12, సెప్టెంబర్ 2010, ఆదివారం

హిత వచనమ్ డాట్ కామ్


సాధారణంగా ప్రసంగవశాత్తు మనం మన పెద్దల నుండి విన్న నానుడులో, సామెతలో, పద్య పాదాలో, శ్లోక చరణాలో సందర్భవశాత్తు ఉటంకిస్తూ ఉంటాం.అలా ఉటంకించే వాటిలో సద్య పాదాల, శ్లోక చరణాల చివరి పంక్తులు మాత్రమే చెబుతూ ఉంటాం. వాటి పూర్తి పాఠం మనలో కొందరకి తెలియక పోవడం కద్దు. అలాంటి వాటి పూర్తి పాఠాలను కొన్నింటిని ఇక్కడ చూదాం.

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని తరుచుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ శ్లోకం పూర్తి పాఠం ఇది:

అపి స్వర్ణమయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

తమ్ముడా లక్ష్మణా ! ఈ రావణ లంక మొత్తం బంగారుమయం అయితే కావచ్చును. కానీ నాకిక్కడ ఉండడం సమ్మతం కాదు. ఈ వైభోగాలేవీ నాకు రుచించడం లేదు. మన బంధుగణాన్నీ,అయోధ్యాపురినీ వెంటనే చూడాలని ఉంది. ఎందుకంటే, కన్న తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

మరొకటి:
నాస్తి జాగరతో భయం అంటూ ఉంటారు కదా, దీని పూర్తి పాఠం చూడండి:

కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం

చక్కగా వ్యవసాయం చేస్తే కరువు కాటకాలంటూ ఉండవు. నిత్యం జపతపాలు చేస్తూ ఉంటే అన్ని
పాపాలూ పోతాయి. మౌనంగా ఉండడం వల్ల ఎవరితోనూ జగడం అన్నదే ఉండదు. మెలకువగా, జాగ్రత్తగా ఉంటే భయమన్నదే ఉండదు.

మరొకటి:

విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనే దాని పూర్తి పాఠం చూడండి:

విద్వత్త్వంచ నృపత్వంచ
నైవ తుల్యం కదాచన
స్వదేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే

పండితుడు, రాజు వీరికి పోలికే లేదు. రాజు కేవలం తన దేశంలోనే , అంటే తన రాజ్యం లోనే
గౌరవించబడతాడు. ఇక పండితుడో? లోకమంతటా గౌరవాదరాలు పొందుతాడు.

దేనికయినా మరీ ఓవరయి పోతూ ఉంటే అతి సర్వత్ర వర్జయేత్ అని హెచ్చరిస్తూ ఉంటాం,దీని పూర్తి పాఠం చూడండి:

అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్

కన్నూ మిన్నూ కానకుండా దానాలూ ధర్మాలూ చేసుకుంటూ పోతే నాశనమై పోతాం సుమా.అందుకు భారతం లోని కర్ణుడే తార్కాణం. ఇంద్రుడు కపటోపాయంతో కవచ కుండలాలు దానమడిగితే మరో ఆలోచన లేకుండా వాటిని దానం చేసీసేడు. అవి లేనందు వలన యుద్ధంలో మరణించాడు. అలాగే మరీ అంత దురాశా పనికి రాదు. తమదీ, పాండవులదీ కూడా రాజ్యం తనకే దక్కాలనే పేరాశతోనే కదా, దుర్యోధనుడు పేచీల మీద పేచీలు పెట్టి, కడకు భరత యుద్ధంలో దుర్మరణం పాలయ్యేడు. అలాగే మితి మీరిన కామంతో రావణుడు సీతాపహరణం చేపి రఘురాముని చేతిలో మరణించాడు. అందు వలన ఎందులోనూ అతి పనికి రాదు
సుమా !
అందుకే చెప్పేరు, ఎప్పుడూ అతి వద్దు. మితి ముద్దు. అని.

మరొకటి చూడండి:
చెబితే వింటాడూ? వాడి కెంత తోస్తే అంత! అనుభవిస్తాడు వెధవ ! బుద్ధి: కర్మాను సారిణీ అని, మన వాళ్ళు ఊరికే అన్నారా? అనడం వింటూ ఉంటాం. దాని పూర్తి రూపం చూడండి.

సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగానుసారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

లక్ష్మి నిత్యం సత్యాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగాన్ని అనుసరించి కీర్తి ఉంటుంది. ఎంతగా అభ్యాసం చేస్తే అంతగా విద్య పట్టువడుతుంది. మానవ బుద్ధి వారి కర్మను అనుసరించి ఉంటుంది. వాడి కర్మ ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది.

ఇంకొకటి చూదామా?

న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథాపి తృష్ణా రఘునందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

బంగారు లేడి పుట్టి ఉండడం ఎప్పుడూ జరిగి ఉండ లేదు. అలాంటి బంగరు లేడిని ఎన్నడూ చూడనూ లేదు. విననూ లేదు. కాని, ప్రియసతి సీత అడిగింది కదా అని,ముందు వెనుకలు ఆలోచించకుండా బంగారు లేడిని తీసుకుని రావడానికి విల్లంబలు ధరించి రాముడు పరిగెత్త లేదూ? ఆ పిదప రావణుడు సీతను అపహరించడం, రాముడు పడిన వేదన, రావణ వధ ఎన్న ఇడుముల పాలయ్యాడో కదా? చెడి పోయే కాలం వస్తే అలాంటి విపరీతమయిన బుద్ధులే పుడతాయి మరి !

చివరగా మరొకటి ...

చెప్పింది చెప్పినట్టు వెంటనే ఎప్పుడూ చేయవు కదా, ప్రతీ దానికీ ఊరకే తటపటాయిస్తావు.ఆలస్యాదమృతం విషం రా నాయనా ! అని కోప్పడుతూ ఉంటాం. దాని పూర్తి పాఠం చూడండి మరి:

సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యవ్వనమ్
కాలక్షేపం న కర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

వండిన అన్నాన్ని వేడి వేడిగా తినక పోతే అది జీర్ణమై చావదు. చల్లారిన భోజనం విషతుల్యం.అలాగే, యవ్వన వతులైన ముదితలు వారి యవ్వనం కోలు పోయాక అందగించరు. ప్రతీదీ తరువాత చూదాం లే అని, తాత్సారం చేయడం కూడా మంచిది కాదు. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషంగా మారి పోతుంది సుమా!

ఇప్పటికివి. మరి కొన్ని తదుపరి హిత వచనమ్ డాట్ కామ్ లో చూదాం.

సంస్కృత శ్లోకాలే కాదు, మన కవిత్రయం వారి భారతం లోనూ. పోతన గారి భాగవతం లోనూ, రామాయణం లోనూ, ఇతర ప్రసిద్ధ కావ్యాలు, ప్రబంధాలలోనూ ఇలాంటివి చాలా కొటేషన్లు కనిపిస్తూ ఉంటాయి.

వీలుని బట్టి వాటిని మన హిత వచనమ్ డాట్ కామ్ లో చూదామా?

స్వస్తి.

11, సెప్టెంబర్ 2010, శనివారం

త్వమేవా2హమ్


వినాయక చవితి శుభాకాంక్షలు.

ఉదయాన్నే వొచ్చేడు నా కాషాయ మిత్రుడొకడు. ఇదేం పిచ్చిరా బాబూ ! ఇదేం గోల! ఊరంతా ఎక్కడ చూసినా వినాయక ఉత్సవాలే, దారి పొడుగునా వినాయక పెండాల్ లే కనిపిస్తున్నాయి. ఒక దానిని మించిన ఎత్తులో ఒకటి ఉంటున్నాయి వినాయక విగ్రహాలు. మైకులు చెవులు చిల్లులు పడేటట్టుగా హోరెత్తించేస్తున్నాయి. ఆ రంగులు పర్యావరణానికి ఎంతో ముప్పు కలిగిస్తుందని మొత్తుకుంటున్నా వీరికి చెవి కెక్కదు. వీళ్ళ దుంప తెగ !

అవేం విగ్రహాలు ! ఒక్కో చోట ఒక్కో రకం వినాయక ప్రతిమ కనిపిస్తోంది. ఎవడికి తోచినట్టు వాడు చేయిస్తున్నాడు. ఆధునిక వినాయకుడట ! ఆల్ట్రా మోడరన్ వినాయకుడట. వీళ్ళకి మతులు కానీ పోతున్నాయా? అని ఆవేశ పడి పోయాడు.



మైకుల హోరు తగ్గించి, శబ్ద కాలుష్యం అరికట్టాలనీ, వినాయక ప్రతిమల తయారీలో పర్యావరణానికి హాని కలిగించే రంగుల వాడకం కూడదనీ చెబుతున్న దానిలో విప్రతిపత్తి లేదు. కాని, రకరకాల ఫోజులలో వినాయక ప్రతిమలు చేయిస్తూ గణపతి దైవాన్ని అపహాస్యంపాలు చేసేస్తున్నారనే విషయంలో నా అభిప్రాయం వేరుగా ఉంది.

విఘ్నాలు పోగొట్టి మనందరకీ సకల శుభాలూ కలిగిచే వినాయకుడంటే మనందరకీ చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే,

ఆ తొండం, ఆ బాన పొట్ట, ఆ కుబ్జ రూపు ... ఇవేవీ మనకి తోచవు. ఒక దేవతా మూర్తిగా భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తూనే వినాయకుడిని మనం ఒక ఆత్మీయ మిత్రునిగా, మనలో ఒకడిగా భావిస్తాం కాబోలు. అందుకే ఏ దేవుడికీ లేని విధంగా వినాయకుడికి పూజలు చేసే వేళ వినాయక రూపాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా రూపొందించుకుంటున్నాం.

ఒక్కో చోట ఒక్కో ఆకారంలో తయారు చేసిన వినాయక విగ్రహాలు ఈ ఉత్సవ సమయంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. కపు విందు చేస్తూ ఉంటాయి. అపరిమితమైన వినోదాన్ని అందిస్తూ ఉంటాయి.

వినాయకుడు ఫేంటూ చొక్కా వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని ల్యాప్ టాప్ ముందు కూచున్న తీరు చూసి మురిసి పోతాం

.

మోటారు బైకు నడిపే వినాయకుడూ, జైజవాన్ లా ముస్తాబయిన వినాయకుడూ, రకరకాల పండ్లతో చేసిన వినాయకుడూ, క్రికెట్ లాంటి ఆటలు ఆడే వినాయకుడూ, రక్షక భటుని వేషంలో ఉండే వినాయకుడూ, ఇలా ఒకటేమిటి? ఎన్ని రకాల ఫోజులలోనో వినాయక విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి,

వినాయకుడి విషయంలో ఇదేదో తీరని అపచారం జరిగి పోతున్నదని ఊరకే గుండెలు బాదుకోనవసరం లేదని

నా అభిప్రాయం.

వినాయకుడంటే జనాలకి భక్తితో పాటు ఒక దగ్గరితనం కూడా ఉంది.తమనీ, తమ వృత్తులనీ, తమ జీవితాన్నీ ,జీవితావసరాలనీ, తమ ఆలోచనలనీ, తమ ఆనందాలనీ, తమ నైమిత్తిక సమమస్యలనీ, తమ అభిరుచులనీ, అభీష్టాలనూ. తమకు చెందిన సమస్త వస్తు సముదాయాన్నీ తమతో పాటు తమ ఇష్ట దైవం వినాయకుడివిగా భావించి , తమను తాము ఆ గణపతితో అన్ని విషయాలలో ఐడింటిఫై చేసుకోవడం వల్ల గణపతిని ఒక దేవుడి కన్నా, ఒక ఆత్మీ బంధువుగానో, చెలికానిగానో చూస్తూ ఉండడం వలన ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు వినాయక ప్రతిమలు చేయిస్తున్నారు అని నా భావన. కనుక, ఇదేమంత తీవ్రంగా ఆక్షేపించ వలసిన విషయం కాదనుకుంటాను

Hand made Ganapathi.JPG

.ఇది, విశాఖపట్నంలో ఉండే మామరదలు స్వాతి స్వయంగా తను తయారు చేసిన మట్టి వినాయకుడు. బాగుంది కదూ ! వీలయినంత వరకూ ప్రతి ఒక్కరూ ఇలా మట్టి వినాయకుడిని తయారు చేసుకుని పూజ చేస్తే పర్యావరణ కాలుష్యం బెడద ఈ పండుగ సందర్భంగా కొంతయినా తగ్గుతుంది. అంతే కాక, మనం స్వయంగా చేసుకోవడంలో ఉండే ఆనందం కూడా అనుభవించ వచ్చును. ఏమంటారు?

