
మహా కవి జయంతి నేడు.



















పుష్పా వేదన
వేకువందునే మేల్గాంచి వివస మొంది,
దైవ పూజకు పూలను తేవ నెంచి,
పూల తోటకు నేగితి పూలు కోయ, 1
జాలి కురిపించు జంధ్యాల పూల కవిత
ఎచట నుండియో వినిపించె అచట నాకు
మనసు మార్చుకు కొమ్మను విడిచి పెట్టి
వట్టి చేతుల ఇంటికి పయన మైతి 2
పయన మవుతున్న నను జూచి మల్లె యొకటి
"వెళ్ళి పోబోకు మిత్రమా! వెళ్ల కనుచు "
నేల పడియున్న పూలను నెత్తి జూపి
దీన మలరగ వినిపించె వింత కధను 3
వాడి రాలిన మము జూడ వచ్చి నావ?
పూజ కొరకునే పూవులు పూయు ననుచు
భక్తి శ్రద్ధతో మమ్ముల పట్టు కెళ్ళి
పూజ చేసెడి వారు మీ పూర్వ జనులు 4
రంగు రంగుల పూవుల రాసి పోసి,
ఊలు దారాలతో మమ్ము మాల గూర్చి
స్వామి మెడలోన మము వేయు సమయ మందు,
ఎంత ఆనంద పడితిమో ఎరుక పడదు. 5
మంత్రపు నీళ్ళు జల్లి మము మంత్రము తోడనె పూజ చేసి , యా
చెంతన యున్న భక్తులకు చింతలు పోవగ ఇచ్చి నంత , వా
రంతయు పూజ పూవులని ఆత్రత తోడుగ చేత బట్ట ; మే
మెంతగ పొంగి పోయితిమొ ? ఏ తరి చేసిన పుణ్య మంచు చున్ 6
నూట ఎనిమిది పూవులు పూజ చేసి
మంత్ర మంత్రంబు కోక్కొక్క మహిమ జెప్పి,
స్వామి పాదాల చెంతన జార విడువ
ప్రభువు సేవకు ఉపయోగ పడితి మనుచు
అమిత ఆనంద పడితిమి అబ్బురముగ 7
పూజ చేసిన వాడిన పూల నన్ని
భద్ర పరిచియు మర్నాడు పదిలముగను
తులసి మొక్కల నడుమున తురిమి యుంచి
జలము నర్పణ చేసియు జార విడరె ! 8
గోళెముల లోన మట్టిని గుమ్మ రించి,
మొక్కలను నాటి ప్రతి రోజు మొద మలర,
నీరు పోయుచు ప్రాణాలు నిలుపు మీకు ,
పూల నిచ్చెడి సంతృప్తి పొంది నాము ! 9
పెండ్లి కూతురు అందంబు వెల్లి విరియ
మల్లె జాజులు జడలోన మాల తురిమి
బంధు హితులంత మెచ్చుతూ పరవ సించ
జన్మ ధన్యత అయినంత సంభ్రమొందె ! 10
సభల యందున సత్కవుల్ సత్క రించ
పుష్ప గుచ్చము లిచ్చుచు ప్రోత్స హించ
వారి గౌరవ మంతయు మాదె అనుచు
గొప్పగా మేము చప్పట్లు కొట్టి నాము 11
హరికధను చెప్పు హరిదాసు హార మందు,
పూల దండయే దాసుకు ప్రోత్స హమ్ము;
హరియు నామమె ప్రజలకు హర్ష మనుచు
బ్రతుకు చున్నాము ఇన్నాళ్ళు పరువు తోడ 12
సిగను ముడుచు కొనెడి చిరు పూల దండయే,
భార తీయ స్త్రీకి గౌర వమ్ము ;
పెళ్లి రోజు తెచ్చు మల్లె పూదండయే
ప్రియుడు సఖికి ఇచ్చు ప్రేమ గుర్తు ! 13
ప్రకృతికె కాదు జనులకు బహు విధాల
అందము తొ బాటు ఆహ్లాద మంద చేయు
మమ్ము వెలి వెయ మీ కెట్లు భావ్య మయ్య?
