20, నవంబర్ 2011, ఆదివారం

గురుదేవుల శతజయంత్యుత్సవ సంచిక


పెద్దలూ, సమవయస్కులూ భాష్యం అనీ, అంతేవాసులు ఎస్వీయన్ గారు అనీ ఎంతో ఇష్టంగా పిలుచుకునే వారు వారిని.
వారే శ్రీభాష్యం వేంకట నరసింహ భాష్యకారాచార్యుల వారు.

వారి శతజయంతి వేడుకలు విజయ నగరం శంకరమఠంలో తే 16 -9-2010 ది అద్వితీయంగా జరిగాయి.
మాష్టారి బంధువులూ, మిత్రులూ, శిష్యులూ, విజయ నగరం సౌరులూ చాలా మంది విచ్చేసి ఆ కార్యక్రమాన్ని ఎంతో విజయ వంతం చేసారు.

ఆనాటి కర్యక్రమం వివరాలతో, ఫొటోలతో, ప్రముఖుల వ్యాసాలతో రూపొందించిన ఎస్.వీ.ఎన్ గారి శతజయంత్యుత్సవ సంచిక వెలువడింది.
నాటి కార్యక్రమంలో ఆచార్య శలాక రఘునాథ శర్మ, బ్రహ్మశ్రీ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీమాన్ కండ్లకుంట వెంకట నరసింహాచార్య స్వామి, వారి శిష్యులు డాక్టర్ ఎ. గోపాలరావు, డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహంగారూ, విజయ నగరం సంస్కృత కలాశాల నాటి అథ్యక్షులు శ్రీ మానాప్రగడ శేషసాయి గారూ, జోస్యుల దక్షిణా మూర్తి గారూమొదలయిన వారు చక్కని ప్రసంగాలు చేసారు.

గురువు గారి కుమారులు శ్రీభాష్యం శ్రీనివాసాచార్యులు, రంగాచార్యులు గారలు ఈ శతజయంతి సంచికను ప్రచురించారు.

ఇందులోమహామహోపాధ్యాయ, కవిశాబ్దిక కేసరి, శ్రీమాన్ న.చ.రఘునాథాచార్య స్వామి, శ్రీమతి కిదాంబి గోదా దేవి, కిదాంబి రఘుపతి, ఆచార్య సార్వ భౌమ ప్రొ. వేదుల సుబ్రహ్మణ్య శా స్త్రి, ప్రాచార్య శలాక రఘనాథ శర్మ, డా. యు.ఎ.నరసింహమూర్తి,శ్రీమాన్ కండ్లకుంట వెంకట నరసింహాచార్యులు, డా. అయలసోమయాజుల గోపాలరావు,
జోస్యుల దక్షిణామూర్తి, శ్రీభాష్యం తిరుమల రామానుజాచార్యులు, ప్రభృతులు వ్రాసిన చక్కని రచనలు ఉన్నాయి.

వీటితో పాటు విష్ణధర్మాంతర్గత మాంగళ్య వివృద్ధి స్తోత్రమ్ నకు మా గురుదేవులు ఎస్.వీ.ఎన్ గారు రచించిన ఆంధ్రతాత్పర్య సహిత వ్యాఖ్యానాన్ని కూడ ప్రచురించారు.

మా గురుదేవులు శ్రీభాష్యం వేంకట నరసింహ భాష్యకారాచార్యులు (ఎస్.వి.ఎన్) గారు విజయగరం సంస్కృత కలాశాలలో విద్యాప్రవీణ, భాషా ప్రవీణలు చదివారు.


జ్యోతిష, న్యాయ, వేదాంత శాస్త్రాలలో నిష్ణాతులు. 1947 నుండి 1973 వరకూ అదే కలాశాలలో పండిత పదవిని అలంకరించారు. తెలుగు శాఖకి అధిపతి గా బాధ్యతలు నిర్వహించారు.

1969 - 1972 వరకూ అదే కలాశాలలో భాషాప్రవీణ చదివిన నేను వారి శిష్యులలో ఒకడినై కనులారా వారిని తిలకిస్తూ, చెవులారా వారి పాఠ్య బోధనామృతాన్ని గ్రోలే అదృష్టానికి నోచు కున్నాను.

గురుదేవులు మాకు అనంతుని ఛందస్సు, ప్రౌఢవ్యాకరణం, అహోబల పండితీయం, అచ్చ తెనుగు కబ్బం యయాతి చరిత్ర, రాఘవపాండవీయం మొదలయినవి బోధించారు. 16వ శతాబ్ది నాయకరాజుల యుగం ప్రత్యేకాంశంగా మాకు బోధించారు.

శ్రీ ఎస్.వీ.ఎన్ గారు ప్రౌఢ వ్యాకరణానికి చక్కని వ్యాఖ్య వెలయించారు. అలాగే అనంతుని ఛందోదర్పణానికి తత్త్వబోధినీ వ్యాఖ్య రచించారు. అప్పటి వరకూ ఈ గ్రంథాలకు సర్వ సమగ్రమయిన వ్యాఖ్యాన గ్రంథాలు లేవు.

ఛందోదర్పణానికయితే అసలు వ్యాఖ్యలే లేవు. ఆ ఘనత మా గురుదేవులకే దక్కింది !

గురువులు నాచన సోమన ఉత్తరహరివంశానికీ, చేమకూర వేంకట కవి విజయ విలాసానికీ కూడా చక్కని వ్యాఖ్యలు రచించారు. ( ఇవి రెండూ అముద్రితాలు, దురదృష్టవశాత్తు నేడు అలభ్యాలు కూడా.)

శ్రీనివాస స్తుతి పేరుతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై శతకాన్ని రచించారు.

శ్రీకూర్మనాథ సుప్రభాతం రచించారు.

నాట్య శాస్త్ర రచనలో పోణంగిపల్లి అప్పారావు గారు, తూమాటి దొణప్ప గారు మొదలయిన ఎందరో సాహితీ వేత్తలకు. పరిశోధకులకూ వీరు అందించిన సహకారం అనన్యసామాన్యమైనది.

చెరగని చిరు నవ్వు , అవ్యాజమైన వాత్సల్యాన్ని కురిపించే చూపులూ, మృదు మధురమైన మాట తీరూ, నిరాడంబరమైన జీవన శైలీ మా గురు దేవులకే స్వంతం.

మాకు ప్రౌఢ వ్యాకరణమో, ఛందో దర్పణమో పాఠ్యాంశంగా బోధించడానికి , తాము స్వయంగా చక్కని వ్యాఖ్యానాలు ఆ పుస్తకాలకి రచించి కూడా తరగతి గది లోకి రావడానికి ముందుగా ప్రతి రోజూ ఆ పుస్తకాలను శ్రద్ధగా తిరగెయ్యడం చూస్తే
అంత గొప్ప గురువల వద్ద చదువు కొనే మా భాగదేయం మాకే దక్కింది కదా అని గర్వించే వాళ్ళం.

ఈ శతజయంతి సంచిక గురించి మరిన్ని వివరాలు కావాలనుకునే వారికి :

శ్రీభాష్యం శ్రీనివాసాచార్యలు, 101, లక్ష్మీ నిలయం, తిరుమల నగర్, మీర్ పేట, మౌలాలి, హైదరాబాద్40,
ఫోను నంబరు: 27241942 మరియు 9866474202 చిరునామాకి సంప్రదించ వచ్చును.

గురుభ్యో నమ:

ఇతి శివమ్.





4, నవంబర్ 2011, శుక్రవారం

సారీ, గురూ !


మా తింగరి బుచ్చి గాడు మీకు గుర్తున్నాడు కదూ!

వీడు రెండో తరగతి రెండుసార్లు చదివి ‘ ఇహ మనకీ చదువులు వంట బట్టవు కానీ ’ అనుకోని వదిలేసాడు. ఆ తర్వాత తన నేస్తులయిన బడి గుంటలంతా పాస్ పీస్ మంటూ ఏవో ఇంగిలిపీసు ముక్కలు మాట్లాడేస్తూ ఉండడంతో తనూ ఓ నాలుగు ఇంగిలీసు ముక్కలు నేర్చుకోవాలను కున్నాడు. ముందుగా ఓ రెండింటిని ఒంట పట్టించు కున్నాడు.

అవి : 1. టాంక్యూ
2. షారీ ! ...
వాడు వాటిని అలాగే పలుకుతాడు. అవేమిటో మీకు నేను చెప్పనక్కర లేదు. ఈ రెండూ నేర్చుకొన్న కొత్తలో ఏది ఎప్పుడు వాడాలో తెలియక తెగ తికమక పడి పోతూ ఉండే వాడు. దానికిదీ, దీనికదీ వాడేస్తూ ఉండే వాడు. అలవాటయ్యే సరికి వారం పది రోజులు పట్టింది.