మా ఇంట వినాయక పూజ ఫొటోలు చూడండి.


సరే, ఈ రోజు వినాయక చవితి సందర్భంగా వినాయకుని స్తుతించే ఒక చక్కని పద్యం చూదాం ....

అంకముఁజేరి శైలతనయాస్తన దుగ్ధము లాను వేళ బా

ల్యాంక విచేష్టఁదొండమున నవ్వలిచన్ గబళింపఁబోయి యా

వంకఁగుచంబుఁగాన కహి వల్లభ హారముఁగాంచి వే మృణా

ళాంకుర శంక నంటెడు గజాస్యునిఁగొల్తు నభీష్ట సిద్ధికిన్

( అల్లసాని పెద్దన. మను చరిత్రము)

బాల గణపతి తల్లి పార్వతమ్మ ఒడిలో చేరాడు. చనుబాలు త్రాగుతున్నాడు.పసితనపు చెయిదము చేత తొండంతో అవతలి కుచాన్ని పట్టు కోవాలని చూసాడు. అర్ధ నారీశ్వరత్వం వల్ల అటు వేపు తల్లి స్తనం వానికి దొరక లేదు.

సరి కదా, పాముల హారాన్ని చూసి, దానిని తామర తూడు అనుకుని పట్టుకో బోయాడు ! గజాస్యుడు కదా మరి ! తామర తూడు పట్ల ఆకర్షితుడు కావడం సహజమే మరి ! అట్టి వినాయకుడిని నా కోరికలు నెరవేరాలని సేవిస్తాను

అని పెద్దన గణపతి స్తవం కమనీయంగా చేసాడు, తన మను చరిత్రములో.

అందుకే,

పెద్దన గారి మను చరిత్ర కల్పాంతముల దనుక మను చరిత్ర !!.

అవిఘ్నమస్తు..

స్వస్తి.

8, సెప్టెంబర్ 2010, బుధవారం

సతాయింపు వారి సహజ గుణము !


ద్వా విమౌ పురుషౌ లోకే, శిరశ్శూల సమౌ మతౌ,
గృహస్థశ్చ నిరారంభో, యతిశ్చ సప్రతిగ్రహ:

లోకంలో ఇద్దరి వల్ల చాలా ఇబ్బంది. వాళ్ళు మనకు తల నొప్పిగా పరిణమిస్తారు.
ఎవరయ్యా వాళ్ళు, అంటే,

ఏపనీ చేయని ఇంటి యజమాని ఒకడు.

రెండో వాడు సన్యాసం తీసుకుని కూడా గృహస్థుల దగ్గర డబ్బు ఆశించే యతి.

వీళ్ళిద్దరితో తల నెప్పి ఇంతా అంతా కాదు. శ్లోకంలో శిరశ్శూల సమౌ అనే పదం వీళ్ళు మనకి తల నెప్పితో సమానం అని చెబుతోంది.

నిజమే కదూ, ఏపనీ చేయకుండా, నిర్వ్యాపారంగా ఇంట కూర్చుని తింటూ, అలాగని ఊరు కోకుండా ప్రతి దానికీ సతాయిస్తూ ఉండే మగాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళతో తల నెప్పి కాక మరేమిటి?

ఇక, సన్యాసం తీసి కొన్న యతులు మన మతులు పోగొట్టే వైభోగాలు అనుభవిస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం కదా? కాషాయం కట్టి, సర్వం పరిత్యజించామని చెప్పుకునే వాళ్ళు కూడా, ధనం కోసం పీడించడం సతాయింపు కాక మరేమిటి చెప్పండి ?

వీళ్ళలో కొందరికి కట్న కానుకలు కావాలి. పాద పూజలు కావాలి. పూల దండలు కావాలి. ఎర్ర తివాచీ ఆహ్వానాలు కావాలి. ఏసీ కార్లూ, గదులూ కావాలి. విమాన ప్రయాణాలు కావాలి. విదేశాలలో లభించే సకల వైభోగాలూ కావాలి.

కుదిరితే కప్పు కాఫీ లాగ, అందమైన అమ్మాయిలూ, సినీ తారలూ కావాలి ...

అబ్బో, ఆశా పాశము కడున్ నిడుపు. లేదంతంబు ....

పనీ పాటు చేయని వాళ్ళంటే, కేవలం రిటైరయిన వాళ్ళూ, వృద్ధులూ మాత్రమే అనుకో నక్కర లేదండీ. మంచి వయసులో ఉండే మగానుబావులు కొందరిలోనూ ఈ పని గండం గాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళ సతాయింపు అనుభవించే ఇంట్లోని వ్యక్తులకే ఎరుక.

శ్లోకంలో పురుషుల గురించే చెప్పారు కనుక ఆడవారికి మినహాయింపు ఉందనుకో నక్కర లేదండోయ్.

పని చేస్తూనో, చేయకుండానో, , చేస్తున్నట్టు నటిస్తూనో, సతాయించే తల నెప్పి లలనలకు
తక్కువేం లేదు.

ఏతావాతా ఈ సతాయింపు గాళ్ళు తల నెప్పి మాత్రలూ, మందులూ తయారు చేసే కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్లుగా చక్కగా పనికొస్తారు.

అయితే, అందుకూ సతాయిస్తారేమో, కదూ !

7, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఆట పాటల మేటి


ఆట పాటల మేటి, హరి కథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు విజయ నగర ప్రభువులు ఇచ్చిన ఒక సమస్యను ఈ విధంగా పూరించారు. చూడండి:

సానుల యొద్ద నిచ్చకము సల్పుచు లొంగుచునుంట కర్షమౌ
దానము సేయ కుంటకు వృధా దినముల్సరి పుచ్చుకుంటకున్
ఙ్ఞానియు జాణయైన తన నాథుని గన్గొను నప్డు కు
న్మానము ప్రేమ లజ్జయును మాటికి బోరగ బ్రీతి మీరెడున్.

నారాయణ దాసు గారి గురించి ఇక్కడ క్లిక్ చేసి చూడండి.

దాసు గారి జీవిత చరిత్ర నా యెరుక చదవడం ఒక గొప్ప అనుభూతి కలిగిస్తుంది.
హరి కథనే కాదు, అవసర పడితే గిరి కథ కూడ చెప్పటల దిట్ట దాసు గారు.

దాసు గారు గజ్జె కట్టి, విజయ నగరంలో గుమ్చీ అరుగు మీద, మూడు కోవెళ్ళ దగ్గర గొంతెత్తి
శంభో నినాదం చేసారంటే, మైకులు లేని ఆ రోజులలో ఊరు ఊరంతా మారు మ్రోగి పోయేదని చెబుతారు.

నేను తెలుగు పండితునిగా నియామకపు ఉత్తర్వులు అందుకుని తొలి సారిగా ఉద్యోగ జీవితంలో నిడగల్లు అనే గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాయనయ్యాను. ఆ ఊరు మా స్వగ్రామం పార్వతీ పురానికి కేవలం 8 కి,మీ. దూరంలో ఉంది. బస్సు దిగేక 4 మైళ్ళు నడిచి వెళ్ళాలి. ఇప్పుడు బస్సు సౌకర్యం వచ్చిందనుకోండి. చెప్పొచ్చేదేమిటంటే, ఆ నిడగల్లు గ్రామానికి దాసు గారు జన్మించిన అజ్జాడ అగ్రహారం చాలా దగ్గర. దాసు గారి జన్మస్థలాన్ని ఒకటికి రెండు సార్లు దర్శించుకునే అదృష్టం నాకు లభించింది. అంతే కాదు, విజయనగరంలో
ఐదేళ్ళ పాటు మహా రాజా ప్రభుత్వ సంస్కృత కలాశాలలో చదువుకునే రోజులలో నిత్యం దాసు గారి దివ్య గళంతో పునీతమైన గుమ్చీని, మూడు కోవెళ్ళని దాటుకుంటూ వెళ్ళే వాడిని.
అను నిత్యం నేనూ, మా మిత్రులూ అక్కడికి రాగానే దాసు గారిని తలుచుకుంటూ పరవశించి పోయే వాళ్ళం.

అప్పటి మా మిత్రులలో మంగిపూడి వేంకట రమణ మూర్తి దాసు గారి పరోక్ష శిష్య సరంపరలో ఒకడిగా హరి కథలు నేర్చుకుని, హరిదాసుగా మంచి పేరే సంపాదించుకున్నాడు.

ఈ సందర్భంగా నారాయణ దాసు గారి గురించి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలను ఓ సారి గుర్తు చేసుకుందాం:

1.
ఎవరీ ముగ్ధ మనోఙ్ఞ దర్శనుఁడెవండీ శారదా మూర్తి ! యీ
నవ శృంగార రసావతారుడెవరన్నా ! శ్రీమదజ్జాడయే
యవునా ! ఆ దరహాస!మానడకతీ!రాఠీవి!యాదర్ప! మా
కవితా దీప్తి! యనన్య సాధ్యములురా! కైమోడ్పులందింపరా!

2.
పండించె నీ కాలి గండ పెండెరము రం
గారు ముంగారు బంగారు పంట
నర్తించె నీ కీర్తి నవనవస్ఫూర్తి యా
సేతు శీతాచలక్ష్మాతలాన
జోహారులందె నీ సాహిత్య నందిని
కదలించి సహృదయ హృదయములను
గంభీరమయ్యె నీ శంభో నినాదంబు
దిగ్దిగంతాల బ్రతి ధ్వనించి

కాంతు లీనెను రాజ సభాంతరాల
నీ జయశ్రీ దృగంత నీరాజనాల
యక్షగాన కళా మహాధ్యక్ష పదవి
అక్షరంబయ్యె నీ పట్ల నాది భట్ల !

3.
చిఱు తాళముల జత చే ధరించిన చాలు
లయ తాళములు శుభోదయము పలుకు
కాలి గజ్జె లొకింత ఘల్లుమన్నను చాలు
భరతమ్ము నీ ముందు శిరసు వంచు
వీణతంత్రులు ముని వ్రేళ్ళు సోకిన చాలు
సంగీత వాహిని పొంగి పొరలు
గంటంబుఁబూని క్రీగంటఁగాంచిన చాలు
కవిత నీ యెదుట సాక్షాత్కరించు

నేటి కథకులందు నీ పేరు చెప్పక
గజ్జె కట్టు వాడు కాన రాడు
తెలుగు వెలుగు దేశ దేశాన నింపిన
హరి కథా పితా మహా ! నమోస్తు !

4.
ఎవడురా! యచట తెండింకొక్క గ్లాసంచు
అమృత రక్షకులకు నాఙ్ఞ యొసఁగి
సుధ కంటె మా హరి కథ లెస్స యని బృహ
స్పతి తోడ నర్మ భాషణము నెఱపి
ఏవమ్మ వాణి ! యేదీ వీణ ! సరి క్రొత్త
తీవలా ! యని గిరాందేవి నడిగి
ఆగవే రంభ ! ఆ హస్త మట్టుల గాదు
త్రిప్పి పట్టు మటంచు తప్పు దిద్ది

ఏమయా ! క్రొత్త సంగతు లేమటంచు
బ్రహ్మమానస పుత్రుని పలుకరించి
ఆది భట్ల నారాయణాఖ్యము మహస్సు
తిరుగునిందందు స్వర్గ మందిరములందు !

