4, ఆగస్టు 2010, బుధవారం

విశ్రాంత నేత్ర వైద్యుని అవిశ్రాంత సాహితీ సేద్యం


శ్రీ ముద్దు వెంకట రమణా రావు విశ్రాంత నేత్ర వైద్య నిపుణులు.

వీరికి తెలుగు, సంస్కృత సాహిత్యాల పట్ల ప్రగాఢ మైన అభిమానం,అభిరుచి. సంగీతంలో కూడ మంచి ప్రవేశం ఉంది. ఎనభై సంవత్సరాల వయసులో కూడ ఉరక లేసే ఉత్సాహంతో సాహితీ సేద్యం చేస్తున్నారు. వివిధ సాహిత్య సంస్థలతోనే కాక, సంగీత సమాఖ్యలతో కూడ సన్నిహితంగా మెలుగుతూ ఆయా సంస్థల కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు.

కీ.శే. యం. లక్ష్మణ మూర్తి, సూర్యకాంతం దంపతులు వీరి తల్లిదండ్రులు.

11-09-1930 వ తేదిన ఒరిస్సా గంజాం జిల్లా కాశీనగరంలో పుట్టిన వీరు వైజాగ్ ఆంధ్రా మెడికల్ కాలేజీ నుండి యం.బి.బి.యస్ , యం.యస్.డి.ఒ పట్టాలు పొంది, పి.జి. డిప్లమో చేసారు. ప్రభుత్వ జిల్లా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ గా పదవీ విరమణ చేసారు.

అరవైయ్యవ దశకంలో ఆంధ్ర పత్రిక, ఆంధ్ర జ్యోతి వంటి పత్రికలలో కొన్ని చక్కని కథలు వ్రాసిన ఈ నేత్ర వైద్యులు వృత్తి రీత్యా సమయాభావం వలన అడపా దడపా రచనలు చేస్తున్నా, వాటిని పత్రికలలో ప్రచురించ లేదు. ఉద్యోగ విరమణ చేసాక, తమ చిన్న నాటి ఆత్మీయ మిత్రులు శ్రీ గొర్తి సత్యనారాయణ గారు ఇచ్చిన ప్రేరణతో ఇటీవల తమ రచనలతో వరుసగా ఐదు చక్కని పుస్తకాలను వెలువరించారు.

అవి:

రమణీయం

సంధ్యారాగం

ఉదయ కిరణాలు

కమనీయం

మహనీయం

భావుకతకూ, లోకవృత్తాలను సహేతుకంగా విమర్శించే డాక్టరు గారి నిపుణతకూ,విస్తారమైన వారి అధ్యయన సాధికారతకూ, నిదర్శన ప్రాయంగా నిలిచే ఈ పుస్తకాలను మీకు ఇక్కడ క్లుప్తంగా పరిచయం చేస్తున్నాను.


1.రమణీయం

ఇదొక అపురూపమైన సాహితీ కదంబమాల అని చెప్పుకో వచ్చును. ఇందులో 48 కవితలు , 8 అనువాద గేయాలు, 07 సాహితీ వ్యాసాలు, వివిధ అంశాల మీద వ్రాసిన వ్యాసాలు 11 , ఇంకా 03 గల్పికలు,08 కథలు పొందుపరిచారు. అంతే కాక వారి అన్న గారి సమస్యాపూరణలు, పద్య రచనలు కూడ చేర్చి వారి పట్ల తమ ఆదర భావాన్ని ప్రకటించుకున్నారు.

వీరి కవితా ధారకి ఉదాహరణ ప్రాయంగా మచ్చుకి:

ఆకలి దప్పుల నల్లలాడిననే

అన్నోదకముల విలువలు తెలియును

సోపాన పంక్తుల నెక్కిననే కద

సౌధోపరి సౌందర్యము కనవిందగు ... అంటూ సాగే సాధన అనే గీతం,

సుభగ శరీర సురభిళా

సుగుణ సౌశీల్యా విరళా

సౌందర్యజిత చంద్రకళా

విరహిణీ, కాంతామణీ, ఊర్మిళా ! ... అంటూ సాగే ఊర్మిళ పద్యాల ఖండ కావ్య రచనా ...

మధుర రసాల వనమనోఙ్ఞమ్ము

కదళీ నారికేళ కేదారమ్ము

కుల్య తటినీ తటాక వికసిత

కుముదవనజ పుష్ప వన నికాయమ్ము ... అని కోనసీమ అందాలను తనివితీరా వర్ణించిన పద్యాలూ ... ఎంతగానో అలరిస్తాయి. అందమయిన పదాల పొందిక, చక్కని మధురమయిన శైలీ విన్నాణమూ, ఈ పద్యాలను, కవితలను ఎంతో రసవంతములుగా అందించేందుకు కవికి ఉపకరించిన ఉపకరణాలు.

అనువాద గేయాల విభాగంలో ...

ముందుగానే తెలిసి ఉంటే

చివరగా మనము చినుకు లోన

కలిసి నడిచే భాగ్యమదియని

ముందుగానే తెలిసి వుంటే

వాన లోనే రాత్రి అంతయు

వదలకుండగ నీ కేలు పట్టి

హృదికి హత్తుకు గడిపియుందును ... అని సాగే మధురమయిన అనువాద రచనలు ఉన్నాయి.

కవి కోకిల దువ్వూరి రామి రెడ్డి, గరిమెళ్ళ , పాల్కురికి సోమన మున్నగు వారి గురించే కాక, మేఘసందేశం, కళల ప్రయోజనం, దళిత కవిత్వం మొదలయిన వాటి మీద విశ్లేషాణాత్మక వ్యాసాలు సాహితీ వ్యాస విభాగంలో కనిపిస్తాయి.

వీరి గల్పికలు, కథలు కూడ చదివించే రచనలు. కథా రచయితగా వీరి సామర్ధ్యాన్ని చాటేవిగా ఉన్నాయి.

శ్రీ ముద్దు నరసింహ మూర్తి , స్వర్గీయ సీతా లక్ష్మి దంపతులు.

శ్రీ రమణారావు గారు తమ రమణీయం గ్రంధంలో తమ అన్నగారయిన నరసింహ మూర్తి గారి పద్య రచనలు కూడ కొన్ని చేర్చి ప్రచురించారు.

తెలుగు భాషాభిమానం, కవిత్వాభిమానం గల వీరి సోదరులు వ్రాసిన కొన్ని

సమస్యాపూరణ పద్యాలు, మరి కొన్ని ఆంగ్ల సామెతలకు తెలుగులో పద్యానువాదాలు ఇందులో అలరిస్తున్నాయి.


ఈ పుస్తకం వారి జననీ జనకులకి అంకితం చేసారు.

ఇక, రెండో పుస్తకం ...




2.సంధ్యారాగం

ఇది వివిధ విషయాల మీద తన అభిప్రాయాలను క్రోడీకరిస్తూ, తన భావాలను చదువరులతో పంచుకోవాలనే ఆకాంక్షతో వ్రాసిన 56 వ్యాస రచనల సంపుటి.

ఇందులో తెలుగు సాహిత్యం,విదేశీ సాహిత్యం, సంగీతం , చరిత్ర, పర్యటన, వైద్యం, గురించిన వ్యాసాలతో పాటు కొన్ని ఇతర అంశాల గురించినవ్యాసాలు,

7 వ్యాస సదృశ గల్పికలూ చోటు చేసుకున్నాయి.

వీటిలో కుమార సంభవం, శతక రచనలు, బాపు రెడ్డి కవిత్వం, శోభిరాల కావ్య సంపద, వంశధార కథలు, కథా వార్షికలు 2004, 05 ల మీద సమీక్షా వ్యాసాలు మొదలైనవి ఉన్నాయి.

విదేశీ సాహిత్యం గురించిన వ్యాసాలలో ఆంగ్ల సాహిత్యంలో రొమాంటిసిజమ్ , ఫ్రెంచి సాహిత్య పరిచయం చోటు చేసుకోగా, సంగీత విభాగంలో పాశ్చాత్య సంగీతాన్ని గురించీ , సంగీత రావు గారి గురించి వ్రాసినవి ఉన్నాయి.

పర్యటన, వైద్య విభాగాల్లో చేర్చిన వ్యాసాలు వారి అనుభవ సారంగానూ. వారి యాత్రా ప్రియత్వాన్నీ వ్యక్త పరిచేవిగానూ ఉన్నాయి.


రచయిత ఈ పుస్తకాన్ని ఆది దేవుడు సూర్య నారాయణ మూర్తికి అంకితం చేసారు.


3.ఉదయ కిరణాలు

వచన రచనా విభాగంగా వెలువరించిన ఈ పుస్తకం కూడ 45 వ్యాసాల సంకలనమే.

ఇందులో రఘు వంశం , సౌందరనందనం , పౌలస్త్య హృదయం , దీపావళి, ఫిరదౌసి, బసవ రాజు అప్పారావు, మొదలయిన వ్యాస శీర్షికలతో ఆయా కవుల రచనల గురించి పరిచయ పూర్వక విశ్లేషణాత్మక వ్యాసాలు కనిపిస్తాయి. తెలుగు కవులనే కాక, ఈ విభాగంలో షేక్స్పియర్, ఇలియట్ వంటి వారిని గురించిన వ్యాసాలూ ఉన్నాయి. ఇవి కాక, వేదాంతం, మతం , వాణిజ్యం, స్త్రీ స్వేచ్ఛ , గ్లోబలైజేషన్, చారిత్రక ప్రదేశాల పరిచయం, దర్శనీయ క్షేత్రాలు ,మనోవిశ్లేషణ ... యిలా భిన్న భిన్న అంశాల గురించి అలవోకగా వ్రాసిన లఘు వ్యాసాలు మనలని అలరిస్తాయి.

రచయిత ఈ పుస్తకాన్ని తమ ఆత్మీయ బాల్య మిత్రులు శ్రీ గొర్తి వెంకట సత్య నారాయణ మూర్తి గారికి అంకితం చేసారు.


4.కమనీయం

ఇది కవితా సంపుటి. 73 కవితలతో ఈ కవితా సంపుటి వెలువరించారు.ప్రతి కవిత లోనూ వారి కవితా తత్వం, రసభావ బంధురమయిన వారి మనోఙ్ఞమైన శైలి, భాషా విషయకంగా వారి ప్రతిభా సంపద గోచరిస్తూ ఉంది. ఛందో గంధంతో పరిమళించే వారి కవితలు ధారా శుద్ధితో ప్రశంసనీయంగా ఉన్నాయి.

కవి గారు ఈ కవితా సంపుటిని వారి సోదరి, స్వర్గీయ ముద్దు(చుండూరు) శకుంతలకు అంకితం చేసారు.

మచ్చుకి ఒకటి రెండు కవితలు ...

నవాబుల దర్బారు హాలులా

నగరం వ్యాపించివుంది

భారతి మేఖలాపతకంలా ప్రకాశించు నగరం

తెలుగు తల్లి నుదుట తిలకం

తెలుగు చరిత్రకు స్వర్ణ ఫలకం

( భాగ్య నగరం)

ద్వేష దౌర్జన్యపూరిత తీవ్రవాద

కంటకావృత శిధిల మార్గాన నేల

శాంత్యహింసా సుహృజ్జీవ సాధు భావ

సత్య సౌలభ్య పథమున సాగి పొమ్ము

(అనుసరణీయం)

తల్లి వడి లోన వెచ్చగ తనువు మరచి

శాంత్యమాయక భావాల స్వాదు రసము

నీలి కన్నుల రెప్పల నిదుర గ్రమ్మ

చింత లెఱుగని పొన్నారి చిట్టి పాప

(నిద్ర)


5 మహనీయం

ఆ కావ్య సంపుటిలో పద్య విభాగంలో 64 ఛందోసుందరమయిన పద్యరచనలు, గేయ కవితా విభాగంలో 61 గేయాలూ , అనువాద కవితల విభాగంలో 9 అనువాద కవితలూ చేర్చి ప్రచురించారు.

ఈ కవికి మిక్కిలి ప్రీతి పాత్రమైన ప్రకృతి వర్ణన, ఋతు వర్ణనలు ఇందులో సజహజంగానే ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే యాత్రాప్రియులైన వీరు దేశ దేశాలు తిరిగి, తాను చూసిన అందమయిన ప్రదేశాలనీ , ఆ అందాలనీ కూడ మనతో పంచుకోవడం కనిపిస్తుంది.

ఇవే కాక, వివిధ కవుల గురించిన మనోహరమయిన పద్యాలు, కావ్య ప్రశంసలు, భగవదారాధనలు, జాతీయ భావనలు, రాష్ట్ర గానాలూ. సంగీతకారుల ప్రశంసలూ, ... ఇలా ఒకటేమిటి, వైయక్తిక పులకరింతల పలవరింతలూ, అనుభవాల గిలిగింతలూ, తల పోతల కలబోతలూ ... ప్రతి కవితలోనూ అందంగా అక్షరీకరించి మనకి అందించారు.

మచ్చునకు ఒకటి రెండు ...

ఉత్పలమాలికాభరణుజ్జ్వల నీల శరీర తేజుడున్

సత్పరిపాలకాశ్రయుడు, శర్వవిరించి మహేంద్రపూజ్యభా

స్వత్పరిపూర్ణ సద్గుణుడు, సర్వ జగత్పరిపాలకుండు, మా

ఉత్పల వారికిచ్చుత శుభోన్నత జీవన శాంతి సౌఖ్యముల్

(ఉత్పల కవివర్యునికి సమర్పించిన శుభ కామన... ఉత్పల అనే శీర్షికతో ఛందస్సుందర మయిన పద్య కుసుమాలు.)

గ్రంధకర్త ఈ కావ్య సంపుటిని నిత్య కల్యాణ శోభితుడు కొండలరాయునికి అంకితం చేసారు.

ఈ ఐదు పుస్తకాలూ రచయిత ఆంధ్రప్రదేశ్ సాహితీ, సాంస్కృ తిక సమాఖ్య, శ్రీకాకుళం వారి సహకారంతో ప్రచురించారు.

(త్వరలో వెలువడనున్న వీరి రచనలు: ఒక కవితా సంపుటితో పాటు

వెన్నెల వెలుగులు ( సాహిత్య వ్యాసాలు) , ఇంగ్లీషు – తెలుగు మెడికల్ డిక్షనరీ.)

ఇప్పటికి ప్రచురితములయిన ఈ ఐదు పుస్తకాలు చదవాలన్నా, రచయిత గురించి మరిన్ని వివరాలు తెలుసుకోగోరినా, క్రింది చిరునామాలకు సంప్రదించాలి:

డా. యం.వి.రమణారావు, యం.యస్.డి.ఓ.,

రిటైర్డ్ సివిల్ సర్జన్,

ప్లాట్ నెంబర్: 11, శ్రీ కోలనీ,

పుణ్యపు వీధి, శ్రీకాకుళం 532001

ఫోన్: (08942)223243.

లేదా,

శ్రీ రామిశెట్టి, ప్రధాన కార్యదర్శి,

ఆంధ్ర ప్రదేశ్ సాహితీ సాంస్కృతిక సమాఖ్య,

శ్రీ భద్రమ్మ గుడి వెనుక, ఇల్లిసిపురం,

శ్రీకాకుళం 532001

ఫోన్ (08942)278572

ఈ పుస్తకాలు విశాలాంధ్ర వారి అన్ని బ్రాంచీలలోను, బుక్ సెంటర్ (విశాఖ పట్నం) . నవోదయ బుక్ హౌస్, కాచి గూడ, హైదరాబాద్ వారి దగ్గర లభిస్తాయి.

3, ఆగస్టు 2010, మంగళవారం

ఎందుకయ్యా, వెక్కి వెక్కి ఏడిచేవూ ?!

యే నామ కేచిదిహ న: ప్రథయం త్యవఙ్ఞాం
జానంతి తే కిమపి తాన్ర్పతి నైష యత్న:
ఉత్పత్స్యతే మమ తు కో2పి సమాన ధర్మా
కాలో హ్యయం నిరవధి ర్విపులాచ పృధ్వీ

నా రచన చదివి, దాని మీద ఆదరం లేని వారికి ఒక్క మాట చెబుతున్నాను. ఈ రచన మీ కోసం చేసినది కాదు. కాలం అనంతమయినది. నేల తల్లి చాల విశాలమైనది. నా కావ్య గుణ ధర్మాలను వెల కట్ట గల రసికుడు ఎక్కడయినా ,ఎప్పుడయినా పుట్టక పోడు సుమా !

మంచి కవిత్వాన్ని ఆదరించ లేని కొందరు సమ కాలికుల గురించి మన కవులు ఈ విధంగా వాపోవడం జరిగింది.

చేమకూర వేంకట కవి ఏ గతి రచియించి రేని సమ కాలము వారలు మెచ్చరే గదా ? అని రవంత బాధ పడిన సంగతి తెలిసినదే కదా.

అరసికేషు కవిత్వ నివేదనమ్ మాలిఖ మాలిఖ మాలిఖ అని ఓ కవి ఓ బ్రహ్మ దేవుడా, రసికులు కాని వారికి నా కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యం నాకు ముమ్మాటికీ కలిగింకయ్యా. నా నుదుటున అలాంటి రాత రాయకయ్యా అని వాపోయేడు.

గురజాడ కూడా,
కొత్త పాతల మేలు కలయిక
క్రొమ్మెఱుంగులు చిమ్మగా
మెచ్చనంటావీవు నీవిక
మెచ్చకుంటే మించి పాయెను ...

అని ఊరుకోకుండా,
కొయ్య బొమ్మలు మెచ్చు కళ్ళకు
కోమలులు సౌరెక్కునా ?
అని ఓ చురక కూడా వేసాడు.

కవితా మాధురి సంగ్రహించి, ‘‘ యిది శ్లాఘ్యంబిద్ది శ్లాఘ్యంబు గా
దు, విశేషంబిట, నిర్విశేషమిట, మాధుర్యంబిటన్ , వహ్వరే !
కవిరాజా !’’ యని మెచ్చి యిచ్చు నృపుఁడొక్కండైనఁగర్వైనచో
కవియై పుట్టుట కన్నఁబాప పరిపాకంబుండునే భూవరా !

ఈ విధంగా తిరుపతి కవులు అరసికులయిన ప్రభు వులున్న లోకంలో కవిగా పుట్టడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదని బాధ పడిన సందర్భమూ లేక పో లేదు.

శ్రీనాధుడు కూడ, భీమేశ్వర పురాణంలో ఇలాంటి వారి గురించే కుకవి నింద చేసాడు ...