సరే, టాంక్యూ సంగతి అలా ఉంచితే వాడు షారీ పదం నేర్చుకొన్న కొత్తలో ఆ మోజు కొద్దీ దాన్ని ప్రయోగించడానికి తగిన పరిస్థితులను తానే కల్పించుకొనే వాడు.

సినిమా హాళ్ళలో, ఇంటర్వెల్ అయ్యాక తిరిగి షో మొదలయ్యే వేళ, చీకట్లో కావాలనే కుర్చీలలో కూర్చునే వారి కాళ్ళు
తొక్కి ‘ షారీ ’ ! అని పళ్ళికిలించే వాడు. ఈ సరదా ఒక్కో సారి వికటించి, ‘‘ ఎవడ్రా నువ్వూ ’’తో మొదలై తిట్ల దండకాలతోనూ, ఒక్కోతూరి గూబ గుయ్యి మనిపించడాలతోనూ ముగిసేది. మూడు తిట్లూ, ఆరు చెంప కాయలతో వాడికా పదం బాగా వంటబట్టింది. ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకో లేదు వాడు.

మనలో చాలా మంది ఈ సారీ పదం అలవోకగా వాడేస్తూ ఉంటాం. అడుసు తొక్క నేల ? కాలు కడుగ నేల ? అని కూడా చూసు కోం.

అండగా సారీ అనే దిక్కుమాలిన పదం ఒకటుండగా
ఆలోచించి పని చెయ్యడ మెందుకు దండగా ! ... అనుకొంటూ ఉంటాం, కాస్త కవితాత్మకంగా.

మన పూజా విధానంలోనూ, మనం పలికే మంత్రంలోనో, చేసే పూజలోనో, అసలు మన భక్తిలోనో ఏమేనా పొరపాట్లూ గట్రా ఉంటే దేవుళ్ళకు సారీ చెప్పేసే సుళువు ఒకటి మన వాళ్ళు పొందు పరిచే ఉంచారు.

మీ తెలిసినదే కదా.

వినాయక పూజ చేస్తున్నామనుకోండి, చివరలో

మంత్రహీనం, క్రియాహీనం, భక్తి హీనం గణాధిప:
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే.

అని లెంపలు వాయించు కోవాలి. ఎలాగూ సారీ చెప్పేస్తున్నాం కదా అని భక్తిలో కానీ, పూజా విధానంలో కానీ, మంత్రంలో కానీ బుద్ధి పూర్వకంగా పొరపాటు చేయ కూడదు. అలాగే ఏమరుపాటూ తగదు. కళ్ళు పోతాయ్.

అసలు సారీ చెప్పు కోవాల్సిన పరిస్థితి తెచ్చు కోవడమే తప్పయితే, అలా చెప్పే సారీని కూడా కుర్రకారు కొంతమంది
మరీ విడ్డూరంగా, యాదాలాపంగా, నిర్లక్ష్యంగా , తలపొగరుగా కూడా చెబుతూ ఉండడం కద్దు. అదే -

సారీ గురూ ! ఇది మరింత దిక్కు మాలిన పదం.

ఇక,

మన ప్రాచీన కవులకు కవిత్వం పట్ల, ఛందస్సు పట్ల , అసలు అక్షరం పట్ల ఎంత విధేయత ఉండేదో చూడండి :

యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమో2స్తుతే.

ఎక్కడయినా అక్షర స్ఖలనం జరిగినా, అంటే అక్షర దోషం కలిగినా, ఛందోభంగం వచ్చినా, లేదా మరే దోషాలు నా కవిత్వంలో ఉన్నా, ఓ అక్షర మూర్తీ ! వాటిని అన్నింటినీ మన్నించు తండ్రీ ! నారాయణుడవైన నీకిదే నా నమస్కారం !

ఇంత భక్తీ, నిబద్ధతా ఉండబట్టే వారు మహా కవులయ్యారు. ఋషులయ్యారు. నానృతి: కురుతే కావ్యమ్ కదా.

పొరపాటు చేసినా క్షమించమని అడగడంలో ఇంత ఉదాత్తత చూపించాలి. ఇంత విధేయత కనబరచాలి.

అంతే కానీ, సారీ గురూ ! అనేస్తే చాలనుకో కూడదు. ఇదే నేను చెప్ప దలచినది.

నేను చెప్ప దలచిన దానిని అర్ధమయ్యేలా సరిగా చెప్ప లేదనిపిస్తోందా. కథా మంజరి ( ఏకైక నస బ్లాగు ) తరఫున,

సారీ, గురూ !


3, నవంబర్ 2011, గురువారం

ఈ గేయం ఏ కవి రచించారో చెప్పండి చూదాం !

ఒకరి కొకరు

నువ్వూ నేనూ కలిసి
పువ్వులో తావిలా
తావిలో మధువులా !

నువ్వూ నేనూ కలిసి
కోకిలా గొంతులా
గొంతులో పాటలా !

నువ్వూ నేనూ కలిసి
వెన్నెలా వెలుగులా
వెలుగులో వాంఛలా !

నువ్వూ నేనూ కలిసి
గగన నీలానిలా
నీలాన శాంతిలా !

ఈ చిన్ని గేయ రచయిత ఎవరో చెప్పగలరూ ?

క్లూ ఏదేనా ఇమ్మంటారా ?

అతను గొప్ప కవి అని చిత్రకారులు అనేవారుట ! అతను గొప్ప చిత్రకారుడు అని కవులు పొగిడే వారుట.

ఇతని ఊహా ప్రేయసి చంద్ర సంబంధి.

పోనీ, మరో క్లూ ఇమ్మంటారేమిటి ?

ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు వారు ఒకసారి ఒక నవలల పోటీ లో మరొక ప్రముఖునితో పాటు, ఇతనికి బహుమతి పంచి ఇచ్చారు.

ఆ ప్రముఖుని ప్రముఖ పాటల పుస్తకంలో ( గేయ సంపుటి ) బొమ్మలు ఇతనే గీసారు.

ఈ క్లూలు చాలవూ !

పోనీ, వారి ఫొటో కూడా పెట్టేస్తున్నాను. చెప్పెద్దురూ ! అయితే, మరో అనుబంధ ప్రశ్న కూడా ఉందండోయ్ !

క్లూలలో చెప్పిన బహుమతి పొందిన నవల పేరూ, వారి ఊహా ప్రేయసి పేరూ, వారు బొమ్మలు వేసిన గేయ సంపుటి పేరూ కూడా చెప్పాలి. మరి.


5, అక్టోబర్ 2011, బుధవారం

! దడిగాడువానసిరా

కుక్కలు విశ్వాసానికీ, గాడిదలు సహనానికీ పెట్టింది పేరు.

కాకుల గురించి కాకి గోల ( ఇక్కడ నొక్కి ఆ కాకి గోల భరించండి) అనే టపా రాస్తూ త్వరలో గాడిదల గురించి కూడా
ఓ టపా పెడతానని చెప్పాను కదా.
ఇప్పుడు గాడిదల గురించి రాయడం మానుకుంటే ‘ మాట తప్పేడురా గాడిద కొడుకు ! ’ అని ఎవరు తిడతారో అనే భయంతో ఇది పెడుతున్నాను.

‘ ఖర’ నామ సంవత్సరంలో గాడిద గురించి రాస్తున్నందుకు కథా మంజరి తెగ గర్విస్తోంది.

గాడిదకు చాలా పేర్లుఉన్నాయి. చక్రీవంతం,బాలేయం, రాసభం,గర్ధబం, గార్ధభం,గాడ్ద, ఖరం, గాలిగాడు ... ఇలా.
ఏ పేరుతో పిలిచినా ఓండ్ర పెడుతూ పలుకుతుంది కనుక అందరకీ తెలిసిన గాడిద అని పిలుచుకుంటేనే సుఖంగా ఉంటుంది.

రామాయణంలో ఖర దూషణలు అనే ఇద్దరు రాక్షసులు కనిపిస్తారు. ఇద్దరూ అన్న దమ్ములు. రావణుని చెల్లెలు శూర్ఫణఖ దండకారణ్యంలో ఉన్న శ్రీరాముని మీద మనసు రాక్షసంగా పారేసుకుంది. లక్ష్మణుడు దాని ముక్కు చెవులూ కోసి తరిమేసాడు. అది వెళ్ళి ఈ అన్నదమ్ములిద్దరికీ తన గోడు చెప్పుకుంది. ఈ అడ్డగాడిద లిద్దరూ రామునిపైకి దండెత్తి, అతని చేతిలో చచ్చారు.

భాగవతంలో గార్ధభాసురుడు అనే వాడు కనిపిస్తాడు. వీడూ రాక్షసుడే. వీడు బలరాముని చేతిలో హతుడయ్యాడు.

