Day 06 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Day 06 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, మార్చి 2016, సోమవారం

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ... Day 06 ( 03- 03-2016)

మా  8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ...  Day  06  ( 03- 03-2016)
నిన్నటి రోజున మధురై మీనాక్షీ అమ్మ వారిని కనులారా దర్శించు కోగలిగిన తృప్తితో రాత్రి బాగా నిద్ర
పట్టింది. అయినా రోజూ లాగే వేకువనే 4.30 కి మెళకువ వచ్చింది. నింపాదిగా తయారై, 8 గంటలకి
మధురై లో టూరిజమ్ వారి హొటల్ లోనే బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి,లగేజీ బస్ డిక్కీలో పెట్టించాము. 8.30కి
బస్ బయలు దేరింది. ఈరోజు మా ప్రయాణం విహార పర్యాటక కేంద్ర మయిన కొడైకెనాల్ కి.
తమిళ నాడు రాష్ట్రంలో దాదాపు నడి బొడ్డు న  తూర్పు కనుమలలో  ఉన్న చక్కటి పద్యాటక కేంద్రం
కొడైకెనాల్. ఊటీ తర్వాత మంచి వేసవి విడిది. సముద్ర మట్టానికి 2133 అడుగుల ఎత్తులోఉంది.

11 గంటల ప్రాంతంలో కొడై కెనాల్ వస్తోందనగా  వొక అంద మయిన ప్రదేశంలో బస్ ఆగింది. అక్కడి సుందర
దృశ్యాలను కెమేరాలలో బంధించాము. అక్కడ కాసేపు గడిపి, బయలుదేరాం. మధ్యాహ్నం
 12 గంటలకి కొడైకెనాల్ లో టూరిజమ్ వారి హొటల్ కి చేరు కున్నాము. ఆ హిల్ స్టేషనులో టూరిజమ్
 వారి హొటల్ ఎత్తయిన గుట్ట మీద  ఉంది. దాదాపు అక్కడ అన్ని భవనాలూ అక్కడక్కడా గుట్టల మీదే
ఉండడం కనిపించింది. పగలు ఏమంత చలిగా లేదు కానీ రాత్రి చలి వణికించింది. మామూలుగా ఇచ్చే
 రగ్గులతో పాటు, మరో రెండు రగ్గులు అక్కడ వొక ఆల్మెరాలో ఉండడం చూసి, తీసి కప్పుకో వలసి వచ్చింది.
 గదుల్లో ఎక్కడా ఫేన్లు లేవు.  ఆ అవసరమే లేదు. సీజన్ బట్టి గదుల అద్దెలు మారుతూ ఉంటాయని
రిసెప్షన్ దగ్గర ఉండే బోర్డు వల్ల తెలుస్తోంది. వేసవి వి రోజుల్లో అద్దెలు ఎక్కువ.
వేసవిలో వచ్చే సందర్శకులూ ఎక్కువగానే ఉంటారు.
హొటల్ గదులకు చేరాక, 12.30కి లంచ్ టూరిజమ్ వారి హొటల్లో చేసాము. లంచ్, డిన్నర్
లతో పాటు మరు నాడు ఉదయం బ్రేక్  ఫాస్టు కూడా అక్కడే నని గైడ్ చెప్పాడు. లంచ్ అయ్యేక అక్కడ
చూడ వసిన ప్రదేశాలు చూడడానికి బయలు దేరాము.కొడై కెనాల్ లో ముఖ్యంగా లేక్ ( సరస్సు),
సూసెయిడ్ పాయింట్,  కోకర్స్ వాక్  (వాకింగ్ ట్రాక్ ).  సరస్సులో  పడవలలో విహారం ( సొంత డ్రైవింగులో !)
గుఱ్ఱపు స్వారీ, సైకిలింగ్ ముఖ్య ఆకర్షణలు.ఏదేనా షాపింగ్ చేసు కోవాలంటే కూడా
ఇక్కడ ప్రభుత్వం నిర్వహిస్తున్న దుకాణాలతో పాటు చాలా దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ ఏలకులు,
