31, ఆగస్టు 2011, బుధవారం

కంటికి నిద్ర లేదు !!


సంజయుడు రాయబారిగా పాండవుల వద్దకు వెళ్ళాడు. తిరిగి వచ్చాడు. అక్కడి విషయాలు తెలుసు కోవాలని ధృతరాష్ట్రుడికి మహా తొందరగా ఉంది. ఐతే , తిరిగి వచ్చిన సంజయుడు అతనికి ఏమీ అప్పుడు చెప్ప లేదు. బడలికగా ఉందన్నాడు. మరు నాడు ఉదయమే అందరూ సభదీరే వేళ అక్కడ జరిగిన విశేషాలన్నీ చెబుతానని తన నివాసానికి వెళ్ళి పోయాడు.

అంతే !

మరింక కురు మహారాజుకి కంటి మీద కునుకు పట్ట లేదు. అశాంతితో అటూ ఇటూ దొర్లు తున్నాడే కానీ నిద్ర వస్తేనా ?
విదురుడిని తన దగ్గరకి పిలిపించు కున్నాడు. నాలుగు మంచి మాటలు చెప్పి తన అశాంతిని దూరం చేయమన్నాడు.

విదురుడు రాజుకి చాలా నీతులు బోధించాడు. అక్కడక్కడా చురకలు కూడా వేసాడు.

బలవంతుఁడు పై నెత్తిన
బలహీనుఁడు ధనము గోలు పడిన యతఁడు మ్రు
చ్చిల వేచు వాఁడు, గామా
కుల చిత్తుఁడు నిద్ర లేక కుందుదు రధిపా !


బలవంతుడు మీద పడిన బలహీనుడూ, డబ్బు పోగొట్టు కొన్న వాడూ, ఎప్పుడు ఎవడి సొమ్ము కాజేదామా అని కాచుకుని కూర్చునే వాడూ, కామం చేత మనస్సు కలత చెందిన వాడూ నిద్ర పట్టక అవస్థ పడతారు సుమీ ! అని
హిత బోధ చేసాడు విదురుడు.

ఈ సందర్భం లోనే గొప్ప తాత్త్వికార్ధాలతో కూడిన తిక్కన గారి మహా భారతం ఉద్యోగ పర్వం లోని ఒక చిన్న పద్యం చూడండి:

ఒకటిఁ గొని, రెంటి నిశ్చలయుక్తిఁ జేర్చి
మూఁటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి
యేనిటిని గెల్చి యాఱింటి నెఱిఁగి యేడు
విడిచి వర్తించు వాఁడు వివేక ధనుడు !

అధికారాన్ని చేపట్టి, మంత్రమూ ఉత్సాహమూ అనే రెండింటినీ నిశ్చలంగా ఉండేలా జత చేయాలి, మిత్రులూ, అమిత్రులూ , తటస్థులూ అనే మూడు వర్గాల వారినీ, సామ, దాన, భేద, దండములు అనే నాలుగు ఉపాయాల చేతా పూర్తిగా వశ పరచు కోవాలి. త్వక్కు ( చర్మం) ,చక్షువు ( కన్ను ) , శ్రోత్రము ( చెవి ), జిహ్వ ( నాలుక), ఘ్రాణం
( వాసన) అనే సంచేంద్రియానూ జయించాలి. సంధి , విగ్రహం, యానం , ఆసనం, ద్వైదీభావాలు(2) అనే ఆరింటినీ తెలుసు కోవాలి. వేట ,జూదం, పానం, స్ర్తీ , వాక్పారుష్యం ( కఠినంగా మాటలాడడం, ) దండపారుష్యం ( హింప చేయడం), అర్ధ దూషణం ( దుబారా చేయడం) అనే సప్త ( 7) వ్యసనాలనూ విడిచి పెట్టి ఎవడయితే ఉంటాడో వాడే వివేకవంతుడు.


స్థూలంగా ఈ పద్యానికి ఇదీ భావం. కానీ పెద్దలు ఈ చిన్న పద్యానికి వేరే తాత్త్విక పరమయిన అర్ధాలు చెబుతారు. వాటిని కూడా చూదామా ?

ఒకటి బుద్ధి. దీనికి వాక్కు , క్రియ, అనే రెండింటినీ నిశ్చలంగా ఉండేలా చేర్చాలి. అంటే ఏది చెబుతాడో అదే చేయాలి.
ఇక, ధర్మార్థ కామాలను మూడింటినీ బ్రహ్మచర్యం, గార్హస్థం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు ఆవ్రమవిధులతో వశం చేసు కోవాలి. కర్మేంద్రియాలు ( వాక్కు, పాణి, పాదం, వాయువు, గుహ్యం ) ఐదింటినీ గెలవాలి. యజన, యాజన, ఆద్యయన, దాన, ప్రతిగ్రహాలు అనే స్మార్త కర్మలను తెలుసుకొని, ఆవరణం ( పంచభూతాలు పృధ్వి, అప్,తేజస్సు, వాయువు, ఆకాశం) బుద్ధి, అహంకారం ఈ మొత్తం ఏటింటినీ విడిచి వర్తించే వాడు వివేకధనుడు.

పెద్దలు చెప్పే మరో తాత్త్వికార్ధం:

ఒకటి - సత్త్వం , రెండు -రజస్తమస్సులూ , మూడు -ధన, దార ( భార్య) పుత్రుల పట్ల మమకారం, నాలుగు - ధ్యానం, ధారణ, యోగం, సమాధి. తక్కినవి మీద చెప్పినవే.

మూల భారతంలో దీని శ్లోకం ఇలా ఉంది:

ఏకయా ద్వౌ వినిశ్చిత్య త్రీం శ్చతుర్భి ర్వశే కురు
పంచ జిత్వా విదాత్వా షట్ సప్త హిత్వా సుఖీ భవ !


ఈ టపా రాస్తున్నప్పుడు వచ్చేడు మా తింగరి బుచ్చిగాడు. ( వాడి తొలి పరిచయం ఇక్కడ చూడండి ) ఏఁవిటి రాస్తున్నావని ఆరా తీసాడు.

అంతా చదివి వినిపించేను. నా ఖర్మ కాలి, ఏ కొంచెమైనా అర్ధమయిందా అనడిగేను.

భలే వాడివే , అర్ధం కాక పోవడమేం ! గుడ్డి రాజుకి పాపం నిద్ర పట్ట లేదు. అంతే కదా ! అన్నాడు. నా బుర్ర తిరిగి పోయింది.

ఓ నిద్ర మాత్ర వేసుకుంటే పోలా ! అని ముక్తాయించేడు.

నాకు బ్లాగు రాయడం మీద చెప్ప లేనంత విరక్తి కలిగింది. కథా మంజరిని మూసేద్దామని నిర్ణయాని కొచ్చేను.

కానీ మా తింగరి బుచ్చి గాడు తన ఆత్మ కథను కథా మంజరిలో రాయాలని పట్టుబట్టేడు. అందు వల్ల తప్పడం లేదు.

త్వరలో మా తింగరి బుచ్చి గాడి ఆత్మ కథ కథా మంజరిలో. వేచి చూడండి ...





30, ఆగస్టు 2011, మంగళవారం

తెలుగు పద్యం వెలుగు జిలుగులు


నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షిక క్రింద వరుసగా తే 10.8.2011 దీ , తే 24.8.2011దీ
తే 31.8 .2011 దీ సంచికలో ప్రచురితమైన పద్యాలను ఇక్కడ ఉంచుతున్నాను. ఈ లేబిల్ క్రింద వీటితో కలిపి మొత్తం ఇప్పటికి 7 పద్యాలు చూడ వచ్చును.

తక్కినవి తీరిక చేసుకొని తరువాత ...






























29, ఆగస్టు 2011, సోమవారం

పోతన పద్యం


నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షిక క్రింద తే 3-8-2011 దీ సంచికలో ప్రచురితం.

ఇది బమ్మెఱ పోతన భాగవతం లోని వామన చరిత్ర ఘట్టం లోని పద్యం. ఈ లేబిల్ క్రింద ఇది నాలుగో టపా.

