29, జులై 2011, శుక్రవారం

ఇంతకీ అసలు సమస్య ఏమిటయ్యా ?


ఈ క్రింది శ్లోకం చూడండి:

కా శంభు కాన్తా ? కిము చంద్ర కాంతం ?
కాన్తా ముఖం కిం కురతే భుజంగం
క: శ్రీపతి: కా విషమ సమస్యా ?
‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ: ’’

ఇందులో మొత్తం నాలుగు ప్రశ్నలూ, నాలుగు సమాధానాలూ ఉన్నాయి. చూడండి:

కా శంభు కాన్తా ? = ఎవరు ఈశుని భార్య ? = గౌరి

కిము చంద్ర కాన్తం ? = ఏది చంద్ర బింబం ? = ముఖం

కాన్తా ముఖం కిం కురుతే = అమ్మాయి ముఖాన్ని ఏం చేస్తున్నాడు? = చుంబతి ( ముద్దు పెట్టు కుంటున్నాడు)

భుజంగం క: = పాము ఎవరు ? = వాసుకి.

ఈ విధంగా తొలి నాలుగు ప్రశ్నలకీ వరుసగా నాలుగో పాదం లోని ’’ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ:’’ అని

కవి నాలుగు జవాబులూ తనే ఇచ్చేడు.

మరయితే అసలు సమస్య ఏమిటయ్యా ?

ఒక కవి ‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ:’’ అని ఒక సంస్కృత సమస్య ఇచ్చాడు. శ్లోకం లోని మీద మూడు పాదాలూ పూరణ.

కా విషమ సమస్యా ? = ఏది జటిలమైన సమస్య ? దీనికి నాలుగో పాదం లోని ‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ: ’’ అనేదే జవాబు.

గౌరీ దేవి ముఖాన్ని వాసు దేవుడు ముద్దు పెట్టు కోవడ మేమిటీ , ఓఘాయిత్యం కాక పోతేనూ !!

మరదే , అందుకే కవికి మండుతుంది. ఏ అనౌచిత్యమూ లేకుండా ఈ సమస్య లోని ప్రతి పదానికి అర్ధవంత మయిన జవాబు వచ్చేలా ముందే ప్రశ్నలు వేశాడు కదండీ.

ఇలాంటి కిత కితలంటే మన పూర్వ కవులకి చాలా సరదా సుమండీ . మనలా ఎప్పుడూ ఆందోళనలతో ఏడుపుగొట్టు ముఖాలతో ఉండకుండా గొప్ప కులాసాగా, కుంచెం శృంగారం ఒలికించే పద్యాలూ శ్లోకాలూ చెప్పుకుంటూ ఉండే వారు కాబోలు.

ఆ రోజుల్లో వాళ్ళకి ఏ నవ్వుల క్లబ్బులూ ఉండేవి కాదని , వాటి అవసరం వాళ్ళకి పడ లేదని మా కథా మంజరి దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది.




శలవ్.



6, జులై 2011, బుధవారం

గుండె తడి ... కథల సంపుటి ... ఒక సమీక్ష



నా ‘ గుండె తడి ’ కథల సంపుటి గురించి ఈ వారం ( 13.7.2011) దీ సంచికలో బుక్ చాట్ శీర్షికలో ప్రచురిత మైన ‘శ్రీవత్స‘ గారి పుస్తక సమీక్ష చదవండి ...


27, జూన్ 2011, సోమవారం

తిరుగలి గురించి మా తింగరి బుచ్చి గాడి ఉపన్యాసంబెట్టి దనిన ...


ఇప్పుడంటే మిక్సీలూ , గ్రైండర్లూ వచ్చేయి కానీ, వెనుకటి రోజులలో ఆడవాళ్ళు జబ్బలు పీకే లాగున పిండి రుబ్బాలంటే రుబ్బు రోలునీ, దంచాలంటే రోళ్ళూ రోకళ్ళనీ, విసరాలంటే తిరుగళ్ళనీ ఆశ్రయించే వారు.

ప్రస్తుతం మనం తిరుగలికి చెందిన కబుర్లు చెప్పు కుందాం.

మీదో రాయీ, కిందో రాయీ ఉండే విసురు సాధనం తిరుగలి. కింద రాయి స్థిరంగా ఉంటే, మీద రాయి చేత్తో త్రిప్పడానికి అనువుగా ఉంటుంది. మీద రాతిని చేత్తో త్రిప్పడానికి అనువుగా ఒక కర్రతో చేసిన పిడి ఉంటుంది. విసర వలసిన గింజలను మీద రాయి మధ్యలో ఉండే ఖాళీ లోంచి పోసి, ఇంక త్రిప్పడం ( అంటే విసరడం) మొదలు పెట్టే వారు. విసరగా విసరగా మెత్తని పిండి రెండు రాళ్ళ మధ్యా ఉండే ఖాళీ ప్రదేశం నుండి కింద పడేది. ఇదీ తిరుగలి పని చేసే తీరు.

ఈ తిరుగలికే చాలా పర్యాయ పదాలు ఉన్నాయి !

అంజి, అనఘట్టము,కణలాభము, ఘరట్టము,జిక్కి,యంత్రపేషిణి,యంత్రము, రాగల్రాయి, విసుర్రాయి ... ఇవండీ తిరుగలికి ఉన్న మరో పేర్లు !

ఇంత ఆయాసపడి పోవడం ఎందుకు కానీ, హాయిగా మనం తిరుగలి అనో, విసుర్రాయి అనో తెలిసిన పేర్లతో ప్రస్తుతానికి ముద్దుగా పిలుచు కుందాం ! ప్రాణానికి సుఖంగా ఉంటుంది.

తిరుగలి ఊసెత్తితే సాయి భక్తులకి సాయి బాబా షిర్దీలో తిరుగలి విసరడం గుర్తుకు వస్తుంది. కదూ !

ఆ కథ ఇక్కడ మరొక్క సారి గుర్తుకు తెచ్చు కుందాం.