ఆ దివ్య మహస్సుకి నమోవాకములర్పిస్తూ ....

స్వస్తి.



6, సెప్టెంబర్ 2010, సోమవారం

పోనిద్దురూ ...!!


ఇహ తురగ శతై: ప్రయాంతు మూఢా:
ధనరహితాస్తు బుధా: ప్రయాంతు పద్భ్యాం
గిరిశిఖరగతా2పి కాక పంక్తి:
పులినగతై ర్న సమత్వమేతి హంసై:

లోకంలో విద్య, సంస్కారాలు ఎంత మాత్రమూ లేని వారు, రసహీనులు ఏనుగుల మీద, గుర్రాల మీద, రధాల మీద ఊరేగుతూ ఉంటారు.మహా పండితులు, పరమ యోగ్యులు, ధార్మికులు మాత్రం నిరు పేదలవడం వలన కేవలం కాలి నడకన పోతూ ఉంటారు.
కాకులను చూడండి. పర్వత శిఖరాల మీద బారులు తీర్చి కూర్చుని ఉంటాయి.
మరి హంసలో ? నేల మీద నదీ పులినతలాలలో తిరిగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత ఆ హంసలతో కాకులు సాటి రాజాలవు కదా !

ఇదీ ఈ శ్లోకార్ధం.

నిజమే కదా, ఉన్నతులు నిగర్వులై, నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఉండడం, ఇడుములు పడుతూ ఉండడం, కుసంస్కారుల చేత నిదాదరణ. తిరస్కారాలు పొందుతూ ఉండడం మనం తరుచుగా చూస్తూనే ఉంటాం.

అలాగే, అధములు ఆడంబర జీవనం గడపడమూ మనకి తెలిసినదే. నిజానికి ఈ పాడు లోకంలో అలాంటి వారికే మన్నన ఎక్కువగా ఉండడం బాధాకరం. కాని, అది లోక రీతి.

ఏం చేస్తాం చెప్పండి?
యస్యాస్తి విత్తం స నర: కులీన: స పండిత: స:శ్రుతవాన్ గుణఙ్ఞ:
స ఏవ వక్తా సచ దర్శనీయ: సర్వే గుణా: కాంచన మాశ్రయన్తి.

ఎవడు ధనవంతుడో వాడు కులీనుడు. పండితుడు. వివేకి. ధన్యుడు. నేర్పరి. ఆహా, అన్ని గుణాలూ బంగారాన్ని ఆశ్రయించి ఉంటాయి కదా !

అయితే, కాలాంతరంలో నయినా ఎవరి విలువలు ఎలాంటివో విశదం కాక తప్పదు. కాకులు కొండ కొనన ఉన్నా, హంసలతో సరి కావు కదా !

పండితులైన వారు దిగువందగనుండగ నల్పుడొక్కడు
ద్దండతఁ బీఠమెక్కిన బుధ ప్రకరంబున కేమి యెగ్గగున్
కొండొక కోతి చెట్టు కొన కొమ్మలనుండగ గ్రింద గండభే
రుండ మదేభసింహ నికురంబములుండవె? చేరి భాస్కరా !

చెట్టు క్రింద గండ భేరుండాలు, మదించిన ఏనుగులు, సింహాలు ఉంటూ ఉండగా, ఒక కోతి మాత్రం చెట్టు కొమ్మల చివరన ఎక్కి కూర్చున్నదట. అంత మాత్రం చేత, ఆ మృగములకు వచ్చిన తక్కువతనం ఏమీ లేదు.
అలాగే, మహా పండితులందరూ నేల మీద సుఖాసీనులై ఉంటే, ఒక అల్పుడు ఉన్నతాసనం ఎక్కి కూర్చుంటే ఆ పండితుల గొప్పతనమేమీ తరిగి పోదు.

మణిలాగ కనిపించినంత మాత్రం చేత గాజు పూస మణి కాజాలదు. గాజు గాజే.మణి మణే కదా !

అలాగే, వసంత కాలం వచ్చినప్పుడు కదా, కాకి ఏదో, కోకిల ఏదో తెలియవచ్చేది ?!


5, సెప్టెంబర్ 2010, ఆదివారం

గురు పూజోత్సవం సందర్భంగా నా కథ - గురు దక్షిణ.


ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం. నేను తెలుగు ఉపాధ్యాయునిగా ప్రభుత్వ పాఠశాలలో 35 సంవత్సరాలు పని చేసి పదవీ విరమణ చేసాను.

1980 లో నేను వ్రాసిన ఈ కథను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీముందు ఉంచుతున్నాను.
తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయునికి ఒక వ్యక్తి సమర్పించిన గురు దక్షిణ ఎలాంటిదో ఈ కథలో చూడ వచ్చును.
సంక్లిష్టమైన మానవ మనస్త్తత్వాన్ని ఇందులో చిత్రీకరించడానికి ప్రయత్నించాను.

బడి నేపథ్యంలో నేను రాసిన కొన్ని కథలలో ఇది ఒకటి. ఈ కథ 1980 లో ఆంధ్ర భూమి మాస పత్రికలో ప్రచురితం.

గెటే నృత్యం చేసాడంటే, చేయడూమరి !!


మహా కవి కాళిదాస కృత అభిఙ్ఞాన శాకున్తలమ్ సంస్కృత నాటక రచనలలో ఒక అపూర్వ కళాకృతి. మహోన్నతమైన రచన. గెటే పండితుడు ఈ నాటకాన్ని చదివి ఆనందం పట్ట లేక, నృత్యం చేసాడుట ! (ఇక్కడ చూడండి)

మానవ జీవితంలో సుఖ దు:ఖాలు, కష్ట సుఖాలు, హిత అహితాలు, కలిమి లేములు, మంచి చెడ్డలు, స్నేహ విరోధాలు, చీకటి వెలుగులు, విషాద వినోదాలూ .. ఇలా చెప్ప లేనన్ని
ద్వంద్వాలు తారస పడుతూనే ఉంటాయి. నిత్య నైమిత్తిక జీవితంలో వాటికి తుల్య ప్రాధాన్యమిచ్చి
జీవనయానం సాగించాలి. ఈ అర్ధాన్ని బోధించే చక్కని శ్లోకం ఒకటి అభిఙ్ఞాన శాకున్తమ్ నాటకంలో చతుర్ధాంకంలో ఉన్నది. చూడండి...

సందర్భం క్లప్తంగా:

దుష్యంత మహారాజు కణ్వాశ్రమంలో శకున్తలను గాంధర్వవిధిని వివాహం చేసుకుని, ఆమెకు తన నామాంకితమైన అంగుళీయకాన్ని బహూకరించి, త్వరలో రాజలాంఛనాలతో రాచనగరుకి రప్పించుకుంటానని మాట యిచ్చి, రాజధానికి వెళ్ళి పోయాడు.

రాజునే తలుచుకుంటూ పరాకు పడిన శకుంతల ఆశ్రమానికి ముక్కోపి ముని దుర్వాసుడు రావడం గమనించనే లేదు. అతిథి సేవలో లోపం కలిగింది. ముని కోపించి,ఎవనిని తలుచుకుంటూ తన రాకను గమనించ లేదో, ఆతడు ఆమెను మరిచి పోవుగాక ! అని శాపమిచ్చాడు. పాపం. కడు ముద్దరాలు శకుంతల ఆ సంగతీ గమనించ లేదు. చెలికత్తె ప్రియంవద ముని రాకను, శాపమిచ్చిన వైనాన్నీ గమనించి, మునిని వేడుకుని ప్రసన్నుని చేసుకుంది. ముని శాపవిమోచన మార్గాన్ని ప్రసాదించాడు. అభిఙ్ఞాన దర్శనం చేత శాపం తొలిగి పోగలదని చెప్పాడు. దుష్యంతుడిచ్చిన అంగుళి శకుంతల వద్ద ఉన్నది కనుక, అప్పటికి చెలికత్తె ప్రియం వద స్తిమిత పడింది. తర్వాత శకుంతల అత్తవారింటికి ఇరువురు కణ్వ శిష్యులు, చెలికత్తెలు అనసూయ ప్రియంవదలు, గౌతమి వెంటరాగా బయలు దేరడం, నదిని పడవలో దాటుతూ ఉండగా నదీ జలాలలో అంగుళి జారి పోవడం, దుష్యంతుడు అభిఙ్ఞానం ( గుర్తు) లేనందు వలన ఆమె ఎవరో గుర్తు రాక తిరస్కరించడం జరిగింది.

అత్తవారింటికి బయలు దేరిన శకుంతలకు ఎరురు కానున్న కష్టాలను, అనంతర కాలంలో అవి తొలిగి పోయి ఆమెకు కలగనున్న శుభాలను స్ఫురింప చేసే ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన శ్లోకం చతుర్ధాంకంలోనే కాళిదాసు రచించాడు. చూడండి:

నాల్గవ అంకంలో కణ్వ శిష్యుడు నిద్ర లేచి, ఒక వంక అస్తమిస్తున్న చంద్రుడిని, ఒక వంక ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ ప్రభాత వేళని వర్ణిస్తూ చెప్పిన శ్లోకం ఇది.

యాత్యేకతో2స్త శిఖరం పతిరోషధీనా
మావిష్కృ తో2రుణ పురస్సర ఏకతో2ర్క:
తేజో ద్వయస్య యుగపద్వ్యసనోదయాభ్యామ్
లోకో నియమ్యత ఇవాత్మదశాన్తరేషు.

ఒక వేపు చంద్రుడు అస్తగిరికి పోతున్నాడు.
ఒక వేపు దినకరుడు అనూరుడు రధసారధిగా రధం నడుపుతూ ఉండగా ఉదయిస్తున్నాడు.
ఆహా! రెండు దివ్య తేజస్సులు ఒకే సమయంలో వ్యసనోదయములు పొందుతున్నవి కదా.
ఒక తేజస్సు అంతర్హితమవుతూ ఉంటే, ఒక తేజస్సు ప్రవర్ధమానవవుతున్నది. ఏక కాలంలో కనిపిస్తున్న ఈ సూర్య చంద్రుల ఉదయాస్తమయాలు లోకంలో ప్రాణులకి సంభవించే సుఖదు:ఖాలని గుర్తునకు తెచ్చేదిలాగ ఉన్నది కదా !

ఇదీ ఈ శ్లోక భావం.

కష్ట సుఖాలు కావడి కుండలు. అందు చేత కష్టం వస్తే క్రుంగి పోనూ కూడదు. సుఖం వస్తే పొంగి పోనూ కూడదు.

ఒక గొప్ప జీవిత సత్యాన్ని ఆవిష్కరించిన ఈ శ్లోకానికి కందుకూరి వీరేశలింగము గారి అనువాదం కూడ చూడండి:

ఒక దెస నస్త శైలమున కోషధినాధుడు పోవుచున్న వాఁ
డొక దెస భాస్కరుం డుదయ మొందె ననూరు పురస్సరంబుగా
నొక సమయంబునందె వ్యసనోదయముల్ గనె రెండు తేజముల్,
ప్రకట సుఖంబు దు:ఖమును బ్రాణులకిట్లని తెల్పు కైవడిన్


మూల శ్లోక హృదయాన్ని అనువాద రచన ఎంత గొప్పగా వ్యక్తం చేసిందో కదూ !

ఇప్పటికి స్వస్తి.




26, ఆగస్టు 2010, గురువారం

కత్తి మీద సాము ...


