29, జనవరి 2011, శనివారం

కష్ట చతుష్టయమ్


ఎంతటి ధీరుడైనా నాలుగు రకాలయిన కష్టాలను మాత్రం ఓర్చుకో జాలడని పెద్దలు చెబుతున్నారు.

అవేమిటో చూద్దాం ...

సహస్ర దు:ఖాని సహంతి ధీరా : చత్వారి దు:ఖా న్యతి దుస్సహాని
కృషీ చ నష్టా గృహిణీ చ దుష్టా, పుత్రో2స్యవిద్వాన్ , ఉదరే వ్యథా చ.

ధీరులు వేయి దు:ఖాలనయినా ఓర్చుకో గలరు. అంటే, ఎన్ని కష్టాల నయినా సహించ గలరు. కానీ, నాలుగు రకాలయిన కష్టాలు మాత్రం వారికి అత్యంత దుస్సహమైనవి.

అవి యేమంటే ...

కృషి వినష్టమైతే ఆ కష్టాన్ని ఎంతటి ధీరుడూ ఓర్చుకో లేడు. కృషి అంటే వ్యవసాయం. వ్యవసాయం చెడిపోతే అ దు:ఖం ఎంతటి ధీరుడినీ భీరువుగా చేస్తుంది.

ఇక రెండవది - భార్య దుష్టు రాలైతే ధీరుడు ఓర్చుకో లేడు.

పుత్రుడు విద్యా గంధ శూన్యుడయితే ఎంతటి ధీరుడూ సహించ లేడు.

ఇక, నాలుగవది - ఉదర బాధ. కడుపు నొప్పికి ఎంతటి ధైర్యవంతుడయినా తాళ లేడు.

ఈ రకంగా ఈ శ్లోకంలో ధీరుడు వేయి కష్టాలను సహించ గలడు కానీ, వ్యవసాయం నష్టమైనా, భార్య గయ్యాళిదైనా, కుమారుడు చదువు రాని దద్దమ్మ అయినా, కడుపులో నెప్పి కలిగినా ఓర్చుకో జాలడని కవి చెబుతున్నాడు.

27, జనవరి 2011, గురువారం

పద్య వినోదం


ఈ పద్యం చూడండి:

రజక, కవాటముల్ రహి తప్పి యుండుట
కేమి హేతువో దాని నెఱుఁగ వలయు

ఇల్లును, పామును హీనమై యుండుట
కేమి హేతువో దాని నెఱుఁగ వలయు

పాలిచ్చు పశువును, పక్షియు హీనమై
యుండుట యేమిమో నెఱుఁగ వలయు

సస్యంబు కుమ్మరి సంతోష వర్జమై
యేమిట నుండు నో యెఱుఁగ వలయు

దీని యర్ధంబు చెప్పిన దేశికులకు
నెలలు పండ్రెండు గడువిత్తు నేర్పు తోడ.

పద్య వినోదం. లేదా, వినోద పద్యం. కవి ఈ పద్యంలో కొన్ని ప్రశ్నలు వేసి, జవాబు తెలిస్తే చెప్పమంటున్నాడు. కావాలంటే వో యేడాది గడువు తీసుకోండని కూడా ఉదారంగా సెలవిస్తున్నాడు.

కవి సంధించిన ప్రశ్నలకు మనం జవాబులు చూద్దామా?

వీటికి అన్నింటికీ వరుసగా జవాబులు ఇవి:

1. ఉతక లేక!
2. కప్ప లేక!
3. చేప లేక !
4. వాన లేక.!

రజకుడు ( చాకలి), కవాటము (తలుపు) రహి తప్పి ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? అంటే, కళ తప్పి ఉండడానికి కారణం అడుగుతున్నాడు కవి.

రెండింటికీ ఒకటే జవాబు: ఉతక లేక !
అంటే రజకుడు బట్టలు ఉతక లేక. తలుపు ఉతక ( అడ్డు గడియ) లేక రహి చెడి ఉండడానికి కారణం.

ఇల్లు, పాము దైన్యంతో ఉండడానికి కారణం ప్రశ్నిస్తున్నాడు కవి.

రెండింటికీ ఒకే జవాబు : కప్ప లేక !

అంటే, ఇల్లు కప్ప లేక ( తాళం కప్ప లేక అని కానీ, పై కప్పు కప్ప లేక అనికానీ చెప్పుకో వచ్చును) పాము తినడానికి కప్ప దొరక్క దీనంగా ఉండడానికి కారణం.

పాలిచ్చే పశువు, పక్షి రెండూ విచారంగా ఉండడానికి హేతువేమిటని కవి గారి ప్రశ్న.

జవాబులు రెంటికీ ఒకటే: చేప లేక !

పాలిచ్చే పశువు చేప లేక గిల గిలలాడి పోతుంది. పక్షి చేప దొరక్క విలవిలలాడి పోతుంది.

సస్యము, కుమ్మరి సంతోషం లేకుండా ఉండడానికి కారణం చెప్పమంటున్నాడు కవి.

రెంటికీ జవాబు ఒకటే: వాన లేక !

పంటకి వాన లేక పోయినా, కుమ్మరికి వాన లేక పోయినా గడవదు.

కవి గారు మరీ యేడాది గడువు ఇవ్వడం టూ మచ్ మాత్రమే కాదు, త్రీ మచ్ కూడానూ.
అవునా?

25, జనవరి 2011, మంగళవారం

సాహసం శాయరా డింభకా !!


సాహసం శాయరా, డింభకా ! అన్నాడు కదా, భేతాళ మాంత్రికుడు.


పిరికి గొడ్డులా ఉంటే లోకం తరిమి కొడుతుంది. అదే, బోర విరుచుకుని తిరిగేవనుకో లోకం సాగిల పడుతుంది. వెనుక బడితేను వెనకేనోయ్ అన్నాడు కవి. సాహసం చేయ లేక పోతే ఏదీ సాధించ లేం.‘ చెట్టు లెక్క గలవా ? పుట్ట లెక్క
గలవా ?..’’ అంటూ చెంచు లక్ష్మి కూడా ఓ క్వశ్చనీర్ హీరో గారి ముఖాన కొట్టడం తెలిసిందే కదా.

మా చిన్నప్పుడు ఊళ్ళోకి సర్కస్ కంపెనీ వచ్చిందంటే పండుగే, పండుగ ! పొద్దస్తమానం ఆ డేరాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉండే వాళ్ళం. సర్కసు చూసొచ్చిన కుర్రాళ్ళు ఇంటి వెనుక పెరళ్ళలో ఏవో ఫీట్లు ప్రాక్టీసు చేయబోవడం రివాజు. అలా, మా వీధి పిలగాయలు నలుగురైదుగురు కాళ్ళూ చేతులూ విరక్కొట్టుకున్న వాళ్ళూ లేక పోలేదు. సింహాలూ. పెద్ద పులులూ దొరికే ఛాన్సు ఎలాగూ లేదు కనుక,సీమ పందికి తర్ఫీదు ఇవ్వ బోయి అది భీకరంగా నిరాకరించడంతోను, తొడ కండ పీకేలాగున తన అసమ్మతి చూపడంతోను మంచాన పడిన కుర్రాళ్ళూ ఉండే వారు.

అలాగని సాహసాలు చెయ్యకుండా ఎలా ఉంటాం చెప్పండి?

సాహసాలంటే మంటల్లో దూకడాలూ, ఎత్తుల మీంచి దూకడాలూ మాత్రమే కానక్కర లేదు.

మా డింగరి బుచ్చబ్బాయ్ తనకి సున్నా మార్కులు వేసిన లెక్కల మాష్టారి మీదకి చాటుగా గురి చూసి మెట్లంగి రాయొకటి విసర లేదూ ? అప్పుడు వాడి సాహసానికి మేఁవంతా నోళ్ళు వెళ్ళబెట్టేం కదా. సాహసం కోసం మరీ ఇంతలేసి అకృత్యాలు చెయ్యమనడం లేదు కానీ, మీ పరిధిలో మీరు ఏవో ఒకటి రెండు సాహసాలయినా చేయక తప్పదు,జీవిత కాలంలో.

తెలుగు వర్ణమాల తెలిసిందే కదా, మరింకేం - ఏ కవితో రాసి పారెయ్యండి. ధైర్యంగా ఏ తలమాసిన పత్రికకో పంపించెయ్యండి. అచ్చోసిన వాడూ, చదివిన వాడూ వాళ్ళ ఖర్మానికి వాళ్ళు పోతారు. ఇలాంటి సాహసాలు చేయడం వల్ల ఇతరులకే కానీ మనకి ప్రమాదమేమీ లేదని ఢంకాభజాయించి చెబుతున్నాను.

ఇంటావిడ ధాం ధూమ్ లాడుతూ ఉంటే , పిరికి వాడిలా ముంగిముషాణంలా కూచో వద్దు. ఒక సారయినా సాహసోపేతంగా నోరు విప్పండి. మా సత్రాయిగాడు ఓ సారి ఇలాగే ధైర్యం చేసి వాళ్ళావిడ కన్నా పెద్ద నోరు పెట్టి ’’ నవ్వన్నది నిజమేనే ...‘‘ అని గాఠిగా అరిచేడు. వాడి ధైర్యానికి ఆవిడ మ్రాన్పడి పోయింది తెలుసా?

ఓ సారి మన జానపద బ్రహ్మ విఠలాచార్య గారి చిత్రరాజాలను గుర్తుకు తెచ్చు కోండి.



మన ఎన్టీవోడినీ,





కాంతారావునీ,


రాజనాలనీ




వీళ్ళందరినీ ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. ( దేశ వాళీ వీరులనే కాక విదేశీ వీరులని కూడా స్మరించడం మీ యిష్టం)

సాహస వీరుడు, సాగర కన్య లాంటి సినిమాలు చూసి పిరికి తనం ఏ మూలనయినా ఉంటే పోగొట్టుకోండి అని నా ఉచిత సలహా. ఇంకా చాలా ఉన్నాయి కానీ మరింత వివరంగా చెబుతూ మీ సహనాన్ని పరీక్షించే సాహసం చేయ లేను.

నా బ్లాగే కదా అని ఇలా నానా చెత్తా రాసే సాహసం చేస్తున్నానని మీరనుకుంటున్నారు కదూ.అవున్నిజమే. ఇంతకీ సాహసం చెయ్యమని ఒక కవి శ్లోకంలో చెప్పిన విషయమే మీముందు ఇవాళ ప్రస్తావించ బోతున్నాను. చూడండి:

న సాహస మనారుహ్య, నరో భద్రాణి పశ్యతి
సాహసం పున రారుహ్య, యది జీవతి పశ్యతి.

ప్రమాదాలు ఎదుర్కోనిదే మానవులు కార్య సాఫల్యాన్ని పొంద లేరు .విజయాన్ని అందు కోలేరు.అందు చేత, సాహసం చేసి, జయించి, బ్రతికి ఉంటే శుభాలు పొంద గలరు అని దీని భావం.

బ్రతికి యుండిన శుభములు బడయ వచ్చు ... అనుకుంటూ ఏ సాహస కృత్యమూ చేయకుండా పిరికి తనంతో బతకొద్దని కవి ఉవాచ. సహసం చెయ్. శుభాలు పొందు. ఆ సాహసం చేయడంలో ఛస్తే పాయె. బతికి ఉంటే శుభాలు పొంద గలవు అని కవి గారు హామీ యిస్తున్నారు.

వెన్ను చూపడం, మడమ త్రిప్పడం ... వంటి జాతీయాలు కదన రంగంలో సాహసోపేతంగా ముందుకు పొమ్మని ప్రోత్సహించేవే కదా.

బ్రేవో. గో ఎ హెడ్.