బోధమల్పంబు గర్వ మభ్యున్నతంబు,
శాంతి నిప్పచ్చరము మచ్చరము ఘనము
కూప మండూకములఁబోలె కొంచెమెఱిఁగి
పండితమ్మన్యులైన వైపండితులకు

తెలిసింది తక్కువా, గర్వమా, ఎక్కువా. . నిదానం లేదు. మాత్సర్యమా, జాస్తి. నూతిలో కప్పల్లాంటి
వారు ఈ పండితమ్మన్యులు.

ఎందుకయ్యా ఏడుస్తున్నావు ? అంటే, ఎదుటి వాడు గొప్పోడైపోతున్నడ్రోయ్ బాబోయ్ ... అని ఏడిచే మగానుబావులు అన్ని కాలాల లోనూ ఉంటారని చెప్పడానికి మచ్చుకి రెండు మూడు ఉదాహరణలివి.




2, ఆగస్టు 2010, సోమవారం

గ్యారంటీ లేదు !!


మన పూర్వ కవులలో కొందరికి చిత్ర కవిత్వమన్నా , బంధ కవిత్వమన్నా కొంచెం మోజు జాస్తి. అది వారి ప్రైవేటు హా బీ . దానిని తప్పు పట్ట లేం. వ్వక్తుల ప్రైవేటు లైఫు వారి వారి స్వంతం. వీటిని సాము గరిడీలతో పోల్చి, పెదవి విరిచే వారూ ఉన్నారు. వాటిలో కవిత్వం అనే దినుసు కోసం వెతకడం అంత అవసరం లేదు. ఉండ వచ్చును. ఉండక పోవచ్చును. గ్యారంటీ లేదు. అది మన భాగదేయం మీద, లేచిన వేళా విశేషం మీద ఆధార పడి ఉంటుంది. ఏమయినా , అనంతమూ , అపురూపమూ , అపూర్వమూ అయిన మన కవితా స్రవంతిలో వాటిని అంతర భాగాలుగానే గుర్తించాలి కాని, కోపగించుకో కూడదు, మరి.

ఏకాక్షర నిఘంటు సాయంతో, ప్రయాస పడి అర్ధాన్ని సాధించ గలిగే ఓ రెండు పద్యాలను చూదాం.

రరో రరే రర రురో
రరూ రూరు రురోరరే
రేరే రీరా రార రరే
రారే రారి రిరా రిరా

ర = రామ శబ్దంలో గల రేఫ వలన
రో = భయము కలిగి
అర = వేగంగా పరిగెత్తు
రురో: = లేడికి ( లేడి రూపములో ఉన్న మారీచునికి)
అరే: = శత్రువైన శ్రీరాముని
రేరే (ర+ఈ+రే) = కౌస్తుభాన్ని ధరించి ఉన్న
ఉరోరరే = వక్షము నందు
రీరారా = విలాసవంతమయిన
ఊరూరు = గొప్ప ఊరువులచే
ఉ = లక్ష్మి , సీత
అరరర = తన నివాసమైన లంకకు ఎత్తుకు పోయిన
ఇరార = లంకను పొందిన
ఇరారి = భూమికి కంటకుడిగా మారిన రావణునికి
రి = నాశనము కలిగించినదై
అరిరా = చెలి కత్తెలను
రా = పొందినది

శ్రీరాముని భార్య యగు సీతా దేవి లంకలో రావణుని నాశనం తెలియ జేసే త్రిజట వంటి చెలి కత్తెలను పొందినది. లంకలో రాక్షస స్త్రీల నడుమ లంక నాశనం కానున్నదని, రామ రావణ యుద్ధాన్ని కలగని చెప్పి, హెచ్చరించి నది , సీతా దేవిని సగౌరవంగా చూసినదీ త్రిజట అనే రక్కసి మాత్రమే కదా.

కవి అంత మహా లంకా నగరంలోనూ , లంకా నాశనాన్ని సూచించినది ఒకే ఒక్కతె అని తెలియ జేస్తూ ఏకాక్షర సహిత పద్య రచన చేసాడు కాబోలు.

మరో పద్యం ఇలాంటిదే, కొరికి చూడండి ...

మామా మోమౌ మామా
మామా ! మిమ్మొమ్ము మామ మామ మేమా
మే మొమ్మము మీ మైమే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా !

మా = చంద్రుని
మా = శోభ
మోమౌ = ముఖముగా గల
మా = మా యొక్క
మా = బుద్ధి
మిమ్ము = మీకు
ఒమ్మున్ = అనుసరించును
మామ మామా = మామకు మామా
ఆము = గర్వమును
ఏము = మేము
ఒమ్మము = ఇష్ట పడము
మీ = మీ యొక్క
మై = శరీరము
మేము +ఏమే = మేమే కదా
మమ్ము = మమ్ములను
ఏముము +ఓముము = కాపాడుము. కాపాడుము.
ఇమ్ము +ఔము = (మాకు) అనుకూలుడవై వర్తించుము.

చంద్రుని వంటి ముఖము గల ఓ దేవా ! మా బుద్ధి నీకు అనుకూలించును. అనగా సదా నీయందే నిలిచి ఉండును. మా అంహంకారములను విడిచి , మేము నిన్ను సేవించుకొందుము. మా పట్ల ఆనుకూల్యతతో మమ్ములను నిత్యం కాపాడుము.

ఇదండీ సంగతి. వీటిలో కవితా దినుసుకు గ్యారంటీ లేదని ముందే విన్నవించాను కదా.


31, జులై 2010, శనివారం

ఏవి తల్లీ , నిరుడు కురిసిన హిమ సమూహములు ?


యెర్రి నా యెంకి

‘ యెనక జన్మము లోన
యెవరమో’ నంటి !
సిగ్గొచ్చి నవ్వింది
సిలక - నా యెంకి !

‘ముందు మనకే’ జల్మ
ముందోలె’ యంటి

తెల్ల తెల బోయింది
పిల్ల - నా యెంకి !

‘యెన్నాళ్ళొ మన కోలె
యీ సుకము’లంటి !

కంట నీ రెట్టింది
జంట - నా యెంకి !

( కీ.శే. నండూరి వేంకట సుబ్బా రావు - ఎంకి పాటలు )

ఈ పాటలో ఉన్న అపు రూపమయిన తాత్త్వికత చాలా రోజులకి మళ్ళీ గుర్తుకు తెచ్చుకునేలా చేసింది. మరో సారి పాటని మీతో పంచు కోవాలని ....

29, జులై 2010, గురువారం

ఆరు ముఖాలూ , ఆరు ముద్దులూ ....