ప్రజల కుపయోగ పడ నట్టి బ్రతుకు లేల? 14
అడవి కాచిన పూలలా అంత రించ
పుట్టి గిట్టిన మా కెట్లు పుణ్య మబ్బు?
ప్రభువు సేవకు ఉప యోగ పడుయు నటుల
సాయ మొందించి మా పట్ల జాలి గొనుమ? 15
అనుచు పూలన్ని నా మీద ఆగ్ర హించ
పూజ సరిపడ పూలను ప్రోగు చేసి
పూల నర్పించి దైవాన్ని పూజ చేయ
పరుగు పరుగున ఇంటికి పయన మైతి ! 16

డా. ముద్దు వెంకట రమణారావు ఎనిమిది పదుల వయసులో చేస్తున్న సాహితీ వ్యాసంగం గురించి, ప్రచురిస్తున్న పుస్తకాల గురించి కథా మంజరి లో ‘‘ విశ్రాంత నేత్ర వైద్యుని అవిశ్రాంత సాహితీ సేద్యం’’అనే శీర్షిక లో వారి పుస్తకాలను పరిచయం చేయడం జరిగింది.
అవి:
1. రమణీయం ( కవితా వ్యాస సంపుటి)
2. కమనీయం ( కవితా సంపుటి)
3. ఉదయ కిరణాల (వ్యాస సంపుటి)
4. మహనీయం ( కవితా సంపుటి)
5. సంధ్యారాగం ( వ్యాస సంపుటి )
ఆ వివరాలు ఇక్కడ నొక్కి చూడ వచ్చును.
ఇక, ఇటీవల వారు ‘‘వెన్నెల వెలుగులు ’’ అనే వ్యాస సంపుటిని, ‘‘ అనలానిల గీతాలు ’’ అనే కవితా సంపుటిని కొత్తగా వెలువరించారు.
వాటి గురించిన క్లుప్త పరిచయం:

వెన్నెల వెలుగులు:
ఇందులో వివిధ అంశాల మీద సాధికారికంగా వారు వ్రాసిన 33 వ్యాసాలు ఉన్నాయి.
ఈ పుప్తకానికి అక్కిరాజు రమాపతిరావు గారు సాహితీ కదంబం పేరిట ముందు మాటను, డా.ఎస్.వి. సత్యనారాయణ గారు వ్యాస వెన్నెలకు అభినందన పేరిట ఆప్తవాక్యాలను వ్రాసారు.
అక్కిరాజు వారు ఈ గ్రంథాన్ని ప్రపంచ సాహిత్యాన్ని స్థూలంగా ఎరుక పరిచే పెద్దబాల శిక్షగా అభివర్ణించారు.వీటిలో చిత్రణలు మన మనసుని ప్రపంచ యాత్ర చేయిస్తాయి అని చెబుతున్నారు.
అంతగా ప్రాచుర్యం పొందని కావ్యాలను సైతం మరుగున పడి పోకుండా, సామాన్య పాఠకులకు పరిచయం కలిగించడమే ధ్యేయంగా వీటిలో కొన్ని వ్యాసాలను వారు రచించడం జరిగింది. అద్దంకి కేశవరావు గారి తథాగతీయం ఐతిహాసిక కావ్యం గురించిన వ్యాసమే ఇందుకు నిదర్శనం. తాము చెప్ప దలచుకున్న విషయాన్ని నిదానంగాభావించి, పాఠకుల సంభావింప చేసే నైపుణ్యం గ్రథనంలోనూ, కథనంలోనూ కనబడుతుంది అని రమణారావు గారిని అక్కిరాజు ప్రశంసించారు. పాత కొత్తల మేలు కలయిక క్రొమ్మెరుంగులు చూపే అంతర్వీక్షణం, ప్రపంచాన్నంతా తెలియాలన్న ఆర్తి ఉండాలని, అవి రమణారావు గారిలో పుష్కలంగా ఉన్నాయని, అందు చేతనే ఈ వ్యాస సంపుటి ఇంత సరళ సుందరమై, సుబోధకమై, విషయావగాహనా సమన్వితమై, ఆసక్తి పరులైన తెలుగు వారికి అత్యంత సన్నిహితంగా చేరువయ్యేలాగున వెలువడిందని అక్కిరాజు రమాపతి రావు గారు అభిప్రాయ పడడం సహేతుకమే అనిపిస్తుంది.
డా.ఎస్.వి.సత్యనారాయణ గారు తమ ఆప్త వాక్యంలో చర్విత చర్వణంగా పూర్వ సాహిత్య సౌరభాల గురించి లోగడ విమర్శకాగ్రేసరులు చెప్పిన విషయాలనే తిరిగి చెప్పకుండా, వారు దర్శించిన వినూత్న సాహిత్యాంశాలను రేఖామాత్రంగా తెలుగు పాఠకులకు పరిచయం చేయాలన్న సదాశయంతో రమణారావు గారు ఈ వ్యాస వెన్నెలను రూపొందించారని చెబుతున్నారు.
ఆయా సాహిత్యాంశాలలో చక్కని పరిశ్రమ చేసి కూడా, సామాన్య పాఠకజన పఠనపరిశ్రమని గణన లోనికి తీసుకుని నాతి దీర్ఘమైన రీతిలో ఈ వ్యాసాలను రచించడం జరిగిందని రచయిత తమ ముందు మాటలో తెలియజేసారు.
ఈవ్యాస సంపుటిలో వసు చరిత్రం, ఆముక్త మాల్యద, అనిరుద్ధ చరిత్రము, తొలి అచ్చ తెనుగు కబ్బం యయాతి చరిత్ర, ఐతిహాసిక కావ్యం తథాగతీయం, వంటి గొప్ప ప్రాచీన కావ్యములను గురించిన అనుశీలనమే కాక, నాయని సుబ్బారావు కృతులు, జాతీయోద్యమ కాలం నాటి రచనలు, ప్రపంచ సాహిత్యంలో గొప్ప కథకులు, మరాఠీ నాటక కర్త విజయ్ తెందూలక్కర్, విక్టోరియా యుగం నాటి ఆంగ్ల సాహిత్యపు పోకడలు, రష్యన్ సాహిత్య పరిచయం, అప్పటికీ ఇప్పటికీ షేక్స్పియర్, లాంటి వ్యాసాలు పొందు పరిచారు.
సంగీతాభిమానులైప ఈ రచయిత వాటికి సంబంధించిన కొన్ని మంచి వ్యాసాలను కూడ ఇందులో జత చేసారు. హిందూస్థానీ శాష్త్రీయ సంగీత పరిచయం, సూర్య కుమారి జాతీయ గీతాలు ఈ కోవకి చెందిన వ్యాస రచనలు.
వీరికి చిత్రకాళాభినివేశం కూడ మెండు. ఆధునిక చిత్ర కళ, ఆంధ్ర చిత్ర కళ వంటి లఘు వ్యాసాలను చదివితే ఈ విషయం కాదనలేం.
ప్రాచీన, అర్వాచీన సాహిత్య గ్రంథాల పట్ల అభిరుచి కలిగి ఉండడం, తగినంత కృషి చేసి సంస్కృత సాహిత్యం అధ్యయనం చేయడం తాను అనుభవించిన వాటిని అక్షరాలలో అందంగా పలవరించడం, పదిమందితో పంచు కోవడం వీరికి చాల ప్రీతి పాత్రమైన విషయంగా తోస్తుంది. అది. సాహిత్యం, చిత్ర కళ, నృత్య రీతులు, శిల్పం, పర్యటనానుభవాలు , సంగీతం ... ఏదయినా కావచ్చును. వాటి ఆనుపానులు తెలుసు కోవాలనే అనురక్తి వీరిలో మెండు. తెలిసిన దానిని, తెలుసుకున్న దానిని, సామాన్య పాఠకులకు తెలియ జేయాలనే ఆర్తి కూడ ఎక్కువే. ఎదిగిన కొద్దీ ఒదిగే మనస్తత్వంతో,
వీరు ప్రపంచాన్ని, సాహిత్య ప్రపంచాన్నీ అక్షర బద్ధం చేసి అందించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో సఫలీకృతులయ్యారని ఈ పుస్తకాలే చెబుతున్నాయి.

