11, మార్చి 2016, శుక్రవారం

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ..Day 02

మా  8 రోజుల  తమిళ నాడు యాత్రా విశేషాలు  2/8  Day 2.(28-2-2016)

తమిళ నాడు టూరిజమ్ వారి బస్సు లో  మా తమిళ నాడు 8 రోజుల యాత్రలో ఇది రెండో రోజు.
ఈ రోజు కొంత విశేష మేమిటంటే, ఈ రోజు మేము వొక దర్గానీ, వొక చర్చినీ, హిందూ
 దేవాలయాన్నీ కూడా చూడడం జరిగింది. మా బస్ లో అన్య మతస్తు లెవరూ లేరు. అందరమూ హిందువులమే.
 కానీ  అందరూ దర్గానీ. చర్చినీ కూడా చాలా ఆసక్తి కరంగా చూడడమే కాక, తోచిన దక్షిణలు
సమర్పించుకుని ప్రార్ధనలు కూడా చేసారు. ముఖ్యంగా వేలంగిణి చర్చి నిర్వహణని అంతా మెచ్చు కున్నారు.
సరే, రెండో రోజు ఉదయమే6.30 ని.కు బస్ బయుదేరింది. 9 గంటలకు దారిలో మా ఖర్చుతో బ్రేక్ ఫాస్టు
తీసుకుని ముందుగా తిరుకడయూర్ అనే చోట వొక పెద్ద శివాలయం దర్శించు కున్నాం. నిజానికి ఈ
 ఆలయ దర్శనం మా టూర్ పేకేజీలో లేక పోయినా, గైడ్ ఈ ఆలయానికి తీసుకు వెళ్ళాడు. ఇదొక పెద్ద
శివాలయం. బాగా రద్దీగా  ఉంది. ఇంత పెద్ద శివాలయాన్ని ఉదయాన్నే చూపించి నందుకు అందరం గైడ్ కి
 ధన్యవాదాలు చెప్పాం. ఆ ఆలయ విశిష్ఠత ఏమిటంటే, ఇక్కడ 60 ఏళ్ళు నిండిన వారు షష్ఠి పూర్తి జరుపు
 కుంటారు ! మేం వెళ్ళిన నాడు దాదాపు పది, పదిహేను  జంటల వరకూ  కుటుంబాలతో వచ్చిఅక్కడ
షష్ఠి పూర్తి జరుపు కోవడం చూసాం. అది చూస్తూ ఉంటే ముచ్చట వేసింది. ఈ శివ కోవెల చూసేక, నాగ
పట్నం బయలుదేరాం.
దీనినే నాగూర్ అని కూడా అంటారు. ఈనాగపట్నం ప్రాంతం అంతా 2004 మహా ఉప్పెనకు గురై
పూర్తిగా ధ్వంస మయినదే. తర్వాత చక్కగా పునర్మించ బడింది. ఆ పెను ఉప్పెనలో దాదాపు
20 వేల మందికి పైగా జల సమాధి అయ్యారని అంచనా. వారి స్మృత్యర్థం నాగ పట్నం సమీపాన నిర్మించిన
స్మారక స్తూపాన్ని మా గైడ్ బస్ నుండి చూపిచేడు. బస్ వో ప్రక్కగా ఆపించి బస్ దిగి ఫొటోలు తీసు
 కున్నాము.
గంటన్నర ప్రయాణంతో నాగూర్ చేరు కున్నాం. ఇక్కడ వొక ప్రాచీన మయిన దర్గా చూసేము.
ఈ ప్రాంతంలో కావేరీ నది దక్షిణ వాహినిగా ప్రవహించి, దూరాన సముద్రంలో కలుస్తుంది.
దర్గాలో లోపలి భాగంలో కూడా చాలా రకాల షాపులు ఉన్నాయి. మత పరమయిన వస్తువులూ
పూజా సామగ్రి విక్రయించడం కనిపించింది. పిల్లల ఆట వస్తువులూ అవీ సరేసరి.
దర్గా చూసేక బయలు దేరి వేలంకిని చర్చికి వెళ్ళాం. దీనినే వేలంగిణి అని కూడా వ్యవహరిస్తారు.
చాలా ప్రసిద్ధ మయిన రోమన్ కేథలిక్ చర్చి యిది. చాలా పెద్ద చర్చి. వేలంగిణీ మాత
ఆరోగ్య ప్రదాత అని విశ్వాసంతో తల్లిని   వేలాదిమంది  భక్తులు నిత్యం కొలుస్తూ ఉంటారు. 2004లో
సునామీ వచ్చి నప్పుడు వందలాది మందికి ఆ చర్చి ఆశ్రయం కలిగించిందిట.ఆ ప్రాంత మంతాపూర్తిగా
జలమయ మయినా,చర్చిలో ఒక్క చుక్క నీరు కూడా చేర లేదని చెబుతారు. కొందరు భక్తులు మన పొర్లు
 దండాల లాగా మోకాళ్ళ మీద నడుచు కుంటూ మాత దర్శనం చేసు కోవడం కనిపించింది.
చర్చి పరి శుభ్రంగానే కాక, ఎక్కడా వ్యాపార వాసనలు లేవు. మనసారా వేలంగిణీ మాతను అందరం
 దర్శించుకుని  బస్ ఎక్కాము. ఇక మా యాత్రలో ఆ రోజుకి చివర దర్శనీయ స్థలం తంజావూరు.
తంజావూరు అక్కడకి 95 కి,మీ, దూరంలో ఉంది. మధ్యాహ్నం రెండు గంటలకి చేరాం.ttdc  వారి హొటల్ కి
 చేరుకుని గదులలో ప్రవేశించాము. ఉదయం బ్రేక్ ఫాస్టు మా ఖర్చే కనుక ఆ రోజు లంచ్,
డిన్నరూ కూడా టూరిజమ్ వారిదే నని గైడ్ చెప్పాడు. అంతే కాదు, మరు నాడు ఉదయం టిఫిన్లు కూడా
 అక్కడేనుట.  లంచ్ తీసుకుని, వేగిరం తయారయితే 3 గంటలకి తంజావూరులో చూడ తగిన ప్రదేశాలకి వెళ్ళి
 వద్దామని గైడ్ చెప్పాడు.
ఇక్కడ  టూరిజమ్ వారి  హొటల్    గురించి చెప్పాలి. నిజానికి వొక రాజ ప్రాసాదాన్ని హొటల్ గా
 మార్చడంతో చూడడానికి చాలా రిచ్ గా ఉంది. రాచ మహలు అందాలతో ఆ వసతి అందరినీ ఆకట్టుకుంది.
అక్కడ ఆతిథ్యం కూడా రాచ మర్యాదలనే తలపించేలా ఉంది.
గబగబా తయారై పోయి అందరం లంచ్ తీసుకుని 3 గంటల కల్లా బస్ క్కాము.
ఇక్కడ తంజావూరు గురించి కొంత చెప్పుకుందాం. 16వ శతాబ్దికి చెందిన నాయక రాజులు దీనిని రాజధాని
గా చేసుకుని పాలించారు. నాయక రాజులలో  అచ్యుత నాయకుడు, రఘునాథ నాయకుడు, అతని
తనయుడు విజయరాఘవ నాయకుడు చాలా ప్రసిద్ధులు. వీరు గొప్ప కళా పోషకులు. ఆ రాజులు కవులు
 కూడా కావడంతో అనేక గ్రంథాలు రాసేరు. రఘునాథ నాయకుడు కర్ణాటక సంగీతంలో గొప్ప ప్రతిభ కలవాడు.
అనేక రాగాలను తాళాలనుస్వయంగా కల్పన చేసాడు  రఘునాథనాయకుని రామాయణం, చాలా
 విశిష్ఠ మయినది. విజయ రాఘవుని రఘునాథాభ్యుదయం యక్షగానం కూడ చాలా ప్రసిద్ధ మయినది.
యక్షగాన ప్రక్రియను ఈ రాజులు  ఎంతగానో ప్రోత్సహించేరు. వాటి ప్రదర్శన కోసం ఎన్నో విశాల మయిన
వేదికలను నిర్మించారు కూడా.
చెప్పగ వలె కప్పురములు
కుప్పలుగా పోసినట్లు, విరి పొట్లము
విప్పిన గతి కుంకుమ పైపై
కప్పిన క్రియ ఘుమ్మనన్ కవిత్వము సభలన్
అనివారి నికష! ప్రతి పద్యం చమత్కారాలతో కమ్మనయిన మూడాశ్వాసాల ప్రబంధం రచించిన
 విజయ విలాస కర్త చేమ కూర వేంకట కవి , రామ భద్రాంబ మొదలయిన కవులూ,కవయిత్రులూ వీరి
 ఆస్థానంలోని వారే.

