8, జనవరి 2012, ఆదివారం

స్నాన ఘట్టాలు !


కవి గారు చెప్పనే చెప్పారు కదా. జలకాలాటలలో ఏమి హాయిలే హలా ! అని ! వస్తే పాటలు పాడుకుంటూనో, లేదంటే కూని రాగాలు తీసుకుంటూనో, జలకాలాటలు ఆడుకుంటూ ఉంటే ఆ హాయే వేరు. బాత్ రూమ్ లలో షవర్ కింద, నల్లాల కింద జలకాలాటలు ఆడాలంటే కుదిరే పని కాదు. నదులలోనో, సరస్సులలోనో, ఏరుల్లోనో, చెరువుల్లోనో అయితే బావుంటుంది.

బుడుంగ్ బుడుంగ్ మని ఓ రెండు చెంబుల నీళ్ళు నెత్తి మీద పోసుకొని స్నానం అయిందనిపిస్తే సరి కాదు. తీరిగ్గా గోరు వెచ్చని నీళ్ళతో చేసే స్నానం చేయడంలో మజాయే వేరు. అది శీతాకాపు పొద్దు అయితే ఆ మజా మరీనూ.

స్నానము అనే అర్ధం ఇచ్చే పదాలు చాలా ఉన్నాయి.

చూడండి: అభిషనము, అభిషేకము, అభిషేచనము, అవగాథము, అవభృథము, ఉదగామము, దానము, బుడుక, మజ్జనము, మునుక, స్నయము, స్నాత్రము , నిమజ్జనము, పరి కర్మము, నీరాటము, జలక్రీడ, ప్రక్షాళనము, నీరు పోరు,
తీర్ధ మాట ప్రణేజనము .....

ఇదిలా ఉంచితే, తల మీద నుండి చేసే స్నానానికి శిరస్నానము, అభ్యంగము, అభ్యంజనము, తలగడుగు, తలమునుక, తలంటు మొదలయిన పేర్లు ఉన్నాయి.

సిల్లలకు చేయించే స్నానానికి బోరుకు అంటారు.

వివాహ వేళ, వధూ వరులకు మంగళ స్నానాలు చేయిస్తారు.

పండుగలప్పడూ, వేడుక లప్పుడూ తలంటు స్నానాలు చేసాకే కదా, కొత్త బట్టలు కట్టు కునేది ?

స్త్రీలు బహిష్ఠు సమయంలో చేసే స్నానానికి ఋతు స్నానం, మాఱు నీళ్ళు అంటారు.

అన్ని శుభాశుభ కార్యాలకీ ముందూ వెనుకా చేసే స్నానాలను వరసగా మంగళ స్నానాలనీ, మైల స్నానాలనీ అంటారు.

నవజాత శిశువుకి బొడ్డుతాడు కోసాక ముందుగా చేయించే ఉపచర్య స్నానమే కదా.


స్నానానికి ఉపయోగించే నలుగు పిండిని సున్ని, స్నానీయం అని కూడా అంటారు.

సబ్బుని చౌకారం, స్తోమక్షారం అంటారు.

పసుపుకి చాలా పేర్లు ఉన్నాయి : అళది, కాంచని, కావేరి, పవిత్రం, మేఘాగ్ని, విభావరి, హరిద్ర, శోభన, యామిక .... ఓ, మరెన్నో ఉన్నాయి లెండి.

స్నానానికి చెందిన సామెతలు కొన్ని కనిపిస్తున్నాయి.

స్నానానికి ముందు, సంభావనకు వెనుక కూడదు.

ఈ సామెత వెనుక చాలా దూరాలోచన ఉంది. స్నానం చేయాలంటే నదుల్లోనో, చెరువుల్లోనో, మడుగుల్లోనో దిగే వారు కదా, పూర్వం? తెలిసిన చోటయితే ఫరవా లేదు కానీ, కొత్త చోట దాని లోతెంతో తెలియదు. అందు చేత, స్నానాకి ముందుగా తయారయి పోవడం మంచిది కాదని ఈ సామెత చెబుతోంది. ముందు దిగిన వాడెవడయినా, లోతు తెలియక దిగి. బుడంగున మునిగి పోతే మనం ముందుగా దిగం కనుక బతికి పోవచ్చు.

