అవున్నిజఁవే ! బ్రహ్మ దేవుడ్ని తిట్ట కూడదు. ! తప్పు. కళ్ళు పోతాయ్ ! కానీ, అతడు చేసే తింగరి పనులకు ఒక్కోసారి శతక కవి థూర్జటి style లో తిట్టాలనిపిస్తుంది. కదూ !
లేక పోతే ఏఁవిటి చెప్పండి ?
అష్టైశ్వర్యాలూ ప్రసాదిస్తాడు. అజీర్తి రోగం పట్టు కునేలా ఆశీర్వదిస్తాడు.
సకల విద్యాపారంగతునివి కమ్మని చెబుతాడు. అష్ట దరిద్రాలూ అనుభవించు పొమ్మంటాడు.
అందమైన మనోహర రూపం ప్రసాదిస్తాడు. అలవి మాలిన అహంకారాన్నీ, అఙ్ఞానాన్నీ అంట గడతాడు.
ఏ టీ ఎమ్ సెంటర్లో ఏ.సీ ఉండి, అది పని చేస్తూ, ఏ టీ ఎమ్ మాత్రం పని చేయ నట్టుగానూ ...
రైల్ లో బెర్తు కన్ ఫరమ్ అయిన కులాసాలో మనం ఉండగా రైలే రద్దయే పరిస్థితి కలిగినట్టుగానూ ...
నువ్వు పో గొట్టు కొన్న నీ పర్సులో వేలాది రూపాయలు ఉండడమూ, నీకు దొరికిన ఎవడో తల మాసిన వాడి పర్సులో చిల్లర నాణేలు మాత్రమే ఉండడమూ ...
ఎందుకు లెండి . చెబితే చేంతాడంత. వాడు చేసే తిక్క పనులు అన్నీ ఇన్నీ కావు.
ఈ శ్లోకం చూడండి :
యాత: క్ష్మామఖిలాం ప్రదాయ హరయే పాతాల మూలం బలి:
సక్తుప్రస్థవిసర్జనాత్ స చ ముని: స్వర్గం సమారోపిత:
ఆబాల్యా దసతీ సురపురీం కుంతీ సమారోహయత్
హా ! సీతా పతి దేవతా2గమదధో ధర్మస్య సూక్ష్మా గతి:
దీని అర్ధం ఏమిటంటే,
వామనుడు మూడడుగుల నేల దానం ఇమ్మని బలిని కోరాడు. ముందూ వెనుకా చూసు కోకుండా సరే ఇస్తున్నా పట్టు అన్నాడు మహా దాత బలి. అప్పటికీ రాక్షస గురువు శుక్రాచార్యడు వద్దు సుమీ, దుంప నాశనమై పోతావ్ ! అని హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ బలి విన లేదు ! అంత గొప్ప దానాన్ని చేసిన బలికి ఏం జరిగింది ?
పాతాళానికి పోయేడు !
సక్తుప్రస్థుడు అనే ఒక ముని కొద్దిపాటి పేల పిండిని ఎవడికో పెట్టాడు. వానికి స్వర్గం లభించింది !
వివాహం కాకుండానే తల్లి అయిన కుంతికి స్వర్గం లభించింది.
పరమ పతివ్రత అయిన సీతా దేవి మాత్రం భూగర్భంలో పడిపోయింది. ఆహా ! ధర్మం నడక ఎంత సూక్ష్మమైనదో కదా !
ఇదీ శ్లోక భావం.
అలారాసి పెట్టి ఉంది మరి అనుకుంటాం. కానీ అలా రాసిన వాడిని థూర్జటి కవిలాగా తిట్ట కూడ దంటూనే తిట్టే సాహసం చెయ్యం !
ఇంతకీ థూర్జటి కవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో వేథను ఎలా తిట్టాడో కాస్త చూదామా ?
వేథం దిట్టగ రాదు గాని భువిలో విద్వాంసులం జేయనే
లా ? థీ చాతురిం జేసినన్ యటుల రా బాటంచు నేఁ బోక క్షు
ద్భా దాదుల్ కలిగింప నేల ? యది కృత్యంబైన దుర్మార్గులం
యీ ధాత్రీశుల చేయ నేటి కకటా ! శ్రీకాళ హస్తీశ్వరా !