ఈ వ్యాస సంపుటిని వీరు తమ బాల్య మిత్రులు, సహృదయులు, విద్యా వేత్త, అశేష శేముషీ ధురంధరుడు, కీ.శే. ఆచార్య తూమాటి దొణప్ప ( మాజీ వైస్ ఛాన్సలర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం) మధుస్మృతికి అంకితం చేసారు.
ఇక, వీరు ప్రచురించిన కొత్త కవితా సంపుటి అనలానిల గీతాలు:

62 కవితలు గల ఈకవితా సంపుటికి డా.సి.నారాయణ రెడ్డి గారు, డా,ఎన్. గోపి గారు అభినందన వాక్యాలు అందచేసారు.
భావపూర్ణంగా, సముచిత పదనిహితంగా పాఠకులకు అందించే సృజనాత్మక ప్రతిభ రమణారావు గారిదని సి.నా.రె ప్రశంసించగా,అనలానిల గీతాలలో అనల గీతాలు ( అగ్నికి సంబంధించినవి) అనిలగీతాలు ( వాయువుకి చెందినవి) , వాటి గూర్చిన కవితాలాపన, తాత్వ్తిక స్పర్శ కనిపిస్తున్నదని ఆచార్య గోపి వివరించారు. మృదుత్వం, తగ్గని ప్రౌఢశైలిలో రాసిన పద్యాలు రమణారావు గారి కవితా శక్తిని తెలియ జేస్తాయి అని అభినందిస్తున్నారు.
వీటిలో అనలానిల గీతాలే కాకుండా అన్య వస్తు సంబంధితాలయిన మరి కొన్ని కవితలను కూడ చేర్చడం జరిగింది.
వీటిలో అనల గీతాలు 15, అనిల గీతాలు 12, ఇతరములు 31, అనువాద గీతాలు 4 మొత్తం 62 కవితలు చేర్చారు. సంఖ్యాపరంగా ఇతర గీతాలు, అనువాద కవితలు అనలానిల గీతాల కన్న ఎక్కువ కనిపించే ఈ కవితా సంపుటికి అనలానిల గీతాలు అనే పేరు ఉంచడం చిత్రమనిపించినా, అసంగతంగా తోచదు. పాంచభౌతిక పరివ్యాప్తమైన లోకంలో అనల స్పర్శ, అనిల స్పర్శ లేనివి ఏవీ ఉండనేరవు అనే స్పృహ ఈ కవి లో ఉండడం చేత దీనికి అనలానిల గీతాలు అనే పేరు సముచితమని భావించి ఉంటారు.
అనల గీతాలు అగ్నిమీళే పురోహితమ్ అనే వేద వచనంతోను, అనిల గీతాలు మలయానిల గీతం తోను మొదలు పెట్టడం వీరి ఔచితీ ప్రదర్శనకు తార్కాణ.
ఈ కవితా సంపుటిలో వీరి కవితా సామర్ధ్యానికి ఉదాహరణ ప్రాయంగా కొన్ని కవితా పంక్తులని చూడండి:
అణువునణువున నిక్షిప్తమైన అగ్ని
జఠర మందు జీర్ణాగ్నిగా జ్వలనమందు
ప్రాణులన్నిట వెలిగెడి ప్రాణ జ్యోతి
పీడితుల మానసమ్ముల విప్లవాగ్ని.
అగ్ని గీతం అనే శీర్షికన వెలువరించిన ఈ చిన్ని కవితలో ప్రాణులన్నిట వెలిగే అనల జ్యోతి పీడితుల మనస్సులలో రగిలే విప్లవాగ్నిగా అభివర్ణించడం కవికి గల అభ్యుదయ దృక్ఫథాన్ని తెలియ జేస్తోంది.
ఒక దీపం చాలు వేయి దీపాలను వెలిగించును అనే భావనకు పద్య రూపం:
ఒక్క దీపమ్ముతోడ ప్రద్యోతమౌను
శతసహస్ర దీపమ్ములు ; సకల శుష్క
వనములనెల్లను దావాగ్ని కణము కాల్చు
మంచి చెడ్డల రెంటిని పంచునగ్ని.
ఇక, అనిల గీతాలలో తొలియూరుపు అనే కవిత గొప్ప తాత్త్విక కోణం ఆవిష్కరించే కవిత.
