిమంతులతో ఆలోచించి చేయాలి. ముందుగా విచారించి చేసిన పని ఎప్పుడూ చెడి పోదు.

రాజు నేర్పుతో మెత్తని పని చేత కాని, భయంకరమయిన పని చేత కాని మొదట తనని తాను కాపాడు కోవాలి. తనకు ప్రమాదం లేకుండా చూసుకుని పిమ్మట రాజ ధర్మాలు నడపాలి.

స్వచ్ఛమయిన బుద్ధితో తన లోపాలు ఇతరులు తెలిసికోకుండా, ఇతరుల లోపాలను తాను తెలుసుకుంటూ , దేశ కాల పరిస్థితులను గమనిస్తూ మిత్ర బలాన్ని సమకూర్చుకుంటూ రాజు తన రాజ ధర్మాలు నిర్వర్తించాలి.


శత్రువు బలహీనమయినప్పుడే చంపడం రాజ నీతి. వాళ్ళు అధిక బలురై. మిత్ర బలం కూడ కూర్చుకున్నాక వారిని చంపడం సాధ్యం కాదు సుమా !

రాజు ఎప్పుడూ దూతల వలన అన్ని విసయాలూ తెలుసుకుంటూ ఉండాలి. విసుక్కో కూడదు. తన పనుల గురించే కాక, శత్రువుల పనులను గురించి కూడ తెలుసుకుంటూ ఉండాలి. శత్రు దేశ విషయాలు తెలుసుకుని రావడం కోసం వీలయినంతమంది ఎక్కువ సంఖ్యలో పాషండులను
( వేద బాహ్యులను) పంపాలి.

రాజు చాలా చోట్లకు వెళ్తూ ఉంటాడు. అందుకని రాజు ఎక్కడికి వెళ్ళబోతున్నా, ముందుగా ఆ ప్రదేశాలని క్షుణ్ణంగా పరిశీలించేలా చేయాలి. ఆయా ప్రదేశాలు పరిశీలించి, రాజుకి ఆపద కలిగించే వ్యక్తులు కానీ , ఆయుధాలు కానీ ఉంటే ముందుగానే తొలిగించేలా చర్యలు తీసుకోవాలి.

రాజైన వాడు ‘ వీడు నమ్మ దగిన వాడు ’ , ‘ వీడు నమ్మ రాని వాడు ’ అని అనకూడదు. నిశ్చయ బుద్ధితో తన రక్షణ తానే ప్రధానంగా చూసుకోవాలి. ఎవరినీ అంతగా నమ్మెయ్య కూడదు.

మరో విషయం. రాజు తనని తాను కాపాడు కోవడమే కాదు - తన రహస్యపుటాలోచనలనీ కూడ జాగ్రత్తగా కాపాడు కోవాలి.రహస్యపుటాలోచనలు రాజు ఎంతాగా కాపాడు కుంటాడో అంతగా అతని పనులు విజయవంతాలవుతాయి. రహప్యాలను కాపాడు కోలేక పోతే ఆ బృహస్పతి పనులు కూడ ఫలవంతాలు కావు సుమా !

ఇక మనుషుల నైజం గురించి చెబుతాను. చెడ్డ వాళ్ళు మాటి మాటికీ ఒట్లు పెడుతూ ఉంటారు. చేతులు జోడించి దండాలు పెడుతూ ఉంటారు. తియ్యగా మాటలాడుతూ ఉంటారు. నక్క వినయాలు చూపిస్తూ ఉంటారు.

దుర్మార్గుడు తనకు అనుకూలమయే వరకూ మిత్రుడి వలె నటిస్తాడు. అనుకూలత ఏర్పడిన వెంటనే పాము లాగా తనక్రూరమయిన పనులనే కోరలతో కాటు వేస్తాడు.

పిడుగు పడడం , గాలి వీచడం - ఇవి ప్రజలకు ఎప్పుడు తెలుస్తాయి ? అవి జరిగి నప్పుడే
కదా ? అలాగే మిక్కిలి కోపం కాని, స్నేహం కాని ఇతరులకు వాటి అనుభవ కాలానికే తెలియాలి. రాజు అలా మసలుకోవాలి.

రాజు, తనకు ఇంతకు ముందు అపకారం చేసిన వాడిని, తక్కువ వాడే కదా అని ఆదరించ కూడదు. ముల్లు చిన్నదే కావచ్చు. అది పాదంలో గుచ్చుకుని ఉండగా నడవ గలమా ?

శత్రువుని ఎప్పుడూ తక్కువ అంచనా వెయ్య కూడదు. బాలుడని చులకన భావంతో అతనితో కలిసి ఉండ కూడదు. భయంకరమయిన పర్వతాలను, అరణ్యాలను కాల్చిపారెయ్య డానికి ఒక చిన్న నిప్పు కణికె చాలదూ ?


తనకి అపకారం చేసిన వాడిని చేర దీసి, దగ్గర ఉంచుకునే వాడు బుద్ధి హీనుడు. వాడెలాంటి వాడంటే, ఎత్తయిన చెట్టు కొమ్మ మీద ఏమరుపాటుతో నిద్రించే వాడితో సమానం !

మరో ముఖ్య విషయం ... రాజా, అపకారాలు చేసే వాళ్ళని, సామ దానభేద దండోపాయాల చేత కాని , దయ చూపడం చేత కాని, వారికి నమ్మకం కలిగేలా చేయి. అలా మాటలాడి వారిని నమ్మించు. కావాలంటే ఒట్టు పెట్టు. వారికి నమ్మకం కలిగించి, తర్వాత ఏమాత్రం ఆలస్యం చేకుండా చంపెయ్యి. శుక్రుడు కూడ ఇదే చెప్పాడు. అందు చేత ఏ విధంగానయినా రాజ నీతితో శత్రువులను హతమార్చాలి.

అందు చేత అపకారాలు చేసే వాళ్ళు శత్రువులయినా, బంధువులయినా సరే, అశ్రద్ధ చేయ కూడదు. ఆత్మ రక్షణ కోసం వాళ్ళని హతమార్చాల్సిందే సుమా !

ఇది కణిక నీతి.

ఇక, ఏకచక్రపురంలో పాండవులు భిక్షాటనం చేస్తూ ఉండిన సందర్భంలో, ఆ యింటి గృహస్థుకి వచ్చిన ఆపదను విని కుండి బాధ పడుతూ ఆత్మగతంలో ....

