29, జూన్ 2010, మంగళవారం

కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 3.

విరాట మహా రాజు కొలువులో అఙ్ఞాత వాస కాలాన్ని గడపడానికి పాండవవులు ఒక్కొక్కరే వచ్చి చేరుతున్నారు. ముందు టపాలలో ధర్మ రాజు, భీముడు వచ్చిన వైనం చూసాం. ఇప్పుడు పాండవ మధ్యముడు అర్జునుడు విరటుని కొలువువు లోనికి ప్రవేశించిన తీరు చూదామా ....

అర్జునుడు పేడి రూపంలో బృహన్నలగా విరటుని కొలువులో కుదురుకున్నాడు...

అర్జునుడు విరటుని కొలువులో చేరడానికి పేడి రూపంలో వస్తున్నాడు. కాళ్ళ అందం కనిపించని విధంగా చీర కట్టాడు. చేతుల అందం కనబడని విధంగా శంఖ వలయాలు ధరించాడు. శరీర కాంతిని మరుగు పరిచే విధంగా కంచుకాన్ని తొడిగికున్నాడు. మెడ అందం తగ్గేలా హేమ పట్టిక, ముఖ సౌందర్యం తగ్గేలా పసుపు పూత, నుదురు కనిపించకుండా ముంగురులు, పాపటి , చెవి అందం సన్నగిల్లే లాగున పగడాలు అందం రాణించని విధంగా తల కట్టు ఉన్నాయి. మొత్తం మీద అతని ఆహార్యం అతని అందాన్ని కప్పి పుచ్చేలా ఉంది. ఊర్వశి శాపానికి తగినట్టుగా పేడి రూపంతో వచ్చాడు. వేషధారి అయిన విష్ణువు లాగానూ ఉన్నాడు.

అర్జునుడిని ఈ రూపంలో చూసిన విరటుడు తన సమీపస్థులతో యిలా అన్నాడు:

విరటుడు:

‘‘చూడండి ... ఇతని వేషం చూస్తే ఆడ వేషం. నడకలో మాత్రం ఆడ పోలిక కనిపించదు. నిదానంగా చూస్తే రాజసం ఉట్టి పడడం లేదూ ? పెద్దరికం కూడ గోచరిస్తోంది. ఆకారంలో ఏ దోషమూ కనబడడం లేదు. సాముద్రిక లక్షణాలన్నీ ఉన్నాయి. ఇతడు లోకమాన్యుడు కావచ్చును. వినోదం కోసం ఈ రూపం ధరించాడు కాబోలు. నాకలాగే అనిపిస్తోంది. మీరూ ఊహించండి. అవును. తేరిపార చూస్తే అలాగే తోస్తున్నది.’’

అతనిలా అంటూ ఉండగానే అర్జునుడు కొలువులోనికి ప్రవేశించి, విరాట మహా రాజుతో యిలా అన్నాడు:

అర్జునుడు:

‘‘ రాజా ! నేను నిన్ను సేవించడం కోసం వచ్చాను .అంత:పుర కన్యలకు ఆటపాటలు నేర్పుతాను.

నా పేరు బృహన్నల.’’

విరటుడు ( ఆత్మగతం):

ఇతడు ఆజాను బాహువు. విశాలమూ, ఉన్నతమూ అయిన వక్ష స్థలం ఉంది. కళ్ళు పద్మాల లాగా ఉన్నాయి. ముఖం ఎంత నిర్మలంగా ఉందో కదా. చూపు తిప్పుకో లేని విధంగా ఉంది. ఇతని తీరు ఎంతో ఉదాత్తంగా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇతని రూపం మన్మధుడిని మించి పోయేలా ఉంది. ఇంద్రుడిని మీరి పోయేలా ఉంది. ఇంతటి విలాసం, వైభవం కలిగించి, ఇతడిని ఆ బ్రహ్మ నపుంసకుడిగా చేసాడు కదా?

ఇలా అనుకుని అర్జునుడితో ఈవిధంగా అన్నాడు:

‘‘నా వద్ద గొప్ప గొప్ప విండ్లున్నాయి. వాటిలో ఒక గొప్ప వింటిని నీకు ఇవ్వాలని ఉంది. కాంతులీనే బాణాలు, బంగారు పూలతో మెరిసే కవచాలు యిచ్చి, సత్కరించాలని ఉంది. మంచి మంచి వాహనాలూ, అలంకరణ ఆభరణ విశేషాలూ మొదలయిన గౌరవ లాంఛనాలన్నీ యిచ్చి మన్నించాలని ఉంది. గొప్ప ఐశ్వర్యవంతుడిగా చేయాలని ఉంది. రాజుగా చేయాలని ఉంది.

నిన్ను మా మత్స్య దేశానికంతటికీ అధికారిగా చేదామనుకుంటున్నాను. అయితే నువ్వు అంత:పుర కాంతలకు నాట్యం నేర్పుతానంటున్నావు. నాకేమో నిన్ను రాజుగా చేయాలని ఉంది. ఎలా కుదురుతుందో మరి....’’

బృహన్నల:

‘‘ రాజా ! నాలో ఆడుతనం అస్సలు లేదు. మగతనం మాత్రం రూపు తప్పింది. శాపవశాత్తు ఇలా నపుంసకత్వం అనుభవించ వలసి వచ్చింది. కర్మ ఫలాన్ని ఎవరూ తప్పించ లేరు కదా? అందు చేత ...

పేడితనం వలన ఏపనీ చేయ లేక పోతున్నాను. చిన్నప్పటి నుండి దండలాసకం, కుండలి, ప్రెక్కణం, పేరణం వంటివన్నీ తెలుసు. ప్రసిద్ధ వాయిద్యాలన్నింటినీ వాయించ గలను. మంచి శ్రుతితో గీతాలు, గతులు నాకు విదితమే. రసవంతాలయిన చక్కని అభినయాలూ నాకు తెలిసినవే.

మరో విషయం. నా నేర్పు ఎలాంటిదో తెలుసునా? ఏ మాత్రం నేర్పు లేని వాళ్ళ చేతనయినా సాధన చేయించి తీర్చి దిద్దుతాను. నాట్యం నేర్పుతూ అంత:పురాలలో ఉంటాను. అంతే కాదు, నాకు నాట్యకత్తెలకు చేసే అలంకరణ విధులు కూడ తెలుసు.’’

బృహన్నల ఇలా చెప్పాక, విరటుడు తన కుమార్తె ఉత్తరను పిలిపించాడు. ఆమె మహా సొగసుగా సభలోనికి అడుగు పెట్టి, తండ్రికి నమస్కరించి చెంతనే నిలబడింది. రాజు కూడ కుమార్తెను పరి పరి విధాల బుజ్జగించి. ముద్దు చేసాడు. తనివి తీరా ముద్దులు కురిపించాడు తరవాత అర్జునుడితో యిలా అన్నాడు :

విరటుడు:

‘‘ బృహన్నలా ! నీవు చాల నిపుణరాలివి. నా కుమార్తె ఉత్తరను నీకు జాగ్రత్తలు చెప్పి మరీ వేరుగా నీకు అప్పగించ వలసిన పని లేదు. అయినా తండ్రి మనసు కదా? అందు చేత చెప్పకుండా ఉండ లేను. మా ఉత్తరకు ఆటలంటే చాల ఇష్టం. ఎప్పుడూ చెలికత్తెలతో ఆడుతూనే ఉంటుంది. హాయిగా విచ్చల విడిగా తిరుగుతూ ఉంటుంది. విద్య నేర్చు కోవడంలో పాటించ వలసిన నియమాలేవీ తెలియవు. శిక్షణ ఏమాత్రం తెలియదు. ఈమె చిన్న పిల్ల. ఈమెకి ఆటల మీద ఉండే మక్కవను కళల మీదకు మరల్చు.చక్కని నాట్య శిక్షణ యివ్వు. ఈమెకు అన్ని విధాల నువ్వే రక్షకుడివి.’’ అని ఉత్తరను బృహన్నలకి అప్పగించాడు. అంతే కాక కూతురికి గురువుని గౌరవంగా చూడమనీ, అతను ఎలా చెబుతే అలా నడచుకో మనీ చెప్పాడు. తమ హోదాకి తగినట్టుగా ఆహారం, గంధం మొదలయిన సుగంధ ద్రవ్యాలు, పూలు అన్నీ నాట్యాచార్యునికి సమకూర్చమని చెప్పాడు.భక్తి శ్రద్ధలతో గౌరవించమని హెచ్చరించాడు.ఇంకా కుమార్తెతో యిలా అన్నాడు:

‘‘ అమ్మాయీ ! నీకు గురువే చుట్టం. తల్లి. తండ్రి. తోడు. చెలి. బలగం అంతా ఇతడే. నీకు ఏలోటూ రాదు.