ఇక, సంభావనకు వెనుక ఉండ కూడదన్నారు. నిజమే కదా, దొరలూ, రాజులూ, జమీందారులూ ఇచ్చే సంభావనలకు ముందే ఉండాలి. లేక పోతే మనకు దక్కే సంభావన తగ్గి పోవచ్చు. లేదా, మొదటికే మోసం రావచ్చు. ఏమంటారు !

తా మునిగింద గంగ, తా వలచింది రంభ అని మరో సామెత.

స్నానాలు లేని బ్రాహ్మలకు శాపాలు లేవు అని, వేరొక సామెత ఉంది. అంటే, శుచీ శుభ్రం లేని బ్రాహ్మల శాపాలు పని చెయ్యవని కాబోలు.

మోక్షానికి పోతే, మొసలెత్తుకు పోయిందిట !

ఈ సామెతకి అర్ధం, ముక్తి కోరి తీర్ధ స్నానం చేస్తే ఆ సరస్సులో ఉండే మొసలి ఎత్తుకొని పోయిందిట. పుణ్యానికి పోతే ... అంటే యిదే నన్న మాట !

తల కడుక్కోవడం అనే జాతీయం, బరువు బాధ్యతలు తీరాక, తలారా స్నాం చేసి, హమ్మయ్య ! అనుకోవడం గురించి కదా.

ఈ సందర్భంగా సన్ బాత్ గురించి గుర్తుకు తెచ్చు కోక తప్పదు. ఇదో రోగ నిదాన ప్రక్రియ. కాక పోతే ఆరోగ్య పరి రక్షణకు కొందరు సన్ బాత్ చేస్తూ ఉంటారు. ఆవిరి స్నానం అని కూడా ఒకటి ఉంది.

సన్ బాత్ ఉన్నప్పుడు మూన్ బాత్ ఎందుకు ఉండ కూడదూ ! అని మా తింగరి బుచ్చి గాడు లాజిక్కు లేవ తీస్తూ ఉంటాడు. అది వేరే విషయం.
ఇక,

పుణ్య తిథులలోనూ. గ్రహణాల వేళ పట్టు విడుపుల సమయాలలోనూ సముద్ర స్నానాలు చేయడం తెలిసినదే కదా !


స్నానాల గురించి మరి కొంత సమాచారం ...

ఇప్పు డెక్కడా నూతులు లేవు కానీ, నూతి నీళ్ళతో చేసే స్నానం చాలా హాయిగా ఉంటుంది.

కూపోదకం, వటచ్ఛాయా, తరుణీ స్థన మండలం
శీత కాలే భవేదుష్ణం, ఉష్ణ కాలేతు శీతలమ్ అంటారు.

కూపం అంటే నుయ్యి. నూతిలో నీళ్ళు శీతా కాలంలో వెచ్చగానూ, వేసవి కాలంలో చల్లగానూ ఉంటాయన్న మాట ! మిగతా రెండింటి విషయమూ ఇక్కడ అప్రస్తుతం కనుక వాటి గురించిన వివరణ ఇవ్వడం లేదు.

శ్రీ.శ్రీ గారి గొప్ప కథ ‘‘ ఒసే, తువ్వాలందుకో ’’ గుర్తుందా ?

చాలా మంది మగ మహా రాజులకి బాత్ రూం లలో దూరి తలారా స్నానం చేసాక కానీ తువ్వాలు తెచ్చు కోలేదన్న మాట గుర్తుకు రాదు. అప్పుడు అరుస్తారు, ‘‘ఏమేవ్ ! తువ్వాలందుకో !’’ అని.

