ఙ్ఞాపకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఙ్ఞాపకం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, ఏప్రిల్ 2014, మంగళవారం

మా తెల్లావు కథ ...... కథా మంజరి 400 వ టపా ...ఇది కథా మంజరి 400వ టపా.

ముందుగా , ఈ కథా మంజరి బ్లాగును డిజైన్ చేసి. ఓపికగా చాలా సూచనలు చేసి, సాంకేతికాంశాలను తెలియజేసిన జ్యోతి వలభోజు గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను.

అలాగే, నాకు కంప్యూటరు ఉపయోగంలోని మరి కొంత సాంకేతిక పరిఙ్ఞానాన్ని అందించిన మా సుధారాణి కి  కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

ఇప్పుడీ కథా మంజరి 400వ టపాగా మా తెల్లావు కథ రాస్తున్నందుకు

నాకు చాలా సంతోషంగా ఉంది... అదే సమయంలో ఎంతో విచారంగానూ ఉంది ...

కథా మంజరి మీద ఒట్టేసి చెబుతున్నాను. అంతా నిజమే చెబుతాను. అబద్ధం చెప్పను.

అప్పటి శ్రీకాకుళం జిల్లా, ఇప్పటి విజయ నగరం జిల్లా లో ఉన్న పార్వతీపురం మా ఊరు. పార్వతీపురం కుట్ర కేసుతో మా ఊరి పేరు దేశమంతా తెలిసిపోయింది.

ఇరుకిరుకు సందులూ, చెత్తా చెదరాం, రోడ్ల మీద పొర్లే మురికి కాలువలూ, ఏలిన వారి దయ వల్ల , ఇవాళకీ దాదాపు మా ఊరు అలాగే ఉంది.

ఊర్లో మావీధి పేరు కంచరి వీధి. కంచర్లు ఎక్కువ కుటుంబాలు ఉండడంతో ఆ పేరొచ్చింది.. ఇత్తడి బిందెలూ, కంచాలూ, గిన్నెలూ, గ్లాసులూ మొదలయినవి తయారు చేస్తూ ఉంటారు కంచర్లు. ఇప్పటికీ దేవుడి సింహాసనాల తయారీకి మా పార్వతీపురం కంచర్లే ప్రసిద్ధి. ఎక్క డెక్కడి నుండో జనాలు వచ్చి ఇక్కడ దేవుడి సింహాసనాలు ఆర్డరు మీద చేయించుకుని పట్టు కెళుతూ ఉంటారు.

కంచరి వీధిలో మాది పెద్ద లోగిలి. తాత గారు జోగయ్య పంతులు. మా వీధిలో మా ఇంటికి చాలా పేరుంది. నవ్య సంపాదకులు జగన్నాథ శర్మ గారు అగ్రహారం కథల్లో రాసిన‘‘ జోగారావు గారి మేడ ’’ మా లోగిలి గురించే.

వీధికి ఈ కొస నుండి ఆ చివర కూ కూరాకుల మడుల వరకూ వ్యాపించిన ఇల్లు మాది.

ఆ చివర ఉండేది. పశువు శాల. బాల్యంలోచాలా రోజులు , ముఖ్యంగా వేసవి శలవులలో నేను అక్కడే గడిపే వాడిని. శాల అటక మీద నెలా రెండు నెలలకి పరిపడా ఎండుగడ్డి ఉండేది. ఆ వాసన నాకిష్టంగా ఉండేది. ఊర్లోకి టీకాలు వేసే వాళ్ళొచ్చి నప్పుడు భయపడి దాక్కోడానికీ, ఇంట్లో అలిగి నప్పుడు నిరసన తెలియ జేయడానికీ అదే నాకు అనువైన చోటు. సురక్షిత ప్రదేశం !

మా పశువుల శాలలో మా తెల్లావు రావడానికి ముందు ఒకటి రెండు గేదెలు ఉండేవని అంటారు. నాకు తెలియదు. నా చిన్నప్పుడు నేను శాలలో చూసినది మా తెల్లావునీ, దాని దూడనీ ... తెల్లావు పెయ్యి మాత్రం ముదురు గోధుమ రంగులో ఉండేది.

