3, నవంబర్ 2011, గురువారం

ఈ గేయం ఏ కవి రచించారో చెప్పండి చూదాం !

ఒకరి కొకరు

నువ్వూ నేనూ కలిసి
పువ్వులో తావిలా
తావిలో మధువులా !

నువ్వూ నేనూ కలిసి
కోకిలా గొంతులా
గొంతులో పాటలా !

నువ్వూ నేనూ కలిసి
వెన్నెలా వెలుగులా
వెలుగులో వాంఛలా !

నువ్వూ నేనూ కలిసి
గగన నీలానిలా
నీలాన శాంతిలా !

ఈ చిన్ని గేయ రచయిత ఎవరో చెప్పగలరూ ?

క్లూ ఏదేనా ఇమ్మంటారా ?

అతను గొప్ప కవి అని చిత్రకారులు అనేవారుట ! అతను గొప్ప చిత్రకారుడు అని కవులు పొగిడే వారుట.

ఇతని ఊహా ప్రేయసి చంద్ర సంబంధి.

పోనీ, మరో క్లూ ఇమ్మంటారేమిటి ?

ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు వారు ఒకసారి ఒక నవలల పోటీ లో మరొక ప్రముఖునితో పాటు, ఇతనికి బహుమతి పంచి ఇచ్చారు.

ఆ ప్రముఖుని ప్రముఖ పాటల పుస్తకంలో ( గేయ సంపుటి ) బొమ్మలు ఇతనే గీసారు.

ఈ క్లూలు చాలవూ !

పోనీ, వారి ఫొటో కూడా పెట్టేస్తున్నాను. చెప్పెద్దురూ ! అయితే, మరో అనుబంధ ప్రశ్న కూడా ఉందండోయ్ !

క్లూలలో చెప్పిన బహుమతి పొందిన నవల పేరూ, వారి ఊహా ప్రేయసి పేరూ, వారు బొమ్మలు వేసిన గేయ సంపుటి పేరూ కూడా చెప్పాలి. మరి.


7 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

ఈయన అడవి బాపిరాజు గారు! నండూరి వారి ఎంకి పాటలన్నిటికీ బొమ్మలు ఈయనే వేశారు!

కథా మంజరి చెప్పారు...

రసఙ్ఞ గారూ, మరి కొందరి జవాబులు చూసాక, మీ వ్యాఖ్య ప్రచురిస్తాను. మరోలా అనుకోకండి.

ఎంకి పాటలకి బొమ్మలు నిజమే.

నా అనుబంధ ప్రశ్న ఏమిటంటే, ఈ గేయ కవి మరొక ప్రముఖునితో నవలల పోటీలో బహు మతి పొందారు కదా. ఆ నవల పేరేమిటి ?

ఆ మరో ప్రముఖుని ఏ గేయ సంపుటికి వీరు బొమ్మలు గీసారు ?

ఈ ప్రశ్నలన్నీ కేవలం మన సరదా కోసమే సుమండీ.

Praveen Mandangi చెప్పారు...

అడవి బాపిరాజు ఫొటో వేసి ఇంకా రచయిత పేరు అడుగుతారేమిటండి?

రసజ్ఞ చెప్పారు...

పర్లేదండీ ముందు నేనే పంపాను కదా! ఆ ఆనందం చాలు! విశ్వనాధ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలకి కూడా ఈయనే వేసారని గుర్తు! ఆ నవల పేరు నారాయణరావు అనుకుంటా అండి!

కథా మంజరి చెప్పారు...

రసఙ్ఞ గారూ, మొట్ట మొదటి కామెంటు మీదే.
అంచేత, అందుకోండి అభినందనలు !
ఇక, టపాలోని ముఖ్య ప్రశ్నకూ, అనుబంధ ప్రశ్నలకూ మీ జవాబులు రైటో, రైట్ !!!

ఫొటో చూసి గుర్తు పట్టినా చాలు కదండీ. అదే పదివేలు

రసజ్ఞ చెప్పారు...

మీ అభినందనలకి ధన్యవాదాలండీ! అయితే నాకు గుర్తున్నది కరెక్టే అనమాట!

Lakshman .M. V. చెప్పారు...

ముచ్చటగా వుంది.
ఐతే, బొమ్మ చూపిస్తూ ఇంకా ప్రశ్న ఏంటి గురువు గారు అన్నారు ఒకరు. పేరు చెప్పేక కూడా ఈయన ఎవరు అనే పరిస్థితిలో వుంది ఇప్పుడు మన తెగులు (మన్నించాలి తెలుగు) ప్రజ. తలిసిన వారికి ఇడి ప్రశ్న కాదు, ఇలా ఐన ఆ మహనీయులని మరో సారి స్మరించుకుందాం. మరచి పోకుండా మన ఉనికిని ఇంతైనా కాపాడుకుందాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి