తమిళ నాడు యాత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తమిళ నాడు యాత్ర లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, మార్చి 2016, సోమవారం

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ......Day 08 ( 5-3-2016)

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ......Day 08  ( 5-3-2016)

( చివరి భాగం )
మా యాత్రలో యిది చివరి రోజు. పేకేజీలో ఇవాళ ఏ దేవాలయ దర్శనాలు లేవు. కానీ మేమంతా
నిన్న గైడు చెప్పి నట్టుగా ఉదయం ఆరు గంటలకే ప్రయాణానికి తయారయి పోయేం కనుక, దారిలో
ఒక అమ్మ వారి ఆలయాన్ని దర్శించు కోగలిగేము. తిరుచ్చి నుండి చెన్నై 350 కి.మీల దూరం.
వీలయి నంత వరకూ మధ్యాహ్నం 3 లేదా 4 గంటల మధ్య చేరుకో గలిగితే మంచిదని గైడ్ చెప్పాడు.
చెన్నైలో ట్రాఫిక్ జామ్ లు ఎక్కువగా ఉంటాయనీ, ఒక్కో సారి చెన్నై చేరే సరికి ఎనిమిదీ తొమ్మిదీ కూడా
దాటి పోతూ ఉంటుందనీ గైడ్ చెప్పాడు.
ఉదయాన్నే 6 గంటలకల్లా తయారయి పోయి, లగేజీ బస్ డిక్కీలో పెట్టించుకుని అందరం
బస్ ఎక్కాము. దారిలో 9 గంటలకి ఉరుమండల్ అనే చోట టూరిజమ్ వారి హొటల్ దగ్గర బస్ ఆగింది.
అక్కడ బ్రేక్ ఫాస్ట్ కానిచ్చేము. మళ్ళీ ప్రయాణం మొదలయింది. 12 గంటలకి మెయిల్ ముత్తూర్ అనే
చోట ఆగేము. అక్కడ ఆది పరాశక్తి గుడి లో అమ్మ వారిని దర్శించు కున్నాము. అదొక
గ్రామీణ దేవత కోవెల. గుడి చాలా పెద్దది. చాలా ఆధునికంగా నిర్మించేరు. అక్కడ దేవీ
భక్తులు ఎర్రని దుస్తులలో ఎర్రని పూలు పెట్టుని స్తోత్రాలు చేస్తూ అమ్మ వారిని కొలుస్తూ ఉంటారు.
దక్షిణలు హుండీలలో మాత్రమే వేయమని చెప్పారు.  ఎక్కడా  డబ్బుల కోసం చెయ్యి చాచింది లేదు.
ఆ ప్రాంతీయులు అమ్మ వారు చాలా శక్తిసంపన్నురాలిగా భావించి సేవిస్తారు . అమ్మ వారి విగ్రహం
చాలా బాగుంది. మొత్తానికి మా యాత్రలో చివరి రోజయిన ఈ రోజు కూడా పేకేజీలో లేని
వొకఆలయాన్ని దర్శించు కున్నందుకు అందరం సంతోషిస్తూ బస్ ఎక్కాము.
మా యాత్రలో ఏ ఆలస్యాలూ లేకుండా  చక్కగా జరిపించినందుకు మాగైడ్ కి అభినందనలు చెప్పాము.
తలో వందా వేసుకుని డ్రైవరుకీ, అతని సహాయకునికీ మా సంతోషం కొద్దీ యిచ్చి అభినందించేము.
బస్ లో ఆ చిరు అభినందన సభని అందరూ ఫొటోలు తీసుకున్నాం.
బస్ మళ్ళీ బయలు దేరింది. సరిగ్గా 3.30 అవుతూ ఉండగా చెన్నైలో తమిళ నాడు టూరిజమ్ వారి
ఆఫీసు దగ్గర ఆగింది. బయలు దేరిన చోటుకి సురక్షితంగా వచ్చి చేరాము.
లగేజీలు తీసుకుని వారి ఆఫీసులో కుర్చీల మీద కూర్చున్నాము. మా యాత్రీకులలో బొంబాయి
నుండి వచ్చిన దంపతులూ, వారి అమ్మాయీ తప్ప అందరం సీనియర్ సిటిజన్ లమే.
ఆఫీసులో మా టిక్కెట్ లు, ఫొటో ఐడెంటిటీ కార్డుల జెరాక్స్ ప్రతులూ ఇచ్చేక ఐదు నిమిషాల లోపే
కంప్యూటర్లో ఆ వివరాలు నమోదు చేసుకుని మాకు రిపండు కాగితాలు ఇచ్చేరు. వాటి మీద సంతకాలు
చేసి కేష్ కౌంటర్లో ఇస్తే మాకు రావలసిన రిఫండు యిచ్చేసారు. మా ఇద్దరికీ మొత్తం 28,100 రూ.లు