‘‘ నువ్వేంటే, మీ అమ్మలాగా తెల్లగా లేవూ ? ’’ అనడిగే వాడిని దాని చెవిలో. ఓ సారి మా చిన్నాన్న దాని చెవిలో నేనిలా అనడం చూసి, తెగ నవ్వుకుని ఇంట్లో అందరికీ చెప్పి నా పరువు తీసాడు.

తెల్లావు అంటే, తెల్లావే ! ఎక్కడా ఒంటి మీద ఒక్క మచ్చ కనిపించేది కాదు.‘‘ మచ్చ లేని మంచావు మా తెల్లావు ! ’’ అంటూ నా చిన్నప్పుడు గర్వంగా కవిత్వం అల్లే వాడిని కూడా.

మా తెల్లావు ఎంత మంచి దంటే, ఏనాడూ ఏ ఒక్కరి మీది కొమ్ములు ఎగరేసి ఎరుగదు.

ఉదయాన్నే మేతకి వెళ్ళి, సాయంత్రానికి ఇల్లు చేరేది. వీధి గుమ్మం దగ్గర రెండు కాళ్ళూ వీధి గుమ్మం మొదటి మెట్టు మీద ఆన్చి నిలబడి ‘‘ నేనొచ్చా !’’ అన్నట్టుగా ‘‘ అంబా ’’ అని అరచేది. అప్పుడు దాని నల్లని కాటుక కళ్ళు చూడడం నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఆ వెంటనే

‘‘ మా లచ్చిమి వొచ్చినట్టుందర్రా ... పెరటి సందు తులుపు తెరవండి ..’’ అని మా నాయనమ్మ అచ్చమ్మ గారు ,, నాయి అనే వాళ్ళం, ఆవిడ కేక ఏ వంటింట్లోంచో వినబడేది. ఆసమయంలో మా పిల్లల్లో ఎవరుంటే వాళ్ళం వీధి గుమ్మం దగ్గరకి పరిగెట్టే వాళ్ళం. వీధి మొదటి మెట్టు మీద ముంగాళ్ళతో నిలుచున్న మా తెల్లావు గంగడోలుని ప్రేమగా నిమిరి,

‘‘ పద, పద ... పెరట్టోకి రా !’’ అని మూపు మీద మెల్లగా చరిచే వాళ్ళం. వెంటనే తెల్లావు మెట్టు దిగి, ఇంటి ప్రక్క నున్న పెరటి సందు వేపు తలూపుతూ వెళ్ళేది. మేం పరుగు పరుగున పెరట్లోకి వెళ్ళి గోర్జీ తలుపు తీసి ఉంచేవాళ్ళం. మా ఇంటికీ, మా పక్కింటి గుమ్మా వారింటికీ మధ్య ఉండే గోర్జీ లోంచి అది వేగంగా వచ్చేది.వస్తూనే ఆత్రంగా అప్పటికే సిద్ధం చేసి ఉంచిన కుడితి గోళెంలో మూతి పెట్టి కుడితి తాగేది. పెయ్యి దాని పొదుగు కుమ్ముతూ పాలు తాగేది. ఆ దృశ్యం నా కంటికి అపురూపంగా తోచేది.

మా ఇంట్లో పెద్ద వాళ్ళు రోజూ ఉదయాన్నే నిద్ర లేవగానే కళ్ళు నులుము కుంటూనే పెరట్లో ఆవుల శాల దగ్గరకి వెళ్ళి మా తెల్లావుని నిమురుతూ దానికి దండం పెట్టు కుంటూ ఉండే వారు. నాకూ అదే అలవాటు వొచ్చింది. ఇక ప్రతి శుక్ర వారం, మరింకా పండుగలూ పబ్బాలూ వొచ్చి నప్పుడు మా నాయినమ్మ తెల్లావు కొమ్ములకీ, మెడకీ పసుపు రాసి, కొమ్ముల మధ్య మందార పువ్వులు పెట్టేది.