28, ఆగస్టు 2011, ఆదివారం

అల్లసాని పెద్దన పద్యం



ఈ పద్యం నవ్య వార ప్రతికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 17-8-2011 దీ సంచికలో ప్రచురింప బడింది

ఇది పెద్దన గారి మను చరిత్ర ప్రబంధం లోనిది. తెలుగు పద్యం లేబిల్ క్రింద ఇది మూడవది.

27, ఆగస్టు 2011, శనివారం

తిక్కన పద్యం


నవ్య వార పత్రిక తే 27-7-2011 దీ సంచికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన వెలువడిన పద్యం . ఇది తిక్కన
గారి మహా భారతం ఉద్యోగ పర్వం లోనిది.

తెలుగు పద్యం లేబిల్ క్రింద ఇది రెండవది.




రేపు మరో కవి కావ్యం నుండి మరో మనోహరమైన పద్యం ...

26, ఆగస్టు 2011, శుక్రవారం

నన్నయ పద్యం


నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షిక క్రింద వారం వారం ఒక తెలుగు పద్యం గురించి వ్రాస్తున్నాను.
ఆ శీర్షికలో ప్రచురితమైన వాటని ఇక్కడ బ్లాగు మిత్రుల కోసం ఉంచుతున్నాను.

ఇది నన్నయ గారి అవతారిక లోని పద్యం. నవ్యలో తే 20 - 7 - 2011 దీ సంచికలో ప్రచురితం. నవ్యలో వచ్చాక వీలుని బట్టి వాటిని ఈ బ్లాగులో ఉంచుతాను. తెలుగు పద్యం లేబిల్ క్రింద వాటిని మీరు చూడ వచ్చును.



19, ఆగస్టు 2011, శుక్రవారం

అపురూపం. కథలసంపుటి




ఈ మధ్య కొత్త టపాలు ఏమీ రాయడం లేదు. పోనీ, నా కథల సంపుటి అపురూపం చూడండి.

పుస్తకం మీద మౌస్ పెట్టి నొక్కితే అక్షరాలు పెద్దవిగా కనబడతాయని చెప్ప నవసరం లేదు కదూ.

29, జులై 2011, శుక్రవారం

ఇంతకీ అసలు సమస్య ఏమిటయ్యా ?


ఈ క్రింది శ్లోకం చూడండి:

కా శంభు కాన్తా ? కిము చంద్ర కాంతం ?
కాన్తా ముఖం కిం కురతే భుజంగం
క: శ్రీపతి: కా విషమ సమస్యా ?
‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ: ’’

ఇందులో మొత్తం నాలుగు ప్రశ్నలూ, నాలుగు సమాధానాలూ ఉన్నాయి. చూడండి:

కా శంభు కాన్తా ? = ఎవరు ఈశుని భార్య ? = గౌరి

కిము చంద్ర కాన్తం ? = ఏది చంద్ర బింబం ? = ముఖం

కాన్తా ముఖం కిం కురుతే = అమ్మాయి ముఖాన్ని ఏం చేస్తున్నాడు? = చుంబతి ( ముద్దు పెట్టు కుంటున్నాడు)

భుజంగం క: = పాము ఎవరు ? = వాసుకి.

ఈ విధంగా తొలి నాలుగు ప్రశ్నలకీ వరుసగా నాలుగో పాదం లోని ’’ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ:’’ అని

కవి నాలుగు జవాబులూ తనే ఇచ్చేడు.

మరయితే అసలు సమస్య ఏమిటయ్యా ?

ఒక కవి ‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ:’’ అని ఒక సంస్కృత సమస్య ఇచ్చాడు. శ్లోకం లోని మీద మూడు పాదాలూ పూరణ.

కా విషమ సమస్యా ? = ఏది జటిలమైన సమస్య ? దీనికి నాలుగో పాదం లోని ‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ: ’’ అనేదే జవాబు.

గౌరీ దేవి ముఖాన్ని వాసు దేవుడు ముద్దు పెట్టు కోవడ మేమిటీ , ఓఘాయిత్యం కాక పోతేనూ !!

మరదే , అందుకే కవికి మండుతుంది. ఏ అనౌచిత్యమూ లేకుండా ఈ సమస్య లోని ప్రతి పదానికి అర్ధవంత మయిన జవాబు వచ్చేలా ముందే ప్రశ్నలు వేశాడు కదండీ.

ఇలాంటి కిత కితలంటే మన పూర్వ కవులకి చాలా సరదా సుమండీ . మనలా ఎప్పుడూ ఆందోళనలతో ఏడుపుగొట్టు ముఖాలతో ఉండకుండా గొప్ప కులాసాగా, కుంచెం శృంగారం ఒలికించే పద్యాలూ శ్లోకాలూ చెప్పుకుంటూ ఉండే వారు కాబోలు.

ఆ రోజుల్లో వాళ్ళకి ఏ నవ్వుల క్లబ్బులూ ఉండేవి కాదని , వాటి అవసరం వాళ్ళకి పడ లేదని మా కథా మంజరి దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది.




శలవ్.



6, జులై 2011, బుధవారం

గుండె తడి ... కథల సంపుటి ... ఒక సమీక్ష



నా ‘ గుండె తడి ’ కథల సంపుటి గురించి ఈ వారం ( 13.7.2011) దీ సంచికలో బుక్ చాట్ శీర్షికలో ప్రచురిత మైన ‘శ్రీవత్స‘ గారి పుస్తక సమీక్ష చదవండి ...


27, జూన్ 2011, సోమవారం

తిరుగలి గురించి మా తింగరి బుచ్చి గాడి ఉపన్యాసంబెట్టి దనిన ...


ఇప్పుడంటే మిక్సీలూ , గ్రైండర్లూ వచ్చేయి కానీ, వెనుకటి రోజులలో ఆడవాళ్ళు జబ్బలు పీకే లాగున పిండి రుబ్బాలంటే రుబ్బు రోలునీ, దంచాలంటే రోళ్ళూ రోకళ్ళనీ, విసరాలంటే తిరుగళ్ళనీ ఆశ్రయించే వారు.

ప్రస్తుతం మనం తిరుగలికి చెందిన కబుర్లు చెప్పు కుందాం.

మీదో రాయీ, కిందో రాయీ ఉండే విసురు సాధనం తిరుగలి. కింద రాయి స్థిరంగా ఉంటే, మీద రాయి చేత్తో త్రిప్పడానికి అనువుగా ఉంటుంది. మీద రాతిని చేత్తో త్రిప్పడానికి అనువుగా ఒక కర్రతో చేసిన పిడి ఉంటుంది. విసర వలసిన గింజలను మీద రాయి మధ్యలో ఉండే ఖాళీ లోంచి పోసి, ఇంక త్రిప్పడం ( అంటే విసరడం) మొదలు పెట్టే వారు. విసరగా విసరగా మెత్తని పిండి రెండు రాళ్ళ మధ్యా ఉండే ఖాళీ ప్రదేశం నుండి కింద పడేది. ఇదీ తిరుగలి పని చేసే తీరు.

ఈ తిరుగలికే చాలా పర్యాయ పదాలు ఉన్నాయి !

అంజి, అనఘట్టము,కణలాభము, ఘరట్టము,జిక్కి,యంత్రపేషిణి,యంత్రము, రాగల్రాయి, విసుర్రాయి ... ఇవండీ తిరుగలికి ఉన్న మరో పేర్లు !

ఇంత ఆయాసపడి పోవడం ఎందుకు కానీ, హాయిగా మనం తిరుగలి అనో, విసుర్రాయి అనో తెలిసిన పేర్లతో ప్రస్తుతానికి ముద్దుగా పిలుచు కుందాం ! ప్రాణానికి సుఖంగా ఉంటుంది.

తిరుగలి ఊసెత్తితే సాయి భక్తులకి సాయి బాబా షిర్దీలో తిరుగలి విసరడం గుర్తుకు వస్తుంది. కదూ !

ఆ కథ ఇక్కడ మరొక్క సారి గుర్తుకు తెచ్చు కుందాం.

