6, ఏప్రిల్ 2012, శుక్రవారం

1, ఏప్రిల్ 2012, ఆదివారం

అంతా రామ మయం !



కథా మంజరి అభిమానులకు శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు !

శ్రీరాముని దయ చేతను

నారూఢిగ సకల జనులు నౌరా యనఁగా

ధారాళమైన నీతులు

నోరూరఁగ చవులు పుట్ట నుడివెద సుమతీ.

బద్దె భూపాలుని సుమతీ శతకంలోని ఈ పద్యం తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైనది కదూ ?

శ్రీరామ చంద్రుని దయా విశేషం చేత, జనులెల్లరు ఆశ్చర్య చకితులయ్యే విధంగా ప్రసిద్ధమైన నీతులను ధారాళంగా వినేవారికి నోరూరే విధంగా చెబుతాను. మధేర పదార్ధాలను తింటే నోట్లో నీళ్ళు ఎలా ఊరుతాయో, ఈ కమ్మని నీతులు విన్న వారి నోట నీళ్ళు ఊరవలసినదే !

కంచెర్ల గోపన్న రచించిన దాశరధీ శతకం నుండి ఇవాళ ఒకటి రెండు చక్కని పద్యాలనయినా తలచు కోవడం మనకి విధాయకం.

శ్రీ రఘురామ చారు తులసీదళధామ, శమక్షమాది శృం

గార గుణాభిరామ; త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు

ర్వార కబంధ రాక్షస విరామ ; జగజ్జన కల్మషార్ణవో

త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణా పయోనిథీ !

మంగళకరమయిన ఇక్ష్వాకు వంశంలో జన్మించిమనోహర మయిన తులసీమాలను దండగా ధరించి, శాంతం, క్షమ, మొదలయిన గొప్ప గుణాలు కలిగి,మూడు లోకాలలో కీర్తింప బడిన వాడవు ! గొప్ప పరాక్రమం అనే అభరణాలతో విలసిల్లి, అపజయం లేని కబంధుడు అనే రాక్షసుడిని చంపి, లోకాలను పాపాలు అనే సముద్రం నుండి ద్ధరించి, దయా సముద్రడవై భద్రాచలంలో వేంచేసిన దశరథ మహారాజ కుమారా ! శ్రీరామా ! జయము.

రాకలుషంబు లెల్ల బయలం బడ ద్రోచిన మాకవాటమై

దీకొని ప్రోచు నిక్కమని థీయుతు లెన్న దదీయ వర్ణముల్

గైకొని భక్తిచే నుడుపఁగానరు గాక విపత్సరంపరల్

దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిథీ !

రామఅనే దివ్యమైన పేరులో రాఅనే అక్షరం పలకడం వల్ల పాపాలన్నీ పోతాయి ! అనే అక్షరం పలకడం వల్ల నోటి పెదవులు మూసుకొని కవాటముల వలె కాపాడుతుంది. పండితుల వలన ఈ విషయం తెలియని మూర్ఖ జనం ఆ దివ్యాక్షరాలను కేవలం పలకడం చేతనే పునీతులౌతున్నారు. ఏ కష్టాలూ వారిని దరి చేరడం లేదు.

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్

ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనమ్.

రామాయణంలోని ఒక్కొక్క అక్షరాన్నీ ఉచ్చరించినా చాలు, మహాపాతకాలన్నీ నశిస్తాయి !

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం

ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్.

శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం

ఆజానుబాహు మరవింద దళాకతాక్షం

రామం నిశాచరవినాశకరం నమామి.

శ్రీరామ. శ్రీరామ. శ్రీరామ.

24, మార్చి 2012, శనివారం

కథా పార్వతీపురం


మా పార్వతీపురం కథా రచయితల కథల సంకలనం కథా పార్వతీపురం వెలువడింది !
ఈ పుస్తకం గురించి కాళీ పట్నం ఇలా అంటున్నారు ...

‘‘ఉత్తరాంధ్రకు ఉత్తర భూములు సారవంతమయినవి.
గిరులూ, తరులతో సంపన్నమయినవి.
అచ్చట పుట్టిన చిగురు కొమ్మయిన చేవ అన్నట్టుగా యోథులే కాదు, కలం యోథులు కూడా సామాన్యులు కారు.
కాలక్షేపం కోసం కాకుండా జీవితాన్ని చిత్రించిప్రశ్నించి ఆలోచనలు రేపే ఈ కథలు కేవలం పార్వతీపురం ప్రాంత కథలు మాత్రమే కావు. ఎల్ల ప్రాంతాల వారిని ఆలోచింప చేసే కథలు.
గత నూరేళ్ళలో తొలినాటి ఆచంట సాంక్యాయన శర్మ గారి నుండి, నిన్న మొన్నటి కలంపట్టిన చి. బెలగం గాయత్రి దాకా కథకుల కథలు ఇందులో పొందు పరిచేరు.
ఈ పొందిక నేటి సామాజిక అవసరమని భావిస్తూ అభినందిస్తున్నాను. ’’

‘‘ పార్వతీపురానికి సాహిత్య లోకంలోఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడీ కథా పార్వతీపురం ఉన్న ప్రత్యేకతలకు, మరో కొత్త చేర్పు అవుతుదంని మా విశ్వాసం !’’ అంటున్నారు, దీని ప్రచురణ కర్త శ్రీ గుడిపాటి.

‘‘ కథకు కొత్తందాలు తీరిచి
దిద్ది ముత్యాల్ సరులు కూరిచి
తెలుగు జాతికి వెలుగు బాటలు
వేసినావు మహా కవీ...’’