ఇక, దేవకీ వసు దేవులకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు పుడితే , కసంసుడిపాల బడకుండా వసు దేవుడు ఆ పసివాడిని గంపలో పెట్టుకొని యమునానది దాటి వ్రేపల్లెకు చేరి యశోదమ్మ ప్రక్కన ఉంచి ఆమె కన్న ఆడశిశువును తనతో నిరాటంకంగా తెచ్చుకొన్నాడు. విష్ణుమాయ చేత ఆ పనిలో అతనికి ఎలాంటి ఆటంకాలూ ఎదురు కాలేదు. కానీ
దారిలో ఒక గాడిద మాత్రం రహస్య భేదనం జరిగేలా ఓండ్ర పెట్టింది. ఓండ్ర శబ్దంలో ఓం కారం ఉంది కనుక తన అరుపు
ఓంకారనాదం అనుకుందేమో పిచ్చి ముండ ! శాంతం పాపం ! శాంతం పాపం!

ఇహ లాభం లేదని, వసు దేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుకో వలసి వచ్చింది.

గాడిద ముఖం కలిగిన దేవుళ్ళూ, దేవగణాల వాళ్ళూ ఉన్నారంటే ఈ చతుష్పాది ఎంత మహిమ కలదో వేరే చెప్ప నక్కర లేదు.

ఇవి గాడిదల ప్రస్తావన ఉన్న పురాణ కథలు కాగా, గాడిదల గురించిన నీతి కథలు అనేకం ఉన్నాయి.

అందరికీ తెలిసిన ప్రముఖమైన కథ ఇది:

ఒక చాకలి ఇంట కుక్క గాడిద ఉండేవి. కుక్క అతని ఇంటిని కాపలా కాస్తూ ఉంటే, గాడిద బరువులు మోసేది. తనెంత విశ్వాసంగా ఉన్నా ఇంటి యజమాని తనని సరిగా చూడడం లేదని కుక్కకి కోపం వచ్చింది. ఇక వాడి పట్ల విశ్వాసంగా ఉండ కూడదని భౌ భౌ తీర్మానం ఒకటి ఆత్మగతంగా చేసుకొంది. ఓ రాత్రి యజమాని ఇంట దొంగలు పడ్డారు. సహాయ నిరాకరణకు పూనుకొన్న కుక్క దొంగను చూసి కూడా మొరగడంమానేసింది. గాడిద కంగారు పడి కుక్కను హెచ్చరించింది. కుక్క ససేమిరా అని మొరగడానికి నిరాకరించింది. అయ్యో యజమాని, పాపం, అనుకుంటూ దొంగలొచ్చారని యజమానికి తెలియ జేయడం కోసం గాడిద ఓండ్ర పెట్టింది. చాకలి లేచాడు. నిద్రాభంగమయినందుకు కోపంతో దుడ్డు కర్రతో గాడిదను చావ మోదాడు ! ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకో కూడదని చెప్పే నీతి కథ ఇది.

గాడిదల గురించి కొన్ని జాతీయాలూ, సామెతలూ కూడా చూదాం:

గాడిద గత్తర

గాడిద పిల్ల కోమలం

గాడిద పుండుకి బూడిద మందు

గాడిద కేం తెలుసు గంధం వాసన

కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట.

పనీ పాటా లేని అడ్డ గాడిద

యజమానికి ఎదుటా, గాడిదకు వెనుకా ఉండ రాదు.

గాడిద గుడ్డు

గాడిద గుడ్డూ గరుడ స్తంభం

గాడిదతో చెలిమి కాలి తాపులకే

గాడిదల మోత, గుర్రాల మేత

గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్య పడితే, ఒంటె అందం చూసి గాడిద మూర్ఛ పోయిందిట !

పూర్వం యుద్ధాలలో గజ సైన్యం, ఆశ్విక సేన వగైరాలు ఉండేవి. గాడిదల సేనలు ఉండేవో లేదో తెలియదు. రాజ్య కాంక్షతో యుద్ధాలు చేసే రాజులే ఎలాగూ గాడిదలు కనుక వేరే గాడిదల సేన ఉండే అవసరం లేక పోయి ఉండ వచ్చును.

కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధానులూ, లుబ్ధావధానులూ పరస్పరం త్వం శుంఠా అంటే త్వం శుంఠా ! అనీ,

గాడిదా ! అంటే అడ్డగాడిదా !అనీ ఒకరినొకరు ముచ్చటగా తిట్టుకునే వారు.

మరి గాడిద ప్రస్తావన గల కొన్ని పద్యాలు కూడా చూదామా ?

గాడిదల గురించిన చక్కని చాటువు చూడండి:

రేరే రాసభ ! వస్త్రభారవహనాత్ కుగ్రామ మశ్నాశి కిమ్ ?
రాజా శ్వావసధం ప్రయాహి, చణకాభ్యూషా సుఖం భక్షయాన్ !
సర్వా పుచ్ఛవతో హయమితి వదంత్య త్రాధికారే ప్థితౌ
రాజా తై రుపదిష్టమేవ మనుతేన్ సత్యం తటస్థాపరే:

దీని అర్ధం : ఓ గాడిదా ! బట్టలు మోస్తూ గ్రామాలు తిరుగుతూ శ్రమ పడతావెందుకు ? హాయిగా రాజు గారి గుర్రాల శాలకు పోయి అక్కడ గుర్రాలతో పాటు గుగ్గిళ్ళు తింటూ గడుపు. తోక లున్నవన్నీ గుర్రాలే నని అక్కడి అధికారు లంటారులే. రాజు కూడా గుడ్డిగా ఆ మాట నమ్ముతాడు !

చవట గాడిదలన తగిన రాజుల గురించీ, అధికారుల గురించీ ఈ సంస్కృత చాటువు వివరిస్తే, శ్రీనాథుని తెలుగు చాటువు కూడా చూడండి మరి:

బూడిద బంగలై యొడలు పోడిమి దప్పి మొగంబు వెల్ల నై
వాడల వాడలం దిరిగి వచ్చెడు వారల ’’ చొచ్చొచో ‘‘ యనన్
గోడల గొందులం దొదిగి కూయుచు నుండెడు కొండవీటిలో
గాడిద ! నీవునుం దొదిగి కవివి కావు కదా ! యనుమాన మయ్యెడున్ !

బూడిద రంగులో ఒళ్ళంతా కళావిహీనమై, పాలి పోయిన ముఖంతో, వీధీ వీధీ తిరుగుతూ, వచ్చీ పోయే వారు అదిలిస్తూ ఉంటే గోడల వెనుకా. సందుగొందలలోనూ ఒదిగి పోతూ ఓండ్ర పెడుతూ ఉంటావు. ఓ గాడిదా ! నాకు అనుమానం కలుగుతోంది. ఈ కొండవీటిలో నువ్వు కూడా ఒక కవివి కాదు కదా !

గంగి గోవు పాలు గరిటెడైనను చాలు
కడివిడైనను నేమి ఖరము పాలు
భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ !

గంగి గోవు పాలు చిన్న గరిటెడు చాలు. కడివెడు గాడిద పాలు ఎందుకని వేమన సభక్తికంగా పెట్టే అన్నం ఏ కొద్దిపాటి అయినా చాలును అని చెప్పడానికి మధ్యన పాపం గాడిదను లాక్కుని వచ్చాడు.

కవి చౌడప్ప గాడిదనూ వదల లేదు. అతడివే మూడు పద్యాలు చూడండి:

వేడుక పడి వినవలెనా
దోడు కవిత్వంబునైన తులువ నలువురన్
గోడిగము సేయు వాడే
గాడిదరా కుందవరపు కవి చౌడప్పా.

కవిత్వాన్ని మెచ్చు కుంటూ ఆస్వాదించాలి. అంతే కానీ దానితో నలుగురినీ అవహేళన చేస్తూ, అవమాన పరిచే తుంటరి వాడు గాడిద.

ఆడిన మాటలు తప్పిన
గాడిద కొడు కంచు తిట్టగా విని మదిలో
వీడా కొడుకని యేడ్చెను
గాడిదయును కుందవరపు కవి చౌడప్పా.

పలికిన మాటను మరిచే అబద్ధాలకోరును గాడిదా అని ఒక తండ్రి ఎవడో తిడితే, ఇలాంటి వాడా నా కొడుకు ! ఛీ ! అని గాడిద కూడా ఏడిచిందిట.

గాడీపాలకి గలగిన
వాడయితేనేమి కవుల వంచించిన యా
గాడిద కొడుకును దిట్టగ
గాదా మరి కుంద వరపు కవి చౌడప్పా.

పెద్ద పెద్ద వాహనాలు, పల్లకీలు ఉంటే మాత్రం ఏం ? కవులను మోసగించే వాడు గాడిద కొడుకు ! వాడిని తిడితే ఏం తప్పు కనుక ? పిరదౌసిని మోసగించిన సుల్తాను ప్రభువు గాడిదే కదా ?