ప్రసంగవశాత్తు ఇక్కడ తంజావూరు ప్రభువుల దాన వైభవానికి చెందిన వొక కథ కూడా చెప్పు కోవాలి.
ఈ కథలో నిజం ఎంతో కానీ, తంజావూరు బద్ధకస్తుల కథగా యిది చాలా ప్రసిద్ధ మయినది.
నాయక రాజులు తమ పాలనలో వొక పెద్ద అన్నదాన సత్రం నిర్మించి పూటకి 60 వేల మంది ఉచితంగా
ముప్పూటలా భోజనాలు చేసే వీలు కల్పించారుట. ఇంత పెద్ద అన్న దాన సత్రం మరెక్కడా ఉండదు.
అన్నదాన కార్యక్రమం ముగిసేక, సత్రం అధికారులు గంట మ్రోగిస్తే దానిని విని కానీ రాజులు భోజనాలకి
కూర్చునే వారు కారుట. ఇలా ఉండగా రాను రాను తంజావూరులో ఈ అన్నదానం వల్ల సోమరుల సంఖ్య
 తామర  తంపరగా పెరిగిపోయింది. అందరి లోకీ గొప్ప సోమరి పోతు ఎవరూ అని రాజులు తెలుసుకో గోరేరుట.
వో రోజు రాత్రి సత్రానికి నిప్పు పెట్టారు. అంతా పొలోమని బయటకి పరిగెత్తారు. ముగ్గురు మాత్రం పడుకునే
 ఉన్నారు. వారిలో వొకడు కాసేపటికి విధి లేక లేచి వెళ్ళి పోయేడు. రెండవ వాడు తాము పడుకున్న
 చోటుకి  అగ్ని కీలలు వచ్చే వరకూ పడుకుని ఇక లాభం లేదనుకుని  లేచి వెళ్ళి పోయాడుట. మూడవ
వాడు మాత్రం తాను పడుకున్న చోట పైన ఉండే దూలం పూర్తిగా కాలే వరకూ చూదాం లెమ్మని పడుకునే
 ఉన్నాడుట. సత్రం అధికారులు వాడినే అతి గొప్ప సోమరి పోతుగా నిర్ణయించి బలవంతంగా లాగి బయట
పడేసారుట. ఈ కథలో వాస్తవం ఉన్నా, లేక పోయినా తంజావూరు ప్రభువుల దాన శీలత్వం లోక ప్రసిద్ధ
మయినదే . ఇక  యాత్రా కథనం లోకి వద్దాం.

బస్ ముదుంగాతంజావూరు సరస్వతీ మహల్  గ్రంథాలయం చేరుకుంది. ప్రపంచ ప్రసిద్ధ మయిన
ఆ పుస్తక దేవాలయాన్ని దర్శించు కోవడం మా జీవితంలో వొక మధురానుభవం అనే చెప్పాలి.
మేం వెళ్ళిన రోజున గ్రథాలయంలో కొన్ని భాగాలకు మరమ్మత్తులుజరుగుతున్నాయి.ఇదొక పెద్ద
పుస్తక భాండాగారం. ఎందరో సాహితీవేత్తలకు గొప్ప గొప్ప గ్రంథాలు ఇక్కడ ఉపలభ్యమౌతాయి.
సాహిత్య పరిశోధకులకు ఇదొక పెన్నిథి వంటిది.
సరస్వతీ మహల్ గ్రంథాలయం చూసేక తంజావూరు లోని గొప్ప శైవ  క్షేత్రం బృహదీశ్వరాలయం చేరు కున్నాము.
కావేరీ నది ఒడ్డున దక్షినాన ఉండే తంజావూరులో బృహదీశ్వరాలయం అతి పెద్ద శైవ క్షేత్రం.
తంజ – ఆన్ అనే రాక్షసుని ఇక్కడశ్రీ ఆనందవల్లి, శ్రీ నీల మేఘ పెరియాళ్ లు వధించినట్లు ఐతిహ్యం.
అపురూప మయిన శిల్ప కళా వైభవానికి పరాకాష్ఠగా ఈ ఆలయం విలసిల్లుతోంది.1010లో తొలి చోళ రాజ
రాజు నిర్మించిన అతి పెద్ద శైవాలయమిది. దీనికి మూడు ద్వారాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారం
కేరళాంతకన్ కాగా రెండవది రాజరాజన్ తిరువళ్ మరొకటి తిరులేశక్కన్ తిరువళ్. ఇక్కడే వొక పెద్ద నంది
ఉంది. లేపాక్షి తర్వాత దేశంలో అతి పెద్ద నంది ఇదేనంటారు. దాని ఎదురుగా పెద్ద లింగ పీఠం మీద బృదీశ్వర
స్వామి దర్శనమిస్తాడు .బృహత్ అంటే పెద్ద. ఇది చాలా పెద్ద లింగం కనుక దీనికా పేరు వచ్చింది. భక్తుల రద్దీ
 విశేషంగా ఉంది.
గర్భ గుడిలో దక్షిణాన శివుడూ, పడమర వేపు నటరాజు, ఉత్తరాన దేవతామూర్తు విగ్రహాలూ ఉంటాయి.
ఇది సర్వకళా శోభిత మయిన గోపురాలతో కూడిన ఆలయం.
భారత ప్రభుత్వం1954లో తొలి సారిగా 1000 రూపాయల నోటు ముద్రించి నప్పుడు నోటు మీద ఈ
 ఆలయ చిత్రాన్నే ముద్రించారు.  అలాగే 2001లో ఈ ఆలయ చిత్రం ముద్రించిన తపాలా బిళ్ళ
కూడా విడుదల చేసారు.
సర్వతో భద్ర మయిన ఈ బృహదీశ్వరాలయ దర్శనం జీవితంలో మరచి పోలేనిది. అక్కడ చాలా సేపు గడిపి,
మా హొటల్ కి చేరు కున్నాము. ఆ రాత్రి తంజావూరు లోనే బస.
మర్నాడు మా 3వరోజు యాత్రా సందర్భంగా రామేశ్వరం చూసాము, ఆ వివరాలు ప్రస్తుతానికి
సశేషమ్!


