ఈ బృహన్నల వద్ద తెలివితేటలతో గౌరవప్రదంగా ప్రవర్తించు‘‘

ఇలా విరటుడు ఉత్తరను బృహన్నలకు అప్పగించి, అతనికి అంత:పుర సంచారంలో ఏ నిషేధమూ లేదని, యిచ్చ వచ్చిన విధంగా తిరగ వచ్చునని అనుమతినిచ్చాడు ఈ విధంగా అర్జునుడు విరటుని కొలువు లోనికి ప్రవేశించాడు.

ఇక, నకులుడు విరటురాజు కొలువులోనికి ఎలా ప్రవేశించాడో రేపటి హిత వచనమ్ డాట్ కామ్ లో చూదాం......

స్వస్తి.

28, జూన్ 2010, సోమవారం

కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 2.

అఙ్ఞాత వాస వత్సరాన్ని గడపడానికి కంకుభట్టుగా విరట రాజు కొలువులో ప్రవేశించిన ధర్మ రాజు గురించి నిన్నటి టపాలో చూసాం. ఇప్పుడు భీముడు ఎలా వచ్చేడో చూదాం ...భీముడు వలలుడు అనే పేరుతో వంటల వాడిగా విరటమహా రాజు కొలువులో కుదురు కోడానికి బయలు దేరాడు.

అతని చేతిలో గరిటె ఉంది. కత్తిని చంకకి తగిలించుకున్నాడు. నల్లని వస్త్రాన్ని దట్టీగా బిగించుకున్నాడు. అందులో చుర కత్తి బిగించి ఉంది. ఎడమ చేతిలో పదనైన శూలాలు ఉన్నాయి. రంగు రంగుల లేడి చర్మాన్ని ఉత్తరీయంగా వేలాడదీసుకుని ఉన్నాడు. చూసే వారికి అతని రూపం దుస్సహంగానూ, ఆశ్చర్యం కొలిపేదిగానూ ఉంది.

భీముడు ధర్మ రాజు వచ్చిన దిక్కులో నుండి కాకుండా మరో దిక్కు నుండి విరటుడున్న తావునకు వచ్చాడు. గజగమనంతో గంభీరంగా వచ్చేడు. అలా వస్తున్న భీముడిని దూరం నుండి చూసాడు విరాట రాజు.అతడి మనసులో భయం చోటు చేసుకుంది. ఆశ్చర్యం కలిగింది. అతడి దీర్ఘ బాహువులు, విశాలమైన వక్ష స్థలం రాజుకి పరవశత్వాన్ని కలిగించాయి. మనసులో ఇలా అనుకున్నాడు:

‘‘ ఇతడు మానవ మాత్రుడు కాడు. మానవ రూపం ధరించి భూమి మీదకి వచ్చిన సూర్యుడో, చంద్రుడో, ఇంద్రుడో అయి ఉంటాడు.ఇతనిదేకులమో?పేరేమిటో? నాసేవకులలో ఎవరయినా ఇతనిని గుర్తు పట్టగలరేమో ?’’

విరటుడు ఇలా అనుకుంటూ ఉన్నంతలోనే, భీముడు అక్కడికి వచ్చి జయనాదంతో వినయంగా విరాట మహా రాజునకు నమస్కరించాడు. తర్వాత ఇలా అన్నాడు :

భీముడు:

‘‘ రాజా ! నేను నాలవ జాతి వాడిని. నీకు సేవ చేయాలని ఇక్కడికి వచ్చాను. నీవు మెచ్చుకునేలా వంటలు చేస్తాను. నన్ను మించిన వాడు వంటలు చేయడంలో మరొకడు లేడు.

నా పేరు వలలుడు. నాకు కూడూ గూడూ యిస్తే చాలును. నువ్వు కోరిన వంటకాలు చేసి పెడతాను. భక్తితో నిన్ను సేవిస్తాను. ’’ ఇలా అనగానే రాజు భీముడితో యిలా పలికాడు:

విరటుడు:

‘‘ నిన్ను చూస్తే నాలవ జాతి వాడిలాగా కనబడడం లేదయ్యా. నీ రూపం చూస్తే మొత్తం భూభారాన్ని వహించ గలిగే వాడివిగా కనిపిస్తున్నావు. నువ్వు వంటలు చేయడం ఏమిటి ! నీకు నేను తగిన వాహనం యిస్తాను. పీఠం సమకూరుస్తాను. వెల్ల గొడుగుని సిద్ధం చేయిస్తాను. నీకు నా కొలువులో చనువుగా మెలుగుతూ తిరగ గలిగే పదవి చేకూరుస్తాను. నా గజ సైన్యానికి నిన్ను అథ్యక్షునిగా చేస్తాను. నా ఏనుగులను పర్యవేక్షిస్తూ ఉండవయ్యా.’’

భీముడు: (తల అడ్డంగా తాటించాడు) ‘‘ రాజా ! నాకవన్నీ ఎందుకయ్యా? రాజులకు ఇంపుగా వంట చేస్తాను. నా వంట ధర్మ రాజుకి చాలా నచ్చేది. నీవు పుణ్యాత్ముడివి. అందు చేత ధర్మ రాజుని ఎలా సేవించు కున్నానో, నిన్నూ లాగే సేవిస్తాను.

నేను బలవంతుడను. అడవి దున్నలతో, ఏనుగులతో, పెద్ద పులులతో, సింహాలతో పోరాడుతాను. బలవంతులూ, మల్లురూ, వారితో పోరాడుతాను. ఒక్క గడియలో వారిని చిత్తు చేసి పారేస్తాను. నీకు వినోదం కలిగిస్తాను. నీకిష్టమైతే నన్ను నీ కొలువులో చేర్చుకో.

ఒక వేళ నీకు నా చేత కొలువు చేయించుకోవడం యిష్టం లేక పోతే నన్ను పొమ్మనటం మంచిది. నాకు నచ్చిన చోటుకి వెళ్తాను. నీ ఉద్దేశం ఏమిటో చెప్పు.’’

విరటుడు: (బ్రతిమాలే ధోరణిలో): అయ్యో, నీరూపాన్ని చూసి, నీ పరాక్రమాన్ని అంచనా వేసుకుని నీకు తగిన విధంగా చెప్పాను తప్ప , మరోటి కాదు.నువ్వు ఇక్కడ ఉండడమే మాకు ఇష్టం. సరే, నీవు వంటశాలకు అధికారిగా ఉండు. వంట వాళ్ళంతా నీ అదుసాఙ్ఞలలో ఉంటారు.’’