బుద్ధిమంతులు తమకి ఎదుటి వాళ్ళు చేసిన ఉపకారాన్ని గుర్తించాలి. అదే ఉత్తమమయిన పుణ్య కార్యం. మంచి బుద్ధితో దానికి సమానమయిన ప్రత్యుపకారం చేయడం మధ్యమ మార్గం,
అలా కాకుండా పొందిన మేలు కంటె ఎక్కువగా ప్రత్యుపకారం చేయడం ఉత్తమ పద్ధతి.

ఆ బ్రాహ్మణుడు తన వారితో పలికినది:

ఈ సంసారం గడ్డిలాగా చాల నిస్సారమయినది. దు:ఖాన్ని కలిగించేది. భయానికి నెలవయినది. కడు చంచలమయినది. ఇతరులకు లొంగేది. పండితు ఈ సంసార జీవనం సత్యమయినదని ముమ్మాటికీ నమ్మరు

ఇదే ఘట్టంలో కుంతి:

ధైర్యం కొలు పోయి వేడుకునే వాడిని, అతిథిని, అభ్యాగతుడిని, భయ వడే వాడిని, శరణే వేడిన వాడిని చంప కూడదు. అలా చేసే వాడికి ఇహపర లోక సుఖం ఉండదు.

ఉత్తమ క్షత్రియుడు ఇతరుల దు:ఖాలను తొలతగించడానికి పుట్టిన ధర్మ శీలుడు. మృత్యుభయం కలిగిన బ్రాహ్మణుడిని కాపాడితే పుణ్య లోకాలు కలుగుతాయి. దయతో క్షత్రియుడుని కాపాడితే కీర్తిని పొందుతాడు. వైశ్యులను, శూద్రులను కాపాడితే ప్రజలందరి మన్ననలు పొందుతాడు. ఈ విషయం వేదవ్యాసుడు చెప్పాడు.

మరి కొన్ని తదుపరి ‘ హిత వచనమ్ ’ డాట్ కామ్ లో చూదామా ?


ఇప్పటికి స్వస్తి.




14, జూన్ 2010, సోమవారం

మంచి మాట


(ఆంధ్ర మహా భారతం ఆది పర్వం చతుర్ధాశ్వాసం నుండి ... )

శకుంతలోపాఖ్యానం లో శకుంతలతో కణ్వ మహా ముని:

ఎటు వంటి పతివ్రతలకయినా, పుట్టినిళ్ళలో ఎక్కువ కాలం ఉండడం ఎంత మాత్రం తగదు సుమా ! ఇళ్ళాళ్ళకు భర్తల దగ్గర ఉండడమే ధర్మం. భార్యలకు భర్తలే ఏడుగడలు ( సర్వ రక్షకులు.)

తనను గుర్తించ నట్టుగా ఉన్న దుష్యంతుని గురించి శకుంతల ఆత్మగతంలో అనుకున్నది:

ఎవరయినా నిజంగా మరచి పోతే ఙ్ఞాపకం చేయ వచ్చును. అసలు తెలియనప్పుడు తెలియ చెప్ప వచ్చును. కాని, తెలిసి కూడ తెలియని వానివలె నటించే మోసగాడికి తెలియ జేయడం ఆ బ్రహ్మ దేవుడి వశం కూడా కాదు.


శకుంతల దుష్యంతునితో పలికినది:

వివేకంతో బాగా ఆలోచిస్తే, పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కారభావంతో చూసే వాడికి ఇహపరాలు రెండూ ఉండవు.

అనుకూలవతి అయిన భార్య కలవాడు కర్మలు చక్కగా ఆచరించ గలుగుతాడు. ఇంద్రియాలను నిగ్రహించ గలుగుతాడు. పుత్ర సంతానాన్ని పొంద గలుగుతాడు. గృహస్థ ధర్మాన్ని ఆచరించడం వల్ల కలిగిగే ఫలాన్ని పొందుతాడు.

అంతే కాక, భార్య అంటే ఎవరనుకున్నావు? ధర్మార్ధ కామాలనే పురుషార్ధాలను సాధించడానికి అనువైన సాధనం. గృహనీతి అనే విద్యకు నెలవైనది. శీలాన్ని ప్రబోధించే గురువు. వంశం నిలవడానికి ఆధారం. ఉత్తమ గతులు పొందడానికి ఊత కర్రలా ఉపయోగ పడుతుంది. మన్ననకు ముఖ్య హేతువు. ఆదర్శ ప్రాయాలు, కలకాలం నిలిచేవీ అయని రత్నాల లాంటి గుణాలకు నెలవైనది. హృదయానందాన్ని భర్తకు కలిగించేది భార్యయే సుమా !

మగనికి ఇల్లాలి కంటె ఇంపైనది వేరొకటి లేదు. భార్యా పిల్లలను ఆప్యాయంగా చూసుకునే వారికి ఎక్కడయినా, ఎలాంటి పరిస్థితిలోనయినా, ఎలాంటి ఆపదలోనయినా, ఏ తీరాలలోనయినా చుట్టుముట్టినా ఆపదలన్నీ తొలిగి పోతాయి.

అంతే కాక, భార్య భర్తలో సగం. అందు వల్ల భర్త కంటె ముందుగానే మరణించిన భార్య పర లోకంలో అతడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. భర్త ముందుగానే చనిపోతే అతనిని అనుగమిస్తుంది. అట్టి స్త్రీని అవమానించడం ధర్మవిరుద్ధం. మరో ముఖ్య విషయం. భర్త భార్యయందు ప్రవేశించి, గర్భంలో నవమాసాలు ఉండి పుత్రుడై పుడతాడు. కాబట్టి ‘ అంగాత్ అంగాత్ సంభవసి ’ ( శరీరం ను్డి పుడుతున్నావు) అని వేదం చెబుతోంది. దాని వలన తండ్రి కొడుకులకు భేదం లేదు.

గార్హపత్యం అనబడే అగ్ని ఏ విధంగా ఆహవనీయంలో ప్రజ్వలింపబడి వెలుగుతుందో, అలాగే, తండ్రి తానే కుమారుడై తన ప్రకాంశంతో వెలుగొందుతాడు.

మగవాడు తన నీడను నీళ్ళలో ఎలా స్పష్టంగా చూసుకో గలుగుతాడో, అలాగే తండ్రి కొడుకుని చూసి మహదానందాన్ని పొందుతాడు.