టిక్కెట్లకి అయితే, సీనియర్ సిటిజన్ రాయితీగా తిరిగి యిద్దరికీ కలిపి 5400 రూ.లు వచ్చేయి.
తర్వాత ఒకరి కొకరం బై బైలు చెప్పుకున్నాం. వెళ్ళ వలసిన వాళ్ళు ఆటోలు చేయించుకుని వెళ్ళి
పోయేరు.   నేనూ, మా ఆవిడా, మురళీ కృష్ణ గారి ఫేమిలీ ముగ్గురూ,బొంబాయి వెళ్ళ వలసిన కుటుంబం
 ముగ్గురూ మొత్తం 8 మందిమి మాత్రం మిగిలేం. మా మూడు  కుటుంబాల వారం ఎక్క వలసిన రైళ్ళూ
రాత్రి పదీ పన్నెండు గంటల మధ్య కావడంతో తొందర లేదు.
టూరిజమ్ వారి ఆఫీసులోనే రిఫ్రెష్ అయి, మెరీనా బీచ్ కీ, ఎగ్జిబిషన్ కీ వెళ్ళి వద్దామని నిర్ణయించు
కున్నాము. టూరిజమ్ వారి ఆఫీసు రాత్రంతా పని చేస్తుందనీ కనుక లగేజీ అక్కడ ఉంచి ఎంత రాత్రయినా
వచ్చి తీసుకో వచ్చనీ అక్కడి అధికారులు చెప్పేరు. మరింకేం ! అనుకుని లగేజీ అంతా అక్కడ
ఉంచి, ఆటోలు మాట్లాడుకుని బయలు దేరాము.
ముందుగా మెరీనా బీచ్ దగ్గర జరుగుతున్న ఎగ్జిబిషన్ చూసాము, చాలా బాగుంది. ఎక్కడా
ప్రవేశ రుసుము అంటూ లేదు. అక్కడే కలయ తిరుగుతూ అన్ని స్టాల్సూ చూసి మళ్ళీ ఆటోలు
మాట్లాడుకుని మెరీనా బీచ్ కి వెళ్ళాము. బీచ్ లో చాలా సేపు గడిపి తిరిగి 8.30 అవుతూ ఉండగా
టూరిజమ్ వారి రఫీసుకి చేరు కున్నాము. మా లగేజీలు తీసుకుని అక్కడి కుర్చీలలోనే కబుర్లు
చెప్పుకుంటూ కూర్చున్నాము. ఈ లోగా నేను బయటకి వెళ్ళి పెరుగు పేకెట్ , అరటి పళ్ళూ తెచ్చాను.
 మా ఆవిడ  ఆ పెరుగు తను తెచ్చుకున్న అన్నంలో కలుపుకుని తిన్నాది. తన భోజనం అయినట్టే.
రాధ, విజయ లక్ష్మి గారలు మాత్రం ఏకాదశి ఉపవాసం కనుక, పళ్ళు తిని ఉండి పోయేరు.
నేనూ మురళీ కృష్ణ గారూ బయటికి వెళ్ళి, దగ్గరలోనే ఆంధ్రా భోజన హొటల్ కనబడితే
అక్కడ భోజనాలు చేసి వచ్చేము. భోజనం బాగుంది. ఒక్కో భోజనం 65 రూపాయలు. 9 గంటలవుతూ
 ఉండగా, యిక మూడు కుటుంబాల వారమూ చెన్నై సెంట్రల్ కి ఆటోలు మాట్లాడుకుని బయలుదేరాము.
స్టేషను చేరాక, బొంబాయి నుండి వచ్చిన వాళ్ళు మా దగ్గర సెలవు తీసుకుని తమ రైలు వచ్చే
 ప్లాట్ ఫారమ్ దగ్గరకి వెళ్ళి పోయేరు. మేమూ మురళీ కృష్ణ గారి ఫేమిలీ  నాలుగో నంబరు  గేటులోంచి
లగేజీలు తీసుకుని వెళ్ళి అక్కడి కుర్చీలలోచతికిల పడ్డాం.
ఎదురుగా కనిపించే తెర మీద మా రైలు ఏ ప్లాట్ ఫారమ్ మీదకి వస్తుందో చూస్తూ కబుర్లు
చెప్పుకుంటూ గడిపేము. 9.30కి మా హౌరా మెయిల్ 8వ నంబరులోకి వస్తుందని డిస్ప్లే
వచ్చింది. మేం కూచున్న చోటుకి ఎదురు గేటులోనే 8వ నంబరు ప్లాటు ఫారమ్ కనుక
బాగుందను కున్నాం. మా మిత్రుల రైలు అక్కడ బయలు దేరేది కాక పోవడంతో డిస్ప్లేలో
జాప్యం జరుగుతోంది.
పది గంటలవుతూ ఉండగా, వెళ్ళొస్తామని చెప్పి, మేము ప్లాట్ ఫారమ్ మీదకి వెళ్ళాము. అప్పటికే
హౌరా మెయిల్ ప్లాట్ ఫారమ్ మీద పెట్టి ఉంది. మా కోచ్ ఎక్కి మా బెర్తులలో స్థిర పడ్డాం. ఈ సారి
మా యిద్దరివీ లోయర్ బెర్తులే. మెయిల్ రేపు మధ్యాహ్నం రెండు గంటల కి విజయ నగరం చేరుతుంది.
కనుక హాయిగా విశ్రాంతిగా పడుకో వచ్చనుకున్నాము. ట్రైన్  రాత్రి 11.50 ని.లకిబయలుదేరింది.