సేవా ధర్మం చాల కష్టతరమైనది. నిజానికది కత్తి మీది సాము లాంటిది. రాచ కొలువు లభించడం ఎంత కష్టమో, దానిని నిర్వహించడం అంతే కష్టం. ప్రభువుల వారికి ఎప్పుడు ఆగ్రహం వస్తుందో, ఎప్పుడు అనుగ్రహం వస్తుందో తెలియదు. ఎంతో మెళకువతో మెలగాలి. ఈ శ్లోకం ఆ అర్ధాన్నే వివరిస్తోంది:

మౌనా న్మూర్ఖ: ప్రవచన పటు:, నాతులో జల్పకో వా,
ధృష్ట: పార్న్వే వసతి నియతం చూరతశ్చా: ప్రగల్భ:
క్షాంత్యా భీరు ర్యది న సహతే ప్రాయశోనా2భిజాత:
సేవాధర్మ: పరమ గహనో యోగినా మస్యగమ్య:

సేవలు చేసి మెప్పు పొందడం చాల కష్టమైన పని. అది నిర్లిప్తంగా ఉండే యోగులకు కూడ అగమ్యగోచరం. సేవకుడు ఎలా ప్రవర్తించినా ఏదో ఒక తప్పు పట్టుకుంటారు యజమానులు.
మాట్లాడ కుండా మౌనంగా ఉంటే వొట్టి మూర్ఖుడని అంటారు.
మాటకారి అయితే వాగుడుకాయ అని తిడతారు.
ఓర్చుకుని సహనంగా ఉంటే పిరికిపంద అని వెక్కిరిస్తారు.
ఎదురాడితే తక్కువ జాతివాడంటారు.
యజమానికి ఎప్పుడే అవసరం ఉంటుందో అని, అతనికి సమీపంలో ఉంటే పొగరుబోతని అంటారు.
దూరం దూరంగా ఉంటే చేత కాని చవట అంటారు.
ఇలా సేవకునిలో లేని తప్పులని పదే పదే ఎత్తి చూపుతూ యజమానులు నానా యాగీ చేస్తారు.
సేవా ధర్మం చాలా కష్టం బాబూ !

25, ఆగస్టు 2010, బుధవారం

భగవంతుడు భక్త సులభుడు !!



వ్యాధస్యాచరణం ధ్రువస్య చ వయో విద్యా గజేంద్రస్య కా,
కుబ్జాయా: కిము నామరూపమధికం కిం వా సుధామ్నో ధనం.
వంశ: కో విధురస్య యాదవపతే రుగ్రస్య కిం పౌరుషం,
భక్త్యా తుష్యతి కేవలం న చ గుణై: భక్తప్రియో మాధవ:

భగవంతుడు భక్త సులభుడు. భక్త జన పక్షపాతి. ఆ పరమార్ధాన్ని ఈ శ్లోకం వివరిస్తున్నది.

గుహుని నడవడి ఎలాంటిది? పడవ నడుపుకునే వాడు. ఒక నిషాద రాజు. రామ భక్తుడు. ఇతని నగరం శృంగిబేరి పురం. దండకారణ్యానికి బయలు దేరిన సీతా రామ లక్ష్మణులను గంగానదిని దాటించాడు. కేవల నిషాదుడయిన గుహుని ఎంతో ఆదరంతో రాముడు చూసి అతని జన్మ చరితార్ధం చేసాడు.

ధ్రువుని వయసనగా ఎంత? అతనికి మహోన్నత స్థానం భగవానుడు కల్పించ లేదూ?
ఇతడు సునీతి, ఉత్తానపాదుల కుమారుడు. తండ్రి అంకసీమను కూర్చుని ఉండగా సవతి తల్లి సురుచి అవమానించింది. దానితో ఇతడు తీవ్రమయిన తపస్సు చేసాడు. ఈ విష్ణు భక్తుడు ధ్రువ నక్షత్రమై నభో వీధిలో ప్రకాశిస్తూ ఉంటాడు.

ఇక, గజేంద్రుని పాండిత్యమెంత? హరి గజేంద్రుని కాపాడ లేదూ?
పూర్వ జన్మలో ఇంద్రద్యుమ్నుడనే ద్రవిడ ప్రభువు అగస్త్యుని శాపం వల్ల ఏనుగు జన్మ ఎత్తాడు. గజరాజయ్యాడు. దాహం తీర్చుకోడానికి కొలను నీటిని త్రాగబోయి మొసలి బారిని పడ్డాడు. వదిలించుకుందామని ఎంత పోరాటం చేసినా ఫలితం శూన్యం. అలసి పోయాడు గజరాజు. బలం సన్నగిల్లి పోయింది. ధైర్యం అడుగంటి పోయింది. ప్రాణాలు కడతేరిపోతున్నాయి. మూర్ఛ వస్తున్నది. శరీరం డస్సి పోయింది. శ్రమాధిక్యతతో మరి మకరితో పోరాడే ఓపిక లేకుండా పోతోంది. హరి తప్ప వేరే దిక్కు లేడని గ్రహించి నోరారా వేడుకుంది.
అట్టి గజరాజుని విష్ణువు కాపాడడానికి వైకుంఠ పురం నుండి హడావిడిగా బయలు దేరాడు. ఎలా వచ్చాడయ్యా, అంటే:

సిరికిం జెప్పడు, శంఖ చక్రయుగముంజేదోయి సంధింపఁడే
పరివారంబును జీరఁడభ్రగ పతిం బన్నింపఁడా కర్ణికాం
తర ధమ్మిల్లముఁజక్క నొత్తడు వివాద ప్రోద్ధత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణా వనోత్సాహియై

పోనీ, కుబ్జ అపురూప సౌంద్యర్యవతి కాదుకదా. మిక్కిలి అనాకారి, భక్త సులభుడు ఆమెను దయామయుడై అనునయించ లేదూ? కంసుని దాసి అయిన ఈ కుబ్జ దగ్గరకి కృష్ణుడు వచ్చి, ఆమె శరీరమును తాకడం చేతనే ఆమె కుబ్జత్వం పోయింది.

పోనీ, కుచేలుడు ఏమయినా సంపన్నుడా ఏమిటి? ఒక బీద బ్రాహ్మణుడు. శ్రీకృష్ణుని బాల్యమిత్రుడు. ఇద్దరూ సాందీపుని దగ్గర చదువుకున్నారు. బహుసంతానవంతుడు. అంతమంది పిల్లలతో సంసారాన్ని నడప లేక దరిద్రం అనుభవిస్తున్నాడు. భార్య మాటలు కాదన లేక కృష్ణుడి దగ్గరకి బయలు దేరాడు. రిక్త హస్తాలతో వెళ్ళడం బాగుండదని కొంచెం అటుకులు మూట కట్టుకుని వెళ్ళాడు. కృష్ణుడు ఆ బాల సఖుని ఎంతగానో ఆదరించి, ప్రేమగా అతడు తెచ్చిన అటుకులు ఓ గుప్పెడు తిన్నాడు. రెండో గుప్పెడు తినబోతూ ఉంటే లక్ష్మీ దేవి వారించిందిట ! ఎందుకంటే మొదటి గుప్పెడు అటుకులు స్వీకరించినందుకే అక్కడ కుబేరుని ఇంట సమస్త ఐశ్వర్యాలూ సమకూడాయి. ఆ సంగతి ఎరుగని కుచేలుడు తనకి సాయం చేయమని అడగడానికి మనసు అంగీకరించక మిత్రుని దగ్గర శలవు తీసుకుని ఇంటికి వచ్చి
చూస్తే ఇంకేముంది? ఆ దయాముని అనుగ్రహం వల్ల అతనికి అష్టైశ్వర్యాలూ సమకూడాయి.
భగవంతుడు భక్త సులభుడనడానికి ఇది తార్కాణం కాదూ?

మరి, విదురుని ఆభిజాత్యం ఎలాంటిది? సంధి పొసగదని తెలిసీ రాయబారిగా కౌరవ సభకి వచ్చిన శ్రీకృష్ణుడు దుర్యోధనాదులు ఇవ్వజూపిన ఆతిథ్యాన్ని సున్నితంగా కాదని, విదురుడిచ్చిన విందు స్వీకరించ లేదూ?
పోనీ, యాదవరాజు ఉగ్రసేనుడి విషయమే చూడండి.కంస వధానంతరం కృష్ణుడితనికి రాజ్యాభిషేకం చేయించాడు.

భగవానుడు భక్త సులభుడనడానికి తండ్రి పెట్టించిన దారుణమయిన హింసలనుండి ప్రహ్లాదుని కాపాడడం, శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను ప్రీతితో భుజించడం ... ఇలా ఒకటా రెండా? ఎన్ని దృష్టాంతాలనయినా పేర్కొన వచ్చును.

ఇప్పటికి స్వస్తి.

21, ఆగస్టు 2010, శనివారం

శాంతము లేక, సౌఖ్యమూ లేదూ ...


తుల్యం పరోపతాపిత్వం , క్రుద్ధయో: సాధునీచయో:

న దాహే జ్వలతోర్భేధ:, చందనేంధనయో: క్వచిత్.

కోపం మంచి వాళ్ళకి వచ్చినా, చెడ్డ వారికి వచ్చినా అది ఇతరులని బాధిస్తుంది.

చందనం చెట్టునయినా , తుమ్మ చెట్టునయినా అగ్ని ఒక్కలాగే దహించి వేస్తంది కదా?

కోపం అగ్ని లాంటిదన్న మాట. అది ఇతరులనే కాదు, మనలనీ దహించి వేస్తుంది. అందుకే పెద్దలు శాంతంగా ఉండండర్రా అని చెబుతూ ఉంటారు.

తన కోపమె తన శత్రువు

తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ

తన సంతోషమె స్వర్గము,

తన దు:ఖమె నరకమండ్రు తథ్యము సుమతీ !

అని బద్దె భూపతి చెప్ప లేదూ?

క్రోధమ తపముంజెఱచును

క్రోధమ యణిమాదులైన గుణములఁబాపున్

క్రోధమ ధర్మ క్రియలకు

బాధ యగుం గ్రోధిగాఁ దపస్వికి జన్నే?

(నన్నయ . భారతం)

కోపం వలన తపస్సు చెడి పోతుంది. అణిమాది సిద్ధులు పనికి రాకుండా పోతాయి. కోపం ధర్మ విధులకు ఆటంకం కలిగిస్తుంది. మునులకు కోపం తగదు.

చీటికీ మాటికీ వెర్రి కోపంతో ఊగి పోతూ శాపాలిచ్చే దూర్వాస ముని తెలుసు కదా? దాని వలన అతని

తపో ఫలితమంతా హరించుకు పోయేది.

కీచకుడు ద్రౌపదిని చెరబట్టాలని తమకంతో వెంట తరిమాడు. ఆమె విరటుని కొలువు లోనికి ప్రవేశించింది. ఆమెను తరుముతూ వచ్చేడు కీచకుడు. అక్కడే ఉన్నవలలుడు అనే పేరుతో విరటుని కొలువులో వంటల వాడిగా ఉన్న భీముడికి కోపం నసాళానికెక్కింది. అమిత క్రోధా వేశంతో ఊగి పోయేడు. అక్కడ ఉన్న ఓ ఫలవృక్షాన్ని పెకిలించి, దానితో కీచకుని అంతం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు.

అంత పనీ చేసే వాడే, కంకుభట్టుగా విరటుని కొలువులో ఉన్న ధర్మ రాజు గూఢ భాషణంతో వారించ బట్టి సరి పోయింది. లేక పోతే, అఙ్ఞాత వాసం భగ్నమై, కథ మళ్ళీ మొదటి కొచ్చి ఉండేది.

వలలుండెక్కడఁజూచె? నసేవ్యక్ష్మాజముల్ పుట్టవే?