శ్రీ.శ్రీ గారి కథలో ఇలాంటి మగ మహారాజే తువ్వాలు మరిచి పోయి, స్నానాల గదిలో దూరి భార్యని ముద్దుగా కేకేసి, ‘‘ ఒసే, తువ్వాలందుకో !’’ అని అరుస్తాడు. అంతకు ముందు స్నానాల గదిలో భర్త గారి ఊహాపోహలు, , ఇటు భార్య గారి ఆలోచనలూ ఈ కథకి ఆయువు పట్టులు. సర్దుకు పోయే సంసారాల గుట్టు ఇందులో గొప్పగా చెప్పారు శ్రీ.శ్రీ.

బెజ్జ మహా దేవి పరమేశ్వరుని పసి వాడిగా చేసి స్నానాలు చేయింే ఘట్టం పాల్కురికి సోమన తన బసవ పురాణంలో అద్భుతంగా చిత్రీకరించేడు. చూడండి:

అనయంబు బెజ్జ మహా దేవి తాను
జననియై పరమేశుఁదనయు గావించి

తొంగిళ్ళు పైనిడి లింగ మూర్తికిని
నంగన గావించు నభ్యంజనంబు

ముక్కొత్తు చెక్కొత్తు ముక్కన్ను పులుము
నక్కొత్తు కడుపొత్తు నట వీపు నిమురు
బెరుగంగ వలెనని తరుణి వీడ్డడగ

చరణముల్కరములు చాగంగ దిగుచు
నలుగులు నలుచు నర్మిలి పెట్టి

జలముల వీపున చరుచు నంతతంత
వెగచి బెగడ కుండ వెన్ను వ్రేయుచును

నొగి మస్తకమున నీరొత్తు దోయిటను
వదనంబు సొచ్చుచో యుదకంబు లనుచు
నదుము పొట్టను నోరి కడ్డంబు పట్టు

చెన్నుగా పసుపార్చి చేయు మజ్జనము
కన్నులు చెవులును గాడంగ నూదు .... ....

బెజ్జ మహా దేవి పరమ శివుని పసి వానిగా భావించి, చేయించిన అభంయంజనమిది ! పసుపు రాసేది. నలుగు పెట్టేది. తల మీద నూనె అదిమేది. ముక్కూ, చెక్కిళ్ళూ అదిమేది. మూడో కన్ను పులిమేది. బాగా పొడవుగా పెరగాలని కాళ్ళూ చేతులూ సాగదీసేది. నీళ్ళు దోసిళ్ళతో తీసికొని వాని నడ్డి మీద చరిచేది. వెన్ను నిమిరేది. తల మీద నీళ్ళు కళ్ళ లోకి జారకుండా పదిలంగా పోసేది. అందు కోసం వాని నోటికి అడ్డంగా చెయ్యి పెట్టేది. కడుపు అదిమేది. స్నానం చేయించాక, కళ్ళూ చెవులూ గట్టిగా ఉఫ్ మని ఊదేది ....


ఇక, ద్రౌపదీ దేవి మహా భారతంలో ...

‘‘ రాజసూయావభృథంబున శుచియై పెనుపొందిన వేణి వట్టి, ఈ యేవురు సూడగా సభకు నీడ్చె, కులాంగన నిట్లొనుర్తురే ! ’’ అని వాపోయింది.

రాజసూయ యాగం పరి సమాప్త మయ్యాక అభ్యంగన స్నానం చేయడం వల్ల పవిత్రమైన ఈ జుత్తు పట్టుకొని , నాభర్తలు ఈ ఐదుగురూ చూస్తూ ఉండగా ఒకడు ( దుశ్శాసనుడు ) కౌరవ సభలోనికి ఈడ్చుకొని వచ్చేడు. లోకంలో ఎక్కడయినా కుల స్త్రీలను ఇలా అవమానం చేస్తారా ?’’ అంటూ విలపించింది.

