2, జులై 2010, శుక్రవారం

కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 6


అఙ్ఞాత వాసం ఒక్క ఏడాదీ విరాట మహా రాజు కొలువులో గడపడానికి నిర్ణయించుకున్నాక, పాండవులు ఒక్కొక్కరూ మారు వేషాలలో వచ్చి, విరటుని కొలువులో చేరారు.

ధర్మ రాజు , భీముడు , అర్జునుడు , నకులుడు , సహ దేవుడు వరుసగా కంకు భట్టు , వలలుడు ,బృహన్నల , దామగ్రంథి ,తంత్రీ పాలుడు అనే పేర్లతో విరటుని కొలువులో ప్రవేశించారు. (ఆ వివరాల కోసం ఆయా పేర్ల వద్ద నొక్కి చూడండి.)

ఇక, మిగిలింది ద్రౌపది. ఆమె సైరంధ్రీ వేషంలో మాలినిగా విరాట మహా రాజు పట్ట మహిషి సుధేష్ణ కొలువులో వచ్చి చేరింది.

ఆమె తన దేశాచారం ప్రకారం కేశపాశం అంతా విప్పుకుని, కొప్పుగా అమర్చడానికి అనువుగా జడను అల్లుకున్నది. కొప్పు కొద్దిగా కుడి వైపునకు ఒరిగే విధంగా అమర్చుకుంది. కొద్దిగా మాసిన చీర కట్టుకుంది. ముతక నార బట్టతో స్తన మండలాన్ని కప్పుకుంది.

ఆమె తన ఆకారంలో దాసీత్వ లక్షణాన్ని ఉట్టి పడేటట్లు చేసికొంది. దాసీ భావాన్ని స్థిరంగా మనసులో నిలుపు కొన్నది. ఆవిధంగా విరటుని రాచ నగరు లోనికి ప్రవేశించింది.

అలా పైరంధ్రీ వేషంలో వస్తున్న ద్రౌపది మేఘం క్రమ్మడం వల్ల కాంతి తగ్గిన చంద్ర కళలా ఉంది. మంచు కప్పడం చేత వన్నె తగ్గిన పద్మంలా ఉంది. పొగ క్రమ్మడం వల్ల కాంతి తగ్గిన దీప శిఖలా ఉంది. దుమ్ము పడగా నిగ నిగలు తగ్గి, లావణ్యం కొరవడిన తీగ లాగ ఉంది. మొత్తానికి ఈ వేషంలో ఆమె రూపం లోని సహజంగా ఉండే ఉజ్వలత్వం మరుగున పడింది.

అలాంటి వేషంతో వస్తున్నద్రౌపదిని చూసి, పుర జనులు తమలో తాము యిలా అనుకున్నారు:

‘‘ ఈమె రోహిణి కాని , అరుంధతి కాని అయి ఉండాలి. అంతే కాని , మానవ కాంత మాత్రం కాదు. తన రూపలావణ్యం చేత చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంతే కాదు, అందరి మన్ననలు పొందుతోంది. మంగళ ప్రదమయిన ఆ శరీర కాంతి చూస్తే సందేహం కలుగుతోంది. ఏ లోకం లోనయినా , యిటువంటి అపురూప రూపవైభవం కలవారు ఉంటారా ?’’ అనుకుంటూ బిలబిలా ఆమె దగ్గరకి వచ్చి చేరారు. ‘‘ నీవెవరు ? ఏ పని మీద ఎక్కడికి పోతున్నావు?’’ అని అడిగారు. అప్పుడు ద్రౌపది సుముఖత, సద్భావం వెల్లడి అయేవిధంగా ఇలా అంది:

ద్రౌపది:

‘‘నేను సైరంధ్రిని. నాకు కూడూ గుడ్డా చాలును. ఎవరు నన్ను దయతో పోషిస్తారో వారి దగ్గర పనులు చేస్తాను ’’

ఆమె మాటలు విని అక్కడి వారు ఆశ్చర్య పోయారు. వారికి కొంచెం సందేహం కూడ కలిగింది, ‘‘ ఈమె కడుపు కూటికి ఎక్కడయినా ఉంటానంటున్నది. ఇది నమ్మదగిన మాటేనా?’’ అనుకుంటూ ఆమెని చూస్తూ చుట్టుముట్టారు.