బ్రహ్మకి అయిదు ముఖాలుండేవి. అయితే, ఇప్పుడు నాలుగే ఉన్నాయి. కుమార స్వామికి ఆరు ముఖాలు , ఒక్కో చోట శివుడికి పంచముఖాలు , రావణుడుకి పది ముఖాలు , ఉండడం మనకి తెలుసు. ఇంకా ఎవరెవరికి ఎన్నెన్ని ముఖాలున్నాయో తెలియదు.

మనమయితే, ‘‘ ఎలా ఉందయ్యా ? ’’ అనడిగితే, నచ్చక పోతే , ‘‘ నాముఖంలా ఉంది ’’ అని చెబుతాం. కాని మీద పేర్కొన్న మహానుభావులు మాత్రం అలా అనడానికి వీలు లేదు. బ్రహ్మ ‘‘ ఏడిచినట్టుంది. నాముఖంలా ఉంది ’’ అని నాలుగు సార్లు , కుమార స్వామి ఆరు సార్లు , పంచ ముఖి శివుడు ఐదు సార్లూ , రావణబ్రహ్మ అయితే ఏకంగా పది సార్లూ అనాలి కదూ ? అన్ని ముఖాల వాళ్ళు ఆ పాటి ఆయాస పడక తప్పదు లెండి.

ఈ పరిస్థితిని గమనించి, మన కవులు చమత్కారంగా కొన్ని పద్యాలు చెప్పారు.

చూడండి ...

అంబా కుప్యతి తాతమూర్ధ్ని విలసద్గంగేయ ముత్ సృజ్యతాం ,
విద్వన్ షణ్ముఖ కా గతి: మయి చిరా దస్యా: స్థితాయా వద,
కోపావేశ వశౌ దశేషవదనై: ప్రత్యుత్తరం దత్తవాన్ ,
అంబోధి: జలధి: పయోధి రుదధి ర్వారాన్నిధి ర్వారిధి:

షణ్ముఖుడు తండ్రి శివుడితో ఇలా అన్నాడు: ‘‘ తండ్రీ ! అమ్మ కోపంగా ఉంది. నీ తల మీద ఉన్న ఆ గంగను విడిచి పెట్టు.’’

శివుడు: ‘‘కుమారా ! చిర కాలంగా నన్నే ఆశ్రయించి ఉన్న గంగను ఎలా విడిచి పెట్టేదిరా. నేను కాదు పొమ్మంటే, పాపం ఆవిడకి ఏదిరా గతి ?’’

చిన్నింటిని విడువడం కుదరదని తండ్రి చెప్పే సరికి కుమార స్వామికి కోపం ముంచు కొచ్చింది.

అతనికి ఆరు ముఖాలు కదూ ? అందు చేత ఆరు ముఖాలతోనూ ఇలా అన్నాడు:
‘‘అంబోధి. జలధి , పయోధి , ఉదధి , వారాంనిధి , వారిధి.‘‘

పై పదాలు ఆరింటికీ సముద్రమనే అర్ధం !!

అంటే , ‘ పోయి , సముద్రంలో పడమను !’ అని దీని అర్ధం.

‘వెళ్ళి గంగలో దూకు ’ అంటాం కదా, కోపంలో. అలాంటిదే ఇదీనూ.

నదీనాం సాగరో గతి: అని, నదులు చివరకు చేరేది సాగరం లోనే కదా ?

గంగకు సాగరమే గతి అని కవి ఈ విధంగా చమత్కరించాడు.

మరో పద్యం , ఆరు ముఖాల వాడి మీదే . చూడండి ...

ఓ కవి గారికి ( జంద్యాల పాపయ్య శాస్త్రి గారని గుర్తు ) అష్టావధానంలో ఇచ్చిన సమస్య ఇది:

‘‘నీవును నీవుయున్ మరియు నీవును నీవును నీవు నీవుయున్ !’’

ఇదీ సమస్య. ఇందులో ఆరు నీవులు ఉన్నాయి. కవి గారు కుమార స్వామి పరంగా ఇలా పూరించారు.

నీవు గజాస్యు చంక దిగనీయవు, నన్నసలెత్తు కోవు ,నీ
కా వెనకయ్య ముద్దు కొడుకయ్యె నటంచును పల్కు షణ్ముఖున్
దేవి భవాని కౌగిట గదించి ముఖంబున ముద్దిడున్ యనున్
నీవును నీవుయున్ మరియు నీవును నీవును నీవు నీవుయున్ !!

ఆరు ముఖాలు కలిగిన కుమార స్వామి ( షణ్ముఖుడు ) తల్లి పార్వతీ దేవితో ఇలా అంటున్నాడు:

‘‘ అమ్మా ! నీవు గజాస్యుని ( వినాయకుడిని ) చంక దిగ నీయవు. నన్ను అసలు ఎత్తుకోవు. నీకు ఆ వెనకయ్యే ( వినాయకుడే ) ముద్దు కొడుకయ్యేడు కదమ్మా ...’’
అంటూ ఏడుస్తున్న షణ్ముఖుని దేవి భవాని ( పార్వతీ దేవి) కౌగిలిలో ప్రేమతో బంధించి, ముఖాన్ని ముద్దు పెట్టుకుని ఇలా అంది: ‘‘ లేదయ్యా !! నువ్వన్నా నాకు మద్దేనురా కన్నా ..!’’

ఇక్కడ చమత్కారం ఏమిటంటే, పార్వతి కుమార స్వామిని లాలిస్తూ , అతని ఆరు ముఖాలనీ ముద్దు పెట్టుకుంటూ నువ్వన్నా నాకు ముద్దేనురా అంది. అందుకే, నువ్వు , నువ్వు ... అంటూ ఆరు సార్లు అంది.! అదీ కవి చమత్కారం.

మన చిన్నారులకి ఏదయినా తినిపించాలన్నా, త్రాగించాలన్నా, పాపం, మన తల్లులు ఎంత అవస్థ పడతారో మనకి తెలిసినదే కదా ? ఈ ఆరు ముఖాల వాడికీ , ఆ తొండం గల వాడికీ - వాళ్ళ చిన్నప్పుడు ఏదేనా తినిపించడానికీ, త్రాగించడానికీ జగన్మాత ఎన్ని తంటాలు పడిందో కదూ ?