తొలియూరుపు నుండి కడపటి యూరుపు వరకు జీవధార ప్రవహింపగ, చేతన ప్రభ వికసింపగ అవిరామంగా ప్రసరించే మారుత తరంగాలకు కవి అంజలి ఘటిస్తున్నారు.
అనిల గీతాలాపనలో గాలిలో కలసి పోయిన కాలకూట విషవాయువు బారిన మృత్యువాత పడిన అసంఖ్యాక జనుల మృత్యు ఘోష విషవాయువు కవితలో వినిపిస్తున్నారు. ఇది వీరి సామాజిక స్పృహకు నిదర్శనం.
భీకర దృశ్యమ్మది
వేలకొలది జనులు
విగత జీవులైన వేళ
విషాద చరిత సృష్టించును
అని చెబుతూ ఈ దండనీతి యేరీతిగ సాగిందని, ఎవరు దీనికి బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.
ఇతర గీతాలలో చక్కని గీతాలు కనిపిస్తాయి. సెల్ ఫోన్, టైమ్ మిషీన్ వంటి చమత్కార జనితాలయిన కవితలను ఈ విభాగంలో చూడవచ్చును.
మనలోనే కాలయంత్రములు
మనస్సులోనే ఇమిడి వున్నవి ...
అంటూ, మన ఙ్ఞాపకాలే గత కాలం లోకి మనలని మోసుకుని పోతాయనీ, మన కలలే భావి మార్గంలోకి మనలను పయనింప చేస్తాయనీ, అందు వలన కడు క్లిష్టమైన ఖరీదయిన యంత్రాలతో పని లేదని వివరణ యిస్తున్నారు.
ఈ కవి తమ కవితావేశాన్ని ఇలా అక్షరీకరిస్తున్నారు:
కవితావేశము పొంగు వేళల లసత్
కావ్యాకృతుల్ మన్మనో
భవమై, సుందర పద్య గేయ రచనల్
భాసించు స్వేచ్చా విధిన్
మివులన్ సమ్మదమై, నవరసో
న్మీలమ్ముగా వ్రాసెదన్
ఇవినా తప్పులుగా బుధుల్ తెలిసి
సైరింపంగ ప్రార్ధించెదన్.
ఈ కవితాభివేశం యిలాగే నిండు నూరేళ్ళు కవిలో ఉండాలని కోరుకుందాం,

ఈ కవితా సంపుటిని వారు తమ ఆప్తుడు, సహృదయుడు, కవి, పండితుడు అయిన కీ.శే. పంతుల విశ్వనాధ రావు మధుర స్మృతికి అంకితం ఇచ్చారు.
సుందరంగా వెలువడిన ఈ రెండు పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ సాహితీ, సాంస్కృతిక సమాఖ్య (రి),వారు ప్రచురించారు. వారి ప్రథాన కార్యాలయం శ్రీకాకుళంలో ఉంది. వెన్నెల వెలుగులు వ్యాస సంపుటి వెల రూ. 125. కాగా, అనలానిల గీతాలు కవితా సంపుటి రూ.75 లకు లభిస్తోంది.
ఇతర వివరాలకు: శ్రీరామిశెట్టి, ప్రథాన కార్యదర్శి,
ఆంధ్రప్రదేశ్ సాహితీ, సాంస్కృతిక సమాఖ్య (రి),
శ్రీ భద్రమ్మ గుడి వెనుక, ఇల్లిసిపురం వీధి,
పుణ్యపు వీధి, శ్రీకాకుళం - 532001
పెల్: 9441707772
చిరునామాకి సంప్రదించ వచ్చును.
లేదా, నేరుగా రచయిత గారినే పంప్రదించ వచ్చును. వారి చిరునామా:
డా,యం.వి.రమణారావు, యం.యస్.డి.ఓ
రిటైర్డ్ సివిల్ సర్జన్
ప్లాట్ నం. 211, ఎస్.బి.ఐ కాలనీ,
పుణ్యపు వీధి, శ్రీకాకుళం - 532001
ఫోన్: (08942)223143 సెల్: 9849696511

ఎర్రగా బుర్రగా, కొంచెం కుదమట్టంగా ఉన్న నేను మీకు తెలుసు కదూ?