ఈ విధంగా పలికి, విరటుడు సంతోషంగా భీముడిని తన కొలువులో వంటల వాడిగా ఏలుకున్నాడు.

ఇక, విరటుని కొలువులోనికి పాండవ మధ్యముడు అర్జునుడు ప్రవేశించిన తీరు రేపటి హిత వచనమ్డాట్ కామ్ లో చూదాం ....

స్వస్తి. .

27, జూన్ 2010, ఆదివారం

కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 1.

పాండవులు అఙ్ఞాత వాస సమయం ఒక ఏడాదీ విరాట మహా రాజు కొలువులో గడపడానికి నిశ్చయించుకున్నాక, రాజ పురోహితుడు ధౌమ్యుడు వారికి వివిధ సేవా ధర్మాలు బోధించాడు. వాటిని గత హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లో ఉంచడం జరిగింది.( ఇక్కడ చూడ వచ్చును)

ఇక పంచ పాండవులు, ద్రౌపది - విరటుని కొలువులో ఎలా కుదురు కున్నారో వరసగా చూదాం. ఆ మహా తేజశ్శాలురు ఎంత ఉదాత్త చరితులో వారు విరటుని కొలువు లో ప్రవేశించడంలోనే తెలుస్తుంది.

( తిక్కన సోమయాజి కృత ఆంధ్ర మహా భారతం విరాట పర్వం ఫ్రథమాశ్వాసం నుండి ...)

ధర్మ రాజు :

ధర్మ రాజు ముందుగా యముని ప్రార్ధించాడు. యముని అనుగ్రహం వలన ధర్మ రాజుకి సన్న్యాసి వేషం వచ్చింది. కాషాయం బట్టలు, కమండలం, వచ్చాయి. ధర్మజుడు అచ్చం సన్న్యాసిలా ఉన్నాడు. తమ్ముళ్ళనూ, ధర్మ పత్ని ద్రౌదిని తను వెళ్ళి విరటుని కొలువులో కుదురు కున్నాక, ఒక్కొక్కరినే రమ్మని చెప్పి, తను బయలు దేరాడు.

పాచికల మూట చంకలో పెట్టుకుని మరీ బయలు దేరాడు. దేవుడి దయ వల్ల ఆ రోజు విరాట రాజు అంత:పురంలో కాకుండా, నగరంలో ఆరుబయట కొలువు తీరి ఉన్నాడు.

విరటుడు దూరం నుండి వస్తున్న ధర్మ రాజుని చూసాడు. ఇలా అనుకున్నాడు : ‘ ఆహా! ఈ వచ్చే వ్యక్తి ఎవరో కానీ, ఎంత తేజస్విగా గోచరిస్తున్నాడు ? చూడడానికి మహా ఆశ్చర్యకరంగా ఉన్నాడు. లోకాలన్నింటినీ పాలించే తేజస్సు ఇతనిలో కనిపిస్తోంది. త్రిమూర్తులతో సమానమయిన రూప సౌందర్యం ఇతనిలో ఉంది. యతీంద్రుడిలా ఉన్నాడు, చూసారా?

ఒంటి మీద రత్నాభరణాలేవీ లేవు. అన్నీ తీసి వేసినట్టుగా కనిపిస్తోంది. ఇరు ప్రక్కలా రాజ లాంఛనాలయిన మదజలధారలకి ఎగబడే తుమ్మెదల ఝంకారాలతో మదపుటేనుగులు కూడా రావడం లేదు.మహా రాజు పుర వీధిని వస్తూ ఉంటే ప్రజలను తప్పు కోండి, తప్పుకోండి అని కేకలేస్తూ అదిలించే వేత్రహస్తలూ వెంట రావడం లేదు. ఎందుకో, మరి ! ముత్యాల కాంతులు వెద జల్లే వెల్ల గొడుగులూ ఎవరూ పట్టడం లేదు. ఇతను తప్పకుండా మహా రాజై ఉంటాడు. కాని, ఎందు చేతనో, యేమో, ఏ విధమయిన రాజ లాంఛనాలూ కనబడడం లేదు. ఇతను రాజు మాత్రమే కాదు, సామంత రాజులనేకుల చేత పాద సేవలందుకునే మహా చక్రవర్తి అయి ఉంటాడు.

మన దగ్గరకి ఎందుకు వస్తున్నాడు చెప్మా ? ఈ మహానుభావుడు నన్ను ఏమి ఆఙ్ఞాపించినా కాదనకుండా చేస్తాను.బంగారాన్ని అడగనీ నూతన వస్త్రాలను అడగనీ, మణిమాణిక్యాలను అడగనీ, ఏదడిగినా ఇతడు అడిగిన దానికంటె అధికంగా ఇస్తాను. ఈ మత్స్య రాజు విభవానికి తాను తగిన వానిగా ఈతడు భావిస్తే, గౌరవ పురస్సరంగా అతడిని గౌరవిస్తాను. నా మంత్రులతో, కుమారులతో, స్నేహితులతో, భటులతో, పుర జనులతో సహా ఇతడిని భక్తితో సేవిస్తాను.... అనుకుంటూ విరటుడు సింహాసనం దిగి, కంకు భట్టుకి ( అఙ్ఞాత వాస సమయంలో ధర్మరాజు పేరు) ఎదురు వెళ్ళాడు. నమస్కరించి, అతని దీవెనలు పొందాడు.మర్యాదలు చేసి, ఉచితాసనం మీద కూర్చో పెట్టాడు. వినయంగా అతనితో యిలా అన్నాడు:

‘‘ మహానుభావా ! మీ జన్మ స్థలం ఏది ? ఏ వంశం వారు? ఇదివరకు ఎక్కడ ఉండే వారు? తమ పేరేమిటి? ఇక్కడకి ఏ కారణం చేత వచ్చేరా శలవియ్యండి.’’

కంకుభట్టు:

‘‘ ఓ విరాట రాజా ! ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళు లోకంలో ఎవరున్నారు చెప్పు? ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతారు. ఎవరయినా, ఎటువంటి వారయినా అంతగా పట్టి పట్టి చూస్తారా ఏమిటి ?

ఈ శరీరంపంచభూతాత్మకం. ఇక ఈ మనసు ఉంది చూడు, దీనికి అసలే నిలకడ లేదు. మరి అలాంటి వీటిని ఆధారం చేసుకుని సత్య నిరూపణ చేయడం ఎవరికి వీలు పడుతుంది చెప్పు?

సరేలే, నేను ద్విజుడిని కురు దేశంలో పుట్టాను. ధర్మ రాజు స్నేహితుడిని. అయితే, ఇప్పుడు మాత్రం సన్న్యాసం స్వీకరించాను. రాజులకు తగిన విధంగా వినోదాలను సమకూరుస్తూ ఉంటాను. ( ఇక్కడ, ద్విజుడు అనే పదం బ్రాహ్మణుడు,క్షత్రియుడు అనే రెండు అర్ధాలనూ బోధిస్తుంది. ఉపనయన సంస్కారం బ్రాహ్మణులకీ , రాజులకీ కూడా ఉంటుంది కదా? అందు చేత ధర్మజుడు అసత్యం పలికినట్టు కాదు.)

రాజా ! నాకు కొంచెం జూదం వచ్చు. కాని , కిట్టని వాళ్ళు మోసంతో నా చేతిలోని డబ్బుని అంతా కపట జూదంలో కాజేసారు.అంతే కాదు అవమానించేరు కూడ. దానితో నాకు విరక్తి కలిగింది. నా స్వస్థలం విడిచి వచ్చేసాను.

