15, డిసెంబర్ 2009, మంగళవారం

బాపురే !! బాపూ బొమ్మలు !!


ఇవి నా కథలకి శ్రీ బాపు వేసిన బొమ్మలు.
శ్రీ బాపు జన్మ దిన సందర్భంగా వీటిని మీతో పంచుకోవాలనే వేడుకతో వీటిని మీముందుంచుతున్నాను.
ఆ బొమ్మలంటే నాకు నా కథల కన్నా కూడా చాలా యిష్టం !!




Posted by Picasa

కొంటె బొమ్మల బాపు




బాపూ గారికి జన్మ దిన శుభాకాంక్షలు !!


తెలుగు రచయితలలో చాలా మందికి తమ కథలు పత్రికలలో ప్రచురించ బడేటప్పుడు దానికి శ్రీ బాపు గారు బొమ్మ వేస్తే బావుణ్ణని మహా ఉబలాటంగా ఉంటుంది.
నాకూ అలాంటి ఉబలాటమే. శ్రీరాముని దయ చేతను ఈ క్రింది కథల విషయంలో నా కోరిక తీరింది.

1. గోవు మా లచ్చిమికి కోటి దండాలు ... ఆంధ్ర జ్యోతి వార పత్రిక
2. అనాధలు కావలెను ... స్వాతి వార పత్రిక
3. గెలుపు ... ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక


కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలనూపు
ఓ కూనలమ్మా !
అన్న ఆరుద్ర గారి మాటలు తలుచుకుంటూ, మీకివే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

దొంగ లెక్క !!!


ఒక్కో సారి ఆపద సమయంలో దొంగ లెక్కలు వేసి, ఆపద గట్టెక్కొచ్చు ! ఐతే, దీనికి యుక్తి, వివేకం కావాలి...
మన ప్రాచీన సాహిత్యంలో యుక్తిగా తననీ తన వారినీ చావు నుండి తప్పించిన ఓ యుక్తిపరుని వైనం ఓ చక్కని పద్యంలో ఉంది. చూడండి ...
ముందుగా పద్యం చూడండి ...


తార్కికుల్ నలుగురు,తస్కరులేవురు
శ్రోత్రియులిద్దరు, చోరుడొకడు
భూసురుల్ ముగ్గురు,మడియవిప్పొకడు
సకలార్ధ నిపుణుడు శాస్త్రి యొకడు
యల్లాపులిద్దరు, యాచకులిద్దరు
బరి వాండ్రు ముగ్గురు, బాప డొకడు
ఆగడీలిద్దరు, ఆరాధ్యులిద్దరు
దుష్టాత్ముడైనట్టి దొంగయొకడు

అరసి వారల నొక శక్తి యశనమునకు
సగముఁగోరగ, నవ సంఖ్య జగతి సురుడు
చెప్ప ; దొంగలు హతులైరి ; చేటుఁదప్పి,
విజయమందిరి యా వేళ విప్రులెల్ల !!


వివరణ : పూర్వం ఓ దొంగల గుంపు ఒకటి యాత్రీకులైన బ్రాహ్మణులని అడ్డగించి, శక్తి గుడికి తీసుకు పోయేరు.
శక్తి వారిలో సగం మందిని తాను తినేస్తానని అంది. ఎవరు బలి కావాలో నిర్ణయించుకోమంది. లేక పోతే అందరినీ తినేస్తానంది.
దొంగలు పదిహేను మంది, బ్రాహ్మణులు పదిహేను మంది ఉన్నారు.
ఎవరు బలి కావాలి ?
దొంగలు బెదిరి పోయేరు. వారికి దిక్కు తోచ లేదు. ఒక బ్రాహ్మణుడు యుక్తితో కేవలం దొంగలు కాని, కేవలం బ్రాహ్మణులు కానీ చావడం న్యాయం కాదనీ, తాము అందరూ ఒక వరుసలో నిలుచుంటామనీ, శక్తి ప్రతి ఆవర్తంలో తొమ్మిదవ వ్యక్తిని బలి తీసుకోమని వేడుకున్నాడు. శక్తి అంగీకరించింది.
దొంగలూ ఈ ప్రతిపాదనకి అంగీకరించేరు. ఆ బ్రాహ్మణుడు దొంగలనీ, బ్రాహ్మణులనీ కలగలిపి ఒక వరుసలో నిలుచోబెట్టాడు.
శక్తి ప్రతి ఆవర్తంలో తొమ్మిదో వ్యక్తిని బలి తీసుకోవడం మొదలెట్టింది.

చిత్రం !!!


ప్రతి ఆవర్తంలోనూ తొమ్మిదో వాడు దొంగే కావడం వల్ల, ఏం జరుగుతోందో గమనించే లోపల దొంగలందరూ శక్తికి బలైపోయేరు ! బ్రాహ్మణులు సురక్షితంగా బయట పడ్డారు!

ఇంతకీ, ఆ తెలివైన బ్రాహ్మణుడు చేసిన యుక్తి ఏమిటి? వేసిన దొంగ లెక్క ( !) ఏమిటో కాస్త కనిపెట్టి చెబుదురూ !

మీ ప్రయత్నం మీరు చెయ్యండి ... సాధ్యం కాక పోతే , జవాబు ఈ క్రిందనే ఉంది. చూడండి. తెలిసి పోతుంది.! మరెందుకు ఆలస్యం ?!



బ్రాహ్మణులు # గుర్తు తోనూ, దొంగలు గుర్తుతోనూ ఉన్నారు. వారందరినీ కలగలిపి, క్రింది వరుసలో నిలబెట్టాడు. శక్తి ప్రతి ఆవర్తంలోనూ తొమ్మిదో వ్యక్తిని బలి తీసుకుంది. అంతే ! ... దొంగలంతా ఖతం !!

ఆ వరుసల వైనం యిదీ : క్రింద తెలుపు భాగాన్ని డ్రాగ్ చేస్తే జవాబు కనిపిస్తుంది ...

#### ౦౦౦౦౦ ## ####౦౦##౦౦౦#౦౦##0





#### ౦౦౦౦౦ ## ### #౦౦##౦౦౦#౦౦##0

14, డిసెంబర్ 2009, సోమవారం

లేడిని చూసి సింహం పారి పోయిన కథ !!



మన కవులు భాషను క్రీడా రంగంగా చేసుకుని ఎన్ని చక్కని ఆటలు ఆడుకున్నారో గమనిస్తే చాలా సరదాగా ఉంటుంది ..
క్రింది శ్లోకాన్ని పరికించండి ...


కస్తూరీ జాయతే తస్మాత్ ? కో హన్తి కరిణామ్ శతమ్ ?
కిం కుర్యాత్ కౌతరో యుద్ధే ? మృగాత్ సింహ: పలాయతే.

లేడిని చూసి సింహం పారిపోతోందని కవి గారి ఉవాచ !!

పోదురూ, మరీ బడాయి కాక పోతేనూ !

ఇప్పుడు కవి గారి అసలు ఉద్దేశ్యాన్ని వివరిస్తాను. చూడండి ...

చరణాల వారీగా ఇలా చెప్పు కుందాం...
కస్తూరి దేని నుండి పుడుతుంది ? ... మృగాత్ = మృగం నుండి
అనేక ఏనుగులను చంపేది ఏది ? .... సింహం
పిరికిపంద యుద్ధంలో ఏం చేస్తాడు ? ....పలాయతే ... పారి పోతాడు!

శ్లోకంలోని మూడు ప్రశ్నలకీ వరుసగా చివరి పాదంలోని మృగాత్ సింహ:, పలాయతే అనే వాటిని జవాబులుగా చెప్పుకుంటే మరే అసంగతమూ ఉండదులేడిని చూసి సింహం పరిగెత్తడమూ ఉండదు!
క్రమాలంకారంతో కవి గారు సాధించిన చమత్కారం యిది !
బాగుంది కదూ ? ...

ఔరా, యిదేమి చిత్రం !!