ముగిపు:

ఉదయం ఆరు గంటల ప్రాంతంలో నిద్ర లేచి ముఖాలు కడుక్కుని కాఫీలు వస్తే త్రాగేము.
9 .20కి రాజమండ్రి చేరింది. ముందుగా అనుకున్నాం కనుక రాజమండ్రిలో స్టేషనుకి
మా మరదలు మణి, వాళ్ళ చిన్నమ్మాయి రోషిణి వచ్చేరు. నాలుగయిదు నిమిషాలు కబుర్లు
చెప్పుకునే వీలు దొరికింది. మా తమ్ముడు రమణ ఏదో ఆఫీసు పని ఉండడంతో
రాలేక పోయేడు. మణి మాకోసం ఇంటి నుండి పేక్ చేసి తెచ్చిన టిఫిన్, భోజనం ఉన్న
సంచీ అందించి వీడ్కోలు చెప్పింది. ట్రైన్ బయలు దేరింది.
చేతులు కడుక్కుని వచ్చి టిఫిన్ లు కానిచ్చేం. చపాతీలు.కూర. మా మణి బాగా పేక్ చేసింది.
టిఫిన్ లకీ భోజనాలకీ వేరు వేరుగా పేపర్ ప్లేట్లూ, ప్లాస్టిక్ చెంచాలూ, కూల్ వాటర్ బాటిలూ ఉంచింది.
తను తెచ్చిన భోజనం ఇంటికి వెళ్ళేక తినొచ్చులే అనుకున్నాం.             మా చిన్నమ్మాయి కిరణ్ మా రైలు
విశాఖ పట్నం చేరగానే ఫోను చేసి చెబితే, మేం రైలు దిగి ఇంటికి చేరే సరికి  మాకోసం భోజనాలు
పట్టు కొస్తానని చెప్పి ఉంది. కానీ మణి మీల్సు కూడా తెచ్చి యివ్వడంతో మరేమీ చేసి తేవద్దని
మా అమ్మాయికి ఫోను చేసి మా ఆవిడ చెప్పింది.
ట్రైన్ లేటు లేకుండా సరైన సమయానికే విజయ నగర చేరుకుంది.
ఆటోలో యింటికి చేరుకుని స్నానాలు కానిచ్చి పేకెట్ విప్పి తినడానికి ఉపక్రమించేం.
అన్నం, పప్పు, దోసావకాయ పచ్చడీ పెరుగుతో భోజనం కానిచ్చేము.

మా యాత్రలాగే భోజనం కమ్మగా ఉంది.

ఇక్కడితో మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాల కథనం పూర్తయింది.