సాహసాల పేరిట సొమ్ము చేసుకునే టక్కరి తనమూ సాహసమేనా? ఏమో, 1979 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో నేను రాసిన ఈ సాహసాల కథ చదివే సాహసం చేస్తే మీకే తెలుస్తుంది. చదివేక, ధైర్యం ఉంటే సాహసంతో కామెంటండి.

నా కథ చూడండి:




అక్షరాలను జూమ్ చేసుకోవడానికీ పేజీని మనకు అనువుగా తిప్పుకోవడానికీ పేజీ పైన ఉన్న గుర్తులను పాటించగలరు

22, జనవరి 2011, శనివారం

పాల పిట్ట కొత్త సంచికలో చెమట పూల చెట్టు కవిత ...


చెమట పూల చెట్టు

ఒక్కో విత్తనం ఒక్కో అక్షరంగా శుభ్ర పరచి
చాలు చాలునా మొలకల కవితలల్లి
మట్టిని మహా కావ్యంగా మలిచిన కవివి నువ్వు

చినుకులూ సూర్య కిరణాలూ పడుగు పేకలుగా
నేలమ్మకు చేల చీరలు నేసే నేతగాడివి నువ్వు

నాలుగు గట్లు నగిషీల ఫ్రేములుగా
దుక్కి బెడ్డలే రంగు ముద్దలుగా స్వేదజలంతో కలిపి
మడి చెక్క కేన్వాసు మీద
ఆకు పచ్చ చిత్రాలను అలవోకగా గీసే
చేయి తిరిగినచిత్రకారుడివి నువ్వు

నిత్యమూ నిరంతరమూ
సమస్త ప్రజలకూ నిశ్శబ్ద హరిత సందేశాన్నందించే
మహామహోనాధ్యాయుడు నీ కంటే
యింకెవరుంటారు?
ఆరు రుతువులు చెక్కిన అపురూప శిల్పమా !
మా అరుదైన నేస్తమా !

కళ్ళు మిరుమిట్లు గొలిపే నీ శ్రమ సౌందర్యం ముందు
నీడ పట్టున నునుపెక్కిన మా సోమరి దేహధావళ్యం
తెల్లబోయి తల వొంచుకుంటుంది.

చెమట పూల చెట్టువు నువ్వు
ప్రగతికి తొలి మెట్టువి నువ్వు

నేల అణువణువునా పరుచుకుంది నీ నవ్వే
భూగోళం నీ దోసిట విరిసిన పువ్వే.

పంట నీ భాష
స్వేచ్ఛ నీ శ్వాస
నీ అడుగు ఆకుపచ్చని మడుగు
నీ నీడ మాకు చల్లని గొడుగు

(రైతు మిత్రుడు నడిసొంటి వెంకట్నాయుడికి ఆత్మీయంగా )

గంటేడ గౌరునాయుడు.

పాల పిట్ట ( మాస పత్రిక) జనవరి 2011 సంచికలో ప్రచురితమైన ఈ కవిత నన్నుకొన్ని మినహాయింపులతో
ఆకర్షించింది.

ఆరుగాలం పొలంలో శ్రమించే రైతుని చెమట పూల చెట్టుగా అభివర్ణించడం పులకింప చేసింది.
గౌరునాయుడు మంచి భావుకత ఉన్న కవి. పల్లెల పునాదుల మీద మొలిచిన కవి. చెట్టు పాట, ఏటి పాట ఎరిగిన వాడు. ఉత్తరాంధ్ర భాష పుట్టక తోనే వంట బట్టిన వాడు. అక్కడి పల్లెల నిసర్గ సౌందర్యంతో పాటు, అనంత విషాదాలను, సమస్యల మూలాలను అనుభవించి పలవరించే కవి.

రైతు మిత్రుడిని చెమట పూల చెట్టుగానే కాక, మట్టిని మహా కావ్యంగా మలచిన కవిగానూ, నేలమ్మకు చేల చీరలు నేసే నేతగానిగానూ, మడి చెక్క మీద ఆకు పచ్చని చిత్రాలను గీసే అపురూప చిత్రకారుని గానూ, నిశ్శబ్ద హరిత సందేశాన్ని జాతి జనులకు చేర వేసే మహామహోపాధ్యాయునిగానూ, పేర్కొంటూ, ఆరు రుతువులు చెక్కిన అరుదైన నేస్తంగా .
అక్కున చేర్చుకుంటున్నాడు. అతని భాష పంట భాష అంటూ పాత విషయాన్ని కొత్తగా నిర్వచిస్తున్నాడు.

ఐతే, డిక్షన్ మోతాదు మించి, ‘నదిని దానం చేసాక ...’ వంటి గొప్ప కవిత్వం రాసిన గౌరునాయుడు కలం నుండి వచ్చిన కవితేనా యిది అనిపించింది.

అంత్య ప్రాసల మీద అక్కరకు మించిన మోజు చూపడం ఏమంత మెచ్చుకో లేం.

శ్రమ సౌందర్యం వంటి భావనలు గౌరునాయుడు వంటి కవికి రాతగ్గవి కావు.
నేల అణువణువునా పరుచు కుంది నీ నవ్వే అనడం సుదీర్ఘ రైతాంగ పోరాటాల నేపథ్యాన్ని కాస్సేపు విస్మరించడమే. అతని అడుగు ఆకు పచ్చని మడుగు కావచ్చు కానీ, అతని నీడ (ప్రాస కోసం) మాకు చల్లని గొడుగు అనడం మింగుడు పడదు. పెత్తందారీ పోకడలకు ఊతమిచ్చే మోసపూరిత భావమేదో ద్యోతకమౌతున్నది.

ఏమయినా, ఈ కవితలో రైతన్నను చెమట పూల చెట్టుగా చూడడం నన్ను అమితంగా ఆకర్షించింది. అందుకే దీనిని మీకు పరిచయం చేస్తున్నాను.

ఔత్సాహిక నాటక రంగానికి చెందిన కథా వస్తువుతో సాయి బ్రహ్మానందం, గొర్తి రాసిన ‘ నేను అహల్యను కాను’ అనే మంచి కథ కూడా ఈ సంచికలో చదవొచ్చును.

పాల పిట్ట ( మాస పత్రిక)

విడి ప్రతి: 30/- లు.

16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సి, సలీం నగర్, మలక్ పేట,
హైదరాబాద్ 500 036
ఫోన్: 9848787294
మెయిల్ : palapittabooks@gmail.com

21, జనవరి 2011, శుక్రవారం

హెచ్చరిక



లోకంలో ప్రతి దానికీ కార్యకారణ సంబంధం ఉంటుంది. ఒకటి జరిగిందంటే దానికి తగిన కారణం ఏదో ఉండే ఉంటుంది.ఒక శ్లోకంలో భర్తృహరి ఈ విషయమై ఏం చెబుతున్నాడో చూడండి:

దౌర్మంత్ర్యా న్నృపతి ర్వినశ్యతి, యతి స్సంగాత్, సుతో లాలనాత్
విప్రో2నధ్యయనాత్, కులం కుతనయా, చ్ఛీలం ఖలోపాసనాత్
హ్రీ ర్మద్యా, దనవేక్షణాదపి కృషి: ప్రవాసాశ్రయాత్
మైత్రీ చా2ప్రణయాత, సమృద్ధి రనయాత్ , త్యాగాత్ ప్రమాదా ద్ధనమ్

దుర్మార్గడైన మంత్రి వలన రాజు నాశనమై పోతాడు.

స్నేహాల వలన యతి (సన్యాసి) చెడి పోతాడు. అంతే కదా, సర్వసంగ పరిత్యాగికి ఇతర సాంగత్యాలు తగవు కదా?

గారం చేయడం వలన పుత్రుడు చెడతాడు. అతిగారాబం అనర్ధ హేతువు.

వేదాధ్యయనం చేయక పోవడం వలన బ్రాహ్మణుడు సంకనాకి పోతాడు. వాడికి విహితమైన వేదాభ్యసనం చేయకుండా, నిగమశర్మకి తమ్ముడిలా అడ్డమైన తిరుగుళ్ళూ తిరిగితే ఏం బాగుపడతాడు లెండి ?

కుపుత్రుని వలన కులం నశిస్తుంది. కులానికో చెడ్డ కొడుకు పుడితే ఇహ చాలు, జనాలు ఆ కులాన్నంతా తిట్టిన తిట్టు తిట్ట కుండా తిడతారు. ఒక విభీషణుడున్నా, రావణ కులానికి దూషణలు తప్ప లేదు కదా.

దుష్టులతో చెలిమి వలన శీలం నశిస్తుంది. అందుకే పెద్దలు నీ స్నేహితులని చూసి, నువ్వు ఎలాంటి వాడివో చెప్పొచ్చని అంటారు.

మద్యపానం చేత లజ్జ నశిస్తుంది. తాగుబోతుకి ఎగ్గూ సిగ్గూ ఎక్కడుంటాయి చెప్పండి ?

తరచుగా వెళ్ళి చూడని వ్యవసాయం తగలబడుతుంది. కాలు మీద కాలు వేసుకుని దర్జాలు ఒలక బోస్తే వ్యవసాయం పనులు కావు. కార్తె పోతే రాదు. అందుకే అదనెరిగి వ్యవసాయం పనులు చేయాలి.

దేశాంతరగమనం వలన స్నేహం చెడి పోతుంది. అంతే కదా, ఎప్పుడూ దేశాలమ్మట పట్టుకు తిరుగుతూ ఉంటే మిత్రులే కరువవుతారు.తరుచుగా పలకరింపులు ఉంటేనే కదా, స్నేహాలు నిలుస్తాయి?

కూరిమి చెడి పోతే మైత్రీభావం నశిస్తుంది. కూరిమి గల దినములలో నేరము లెన్నడును తోచవు. ఆ కూరిమి విరసమైతే ఎదుటి వాడిలో అన్నీ తప్పులే కనబడుతూ ఉంటాయని శతక కర్త చెప్ప లేదూ?

అవినీతిచే సంపదలు నశిస్తాయిట. ఇది కొంత విచార మూలకం.అడ్డూ ఆపూ లేని సంపదలు పోగు పడేది అవినీతి పనులు అధికంగా చేయడం వల్లనే కదా? కవి మరి యిలా అంటాడేం? అంటే అవినీతితో చేకూరిన సంపదలు ఒకనాటికి నశించక తప్పదని కాబోలు. ఎంతటి ధనాధికులూ పట్టువడి శ్రీకృష్ణ జన్మ స్థానం చేరు కోవడం ఇటీవలి కాలంలో చూడడం లేదూ?

దానం, ప్రమాదం - వీటి వలన ధనం నశిస్తంది. ప్రమాదం సరే, దానం చేయడం వలన సంపదలు నశిస్తాయిట. కన్నూ మిన్నూ కానక అపాత్రదానాలు చేస్తూ పోతూ ఉంటే చేతికి చిప్ప కాక మరేం మిగులుతుంది ?

కనుక, ఆయా సంబంధాలనీ, విషయాలనీ విడిచి పెడితే మంచిది. లేక పోతే నశించడం ఖాయం అని కవి హెచ్చరిస్తున్నాడు.



17, జనవరి 2011, సోమవారం

గుండెల్లో తగినంత తేమ ఉండడం లేదు !!



మనం తరుచుగా అతిథి, అభ్యాగతుడు అనే మాటలు వింటూ ఉంటాం కదా.
అతిథి అంటే తిథి, వార, నక్షత్రాలతో నిమిత్తం లేకుండా వచ్చే వాడు. అభ్యాగతుడు అంటే పర్వ దినాలలోను, భోజన కాలం లోను వచ్చే వాడు.
సరే, భారతీయ సాంప్రదాయంలో అతిథి సేవకు గొప్ప స్థానం యిచ్చారు. అతిథి సేవను నిష్ఠతో పాటించే వారు.

అతిథి సేవకు చెందిన కొన్ని మంచి మాటలు ఇక్కడ చూదామా?

