1, ఏప్రిల్ 2012, ఆదివారం

అంతా రామ మయం !



కథా మంజరి అభిమానులకు శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు !

శ్రీరాముని దయ చేతను

నారూఢిగ సకల జనులు నౌరా యనఁగా

ధారాళమైన నీతులు

నోరూరఁగ చవులు పుట్ట నుడివెద సుమతీ.

బద్దె భూపాలుని సుమతీ శతకంలోని ఈ పద్యం తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైనది కదూ ?

శ్రీరామ చంద్రుని దయా విశేషం చేత, జనులెల్లరు ఆశ్చర్య చకితులయ్యే విధంగా ప్రసిద్ధమైన నీతులను ధారాళంగా వినేవారికి నోరూరే విధంగా చెబుతాను. మధేర పదార్ధాలను తింటే నోట్లో నీళ్ళు ఎలా ఊరుతాయో, ఈ కమ్మని నీతులు విన్న వారి నోట నీళ్ళు ఊరవలసినదే !

కంచెర్ల గోపన్న రచించిన దాశరధీ శతకం నుండి ఇవాళ ఒకటి రెండు చక్కని పద్యాలనయినా తలచు కోవడం మనకి విధాయకం.

శ్రీ రఘురామ చారు తులసీదళధామ, శమక్షమాది శృం

గార గుణాభిరామ; త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు

ర్వార కబంధ రాక్షస విరామ ; జగజ్జన కల్మషార్ణవో

త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణా పయోనిథీ !

మంగళకరమయిన ఇక్ష్వాకు వంశంలో జన్మించిమనోహర మయిన తులసీమాలను దండగా ధరించి, శాంతం, క్షమ, మొదలయిన గొప్ప గుణాలు కలిగి,మూడు లోకాలలో కీర్తింప బడిన వాడవు ! గొప్ప పరాక్రమం అనే అభరణాలతో విలసిల్లి, అపజయం లేని కబంధుడు అనే రాక్షసుడిని చంపి, లోకాలను పాపాలు అనే సముద్రం నుండి ద్ధరించి, దయా సముద్రడవై భద్రాచలంలో వేంచేసిన దశరథ మహారాజ కుమారా ! శ్రీరామా ! జయము.

రాకలుషంబు లెల్ల బయలం బడ ద్రోచిన మాకవాటమై

దీకొని ప్రోచు నిక్కమని థీయుతు లెన్న దదీయ వర్ణముల్

గైకొని భక్తిచే నుడుపఁగానరు గాక విపత్సరంపరల్

దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిథీ !

రామఅనే దివ్యమైన పేరులో రాఅనే అక్షరం పలకడం వల్ల పాపాలన్నీ పోతాయి ! అనే అక్షరం పలకడం వల్ల నోటి పెదవులు మూసుకొని కవాటముల వలె కాపాడుతుంది. పండితుల వలన ఈ విషయం తెలియని మూర్ఖ జనం ఆ దివ్యాక్షరాలను కేవలం పలకడం చేతనే పునీతులౌతున్నారు. ఏ కష్టాలూ వారిని దరి చేరడం లేదు.

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్

ఏకైక మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనమ్.

రామాయణంలోని ఒక్కొక్క అక్షరాన్నీ ఉచ్చరించినా చాలు, మహాపాతకాలన్నీ నశిస్తాయి !

కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం

ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్.

శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం

ఆజానుబాహు మరవింద దళాకతాక్షం

రామం నిశాచరవినాశకరం నమామి.

శ్రీరామ. శ్రీరామ. శ్రీరామ.

3 కామెంట్‌లు:

భారతి చెప్పారు...

రామేతి రామచంద్రేతి రామభద్రేతి వా మనుమ్ /
యావజ్జీవం జపన్ మర్త్యో జీవన్ముక్తో న సంశయః // ( ఉమా సంహిత )
శ్రీరామనవమి శుభాకాంక్షలండి.

durgeswara చెప్పారు...

మీపై సదా రామకృపావర్షం కురియాలని కోరుకుంటూన్నాను జైశ్రీరాం

durgeswara చెప్పారు...

మీపై సదా రామకృపావర్షం కురియాలని కోరుకుంటున్నాను జైశ్రీరాం

కామెంట్‌ను పోస్ట్ చేయండి