మన అపార పారావార తుల్యమైన సాహితీ భాండారంలో ఎన్ని అనర్ఘరత్నాలు ఉన్నాయో నేనివాళ కొత్తగా వివరించ నక్కర లేదు...నేనెరిగినవాటిని మిత్రులతో పంచుకునే ప్రయత్నంలో రోజు మీకోసం అందమయిన పద్యం....

హరిని హరి బట్టి మ్రింగెను
హరి దౌడుం జూచి బెదరి హరి చెట్టెక్కెన్
హరి పలుకులు హరి మెచ్చెను
హరి వాహన మగుపడంగ హరి గర్జించెన్ !

కప్పను పట్టుకుని పాము మ్రింగి వేసిందిట!
గుర్రం పరిగెత్తడం చూసి, బెదిరి పోయి , కోతి చెట్టెక్కిందిట!
చిలుక పలుకులు విని శ్రీ హరి మెచ్చు కున్నాడుట!
యముని వాహనం దున్న పోతుని చూసి సింహం గర్జించిందిట!

నానార్ధ పద నిఘంటువు చూసి, హరికి ఎన్ని అర్ధాలున్నాయో సారిచూడండి ...
నానార్ధాల వల్లనే మీది పద్యంలో హరిని హరి తినేసాడనీ, హరిని చూసిహరి పరిగెత్తి పారి పోయేడనీ, హరి మాటలను హరే మెచ్చు కున్నాడనీ, హరి వాహనానాన్ని చూసి హరి గర్జించాడనీ బయటకి కనిపించేఅసంగతార్ధం తొలిగి పోయి వాస్తవార్ధం గోచరిస్తుంది ...

బాగుంది కదూ ?!












13, డిసెంబర్ 2009, ఆదివారం

రెండు భోజనాల గొడవ !!!



మిత్రులారా, ఈ క్రింది శ్లోకాన్ని కాస్త పరిశీలించండి ...ఇందులో అసంగతం కనబడడం లేదూ !

ఏకాదశ్యా మహా రాత్రే కర్తవ్యం భోజన ద్వయం
రాత్రే జాగరణంచైవ, దివాచ హరికీర్తనమ్.


రామ ! రామ!! చూడండి ఎంత అసంగతంమయిన విషయమో ! ...ఏకాదశి నాడు రెండు సార్లు భోజనం చెయ్యాలిట ! ...
రాత్రి జాగరణం చెయ్యాలనీ, పగటి పూట హరి కీర్తనం చెయ్యాలనీ సెలవిస్తున్నాడు ... ఇదంతా బాగుంది కానీ ...హవ్వ !!!
ఈ రెండు భోజనాల సంగతేంటండీ !


మరేం లేదండీ ... ఈ శ్లోకంలో పదాలను భో ! జన! అని విరిచి చదువుకోవాలి. అలాగే, ద్వయం కర్తవ్యం అంటే రెండు పనులు చేయాలి అని అన్వయించుకోవాలి...
ఇప్పుడు చూడండి ...ఏకాదశి పర్వ దినాన ఓ జనులారా ! మీరు రెండు పనులు చెయ్యాలి సుమండీ ! ...రాత్రంతా జాగరణ చేసి, పగలంతా హరికీర్తనం చేస్తూ గడపండి అని బోధన... అంతే తప్ప రెండు భోజనాలు వరస పెట్టి లాగించెయ్య మని కాదు!!!
సరే ...ఈ రెండు భోజనాల గొడవ గురించి చెబుతూ ఉంటే ఎప్పుడో చదివిన ఓ జోక్ గుర్తుకొస్తోంది. అది కూడా వినండి మరి ...

ఓ వ్యక్తి డాక్టరు దగ్గరకి వచ్చి, ‘‘ డాక్టరు గారూ ! నేను రోజుకి ఇరవై సిగరెట్లు తాగడానికి అలవాటు పడి పోయేనండీ ...తగ్గించే ఉపాయం చెప్పండి ...’’ అనడిగేడు. దానికి డాక్టరు ‘‘ దానిదేముందిండీ ... విల్ పవరుండాలంతే ... ఇక నుండీ మీరు భోజనం ముందొక సిగరెట్టూ, భోజనం తర్వాత ఒకటీ తాగడం మొదలెట్టండి ...దెబ్బకి కంట్రోలవుతాయి ...’’ అని చెప్పాడు.
చాలా రోజుల తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ వచ్చేడు. ‘‘ సిగరెట్లు తాగే అలవాటు యిప్పుడు కంట్రోలయింది కదూ మీకు ?’’ అడిగేడు డాక్టరు.
ఆ మనిషి నీరసంగా ‘‘ ఏం కంట్రోలోనండీ ! ... రోజుకి పది సార్లు భోజనం చెయ్య లేక ఛస్తున్నాను.’’ అంటూ
బావురుమన్నాడుట!

12, డిసెంబర్ 2009, శనివారం

అయ్యో, రామ !!



నీయాశా, అడియాశా ....
రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం
భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీ
యిత్థం విచింతయతి కోన గతే ద్విరేఫే
హా ! హంత హంత ! నళినీం గజవుజ్జహార !


మిత్రులారా ! ఈ శ్లోకం ఎంత అందంగా ఉందో గమనించండి ...

ఓ తుమ్మెద తామర పువ్వులో దూరి మకరందం గ్రోలుతోంది. ఇంతలో సూర్యుడు అస్తమించి రాత్రయింది. పద్మం ముడుచుకు పోయింది ! తుమ్మెద అందులో బందీ అయి పోయింది... సరేలే, ఎలాగూ తెల్లారుతుంది, సూర్యోదయం కాగానే పద్మం వికసిస్తుంది. అప్పుడు బయట పడదాం అనుకుంది తుమ్మెద.
అంత లోనే వో మదించిన ఏనుగు వచ్చి, ఆ సరోవరంలో దిగి, తామరలనన్నింటినీ పెకిలించి వేసిందిట ! మిగతా పువ్వులతో పాటూ తుమ్మెద బందీగా ఉన్న పద్మాన్ని కూడా పెకిలించి వేసింది.
బయట పడదాం అనుకున్న మన తుమ్మెద ఆశ ఎలా అడియాస అయిందో చూసారు కదూ ?
మంద భాగ్యుల కథల ముగింపు యిలాగే ఉంటుందేమో, కదూ !!

ఇది చదివేక, తెలుగులో ఓ మంద భాగ్యుని గురించిన పద్యం ఒకటి గుర్తుకొస్తోంది కదూ !!!
అదేమిటో గుర్తుకు తెచ్చుకుని రాయండేం?

చిన్న క్లూ యిస్తాను ... పద్యం చివర్లో ...పోవుంగదా యాపదల్ ! అని ఉంటుంది
మిత్రుడు చింతా రామ క్రిష్ణారావు చూపిన మార్గంలో నాకు తెలిసిన కొన్ని చమత్కార శ్లోకాలూ , పద్యాలూ సరదాగా మీతో ఇక మీద పంచుకోవాలనుంది. ... మీరు సరే నంటే !

11, డిసెంబర్ 2009, శుక్రవారం

అమ్మాయి పెళ్ళి చేయ బోతున్నారా ? ఏయే సామాన్లు సమకూర్చు కోవాలో అని సతమత మవుతున్నారా? నో టెన్షన్ ...




శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
వివాహ సమయంలో వరుసగా జరిపించే కార్యక్రమాలు, వాటికి సమకూర్చుకో వలసిన సామగ్రి
1. ఎదురుకోలు సన్నాహం : ఇది మగ పెళ్ళి వారు  కళ్యాణ మండపానికి తరలి వచ్చినప్పుడు జరిపించే విధి.
మగ పెళ్ళి వారు రాగానే ఒక కొత్త స్టీలు పళ్ళెంలో క్రింది సామగ్రి ఉంచి యిస్తారు:
పసుపు,కుంకుమ,బ్రష్. పేష్టు,అద్దం,దువ్వెన, పౌడరు,సబ్బు,సెంటు, కాటుక,తిలకం,(మేకప్ బాక్స్) నేప్కిన్.
(అక్షతలు,గంధం, హారతి కర్పూరం , పసుపు సున్నం కలిపిన నీళ్ళు సిద్ధం చేసుకోవాలి.)
2.స్నాతక వ్రతం : కావలసిన సామగ్రి: పసుపు, కుంకుమ,అగరు వత్తులు,కర్పూరం,తమలపాకులు100, చెక్కలు,50గ్రా. కొబ్బరి బొండాలు2,
కొబ్బరు కాయలు2, ధాన్యం 1 కేజీ, బియ్యం 3 కేజీలు, వరిపిండి పావు కేజీ, ఆవు నెయ్యి పావు కేజీ,వత్తులు, ప్రమిదలు8 (చిన్నవి) , గంధం, పన్నీరు, గావంచాలు2,అరటి పళ్ళు 3 డజన్లు, వరునికి చెప్పుల జత, గొడుగు, చేతి కర్ర, అద్దం, దువ్వెన, కాటుక భరిణె, నలుగు పిండి పావు కిలో. పువ్వులు, చిన్న పువ్వుల దండ, 1 పెళ్ళి పీట, 2 పీటలు, ఒక బేసినుతో యిసుక, హోమం పుల్లలు 2 కట్టలు, కర్ర పేళ్ళు, విసనకర్ర, అగ్గి పెట్టె, 3 స్టీలు గ్లాసులు, 2 పళ్ళేలు, 2 చిన్న యిత్తడి గిన్నెలు మామిడి కొమ్మలు
పెండ్లి కుమారుని బట్టలు
3.తోట ఉత్సవం : పసువు పావు కిలో, కుంకుమ పావు కిలో, అగరు వత్తులు, కర్పూరం, తమలపాకులు100, గ్రా. చెక్కలు100 గ్రా . బుక్కా,భర్గుండ, పటుక బెల్లం, 2 పెద్ద కర్పూర హారాలు, తగినన్ని చిన్న కర్పూర హారాలు, సెంటు, లవండరు, గంధం, అక్షతలు, గంధం గిన్న, పన్నీరు బుడ్డి,
2 పానకం బిందెలు, 2 కొత్త గ్లాసులు, 1కిలో పంచదార పానకం,అరటి పళ్ళ గెల, వివాహ పత్రిక, పువ్వులు,మామిడి కొమ్మలు, అగ్గి పెట్టె.
తోట ఉత్సవంలో పెట్ట వలసిన బట్టలు.
4.అంకురార్పణ : పసుపు, కుంకుమ, అగరుబత్తులు, కర్పూరం తమలపాకులు,25, చెక్కలు 25 గ్రా. బియ్యం 2 కిలోలు,
పాలికలు 6, ప్రమిదలు 10, పుట్టమన్ను, నవధాన్యాలు, కొత్త దారపు రీలు, గంధం, దీపం, ఒత్తులు, ఆవు నెయ్యి,పావు కిలో, అరటి పళ్ళు ఒక డజను, కొబ్బరి కాయ, కొబ్బరి బొండాం, పెసర పప్పు పావు కిలో, అప్పడాలు2 ఒడియాలు2 మామిడి కొమ్మలు, కొబ్బరి కురిడీలు2, సన్నికల్లు, పొత్రం, ఒత్తుల పేకెట్టు, ఇంట్లోవి 3 గ్లాసులు, 3 చెంబులు, దేవుని ఫోటో, దీపం కుందెలు, 2 , చిల్లర పైసలు, పీట మీద వెయ్యడానికి గావంచా. అగ్గి పెట్టె. మామిడి కొమ్మలు.
5. గౌరీపూజ : గౌరీ గంప, బియ్యం 5 పావులు, పసుపు కొమ్ములు, కొబ్బరు బొండాం, దీపం, కుంకుమ భరిణె, గంధం చెక్క, గుమ్మడి పండు, అగరు బత్తులు, మామిడి కొమ్మలు, తమలపాకులు25 చెక్కలు
6. లగ్నము : పసుపు పావు కిలో, కుంకుమ పావు కిలో, పసుపు కొమ్ములు పావు కిలో, అగరు వత్తులు, కర్పూరం, తమలపాకులు, 100, చెక్కలు 100 గ్రా. తలంబ్రాల బియ్యం 1 కిలో,
కాళ్ళు కడుగు పళ్ళెం, చెంబు, తెర సెల్లా దుప్పటి, మధు పర్కాలు, గుమ్మడి పండు, 5 కాయలుండే కొబ్బరి కాయల గుత్తి, అరటి పళ్ళ గెల, బెల్లం దిమ్మ (చిన్నది),
సిద్ధం చేసుకోవలసిన ఇతర సామగ్రి: జీల కర్రబెల్లం నూరిన ముద్ద, వెండి జంద్యం, నల్ల పూసలు, మంగళ సూత్రాలు, వెంటి మట్టెలు, దారపు రీలు,
చుట్టు ఉంగరం, పువ్వులు, పెద్ద సైజు పువ్వుల దండలు2, పాలు,
చిన్న ప్రమిదలు6, జ్యోతి దీపాలకు నలుగు పిండి పావు కిలో, ఆవు నెయ్యి పావు కిలో, గౌరీ గంప, గంధం చెక్క, పేలాలు, హోమం పుల్లల కట్టలు2 కర్ర పేళ్ళు, వరిపిండి 100 గ్రా,
సన్నికల్లు, పూజు, పెళ్ళి పీట, కర్పూర హారాలు, హారతికి కర్పూరం,
ఒడి కట్టు చీర,వెండి గిన్నె, కంద దుంప, గంధపు చెక్క, ఉయ్యాల చీర, బొమ్మ, ఆభరణం చీర(నగ చీర),
అప్పగింతల బట్టలు, తెరసెల్లా, అలక పానుపు దుప్పటి, బకెట్ (స్టీలుది), తాడు, దొంగవిల్లి గిన్నె (వెండిది),
దంపతుల తాంబూలాలకి 10 కొబ్బరి బొండాలు
స్థాలీపాకం గిన్నె (చిన్న యిత్తడి గిన్నె), చిల్లర డబ్బులు, మామిడి కొమ్మలు, అగ్గి పెట్టె. పీటల మీద గావంచా.
తగువు : తగువులో యిచ్చే స్వీట్లు. అప్పడాలు, ఒడియాలు, అరిసెలు, అటుకులు
హోమం : చిన్న ఇత్తడి గిన్నెలు4 హోమం పుల్లలు, ఆవు నెయ్యి
పై వస్తువులన్నీ కార్యక్రమాల వారీగా Packets కట్టుకుంటే గాభరా ఉండదు.కొన్ని common వస్తువులు ex. పెళ్ళి పీట, పూజు. సన్నకల్లు, పూల దండలు లాంటివి Packets లో కట్టలేం కనుక వేరే సిద్ధం చేసుకోవాలి.
వీటిలో సన్నికల్లు, పెళ్ళి పీట, పూజు లాంటివి కేటరర్ తెస్తాడేమో అడగాలి.ఐతే, కేటరర్ పై వాటిలో తాను సమకూరుస్తానని చెప్పిన వస్తువుల గురించి అడిగి, అతని చేతనే భోజనాల మెనూ రాసుకునేటప్పుడే అతను తెస్తానన్న వస్తువుల జాబితా కూడా ఖాయం చేసుకుని Note చేయించాలి.
పెండ్లి రాట వేసేటప్పుడు కాపెంవలసిన సామగ్రి.
పసుపు, కుంకుమ, అగరు బత్తి కట్ట, అరటి పళ్ళు 2 డజన్లు, తమలపాకులు 50, చెక్కలు 50గ్రా. కర్పూరం 2తు. పసుపులో ముంచిన తెల్లని వస్ర్తం, పెద్ద దారపు రీలు, నవధాన్యాలు, పాలు అర లీటరు, పంచ లోహాలు (మంచి ముత్యం, పగడం,బంగారం, వెండి, రాగి కానీ) , విచ్చు రూపాయలు, చిల్లర పైసలు తగినన్ని,
పందిరి రాటకు : నేరేడు కొమ్మ, పాల కొమ్మ, భరిణి కొమ్మ,
మామిడాకులు, కొబ్బరి కాయ1
0 0 0
పై విధంగా ఆయా సందర్భాలలకి గాను సమకూర్చుకో వలసిన మరియు packets కట్టడానికి కావలసిన మొత్తం వస్తువుల జాబితా యిది :
ABSTRACT
పసుపు
కుంకుమ
కొబ్బరి బొండాలు 15
కొబ్బరి కాయలు 5
5కొబ్బరి బొండాల గుత్తి ఒకటి.
ఆవు నెయ్యి
అరటి పళ్ళ గెలలు 2 (లగ్నానికి, ఇతరాలకు)
చిన్న బెల్లం దిమ్మ
మొత్తం అన్ని కార్యక్రమాలకి గాను బియ్యం 16 కిలోలు
తగువు సామాను (మీద రాసిన విధంగా) గుమ్మడి పండు పసుపు కొమ్ములు
పెండ్లి పీట, సన్ని కల్లు, పూజు, పొత్రం ,చిన్న పీటలు2
కొత్త స్టీలు పళ్ళెం (పైన రాసిన విధంగా ఎదురుకోలు సామగ్రి)
కాళ్ళు కడుగు పళ్ళెం. చెంబు,
గ్లాసులు2 పానకం బిందెలు2 పానకం
హామానికి ఇత్తడి గిన్నెలు2
స్టీలు బకెట్, తాడు, వెండి దొంగ విల్లి గిన్నె, వడి కట్టు గిన్నె,బొమ్మ, గంధం చెక్క, హోమం పుల్లలు, పుట్ట మన్ను, వరిపిండి, పేలాలు, ప్రమిదలు, పాలికలు , ఉత్తర జంద్యం,ఒత్తులు,కుందులు , కుంకుమ భరిణె, ఎదురుకోలు సామాను, నలుగు పిండి, గౌరీ గంప, పువ్వులు, పూల దండలు (పెద్దవి2 లగ్న సమయానికి) చిన్న పూల దండ (స్నాతకానికి)
కర్సూర హారాలు 4 (పెద్దవి) చిన్న కర్పూర హారాలు తగినన్ని,
కంద దుంప, హామానికి పుల్లలు, బేసినుతో ఇసుక,విసన కర్ర, దేవుని ఫొటో, అద్దాలు 2 దారపు రీళ్ళు పెద్దవి2
జీలకర్ర,బెల్లం నూరిన ముద్ద. మంగళ సూత్రాలు, నల్ల పూసలు.
పన్నీరు బుడ్డి, లవండరు, సెంటు, బుక్కా భర్గుండ, చిన్న కర్పూర హారాలు, వివాహ పత్రిక, పటిక బెల్లం ధాన్యం, స్నాతకం సమయంలో అవసరమయితే, ( యివ్వాల్సి వస్తే) ఓ పాత లుంగీ
గొడుగు. చెప్పుల జత, చేతి కర్ర, వెండి జంద్యం, మట్టెలు, మంగళ సూత్రాలు, నవ ధాన్యాలు, కుందులు, ఇంట్లోవి గ్లాసులు, చెంబులు, చిల్లర పైసలు, పంచ లోహాలు, మామిడాకులు. పాలు, పెండ్లిరాట సామాను, పెండ్లి రాట కొమ్మలు. తమలపాకులు, చెక్కలు, అగరబత్తులు వగైరా పూజ సామాను ...
మొత్తం స్నాతకం,అంకురార్పణ,గౌరీ పూజ, లగ్నం, తలంబ్రాలు, స్థాలీ పాకం కార్యక్రమాలకి గాను బియ్యం సుమారుగా 16 కిలోలు.
అక్షతలు అన్ని వేడుకలకూ తగినన్ని.
సమకూర్చు కోవలసిన బట్టల వివరాలు :
వీటిలో మగ పెళ్ళి వారు, ఆడ పెళ్ళి వారు ముందు అనుకున్న విధంగా బట్టలని సమకూర్చు కోవాల్సి ఉంటుంది.
పెళ్ళి కుమార్తెకి పట్టు చీరలు
తోట లాంఛనం బట్టలు
అప్పగింతల బట్టలు
ఇవి కాక - ఆడ పెళ్ళి వారు సిద్ధం చేయాల్సినవి:
పెండ్లి పీటల మీదకి గావంచాలు
మధుపర్కాలు
తెర సెల్లా దుప్పటి
అలక పానుపు దుప్పటి
ఒడికట్టు చీర
ఉయ్యాల చీర
పురోహితునికి చీర, పంచెల చాపు.
N.B పెండ్లి చేయించే పురోహితుని చేత పెండ్లికి కావలసిన జాబితా రాయించి, పై వాటితో సరిచూసుకోవాలి.
మన తాహతు బట్టి, వేడుకను బట్టి, అవసరాన్ని బట్టి , ఆచారాన్నిబట్టి పై జాబితాలో మరి కొన్ని వస్తువులు చేరనూ వచ్చు, తగ్గనూవచ్చు, మార్పు చెందనూ వచ్చు... ఎలాగంటే ... వెండి వస్తువులబదులు బంగారం వస్తువులు పెట్టుకో వచ్చు కదా ? ... అలాగే, మనసాంప్రదాయాలను అనుసరించి కూడా మారే అవకాశం లేకపోలేదు...ఏమయినా ... పురోహితుని అడిగి , దీనితో చెక్చేసుకోమని సూచన ...బ్రాహ్మణ శాఖలలో ఇది చాలా మందికిసుపరిచితమైన జాబితాయే ... ఏతావాతా , ఇది బ్లాగులో పెట్టడంకేవలం నా సరదా కొద్దీ మాత్రమేనండోయ్ ...
మంగళం మహత్
శ్రీ శ్రీశ్రీ