‘ పున్నామ్నో నరకాత్రాయత ఇతి పుత్ర ’ అని వేద వచనం. కనుక ఉత్తమ శీలం కల పుత్రుడు తలిదండ్రుల ఉభయ వంశాల వారినీ ఉద్ధరిస్తాడు.

ఒక దీపం నుండి మరొక దీపం పుట్టి వెలుగొందినట్టుగా నీ పుణ్య శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టి ప్రకాశిస్తున్నాడు.

రాజా ! విరుద్ధాలయిన మాటలు ఎందుకు? ఈ నీ కుమారుని కౌగలించుకో. ఆ సుఖాన్ని అనుభవించు. ముత్యాల హారాలూ, దట్టంగా పులుముకున్న పచ్చ కర్పూరపు పొడి, మంచి గంధం, వెన్నెల .... ఇవేవీ కూడ కుమారుని కౌగిలించు కోవడం వల్ల మనసుకి కలిగేటటు వంటి సుఖాన్నీ, చల్లదనాన్నీ ఇవ్వ
లేవు సుమా !

సత్య వాక్యం గురించి శకుంతల ...

ఓ రాజా ! మంచి నీటి ,చేదుడు బావులు నూరిటి కంటె ఒక దిగుడు బావి మేలు. కాగా బావులు నూరిటి కంటె కూడ ఒక మంచి యఙ్ఞం మేలు. అలాంటి యఙ్ఞాలు నూరిటి కంటె కూడ
ఒక కుమారుడు మేలు. అట్టి పుత్రులు నూరుమంది కంటె కూడ ఒక సత్య వాక్యం మంచిది సుమా !

వేయి ఆశ్వ మేథ యాగాలు చేసిన ఫలితం ఒక వైపు, ఒక్క సత్యాన్ని మాత్రమే ఒక వైపు త్రాసులో వేసి ఉంచి తూచి చూస్తే, సత్యం వేపే త్రాసు ముల్లు చూపిస్తుంది. సత్యం అంత గొప్పది.

సర్వ తీర్ధాలూ సేవించడం, అన్ని వేదాలనూ అధ్యయనం చేయడం కూడ సత్యంతో సాటి రావు ! ధర్మం బాగా తెలిసిన మునులు అన్ని ధర్మాల కంటె సత్యము గొప్పదని అంటారు.



మరి కొన్ని ... తదుపరి హిత ‘ వచనమ్ ’ . కామ్ లో

స్వస్తి

13, జూన్ 2010, ఆదివారం

మంచి మాట


( ఆంధ్ర మహా భారతం ఆది పర్వం. ద్వితీయాశ్వాసం నుండి ... నన్నయ రచన)

శమీక మహర్షి పరీక్షిన్మహా రాజునకు శాపమిచ్చిన తన కుమారుడు శృంగితో పలికినది ...


నాయనా ! కోపమే తపస్సును చెడ గొడుతుంది. అణిమాది అష్ట సిద్ధులను నాశనం చేస్తుంది. కోపం ధర్మ కార్యాలకు విఘాతం కలిగిస్తుంది. కనుక తపస్సు చేసుకునే మునికి కోపం తగదు సుమా !

పగిలిన కుండలో నీళ్ళు నిలుస్తాయా చెప్పు ? అలాగే , ఏమాత్రం ఓర్పు అనేది లేని ముని చేసే తపస్సు , అజాగ్రత్తగా ఉండే వాడి ధనం, ధర్మాన్ని విడనాడిన రాజు యొక్క రాజ్యం యివన్నీ నిలవవు.

( ద్వితీయాశ్వాసం నుండి ...)

కచ దేవయాని కథలో శుక్రాచార్యుడు మద్యపానాన్ని నిషేధిస్తూ చెప్పినది ...

మనం ముందు జన్మలలో చేసిన పుణ్యమంతా , పొందిన వివేకమంతా మద్యపానం చేయడం వల్ల యిట్టే పోతుంది. అందు చేత మద్యపానం చేయడం తగదు. నేటి నుండి బ్రాహ్మణులాదిగా గల జనులు మద్యాన్ని సేవిస్తే ఘోరమయిన నరకంలో పడతారు అని కట్టడి చేస్తున్నాను.

రాచబిడ్డ శర్మిష్ఠతో వైరం పొంది అలిగిన కుమార్తె దేవయానితో శుక్రుడు పలికినది ...

సాటి లేని గొప్ప నియమాలతో కూడిన వారై, భూరి దక్షిణలిచ్చి వేల కొద్దీ క్రతువుల చేసిన వారి కంటె కూడ ఎవడు కోపం లేకుండా ఉంటాడో, వాడే మిక్కిలి గొప్ప వాడని పరమార్ధం తెలిసిన వాళ్ళు చెబుతారు.

ఇతరులు కోపిస్తే కోపించ కుండా, ఇతరులు నిందలు పలికితే వాటిని విననట్లే మారు పలక కుండా, అవమానం పొంది ఉండి కూడ మనసులో పెట్టుకోకుండా ఉన్న వాడే లోకంలో ధర్మాన్ని తెలిసిన వాడు. కాబట్టి బుద్ధిమంతులకు కోపం తగదు.

శర్మిష్ఠ యయాతితో పలికినది :

ప్రాణాలకు ముప్పు కలిగినప్పుడూ, సమస్త ధనమూ అపహరించబడుతున్నప్పుడూ, వధించబడుతున్న బ్రాహ్మణుడిని కాపాడేటప్పుడూ , స్త్రీలతో సమాగమం చేసే విషయం లోనూ, వివాహ సమయాలలోనూ అసత్యం చెప్ప వచ్చును.

భాగవతంలో వారిజాక్షులందు, వైవాహికములందు ... అనే పద్యంలో ఇలాంటి మాటలే చూస్తాం. అక్కడ స్త్రీల విషయం లోను, మాన భంగం జరిగే సమయంలోనూ, భీతిల్లిన గోవులను కాపాడే సందర్భంలోను అసత్యం చెప్పినా దోషం లేదని చెప్పగా, యిక్కడ వధూజన సంగమ విషయంలో కల్ల పలికితే తప్పు లేదనడం కనిపిస్తుంది. ( సందర్భం అది, మరి.)

శుక్రుడు యయాతికి శాపం యిచ్చే సందర్భంలో యయాతి పలికిన పలుకులు :

పుష్పవతియై , భర్త సమాగమాన్ని పుత్రార్ధం కోరిన భార్య ను వలదని తిరస్కరించి, ఆమె యెడ అననుకూలంగా ప్రవర్తించి, రుతుకాలాన్ని ఎవడైతే వ్యర్ధం చేస్తాడో, అట్టి వానికి గర్భస్థ శిశువును చంపిన పాపం కలుగుతుంది అని పెద్దలు చెబుతారు.