అన్నా సాహెబ్ ధబోల్కర్ అనే ఒక పెద్ద మనిషి బాబా కీర్తి గురించి విని ఆయన దర్శనం కోసం షిరిడీ రావాలనుకున్నాడు. అతడు వచ్చిన రోజు ప్రొద్దున సాయి బాబా మసీదులో ఒక తిరగలి ముందర కూర్చుని గోధుమలు విసురుతున్నారు. బాబాకు ఇల్లు సంసారం లేవు. వారు భిక్షాటనంతో జీవిస్తారు గదా! మరి ఈ గోధుమ పిండి ఎందుకు? అని అతడు వచ్చి ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు. అంతలో నలుగురు ఆడవాళ్ళు బాబాను తిరగలి ముందు నుంచి లేపి, పాటలు పాడుతూ పిండి విసిరారు. తరువాత దాన్ని నాలుగు భాగాలుగా చేసి తీసుకు పోబోయారు. అపుడు బాబా వాళ్ళను కోప్పడి "ఈ పిండి మీకు కాదు. దిన్ని తీసుకువెళ్ళి ఊరి సరిహద్దులలో చల్లండి" అని ఆజ్ఞాపించారు. ఇదంతా చూస్తున్న అన్నా సాహెబ్ ఆ ఊరి వాళ్ళను అడిగాడు - అలా పిండి ఊరు చుట్టూ చల్లటం దేనికి? అని. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం: "షిరిడీ గ్రామంలో కలరా వ్యాధి ఉంది. దాన్ని పోగొట్టడానికి బాబా యిలా చేసారు. ఆయన విసిరింది గోధుమలు కావు, వ్యాధినే" అని చెప్పారు. వాళ్లు చెప్పినట్లే మరునాటికి కలరా వ్యాధి తగ్గు ముఖం పట్టింది. అన్నా సాహెబ్ బాబా శక్తికి ఆశ్చర్యపోయాడు. ఇక ఆయన దగ్గరే ఉంది పోయాడు. బాబా కూడా అంతర్నేత్రంతో ప్రేమగా చూచేవారు. అతని "హేమాడ్పంత్" అని పిలిచేవారు. అతని మనసులో ఏ సందేహం వచ్చినా, బాబా తీర్చే వారు
తిరుగలి గురించి ఇంత పవిత్రమూ, ప్రశస్తమూ, ప్రఖ్యాతమూ అయిన కథలూ, విశేషాలూ ఉండగా ఓ సారి మా తింగరి బుచ్చి గాడు ఒక మహిళామణుల సభలో తిరుగలి గురించి అవాకులూ చవాకులూ ఉపన్యసించి మెడ మీదకి ( పీక మీదకి అని ఎందుకు అన లేదో మొత్తం ఆ వృత్తాంతం చదివితే గానీ మీకు తెలియదు) తెచ్చు కున్నాడు.
ఇంతకీ, మా తింగరి బుచ్చి గాడి గురించి మీకు చెప్పనే లేదు కదూ ! సన్నగా రివట వలె గాలికి తూలి పోవు రీతిని ఒప్పు వాడు. అడపాదడపా సభలలో సందడి చేయు వాడు. పిలిచిననూ, పిలువక పోయిననూ సభా ప్రాంగణము నందు తిరుగాడు వాడు. వీలు చిక్కించు కుని వేదిక నెక్కి తన ధోరణిలో ఉపన్యాసము లిచ్చు వాడు. మిక్కిలి తరుచుగా ఉపన్యాసము పూర్తి చేయక ముందే బలవంతముగా వేదిక నుండి నిర్దాక్షిణ్యముగా దింపి వేయ బడు వాడు. అంతియ కాక, లోకములో ఏ విషయము తనకు తెలియదను మాట లేని వాడు. సమస్త విషయముల గూర్చిన సమగ్ర సమాచారము తన వద్ద మాత్రమే కలదని అహంకరించు వాడు ...
మా తింగరి బుచ్చిగాడి ఘనత గురించి చెబుతూ పోతే తరిగేది కాదు కానీ , ఇప్పుడు వాడిచ్చిన తిరుగలి గురించిన ఉపన్యాసం గురించి మాత్రం చెబుతాను వినండి:
‘‘ మన వాళ్ళుట్టి వెధవలోయ్‘‘ అని గురజాడ ఊరికే అన లేదు. గురజాడకి అసలు మన వారి గురించిన ఆ గ్రహింపు మా ముత్తాత బ్రహ్మశ్రీ తింగరి హనుమాన్లు శాస్త్రుల వారి వలన కలిగిందని మీలో ఎవరికీ తెలిసి ఉండక పోవచ్చును. సరే ఈ విషయం కాస్సేపు ప్రక్కన పెడదాం ! మన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాక పోతే, ఆలు మగల సంసారాన్ని బండి చక్రాలతోనా పోలుస్తారూ ! చక్రాల సంగతి అలా ఉంచితే, బండిని లాగేవి ఎద్దులు కదా ? ఆ రెండున్నూ పుంలింగములు కదా ? మరి ఆలు మగలలో ఒకరు పురుషుడున్నూ, వేరొకరు స్త్రీయున్నూ అయి ఉన్నారు కదా !
అందు చేత ఈ పోలిక శుద్ద చవటలు చేసిన పోలికగా నేను ఈ వేదిక మీద నుండి ధృవీకరిస్తున్నాను.... ’’ మా తింగరి బుచ్చి గాడి ఉపన్యసం ఈ వరకూ వచ్చే సరికి సభలో కొంత అలజడి బయలు దేరింది. అసహనం పురులు విప్పింది. హాహాకారాలు చెలరేగాయి. అదంతా తనఉపన్యాస ధోరణికి ప్రశంసారూపమయిన శబ్ద ఘోషగా ఎంచి, మా తింగరి బుచ్చి తన ఉపన్యాసాన్ని ఇంకా ఇలా కొన సాగించాడు:
‘‘ అందు చేత నా మట్టుకు నాకు భార్యా భర్తలను తిరుగలితో పోల్చడం సరైనదని పిస్తుంది. కింద ఉండే రాయి భార్య అయితే, పైనుండే రాయి భర్త. కింద రాయి అంగుళం కదలదు. అంటే, ఏమిటంటా, ఆడది గడప దాటకుండా ఇంట్లోనే పడి ఉండాలన్నమాట ! ఇక మగాడు పైన ఉండే రాయిలాగా సదా తిరుగుతూ డబ్బులు సంపాదించాలన్నమాట!అంతే కాకుండా మీది రాయి తిరుగుతూ ఉంటే, కింది రాయి ఆ రాపిడిని తట్టు కుంటూ ఉంటుంది. అంటఏ ఏమిటంటా ? భర్త పెట్టు నసను భార్య సదా భరిస్తూ ఉండడమే సృష్టి ధర్మం. అంతే కానీ నేటి ఆధునిక తుచ్ఛ వనిత వలె తిరుగబడుట అవివేకమూ, అనాగరికమూ ... ఇక, తిరుగలి తిరిగి నప్పుడే మెత్తని పిండి అనే సంసార సుఖాలు లభిస్తాయి. అయితే, సంసారం అనే ఈ తిరుగలి త్రిప్పేది ఎవరని మీకు ఆలోచన రావచ్చును. తిరుగలి పిడి అనే కాలం పట్టుకుని విధాత తిరుగలిని విసురుతూ ఉంటాడు....’’
ఇహ విన లేక సభలోని మహిళామణులంతా ఏక కంఠంతో దిగు ! దిగు !! ధ్వానాలు పలికి, మైకు లాక్కుని, చొక్కా గుంజుతూ, వేదిక మీద నుండి అర్ధాంతరంగా ఇవతలకి లాగి, సభాప్రాంగణం నుండి బయటకు ఎప్పటి వలె గెంటి వేసారట.
మా తింగరి బుచ్చి గాడు అందుకు నొచ్చు కోలేదు కానీ, తన గభీరమైన ఉపన్యాసం ఇంకా పూర్తి కాకుండానే అవాంతరం ఏర్పడింది కదా ! అని చింతించాడుట. ఆ రాత్రి అతనికి ఇంట అన్నం కాదు కదా, పచ్చి మంచి నీళ్ళు కూడా లభించ లేదని నమ్మకమైన సమాచారం కథామంజరి వద్ద ఉంది.
ఇదీ మా తింగరి బుచ్చిగాడి తిరుగలి మీద ఉపన్యాసం. వీలు చూసుకుని తింగిరోపన్యాసాలు అనే లేబిల్ క్రింద వాని ఉపన్యాసాలు మును ముందు మీముందు ఉంచగలను.
ఇక, తిరుగలి గురించి లోగడ కవిగారు ఒకరు చెప్పిన ఆశువు చూడండి
ఏడిచెదవేలనోయిక ఘరట్టమ ! త్రిప్పల బెట్టుచుందురే
చేడెలు నన్నటంచు కడు చిత్రముగా కడగంటి చూడ్కి చే
రేడులనైన ద్రిప్పెదరు రేలు పవళ్ళిక కేలుబట్ట నె
వ్వాడు పరిభ్రమింపడు సుమా ! సుదతీమణి త్రిప్పు చేతలన్ !!
దీని భావం:
ఓ తిరుగలీ ! ‘‘ఆడవాళ్ళు నన్ను స్థిరంగా ఉండనివ్వ కుండా అరిగి పోయేలాగున తెగ త్రిప్పుతూ ఉంటారు ’’
అని ఎందుకే ఏడుస్తావు ? స్త్రీలంటే ఏమిటను కున్నావ్ ! ఓర చూపులతో ప్రభువులనయినా గిర్రున తమ వెంట రేయింబవళ్ళు త్రిప్పుకో గలరు. ఒక తూరి చేయి అందుకుంటే, ఆ చేతిని వదలకుండా ఆవిడగారి కనుసన్నలలోతిరుగాడుతూ ఉండ వలసినదే కదా !
అన్నట్టు మాతింగిరి బుచ్చిగాడికి తెలుసో, లేదో, తిరుగలి మాహాత్మ్యం గురించిన ఓ విషయం వాడి చెవిని వెంటనే వేయాలి. అవపరమయితే ఏదో చోట తన ఉపన్యాసంలో ఉపయోగించుకుంటాడు కదా.
అదేమిటంటే, కోదాడ దగ్గర ఒక నరసింహస్వామి దేవాలయంలో ఒక తిరుగలి ఉంది. దానిని కౌగలించుకుని వేడుకుంటే ఎలాంటి కోరికలనయినా తీరుస్తుందని భక్త జనుల విశ్వాసం ! ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే తిరుగలి అదిట ! కావాలంటే ఈ క్రింది ఫొటో మీరే చూడండి: :
ఈ భక్తాగ్రేసరి ఇప్పట్లో లేవదు కానీ, ఇక శెలవ్.