రాజా! నాకు నీతి విద్య తెలుసు. ఆ నేర్పు నాకు ఉంది. పైగా, ధర్మ బుద్ధి కల వారితో సఖ్యంగా ఉంటాను. నా పేరు కంకుడు. నేను కంకుభట్టును. నేను నీచమయిన కొలువు చేయను సుమా ! అలాంటి కొలువులో ఉండడం నాకు యిష్టం ఉండదు. రాజులందరిలో నువ్వు సజ్జనుడవని విన్నాను. అందు చేత నీ కొలువులో చేరి, నిన్ను సేవించడానితకి వచ్చాను.

మరో విషయం. నాకొక వ్రతం ఉంది. వ్రత కాలం ఓ ఏడాది. ఆఏడాది వ్రతం నీ దగ్గరే పూర్తి చేసుకుంటాను.అలా చేయనిస్తే నీకు నా ధన్యవాదాలు తెలుపుకుంటాను.ఈ ఏడాది వ్రత కాలం పూర్తయాక నాకు అపకారం చేసిన వారి జయించడానికి ఉత్సాహంగా వెళ్తాను.’’

విరటుడు:

‘‘ అలాగే చేయండి. ఉన్నతమయిన ఆసనాలు, వాహనాలు, బట్టలు ఇంకా ఇతర భోజనాది మర్యాదలూ నాకు ఎలా జరుగుతూ ఉంటాయో, నీకూ అలాగే జరిగేలా జరిపిస్తాను.నా సేవకులలో ఎవడయినా నీ పట్ల భయ భర్తులు లేకుండా ప్రవర్తించాడంటే ఆ నీచుడిని కఠినంగా శిక్షిస్తాను. వాడు ఎంత ప్రసిద్ధుడవనీ దండన తప్పదు.

అంతే కాదు, నువ్వు ఈ మత్స్య దేశాన్ని పాలించడం నాకు సమ్మతం. నువ్వు దేవంద్రుడితో సమానుడివి. నా తమ్ముళ్ళు, బంధువులు, మంత్రులు, నాబలగం, నేనూ నిన్ను అతి భక్తితో సేవించుకుంటాం. ఆ అవకాశాన్ని నీవు మాకు ఇప్పించ వలసిందిగా కోరుతున్నాను.’’

ఆ మాటలకు ధర్మ రాజు నవ్వి యిలా అన్నాడు:

‘‘రాజా !హోమార్హమయిన పవిత్ర పదార్ధాలనే నేను భోజనంగా స్వీకరిస్తాను. నేల మీదనే పడుకుంటాను. నేను వ్రతాచరణం చేసే వాడిని. నాకు నువ్వు చెబుతున్న మర్యాదలేవీ వద్దు.

విరటుడు:

సరే. అలాగే కానివ్వండి. మీ యిష్ట ప్రకారం ఏలా ఉండాలనుకుంటారో అలాగే ఉండండి. నచ్చినన్ని రోజులు ఉండండి. మీరెలా ప్రవర్తించినా నాకు యిష్టమే. మీ హోదాకి తగినట్టుగా సుఖంగా ఉండండి.

జూదం తెలిసిన వాళ్ళంటే నాకు చాలా యిష్టం అదీ కాక, మీరు పెద్దలు. మీ యిష్టమే నా యిష్టం. అదే నాకు ఆనందం.’’

ఇలా, ధర్మజుడు కంకుభట్టు పేరుతో విరాట రాజు కొలువులో ప్రవేశించాడు.


ఇక, పాండవులలో రెండవ వాడు భీముడు విరటుని కొలువులో ఎలా కుదురు కున్నాడో రేపటి హిత ‘వచనమ్’ డాట్ కామ్ లో చూదాం ...

స్వస్తి.



23, జూన్ 2010, బుధవారం

అచ్చులో వచ్చిన నా తొలి కథ ... బహుమతి

ఇది అచ్చులో వచ్చిన నా తొలి రచన. ఆంధ్ర ప్రభ , సచిత్ర వార పత్రిక తే 13-7-1966 దీ సంచికలో ప్రచురించ బడింది. నా తొలి రచన దాదాపు 40 సంవత్సరాల క్రిందట యిదే (జూన్) నెలలో అచ్చులో వచ్చింది.

ఈ కథ జోగ్ అనే కలం పేరుతో రాసేను. తరవాత మళ్ళీ ఆ కలం పేరుతో మరేమీ రాయ లేదు. అప్పట్లో ఆంధ్ర ప్రభ వారు నాకథకు బహుమతిగా ( Remmuniration) రూ. 25 లు పంపించారు.

ఈ కథ పడిన నాటి సంతోషం నాలో యింకా తాజాగానే ఉంది ... కాకి పిల్ల కాకికి ముద్దు కదూ?



22, జూన్ 2010, మంగళవారం

మీ దయ వల్ల మేం బ్రతికి పోయాం ! .... మంచి మాట


ఆంధ్ర మహా భారతం విరాట పర్వం ( తిక్కన సోమయాజి రచన) ప్రథమాశ్వాసం నుండి)


పాండవుల అరణ్యవాసం ముగిసింది. ఇక మిగిలింది అఙ్ఞాతవాసం. ఆ ఒక్క ఏడాదీ విరాట మహా రాజు కొలువులో గడపడానికి నిశ్చయమయింది. సరే. మారు వేషాలలో ఎవరికీ అనుమానం రాని విధంగా అఙ్ఞాతంగా గడపాలి. విరటుని కొలువులో ధర్మ రాజు కంకు భట్టు గానూ, భీముడు వలలునిగానూ,అర్జునుడు బృహన్నలగానూ, నకులుడు దామగ్రంధి గానూ, సహదేవుడు తంత్రీపాలుడు అనే పేరుతోనూ వ్యవహరించడానికి నిర్ణయాలు తీసుకున్నారు.

ఆ సమయంలో రాజ పురోహితుడు ధౌమ్యుడు పాండవులకు కొన్ని సేవా ధర్మాలు తెలియ జేసాడు.

నేటి హిత ‘ వచనమ్’ డాట్ కామ్ లో వాటి గురించి ....

లోకంలో తెలిసిన వారు చాలమంది ఉంటారు. కాని, శ్రేయోభిలాషులయిన వారు అట్టి విఙ్ఞు లకు అదనెరిగి తగిన బుద్ధులు చెప్ప వలసినదే.

మీరు ఉన్నతమయిన కౌరవాన్వయంలో పుట్టిన వారు. అలాంటి మీరు ఒక సామాన్య మానవ మాత్రుని సేవిస్తూ , మానావమానాలను సహిస్తూ, అణగిమణగి సవినయంగా ఉండడం కష్టమే.

రకరకాలయిన అస్త్రాలు మంటల వంటివి. వాటిని ధరించే పాండవులు అగ్నుల వంటి వారు. అట్టి మీరు కాల విరోధాన్ని మరచి పోకూడదు సుమా ! కాదని మరచి పోతే, బాహాటంగా మీ పరాక్రమాన్ని ప్రకటిస్తే మీ ఉనికి తెలిసి పోతుంది. కార్యం చెడి పోతుంది. అఙ్ఞాత వాసం భంగమవుతుంది.

కనుక నాకు తెలిసినంత మేరకు మీకు కర్తవ్యం ఉపదేశిస్తాను. వినండి.

రాజ సభలోకి తగిన విధంగా అడుగు పెట్టాలి. తనకు తగిన ఆసనంలో కూర్చోవాలి.తన రూపంలో కాని, వేషంలో కాని ఏ మాత్రం తేడా ఉండ కూడదు. అంటే, వికృతత్వం లేకుండా చూసుకోవాలి. వేషానికి భిన్నంగా వేషధారణ పనికి రాదు. సమయం తెలుసుకుని మసలు కోవాలి.రాజ సభలో ప్రసంగించేటప్పుడు సమయం చూసి. తనకు అవకాశం దొరికినప్పడు మాత్రమే ప్రసంగించాలి. అలా చేస్తే ఎవరయినా రాజుకి గౌరవపాత్రుడవుతాడు.