ఫలితంబై వర శాఖ లొప్పగ ననల్ప ప్రీతి సంధించుచున్

విలసచ్ఛాయ నుపాశ్రిత ప్రతతికిన్ విశ్రాంతి గావింపగాఁ

గల యీ భూజము వంట కట్టియలకై ఖండింపగా నేటికిన్ !

ఈ వంటల వాడు వలలుడు ఈ ఫలవృక్షాన్ని ఎక్కడ చూసాడయ్యా ! ఒట్టి మూర్ఖుడిలా ఉన్నాడే? చక్కగా పెద్ద పెద్ద కొమ్మలతో విస్తరించి, అందరికీ నీడని ప్రసాదిస్తూ సేద దీర్చే ఈ పండ్ల చెట్టు ఇతనికి వంట కట్టెల కోసం కావలసి వచ్చిందా? వేరే చోట ఎక్కడా ఎండి పోయిన పనికి రాని చెట్లే లేనట్టు వీడి కన్ను దీని మీద పడ్డదేమయ్యా. పండ్ల చెట్టుని ఎవరయినా వంట చెఱకు కోసం తెగ నరుకుకుంటారా?

ధర్మ రాజు మాటలలోని అంతరార్ధం గ్రహింపునకు వచ్చేక భీమ సేనుడు అప్పటికి శాంతించేడు. ఆ తర్వాత వడ్డీతో సహా తన కసి తీర్చుకున్నాడనుకోండి.

కోపం వస్తే వారించడానికి అందరకీ అలాంటి అన్నగార్లు దొరకొద్దూ?

అన్నగారంటే అన్నగారా ! ధర్మ రాజు గుణ గణాలను వర్ణిస్తూ విజయ విలాసంలో చేమకూర వేంకట కవి ‘‘ కోపమొకింత లేదు, బుధ కోటికి కొంగు పసిండి, పత్యమా రూపము, తారతమ్యము లెఱుంగని స్వతంత్రుడు ... యిత్యాదిగా వర్ణించాడు.

అందు చేత కోపం తగ్గించు కోవడం మంచిది. కోపం వల్ల ఎంత వినాశం జరిగిందో చెప్పడానికి మన పురాణాలలోనూ, కావ్యాలలోనూ , ప్రబంధాలలోనూ అసంఖ్యాకమైన వృత్తాంతాలున్నాయి.

అవన్నీ నేను చెప్పడం మొదలు పెడితే చదవడానికి విసుగు వేసి మీకు కోపం రావచ్చు.

చివరగా రెండు చిన్న జోకులు:

అప్పా రావు: ఎందుకురా, అంత కోపంగా ధుమ ధుమలాడి పోతున్నావు?

పాపారావు: ఆ శాంతారావు గాడిని కోపం తగ్గించుకోరా నాయనా, అని చిలక్కి చెప్పినట్టగా ఎంత చెప్పినా వినడే ! వొళ్ళు మండి పోయిందనుకో, చెడామడా దులిపేసాను...

మరొకటి:

భర్త: మా ఆవిడకి వొళ్ళెరుగని పిచ్చి కోపమనుకో. ప్రతి దానికీ ఒకటే అరుస్తూ ..

భార్య: ఆఁ ... ప్రతి దానికీ ఊరికే అరుస్తూ ఉంటాను. గోల చేస్తాను. అదేగా మీరు చెప్నబోయేది? (అంటూ గయ్యిమంది)

20, ఆగస్టు 2010, శుక్రవారం

మన ఓటు మంచికే !


సంత స్తృణోత్పారణ ముత్తమాంగాత్,
సువర్ణకోట్యర్పణ మామనంతి
ప్రాణ వ్యయేనా2పి కృతోపకారా:
ఖలా: పరే వైర మివోద్వహంతి

మంచి చెడుల తారతమ్యం ఎప్పుడూ ఉండేదే. మంచి వారికీ, చెడ్డ వారికీ ప్రవర్తనలో భేదం స్పష్టంగా కనిపించి పోతూనే ఉంటుంది.

తల మీద ఉన్న గడ్డి పోచను తొలిగించినంత మాత్రాన , వాళ్ళేదో మనకి మహోపకారం చేసినట్టుగా సత్పురుషులు భావిస్తూ ఉంటారు. అంటే, మనం వారికి ఏ చిన్న ఉపకారం చేసినా అది మహోపకారం చేసినట్టుగా కృతఙ్ఞత కనబరుస్తారు. చేసిన మేలు ఎప్పటికీ మరిచి పోరు.

అదే, చెడ్డ వారయితేనా, మన ప్రాణాలు పణంగా పెట్టి గొప్ప ఉపకారం చేసినా, కృతఘ్నులై చేసిన మేలు మరిచి పోవడమే కాక, అకారణంగా మన మీద పగ సాధిస్తూ ఉంటారని మీది శ్లోకం చెబుతోంది.

దుర్జనుల వైఖరి అలానే ఉంటుంది, మరి. చూడండి:

అకరుణత్వమకారణ విగ్రహ:
పరధనే పరయోషితి చ స్పృహా
సుజన బంధు జనేష్వ సహిష్ణుతా
ప్రకృతి సిద్ధ మిదం హి దురాత్మనామ్

ఏ కారణం లేకుండా కలహించడం, దయ ఏమాత్రమూ లేక పోవడం, పరాయి ఆడువారి మీద, ఇతరులు ధనం మీద కోరిక కలిగి ఉండడం, బంధువులని, మంచి వారినీ అంగీకరించక వారిని దూషించడం, ఇవన్నీ దుర్మార్గుల స్వాభావిక లక్షణాలు.

ఇక, మంచి వారి స్వభావం ఎలా ఉంటుందంటే,

సంపత్సు మహతాం చిత్తం భవేదుత్పల కోమలమ్
ఆపత్సు చ మహా శైలాసంఝాత కర్కశమ్

మంచి వారి మనసు సంపదలు కలిగినప్పుడు కొత్తదయిన నల్ల కలువ వలె కోమలంగా మృదువుగా ఉంటుంది. ఆపదలు కలిగి నప్పుడు పెద్ద కొండ రాతి బండలాగున కఠినంగా ఉంటుంది.
అంటే, వారు కలిమికి పొంగి పోరు, లేమికి క్రుంగి పోరు.స్థిత ప్రఙ్ఞు లన్న మాట !

విడివిడిగా సజన దుర్జనుల వైఖరి చూసాం కదా? ఇప్పుడు జమిలిగా చూదాం ...

తమ కార్యంబుఁబరిత్యజించియుఁబరార్ధ ప్రాపకుల్ సజ్జనుల్
దమ కార్యంబు ఘటించుచున్ బరహితార్ధ వ్యాపృతుల్ మధ్యముల్
దమకై యన్య హితార్ధఘాతుక జనుల్ దైత్యుల్, వృధాన్యార్ధ భం
గము గావించెడి వార లెవ్వరొ యెఱుంటన్ శక్యమే యేరికిన్ ?

తమ పని మానుకుని ఇతరుల పనులు చక్కబెట్టే వారు సజ్జనులు
తమ పని చూసుకుంటూనే, ఇతరులకు ఉపకారం చేసే వారు మధ్యములు.
తమ స్వార్ధం కోసం ఇతరుల పనులను చెడగొట్టే వారు రాక్షసులు.
మరి, ఏ ప్రయోజనమూలేక పోయినా, ఊరకనే ఇతరుల పనులు చెడగొట్టే వారు ఎవరో చెప్పడం ఎవరి తరమూ కాదు.




19, ఆగస్టు 2010, గురువారం

ఏ నిముషానికి ఏమి జరుగునో ... ...


మరు నిముషంలో ఏమి జరుగుగుతుందో మనకి తెలియదు. క్షణం మనది కాదు.

శ్లోకం చూడండి:

కాంతం ప్రాహ కపోతికా22కులతయా కాంతాంతకాలో2ధునా

వ్యాధో2ధో ధృతచాప పాణిత శర: శ్యేన: పరిభ్రామ్యతి

ఇత్థం సత్య2హినా స దృష్ట ఇషునా శ్యేనో2పి తేనాహత:

తూర్ణం తౌ తు యమాలయం పరిగతౌ దైవీ విచిత్రాగతి:

ఓ చెట్టు మీద పావురాల జంట కులాసాగా కాపురం చేస్తున్నది. ఇంతలో ఆడు పావురం మగనితో అంది కదా: ‘‘ ఓ ప్రియుడా ! మనకి లోకంలో ఇక నూకలు చెల్లిపోయేలా ఉంది. అంత్య కాలం దగ్గర పడినట్టుగా ఉంది. అదిగో, అలా చూడు ! బోయ ఒకడు బాణాన్ని ఎక్కు పెట్టి మన వేపే గురి చూస్తున్నాడు. పైన డేగ ఎగురు తోంది. ఇవే మనకి చివరి ఘడియలు ’’

ఆ కపోత మిధునం ప్రాణాల మీద ఆశ వదులుకుని ఊపిరి బిగ పట్టి మృత్యువు ఆసన్నమయిందని నిర్ణయించుకుని విషాదంతో క్షణాలు లెక్క పెట్టుకుంటున్నది.

ఇంతలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది !

ఒక పాము జరజరా ప్రాకి వచ్చి, వేట గాడిని కరిచింది. వాడి బాణం గురి తప్పింది. తిన్నగా వెళ్ళి పైన ఎగురుతున్న డేగకి తగిలి, అది మరణించింది. పాము కాటుకి వ్యాధుడూ మృతి చెందాడు.

చూసారు కదా? కొద్ది క్షణాల తరవాత దొరక బోయే ఆహారాన్ని తలచుకుంటూ సంతోషంగా ఉన్న డేగ, బోయ ఇద్దరూ అకాలమృత్యు వాత పడ్డారు. చావు తథ్యమనుకున్న పావురాల జంటకి ఆ గండం గడిచింది.

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ .... అని లవకుశ సినిమాలో కవి ఈ తత్వం బాగా వంట పట్టించుకునే ఆ చరణం రాసాడు కదూ.

జీవితం క్షణ భంగురం అనే విషయం విస్మరించి అశాశ్వతాలయిన విషయాలను శాశ్వతాలని అనుకోవడం తగదు.

ఏవీ మన వెంట రావు.

చూడండి:

ధనాని భూమౌ, పశవశ్చ గోష్ఠే , నారీ గృహ ద్వారి, జన:శ్మశానే

దేహాశ్చితాయాం, పర లోక మార్గే కర్మానుగ: గచ్ఛతి జీవ యేక:

మనం జీవిత కాలంలో సంపాదించుకున్న ధనమంతా, మరణానంతరం మన వెంట రాదు.భూమి మీదనే ఉండి పోతుంది పశు సంపద కూడా పశువుల శాలలోనే ఉండి పోతుంది తప్ప కనీసం మన పార్ధివ శరీరాన్ని చూడడానికయినా రాదు. ఎంతో ప్రియమైన భార్యా మణి కూడా ఇంటి ద్వారం వరకూ తప్ప కనీసం శ్మశానం వరకూ కూడా రాదు. బంధు మిత్రులు పరేత నిలయ ప్రాంతం వరకూ మాత్రమే వస్తారు. మన వెంట కడదాకా రారు.

పిచ్చి మమకారంతో , గంధాదులు అలముకుని, ఎంతో జాగ్రత్తగా, మురిపెంగా , అపురూపంగా, చూసుకున్న మన దేహం చితి వరకూ మాత్రమే కదా వచ్చేది?

ఇక, పర లోక మార్గాన మనని వెన్నంటి వచ్చేది ఎవరయ్యా అంటే, మనం చేసిన కర్మ మాత్రమే

పుణ్య కర్మలు చేయడం వలన పుణ్య లోకాలకీ, పాప కర్మలు చేయడం వలన పాప లోకాలకీ పోతాం.