అతిథిర్బాలక: పత్నీ, జననీ జనకస్తథా,
పంచైతే గృహిణ: పోష్యా , ఇతరే చ స్వశక్తిత:

అతిథులను, పిల్లలను, భార్యను, తల్లిదండ్రులను - ఈ ఐదుగురినీ గృహస్థు తప్పకుండా సేవించు కోవాలి. వీరిని నిష్ఠగా పోషించాల్సిన కర్తవ్యం ఇంటి యజమానిదే. ఇక తక్కిన వారినంటారా, యథా శక్తి పోషించ వచ్చును.

అయితే, కవి ఇక్కడ మరో విషయం కూడా హెచ్చరిస్తున్నాడు.

అతిథి ర్బాలకశ్చైవ స్త్రీజనో నృపతి స్తథా
ఏతే విత్తం న జానంతి, జామాతా చైవ పంచమ:

అతిథి, బాలురు, స్త్రీలు, రాజు, అల్లుడు - ఈ ఐదుగురున్నూ ఇంటి యజమాని ఆర్ధిక పరిస్థితిని గురించి ఎంత మాత్రం పట్టించు కోరు ! అంటే, గృహస్థు దగ్గర డబ్బు ఉన్నా , లేక పోయినా తమకి సేవలు చేయించు కుంటూ, వారిని ఒత్తిడి చేస్తూ , వేధిస్తూ ఉంటారుట.

అయినా, ఓరిమితో అతిథి సేవ చేయాలనేదే భారతీయ విశ్వాసం.

అతిథిర్యస్య భగ్నాశో, గృహాత్ ప్రతి నివర్తతే
స తస్మై దుష్కృతం దత్వా, పుణ్య మాదాయ గచ్ఛతి.

అతిథి సేవను సక్రమంగా చేయని వాడికి ఎలాంటి ఫలితం ఉంటుందో కవి చెబుతున్నాడు.

ఎవరి ఇంటి నుండి అతిథి అయిన వాడు ఆకలితో వెనుతిరిగి వెళ్ళి పోతాడో, ఆ అతిథి తాను వెళ్ళి పోతూ తన వెంట ఆ ఇంటి యజమాని చేసిన మంచి కర్మల ఫలితాన్ని తన వెంట తీసుకుని పోతాడు. అంతే కాదు, తన యొక్క చెడ్డ కర్మల పలితాన్ని ఆ యజమాని ఇంట విడిచి మరీ వెళ్ళి పోతాడు. అంటే, అతిథి సేవ చేయని వాడు మునుపు చేసికొన్న పుణ్య కర్మ ఫలాలను పోగొట్టు కోవడమే కాక, కొత్తగా చెడ్డ కర్మల ఫలితాలను మూటగట్టు కుంటాడని అర్ధం.

అతిథౌ తిష్ఠతి ద్వారి, హ్యాపో గృహ్ణాతి యో నర:
ఆపోశనం సురాపానం, అన్నం గోమాంసభక్షణమ్.

అతిథి వాకిట ఉండగా వానిని విడిచి పెట్టి గృహస్థు తాను ఒక్కడే భుజించడం మహా దోషం సుమా.
అలాంటి వారు అన్నం తినడానికి కూర్చుంటూ పట్టే ఔపోశనం సురాపానంతో సమానం. వాళ్ళు తినే అన్నం గోమాంసంతో సమానం.

మను చరిత్రలో పెద్దన గారి ప్రవరుని అతిథి సేవాతత్పరత ఎలాంటిదో చూడండి:

తీర్ధ సంవాసులే తెంచి నారని విన్న
నెదురుగా నేగు దవ్వెంత యైన

నేఁగి, తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చు
తెచ్చి సద్భక్తి నాతిథ్య మిచ్చు

నిచ్చి, యిష్టాన్న సంతృప్తులుగాఁజేయు
చేసి, కూర్చున్నచో చేర వచ్చు

వచ్చి, యిద్ధరఁ గల్గు వనధి పర్వత సరి
త్తీర్ధ మాహాత్మ్యముల్ తెలియ నడుగు

అడిగి యోజన పరిమాణ మరయు, నరసి,
పోవలయుఁజూడఁగా ననుచు నూర్పులు నిగుడ్చు
నను దినము తీర్ధ సందర్శనాభిలాష
మాత్మ నుప్పొంగ నత్తరు ణాగ్ని హోత్రి

తీర్ధ యాత్రలకు పోతూ ఎవరయినా వస్తున్నారని వింటే చాలు, నిత్యాగ్ని హోత్రడైన ప్రవరుడు ఎంత దూరమైనా సరే , వారికి ఎదురుగా వెళ్ళి, పాదాభివందనం చేసి తన యింటికి ఆతిథ్యం స్వీకరించడానికి రమ్మని వేడు కుంటాడు. వారిని తన యింటికి తోడ్చుకుని పోయి భక్తియుతంగా ఆతిథ్యం యిస్తాడు.ఇష్గ మృష్ఠన్నాలతో వారిని తృస్తి పరుస్తాడు. ఆతర్వాత వారి చెంత చేరి దేశ దేశాలలో ఉండే వింతలూ విశేషాలూ, పుణ్యతీర్ధాలూ వగైరాల గురించి అడిగి, తెలుసుకుని , ఓ సారి చూసి రావాలి అనుకుంటూ నిట్టూర్పులు విడుస్తాడు. అలా ఉండాలి , అతిథి సేవ అంటే.

భాగవతంలో రంతి దేవుని అతిథి సేవ ఎట్టిదో తెలిసినదే కదా

రంతి దేవుడు తన సంపదలన్నీ దాన ధర్మాదులకి సమర్పించి, నిరు పేదయై, భార్యా పిల్లలతోఎనిమిది దినాలు పస్తులు ఉన్నాడు. ఒక నాడు అతనికి దైవవశాన నెయ్యి, పాయసం, నీళ్ళు లభించాయి. భుజిద్దామని కూర్చున్నాడో, లేదో, ఒక అతిథి వచ్చేడు.

అతిథి భూసురుఁడొక్క డాహార మడగిన గడపక ప్రియముతో గారవించి

హరి సమర్పణ మంచు నన్నంబులో సగమిచ్చిన భుజియించి యేగె నాతఁ

డంతలో నొక శూద్రుఁడశనార్ధియై వచ్చి, పొడసూప లేదనబోక తనకు

నున్న యన్నము లోన నొక భాగ మిచ్చిన సంతుష్టఁడై వాడు సనిన వెనుక

కుక్క గమియు దాను నొక్కక డేతేర నా
యన్న శేష మిచ్చి, సన్నయమున
వాని మ్రొక్కి పంప వరుసతోఁజండాలుఁ
డొక్కఁడరుగు దెంచి, చక్క నిలిచి ...

రంతి దేవుడు అన్నదానాన్ని హరి సమర్పణంగా భావించి, తనకు లభించిన దానిలో కొంత అన్నమును వానికిచ్చి, వానిని సంతుష్టుని చేసి సాగనంపేడు. ఆ తరువాత శూద్రుడొకడు ఆకలితో వస్తే మిగిలిన దానిలో సగ భాగం యిచ్చి వేసి గారవించి పంపించాడు. తరువాత కుక్కల గుంపును వెంట నిడు కొనిన వాడొకడు రాగా, వానికి మిగిలినదంతా యిచ్చి వేసి భక్తితో నమస్కరించి పంపించాడు.

తరువాత క్షుద్బాధతో వచ్చిన నాలవ జాతి వానికి దండమిడి,

అన్నము లేదు, కొన్ని మధురాంబులున్నవి త్రావు మన్న ! రావన్న ! ... అంటూ వానిని సగౌరవంగా పిలిచి తియ్యని నీళ్ళు సమర్పించుకున్నాడు.

మన వారికి అతిథి మర్యాదలంటే ఇంత నిష్ఠ.

హర విలాసంలో చిరుతొండ నంబి భక్తికి ఆది దంపతులు పరీక్ష పెడితే, ఆ నంబి తన శివ భక్త్యాచార సంపత్తిని ఎలా నిరూపించుకున్నాడో తెలిసినదే కదా.

పదకొండు రోజుల పాటు ఎడ తెగని వర్షాలు శివ మహిమ చేత కురిస్తే, అతిథి సమర్పణకు వంటలు చేయడమే కష్టమై పోయింది. యింట ఎండిన వంట చెఱకు లేకుండా పోయింది. అయినా తైలంలో ముంచిన గుడ్డలకు నిప్పు అంటించి , పొయ్యలు వెలిగించి, వంటలు చేయించాడు.

అతిథులు భుజిచనిదే తాను ఔపోసన పట్టని వ్రతం కలవాడు. అష్టకష్టాలూ పడి వంటలు ముగించినా, ఒక అతిథీ
( జంగముడూ) కనిపించక ఆశ్చర్య పోతాడు.

ముసురు పట్టిన వేళ, తమ యింటి అరుగులు మీద, పంచల క్రిందా, భస్మం పూసుకున్న వాళ్ళూ, పరమ పావన మూర్తులు, మహా శివ భక్తులూ అయిన వారు అనేకులు ఉండే వారు. ఆ రోజు ఒక్కరూ కనబడక పోవడం చూసి నంబి ఆశ్చర్యచకితుడయ్యాడు. తర్వాత అతను భక్తి పరీక్షలో నెగ్గిన తీరు ఒళ్ళు జలదరింప చేస్తుంది.

భోజరాజీయంలో ఇంటికి పోయి, బిడ్డనికి పాలిచ్చి మగిడి వత్తునని శపథాలు చేస్తూ పులితో ఆవు పలికినది:
అపరాహ్ణ వేళ యందతిథి యాకొని వచ్చి
యడిగినఁ బెట్టక కడపు వాని
గతికి ... ... ... ...

బోవు దాన, నింటికి నేఁబోయి మరల
రాక తక్కితి నేఁబుండరీక వర్య !

ఓ పులి రాజా, నేనింటికి పోయి తిరిగి నీ వద్దకు రాక పోతే, మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపించి వేసే వాడు ఏ దుర్గతి పాలవుతాడో నాకూ ఆ చెడ్డ గతే నాకూ పడుతుంది. అని ఆవు ఒట్టు పెట్టు కుంది. అతిథులంటే అంత శ్రద్ధాభక్తులు మరి.


ఇదంతా అలా ఉంచితే, ఈ కాలంలో అతిథి సేవలు చేయాలంటే మరీ అంత వీజీ కాదు.

గేస్ ఎప్పుడు అయి పోతుందో తెలీదు. నల్లాలో నీళ్ళు వస్తాయో రావో తెలీదు. ఆఫీసులో సెలవు దొరుకుతుందో లేదో తెలీదు. నగరంలో కర్ష్యూ ఎప్పుడు పెడతారో అసలే తెలీదు. కూరల ధరలు మండి పోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు నింగిని తాకుతున్నాయి....

చుట్టాల చిచ్చర పిడుగులు బంతాట ఆడుతూ ఏ టీవీ అద్దాన్నో ఎప్పడు బద్దలు కొట్టేస్తారో తెలీదు.
ముచ్చట పడి చేయించుకున్న కొత్త ఫర్నీచరు ఎంతలా నాశనం కానున్నదో తెలీదు

ఇలాంటి భయాలు ఎన్నో ! అందుకే అతిథి సేవా వద్దు, గాడిద గుడ్డూ వద్దు.

మన యింటి తలుపులు మనకే తెరుచు కోవాలని మనసారా కోరుకుంటూ ఉంటాం.

నిజానికి మీద చెప్పిన భయాలన్నీ కేవలం మన ఊహాపోహలు. కల్పనా కథలు. ముందు తరాల వారు ఇంత కంటె గడ్డు కాలం లో కూడా నిండు మనసుతో అతిథులను గౌరవించే వారు. మనుషులను ప్రేమించే వారు.