రాచ కొలువువ ఉన్నాను కదా, రాజుతో చనువుగా తిరుగుతున్నాను కదా అని, నాకేమిటి అనే భావనతో నిర్భయంగా మర్యాదను అతిక్రమించి నడుచుకో కూడదు. అలాగయితే, మొదటికే మోసం వస్తుంది.

రాజగృహం కన్నా అందమయిన ఇల్లు కట్టుకో కూడదు. అలాగే రాజు గారిలా దుస్తులు ధరించ కూడదు. రాజు మాట్లాడే విధంగా మాట్లాడడం తగదు. అంటే వీటి వేటి లోనూ ఎంత మాత్రం రాజుని అనుకరించ కూడదు. సేవకుడు ఎట్టి పరిస్థితి లోనూ రాజు దగ్గర తన ఆధిక్యాన్ని చూపించ కూడదు. అణకువగా జీవించాలి.

ఎందుకంటే, రాజు ధిక్కారాన్ని సహించడు. తన ఆఙ్ఞను అతిక్రమించే వాడు కొడుకవనీ, మనుమడవనీ, సోదరుడవనీ, స్నేహితుడవనీ రాజు అంగీకరించడు. తన మేలు కోసం, భద్రత కోసం వారిని తన శత్రువులు గానే పరిగణిస్తాడు. వారి మీద కోపం పెంచుకుని వారి అంతు చూస్తాడు.

ఏదయినాసరే సాధించుకో గలిగే సమర్ధుడి పనికి అడ్డు వెళ్ళ కూడదు. తగుదునమ్మా అని ఆ పని తనమీద వేసుకుని నేర్పును ప్రదర్శిస్తూ పూసుకుని తిరుగ కూడదు. దాని వలన అసలు స్థితికి ముప్పు వస్తుంది.

రాజుతో సన్నిహితంగా ఉండడంలో తప్పు లేదు. కాని రాజు దగ్గర చాలమంది ఉంటారు వారికి కష్టం కలిగించే పనులలో మాత్రం జోక్యం చేసుకోవడం తగదు. అలా చేయడం వల్ల ఆ సేవకుడి గొప్పతనం వెల్లడి కావచ్చును. సమర్ధత తెలియ వచ్చును. పేరు ప్రతిష్ఠలు రావచ్చును. కాని ఆ తర్వాత హాని కలగడం మాత్రం తథ్యం. అందు వలన తెలివయిన వారు అలాంటి పనులకు పూనుకొనరు.

రాజు దగ్గర మౌనంగా ఉండ కూడదు. అలాగని పదిమందితో ఆర్భాటంగా మాట్లాడ కూడదు. సన్నిహితులయిన సేవకులతో పాటు తాను రాజుతో మాటలాడడం సబబు.

రాజు కొలువులో ఉన్నప్పుడు వ్యతిరేకత తోచే విధంగా ఇతరులకు జవాబులు చెప్ప కూడదు. అవసరమయినప్పుడు మాత్రం తనంతట తానే ముందుకు వచ్చి రాజాఙ్ఞను నిర్వర్తించాలి.

సభలో ఎప్పుడై రాజునకు మరీ ఎట్ట ఎదురుగా నిలబడ కూడదు. అలాగని వెనుకవేపూ ఉండ కూడదు. ఏదో ఒక ప్రక్కగా నిలబడి సేవించాలి. సదా రాజు ముఖం లోకే చూస్తూ ఏమంటాడో, ఎటు చూస్తాడో, ఎవరిని చూస్తే ఎటువంటి ఆలోచన కలుగుతుందో - వీటన్నింటినీ మనసులో ఉంచుకుని జాగురూకతతో మెలగాలి.

రాజాంత:పురంలోని మాటలు ఎప్పుడూ బయటపెట్ట కూడదు. గుట్టు పాటించాలి. వేరే ఎక్కడయినా రాజుకి సంబంధించిన మాటలు వినబడితే ముందుగా బాగా ఆలోచించాలి. ఆతర్వాత అవి రాజువినదగినవయితే వాటిని రాజు చెవిని వేయాలి.అప్రియమయిన విషయాలు ఎప్పుడూ రాజుకి చెప్ప కూడదు.

రాజాంత:పురంలో రకరకాల వారుంటారు. అక్కడ తిరిగే గూని వారు, కుబ్జలు ( వామనులు) పరిచారికలు మొదలయిన వారితో స్నేహం పనికి రాదు. భటుడికి అంత:పురంతో సంబంధం మంచిది కాదు.

రాజు అనుమతిస్తేనే ఆసనం ఎక్కి కూర్చోవాలి. అలాగే వాహనాలు కూడా. రాజు అనుగ్రహించకుండా పెద్ద పెద్ద వాహనాలను తమంతట తాము ఎన్నుకోవడం, ఎక్కడం తగదు. రాజు దగ్గర ఎంత గౌరవాదరాలు ఉన్నప్పటికీ అది తగని పని.

రాజు తనను గౌరవించాడు కదా అని పొంగిపో కూడదు. ఉబ్బితబ్బిబ్బయిపో రాదు. అలాగే అవమానించినప్పుడు అయ్యో, రాజు అవమానించాడు కదా అని క్రుంగిపోనూ కూడదు. మానావమానాలను సమానంగా పరిగణిస్తూ రాజు దగ్గర మెలిగితే సేవకులకు మంచి జరుగుతంది. ఆపదలు తొలిగి పోతాయి.

ఒక్కోసారి రాజు ఎవరినయినా సంరక్షించాలని అనుకుంటాడు. లేదా, శిక్షించాలని అనుకుంటాడు. ఆ సంగతి ముందే తనకు తెలిసినా అవి అమలు కాక ముందే తనంతట తానుగా వాటి గురించి వెల్లడి చేయ కూడదు. అలా చేసే వాడు మూర్ఖుడు.

ఎండకూ , వానకూ ఓర్చు కోవాలి. తన ఇల్లు, పరాయి కొంప అని అనుకో కూడదు. ఆకలి వేస్తుంది, అలసి పోతాను, నిద్రా సమయం మించి పోతుంది, దాహం వేస్తున్నది ఈ పనంతా ఒక్కడినే ఎలా చేయడం, ఇదేమిటి రాజు నాకు ఈపని ఇప్పుడు పురమాయించేడు ... ఇలా సేవకుడు ఎప్పుడూ ఆలోచించ కూడదు. అనుకో కుండా రాజు ఒక పని చెప్తే భక్తి శ్రద్ధలతో చేయాలి. నెపాలు వెతక కూడదు.

రాజునకు ఎంత ఆప్తుడయినా కావచ్చును. కాని, రాజధనాన్ని పాము ఎముకల లాగా చూడాలి. వాటిని సంగ్రహించే బుద్ధి మానుకోవాలి. లేక పోతే ధన, మాన ప్రాణాలు నిలవవు. వాటికి ముప్పు కలుగుతుంది. ( పాము ఎముకలు విషతుల్యాలు కనుక, వాటిని తాక రాదని లోక ప్రసిద్ధి.)

రాజు కొలువు తీరినప్పుడు సేవకుడు బహిరంగంగా ఆవులించ కూడదు. తుమ్మ కూడదు. నవ్వడం అసలే పనికి రాదు. నిష్ఠీవనం ( ఉమ్మి వేయడం) నిషిద్ధం. వీటి వల్ల ప్రక్క వారికి యిబ్బంది. చిరాకు. కాబట్టి వీటిని తప్పని సరయితే గోప్యంగా చేయాలి.