తెల్లావు ఎన్ని పాలిచ్చేదో నాకచయితే తెలీదు ... కానీ మా ఇంటి వెనుక చావిడీలో పాల గది అని ప్రత్యేకంగా వో గది ఉండేది. ఆ గదిలో ఆగ్నేయ మూల మట్టితో నలుచదరంగా చేసిన పెద్ద పొయ్యి ఉండేది. దాని మీద రోజంతా పెద్ద పాత్రలో పాలు సలసలా కాగుతూనే ఉండేవి. ఆ పాల వాసన కమ్మగా ఇల్లంతా వ్యాపించి గమ్మత్తుగా ఉండేది. సాల గది ముందు పెద్ద వసారా ఉంది. రోజు వారీ వంటలు అక్కడ చేయక పోయినా, ప్రత్యేకంగా పిండి వంటలు చేసేటప్పుడు మాత్రం ఆ వసారాలోనే చేసే వారు. పెళ్ళి వంటల వసారా అనే వాళ్ళం దానిని.

మా తెల్లావు ఙ్ఞాపకాలలో ఇవి కొన్ని తీపి గుర్తులయితే ...

ఇక మా తెల్లావు మిగిల్చి పోయిన విషాదం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు ..

అరవై ప్రాంతాలవి. అక్కయ్య పెళ్ళి. వీధి లోనూ, వాకిలి లోనూ పదింళ్ళు వేసారు. మధ్య వాకిలిలో పెద్ద రంగు రంగుల చాందినీలు కట్టారు. ఇల్లంతా చుట్టాలో నిండి పోయింది. అప్పటికి నాకు పదేళ్ళ వయసు. సందడంతా మా పిల్లలదే. పెళ్ళికి వారం ముందుగానే చుట్టాలంతా వచ్చేరు. వంటల వసారాలో మా సూరీడత్త పర్యవేక్షనలో అరిసెల వంటకం గుమ గుమలాడి పోతోంది. నిజం చెప్పాలంటే, అక్కయ్య పెళ్ళిలో నాకు ఇప్పటికీ బాగా గుర్తున్న అంశాలు రెండే.

ఒకటి, - పెళ్ళిలో పెళ్ళి వారికి వడ్డనలో వేసేందుకుగాను మా తోట నుండి వచ్చిన మామిడి కాయలని మా ఇంటి ఎదురుగా ఉండే స్థలంలో

( అదీ మాదే ) ఉండే కొట్టు గదిలో మగ్గ పెట్టడం. పెళ్ళి రోజు నాటికి మామిడి పళ్ళు బాగా మగ్గి , వీధి వీధంతా మామిడి పళ్ళ వాసనతో నిండి పోయేది. ఆ కొట్టు గదిలో పెళ్ళి కోసం వందలాది కాయలని మగ్గ పెట్టేరేమో, మా పెద్దలు ఎవరయినా ఆ గది తలుపులు తెరిచి నప్పుడల్లా, మా పిల్లలం గబాలున లోపలికి చొరబడి తెచ్చుకో గలిగినన్ని పళ్ళని దోసిలి నిండా తెచ్చుకుని పీల్చుకు తినే వాళ్ళం. పెద్దల అభ్యంతరం ఉండేది కాదు.

ఇక, రెండవ ఙ్ఞాపకం ... మా తెల్లావు గురించి. ...

పెళ్ళికి రెణ్ణెళ్ళ ముందే, .మా తెల్లావుని, చూలుకి వచ్చిందని మా రైతులతో పొలానికి పంపించి వేసారు. చూడి పశువులకి మంచి మేత పెట్టి రైతులు అవి ఈనే వరకూ అక్కడే ఉంచి , ఈనేక దూడతోపాటూ తిరిగి మా ఇంటికి తెచ్చి అప్పగించే వారు.

మా అక్క పెళ్ళికి రెండు నెలలకి ముందే రైతులు తెల్లావుని పొలానికి పెయ్యితో పాటూ తోలుకు పోయారు.