దీని భావం:
ఓ శ్రీకాళహస్తీశ్వరా ! బ్రహ్మ దేవుడిని తిట్ట కూడదు. కానీ, లేక పోతే, మమ్మల్ని పండితులు గానూ, కవులుగానూ పుట్టించడం ఎందుకు ? పోనీ, తన బుద్ధి నేర్పరితనం వల్ల అలా చేసేడే అను కుందాం. ఆ పాండిత్యం వలన కలిగిన ఙ్ఞానంతో మిమ్ములను సేవించు కుంటూ, ఆ మార్గంలో నడవనీయ కుండా మాకు ఆకలి దప్పులు ఎందుకు పెట్టాడయ్యా
మాకుండే ఆ బాధలను ఆసరాగా చేసుకొని, తమ చుట్టూ తిరిగేలా చేసుకొంటున్న ఈ దుర్మార్టులయిన రాజులను ఎందుకు పుట్టించాడయ్యా !
ఈ ఆకలి బాధలూ, సంసార జంఝాటాలూ లేకుండా ఉంటే, ఓ దేవా ! నీవు మాకు ప్రసాదించిన పాండిత్యంతో , దాని వలన కలిగిన మంచి ఙ్ఞానంతో సదా మిమ్ములనే సేవించు కుంటూ ఉండే వారము కదా !
(తిక్కలోడివి కాక పోతే, మాకు మంచి పాండిత్యం ఇవ్వడ మెందుకు ? దానిని మీ కోసం వినియోగించ కుండా రాజులను ఆశ్రయిస్తూ దేబిరించడ మెందుకూ ? అలా దేబిరించడానికి కారణభూత మయిన ఆకలిదప్నులను మాకు ఇవ్వడ మెందుకూ ? వాటిని ఆసరాగా చేసు కొని మా బలహీనతలనూ, దీనత్వాన్నీ ఆసరాగా చేసుకొని మమ్ములను తమ చుట్టూ తిప్పుకొని రాక్షసానందం పొందే ఈ దుర్మార్గులయిన రాజులను పుట్టించడ
మెందుకూ ! )
లలాట లేఖో న పున: ప్రయాతి.
తల రాత మార్చ లేం కదా.
6 కామెంట్లు:
మన కష్టాలకి దేవుణ్ణి తిట్టుకొడం సులభం,కనబడడు కాబట్టి.కనిపించే వాళ్ళని తిడితే వూరుకోరుగదా!ఐనా నాకొక సందేహం.క్రిష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకడుగా సన్మానాలు, సంపదలూ అనుభవించిన వాడూ ,వారజనతా మధురాధర సుధాధారల గ్రోలిన వాడూ ఐన ధూర్జటి కవికి రాజుల మీద అంత కోపం ఎందుకో మరి.
భలే..ధూర్జటినడ్డం పెట్టుకొని బాగా తిట్టేసారే...వేథని.
ధూర్జటి కేం...ఆయన అన్నీ అనుభవించేసాడు. కవిత్వ కళనీ, దాంతో రాజాశ్రయాన్నీ, దాంతో పాటు వచ్చే మన్ననలూ, భోగాలు. ఇక చాలు బాబోయన్నటుల....అనుభవించాక అప్పుడూ తిట్టాడు. మరి మనం అప్పుడే తిట్టీడం ఎలాగ. ఇంకా మనకో ఇల్లా, ఏసీకారా, నెలకో లక్షొచ్చే ఉజ్జోగమా. ఇంట్లోనే నోరు మెదపడానికి సొతంత్రం లేనోళ్ళం. ఇంక రాజునో, వాడిని పుట్టించిన బ్రహ్మనో తిట్టే భ్రమలు మనకెక్కడ
వేధను తిట్టగ రాదని
మేధసు తో దూర్జటయ్య భేషుగ తిట్టెన్
పద్యానికి తగ్గుట్టుగా మీరు చేసిన
వ్యాఖ్యానం చాలా బాగుంది
చాలా మంచి మంచి పద్యాలను చక్కటి మీ "కామెంటరీ" తోపరిచయం చేయడం అభిలషణీయం. ఇలాంటివెన్నైనా రాస్తూనే ఉండండి.మేము చదువుతూనే ఉంటాము.
చాలా మంచి మంచి పద్యాలను చక్కటి మీ "కామెంటరీ" తోపరిచయం చేయడం అభిలషణీయం. ఇలాంటివెన్నైనా రాస్తూనే ఉండండి.మేము చదువుతూనే ఉంటాము.
చాలా మంచి మంచి పద్యాలను చక్కటి మీ "కామెంటరీ" తోపరిచయం చేయడం అభిలషణీయం. ఇలాంటివెన్నైనా రాస్తూనే ఉండండి.మేము చదువుతూనే ఉంటాము.
కామెంట్‌ను పోస్ట్ చేయండి