స్వర్గ నరకాల సంగతి ట్రాష్ అనుకున్నా, మంచి పనులను చేయాలనే భావనలో తప్పు లేదు కదూ?

ధర్మాన్ని ఆచరించడం కూడా ఎలాగంటే,

అజరామరవత్ ప్రాఙ్ఞొ విద్యా మర్ధం చ సాధయేత్

గృహీత ఇవ కేశేషు, మృత్యునా ధర్మ మాచరేత్

తెలివైన వాడు ముసలితనం, చావు లేని వాని వలె విద్యను సముపార్జిస్తూ, ధర్మాలను ఆచరిస్తూ ఉండాలి.

మృత్యువు జుత్తు పట్టి లాగుతున్నట్టుగా భావించి ( అంటే, మరు క్షణంలోనే చావు తప్పదనుకుంటూ) ధర్మాన్ని ఆచరించాలి.

అంటే రేపు, మాపు అంటూ వాయిదాలు వేయకుండా తక్షణమే ప్రారంభించి ధర్మ కార్యాలు చేస్తూ ఉండాలి.

చెప్పొచ్చావులే, గొప్ప ! ఇంతకీ, నువ్వు చేస్తున్న ధర్మ కార్యాలేమిటయ్యా, అని, నన్ను ఎవరయినా నిలదీసే ప్రమాదాన్ని శంకించి, చెబుతున్నాను:

తన యెఱిగిన యర్ధంబొరుఁ

డనఘా ! యిది యెట్లు సెప్పు మని యడిగినఁజె

ప్పని వాడును, సత్యము సె

ప్పని వాడును ఘోర నరక పంకమున బడున్ !

(నన్నయ )

తనకి తెలిసిన దానిని గురించి చెప్పమని ఎవరయినా అడిగితే చెప్పని వాడు, నిజం పలుకని వాడు ఘోరమైన నరకకూపంలో పడతాడని భారతం చెబుతోంది. అందుచేత, ఎందుకయినా మంచిదని ( ఎవరూ అడగక పోయినా) నాకు తెలిసినదీ ( ఏదో , సముద్రంలో నీటి బొట్టంత) , విన్నదీ, కన్నదీ, చదివినదీ, తెలిసినదీ, తెలుసుకున్నానని అనుకున్నదీ, అర్ధమయినదీ. అర్ధమయిందనుకున్నదీ చెప్పడం నా ధర్మం కనుక చెబుతున్నాను.

ఇక, ఈ టపా చదివి, పోనిద్దూ, అని ఊరుకోకుండా, బాగుందనో, బాగు లేదనో, కామెంట్ రూపంలో వెల్లడి చేయడం మీ కనీస ధర్మంగా భావించండి. ఆ ధర్మాన్ని ఆచరించి, పుణ్యలోకాలలో ( రంభా, ఊర్వశి, తిలోత్తమ, మేనక, ఘృతాచి ... ) సీటుని అడ్వాన్సుగా బుక్ చేసుకోండి. ఆపైన మీ యిష్టం. మళ్ళీ, చెప్ప లేదంటనక పొయ్యేరు ....

( ఈ రాతని లైట్ తీసుకోండేం?)

18, ఆగస్టు 2010, బుధవారం

వేటి వలన ఏవి శోభిస్తాయి ?



గత టపాలో ఏవి ఉంటే ఏవి ఉన్నట్లే అవుతుందో చూసాం. ( ఇక్కడ చూడండి) ఇవాళ ఏవి ఉండడం వలన వేటికి శోభ కలుగుతుందని పెద్దలు చెప్పారో చూదాం ...

ఐశ్వర్యస్య విభూషణం సుజనతా శౌర్యస్య వాక్సంయమ:
ఙ్ఞానస్యోపశమ: శ్రుతస్య వినయో విత్తస్య పాత్రే వ్యయ:
అక్రోధ స్తపస: క్షమా ప్రభవితు ర్ధర్మస్య నిర్వ్యాజతా
సర్వస్యాపి హి సర్వ కారణ మిదం శీలం పరం భూషణమ్ .

ఐశ్వర్యం వల్ల ఏది శోభిస్తుంది ? మంచితనం. ( సంపదకు మంచి తనమే అలంకారం. )
పరాక్రమం దేని వలన శోభిస్తుంది ? మాట మంచితనం ( ఎంత పరాక్రమం ఉన్నా, మాట కరుకుదనం వల్ల వ్యక్తి శోభించడు.)
ఙ్ఞానం దేని వలన శోభిస్తుంది? శాంతం వలన ( శాంతం లేని వివేకం వృథాయే కదా)
పాండిత్యానికి అలంకారం ఏది ? వినయం
ధనం ఉన్నందుకు ఏది చేయడం వల్ల శోభ కలుగుతుంది ? పాత్రత నెరిగిన దానం
తపస్సునకు ఏది అలంకారంగా భాసిస్తుంది ? సహనం. కోపం లేక పోవడం (క్రోధిగా తపస్వికిఁజన్నే? అని భారతం చెబుతోంది.)
సమర్ధునకి శోభనిచ్చే ముఖ్య లక్షణం ఏది ? క్షమా గుణం
ధర్మమునకు శోభని కలిగించేది ఏది ? నిర్మోహత్వం ( దేనిమీద ఎక్కువ మమకారం లేక పోవడం)
సమత వలన ఏమి కలుగుతుంది ? తేజస్సు.

తక్కిన ఏ గుణాలు ఉండనీ, లేక పోనీ, మంచి నడవడిక మాత్రం సమస్త జనులకూ శోభని ఇస్తుంది.

ఈ విధంగా పెద్దలు శీల వర్తనకి పెద్ద పీట వేసారు.

17, ఆగస్టు 2010, మంగళవారం

ఇవి ఉంటే అవి అక్కర లేదు !!


క్షాంతిశ్చేత్ కవచేన కిం కిమరిభి: క్రోధో2స్తి చేద్దేహినాం,
ఙ్ఞాతిశ్చే దనలేన కిం యది సుహృద్దివ్యౌషధై: కిం ఫలం,
కిం సర్పైర్యది దుర్జనా: కిము ధనైద్విద్యా2నవద్యా
వ్రీడా చేత్ కిము భూషణై: సుకవితా యద్యస్తి రాజ్యేన కిమ్ ?

ఏవి ఉంటే ఏవి అక్కర లేదో ఒక కవి ఈ శ్లోకంలో చక్కగా వివరించాడు. చూడండి ...

ఓర్పు కల వానికి వేరే కవచం అక్కర లేదు.( ఆ సహనమే అతనిని కాపాడుతుంది.)
కోపం కల వానికి వేరే శత్రువులెవరూ ఉండనక్కర లేదు.( ఆ కోపమే అతడిని నాశనం చేస్తుంది.)
దాయాదులు ఉంటే వేరే అగ్ని అక్కర లేదు. ( ఆదాయాదులే మన కొంపకి చిచ్చు పెడతారు.)
మంచి మిత్రులున్న వారికి వేరే గొప్ప ఔషధాలతో పని లేదు( వారే మనని మంచి మార్గంలో నడిపిస్తారు. ఆరోగ్యకరమైన ఆలోచనలు అందిస్తారు)
దుష్టులు ఉండగా వేరే విష సర్పాలతో పనేముంది ? ( వాళ్ళే పాముల వంటి వారు)
మంచి విద్య ఉన్న వారికి వేరే గొప్ప నిధులు ఎందుకు ? ( విద్యా ధనమే తరగని సంపద కదా)
లజ్జ కలిగిన వారికి వేరే ఆ భరణాలు ఎందుకు ? ( సిగ్గే కదా చక్కని సింగారం?)
కవితా శక్తి కల వారికి వేరే రాజ్యమెందుకు ? ( రాజ్యభోగం కన్నా కవితా శక్తి గొప్ప కీర్తిదాయకం కదా)

అదీ సంగతి !

మరో టపాలో ఏవి ఉంటే ఏవి శోభిస్తాయో చూదాం.

ముఖే ముఖే సరస్వతీ ...


పాట పరిమళించింది.
గళం ప్రాంతీయాభిమానాల నిగళాలు తెంచి వేసింది.
ఆనందంగా ఆ ప్రతిభా మూర్తిని అక్కున చేర్చుకుంది.
ఆశీర్వదించింది.
కళకు ఎల్లలు లేవంది.
కళా జగతికి తలుపులూ, ద్వారబంధాలూ లేవంది.
అడ్డంకులూ, అడ్డదార్లూ లేవని నిరూపితమైంది.


శ్రీరామ్ అభినందనలయ్యా !!

15, ఆగస్టు 2010, ఆదివారం

అమ్మా, నీకు వందనం


స్వాతంత్ర్యం వచ్చినా
సమ భావం కలగ లేదు
ఇంటి లోని గొడవలు
ఇంకా చల్లార లేదు

మధు మాసం వచ్చినా
మల్లెలు వికసించ లేదు
భానూదయ మయెను కాని
మనుషులు మేల్కొన లేదు

కత్తి వైరము కాల్చండని
నుడివిన కవి దేశము
కత్తులపై నడయాడుట
నమ్మ లేని సత్యము

ప్రతి మనిషీ ప్రక్క వాని
పచ్చ దనం ఓర్చ లేడు
ఏ గుండె ఎదుటి వాని
దరహాసము శ్లాఘించదు

పదవి మీద వ్యామోహం
ప్రతి వాడూ వీడ లేడు
నాయకమ్మన్యులు అంతా
చేయబోరు సమన్యాయం !

అయినా మన పవిత్ర దేశం
ఎన్ని ఆటు పోటులనో తిన్నది.
అంతు లేని అవరోధాలను
శాంతంగా అధిగమించినది

కమ్ముకున్న ఈ చీకటి
కడ వరకూ ఉండ బోదు
చిమ్మిన ఈ ద్వేషానలం
వమ్మయి పోవక తీరదు

అద్యతన భావి లోన
అగ్ర గామిగా మన దేశం
విరాజిల్ల బోతున్నది.
అగ్ర రాజ్యాలు సైతం
విస్తు పోయే రోజున్నది !

అందుకే, అందాం
అందరమూ గళమెత్తి
భరత మాతా నీకు జయము !!
వందేమాతరమ్!!!


విజయ నగరం నుండి శ్రీ భాట్టం శ్రీరామ మూర్తిగారు బహుజన అనే ఓ వార పత్రిక నడిపేవారు. అందులో 1970 ఆగష్టు 15 వ తేదీ సంచికలో అప్పట్లో భాషా ప్రవీణ విద్యార్ధిగా ప్రాచ్య కళాశాలలో చదువుకొంటున్న నేను రాసిన కవిత యిది.


అసంఖ్య బ్లాగులో పెట్టిన ఈ క్రింది టపా (ఇక్కడ నొక్కండి) నన్ను అమితంగా ఆకర్షించింది. అందుకే, వారికి నా ధన్యవాదాలతో ...








14, ఆగస్టు 2010, శనివారం

బక్క రైతుల బతుకు గోస - దుక్కి



అచ్చమయిన రైతు కవి చింతా అప్పల నాయుడు. తన చుట్టూ విషాదంగా పరుచుకుని ఉన్న ఛిద్ర జీవితాన్ని రైతు భాషలో వినిపించేడు. శ్రీకాకుళపు బడుగు రైతుల బతుకు గోసని గుండెలు పిండేసే లాగున మనకి వినిపించేడు.
నాయుడు నేనెరిగిన వ్యక్తి. ఎప్పుడూ చిరు నవ్వు నవ్వుతూనే ఉంటాడు. కాని ఆ నవ్వులో ఏదో అనంత విషాద వీచిక కదలాడుతున్నట్టుగా నాకనిపిస్తూ ఉంటుంది.
మట్టి మనుషుల జీవితాలను వారి భాషలోనే చిత్రం కట్టి చూపించేడు. భద్ర జీవుల కలలోకి కూడా రాని బతుకులవి. అనుభవించి పలవరించిన కరకు వాస్తవాలు.
2008 సంవత్సరానికిగాను ఫ్రీవర్స్ ఫ్రంట్ వారి ఉత్తమ కవితా సంకలనానికి యిచ్చే అవార్డు చింతా అప్పల నాయుడు రాసిన దుక్కి కి వచ్చింది.
2009 సంవత్సరానికి గాను అవార్డు యాకూబ్ రాసిన ఎడతెగని ప్రయాణం కి లభించింది.