మా పొలాలు మా ఇంటికి దాదాపు పది పన్నెండు మైళ్ళ దూరంలో ఉండేవి. అలా వెళ్ళిన ఆవు తిరిగి ఈనేక మాత్రమే ఇంటికి వచ్చేది.

మధ్యలో రావడం అంటూ జరగదు.

ముందే చెప్పాను, అంతా నిజమే రాస్తాను, అబద్ధం రాయనని ...

అక్కయ్య పెళ్ళి రోజున మా ఇంటి వీధి గుమ్మం నుండి తెల్లావు అంబారావం వినబడింది. ఇంట్లో అందరం ఇశ్చర్య పోయేం. పెళ్ళి పనుల కోసం రైతులు రెండు రోజులు ముందే వచ్చేరు.

ఇంత దూరం వెతుక్కుంటూ తెల్లావు ఒక్కటీ ఎలా వచ్చిందో తెలియదు !

మా పెద్దల ఆనందానికి అవధి లేకుండా పోయింది ...

‘‘ సందులూ గొందులూ వెతుక్కుంటూ ఇంత దూరం ఎలా వచ్చిందర్రా ఒక్కర్తీ !’’ అంటూ అంతా ఆశచ్చర్య పోవడమే !

‘‘ పిలవక పోయినా మా మనవరాలి పెళ్ళి చూడాలని వచ్చిందర్రా తల్లి !’’ అంటూ మా నాయనమ్మ తెగ ముచ్చటపడిపోయింది.

వెంటనే తెల్లావుని గోర్జీ లోంచి ఇంటి వెనుక శాలోకి తీసికెళ్ళి, పసుపూ కుంకుమలతో, పూలతో పూజలు చేసారు.

ఇక ఆ రోజంతా పెళ్ళింట్లో తెల్లావు రాక గురించిన కబుర్లే ...

ఆ ఆనందం మాకు ఎన్నో రోజులు మిగల్లేదు ..

అక్కయ్య పెళ్ళయిన రెండో రోజో, మూడో రోజో ... ఏం జరిగిందో కానీ, మా తెల్లావు ఓ ఉదయం వెళ్ళి చూసేసరికి కుప్పగా కూలి పడిపోయి ఉంది.

పెద్దలు గుండె నిబ్బరం చేసుకుని కొంత గుంభనగా ఉన్నా, మా పిల్లలంతా గోలు గోలున ఏడిచాం. మమ్మల్ని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు ...

చివరకి మా తాతగారు మమ్మల్ని ఊరుకోమని చెప్పి, ‘‘ మనవరాలి పెళ్ళి చూదామనే వొచ్చింది. చూసింది. వెళ్ళి పోయింది ...పెళ్ళింట ఏడుపు లొద్దు ...వెళ్ళి పోయినా మహాలక్ష్మి దీవెనలు మనకెప్పుడూ ఉంటాయి ...’’ అంటూ మందలించేరు. సరిగ్గా ఇవే కాక పోయినా ఇలాంటివే ఏవో ఓదార్పు మాటలు చెప్పినట్టు నాకు గుర్తు.


అంతే ....

తెల్లావు పోయిన తరువాత మా ఇంట్లో తరతరాలుగా వస్తున్న పశుపోషణ ముగిసి పోయింది.

ఆ తరువాత మరెప్పుడూ ఇంట్లో ఆవుల్ని మేం చూడ లేదు ...

పశువుల శాల కూడా చాన్నాళ్ళు దిక్కు లేని అనాథలా ఉండి, క్రమేపీ ఒక్కో రాటా విరిగి పడగా , చివరకి ఎప్పుడో కూలి పోయింది.

ఇప్పుడా ల్లూ లేదు, ఎప్పుడో అమ్మేసాం ...

తెల్లావు ఙ్ఞాపకం మాత్రం నన్ను ఆబాల్యం వెంటాడుతూనే ఉంది ...

విరిగి పడిన మంచు కొండ చరియలా మా తెల్లావు గుర్తులు ఎప్పటికీ చెరిగిపోయేవి కావు ...


గోవు మా లచ్చిమికి కోటి దండాలు ....