పుష్కర కాలంలో పవిత్ర నదీ జలాల లోకి ముక్కోటి దేవతలూ ప్రవేశిస్తారని, అందు చేత ఆ కాలంలో నదీ జలాలు పరమ పవిత్రాలని హిందువుల విశ్వాసం. అందు చేత, పుష్కర సమయంలో నదులలో పవిత్ర స్నానాలు చేయడానికి తహతహలాడుతారు. అలా స్నాలు చేసే స్థలాలు పుష్కర ఘట్టాలు, స్సానాల రేవులూనూ. అక్కడ స్నాలు చేసే వారి భద్రత కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి.

తిరుపతి మొదలైన చోట్ల పాప వినాశనం వగైరా చోట భక్తులు ఆ జలధారల కింద స్నానాలు చేసి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.

వెనుకటి రోజులలో వీర మడిని పాటిస్తూ కొన్ని వర్గాలకు చెందిన ఆడవారు నది లోనో, చెరువు లోనో స్నానాలు చేసుకొని, మడి నీళ్ళ బిందె నెత్తి కెత్తుకొని , దారంట వస్తూ, మళ్ళీ ఏదో కారణం చేత మడి భంగం ( వ్రత భంగం లాగ !)
జరిగితే మళ్ళీ స్నానం , మళ్ళీ బిందోతో నీళ్ళు పట్ట కోవడం జరిగేది.

పెళ్ళిళ్ళలో , ముఖ్యంగా బ్రాహ్మల వివాహాలలో సరిగ్గా భోజనాల వేళ ఏటికి లేదా నదికి పోయి స్నానం చేసి, సంధ్య వార్చకొని వస్తానంటూ పెళ్ళి పెద్దలలో ఎవరో ఒకరు వెళ్ళి పోయే వారు. అంతే ! దానితో భోజనాలు బంద్. అతను వచ్చే వరకూ వడ్డింపులు, ఉండేవి కావు. పంక్తి నకనకలాడుతూ అతని రాక కోసం ఎదురు చూసేది. ఎంతకీ రాడాయన. ఇదో అల్లరి ( ట ?!).
ఇదిలా ఉంచండి ...ఇక ...


గంగానది కలుష హారిణి. గంగలో స్నానం చేయడం ఒక అపూర్వానుభవం.

చేమకూర కవి విజయ విలాసంలో తీర్ధ యాత్రలు చేస్తూ గంగా నదిలో మునక వేయడం జరిగింది. ఈ ఘట్టంలొ కవి గొప్ప శబ్ద చమత్కారం కలిగిన ఒక చిన్న పద్యం చెప్పాడు. చూడండి:

మునుకలు గంగా నదిలో
నొనరించుట కన్న భాగ్య మున్నదె ? యనుచున్
మునుకలు గంగా దిగి, పరి
జనములు కైలా గొసంగ స్నానోన్ముఖుఁడై

అర్జునుడు తీర్ధ యాత్రల సందర్భంగా గంగా నదిని చూసి ఇలా అనుకున్నాడు. గంగా నదిలో ముుకలు వేయడం కన్నా ( స్నానం చేయడం కన్నా ) మరేమి భాగ్యం ఉంది ? ఇలా అనుకుంటూ సేవకులు దారి చూపిస్తూ ఉంటే, గంగలో దిగి స్నానం చేసాడు.

ఈ పద్యంలో మునుకలు గంగా నదిలో అనీ మును కలుగంగా అనీ పదచ్ఛేదం వల్ల గొప్ప శబ్ద చమత్కతి సాధించాడు కవి. మొదటి దానికి గంగా నదిలో మునకలు వేయడం అనీ, రెండవ చోట సేవకులు నది లోతుపాతులు తెలుసు కోడానికి ముందుగా దిగి చూసాక అనీ స్వారస్యం చెప్పారు పెద్దలు.

కవి గంగా నది గురించి, దాని పవిత్రత గురించి మరిన్ని చెప్పాడు. మచ్చునకు మరో పద్యం :

తల నీ గంగా తీర్ధము
చిలికినవాఁడీశ్వరుండు . చేరెడు లోఁగోఁ
గలిగినఁ దరగలఁదేలం
గలిగినఁ దన్మహిమ లెన్నఁగా దర మగునే ?