10, మార్చి 2016, గురువారం

మా తమిళ నాడు యాత్రావిశేషాలు ... Day 01

మా తమిళ నాడు యాత్రా విశేషాలు ...  Day 01

చెన్నై లోని టూరిజమ్ వారి ఆఫీసు నుండి  27-02-2016 శనివారం ఉదయంబస్ 7.45 గం.లకి
బయలు దేరాక, గంట ప్రయాణం తరువాత TTDC  వారి హొటల్ దగ్గర బస్ ఆగింది.
టిఫిన్ లు అయ్యేక, తిరిగి బయలు దేరింది. పాండిచ్చేరికి ప్రయాణం. పాండిచ్చేరి పది పన్నెండు
కి.మీ దూరంలో ఉందనగా, మా గైడ్  బస్సు లోనుంచే 2004లో వచ్చిన పెను ఉప్పెనకు
గురయిన ప్రాంతాలను చూపించేడు. అవన్నీ మొత్తం ధ్వంస మయ్యాయిట. కానీ ఆ ఆనవాళ్ళేమీ
ఇప్పుడు కనిపించవు. ప్రజల సహకారంతో ప్రభుత్వం నిర్మించిన కొత్త కాలనీలు, వందలాది యిళ్ళు
కనిపిస్తాయి. వొక శ్మశాన వాటికలాంటి ప్రదేశాన్ని అనతి కాలంలోనే నందనోద్యానంగా మార్చిన
ప్రభుత్వం వారి కృషి, చిత్త శుద్ధి ఆనందం  కలిగిస్తుంది.

బస్ 9గటలకి పాండిచ్చేరి చేరింది. దీనినే పుదుచ్చేరి అని కూడా వ్యవహరిస్తారని తెలిసినదే కదా.
 పుదుచ్చేరి చాలా అంద మయిన పట్టణం. ఇది కేంద్ర పాలిత  ప్రాంతం. పుదుచ్చేరి వైశాల్యం 293 కి.మీ.లు.
 బంగాళా ఖాత తీరంలో తమిళ నాడు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉంది. మన ఆంధ్ర ప్రదేశ్ లో అతర్భాగంగా
 కేంద్ర  పాలిత ప్రాంత మయిన యానాం ఉంది. వొకటి రెండు పర్యాయాలు వెళ్ళాను. అది కూడా పాండిచ్చేరి
లాగే అంద మయిన ప్రాంతం. పాండిచ్చేరిలో విశాల మయిన అంద మయిన బీచ్ కనుల పండువు చేస్తుంది.
1673లో ఫ్రెంచి వారు ఇక్కడ ఈస్టిండియా కంపెనీ అనే వర్తక స్థావరం ఏర్పాటు చేసుకుని ఈ ప్రాతాన్ని
స్వాధీన పరుచు కున్నారు.
మాతృ భాష తమిళంగా కలిగి, ఇప్పటికీ ఫ్రెంచి వారసత్వం కలిగిన  చాలా మంది ఇక్కడ ఉంటున్నారు.
పూర్వం ఇక్కడ అగస్త్య ముని ఆశ్రమం ఉండేదిట. అరవిందుడు, ప్రముఖ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి
నడయాడిన చోటు యిది.
పుదుచ్చేరిలోసముద్రపు అలలు నగరం లోనికి చొచ్చుకు రాకుండా  27 అడుగుల కరకట్ట నిర్మించారు.
 2004 లో వచ్చిన పెను ఉప్పెన నుండి పుదుచ్చేరి నగరాన్ని కాపాడినది ఈ కరకట్టేనట! ఆఉప్పెనలో
దాదాపు 24 అడుగుల ఎత్తు వరకూ అలలు విరుచుకు పడ్డాయిట.ఈ కరకట్టే కనుక లేక పోతే, ఆ రోజు
పాండిచ్చేరి సముద్ర గర్భం లో కలిసి పోయి ఉండేది!