నగరాల్లో, పట్నాలలో, పల్లెల్లో నేను అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాను. నన్ను ఆంగ్లంలో ఫొస్ట్ బాక్స్ అనిపిలుస్తారు. తెలుగు వాళ్ళు నన్ను పోస్టు డొక్కు అనీ, తపాల పెట్టె అనీ, ఎర్ర డబ్బా అనీ ముద్దుగా పిలుస్తూ ఉంటారు.
ఒకప్పుడు నా కడుపు నిత్యం నిండుగా ఆకలి బాధ ఎరుగ కుండా ఉండేది. కార్డులు, కవర్లు, ఇన్ లేండ్ కవర్లతో నా కడుపు పొద్దస్తమానం నిండి పోయి ఉండేది. మా తపాల అన్నయ్య ప్రతి రోజు ఠంచనుగా వేళకి వచ్చి, నా నడుం ప్రక్క ఉన్న తాళం తీసి వాటిని సేకరించుకుని వెళ్ళి పోయేవాడు. ఆ తరువాత అవి పోష్టు ఆఫీసుకి చేరి, అక్కడ ముద్రలు వేయించుకుని, ఊర్ల వారీగా వేరు చేయబడి రైళ్ళలో, బస్సుల్లో ఎంచక్కా ప్రయాణం చేసి వెళ్ళి పోయేవి. వెళ్ళి, అవి ఎవరికి చేరాలో వారింట అడుగు పెట్టేవి. ఒకప్పుడు ఆ ఉత్తరాలు తెచ్చే పోస్టు మేన్ కోసం జనాలు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసే వారు.


ఉత్తరాలలో ఎన్ని రకాలో ! కుశలాలు అడిగేవి, కబుర్లు చెప్పేవి, నిష్టూరాలు పలికేవి, నిందలు వేసేవి, సాయం కోరేవి, అభయం యిచ్చేవి, ధైర్యం చెప్పేవి, బెంగలు, బాధలు, చికాకులు, కష్టాలు కలబోసుకునేవి, కన్నీళ్ళు కార్చేవి, నవ్వుతూ కళకళ లాడేవి ... ...
కొన్ని మృదువుగా, కొన్ని కఠినంగా, కొన్ని క్లుప్తంగా, కొన్ని సుదీర్ఘంగా, మరి కొన్ని పెళుసుగా, కుండ బద్దలు కొట్టి నట్టుగా, హెచ్చరికలు, ఓదార్పులు, మంతనాలు, హిత వచనాలు, వేడికోళ్ళు, వెక్కిరింతలు ... ...
శుభ వార్తలను మొసుకొచ్చేవి, దుర్వార్తలను చెప్పేవి. మొదటి వాటికి పసుపు నాలుగు చివర్ల పెట్టే ఆచారం ఉంది. రెండో రకం వాటికి నాలుగు చివర్ల నల్ల సిరా పూసే అలవాటూ ఉంది .
కొన్ని ముత్యాల కోవ వంటి అక్షరాలతో రాసినవి. కొన్ని గొలుసు కట్టు రాతతో చదవడానికే చికాకు పరిచేవి.
కొన్నింట చక్కని కవిత్వం. మరి కొన్నింట అక్షర దోషాలతో ఎంత చదివినా ఏం రాశారో అర్ధం కానట్టు ఉండే వాక్య విన్యాసంతో కూడినవి ...
ఇచ్చట అంతా క్షేమం. అచ్చట మీరంతా క్షేమంగా ఉన్నారని తలస్తాము. లాంటి వాక్యాలతో మొదలై, చిత్త గించ వలెను, తో పూర్తి చేసే వారు.
మహా రాజశ్రీ, అనో, బ్రహ్మశ్రీ వేదమూర్తులయిన అనో, గంగా భాగీరథీ సమానురాలైన ... అనో సంబోధనలు ఉండేవి.
ఇప్పుడా ఉత్తరాలూ లేవు, ఆ రాతలూ లేవు. ఉత్తరాలు రాయాలంటేనే బోర్. సెల్ ఫోన్ లు వచ్చేక మరీనూ. గంటల తరబడి అందులోనే కబుర్లు చెప్పు కోవడం, లేదా ఆకుకీ పోకకీ అతకనట్టు ఎస్సెమ్మస్ లు ఇచ్చు కోవడం. నా పాలిట కొరియర్ సర్వీసులొకటి వచ్చి పడ్డాయి. ఇంక నా ఊసెవరికి పడుతుంది ?