ఇప్పుడా సద్భావన ఎందుకు మృగ్య మౌతున్నదంటే,

కాలం మరి పోయి కాదు. కాని కాలం దాపురించీ కాదు.

మనలో ఉండాల్సిన దేదో మనం కోల్పోవడం చేత.

గుండెలో తగినంత తేమ లేక పోవడం చేత. మనం మనుషుల కంటె కూడా రూపాయి నోట్ల లాగానో, రూపాయి బిళ్ళల లాగానో బతకడానికి తెగ యిష్ట పడి పోతూ ఉండడం చేత. అంతేనంటారా?

16, జనవరి 2011, ఆదివారం

కోప మేల నోయీ ... !!


ఉత్తమే క్షణకోప స్స్యాత్, మధ్యమే ఘటికాద్వయం
అధమే స్యా దహోరాత్రం, పాపిష్ఠే మరణాంతకమ్

ఈ శ్లోకంలో కవి కోపం గురించి చెబుతున్నాడు.కోపం అంటూ వచ్చేక, ఎవరెవరిలో ఆ కోపం ఎంత సేపు ఉంటుందో నిర్ధారిస్తున్నాడు.

ఎలాంటి వారికయినా, ఎప్పుడో ఒకప్పుడు కోపం రాకుండా పోదు. కానీ. ఉత్తములైన వారిలో ఆ కోపం కొంచెం సేపు మాత్రమే ఉండి తగ్గి పోతుంది. వారిలో ఆ కోపం క్షణం సేపు కన్నా ఎక్కువ సేపు ఉండదు.

అదే మథ్యములలో అయితే కోపం రెండు ఘడియల సేపు ఉండవచ్చును.

అధమ ప్రకృతి గల మనుషులలో, అంటే , నీచులలో వచ్చిన కోపం మొత్తం ఒక రోజంతా ఉండవచ్చును.

దీని వల్ల ఎంత కోపం వచ్చినా, ఎంతో కొంత సేపటికి తగ్గి పోక తప్పదని తెలుస్తోంది.

కానీ ఓ రకం వాళ్ళలో మాత్రం కోపం వస్తే , బతికి ఉన్నంత కాలం ఆ కోపం పోదు. వాళ్ళు ఆ కోపాన్ని, కోపకారణాన్ని జీవితాంతం మనసులో పెట్టుకుంటారు.

వాళ్ళనే పాపిష్ఠి వాళ్ళు అని చెప్పాలి. వారిది ఆసురీతత్త్వం. అంటే రాక్షస ప్రకృతి అన్న మాట.

కోపం వేగంగా తగ్గి పోవాలన్నా, కోపం వల్ల వేరే దుష్ఫలితాలు కలగకుండా ఉండాలన్నా, మన వాళ్ళు ఒక చిట్కా చెప్పనే చెప్పారు కదా.

కోపం వచ్చి నప్పుడు పది వరకూ అంకెలు లెక్క పెట్టమన్నారు. అప్పటికి వచ్చిన కోపం తగ్గి పోతుంది.

ఒక వేళ తగ్గ లేదనుకోండి, కొంచెం డోసు పెంచండి. మరో పదో, ఇరవయ్యో అంకెలు ఎక్కువ లెక్క పెట్టండి అప్పటికీ తగ్గక పోతే, ఏనిమల్ డోసు వాడి చూడండి. ఇంకా ఈ చిట్కా పని చేయ లేదనుకోండి . మీ యిష్టం చ్చినంతగా కోపాన్ని ప్రదర్శించండి. అరచి అరచి అలసి సోయి మీరే శాంతిస్తారు.

గురజాడ వారి కన్యా శుల్కంలో కోపిష్ఠి పాత్రలు చాలానే ఉన్నాయి. ధామ్ ధూమ్ లాడుతూనే ఉంటాయి.

గురువు గిరీశాన్ని వెంట బెట్టుకుని కృష్ణారాయపురం అగ్రహారం వొచ్చిన కొడుకు వెంకటేశాన్ని‘ వెధవాయీ, ఈ మారైనా పాసయినావా ?’ అని ప్రేమతో కసురుతూ అడిగిన అగ్నిహోత్రావధాన్లు గిరీశాన్ని చూసి, ‘ యా తుర కెవడోయ్’ అని నిలదీస్తాడు. గిరీశం పట్నం డాబు వొలకబోస్తూ, ‘ టర్క్ ! డామిట్ ! , టెల్ మాన్ ’

అన్నాడో, లేదో, అగ్నిహోత్రావధాన్లు అగ్గిరాఁవుడై పోయాడు.

‘ మానా? మానులా వుంచా నంచావూ? గూబ్బగల గొడతాను ’ అని గయ్యిమంటాడు.

సుబ్బిని లుబ్ధావధాన్లుకి యిచ్చి కన్యా శుల్కం పద్దెనిమిది వందలు తీసుకుని పెళ్ళి మాటలు నిర్ణయమైపోయిన సంగతి విని , భార్య వెంకమ్మ అదే గనుక జరిగితే నూతిలో పడి ఛస్తానని గగ్గోలు పెడుతుంది. చెల్లి బాధ చూడ లేక కరటక శాస్త్రి బావ గారితో ఏదో నచ్చ చెప్ప బోతే, దాంతో మళ్ళీ మన అగ్గి రాముడికి చిర్రెత్తు కొచ్చి, ’ వీళ్ళమ్మా శిఖ తరగా, ప్రతీ గాడిద కొడుకూతిండి పోతుల్లాగా నాయింట చేరి నన్ననే వాళ్ళే.తాంబోలం యిచ్చేసాను తన్నుకు ఛావండి ’ అని ఇంతెత్తు ఎగురుతాడు

కోపం ఎప్పుడూ మంచిది కాదు.
తన కోపమె తన శత్రువు ,తన శాంతమె తనకు రక్ష అనే హిత వాక్యం ఎప్పుడూ మరచిపో కూడదు. భారతం కూడా, కోపము తపముంజెఱచును ... అని చెబుతోంది.

కోపం పేరు చెబుతే గుర్తొచ్చే మొదటి ముని దుర్వాస మహా ముని. తపశ్శక్తిని ఎప్పుడూ కోపతాపాలతో ధారపోస్తూ ఉండడమే. ఆ ముని కోపం వల్లనే కదా అభిఙ్ఞాన శాకున్తలమ్ నాటకం కీలకమైన మలుపు తిరుగుతంది.

కోపానికి పరాకాష్ఠ పరమ శివుని మూడో కన్ను. శివ కోపానలానికి మదనుడు దగ్ధమై పోయాడు. అనంగుడైనాడు.

కీచకవథ ఘట్టంలో ద్రౌపదికి విరటుని కొలువులో కీచకుని వలన జరిగిన అవమానానికి రగిలి పోయి భీమ సేనుడు కోపంతో ఊగి పోయాడు. ప్రక్కనే ఉన్న మహా వృక్షాన్ని పెకిలించి వేసి, కీచకుడిని అంతం చేయాలని ఉద్రేక పడి పోయాడు. కానీ, అప్పడు పాండవులు అఙ్ఞాత వాసంలో ఉండడం చేత, దానికి భంగకరం కాకుండా, ‘‘ వలలుండెక్కడ సూచె ... ’’ అంటూ నర్మ గర్భమైన వాక్యాలతో ధర్మజుడు వారించ బట్టి, సరి పోయింది.

కోపం గురిచి ఇంకా చెప్పడానికి చాలానే ఉన్నా, మరీ ఎక్కువగా చెప్తే మీకు విసుగు కలిగి, కోపం వస్తుందేమో. మరి ముగిస్తాను.

14, జనవరి 2011, శుక్రవారం

తగని సిగ్గు



సిగ్గు లేదూ ! అని ఒక్కోసారి తిడుతూ ఉంటాం కానీ, సిగ్గును విడిచి పెట్టడమే కొన్న వేళల్లో శ్రేయస్కరం. సిగ్గే సింగారం కదా, అనుకుంటూ, అయిన దానికీ, కాని దానికీ సిగ్గులు ఒలక బోస్తూ ఉంటే సుఖం లేదు. పనులు జరుగవు.
అడగందే అమ్మయినా పెట్టదు అనీ, మనకేం కావాలో నోరు విడిచి అడగాల్సిందే. అడిగితే పోయేదేమీ లేదు. దక్కితే దక్కుతుంది. లేక పోతే పోయేదేం లేదు.సిగ్గు పడుతూ కూచుంటే నాయకులకు ఓట్లు రాలవ్. అందు చేత ఎగ్గూ సిగ్గూ లేకుండా, ఆడిన అబద్ధం తిరిగి ఆడకుండా, ఇచ్చిన హామీలనే తిరిగి యిస్తూ, సిగ్గు లేకుండా ముఖానికి నవ్వు పులుముకుంటూ, తిరిగేస్తూ ఉంటారు.

అలాగే, లజ్జని విడిచి పెట్టి లాగాలి లంచాలు. అంతే కానీ, ఎవరేమనుకుంటారో అని బిడియ పడుతూ కూచుంటే, మనదీ , వాడిదీ కూడా వాడే లాగేస్తాడనే ధర్మ రహస్యం తెలిసిన వాళ్ళు కావడం చేత, సిగ్గూ ఎగ్గూ అటకెక్కించి, నిర్లజ్జగా లంచాలు గుంజడం తమ జన్మ హక్కుగా చేసుకునే వారూ ఉన్నారు.

సినిమా తారలు బిడియాన్ని విడిచి పెట్టే విషయంలో ఒక అడుగు ముందుకు వేసి, అలా వేయడం వలన ఒక వెలుగు వెలిగి పోతున్నారు.

ఇవన్నీ సరే, బిడియం ఏయే సందర్భాలలో విడిచి పెడితే సుఖమో , కవి ఒక శ్లోకంలో చెబుతున్నాడు.

చూడండి:


గీతే వాద్యే తథా నృత్యే, సంగ్రామే రిపుసంకటే
ఆహారే వ్యవహారే చ, త్యక్త లజ్జ: సుఖా భవేత్

సిగ్గును, మొహమాటాన్ని ఎప్పుడు విడిచి పెడితే మనిషి సుఖ పడతాడో చూడండి.

సంగీతం పాడేటప్పుడు సిగ్గు పడకూడదు.
నృత్యం చేసేటప్పుడు కూడా బిడియ పడ కూడదు.
అలాగే, వాద్యమును మ్రోగించేటప్పుడు కూడా సదరు సిగ్గు కూడదు.
శత్రువులతో పోరాడేటప్పుడు యుద్ధం లోను, శత్రు బాధ కలిగి నప్పుడు, లజ్జ పనికి రాదు.
భోజన సమయంలో సిగ్గు పడితే అర్ధాకలితో లేవక తప్పదు.
వ్యవహారం నడిచే సమయంలో కూడా బిడియం పనికి రాదు. మొహమాటాన్ని విడిచి పెట్టాలి.

ఈ పైన చెప్పిన సందర్భాలలో ఎవడు బిడియాన్ని విడిచి పెడతాడో వాడు సుఖాన్నీ, కీర్తినీ పొందుతాడని కవి ఈ శ్లోకంలో చెబుతున్నాడు.


13, జనవరి 2011, గురువారం

12, జనవరి 2011, బుధవారం

చెప్తే వినడు కదా ?!


నా2ద్రవ్యే నిహితా కాచిత్, క్రియా ఫలవతీ భవేత్
న వ్యాపారశతేనాపి, శువత్ పాఠ్యతే బక:

అపాత్రుని యందు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవి ఫలించవు.

కొంగను తెచ్చి, మాటలు నేర్పడానికి ఎంతగా ప్రయత్నించినా, అది చిలుక లాగా పలుక లేదు కదా !

