సరదా...సరదా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సరదా...సరదా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, డిసెంబర్ 2019, సోమవారం

తిక్కలోడి సామాజిక స్పృహ

‘‘ ఎటు వేపేనా వెళ్ళు, కానీ, ఉత్తరం దిక్కు వేపు మాత్రం వెళ్ళకు ! ’’ అని ముసలి రాజు మరీ మరీ చెప్పి పంపిస్తాడా ? రాకుమారుడు అటు వేపే వెళ్తాడు.

ఇచ్చట నోటీసుల అంటించ రాదు అనే బోర్డు మీది అక్షరాలు రకరకాల వాల్ సోష్టర్ల నడుమ బిక్కు బిక్కుమంటూ కనిపిస్తూ ఉంటాయి.

ఇచ్చట మూత్రము చేయ రాదు ( మా హైదరాబాదులో అలాగే రాస్తారు మరి) అని ఉంటుందా ? అక్కడంతా ముక్కులు బద్దలయ్యేంత దుర్వాసన గుప్పు మంటూ ఉంటుంది.

నిశ్శబ్దమును పాటించుము అనే చోట నయాగరా జలపాత హోరు వినిపిస్తున్నా , లైబ్రేరియన్ ఒకటి రెండు సార్లు చెప్పి చూసి నిస్సహాయంగా చేతులెత్తేస్తాడు.

వాహనములకు ప్రవేశము లేదు అని వ్రాసి ఉన్న హెచ్చరికను తుంగలో తొక్కి ఏ పోలీసో ఎదురయ్యే వరకూ ఆకతాయి వాహనాలు పరిగెడుతూనే ఉంటాయి.

ప్లేట్లలో చేతులు కడగరాదు అని మా ఊళ్ళో చిన్న చిన్న హొటళ్ళలో బోర్డు రాసి పెట్టే వారు. అందు చేత జనాలు ఆ వినతిని  మన్నించి, టిఫిన్ తిన్నాక, చేతులు గ్లాసులలో ముంచి చక్కా పోయే వారు.

స్త్రీలకు మాత్రమే అని కనిపిస్తున్నా కొందరు జబర్దస్తీ రాయుళ్ళు బస్సులలో ఆ సీట్ల లోనే కూర్చోడం అప్పుడప్పుడు కనిపించే దృశ్యమే.

మెడలు పక్కకి వాల్చి వాహనాలు నడిపే చోదకుల విన్యాసాలూ,పట్ట పగలు కూడా వెలిగే వీధి దీపాలూ, బస్సుల్లో వ్రేలాడుతూ ప్రయాణం చేసే ఫుట్ బోర్డు వీరుల సర్కస్  ఫీట్లూ  ...

ఇలా చెప్పు కుంటూ పోతూ ఉంటే అంతూ పొంతూ ఉండదు. మన సామాజిక  సామాజిక స్పృహ  అలాంటిది మరి !

ఈ మేడే నాడు సామాజిక స్పృహ  గుర్తుకు రావడం యాదృచ్ఛిక మేమీ కాదు.

దానితో పాటు మా తింగరి బుచ్చి గాడి సామాజిక స్పృహ గురించి మీకు చెప్పాలనిపించడం కూడా సహజమైన విషయమే.

మా తింగరి బుచ్చిగాడు గుర్తున్నాడు కదూ ?  పువ్వు పుట్టగానే పరిమళించినట్టు మా తింగరి బుచ్చిగాడు ఆరేడేళ్ళ వయసు లోనే గొప్ప  సామాజిక స్పృహ సంతరించు కున్నాడు. అది విశేషమే కదా ?


ఆ ముచ్చట చెప్పాలనే ఈ టపా పెడుతున్నాను.

నేనూ , మా తింగరి బుచ్చిగాడూ ఎలిమెంటరీ బడిలో చదువుకునే రోజులవి. మా బడి పేరు జంగం బడి. మా బడి పోలీసు స్టేషను వీధికి దగ్గరలోనే ఉండేది. మా బడికి ఎదురుగా ఒక చేకు గోడౌను ఉండేది. అంటే తెలుసు కదా ? గోగు నారని అక్కడ మిషన్ల లో పెట్టి పెద్ద పెద్ద బేళ్ళగా కట్టి ఎక్కడికో ఎగుమతి చేసే వారు.

ఆరోజుల్లో అక్కడ తయారయే చేకు బేళ్ళు మాకంటికి ఆకాశమంత ఎత్తుగా కనిపించేవి. ఆ తయారీ కూడా మాకు చాలా వింతగా కనిపించేది. నార బేళ్ళు కట్టే మిషన్లు ఒకటో, రెండో ఉండేవి. వాటిలో నార వేసి మనుషులు తొక్కే వాళ్ళు.  తర్వాత పెద్ద పెద్ద చక్రాలను నలుగురైదుగురు మనుషులు బలంగా పట్టుకుని తిప్పే వారు. పెద్ద పెద్ద తాళ్ళతో ఆ మిషన్లోనే వాటిని పెద్ద బేళ్ళుగా కట్టే వారు. అలా కట్టిన బేళ్ళ నుండి ఒక్క చిన్న నార పీచు లాగి తియ్యడం కూడా మాకు చాతనయ్యేది కాదు. మా శలవు రోజులన్నీ ఆ గోడౌను లో ఉండే రావి చెట్టు కిందే గడిచి పోయేవి.