దాల్చిన చెక్క, గసగసాలు మొదలయిన సుగంధ ద్రవ్యాలు, తేనె, కాఫీ , టీ పొడులు మొదలయినవన్నీ
కాస్త చౌకగా దొరుకుతాయి. తమ నగరాల్లో ధరలకీ ఇక్కడి ధరలకీ బేరీజు వేసుకుని ఆడవాళ్ళు కావలసినవి
కొనుక్కుంటూ ఉంటారు, మా సహ యాత్రీకులలో ఆడ  వాళ్ళు ఇక్కడ షాపింగు చేసారు. పిల్లల ఆట
 వస్తువులు, రగ్గులు,టోపీలు, స్వెట్టర్లు వంటివి సరే సరి.
ముందుగా కోకర్స్ వాక్ వద్దకు చేరు కున్నాము. ఒకప్పుడు కోకర్ అనే దొర ఇక్కడ రోజూ వాకింగ్ చేసే
 వాడుట. అతని పేరున  కొండ అంచున సన్నగా పొడుగ్గా ఉండే కాలి బాట యిది. ఈ బాట మీద
నడుస్తూ చుట్టూ కనిపించే అందమయిన లోయలు, ప్రకృతి దృశ్యాలను తిలకించ వచ్చును.
తర్వాత సూసెయిడ్ పాయింట్ దగ్గరకి చేరు కున్నాము. ఇక్కడ అగాథంలో దూకి ఎందరో తరుచుగా
 ఆత్మ హత్యలు చేసుకునే వారుట.  దీనికి ఇనుప వలయంతో గేట్లు ర్పాటు చేసి
ఏ ప్రమాదమూ జరుగ కుండా లోయ అందాలను చూడగలిగేలా ఏర్పాటు చేసారు. ఇక్కడి నుండి
 కనిపించే లోయనే లోగడ గ్రీన్ వ్యాలీ అనే వారుట. మంచు పొగలతో, ఎత్తయిన చెట్లతో,లోతయిన ఈ
వ్యాలీ చాలా అందంగా ఉంది. ఈ ప్రాంతంలో చాలా సినిమా షూటింగులు జరుగుతూ ఉంటాయిట.
తర్వాత కొడై సరస్సు దగ్గరకి వెళ్ళాము. 1863లో 60 ఎకరాల విస్తీర్ణంలో మానవ నిర్మిత మయిన అంద
మయిన సరస్సు యిది. దీనిలో సరదా ఉన్న వారు బోటు షికారు చేయ వచ్చును. మేము చేయ లేదు.
ఫొటోలు తీసుకున్నాము. ఈ సరస్సు వొక వేపు అర చెయ్యి లాగ వెడల్పుగా ఉండి మరో వేపు చేతి వేళ్ళ
 లాగా పాయలుగా విడి పోయి ఉంటుంది. ఈ సరస్సును రోడ్డు మీద నుండి చూస్తూ చుట్టి రావడానికి
ఇక్కడ సైకిళ్ళు అద్దెకిస్తారు. చిన్నవీ, పెద్దవీ కూడా సైకిళ్ళు అద్దెలకి దొరుకుతాయి. సైకిళ్ళు అద్దెకిచ్చే
షాపులు ఇక్కడ చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ గుఱ్ఱపు స్వారీ వొక ప్రత్యేక ఆకర్షణ. పిల్లలు,
యువతీ యువకులు డబ్బులిచ్చి గుఱ్ఱాల మీద కాసేపు స్వారీ చేసి ముచ్చట పడుతూ ఉంటారు.
స్వారీ గుఱ్ఱాలను అనుసరిస్తూ రౌతులు కైడా సైకిళ్ళ మీద వెళ్తూ ఉంటారు. కనుక పిల్లలు నిర్భయంగా
 గుఱ్ఱపు  స్వారీ చేయ వచ్చును.
 ఇవన్నీ చూస్తూ చాలా సేపు గడిపి, టూరిజమ్ వారి హొటల్ కి చేరు కున్నాము. రాత్రి 8గం.లకి డిన్నరు
చేసాక, గదులలో చేరాం. ఇక్కడ గదులలో 24 గంటలూ వేడి నీరు దొరుకుతోంది. మామూలు నీళ్ళ
 బకెట్ లో  చెయ్యి పెడితే జివ్వుమంటోంది! అప్పటికి చలి ఎక్కువయింది. రగ్గులు తగినన్ని ఉండడంతో
కప్పుకుని నిద్ర పోయేం. రేపు తిరుచ్చికి ప్రయాణంతో మొదలయ్యే 7వ రోజు యాత్రా విశేషాలు
యిప్పటికి సశేషమ్.