పుదుచ్చేరిలో మొదట వినాయక గుడిని దర్శించు కున్నాం. ఆ విధంగా మా యాత్ర వినాయకుని
 దర్శనంతో మొదలయిందని చెప్పాలి! తదనంతరం ఏ విఘ్నాలూ లేకుండా యాత్ర పూర్తవడానికి ఇది
దోహద పడిందనవచ్చు. ఈ వినాయక గుడి పాతదే అయినా, ఇటీవల కాలంలో ఆధునీకరించి చాలా
అందంగా రూపొందించినట్టు కనబడుతోంది.విశాలంగా ఉంది. ఇక్కడ అందమయిన  రంగులతో  లెక్క లేనన్ని
 భంగిమలతో వినాయకుని బొమ్మలు ఉన్నాయి. తరువాత అరవిందాశ్రమం చూసాం. అరవిందుని
స్మృత్యర్థం నిర్మించిన వొక పవిత్ర మయిన, ప్రశాంత మయిన ఆధ్యాత్మిక అధ్యయన కేద్రం అది.
అక్కడ అరవిందుని పుస్తక భాండాగారం, వారు వినియోగించిన వస్తువులు, స్వాతంత్ర్య సమర ఘట్టానికి
చెందిన ఫొటోలు మొదలయినవి భద్ర పరిచేరు.
అరవిందాశ్రమం చూసాక కొంత సేపు బీచ్  లో గడిపేం. చాలా పొడవయిన బీచ్ ఇది. కనుచూపు
మేర  సముద్రమే.కరకట్ట అవతల అలలు కనుల పండువుగా ఉంటాయి.ఉత్సాహం ఉంటే, కరకట్ట
అవతల బండ రాళ్ళను దాటుకుంటూ అలల వరకూ వెళ్ళ వచ్చును.
 పాండిచ్చేరిలో వీధులన్నీ ఎక్కడా వంపులు లేకుండా తిన్నగా తీర్చి దిద్దినట్టు ఉన్నాయి.
ఇళ్ళు కూడా ఫ్రెంచి వారి కట్టడాల శైలిలో అందంగా  కనిపిస్తాయి. పరిశుభ్ర మయిన ప్రశాంత
 మయిన నగరం.
సరే, పాండిచ్చేరి అందాలనుమనసు పొరలలో నిక్షిప్తం చేసు కుంటూ బస్ ఎక్కాము.
మధ్యాహ్నం  1.30 అవుతూ ఉండగా కడలూరు అనే చోట భోజనాలకి బస్ ఆగింది. ఈ భోజనాల
ఖర్చు  మాదే, భోజనం  చాలా బాగుది. 95 రూ.లకి అంత మంచి భోజనం దొరకడం అదృష్టమే.
అందరం లంచ్ తీసు కోవడం అయ్యాక తిరిగి బస్ బయలు దేరింది. సాయంత్రం 2.30 గంటలకి
పిచ్చవరం చేరింది. ఇదొక అంద మయిన టూరిష్టు ప్లేసు.ఇక్కడ ఎన్నో తమిళ, తెలుగు చిత్రాల
చిత్రీకరణ జరుగుతూ ఉంటుందిట. ఈ బ్యాక్ వాటర్స్ లో తెడ్డు వేసి నడిపే పడవలో వెళ్ళి రావాలి.
మర పడవలు కూడా ఉంటాయి, గంట, రెండు గంటలు, మూడు గంటలు ఇలా మనకి నచ్చిన
సమయం పడవలలో గడిపి రావచ్చును. ఒక్కో దానికీ ఒక్కో రేటు. మేమూ, మురళీ కృష్ణ
కుటుబ సభ్యులు ముగ్గురూ కలిసి మొత్తం ఐదుగురం వొక గంట తిరిగి రావడానికి టిక్కెట్లు
తీసు కున్నాము. ఒక్కొక్కరికీ రూ 63 చొ.నఅయిది. వారిచ్చిన  లైఫ్ జాకెట్ లు తప్పకుండా వేసు
కోవాలి. అవే మంత పరిశుభ్రంగా లేవనుకోండి. అయినా వేసుకోక తప్ప లేదు.ఆ ప్రాంతమంతా
బ్యాక్ వాటర్స్ లో మేంగ్రూ చెట్ల పొదలతో నిడి పోయి ఉంటుంది. అవి ఔషధ మొక్కలు.
గుబురుగా ఉండే ఆ చెట్లను దూరంగా చూస్తూ,వాటి ప్రక్కల నుండీ, క్రింద నుండీ పడవలో వెళ్ళి
 రావడంవొక అందమయిన అనుభవం!  దట్టమయిన ఆ అటవీ వృక్షాల వల్లనే ఆ ప్రాంతం
ఎన్నో తుఫానులనీ, ఉప్పెనలనీ ఎదుర్కొన గలిగినదని  చెబుతారు.
ఈ బోటు షికారుతో మాతొలిరోజు యాత్ర ముగియ లేదు. అక్కడి నుండి  బయలు దేరి సాయంత్రం
కోవెల తెరిచే వేళకి నాలుగు గంటలకి చిదంబరం చేరు కున్నాం.
చిదంబరం కడలూరు జిల్లాలో ఉంది. ప్రసిద్ధ శైవ క్షేత్రం. శివుడు ఆనంద తాడవం చేస్తూ నట రాజ
రూపంలో దర్శన మిస్తాడు. నేల, నీరు, నింగి,గాలి,అగ్ని అనే పంచ భూత లింగాలలో ఇక్కడ శివుడు
 ఆకాశ లింగ రూపంలో ఉంటాడు. ఆకాశం అంటే అంతటా వ్యాపించి ఉండేది కనుక ఆ ఆకాశ లింగం
లింగ రూపంలో ఖాళీ జాగాలో తెర మాత్రమే చూడ గలుగుతాం. శివుడు ప్రక్కన నటరాజ రూపంలో
 మాత్రమే  దర్శన మిస్తాడు.  అదే చిదంబర రహస్యం అని అంటారు. స్వామితో పాటు, శక్తి రూపిణి
 అయిన శివగామిని ప్రతిరూపగా డబల్లెని చూడగలం. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ శైవ
క్షేత్రంలో గోవింద రాజ పెరియాళ్ కూడ తన దేవేరి పుడరీక వల్లీ సహితుడై కొలువై ఉండడం ! నూట ఎనిమిది విష్ణు క్షేత్రాలో ఇది ఒకటిట. స్థితి కారుడినీ, లయ కారుడినీ ఒకే  ఆలయంలో దర్శించు కోవడం చిదంబరం ప్రత్యేకతలలో ఒకటి.

పంచ భూత లింగాలు ఇవి:
1.        చిదంబరం  ...  నటరాజ స్వామి రూపంలో ...ఆకాశ లింగం
2.        కంచి ... ఏకాంబరేశ్వరుడు  ..  భూ లింగం
3.        జంబుకేశ్వరం  ... జల లింగం
4.        తిరువణ్ణామలై  ( అరుణాచలం)  .. అగ్ని లింగం
5.        శ్రీకాళహస్తి ... వాయు లింగం.
చిదంబరంలో మొత్తం 9 పెద్ద గాలి గోపురాలతో విశాల మయిన ప్రాకారంలో కట్టబడిన అతి ప్రాచీన మయిన శైవాలయం. అయితే ఇందులో నాలుగు గాలి గోపురాలు మరీ ప్రత్యేక మయినవి. వాడుకలో ఉన్నవి. ఇక్కడ రాతి గొలుసులు,పెద్ద పెద్ద స్తంభాలు  వారి శిల్ప కళా నిర్మితికి వొక చక్కని ఉదాహరణ.
చిదంబరం నటరాజ స్వామి దర్శనం చేసుకున్నాక, వో గంట సేపు అక్కడ గడిపి మా తొలి రోజు యాత్రలో చివరిదయిన వైథీశ్వరన్ కోయిల్ చేరు కున్నాం.

వైథీశ్వరన్ కోయల్ . చిదంబరం నుండి 27 కి.మీ. దూరంలో ఉంది.శివుడు వైథీశ్వరునిగా అవతరించాడు. పూర్వం వొక రాజు  కుష్ఠు రోగ పీడితుడై అంగారక పూజలు జరిపించగా రోగ విముక్తు డయ్యాడని ఐతిహ్యం. అతడే ఈ దేవాయం నిర్మించినట్టు చెబుతారు.
ఇక్కడ వెలిసిన వైథీశ్వరుడు ఆరోగ్య ప్రదాత అని అంటారు. ఈ ప్రాంతంలో
నాడీ వైద్యం ప్రముఖంగా చేస్తూ ఉంటారుట.
దీనితో మా 8 రోజుల తమిళ నాడు యాత్రలో మొదటి రోజు యాత్ర  సంతృప్తికరంగా ముగిసింది. బస్ టూరిజమ్ వారి హొటల్ కి చేరు కుంది. అక్కడే రాత్రి డిన్నర్ చేసాం.
హొటల్ వారి ఆతిథ్యం గురించీ, భోజనాల గురించీ చెప్పడం చర్విత చర్వణమే అవుతుంది.

మా రెండో  రోజుయాత్రా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. శలవ్.





















9, మార్చి 2016, బుధవారం

మా తమిళ నాడు యాత్రా విశేషాలు .. .. చెన్నై దేవాలయ దర్శనం

మా తమిళ నాడు యాత్రా విశేషాలు  -  చెన్నై దేవాలయ దర్శనాలు
తమిళ నాడు వారి టూరిజమ్ పేకేజిలో మా యాత్ర ఫిబ్రవరి 27 తో మొదలవుతుంది. కాని,
తమిళ నాట మా దేవాలయ దర్శనాలు 26 వ తేదీ నుండే మొదలయ్యాయని చెప్పాలి. ఎదురు చూసిన
ప్రయాణపు తేదీ దగ్గర పడుతూ ఉండడంతో 24 వ తేదీ నాటికే రెండు  చిన్నసూట్ కేసులూ, వొక బేగ్ తో
బట్టలూ అవీ సర్దుకుని సిద్ధ మయ్యాము. రానే వచ్చింది 25 వ తేదీ. ట్రైన్లో రాత్రీ, మరునాడు ఉదయమూ
తినడానికి మా ఆవిడ టిఫిన్ పేకెట్ లు సిద్ధం చేసింది.
మేం ఎక్క వలసిన భువనేశ్వర్ – చెన్నై సూపర్ ఫాస్ట్ఎక్స్ ప్రెస్ సరైన సమయానికే అంటే, సాయంత్రం
 5గ.50 ని.లకి వచ్చింది. మా ఇద్దరివీ కూడా అప్పర్ బెర్తు లే! కానీ మిడిల్ బెర్తు  వ్యక్తి మా ఆవిడకు
అది యిచ్చి, తను అప్పర్ బెర్తులో సర్దుకున్నాడు.
 రాత్రి ఎనిమిదికి టిఫిన్ లు కానిచ్చి, నిద్రకు ఉపక్రమించాం, మర్నాడు ఉదయాన్నే లేచి ముఖాలు కడుక్కుని కాఫీలు సేవించి
కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే 8.50ని.లకి చెన్నై సెంట్రల్ స్టేషనులో సరైన టైముకే  ట్రైన్ చేరింది.