శత్రువుల దూతలు, రాజు ఆగ్రహానికి గురయిన వారు, రాజు చేత నిరాకరించబడిన వారూ, పాపాత్ములూ ఎప్పుడూ తమకు దగ్గరగా ఉండ కూడదు. అంటే, వారిని చేరదీయ కూడదు. దాని వలన చివరకు నింద రావడమే కాక, కీడు కూడ కలుగుతుంది.

రాజు దగ్గర మెలిగే వారెవరితోనూ వైరం పనికి రాదు. చివరకి ఏనుగుతోనయినా, దోమతోనయినా సరే. అంటే గొప్ప వారితో నయినా, సామాన్యులతో నయినా వైరం కూడదు. రాచ కొలువునకు చెందిన వారితో స్నేహంగా ఉండడం మేలు.

సంపదలు అనుభవించడానికే కదా అని, మన దగ్గర ఉంది కదా అని, రాజునకు తెలిసేలా విచ్చలవిడిగా భోగాలు అనుభవించ రాదు. రాజునకు కంటగింపుగా ఉండేలా భోగాలు అనుభవించకుండా, వినమ్రతతో వేడుకలు చేసుకోవాలి.


ఇలా ధౌమ్యుడు చేసిన హిత బోధలు విని పాండవులు చాల సంతోషించారు. సంతోషించి అతనితో యిలా అన్నారు: ‘‘ మాకు తల్లయినా, తండ్రయినా, దైవమయినా, మిత్రులయినా మీరే ! మేము విరటుని కొలువులో ఉండేటప్పుడు ఎలా మెలగాలో చక్కగా బోధించారు. మేము పాటించ వలసిన నడవడిక పద్ధతులను ఎంతో చక్కగా, స్పష్టంగా వివరించారు. నిజం చెప్పాలంటే, మీ దయ వల్ల మేము బ్రతికి పోయాం ... ’’


మరి కొన్ని ... తదుపరి హిత ‘వచనమ్’ డాట్ కామ్ లో చూదాం ...

స్వస్తి.


18, జూన్ 2010, శుక్రవారం

ఏక మాపాత మధురమ్ .....

ఈ రోజు టపా ఏం పెడదామా ? అని ఆలోచిస్తూ, ఒక చక్కని మధుర సంగీతాన్ని మిత్రులతో పంచుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అయితే, బ్లాగులో అందరూ ఆడియోని ఎలా పెడుతున్నారో తెలిసింది కాదు. DivShare ప్రయత్నించాను. సంగీతాన్ని up load చేయడం వరకూ చేయ గలిగాను. తర్వాత దానిని నా బ్లాగులో ఎలా పెట్టాలో అర్ధం కాక, జ్యోతి గారిని అడిగాను. ఆమె చెప్పిన విధంగా చేసాను. ఆమెకి ధన్యవాదాలు చెబుతూ ....

సరే, యిదంతా సొంత ఘోష. దాన్నలా ఉంచి మీరూ ఈ మధుర నాద స్వరాన్ని ఆస్వాదించండి.

సంగీతమపి సాహిత్యం సరస్వత్యా: స్తన ద్వయం
ఏక మాపాత మధరం , అన్యదాలోచనామృతమ్

అని పెద్దలు చెప్పారు కదా. సాహితీ సంబంధమయిన నా బ్లాగులో నా ముచ్చట కొద్దీ తొలిసారిగా చక్కని సంగీతాన్ని అందించే ప్రయత్నమిది ....













17, జూన్ 2010, గురువారం

మంచి మాట

(ఆంధ్ర మహా భారతం సభా పర్వం ప్రథమాశ్వాసం నుండి)

మయుడు నిర్మించి యిచ్చిన సభలో పాండవులు ప్రవేశించారు. ఆ సమయంలో నారద ముని వచ్చి ధర్మ రాజుతో కొన్ని రాజనీతి విషయాలు ముచ్చటిస్తాడు. వాటిని ఇంతకు ముందు హిత వచనమ్ డాట్ కామ్ టపాలో ఉంచాను. వాటిని ఇక్కడ చూడ వచ్చును.

ఇక ... మరి కొన్ని ....

జరాసంధుని వధకు బయలు దేరే ముందు భీమ సేనుడు, అర్జునుడు ధర్మ రాజుతో పలికిన పలుకులు :

లోకంలో ప్రయత్నమే చేయని వానికి ఎప్పుడూ సిరి సంపదలు లభించవు. పురుషుడు బలహీనుడయినా సరే, ప్రయత్నం చేసే స్వభావం కలిగి ఉండాలి. అలాంటి స్వభావం కలవాడు, అసలు ప్రయత్నమే చేయని వాడిని, వాడు ఎంతటి బలవంతుడయినా జయించ గలడు.

పరాక్రమవంతుని రూప గుణ సంపదలు లోక ప్రసిద్ధాలై రాణిస్తాయి. పరాక్రమం లేని వాడికి అవన్నీ ఉన్నా ( రూప, గుణ, సంపదలు) అవి లేనట్లే కాంతి హీనాలవుతాయి.

ఓ ధర్మ రాజా ! శాస్త్రంలో చెప్ప బడిన విధంగా ధర్మ పద్ధతిలో పరాక్రమాన్ని ప్రదర్శించాలి. బద్ధి బలం, పురుష ప్రయత్నం చేసే పురుషులకు ఇది తప్పక చేయ వలసిన కర్తవ్యం సుమా !


( ద్వితీయాశ్వాసం నుండి ...)

ధర్మజుడు ఒనర్చిన రాజ సూయ యాగాన్ని చూసి. ఆనందించి , భీష్ముడు అగ్రపూజ ఎవరికి చేయడం సముచితమో ధర్మ రాజుకి వివరిస్తూ ....

ఓ ధర్మ రాజా ! స్నాతకుడు, , ఋత్వికుడు , సద్గురుడు , ఇష్టుడు , భూపాలుడు, ఙ్ఞాన సంపన్నుడు - వీరందరూ పూజార్హులు. వీరిలో సద్గుణాల చేత ఎవడు అధికుడో అలాంటి వాడిని ఒక్కని పూజించు. వానికి అగ్రపూజ చేయి.

శిశుపాలుడు శ్రీ కృష్ణునకు ధర్మజుడు అర్ఘ్యప్రదానం చేయడాన్ని నిరసిస్తూ పలు చెనటి మాటలు పలుకుతాడు. అప్పుడతనితో ధర్మజుడు అననయ పురస్సరంగా పలికిన మాటలు :


గొప్ప గుణాల చేత శ్రేష్ఠులని చెప్ప దగిన వాళ్ళకు, పండితులకు , ప్రభువులకు ఈ విధంగా కఠినంగా మాటలాడడం తగదు. పలుకు కాఠిన్యం విషం కంటె , అగ్ని కంటె కూడ అతి భయంకరమయినది సుమా !
ఓ శిశుపాలా, పరమార్ధ తత్వాన్ని భీష్ముడు అవగతం చేసి కొన్నట్టుగా నీకు అర్ధం కాదు. ఎక్కడయినా మహాత్ముల చరిత్రలు అల్పులు తెలుసుకో గలరా ?

భీష్ముడు:

ఈ శిశుపాలుడు మితి మీరిన చెడు నడత కలవాడు. అపరిపక్వ బుద్ధి కలవాడు. అసూయ, క్రోధావేశాలు ఇతనిలో మితి మీరాయి. తనకి గల కొద్ది రాజ్య సంపద చేతనే వివక్ష కోల్పోయి, అహంకరిస్తున్నాడు. మహాత్ములను నిందించే స్వభావం కలవాడు. ఇలాంటి వాడికి ధర్మ తత్వం తెలుసు కోవడం సాధ్య పడదు.