యయాతి తన వార్ధక్యాన్ని గ్రహించి, తనకు యవ్వనం వచ్చేలా చేయమని కొడుకులను అడిగితే వారు నిరాకరించడమే కాక తండ్రితో యిలా అంటారు :

లోకంలో ముసలితనం, రోగం ఎవరికయినా విధివశాత్తు కలిగినా వాటిని వారే అనుభవిస్తారు. కాని, తెలిసి తెలిసి ఎవరూ కావాలని ఆ రెండింటినీ ఇతరుల నుండి తీసుకోరు. అలాంటి బుద్ధి హీనులెవరూ ఉండరు కదా ?
మన్మథుడే కావచ్చు , అతడు వెండ్రుకలు నెరిసి పోయి ఉంటే యౌవ్వన వతులు అతనిని సమీపించడానికి అసహ్యించుకుంటారు. మగ వాడు ఎంత కుబేరుడయినా, వృద్ధత్వం వల్ల కలిగిన రోత చేత యిష్ట భోగాలను పొంద లేడు.

తన జరాభారాన్ని గ్రహించి తనకి యవ్వనాన్ని యిచ్చిన కుమారుడు పూరునకు యయాతి రాజ్యభారాన్ని అప్పగించడంతో పాటు కొన్ని హిత వచనాలు చెప్పాడు. చూడండి ....

ఙ్ఞానం కలవారి చరిత్రలు తెలుసుకుంటూ, నిశ్చలంగా సజ్జన సల్లాపం చేస్తూ ధర్మాన్ని గ్రహిస్తూ తెలిసుకున్న దానిని మరిచి పోకుండా న్యాయ బుద్ధితో ఆచరించాలి.

ఎవడు తగిన వాడో , వానికి వాని అర్హతను గుర్తించి తగిన విధంగా ధనాన్ని యివ్వాలి. మనం యిచ్చాక అతడు మరి వేరొకరిని అడగనవసరం లేని విధంగా యివ్వాలి. మన ఎదుట యాచిస్తూ నిలిచిన యాచకులను నిరాశ పరచ కూడదు. సకల జీవులకూ తృప్తిని కలిగించాలి.

సభలలో మాటలాడేటప్పుడు మంచి మాటలే పలకాలి. మనసునకు ప్రీతిని కలిగించేదీ, మేలైనదీ, తగినదీ, సత్యమైనదీ, తీయనిదీ, అయిన మాటలు మాట్లాడాలి. ఆ మాటలు కూడా వీలయినంత క్లుప్తంగా ఉండాలి. ముఖ్యంగా సభలో పలికి పలుకులు ధర్మ బద్దంగా ఉండాలి.

కొంత మంది చాల దుర్మార్గంగా మాటలాడుతూ ఉంటారు. వారి చెంత నివసించ కూడదు.
ముఖం అనే వింటికి మాటలనే వాడి బాణాలను సంధించి, ఇతరుల మర్మాలనే లక్ష్యాలను చీలుస్తూ ఉండే దుష్ట యోధులకు దూరంగా ఉండాలి. దయ, నిజాయితీ, ఇంద్రియ నిగ్రహం, సత్యం, బహిరింద్రియ నిగ్రహం, శుచిత్వం, అనే వాటిని మనసులో నిలపాలి. పాటించాలి. నిర్మల మైన శాంత బుద్ధితో కామ క్రోధాదులను జయించాలి. ఈ అంత: శత్రువులను జయించ గల వాడే బహిశ్శత్రువులను కూడ ఏమాత్రం శ్రమ లేకుండా ఓడించ గలుగుతాడు.


మహా మునుల తపస్సులను తక్కువ చేసి మాట్లాడినందుకు కోపించి, ఇంద్రడు యయాతిని అథో లోక భ్రష్టునిగా చేసి, పిమ్మట అతడి అభ్యర్ధనను మన్నించి యయాతిని నక్షత్రగణాలు ఉండే చోటు పొందేలా అనుగ్రహిస్తాడు. అక్కడ అతని దౌహిత్రులయిన అష్టకాదులు అడిగిన దానికి పలికిన హిత వచనాలు చూడండి ...

సమస్త జీవులకి దయ కలిగి ఉండడం కంటె, సత్యం పలకడం కంటె, శ్రేష్ఠమయిన ధర్మం మరొకటి లేదు. సంకోచం లేకుండా యితరులను బాధించడం, వారికి సంతాపం కలిగించడం చాల అధర్మం అని పండితులు చెబుతారు.

వేద విహిత కార్యాలను ఆచరించడమే ఉన్నత గతికి మార్గం. వేద ధర్మాన్ని అతిక్రమించి నిషేధించబడిన వాటిని ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా చేయడం పాప హేతువు. అట్టి వారు దుర్గతి పాలవుతారు సుమా !

అంతే కాదు ...గర్భయోనిలో రుతు కాలం లోని స్త్రీ రజస్సుతో కూడినదై, పురుషుడి రేతస్సు గాలి చేత ప్రేరేపించబడినదై కలియగా ఆ గర్భ యోనిలో శబ్దస్పర్శాదులైన తన్మాత్రలు ఐదూ రూపొంది క్రమంగా జీవం పొంది, అవయవాలు ఏర్పడి, పుట్టడం జరుగుతుంది.

తరువాత చెవుల చేత శబ్దాన్నీ, నేత్రాల చేత రూపాన్నీ, ముక్కు చేత వాసననీ, నాలుక చేత రుచినీ చర్మం చేత స్పర్శనీ , మనస్సు చేత సమస్తాన్నీ తెలుసుకుంటారు. ఆ పిమ్మట పూర్వ జన్మ కృత పుణ్య పాప పరిపాక ఫలం చేత చెడ్డ పనులు చేస్తూ మతి మాలి పశుపక్ష్యాదులుగా పుడతారు. పుణ్య ఫలాధిక్యత చేత, పుణ్య కార్య నిర్వహణ చేత మానవ జన్మ ఎత్తుతారు. ఆచారవంతులై, నిర్మలఙ్ఞాన సంవద చేత మోక్షాన్ని పొందుతారు.

ఇక, మంచి ఆచారవంతులెవరయ్యా, అంటే....