అన్నా సాహెబ్ ధబోల్కర్ అనే ఒక పెద్ద మనిషి బాబా కీర్తి గురించి విని ఆయన దర్శనం కోసం షిరిడీ రావాలనుకున్నాడు. అతడు వచ్చిన రోజు ప్రొద్దున సాయి బాబా మసీదులో ఒక తిరగలి ముందర కూర్చుని గోధుమలు విసురుతున్నారు. బాబాకు ఇల్లు సంసారం లేవు. వారు భిక్షాటనంతో జీవిస్తారు గదా! మరి ఈ గోధుమ పిండి ఎందుకు? అని అతడు వచ్చి ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు. అంతలో నలుగురు ఆడవాళ్ళు బాబాను తిరగలి ముందు నుంచి లేపి, పాటలు పాడుతూ పిండి విసిరారు. తరువాత దాన్ని నాలుగు భాగాలుగా చేసి తీసుకు పోబోయారు. అపుడు బాబా వాళ్ళను కోప్పడి "ఈ పిండి మీకు కాదు. దిన్ని తీసుకువెళ్ళి ఊరి సరిహద్దులలో చల్లండి" అని ఆజ్ఞాపించారు. ఇదంతా చూస్తున్న అన్నా సాహెబ్ ఆ ఊరి వాళ్ళను అడిగాడు - అలా పిండి ఊరు చుట్టూ చల్లటం దేనికి? అని. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం: "షిరిడీ గ్రామంలో కలరా వ్యాధి ఉంది. దాన్ని పోగొట్టడానికి బాబా యిలా చేసారు. ఆయన విసిరింది గోధుమలు కావు, వ్యాధినే" అని చెప్పారు. వాళ్లు చెప్పినట్లే మరునాటికి కలరా వ్యాధి తగ్గు ముఖం పట్టింది. అన్నా సాహెబ్ బాబా శక్తికి ఆశ్చర్యపోయాడు. ఇక ఆయన దగ్గరే ఉంది పోయాడు. బాబా కూడా అంతర్నేత్రంతో ప్రేమగా చూచేవారు. అతని "హేమాడ్పంత్" అని పిలిచేవారు. అతని మనసులో ఏ సందేహం వచ్చినా, బాబా తీర్చే వారు
తిరుగలి గురించి ఇంత పవిత్రమూ, ప్రశస్తమూ, ప్రఖ్యాతమూ అయిన కథలూ, విశేషాలూ ఉండగా ఓ సారి మా తింగరి బుచ్చి గాడు ఒక మహిళామణుల సభలో తిరుగలి గురించి అవాకులూ చవాకులూ ఉపన్యసించి మెడ మీదకి ( పీక మీదకి అని ఎందుకు అన లేదో మొత్తం ఆ వృత్తాంతం చదివితే గానీ మీకు తెలియదు) తెచ్చు కున్నాడు.
ఇంతకీ, మా తింగరి బుచ్చి గాడి గురించి మీకు చెప్పనే లేదు కదూ ! సన్నగా రివట వలె గాలికి తూలి పోవు రీతిని ఒప్పు వాడు. అడపాదడపా సభలలో సందడి చేయు వాడు. పిలిచిననూ, పిలువక పోయిననూ సభా ప్రాంగణము నందు తిరుగాడు వాడు. వీలు చిక్కించు కుని వేదిక నెక్కి తన ధోరణిలో ఉపన్యాసము లిచ్చు వాడు. మిక్కిలి తరుచుగా ఉపన్యాసము పూర్తి చేయక ముందే బలవంతముగా వేదిక నుండి నిర్దాక్షిణ్యముగా దింపి వేయ బడు వాడు. అంతియ కాక, లోకములో ఏ విషయము తనకు తెలియదను మాట లేని వాడు. సమస్త విషయముల గూర్చిన సమగ్ర సమాచారము తన వద్ద మాత్రమే కలదని అహంకరించు వాడు ...
మా తింగరి బుచ్చిగాడి ఘనత గురించి చెబుతూ పోతే తరిగేది కాదు కానీ , ఇప్పుడు వాడిచ్చిన తిరుగలి గురించిన ఉపన్యాసం గురించి మాత్రం చెబుతాను వినండి:
‘‘ మన వాళ్ళుట్టి వెధవలోయ్‘‘ అని గురజాడ ఊరికే అన లేదు. గురజాడకి అసలు మన వారి గురించిన ఆ గ్రహింపు మా ముత్తాత బ్రహ్మశ్రీ తింగరి హనుమాన్లు శాస్త్రుల వారి వలన కలిగిందని మీలో ఎవరికీ తెలిసి ఉండక పోవచ్చును. సరే ఈ విషయం కాస్సేపు ప్రక్కన పెడదాం ! మన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాక పోతే, ఆలు మగల సంసారాన్ని బండి చక్రాలతోనా పోలుస్తారూ ! చక్రాల సంగతి అలా ఉంచితే, బండిని లాగేవి ఎద్దులు కదా ? ఆ రెండున్నూ పుంలింగములు కదా ? మరి ఆలు మగలలో ఒకరు పురుషుడున్నూ, వేరొకరు స్త్రీయున్నూ అయి ఉన్నారు కదా !
అందు చేత ఈ పోలిక శుద్ద చవటలు చేసిన పోలికగా నేను ఈ వేదిక మీద నుండి ధృవీకరిస్తున్నాను.... ’’ మా తింగరి బుచ్చి గాడి ఉపన్యసం ఈ వరకూ వచ్చే సరికి సభలో కొంత అలజడి బయలు దేరింది. అసహనం పురులు విప్పింది. హాహాకారాలు చెలరేగాయి. అదంతా తనఉపన్యాస ధోరణికి ప్రశంసారూపమయిన శబ్ద ఘోషగా ఎంచి, మా తింగరి బుచ్చి తన ఉపన్యాసాన్ని ఇంకా ఇలా కొన సాగించాడు:
‘‘ అందు చేత నా మట్టుకు నాకు భార్యా భర్తలను తిరుగలితో పోల్చడం సరైనదని పిస్తుంది. కింద ఉండే రాయి భార్య అయితే, పైనుండే రాయి భర్త. కింద రాయి అంగుళం కదలదు. అంటే, ఏమిటంటా, ఆడది గడప దాటకుండా ఇంట్లోనే పడి ఉండాలన్నమాట ! ఇక మగాడు పైన ఉండే రాయిలాగా సదా తిరుగుతూ డబ్బులు సంపాదించాలన్నమాట!అంతే కాకుండా మీది రాయి తిరుగుతూ ఉంటే, కింది రాయి ఆ రాపిడిని తట్టు కుంటూ ఉంటుంది. అంటఏ ఏమిటంటా ? భర్త పెట్టు నసను భార్య సదా భరిస్తూ ఉండడమే సృష్టి ధర్మం. అంతే కానీ నేటి ఆధునిక తుచ్ఛ వనిత వలె తిరుగబడుట అవివేకమూ, అనాగరికమూ ... ఇక, తిరుగలి తిరిగి నప్పుడే మెత్తని పిండి అనే సంసార సుఖాలు లభిస్తాయి. అయితే, సంసారం అనే ఈ తిరుగలి త్రిప్పేది ఎవరని మీకు ఆలోచన రావచ్చును. తిరుగలి పిడి అనే కాలం పట్టుకుని విధాత తిరుగలిని విసురుతూ ఉంటాడు....’’
ఇహ విన లేక సభలోని మహిళామణులంతా ఏక కంఠంతో దిగు ! దిగు !! ధ్వానాలు పలికి, మైకు లాక్కుని, చొక్కా గుంజుతూ, వేదిక మీద నుండి అర్ధాంతరంగా ఇవతలకి లాగి, సభాప్రాంగణం నుండి బయటకు ఎప్పటి వలె గెంటి వేసారట.
మా తింగరి బుచ్చి గాడు అందుకు నొచ్చు కోలేదు కానీ, తన గభీరమైన ఉపన్యాసం ఇంకా పూర్తి కాకుండానే అవాంతరం ఏర్పడింది కదా ! అని చింతించాడుట. ఆ రాత్రి అతనికి ఇంట అన్నం కాదు కదా, పచ్చి మంచి నీళ్ళు కూడా లభించ లేదని నమ్మకమైన సమాచారం కథామంజరి వద్ద ఉంది.
ఇదీ మా తింగరి బుచ్చిగాడి తిరుగలి మీద ఉపన్యాసం. వీలు చూసుకుని తింగిరోపన్యాసాలు అనే లేబిల్ క్రింద వాని ఉపన్యాసాలు మును ముందు మీముందు ఉంచగలను.
ఇక, తిరుగలి గురించి లోగడ కవిగారు ఒకరు చెప్పిన ఆశువు చూడండి
ఏడిచెదవేలనోయిక ఘరట్టమ ! త్రిప్పల బెట్టుచుందురే
చేడెలు నన్నటంచు కడు చిత్రముగా కడగంటి చూడ్కి చే
రేడులనైన ద్రిప్పెదరు రేలు పవళ్ళిక కేలుబట్ట నె
వ్వాడు పరిభ్రమింపడు సుమా ! సుదతీమణి త్రిప్పు చేతలన్ !!
దీని భావం:
ఓ తిరుగలీ ! ‘‘ఆడవాళ్ళు నన్ను స్థిరంగా ఉండనివ్వ కుండా అరిగి పోయేలాగున తెగ త్రిప్పుతూ ఉంటారు ’’
అని ఎందుకే ఏడుస్తావు ? స్త్రీలంటే ఏమిటను కున్నావ్ ! ఓర చూపులతో ప్రభువులనయినా గిర్రున తమ వెంట రేయింబవళ్ళు త్రిప్పుకో గలరు. ఒక తూరి చేయి అందుకుంటే, ఆ చేతిని వదలకుండా ఆవిడగారి కనుసన్నలలోతిరుగాడుతూ ఉండ వలసినదే కదా !
అన్నట్టు మాతింగిరి బుచ్చిగాడికి తెలుసో, లేదో, తిరుగలి మాహాత్మ్యం గురించిన ఓ విషయం వాడి చెవిని వెంటనే వేయాలి. అవపరమయితే ఏదో చోట తన ఉపన్యాసంలో ఉపయోగించుకుంటాడు కదా.
అదేమిటంటే, కోదాడ దగ్గర ఒక నరసింహస్వామి దేవాలయంలో ఒక తిరుగలి ఉంది. దానిని కౌగలించుకుని వేడుకుంటే ఎలాంటి కోరికలనయినా తీరుస్తుందని భక్త జనుల విశ్వాసం ! ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే తిరుగలి అదిట ! కావాలంటే ఈ క్రింది ఫొటో మీరే చూడండి: :
ఈ భక్తాగ్రేసరి ఇప్పట్లో లేవదు కానీ, ఇక శెలవ్.