వెనుకటి రోజులలో సార్ధవాహులు తమ ప్రయాణాలలో ఎడ్లబళ్ళూ, గుర్రాలూ , మూటలూ అవీ మోయడానికి గాడిదలనూ వినియోగించే వారన్నది తెలిసిన విషయమే కదా.

అవునూ, కవులకు కవి వృషభులు అని బిరుదులూ అవీ ఇస్తూ ఉంటారు కదా. కవి గార్ధభ బిరుదులు ఇవ్వరు.

కవి సమ్మేళనాలలో పాత మాటల మూటలతో నానా చెత్తా మోసుకొని వచ్చి ఆహూతులను చచ్చినట్టు వినేలా చేసే కవులూ , ప్రజానీకాన్ని అడ్డగాడిదల్లా అడ్డంగా మోసగించి, దొరికినంతా దోచుకు తినే రాజకీయ ఖరనాయకులూ, వారికి కొమ్ము కాచే కొన్ని పత్రికల వాళ్ళూ, , టీవీల వాళ్ళూ , కుక్కలనీ, పిల్లులనీ, గాడిదలనీ నానా చెత్తా కుమ్మరించే కథా మంజరి బ్లాగరూ, తన చుట్టూ జరిగే అన్న్యాయాన్ని ఎదిరించే సత్తా లేని వాళ్ళూ, ఆడవాళ్ళను కాల్చుకు తినే వాళ్ళూ ... వీళ్ళంతా గాడిదలు ... కాదేమో, అడ్డ గాడిదలు. కదా మరి.

ఈ టపా తమ మీద పెట్టిన కథా మంజరి బ్లాగరుకి గాడిదలు అంతర్జాతీయ గార్ధభ మహా సభ పెట్టుకొని ఏకగ్రీవంగా తీర్మానించి ’’ దడిగాడువానసిరా ’ అనే బిరుదు ప్రదానం చేయ బోతున్నాయని ఒక (అ) విశ్వసనీయమైన సమాచారం వల్ల తెలుస్తోంది.

పిల్లుల గురించి మరోసారి. ఇక శలవు.







28, సెప్టెంబర్ 2011, బుధవారం

కొన గోట మీటితే చాలు ... ( nail art )

నిజమే.

కొందరు కొన గోట మీటితే చాలు, అపురూప నాదాలు పలుకుతాయి. కొందరికయితే అద్భుతమైన నఖ చిత్రాలు రూపు దాల్చి అలరిస్తాయి.

రంగు ల్లేవు. కుంచెల్లేవు. ఏ ఇతర చిత్రకళా సాధన సంపత్తీ లేదు. కేవలం చేతి గోరు ఉపయోగించి 7 x 5 అంగుళాల దళసరి కాగితం మీద ఆయన ఎంతో అందమైన కళాఖండాలు చిత్రిస్తారు. ఒక తపస్సుగా సాధన చేసిన ఈ గోటి బొమ్మలు ( సంస్కృతీకరిస్తే, నఖ చిత్రాలు ) దేశ విదేశాల వారిని ఎంతగానో అలరించాయి. అలరిస్తూనే ఉన్నాయి.

ఈ నఖ చిత్రకారుని పేరు శిష్ట్లా రామ కృష్ణారావు. పార్వతీపురం స్వస్థలం. 12.4.1939 లో పుట్టారు. తల్లిదండ్రులు,సాంబశివరావు,సరస్వతమ్మ గారలు. విజయనగరం మహారాజా కళాశాలలో పట్టభద్రులు. విశాఖ పట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఉద్యోగం చేసి , నఖ చిత్ర కళ మీద ఉన్న ఎన లేని మక్కువ కొద్దీ ఆ కళలో పూర్తిస్థాయి సాధన నిమిత్తం స్వచ్ఛంద పదవీ విరమణ చేసారు.

హనుమద్యుపాసకులైన వీరు కొన్ని వేల నఖ చిత్రాలు గీసారు. గీస్తూనే ఉన్నారు.

వాల్మీకి రామాయణ గాథను దాదాపు 800 నఖ చిత్రాలలో వేసి తరించారు. 200 పైగా నఖచిత్రాలలో హనుమాన్ చాలీసాను చిత్రించి పరవశించారు.

ఇవి కాక బైబిల్, భగవద్గీత లను కూడా నఖ చిత్రాలతో అలరించి ధన్యులయ్యారు

వీరి నఖచిత్రాలు కొన్నింటిని మీ కోసం ...







వీరు తన కొనగోటితో ఎందరో మహనీయుల చిత్రాలు వేసారు. ఇవే కాక, కేవలం కొన గోటితో జంతువులు , పక్షులూ, చెట్లూ చేమలూ, నదీ నదాలూ, సముద్రాలూ ... ప్రకృతిలోని సమస్తమైన అందాలనూ చిత్రించారు.

వీరిని వరించిన బిరుదులకూ, వీరు పొందిన పురస్కారాలకూ అంతే లేదు.

నఖచిత్ర కళా బ్రహ్మ, నఖచిత్ర కళా ప్రపూర్ణ, నఖచిత్ర శిల్పి, వినూత్న కళా స్రష్ఠ, నఖ చిత్ర వాల్మీకి , విశ్వ నఖచిత్ర కళా సామ్రాట్, నఖచిత్ర కళా ధుని, చిత్ర నఖామారుతి, నఖచిత్ర కళా తపస్వి, నటచిత్ర కళా సార్వభౌమ, విశ్వ నఖ చక్రవర్తి, నఖ చిత్ర కళా విధాత .... ఇవీ వీరి బిరుదులలో కొన్ని.

The Limca Book Of Records లో చోటు చేసుకున్న నఖ చిత్రకారులు వీరు.

జవహర్లాల్ నేహ్రూ, డా. సర్వేపల్లి రాధా కృష్ణ, పి.వి.జి. రాజు, కుముద్బెన్ జోషి, ఢిల్లీ తెలుగు అకాడమీ, జి.యమ్.సి. బాలయోగి, యునెస్కో, నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు, మొదలైన ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. కడప ఆర్యవైశ్య సంఘం వారు స్వర్ణ సింహ తలాటాలు, గండపెండేరం, తొడిగి గజారోహణం చేయించి అపూర్వమైన రీతిలో వీరిని సత్కరించారు. భారతప్రథాని నుండే కాక, నెల్సన్ మండేలా, బిల్ క్లింటన్ ల ప్రశంసలు అందుకున్నారు ... దేశ విదేశాలలో వీరి నఖచిత్ర కళా ప్రదర్శనలు విజయవంతంగా జరిగాయి.

ఈ గోటి బొమ్మల మేటి గొప్ప తనాన్ని సంగోరు కాదు కదా, శతాంశమైనా చెప్ప లేక పోయాను.

శలవ్.


22, సెప్టెంబర్ 2011, గురువారం

ప్రతి పద్య చమత్కారం . చేమకూర వేంకటకవి


తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన ఇది తే 19. 9 . 2011 దీ నవ్య వార పత్రికలో ప్రచురితం.

ప్రతి పద్యంలోనూ ఒక చమత్కారం చూపించిన చేమకూర వేంకటకవి విజయ విలాసం లోని పద్యం ఇది. తాపీధర్మారావు గారి హృదయోల్లాస వ్యాఖ్య విజయవిలాసం అందాలను మరింత అందంగా ఆవిష్కరించింది.

20, సెప్టెంబర్ 2011, మంగళవారం

కాకి గోల


అవి చేసుకున్న పాపం ఏమిటో కానీ, పక్షులలో కాకులనూ, జంతువులలో గాడిదలనూ మనుషులు తెగ ఈసడించు కుంటూ ఉంటారు. నిజానికి ఏదో రూపంలో వాటి అవసరాన్ని ఈ మనుషులు పొందుతూనే ఉంటారు. గాడిదల సంగతి మరో మారు చూదాం కానీ, ముందు కాకుల గురించి చూదాం.

నల్లని రూపం. కర్ణ కఠోరమైన గొంతు. ఉచ్చిష్ఠాలను తినే స్వభావం. వెధవ కాకి గోల ! అని విసుక్కుపోతూ ఉంటాం.

ముందుగా కాకి గల వేరే పేర్లు చూదాం.

అన్యభృత్తు, అరిష్టం, ఆత్మఘోషం, ఏకదృష్టి, ఏకాక్షం, కంటకం, కిరవం, గుమికాడు, పిశునం, యమదూత, బలిభృక్కు, మహానేమి, వాయసం, ద్వికం, దీర్ఘాయువు, చిరంజీవి , కృష్ణం, ప్రత్యలూకం,దివాటనం ...ఇలా చాలా పేర్లు ఉన్నాయి
లెండి !