లేఖా రచన గొప్పతనం ఇప్పుడెవరికీ పట్టడం లేదు. సాహిత్యంలో లేఖా సాహిత్యానికి ప్రత్యేకమైన, ఉన్నతమైన స్థానం ఉంది. ప్రముఖుల లేఖలు చదవడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.
విశ్వ కవి రవీంద్రుడు మా ఆఫీసు గురించి పోస్టాఫీసు అనే ఒక గొప్ప కథ రాసిన విషయం మీకు తెలిసిందే కదా ?
నా ఉత్తరాల గురించి బాల గంగాధర తిలక్ పైనికుని ఉత్తరం, తపాల బంట్రోతు లాంటి గొప్ప వచన కవితలు రాసేడు. ఇంకా చాలా మంది నా గురించి , ఉత్తరాల గురించిరాసేరు. అపురూపమైన లేఖా సాహిత్యాన్ని సృజించేరు. అవన్నీ మరో మారు చెప్పుకుందాం.
ఆ మధ్య ఏదో తెలుగు సినిమాలో ఓ కమేడియన్ నా నోట్లో చెయ్యి పెట్టి ఎంతకీ ఊడి రాక గింజుకుంటూ విలవిలలాడుతూ ఊరంతా తిరగడం లాంటి కామెడీ కూడా ఏదో చేసాట్ట. నేను చూడ లేదను కోండి. ...
ఇప్పడు చాల మంది ఉత్తరాలు రాయడానికి బద్ధకం చేతనో, అశక్తత చేతనో, అయిష్టం వల్లనో, చేత కాని తనం చేతనో పూను కోక పోవడం చేత తరుచుగా నా కడుపు అర్ధాకలితో దహించుకు పోతోంది.
సంభాషణలో విప్పి చెప్ప లేని విషయాలను, పరిచి చూప లేని హృదయ స్పందనలను అక్షరం ఆవిష్కరించ గలదనే సత్యాన్ని విస్మరిస్తున్నాం మనం.
అందుకే ఒకప్పుడు ఉత్తరాలతో నిండుగా ఉండే నేను, ఇప్పుడు ఒకటీ అరా ఉత్తరాలతో బోసి పోయి ఉంటున్నాను..
అర్ధాకలితో అలమటించి పోతున్నాను. మరెందుకు లెమ్మని నాకు కొన్ని చోట్ల మా తపాల శాఖ వారు తాళాలు వెయ్యడం కూడా మానుకున్నారు. నన్ను పట్టించు కోవడం మానేసేరు.

చాలా వరకు ఇప్పుడు నేను దుమ్ము పట్టి ఉంటున్నాను. ఫాక్సులూ, ఇంటర్నెట్ లూ వచ్చేక నా పరిస్థితి మరింతగా దిగజారి పోయింది.
నా కేడుపు వస్తోంది. నన్ను పట్టించు కోరూ? ఉత్తరాలతో నా కడుపు నింపరూ? నా ఆకలి కేకలు చెవిని పెట్టరూ?