ఇతి తిరుగలి ఉపాఖ్యానమ్ సర్వం ప్రస్తుతానికి సమాప్తమ్

22, జూన్ 2011, బుధవారం

నవ్వి పోదురు గాక !



కొంత మంది గలగలా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. జాగ్రత్తగా వింటే కానీ వాళ్ళు చెబుతున్నదేమిటో అర్ధం కాదు !
ఆ వేగాన్ని అందుకోవడం మనతరం కాదు. ఇంతకీ వాళ్ళు మాట్లాడేది ఏ భాషో కూడా తెలియక జుట్టు పీక్కోవాలి.

ఒకాయన వేద పఠనం చేస్తున్నాడు. ఆహా ! ఏమి పాండిత్యమయ్యా ! క్రమాంతస్వాధ్యాయిలా ఉన్నాడు ! ఉదాత్తానుదాత్త స్వరిత స్వర భేదాలతో ఏమి గొప్పగా వేద పనసలు వల్లె వేస్తున్నాడయ్యా ! అనుకుంటూ మురిసి పోయేడొకాయన.
‘‘ నీముఖం ! ఆయన చదివేది వేదమూ కాదు. ఏమీ కాదు. నిదానించి విను .నీకే బోధ పడుతుంది.’’ అని హెచ్చరించేడు ప్రక్కనున్నాయన . సావధానంగా వింటే, ఆయన వేదంలా చదువుతన్నది వేదం కాదనీ, అవి తెలుగు పదాలేననీ అర్ధమై నవ్వి పోతాం.

అలాగే, కొన్ని శ్లోకాలు ఉంటాయి. తెలుగు సంస్కృత భాషా పదాలతో కూడిన మిశ్రమ భాషా రచన చేయడం కొందరికి సరదా. వాళ్ళ కదొక తుత్తి !

అలాంటివాటిని కొన్నింటిని చూదాం !

వృత్తింకల్పయ శక్తి లేదు అయితే జీవేకథం త్వత్పురే ?
ఉంటే ఉండుమి కిం,నీల్లు బహుశ: పీత్వా సుఖాదత్రవై
పోతే పో బహువత్సరాదహమిహస్థాస్యామి హే సత్ప్రభో !
ఏతే యాచక రాజ భాషిత మిదం భాషాద్వయం పాతున:

ఓ బిచ్చగాడు రాజుని ఏదేనా పని చూపించమని కోరేడు. అప్పుడు రాజూ, ఆ బిచ్చగాడూ తెలుగూ సంస్కృత భాఫా పదాలతో మాట్లాడేసుకుంటున్నారు.

‘‘ ఏదేనా పని చూపించవయ్యా, రాజా !’’ ‘‘నా వల్ల కాదురా’’ ‘‘ మరెలా బతకడం ?’’ ‘‘ఉంటే ఉండు. పోతే పో !’’ ఇలా సాగింది వారి సంభాషణ.

మరొకటి -

కాచీ కాచి మునక్కాయ
కాయవే పొట్టి కాకరా
కాయానాం వంగ పిందానామ్
కూరానాం గుజ్జు పచ్చడీ !

మునక్కాయ ముక్కలూ, పొట్టి కాకరా, లేత వంకాయలూ వేసి చేసే గుజ్జు పచ్చడి ఉభయభాషా పదశోభితమై చవులూరిస్తోంది కదూ!

భామా కలాపంలో హాస్యగాడు చదివే ఈ తెలుగు సంస్కృత పదాలతో కూడిన శ్లోకం చూడండి:

ఆదౌ దొమ్మరి మంగి గర్భజననం దాసీ గృహేవందనం
మాయామంగలి పోతిగాడి మరణం ఏటొడ్డు రామాయణం
పశ్చాత్ చాకలి పోలి తోడి జగడం పాపౌఘ నిర్వాపణం
కాకచ్ఛేదన కల్మషాపహరణం ఏతన్హా భారతం.

ఇలాంటి ఉభయ భాషా విన్యాసంతోనే ఉన్న ఈ ప్రార్ధనా శ్లోకం చూడండి:

గణానాం గణనాథశ్చ గణపాత్రస్తథైవచ
కాట్రా కాశీ కొంకి నక్కా, గార్ధభాయ నమో నమ:

అక్కలమ్మా మహామారీ మాతంగీ పరమేశ్వరీ
ఎన్నెమ్మాయ నమస్తుభ్యం ఆశీరమ్మాయ నమోనమ:

కామినీ చైవ గాంధారీ లంఖిణీచైవ తాటకీ
భూతప్రేత నివాసించ బూర్లె గంపాయ తే నమ:

పగటి వేషగాళ్ళు వేదంలా స్వరయుక్తంగా వల్లించే ఉభయ భాషా పదాల గారడీ చూడండి:

అంబలి ముఖ్యంత్వలంకారం కంబలి ముఖ్యంతు భోజనం
రాట్టం ముఖ్యంతు నారీణాం దుక్కి ముఖ్చంతు బ్రాహ్మణ:
బాకీ సారా గ్లాసు మనసా సర్వాదాయం యథాక్రమం

తిన్నట్టే తిన్నకున్నట్టే ఉన్నవారికి మాడటం
మాట మాట ప్రసంగేన దబ్బుదిబ్బుస్తథైవచ
పాదరక్ష ప్రయోగన శరీరం పీడ వర్జయేత్ .