చింతా పుస్తకం గురించి ... ... ...

మా అయ్యకి వ్యవసాయం వొక వ్యసనం అంటాడు చింతా. అభివ్యక్తి లో కొత్తదనం, సూటిదనం , నిజాయితీ, నిబద్ధత, రవంత అమాయకత్వం, వంతెన కింద రహస్యంగా పారే నీటి పాయలా, అణచు కొంటున్న ఆర్తి కనిపిస్తుంది.

ఆవుకి కుడితెట్టినట్టు
పొలానికి గత్త మేసినట్టు
గడ్డి పరకలని గాలించి నట్టు
బతకడం నీకు బాగా పట్టుబడి పోయింది
బతుకే నీ యెనకాల బేపి కూనై తిరిగేది.

బతకడం భారమైనప్పుడు, బతక లేని దుర్భర వాతావరణం క్రూరంగా చుట్టూ వలయంలా, నీ కనబడని శత్రువులు కలిపించి నప్పుడు, బతకాలి కదా, జీవచ్ఛవంలాగానయినా ? అదే చేస్తున్నారు శ్రీకాకుళపు బక్క రైతులు. ఆ దౌర్భాగ్యాన్ని, ఆ పెను విషాదాన్ని అక్షర బద్ధం చేసి చూపించేడు చింతా.
అందుకే మిత్రుడు గంటేడ గౌరు నాయుడు అంటాడు: అప్పల నాయుడు రాసే ప్రతీ వాక్యమూ నాకు కవిత్వంలా కాక , జీవితంలా సాక్షాత్కరిస్తుంది. అని !

లోతుకు పోయిన కళ్ళతో మా అమ్మల ముఖాలు
మసిబారి పోయిన దివ్వ గూళ్ళలా ఉంటాయి.

ప్రపంచీకరణ నేపథ్యంలో ఇనుప గద్దలు వాళ్ళ గుడిసెల ముందు ఎగురుతూనే ఉంటాయి.
వాళ్ళ పశువులు గడ్డి పరకలని కలలు కంటూనే ఉంటాయి.
పండగ పూట కూడా వాళ్ళ నోటికి సీసమే పాయసమౌతుంది ...

అక్కడ కూలీలు కండలు తిరిగిన వస్తాదులా ఏమిటి?
వాళ్ళ చేతుల్లో గదలుంటాయా, గాండీవాలుంటాయా?
చూడండి, కూలీల భార్యల బతుకు గోస:

మా మొగోల్లు కండలు తిరిగిన వస్తాదులా !
ఆల్ల సేతుల్ల గదలున్నాయా? గాండీవాలున్నాయా?

వెదురు బద్దల్లాంటి ఎముకల గూళ్ళు, వాళ్ళ శరీరాలు. పిడికెడు కండ లేని నడయాడే అస్థి పంజరాలు వాళ్ళు.
శ్రీశ్రీ చెప్పిన అస్థి మూల సంజరాలు ... ఆర్తరావ మందిరాలు .. వాళ్ళు .

ఈ పుస్తకాన్ని చదివి ఆనందించడానికి ఏమీ లేదు.

ప్రత్యక్షర విషాదం తప్ప.

కాలి పోతున్న, రంగు వెలసిన ఛిద్ర జీవితాల చిత్రణ తప్ప.

రకరకాల కుట్రలకి కునారిల్లి పోతున్న బతుకు గోస తప్ప.

చింతా అప్పల నాయుడికి బరువెక్కిన గుండెతో అభినందనలు.


































పూల బాసలు ...


తెల తెలవారుతూ ఉంటే, నిద్ర లేచి, కళ్ళు నులుముకుంటూ, బద్ధకంగా బాల్కనీ లోకో, పెరట్లోకో వెళ్ళి చూస్తే .... నిన్న మొగ్గ తొడిగిన కొమ్మకి అందమైన పువ్వొకటి కనిపించిందనుకోండి ! ఓహ్! ఆ ఆనందం అంతా ఇంతా కాదు. నవ జాత శిశువుని చూసి, పరవశించి పోయే తల్లి మనసు ఎలా ప్రఫుల్లమవుతుందో, అలా , పరవశించి పోతాం కదూ? ... ఆ పూల చెట్టు మీ చేత్తో నాటి, దోహదం చేసినదయితే, ఆ ఆనందం ద్విగుణీకృతం అవుతుంది.
ఆ వికసిత పుష్పానికి అన్ని రంగులు అద్ది, అన్ని సొగసులు దిద్ది, అన్ని నయగారాలు కూర్చి, అంత సౌకుమార్యాన్ని చేర్చి, అందాలు పేర్చి అందించిన ఆ అదృశ్య హస్తం ఎవ్వరిదా అని విస్తు పోతాం!
పూలు పలకరిస్తాయి. పూలు ఊసులు చెబుతాయి. కొన గోటితో త్రంచ బోతే విలపిస్తాయి. తల్లి కొమ్మనుండి, తండ్రి రెమ్మ నుండి , నిర్దయగా వేరు చేయ బోతే, వద్దని వేడుకుంటాయి. దీనంగా అర్ధిస్తాయి.

అలాంటి పువ్వులను గురించి కొన్ని కబుర్లు ఇవాళ చెప్పుకుందామా?

అలరు, కుసుమము, నన, విరి, పుష్పము, పూవు, ప్రసవము, ప్రసూనము, ఫల్యము, లతాంతము, సుమము, సూనము, సౌమనస్యము ...వీటన్నింటికీ పువ్వు అనే అర్ధం
( ఇంకా ఉన్నాయి లెండి !)
పూలలో ఉండే మకరందాన్ని తుమ్మెదలు స్వీకరిస్తాయి. అందుకే కవి ‘ పూల కంచాలలో రోలంబులకు, రేపటి భోజనము సిద్ధ పరచి పరచి ... ’ ఆ దేవ దేవుడు ఎంత అలసి పోయాడో అని బెంగ పడతాడు.
విరహతాపాన్ని పెంచి, స్త్రీపురుషులను ఏకశయ్యానువర్తులుగా చేసే మన్మథుడికి కుసుమాయుధుడు, పుష్పబాణుడు, అలరు విల్తుడు ... ఇలాంటి పేర్లు ఉన్నాయి. పూల బాణాలు ధరించిన వాడు అని వాటి అర్ధం,
మదనుడు పంచ బాణుడు. ఐదు రకాల పూలను బాణాలుగా ఉపయోగించే వాడు. ఆ అయిదు రకాలూ ఏమిటో తెలుసా?
అరవిందము, అశోకము , చూతము , నవ మల్లిక, నీలోత్పలం.
సరే, పూలు పలకరిస్తాయి అనుకున్నాం కదూ? ... చూడండి :

పూల బాసలు తెలుసు యెంకికీ, తోట
పూల మనసు తెలుసు యెంకికీ!
పూల మొక్కల నీటి జాలుగని నిలుసు
పూలన్ని నీ పాటె
ఆలించె నంటాది !
పూల బాసలు తెలుసు యెంకికీ ...అని, నండూరి వెంకట సుబ్బారావు గారు ఎంకి పాటల (కొత్త పాటల) లో పూల బాసల గురించి చెప్పారు.

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పుష్ప విలాపంలో తనని త్రుంచబోయిన వాని గుండె కరిగి పోయేలా విలపిస్తూ తన గోడు చెప్పుకున్నది. మా ప్రాణము తీతువా ! అని బావురుమన్నాయి. తల్లి ఒడిలో చిగురుటాకుల శయ్య మీద హాయిగా నిదురించే మమ్ము చిదిమి, అమ్ముకుంటావా? మనసు లేని నీ పూజ లెందుకోయి ? అని అడిగాయిట, పూలు...
మా ఆయువు నాలుగు గడియలే కదా, ఆయువు కలిగినంత దాక మా తీవ తల్లి చేతులలో హాయిగా ఊయలలూగుతూ మురిసి పోతూ ఉంటాము. ఆయువు తీరాక ఆ తల్లి పాదాల చెంతనే రాలి పోతాము
మా పూల సువాసనలతో గాలి పరిమళిస్తుంది. తుమ్మెదలకు తేనెల విందు చేస్తాము. మీ వంటి వారి కన్నులకు కనువిందు చేసి హాయిని కలిగిస్తాము. అలాంటి మమ్మలని చిదిమి వేయడం తగునా ? తల్లీ బిడ్డలని వేరు చేస్తావా ?
మమ్ములను త్రుంచడం వల్ల నీ చేతులు మా రక్తధారలతో తడిసి పోతాయి. అలాంటి నెత్తురు పూజని పరమేశ్వరుడు స్వీకరించడు సుమా!

నువ్వే కాదయ్యా, మీ ఆడువారూ మాకు హాని చేయడంలో ఏమీ తక్కువ తిన లేదు ...

ఊలు దారాలతో గొంతుకురిబిగించి,
గుండె లోనుండి సూదులు గ్రుచ్చి కూర్చి,
ముడుచు కొందురు ముచ్చట ముడుల మమ్ము
అకట ! దయ లేని వారు మీ ఆడువారు !

మా నెత్తురులతో చేసిన అత్తరులను మీ కంపు గొట్టు దేహాల మీద అలము కుని శయ్యల మీద వెద జల్లు కుని రాత్రంతా దొర్లుతారు. సిగ్గు లేదూ?

మా వెల లేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి, నశించి పోయె , మా
యౌవన మెల్ల కొల్ల గొని ఆ పయి చీపురు తోడ చిమ్మి, మ
మ్మావల పార బోతురు గదా ! నరజాతికి నీతి యున్నదా?

అని పూలు చీవాట్లు పెట్టాయి ....

గౌతమీ కోకిల బిరుదాంకితులు వేదుల సత్య నారాయణ శాస్త్రి గారి కాంక్ష కవితా ఖండికలో పూల మనోభావాలు ఎలా ప్రతి ఫలించాయో, చూడండి ... మచ్చుకి ఒకటి రెండు పద్యాలు ...

పేదల రక్త మాంసములఁబెంపు వహించి, దయా సుధా రసా
స్వాద దరిద్రు లైన ధనవంతుల పెద్దరికమ్ముకై మతో
న్మాదము పెంచు దేవునికి మారుగ నిల్చిన రాతి బొమ్మలం
దూదర వోవు పాడు బ్రతుకొక్క నిమేషము సైప నాయెదన్

పేదల రక్తమాంసాలతో బలిసి, దయ ఒక్కింత కూడ లేకుండా, మతోన్మాదాన్ని ఎక్కువ చేస్తూ, దేవుడి పేరుతో నిలబెట్టిన రాతి బొమ్మల మెడలలో పూజకై నిలిచి, వాడి పోయే ఆ పాడు బ్రతుకు నాకు వద్దు.

కానుకనై ధరాధిపుల కాళ్ళ కడం బొరలాడి వాడి పో
లేను, ధరా పరాగపటలీ మలినమ్మగు ద్వార తోరణా
స్థానము నందురింబడఁగ జాలను, దోసిట పేరి ఘోర కా
రా నరకమ్ము నందుసురు రాల్పగ లేను నిమేష రక్తికై

మీ క్షణికానందం కోసం - రాజుల కాళ్ళ దగ్గర కానకనై పొర్లి వాడి పోవడం నాకు సమ్మతం కాదు.
ధూళి ధూసరితమైన ద్వారాలకు తోరణాన్నయి ఉరి వేసు కోవడం నాకు నచ్చదు.
మీ చేతుల కారాగారంలో మ్రగ్గి పోలేను.