సరే, ఇదంతా అలా ఉంచితే, ఒక రోజు మా తింగరి బుచ్చి నన్ను రహస్యంగా ప్రక్కకి పిలిచి, ‘‘ నీకో రహస్యం చెబుతాను. మన చేకు గోడౌనులో దొంగతనం జరుగుతోంది. తెలుసా ! ’’ అనడిగేడు.

‘‘ దొంగతనమా !’’ అన్నాను భయంగా.

‘‘ అంటే, దొంగ వ్యాపార మన్న మాట.’’ అని వివరించేడు. కల్తీ , దొంగ వ్యాపారం, దోపిడీ లాంటి పదాలు వాళ్ళ అన్నయ్య తరుచుగా అంటూ ఉంటాడు. అవే వీడికీ వంట బట్టేయి.

‘‘ మనం ఈ విషయం పోలీసులకి చెప్పాలి. పోలీసు స్టేషన్ కి వెళదాం పద !‘‘ అన్నాడు.

నా నిక్కరు తడిసి పోయింది.

‘‘ అమ్మో ! నాకు భయం’’ అన్నాను.

‘‘ నీకు సామాజిక స్పృహ లేదు.’’ వెక్కిరించాడు వాడు. ఈ పదం కూడా వాడు వాళ్ళ విప్లవ అన్నయ్య నుండి నేర్చుకున్నదే. అసలీ విప్లవమనే పదం కూడా వాడికి అలాతెలిసిందే. ‘‘ అంటే ఏమిటి ’’ అనడిగేను. ‘‘ నాకూ సరిగా తెలియదు. తిరగ బడడంట.’’ అన్నాడు. మా అవ్వ ఆ మధ్య నీరసంతో కళ్ళుతిరిగి నేలకు తిరగ బడి పోయింది. ఇది సామాజిక స్పృహ  అవునో కాదో నాకు తెలియదు. నిజంగా. నిజం. సరస్వతి తోడు.

నాకు సామాజిక స్పృహ లేదని ఖాయమై పోయేక, వాడొక్కడూ పోలీసు స్టేషన్కి బయలు దేరాడు.



 అక్కడ జరిగిన బోగట్టా అంతా నా మనో నేత్రంతో ( అంటే ఏఁవిటో నాకు సరిగ్గా తెలియదు. మా కథా మంజరి బ్లాగరు అంకుల్ చెప్పాడు ) చూసాను కనుక మీకు చెబుతున్నాను.



మా తింగరి బుచ్చి గాడు వీరోచితంగా పోలీసు స్టేషను వరకూ వెళ్ళి , అక్క డ చాలా సేపు తటపటాయించి, ఎలాగయితేనేం, స్టేషను లోకి ప్రవేశించాడు.

అక్కడింకా పోలీసు బాబాయిలు మేలుకో లేదు. మేలుకునే ఉన్నా,  అంటే,  ఉత్త బాబాయిల్లా గానే ఉన్నారు.

కానీ, పోలీసు బాబాయిల్లా లేరన్న మాట.

అంచేత, ఏం కావాలి బాబూ ! అనడిగేరు లాలనగా.

‘‘ కంప్లయంటు ఇవ్వడానికి వచ్చానండీ’’ అన్నాడు వీడు.

‘‘ మీ నాన్న మీదా ?’’

‘‘ కాదండీ ...’’

‘‘ మీ అమ్మ మీదా ?‘‘

‘‘ కాదండీ ..’’

‘‘ పోనీ, ఇంకెవరయినా మీ ఇంట్లో వాళ్ళ మీదా ? లేక మీ పక్కింటి అంకుల్ గారి మీదా ’’

’’ఉహూఁ !  కాదండీ ...’’

‘‘ నీ జేబులో అయిదు పైసల బిళ్ళ పోయిందా ?’’ చివరి ప్రయత్నంగా కొంచెం లాలనగానే అడిగాడు పో.బా.

‘‘ కాదండీ ..’’ అంటూ, ఎందుకయినా మంచిదని నిక్కరు జేబు ఓసారి తడిమి చూసుకున్నాడు మా తింగరి బుచ్చి గాడు.

అప్పటికి పోలీసు  బాబాయిలో నిజమైన పోలీసు బద్ధకంగా నిద్ర లేచాడు.

‘‘ మరెవరి మీదరా నా కొడకా  ?’’ విసుగ్గా అడిగేడు. అయినా, ముద్దుగానే అడిగాడు. మన వాడికి  కాళ్ళలో సన్నని వణుకు మొదలయింది.