మరొకటి చూడండి:

తిండికైతే పదిమంది వసంతి
తండులాలు గృహమందు వసంతి
కుండ బొచ్చెలు పరం విలసంతి
రండ నా కొడుకులెల్ల హసంతి

కవిగారి ఇంట దరిద్రం ఇలా ఉంది మరి !

చివరగా ఇంకొకటి ...

క్షుధాతురాణాం నవుడిర్నవుడక:
అర్ధాతురాణాం నచెల్లిర్న చెల్లక:
నిద్రాతురాణాం నమెట్టర్న పల్లం
కామాతురాణాం న ముసిలిర్న పిల్ల:

ఇది కామాతురాణాం న రుచిర్న పక్వ: ... అనే శ్లోకానికి వికట కవి చేసిన వెటకారం. ఆకలితో ఉన్నవాడికి ఉడికిందో లేదో కూడా అక్కర లేదు. దరిద్రుడు తనకిచ్చిన రూక చెల్లినదో, చెల్లనిదో కూడా చూసుకోడు. కూరుకు ముంచు కొస్తున్నవాడు మెట్ట పల్లాలు చూసుకోడు. ఇక, కామాంధుడికి పడుచుదయినా, ముసలిదయినా ఒకటే.

లోగడ కథా మంజరిలో తెలుగు, ఇంగ్లీషు పదాలు కలగాపులగం చేస్తూ కవులు రాసిన కొన్ని పద్యాలను ఉంచాను.

చూడాలనిపిస్తే ఆ టపా ఇక్కడ నొక్కి చూడండి. ఓ పనైపోతుంది.





19, జూన్ 2011, ఆదివారం

నీకంత సీన్ లేదు !!

‘‘ తాడిని తన్నే వాడు ఒకడుంటే, వాడి తల తన్నే వాడు వేరొకడు ఉంటాడు’’ అనే సామెత తెలిసినదే కదా !

అందుచేత, ఏదో సాధించేసాం అను కోవడం , విర్రవీగి పోవడం సరికాదు. ఎంత ఎదిగినా , కొంత ఒదిగి ఉండడం మంచిది. లేక పోతే ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అని దులపరించి పారేసే ప్రమాదం ఉంది.

ఈ చాటు పద్యాలు నాలుగూ చూడండి:


ఱంతుల్ మానుము కుక్కుటాధమ ! దరిద్ర క్షుద్ర శూద్రాంగణ
ప్రాంతో టాఖల మూల తండుల కణ గ్రాసంబు చే గ్రొవ్వి దు
దర్దాంతాభీల విశేష భీషణ ఫణాంతర్మాంసన సంతోషిత
స్వాంతుండైన ఖగేంద్రుని కట్టెదుట నీ జంఝాటముల్ సాగునే ?

ఈ పద్యం పెద్దన గారిదిగా ప్రసిద్ధం. కాగా, ఈ పద్యం శ్రీనాథునిదిగా కూచిమంచి తిమ్మకవి తన లక్షణసారసంగ్రహంలో పేర్కొన్నాడు.

ఓ అధమ కుక్కుటమా ! నీ తైతక్కలు ఇక చాల్లే ...దరిద్రగొట్టు తావుల్లో, చెత్తల్లో, పెంట కుప్పల్లో ఎంగిలి మెతుకులు ఏరుకుని తింటూ బలిసిన నువ్వెక్కడ ? కేవలం భీకరమయిన సర్పాల పడగలోని మాంసాన్ని తిని తృప్తి పడే ఖగరాజు ఎదుట నీ మిడిసిపాటు చెల్లదులే !


మరో పద్యం చూడండి:


స్థాన విశేషమాత్రమున తామరపాకున నీటి బొట్ట ! నిన్
బూనిక మౌక్తికంబనుచుఁ బోల్చిన మాత్రనె యింత గర్వమా !
మానవతీ శిరోమణుల మాలికలయందును గూర్ప వత్తువో ?
కానుకలియ్య వత్తువో, వికాసము నిత్తువొ , విల్వ దెత్తువో ?!

ఈ పద్యం ముక్కు తిమ్మన గారిదని చెబుతారు.

స్థాన విశేష మాత్రం చేత మాత్రమే కొందరకి, లేదా కొన్నింటికి గొప్పతనం చేకూరుతూ ఉంటుంది. తామరపాకు మీద నీటి బొట్టు ముత్యంలా మెరిసి పోతూ ఉంటుంది. అంత మాత్రం చేత అది మంచి ముత్యం ఎన్నటికీ కానేరదు కదా !
కవి అదే చెబుతున్నాడు : ఓ తామరపాకు మీద నీటి బొట్టూ ! నువ్వు తామరపాకు మీద నిలచి ఉండడం చేత నిన్ను ముత్యంతో పోలుస్తూ ఉంటారు. అది స్థానవిశేషం వల్ల వచ్చిన గొప్పతనం. అంత మాత్రం చేత నీకు ఇంత గర్వం తగదు సుమా ! నువ్వేమయినా లలనల శిరోరత్నాలలో కూర్చడానికి పనికి వస్తావా ? ఎవరికయినా కానుకగా ఇవ్వడానికి తగుదువా ? నీకు వికాసమూ లేదు, విలువా లేదు!

అంతే కదా, నీటి బొట్టు తామరపాకు మీద ఉన్నంత సేపే ముత్యంలా మెరిసి పోతూ ఉంటుంది. స్థానభ్రంశం చెందిందా, యిక దాని పని అంతే. వొట్టి నీటి బొట్టే. కదా.

మరో పద్యం చూడండి:



తక్కక నేల ముట్టెగొని త్రవ్వగ నేర్తునటంచుఁదాకుతా
వొక్కటి జాతియందు మదమెక్కకు బుద్ధిని వెఱ్ఱిపంది ! నీ
వెక్కడ ! యాది ఘోణియన నెక్కడ ! యద్రి సముద్రదుర్గ భూ
ర్భాక్కు తలంబు నొక్క యరపంటినె మింటికినెత్త నేర్తువే ? !

ఓ వెఱ్ఱి వరాహమా ! నేలను ముట్టెతో త్రవ్వడంలో నాకు నేనే సాటి అంటూ గొప్పలు పోతూ గర్విస్తున్నావు.
నువ్వెక్కడ ? ఆదివరాహ మెక్కడ ? సముద్ర గర్భంలోని భూమిని ఒక కోరతో అవలీలగా ఆ తొలి కిటి మీదికి ఎత్తలేదూ ! ఆ ఆది వరాహం ముందు నువ్వెక్కడ, నీ ప్రతాపమెక్కడ !


ఈ పద్యం భట్టు మూర్తిదిగా చెబుతారు.

తమకు లేని పోని గొప్ప తనాన్ని ఆపాదించు కుంటూ. అహంకరించే అల్పులను అభిశంసిస్తూ కవులు చెప్పిన పద్యాలు చూసాం కదా.

సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని నిలదీస్తూ శ్రీనాథ కవి చెప్పిన ఒక చాటువు కూడా చూదాం. గమనిక: ఇక్కడ అల్పత్వమూ లేదు. అభిశంసనా లేదు. చమత్కారంగా కవి పరమ శివుని ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అంటున్నాడు. అంతే.


గరళము మ్రింగితి ననుచున్
పురహర ! గర్వింప బోకు, పో,పో,పో ! నీ
బిరుదింక గాన వచ్చెడి
మెఱసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ !

ఆ నాడు దేవాసురులు సముద్ర మధనం చేసేటప్పుడు ఉద్భవించిన విషాన్ని పరమశివుడు స్వీకరించాడు. లోకోపద్రవం నివారించాడు. అందుకే నీలకంఠుడిగా నామాంతరం పొందాడు.

ఓ పురహరా ! విషాన్ని మ్రింగాను కదా అని గర్విస్తున్నావు. చాలు . చాల్లే ! రేనాటి జొన్న మెతుకులు తిని చూడు నీ గొప్పతనమేమిటో తెలిసి వస్తుంది ! అని దీని భావం. రేనాటి జొన్న కూడు నోట పెట్టరానిదిగా ఉంటుందని కవి చమత్కారం.