ఆసమయంలో -

విరాట మహా రాజు పట్టమహిషి సుధేష్ణ తన అనుగు చెలికత్తెలతో అంత:పురం మేడ పైభాగంలో విహరిస్తోంది. ఆ మేడ కిటికీల గుండా సైరంధ్రి పుర వీధిలో రావడం గమనించింది. ఆత్మగతాన యిలా అనుకుంది,

సుధేష్ణ : ( తనలో)

‘‘ఈమె ఎక్కడి నుండి వస్తున్నదో ? ఎక్కడికి వెళ్తున్నదో కదా? ఒంటరిదానిలా ఉంది. ఈమెలో అందం ,ఔన్నత్యం కనిపిస్తున్నాయి. అయినా, ఒక సేవకురాలిలాగా వినయంగా వంగి మాట్లాడుతోంది. నగర ప్రజలు కూడ ఎంతో వింతగా ఆమెను చూస్తూ ఉన్నారు. తొందరగా వెళ్ళి ఆమెను వెవటబెట్టుకుని రండి ’’ అని చెలులను పురమాయించింది. సుధేష్ణ యిలా చెప్పడంతో ఇద్దరు ప్రౌఢాంగనలు బయలు దేరి ద్రౌపది దగ్గరకి వెళ్ళి ‘‘ విరాట మహా రాజుల వారి పట్ట మహిషి సుధేష్ణా దేవి దయతో నిన్ను తన దగ్గరకి తీసికొని రమ్మని మమ్ములను పంపించింది, రా ’’ అని పలికారు. అప్పుడు ద్రౌపది మేలి ముసుగు సవరించుకుంది. వినయమే స్త్రీ రూపం ధరించిందా అన్నట్టుగా ఆ చెలుల వెంట అంత:పురం లోనికి బయలు దేరింది.

ద్రౌపది పాదాలు ఎర్రగా ఉన్నాయి. అందు చేత ఆమె నడుస్తున్నంత మేరా కుంకుమ పోసి నట్టు ఎర్రబడి పోతోంది. ఆమె శరీరం మిలమిలలాడి పోతోంది. అందు చేత ఆమె వస్తూ ఉంటే గోడలూ, అరుగులూ మణులు పొదిగినట్టుగా ప్రకాశిస్తున్నాయి. ఆమె కళ్ళు ఒక వింత కాంతితో మెరిసి పోతున్నాయి. ఆ చూపులు పూలు చల్లినట్టుగా ఉన్నాయి. ఆమె జుట్టు నల్లగా నిగ నిగలాడి పోతోంది. అందు చేత గదుల

పై భాగాన నల్లని పట్టు చాందినీ కట్టినట్టుగా కనిపిస్తోంది. ఆమె అడుగిడగానే విరటుని అంత:పురమంతా ఒక కొత్త కాంతితో మెరిసి పోయింది. ఈ విధంగా ద్రౌపది నెమ్మదిగా సుధేష్ణ ఉన్న మేడ మీదకి ఎక్కి వచ్చింది.

అలా వస్తున్న ద్రౌపదిని విరాటుని దేవేరి చూసింది. ఆమె ముఖంలో ఒక విధమయిన గౌరవభావం కదలాడింది. సాదరంగా చేతులు ముందుకు సాచింది. కనీకనబడనట్టుగా దంతకాంతులు వ్యాపిస్తూ ఉండగా ద్రౌపదిని ప్రేమగా దగ్గరకి రమ్మని పిలిచింది. ద్రౌపది మెల్ల మెల్లగా ఆమె దగ్గరకి చేరి నిలబడింది. సుధేష్ణ ఒక సారి ఆమెను ఆపాదమస్తకం పరిశీలించింది. కుతూహలంతో యిలా అడిగింది:

సుధేష్ణ :

‘‘ తల్లీ, నీకులమేమిటి ? నీవు ఎవరిదానవు? ఏ పని మీద ఎక్కడికి వెళ్దామని బయలు దేరావు? మాకు అంతా వివరంగా చెప్పు.’’

సైరంధ్రి:

‘‘ నేను సైరంధ్రీ జాతి దానను. నా పేరు మాలిని. నాకు అయిదుగురు భర్తలు. ఒకానొక కారణం వలన మా విరోధులు అహంకారంతో నా భర్తల ఎదుటే నన్ను జుట్టు పట్టుకుని లాగి అవమానించారు. నా భర్తలతో కలసి అడవికి వెళ్ళాను. అక్కడ కందమూలాలు తిని కాలక్షేపం చేసాను. బ్రహ్మచర్యాన్ని అవలంబించాను. ఇంక, నాకొక నియమం ఉంది. ఆనియమం ఇంకా ఒక్క ఏడాది మాత్రం ఉంది. నీవు ధర్మపరురాలవని విన్నాను. నీదగ్గరే ఉండాలని వచ్చాను. నావ్రతసంపూర్తి ఇక్కడే చేసుకుంటాను. నా చేతనయిన పనులు చేస్తాను’’

సుధేష్ణ :

‘‘ దేవతలు, గరుడులు, ఖేచరులు, విద్యాధరులు, కిన్నరులు, యక్షులు, సిద్ధులు - వీరికి చెందిన కాంతలలో నీవు ఒకతెవు కావచ్చును. ఈ నగరానికి రావడానికి కారణం ఏమిటో అబద్దమాడకుండా చెప్పు.’’