భీష్ముడు శిశుపాలునితో:

ఉత్తమ ఙ్ఞాన సంపద చేత ఎవడయితే గొప్ప వాడో, అట్టి వాడు వయస్సు చేత బాలుడయినా, బ్రాహ్మణుడు పూజింప దగిన వాడే. అపరిమితమయిన పరాక్రమంతో రాజుల్లో అధికుడయితే క్షత్రియుడు కూడ పూజార్హుడే.

వయోవృద్ధులయిన వాళ్ళు ఒక లక్ష మంది ఉండ వచ్చును. కాని, ఎవరినయినా వారి ఙ్ఞానాన్ని బట్టి మాత్రమే పూజిస్తాం.

శిశుపాలుడు భీష్ముని తూలనాడుతూ ....

ఈ భీష్ముడొక వెర్రి ముసలి వాడు. గుణహీనుడయి శ్రీకృష్ణుని అకారణంగా పొగుడుతన్నాడు.ధర్మ తత్వాలు పాండవులకే తెలుసునట ! ఇతని మాట విని కృష్ణుడికి ధర్మ రాజు అర్ఘ్యం ఇచ్చాడు.తన అర్హత ఎలాంటిదో తెలుసుకోకుండా కృష్ణుడు దానిని స్వీకరించాడు. బాగుంది. ఓడతో కట్టిన ఓడలాగా తన గౌరవాన్ని కోలుపోయి మాట తూలుతున్నాడు. ఇలాంటి దుర్మార్గులు ఎక్కడా లేరు. ఇక్కడ రాజులు చేత కాని వాళ్ళా ఏమిటి ?

కృష్ణుడి గొప్పదనం ఏపాటిదో తెలిసిందే కదా ? పూతన అనే ఒక ఆడుదాన్ని చంపాడు. ప్రాణం లేని బండిని (శకటాసురుడుని) కాలితో తన్ని సంహరించాడు. సారం లేని ( మద్ది) చెట్లను విరిచాడు. పుట్టంత చిన్న కొండను ( గోవర్ధన పర్వతాన్ని) పెద్ద బలవంతుడిలా ఏడు రోజులపాటు ఎత్తాడు. ఎద్దుని (వృషభాసురుడి ని) చంపాడు. ఇవా ఇతని పరాక్రమాలు ? హవ్వ ! వీనిని పొగుడుతున్న నీ నాలుక వంద చీలికలు కావాలి.అప్పుడింకా బాగా పొగడ గలవు. ..
స్త్రీలను, గోబ్రాహ్మణులను, అన్నం పెట్టే వారిని, నమ్మిన వారిని చంపడం మహా పాతకమని చెబుతారు. ఈ పాపాలన్నీ గోవిందుడు చేసాడు కదా ? అలాంటి వీనికి అర్ఘ్యం యిప్పించడం తప్పు కాదూ? అంతే కాదు, వేరొకరిని ప్రేమించిన కన్యను ( అంబని) బలిమిని తన తమ్ముడికి కట్టబెట్టడానికి తెచ్చాడు. . మరో సంగతి. నువ్వు అనపత్యుడివి. నీకు పిల్లలు లేరనే దోషం ఉంది. అలాంటి నువ్వు చెప్పేధర్మాలు ప్రజలు ఎలా పాటిస్తారు ?

ఓ గాంగేయా ! ఇతరులను పొగడడం, నిందించడం, తనను తాను పొగుడు కోవడం, నిందించు కోవడం ఇవన్నీ చెయ్య కూడని పనులని పెద్దలు చెప్పారు.

( గమనిక: శిశుపాలుడు పలికిన వన్నీ కఠినోక్తులు. వీటిని హిత వచనమ్ డాట్ కామ్ లో ఎందుకు చేర్చావయ్యా అంటే ....శిశుపాలుడు తాను ఆచరించినా, ఆచరించక పోయినా పెద్దలు చెప్పిన హిత వచనాలను కొన్నింటిని తన వదరుబోతు తనంతో అయినా వల్లించాడు కదా? అదీ కాక, అహితం తెలిస్తే హితం గొప్పతనం మరింతగా ప్రకాశిస్తుంది మరి !)


ఇక, కపటజూదానికి రంగం సిద్ధమయింది. ఆ సందర్భంగా ధర్మజుడు దుర్యోధనునితో పలికినది:

మోసం , జూదం - ఇవి రెండూ కూడా క్షత్రియ ధర్మానికి తగినవి కావు. ధర్మాన్ని ఆచరించే వారు ఈ రెండింటినీ వదిలెయ్యాలి. అంతే కాక, మోసపు మార్గాలు అనుసరిస్తూ జూదం ఆడే నీచపు జూదగాళ్ళతో జూదమాడ కూడదు. దాని వలన లోకంలో ఎటువంటి వారయినా ధనం, ధర్మం కోల్పోతారు. అంతే కాదు, కపటపు జూదంలో గెలవడం మహా పాపమని, ధర్మంగా ఆడిన జూదంలో గెలవడం ధర్మ యుద్ధంలో గెలిచినంత పుణ్యమని అసితుడయిన దేవలుడు కూడ చెప్పాడు.

అప్పుడు శకుని ధర్మ రాజుతో పలికినది:

ఇదేం మాట ! బలహీనులను బలవంతులు ఎన్ని మోసాలతోనయినా ఓడించడం లోక సహజమే కదా? లోకంలో ఏ విధంగానయినా జయాన్ని సాధించాలి.

కపట జూదం ఆపించే ప్రయత్నంలో విదురుడు దుర్యోధనునితో:

చెడిపోయేలా ఎవరయితే చెడ్డ బుద్ధులు చెబుతారో, వారే నీకు స్నేహితులు. నీలాంటి వాడికి మాలాంటి వారు చెప్పే హితవచనాలు చెవికెక్కవు,

అంతేలే. లోకంలో వినడానికి ఇంపుగా ఉండే మాటలు పలికే వాళ్ళనే ఎక్కువగా మెచ్చుకుంటారు. మేలు చేసేదయినా వినడానికి ఇంపుగా లేక పోతే ఎవరూ వినడానికి యిష్టపడరు అందు చేత ప్రతిభావంతులు కూడ కటువైన మాటలు చెప్పడానికి వెనుదీస్తారు.


( ఇది హితం మనోహారిచ వచం దుర్లభ: ... అనేసూక్తి వంటిది.)

అయితేనేం? మొదట వినడానికి ఇంపుగా ఉండక పోయినా, చివరకి మేలు చేసే మాటను ఇష్టులైన వారు ఏ మాత్రం మొగమాటం లేకుండా బలవంతంగానయినా చెప్పాలి. అది ధర్మం. అలాంటి వాడే రాజుకి తగిన సహాయకారి అవుతాడు.

ధర్మజుడు జూదంలో ద్రౌపదిని ఓడాడు. ఆమెను తీసుకు రమ్మని ముందుగా దుర్యోధనుడు విదురుడిని కోరుతాడు ఈ దుర్విదగ్ధత సహించ లేక విదురుడు దుర్యోధనుడితో :

మూర్ఖుడా ! పొగరెక్కి మలినమైన మనస్సు కలవాడు , ఆయువుపట్టును నొప్పించే క్రూరుడు , ... యిలాంటి వారి సంపదలు నశించి పోతాయి.


ఇక, ద్రౌపది సభ వారిని తాను ధర్మ విజితనా , అధర్మ విజితనా అని అడిగిన దానికి పెద్దలు సమాధానం చెప్పి తీరాలని వికర్ణుడు అంటాడు.