కాకిని గురించిన కొన్ని ప్రస్తావనలు చూడండి:

వసంత కాలే సంప్రాప్తే కాక: కాక: పిక: పిక:

కాకులూ కోకిలలూ చూడ్డానికి దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ వసంతకాలం వస్తే మాత్రం ఏది కాకో, ఏది కోకిలో ఇట్టే తెలిసి పోతుంది.

కాటికి కట్టెలు చేరెను
యేటీవల పక్షులన్ని యేడువ సాగెన్
కూటికి కాకులు చేరెను
వేటవరపు పోతురాజు లేడా ? రాడా ?

(భీమకవి తిట్టు కవిత్వం )

వయం కాకం వయం కాక:
ఇతి జల్పంతి వాయస:
తిమిరారి తమోహంతి
అస్మాత్ హంతి యితి శంక:

సూర్యుడు ఉదయించేడు. చీకట్లను తరిమి కొడుతున్నాడు. కాకులు గోల చేస్తున్నాయి. మేం కాకులం. మేం కాకులం అంటూ. లేక పోతే, సూర్యుడు చీకట్లతో పాటూ తమను కూడా ఎక్కడ తరిమి కొడతాడో అని వాటి భయం !

కాకులు చీకట్ల లాగా అంత కారు నలుపన్న మాట.

రామాయణంలో కాకాసురుడు అనే ఒక రాక్షసుడు కనిపిస్తాడు. వాడు మందాకినీ తీరంలో సీతా దేవి నిద్రిస్తూ ఉంటే, ఆమె పయ్యెద తొలగించాడు. ఆమె స్తనాలను గోళ్ళతో గీరాడు. అది చూసి రాముడు కోపించి బాణంతో దానిని కొట్టాడు. అప్పుడా కాకి రాముడిని తప్పు మన్నించమని శరణు కోరింది. రామ బాణం అమోఘం కనుక కనీసం ఒక్క అవయవమైనా ఇమ్మన్నాడు రాముడు. కాకి తన కన్ను ఒకటి ఇచ్చివేసింది. అప్పటి నుండీ కాకులకు ఒక కన్ను లేదు.
అందుకు కాకికి ఏకాక్షి అని కూడా పేరు వచ్చింది.

కాకి గూట్లో కోకిల పిల్ల అనే సామెత ఎందుకు వచ్చిందంటే, కోకిల గ్రుడ్లను పెడతాయే కానీ వాటిని పొదగ లేవుట. అందు చేత అవి పిల్లలయే వరకూ వాటిని కాకి గూట్లో కాకి గ్రుడ్లతో పాటూ ఉంచుతాయిట.

కాకి గూడు పెడితే కడపటి వర్షం అనే సామెత కాకి గూడు కట్టడం మొదలెడితే ఇక వానలు కురియవు అనిచెబుతారు

కాకి పిల్ల కాకికి ముద్దు.

కాకిని తెచ్చి బంగారు పంజరంలో ఉంచినా చిలుకపలుకులు పలుకుతుందా ?

కాకి ముక్కుకు దొండపండు అనే సామెత ఒకరు నలుపూ, ఒకరు తెలుపూ అయిన మొగుడూ పెళ్ళాల గురించి.

కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు. బలహీనులను దోచి బలవంతులకు ఇచ్చినట్టుగా అన్నమాట.

పిల్ల కాకి కేం తెలుసు ఉండేలు దెబ్బ.

ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు .

లోకులు పలుగాకులు.

కాకులను ప్రస్తావిస్తూ గల కొన్ని సంస్కృత న్యాయాలు చూడండి:

కాక దంత పరీక్ష ... అనవసరమైన చర్చ అన్నమాట.

కాకతాళీయం ... కాకి తాటి చెట్టు మీద వాలడం, తాటి పండు రాలి తటాలున నేలన పడడం ఒకే సారి జరిగితే అది కేవలం కాకి వాలడం వల్లనే జరిగిందని అపోహ చెంద రాదు.

కాకరుత బీరు న్యాయం ... పగలు కాకి కూత విని భయపడి పోయి భర్తను ఆలింగనం చేసుకున్న ముద్దరాలు రాత్రి పూట నదిని దాటుకుంటూ విటుడి దగ్గరకి ఒక్కర్తీ వెళ్ళిందిట. అదీ ఎలాగూ, నదిలో ఉన్న మొసళ్ళకు ఆహారంగా మాంసం ముద్దలు వేసుకుంటూ , వాటి బారిన పడకుండా.

కాకాధికరణ న్యాయం ... పలానా వాడి ఇల్లు ఏదని అడిగితే, కాకి వాలి ఉంటుంది చూడూ అదే వాడి ఇల్లు ! అని తిక్క సమాధానం ఇవ్వడం.

కాకోలూకనిశాన్యాయం ... అంటే, కాకికి పగలయితే గూబకు రాత్రి. దానికి రాత్రయితే, దీనికి పగలు.

రావణుడికి భయపడి యముడు కాకి రూపం ధరించాడుట. జనం తమ పితృదేవతలకు తద్దినాలు పెట్టి కాకి పిడచను కాకులుకు పెట్టాలని, పితృదేవతలు కాకుల రూపంలో వచ్చి ఆ పిండాలను తిని వెళ్తారుట. అప్పుడే వారికి తృప్తి కలుగుతుందిట. కాకులకు రావణుడు ఇచ్చిన వరంగా దీనిని చెబుతారు.

కాకులలో మాల కాకుల పరిస్థితి మరీ అధ్వాన్నం.

కవి యను నామంబు నీటి కాకికి లేదా ? అని అడిగే కవి ఒకడు.

పిండం తినే కాకి పితరుడెలా అవుతాడని తెగేసి చెప్పే కవి మరొకరు.



కాకేమి తన్ను తిట్టెనె?
కోకిల ధనమేమి తన్ను గో కొమ్మనెనే ?
లోకము పగయగు బరుసని
వాకున, చుట్టమగు మధుర వాక్యము కలిమిన్.

కాకి నిన్ను తిట్టిందా ఏమిటి ? కోకిల నీ కేమయినా డబ్బులిచ్చిందా? కాకిని అసహ్యిం కుంటావు. కోకిలను మెచ్చుకుంటావు. అంటే, లోకం కఠినంగా మాటలాడే వారికి దూరంగా ఉంటారు. సరుషంగా మాటలాడే వారు అందరకీ శత్రువులవుతారు. మధురంగా పలికితే మిత్రులవుతారు.

ఒక వృత్యనుప్రాసం సరదాగా చూడండి. ఇదీ కాకుల గురించే.

కాకీక కాకికి కోక. కుక్కీక కుక్కకి కోక. కాకీక కాకికి కాక, కుక్కకా ? కుక్కీక కుక్కకి కాక కాకికా ? కాకీక కాకికే కోక.
కుక్కీక కుక్కకే కోక...


ఇదీ కాకి గోల. గాడిదల గురించి మరోసారి.











7, సెప్టెంబర్ 2011, బుధవారం

బాల సాహిత్యం ... చిట్టి కథలు



నవ్య వార పత్రికలో తే 21 - 7 - 2011 దీ నుండి ఏడాది పాటు వరుసగా పాల బువ్వ పిల్లల శీర్షిక కోసం రాసిన కథలు ఇవి. వీటిని అన్నింటినీ కానీ, కొన్నింటిని కానీ పుస్తక రూపంలో ప్రచురించడానికి అభిలాష గల వారెవరయినా నన్ను పంప్రదించ వచ్చును.





మొత్తం : పేజీలు : 71 ( Expand అనే చోట మౌస్ పెట్టి నొక్కితే చదవడానికి వీలుగా ఉంటుంది. పుస్తకం కుడి ఎడమల వేపు అంచుల మధ్యలో ఉండే బాణం గుర్తు మీద నొక్కితే పేజీలు తిరుగుతాయి . ఈ సూచన తెలియని వాదరి కోసమే సుమండీ )

తిక్కన పద్యం


తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 10-8 .-2011 దీ సంచికలో నవ్య లో ప్రచురణ





31, ఆగస్టు 2011, బుధవారం

కంటికి నిద్ర లేదు !!


సంజయుడు రాయబారిగా పాండవుల వద్దకు వెళ్ళాడు. తిరిగి వచ్చాడు. అక్కడి విషయాలు తెలుసు కోవాలని ధృతరాష్ట్రుడికి మహా తొందరగా ఉంది. ఐతే , తిరిగి వచ్చిన సంజయుడు అతనికి ఏమీ అప్పుడు చెప్ప లేదు. బడలికగా ఉందన్నాడు. మరు నాడు ఉదయమే అందరూ సభదీరే వేళ అక్కడ జరిగిన విశేషాలన్నీ చెబుతానని తన నివాసానికి వెళ్ళి పోయాడు.

అంతే !