26, నవంబర్ 2009, గురువారం

పతంజలికి నివాళి

మిత్రుడు పతంజలి యిక లేరు అనే దుర్మార్గపు వార్తని ప్రసార మాధ్యమాల వలన తెలుసుకుని, నిర్ఘాంత పోయేను. ఒక శూన్యం ఆవరించింది. పతంజలితో నా పరిచయం గురించి , కన్నీళ్ళతో ...

పతంజలి - ప్యారిస్ కార్నర్ - నేను !!
కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి ఇక లేరు. రాయాల్సిందేదో రాసేసి, చెప్పాల్సిందేదో చెప్పేసి, నిరాడంబరంగా,నిశ్శబ్దంగా, ఒకింత నిర్లక్ష్యంగా, వెళ్ళి పోయేరు. రచయితగా రావలసినంత పేరు తన ఖాతాలో జమ అయిందో లేదో చూసుకునే ఓపికా, ఆసక్తీ కూడా లేని పతంజలి ‘ అవుతే నాకేటి’ అని నవ్వేసి, వెళ్ళి పోయేరు. ప్రపంచ సాహిత్య ప్రమాణాలతో సరితూగే గొప్ప రచనలను చేసి, వెళ్ళి పోయేరు. కన్యాశుల్కం తర్వాత, అంత వాటంగా హాస్య బీభత్స రసాలను ప్రదర్శించ గలిగిన తెలుగు రచయితలు లేరనే చెప్పాలి.
సన్నగా , రివటలా పొడుగ్గా, కొనదేరిన రాచ ముక్కుతో , సూటిగా, దయగా చూసే చూపులతో, అవతలి వాడి వివేకాన్నీ, వెకిలి తనాన్నీ కూడా సరిగానే అంచనా వెయ్య గలిగిన ధీమాతో కూడిన చిరునవ్వు - యిదీ స్థూలంగా పతంజలి రూపం ! తెలిసిన వాళ్ళకి, అత్యంత వైవిధ్య భరితమూ, అద్భుతమైన హాస్య వ్యంగ్య శైలీ, విభిన్న మానవ మనస్తత్వాలను ఆవిష్కరించే కథనాలతో - ఇంత సాహిత్యాన్ని యీ బక్క మనిషి ఒక్కడూ అందించేడా ! అని, ఆశ్చర్యం కలుగుతుంది.
తెలుగు చిన్న కథ తొలి ఊపిరులు పోసుకున్న విజయ నగరానికి అతి చేరువలో అలమండ గ్రామంలో పుట్టిన పతంజలి డిగ్రీ చదువు విజయ నగరంలోనే సాగింది. పాత్రికేయునిగా విశాఖ పట్నం, విజయ వాడ, తిరుపతి, హైదరాబాద్ లలో శాఖా చంక్రమణం చేసారు. బతుకు బాటలో ఎన్నో ఉత్థాన పతనాల్ని చవి చూసేరు. ఒక అపూర్వమైన స్వీయ వ్యక్తిత్వంతో నిబ్బరాన్ని కోల్పో లేదు. బెదిరి పోలేదు. ఈనాడు, ఉదయం, ఆంధ్ర భూమి, సాక్షిలలో సంపాదకునిగా బాధ్యతలు ... మధ్యలో అవి వదులుకున్న సంధి కాలంలో సొంత పత్రిక పేరుతో చేతులు కాల్చకోవడం ... పచ్చళ్ళు, ఆయుర్వేద మందులు అమ్ముకోవడం, వైద్యం ... ఏవీ ఆయన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయ లేదు. ఆ యోగ పతంజలి యిక లేరు అనే నిజాన్ని జీర్ణించుకో లేక, యీ కొద్ది పాటి మాటలూ ...
మొలకెత్తిన మైత్రీ బంధం