మరి పువ్వు ఏమి కోరుకుంటున్నది? ... చూడండి ...

నీచపు దాస్య వృత్తి మన నేరని శూరత మాతృ దేశ సే
వా చరణమ్ము నందసువు లర్పణఁజేసిన పార్ధివ
శ్రీ చెలువారు చోటఁ దదసృగృచులన్ వికసించి, వాసనల్
వీచుచు, రాలి పోవగ వలెం దదుదాత్త సమాధి మృత్తికన్

దేశం దాస్యంలో మ్రగ్గి పోవడం సహించ లేక, ధేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన వారి పార్ధివ శరీరాలు ఉండే సమాధుల మీద వాసనలు వెదజల్లుతూ వికసించి, అక్కడే, ఆ పవిత్రమైన మట్టి లోనే వాడి వత్తలై పోవడం నాకు చాలా ఇష్టం ...

ఎంత గొప్ప భావనో కదూ , యిది?

మరి కొన్ని పూల ముచ్చట్లు చూడండి ...

పూల కయ్యాలు:

అరణపు కవి నంది తిమ్మన గారి పారిజాతాపహరణం లో పారిజాతపుష్పం కోసం ఎంత రచ్చ అయి పోయిందో మీకు తెలిసినదే కదా!
తగవుల మారి నారదుడు ఒకే ఒక్క పారిజాతం తెచ్చి ,శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. దానినతడు దేవేరి రుక్మిణికి ఇచ్చాడు. ఆ సంగతి సత్యభామకి తెలిసి పోయింది. ఇంకేముంది ! ఆవిడ అలగడం, పతి నుదుటున తన్నడం, అతడామెను బుజ్జగించి, దేవేంద్రుని ఎదిరించి మొత్తం పారిజాతవృక్షాన్నే దేవ లోకం నుండి పెకలించుకుని వచ్చి సత్య ఇంటిలో పెరటి చెట్టుగా నాటడం ... చక చకా జరిగి పోయాయ్ ...
ఆ పారిజాతం మహిమ ( నారదుని మాటల్లోనే ) ఎలాంటిదంటే,

పరిమళము సెడదు, వాడదు
పరువము దప్పదు పరాగభర భరితంబై
నిరతము జగదేక మనో
హరమగు నీకుసుమ రాజమంబుజ వదనా.

ఆ పువ్వుని తనకివ్వక తన సవతి రుక్మిణికి యిచ్చినందుకు కోపించి, ఒళ్ళూ మీదా కానక అలక పానుపు మీద పరుండి, అనునయించ బోయిన మగని కాలితో తన్నిందిట సత్య.

జలజాతాసన వాసవాది సుర పూజాభాజనంబై తన
ర్చు లతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునం
దొలగంద్రోచె లతాంగి; యట్లయగు ; నాధల్నేరముల్సేయఁబే
రలుకం జెంది కాంత లుచిత వ్యాపారమల్నేర్తురే ?

తన తప్పు సైరింపుమని ఆమె పాదాల కడ తల పెట్టిన నాధుని తలని సత్య ఎడమ పాదంతో తన్నిందిట ! ప్రియ నాధులు తప్పులు చేస్తే, అలక చెందిన ఆడువారు ఉచితానుచితాలు చూడరు కదా ? ... అని, కవి సమర్ధన.

ఈ పద్యం చూడండి:

నల్లని వాడు పద్మ నయనంబుల వాడు కృపా రసంబు పై
జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు, నవ్వు రా
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబుఁదెచ్చె, నో
మల్లియ లార ! మీ పొదల మాటున లేడు గదమ్మ తెల్పరే ?

భాగవతంలో పోతన గారి పద్యం ఎంత మనోహరమైనదో చూడండి.

నల్లని వాడు. పద్మాల వంటి కళ్ళు కల వాడు. దయా పూరితములైన చూపుల వాడు, తల మీద నెమలి పింఛం ధరించిన వాడు, నవ్వులు చిందించే ముఖంకలిగిన వాడు, చెలుల మాన ధనాన్ని దోచుకుని పోయాడు. ఓ మల్లియలారా ! ఆ తుంటరి మీ పొదల మాటున కాని ఉన్నాడా, చెప్పరూ ? ... ... అని గోపికలు పూలతో చేసే సంభాషణ ప్రసిద్ధమే కదా.

పూలు కూడా ఊసులాడుతాయని దీని వలన తెలుస్తోంది కదూ?

మహా భారతంలో మరో పూల కయ్యం మీకు తెలిసినదే కదా?
ద్రౌపది ముచ్చట పడిందని, భీముడు సౌగంధికాపహరణం చేయడం, ఆ క్రమంలో హనుమతో చిన్న పాటి కయ్యం, తర్వాత ఆ పువ్వుల కోసం కాపలాదారులతో చేసిన యుద్ధం ... అదో పెద్ద కథ. పూల కధ.

మరొకటి రెండు పూల ముచ్చట్లు .....

పూల చెండుతో ఫ్రియుడొకటంటే, పేము కర్రతో తా రెండనే గడుగ్గాయలూ ...
రాచరికపు రోజులలో గడసరి విటులతో పుష్ప లావికల సరసోక్తులూ ...
చెప్పాలంటే చాలా ఉన్నాయి ....
చెవిలో పువ్వు పెట్టడం ... వంటి నానుడులూ ...
పువ్వులమ్మిన చోటనే కట్టెలమ్మడం వంటి సామెతలూ ...

ఇలా చెప్పుకుంటే పూల బాసలు అనంతం కదూ!

పువ్వులనీ, పసి బిడ్డల బోసి నవ్వులనీ, ఇంద్రధనుస్సులనీ, పురి విప్పిన నెమలి పింఛాలనీ,
చిగురించిన కొమ్మలనీ, రెమ్మలనీ, తలిరాకు తల్పాన మెరిసి పోయే తుహినకణాలనీ, చంద్ర కిరణాలనీ , కోకిలల గొంతులనీ, పిట్టల కువకువలనీ, అందమైన వేకువలనీ, చల్లని సాయంత్రాలనీ, జలపాతాలనీ, ... ఇలా ఎన్నో అందాలని ప్రసాదించిన ఆ దయామయుడికి నమోవాకములతో ..

ఇప్పటికి స్వస్తి.

`









13, ఆగస్టు 2010, శుక్రవారం

ఏవి అసలైన పూజా పుష్పాలు?


తెలుగు నాట భక్తి రసం
తెప్పలుగా పారుతోంది
డ్రైనేజీ స్కీము లేక
డేంజరుగా మారుతోంది ...

అని, కవి గజ్జెల మల్లారెడ్డి ఏనాడో హెచ్చరించారు. భక్తి భావం మంచిదే కానీ, భక్తిని ప్రదర్శించు
కోవడం కోసం చేసే చేష్టలు మాత్రం సమర్ధించ దగినవి కావు. వీర భక్తునిగా, లేదా భక్తురాలిగా అందరి దృష్టినీ ఆకర్షించడం కోసం కొందరు వేసే వేషాలూ, పోయే పోకడలూ చిత్రంగా ఉంటాయి.
నిశ్చలమైన భక్తి భావంతో భగవంతుని సేవించే వాడే నిజమైన భక్తుడు. చిత్త శుద్ధి లేని శివ పూజ లెందుకని ప్రజా కవి వేమన నిలదీసినది అందుకే. చిత్తం చెప్పుల మీద ఉన్నంత వరకూ ఎంత గొప్ప పూజలు చేసినా వ్యర్ధమే కదా?
సరే, ప్రస్తుతానికి వస్తే , నేను చెప్ప దలచినది ఏమంటే, భగవంతుడిని ఏ పూలతో పూజించాలి? ఈ ప్రశ్న వచ్చినప్పుడు మన వాళ్ళు కొన్ని పూలను పూజకు అనర్హమైనవిగా ప్రకటించి, నిషేధం విధించారు. ఆ విధంగా పాపం, పుష్ప జాతిలో కొన్ని పూలు ధేవుని పూజకు పనికి రాకుండా పోయాయ్.

ఐతే, నిజానికి భగవంతుడిని మనం ఏ పూలతో పూజ చేయాలో తెలుసా?

క్రింది శ్లోకంలో భగవంతునికి ( శ్రీ మహా విష్ణువుకి) అత్యంత ప్రియమైన పువ్వులు ఎనిమిది రకాలని ఓ కవి చెబుతున్నాడు.

ఆ ఎనిమిది రకాల పువ్వులూ ఏవంటే ...

అహింసా ప్రథమం పుష్పం , పుష్ప మింద్రియ నిగ్రహ:
సర్వభూత దయా పుష్పం , క్షమా పుష్పం విశేషత:

శాంతి: పుష్పం , తప: పుష్పం , ధ్యానం పుష్పం తథైవ చ,
సత్య మష్టవిధం పుష్పం , విష్ణో: ప్రీతికరం భవేత్

విష్ణువుకి ( భగవంతుడికి) మిక్కిలి ప్రతీకరములయిన పువ్వులు ఎనిమిదీ ఏవంటే,
అహింస , ఇంద్రియ నిగ్రహం , జీవ దయ , క్షమ , శాంతి , తపస్సు , ధ్యానం , సత్యం.

ఇవీ ఆ పువ్వులు !!

వేరే ఏ పూలతో పూజించినా, దేవ దేవుడు సంప్రీతుడు కాడు సుమా !

వెర్రి మొర్రి చేష్టల వీర భక్తులు , భక్త నట సామ్రాట్టులు , కుహనా భక్త శిఖామణులు, ఆలోచించ వలసిన విషయమే కదూ, యిది?

11, ఆగస్టు 2010, బుధవారం

ముఠా కవులు


స్వాధీనో రసనాంచల: పరిచితా: శబ్ధా: కియంత: క్వచిత్
క్షోణీంద్రో న నియామక: పరషదశ్శాంతా: స్వతంత్రం జగత్
తద్యూనం కవయో వయం వయమితి ప్రస్తావనాహుంకృతిం
స్వచ్ఛందం ప్రతిసద్మ గర్జత వయం మౌనవ్రతావలంబిన:

(సాహిత్య శేఖరం)

నోటికి తలుపుల లేవు. ఏమైనా వాగ వచ్చును. ఏవో కొద్ది మాటల పరిచయం ఉంది.వద్దనే వాళ్ళు లేరు. శాసించే ప్రభువు లేడు. పండిత పరిషత్తులూ మూలన పడ్డాయ్. అంచేత పండితులైన వారు ఎదురు చెప్ప లేక నోరుమూసుకుని ఉండి పోతున్నారు. ఎవరికి వారు స్వేచ్ఛగా ఉండడానికి యిష్ట పడతారు కదా. అందు చేత మీరంతా మేం కవులం ! మేమే కవులం!!
అంటూ, అడ్డూ ఆపూ లేకుండా నోటికి వచ్చినట్టుగా ఇల్లిల్లూ మారు మ్రోగి పోయేలాగ అరుస్తున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితులలో మా వంటి వారు ఇక మౌనవ్రతం అవలంబించడం కన్నా వేరే దారి ఏముంది ?

కవి ముఠాలు, లేదా, ముఠా కవులు అన్ని కాలాలలోనూ ఉండేవి / ఉన్నారు కాబోలు. ఈ శ్లోకం చూస్తే అదే అనిపిస్తున్నది. కావు కావుమని కాకులు అరచి ఊదరగొడుతూ ఉంటే, కోకిలలు బిక్కచచ్చిపోయి ఉండి పోక తప్పదేమో.