మరింక కురు మహారాజుకి కంటి మీద కునుకు పట్ట లేదు. అశాంతితో అటూ ఇటూ దొర్లు తున్నాడే కానీ నిద్ర వస్తేనా ?
విదురుడిని తన దగ్గరకి పిలిపించు కున్నాడు. నాలుగు మంచి మాటలు చెప్పి తన అశాంతిని దూరం చేయమన్నాడు.

విదురుడు రాజుకి చాలా నీతులు బోధించాడు. అక్కడక్కడా చురకలు కూడా వేసాడు.

బలవంతుఁడు పై నెత్తిన
బలహీనుఁడు ధనము గోలు పడిన యతఁడు మ్రు
చ్చిల వేచు వాఁడు, గామా
కుల చిత్తుఁడు నిద్ర లేక కుందుదు రధిపా !


బలవంతుడు మీద పడిన బలహీనుడూ, డబ్బు పోగొట్టు కొన్న వాడూ, ఎప్పుడు ఎవడి సొమ్ము కాజేదామా అని కాచుకుని కూర్చునే వాడూ, కామం చేత మనస్సు కలత చెందిన వాడూ నిద్ర పట్టక అవస్థ పడతారు సుమీ ! అని
హిత బోధ చేసాడు విదురుడు.

ఈ సందర్భం లోనే గొప్ప తాత్త్వికార్ధాలతో కూడిన తిక్కన గారి మహా భారతం ఉద్యోగ పర్వం లోని ఒక చిన్న పద్యం చూడండి:

ఒకటిఁ గొని, రెంటి నిశ్చలయుక్తిఁ జేర్చి
మూఁటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి
యేనిటిని గెల్చి యాఱింటి నెఱిఁగి యేడు
విడిచి వర్తించు వాఁడు వివేక ధనుడు !

అధికారాన్ని చేపట్టి, మంత్రమూ ఉత్సాహమూ అనే రెండింటినీ నిశ్చలంగా ఉండేలా జత చేయాలి, మిత్రులూ, అమిత్రులూ , తటస్థులూ అనే మూడు వర్గాల వారినీ, సామ, దాన, భేద, దండములు అనే నాలుగు ఉపాయాల చేతా పూర్తిగా వశ పరచు కోవాలి. త్వక్కు ( చర్మం) ,చక్షువు ( కన్ను ) , శ్రోత్రము ( చెవి ), జిహ్వ ( నాలుక), ఘ్రాణం
( వాసన) అనే సంచేంద్రియానూ జయించాలి. సంధి , విగ్రహం, యానం , ఆసనం, ద్వైదీభావాలు(2) అనే ఆరింటినీ తెలుసు కోవాలి. వేట ,జూదం, పానం, స్ర్తీ , వాక్పారుష్యం ( కఠినంగా మాటలాడడం, ) దండపారుష్యం ( హింప చేయడం), అర్ధ దూషణం ( దుబారా చేయడం) అనే సప్త ( 7) వ్యసనాలనూ విడిచి పెట్టి ఎవడయితే ఉంటాడో వాడే వివేకవంతుడు.


స్థూలంగా ఈ పద్యానికి ఇదీ భావం. కానీ పెద్దలు ఈ చిన్న పద్యానికి వేరే తాత్త్విక పరమయిన అర్ధాలు చెబుతారు. వాటిని కూడా చూదామా ?

ఒకటి బుద్ధి. దీనికి వాక్కు , క్రియ, అనే రెండింటినీ నిశ్చలంగా ఉండేలా చేర్చాలి. అంటే ఏది చెబుతాడో అదే చేయాలి.
ఇక, ధర్మార్థ కామాలను మూడింటినీ బ్రహ్మచర్యం, గార్హస్థం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు ఆవ్రమవిధులతో వశం చేసు కోవాలి. కర్మేంద్రియాలు ( వాక్కు, పాణి, పాదం, వాయువు, గుహ్యం ) ఐదింటినీ గెలవాలి. యజన, యాజన, ఆద్యయన, దాన, ప్రతిగ్రహాలు అనే స్మార్త కర్మలను తెలుసుకొని, ఆవరణం ( పంచభూతాలు పృధ్వి, అప్,తేజస్సు, వాయువు, ఆకాశం) బుద్ధి, అహంకారం ఈ మొత్తం ఏటింటినీ విడిచి వర్తించే వాడు వివేకధనుడు.

పెద్దలు చెప్పే మరో తాత్త్వికార్ధం:

ఒకటి - సత్త్వం , రెండు -రజస్తమస్సులూ , మూడు -ధన, దార ( భార్య) పుత్రుల పట్ల మమకారం, నాలుగు - ధ్యానం, ధారణ, యోగం, సమాధి. తక్కినవి మీద చెప్పినవే.

మూల భారతంలో దీని శ్లోకం ఇలా ఉంది:

ఏకయా ద్వౌ వినిశ్చిత్య త్రీం శ్చతుర్భి ర్వశే కురు
పంచ జిత్వా విదాత్వా షట్ సప్త హిత్వా సుఖీ భవ !


ఈ టపా రాస్తున్నప్పుడు వచ్చేడు మా తింగరి బుచ్చిగాడు. ( వాడి తొలి పరిచయం ఇక్కడ చూడండి ) ఏఁవిటి రాస్తున్నావని ఆరా తీసాడు.

అంతా చదివి వినిపించేను. నా ఖర్మ కాలి, ఏ కొంచెమైనా అర్ధమయిందా అనడిగేను.

భలే వాడివే , అర్ధం కాక పోవడమేం ! గుడ్డి రాజుకి పాపం నిద్ర పట్ట లేదు. అంతే కదా ! అన్నాడు. నా బుర్ర తిరిగి పోయింది.

ఓ నిద్ర మాత్ర వేసుకుంటే పోలా ! అని ముక్తాయించేడు.

నాకు బ్లాగు రాయడం మీద చెప్ప లేనంత విరక్తి కలిగింది. కథా మంజరిని మూసేద్దామని నిర్ణయాని కొచ్చేను.

కానీ మా తింగరి బుచ్చి గాడు తన ఆత్మ కథను కథా మంజరిలో రాయాలని పట్టుబట్టేడు. అందు వల్ల తప్పడం లేదు.

త్వరలో మా తింగరి బుచ్చి గాడి ఆత్మ కథ కథా మంజరిలో. వేచి చూడండి ...





30, ఆగస్టు 2011, మంగళవారం

తెలుగు పద్యం వెలుగు జిలుగులు


నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షిక క్రింద వరుసగా తే 10.8.2011 దీ , తే 24.8.2011దీ
తే 31.8 .2011 దీ సంచికలో ప్రచురితమైన పద్యాలను ఇక్కడ ఉంచుతున్నాను. ఈ లేబిల్ క్రింద వీటితో కలిపి మొత్తం ఇప్పటికి 7 పద్యాలు చూడ వచ్చును.

తక్కినవి తీరిక చేసుకొని తరువాత ...






























29, ఆగస్టు 2011, సోమవారం

పోతన పద్యం


నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షిక క్రింద తే 3-8-2011 దీ సంచికలో ప్రచురితం.

ఇది బమ్మెఱ పోతన భాగవతం లోని వామన చరిత్ర ఘట్టం లోని పద్యం. ఈ లేబిల్ క్రింద ఇది నాలుగో టపా.

28, ఆగస్టు 2011, ఆదివారం

అల్లసాని పెద్దన పద్యం



ఈ పద్యం నవ్య వార ప్రతికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 17-8-2011 దీ సంచికలో ప్రచురింప బడింది

ఇది పెద్దన గారి మను చరిత్ర ప్రబంధం లోనిది. తెలుగు పద్యం లేబిల్ క్రింద ఇది మూడవది.

27, ఆగస్టు 2011, శనివారం

తిక్కన పద్యం


నవ్య వార పత్రిక తే 27-7-2011 దీ సంచికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన వెలువడిన పద్యం . ఇది తిక్కన
గారి మహా భారతం ఉద్యోగ పర్వం లోనిది.

తెలుగు పద్యం లేబిల్ క్రింద ఇది రెండవది.




రేపు మరో కవి కావ్యం నుండి మరో మనోహరమైన పద్యం ...

26, ఆగస్టు 2011, శుక్రవారం

నన్నయ పద్యం


నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షిక క్రింద వారం వారం ఒక తెలుగు పద్యం గురించి వ్రాస్తున్నాను.
ఆ శీర్షికలో ప్రచురితమైన వాటని ఇక్కడ బ్లాగు మిత్రుల కోసం ఉంచుతున్నాను.

ఇది నన్నయ గారి అవతారిక లోని పద్యం. నవ్యలో తే 20 - 7 - 2011 దీ సంచికలో ప్రచురితం. నవ్యలో వచ్చాక వీలుని బట్టి వాటిని ఈ బ్లాగులో ఉంచుతాను. తెలుగు పద్యం లేబిల్ క్రింద వాటిని మీరు చూడ వచ్చును.