పతంజలితో నా తొలి పరిచయం చిత్రంగా జరిగిందనే చెప్పాలి. ఆ రోజులూ, అప్పటి ఉద్వేగాలూ, దుందుడుకుతనాలూ వేరు. పతంజలి, ఆయన తమ్ముడు కలిసి, విజయ నగరంలో ఓ గదిలో ఉండి, మహా రాజా వారి కళాశాలలో చదివే వారు. పతంజలి డిగ్రీ మొదటి సంవత్సరం. అదే రోజుల్లో, అంటే, డెబ్భయ్యవ దశకం తొలి రోజులలో, నేను అక్కడే, మహా రాజా ప్రాచ్య కశాశాలలో భాషా ప్రవీణ చదివే వాడిని. కథా రచయితలుగానే తప్ప , పతంజలితో నాకు అప్పటికి ముఖ పరిచయం లేదు. పతంజలి మహా దూకుడుగా ఉండే వాడు. మా వూరి వాడే, ఓ అబ్బాయి, నా గురించి పతంజలితో చెడ్డగా చెప్పాడు. నాకు రచయితనని పొగరనీ, ఎవరితోనూ మాట్లాడననీ... యిలా ఏవో చెప్పాడు. దాంతో పతంజలి ‘‘ అలాగా ! ఆ పొగరేదో అణిచేస్తాను ... నా దెబ్బ రుచి చూపిస్తాను ...’’ లాంటి శపథాలేవో చేసాడుట. తీరా, సాయంత్రం అలాంటి ఉద్దేశంతో నన్ను ప్యారిస్ కార్నర్ దగ్గర కలిసేడు. కలిసేక సీను మారి పోయింది ! విజయనగరం కోట దగ్గర, బొంకుల దిబ్బ సమీపంలో,రోజూ సాయంత్రాల వేళ. ఊళ్ళోని రచయితలూ, కవులూ గుంపులుగా చేరి, కాళ్ళు పీకేలా , నిలబడి - సాహిత్య చర్చల్లాంటివి చేసే స్థలానికే ముద్దు పేరు ‘ ప్యారిస్ కార్నర్’ ! అక్కడ తొలి సారిగా కలిసేం - నేనూ, పతంజలీ. కాస్సేపు నన్ను దెబ్బ తీసే కార్యక్రమాన్ని వాయిదా వేసి, నా అభిరుచులూ, అభిమాన రచయితలూ, రచనలూ గట్రా యింటర్వ్యూ చేస్తున్నట్టుగా ఏవేవో అడిగేడు. నేను భయ పడుతూనే .వాబులు చెప్పేను. ఎంతయినా అతను రాజా కాలేజీ స్టూడెంటూ, నేను ప్రాచ్య కళాశాల విద్యార్ధినీ కదా !

అంతే ! పతంజలి నన్ను వాటేసుకుని, ‘ మిమ్మల్ని దెబ్బతీయాలనే వచ్చేను. కానీ యిక నుండీ మనం నేస్తాలం ... ఏం . ’’ అనడిగేడు. మొన్న ఆగష్టు నెలలో కలిసినప్పుడు ఆ ముచ్చట్లు చెప్పుకుని యిద్దరమూ ఎంత నవ్వుకున్నామో !
అలమండ రాజు గారి అబ్బాయి ఆ వయసులోనే అందించిన స్నేహానుభవం - నిత్య హరితమై ఏళ్ళు గడుస్తున్నా, మధురంగా మనసులో మెదులుతూనే ఉంది.

మా రహస్య అజెండా

మా స్నేహం, కలిసేక విజయనగరంలో ఉన్నన్ని రోజుల్లోనూ వొకరిని విడిచి వొకరం ఉండ లేదు. అప్పుడప్పుడు మాతో కవి సీర పాణీ, రచయిత దాట్ల నారాయణ మూర్తి రాజూ వొచ్చి కలిసే వారు.
రోజూ నియమం తప్పకుండా మహా రచయిత చాసో గారిని కలవడానికి పోయే వాళ్ళం.చిన్ని పల్లి వారి వీధిలో చాగంటి వారి హవేలీ లోనో, కస్పా బజారులోనో కలిసే వాళ్ళం.ఆయన వెంట మహా శ్రద్ధా భక్తులతో వ్యాస నారాయణ మెట్ట వరకూ వెళ్ళే వాళ్ళం. ఆ కథా శిల్పి ఎన్ని గొప్ప విషయాలు చెప్పే వారో ! నోట్లో చుట్ట ఎర్రగా కాలుస్తూ, చురుకయిన చూపులతో , మా వేపే చూస్తూ సాహితీ ప్రసంగం చేస్తున్నట్టుగా ఉండేది వారి ధోరణి. మా కథలు ఆయనకిచ్చి అభిప్రాయం అడిగే వాళ్ళం. అంత పెద్దాయనా, ఏ మాత్రం విసుక్కోకుండా, మా కథల్లో మంచి చెడ్డలు విపులంగా చర్చించే వారు. మంచేఁవిటి ! నా ముఖం ! ... మా కథల్లో లోపాలు ఎత్తి చూపిస్తూ ఎండ గట్టే వారు. ఉడుక్కునే వాళ్ళం.

‘‘ ఈ ముసిలాయనతో మనం పడలేం బ్రదరూ ! ... అంచేత మన కథలింక ఈయనకి చూపించొద్దు ...ఎప్పటికయినా చాసో రాసిందానికన్నా గొప్ప కథ రాసి చూపిస్తాను ... ’’ అనే వాడు. అంత లోనే , గొంతు తగ్గించి, ‘‘ అబ్బే, అది వీలయ్యే పని కాదు . ఆ స్థాయిని మనం జీవిత కాలంలో అందుకో లేం . .. పోనీ ...ఆయన తన చుట్ట నోటొతో ఒక్క సారయినా , ‘ బాగుందయ్యా ! ’ అనే అనే కథ రాయాలి ... అందాక ... రోజుకో కథయినా చదవమని మన చుట్టల తాత గారిని కందిరీగల్లా కుడదాం ... ఏం . ’’ అని మా మధ్య ఓ రహస్య ఒప్పందం ఖరారు చేసాడు.