చెన్నైలో స్టేషనుకి అర కిలో మీటరు దూరం లోనే సిటీ హోమ్ హొటల్ లో వొక ఎ.సి రూమ్ ముందుగానే
నెట్ లో బుక్ చేసి ఉన్నాను కనుక, రైలు దిగి, కూలీని మాట్లాడుకుని స్టేషను వెలుపలికి వచ్చి, ఆటోలో
హొటల్ కి  చేరాం. గదిలో ప్రవేశించి స్నానాదికాలు ముగించుకుని టిఫిన్  కానిచ్చేం. ఇక మర్నాడు ఉదయం
వరకూ మాకు తీరికే. కనుక, మద్రాసులో ప్రసిద్ధ మయిన ప్రాచీన దేవాలయాలు చూసి వద్దాం అని
 నిర్ణయించు కున్నాం. మేం దిగిన సిటీ హోమ్ హొటల్ వారే ట్రావెలింగు ఏజెన్సీనిర్వహిస్తూ ఉండడంతో
వాళ్ళ టారిఫ్    సరి చూసుకుని, 5 గంటలకి వొక ఇండికా ఎ.సి. కేబ్ బుక్ చేసాను. రేటు 900లు.
కేబ్ మధ్యాహ్నం 3 గంటలకల్లా ఉండాలని చెప్పేను. రెండింటికి భోజనాలు కానిచ్చి, పేపరు చదువుకుంటూ
 విశ్రాంతి తీసుకున్నాం. మూడు గంటలకి బయలు దేరడానికి సిద్ధంగా ఉన్నాం.
చెప్పిన టైముకి కేబ్ వచ్చింది. బయట ఎండ కొంచెం ఎక్కువగానే ఉంది. ఎ.సి కేబ్ బుక్ చెయ్యడంతో
మాకు అలసట తెలియ లేదు.
ముందుగా అష్ట లక్ష్మీ దేవాలయానికి వెళ్ళాం. అంతస్థులుగా ఉండే ఈ దేవాలయం చాలా బాగా ఉంది.
మెట్లెక్కుతూ అష్ట లక్ష్ములనూ దర్శించు కున్నాం. అక్కడి నుండి ఎదురుగా సముద్రం కనబడుతూ
వాతావారణం ఆహ్లాదకరంగా అనిపించింది. తర్వాత పార్ధ సారధి టెంపుల్,  ఆ తరువాత కపాలేశ్వర స్వామి
దేవాలయాలను దర్శించు కున్నాం. ఈ మూడు దేవాయాలూ చెన్నై లో  చాలా ప్రసిద్ధ మయినవే కాక
తప్పకుండా చూడ తగినవి. వీటి గురించి మేం ముందుగానే విని ఉన్నాం.
దేవాలయాలను దర్శించు కున్నాక, మెరీనా బీచ్ కి వెళ్ళాం. అప్పటికి చీకటి పడింది. సముద్రం మసక
 మసకగా  కనిపిస్తోంది. అయితే నేం, సముద్రపు గాలి చల్లగా హాయిగా ఉంది.
ఎంత చూసినా తనివి తీరదు. ప్రతి సారీ కొత్త కొత్త పాఠా లేవో చెబుతూనే ఉన్నట్టుగా ఉంటుంది. కెరటాల
 చేతులతో ఆశీర్వదిస్తూ. తెల్లనినురుగు నవ్వులతో  సమ్మోహనపరుస్తూ, చల్లని గాలుల్తో సేద దీరుస్తూ,
 ఆ సంజె చీకట్లలో చీకట్ల దుప్పటీ కప్పుకుని సముద్రం మరింత కొత్తగా కనిపించింది. గరికపాటి వారి
 సాగర ఘోష కావ్యం లోని  కొన్ని చరణాలను గుర్తు చేసు కున్నాను. దానితో మనసు మరింత ప్రఫుల్ల
మయింది.
బీచ్ లో  రాత్రి ఎనిమిది వరకూ గడిపి హొటల్ కి చేరు కున్నాము. రాత్రి పెద్దగా ఆకలి లేక పోవడంతో
కొద్దిగా పెరుగన్నాలు మాత్రం తిని, నిద్రకు ఉపక్రమించాం.

27 – 02 -2016.
ఉదయాన్నే లేచి, 5.30కల్లా తయారయి పోయాం. కాఫీలు త్రాగి, ఆటోలో తమిళ నాడు టూరిజమ్ వారి
 ఆఫీసుకి  చేరు కున్నాం.

 TTDC  వారి ఆఫీసు మేం దిగిన హొటల్ కి నాలుగు కి.మీ.ల దూరంలో ఉంది.
No.2 Wallajah Road, Triplicane  లో ఉంది.మేము అక్కడకి చేరుకునే సరికే మా సహ ప్రయాణికులు
కొందరు అక్కడికి చేరుకుని ఉన్నారు. మేం వచ్చి నట్టుగా రిపోర్టు చేసి, వారిచ్చిన టిక్కెట్ అసలు
ప్రతి తీసుకున్నాం. దాని మీదే మా కోచ్ నబరు వేసి ఇచ్చారు. ఎ.సి కోచ్. 18 సీటర్ బస్.
ఐతే, 17 మంది మాత్రమే అయ్యేము.
మా సహ ప్రయాణికుల గురించి ఇక్కడ కొంత చెబుతాను. పాట్నా నుండి వచ్చిన బీహారీ కుటుంబ
సభ్యులు  3 జంటలూ, బొంబాయి నుండి వచ్చిన వొక జంట, వారి అమ్మాయి,కలకత్తా నుండి
బెంగాళీ దపతులు, ఢిల్లీ నుండి వొకామె, హైదరాబాదు నుండి అయ్యగారి మురళీ కృష్ణ, వారి శ్రీమతి రాధ
మరదలు విజయ లక్ష్మి ఉన్నారు. మాతో పాటు వొక తెలుగు కుటుంబం, మా సమ వయస్కులయిన వారు
ఉండడంతో చాలా సంతోషించేము. బస్ లో కూడా మా ముందు సీట్లే వారి వి కావడంతో  కబుర్లు
చెప్పుకుంటూ  కలసి పోయి మొత్తం టూర్ అంతా అందరం బాగా ఎంజాయ్ చేసాం.
(యాత్ర ముగిసేక, చివరి రోజు కూడా రైల్వే స్టేషన్ వరకూ మేమూ, మురళీ కృష్ణ గారి కుటుంబమూ,
బొంబాయి నుండి వచ్చిన దంపతులూ, వారి కుమార్తె ప్రియాంక అందరం కలిసే తిరిగేం. ఆరోజు
మా ట్రయిన్లు రాత్రి పదీ, పన్నెండు  గంటల మధ్య ఉండడంతో  మేమంతా మద్రాసులో ఎగ్జిబిషన్,
 మెరీనా బీచ్ లు తిరిగి వచ్చేము.  బాగా కాక్షేపం అయింది.ఆ విశేషాలు చివర్లో రాస్తాను.)