19, ఆగస్టు 2011, శుక్రవారం

అపురూపం. కథలసంపుటి




ఈ మధ్య కొత్త టపాలు ఏమీ రాయడం లేదు. పోనీ, నా కథల సంపుటి అపురూపం చూడండి.

పుస్తకం మీద మౌస్ పెట్టి నొక్కితే అక్షరాలు పెద్దవిగా కనబడతాయని చెప్ప నవసరం లేదు కదూ.

29, జులై 2011, శుక్రవారం

ఇంతకీ అసలు సమస్య ఏమిటయ్యా ?


ఈ క్రింది శ్లోకం చూడండి:

కా శంభు కాన్తా ? కిము చంద్ర కాంతం ?
కాన్తా ముఖం కిం కురతే భుజంగం
క: శ్రీపతి: కా విషమ సమస్యా ?
‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ: ’’

ఇందులో మొత్తం నాలుగు ప్రశ్నలూ, నాలుగు సమాధానాలూ ఉన్నాయి. చూడండి:

కా శంభు కాన్తా ? = ఎవరు ఈశుని భార్య ? = గౌరి

కిము చంద్ర కాన్తం ? = ఏది చంద్ర బింబం ? = ముఖం

కాన్తా ముఖం కిం కురుతే = అమ్మాయి ముఖాన్ని ఏం చేస్తున్నాడు? = చుంబతి ( ముద్దు పెట్టు కుంటున్నాడు)

భుజంగం క: = పాము ఎవరు ? = వాసుకి.

ఈ విధంగా తొలి నాలుగు ప్రశ్నలకీ వరుసగా నాలుగో పాదం లోని ’’ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ:’’ అని

కవి నాలుగు జవాబులూ తనే ఇచ్చేడు.

మరయితే అసలు సమస్య ఏమిటయ్యా ?

ఒక కవి ‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ:’’ అని ఒక సంస్కృత సమస్య ఇచ్చాడు. శ్లోకం లోని మీద మూడు పాదాలూ పూరణ.

కా విషమ సమస్యా ? = ఏది జటిలమైన సమస్య ? దీనికి నాలుగో పాదం లోని ‘‘ గౌరీ ముఖం చుంబతి వాసు దేవ: ’’ అనేదే జవాబు.

గౌరీ దేవి ముఖాన్ని వాసు దేవుడు ముద్దు పెట్టు కోవడ మేమిటీ , ఓఘాయిత్యం కాక పోతేనూ !!

మరదే , అందుకే కవికి మండుతుంది. ఏ అనౌచిత్యమూ లేకుండా ఈ సమస్య లోని ప్రతి పదానికి అర్ధవంత మయిన జవాబు వచ్చేలా ముందే ప్రశ్నలు వేశాడు కదండీ.

ఇలాంటి కిత కితలంటే మన పూర్వ కవులకి చాలా సరదా సుమండీ . మనలా ఎప్పుడూ ఆందోళనలతో ఏడుపుగొట్టు ముఖాలతో ఉండకుండా గొప్ప కులాసాగా, కుంచెం శృంగారం ఒలికించే పద్యాలూ శ్లోకాలూ చెప్పుకుంటూ ఉండే వారు కాబోలు.

ఆ రోజుల్లో వాళ్ళకి ఏ నవ్వుల క్లబ్బులూ ఉండేవి కాదని , వాటి అవసరం వాళ్ళకి పడ లేదని మా కథా మంజరి దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది.




శలవ్.



6, జులై 2011, బుధవారం

గుండె తడి ... కథల సంపుటి ... ఒక సమీక్ష



నా ‘ గుండె తడి ’ కథల సంపుటి గురించి ఈ వారం ( 13.7.2011) దీ సంచికలో బుక్ చాట్ శీర్షికలో ప్రచురిత మైన ‘శ్రీవత్స‘ గారి పుస్తక సమీక్ష చదవండి ...


27, జూన్ 2011, సోమవారం

తిరుగలి గురించి మా తింగరి బుచ్చి గాడి ఉపన్యాసంబెట్టి దనిన ...


ఇప్పుడంటే మిక్సీలూ , గ్రైండర్లూ వచ్చేయి కానీ, వెనుకటి రోజులలో ఆడవాళ్ళు జబ్బలు పీకే లాగున పిండి రుబ్బాలంటే రుబ్బు రోలునీ, దంచాలంటే రోళ్ళూ రోకళ్ళనీ, విసరాలంటే తిరుగళ్ళనీ ఆశ్రయించే వారు.

ప్రస్తుతం మనం తిరుగలికి చెందిన కబుర్లు చెప్పు కుందాం.

మీదో రాయీ, కిందో రాయీ ఉండే విసురు సాధనం తిరుగలి. కింద రాయి స్థిరంగా ఉంటే, మీద రాయి చేత్తో త్రిప్పడానికి అనువుగా ఉంటుంది. మీద రాతిని చేత్తో త్రిప్పడానికి అనువుగా ఒక కర్రతో చేసిన పిడి ఉంటుంది. విసర వలసిన గింజలను మీద రాయి మధ్యలో ఉండే ఖాళీ లోంచి పోసి, ఇంక త్రిప్పడం ( అంటే విసరడం) మొదలు పెట్టే వారు. విసరగా విసరగా మెత్తని పిండి రెండు రాళ్ళ మధ్యా ఉండే ఖాళీ ప్రదేశం నుండి కింద పడేది. ఇదీ తిరుగలి పని చేసే తీరు.

ఈ తిరుగలికే చాలా పర్యాయ పదాలు ఉన్నాయి !

అంజి, అనఘట్టము,కణలాభము, ఘరట్టము,జిక్కి,యంత్రపేషిణి,యంత్రము, రాగల్రాయి, విసుర్రాయి ... ఇవండీ తిరుగలికి ఉన్న మరో పేర్లు !

ఇంత ఆయాసపడి పోవడం ఎందుకు కానీ, హాయిగా మనం తిరుగలి అనో, విసుర్రాయి అనో తెలిసిన పేర్లతో ప్రస్తుతానికి ముద్దుగా పిలుచు కుందాం ! ప్రాణానికి సుఖంగా ఉంటుంది.

తిరుగలి ఊసెత్తితే సాయి భక్తులకి సాయి బాబా షిర్దీలో తిరుగలి విసరడం గుర్తుకు వస్తుంది. కదూ !

ఆ కథ ఇక్కడ మరొక్క సారి గుర్తుకు తెచ్చు కుందాం.

