21, ఏప్రిల్ 2012, శనివారం

పన్నగ ధారీ ! నగ ధారీ !!


ఈ శ్లోకం చూడండి:

పన్నగధారి కరాగ్ర: గంగోమా లక్ష్మితో గదాగ్ర భుజ:
శశి ఖండ శేఖర ఉమా పరిగ్రహో ముహురనాది రవతు త్వామ్.

ఈశ్లోకంలో కవి శివ పరమయిన అర్ధమూ, విష్ణు పరమయిన అర్ధమూ  వచ్చేలా రచించాడు.
ముందుగా శివ పరమయిన అర్ధం చూదాం.


శివ పరంగా అర్ధం చెప్పు కునేటప్పుడు శ్లోకం లో పదచ్ఛేదం ఇలా ఉంటుంది:

పన్నగధారి,  కరాగ్ర:,  గంగా, ఉమా లక్షిత:,   గదా, అగ్ర భుజ:,  శశి ఖండ శేఖర:,   ఉమా పరిగ్రహ:,  అనాది:, ముహు:, త్వామ్ , అవతు.

అన్వయ క్రమం ఇలా ఉంటుంది:

పన్నగధారి:, గంగా ఉమా లక్షిత:, అగదోగ్ర భుజ:, శశిఖండ శేఖర:, ఉమా పరిగ్రహ:, అనాది: , మహు:, త్వామ్ అవతు !

భావం: చేతలో పామును ధరించిన వాడూ, గంగా, పార్వతులు ప్రియ నాథుడూ, భుజాల మీద చక్కని బాహుపురులూ, బంగారు ఆభరణాలూ ధరించిన వాడూ, చంద్ర రేఖను తల మీద అలంకారంగా ధరించిన వాడూ , పార్వతీ దేవిని తన అర్ధాంగిగా పొందిన వాడూ, పుట్టుకే లేని అభవుడూ అమిన పరమేశ్వరుడు ఎల్లప్పుడూ మిమ్ములను కాపాడు గాక !

కవి ఈ శ్లోకంలో శివుడికి  ఈ విశేషాణాలు వేసాడు.
 పన్నగధారి                                     =    పామును ధరించిన వాడు
గంగో మా లక్ష్మిత: = గంగా = ఉమా లక్షిత:    =    గంగా పార్వతులచే కోరబడిన వాడు
అగదోగ్ర భుజ:                                  =    భుజాల మీద బాహుపురులు,                                         
                                                        స్వర్ణాభరణాలు ధరించిన వాడు
శశిఖండ శేఖర:                                  =    చంద్ర రేఖను అలంకారంగా ధరించిన వాడు.
ఉమా పరిగ్రహ:                                  =     పార్వతిని భార్యగా స్వీకరించిన వాడు
అనాది:                                           =     పుట్టుక లేని వాడు
మహు:, త్వామ్ అవతు                        =      సదా   మిమ్ము కాపాడు గాక !     

ఇక, శ్లోకం లోని అర్ధాన్ని విష్ణు పరంగా చెప్పు కోవాలంటే, కవి శివుడికి వేసినట్టుగా చెప్పిన విశేషణ పదాలలోని తొలి అక్షరాలను తొలిగించి చదువు కోవాలి !


విశేషణాలలోని తొలి అక్షరాలు తొలిగిస్తే,  పదచ్ఛేదం ఇలా ఉంటుంది:

నగధారి, కరాగ్ర: ,  గో, మా లక్షిత: , గద: , అగ్ర భుజ:, శిఖండ శేఖర:,  మా, పరిగ్రహ: , అనాది: , ముహు:, త్వామ్ , అవతు.

అన్వయ క్రమం ఇలా ఉంటుంది:

కరాగ్ర:, నగధారి, గో,మా లక్షిత:, అగ్ర భుజ: గద:, శిఖండ శేఖర:, మా , పరిగ్రహ: , అనాది: , త్వామ్, ముహు:, అవతు.

కరాగ్ర: నగధారి            =       గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడు
గో                           =      ఆవుల చేత,
మా                         =       లక్ష్మీదేవి చేత
లక్షిత:                      =       కోర బడిన వాడు ( అంటే, గోవులకు , లక్షీ దేవికి ప్రభువు
                                     అయిన వాడు )
గద: అగ్ర భుజ:            =       భుజం మీద కౌమోదకి అనే గదను ధరించిన వాడు
శిఖండ శేఖర:             =        శిరసున నెమలి పింఛం ధరించిన వాడు
మా                          =      లక్షీ దేవిని
పరిగ్రహ:                     =      భార్యగా స్వీకరించిన వాడు
అనాది:                      =      ( మొదటి అక్షరాలు తీసివేయగా మిగిలిన అర్ధమగు) విష్ణువు
                                     పుట్టుక లేని వాడు అయిన విష్ణువు
ముహు: , త్వామ్, అవతు =      సదా మిమ్ము కాపాడు గాక !