అతని మాటలను సమర్ధిస్తూ విదురుడు పలికినది:


సభకు వచ్చి ఎవరయినా ధర్మ సందేహం అడిగితే సభ్యులలో ఎవరయినా తెలిసిన వారు దాని గురించి చెప్పాలి. అలా తెలిసీ చెప్పక పోతే, అసత్యం ఆడడం వల్ల కలిగిన ఫలితంలో సగాన్ని పొందుతారు.

ధర్మాన్ని తెలిసి కూడ, లాభాపేక్షతోనో , లోభం చేతనో , ఊగిసిలాడే బుద్ధి చేతనో ఎవరయినా దానిని మరొక విధంగా పలికితే అతను అసత్యమాడే దోష ఫలితాన్ని అనుభవిస్తాడు.

ధర్మం అధర్మం చేత బాధించబడి సభకు వస్తే సభ్యులు దానిని తీర్చాలి. లేక పోతే వారు అధర్మం చేత బాధించబడుతారు. సభ్యులు కామక్రోధాదులు విడిచి అధర్మాన్ని ఆపాలి. అలా చేయని నాడు ఆ అధర్మంలో నాల్గవ భాగం ఆ సభ్యులకు , మరొక నాల్గవ భాగం రాజునకు, మిగిలింది కర్తకు సంక్రమిస్తుంది. అందు చేత అడిగినప్పుడు తెలిసిన సభ్యులు తప్పక ధర్మం చెప్పాలి.


ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలు యిచ్చాడు. ద్రౌపది ముందుగా ధర్మరాజుకు దాస్య విముక్తిని వరంగా కోరుకుంది. రెండవ వరంగా ధర్మజుని నలుగురు తమ్ములకు దాస్యం నుండి విముక్తి కోరింది. రాజు యిక మూడవ వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు ద్రౌపది యిలా అంది :

రాజా ! వైశ్య స్త్రీ ఒక వరం, ఉత్తమ క్షత్రియ స్త్రీ రెండు వరాలు , శూద్ర స్త్రీ మూడు వరాలు , బ్రాహ్మణ స్త్రీ వంద వరాలు కోరుకో వచ్చును. అందు వలన నేను రెండు వరాలు తప్పితే మూడోది కోరుకో కూడదు.


రాజు సంతోషించి: అమ్మా, నీవు ధర్మఙ్ఞవు. నీకు నేను బోధించ వలసిన నీతులు వేరే ఏమీ లేవు.
మనసులో వైరాన్ని తలచక పోవడం, ఓర్పు కలిగి ఉండడం, గుణాలు స్వీకరించి, దోషాలను విడిచి పెట్టడం ఇవి గొప్ప వ్యక్తి లక్షణాలు. ఇవన్నీ నీకు ఉన్నాయి. తల్లీ వర్ధిల్లు..


ఇవీ ఈనాటి హితవచనాలు ....


మరి కొన్ని ... తదుపరి హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లో చూదాం ...


ఇప్పటికి స్వస్తి.









16, జూన్ 2010, బుధవారం

మంచి మాట


( మహా భారతం ఆది పర్వం అష్టమాశ్వాసం మందపాలోపాఖ్యానం నుండి.)

మందపాలుడు ఒక మునివర్యుడు. అతని భార్య జరిత. ఒక లావుక పక్షి. వారి కుమారులు నలుగురు. జరితారి, సారిసృక్కు , స్తంబ మిత్రుడు, ద్రోణుడు వారి పేర్లు.

ఖాండ దహనం జరుగుతోంది. అగ్ని అడవంతా వ్యాపించింది. అక్కడ ,చిక్కుకు పోయారు, జరితారి, అమె నలుగురు కుమారులు. మందపాలుడు తన వారిని కాపాడుమని అగ్ని దేవుని వేడుకుని ముందే తపశ్చర్య కోసం వెళ్ళి పోయాడు. ఆ సంగతి వీరికి తెలియదు.

చుట్టు ముట్టే అగ్ని కీలలనుండి తన బిడ్డలను ఎలా కాపాడు కోవాలో తెలియక జరితారి విలపిస్తుంది. చివరకి వారిని ఒక బిలం లోనికి ప్రవేశించ మంటుంది . దానిని తాను దుమ్ము ధూళితో కప్పి వేసి కాపాడుతానంటుంది. అప్పుడు ఆమె కుమారులలో పెద్దవాడయిన జరితారి తల్లికి చెప్పిన ధర్మ సూక్ష్మం యిది.


అమ్మా, నీవు చెప్పినట్టుగానే మేము ఈ బిలం లోకి ప్రవేశిస్తే మమ్మలని అందులో ఉండే ఎలుక తిని వేస్తుంది. అది తప్పదు. ఎలుక చేత చంపబడటం కన్నా, అగ్ని దేవుడికి ఆహుతయి మేము పుణ్య లోకాలకి పోతాము.

కష్ట కాలంలో ఏది నియతకార్యమో ( అంటే, ఏది తప్పకుండా జరిగి తీరుతుందో ) అది చేయ కూడదు. దానిని విడిచి పెట్టాలి. మేము కన్నం లోకి వెళ్తే అందులో ఉండే ఎలుక మమ్మలని తిని వేయడం నియతం. కనుక మేము ఆ పని చేయ కూడదు. కష్ట కాలంలో ఏది అనియత కార్యమో ( అంటే ఏది అనుమానాస్పదమో.) ఆ పని చేయాలి. అది ఎలాగంటే, మేము ఇక్కడే ఉంటే అగ్నికి ఆహుతి కావడం నిజమే కానీ, ఒక వేళ గాలి వల్ల అగ్ని చెదిరి పోయి మేము బయట పడే వీలు కూడా ఉంది. అప్పుడు మేము బ్రతికే వీలు ఉంది. అగ్ని వలన భయం సందేహాస్పదం. కష్ట కాలంలో అనియత కార్యాలనే చేయాలి. నియత కార్యాలను విడిచి పెట్టాలి.

మరో విషయం ... నువ్వు చెప్పినట్టుగా మేము బిలం లోనికి వెళ్ళం. నీవు మామీద మమకారం విడిచి వెళ్ళిపో. ఒక వేళ మేము అగ్నికి ఆహుతి అయినా, నీవు జీవించి మళ్ళీ పుత్రులను కన వచ్చును. లేదూ, నీ పుణ్యఫలం వల్ల మేము బ్రతికామనుకో, అప్పుడు ఎప్పటి లాగే నీవు మమ్ములను సాకవచ్చును.

జరితారి ఈ మాటలన్నాక జరిత ఆకాశం లోకి ఎగిరి పోయింది. నలుగురు కుమారులూ అగ్ని దేవుని నాలుగు వేదాలలోని మంత్రాలతో నుతించారు. మందపాలుడు ముందే చెప్పడం వల్ల అగ్ని దేవుడు వారున్న ఆ చెట్టుని దహించి వేయకుండా పరిహరించాడు. జరిత తిరిగి వచ్చి తన కుమారులను కలుసుకుంది.

కష్ట కాలంలో మానవులకు కర దీపికలా ఉపయోగించే చక్కని ఈ సూక్తి నన్నయ గారి
నానా రుచిరార్ధసూక్తినిధిత్వానికి మచ్చు తునక !

మరి కొన్ని తదుపరి హిత ‘ వచనమ్ ’ డాట్ కామ్ లో చూదాం ...

స్వస్తి.

15, జూన్ 2010, మంగళవారం

శ్రీ. శ్రీ వర్ధంతి

నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరి పోతే
నిబిడాశ్చర్యంతో వీరు.

నెత్తురు కక్కు కుంటూ
నేలకు నే రాలి పోతే
నిర్దాక్షిణ్యంగా వీరె !