పతంజలి గారు ఓ రోజు ఒక పత్రికాఫీసులో కూర్చొని వుండగా అక్కడికి దండిగా మాత్రమే కధలు రాసిన ఓ విశాఖ రచయిత వచ్చారు. పత్రికాధిపతి ఆయనను పతంజలి గారికి పరిచయం చేసారు. పతంజలి గారు అప్పటికే వీర బొబ్బిలి,రాజుగోరు,దెయ్యం ఆత్మ కధ,పెంపుడు జంతువులులాంటి క్లాసిక్స్ రాసి వున్నారు.ఆ రచయిత పతంజలి గారి వంక దర్పంగా ఓ చూపు చూసి ” ఆ… మీ పేరు విన్నట్లు గుర్తు .మీరు కూడా కధలవీ రాస్తారనుకుంటా” అన్నారు.పతంజలి గారు పెంకిగా “ఎబ్బెబ్బే… నేను అట్లాంటి పనులు చేయను లెండి”అనేసారు.ఈ ఎపిసోడ్ అంతా పతంజలి గారు విశాఖ వర్మకి చెపుతూ ” చూసావోయ్ ఈ రచయితల గోరోజనం…..”అన్నారు.అపుడు వర్మ రణపెంకిగా”అంతేలెండి మరి అయన రాసిన ఐదువందల కధలు మీరు రాయని ఒక కధతో సమానమని”ముక్తాయించారు
పతంజలి గారి హాస్య చతురతికి చక్కని తార్కాణమిది. వర్మ గారి ముక్తాయింపు బావుంది. పతంజలి గడుసు దనానికి మరో చిన్న ఉదాహరణ : విజయనగరంలో ఓ (పెద్ద అనుకునే ) రచయిత ఒక సారి తన పుస్తకాన్ని యిచ్చి అభిప్రాయం కోరేడు పతంజలిని . రెండు రోజులాగి చెప్తానని పతంజలి ఆ పుస్తక రచయితతో చెప్పి పుస్తకం తీసుకున్నాడు.
రెండు, మూడు రోజులయేక పతంజలి ఆ పుస్తకాన్ని అతనికి తిరిగి యిచ్చేస్తూ : ‘‘ పుస్తకం చాలా బావుందండి. చక్కని గెటప్. మంచి ప్రింట్. ఎక్కడా అక్షర దోషాలు లేవ్. వాడిన పేపరు చాలా బాగుంది …’’ లాంటి మాటలేవో మాట్లాడేడు. ఆ రచయిత చాలా సంతోషించి, ధన్యవాదాలు మరీ, మరీ చెప్పి ఆనందంగా వెళ్ళి పోయేడు.
‘‘ ఆయనకి నా అభిప్రాయం సరిగా చెప్ప గలిగేను కదా?’’ అడిగేడు పతంజలి.
‘‘ ఓ … బ్రహ్మాండంగా … పుస్తకం గురించి ఒక్ఖ మాట దొర్లకుండా జాగ్రత్త పడుతూ బాగానే చెప్పారు …’’ అన్నాను, నవ్వుతూ…
తర్వాత, యిద్దరం సుబ్రహ్మణ్య విలాస్ లో కాఫీలు తాగుతూ ఎంతగా పగలబడి నవ్వుకున్నామో
- - - - - - - - -
ఈ టపాలో మొదటి సంఘటన విశేషాన్ని జాజిమల్లి గారి మల్లీశ్వరి బ్లాగు టపా పతంజలి రాయని కథ నుండి తీసు కోవడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు. ఆ టపా కోసం ఇక్కడ చూడండి.
ఇక, రెండవ సంఘటన గురించి నేను జాజిమల్లిగారి పతంజలి రాయని కథ టపాకు నేను అప్పట్లో ఉంచిన వ్యాఖ్య . ( మొదటి సంఘటన నాకు శృత పూర్వం కాడం చేత, రెండో దానిలో నా ప్రత్యక్ష భాగస్వామ్యం ఉండడం చేత టపా పెట్టే ముందు జాజిమల్లి గారి టపా గురించి పేర్కొనడంలో ఏమరుపాటు జరిగింది.)
ఈ రోజు పతంజలి సమగ్ర సాహిత్య రచనలు మరోసారి ( బహుశా పదో సారి) చదువుతూ ఉంటే ఆ టపా, దానికి నేను పెట్టిన వ్యాఖ్య గుర్తొచ్చి మరోసారి బ్లాగులో నా ముచ్చట కొద్దీ పెట్టాను.
ఇది టపాల పునరక్తి కావచ్చు, కానీ మా పతంజలి గురించి ఎన్ని సార్లు చెప్పినా నాకు తనివి తీరదు.
ఇక్కడ నా ఈ టపాకి వ్యాఖ్య పెట్టి, నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేసిన మల్లి (Malli) గారికి కృతఙ్ఞతలు తెలుపు కుంటున్నాను.. .
కె.ఎన్.వై.పతంజలి రచనలూ,ఫోటోలు కోసం ఓసారి ఇక్కడ నొక్కి చూస్తే ఓ పనైపోతుంది.
0
0