తల మీద గంగా జలాన్ని చిలకరిస్తేనే ఈశ్వరత్వం పొందు తున్నారు. ఇకచ చేరెడు గంగా తీర్ధం పుచ్చుకొన్నా, గంగా నదిలో స్నానం చేసినా, ఎంత గొప్ప ఫలితం కలుగుతుందో కదా !

ఇక, తీర్ధ యాత్రలు చేస్తూ, పవిత్ర నదీ జలాలలో స్నానాలు ఆచరించడం మన సాంప్రదాయం.

ప్రవరుడు మను చరిత్రలో సిద్ధుడిని ఏయే దేశాలు చూశారు చెప్పరూ ? అంటూ అడిగిన ప్రశ్నావళిలో ఏ తీర్ధాలలో స్నానాలు చేసారు ? అని కూడా ఉండడం గమనించాలి.

దేవతా స్త్రీలూ, రాచ కన్నెలూ వన విహారాలూ, జల క్రీడలూ చేయడం చాలా గ్రంథాలలో చదువుతాం.

గోపికలు విలాసంగా నదీ స్నానాలు చేస్తూ ఉంటే వారి కోక లెత్తుకు పోయిన కొంటె కృష్ణుడి గురించి వేరే చెప్పాలా?

మరో రెండు శ్లోకాలను చూడండి:

కించి దుష్ణోదక స్నానం, కించి దుష్ణాన్న భోజనం.
మానవానా మిదం సధ్యం, సయ: స్నానం వయ: స్త్రియ:

అంటే, గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం, మృష్టాన్న భోజనం చేయడం, పాలు త్రాగడం, తరుణ స్త్రీ సంగమం - ఈ నాలుగూ మనుషులకు పథ్యాలుట !

స్నానానంతరం చేయాల్సినవి కూడా మన పెద్దలు చెప్పారండోయ్ ! చూడండి:

స్నాత: చందన లిప్తాంగ: సుగంధ: సు మనోన్విత:
భుక్త వృష్య స్సు వపన: సువేష సమలంకృత:

తాంబూలవదన: పత్న్యాం, అను రక్తో2ధిక స్మర:
పుత్రార్ధీ పురుషో నారీమ్, ఉపేయా చ్ఛయనే శుభే.

దీని భావం ఏమిటంటే, స్నానం చేసి, పరి శుద్ధు డయ్యాక, చందనాది సుగంధ ద్రవ్యాలు పూసు కోవాలి. పు్వులు పట్టు కోవాలి. మంచి బట్టలు ధరించాలి. చక్కని ఆహార్యం ధరించాలి. అలంకారాలు పెట్టు కోవాలి. బలవర్ధక మైన ఆహారంభుజించాలి. తంబూలం వేసు కోవాలి. భార్యయందు అనురక్తితో ఆమె పొందు స్వీకరించాలి. ఇది శాస్త్రం చెప్పిన తృతీయ పురుషార్ధం అన్న మాట!

‘క్షణంలో బాత్ చేసి రానూ !’ అంటూ బాత్ రూం లో దూరి, గంటలు గడిచినా రాని స్నాన రుద్రులూ, ఏడాదికి ఒకసారో, రెండు సార్లో తప్ప అసలెప్పుడూ స్నానం చెయ్యని తెగల వారూ ఉన్నారని తెలుసు కోవాలి.

ఈ టపా రాస్తూ ఉంటే, ఆంధ్ర జ్యోతి ఛానెల్ లో తణికెళ్ళ భరణి గారు తన జీవిత కాలంలో పేద్ధ బాత్ రూం కట్టకొని, అందులో తనివితీరా గంట సేపు స్నానించాలనీ , తన మనసులో కోరికను బయట పెట్టారు.

అయ్యా, ఇదీ స్నాన ఘట్టం ! స్నానాల గొడవ ! ఇలా చెబుతూ పోతూ ఉంటే, దీనికి అంతూ పొంతూ ఉండేలా లేదు ... కనుక,

స్వస్తి.