ద్రౌపది : ( మందహాసం చేస్తూ )

‘‘ నేను ఇంతకు ముందు శ్రీకృష్ణుని భార్య సత్య భామ దగ్గర, ఆ పిమ్మట ద్రౌపది దగ్గర పని చేసే దానిని.

పరిచారికలు చేసే పనులన్నీ నాకు తెలుసును. ఆపనులన్నీ నేను చేసినవే. వాటిని చేయడంలో నాకు చాల సమర్ధత ఉంది. అమ్మా, విను. ద్రౌపది నన్ను ప్రాణప్రదంగా చూసుకునేది. అంతెందుకు? నన్ను తనతో సమానంగా చూసుకునేది.

నీవు కూడ అలాగే చూడాలని కోరుతున్నాను. నీచములయిన పనులకు నేను తగను. ఈ విషయం ముందుగా నీవు తెలుసుకోవాలి. గౌరవమయిన పద్ధతిలో నన్ను స్వీకరించు. నా సైరంధ్రీ జాతి ఆచారానికి విఘాతం కలగని విధంగా నన్ను ఏలుకో.

కలపాలు ( చందనాది సుగంధ ద్రవ్య విశేషాలు) కలపడం నాకు బాగా తెలుసును. రకరకాలయిన తిలకాలు దిద్దడమూ తెలుసును. వింత వింతలుగా పూలమాలలు కట్టడం, ముద్దుగా కొప్పులలో ముడవటం, దండగుచ్చటం అన్నీ నాకు బాగా తెలుసును.’’

ఆమాటలకు సుధేష్ణ ఆశ్చర్యపోతూ ఇలా అంది:

సుధేష్ణ:

‘‘ అమ్మాయీ ! నీ రూపాన్ని చూసి మా రాజు ఆకర్షితుడయి ఉవ్విళ్ళూరడం ఖాయం ! అటువంటిది, నీ చేత నేను ఎలా పనులు చేయించుకుంటాను చెప్పు? మగ వాళ్ళ సంగతి అలా ఉంచు ఆడవారు కూడా నీ అందం చూసి కళ్ళు మరల్చ లేక పోతున్నారు కదా? ఇంకా వేరు మాటలు ఎందుకు?

నిన్ను భరించడం చాల కష్టం తల్లీ ! నీరక్షణ పీత గర్భంలాంటిది ! నిన్ను చేరదీసి, నా వినాశనం నేనే కొనితెచ్చుకున్నట్టవుతుంది. అది తెలివయిన పని కాదు.’’

(ఎండ్రకాయ (పీత) ప్రసవించే సమయంలో పిల్లలు తల్లి గర్భం చీల్చుకుని పైకి వస్తాయి. తల్లి చనిపోతుంది. అందు చేత పీత గర్భం క్షేమకరం కాదు)

అని పలికిన మహారాణితో ద్రౌపది ఇలా అంది.

ద్రౌపది (సైరంధ్రి):

‘‘ అమ్మా, నీవనుకున్న విధంగా ఎన్నటికీ జరుగదు. నా భర్తలు సామాన్యులు కారు. ఉపాయశీలురు. మిక్కిలి బలవంతులు. గొప్ప పరాక్రమం కలవారు. ఒక్క నిమేష కాలమయినా, నావిషయంలో వారు పరాకుగా ఉండరు. నన్ను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు.

నన్ను ఎవడయినా నీచ బుద్ధితో చూస్తే నా భర్తలు ఆ నీచుడిని ఆ రాత్రే కడతేరుస్తారు. హరిహరాదులు అడ్డం వచ్చినా సరే యిదితప్పదు. వారెంత బలమూ, పరాక్రమమూ ఉన్న వారయినా నా భర్తల చేతిలో హతం కావలసిందే.

నన్ను నీచ బుద్ధితో చూసే ఆనీచులకు వందల కొద్దీ బంధువులు ఉండవచ్చును. వాళ్ళు గొప్ప పరాక్రమం కలిగిన వారు కావచ్చును. మదాంధులు కావచ్చును. శక్తి సంపదతో భయంకరులు కానోపును. ఏనుగుల వలె ఉండవచ్చును. అయినా సరే, నా భర్తలు కీళ్ళకు కీళ్ళు విడదీసి వారిని చంపి వేస్తారు. అందు వలన మగవారు నా వేపు తేరిపారి చూడడానికి కూడ భయపడుతారు.

అంతే కాదు. నా మనసు అటువంటి వారికి గోచరించదు. నా పెద్దల శిక్షణ, ఆచారం అలాంటివి. కనుక, ఇటువంటి అల్పమయిన మాటలు మాట్లాడ వద్దు. మనసులో ఇంకేమీ పెట్టుకోకు. నా మీద సందేహం వద్దు. నన్ను నీ సేవకురాలిగా స్వీకరించు. నాగరికమూ, ఉదాత్తమూ అయిన పనులు , నీకు నచ్చిన పనులు, నీకు నచ్చిన పద్ధతిలో భయభక్తులతో చేస్తాను.నా చేతలు పెద్దలు కూడ మెచ్చుకుంటారు. అందరూ ప్రశంసించేలా నా ప్రవర్తన ఉంటుంది.