గురువులను సేవించే వారు , నిత్యం వేదాధ్యయనం చేసే వారు, ఏమరక అగ్ని హోత్రాలను నిర్వర్తించే వారు, అంతర్ బహిరింద్రియ నిగ్రహాన్ని పాటించే వారు, శుచిగా బ్రహ్మచర్యవ్రతాన్ని ఆచరించే వారు, పాపకార్యాలు చేయకుండా, పరులను పీడించకుండా ధర్మ మార్గాన సంపాదించిన ధనంతో అతిథి సేవ చేసే వారూ, ఆహారం నియమంగా తీసుకునే వారూ, శీతోష్ణ సుఖ దుఖాలను, సర్వ ద్వంద్వాలను జయించి అన్ని ఆసక్తులు విడిచి పెట్టి ఒంటరిగా తిరుగుతూ ఉండే యోగులు ... వీరు యుక్తాచారులు. వీరు తమ పుణ్యాచారాల చేత అటు వది వేల తరాల పూర్వులనూ, యిటు పది వేల తరాల వారినీ ఉద్ధరిస్తారు.

గర్వంతో అగ్ని కార్యం చేసినా, ఆడంబరం కోసం వేదాధ్యయనరం చేసినా మదంతో కూడిన మౌనాన్ని వహించినా, అఙ్ఞానంతో , ఆడంబరంగా యఙ్ఞం చేసినా ఫలితం ఉండదు.అట్టివి అయోగ్యాలు సుమా .



మరి కొన్ని ... తదుపరి హిత ‘వచనమ్ ’ . కామ్ లో చూదాం .......


ఇప్పటికి స్వస్తి.






11, జూన్ 2010, శుక్రవారం

అక్షరాస్యులు కూడ అడుక్కోవడం తప్పదా ?

ఇవాళ సాక్షి దిన పత్రికలో వచ్చిన ఈ ఫొటో చూసేరా ? మీకేమనిపిస్తోంది ? నాకుమాత్రం ఇది బాధ్యతారాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా తోస్తోంది.

ప్రజా సేవకు వినియోగ పడ వలసిన పోలీస్ సబ్ కంట్రోల్ రూం నానా చెత్త ప్రకటనలతో దిక్కుమాలి పోయి ఉంది. ఇంత నిర్లిప్తత క్షంతవ్యమా ?

మన మహా నగరంలో మనం పడుతున్న ఒక ముఖ్యమైన యిబ్బందిని మీ దృష్టికి తెస్తున్నాను ...

మనం బస్సులోనో , లేదా , సొంత వాహనంలోనో , టూ వీలర్ మీదనో , కాదంటే కాలి నడకనో మన మహా నగరంలో వెళ్తున్నామనుకోండి. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో ఛస్తే తెలియదు. ఎవరినయినా అడగాల్సిందే. పాత వారికీ, ఆ ప్రాంతం పరిచయం ఉన్న వారికీ అయితే ఫరవా లేదు. ఈ మహా నగరం లోనే ఉంటున్నా, ఆ ప్రాంతం తెలియని వారి గతేమిటి ? ఇక, నగరానికి బొత్తిగా కొత్త వారయితే యిక చెప్పే పని లేదు. నగర పాలక సంస్థ వారు ప్రాంతాలని సూచిస్తూ పెట్టే బోర్డులు ఎక్కడో ఉంటాయి. కిక్కిరిసిన జన సమ్మర్ధంలో కనిపించవు.అంతా అయో మయం. గాభరా. అది ఏ ప్రాంతమో తెలుసు కోవాలంటే చచ్చినట్టు ఎవరినయినా అడగక తప్పదు. అక్షరాస్యులమై ఉండి కూడా ఈ అడుక్కోడం తప్పదంటారా ?

దయ గల ప్రభువులు, మనలను ఏలే మహానుభావులు ఒక చిన్న నిబంధనని ఖచ్చితంగా అమలు పరిస్తే ఈ బెడద తప్పి పోతుంది. దీనికి అదనంగా ఎర్ర ఏగానీ ఖర్చు కూడా ఏలిన వారికి ఉండదు.

కొద్దిపాటి నిబంధనలతో నగర వాసులకీ, నగరానికి వచ్చే కొత్త వారికీ కొండంత మేలు జరుగుతుంది ...

అదేమిటో వివరిస్తాను ...

నగరంలో బజార్లమ్మట ఏ ప్రాంతానికి వెళ్ళండి ... ఆకర్షణీయమయిన పెద్ద పెద్ద సైన్ బోర్డులూ, హోర్డింగులూ కనిపిస్తూనే ఉంటాయి. కూడళ్ళలో ట్రాఫిక్ ఐలెండులు ఎలానూ ఉంటాయి.

ఎక్కడో, మన పూర్వజన్మ పుణ్య పరిపాక ఫలితం వల్ల కొద్ది పాటి సైన్ బోర్డుల మీద అది ఏ ప్రాంతమో రాసి ఉంటుంది. తక్కిన లక్షలాది పెద్దా చిన్నా బోర్డులన్నీ ఆయా షాపుల పేర్లతోనూ, తక్కిన వాణిజ్య ప్రకటనలతోనూ నిండి పోయి ఉంటాయి. ఎక్కడా అదే ప్రాంతమో మచ్చుకయినా కనిపించదు.

ఏలిన వారికి నా సూచన ఏమిటంటే .....

వ్యాపార ప్రకటనల కోసం మీరు ఎన్ని బోర్డులు పెట్టు కోండి, ఎలాంటి రాతలు రాసుకోండి. కానీ ...

ఆ బోర్డుల మీద ఖచ్చితంగా ఆ ప్రాంతం పేరు ఇంగ్లీషులోనూ , తెలుగు లోనూ, వీలయితే జాతీయ భాష లోనూ రాసి తీరాలి. లేని వాటికి అనుమతి రద్దు చేస్తూ వాటిని తొలిగించాలి.

నిర్ణీత గడువు యిచ్చి, మన మహా నగరంలో గల్లీ గల్లీ లోనూ, ప్రధాన రహదార్ల మీదా, ఎక్కడవనీయండి ...ఆ ప్రాంతాన్ని సూచించని బోర్డులను ఎంత మాత్రం ఇక మీదట అనుమతించ కూడదు.