ఇక  మరోసారి 9 రాత్రులు ఉండేలా కాశీ వెళ్ళే యోచన ఉంది. మా చిన్నాన్న
 పంతులు బాబు, మురళీ పిన్ని, మా అక్కయ్య,  తన పెద్ద కొడుకు నాని, నాని
అత్త గారూ మామ గారూ మా శ్రీకాకుళం తమ్ముడు లక్ష్మణ్, మరదలు శారదలు
 కూడా తప్పకుండా వస్తామని అదరం కలిసి వెళదామని ఎప్పటి నుండో అంటున్నాం.

కాశీ నాథుని దయతో ఆ యాత్ర కూడా జయప్రదంగా జరగాలని కోరుకుంటూ, శలవ్.


ఈ యాత్ర వివరాల కోసం
ttdc అని type చేసి నెట్లో వెతక వచ్చును. లేదా,చిరునామా, ఫోను నంబర్లు
Tamil Naidu Tourism Devolepmednt Corporation,
Tourism Complex,
No.2 Wallajh Road, CHENNAI -600 002,
Phone :25333850 Extn. 208
Phone 044-25333113

mail ID ttdc@vsnl.com కి సపద్రదించ వచ్చును.


మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ... Day 07 ( 4 -3-2016)

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ... Day 07   ( 4 -3-2016)

కొడైకెనాల్ టూరిజమ్ వారి హొటల్ లో బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి, లగేజీలను బస్ డిక్కీలో పెట్టించుకుని
8.30. ని.లకు తిరుచ్చికి బయలు దేరాము. తిరుచనా పల్లినే తిరుచ్చి అంటారు. బస్సు ఏకథాటిగా
పరుగులు తీసి మధ్యాహ్నం 3 గంటలవుతూ ఉండగా తిరుచ్చి చేరింది.
తిరుచ్చిని ఆనుకుని శ్రీరంగ పట్టణం ఉంది. ఇక్కడ  ఉభయ కావేరుల మధ్య శ్రీరంగనాథ స్వామి రంగనాయకి
 అమ్మ వారితో కలసి స్వయంభువుగా వెలిసాడంటారు. 108 వైఫ్ణవ దివ్య క్షేత్రాలలో శ్రీరంగం చాలా ప్రసిద్ధ
మయినది. 7 ప్రాకారాలతో,21 గోపురాలతో విరాజిల్లుతూ ఉంటుంది. రాజ గోపురం ఎత్తు 236 అడుగులు.
భగవద్రామానుజుల వారి వైష్ణవ మత ప్రచారానికి ఈ శ్రీరంగం పట్టు కొమ్మగా నిలిచింది.
దీనికి సంబంధించిన వొక స్థల పురాణం ఉంది. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత విభీషణుడు శ్రీ రాముని విడిచి
వెళ్ళ డానికి మనస్కరించక రాముని ఎడబాటు సహించ లేక పోయాడుట. అప్పుడు  రామచంద్రుడు
అతనిని ఓదార్చి, ఇక్ష్వాకు వంశంలో తరతరుగా కొలువ బడుతూ ఉన్న రంగనాథుని ప్రతిమను తనకు
మారుగా సేవించు కొమ్మని యిచ్చేడుట.
అది తీసుకుని  విభీషణుడు లంకకు వెళ్తూ ఉభయ కావేరుల మధ్య ఉండే ఈ ప్రాంతానికి చేరుకొనే సరికి
సంధ్యా సమయ మయిందిట. సంధ్య వార్చు కునే నిమిత్తం దానిని చూస్తూ ఉండమని అక్కడ తారసపడిన
వొక బాలుని కోరేడుట. వినాయకుడే బాలుని రూపంలో వచ్చేడు. చూస్తాను కానీ నేను ముమ్మారు పిలిస్తే
 వెంటనే వచ్చి దీనిని తీసు కోవాలి. లేదంటే ఇక్కడే పెట్టి వెళ్ళి పోతానని బాలుడు చెప్పాడుట.
విభీషణుడు అందుకు అంగీకరించాడు. నది దగ్గరకి సంధ్య వార్చడం కోసం వెళ్ళాడు. కాసేపటికి బాలుడు
ముమ్మారు రమ్మని  పిలిచేడు. నది హోరులో విభీషణుడికి బాలుని పిలుపు అంద లేదు. దానితో బాలుడు
 శ్రీరంగని మూర్తిని అక్కడ ఉంచి మాయమై పోయాడుట. అలా ఉభయ కావేరుల మధ్య వెలసిన శ్రీరంగ
 నాథుడు భక్తుల పూజలు అందుకుంటూ  ఈ ప్రముఖ వైష్ణవ ఆలయంలో కొలువై ఉన్నాడు.