ఇలాంటిదే శ్రీనాథుని మరో చాటువు చూడండి:


ఫుల్ల సరోజ నేత్ర ! యల పూతన చన్నుల చేదుద్రావి, నా
డల్ల, దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల ? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగ మ్రింగుము నీ పస కాననయ్యెడిన్ !

ఇది పలనాటి జొన్న కూడు గురించినది. కృష్ణా ! ఆనాడు రక్కసి పూతన విషపు చనుబ్రాలు త్రాగాననీ, అల్లప్పుడు విషాన్ని మ్రింగాననీ, గొప్పలు పోతున్నావు. చింతాకుతో కూడిన ఉడుకు బచ్చలి కూరను జొన్న కూటితో ఒక ముద్ద నోటిలో పెట్టుకో ! నీపస ఏమిటో తెలిసి పోతుంది.

ఇదీ, నీకంత సీన్ లేదు ! అని కుండ బద్దలు కొట్టిన పద్యాల కథ .





16, జూన్ 2011, గురువారం

ప్రియురాలు ఎంత కఠినం !


ప్రియురాలి సొగసు చూడ తరమా ? అపురూప లావణ్యవతి. ముగ్ధ మోహన రూపం. ఒప్పుల కుప్ప. ఒయ్యారి భామ.

లోకోత్తర సౌందర్యం. బాపూ బొమ్మ....

ప్రియుడు ప్రియురాలి సౌందర్యం చూసి పరవశించి పోయాడు. ‘నిన్ను చూడకుండాఒక్క క్షణం నేనుండ లేను ’ అనడాలూ, ‘నువ్వు నాకు లభించడం నా అదృష్టం’ అనడాలూ, ‘ దేవ కన్యలు కూడా నీ కాలి గోటికి సరిపోరు ’ అని పొగడడాలూ, ‘అచ్చం బాపూ బొమ్మలా ఉన్నావు సుమా !’’ అని మురిసిపోవడాలూ, సినిమాలూ, షికార్లూ, పార్కులూ, షాపింగులూ,రెండు స్గ్రాలతో ఒకే కొబ్బరి బొండమో, కూల్ డ్రింకో తాగడాలూ ... కను రెప్పలు బరువుగా వాలి పోవడాలూ, ఛాతీలు గర్వంతో పెరిగి పోవడాలూ , కలల విహారాలు చెయ్యడాలూ, బేంకు బేలన్సు తరిగి పోవడాలూ ...

అన్నీ అయ్యేక ప్రియుడుకి ప్రియురాలి అసలు స్వరూపం తెలిసి వచ్చింది. ఇలా వాపోతున్నాడు:

ఈ చాటు పద్యం చూడండి:

పల్లవము బూని సకియ మేనెల్ల జేసి
సద్మగర్భుడు లాదీసి వా గుడిచ్చి
మూ విసర్జించి యప్పుడప్పూవు బోడి
డెంద మొనరించె సందేహమందనేల ?

ఆ బ్రహ్మ దేవుడు ఈమె శరీరాన్ని లేత చిగురాకులతో తయారు చేసాడు. అందుకే అంత మృదుత్వం ! అంత సౌకుమార్యం !

అంత వరకూ బాగుంది. కానీ అక్కడే పాడు బ్రహ్మ దేవుడు పెద్ద కిరికిరీ చేసాడు ...

అదేమంటే ...

పల్లవము అనే పదంలో ‘‘ లా ’’ తీసేసాడు. దానితో ‘‘ ల్ల’’ అనే అక్షరం ఎగిరి పోయింది.

తర్వాత వా గుడిచ్చాడుట ! ‘‘ వ’’ కి గుడి ఇస్తే ‘‘ వి ’’ అయింది !

అక్కడితో ఊరుకోకుండా ‘‘ ము’’ అనే అక్షరాన్ని విడిచి పెట్టాడుట !

సరే, మరి ఇప్పుడు ఇన్ని తీసి వేతలూ, కలపడాలూ, జరిగేక, ‘‘ పల్లవము ’’ అనే పదంలో మిగిలినదేమిటీ ?!

‘‘ పవి’’ అనే పదం మిగిలింది ! ‘‘ పవి ’’అంటే ఇంద్రుని వజ్రాయుధం !

ప్రియురాలి తనువూ, మనసూ అంత కఠినం అన్నమాట !




2, జూన్ 2011, గురువారం

కంట తడి పెట్టించిన కథల నామిని ... ఒక నిందా రూప స్తుతి



ఈ నెల ( మే 2011 ) పాల పిట్ట మాస పత్రిక చదివేరా?

అందులో కంట తడి పెట్టించిన కథల నామిని శీర్షికన ఖమ్మం నుండి శ్రీధర్ రాసిన ‘‘నామిని, నెంబర్ వన్

పుడుంగి ’’ పుస్తకం మీద ఒక సమీక్షా వ్యాసం ప్రచురించారు.

నిందా స్తుతి రూపంలో వచనంలో వచ్చిన ఇంత గొప్ప సమీక్షా వ్యాసం ఇటీవల నేను చదివి ఉండ లేదు.

అమ్మీ, పెబోవతీ ... అనే సంబోధనతో మొదలై

యెట్టా యేగుతున్నావమీ, ఈ నా బట్టగానితోని, పెద్ద పుస్తకం రాసి కాపరాన్ని దేశమంతా రచ్చ రచ్చ చేసినాడు

గదమ్మీ ... అనే వాక్యాలతో నామిని కొత్త పుస్తకం ’’ నామిని, నెంబర్ వన్ పుడుంగి‘‘ మీద రాసిన నిందా రూప స్తుతి చివరి అక్షం వరకూ ఉగ్గబెట్టి చదివిస్తుంది.

పచ్చ నాకు సాక్షిగా , సినబ్బకతలు, ముని కన్నడి సేద్యం, చదువులా ? చావులా? తో పాటు నామిని రాసిన ఈ కొత్త పుస్తకం ‘‘ నామిని, నెంబర్ వన్ పుడుంగి’’ వెంటనే కొనుక్కుని చదివేలా చేస్తుంది.

పుస్తకం చదివేక, నామిని పుడుంగి అవునో కాదో తేల్చు కోవలసినది మనమే.

పాలపిట్ట మాస పత్రిక వివరాలు:

పాలపిట్ట,

ప్లాట్ నె.3, ఎంఐ.జి - 2, బ్లాక్ -6,

ఏ.పి.హెచ్.బి. , బాగ్ లింగంపల్లి,

హైదరాబాద్ - 500 044

ఫోన్: 040 - 27678430

సెల్: 9848787294

మెయిల్: palapittabooks@gmail.com



29, మే 2011, ఆదివారం

కామమ్మ కథ


చిన్ని పుస్తకం ... పెద్ద మనసు ...

నా పుస్తకాల గూటి లోకి, గువ్వ పిట్టలాగ ఒక చిన్న పుస్తకం వచ్చి చేరింది. పుస్తకం పేరు కామమ్మ కథ. వెల పన్నెండణాలు. రచయిత ఎవరో ఎక్కడా లేదు. చుక్కల సింగయ్య శెట్టి, యన్.వి.గోపాల్ అండ్ కో, మదరాసు వారి ప్రచురణ.

ముందుగా ఈ పుస్తకం నాకు దొరికిన వైనం చెబుతాను.

విజయ నగరం జిల్లా పార్వతీ పురం మా స్వగ్రామం. నేను పుట్టింది అక్కడే. హెచ్.స్. ఎల్.సీ వరకూ నా చదువు అక్కడే.

ఆ రోజులలో ఏ పుస్తకం కంట బడినా ఆత్రంగా చదివే వాడిని. ఇంటికి రెండు వార పత్రికలూ, ఒక మాస పత్రికా వచ్చేవి. ఊళ్ళో ఒక మనిసిపల్ లైబ్రరీ, మరో శాఖా గ్రంథాలయం ఉండేవి.