ప్రజోపయోగకరమయిన ఇలాంటి చిన్న చిన్న ఏర్పాట్లు చేయడానికి కూడా అంతగా ఆసక్తి కనబరచని ఏలిన వారికి ఓ దండం పెట్టి, ఆ పనేదో ప్రజా సంఘాలు చేపట్ట వచ్చును. ధరల పెరుగుదల మీద మండి పడుతూ ప్రదర్శనలు చేసే రాజ కీయ పక్షాల వారూ, యితర ప్రజా సంఘాల వారూ యిందుకు నడుం కట్టాలి.

నా సూచన నచ్చితే మీ కామెంట్లతో స్పందించండి. ఇది పరిగణించాల్సిన విషయంగా తోస్తే, మీరిచ్చే సలహాలు కూడ నలుగురితో పంచుకోండి.

లేదూ, యిలాగే ఉందాం, అనుకుంటే సరే.

ఎన్ని యిబ్బందులని, ఎన్ని నరకాలని, ఎన్ని అసౌకర్యాలని , ఎన్ని అవమానాలను , ఎన్ని అనుచితాలను నిత్యం భరిస్తూ నగర జీవితం గడిపేయడం లేదు కనుక ?

మంచి మాట

హిత ‘ వచనమ్’ . కామ్ లో భారతేతి హాసంలో చెప్ప బడిన హిత వచనాలను ఒక చోట క్రోడీకరించి వచనంలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను కదా ? ఆ క్రమం లో , ఇది, శ్రీమదాంధ్ర మహా భారతం, నన్నయ కృతం ఆదిపర్వం ప్రథమాశ్వాసం నుండి ....

జనమే జయునితో సరమ పలికిన పలుకులు:

ఓ రాజా ! ఈ పని తగినది. ఈ పని తగనిది అని మనస్సులో ఆలోచించుకుని చేయాలి. అలా కాకుండా బీద వారికీ, అశక్తులకీ , మంచి వారికీ కావాలని అపకారాలు చేసే నీతి రహితులకు అకారణంగానే ఆపదలు వస్తూ ఉంటాయి

ఉదంకోపాఖ్యానం లోని ‘ నిండు మనంబు నవ్య నవనీత సమానము ...’’ అనే పద్యం చాల ప్రసిద్ధమైనది. పౌష్య మహా రాజు శాపమిచ్చిన పిదప ఉదంకునితో పలికిన పలుకులు ...

ఓ మహా మునీ ! అప్పుడే తీసిన వెన్నలా మిక్కిలి మృదువుగా ఉంటుంది బ్రాహ్మణులు మనసు. మరి వారి మాట మాత్రం భయంకరమైన ఇంద్రుని వజ్రాయుధంతో సమానంగా ఉంటుంది. ఇది నిజం. మనసూ, మాట రాజులలో దీనికి విరుద్ధంగా ఉంటాయి. అంటే, రాజులలో మనసు వజ్రతుల్యంగా ఉంటుంది. మాట నవనీత సమానంగా ఉంటుంది. కనుక, బ్రాహ్మణుడు శాపమిస్తే, తరిగి ఉపసంహరించ గలుగుతాడు. రాజు ఎంత శాంత స్వభావం కలవాడయినా, యిచ్చిన శాపాన్ని ఉపసంహరించ లేడు సుమా !

భృగు మహర్షి తో అగ్ని దేవుడు పలికినది ...

తనకు తెలిసిన విషయాన్ని ఇతరు డెవరయినా ‘ఇది ఎలా జరిగిందో చెప్పు ’ అని అడిగితే చెప్పడానికి నిరాకరించే వాడు ఘోరమయిన నరక కూపంలో పడతాడు. అలాగే, సత్యం చెప్పని వాడు కూడ నరకానబడతాడు.


మరి కొన్ని తదుపరి హిత వచనమ్ . కామ్ లో ...

స్వస్తి.


10, జూన్ 2010, గురువారం

మంచి మాట


హిత వచనమ్ . కామ్ లో భారతంలో చెప్ప బడిన రాజ నీతి ధర్మాలు చూస్తున్నాం కదా.
ఇప్పడు మరి కొన్ని యుద్ధనీతి ధర్మాలు చూదాం ... శాంతి పర్వం ద్వితీయాశ్వాసం నుండి ....


రాజు తన మూల బలం ( అంటే, చతురంగ బలాలలో ప్రధాన సైన్యం) శత్రుసంహారార్ధం అని భావించి, దానిని ప్రేమగా చూడాలి. శత్రువు అసమర్ధుడుగా ఉన్నాడని గ్రహించి నప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. ఈ దండ నీతి వలన రాజునకు మిక్కిలి శుభం కలుగుతుంది.

యుద్ధం ఒక సాహస కృత్యం.యుద్ధం చేసి, శత్రు సంహారం వలన సంపాదించిన సిరి సంపదలు మేలు కలిగించవు సుమా ! రాజు అహంకారాన్నీ, కోపాన్నీ తగ్గించుకోవాలి. అలాంటి రాజునకు శత్రువులు ఉండరు. రాజు ఎదిరి రాజు తనంతటి వాడని గ్రహించి నప్పుడు తగిన సామోపాయంతో ప్రవర్తించాలి.

ఒక్కో సారి తన సైన్యం లోనే అంత: కలహాలు చెల రేగుతూ ఉంటాయి. అలాంటప్పుడు రాజు యుద్ధానికి బయలు దేర కూడదు. శత్రువు ఎంత బలహీనుడయినా సరే, అతనికి ధనం ఇచ్చి సంతృప్తి పరచి వశం చేసు కోవడమే ఉత్తమం.

ఇలా సామ దాన దండోపాయాలనే మూడింటికి అవకాశం లేనప్పుడు శత్రువు బలహీనతలను గమనించి, అవకాశం చిక్కి నప్పుడు శ్రద్ధతో రాచ కార్యాన్ని చేయ గల సమర్ధుని నియోగించి భేదోపాయానికి ప్రయత్నించాలి.

శుక్రాచార్యుడి మతం ప్రకారం సామ దాన భేద దండోపాయాలే కాక, ఉపేక్షా భావ మనే మరో ఉపాయం కూడ ఉంది. దానిని ఎలా ప్రయోగించాలో చూడండి ...

తమలో తమకే వైరం కలిగి సతమతమయే రాజుని ఉపేక్షించాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి. కొందరు మంత్రులు రాజుకి ఆపదలు కలిగించడానికి చూస్తూ ఉంటారు. వారి పట్ల కూడ కొంత కాలం ఉపేక్షాభావం వహించి, అదను చూసి వారిని తొలిగించాలి.