సరిగ్గా ఉదయం 7.30కి మా బస్ వచ్చింది. సామాన్లు డిక్కీలో పెట్టించి అందరం బస్ ఎక్కాం.
భాషలు వేరయినా, వొకరి నొకరు నవ్వుతూ పలకరించుకుని సీట్లలో కూచున్నాం. మాగైడ్ గణేశ్ తన
 గురించి పరిచయం చేసుకుని , డ్రైవరునీ, అతని సహాయకునీ మాకు పరిచయం చేసాడు.
మమ్మల్ని అందరినీ  పరిచయం చేసుకున్నాక 7.45 ని.లకి మా తమిళ నాడు యాత్ర మొదలయింది.
బస్ బయలు దేరింది. మొదటి రోజు యాత్రా విశేషాలు యిప్పటికి సశేషమ్!





























8, మార్చి 2016, మంగళవారం

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ... ప్రస్తావన

మా 8 రోజుల తమిళ నాడు యాత్రాదర్శన విశేషాలు
ప్రస్తావన
గత 2015 అక్టోబరు నెలలో మా అన్నదమ్ములం నలుగురమూ ( ఆఖరి వాడు రాలేక పోయాడు)
శ్రీమతులతో సహా కాశీ, గయ, ప్రయాగ యాత్రలు చేసి వచ్చేం. మాతో మా మరదలు హైమ కూడా వచ్చింది.
ఆ యాత్రా విశేషాలన్నీ మా అన్నయ్య ‘‘ మా కాశీ యాత్ర విశేషాలు’’ పేరిట ముఖ పుస్తకంలో వివరగా చక్కగా రాసేడు.
ఈ ఫిబ్రవరి 25 వ తేదీన నేనూ, నా భార్య విజయ లక్ష్మి తమిళనాడు యాత్రలు చేసి వచ్చేము.
తమిళ నాడు టూరిజమ్ వారు ఏర్పాటు చేసిన 8 రోజుల తమిళ నాడు యాత్రా దర్శిని లో బయలు దేరి వెళ్ళి వచ్చేము. అసలు తమిళ నాడు టూరిజమ్ వారి ( ఇక నుండిదీనిని ttdc అని పేర్కొంటాను) ఈ పేకేజీ గురించి, మేము హైదరాబాద్ లో ఉండే రోజులలోనే, ఐదేళ్ళ క్రిందటే మా తమ్ముడు క్ష్మణ్, మరదలు
శారద చాలా బాగుంటుందని చెప్పేరు. వాళ్ళు అప్పటికే వెళ్ళి ఉండడంతో వాళ్ళ అనుభవం మాకు అక్కరకొచ్చింది. ఐతే, ఎప్పటి కప్పుడు వెళ్దాం అనుకుంటూనే తాత్సారం చేసాక, దైవ సంకల్పం వల్ల ఇప్పటి కయింది. ఆ 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలనూ 8 భాగాలలో మీ తో పంచు కోవాలని అనుకుంటున్నాను. సూక్ష్మాంశాలతో పాటూ సవివరంగా రాదామని నాప్రయత్నం. వెళ్ళ దలచు కున్న
వారికి ఉపయుక్తంగా ఉండే లాగున పేకేజీవిరాలూ, ధరవరలూ, వసతులూ, భోజన సదుపాయాలూ షాపింగ్ స్థలాలూ వాటి గురించి చెబుతాను. ఆ యాత్రాస్థలాల గురిచి క్లుప్తంగా నయినా తెలియ జేస్తాను. ఆసక్తి కలవారు అంతర్జాలంలో గూగులమ్మని అడిగితే ఆ యమ ఎలాగూ చెబుతుంది!
పేకేజీ వివరాలు:
తమిళనాడు గవర్నమెంట్ టూరిజమ్ వారి 8 రోజుల తమిళ నాడు యాత్రా దర్శినిలో రాత్రి పూట ప్రయాణాలు ఉండవు. ఉదయమే బయలు దేరి సాయంత్రానికి వారి టూరిజమ్ హొటళ్ళు ఉండే ప్రాంతాలకి చేరుస్తారు. ఆ హొటళ్ళ లో బస. మళ్ళీ మరు నాడు ఉదయంబ్రేక్ ఫాస్టు అయ్యాక మరో యాత్రా స్థలానికి ప్రయాణం. AC Non Ac బస్సులూ, టూరిజమ్ వారి హొటళ్ళూ ఉంటాయి.
మేము టూర్ కి A C కోచ్ నీ, బసకి AC రూమునీ బుక్ చేసుకున్నాము. ఒక్కో టిక్కెట్టు ధర రూ.14,050. మొత్తం 28,100 ఇచ్చి నెట్లో బుక్ చేసుకుని ప్రింటవుట్ తీసుకున్నాను. ( మనం సీనియర్ సిటిజన్ల మయినా, వికలాంగుల మయినా ఒక్కో టిక్కెట్ కి 20 శాతం నగదు రిఫండ్ యాత్ర పూర్తయాక వెంటనే ఇచ్చేస్తారు !)
ఈ పేకేజీలో మనకి చూపించే యాత్రా స్థలాలు ఇవి:
1పుదుచ్చేరి,2 పిచ్చ వరం 3.చిదంబరం 4.వైదీశ్వరన్ కోయిల్ 5నాగ పట్నం ( నాగూర్) 6 వేలంకిని 7.తంజావూరు 8.రామేశ్వరం 9.కన్యా ుమారి10.సుచీంద్రం11. మధురై12.కొడైకెనాల్ 13.తిరుచ్చి (శ్రీరంగం)
ఇవి కాక దారిలో అదనంగామరో ఇవి కాక పేకేజీలో లేని నాలుగయిదు ముఖ్య స్థలాలను కూడా చూపెడతారు. వీటిలోవైదీశ్వరన్ కోయిల్,
తంజావూర్ ,రామేశ్వరం, కన్యా కుమారి, మధురై, కొడైకెనాల్, తిరుచ్చి లలో రాత్రి బస.
టూరిజమ్ వారి కేంటీన్లలో ప్రతి చోటా ఉదయం స్వీటుతో పాటు నాలుగయిదు రకాల టిఫిన్లు, మధ్యాహ్నం, రాత్రి స్వీటుతో పాటు చక్కని రుచికర మయిన భోజనాలు కొసరి కొసరి వడ్డించేరు. ఎక్కడి క్కడ వాటర్ బాటిళ్ళు కొనుక్కునే వాళ్ళం. పేకేజీ నిబంధనల ప్రకారం ఉదయం టిఫిను తప్పని సరిగానూ, లంచ్ కానీ, డిన్నర్ కానీ టూరిజమ్ వారే ఇస్తారు. ఏదో ఒక పూట మంచి హోటల్ వద్ద ఆపుతారు. మన ఖర్చుతో నచ్చినవి తీసుకో వచ్చును.
పగటి పూట యాత్ర ముగించుకుని టూరిజమ్ వారి హొటల్ కి చేరు కోగానే రూమ్ బాయస్ మన సమాన్లు భద్రంగా మనుకు కేటాయించిన గదులకు చేరుస్తారు.
అలాగే మరు నాడు ఉదయమే బస్ వద్దకు చేరుస్తారు. ఎక్కడా టిప్ కోసం చేయి చాపిన దాఖలాలు లేవు.
టూరిజమ్ అభివృద్ధి కోసం ఆ ప్రభుత్వం, వారి టూరిజమ్ శాఖ తీసుకుంటున్న శ్రద్ద ఎంతయినా మెచ్చుకో తగినదే. మనతో పాటు ఒక గైడూ, కోచ్ డ్రైవరూ, అతని సహాయకుడూ ఉంటారు. మా గైడ్ పేరు గణేశ్.
మా యాత్ర చెన్నై లో ఫిబ్రవరి 27 శనివారం ఉదయం 7 గంటలకి మొదలై మార్చి 5వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటకి ముగుస్తుంది. కనుక, మేం ఒక రోజు ముందుగా అంటే 26 వ తేదీ నాటికే చైన్నై చేరు కోవాలి. అందుచేత మేం 25 సాయంత్రం 5.45ని.కి విజయ నగరంలో ఎక్కడానికి వీలుగా భువనేశ్వర్,
చైన్నై సూపర్ ఫాస్టు ఎక్స్ ప్రెస్ లో 3rd AC టిక్కెట్లు బుక్ చేసు కున్నాము. అలాగే తిరుగు ప్రయాణానికి చెన్నైలో 5 వ తేదీ రాత్రి 11.45 కి బయలు దేరే హౌరా మెయిల్ లో టిక్కెట్లు బుక్ చేసు కున్నాము.
ఐతే, స్లీపరు క్లాసు తప్ప ఎ.సి దొరక లేదు. సరే లెమ్మనుకున్నాం.టిక్కెట్లు బుక్ అయ్యాయి. ఇక ప్రయాణం తేదీ కోసం ఎదురు చూడడమే !
మద్రాసుకి ప్రయాణంతో మొదలయ్యే మా తమిళ నాడు యాత్రా దర్శిని రోజు వారీ వివరాలు సశేషమ్!