నన్ను నీచకార్యాలకు పంపని వారిని, ఎంగిలి కూడు నాకు పెట్టకుండా నన్ను గౌరవంతో చూసుకునే వారిని నా భర్తలు కూడా ఎంతో ఆదరంతో చూస్తారు.’’

సైరంధ్రి పలికిన ఈ మాటలతో విరాట మహా రాజు పట్ట మహిషి సుధేష్ణ సంతోషించింది. ఆ మాటలతో ఆమె మనసు కుదుట పడింది. ఆమెను తన వద్ద సేవకురాలిగా చేర్చుకుంది. సైరంధ్రి కూడ అంత:పుర మర్యాదలకు అనుగుణంగా ప్రవర్తించ సాగింది.

ఈ విధంగా పాండవులయిదుగురూ., వారితో పాటు ద్రౌసది మారు వేషాలతో, మారు పేర్లతో విరటుని కొలువులో చేరారు. దీనితో లోగడ ఓ అష్టావధానంలో అవధాని సమస్యను పూరించినట్టు - కుంజర యూథం దోమ కుత్తుకను చొచ్చినట్టయింది !!

తదుపరి హిత వచనమ్డాట్ కామ్ లో మరి కొన్ని ...

స్వస్తి.

1, జులై 2010, గురువారం

సరస్వతీ నమస్తుభ్యమ్




నా చిన్ని పుస్తక సంచయం నుండి కొన్ని పుస్తకాలు .....


కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 5


అఙ్ఞాత వాసం ఒక్క ఏడాదీ విరాట మహా రాజు కొలువువలో గడపడానికి పాండవులు ఒక్కరొక్కరూ చేరు కున్నారు. ఇంతకు ముందు ధర్మ రాజు , భీముడు , అర్జునుడు , నకులుడు విరటుని కొలువు లోనికి ఎలా ప్రవేశించారో చూసాం కదా ? ( ఆ వివరాల కోసం ఆయా పేర్ల వద్ద నొక్కండి)

చివరి వాడు సహ దేవుడు. అతడు విరటుని కొలువులో ప్రవేశించిన విధం చూడండి ...సహ దేవుడు గోపవేషంలో పసుల కాపరిగా విరట రాజు కొలువులో చేరడానికి తంత్రీపాలునిగా ప్రవేశించాడు.

అతని రూపం ఎలా ఉందంటే, బయటకి చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. ఆంతర్యంలో మాత్రం పరాక్రమం తేజస్సు ఉట్టి పడుతున్నాయి. ఆ చంద్రుడే మానవాకారంతో వచ్చాడా ? లేదా, అగ్ని దేవుడే ఈ మానవాకారం దాల్చాడా ? అన్నట్లగా ఉన్నాడు.

ఒక ప్రక్క పశువులను కట్టే పలపుల మోపు, మరో ప్రక్క పెయ్య దూడల త్రాళ్ళు ధరించి పసుల కాపరి వేషంలో ఉన్నాడు. ఆహార్యమూ, అభినయమూ కూడ అలాగే ఉన్నాయి. చేతిలో నునుపైన పసుల కాపరి కర్రనొకదానిని పట్టుకుని ఉన్నాడు. అతడి సుందరాకారం విరట రాజుని ఎంతగానో ఆకర్షించింది. చుట్టూ ఉన్న ప్రజల చూపూ అతడి మీదే . చూపు త్రిప్పుకో లేక పోతున్నారు. తామర రేకుల వంటి ఆ కళ్ళలో చలాకీతనం తొంగి చూస్తోంది. అతడి చూపులో ఏదో సంభ్రమం కనిపిస్తోంది. కొద్దిగా భయపడుతున్నట్టుగా కూడ ఉన్నాడు. తడబడే చూపులతో ప్రజలను చూస్తూ సహదేవుడు మెల్లగా అక్కడకి వచ్చాడు.

వచ్చి, విరాట దేశాధీశునకు వినయంగా నమస్కరించాడు , తర్వాత యిలా అన్నాడు.

సహదేవుడు:

‘‘ రాజా ! నీ ఆలమందను కాపాడడానికి నన్ను అధికారిగా నియమించు. నా పర్యవేక్షణలో పశువులకు ఏ రోగాలూ అంటవు. ఇతరులెవరూ నీ ఆలమందను వశపరచుకో లేరు. వాటికి అలసట అసలు ఉండదు. దాహంతో బాధ పడవు.