మరి కొంత యుద్ధ నీతి చూడండి ...

యుద్ధంలో శత్రువు పైన్యంతో ఎదుర్కొంటే, నువ్వూ సైన్యం తోనే ఎదిరించాలి. శత్రవు ఎక్కటి కయ్యానికి తలపడితే నీవూ అదే చేయాలి.శత్రువు మాయోపాయాలతో యుద్ధం చేయడం ప్రారంభిస్తే నీవు కూడ కపటోపాయంతోనే ఎదిరించాలి.
శత్రువు వెన్ను చూపి పారిపోయినా, అజాగ్రత్తగా ఉన్నా, అతని ఆయుధం భగ్నమయినా, శరణు వేడినా, మ్రొక్కినా, శత్రువు గుర్రాలు నేల కూలినా, పారి పోయినా, శత్రువు వేరొకడితో యుద్ధం చేస్తున్నా, ఎట్టి పరిస్థితులలోనూ శత్రువుని చంప కూడదు సుమా ! అది యుద్ధ నీతి కాదు. అధర్మంగా యుద్ధంలో శత్రువుని చంపడం కంటె చావడం మంచిది.

మరొక విషయం ... యుద్ధంలో వాడే ఆయుధాల గురించి ... చివర ములికిని ఉంచి తయారు చేసిన ఆయుధాన్ని కానీ, లేదా, విషం పూసిన ఆయుధాన్ని కానీ ఎలాంటి శత్రువు మీద కూడ ప్రయోగించ కూడదు. అలా చేస్తే రాజునకు నరకం ప్రాప్తిస్తుంది.
అలాగే యుద్ధలో తనకు సహాయంగా వచ్చి, ఘోరంగా గాయాలబారిన పడిన వారిని పట్టించు కోకుండా ఉండ కూడదు.అది చాల పాప హేతువు.

శత్రువుపై దండెత్తి, అతని రాచ నగరుని వశం చేసుకుని, నాశనం చేయడమూ, అక్కడి ప్రజలను బాధించడమూ కూడ తగదు. అలాగే బ్రాహ్మణుల యిళ్ళను, దేవాలయాలను కొల్ల గొట్టడం కూడా సరి కాదు. అది రాజునకు తగని పని.

భీష్ముడు ఈ యుద్ధ నీతిని బోధించగా విని, ధర్మ రాజు ‘‘ మొత్తానికి రాజ ధర్మం కంటె మరొక పాప కార్యం లేనట్టుంది. ఎలా చూసినా రాజునకు నరకం తప్పేలా లేదు.’’ అంటూ కించ పడ్డాడు.

రాజ్యాంతే నరకం ధృవమ్ అని పెద్దలు చెప్ప లేదూ ?

మరి కొన్ని తదుపరి హిత వచనమ్ . కామ్ లో చూదాం ...

స్వస్తి.


7, జూన్ 2010, సోమవారం

మంచి మాట


ఆంధ్ర మహా భారతం ఉద్యోగ పర్వం తృతీయాశ్వాసం ( తిక్కన కృతం) శ్రీకృష్ణ రాయబార ఘట్టంలో ఒక అపూర్వ మయిన పద్యం ఉంది.

సారపు ధర్మమున్ విమల సత్యముఁబాపము చేత బొంకుచేఁ
బారముఁబొంద లేక చెడఁబాఱినదైన యవస్థ దక్షు లె
వ్వార లుపేక్ష సేసి రది వారల చేటగుఁగాని ధర్మని
స్తారక మయ్యు సత్య శుభ దాయక మయ్యును దైవముండెడిన్

ఉత్తమ మయిన ధర్మం, నిర్మల మయిన సత్యం పాపం చేతను, అసత్యం చేతను దరి చేర లేక చెడబారి పోవడానికి సిద్ధ మయిన తరుణంలో వాటిని రక్షించ గలిగే సమర్ధత కలిగి ఉండి కూడ ఎవరు ఉపేక్ష చేస్తారో, అది వారికే కీడు కలిగిస్తుంది. కాని, ధర్మాన్నీ, సత్యాన్నీ కాపాడే దైవం ఉంటాడు సుమా!

శ్రీకృష్ణుడు కురు సభలో పెద్దలందరి ఎదుట పలికిన పలుకులివి.

ఉదాత్తమయిన వ్యంగ్య వైభవంతో, గంభీర భావ ప్రధానమయిన ఈ పద్యం మహా భారతం లోనే ఒక ధర్మ దీపంగా పెద్దలు పేర్కొంటూ ఉంటారు.

ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత నశిస్తున్నప్పుడు దక్షులైన వారు చూస్తూ ఊరుకుంటే, అది వారికే హాని కలిగిస్తుంది. సత్య ధర్మాలను కాపాడడానికి భగవంతుడు ఉంటాడు.

కురు సభలో సత్య ధర్మాలకి చ్యుతి కలుగుతున్నా ఉపేక్ష చేసిన పెద్దలకు ఒక హెచ్చరికగా ఉంటుందీ పద్యం. అలాగే, సత్య ధర్మాలను కాపాడే శ్రీకృష్ణుడు పాండవ పక్షం వహించి ధర్మ రక్షణ చేసి, సత్యాన్ని కాపాడతాడని సూచన కూడ ఇందులో ఉంది.

ఈ పద్యం తిక్కన రచలనలో ఒక అనర్ఘ రత్నంగా భాసిస్తూ ఉంటుంది. మహా భారత కథా తత్త్వానికి ఈ పద్యం ఆత్మ వంటిదని పెద్దలు చెబుతారు.

క్లిష్ట మయిన పరిస్థితులలో భగవంతుడు ధర్మాన్నీ, ధర్మాత్ములను రక్షిస్తాడని, అధర్మాన్నీ, అధర్మ పరులనూ శిక్షిస్తాడనీ నమ్మే తెలుగు వారి విశ్వాసానికి అద్దం పట్టేలా ఉంటుందీ పద్యం.

తదుపరి హిత వచనమ్ . కామ్ లో మరి కొన్ని చూదాం ...

స్వస్తి.


4, జూన్ 2010, శుక్రవారం

మంచి మాట

ఏ ప్రభుత్వమయినా సక్రమంగా నడుస్తూ, అభివృద్ధి పనులు చేయాలంటే ప్రజలు సక్రమంగా పన్నులు కడుతూ ఉండవలసినదే. ప్రజల నుండి పన్నులు వసూలు చేయ వలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ధనాగారాన్ని ఎలా నింపు కోవాలా అనే ఆలోచనతో మరీ క్రూరమయిన విధంగా పన్నులు వేయడం వసూలు చేయడం తగదు.