రంగనాథుని దర్శనమయ్యేక, కొంత దూరంలో ఉన్న జంబుకేశ్వర స్వామిని దర్శించు కున్నాము, తర్వాత
మరో రెండు మూడు కి.మీ దూరంలో ఉన్నవినాయక గుడినీ, వినాయక గుడి ఉండే రాక్
 టెంపుల్ నీ చూడడానికి వెళ్ళాము. వినాయక గుడి చాలా పెద్దది. రద్దీ బాగానే ఉంది.
మా ఆవిడా, రాధగారూ వాళ్ళూ అక్కడ ఉండే గజరాజుకి అక్కడ కొన్న గరిక తినిపించేరు.వో చిన్న షాపులో
 కాఫీలు త్రాగేము. భారీ ఏనుగు చూడ ముచ్చటగా ఉంది. రాక్ టెంపుల్ చూడాలంటే చాలా మెట్లు ఎక్కాలి
 కనుక, అంత ప్రయాసకు  ఓర్చుకో లేక, అందరం కిందనే గడిపేసాము. మాలో ఢిల్లీ నుండి వొంటరిగా
వచ్చిన డాక్టరమ్మ ఒకామె ( ఆవిడా మా లాగే సీనియరు సిటిజనే) పట్టుదలగా వెళ్ళి మెట్లు ఎక్కి గుడిని
 చూసి వచ్చింది. తర్వాత అందరం తిరుచ్చి లోని టూరిజమ్ వారి హొటల్ కి చేరు కున్నాము. నిజానికి
 దేవాలయాల దర్శనాలు మరి లేనట్టే. చివరి రోజయిన రేపు నేరుగా చెన్నైటూరిజమ్ వారి ఆఫీసు వద్దకు
బయలుదేరిన చోటుకి చేరు కోవడమే. పేకేజీలో లేకపోయినా, దారిలో వొక మంచి అమ్మ వారి ఆలయాన్ని
 చూపిస్తానని గైడు చెప్పాడు. అయితే అంతా సహకరించి ఉదయం 6.30కే బయలుదేరాలని కోరేడు.
అలాగే, చెన్నై చేరు కోగానే తక్కిన ఫార్మాలిటీస్ వేగిరం పూర్తి చేయిస్తానని చెప్పాడు. సీనియర్ సిటిజన్ లకు
 టిక్కెట్ మొత్తంలో 20 శాతం రిఫండు ఉంటుందనీ, అయితే దానికి ఏదో ఒక ఫొటో, జనన తేదీ ఉండే
ప్రభుత్వ గుర్తింపు కార్డు జెరాక్స్ ప్రతి ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. అంతే కాకుండా,
తిరుచ్చి టూరిజమ్ వారి హొటల్లో శాఖాహార భోజనం దొరకదని చెప్పి, బయట  మంచి హొటల్
నుండి ఎవరికి కావలసిన ఆహార పదార్ధాలు వారికి టూరిజమ్ వారి ఖర్చుతో వారి వారి రూములకే
పంపిస్తానని చెప్పాడు. నేను చపాతీ, ఫ్రైడ్ రైస్ కావాలని చెప్పేను.
హొటల్ రూముకి చేరు కున్నాక, వేడి నీళ్ళతో స్నానం చేసి, బట్టలు మార్చుకుని మా ఆధార్ కార్డుల
జెరాక్సు కాపీలు తెచ్చుకోడానికి బయటకి వెళ్ళేను. ఈ హొటలు తిరుచ్చిప్రధాన బస్  స్టేషనుకి అతి
 సమీపంలో బాగా రద్దీగా ఉండే ప్రాంతంలో ఉంది. జెరాక్సు కాపీలు తెచ్చుకుని హొటలుకి వచ్చే సరికి
మా గైడు పంపించిన వ్యక్తి  చపాతీ, ఫ్రైడ్ రైసు పేకట్లు తెచ్చి అందించేడు.
వాటిని తిని అంత వరకూ జరిగిన మా యాత్రను మననం చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నిద్రకు
ఉపక్రమించేము.

రేపటి రోజుతో ముగిసే మా ఎనిమిది రోజుల తమిళనాడు యాత్రలో చివరి రోజు నాటి విశేషాలు
తెలుసుకునే ముందు కాస్త విరామం. శలవ్.