అన్నా సాహెబ్ ధబోల్కర్ అనే ఒక పెద్ద మనిషి బాబా కీర్తి గురించి విని ఆయన దర్శనం కోసం షిరిడీ రావాలనుకున్నాడు. అతడు వచ్చిన రోజు ప్రొద్దున సాయి బాబా మసీదులో ఒక తిరగలి ముందర కూర్చుని గోధుమలు విసురుతున్నారు. బాబాకు ఇల్లు సంసారం లేవు. వారు భిక్షాటనంతో జీవిస్తారు గదా! మరి ఈ గోధుమ పిండి ఎందుకు? అని అతడు వచ్చి ఆశ్చర్యకరంగా చూస్తున్నాడు. అంతలో నలుగురు ఆడవాళ్ళు బాబాను తిరగలి ముందు నుంచి లేపి, పాటలు పాడుతూ పిండి విసిరారు. తరువాత దాన్ని నాలుగు భాగాలుగా చేసి తీసుకు పోబోయారు. అపుడు బాబా వాళ్ళను కోప్పడి "ఈ పిండి మీకు కాదు. దిన్ని తీసుకువెళ్ళి ఊరి సరిహద్దులలో చల్లండి" అని ఆజ్ఞాపించారు. ఇదంతా చూస్తున్న అన్నా సాహెబ్ ఆ ఊరి వాళ్ళను అడిగాడు - అలా పిండి ఊరు చుట్టూ చల్లటం దేనికి? అని. దానికి వాళ్ళు చెప్పిన సమాధానం: "షిరిడీ గ్రామంలో కలరా వ్యాధి ఉంది. దాన్ని పోగొట్టడానికి బాబా యిలా చేసారు. ఆయన విసిరింది గోధుమలు కావు, వ్యాధినే" అని చెప్పారు. వాళ్లు చెప్పినట్లే మరునాటికి కలరా వ్యాధి తగ్గు ముఖం పట్టింది. అన్నా సాహెబ్ బాబా శక్తికి ఆశ్చర్యపోయాడు. ఇక ఆయన దగ్గరే ఉంది పోయాడు. బాబా కూడా అంతర్నేత్రంతో ప్రేమగా చూచేవారు. అతని "హేమాడ్పంత్" అని పిలిచేవారు. అతని మనసులో ఏ సందేహం వచ్చినా, బాబా తీర్చే వారు
తిరుగలి గురించి ఇంత పవిత్రమూ, ప్రశస్తమూ, ప్రఖ్యాతమూ అయిన కథలూ, విశేషాలూ ఉండగా ఓ సారి మా తింగరి బుచ్చి గాడు ఒక మహిళామణుల సభలో తిరుగలి గురించి అవాకులూ చవాకులూ ఉపన్యసించి మెడ మీదకి ( పీక మీదకి అని ఎందుకు అన లేదో మొత్తం ఆ వృత్తాంతం చదివితే గానీ మీకు తెలియదు) తెచ్చు కున్నాడు.
ఇంతకీ, మా తింగరి బుచ్చి గాడి గురించి మీకు చెప్పనే లేదు కదూ ! సన్నగా రివట వలె గాలికి తూలి పోవు రీతిని ఒప్పు వాడు. అడపాదడపా సభలలో సందడి చేయు వాడు. పిలిచిననూ, పిలువక పోయిననూ సభా ప్రాంగణము నందు తిరుగాడు వాడు. వీలు చిక్కించు కుని వేదిక నెక్కి తన ధోరణిలో ఉపన్యాసము లిచ్చు వాడు. మిక్కిలి తరుచుగా ఉపన్యాసము పూర్తి చేయక ముందే బలవంతముగా వేదిక నుండి నిర్దాక్షిణ్యముగా దింపి వేయ బడు వాడు. అంతియ కాక, లోకములో ఏ విషయము తనకు తెలియదను మాట లేని వాడు. సమస్త విషయముల గూర్చిన సమగ్ర సమాచారము తన వద్ద మాత్రమే కలదని అహంకరించు వాడు ...
మా తింగరి బుచ్చిగాడి ఘనత గురించి చెబుతూ పోతే తరిగేది కాదు కానీ , ఇప్పుడు వాడిచ్చిన తిరుగలి గురించిన ఉపన్యాసం గురించి మాత్రం చెబుతాను వినండి:
‘‘ మన వాళ్ళుట్టి వెధవలోయ్‘‘ అని గురజాడ ఊరికే అన లేదు. గురజాడకి అసలు మన వారి గురించిన ఆ గ్రహింపు మా ముత్తాత బ్రహ్మశ్రీ తింగరి హనుమాన్లు శాస్త్రుల వారి వలన కలిగిందని మీలో ఎవరికీ తెలిసి ఉండక పోవచ్చును. సరే ఈ విషయం కాస్సేపు ప్రక్కన పెడదాం ! మన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాక పోతే, ఆలు మగల సంసారాన్ని బండి చక్రాలతోనా పోలుస్తారూ ! చక్రాల సంగతి అలా ఉంచితే, బండిని లాగేవి ఎద్దులు కదా ? ఆ రెండున్నూ పుంలింగములు కదా ? మరి ఆలు మగలలో ఒకరు పురుషుడున్నూ, వేరొకరు స్త్రీయున్నూ అయి ఉన్నారు కదా !
అందు చేత ఈ పోలిక శుద్ద చవటలు చేసిన పోలికగా నేను ఈ వేదిక మీద నుండి ధృవీకరిస్తున్నాను.... ’’ మా తింగరి బుచ్చి గాడి ఉపన్యసం ఈ వరకూ వచ్చే సరికి సభలో కొంత అలజడి బయలు దేరింది. అసహనం పురులు విప్పింది. హాహాకారాలు చెలరేగాయి. అదంతా తనఉపన్యాస ధోరణికి ప్రశంసారూపమయిన శబ్ద ఘోషగా ఎంచి, మా తింగరి బుచ్చి తన ఉపన్యాసాన్ని ఇంకా ఇలా కొన సాగించాడు:
‘‘ అందు చేత నా మట్టుకు నాకు భార్యా భర్తలను తిరుగలితో పోల్చడం సరైనదని పిస్తుంది. కింద ఉండే రాయి భార్య అయితే, పైనుండే రాయి భర్త. కింద రాయి అంగుళం కదలదు. అంటే, ఏమిటంటా, ఆడది గడప దాటకుండా ఇంట్లోనే పడి ఉండాలన్నమాట ! ఇక మగాడు పైన ఉండే రాయిలాగా సదా తిరుగుతూ డబ్బులు సంపాదించాలన్నమాట!అంతే కాకుండా మీది రాయి తిరుగుతూ ఉంటే, కింది రాయి ఆ రాపిడిని తట్టు కుంటూ ఉంటుంది. అంటఏ ఏమిటంటా ? భర్త పెట్టు నసను భార్య సదా భరిస్తూ ఉండడమే సృష్టి ధర్మం. అంతే కానీ నేటి ఆధునిక తుచ్ఛ వనిత వలె తిరుగబడుట అవివేకమూ, అనాగరికమూ ... ఇక, తిరుగలి తిరిగి నప్పుడే మెత్తని పిండి అనే సంసార సుఖాలు లభిస్తాయి. అయితే, సంసారం అనే ఈ తిరుగలి త్రిప్పేది ఎవరని మీకు ఆలోచన రావచ్చును. తిరుగలి పిడి అనే కాలం పట్టుకుని విధాత తిరుగలిని విసురుతూ ఉంటాడు....’’
ఇహ విన లేక సభలోని మహిళామణులంతా ఏక కంఠంతో దిగు ! దిగు !! ధ్వానాలు పలికి, మైకు లాక్కుని, చొక్కా గుంజుతూ, వేదిక మీద నుండి అర్ధాంతరంగా ఇవతలకి లాగి, సభాప్రాంగణం నుండి బయటకు ఎప్పటి వలె గెంటి వేసారట.
మా తింగరి బుచ్చి గాడు అందుకు నొచ్చు కోలేదు కానీ, తన గభీరమైన ఉపన్యాసం ఇంకా పూర్తి కాకుండానే అవాంతరం ఏర్పడింది కదా ! అని చింతించాడుట. ఆ రాత్రి అతనికి ఇంట అన్నం కాదు కదా, పచ్చి మంచి నీళ్ళు కూడా లభించ లేదని నమ్మకమైన సమాచారం కథామంజరి వద్ద ఉంది.
ఇదీ మా తింగరి బుచ్చిగాడి తిరుగలి మీద ఉపన్యాసం. వీలు చూసుకుని తింగిరోపన్యాసాలు అనే లేబిల్ క్రింద వాని ఉపన్యాసాలు మును ముందు మీముందు ఉంచగలను.
ఇక, తిరుగలి గురించి లోగడ కవిగారు ఒకరు చెప్పిన ఆశువు చూడండి
ఏడిచెదవేలనోయిక ఘరట్టమ ! త్రిప్పల బెట్టుచుందురే
చేడెలు నన్నటంచు కడు చిత్రముగా కడగంటి చూడ్కి చే
రేడులనైన ద్రిప్పెదరు రేలు పవళ్ళిక కేలుబట్ట నె
వ్వాడు పరిభ్రమింపడు సుమా ! సుదతీమణి త్రిప్పు చేతలన్ !!
దీని భావం:
ఓ తిరుగలీ ! ‘‘ఆడవాళ్ళు నన్ను స్థిరంగా ఉండనివ్వ కుండా అరిగి పోయేలాగున తెగ త్రిప్పుతూ ఉంటారు ’’
అని ఎందుకే ఏడుస్తావు ? స్త్రీలంటే ఏమిటను కున్నావ్ ! ఓర చూపులతో ప్రభువులనయినా గిర్రున తమ వెంట రేయింబవళ్ళు త్రిప్పుకో గలరు. ఒక తూరి చేయి అందుకుంటే, ఆ చేతిని వదలకుండా ఆవిడగారి కనుసన్నలలోతిరుగాడుతూ ఉండ వలసినదే కదా !
అన్నట్టు మాతింగిరి బుచ్చిగాడికి తెలుసో, లేదో, తిరుగలి మాహాత్మ్యం గురించిన ఓ విషయం వాడి చెవిని వెంటనే వేయాలి. అవపరమయితే ఏదో చోట తన ఉపన్యాసంలో ఉపయోగించుకుంటాడు కదా.
అదేమిటంటే, కోదాడ దగ్గర ఒక నరసింహస్వామి దేవాలయంలో ఒక తిరుగలి ఉంది. దానిని కౌగలించుకుని వేడుకుంటే ఎలాంటి కోరికలనయినా తీరుస్తుందని భక్త జనుల విశ్వాసం ! ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే తిరుగలి అదిట ! కావాలంటే ఈ క్రింది ఫొటో మీరే చూడండి: :
ఈ భక్తాగ్రేసరి ఇప్పట్లో లేవదు కానీ, ఇక శెలవ్.

ఇతి తిరుగలి ఉపాఖ్యానమ్ సర్వం ప్రస్తుతానికి సమాప్తమ్