నా పుస్తక దాహార్తి అక్కడే తీరేది. ఇక మా చిన్న ఊళ్ళో రాధా గోవింద పాఢి గారని ఒక ఒరియా వ్యక్తి ఉండే వారు. తెలుగు మాట్లాడడం వచ్చు. కూడ బలుకుకుని చదివే వారేమో కూడా. రాయడం వచ్చేది కాదను కుంటాను. వారికి ఒక ఫొటో స్టూడియో ఉండేది. ఆ పనులతో తెగ బిజీగా ఉండే వారు. దానితో పాటు ఆయన ఆ రోజులలో వచ్చే అన్ని దిన, వార , పక్ష, మాస పత్రికలు అన్నింటికీ కూడా ఏజెంటుగా ఉండే వారు. మెయిన్ రోడ్డులో వారి ఫొటో స్టూడియో కమ్ పుస్తకాల షాపు నన్ను అమితంగా ఆకట్టు కునేది. ఎక్కవ గంటలు అక్కడే గడిపే వాడిని. వారు మా కుటుంబ మిత్రులు కూడానూ. పేపర్లూ, పీరియాడికల్స్ తో పాటు ఆయన ఎన్నెన్నో మంచి పుస్తకాలు కూడా అమ్మకానికి తెప్పించే వారు. జిల్లా వ్యాప్తంగా ఉండే పాఠశాలలకీ, ఆఫీసు లైబ్రరీలకీ వాటిని విక్రయించే వారు. మంచి పుస్తకాలు తెప్పించడం కోసం వారు ఒక పద్ధతి అవలంబించే వారు. పుస్తకాల ఏజెంటుగా వారికి ఎందరో రచయితలతోనూ, ప్రముఖ సంపాదకులతోనూ మంచి పరిచయాలు ఉండేవి. వారి షాపులోనే నేను చాలా మంది గొప్ప రచయితలను చూసేను. విద్వాన్ విశ్వం, రాంషా వంటి సంపాదకులనూ చూసేను. సోమ సుదర్ గారిని కూడా అక్కడే చూసినట్టు గుర్తు. పాఢి గారు ఆయా రచయితలనూ, సంపాదకులనూ కలిసినప్పుడు తెలుగులో ఏవి మంచి పుస్తకాలంటూ కేటలాగులు ఇచ్చి మరీ వారినుండి వివరాలు సేకరించే వారు. ఆ క్రమంలో నేను కూడా నాకు తోచిన గొప్ప పుస్తకాల గురించి చెప్పే వాడిని. ఈ విధంగా తనకు తెలుగు సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం లేక పోయినా అమ్మకం కోసం ఎన్నో గొప్ప పుస్తకాలను తెప్పించే వారు. చెంఘిజ్ ఖాన్, అతడు ఆమె, నేరము శిక్ష , పెంకుటిల్లు, సమగ్రాంధ్ర సాహిత్యం సంపుటాలు, లత , రావి శాస్త్రి, ముళ్ళపూడి, బీనాదేవి, గోపీచంద్, తిలక్, శ్రీ.శ్రీ, మధురాంతకం రాజారాం, మొదలయిన గొప్ప గొప్ప రచయితల రచనలు తెప్పించే వారు. అనువాద సాహిత్యమయితే లెక్కే లేదు. శరత్ సాహిత్యమంతా ఉండేది.

ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే, వారి షాపుకి వచ్చే వార, మాస పక్ష పత్రికలన్నీ ఇలా బంగీ రాగానే ఒక కాపీ నాకు చదువుకోమని ఇచ్చే వారు. విజయ,నీలిమ , యువ, జ్యోతి వంటి మాస పత్రికలు, ఆంధ్ర పత్రిక, ప్రభ వంటి వార పత్రికలు షాపుకి రాగానే అమ్మకానికంటె ముందుగా నాకు ఇచ్చేసే వారు. ఏ రోజయినా, నేను షాపుకి వెళ్ళక పోతే, ఆ రోజు వచ్చిన కొత్త పత్రకలను మా ఇంటికి పంపించి వేసే వారు. వీటితో పాటు, అమ్మకానికి వచ్చిన నవలలు, కథా సంపుటాలు, సాహిత్య గ్రంథాలు అన్నింటి ప్రతులు ఒక్కొక్కటి చొప్పున నాకు చదువుకోడానికి అంద చేసే వారు. వీలయినంత వేగిరం, అంటే, తిరిగి ఆయా పుస్తకాలను అమ్ముకునేందుకు వీలుగా ఇచ్చి వేసే నియమం పెట్టే వారు. అలాగే మరో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, ఏ పుస్తకమూ నలగ కూడదు. చిరగ కూడదు.

ఈ నిబంధన కూడా చాలా సున్నితంగా చెప్పే వారు. నేనెక్కడ నొచ్చు కుంటానో అని తెగ బాధ పడి పోయే వారు కూడా.

హైస్కూలు చదువు చదువుకుంటూ, పైసా సంపాదన లేని నా బోటి వాడికి ఆ రోజుల్లో అన్ని పత్రికలు, విలువైన పుస్తకాలు, గొప్ప సాహిత్య గ్రంథాలు అన్నీ కేవలం ఉచితంగా చదివే వీలు కలగడం నా అదృష్టం కాక మరేమిటి చెప్పండి ?

నా పుస్తక దాహార్తిని తీరుస్తూ, నేనొక రచయితగా ఎదిగే క్రమంలో ఎంతగానో దోహద పడి, చేయూత నందించిన ఆ దయామయుని రుణం ఎలా తీర్చు కోగలను ?

ఇంతకీ ఈ కామమ్మ కథ అనే పుస్తకం నాకు ఎలా వచ్చి చేరిందో ఇంకా చెప్పనే లేదు కదూ ?

సరే, అలాగ, నా హైస్కూలు చదువు పూర్తయి, తరువాత విజయ నగరంలో భాషా ప్రవీణ చదువు నాలుగేళ్ళూ గడిచే వరకూ వారి దయ వల్ల అసంఖ్యాకంగా పుస్తకాలు ఉచితంగా చదివేను. చదువు ముగిసి, తెలుగు పండితునిగా ఓ చిరుద్యోగం లోకి ప్రవేశించాక కూడా మీరు ఊహించ లేనంత కమీషను డిస్కవుంట్ పొందుతూ వారి నుండి ఎన్నో చాలా మంచి పుస్తకాలు కొనుక్కున్నాను. చాలా వరకూ అరువు. నెలల తరబడి ఆ వాయిదాలు కడుతూ ఉండే వాడిని. నేనంటే వారికి ఎంత అభిమానమో. ఆ పుస్తకాలు చదివి నేను ఏదయినా పుస్తకం గురించి మెచ్చుకుంటూ పొగిడితే అతనూ పొంగి పోయే వారు. అప్పటి వారి చూపుల్లో అన్నం వడ్డించే అమ్మ కున్నంత ఆదరణ ఉండేది.

ఇంకా ఈ పుస్తకం నాకు ఎలా వచ్చి చేరిందో చెప్పనే లేదు కదూ.

మరింక విసిగించను లెండి. వారిచ్చిన ఉచిత పుస్తకాలతో నన్ను నేను ఉన్నతీకరించు కుంటూ ,ఇలా ఓ ముప్ఫయ్ ఏళ్ళు గడిచేక, నేను ఉద్యోగ రీత్యా మా ఊరికి దూరంగా ఉండి పోవలసి రావడం చేత వారిని ఒకటి రెండు సార్లు తప్ప మరి కలియడం జరుగ లేదు. వారి గురించిన వివరాలూ తెలియ రాలేదు.

ఉద్యోగ విరమణ చేసాక, మా అన్నగారితో పాటు మళ్ళీ మా ఊరు వెళ్ళాను. అప్పటికి అక్కడ మాకు ఇల్లూ, పొలాలూ అన్నీ చెల్లి పోయాయి. తెలిసిన వారు కూడా కొద్ది మందే మిగిలేరు. చాలా ఏళ్ళ అనతంరం మా ఊరు చూడాలనే కుతూహలంతో నేనూ మా అన్న గారూ అక్కడికి వెళ్ళాం.