అని దీని భావం. వినే వాడికి చెప్ప గలం. వినని వాడికీ ఎంతో కొంత శ్రమ మీద చెప్పగలం.
కానీ వింటూ కూడా విన నట్టుగా ఉండే వారికి ఎంత చెప్పినా తలకెక్కదు.

అఙ్ఞ: సుఖమారాధ్య:, సుఖతర మారాధ్యతే విశేషఙ్ఞ:
ఙ్ఞానలవ దుర్విదగ్ధం, బ్రహ్మాపి నరం నరంజయతి

అంటాడు భర్తృహరి, ఏమీ తెలియని వానిని సులభంగా ఒప్పించ వచ్చును. బాగా తెలిసిన వానినైతే ఇంకా సులభంగా ఒప్పించ వచ్చును. కానీ, ఙ్ఞానినై పోయానని మిట్టి పడే అల్పఙ్ఞానిని ఆ
బ్రహ్మ దేవుడు కూడా రంజింప చేయ లేడు కదా !



10, జనవరి 2011, సోమవారం

ఎంత కష్టం ! ఎంత కష్టం !


‘’ హాయిగా ఇంత వండి పడేసి, మొగుడు ఆఫీసుకి వెళ్ళాక, తిరిగి యింటికి తగలడే వరకూ నీకు పనేం ఉంటుంది చెప్పు? ఏ పత్రికో పట్టుకుని ఆ వెర్రి మొర్రి సీరియల్సూ గట్రా చదవుతూ పడుకోవడమో, లేదంటే, పిచ్చి పిచ్చి టీ.వీ జీళ్ళ పాకం సీరియళ్ళు చూస్తూ గడపడమో తప్పితే ?’’

ఈ రకమయిన మాటలు ఇదే మోతాదులో కాక పోయినా, కొంత మాటల మేకప్ వేసుకుని దాదాపు ప్రతి యింటా విన బడుతూనే ఉంటాయి.

మీరేం చేస్తున్నారని ఎవరయినా అడిగితే ఎందుకో తెలీదు కానీ , కొంచెం అనవసరంగా మొహమాట పడి పోతూ జాబేమీ చేయడం లేదండీ, హౌసు వైఫునిఅని జవాబిచ్చే సగటు ఆడవాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం.

జాబ్ చేసే ఆడవారికి తామేదో తీసి పోయి నట్టుగా పాపం , కించ పడుతూ మాట్లాడుతూ ఉండే వారూ కనిపిస్తారు. ఈ వేగవంతమయిన రోజులలో ఉద్యోగం ఆడవాళ్ళకి కొంత వెసులు బాటుని కలిగించేదే కానీ అదనపు సదుపాయం మాత్రం కాదని నాకనిపిస్తూ ఉంటుంది. ఆర్ధిక స్వేచ్ఛ వలన ఆడవాళ్ళకి అదనపు గౌరవంతో పాటు అదనపు సమస్యలూ తెచ్చి పెడుతూ ఉండడం కూడా కొన్ని ఇళ్ళలో కనిపించే విషాదం.

సరే, ఈ విషయం కాస్త ప్రక్కన పెట్టి, ఇళ్ళలో ఆడవాళ్ళు చేసే అవధానం ఎలాంటిదో శ్రీమాన్ గరిక పాటి నరసింహా రావు అవధాని గారు చెప్పిన ఒక ప్రసిద్ధ మైన ఆశు పద్యం తెలియని వారి కోసం చెప్పుకుందాం.

అష్టావధానం లో సమస్యా పూరణం, నిషేధాక్షరి, దత్తపది, వర్ణన, ఆశువు, ఘంటానాదం ,పురాణ పఠనం,అప్రస్తుత ప్రసంగం మొదలయిన ఎనిమిది అంశాలు ఉంటాయి కదా. ఈ అంశాల ఎన్నికలో అవధాని అభిరుచిని బట్టి కొన్నిటి స్థానంలో వేరే అంశాలూ చేర్చబడుతూ ఉంటాయి. ఏమైనా అంశాల సంఖ్య ఎనిమిదికి మించదు. ఘంటా నాదం బదులు పుష్ప గణనం, కానీ చదరంగ క్రీడ కానీ ఉండవచ్చును. కొందరు అవధానులు ఈ ఎనిమిది అంశాలలో న్యస్తాక్షరిని చేర్చి అవధానం చేస్తూ ఉంటారు.

పృచ్చకులు నిర్వహించే సమస్య మొదలగు వాటి గురించి క్లుప్తంగా చెప్పు కుందాం,

1. సమస్యా పూరణం: పృచ్ఛకుడు ఏదో ఒక ఛందస్సులో ఒక పద్యం యొక్క నాలుగవ పాదం చెబుతాడు.అతను ఇచ్చిన పాదం కొంత అసంబద్ధంగానో, అసంగతంగానో, అశ్లీలార్ధ ద్యోతకంగానో కనిపించ వచ్చును.హేతు బద్ధంగా అనిపించక పోవచ్చును. కానీ, అవధాని పద్యం యొక్క మీది మూడు పాదాలు చెప్పడంతో ఆ అసంగత్వం ఏదేనా ఉంటే, తొలిగి పోయి చక్కని భావ యుక్తమయిన పద్యం తయారవుతుంది. ఇది సమస్య.

ఉదాహరణకి : ఒక పృచ్ఛకుడు ‘‘ ఈతాకుల గుడిసె లోన ఇనుడు దయించెన్’’ అనే సమస్య ఇచ్చాడు. ఇది పద్యంలోని నాలుగో పాదం. తూర్పు కొండల్లో ఉదయించాల్సిన సూర్యుడు ఈతాకుల గుడిసెలో ఉదయించడ మేమిటి ? అవధాని గారి పూరణతో పద్యంలో ఆ సందిగ్ధత తొలిగి పోతుంది. చూడండి:

సీతా పతి పూదోటకు

ఏతా మెత్తంగ వలయు వేకువ జామున్

తాతా ! తొంగున్నావా ?

ఈతాకుల గుడిసె లోన ఇనుడుదయించెన్.

శ్రీరాముల వారి పూల తోటను చూసు కుంటూ ఉండే తోట మాలి తన ఈతాకుల గుడిసెలో పడుకుని ఉన్నాడు. తెల్ల వారింది. తాతను నిద్ర లేపుతూ మనుమరాలు కాబోలు, అంటోంది:

‘‘ తాతా, సూర్యుడు ఉదయించాడు. రాముల వారి పూల తోటకు ఏతాం ఎత్తి నీళ్ళు పట్టాలి. ఇంకా నవ్వు నీ ఈతాకుల గుడిపెలో పడుకుని లేవ లేదా?’’ అని అవధాని గారి చక్కని పూరణతో పృచ్ఛకుడు సమస్య ఇచ్చి నప్పటి అసంబద్ధత తొలిగి పోయింది కదూ?

2. నిషేధాక్షరి: పృచ్ఛకుడు ఏదో ఒక అంశం యిచ్చి కోరిన ఛందస్సులో అవధాని పద్యం చెప్పడం మొదలు పెడుతూ పాదం తొలి పదంలో తొలి అక్షరాన్ని పలుకుతాడు. వెంటనే పృచ్ఛకుడు తర్వాతి పదాన్ని నిషేధిస్తాడు. అంటే అవధాని ఇక ఆ అక్షరాన్ని ఉపయోగించ కూడదన్న మాట. దానికి బదులు మరో అక్షరాన్ని వేసు కోవాలి. ఉదాహరణకి అవధాని శ్రీరాముని మీద పద్యం చెప్పడానికి సిద్ధ పడి శ్రీ అని అన్నాడను కోండి, పృచ్ఛకుడు అనే అక్షరాన్ని నిషేధిస్తాడు. దానితో అవధాని ర అనే అక్షరానికి బదులుగా మరో అక్షరం వాడాలి. ఇలా పృచ్ఛకుడు ప్రత్యక్షర నిషేధం కానీ, తాను కోరిన చోట నిషేధం కానీ విధిస్తూ ఉంటాడు. నిషేధించిన అక్షరాన్ని వదిలి అవధాని వేరే అక్షరాన్ని ప్రయోగిస్తూ , మొత్తానికి అర్ధవంతమయిన పద్యం చెప్పాలి. అవధానంలో అవధాని ప్రతిభకు నిషేధాక్షరి ఒక అగ్ని పరీక్ష అని చెప్పాలి.

3. దత్త పదిలో పృచ్ఛకుడు తనకు తోచిన నాలుగు పదాలు చెబుతాడు. వాటిని వరుసగా ఒక్కో పాదంలో ఉపయోగిస్తూ, అర్ధవంతమయిన చక్కని పద్యం అవధాని చెప్పాలి.

చూడండి, ఒక దత్తపది. ఒక పృచ్ఛకుడు పాలు, పెరుగు, నేయి, నూనె అనే పదాలు ఇచ్చి, వాటిని ఉపయోగిస్తూ భారతార్ధం వచ్చే లాగున ఒక పద్యం చెప్పమన్నాడు.

అవధాని గారి పూరణ చూడండి:

పాలు పంచడు రారాజు పాండవులకు

పెరుగు చున్నది వానిలో దురితము గన

నే యిలను గల్గ దిట్టి యహితము వాని

నూనె మూర్ఖత తప్పదు యుద్ధ మింక.

నాలుగు పాదాల లో పృచ్ఛకుడు ఇచ్చిన నాలుగు పదాలూ వచ్చేయి కదా. ఇక భావం చూడండి:

దుర్యోధనుడు పాండవులకు రాజ్య భాగం ఇవ్వడు. దుర్మార్గం వాడిలో మరీ పెచ్చు పెరిగి పోతోంది. ఇలాంటి మూర్ఖత్వం ఎక్కడా చూడం .వాడిలో మూర్ఖత్వం ప్రబలి పోయింది. ఇక యుద్ధం తప్పదు.

4. వర్ణన: పృచ్ఛకుడు కోరిన అంశం గురించి, కోరిన ఛందస్సులో కోరిన వర్ణన చేస్తూ అవధాని పద్యం చెప్పాలి.

ఇవి సాధారణంగా దేవతా వర్ణనలో, ప్రకృతి వర్ణనలో అయి ఉంటాయి.

5. .ఆశువు: అవధాని పృచ్ఛకుడు అడిగిన విషయం మీద చక్కని పద్యం చెప్పాలి. అడిగే వాడు పకోడీ మీద పద్యం కావాలన వచ్చు. కంప్యూటరు గురించి కావాలన వచ్చు దేని గురించయినా పద్యం చెప్పమన వచ్చు. అతనిష్టం. అవధాని ఆశువుగా, ధారాశుద్ధితో మొత్తం పద్యం చెప్పాలి.

6. ఘంటా నాదం (లేదా) చదరంగం (లేదా) పుష్ప గణన (లేదా) తేదీ, వారాల లెక్క :

(a) ఘంటానాదం: అవధానం జరుగు తున్నంత సేపూ ఒక వ్యక్తి ఠంగ్ మని ఒక్కో గంట కొడుతూ ఉంటాడు. అవధానం చివరలో అతడు ఎన్ని గంటలు కొట్టేడో అవధాని లెక్క తప్ప కుండా సరిగ్గా చెప్పాలి.

(b) చదరంగం: ఒక ప్రక్క ఇతర పృచ్ఛకులకు పద్య పాదాలు అవీ చెబుతూనే అవధాని ఒక వ్యక్తితో చదరంగం ఆడాలి. గెలవక పోయినా ఫరవా లేదు కానీ, ఓడిపో కూడదు.

(c) పుష్ప గణన: ఇది కూడా ఘంటా నాదం లాంటిదే. గంటలకు బదులు ఇక్కడ పూల లెక్క ఉంటుంది.