రాజా ! నన్ను నీ కొలువులో పసుల కాపరిగా కనుక నియమిస్తే నీ పశువులు ఎప్పుడూ తప్పి పోవడం జరుగదు. క్రూర జంతువుల బారిన పడవు. సమృద్ధిగా పాడి లభిస్తుంది. పాడి తగ్గి పోవడం జరుగదు. తోటి పసుల కాపరులు మెచ్చుకుంటారు. నీవు కూడా మెచ్చుకుంటావు. అంత బాగా ఆలమందను కాపాడుతాను. నన్ను ఏలుకో.’’

విరటుడు:

‘‘ఇవేం మాటలు? నీలో పశుల కాపరితనం మచ్చుకయినా కనబడడం లేదు. రాజసం ఉట్టిపడుతోంది. నీ శరీరం చక్కగా ఉంది. నీలో గాంభీర్యం ఉంది. కాంతివంతమయిన దేహంతో ఒప్పుతున్నావు. బాగా ఆలోచిస్తే నువ్వు సూర్య వంశపువాడివిగా తోస్తున్నది. లేదా, చంద్ర వంశస్థుడివయినా కావచ్చును. అంతే తప్ప కేవల పసుల కాపరివి అనిపించడం లేదు.

నీకిష్టమయిన పదవిలో కుదురుకో. నా రాజ్యాన్ని అంతా చక్కబెట్టు. నయ నీతి పరాక్రమాలు ప్రదర్శించగల సమర్ధత నీకు ఉంది. అయినా కూడా ఇటువంటి అల్పమైన జీవనోపాధిని కోరు కోవడం ఎందుకు చెప్పు ?’’

హదేవుడు: ( రాజుకి మ్రొక్కి)

‘‘ రాజా ! నేను హీనకులజుడని. ముందెప్పుడూ నాగరికపు పనుల తీరు ఎరిగిన వాడను కాను. గతంలో మేము కౌరవులకు సేవకులం. పశు గణాన్ని కాపాడే వాడిని. పశువులను కాపాడడం తప్ప వేరే విధంగా బ్రతకడం నాకు తెలియదు. ఇంతకు ముందు ధర్మ రాజు యొక్క పశుగణాన్ని పాలిస్తూ ఉండే వాడిని. ఆ విధంగా ఆ మహారాజు మన్ననకు పాత్రుడనయ్యాను. నా పేరు తంత్రీ పాలుడు. నా హస్తవాసి మంచిది. అందు చేత దూడలు బాగా ఏపుగా పెరుగుతాయి. అతి తక్కువ కాలం లోనే నీ ఆలమందను రెట్టింపు అయ్యేలా చేస్తాను.ఆబోతు మూత్రం వాసన చూసినా, పైగాలి వీచినా సరే, గొడ్డుటావులకు సైతం చూలు నిలవడం ఖాయం. అలా పశువులను కాపాడుతాను. పశువులకు సాధారణంగా వచ్చే ఉంగిడి, అదురు, త్రిక్క అనే రోగాలు నా పేరు చెప్తే దగ్గరకి రావు. పశువులలో రకాలన్నీ నాకు బాగా తెలుసును. వేరే పనికి నేను తగను. ఈ పనిలో మాత్రం నీ మనసునకు నచ్చే విధంగా నడుచుకుంటాను. నా వలన నీకేమయినా ప్రయోజనం ఉందనుకుంటే మరోమాట లేకుండా నన్ను నీ కొలువులో పశుల కాపరిగా నియమించు’’

విరటుడు:

‘‘ సరే. నీకు అదే మంచిదనిపిస్తే అలాగే. నీకు ఇష్టమయితే వేరే పెద్ద పనులను చేయ వచ్చును. లేదంటే నా గోసంపదను శ్రద్ధతో తగిన విధంగా రక్షించు.’’ అని పలికి సహ దేవుడిని విరాటుడు తన కొలువులో పశుగణాలను సంరక్షించే అధికారిగా నియమించాడు.

ఈ విధంగా ధర్మ రాజు , భీముడు, అర్జునుడు , నకులుడు , సహ దేవుడు వరుసగా విరటుని కొలువులో కంకుభట్టు , వలలుడు , బృహన్నల , దామగ్రంథి , తంత్రీ పాలుడు గా అఙ్ఞాత వాసం ఒక ఏడాది పూర్తి చేసుకునే నిమిత్తం మారు వేషాలతో కుదురుకున్నారు.

అఙ్ఞాత వాస కాలంలో తమలో తమకు వ్యవహార నిమిత్తం రహస్యంగా పిలుచుకోడానికి తగిన విధంగా రహస్యనామధేయాలు పెట్టుకున్నారు. అవి: జయుడు (ధర్మ రాజు) జయంతుడు (భీముడు) , విజయుడు (అర్జునుడు) , జయత్సేనుడు ( నకులుడు) , జయద్బలుడు ( సహ దేవుడు )

ద్రౌపదికి మాత్రం సంకేత నామమంటూ ఏమీ లేదు.