28, జులై 2010, బుధవారం

కోపం తన్నుకొస్తోందా ; పది లెక్క పెట్టండి ....


సహసా విదధీత న క్రియా, మవివేక: పరమాపదాం పదం
వృణుతేహి విమృశ్యకారిణమ్ , గుణలుబ్ధా: స్వయమేవ సంపద:

ఈ శ్లోకం ఏం చెబుతోందంటే , ఏ పనీ తొందర పడి చేయ కూడదు. తొందర పాటు , అవివేకమే అన్ని అనర్ధాలకూ మూలం. చక్కగా ఆలోచించి చేసిన పనికి
ఏ ఆటంకాలూ రావు. అట్టి వానిని సంపదలు తమంతట తామే వచ్చి చేరుతాయి. లక్ష్మి గుణ లుబ్ధ కదా ? అంటే మంచి గుణాలపట్ల ప్రీతి కలది కదా !

ఈ శ్లోకాన్ని ఆధారం చేసుకుని ఓ కథ ప్రచారంలో ఉంది.
అదేమిటంటే ...
కిరాతార్జునీయమ్ కావ్యం రచించిన భారవి గురించిన కథ. భారవికి ఎంత పేరు ప్రఖ్యాతులు వస్తున్నా, అతని తండ్రి మాత్రం ఎప్పుడూ అతని గొప్పతనాన్ని అతని ఎదుట పొగుడుతూ ఒక్క మంచి మాట కూడా అనే వాడు కాదుట ! దీనితో భారవికి కోపం వచ్చి , తండ్రిని అంతం చేయాలనుకున్నాడుట. ఆలోచించి ఓ రాత్రి ఇంట్లో అటక మీదికి ఎక్కి , ప్రక్కనే ఓ బండ రాయి పెట్టుకుని అదను కోసం చూస్తూ కూర్చున్నాడుట. ఇంతలో తల్లిదండ్రుల సంభాషణ అతని చెవిని పడింది.

తల్లి : ‘‘ మన భారవిని లోకమంతా అంత గొప్ప కవి అని పొగుడుతూ ఉంటే, మీరు మాత్రం ఒక్కసారీ మెచ్చు కోవడం లేదు ! వాడెంత బాధ పడుతున్నాడో తెలుసా ? ...’’

తండ్రి : ‘‘ అమాయకురాలా ! మన భారవి నిజంగా చాలా గొప్ప కవి. అతని కవిత్వం మహాద్భుతం. అందరూ పొగుడుతున్నట్టుగా తండ్రినయిన నేను పొగడ కూడదు. అది వాడికి క్షేమకరం కాదు.అందుకే పొగడడం లేదు. తండ్రి పొగడ్త బిడ్డలకి ఆయుక్షీణం అంటారు. అంతే కానీ వాడన్నా , వాడి కవిత్వమన్నా నాకెంత ఇష్టమో తెలుసా ? ...’’

దీనితో భారవి గుండె బరువెక్కింది. కిందకి దిగి వచ్చి, తన అపరాధాన్ని మన్నించమని తండ్రిని వేడుకుని, తనకి తగిన శిక్ష వేయమని కోరేడు.

పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని తండ్రి ఎంత చెప్పినా విన లేదు. దానితో తండ్రి భారవిని ఒక యేడాది పాటు అత్త వారింటిలో గడపి రమ్మని శాసించాడు.

శిక్ష వేయమంటే తండ్రి వరమిచ్చాడనుకుంటూ పొంగి పోతూ భారవి భార్యా పిల్లలతో పాటు అత్త వారింటికి చేరాడు.

తొలి రోజులు బాగానే గడిచాయి. అత్త వారింట భారవికి మంచి మర్యాదలే జరిగాయి. కాని రోజులు గడిచే కొద్దీ అతనికి ఆ ఇంట గౌరవాదరాలు తగ్గి పోయాయి. అంతా చాలా హేయంగా చూడ సాగారు. భారవికి భరించ లేనంత అవమానంగా ఉంది. కానీ ఏడాది శిక్షాకాలం గడపాలి కనుక, పంటి బిగువున కాలం గడపసాగేడు.

ఇలా ఉండగా అతని భార్య శుక్రవారం వరలక్ష్మి నోము నోచుకుంటాననీ, దానికి ఏర్పాట్ల కోసం కొంత డబ్బు ఇమ్మనీ అడిగింది.

భారవి దగ్గర చిల్లి గవ్వ లేదు. ఆలోచించి, తను వ్రాసిన కిరాతార్జునీయమ్ కావ్యం లోని ఒక శ్లోకం ఉన్న తాటాకును తీసి భార్యకు ఇచ్చి ఏ ధనవంతుని దగ్గరయినా దానిని కుదువ పెట్టి డబ్బు తెచ్చుకో మని చెప్పాడు. ఆమె దానిని ఓ ధనవంతుని ఇంట కుదువ పెట్టి అతడిచ్చిన పైకంతో నోము నిర్విఘ్నంగా పూర్తి చేసుకుంది.

ఇలా ఉండగా, ఆ ధనవంతుడు ఆమె ఇచ్చిన శ్లోకం వ్రాసి ఉన్న తాటాకుని ఎక్కడ పెడదామా అని ఆలోచించి , చివరకి తన కత్తి ఒరలో దానిని కత్తితో పాటు భద్రంగా ఉంచి , గూట్లో పెట్టాడు. ఆ తర్వాత అతను వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళి పోయి, చాలా ఏళ్ళకి ఇంటికి వచ్చేడు.




వస్తూనే తన రాకతో భార్యకి విభ్రమం కలిగించాలనే చిలిపి ఆలోచనతో ఇంటి వెనుక వేపు ద్వారం లోనుండి ఇంట్లోకి ప్రవేశించాడు.
అక్కడ తమ పడక గదిలో భార్యతో పాటు మరో యువకుడు కూడా సన్నిహితంగా ఉండడం గమనించి, కోపంతో ఊగి పోయాడు. భార్యనీ , ఆ యువకుడినీ చంపెయ్యాలని అనుకుని క్రోధంతో గూటి లోనుండి కత్తిని తీసాడు. సర్రున కత్తి లాగుతూ ఉంటే దానితో పాటు ఓ తాటాకు కూడా బయట పడింది. దాని సంగతే అతను మరిచి పోయాడు. ఏమిటా అని ఆసక్తిగా చదివాడు.

అదే, మీద చెప్పిన శ్లోకం !