ఒక వ్యక్తి పూల రాశి లోనుండి ఒక్కో పువ్వునూ తీసి ప్రక్కన పెడుతూ ఉంటాడు. అవధాని ఆ పూల సంఖ్య సరిగ్గా చెప్పాలి.

(d) తేదీ వారాల లెక్క: పృచ్ఛకుడు ఏడాది, నెల, తేదీ చెప్పి, ఆ రోజు ఏ వారమో చెప్ప గలరా ? అనడిగితే తడుము కోకుండా అవధాని ఆ వారం పేరు సరిగ్గా చెబుతాడు.

7. పురాణపఠనం: పృచ్ఛకుడు కోరిన గ్రంధం లోనుండి కోరిన భాగం లోని పద్యాలు చదివి,పురాణం చెప్పడం.

8. అప్రస్తుత ప్రసంగం: అవధానం జరుగుతున్నంత సేపూ, అవధాని గారి ఏకాగ్రతను చెడ గొడుతూ ఒక పృచ్ఛకుడు చమత్కారవంతమైన సంభాషణ తనకు తోచిన రీతిని చేస్తూ ఉంటాడు. అవధాని అతనికి తగు రీతిలో , అతనడిగిన దానికి దీటుగా బదులు చెబుతూ ఉండాలి.

అష్టావధానంలో చోటు చేసుకుంటూ ఉండే మరో అంశం వ్యస్తాక్షరి అని చెప్పు కున్నాం కదూ. ఇదెలా చేస్తారంటే, పృచ్ఛకుడు అనుష్టుప్ శ్లోకంలో ఉండే సంఖ్యానుగుణంగా గడులు గీసుకుని సిద్ధంగా ఉంటాడు. అవధానం మొదలయ్యేక, పృచ్ఛకుడు తనకు నచ్చిన అంశం మీద ఒక శ్లోకం చెప్పమంటాడు. సాధారణంగా ఇది కూడా ఏ దేవతా ప్రార్ధనో అవుతుంది. అయితే, శ్లోకమంతా ఒకే సారి కాకుండా, తనకు నచ్చిన గడి సంఖ్య చెప్పి, ఆ గడిలో ఉండ తగిన అక్షరం చెప్పమని అవధానిని అడిగి, అతను చెప్పిన అక్షరాన్ని ఆ గడిలో వ్రాసుకుంటాడు.అవధానం పూర్తయే లోగా మొత్తం అన్ని గడులూ అవధాని అప్పుడూ అప్పుడూ చెప్పిన అక్షరాలతో నిండి పోతాయి. అవధానం చివరలో ఆ అక్షరాలన్నీ కలిసి ఒక పూర్తి అర్ధవంతమయిన శ్లోకం అవుతుంది..

అవధానం లోని అంశాల గురించి ఇక్కడ నేను వ్రాసినది సర్వ సమగ్రం కాక పోవచ్చును. కొంత అస్పష్టత ఉండ వచ్చును. నా తెలియమి కూడా కారణం కావచ్చును. కానీ నాకు తెలిసినంతలో అవధానం లోని అంశాలను వివరించాను. పెద్దలు సరి చేస్తే సరి దిద్దుకుంటాను.

అవధాని పృచ్ఛకులకు ఒకే సారి నాలుగు పాదాలూ చెప్పనవసరం లేదు. చెప్పడు కూడా. ఆవృత్తికి ఒక పాదం చొప్పున చెబుతాడు, అవధానం ముగిసే సమయానికి పద్యం నాలుగు పాదాలూ పూర్తవుతాయి.

ఆ తరువాత అంశం, ధారణ. అవధాని ఒక్కో పాదం చొప్పున అన్ని ఆవృత్తాలలో చెప్పిన మొత్తం పద్యాలు తిరిగి ఆయా అడిగిన వారికి (పృచ్ఛకులకు) ధారగా అప్ప చెబుతాడు. ఎక్కడా తడుము కోరాదు. ఏం చెప్పానని అడుగ రాదు. మొదట చెప్పిన దానికి భిన్నంగా చెప్ప రాదు. ధారణ విజయవంతంగా చేస్తే అవధానం విజయవంతంగా పూర్తయినట్టు లెక్క ! మరో విషయం, మొత్తం అవధాన సమయం నాతి దీర్ఘంగా ఉండ కుండా చూడడం కూడా అవధాని ప్రతిభకు పట్టం కట్టేదే.

ఇంత కష్టసాధ్యమైన అవధానం మన ఇళ్ళలో ఆడవాళ్ళు కూడా ఎలా చేస్తూ ఉంటారో ఈ పద్యంలో చూడండి:

అడుగడుగున నిషేధాఙ్ఞ జారీ చేయు

భర్త నిషేధాక్షరార్తిఁదోప

గుప్పిళ్ళు నిండని గ్రుడ్డి గవ్వల తోడ

మాసమ్ము గడప సమస్య కాగ

అది సర్దు మిది సర్దు మని చంపు కాన్వెంటు

దత్తుండు దత్త పదమ్ము కాగ

ముద్దు లొల్కెడి చంటి బుజ్జాయి పాపాయి

వర్ణనీయాంశమై వరలు చుండ

పాలు కూరలు పళ్ళ బండ్ల వారల రాక

ఆశు ధారా కవిత్వార్ధ మనఁగ

అత్తయ్య వేసెడి అక్షింత లవి యన్ని

పాత పురాణంపు పఠన మనఁగ

చీటి మాటికి వచ్చు సెల్లు సందేశాలు

వ్యస్తాక్కరమ్ముల వరుస గాగ

విసుగు తెప్పించెడి వీర ధారా వాహి

అధిక ప్రసంగమై అడ్డు పడఁగ

దినము దినమిట్లు వనితలు తిప్పలు పడి

పూట పూటకు అవధాన పూర్ణ బుద్ధి

తనరు చుండంగ పురుషావధాను లేల?

వర సహస్రావధానులీ పడతు లెల్ల !

.ఆడ వాళ్ళు అవధానంలో అవధాని గారు చేసే పనులన్నీ తమ నిత్య జీవితమనే అవధానంలో ఎలా చేస్తున్నారో చూడండి.

మొగుడు ప్రతీ దానికీ అడ్డు పడుతూ అది వద్దు, ఇది వద్దు, ఇలా చెయ్యి, అలా చెయ్యకు అంటూ తల తినేస్తూ ఉంటాడుట. దీనిని నెట్టుకు రావడమే ఆడ వారు చేసే నిషేధాక్షరి .

చాలీ చాలని జీతం రాళ్ళతో, లేదా బొటా బొటీ డబ్బులతో నెల గడపడమే వారికి సమస్య.

అదీ ఇదీ సర్దవే అమ్మా, అంటూ వెంట పడే కాన్వెంటు పిల్లలను ముస్తాబు చేసి, బడికి పంపడమే దత్తపది.

ఇంట్లో బుజ్జి పాపాయిలు ఉంటే నిత్యం వారిని ముద్దాడుతూ, వారికి సేవలు చేయడంతోనే సరి పోతుంది. అదే వర్ణన.

పాలబ్బాయ్, కూరలబ్బాయ్ సండ్ల బళ్ళ వాళ్ళతో చేసే సంభాషణే ఆశువు

ఇక ఇంట్లో అత్త గారు కనుక ఉంటే ఆవిడ గారు వేసే అక్షింతలు, వినిపించే పాత పురాణం అంతా యింతా కాదుట. అదే పురాణపఠనం

ఈ మధ్యలో సెల్ ఫోను రింగవుతూ ఉంటుంది. ఆ బాధ మరీ వర్ణనాతీతం ఇల్లలికి. అది వ్యస్తాక్షరి.

విసుగు తెప్పించే బుల్లి తెర ధారావాహికలు అధిక స్రసంగాలు.

ఇలా రోజూ తిప్పలు పడే వనితలు గొప్ప అవధాన విద్య ప్రదర్శిస్తున్నారు. సహస్రావధానులైన పడతులుండగా, ఇక పురుషావధాను లెందుకండీ ...

నిత్యావధానులైన ఆడవారికి నమోవాకాలు .

తల్లుల కష్టం వెల కట్ట లేనిది. వెల కట్ట రానిదీనూ.

వారికి ఆది వారమూ లేదు, శలవు దినమూ ఉండదు. కదూ?

రిటైర్మెంటు అసలే లేదు.

9, జనవరి 2011, ఆదివారం

కొంచెం టచ్ లో ఉంటే చాలు ...


అతి పరిచయా దవఙ్ఞా, సంతతగమనా దనాదరో భవతి
మలయే భిల్ల పురంధ్రీ , చందనతరుకాష్ఠ మింథనం కురుతే.

అతి పరిచయం వల్ల అలుసై పోతామట. తరుచు వస్తూ పోతూ ఉండడం వల్ల కూడా అనాదరం కలుగుతూ ఉంటుంది. రోజూ చచ్చే వాడి కోసం ఎంతని ఏడుస్తాం అంటారు కదా, అలాగే, రోజూ కనిపించే వాడు వస్తే ఏమీ పట్టనట్టుగా ఊరుకుండి పోతాం. మలయ పర్వతం మీద మంచి గంధం చెట్లు చాలా విస్తారంగా ఉంటాయి. మనకవి అపూర్వం. చాలా విలువైనవి. కాని అక్కడ ఉండే భిల్ల వనితలు ఆ మంచి గంధం చెక్కలనే వంట చెఱకుగా ఉపయోగించడం చూడ లేదూ ? అంటున్నాడు కవి. అతి పరిచయం వలన అలుసై పోవడ మంటే ఇదే. పని కట్టుకుని పుణ్య క్షేత్రాలకో, దర్శనీయ స్థలాలకో వెళతాం. అక్కడి ప్రతి అణువునీ కళ్ళార్పకుండా చూస్తూ తన్మయులై పోతూ ఉంటాం. కెమేరాలలో ఆ అందమైన
దృశ్యాలను అపురూపంగా బంధిస్తూ ఉంటాం. అక్కడి స్థానికులు మాత్రం మనంతగా విచలితులు కావడం జరుగదు. రోజూ చూసేదా కదా, అనే భావనతో రవంత నిర్లిప్తంగా కనిపిస్తారు.

ఆలు మగలైనా సరే, అప్పుడప్పుడు ఏ పుట్టినింటికో ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి నాల్రోజులు ఉండి వస్తూ ఉండడం మంచిది. ఎడబాటు ఎప్పుడూ మరింత చేరువ చేస్తుంది. అందుకే కదా, మన ప్రబంధ కవులు విప్రలంభ శృంగారానికి అంత ప్రాముఖ్యమిచ్చి, పోషించారు?

అంచేత, మరీ అతుక్కు పోకుండా, తగు మోతాదులో కొంచెం టచ్ లో ఉంటే చాలు ... కదూ !

7, జనవరి 2011, శుక్రవారం

మీకు చేత కాదూ ?

16వ శతాబ్దికి చెందిన రఘునాథ రాయలు, అతని కుమారుడు విజయ రాఘవ నాయకుడు ( 17వ శ.) తంజావూరు ప్రభువులు. గొప్ప సాహిత్య పోషకులు. వారిరువురూ స్వయం రాజా, స్వయం కవి అన్నట్టుగా చక్కని కావ్యాలు రచించారు.
నాయక రాజుల కొలువులో కవులే కాక ముద్దు పళని, రంగాజమ్మ, రామ భద్రాంబ, మధురవాణి మొదలయిన కయిత్రులు కూడ ఉండే వారు. వారిలో రంగాజమ్మ ప్రసిద్ధురాలు. మన్నారు దాస విలాసము అనే కావ్యమే కాక, అనేక యక్షగానాలు రచించింది. విజయ రాఘవుడీమెను చేరదీసి పోషించాడు. ప్రభువు రంగాజమ్మకు దగ్గరవడం సహించ లేని రాణి వాసపు రాణులెవరో రంగాజమ్మను నిందించి ఉంటారు. దానికి రంగాజమ్మ పద్య రూపంలో ఇచ్చిన ప్రత్యుత్తరం చూడండి:

ఏ వనితల్ మముం దలప నేమి పనో? తమరాడువారు గా
రో? వలపించు నేర్పెరుఁగరో ? తమ కౌగిట లోన నుండఁగా
రావిది యేమిరా ! విజయ రాఘవ ! యంచిలు దూరి బల్మిచే
దీవర కత్తినై పెనఁగి తీసుకు వచ్చితినా ? తలోదరీ !