ద్రౌపది సైరంధ్రీ వేషంలో విరటుని దేవేరి సుధేష్ణ ను మెప్పించి ఆమె వద్ద పనికి కుదురుకున్నది. ఆ వివరాలు - ద్రౌపది విరటుని కొలువులోకి ఎలా ప్రవేశించిందో రేపటి హిత వచనమ్ డాట్ కామ్ లో చూదాం ...

స్వస్తి

.

30, జూన్ 2010, బుధవారం

కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! - 4









అఙ్ఞాతవాసం విరట మహా రాజు కొలువులో పూర్తి చేసుకోడానికి నిశ్చయించుకుని, పాండవులు ఒకరొకరూ అక్కడకి చేరుకుంటున్నారు. ముందు టపాలలో ధర్మ రాజు , భీముడు , అర్జునుడు ఎలా వచ్చి కొలువులో ప్రవేశించారో చూసాం ( వివరాలకు వరుసగా ఆయా పేర్ల వద్ద నొక్కండి)

ఇక, నకులుడు విరటుని కొలువులో ఎలా కుదురు కున్నాడో చూదాం ....నకులుడు అశ్వపాలకడిగా దామగ్రంథి పేరుతో వచ్చాడు.

అతడిని చూస్తూనే అక్కడి ప్రజల నేత్రాలు అప్పుడే సూర్యుడిని చూస్తూ వికసిస్తున్న పద్మాల్లా వికాసవంతాలయ్యాయి. నకులుడు విరటుని కొలువు దగ్గరకి వచ్చాడు. అక్కడున్న గుర్రాలను దీక్షగా పరికిస్తున్నాడు. విరటుడు అది చూసి తన పరివారానికి అతడిని చూపించి ఇలా అన్నాడు:

‘‘ ఇతడు గుర్రాలను పరిశీలించే తీరు చూడండి. ఇతనికి అశ్వ శాస్త్రంలో ఎంతో నైపుణ్యం ఉన్నట్టుగా ఉంది.కదూ? ఇతడు బహు సుందరాకారుడే కాదు, గొప్ప పరాక్రమం కలవాడుగా కూడా కనిపిస్తున్నాడు.

ఇతడి పేరు మీలో ఎవరికయినా తెలుసునా? తెలిస్తే చెప్పండి. తెలియక పోతే దగ్గరకి వెళ్ళి అడిగి తెలుసు కోవాలి. ’’

ఇలా రాజు అనుకుంటూ ఉండగా నకులుడు విరాటుని వద్దకు వచ్చి నమస్కరించి ఇలా అన్నాడు.

నకులుడు:

‘‘ రాజా ! నేను రాజవాహనాలయిన గుర్రాలను చాల నేర్పుగా కనిపెట్టి జాగ్రత్తగా చూసుకుంటాను. నా పేరు దాగ్రంథి. నాకు అశ్వ శాస్త్రం బాగా తెలుసును.

అశ్వాల లక్షణాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. చూడగానే ఆ గుర్రాలు ఎంత కాలం బతుకుతాయో చెప్ప గలను.( వాటి ఆయు:ప్రమాణం కనిపెట్టగలను.) అవి చూలుతో ఉన్నాయో కాదో చెప్ప గలను. ఆకారానక్ని బట్టి వాటి స్వభావాన్ని తెలుసుకో గలను. గుర్రాల మేతలు, పోషణ పద్ధతులు, వాటికి ఏమయినా రోగాలు వస్తే నయం చేసే చికిత్సా పద్ధతులు నాకు తెలుసు. ఆ విద్యలన్నీ కావాలంటే నీ ఎదుట ప్రదర్శించా చూపిస్తాను. ఒక వేళ యుద్ధమే కనుక వస్తే అది నా పని కాదని ఊరుకోను. యుద్దంలో నా బలాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తాను ’’

విరటుడు:

‘‘ నీకు తగిన పదవి యిస్తాను. నా సంపదని కాపాడుదువుగానిలే. నీవు కేవలం అశ్వ రక్షకుడివే కాదు. అలా అనడం నీకు తగదు ’’

నకులుడు:

‘‘రాజా! ఎవరయినా వారికి ఏ పనులు తెలుసునో అవి చేస్తూ జీవించాలి. అంతే కాని చేతకాని సేవలకు ఒప్పుకోవడం న్యాయం కాదు.