స్నానాల గురించి బ్లాగరు రసఙ్ఞ గారు చక్కని శాస్త్రీయమైన వివరణలతో ఒక టపా రాసారు. దాని లింక్ ఇక్కడ నొక్కి చదవండి.

అంకితం :

స్నానాల గదిలో ఒళ్ళంతా సబ్బు పట్టించు కున్నాక, తొట్టెలో నీళ్ళు నిండుకొని, కుళాయిలు బంద్ అయి పోతే, నానా అవస్థలూ పడే వారికి ఈ టపా అంకితం చేస్తున్నాను.

మరింకా, మా తింగరి బుచ్చి గాడికి కూడా లోపాయికారీగా అంకితం చేస్తున్నాను. ఎందుకంటే జల గండం పేరిట వాడు మూడ్నాలుగు రోజులకో సారి స్నానం చేస్తాడని కథా మంజరి దగ్గర విశ్వసనీయమైన సమాచారం ఉంది.
















7, జనవరి 2012, శనివారం

చెప్పండి చూద్దాం !-4.



ఈ సంస్కృత శ్లోకార్ధం సుబోధకం. సరళం. దీనికి ఒక చక్కని అనువాద పద్యం మన తెలుగు శతకాలలో ఒక దానిలో శతకకారుడు రచించేడు. ఆ పద్యం ఏమిటో చెబుదురూ !

అజగామ యదా లక్ష్మీ: నారికేళ ఫలాంబువత్,

నిర్జగామ యదా లక్ష్మీ: గజ భుక్త కపిత్థవత్

నిజానికీ సమస్య మన పెద్దల కోసం ఇచ్చినది కాదు. పిల్లలలో తెలుగు భాషాబిమానం పెంపొందించడానికి ఇలాంటి సమస్యలని మనమే తయారు చేసుకుందాం.

1. ముందుగా పిల్లలకి ఈ శ్లోకం లోని ముఖ్యమైన పదాలకు అర్ధాలు చెప్పాలి.

2. వాటికి తెలుగులో ఉన్న పర్యాయ పదాలు కూడా చెప్పాలి.

3. శ్లోక భావం మాత్రం చెప్ప కూడదు.

4.తరువాత తెలుగులో వచ్చిన ప్రసిద్ధమైన శతకాలు వారి ముందు ఉంచాలి. వీలైనంత వరకూ భావాలతో కూడిన శతకాలు ఇవ్వాలి ( అప్పుడు వారి పని కొంత సుళువవుతుంది )

5.వాటిలో ఈ శ్లోకానికి అనువాద పద్యం ఉన్న శతకాన్ని ఉంచడం మరిచి పోకూడదు.

6. ఇప్పుడు ఈ శ్లోకార్ధం ఇచ్చే పద్యం వారినే వెతికి చెప్ప మనాలి.

7. గెలిచిన పిల్లలకు బహుమానాలు ఇవ్వాలి.

8. చెప్ప లేక పోయిన వారికి మరో అవకాశం ఇవ్వాలి.

నేను హైస్కూల్లో తెలుగు పండితునిగా పని చేసే రోజులలో పిల్లలు ఈ రకమయిన సమస్యలతో ఇచ్చిన క్రీడలను ఎంతగానో ఇష్ట పడే వారు. చురుకుగా పాల్గొనే వారు.

టీ.వీ లకో, వార్తా పత్రికలకో అతుక్కు పోకుండా పిల్లలతో మమేక మవుదాం ! ఏమంటారు ?

6, జనవరి 2012, శుక్రవారం

ఈ ఏడాది జగన్నాథ శర్మకు చా.సో. స్ఫూర్తి అవార్డు ...


జగన్నాథ శర్మకి ఈ ఏడాది చా.సో స్ఫూర్తి అవార్డు లభించింది. తెలుగు కథకి తూర్పు దిక్కు శ్రీ చా.సో అవార్డు వీరికి లభించడం కథకి గర్వ కారణం.