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ... Day 06 ( 03- 03-2016)

మా  8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు ...  Day  06  ( 03- 03-2016)
నిన్నటి రోజున మధురై మీనాక్షీ అమ్మ వారిని కనులారా దర్శించు కోగలిగిన తృప్తితో రాత్రి బాగా నిద్ర
పట్టింది. అయినా రోజూ లాగే వేకువనే 4.30 కి మెళకువ వచ్చింది. నింపాదిగా తయారై, 8 గంటలకి
మధురై లో టూరిజమ్ వారి హొటల్ లోనే బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి,లగేజీ బస్ డిక్కీలో పెట్టించాము. 8.30కి
బస్ బయలు దేరింది. ఈరోజు మా ప్రయాణం విహార పర్యాటక కేంద్ర మయిన కొడైకెనాల్ కి.
తమిళ నాడు రాష్ట్రంలో దాదాపు నడి బొడ్డు న  తూర్పు కనుమలలో  ఉన్న చక్కటి పద్యాటక కేంద్రం
కొడైకెనాల్. ఊటీ తర్వాత మంచి వేసవి విడిది. సముద్ర మట్టానికి 2133 అడుగుల ఎత్తులోఉంది.

11 గంటల ప్రాంతంలో కొడై కెనాల్ వస్తోందనగా  వొక అంద మయిన ప్రదేశంలో బస్ ఆగింది. అక్కడి సుందర
దృశ్యాలను కెమేరాలలో బంధించాము. అక్కడ కాసేపు గడిపి, బయలుదేరాం. మధ్యాహ్నం
 12 గంటలకి కొడైకెనాల్ లో టూరిజమ్ వారి హొటల్ కి చేరు కున్నాము. ఆ హిల్ స్టేషనులో టూరిజమ్
 వారి హొటల్ ఎత్తయిన గుట్ట మీద  ఉంది. దాదాపు అక్కడ అన్ని భవనాలూ అక్కడక్కడా గుట్టల మీదే
ఉండడం కనిపించింది. పగలు ఏమంత చలిగా లేదు కానీ రాత్రి చలి వణికించింది. మామూలుగా ఇచ్చే
 రగ్గులతో పాటు, మరో రెండు రగ్గులు అక్కడ వొక ఆల్మెరాలో ఉండడం చూసి, తీసి కప్పుకో వలసి వచ్చింది.
 గదుల్లో ఎక్కడా ఫేన్లు లేవు.  ఆ అవసరమే లేదు. సీజన్ బట్టి గదుల అద్దెలు మారుతూ ఉంటాయని
రిసెప్షన్ దగ్గర ఉండే బోర్డు వల్ల తెలుస్తోంది. వేసవి వి రోజుల్లో అద్దెలు ఎక్కువ.
వేసవిలో వచ్చే సందర్శకులూ ఎక్కువగానే ఉంటారు.
హొటల్ గదులకు చేరాక, 12.30కి లంచ్ టూరిజమ్ వారి హొటల్లో చేసాము. లంచ్, డిన్నర్
లతో పాటు మరు నాడు ఉదయం బ్రేక్  ఫాస్టు కూడా అక్కడే నని గైడ్ చెప్పాడు. లంచ్ అయ్యేక అక్కడ
చూడ వసిన ప్రదేశాలు చూడడానికి బయలు దేరాము.కొడై కెనాల్ లో ముఖ్యంగా లేక్ ( సరస్సు),
సూసెయిడ్ పాయింట్,  కోకర్స్ వాక్  (వాకింగ్ ట్రాక్ ).  సరస్సులో  పడవలలో విహారం ( సొంత డ్రైవింగులో !)
గుఱ్ఱపు స్వారీ, సైకిలింగ్ ముఖ్య ఆకర్షణలు.ఏదేనా షాపింగ్ చేసు కోవాలంటే కూడా
ఇక్కడ ప్రభుత్వం నిర్వహిస్తున్న దుకాణాలతో పాటు చాలా దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ ఏలకులు,