ఇంత వరకూ ధర్మ రాజు వద్ద పెరిగాను. అశ్వ శాస్త్రంలో నన్ను అతడు కడు నేర్పరిగా చేశాడు. గుర్రాలకు అధిపతిగా చేసాడు. నన్ను తన తమ్ముళ్ళలో ఒకడిగా ఎంతో ప్రీతిపాత్రంగా చూసుకున్నాడు. అయితే, కపట ద్యూతంలో ఓడిపోయి, ఆ రాజు రాజ్యం మీది విముఖతతో వెళ్ళి పోయాడు. చుట్టాలను వదిలి పెట్టాడు. తనకు తోచిన చోట గడిపాడు. పిమ్మట అఙ్ఞాతం లోకి వెళ్ళి పోయాడు. ఇంక నేను ఎక్కడ పొట్ట పోసుకోవాలా అనుకుంటూ ఇక్కడికి వచ్చేను. నిన్ను చూసాను. నాకు తోచిన విధంగా విషయమంతా నీకు విన్నవించుకున్నాను. నాచేత పని చేయించ దల్చుకుంటే సరి. లదూ, నీకు సందేహంగా ఉంటే చెప్పు, నేను వెళ్ళి పోతాను ’’

విరటుడు:

‘‘అశ్వ రక్షణమే నీకు ఇష్టమయితే మా అశ్వశాల లన్నింటికీ నీవే ప్రధానిగా ఉండు.నేను ఇంత వరకూ నా అశ్వ పాలకులను ఎలా చూసే వాడినో నువ్వూ వారిని అలాగే ప్రీతి చూడు. వారిచేత పనులు చేయించుకో ’’

ఇలా పలికి, విరాట మహా రాజు నకులుడిని గౌరవ పురస్సరంగా తన ఆస్థానంలో

అశ్వ రక్షకునిగా నియమించాడు.

ఇక, పాండవులలో చివరి వాడు సహదేవుడు విరటుని కొలువులో ఎలా ప్రవేశించాడో రేపటి హిత వచనమ్ డాట్ కామ్ లో చూదాం ...

స్వస్తి.

29, జూన్ 2010, మంగళవారం

మా టామీ కథ

మొన్నీ మధ్య మా యింట్లో ఒక శుభకార్యం జరిగితే, దానికి విజయ నగరం నుండి మా చిన్నమ్మాయీ, అల్లుడు, పిల్లలు ( మనవడు, మనవరాలు) తో వచ్చేరు. అప్పుడు మా చిన్నమ్మాయి మన టామీ ఫొటో ఒకటి ఉండాలి కదా ఒక సారి చూపించరూ? అని అడిగింది. ఉంది. కాని , ఎక్కడో మా దగ్గర ఉన్న చాలా ఫొటోలలో కలిసి పోయి కనబడ లేదు. సరే, యీ సారి దొరికేక, దానిని మీ బ్లాగులో పెట్టండి. అని మా అమ్మాయి మరీ మరీ చెప్పింది. నిన్న అనుకోకుండా సుధా రాణి గారి ఇల్లాలి ముచ్చట్లు బ్లాగులో ఆవిడకి దైవమిచ్చిన కుక్క స్నోవీ గురించి రాసిన కథనం చూసాక ( దాని కోసం ఇక్కడ నొక్కండి) అరే ! మా టామీ గురించి నేను కూడా ఎందుకు రాయ కూడదు? అనిపించింది. ఆ కుతూహల ఫలితమే
ఈ కథనం .....

మేము విజయ నగరం జిల్లా సాలూరులో ఉండేటప్పుడు నాగావళి ఏటవతల ఓ చక్కని ఇంట్లో అద్దెకి ఉండే వాళ్ళం. ఆ ఇల్లు మా డాక్టరు మిత్రులదే. నాగావళి ఏటికి అటు వేపు ఉండే శ్రీనివాప నగర్ కాలనీ అది. పట్టుమని పది యిళ్ళు ఉండేవి. అన్నీ కొత్తగా కట్టిన ఇళ్ళే. అక్కడి వాతావరణం చాలా ఆహ్లాద కరంగా ఉండేది. మా ఇంటి ముందు పెద్ద ఆట స్థలం ఉండేది. ఆ చివర డిగ్రీ కాలేజీ ఉండేది. అది కూడా కొత్తగా వచ్చినదే. అందు వల్ల పెద్ద పెద్ద భవనాలేమీ లేవు.

మా కాలనీలో టామీ అని ఓ కుక్క తిరుగుతూ ఉండేది. ఎవరు పెంచే వారో తెలియదు. కాలనీ అంతా నాదే నన్నట్టుగా తెగ తిరిగేది. దానికి టామీ అనే పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదు. మా ఆవిడా, పిల్లలూ దానిని చాలా యిష్టంగా చూసే వారు. దానికి రోజూ మూడు పూటలా తినడానికి ఏదేనా పెడుతూ ఉండే వారు. మా అమ్మాయిలిద్దరూ అప్పటికి చాలా చిన్న వయసు వాళ్ళు. టామీతో ముచ్చటగా ఆడుకుంటూ ఉండే వారు.

ఇదంతా 1988 నాటి సంగతి.