భావం:  గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడూ,  గోవులకూ, లక్ష్మీ దేవికీ ప్రభువూ, భుజాన గదనూ, తల మీద నెమలి పింఛాన్నీ ధరించిన వాడూ, రమా పతీ అయిన వాడూ, పుట్టుక లేని వాడూ అయిన శ్రీ మహా విష్ణువు మిమ్ములను ఎల్లప్పుడూ కాపాడు గాక !
   


20, ఏప్రిల్ 2012, శుక్రవారం

పరాకేలనోయి ప్రభూ !


ఈ అందమయిన భావ చిత్రణ చూడండి:

రాధా పునాతు జగదచ్యుత దత్త చిత్తా మంధాన మా కలయతి దధి రిక్త భాండే

తస్యా: స్తనస్తబక చంచల లోల దృష్టి: దేవో2పి దోహన థియా వృషభం నిరుంధన్ !

భావం: రాథ మనసంతా శ్రీకృష్ణుని మీదే ఉంది. పరవశయై ఉంది. అలా శ్రీకృష్ణుని మీద లగ్న చిత్త అయిన రాథ ఖాళీ కుండలో కవ్వం ఉంచి చిలుకుతోంది !

కృష్ణుడికి అప్పుడు ఆవుల పాలు పితికే వేళయింది. అతని చూపంతా రాథ మీదే ఉంది. ఆమె వక్షోజ సౌందర్యాన్నే చూస్తూ పరవశించి పోయి ఉన్నాడేమో, పాలు పితకడానికి ఎద్దు కాళ్ళకి బంధనాలు వేస్తున్నాడు !

(చిత్రంలో కృష్ణుడి చేష్టలు సరిగానే ఉన్నాయి. మరక్కడ అప్పుడు రాథ లేదు కాబోలు..)

15, ఏప్రిల్ 2012, ఆదివారం

మరీ ఇంత అన్యాయమా, మీరైనా చెప్పండి ...



ఆదివారం 15 ఎప్రిల్ 2012

మరీ ఇంత అన్యాయమా, మీరైనా చెప్పండి ...

ఈ కథామంజరి నస బ్లాగు ఉంది చూసారూ ? దాని ఓనరు పరమ పిసినారి సుమండీ. ఏడాదిగా అతని దగ్గర ఎంతో వినయంగా పని చేస్తున్నాను. ఒళ్ళు దాచుకో కుండా పని చేస్తున్నాను. ఒళ్ళు హూనం చేసుకొని అతని ఇంటిని శుభ్రం చేసే చాకిరీ నాదే. రోజూ వాడి ఇంటిని శుభ్రం చేసే పని నాదే. చేసేది వాడే అయినా నన్నుఉపయోగించు కుంటున్నాడు కనుక నేనే ఆ చాకిరీ అంతా చేస్తున్నట్టు లెఖ్ఖ కదా ! ఇంత చాకిరీ వాడి కోసం చేసినా , వాడు నామీద రవంత ప్రేమ కూడా చూపించడు.

పనంతా అయ్యేక దులిపి ప్రక్కకి విసిరేస్తాడు. నన్నసలు మళ్ళీ వాడి అవసరం వచ్చే వరకూ తాకనయినా తాకడు.

సరే వాడి పాపాన వాడు పోతాడులే.

ఈ మధ్య జుత్తు బాగా పెరిగి పోయి ఒకటే చిరాగ్గా ఉంది. నన్ను చూస్తూనే‘‘ తలమాసిన వెధవా’’ అంటూ తిడుతున్నాడు. నాకు ఒళ్ళు మండి పోతోంది. వాడి బ్లాగును ఎవడూ చూడకుండు గాక ! చూసినా ఒక్క కామెంటూ పెట్టకుండు గాక ! వాడి తొక్కలో సిస్టం చీటికీమాటికీ మొరాయించు గాక ! అని వాడిని మనసులోనే శపించేను.

వాడి ఇల్లంతా శుభ్రం చేయడం కోసం నన్ను ఇంతగా హైరానా పెడతాడా ? నా ఒళ్ళంతా చీదరగా ఉంది. మురికి పట్టి పోయాను. సబ్బో గిబ్బో పెట్టి కొంచెం స్నానం చేయిస్తే వాడి సొమ్మేం పోయింది ? నా వొంటిని అంటిన దుమ్మూ ధూళిని వదిలించడానికట - నన్నుటేబిలు అంచుకేసి టపా టపా బాదేడు. ఊపిరాడింది కాదు. వాడి మీద ఏ మర్డరు కేసో పెట్టి బొక్కలో తోచించేస్తేనో అన్నంత కోపం వచ్చింది.