ఇతి తిరుగలి ఉపాఖ్యానమ్ సర్వం ప్రస్తుతానికి సమాప్తమ్

22, జూన్ 2011, బుధవారం

నవ్వి పోదురు గాక !



కొంత మంది గలగలా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వింటే కానీ వాళ్ళు చెబుతున్నదేమిటో అర్ధం కాదు !
ఆ వేగాన్ని అందుకోవడం మనతరం కాదు. ఇంతకీ వాళ్ళు మాట్లాడేది ఏ భాషో కూడా తెలియక జుట్టు పీక్కోవాలి.

ఒకాయన వేద పఠనం చేస్తున్నాడు. ఆహా ! ఏమి పాండిత్యమయ్యా ! క్రమాంతస్వాధ్యాయిలా ఉన్నాడు ! ఉదాత్తానుదాత్త స్వరిత స్వర భేదాలతో ఏమి గొప్పగా వేద పనసలు వల్లె వేస్తున్నాడయ్యా ! అనుకుంటూ మురిసి పోయేడొకాయన.
‘‘ నీముఖం ! ఆయన చదివేది వేదమూ కాదు. ఏమీ కాదు. నిదానించి విను .నీకే బోధ పడుతుంది.’’ అని హెచ్చరించేడు ప్రక్కనున్నాయన . సావధానంగా వింటే, ఆయన వేదంలా చదువుతన్నది వేదం కాదనీ, అవి తెలుగు పదాలేననీ అర్ధమై నవ్వి పోతాం.

అలాగే, కొన్ని శ్లోకాలు ఉంటాయి. తెలుగు సంస్కృత భాషా పదాలతో కూడిన మిశ్రమ భాషా రచన చేయడం కొందరికి సరదా. వాళ్ళ కదొక తుత్తి !

అలాంటివాటిని కొన్నింటిని చూదాం !

వృత్తింకల్పయ శక్తి లేదు అయితే జీవేకథం త్వత్పురే ?
ఉంటే ఉండుమి కిం,నీల్లు బహుశ: పీత్వా సుఖాదత్రవై
పోతే పో బహువత్సరాదహమిహస్థాస్యామి హే సత్ప్రభో !
ఏతే యాచక రాజ భాషిత మిదం భాషాద్వయం పాతున:

ఓ బిచ్చగాడు రాజుని ఏదేనా పని చూపించమని కోరేడు. అప్పుడు రాజూ, ఆ బిచ్చగాడూ తెలుగూ సంస్కృత భాఫా పదాలతో మాట్లాడేసుకుంటున్నారు.

‘‘ ఏదేనా పని చూపించవయ్యా, రాజా !’’ ‘‘నా వల్ల కాదురా’’ ‘‘ మరెలా బతకడం ?’’ ‘‘ఉంటే ఉండు. పోతే పో !’’ ఇలా సాగింది వారి సంభాషణ.

మరొకటి -

కాచీ కాచి మునక్కాయ
కాయవే పొట్టి కాకరా
కాయానాం వంగ పిందానామ్
కూరానాం గుజ్జు పచ్చడీ !

మునక్కాయ ముక్కలూ, పొట్టి కాకరా, లేత వంకాయలూ వేసి చేసే గుజ్జు పచ్చడి ఉభయభాషా పదశోభితమై చవులూరిస్తోంది కదూ!

భామా కలాపంలో హాస్యగాడు చదివే ఈ తెలుగు సంస్కృత పదాలతో కూడిన శ్లోకం చూడండి:

ఆదౌ దొమ్మరి మంగి గర్భజననం దాసీ గృహేవందనం
మాయామంగలి పోతిగాడి మరణం ఏటొడ్డు రామాయణం
పశ్చాత్ చాకలి పోలి తోడి జగడం పాపౌఘ నిర్వాపణం
కాకచ్ఛేదన కల్మషాపహరణం ఏతన్హా భారతం.

ఇలాంటి ఉభయ భాషా విన్యాసంతోనే ఉన్న ఈ ప్రార్ధనా శ్లోకం చూడండి:

గణానాం గణనాథశ్చ గణపాత్రస్తథైవచ
కాట్రా కాశీ కొంకి నక్కా, గార్ధభాయ నమో నమ:

అక్కలమ్మా మహామారీ మాతంగీ పరమేశ్వరీ
ఎన్నెమ్మాయ నమస్తుభ్యం ఆశీరమ్మాయ నమోనమ:

కామినీ చైవ గాంధారీ లంఖిణీచైవ తాటకీ
భూతప్రేత నివాసించ బూర్లె గంపాయ తే నమ:

పగటి వేషగాళ్ళు వేదంలా స్వరయుక్తంగా వల్లించే ఉభయ భాషా పదాల గారడీ చూడండి:

అంబలి ముఖ్యంత్వలంకారం కంబలి ముఖ్యంతు భోజనం
రాట్టం ముఖ్యంతు నారీణాం దుక్కి ముఖ్చంతు బ్రాహ్మణ:
బాకీ సారా గ్లాసు మనసా సర్వాదాయం యథాక్రమం

తిన్నట్టే తిన్నకున్నట్టే ఉన్నవారికి మాడటం
మాట మాట ప్రసంగేన దబ్బుదిబ్బుస్తథైవచ
పాదరక్ష ప్రయోగన శరీరం పీడ వర్జయేత్ .


మరొకటి చూడండి:

తిండికైతే పదిమంది వసంతి
తండులాలు గృహమందు వసంతి
కుండ బొచ్చెలు పరం విలసంతి
రండ నా కొడుకులెల్ల హసంతి

కవిగారి ఇంట దరిద్రం ఇలా ఉంది మరి !

చివరగా ఇంకొకటి ...

క్షుధాతురాణాం నవుడిర్నవుడక:
అర్ధాతురాణాం నచెల్లిర్న చెల్లక:
నిద్రాతురాణాం నమెట్టర్న పల్లం
కామాతురాణాం న ముసిలిర్న పిల్ల:

ఇది కామాతురాణాం న రుచిర్న పక్వ: ... అనే శ్లోకానికి వికట కవి చేసిన వెటకారం. ఆకలితో ఉన్నవాడికి ఉడికిందో లేదో కూడా అక్కర లేదు. దరిద్రుడు తనకిచ్చిన రూక చెల్లినదో, చెల్లనిదో కూడా చూసుకోడు. కూరుకు ముంచు కొస్తున్నవాడు మెట్ట పల్లాలు చూసుకోడు. ఇక, కామాంధుడికి పడుచుదయినా, ముసలిదయినా ఒకటే.

లోగడ కథా మంజరిలో తెలుగు, ఇంగ్లీషు పదాలు కలగాపులగం చేస్తూ కవులు రాసిన కొన్ని పద్యాలను ఉంచాను.

చూడాలనిపిస్తే ఆ టపా ఇక్కడ నొక్కి చూడండి. ఓ పనైపోతుంది.





19, జూన్ 2011, ఆదివారం

నీకంత సీన్ లేదు !!

‘‘ తాడిని తన్నే వాడు ఒకడుంటే, వాడి తల తన్నే వాడు వేరొకడు ఉంటాడు’’ అనే సామెత తెలిసినదే కదా !

అందుచేత, ఏదో సాధించేసాం అను కోవడం , విర్రవీగి పోవడం సరికాదు. ఎంత ఎదిగినా , కొంత ఒదిగి ఉండడం మంచిది. లేక పోతే ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అని దులపరించి పారేసే ప్రమాదం ఉంది.