తర్వాత, నాగావళికి 1990 లో ఎప్పుడూ రానంత వరదలు వచ్చేయి. వర్షం కుండ పోతగా కురిసింది. మన్నూ మిన్నూ ఏకమయింది. నాగావళి మీద సాలూరు ఊర్లోకి వెళ్ళడానికి ఉండే బ్రిడ్జి కూలిపోయింది. ఊర్లోకీ, మా కాలనీ వారికీ రాక పోకలు బంద్ అయ్యాయి. కాలనీ అవతల 8 కిలో మీటర్ల దూరంలో రామభద్రపురం ఉంది. అక్కడి నుండి విజయ నగరం, విశాఖ పట్నం , ఇటు - బొబ్బిలి, పార్వతీపురం - అది దాటేక ఒరిస్సా - వీటిని కలిపే హైవే ఉంది.

బ్రిడ్జి కూలిపోవడంతో మా కాలనీ ఒకటి ఒంటరి అంకెలా మారి పోయింది.

ఇహ లాభం లేదని వరద నీరు తీసాక పదిహేను రోజులకి సాలూరు ఊర్లోకి ఇల్లు మార్చేసాం.

మా పిల్లలు దాదాపు ఓనెల రోజుల వరకూ టామీని గుర్తు చేసుకుంటూ బెంగ పడే వారు. తర్వాత క్రమేపీ టామీ గురించిన ఆలోచనలు మా ఇంట్లో మరుగున పడి పోయాయి.

చెప్పొచ్చేదేమిటంటే ....

నాగావళి అవతలి వేపున్న కాలనీ లోని ఇల్లు మారేక మేం చాలా సంవత్సరాల పాటు అక్కడికి మరి వెళ్ళ లేదు. ప్రత్యేకంగా ఏకారణమూ లేక పోయినా, వీలు పడ లేదంతే. మా అందరి మనస్సులలోను టామీ గురించిన ఆలోచనే తుడిచిపెట్టుకు పోయింది. టామీ మా ఎవరికీ గుర్తే లేదు.

1998 లో అంటే, దాదాపు పదేళ్ళ తర్వాత, మా పెద్దమ్మాయి పెళ్ళి కుదిరితే, కాలనీలో మా పరిచయస్థులను పెళ్ళికి పిలవడానికి నేనూ, మా ఆవిడా నడుచుకుంటూ బయలు దేరాము.

ఇప్పుడంతా మారి పోయింది. పడి పోయిన బ్రిడ్జి స్థానంలో కొత్త వంతెన కట్టేరు. రాక పోకలు బాగా జరుగుతున్నాయి. పెద్ద దూరం కాక పోవడంతో, సాయంత్రం పూట చల్లగా ఉందని చెప్పి, కబర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాము.

అక్కడికి మేం అప్పట్లో ఉండే కాలనీ ఇంకా దాదాపు కిలోమీటరు ఉంటుంది. హఠాత్తుగా ఓ కుక్క వచ్చి మా మీద పడింది ! మేం తుళ్ళి పడ్డాం. అది సంతోషం పట్ట లేనట్టుగా బిగ్గరగా అరుస్తూ, నాలుక పెట్టి మా ఒళ్ళంతా నాకేస్తూ, అబ్బ ! దాని హడావిడి అంతా యింతా కాదు ... ఒక్క సారిగా ఎక్కడి నుండో ( దూరాన ఉన్న కాలనీ నుండి ) వచ్చి అది మా మీద పడడంతో మా కంగారు, భయం చెప్పనలవి కాదు. ముచ్చెమటలు పోసాయి. మా గుండెలు అదిరిపోయేయి.

తీరా చూస్తే అది మా టామీ !!

అది మమ్మలనేమీ చేయడం లేదనీ, చాలా ఏళ్ళకి మేం కనిపించినందుకు ఆనందంతో ఉక్కిబిక్కిరవుతోందనీ, దాని సంతోషాన్ని, ప్రేమనీ అలా మా మీద కలియబడుతూ చాటుతోందనీ మరి కొద్ది సేపటకి కానీ మాకు అర్ధం కాలేదు.
అర్ధమయేక మాకు కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. నిజం.

మా టామీ జాతి కుక్క కాక పోవచ్చును. ఒట్టి ఊర కుక్క కావచ్చును. కాని అది మా జాతైన కుక్క అనడంలో మాకు సందేహం లేదు.

ఇదీ మా టామీ కథ.

( అన్నట్టు, మా నాగావళి వరదల వల్ల వంతెన కూలిపోయిన నేపథ్యంతో ఆంధ్ర ప్రభ లో వరద అనే కథ
ఒకటి అప్పట్లో రాసేను. వీలు చూసుకుని ఆ కథని మీతో బ్లాగులో పంచుకుంటాను)

మా టామీ ఇప్పుడేమయిందో తెలీదు. నాగావళి ఒడ్డున ఇసుక తిన్నెల మీద నా కోసం, మా ఆవిడ కోసం, మా పిల్లల కోసం అటూ, యిటూ తిరుగుతోందో, యేమో ....