ఆ తర్వాత, నా సంగతి అటుంచండి కానీ ... మా పతంజలి మాత్రం చా.సోనీ, అలాంటి ప్రసిద్ధ రచయితలనీ మెప్పించే రచనలు అనేకం చేసాడు. చా.సో గురించీ , అతని కథల గొప్పదనం గురించీ ఎంత విశ్లేషిస్తూ చెప్పే వాడో ! ఆ కథా శిల్పి చెక్కిన అపురూప కథకుడు - ఆ మధ్య చా.సో స్ఫూర్తి అవార్డుని సొంతం చేసుకున్నాడు ... అదీ పతంజలి !

పూర్వీకుని పరిచయం
పతంజలితో సాగిన నా స్నేహ ప్రస్థానంలో మరో అబ్బుర పరిచే ముచ్చట. ఆయన విశాఖలో ఈనాడులో పని చేసే రోజులలో తరుచుగా కలిసే వాడిని. ‘ రాజుగోరు’ రాసిందప్పుడే.

విజయ వాడలో ఉండేటప్పుడు ఓ సారి ఆఫీసులో కలిసాను. ఎప్పటిలాగే ఆత్మీయంగా పలకరించేడు. ఎన్నో కబుర్లు కలబోసుకున్నాం. ఆ రోజు నాకు ఆయన యింట్లోనే ఆతిధ్యం. ‘‘ మా యింటికి రండి... మా పూర్వీకుడ్ని ఒకరిని పరిచయం చేస్తాను ...’’ అని తీసికెళ్ళాడు.

ఏ శతాధిక ముది వగ్గో అనుకున్నాను. చిత్రం ! అయన చూపించింది ఓ కోతిని. బజార్లో కోతులాడించే మనిషి దగ్గర కొని పెంచుతున్నాడుట ! ఆ చమత్కారం అతనికే చెల్లింది ! చేపల్ని పెంచిన పతంజలీ, పిట్టల్ని పెంచిన పతంజలీ చాలా మందికి తెలిసుండ వచ్చు. కోతుల్ని పెంచిన పతంజలి తెలీక పోవచ్చు. కదూ?
అమ్మ దొంగా !

ఆ తర్వాత ఫోన్లూ, అప్పటప్పట ఉత్తరాలూ తప్ప మేం కలుసుకున్న సందర్భాలు తక్కువే. కథా, నవలా సాహిత్యంలో మా పతంజలి విరాడ్రూపాన్ని చూసి, మురిసి పోతూనూ ఉన్నాను.

మళ్ళీ ఎప్పుడు చెప్మా కలుసుకున్నాం ? ఆఁ! ... ఓ సారి విశాఖ పట్నంలో కలిసేం. నేను మా సాలూరు ( నేను ఉద్యోగ రీత్యా ఉండే వూరు) వెళ్ళడానికని బయలు దేరాను. దార్లో ఓ పుస్తకాల షాపులో దూరేను. పుస్తకాలు చూస్తున్నాను.

వెనక నుండి బలమైన ఓ రెండు చేతులు నన్ను బలంగా వాటేసుకుని , ఉక్కిరి బిక్కి రి చేసాయి.
చూద్దును కదా ... మా పతంజలి !
‘‘ రాత్రికి ఉండి పోండి ... మన చిన్నప్పటి కబుర్లతో రాత్రిని కరిగిద్దాం ... ఏం ? ...’’ అనడిగేడు. అక్కడే, అమ్మకానికి ఉంచిన పుస్తకాలలోనుండి తనపుస్తకాన్ని ఒక దానిని తీసి, దాని మీద ‘ నాకెంతో ప్రియమైన మా పంతుల జోగారావు గారికి’ అని రాసి నాకిచ్చేడు.తీయని గుర్తుగా అది నా దగ్గరింకా పదిలమే. ‘పతంజలి భాష్యం’ దాని పేరు.
ఆ రాత్రి ఎన్ని విశ్వ సాహివత్య వీధుల్లో పచార్లు చేయించేడో! ఆ విషయ సంపదకీ, సాధికారతకీ చకితుడినయి పోయేను.
దగ్గర్లోనే ఉండి ఒక్క సారి కూడా కలవ లేదని నిష్ఠరమాడేడు. ‘ ఇప్పుడయినా, దొంగ ని పట్టుకున్నాను కనుక సరి పోయింది! సరే ... ఇక్కడ ఓ పత్రిక పెట్టాను ... తెలుసా ? ...’’ అనడిగేడు.
‘‘ తెలీదు.’’ అన్నాను నిజాయితీగా.
‘‘సరే లెండి! ... దాని గురించి నాకే తెలీదు ! ’’ అని నవ్వేసాడు. ఆ హాస్య ప్రియత్వమే అతని పుస్తకాలనిండా వెన్నెలలా పరుచుకుని ఉంది మరి !

ఆ సౌజన్యం అపురూపం

పతంజలిని కలిసింది నా ‘ అపురూపం’ కథల సంపుటి ఆవిష్కరణ సభలోనే. నాకుగా నేను కోరక పోయినా , నా ప్రచురణ కర్త మాట మేరకు, నామీద గల అభిమానంతో నా పుస్తకానికి ముందు మాట రాయడమే కాక, ఆ రోజు సభకి వచ్చి పలకరించి వెళ్ళాడు నా గురించి అతను రాసిన నాలుగు ముక్కలూ ఎప్పటికీ నాకు నా కథలకంటే కూడా ప్రీతి పాత్రం.

అవీ, యివీ ... మరి కొన్ని ...


దు:ఖోద్వేగంలో గుర్తుకు రావడం లేదు... గుర్తున్నంత వరకూ మరి కొన్ని ...
చదువుకునే రోజులలో అలమండ నుండి వచ్చే కేరియర్లలోంచి వంటకాలను బలవంతంగా రుచి చూపించడం ... ‘దిక్కుమాలిన కాలేజీ’ కథ రాసి, తను చదువుకునే కాలేజీ రాజకీయాలను ఎండ గట్టి కూడా ... ధైర్యంగా బోర విరుచుకుని నడవడం, నవ్వడం ...చతురలో నవలకి వెయ్యి రూసాయలొస్తున్నాయని ఎడాపెడా అప్పులు చేస్తున్నానని చెప్పడమూ ...


కడసారి కలిసింది


మొన్న ఆగష్టు పన్నెండవ తేదీన చివరి సారిగా పతంజలిని కలిసేను.
అతని ఆరోగ్యం గురించి నేనూ అడగ లేదు... పతంజలీ చెప్ప లేదు ... కబుర్లు కలబోసుకున్నాం. విజయ నగరం కబుర్లు ...
పతంజలికి అలమండ అన్నా, విజయ నగరం అన్నా అవధుల్లేని అభిమానం ! అక్కడి మిత్రులు ఎవరు పలకరించినా పులుకరించి పోతాడు.
అప్పుడెప్పుడో వో సారి కలిసినప్పుడు విజయ నగరం గురించి చెబుతూ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి ...

‘‘ ఆ ఊరి కోట, కందకం,కస్పా బజారు, బొంకుల దిబ్బ,మూడు మూడు లాంతర్లు, మూడు కోవెళ్ళు, మచ్చ కొండ, గంట స్థంబం, పెద్ద చెరువు ... చివరికి పెద్ద చెరువులో దోమలు కూడా నాకు మంచి నేస్తాలే ! ... ఎందుకంటే ...రాత్రి పూట నన్ను తెగ కుట్టి మేలుకుని ఉండేలా చేసి, కథలూ గట్రా రాసుకునేలా ప్రోత్సహించినవి , పాపం, అవే కదా ! ...’’
మరింక రాయ లేను ...



అయ్యో, ఇప్పుడా ...


రక్తం ఉత్సాహంతో ఉరకలేసే వయసులో నన్ను దెబ్బ తీయాలని వచ్చి స్నేహ లతలా అల్లుకు పోయేడు - మా పతంజలి ! ... ప్రసార మాధ్యమాలలో పతంజలి ఇక లేరని విని , చూసి , అవాక్కయాను.

అయ్యో మిత్రమా ! ఇప్పుడీ వయసులో ఎంత కోలుకో లేని దెబ్బ తీసావయ్యా ....