ఆ మధ్య వాడి ఫ్రెండొకడు వచ్చి , నన్ను చూసి పగలబడి ఒకటే నవ్వడం ! నా తల తీసేసి నట్టయింది.

ఎంత అవమానం !

‘‘ఈ తలమాసిన శాల్తీ ఎక్కడిదోయ్ ! ’’ అని వెక్కిరిస్తూ ఒకటే నవ్వేడు.

ఇహ నేను ఈ కథామంజరి ( ఏకైక నస బ్లాగు ) గాడి అథార్టీ భరించ లేను. కానీ ఏమీ చెయ్య లేను కదా. చేతిలో ఎర్ర ఏగానీ కూడా లేని వాడిని కదా ? అస్వతంత్రుడిని కదా !

అంచేత మనమే తగ్గాలి. ఒదిగి ఉండాలి. శాంతం భోషాణం పెట్టె అన్నారు పెద్దలు.

ఇలా ఉండగా , నాకో దివ్యమైన ఆలోచన వచ్చింది. పోనీ మనమే జుత్తు కటింగ్ చేయించుకుని కాస్త ట్రిమ్ గా తయారై కనిపిస్తేనో ? అప్పుడయినా ఈ వెటకారాలూ , వెక్కిరింతలూ తగ్గిస్తాడేమో?!

ఈ ఆలోచన వచ్చేక , మా కథా మంజరి గాడి మూడ్ బాగుందని అనుకుని నా మనసులో మాట వాడి ముందు బయట పెట్టాను

‘‘ పారూ, జుత్తు బాగా పెరిగి పోయింది. తల మాసి పోంది. చిరాగ్గా ఉంది. సెలూన్ కి వెళ్ళి క్షవరం చేయించుకు రావాలనుకుంటున్నాను. డబ్బులివ్వరూ ? ’’ అని దేబిరిస్తూ అడిగాను.

అంతే. వాడేమన్నాడో తెలుసునా ?

‘‘ ఓరి జుత్తుల పోలిగా ! నీకు క్షవరం కూడానా ? దండగ ఖర్చు ! అట్టే మాట్లాడితే పెంట మీద విసిరి పారెయ్య గలను జాగ్రత్త !’’

అని కసిరేడు. ఏడాదిగా నా చేత అరవచాకిరీ చేయించుకొని ఇంత మాటంటాడా ! మరీ ఇంత అన్యాయమా, మీరే చెప్పండి ?

నా తమ్ము డొకడు ఉన్నాడు. మా ఓనరు గాడి షేవింగు కిట్ లో ఉన్నాడు. వాడూ నాలాగే తలంతా మాసిపోయి, జుత్తుల పోలి గాడిలా ఉన్నాడు.

ఏదో ఒక రోజున మా కథామంజరి నస బ్లాగరు ఓనరు మహాశయుడు మా ఇద్దరినీ పెంట కుప్ప మీద విసిరి పారెయ్యక తప్పదనిపిస్తోంది. ఈ అన్యాయం ఖండించే వారే లేరా ? మము బ్రోచే వారే లేరా ! హే ! భగవాన్ !

గమనిక : ఈ టపాలో వాడిన‘‘ ఇల్లు ’’ అనే పదమునకు మానిటరూ, సీ.పీ.యూ, కీ బోర్డూ, మౌసూ, ప్రింటరు, స్కానరూ వగైరాలని అర్ధం చేసుకో గోరుతాను.

ఇట్లు,

తమ విశ్వాసపాత్రుడు,


ఇబ్బందే సుమండీ ....


13, ఏప్రిల్ 2012, శుక్రవారం

కమనీయం బ్లాగరు కోరిన కమనీయ పద్యం



కమనీయం బ్లాగరు డా.ముద్దు వెంకట రమణారావు గారు నా అర్ధరాత్రి వరకూ అరవ చాకిరీ టపా చూసి, ( ఆటపా ఇక్కడ చూడవచ్చును) శ్రీకృష్ణ దేవరాయల వారి ఆముక్త మాల్యదలో మరో రెండు చక్కని పద్యాల గురించి ప్రస్తావించారు. వాటిలో ఒక దానిని ఇక్కడ పెడుతున్నాను. మరొకటి మరోసారి పెడతాను.
ఇది తెలుగు పద్యం వెలుగు జిలుగులు శీర్షికన తే 31-8-2011 దీ సంచికలో ప్రచురింప బడింది.

కమనీయం బ్లాగు కోసం ఆ లింక్ ఇక్కడచూడవచ్చును.