శ్రీ జగన్నాథ శర్మ బుల్లి తెరకు (జెమిని, ఈ టి,వీ) కథా, మాటల రచయితగా చిర పరిచితులు. కొన్ని సినిమాలకు కథా సహకారం అందించారు, ప్రసిద్ధ పత్రికలకు సహ సంపాదకత్వ బాధ్యత వహించి, ప్రస్తుతం నవ్య వార పత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర జ్యోతి వారి నవ్య వార పత్రికను పాఠకుల పత్రికగానూ, రచయితల పత్రికగానూ కూడా సమర్ధ వంతంగా తీర్చి దిద్దడంలో వీరి కృషి అనన్య సామాన్య మైనది. నవ్యలో విశేష పాఠకుల ఆదరణ పొందిన పాలపిట్ట ప్రపంచ జానపద కథల ధారా వాహికం, కథా సరిత్సాగరం వీరి ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యాలు.
వీరి వచన మహా భారతం , జగన్నాథ రథ చక్రాల్ (మొదటి పేజీ సంపాదకీయ రచనలు) పాఠకులను విశేషంగా ఆకట్టు కొంటూ సాగుతున్నాయి.


అసంఖ్యాకంగా కథల పోటీలు పెడుతూ, కథా నీరాజనం శీర్షికను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ తెలుగు కథకు జయ కేతన మెత్తు తున్నారు. తెలుగు నాట ఎక్కడ కథా గోష్ఠులు నిర్వహించినా, వాటి వివరాలు ఫొటోలతో పాటు చక్కని వార్తా కథనాలు నవ్యలో ప్రచురిస్తున్నారు.

ఈ ఏడాది చా.సో స్ఫూర్తి అవార్డు ఎ.ఎన్ జగన్నాథ శర్మకు ఇస్తున్నట్టుగా చా.సో గారి కుమార్తె ప్రముఖ రచయిత్రి, చా.సో స్ఫూర్తి పురస్కార ట్రస్టు వ్యవస్థాపకురాలు చాగంటి తులసి ఈ క్రింది ప్రకటన చేసారు :

ప్రముఖ కథారచయిత చాగంటి సోమయాజులు (చాసో) 18వ స్ఫూర్తి పురస్కారం 2012, జనవరి నెల 17వ తేదీన విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన ప్రముఖ కథా రచయిత అయ్యల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథశర్మకు వచ్చింది. . పేగు కాలిన వాసన కథలు, అగ్రహారం కథలు, మావూరి కథలు రచయితగా, అనువాదకుడిగా జగన్నాథశర్మ కథాభిమానులకు చిర పరిచితులు. ఆయన కథల్లో వాస్తవికత, మానవీయతల మేలుకలయిక కనిపిస్తుంది., వ్యవస్థలోని అవకతవకలకు అద్దం పట్టి , సామాన్య మానవుల పట్ల అపారమైన ప్రేమ ఉన్న రచయిత వీరు.. కథ అల్లి చెప్పే కౌశలంతో ఎదిగి ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నందున చాసో స్ఫూర్తి పురస్కారానికి జగన్నాథ శర్మను ఈ అవార్డు వరించింది. జనవరి 17న చాసో 97వ పుట్టినరోజు , ఆరోజు సాయంత్రం విజయ నగరం మహారాజ లేడీస్ రిక్రియేషన్ క్లబ్‌లో ఐఎఎస్ అధికారి కె.వి.రమణాచారి అధ్యక్షతన సాయంత్రం 6 గంటలకు జరిగే సభలో శ్రీ జగన్నాథ శర్మకి రూ. 10,000 ల నగదు పురస్కారంతో పాటు, ప్రశంసా పత్రం అంద.జేయడం జరుగుతుంది.

కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి ...



ఇంత వరకూ చా.సో అవార్డు అందుకొన్న రచయితలు :


ఇంత వరకూ పుస్తక రూపంలో వెలువడిన జగన్నాథ శర్మ రచనలు ...











5, జనవరి 2012, గురువారం