ఈ చాటు పద్యాలు నాలుగూ చూడండి:


ఱంతుల్ మానుము కుక్కుటాధమ ! దరిద్ర క్షుద్ర శూద్రాంగణ
ప్రాంతో టాఖల మూల తండుల కణ గ్రాసంబు చే గ్రొవ్వి దు
దర్దాంతాభీల విశేష భీషణ ఫణాంతర్మాంసన సంతోషిత
స్వాంతుండైన ఖగేంద్రుని కట్టెదుట నీ జంఝాటముల్ సాగునే ?

ఈ పద్యం పెద్దన గారిదిగా ప్రసిద్ధం. కాగా, ఈ పద్యం శ్రీనాథునిదిగా కూచిమంచి తిమ్మకవి తన లక్షణసారసంగ్రహంలో పేర్కొన్నాడు.

ఓ అధమ కుక్కుటమా ! నీ తైతక్కలు ఇక చాల్లే ...దరిద్రగొట్టు తావుల్లో, చెత్తల్లో, పెంట కుప్పల్లో ఎంగిలి మెతుకులు ఏరుకుని తింటూ బలిసిన నువ్వెక్కడ ? కేవలం భీకరమయిన సర్పాల పడగలోని మాంసాన్ని తిని తృప్తి పడే ఖగరాజు ఎదుట నీ మిడిసిపాటు చెల్లదులే !


మరో పద్యం చూడండి:


స్థాన విశేషమాత్రమున తామరపాకున నీటి బొట్ట ! నిన్
బూనిక మౌక్తికంబనుచుఁ బోల్చిన మాత్రనె యింత గర్వమా !
మానవతీ శిరోమణుల మాలికలయందును గూర్ప వత్తువో ?
కానుకలియ్య వత్తువో, వికాసము నిత్తువొ , విల్వ దెత్తువో ?!

ఈ పద్యం ముక్కు తిమ్మన గారిదని చెబుతారు.

స్థాన విశేష మాత్రం చేత మాత్రమే కొందరకి, లేదా కొన్నింటికి గొప్పతనం చేకూరుతూ ఉంటుంది. తామరపాకు మీద నీటి బొట్టు ముత్యంలా మెరిసి పోతూ ఉంటుంది. అంత మాత్రం చేత అది మంచి ముత్యం ఎన్నటికీ కానేరదు కదా !
కవి అదే చెబుతున్నాడు : ఓ తామరపాకు మీద నీటి బొట్టూ ! నువ్వు తామరపాకు మీద నిలచి ఉండడం చేత నిన్ను ముత్యంతో పోలుస్తూ ఉంటారు. అది స్థానవిశేషం వల్ల వచ్చిన గొప్పతనం. అంత మాత్రం చేత నీకు ఇంత గర్వం తగదు సుమా ! నువ్వేమయినా లలనల శిరోరత్నాలలో కూర్చడానికి పనికి వస్తావా ? ఎవరికయినా కానుకగా ఇవ్వడానికి తగుదువా ? నీకు వికాసమూ లేదు, విలువా లేదు!

అంతే కదా, నీటి బొట్టు తామరపాకు మీద ఉన్నంత సేపే ముత్యంలా మెరిసి పోతూ ఉంటుంది. స్థానభ్రంశం చెందిందా, యిక దాని పని అంతే. వొట్టి నీటి బొట్టే. కదా.

మరో పద్యం చూడండి:



తక్కక నేల ముట్టెగొని త్రవ్వగ నేర్తునటంచుఁదాకుతా
వొక్కటి జాతియందు మదమెక్కకు బుద్ధిని వెఱ్ఱిపంది ! నీ
వెక్కడ ! యాది ఘోణియన నెక్కడ ! యద్రి సముద్రదుర్గ భూ
ర్భాక్కు తలంబు నొక్క యరపంటినె మింటికినెత్త నేర్తువే ? !

ఓ వెఱ్ఱి వరాహమా ! నేలను ముట్టెతో త్రవ్వడంలో నాకు నేనే సాటి అంటూ గొప్పలు పోతూ గర్విస్తున్నావు.
నువ్వెక్కడ ? ఆదివరాహ మెక్కడ ? సముద్ర గర్భంలోని భూమిని ఒక కోరతో అవలీలగా ఆ తొలి కిటి మీదికి ఎత్తలేదూ ! ఆ ఆది వరాహం ముందు నువ్వెక్కడ, నీ ప్రతాపమెక్కడ !


ఈ పద్యం భట్టు మూర్తిదిగా చెబుతారు.

తమకు లేని పోని గొప్ప తనాన్ని ఆపాదించు కుంటూ. అహంకరించే అల్పులను అభిశంసిస్తూ కవులు చెప్పిన పద్యాలు చూసాం కదా.

సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని నిలదీస్తూ శ్రీనాథ కవి చెప్పిన ఒక చాటువు కూడా చూదాం. గమనిక: ఇక్కడ అల్పత్వమూ లేదు. అభిశంసనా లేదు. చమత్కారంగా కవి పరమ శివుని ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అంటున్నాడు. అంతే.


గరళము మ్రింగితి ననుచున్
పురహర ! గర్వింప బోకు, పో,పో,పో ! నీ
బిరుదింక గాన వచ్చెడి
మెఱసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ !

ఆ నాడు దేవాసురులు సముద్ర మధనం చేసేటప్పుడు ఉద్భవించిన విషాన్ని పరమశివుడు స్వీకరించాడు. లోకోపద్రవం నివారించాడు. అందుకే నీలకంఠుడిగా నామాంతరం పొందాడు.

ఓ పురహరా ! విషాన్ని మ్రింగాను కదా అని గర్విస్తున్నావు. చాలు . చాల్లే ! రేనాటి జొన్న మెతుకులు తిని చూడు నీ గొప్పతనమేమిటో తెలిసి వస్తుంది ! అని దీని భావం. రేనాటి జొన్న కూడు నోట పెట్టరానిదిగా ఉంటుందని కవి చమత్కారం.

ఇలాంటిదే శ్రీనాథుని మరో చాటువు చూడండి:


ఫుల్ల సరోజ నేత్ర ! యల పూతన చన్నుల చేదుద్రావి, నా
డల్ల, దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల ? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగ మ్రింగుము నీ పస కాననయ్యెడిన్ !

ఇది పలనాటి జొన్న కూడు గురించినది. కృష్ణా ! ఆనాడు రక్కసి పూతన విషపు చనుబ్రాలు త్రాగాననీ, అల్లప్పుడు విషాన్ని మ్రింగాననీ, గొప్పలు పోతున్నావు. చింతాకుతో కూడిన ఉడుకు బచ్చలి కూరను జొన్న కూటితో ఒక ముద్ద నోటిలో పెట్టుకో ! నీపస ఏమిటో తెలిసి పోతుంది.

ఇదీ, నీకంత సీన్ లేదు ! అని కుండ బద్దలు కొట్టిన పద్యాల కథ .





16, జూన్ 2011, గురువారం

ప్రియురాలు ఎంత కఠినం !


ప్రియురాలి సొగసు చూడ తరమా ? అపురూప లావణ్యవతి. ముగ్ధ మోహన రూపం. ఒప్పుల కుప్ప. ఒయ్యారి భామ.

లోకోత్తర సౌందర్యం. బాపూ బొమ్మ....

ప్రియుడు ప్రియురాలి సౌందర్యం చూసి పరవశించి పోయాడు. ‘నిన్ను చూడకుండాఒక్క క్షణం నేనుండ లేను ’ అనడాలూ, ‘నువ్వు నాకు లభించడం నా అదృష్టం’ అనడాలూ, ‘ దేవ కన్యలు కూడా నీ కాలి గోటికి సరిపోరు ’ అని పొగడడాలూ, ‘అచ్చం బాపూ బొమ్మలా ఉన్నావు సుమా !’’ అని మురిసిపోవడాలూ, సినిమాలూ, షికార్లూ, పార్కులూ, షాపింగులూ,రెండు స్గ్రాలతో ఒకే కొబ్బరి బొండమో, కూల్ డ్రింకో తాగడాలూ ... కను రెప్పలు బరువుగా వాలి పోవడాలూ, ఛాతీలు గర్వంతో పెరిగి పోవడాలూ , కలల విహారాలు చెయ్యడాలూ, బేంకు బేలన్సు తరిగి పోవడాలూ ...