౦ ౦ ౦


పతంజలి( ౧౯౫౨ మార్చి ౨౯ - ౧౧ మార్చి ౨౦౦౯) కి నివాళిగా నవ్య వీక్లీలో తే ౨౫-౩-౨౦౦౯ దీ సంచికలు ప్రచురణ.



పతంజలి రచనలు


ఖాకీ వనం

పెంపుడు జంతువులు
రాజు గోరు

వీర బొబ్బిలి

గోపాత్రుడు

పిలక తిరుగుడు పువ్వు

అప్పన్న సర్దార్

ఒక దెయ్యం ఆత్మ కథ

నువ్వే కాదు

వేట కథలు


ఈ నవలికలను కె.యన్.వై. పతంజలి రచనలు పేరిట పతంజలి మిత్ర మండలి ( హైదరా బాద్ ) వారు ప్రచురించారు.


ఇవి కాక - రాజులు లోగిళ్ళు, చూపున్న పాట, పతంజలి భాష్యం, దిక్కు మాలిన కాలేజీ కథల సంపుటి ...

డా. కె.వి.నరసింహా రావు వీరి ఖాకీ వనం నవలని హిందీ లోకి అనువదించేరు.


రాజకీయ,పోలీస్, న్యాయ, పత్రికా వ్యవస్థల మీద కొరడా ఝళిపిస్తూ శక్తి వంతంగా తెలుగులో రాసిన ఒకే ఒక్క రచయిత పతంజలి గారు.

20, నవంబర్ 2009, శుక్రవారం

షరతులు వర్తిస్తాయి ...

మంచి సంబంధం.కట్నాల ఊసు లేదు.పిల్ల నచ్చింది."రెండు రోజుల్లో మళ్ళీ మూఢాలు వస్తాయి.కనుక,రేపే తాంబూలాలు మార్చుకుందాం" అని వియ్యాల వారి నుండి ఫోను.


ఆ యింట్లో అందరూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయి పోయేరు."మా సునంద జాతకం చాలా మంచిదమ్మా" యీ మాట యిప్పటికి తల్లి సరస్వతమ్మ అనుకోవడం యిది ఏ వందో సారో. తండ్రి నారాయణ కూడా ఎంతగానో సంతోషించారు. వియ్యంకుల వారి నుండి ఫోను వచ్చింది లగాయితూ ఆ దంపతులకి కాలు ఒక చోట నిలవడం లేదు. చుట్ట పక్కాలకి ఉదయం నుండి ఫోన్లు చేస్తూ ఆ శుభ వార్త అందజేస్తూనే ఉన్నారు. ఇరుగు పొరుగులకీ,ఊళ్ళో స్నేహితులకీ ఆ వార్త చేర వేసారు. మరో ప్రక్క తాంబూలాలు యిచ్చుకుందుకి అట్టే వ్యవధి లేక పోవడంతో వాళ్ళకి కంగారు పెరిగిపోతోంది. పీకల మీదకి యీ మూఢాలొకటి వచ్చి పడుతున్నాయి. ఏం చెయ్యాలో తోచడం లేదు. తాంబూలాలకి కొంచెం సమయం కావాలని అడిగే సాహసం చేయ లేక పోయేరు.


సునంద కూడా యీ సంబంధానికి సుముఖత తెలియ జేసింది. అయితే యింత అవ్యవధానంగా నిశ్చయ తాంబూలాలు ఏర్పాటు చెయ్య మనడం ఆమెకి చిరాకనిపిస్తోంది."మరో సారి వాళ్ళతో మాట్లాడ కూడదూ, నాన్నా..."అంది తండ్రితో. అతను ఫోను చేసారు.


"అబ్బే...అనుకున్నాక మరి ఆలస్యమెందుకండీ...బావ గారూ...మూఢాలు రాకుండానే ఆ తంతు జరిపించేద్దాం...మాట్లాడుకోడానికి మరేం లేదు.. అదీ కాక, మా వాడికి యిప్పట్లో మళ్ళీ సెలవు దొరకదు . తాంబూలాల కార్యక్రమం చాలా సింపులుగా జరిసించేద్దాం...కాదనకండి..." అని జవాబొచ్చింది.


మరి చేసేదేముంది కనుక? హడావిడిగా పనులకి సిద్ధమయ్యారు నారాయణ దంపతులు.


కట్నం ప్రసక్తి లేని సంబంధం వొచ్చినందుకు సునంద ఎంతగానో ఆనందించింది. అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తున్నా కట్నం కోసం వేధించే వారున్న యీ రోజులలో ...ఆ ఊసే ఎత్తని వారి ఉత్తమ సంస్కారానికి పొంగి పోయింది. ఆ రోజంతా షాపింగ్ చేసి, బట్టలూ, ప్వీట్లూ అవీ కొని, బిజీ బిజీ అయి పోయేరు నారాయణ దంపతులు. వియ్యాల వారిదీ అదే ఊరు కావడం చేత, ప్రయాణ హడావిడి లేదు. దగ్గరి వాళ్ళకి ఫోన్లు చేసి ఆహ్వానించారు.


మర్నాడు నిశ్చయ తాంబూలాల కార్యకమం నిరాడంబరంగానే, అయినా, ఎంతో ఉల్లాసంగా జరిగింది. కొద్ది పాటి మంది బంధువులూ, స్నేహితులూ హాజరై దీవించేరు. ఫొటోలూ, వీడియోలూ షరా మామూలే...


మూఢం వెళ్ళేక ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నారు. వియ్యాల వారు వెళ్ళి పోయేక ఆ రాత్రంతా సరదా కబుర్లతోనే గడిచి పోయింది.
కట్నం లేని సంబంధం వొచ్చినందుకు నారాయణ గర్వించేడు.


* * * * * *


"సునందది మహర్జాతకం..." అనుకున్నాడు నారాయణ.
"అవును సుమీ..." అనుకుంది సరస్వతమ్మ.


కాని, ఆ సంతోషం అట్టే రోజులు వారికిొ నిలవ లేదు.


మూఢాలు వెళ్ళేక, పెళ్ళి ముహూర్తాలు పెట్టుకున్నది లగాయితూ వారి ఆనందం అడుగంటి పోసాగింది. వాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెట్టించే సంఘటనలు చాలానే జరిగాయి...


వియ్యాల వారి నుండి రోజుకో ఫోను. పూటకో బెత్తాయింపు.కట్నం లేదు కనుక, పెళ్ళి మాత్రం ఆ పట్నంలోకెల్లా అత్యంత విలాసవంతమయిన హొటల్లో జరిపించాలని హుకుం జారీ చేసేరు. తమ తరఫు వాళ్ళెవరి వద్దా చిన్నపోకుండా పెట్టుపోతలూ అవీ ఘనంగా జరిపించాలని తేల్చి చెప్పారు. ఆ బట్టల ఖరీదులూ,వివరాలూ విని నారాయణ దంపతులకి గుండెలు జారి పోయేయి. ఇక,పెళ్ళి కూతురుకి పెట్ట వలసిన నగల గురించి విన్నాక,వారికి మూర్ఛ వచ్చినంత పనయింది. కళ్ళు బైర్లు కమ్మాయి.సారె సామాన్ల జాబితా, విందు భోజనాలలో మెనూ, పెళ్ళయాక నూతన దంపతుల హనీమూను ట్రిప్పు కోపం చేయాల్సిన యేర్పాట్లూ,.. ఇవన్నీ క్రమేపీ ఒక్కొక్కటీ వింటూ వాళ్ళ మెదళ్ళు మొద్దుబారి పోయాయి.


వియ్యాల వారి నుండి ఫోనంటేనే బెంబేలెత్తి పోతున్నారు. వారికి ముచ్చెమటలు పడుతున్నాయి.


కట్నం లేదన్న మాటే కానీ, ఆ గొంతెమ్మ కోరికలకి అంతూ పొంతూ లేకుండా పోతోంది. ట్రింగ్ ....ట్రింగ్ ... అనే ఫోను శబ్దం వాళ్ళ గొంతు తడారి పోయేలా చేస్తోంది.