ఒక్కక్షణం తటపటాయించేడు. ఇంతలో భార్య లేచి, భర్తని చూసి ఆనందంతో పలకరిస్తూ ఆ యువకుడిని పరిచయం చేసింది. ఆ యువకుడు వారి కుమారుడే. ఆ ధనవంతుడు విదేశాలకు వెళ్ళే సమయంలో అతని భార్య నెల తప్పింది. ఆ తర్వాత ఆ కొడుకు పుట్టాడు. క్రోథావేశంలో ఆ సంగతి కూడా విస్మరించి నందుకు ఆ ధనవంతుడు చాలా సిగ్గు పడ్డాడు.

పెను ప్రమాదం నుండి తన భార్యనీ , కుమారుడినీ కాపాడినందుకు , తను క్రోథావేశంతో నేరం చేయకుండా రక్షించినందుకు అతనికి ఆ శ్లోక రచయిత భారవి పట్ల అపారమయిన గౌరవాదరాలు కలిగి, మరుచటి దినమే ఆ మహా కవిని దర్శించుకుని గొప్ప కానుకలు సమర్పించుకున్నాడు.
భారవి శిక్షా కాలం కూడా ఆ దినంతో ముగియడంతో అతను ఆ అపూర్వ ధన రాసులతో, భార్యా బిడ్డలతో తిరిగి తన తల్లిదండ్రుల చెంతకు ఆనందంగా చేరాడు.

చక్కగా ఆలోచించి చేసే పనికి ఏ ఆటంకమూ రాదు. వేయి విధాలుగా ఆలోచించి కార్యాలు చేయని వాడు గొప్ప ఆపదల పాలవుతాడు. ఆలోచించి చేసే వాడిని లక్ష్మి వరిస్తంది. అని ఈ శ్లోకార్ధం నిత్య సత్యం కదూ !

అందుకే కదా, కోపం తన్నుకొస్తూ ఉంటే , పది అంకెలు లెక్క పెట్టమని మని పెద్దలు చెప్పారు ....
రెడీ ... ఒన్ ... టూ ... త్రీ ... ఫోర్ ....!!

25, జులై 2010, ఆదివారం

విజయ నగరం జిల్లా రచయితలు.

Kadhaki Namaskaram

వాళ్ళని మరి మార్చ లేం !


దుర్జనేన సమం వైరం , ప్రీతించాపి న కారయేత్
ఉష్ణో దహతి చాంగార: శీత: కృష్ణాయతే కరమ్

దుర్జనులతో విరోధమూ వద్దు.స్నేహమూ వద్దు. బొగ్గులు చల్లగా ఉన్నప్పుడు చేతులను మసి చేస్తాయి. వేడిగా ఉన్నప్పుడు చేతులను కాలుస్తాయి. అది బొగ్గుల నైజం. దుష్టుల స్వభావమూ అంతే. మైత్రి లోనూ విరోధం లోనూ కూడా అపకారమే చేస్తారు సుమా !

18, జులై 2010, ఆదివారం

కుక్క , యువకుడు , ఇంద్రుడు


కాచం మణిం కాంచన మేకసూత్రే , గ్రధ్నాతి ముగ్ధేతి కిమత్ర చిత్రంఅశేషవిత్ పాణిని రేకసూత్రే , శ్వానం యువానం మఘవాన మూచే
ఒక ముద్దరాలు దండ గుచ్చుతోంది. అది చూసి , ఒక పెద్ద మనిషి ఇలా అడిగాడు : ‘‘ ఓ అమాయకురాలా ! అదేం అలా చేస్తున్నావు ? గాజు పూసను , మణిని , బంగారాన్ని ఒకే దారంలో గ్రుచ్చుతున్నావు . వింతగా ఉంది. ఇది తెలివి తక్కువ పని కాదూ ? ..’’
అందుకా ముద్దరాలు వినయంగా ఇలా జవాబు చెప్పింది: ‘‘ అయ్యా, మహా పండితుడు పాణిని మహా శయుడు సంస్ఝ్జృత భాషలో వ్యాకరణ గ్రంధం కౌముది ( పాణినీయం) వ్రాస్తూ , తద్ధిత ప్రకరణంలో, కుక్కను , యువకుని, ఇంద్రుని ఏక సూత్రంలో చెప్ప లేదూ ? శ్వయువమఘోనామ తద్ధితే అని కదా ఆ సూత్రం ! ... అఖండ మేధావి పాణిని అలా చేసినప్పుడు మా బోంట్ల సంగతి అడగడం ఎందుకులే ...’’ అంది.
పాణిని కుక్క , యువకుడు , ఇంద్రుడు - ఈ పదాల తద్ధిత ప్రత్యయాలు ఏర్పడే విధం గురించి చెప్పిన వ్యాకరణ సూత్రం ఉటంకిస్తూ ఆ కడు ముద్దరాలు చమత్కారంగా చెప్పిన సమాధానం ఇది.
మేం విజయ నగరం ప్రాచ్య కళాశాలలో చదువుకునే రోజులలో పాణిని సూత్రాలను మా వ్యవహారాలకు అనుగుణంగా సరదాగా చెప్పుకునే వాళ్ళం. ఉదాహరణకి, అజాద్యతష్టాప్ అనే పాణిని సూత్రం ఎవరయినా అప్పడగ బోతూ ఉంటే ఈ సూత్రాన్ని నవ్వుతూ వల్లె వేసే వాళ్ళం. ఇది అప్పడగడానికి మేం పెట్టుకున్న సంకేతం అన్న మాట !

17, జులై 2010, శనివారం

ఒక పీడ కల









































కింవాససైవం న విచారణీయం ,
వాస: ప్రధానం ఖలు యోగ్యతాయా:
పీతాంబరం వీక్ష్య దదౌ తనూజాం
దిగంబరం వీక్ష్య విషం సముద్ర:

‘నాకు బట్టల మీద అంత శ్రద్ధ లేదండీ, అయామ్ వెరీ సింపుల్. ’ అంటారు కొందరు కించిద్గర్వంగా. మేచింగుల కోసం , బట్టల సెలక్షన్ కోసం ఆడవాళ్ళు వెచ్చించే సమయం అంతా యింతా కాదు. గణితం వేస్తే గుండె

తరుక్కు పోతుంది. కొందరు మగవాళ్ళూ దీనికి మినహాయింపు కాదు. ఈ శ్లోకం గురించి చెప్పుకునే ముందు ఆ మధ్య నా కొచ్చిన గమ్మత్తయిన కల గురించి చెబుతాను వినండి. ఆ కల రావడం నిఝ్ఝంగా నిఝం సుమండీ ...
ఏదో ఓ మహా పట్టణంలో రోడ్డు మీద నడుస్తున్నాను. ఓ బట్టల షాపు ముందు పేద్ధ బోర్డొకటి కనిపించింది. దానిమీద ఏం రాసుందో నాకు మెళకువ వచ్చేక కూడా అక్షరం పొల్లు పోకుండా గుర్తుంది. చూడండి ...