దాల్చిన చెక్క, గసగసాలు మొదలయిన సుగంధ ద్రవ్యాలు, తేనె, కాఫీ , టీ పొడులు మొదలయినవన్నీ
కాస్త చౌకగా దొరుకుతాయి. తమ నగరాల్లో ధరలకీ ఇక్కడి ధరలకీ బేరీజు వేసుకుని ఆడవాళ్ళు కావలసినవి
కొనుక్కుంటూ ఉంటారు, మా సహ యాత్రీకులలో ఆడ  వాళ్ళు ఇక్కడ షాపింగు చేసారు. పిల్లల ఆట
 వస్తువులు, రగ్గులు,టోపీలు, స్వెట్టర్లు వంటివి సరే సరి.
ముందుగా కోకర్స్ వాక్ వద్దకు చేరు కున్నాము. ఒకప్పుడు కోకర్ అనే దొర ఇక్కడ రోజూ వాకింగ్ చేసే
 వాడుట. అతని పేరున  కొండ అంచున సన్నగా పొడుగ్గా ఉండే కాలి బాట యిది. ఈ బాట మీద
నడుస్తూ చుట్టూ కనిపించే అందమయిన లోయలు, ప్రకృతి దృశ్యాలను తిలకించ వచ్చును.
తర్వాత సూసెయిడ్ పాయింట్ దగ్గరకి చేరు కున్నాము. ఇక్కడ అగాథంలో దూకి ఎందరో తరుచుగా
 ఆత్మ హత్యలు చేసుకునే వారుట.  దీనికి ఇనుప వలయంతో గేట్లు ర్పాటు చేసి
ఏ ప్రమాదమూ జరుగ కుండా లోయ అందాలను చూడగలిగేలా ఏర్పాటు చేసారు. ఇక్కడి నుండి
 కనిపించే లోయనే లోగడ గ్రీన్ వ్యాలీ అనే వారుట. మంచు పొగలతో, ఎత్తయిన చెట్లతో,లోతయిన ఈ
వ్యాలీ చాలా అందంగా ఉంది. ఈ ప్రాంతంలో చాలా సినిమా షూటింగులు జరుగుతూ ఉంటాయిట.
తర్వాత కొడై సరస్సు దగ్గరకి వెళ్ళాము. 1863లో 60 ఎకరాల విస్తీర్ణంలో మానవ నిర్మిత మయిన అంద
మయిన సరస్సు యిది. దీనిలో సరదా ఉన్న వారు బోటు షికారు చేయ వచ్చును. మేము చేయ లేదు.
ఫొటోలు తీసుకున్నాము. ఈ సరస్సు వొక వేపు అర చెయ్యి లాగ వెడల్పుగా ఉండి మరో వేపు చేతి వేళ్ళ
 లాగా పాయలుగా విడి పోయి ఉంటుంది. ఈ సరస్సును రోడ్డు మీద నుండి చూస్తూ చుట్టి రావడానికి
ఇక్కడ సైకిళ్ళు అద్దెకిస్తారు. చిన్నవీ, పెద్దవీ కూడా సైకిళ్ళు అద్దెలకి దొరుకుతాయి. సైకిళ్ళు అద్దెకిచ్చే
షాపులు ఇక్కడ చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ గుఱ్ఱపు స్వారీ వొక ప్రత్యేక ఆకర్షణ. పిల్లలు,
యువతీ యువకులు డబ్బులిచ్చి గుఱ్ఱాల మీద కాసేపు స్వారీ చేసి ముచ్చట పడుతూ ఉంటారు.
స్వారీ గుఱ్ఱాలను అనుసరిస్తూ రౌతులు కైడా సైకిళ్ళ మీద వెళ్తూ ఉంటారు. కనుక పిల్లలు నిర్భయంగా
 గుఱ్ఱపు  స్వారీ చేయ వచ్చును.
 ఇవన్నీ చూస్తూ చాలా సేపు గడిపి, టూరిజమ్ వారి హొటల్ కి చేరు కున్నాము. రాత్రి 8గం.లకి డిన్నరు
చేసాక, గదులలో చేరాం. ఇక్కడ గదులలో 24 గంటలూ వేడి నీరు దొరుకుతోంది. మామూలు నీళ్ళ
 బకెట్ లో  చెయ్యి పెడితే జివ్వుమంటోంది! అప్పటికి చలి ఎక్కువయింది. రగ్గులు తగినన్ని ఉండడంతో
కప్పుకుని నిద్ర పోయేం. రేపు తిరుచ్చికి ప్రయాణంతో మొదలయ్యే 7వ రోజు యాత్రా విశేషాలు
యిప్పటికి సశేషమ్.