ఈ పద్యానికి చెందిన ఒక చక్కని ఆడియో లింక్ ఇక్కడ చూడండి. ఈ పద్యాన్ని చక్కని కంఠ మాధుర్యంతో ఆలపించిన వారికి ధన్యవాదాలు.



ఏ స్త్రీ లయినా మమ్ము ఆడి పోసు కోవడం తగదు. మీరేమి, ఆడువారు కాదా ? వలపించే నేర్పు మీకు లేదా? మీ కౌగిటిలో ఉండగా బలవంతంగా విజయ రాఘవా, రావేమిరా !, రా !అంటూ మీ అంతిపురం లోకి చొచ్చి కపటంతో ప్రభువులను తీసుకొని రాలేదు కదా ?

ఈ సందర్భంగా విజయ రాఘవుని రసికతను నుతిస్తూ చెప్పిన పద్యం కూడా చూడండి.

ఇంతీ పానుపు పై నిదె
కంతుడు కూర్చున్న వాడు కనుగొను, వహవా !
కంతుడనంగుడు నీ తెలి
వింతేనా ! విజయ రాఘవేంద్రుఁడె చెలియా !

రాణి వాసపు స్త్రీల సంభాషణ ఇది:

ఈ శయన మందిరంలో తల్పం మీద సాక్షాత్తు మన్మథుడు కూర్చుని ఉన్నాడు, చూడవే అని ఒకతె అంటున్నది.

దానికి రెండవ ఆమె ఇలా ప్రత్యుత్తరమిచ్చింది: నీ మొహం ! నీ తెలివి తేటలు ఇంతేనా ? అతడు నీవన్నట్టు కంతుడు ( మన్మధుడు) కాదే. ఎందు కంటే, కంతుడు అనంగుడే. శివ కోపానలంచేత దగ్ధమైన వాడు. అశరీరుడు. మరి, ఇక్కడ సశరీరుడైన అంద గాడు కూర్చుని ఉన్నాడు. ఎవరో తెలుసా ? ఈతడు మన విజయ రాఘవ నాయకుడే, చెలీ !

( ప్రభువులు మన్మధాకారులని భావం)

5, జనవరి 2011, బుధవారం

అన్న దాతా సుఖీ భవ !


వస్తూనే అన్నాడు కోనేటి రావు: ‘‘ హబ్బ! ఘుమఘుమలాడి పోతోంది, అక్కయ్య గారు పకోడీలు వేయిస్తున్నట్టున్నారు ..’’ అని. సరిగ్గా సమయానికే వస్తాడు కోనేటి రావు.

‘‘ పకోడీలు కావయ్యా, బజ్జీలు ...’’ అన్నాను.

‘‘ ఏవో ఒకటి, అక్కయ్య గారూ, వేగిరం తెండి , నోరూరి పోతోంది’’ వంట గది లోకి చూస్తూ కేకేసాడు.

అతను మా యింట్లో ఉన్నప్పుడు నేను వేరే ఎవరి యింట్లోనో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు.

ఆహార ప్రియుల తీరు ఇలాగే ఉంటుంది. ఇవాళ మన కథామంజరిలో అంతా తిండి గోలే. ఇక చదవండి:

పంక్తిభేదే పృథక్పాకే, పాకభేదే తథా2కృతే,

నిత్యం చ గేహకలహే, భవితా వసతి స్తవ.

ఒకే పంక్తిలో కూర్చున్న వారికి భేదంగా వడ్డించే చోట లక్ష్మీ దేవి నిలువదట ! అంటే, అయిన వాళ్ళకి ఆకుల్లోను, కాని వాళ్ళకి కంచాల్లోనూ అనే సామెత ఉంది చూసారూ ? అలాగన్న మాట.

వడ్డించే వాడు మన వాడయితే, కడ పంక్తిని కూర్చున్నా ఫరవా లేదంటారు. అయితే, ఒకే వరసలో కూర్చున్న వారికి వడ్డన విషయంలో భేదం చూప కూడదు. అందరకీ ఒకేలా వడ్డించాలి. ఒకరికి కొంచెం ఎక్కువా, కొందరకి కొంచెం తక్కువా, కొందరకి కొసరి కొసరి, కొందరకి విదిలించి నట్టుగానూ వడ్డించ కూడదన్న మాట. అలా చేస్తే ఇంట లక్ష్మి ఉండదంటున్నాడు శ్లోక కర్త.

అలాగే, వేరు వేరు పొయ్యలు పెట్టుకుని వండు కునే చోట కూడా ధనం ఉండదు. ఉమ్మడి కుటుంబంగా అంతా కలిసి ఒకే పొయ్యి మీద వండుకుని తినాలి. వేరు పడి పోయి, ఒకే ఇంట వేరు వేరు పొయ్యలు పెట్టుకుని వండు కోవడం మొదలెడితే ఆ యింట లచ్చి తల్లి ఉండదు.

అసలే వండు కోని ఇంట కూడా ఆ తల్లి ఉండదుట.

అలాగే, నిత్యం కలహాలతో నిండి ఉండే ఇంట కూడా లక్ష్మీ దేవి ఉండదు.

అంటే, పంక్తి వడ్డనలో భేదం పాటించే వారింట, వేరు వేరు పొయ్యలు పెట్టుకుని ఒకే ఇంట వండుకునే వారింట, అసలే వండు కోని వారింట, నిత్యం కలహాలతో కాపురం చేసే వారింట పెద్దమ్మ (దరిద్ర దేవత) తిష్ఠ వేస్తుంది. చిన్నమ్మ లక్ష్మి అక్కడి నుండి తొలగి పోతుంది అని దీని భావం.

లక్షాధికారైన లవణమన్నమె కాని, మెఱుగు బంగారమ్ము మ్రింగ బోడు.

అయితే తినేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి.

ఆదరాబాదరాగా తిన కూడదు. నోట్లో కుక్కుకుంటూ ఏదో ఇవేళ్టికి భోజనం అయిందనిపించ కూడదు.

నింపాదిగా, శ్రద్ధగా భోజనం చేయాలి.

భుంజానో న బహు భ్రూయాత్, న నిందేదపి కంచన

జుగుప్పసితకథాం నైవ, శ్రుణుయాదపి వా వదేత్.

భోజనం చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడ కూడదు. ఇతరులను తిడుతూ నిందా ప్రసంగాలు చేయ కూడదు. అసహ్య కరమయిన కథనాలు చేయ కూడదు. విననూ కూడదు.

చరక సంహిత ఏమి చెబుతున్నదో చూడండి:

ఉష్ణ మశ్నీయాత్, స్నిగ్ధ మశ్నీయాత్, మాత్రావ

దశ్నీయాత్, జీర్ణే2శ్నీయాత్, వీర్యా2విరుద్ధ మశ్నీయాత్

ఇష్టే దేశే2శ్నీయాత్, నాతిద్రుత మశ్నీయాత్, నా2తి

విలంబిత మశ్నీయాత్, అజల్పన్నహసన్ తన్మనా భుంజీత,

ఆత్మానమభిసమీక్ష్య భుంజీత.

వేడి పదార్ధాలనే తినాలి.

చమురు గల ఆహారాన్ని తినాలి. ( అలాగని ఎక్కువ నూనె పదార్ధాలూ పనికి రావు సుమా )

మితంగా భుజించాలి.

ముందు తిన్నది జీర్ణమయిన తరువాతనే తిరిగి ఆహారం తీసు కోవాలి.

ఒకదానికొకటి పొసగని పదార్ధాలు ఏక కాలంతో తినరాదు.

మనస్సునకు ఆహ్లాదాన్ని కలిగించే చోట, శుచిగా ఉండే చోట తినాలి. తినే చోట గలీజుగా ఉండ కూడదు.

త్వర త్వరగా మ్రింగ కూడదు. మెక్కడం చేయ కూడదు.

అలాగని అతి నెమ్మదిగా కూడా తిన వద్దు.

అతిగా మాటలాడుతూ, తుళ్ళుతూ, కేరింతలు కొడుతూ భోజనం చేయ కూడదు.

ఏకాగ్ర చిత్తంతో తినాలి.

ఏ పదార్ధం ఎంత అవసరమో, హితమో తెలుసుకుని అంతే తినాలి.

ఇలా తింటే నూరేళ్ళు బ్రతకొచ్చని శ్లోకంలో కవి భరోసా ఇస్తున్నాడు.

అలాగే ఒంటిపిల్లి రాకాసిలా ఒక్కరే కూచుని తినడం మంచిది కాదు.

ఏకఏవ నభుంజీత, యదిచ్ఛేత్సిద్ధి మాత్మన:

ద్విత్రిభి ర్బహుభి స్సార్ధం, భోజనం తు దివానిశమ్,

పగలు కానీ రాత్రి కానీ, ఒంటరిగా తిన కూడదు. ఇద్దరో, ముగ్గురో సహ పంక్తిని కూర్చుని భుజిస్తూ ఉండగా తినాలి. అలా చేస్తే ఆయురారోగ్య భాగ్యాలు కలుగుతాయి.

ఇప్పుడంటే గేదె బోయినాలు ( బఫేలు) వచ్చేయి కానీ వెనుకటి రోజులలో నేల మీద అరిటాకులో, విస్తళ్ళో వేసి వడ్డంచే వారు. వడ్డిస్తున్నాం, కాళ్ళు కడుక్కుని రండి. అనడం అలవాటు.

విందు భోజనాలకు పిలుస్తూ దేవతార్చనకు మా యింటికి దయ చేయండి అనే వారు. మా ఊళ్ళో అయితే, శుభాశుభ కార్యాలకు భోజనాలకి వెళ్తూ , శుభ కార్యాలకయితే పట్టు పంచెలు, దినకర్మలలాంటి వాటికయితే నూలు పంచెలు కట్టుకుని, చెంబులతో నీళ్ళు పట్టుకుని బయలు దేరే వారు.

ఇక, పెళ్ళిళ్ళలో భోజనాల తంతు సంగతి చెప్పే పని లేదు. మడి కట్టు కోండి అని ఊళ్ళో అతిథులందరకీ మరో మారు గుర్తు చేయాలి. ( ఊళ్ళో సగోత్రీతకులనే భోజనాలకు పిలిచే వారు మరి) ఇదిగో వస్తున్నాం అంటూ ఎంతకీ వచ్చే వారు కారు. వాళ్ళ కోసం విస్తళ్ళ ముందు మిగతా బంధువులు పడిగాపులు పడే వారు. అంతా వచ్చేరనుకుంటే ఒక పెద్దమనిషి నదికో, ఏటికో స్నానానికని వెళ్ళి, ఎంతకీ వచ్చే వాడు కాడు. ఏం అనడానికి లేదు. మగ పెళ్ళి వారంతా భోజనాలు ముగిప్తే కానీ, ఆడ పెళ్ళి వారు బోయినాలకు కూచోడానికి లేదు. అలకలూ, దెప్పి పొడవడాలూ కూడా ఒక్కోసారి విందు భోజనాలలో చోటు చేసుకునేవి.