రండి ! రండి !

దయ చేయండి. మా వద్ద చిరిగినవీ, లెక్క లేనన్ని మాసికలు వేసినవీ, అట్ట కట్టి అలుగ్గుడ్డలా ఉన్నవీ, వెలిసి పోయినవీ, చీకి పోయినవీ, మీరే లెక్క పెట్టడానికి విసుక్కునేటన్ని జేబులు కలవీ అయిన రక రకాల కొత్త జీన్ ఫేంట్లు సరి కొత్త స్టాక్ వచ్చింది. త్వర పడండి. జీబురు గడ్డం వాళ్ళకీ, తల మాసిన వాళ్ళకీ , నిక్క బొడుచుకున్న తల వెండ్రుకలు కలవారికీ ప్రత్యేక డిస్కౌంటు కలదు. ఆలసించిన ఆశా భంగం

మరో క్షణంలో అక్కడ చేరిన వేలాది మంది కుర్రాళ్ళని కంట్రోలు చేయ లేక పోలీసులు లాఠీ చార్జి చేయడం, వింత చూస్తున్న నా నుదుటి మీద కూడా ఓ దెబ్బపడడంతో మెళకువ వచ్చింది.

ఇది సరదాకి రాసింది కాదు. నమ్మక పోతే నేనేం చేయను ? త్వరలో ఇలాంటి (పీడ) కలలు
మీకూ రావాలని ఉడుకుమోతుతనంతో శపించడం తప్ప ?

ఇక, శ్లోకం చూదాం ...

ఎలాంటి బట్టలు కట్టుకుంటేనేం అని అనుకోడం తగదు సుమా అని కవి హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే, లోకం లో ఒక మనిషి యోగ్యతను అతను వేసుకున్న బట్టలను బట్టే నిర్ణయించడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.

క్షీర సాగర మథనం జరిగేటప్పుడు శ్రీ మహా లక్ప్మితో పాటు, కాలకూట విషం కూడా పుట్టిందని తెలిసిన విషయమే కదా ? అయితే, సముద్రుడేం చేసాడో చూడండి ...
పీతాంబరధారికి ( మహా విష్ణువుకి ) తన కూతురు రమని ఇచ్చేడు. దిగంబరుని (శివుడిని ) చూసి ఈ మొఖానికిది చాలునులే అన్నట్టుగా కాలకూట విషాన్ని ఇచ్చేడు.

లోకం ఇలా ఉందండీ బాబూ , ఏం చేస్తాం !

మహాత్మా గాంధీ ఓ సారి రౌండ్ టేబిలు సమావేశానికి గావంచా కట్టుకుని పై మీది కండువాతో వెళ్తే అక్కడ వాళ్ళతనిని పోల్చుకో లేక లోపలకి పోనివ్వకుండా తరిమేసారుట.
అప్పుడు గాంధీజీ మంచి సూటు బూటు వేసుకుని వస్తే ఆదరంగా లోపలికి పంపించేరుట. సరే, లోపలికి వెళ్ళాక, విందు మొదలయితే, గాంధీజీ ఆహార పదార్ధాలను తినడం మానేసి తొడుక్కున్న ఖరీదయిన కోటు మీద వేసుకోడం మొదలెట్టారుట. ఇదేం పిచ్చి పని అని అందరూ విస్తుపోతే ఇక్కడికి రమ్మని ఆహ్వానం పంపింది నా కోటుకే కాని, నాకు కాదు కదా ! దాని విందు నేనెలా తింటాను ? అనడిగారట. అక్కడి అధికారులకి కొంచెం ఆలస్యంగా ట్యూబు లైటు వెలిగి, మహాత్ముని క్షమాపణలు వేడుకున్నారుట. ఈ కథ నిజమో కాదో కాని, చిన్నప్పుడు మా డ్రిల్లు మాష్టరు (ఆటలాడించడం మానీసి మరీ ) కథలు కాకరకాయలు చెప్పేటప్పుడు దీనిని మాకు చెప్పారు. శ్లోక సందర్భానికి సరి పోతుందనిపించి చెప్పానంతే ...



16, జులై 2010, శుక్రవారం

తిరగ బడు ! ( విప్లవం కాదు).

ఈ శ్లోకంలో చమత్కారాన్ని చూడండి ...

సాక్షరా విపరీతాశ్చేత్ , రాక్షసా ఏవ కేవలం
సరసో విపరీతో2పి , సరసత్వం న ముంచతి.

అక్షరాస్యులు విపరీతులయితే , అంటే దుర్మార్గపు వర్తనులయితే , రాక్షసులవుతారు. వారి చదువు చట్టుబండలై , మహా దూకుడుకుగా తయారవుతారు.

అంతే కదా, సాక్షరులు అంటే అక్షరాస్యులు. శ్లోకంలో సాక్షరా అనే పదాన్ని తిరగేసి చదవండి రాక్షసా
( రాక్షసులు) అని రావడం లేదూ !

అయితే, సరసుల (పండితులు ) తలక్రిందులయినా , అంటే , ఎట్టి పరిస్థితిలోను కూడా , తమ సరసత్వాన్ని వీడరు.

శ్లోకంలో రెండో పాదం మొదటి పదం చూడండి. దానిని సరస: , విపరీత: అపి అని చదువుకోవాలి.

ఇప్పుడు చూడండి ... సరస అనే పదం వెనుక నుండి చదివినా మారడం లేదు. కదూ ?

చదవేస్తే ఉన్న మతి పోతుంది కొందరికి. చదువుకున్న మూర్ఖులుగా తయారవుతారు. కొందరు మాత్రం ఎదిగిన కొద్దీ ఒదిగే లక్షణాన్ని కలిగి ఉంటారు. అదన్న మాట సంగతి.