మా పుస్తకాల మిత్రుడు రాధా గోవింద పాఢి గారిని చాలా సంవత్సరాల తరువాత చూడాలని వారింటికి వెళ్ళాం.

ఆయన లేవ లేని స్థితిలో మంచం మీద ఉన్నారు. మాట కూడా సరిగా రావడం లేదు. అప్పటికి పది, పదిహేను ఏళ్ళ క్రిందటే ఫొటో స్టూడియో, పుస్తకాల షాపూ మూసి వేసారుట. ఆయన బహు కుటంబీకుడు. ఆరుగురు కూతుళ్ళు. ఒక కొడుకు. అందరికీ వివాహాలు చేసారు. ఆర్ధికంగా ఇబ్బంది ఏమీ లేదు. శరీరం సహకరించక ఫొటోల బిజినెస్సూ, పుస్తకాల షాపూ మూసి వేసారుట. నాకీ వివరాలేవీ తెలియదు. తెలుసు కోడానికి కనీస ప్రయత్నం కూడా చెయ్య లేదేమో. ఉద్యోగం, పిల్లలు, వారి చదువులూ, బదిలీలూ, అమ్మాయిల పెళ్ళిళ్ళూ, పురుడు పుణ్యాలూ ... వీలు చిక్క లేదని సిగ్గు లేకుండా చెప్పడానికి కావలసినన్ని కారణాలు ఉన్నాయి.

మా రాక చూసి ఎంతగానో సంతోషించారు. నన్ను చూసి కన్నీళ్ళు పెట్టు కున్నారు. వారు పడుకున్న మంచం క్రిందకి సైగ చేసి చూపించారు. వంగి , అక్కడ ఏముందా అని చూసి, ఒక పెద్ద పుస్తకాల కట్ట ఉంటే దానిని ముందుకు లాగేను. దళసరి అట్టతో వాటిని పేక్ చేసి ఉన్నారు. వాటి మీద జోగారావు గారికి అని వచ్చీ రాని తెలుగులో రాసి ఉంది. ఉద్వేగం ఆపుకో లేక పోయాను. కళ్ళంట నీళ్ళు ఆగ లేదు. ఎప్పుడో, మామధ్య రాక పోకలు ఆగి పోయినా, దూరాలు పెరిగి పోయినా, వారు పుస్తకాల షాపు మూసి వేసే రోజులలో నాకు ఇవ్వడానికి కొన్ని పుస్తకాలు పదిలంగా పేక్ చేసి ఉంచారుట. ఆ తరువాత వారిని నేను కలవడానికి నాలుగు దశాబ్దులకి పైగా పట్టింది. అయినా, వారి మంచం క్రింద నా పేరు రాసి ఉంచిన ఆ పేకెట్ అలాగే పదిలంగా ఉంది. చెక్కు చెదరని వారి అభిమానం లాగా. తరగని ప్రేమలాగా.

వారి గురించిన వివరాలు ఎప్పటి కప్పుడు తెలుసు కోలేక పోయిన నా అల్పత్వం స్ఫురించి సిగ్గు కలిగింది.

వారు నాకోసం దాచి ఉంచిన ఆ పుస్తకాల కట్టలో సి.నా.రె. గారి ఆధునికాంధ్ర కవిత్వం , సీతా దేవి మట్టి మనుషులు, కుటుంబరావు చదువు, రావి శాస్త్రి గారి నిజం నాటకం, రక్తాక్షరాలు, ఏడుతరాలు, ఊహాగానం ...లాంటి మంచి మంచి పుస్తకాలు చాలా ఉన్నాయి. వాటితో పాటు ఎలా వచ్చి చేరిందో ఈ కామమ్మ కథ పుస్తకం కూడా ఉంది.

నా పుస్తకాల గూటి లోకి గువ్వ పిట్టలా వచ్చి చేరి పోయింది.

ఇదీ, కామమ్మ కథ పుస్తకం నా దగ్గరకు వచ్చి చేరిన వైనం.

అయితే, ఈ పుస్తకంలో ఏముందో కూడా చెప్పాలి కదూ. నిజానికి అంత గొప్పగా దాన్ని గురించి చెప్పడానికి లేదు.

శుభము కామమ్మ శుభము కామమ్మా కామమ్మ

శుభ మొంది సామర్ల కోటలో నమ్మా కామమ్మ ... అంటూ పాట రూపంలో సాగి పోయిన నలభై పుటల చిన్ని పుస్తకం ఇది.

సుకపట్ల లక్ష్మయ్య, వెంకమ్మ దంపతుల కుమార్తె కామమ్మ. తల్లి దండ్రులు చిన్నప్పుడే పోవడంతో పిన తండ్రి రామన్న ఇంట అల్లారు ముద్దుగా పెరిగింది. బాల్యం వీడక ముందే తిరుపతి మారయ్యతో వివాహం జరిగింది. పెళ్ళినాటికి భర్త కలక్టరు దొర దగ్గర నెలకు మూడు వరహాల జీత గాడు. దొరతో ఎందుకో మాటా మాటా వచ్చి, కొలువు చాలించు కున్నాడు. తరువాత తల్లి ఎంత వారించినా వినకుండా చెన్నపట్నం వెళ్ళి అక్కడ దొరల దగ్గర మంచి కొలువునే సంపాదించు కున్నాడు. కొన్నాళ్ళకి ఇంటి మీద మనసు పుట్టి, నాలుగు మాసాలు సెలవు పుచ్చుకుని, ఇంటికి తిరిగి వచ్చేడు. చిత్రమేమిటంటే, వివాహమయినా, అప్పటికింకా భార్య కామమ్మ కాపురానికి రానే లేదు. పెళ్ళవుతూనే కొలువులకి వెళ్ళి పోయేడు మరి. సరే, ఇంటికి చేరిన మారయ్య తీవ్రంగా జబ్బు పడ్డాడు. మరి కోలుకో లేదు. కామమ్మను చూడాలని కోరేడు. కామమ్మ సారె, సరంజామాతో తొలిసారిగా అత్తింట అడుగు పెట్టింది. తొలి సారి చూపు మంచాన పడిన భర్తను. అదే కడ సారి చూపు కూడా అయింది. తరువాత కామమ్మ జీవితం అనేక మలుపులు తిరిగింది. ఎన్నో కష్టాలు పడింది. ఎందరికో తలలో నాలుకగా మెలిగింది. చివరలో కామమ్మ మరణంతో ఊరు ఊరంతా విలపించింది. ఊరి ప్రజలు కామమ్మకు గుడి కట్టి గ్రామ దేవతగా ఆరాధించడం మొదలు పెట్టారు.

స్థూలంగా ఇదీ కామమ్మ కథ. పాట రూపంలో ఉన్న ఈ కథను గాయకులు అప్పట్లో గానం చేసే వారేమో తెలియదు. రచయిత పేరు ఎక్కడా కానరాక పోవడం వల్ల ఈ పాట పరంపరగా సామర్ల కోట ప్రాంతంలో పాడు కునే వారేమో కూడా తెలియదు.

ఈ పుస్తకం గురించి పరిచయం చేయడం ఎందుకయ్యా అని మీరడుగ వచ్చును.

చిన్ని పుస్తకమే కావచ్చును. కానీ, అది నా దగ్గరకు చేరిన వైనం నా వరకూ చాలా గొప్పది. విలువైనది.

ఒక తియ్యని ఙ్ఞాపకం. ఒక మరపు రాని అనుభూతి. ఒక కన్నీటి తరంగం. ఒక మధుమయిన హృదయ స్పందన.

ఈ చిన్ని పుస్తకం కామమ్మ కథను చూస్తూ ఉంటే, నాకు నా మిత్రుని చూసి నట్టే ఉంటుంది. పలకరించి పులకరించి పోతున్నట్టుగా ఉంటుంది...

నా పుస్తకాల గూటిలో ఆ గువ్వ పిట్ట మంద్రంగా కువలాడుతూనే ఉంటుంది ...

అప్పటికీ ... ఇప్పటికీ ... ఎప్పటికీనూ ...