కట్నం తీసుకోని కీర్తి వాళ్ళకి దక్కొచ్చు కాక, ఈ పెళ్ళి యేర్పాట్లతో తాము కుదేలయి పోవడం తధ్యం... సునంద కోపంతో చిందు లేస్తోంది. ఒక దశలో ఈ సంబంధం కేన్సిలు చేసెయ్యమని తెగేసి చెప్పింది.


అంత వరకూ వచ్చేక ఎలా వదులు కోవడం? అల్లుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మనిషి యోగ్యుడులాగే ఉన్నాడు. అయినా, పెళ్ళి ఘనంగా జరగాలని వారను కోవడంలో తప్పేమీ లేదు... కానీ, ఆ సంగతి ముందే చెప్పొచ్చు కదా... అప్పుడు తను తూగగలడో లేదో ముందే వారికి చెప్పుకునే వాడు కదా...పెళ్ళికి ముందే యిలాగుంటే, పెళ్ళయాక తమ తలకి మించిన కోరికలు ఏం కోరుతారో....అదో బెంగ వారిని పీడించ సాగింది.


గొప్పగా ... మాట్లాడు కోడానికి ఏమీ లేదని చెప్పి, తాంబూలాలకి తొందర పెట్టి, తీరా యిప్పుడీ గొంతెమ్మ కోరికలతో చంపుతున్నారు...


వీళ్ళ ఆరాటం గమనించి , తెలిసిన స్నేహితుడొకాయన సలహా యిచ్చేడు ‘‘ కొందరంతే ...అన్నీ ఉచితం అని ప్రకటనలిచ్చి...చివర్లో ఎక్కడో కనీ కనిపించ కుండా షరతులు వర్తిస్తాయి అని వేస్తారు చూడండి... అలాగన్న మాట...పైకి సంస్కారం ప్రకటించి, తర్వాత వాళ్ళనుకున్న వన్నీ సాధిస్తారు...సరే ...అప్పో ...సప్పో చేసి, సునంద పెళ్ళి జరిపించండి ...అంతకన్నా మరో మార్గం లేదు...అన్నీ సర్దుకుంటాయి...పెద్ద వాడ్ని చెబుతున్నాను ... కాదనకండి ...’’ అని హితవు పలికారు. అయిష్టంగానే అంగీకరించేరు నారాయణ దంపతులు.


* * * * * *


పెళ్ళి మహా ఆడంబరంగా జరిగింది. చిన్నా చితకా తప్ప మరేం కొత్త కోరికలు కోర లేదు వాళ్ళు. ఆ మేరకు ... అదో ఊరట...
ఆ పెళ్ళితో ఆ దంపతులకి ఆనందంతో పాటూ పుట్టెడు అప్పూ, తెలీని బెంగా మిగిలి పోయేయి.


సునంద అత్త వారింటికి వెళ్ళి పోయింది. త్వరలోనే అందరితో బాగా కలిసి పోయింది.పదహారు రోజుల పండుగ పూర్తయేక ...సెలవు ముగించుకుని, సునంద తిరిగి తన ఉద్యోగంలో జాయనయింది రోజులు గడుస్తున్నాయి. నాలుగు నెలలయింది. సునంద తన జీతం ఏం చేస్తోందో తెలీడం లేదు. అత్త వారింటిలో ఒక్క పైసా యివ్వడం లేదు... ఆ యింట్లో అంతా మనసులోనే కుత కుత లాడి పోతున్నారు. సంస్కారపు తెర అడ్డొచ్చి, ఎవరూ నోరు మెదపడం లేదు.


ఆఖరికి ఉండబట్ట లేక, భర్తే ఓ రోజు సునందని జీతం గురించి అడిగేడు.

సునంద ప్రశాంతంగా బదులిచ్చింది."పెళ్ళయాక, ఉద్యోగం చెయ్యాలనీ, మానకూడదనీ అన్నారు కదా" ?

"అవును ... అయితే ..."

"అందుకే ఉద్యోగం మాన లేదు ...ఉద్యోగం చెయ్య మన్నారే కానీ ... జీతం మీకిమ్మని ముందే కండిషను పెట్ట లేదు కదండీ "

సునంద మాటలతో ఆ యింట్లో అంతా నిర్ఘాంత పోయారు.వాళ్ళకి కోపం తన్నుకొచ్చినా, ఎలా వ్యక్తం చేయాలో తెలీక ... మిన్నకుండి పోయేరు.ఆ విస్ఫోటనం మరింత పెద్దది చెయ్యడం యిష్టం లేక .... సునంద మళ్ళీ అంది ..."ఈ పరిస్థితులు కొంత కాలమే లెండి .....మా నాన్న మన పెళ్ళికి చేసిన అప్పులు తీరే వరకూ ... ప్లీజ్ ...అర్ధం చేసుకోరూ ..." అని.


కట్న ప్రసక్తి లేకుండా కోడల్ని తెచ్చుకున్న వారిగా అందరి మెప్పూ పొందిన ఆ యింట్లో ఎవరికీ ఆ మాటలతో మరింక నోళ్ళు పెగల లేదు...

ఎంతయినా ... వారిది సంస్కారవంతుల కుటుంబం కదా ? ......


* * * * * * *


నవ్య సచిత్ర వార పత్రికలో తే 9-9-2009 దీ సంచికలో ప్రచురణ.

18, నవంబర్ 2009, బుధవారం

నగరం

నగరం
వేగమయ జీవితం
ఏక్సిలేటరు లో వినిపిస్తుంది.
ఏక్సిడెంటు లోకనిపిస్తుంది.

15, నవంబర్ 2009, ఆదివారం

బడికి సెలవు

బడికి సెలవు
అక్షరాల గుడికి సెలవు
బెత్తాల ఏలుబడికి సెలవు
పంతుళ్ళ పెత్తనాలకి సెలవు.

పూల బస్తాల రవాణా చేస్తునట్టు -
ఆటోలు, రిక్షాలూ -
వాటికి సెలవు.

టిఫిన్ బాక్సులకు సెలవు
వాటరు బాటిళ్లకు సెలవు

పుస్తకాల సంచీలకి
యూనిఫారాలకీ సెలవు

బడికి సెలవు
మోయలేని పెను భారాలకు సెలవు

సెలవుల్లో మూతబడిన బడి ఎలా ఉంటుందో?
పిట్టలెగిరి పోయినట్టి
వట్టి చెట్టులాగానో !
గల గలమని జల జలమని
పారే నీరింకిన ఏటి చాలు లాగానో!!

సందడి తగ్గిన పెళ్లి పందిరి
చందంగా ఉంటుందా? బడి!
ఎలా ఉంటుందో,మా బడి -సెలవుల్లో!!

బడిలో మొక్కల చుట్టూ ఎగిరే
మా రంగు రంగుల నేస్తాలు
అందమైన సీతాకోక చిలుకలు!!

ఎంత బెంగ పడ్డాయో! ఎచటి కెగిరిపోయాయో!
ఎక్కడికో ఎగిరిపోయి, ఇక్కడికే వస్తాయా?

ఆట స్థలం మా కోసం
ఆత్రంగా చూస్తుందో, అయ్యో , అనుకుంటుందో?

బడి గంటలు సడి చెయ్యక
మూగబోయి ఉన్నాయో, మా
ఆగమనం కోసం మూగ నోము పట్టాయో
ఎలా ఉంటుందో మా బడి సెలవుల్లో!!

సెలవుల పిమ్మట తెరిచిన
బడి ఎలా ఉంటుందా?

కొత్త నీరు చేరినట్టి
కొలను లాగా ఉంటుంది!

గుత్తులుగా పూసినట్టి
కొమ్మలాగా ఉంటుంది !

ఎగిరే రాయంచ లాగా
ఎంతో బాగుంటుంది !

విరిసే హరివిల్లు లాగ
వింత వింతగా ఉంటుంది
కురిసే చిరు జల్లులాగా
మురిపెంగా ఉంటుంది !!


ఆకాశవాణి.. విశాఖపట్నం కేంద్రం నుండి తే .. 7-6-2004 న ప్రసారం