కాళ్ళకూరి నారాయణ రావు గారి వర విక్రయం నాటకంలో విందు భోజనాలకు పిలిస్తే బెట్టు చేసి బాధించే వారి గురించి ఒక చక్కని పద్యం ఉంది. చూడండి:


పిలిచిన పలుకక బిగదన్ను కొని లోన

ముసుఁగు పెట్టెడు శుద్ధ మూర్ఖుఁడొకడు

ఇదె వత్తు మీ వెన్కనే మీరు పొండని

చుట్ట ముట్టించెడు శుంఠ యొకడు

ఒగిఁదనకై వేచి యుంద్రో లేదో చూత

మని జాగు సల్పెడి యల్పుఁడొకడు

ముందు వచ్చినఁబర్వు ముక్కలౌననుకొని

కడను రాఁజూచు ముష్కరుఁడొకండు

కుడి యింటను హాయిగా కూరుచుండి

వత్తు, రానని చెప్పని వాచి యొకఁడు

వచ్చి, కోపించి పోవు నిర్భాగ్యుఁడొకడు

ఆరు వేల్వారి విందుల తీరు లివ్వి.

పిలిస్తే పలుకడు. బిగదన్నుకొని ముసుగు పెట్టుకుని పడుకునే మూర్ఖుడు ఒకడు.

ఇదిగిదిగో, వచ్చేస్తున్నా, మీ వెనకే వస్తున్నా, మీరు వెళ్ళండి అని చెప్పి అప్పుడు తీరిగ్గా చుట్ట ముట్టించే శుంఠ మరొకడు.

తన రాక కోసం విందుకు పిలిచిన వారు వేచి చూస్తారో, చూడరో చూద్దాం అని కావాలని ఆలస్యం చేసే అల్పుడు ఒకడు.

ముందుగా వచ్చేస్తే ఎక్కడ తమ పరవు ముక్కలై పోతుందో అని అందరి కంటె చివరగా రావాలని అనుకునే దుష్టుడొకడు.

హాయిగా నట్టింట కూర్చుని, వస్తాననీ, రాననీ కూడా చెప్ప కుండా తాత్సారం చేసే వాడొకడు.


ఒహ వేళ వచ్చినా, ఏదో విషయంలో అలక వహించి, కోపం తెచ్చుకుని అగ్గిరాముడై పోయి చిందులు తొక్కుతూ తిరిగి వెళ్ళి పోయే నిర్భాగ్యుడు మరొకడు.

ఆరు వేల నియ్యోగుల యింట విందు భోజనాల తంతు ఇలా ఏడుస్తుంది.

( వర విక్రయం - కాళ్ళ కూరి నారాయణ రావు)

పెళ్ళిళ్ళలో ఈ బ్యాచ్ ఉంది చూసారూ, వీళ్ళు కూడా ఎంతకీ భోజనాలకి లేవరు.

వడ్డన కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఆకులో ఎక్కడ కూరలు వడ్డించాలి, ఎక్కడ పచ్చళ్ళు వెయ్యాలి, అన్నది తెలిసిన వారే వడ్డనకు పూను కోవాలి. ఆ రోజు వండిన వాటి నన్నింటినీ కొంచెం కొంచెంగానయినా విస్తట్లో ముందుగా వడ్డించాలి. పులుసు, నెయ్యి, పెరుగు కూడా అభిగారం చెయ్యాలి. ( ఇవి ఉన్నాయి సుమండీ అని తెలియ జెప్పే లాగున కొంచెం కొంచెం వడ్డించాలి.) ఓ మూల ఉప్పుతో సహా అన్నీ విస్తట్లో పడ్డాయని ధృవీకరించుకున్నాక, గృహ యజమాని ఇహ ఔపోసన పట్టండి అంటూ వేడుకునే వాడు. భోజనాలు పూర్తయాక, అన్న దాతా సుఖీ భవ అని దీవిస్తూ కొందరు గొంతెత్తి చక్కని పద్యాలు రాగ యుక్తంగా చదివే వారు. పద్యం చదవడం పూర్తయేక, అంతా ఒక్క సారిగా గోవిందా ! గోవింద! అని , గోవింద నామస్మరణ చేసి, లేచే వారు. అయితే,అందరి భోజనాలు పూర్తయి లేస్తే తప్ప పంక్తి లోనుండి లేవ కూడదు. అది అమర్యాద అలా ఉండేవి వెనుకటి రోజుల్లో పెళ్ళి భోజనాలు.

ఇప్పటి గేదె బోయినాలకి ఆ బాధ లేదు. కానీ, ఒకర్నొకరు రాసుకుంటూ, చేతిలో ప్లేటు పట్టుకుని క్యూలో మన వంతు వచ్చే వరకూ నిరీక్షించడం కొంత ఇబ్బందికరం. ఏదో వడ్డించుకుని తింటున్నామంటే, ఎవడు అజాగ్రత్తగా చేయి తగిలిస్తాడో, బట్టలు ఖరాబవుతాయో అనే టెన్షను లోలోపల పట్టి పీడిస్తూ ఉంటే తినడం మొదలెడతాం. మధ్యలో ఏ పదార్ధమో కావాలంటే, మళ్ళీ ఆ ఎంగిలి ప్లేటుతో క్యూ మధ్య చొరబడ వలసిందే.

ఎవరు తింటున్నారో తెలియదు. ఏం తింటున్నారో తెలియదు. అసలు తింటున్న వాళ్ళంతా బంధువులో కారో కూడా తెలియదు. అంతా దొమ్మీ లాగున తిండి సంత. కాలానుగుణమయిన మార్పులను ఇష్టం ఉన్నా , లేక పోయినా ఆమోదించక తప్పదు.

ఈ సందర్భంగా మందు బాబులకు ఓ శుభ వార్త. ఓ అశుభ వార్త.

కిం తు మద్యం స్వభావేన, యథైవా2న్నం తథా స్మృతమ్

ఆయుక్తియుక్తం రోగాయ, యుక్తాయుక్తం యథామృతమ్

మద్యం కూడా మంచిదే (మరక మంచిదే కదా?)

స్వభావరీత్యా మద్యం దోషభూయిష్ఠం కాదు.

తగినంత మోతాదులో తీసుకుంటే అది అమృతంలా పని చేస్తుంది.

మోతాదు మించితే మాత్రం అదే విషతుల్యమవుతుంది సుమా ! అంటున్నాడు శ్లోక కర్త.

తిండి కలిగితె కండ కలదోయ్

కండ కలవాడేను మనిషోయ్ !!

అంటాడు గురజాడ.

ఈ తిండి టపాసందర్భంగా బరంపురంలో సహపంక్తి భోజనాల గురించి తలచు కుందాం.

అలాగే, నాయక రాజుల కాలం నాటి తంజావూరు భోజన సత్రం వైభవ ప్రాభవాల గురించి స్మరించు కుందాం.

దేవాలయాల్లో జరిగే ఉచితాన్నదానాల గురించి చెప్పుకుందాం.

మాయా బజార్ సినిమాలో ఘటోత్కచుడి వివాహ భోజనంబు ... గుర్తుకు తెచ్చుకుందాం

ఇక,.

భోజ రాజుని కవిత్వంతో మెప్పించి బహుమానం పొందాలనుకున్న ఒక అల్ప కవి -

భోజనం దేహి రాజేంద్ర ! ఘృత సూప సమన్వితమ్

అని తొలి పాదం రాసేక , ఇహ దానిని ఎలా పూర్తి చేయాలో తెలీక జుట్టు పీక్కుంటూ ఉండగా కాళిదాసు పోనీ పాపం, అని రెండో పాదం ఇలా పూర్తి చేసి ఇచ్చాడుట.

మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం ధధి:

ఓ రాజా, నెయ్యీ, పప్పూ కూడిన భోజనం ఇయ్యవయ్యా అని మొదటి పాదానికి కవితా రసం లేని రసహీనమయిన అర్ధమయితే,

నిండు కవిత్వం తొణికిసలాడే కాళిదాసు పూరణ రెండో పాదం.

నిండు వెన్నెల వంటి తెల్లనయిన గేదె పెరుగుతో అన్నం పెట్టవయ్యా.

వెనుకటి రోజులలో ఓ దొర గారికీ ఓ ఛాందస పండితునికి భలే దోస్తీ ఉండేది.

ఒక సారి, పండితుని ఇంట ఏదో శుభ కార్యానికి దొర గారు ఫుల్ సూటూ, టై, హేటూ, బూటూతో వెళ్ళాడు. పండితుని ఇంట పెట్టిన బూరెల రుచి చూసి వాటిని ఓ పట్టు పట్టాడు. కానీ అతడిని ఓ సందేహం పీడించ సాగింది . ఇక ఊరుకో లేక. పండితుడిని అడిగాడు: ఇవి చాలా రుచిగా ఉన్నాయి సుమా. ఇంతకీ ఈ (పూర్ణం) ముద్ద దీని లో ఎలా పెట్టారో చెప్పండి. అని.

పండితుడు నవ్వి, అది సరే కానీ, ముందు నువ్వీ సూట్ లోరి ఎలా దూరేవో కాస్త చెబుదూ అని అమాయకంగా అడిగేడుట.

ఓ ఆసామీ డాక్టరు దగ్గరకి చ్చేడు.

‘‘ నవ్వింక సిగరెట్లు తాగడం తగ్గించాలోయ్. లేక పోతే ఛస్తావ్ ! పోనీ, భోజనం ముందొకటీ, తర్వాత ఒకటీ చొప్పున లిమిట్ చేసుకో ’’ అని డాక్టరు సలహా ఇచ్చేడు.

కొన్నాళ్ళు పోయేక ఆ ఆసామీ పిప్పళ్ళ బస్తాలా తయారై ఆప సోపాలు పడుతూ డాక్టరు దగ్గరకి మళ్ళీ వచ్చేడు.

‘‘నా సలహా పాటించావా ? ఇప్పుడెలా ఉంది ?’’ అడిగేడు డాక్టరు.

‘‘ ఏం చెప్పమంటారు డాక్టరు గారూ, రోజుకి ఇరవైసార్లు తిండి తిన లేక ఛస్తున్నననుకోండి’’ అన్నాడుట ఆ ఆసామీ.

ఇదిలా ఉంచితే, తిండితో లింక్ ఉన్న మరికొన్నింటిని కూడా చూదాం

తిండికి తిమ్మ రాజు. పనికి పోతరాజు.

తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి.

తినగ తినగ వేము తీయనుండు.

అన్నమో రామచంద్రా !

అమ్మ పెట్టా పెట్టదు. అడుక్కుని తినానివ్వదు.

వండుకునే వాడికి ఒకటే కూరయితే అడుక్కునే వాడికి చెప్పలేనన్ని.

ఇక,

తిండి అంటే అన్నం తినడమే కాదు.

లంచాలు తినడం, బుర్ర తినడం, సమయం తినడం, క్రికెట్ లో ఓవర్లు తినడం, దేశాన్ని తినెయ్యడం...కాల్చుకు తినడం, వేధించుకు తినడం, చూపులతో కొరుక్కు తినడం ... ... ఓ, ఇలా చాలా తినడాలు ఉన్నాయి లెండి.

మా ఆవిడ పెట్టిన బజ్జీలు కడుపారా తిని, కాఫీ ఊదుకుంటూ సేవించి, లేచాడు కోనేటి రావు.

‘‘ ఇహ వెళ్తానయ్యా, అక్కయ్యగారివాళ భలే రుచికరమయిన టిఫిను పెట్టారు. అన్నదాతా సుఖీ భవ ! ... కాదు కాదు ... టిఫిన్ దాతా సుఖీ భవ అనాలి కాబోలు ...’’ అంటూ వెళ్ళి పోయాడు.

మళ్ళీ రేపు ఉదయం మా ఆవిడ స్టవ్ వెలిగించిన శబ్దం చెవిని పడి కానీ రాడు.

తిండి గురించి కొంత చెప్పుకున్నాం. ఈ సారి పస్తుల గురించి చెప్పుకుందాం.

స్వస్తి.