శ్రీమదాంధ్ర మహా భారతం శాంతి పర్వం ద్వితీయాశ్వాసంలో భీష్ముడు ధర్మ రాజుకి కోశాగారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో చక్కగా వివరించిన సందర్భం ఉంది. సార్వ జనీనమయిన ఆ ఉపన్యాస సారాంశం వచనంలో ...హిత వచనమ్ . కామ్ టపా గా అందిస్తున్నాను .....

భీష్ముడు ధర్మ రాజుతో యిలా చెప్పాడు...

ధర్మ రా జా ! ప్రజల నుండి పన్నులు వసూలు చేసేటప్పుడు రాజు చాల జాగ్రత్త వహించాలి

రాజా ! సావధానంగా విను. పన్నుల రూపంలో రాజునకు ధనం చేకూర్చే వాళ్ళలో రైతులు, వర్తకులు, గోపాలురు ముఖ్యులు.

ధనోత్పత్తికి వర్తక వాణిజ్యాలు ఆధారాలు. అలాగే, ధాన్యాభివృద్ధికి భూమి ఆధారం. అందు వల్ల ఇవి రాజు ఆధీనం లోనే ఉండాలి. వాటికి హాని కలుగ కుండా ఉండే రీతిలో రాజు జాగ్రత్తగా ధనాగారాన్ని అభివృద్ధి చేసుకోడానికి ప్రయత్నించాలి.

ఆకలితో ఉన్న పులి ఈనిన వెంటనే తన పిల్లలను తానే తినేస్తుంది. ఆ విధంగా క్రూరంగా రాజు ప్రజల నుండి పన్నుల వసూలు చేయడం మొదలెడితే పన్నులు సరిగా వసూలు కావు, సరి కదా, కోశాభివృద్ధి ఆగి పోతుంది. అందు వలన ప్రజలకు బాధ కలగనీయకుండా, కష్టం తెలియకుండా జలగ నెత్తురును ఎలా పీలుస్తుందో అలా, రాజు ప్రజల నుండి పన్నులు వసూలు చేయించ గలగాలి. అప్పుడే కోశాగారం కళకళలాడుతుంది.

ప్రజాభి వృద్ధికరమయిన పనులు రాజు చేస్తూ ఉండాలి. మూర్ఖపు పట్టుదలలకు పోకూడదు. చక్కటి ఉపాయాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ప్రజలు సక్రమంగా పన్నులు కడతారు. కోశాగారం తప్పకుండా నిండుతుంది. రాజు ఏం చేయాలంటే, ఎవరిని దండించాలో వారిని తగిన సమయంలో దండించాలి. శిక్షార్హులకు సకాలంలో తగిన దండన విధించాలి. వారి సంపదను స్వాధీన పరుచు కోవాలి. అలా చేస్తే ప్రజలు సంతోషిస్తారు. బొక్కసమూ నిండుతుంది.

రాజుకి అసూయ తగదు. ధనవంతులయిన తన ప్రజల సిరిసంపదలను చూసి ఓర్చుకో లేక, బలవంతంగా, అన్యాయంగా వారి సంపదను స్వాధీన పరుచుకో కూడదు. అలా చేస్తే రాజుకి కీడు కలుగుతుంది. అందు వలన రాజు దయతో వ్యవహరించి అందరికీ ఆనందం కలిగించాలి.

ఉచితానుచితాలు తెలిసిన రాజు ఇహ పరాలలో సిద్ధిని పొందడం కోసం సామంత రాజులను ఆదరించాలి. వారితో స్నేహంగా మెలగాలి.కర్షకులను ఊరికే భయభ్రాంతులకు లోను చేయ కూడదు. అదను చూసి వారినుండి పన్నులు వసూలు చేయాలి. ధనాగారం నింపుకోవాలి.

రాజు బొక్కసం నింపుకోడానికి న్యాయమైన మార్గాలనే ఎంచుకోవాలి. అంతే కాని, పన్నులు రాబట్టకోవడం కోసం కపటోపాయాలు పన్నుతూ కుటిలుడై ఉండడం తగదు సుమా.

ఓ ధర్మ రాజా! జాగ్రత్తగా విను. అపాత్ర దానం చేసి, ధనాన్ని నాశనం చేసుకుంటే ఆ ధన సంపాదన వలన ప్రయోజనం లేదు. అయితే పాత్రులయిన వారికి దానం చేసి, సంపదలను వెచ్చిస్తే మాత్రం అది ఆ సంపదకు ప్రయోజనకారి అవుతుంది. అందు వల్ల పాత్రత ఎరిగి దానం చేయాలి.

ఓ ధర్మ రాజా ! ఈ విధంగా నీవు నడుచుకుంటే నీ భాండాగారం వృద్ధి చెందుతుంది. దానితో పాటు నీ మిత్రబృందం , రాష్ట్రం , సైన్యం అభ్యున్నతి పొందుతుంది. కనుక ఈ మార్గం లోనే నడుచుకో. ప్రజలను చక్కగా పరిపాలించు. ప్రజారక్షణ చెయ్యి. యుద్ధాలకు భయ పడ వద్దు. పరాక్రమంతో నీ శత్రువులను సంహరించు. యాగాలు చెయ్యి. దరిద్రులైన బ్రాహ్మణ కుటుంబాలను కాపాడు. మంచి వారిని రక్షించు.

ఉతథ్యుడనే మహర్షి మాంధాత మహా రాజునకు ఇదే విధమయిన హిత వచనాలు చెప్పాడు. అతను చెప్పిన హిత వచనాలేమంటే ...

ధర్మం వల్లనే ప్రాణి కోటి అభివృద్ధి చెందుతుంది. ధన లాభం కలుగుతుంది. రాజనే వాడు ధర్మాన్ని కాపాడడానికే జన్మిస్తాడు. కనుక అతనికి అహంకారం తగదు. కామాన్ని విడిచి పెట్టాలి. ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ధర్మ మార్గంలో రాజ్య పాలన చేయాలి .....

ఇవీ భీష్ముడు ధర్మ రాజుకి చెప్పిన ఆదాయ మార్గాలు.

మరి కొన్ని .... తదుపరి హిత వచనమ్ . కామ్ లో.....

విన్నారా, ... ఆర్ధిక శాఖామాత్యుల వారూ ? !

స్వస్తి..