అన్నీ అయ్యేక ప్రియుడుకి ప్రియురాలి అసలు స్వరూపం తెలిసి వచ్చింది. ఇలా వాపోతున్నాడు:

ఈ చాటు పద్యం చూడండి:

పల్లవము బూని సకియ మేనెల్ల జేసి
సద్మగర్భుడు లాదీసి వా గుడిచ్చి
మూ విసర్జించి యప్పుడప్పూవు బోడి
డెంద మొనరించె సందేహమందనేల ?

ఆ బ్రహ్మ దేవుడు ఈమె శరీరాన్ని లేత చిగురాకులతో తయారు చేసాడు. అందుకే అంత మృదుత్వం ! అంత సౌకుమార్యం !

అంత వరకూ బాగుంది. కానీ అక్కడే పాడు బ్రహ్మ దేవుడు పెద్ద కిరికిరీ చేసాడు ...

అదేమంటే ...

పల్లవము అనే పదంలో ‘‘ లా ’’ తీసేసాడు. దానితో ‘‘ ల్ల’’ అనే అక్షరం ఎగిరి పోయింది.

తర్వాత వా గుడిచ్చాడుట ! ‘‘ వ’’ కి గుడి ఇస్తే ‘‘ వి ’’ అయింది !

అక్కడితో ఊరుకోకుండా ‘‘ ము’’ అనే అక్షరాన్ని విడిచి పెట్టాడుట !

సరే, మరి ఇప్పుడు ఇన్ని తీసి వేతలూ, కలపడాలూ, జరిగేక, ‘‘ పల్లవము ’’ అనే పదంలో మిగిలినదేమిటీ ?!

‘‘ పవి’’ అనే పదం మిగిలింది ! ‘‘ పవి ’’అంటే ఇంద్రుని వజ్రాయుధం !

ప్రియురాలి తనువూ, మనసూ అంత కఠినం అన్నమాట !




2, జూన్ 2011, గురువారం

కంట తడి పెట్టించిన కథల నామిని ... ఒక నిందా రూప స్తుతి



ఈ నెల ( మే 2011 ) పాల పిట్ట మాస పత్రిక చదివేరా?

అందులో కంట తడి పెట్టించిన కథల నామిని శీర్షికన ఖమ్మం నుండి శ్రీధర్ రాసిన ‘‘నామిని, నెంబర్ వన్

పుడుంగి ’’ పుస్తకం మీద ఒక సమీక్షా వ్యాసం ప్రచురించారు.

నిందా స్తుతి రూపంలో వచనంలో వచ్చిన ఇంత గొప్ప సమీక్షా వ్యాసం ఇటీవల నేను చదివి ఉండ లేదు.

అమ్మీ, పెబోవతీ ... అనే సంబోధనతో మొదలై

యెట్టా యేగుతున్నావమీ, ఈ నా బట్టగానితోని, పెద్ద పుస్తకం రాసి కాపరాన్ని దేశమంతా రచ్చ రచ్చ చేసినాడు

గదమ్మీ ... అనే వాక్యాలతో నామిని కొత్త పుస్తకం ’’ నామిని, నెంబర్ వన్ పుడుంగి‘‘ మీద రాసిన నిందా రూప స్తుతి చివరి అక్షం వరకూ ఉగ్గబెట్టి చదివిస్తుంది.

పచ్చ నాకు సాక్షిగా , సినబ్బకతలు, ముని కన్నడి సేద్యం, చదువులా ? చావులా? తో పాటు నామిని రాసిన ఈ కొత్త పుస్తకం ‘‘ నామిని, నెంబర్ వన్ పుడుంగి’’ వెంటనే కొనుక్కుని చదివేలా చేస్తుంది.

పుస్తకం చదివేక, నామిని పుడుంగి అవునో కాదో తేల్చు కోవలసినది మనమే.

పాలపిట్ట మాస పత్రిక వివరాలు:

పాలపిట్ట,

ప్లాట్ నె.3, ఎంఐ.జి - 2, బ్లాక్ -6,

ఏ.పి.హెచ్.బి. , బాగ్ లింగంపల్లి,

హైదరాబాద్ - 500 044

ఫోన్: 040 - 27678430

సెల్: 9848787294

మెయిల్: palapittabooks@gmail.com



29, మే 2011, ఆదివారం

కామమ్మ కథ


చిన్ని పుస్తకం ... పెద్ద మనసు ...

నా పుస్తకాల గూటి లోకి, గువ్వ పిట్టలాగ ఒక చిన్న పుస్తకం వచ్చి చేరింది. పుస్తకం పేరు కామమ్మ కథ. వెల పన్నెండణాలు. రచయిత ఎవరో ఎక్కడా లేదు. చుక్కల సింగయ్య శెట్టి, యన్.వి.గోపాల్ అండ్ కో, మదరాసు వారి ప్రచురణ.

ముందుగా ఈ పుస్తకం నాకు దొరికిన వైనం చెబుతాను.

విజయ నగరం జిల్లా పార్వతీ పురం మా స్వగ్రామం. నేను పుట్టింది అక్కడే. హెచ్.స్. ఎల్.సీ వరకూ నా చదువు అక్కడే.

ఆ రోజులలో ఏ పుస్తకం కంట బడినా ఆత్రంగా చదివే వాడిని. ఇంటికి రెండు వార పత్రికలూ, ఒక మాస పత్రికా వచ్చేవి. ఊళ్ళో ఒక మనిసిపల్ లైబ్రరీ, మరో శాఖా గ్రంథాలయం ఉండేవి.

నా పుస్తక దాహార్తి అక్కడే తీరేది. ఇక మా చిన్న ఊళ్ళో రాధా గోవింద పాఢి గారని ఒక ఒరియా వ్యక్తి ఉండే వారు. తెలుగు మాట్లాడడం వచ్చు. కూడ బలుకుకుని చదివే వారేమో కూడా. రాయడం వచ్చేది కాదను కుంటాను. వారికి ఒక ఫొటో స్టూడియో ఉండేది. ఆ పనులతో తెగ బిజీగా ఉండే వారు. దానితో పాటు ఆయన ఆ రోజులలో వచ్చే అన్ని దిన, వార , పక్ష, మాస పత్రికలు అన్నింటికీ కూడా ఏజెంటుగా ఉండే వారు. మెయిన్ రోడ్డులో వారి ఫొటో స్టూడియో కమ్ పుస్తకాల షాపు నన్ను అమితంగా ఆకట్టు కునేది. ఎక్కవ గంటలు అక్కడే గడిపే వాడిని. వారు మా కుటుంబ మిత్రులు కూడానూ. పేపర్లూ, పీరియాడికల్స్ తో పాటు ఆయన ఎన్నెన్నో మంచి పుస్తకాలు కూడా అమ్మకానికి తెప్పించే వారు. జిల్లా వ్యాప్తంగా ఉండే పాఠశాలలకీ, ఆఫీసు లైబ్రరీలకీ వాటిని విక్రయించే వారు. మంచి పుస్తకాలు తెప్పించడం కోసం వారు ఒక పద్ధతి అవలంబించే వారు. పుస్తకాల ఏజెంటుగా వారికి ఎందరో రచయితలతోనూ, ప్రముఖ సంపాదకులతోనూ మంచి పరిచయాలు ఉండేవి. వారి షాపులోనే నేను చాలా మంది గొప్ప రచయితలను చూసేను. విద్వాన్ విశ్వం, రాంషా వంటి సంపాదకులనూ చూసేను. సోమ సుదర్ గారిని కూడా అక్కడే చూసినట్టు గుర్తు. పాఢి గారు ఆయా రచయితలనూ, సంపాదకులనూ కలిసినప్పుడు తెలుగులో ఏవి మంచి పుస్తకాలంటూ కేటలాగులు ఇచ్చి మరీ వారినుండి వివరాలు సేకరించే వారు. ఆ క్రమంలో నేను కూడా నాకు తోచిన గొప్ప పుస్తకాల గురించి చెప్పే వాడిని. ఈ విధంగా తనకు తెలుగు సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం లేక పోయినా అమ్మకం కోసం ఎన్నో గొప్ప పుస్తకాలను తెప్పించే వారు. చెంఘిజ్ ఖాన్, అతడు ఆమె, నేరము శిక్ష , పెంకుటిల్లు, సమగ్రాంధ్ర సాహిత్యం సంపుటాలు, లత , రావి శాస్త్రి, ముళ్ళపూడి, బీనాదేవి, గోపీచంద్, తిలక్, శ్రీ.శ్రీ, మధురాంతకం రాజారాం, మొదలయిన గొప్ప గొప్ప రచయితల రచనలు తెప్పించే వారు. అనువాద సాహిత్యమయితే లెక్కే లేదు. శరత్ సాహిత్యమంతా ఉండేది.

ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే, వారి షాపుకి వచ్చే వార, మాస పక్ష పత్రికలన్నీ ఇలా బంగీ రాగానే ఒక కాపీ నాకు చదువుకోమని ఇచ్చే వారు. విజయ,నీలిమ , యువ, జ్యోతి వంటి మాస పత్రికలు, ఆంధ్ర పత్రిక, ప్రభ వంటి వార పత్రికలు షాపుకి రాగానే అమ్మకానికంటె ముందుగా నాకు ఇచ్చేసే వారు. ఏ రోజయినా, నేను షాపుకి వెళ్ళక పోతే, ఆ రోజు వచ్చిన కొత్త పత్రకలను మా ఇంటికి పంపించి వేసే వారు. వీటితో పాటు, అమ్మకానికి వచ్చిన నవలలు, కథా సంపుటాలు, సాహిత్య గ్రంథాలు అన్నింటి ప్రతులు ఒక్కొక్కటి చొప్పున నాకు చదువుకోడానికి అంద చేసే వారు. వీలయినంత వేగిరం, అంటే, తిరిగి ఆయా పుస్తకాలను అమ్ముకునేందుకు వీలుగా ఇచ్చి వేసే నియమం పెట్టే వారు. అలాగే మరో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, ఏ పుస్తకమూ నలగ కూడదు. చిరగ కూడదు.

ఈ నిబంధన కూడా చాలా సున్నితంగా చెప్పే వారు. నేనెక్కడ నొచ్చు కుంటానో అని తెగ బాధ పడి పోయే వారు కూడా.

హైస్కూలు చదువు చదువుకుంటూ, పైసా సంపాదన లేని నా బోటి వాడికి ఆ రోజుల్లో అన్ని పత్రికలు, విలువైన పుస్తకాలు, గొప్ప సాహిత్య గ్రంథాలు అన్నీ కేవలం ఉచితంగా చదివే వీలు కలగడం నా అదృష్టం కాక మరేమిటి చెప్పండి ?

నా పుస్తక దాహార్తిని తీరుస్తూ, నేనొక రచయితగా ఎదిగే క్రమంలో ఎంతగానో దోహద పడి, చేయూత నందించిన ఆ దయామయుని రుణం ఎలా తీర్చు కోగలను ?

ఇంతకీ ఈ కామమ్మ కథ అనే పుస్తకం నాకు ఎలా వచ్చి చేరిందో ఇంకా చెప్పనే లేదు కదూ ?

సరే, అలాగ, నా హైస్కూలు చదువు పూర్తయి, తరువాత విజయ నగరంలో భాషా ప్రవీణ చదువు నాలుగేళ్ళూ గడిచే వరకూ వారి దయ వల్ల అసంఖ్యాకంగా పుస్తకాలు ఉచితంగా చదివేను. చదువు ముగిసి, తెలుగు పండితునిగా ఓ చిరుద్యోగం లోకి ప్రవేశించాక కూడా మీరు ఊహించ లేనంత కమీషను డిస్కవుంట్ పొందుతూ వారి నుండి ఎన్నో చాలా మంచి పుస్తకాలు కొనుక్కున్నాను. చాలా వరకూ అరువు. నెలల తరబడి ఆ వాయిదాలు కడుతూ ఉండే వాడిని. నేనంటే వారికి ఎంత అభిమానమో. ఆ పుస్తకాలు చదివి నేను ఏదయినా పుస్తకం గురించి మెచ్చుకుంటూ పొగిడితే అతనూ పొంగి పోయే వారు. అప్పటి వారి చూపుల్లో అన్నం వడ్డించే అమ్మ కున్నంత ఆదరణ ఉండేది.

ఇంకా ఈ పుస్తకం నాకు ఎలా వచ్చి చేరిందో చెప్పనే లేదు కదూ.

మరింక విసిగించను లెండి. వారిచ్చిన ఉచిత పుస్తకాలతో నన్ను నేను ఉన్నతీకరించు కుంటూ ,ఇలా ఓ ముప్ఫయ్ ఏళ్ళు గడిచేక, నేను ఉద్యోగ రీత్యా మా ఊరికి దూరంగా ఉండి పోవలసి రావడం చేత వారిని ఒకటి రెండు సార్లు తప్ప మరి కలియడం జరుగ లేదు. వారి గురించిన వివరాలూ తెలియ రాలేదు.

ఉద్యోగ విరమణ చేసాక, మా అన్నగారితో పాటు మళ్ళీ మా ఊరు వెళ్ళాను. అప్పటికి అక్కడ మాకు ఇల్లూ, పొలాలూ అన్నీ చెల్లి పోయాయి. తెలిసిన వారు కూడా కొద్ది మందే మిగిలేరు. చాలా ఏళ్ళ అనతంరం మా ఊరు చూడాలనే కుతూహలంతో నేనూ మా అన్న గారూ అక్కడికి వెళ్ళాం.

మా పుస్తకాల మిత్రుడు రాధా గోవింద పాఢి గారిని చాలా సంవత్సరాల తరువాత చూడాలని వారింటికి వెళ్ళాం.

ఆయన లేవ లేని స్థితిలో మంచం మీద ఉన్నారు. మాట కూడా సరిగా రావడం లేదు. అప్పటికి పది, పదిహేను ఏళ్ళ క్రిందటే ఫొటో స్టూడియో, పుస్తకాల షాపూ మూసి వేసారుట. ఆయన బహు కుటంబీకుడు. ఆరుగురు కూతుళ్ళు. ఒక కొడుకు. అందరికీ వివాహాలు చేసారు. ఆర్ధికంగా ఇబ్బంది ఏమీ లేదు. శరీరం సహకరించక ఫొటోల బిజినెస్సూ, పుస్తకాల షాపూ మూసి వేసారుట. నాకీ వివరాలేవీ తెలియదు. తెలుసు కోడానికి కనీస ప్రయత్నం కూడా చెయ్య లేదేమో. ఉద్యోగం, పిల్లలు, వారి చదువులూ, బదిలీలూ, అమ్మాయిల పెళ్ళిళ్ళూ, పురుడు పుణ్యాలూ ... వీలు చిక్క లేదని సిగ్గు లేకుండా చెప్పడానికి కావలసినన్ని కారణాలు ఉన్నాయి.