అంటూ, రెండు యాభైల తెలుగు కథకు వందనం. మూడు యాభైల గురజాడకు ఈ ‘‘కథా పార్వతీపురం’’ అంకితం చేసారు సంకలన కర్తలు అట్టాడ అప్పలనపాయుడు, గంటేడ గౌరునాయుడు గారలు.

కథా పార్వతీపురం ఆవిష్కరణ సభ పుస్తకాన్ని మా పార్వతీపురం వీథుల్లో మేళతాళాలతో ఊరేగిస్తూ మొదలై 10.3.2012 వ తేదీన ఘనంగా జరిగింది.

52 మంది మా ఊరి రచయితల కథలున్న ఈ కథా సంకలనంలో కీ.శే. ఆచంట సాంఖ్యాయన శర్మ ( తొలి తెలుగు కథా రచయితలలో ఒకరు), ఎస్.వి.జోగారావు, పంతుల విశ్వనాథరావు, రాళ్ళపల్లి గౌరీపతి శాస్త్రి,, భూషణం, వి.వి.బి.రామారావు, దాసరి రామ చంద్రరావు, వంగపండు ప్రసాదరావు, పంతుల జోగారావు, జయంతి వెంకట రమణ, చింతా అప్పలనాయుడు, ఓలేటి శ్రీనివాసభాను, పి.వి.బి.శ్రీరామ మూర్తి, బి.వి.ఎ.రామారావు నాయుడు, వాడ్రేవు చిన వీర భద్రుడు, వేదప్రభాస్, డా.బి.యస్.ఎన్. మూర్తి, మల్లిపురం జగదీశ్, సువర్ణముఖి, గొల్లపూడి మారుతీరావు, అరుణ పప్పు, ఎ.ఎన్. జగన్నాథ శర్మ, గణేశ్ పాత్రో, అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు మొదలయిన పార్వతీపురం రచయితల కథలు ఉన్నాయి.

సార్వతీపురంలో ఫుట్టిన వారివే కాకుండా, ఆ ఊర్లో కొన్నాళ్ళు నివసించిన వారి కథలు కూడా ఇందులో చోటు చేసు కోవడంతో ఈ సంకలనానికి ఒక సమగ్రత సిద్ధించింది.

స్నేహ కళా సమితి, పార్వతీపురం, కురుపాం వారు ప్రచురించిన ఈ కథా పార్వతీపురం కోసం ఈ క్రింది ఫోను నంబర్లలో సంప్రదించ వచ్చును.

9441415182

9848787284

లేదా, మెయల్ చిరునామాలలో సంప్రదించ వచ్చును.

langulya@gmail.com

palapittabooks@gmail.com
పుస్తకం వెల : రూ. 250 మాత్రమే.


23, మార్చి 2012, శుక్రవారం

30 కథల శ్రవణ సంపుటి ... పంతుల జోగారావు కథలు





కథా మంజరి బ్లాగు మిత్రు లందరకీ శ్రీనందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !

S.R. Communications, Hyderabad వారు ఇటీవల నా కథల ఆడియో కేసెట్ విడుదల చేసారు. తారంగం తారంగం , బుజ్జి మేక వంటి చక్కని పిల్లల ఆడియో వీడియోఏనిమేషన్ కేసెట్ లు విడుదల చేసిన వీరు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు గారి సౌందర్య లహరి మీద ప్రవచనాలు , బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శా స్త్రి గారి భారత, భాగవత, రామాయణ ప్రవచనాలు, శారదా శ్రీనివాసన్ గారి రేడియో అనుభవాలు, పెండ్లి పాటల సంప్రదాయ కీర్తనలు మొదలయిన చాలా ఆడియో కేసెట్ లు వెలువరించారు. నిర్వాహకులు శ్రీ మారేమండ సీతారామయ్య గారికి పత్రికా సంపాదకునిగా విశేషమయిన అనుభవం ఉండడం చేత, రచయితగా అనేక కథలూ, నవలలూ రాసిన వారు కావడం చేత తెలుగు కథ మీద మమకారం కొద్దీ ఇటీవల ఆయా రచయితల కథలను వారి సొంత గొంతుకలతో చదివించి, రికార్డు చేసి, శ్రవణ కథా సంపుటాలుగా వెలువరించే మంచి ప్రయత్నం తలపెట్టారు.

ఆ పరంపరలో భాగంగానే ఇంత వరకూ శ్రీయుతులు వీరాజీ. విహారి, అంగర వెంకట కృష్ణారావు, సలీం, కె.బి. లక్ష్మి, మొదలయిన రచయితల శ్రవణ కథా సంపుటాలు కొన్ని వెలువరించారు. ఒక వంద మంది రచయితల శ్రవణ కథా సంపుటాలు వెలువరించాలని వారి బృహత్తర ప్రయత్నం. త్వరలో ఆదూరి వెంకట సీతారామ మూర్తి గారి శ్రవణ కథా సంపుటి వెలుగు చూడ బోతున్నది.

ఇందులో భాగంగానే ఇటీవల నా కథలు ఓ 30 పంతుల జోగారావు కథలు

30 కథల శ్రవణ కథల సంపుటి పేర సీతారామయ్య గారి ముందు మాటలతో వెలువడింది. ఈ ఆడియో కేసెట్ వెల 75 రూపాయలు. ఆ ఆడియో కేసెట్ లో నా శ్రీమతి విజయ లక్ష్మి ముచ్చటగా వ్రాసిన మూడు కథలనూ ఆమె సొంత గొంతుక లోనే వినిపించారు.

కేసెట్ కోసం, ఇతర వివరాల కోసం కింది చిరునామాలో సంప్రదించ వచ్చును.

S.R.Communications

242 TRT Colony, Vidya Nagar, Hyderabad – 44

Ph. 040-65153327

E-mail : srmaiah@yahoo.com