28, నవంబర్ 2015, శనివారం

అనుకోని అతిథితో అర క్షణం సేపు ...





ఇవాళ మా ఇంటికి వో అనుకోని అపురూప మయిన అతిథి రావడం జరిగింది. ఆ అతిథితో  కాస్సేపు జనాంతికంగా సాగిన సంభాషణ సారం మీ ముందు ఉంచుతున్నాను.
అతిథి :  ‘‘ బావున్నారా ? ! ’’
నేను : ‘‘ ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు ! నన్ను నేనే నమ్మ లేక పోతున్నా ననుకో !
నా కళ్ళు నిజమే చెబుతున్నాయా ! ఎప్పుడో, చిన్నప్పుడు  పల్లెటూర్లో మా యింటి నడి వాకిలిలో  మీరంతా పిల్లా పీచూతో సమావేశ మవుతూ ఉండే వారు కదూ !  అప్పుడు మురిపెంగా మిమ్మల్ని చూసే వాళ్ళం ! తరువాత చూడ్డమే అరుదయి పోయింది ... ఎలా ఉన్నారు ? ’’
అతిథి : ‘‘ ఎందుకులే, చెప్పు కుంటే కడుపు తరుక్కు పోతుంది. ఎందుకో తెలీదు కానీ,  మేం పిట్టల్లా రాలి పోతున్నాం ! మా కుటుంబాలకు  కుటుంబాలే కూలి పోతున్నాయి. ఆ దేవుడికి మా మీద దయ లేదు ! అక్కడా అక్కడా ఒకటీ అరా మిగిలేం.’’
నేను: ( బాధగా ) అవును .. నేనూ విన్నాను,  అంతర్జాలంలో ఆ వివరాలు చదివేను కూడా
అతిథి : ‘‘  ఏం రాసేరేం ? ’’
నేను: అంతర్జాలం నుండి నేను సేకరించిన కథనం ఇలా ఉంది చూడు ...

‘‘పిచ్చుకలు మన చిన్ననాటి నేస్తాలు. పదిహేనుఇరవై యేళ్ళ క్రితం వరకూ పిచ్చుకలు లేని చోటంటూ కనపడేది కాదు. ముఖ్యంగా భారత దేశ గ్రామాల్లో అవి దాదాపు పెంపుడు పక్షులుగా కనపడుతుండేవి. పొద్దున లేచింది మొదలు దైనందిన జీవితంలో మనుషులు చేరే ప్రతి చోటా పిచ్చుకలూ చేరి తమ కార్యకలాపాల్లో మునిగితేలుతుండేవి. ఇంటి చూరులోకిటికీ తలుపులపైనాస్కూలు గది గోడలపైనాచెట్ల కొమ్మల చివర్లలోబట్టలు ఆరేసుకునే దండేలపైనాపొట్ట పోసుకున్న వరి చేలల్లోబిళ్లంగోడు ఆడే తుమ్మ తోపుల్లోఎండాకాలపు సీతమ్మ చెట్లపైనాగుళ్ళు గోపురాలపైనా ఎక్కడికెళ్ళినా పలకరిస్తుండేవి.
పరిశీలనా పరులకి పిచ్చుకల జీవనం ఆసక్తిగా ఉండేది. స్నేహం చేయడంజంట కట్టడంసందర్భానికి తగినట్లు కిచ కిచ’ చప్పుళ్లు మార్చడంఆడ మగ పిచుకలు ఊసులాడుకోవడంచిన్న చిన్న పురుగుల్ని ముక్కున పట్టి పిల్ల పిచ్చుకల నోట్లోకి నెట్టడంనిపుణులైన ఆర్కిటెక్చర్ ఇంజనీర్లలా ఒక్కో పుల్లాపీచూ తెచ్చి గూళ్లు అల్లడం… ఎన్ననిపరిసరాల్ని మర్చిపోయేలా చేసేవి. ఒక్కో మనిషీ పెరిగి పెద్దయ్యే క్రమంలో వివిధ సందర్భాల్లో పిచ్చుకలతో అనుభవం కొండ గుర్తులుగా ఉండేవి.
ఇప్పుడు పిచ్చుకలు దాదాపు కనుమరుగైనాయి. ప్రకృతినంతటినీ అదుపులోకి తెచ్చుకున్న మనిషి అవసరాలకు మించి ప్రకృతి వనరుల్ని ఖర్చు చేసేస్తున్నాడు. ఇతర పశుపక్షు జాతులకి ప్రకృతిని దూరం చేస్తున్నాడు. భూ వాతావరణాన్ని తోటి జీవజాలానికి పనికి రాకుండా చేస్తున్నాడు. పరిమితికి మించి వనరుల్ని తవ్వి తీస్తూ వాతావరణ వ్యవస్ధని అస్తవ్యస్తం చేయడంతో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి పిచ్చుకలకి మరణ శాసనంగా మారింది. మారుమూల ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకుపోయిన సెల్ టవర్లు పిచ్చుకలు అంతరించిపోవడానికి కారనమని పరిశోధనలు చెబుతున్నాయి. టవర్ల నుండి వచ్చే విద్యుదయస్కాంత తరంగాల ధాటికి సున్నిత ప్రాణులైన పిచ్చుకలు చనిపోతున్నాయని ఆ పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రపంచం మొత్తం మీద పిచ్చుకల సంఖ్య ఎనభై శాతం పడిపోయిందని ఆర్నితాలిజిస్టులు సర్వే చేసి లెక్కతేల్చారు. పిచ్చుకల దైన్యానికి ఇక్కడ మనిషి’ కారణంగా జనరలైజ్ చెయ్యడం కూడా సరికాదేమో. ఎందుకంటే మనుషుల్లో తొంభై శాతం మంది పశు పక్ష్యాదులకు స్నేహ శీలురే. భూములూకంపెనీలు అదుపులో పెట్టుకున్న కొద్ది మందే భూ వినాశనానికీవాతావరణ విధ్వంసానికీ కారణం అవుతున్నారు. వీరి లాభాపేక్ష మెజారిటీ ప్రజలతో పాటు ఇతర జీవ జాలానికి కూడా ప్రాణాంతకంగా మారింది.
ఈ నేపధ్యంలోనే 2012, మార్చి 20 తేదీని ప్రపంచ పిచ్చుకల రోజు’ గా ప్రకటించారు. ఎన్ని రోజులు’ ప్రకటించినా పర్యావరణాన్ని విధ్వంసం చేసే ఆర్ధిక దోపిడీ విధానాలు అంతం అయ్యేవరకూ ఈ పరిస్ధితి కొనసాగుతూనె ఉంటుంది. మనిషి సుఖ జీవనానికి పశుపక్ష్యాదులు కూడా దోహదం చేస్తున్నాయన్న స్పృహ లాభాపేక్ష కు ఉండదు. ఏం చేసయినాశ్రామికుల సుఖ సంతోషాల్నీ ప్రాణాల్నీ కబళించయినాపశు పక్ష్యాదుల వాటాని లాక్కునయినా లాభ శాతం పెంచుకోవాలని చూసే పెట్టుబడిదారీ వ్యవస్ధకు తనకు తాను మరణ శాసనం లిఖించుకుంటోదన్న సృహ కూడా ఉండదు. మేల్కోవలసిందే శ్రామికులే. ’’