మా రాక చూసి ఎంతగానో సంతోషించారు. నన్ను చూసి కన్నీళ్ళు పెట్టు కున్నారు. వారు పడుకున్న మంచం క్రిందకి సైగ చేసి చూపించారు. వంగి , అక్కడ ఏముందా అని చూసి, ఒక పెద్ద పుస్తకాల కట్ట ఉంటే దానిని ముందుకు లాగేను. దళసరి అట్టతో వాటిని పేక్ చేసి ఉన్నారు. వాటి మీద జోగారావు గారికి అని వచ్చీ రాని తెలుగులో రాసి ఉంది. ఉద్వేగం ఆపుకో లేక పోయాను. కళ్ళంట నీళ్ళు ఆగ లేదు. ఎప్పుడో, మామధ్య రాక పోకలు ఆగి పోయినా, దూరాలు పెరిగి పోయినా, వారు పుస్తకాల షాపు మూసి వేసే రోజులలో నాకు ఇవ్వడానికి కొన్ని పుస్తకాలు పదిలంగా పేక్ చేసి ఉంచారుట. ఆ తరువాత వారిని నేను కలవడానికి నాలుగు దశాబ్దులకి పైగా పట్టింది. అయినా, వారి మంచం క్రింద నా పేరు రాసి ఉంచిన ఆ పేకెట్ అలాగే పదిలంగా ఉంది. చెక్కు చెదరని వారి అభిమానం లాగా. తరగని ప్రేమలాగా.

వారి గురించిన వివరాలు ఎప్పటి కప్పుడు తెలుసు కోలేక పోయిన నా అల్పత్వం స్ఫురించి సిగ్గు కలిగింది.

వారు నాకోసం దాచి ఉంచిన ఆ పుస్తకాల కట్టలో సి.నా.రె. గారి ఆధునికాంధ్ర కవిత్వం , సీతా దేవి మట్టి మనుషులు, కుటుంబరావు చదువు, రావి శాస్త్రి గారి నిజం నాటకం, రక్తాక్షరాలు, ఏడుతరాలు, ఊహాగానం ...లాంటి మంచి మంచి పుస్తకాలు చాలా ఉన్నాయి. వాటితో పాటు ఎలా వచ్చి చేరిందో ఈ కామమ్మ కథ పుస్తకం కూడా ఉంది.

నా పుస్తకాల గూటి లోకి గువ్వ పిట్టలా వచ్చి చేరి పోయింది.

ఇదీ, కామమ్మ కథ పుస్తకం నా దగ్గరకు వచ్చి చేరిన వైనం.

అయితే, ఈ పుస్తకంలో ఏముందో కూడా చెప్పాలి కదూ. నిజానికి అంత గొప్పగా దాన్ని గురించి చెప్పడానికి లేదు.

శుభము కామమ్మ శుభము కామమ్మా కామమ్మ

శుభ మొంది సామర్ల కోటలో నమ్మా కామమ్మ ... అంటూ పాట రూపంలో సాగి పోయిన నలభై పుటల చిన్ని పుస్తకం ఇది.

సుకపట్ల లక్ష్మయ్య, వెంకమ్మ దంపతుల కుమార్తె కామమ్మ. తల్లి దండ్రులు చిన్నప్పుడే పోవడంతో పిన తండ్రి రామన్న ఇంట అల్లారు ముద్దుగా పెరిగింది. బాల్యం వీడక ముందే తిరుపతి మారయ్యతో వివాహం జరిగింది. పెళ్ళినాటికి భర్త కలక్టరు దొర దగ్గర నెలకు మూడు వరహాల జీత గాడు. దొరతో ఎందుకో మాటా మాటా వచ్చి, కొలువు చాలించు కున్నాడు. తరువాత తల్లి ఎంత వారించినా వినకుండా చెన్నపట్నం వెళ్ళి అక్కడ దొరల దగ్గర మంచి కొలువునే సంపాదించు కున్నాడు. కొన్నాళ్ళకి ఇంటి మీద మనసు పుట్టి, నాలుగు మాసాలు సెలవు పుచ్చుకుని, ఇంటికి తిరిగి వచ్చేడు. చిత్రమేమిటంటే, వివాహమయినా, అప్పటికింకా భార్య కామమ్మ కాపురానికి రానే లేదు. పెళ్ళవుతూనే కొలువులకి వెళ్ళి పోయేడు మరి. సరే, ఇంటికి చేరిన మారయ్య తీవ్రంగా జబ్బు పడ్డాడు. మరి కోలుకో లేదు. కామమ్మను చూడాలని కోరేడు. కామమ్మ సారె, సరంజామాతో తొలిసారిగా అత్తింట అడుగు పెట్టింది. తొలి సారి చూపు మంచాన పడిన భర్తను. అదే కడ సారి చూపు కూడా అయింది. తరువాత కామమ్మ జీవితం అనేక మలుపులు తిరిగింది. ఎన్నో కష్టాలు పడింది. ఎందరికో తలలో నాలుకగా మెలిగింది. చివరలో కామమ్మ మరణంతో ఊరు ఊరంతా విలపించింది. ఊరి ప్రజలు కామమ్మకు గుడి కట్టి గ్రామ దేవతగా ఆరాధించడం మొదలు పెట్టారు.

స్థూలంగా ఇదీ కామమ్మ కథ. పాట రూపంలో ఉన్న ఈ కథను గాయకులు అప్పట్లో గానం చేసే వారేమో తెలియదు. రచయిత పేరు ఎక్కడా కానరాక పోవడం వల్ల ఈ పాట పరంపరగా సామర్ల కోట ప్రాంతంలో పాడు కునే వారేమో కూడా తెలియదు.

ఈ పుస్తకం గురించి పరిచయం చేయడం ఎందుకయ్యా అని మీరడుగ వచ్చును.

చిన్ని పుస్తకమే కావచ్చును. కానీ, అది నా దగ్గరకు చేరిన వైనం నా వరకూ చాలా గొప్పది. విలువైనది.

ఒక తియ్యని ఙ్ఞాపకం. ఒక మరపు రాని అనుభూతి. ఒక కన్నీటి తరంగం. ఒక మధుమయిన హృదయ స్పందన.

ఈ చిన్ని పుస్తకం కామమ్మ కథను చూస్తూ ఉంటే, నాకు నా మిత్రుని చూసి నట్టే ఉంటుంది. పలకరించి పులకరించి పోతున్నట్టుగా ఉంటుంది...

నా పుస్తకాల గూటిలో ఆ గువ్వ పిట్ట మంద్రంగా కువలాడుతూనే ఉంటుంది ...

అప్పటికీ ... ఇప్పటికీ ... ఎప్పటికీనూ ...

22, మే 2011, ఆదివారం

హౌస్ ఫుల్ ... కథ


అమృత మథనం బ్లాగులో అంట్లు తోము కుంటున్న అక్కినేని నాగేశ్వర రావు, మా సికింద్రాబాద్ కథలు - 1 చదివేక,
( ఇక్కడ నొక్కి ఆ టపా చూడండి. ) సినిమా వాళ్ళ మీది వెర్రి వ్యామోహంతో, వారి ఫాన్సుమంటూ తిరుగుతూ తమ జీవితాలను పాడు చేసు కునే వారిని చూస్తే ఎవరికయినా బాధ కలగక తప్పదు. వారి పాట వారిది కాదు. వారి వీరోచిత కృత్యాలలో నిజం లేదు. వారి హీరోయిజంలో నిజాయితీ లేదు. కాని, ఆ హీరోలను ఆకాశానికి ఎత్తేస్తూ వాళ్ళని దేవుళ్ళలాగా చూడడం, వారి కోసం తమ జీవితాల్లో నిప్పులు పోసు కోవడం, మన దౌర్భాగ్యం.

బుద్ధా మురళి గారి ఈ టపా చూసాక, నేను ఇదే అంశం మీద 1982 లో విజయ మాస పత్రికలో రాసిన ఒక కథను మీతో పంచు కోవాలనిపించింది.

కథ చూడండి ...



కథ పెద్ద అక్షరాలతో కనబడడం కోసం కథ మీద నొక్కండి. పేజీలు త్రిప్పడానికి పేజీకి కుడి చేతి అంచు మధ్యలో ఉన్న గుర్తు మీద నొక్కండి. ( తెలియని వారి కోసం ఈ వివరణ.)

21, మే 2011, శనివారం

అవునా ? అదన్న మాట సంగతి !


మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాల మూల వాక్యాలు తెలుసు కోవాలని అనిపించడం సహజం కదా. అలాంటి వాటిని కొన్నింటిని చూడండి:

ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:

ధర్మో రక్షతి రక్షిత:

సత్య మేవ జయతే

అహింసా పరమో2ధర్మ:

ధనమూల మిదం జగత్

జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి

కృషితో నాస్తి దుర్భిక్షమ్

యథా రాజా తథా ప్రజా

పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:

శత శ్లోకేన పండిత:

శతం విహాయ భోక్తవ్యం

అతి సర్వత్ర వర్జయేత్

బుద్ధి: కర్మానుసారిణీ

వినాశ కాలే విపరీత బుద్ధి:

భార్యా రూప వతీ శత్రు:

స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

వృద్ధ నారీ పతి వ్రతా

అతి వినయం ధూర్త లక్షణమ్

ఆలస్యం అమృతం విషమ్

దండం దశ గుణం భవేత్

ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?

ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?

ధర్మ ఏవో హతో హంతి
ధర్మో రక్షతి రక్షిత:
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్

ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !

సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.

అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్

అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన

ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ

ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.

అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.

చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.

రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !

రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.

పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

పుస్తకం, ఆడుది , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ.

శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:

వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.

విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.

శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్

వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.

అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్

విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడ్డాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడ్డాడు. అతి కామం చేత రావణుడు నాశన మయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.

సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !

న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా చూసామా ? అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.

ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:

అప్పుడు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.

ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !

అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.

అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.

ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్

ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా !

సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.

విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !

ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.

వీటిలో స్త్రీల విషయమై చెప్పిన వాటి విషయమై నాకూ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కాని. పూర్వులు చెప్పిన దానిని మార్చ రాదు కనుక , యథాతథంగా ఇచ్చాను. స్త్రీవాదులు కినక వహించరు గాక !

స్వస్తి.














14, మే 2011, శనివారం

రూపాయి ... పాయె ! ఏమై పోయింది చెప్మా ?


మా చిన్న తనంలో మా నరసింహం బాబాయి ఈ లెక్క చెప్పి, మమ్మల్ని జవాబు చెప్పమని అడిగాడు. మేం బిక్క ముఖాలు వేసేం.

ఈ వేసవిలో మీరు కూడా మీ పిల్లకాయలకి ఈ లెక్క చెప్పి, జవాబు చెప్పమని అడగండి.
ఏం చెబుతారో చూడండి:

ఇదిగో ఆ లెక్క:

రాముడు, భీముడు ఇద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళు తమ బెస్ట్ ఫ్రెండ్ సోముడి పుట్టిన రోజు కానుకగా ఏదేనా మంచి కానుక కొని ఇద్దామని బజారుకి వెళ్ళారు.

షాపులో ఒక మంచి బొమ్మని చూసి అదెంత అని, అడిగారు. అప్పుడు షాపు యజమాని లేడు. పని కుర్రాడు ఏభై రూసాయలు అని చెప్పాడు.

సరే అని రాముడు , భీముడు చెరో పాతిక రూపాయలూ ఇచ్చి, బొమ్మను కొన్నారు. వాళ్ళు ఆ బొమ్మను కొని ఇంటికి వెళ్ళాక, ఆ షాపు పని కుర్రాడు వచ్చి, వారికి మూడు రూపాయలు తిరిగి ఇచ్చి వేస్తూ ఇలా అన్నాడు : ‘‘ ఈ బొమ్మ నేను మీకు ఏభై రూపాయలకు అమ్మేను కదా. కానీ, మా యజమాని వచ్చి, దీని ధర ఏభై కాదని, నలభై అయిదు రూపాయలే ననీ, తిరిగి అయిదు రూపాయలు మీకు ఇచ్చి రమ్మన్నాడనీ చెప్పాడు. అయితే వచ్చే దారిలో తను ఆ అయిదు రూపాయలలో రెండు రూపాయి ఎక్కడో పారేసానని, అందు వల్ల వారికి మూడు రూపాయలే ఇస్తున్నాననీ అన్నాడు. అంతే కాక, తాను రెండు రూపాయలు పారేసిన సంగతీ, మూడు రూపాయలు మాత్రమే వారికి ఇచ్చిన సంగతి యజమానికి చెప్ప వద్దని కూడా బ్రతిమాలు కొన్నాడు.

రాముడు, భీముడు భలే, భలే అనుకుంటూ, వచ్చిందే చాలుననుకుని ఆ మూడు రూపాయలూ తీసు కున్నారు. షాపులో బొమ్మ కొనడానికి చెరో పాతికా ఇచ్చేరు కనుక, తిరిగి ముదరాగా వచ్చిన మూడు రూపాయలని కూడా వారిద్దరూ సమానంగా చెరి రూపాయిన్నర చొప్పునా పంచు కున్నారు.

ఇదీ కథ. ఇప్పుడు అసలు ప్రశ్ప ఏమిటంటే,

రాముడు భీముడు కలిసి షాపు పని వాడికి ఇచ్చిన మొత్తం చెరొక పాతిక - అంటే ఏభై రూపాయలు.

బొమ్మ అసలు ఖరీదు నలభై అయిదు.

పని వాడు తెచ్చినది ఐదు రూపాయలు.

వాడు పారేసానని చెప్పినది రెండు రూపాయలు.

రాముడు , భీముడు పంచు కున్నది - చెరొక రూపాయన్నర. మొత్తం మూడు రూపాయలు.

ఇప్పుడు చెప్పండి:

బొమ్మ అసలు ధర నలభై అయిదు . పంచు కొన్నది మూడు. పని వాడు పోగొట్టు కున్నది రెండు . మొత్తం ఏభై.

లెక్క సరి పోయిందే !

ఇప్పుడు ఇదే లెక్కని ఇలా చూడండి:

బొమ్మ కోసం మొదట రాముడు తన వాటాగా ఇచ్చినది : 25 రూపాయలు.
భీముడు తన వాటాగా ఇచ్చినది: 25 రూపాయలు
మొత్తం: 50 రూపాయలు. అయితే వారికి తిరగి పని వాడు తెచ్చి ఇచ్చినది మూడు రూపాయలు.

పని వాడు తెచ్చి ఇచ్చిన దానిలో రాముడి వాటాగా వచ్చినది రూపాయిన్నర. అంటే, రాముడి జేబు లోనుండి తీసి ఖర్చు చేసిన మొత్తం ఎంతన్నమాట ? ఇరవై మూడు న్నర రూపాయలు. అంతే కదా !

అలాగే, భీముడికి తన వాటాగా వచ్చిన రూపాయిన్నర కలిపితే వాడి వాటాగా ఖర్చయినది ఎంతన్నమాటా ?

ఇరవై మూడున్నర రూపాయలు. అంతే కదా ?

ఇప్పుడు రాముడు, భీముడు తమ జేబుల లోనుండి ఖర్చు చేసిన డబ్బు మొత్తం కూడితే ఎంతవుతోందీ ?

ఇరవై మూడున్నర + ఇరవై మూడున్నర = 47 రూపాయలు. కదా !

పని వాడు పారేసినది ఎంతా ? రెండు రూపాయలు. అంతే కదా ?

ఇప్పుడు రాముడు, భీముడుల అసలు నిఖర ఖర్చు 47 రూపాయలు + పని వాడు పారేసిన 2 రూపాయలు = 49 రూపాయలు.

అరే ! ఒక రూపాయి తక్కుఃవ వస్తోందే ? ఏమయి పోయింది చెప్మా ?!

టాఠ్ ! రాముడు ; భీముడుల నిఖర ఖర్చు 47 , పని వాడు పారేసినది 2 మరి వాడు ఇచ్చినది మూడు రూపాయలు కదా. దానిని కలపొద్దూ అంటారా ? సరే, మీ ఇష్టం. నాదేం పోయింది ? అలాగే కలపండి. కానీ అప్పుడు మొత్తం 52 అయి పోవడం లేదూ ? అదనంగా ఈ రెండు రూపాయలూ ఎక్కడి నుండి వచ్చేయి చెప్మా ?




మన రూపాయి ఎక్కడికీ పోలేదు. ఎక్కువా కాలేదు. ఇక్కడే ఉంది. కదూ !