అతిథి: ‘‘ ఇంత  చక్కని సమాచారాన్ని అందించిన వారికి నీతో పాటూ మేము కూడా ఋణ పడి ఉంటాము. సరే ... మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకునేందుకు వచ్చేను. ఇక్కడ మీ జనావాసాల మధ్య ఈ మధ్య వో సెల్ టవరు కట్టేరు. పూర్తయిన ఆ టవరుని ఏమయిందో, ఏమో నాలుగు రోజులకే  తొలిగించి వేసారు కదూ ... ఇక్కడి వాళ్ళంతా అంగీకరించక పోవడంతోనే దానిని తొలగించారని చెబుతున్నారు.  అందుకే మీకు ధన్యవాదాలు చెప్పు కుందామని ఇలా వచ్చేను. మరి వెళ్తాను ...’’
నేను : ‘‘ అదేం, వచ్చి అర క్షణం కాలేదు ..కాస్సేపు ఉండ రాదూ ; ...’’
నా మాటలు ఇంకా పూర్తి కానే లేదు, మా  ఇంటి కొచ్చిన అపురూప అతిథి తుర్రున ఎగిరి పోయింది !
మా చిన్నప్పుడు మా పల్లెలో మా ఇంటి నడి వాకిలిలో మా నాయనమ్మ కట్టిన వరి కంకుల మీద గుంపులు గుంపులుగా వచ్చి సందడి చేసేవి. మా రైతులు బళ్ళతో ధాన్యాన్ని తోలు కొచ్చి, మా వీధిలో మా ఇంటి ముందు  నిల బెట్టే వారు. మా ఇంట్లో ముత్తయిదువులు ఎద్దులకి పసుపు కుంకుమలు పూసి, హారతి ఒచ్చి పూజలు చేసాక, ధాన్యం బస్తాలను ఇంట్లోకి తెచ్చి, గాదె గదిలో కుమ్మరించే వారు . ధాన్యం బస్తాలతో పాటు ఆనప కాయలూ, బీర కాయలూ వంటి కూరలు కూడా  తెచ్చే వారు. ధాన్యం బస్తాలన్నీ ఇంట్లో చేరాక, పెరట్లో నుయ్యి దగ్గరకి వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కునే వారు రైతులు . నలుగు రయిదుగురు ఉండే వారనుకుంటాను. ఒక ప్రక్క ధాన్యం బస్తాలు ఇంట్లోకి పెరుగుతూ ఉండగానే ఇంట్లో మా నాయనమ్మా , వాళ్ళూ రైతుల కోసం వేడి వేడి అన్నం, సాంబారూ  ( పప్పు పులుసునీ ) వండి సిద్ధం చేసే వారు. పెరటి వాకిలి గచ్చు మీద విస్తరాకులు వేసి వడ్డించే వారు. ఆ వంటని మా రైతులు ఎంత ఇష్టంగా తినే వారో ! ‘ బుగతమ్మ చేతి వంట అమృతం ! ’ అంటూ మెచ్చుకునే వారు. మా నాయ నమ్మ పోయాక, మా మురళీ పిన్నీ, తర్వాత, మా ఆవిడా, కటి రెండేళ్ళు ఆ బాధ్యత కొత్తగా కాపురాని కొచ్చిన మా ఆవిడ తీసు కుని చేసేరు


ఇదంతా చెప్పడం దేనికంటే, ఇంటికి ధాన్యం బస్తాలు వచ్చిన రోజునే, పొలం నుండి రైతులు తెచ్చిన వరి కంకుల గుత్తులను మా వాళ్ళు మా ఇంటి నడి వాకిట్లో కట్టే వారు. అది మొదలు ! ఆ రోజు నుండీ పిచ్చుకలు గుంపులు గుంపులుగా వచ్చి వాలేవి.  అలా,  అప్పుడు మా ఇళ్ళలోనూ. పెరళ్ళలోనూ విరివిగా కనబడే పిచ్చుకలు ఇప్పుడు  చాలా ఏళ్ళుగా  కనబడడమే మానేసాయి. పొలాలు అమ్ము కున్నాక, మా నడి వాకిలిలో రైతులూ లేరు, ధాన్యం బస్తాలూ లేవు, వరి కంకులూ లేవు. పిచ్చుకలూ లేవు !. 
చాలా ఏళ్ళకి మా కంట పడిన అపురూప అతిథిని మీకూ చూపించాలని ముచ్చట కొద్దీ ఇంత వివరంగా రాసేను.

ఇదిగో  ! మా ఇంటి కొచ్చిన అపురూప అతిథి ఫొటో ... చూడండి ....



నిర్మాణం పూర్తయి, తిరిగి నాలుగు రోజులలోనే తొలగించిన సెల్ టవర్ అవశేషాలు యివే ... ( దీనిని తొలగించిన మరు నాడే అతిథి రావడం  జరిగింది. యాదృచ్ఛికమే కావచ్చు కానీ అదొక అందమయిన భావనకు బీజం వేసింది ) చిత్రం  చూడండి.