’’ మా బడి దగ్గర గోడౌన్ వాళ్ళ మీదండీ ....వాళ్ళు దొంగ వ్యాపారం చేస్తున్నారు ...’’అన్నాడు, ఎలాగో కొంచెం ధైర్యం చిక్కబట్టుకొని.


పో.బా కి ఓ క్షణం తను  ఏం విన్నాడో అర్ధం కాలేదు.

‘‘ సరేలే ... నువ్వు మీ ఇంటికి పోయి, మీ పెద్ద వాళ్ళు ఎవరి నయినా పంపించు. వాళ్ళొచ్చి రిపోర్టు ఇస్తారు ’’ అన్నాడు.

‘‘ వాళ్ళకంత సామాజిక స్పృహ  లేదండీ !’’ అన్నాడు టక్కున మా తింగరి బుచ్చిగాడు.



ఈ సారి పోలీసు బాబాయిలందరికీ నిజంగానే మతి పోయింది ! కాసేపు మాట పడి పోయింది.



‘‘ సరేలే, పద ...ఓయ్, 110 నువ్వు వీడి వెంట వెళ్ళి ఆ సంగతేమిటో చూడు ...’’ అన్నాడొక పెద్ద పో.బా.



తింగరి బుచ్చి గాడికి ఏనుగు నెక్కి నంత సంబర మనిపించింది.



110 పో.బా తనని తన సైకిలు వెనుక కూర్చుండ పెట్టుకొని తొక్కడం వాడికి మరింత గర్వ మనిపించింది.





సామాజిక స్పృహ ఉండడం వల్ల ఎంత గౌరవమో కదా అనుకున్నాడు.



పో.బా ని మన వాడు నేరుగా గోడౌను లోకి తీసుకు వెళ్ళి అక్కడ దొంతరలుగా ఉన్న చేకు బేళ్ళను చూపించాడు.

‘‘ ఇక్కడ ఎన్ని బేళ్ళు ఉన్నాయో చూసారు కదండీ ...’’

‘‘అయితే ? ...’’ బిక్క మొహంతో అడిగాడు పో.బా.

‘‘ రండి చెబుతాను.’’ అని పో.బా ను మా తింగరి బుచ్చి గాడు గోడౌను గేటు వెలుపలి గోడ దగ్గరకు తీసుకు వచ్చాడు. అక్కడ గోడ మీద రాసి ఉన్న అక్షరాలు చదవమన్నాడు.



పో.బా కూడ బలుక్కో కుండానే వీజీగానే చదివేసాడు :  ‘‘STICK NO BILLS  ... ’’

అప్పుడు మా తింగరి బుచ్చి గాడు విజయ గర్వంతో తల ఎగరేస్తూ కాస్త గట్టిగానే అన్నాడు. ‘‘ చూసారా సారూ ? గోడౌన్ లోపల అంత స్టాకు ఉంచుకొని , ఇక్కడ చేకు బేళ్ళు స్టాకు లేవని బోర్డు పెట్టారు. ఇది దొంగ వ్యాపారమే కదా ? మీరు వీళ్ళని జైల్లో పెట్టాలి.’’ అన్నాడు .



పో.బా కి తల తిరిగి, మూర్ఛ వచ్చినంత పనయింది. పోలీసు ఉద్యోగం వదిలేసి ఎక్కడి కయినా పోవాలన్నంత విరక్తి  కలిగింది.



Stick no bills  అనే బోర్డుని మా తింగరి బుచ్చి గాడు తన ఆంగ్ల భాషా పాండిత్యాన్ని ఉపయోగించి,కూడ బలుక్కొని,

 ‘‘ స్టాక్ నో బేల్స్   ’’ అని చదువు తున్నాడని అర్ధం కావడానికి  అతనికి  కొంత సేపు పట్టింది. అతనా షాకు నుండి తేరుకునే లోపల మా తింగరి బుచ్చిగాడు ‘‘ మీకు సామాజిక స్పృహ  కానీ ఉంటే వెంటనే ఈ దొంగ వ్యాపారులను జైల్లో పెట్టాలి ! ’’ అని   ఒకటే సతాయిస్తున్నాడు.



పోలీసు బాబాయి ‘‘ సరే ... సరే ..నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, వీళ్ళందరినీ నేను జైల్లో పెడతానుగా ! ’’ అన్నాడు.



విజయ గర్వంతో విజిలు వేస్తూ మా తింగరి బుచ్చి గాడు  జారి పోతున్న నిక్కరును మీదకి లాక్కుంటూ ఇంటి ముఖం పట్టాడు.



వాడు నాలుగడుగులు వేసాడో లేదో, వెనుక నుంచి ’’ మళ్ళీ మా పోలీసే స్టేషను వేపు వచ్చావంటే ముందు నిన్ను బొక్కలో పడేసి మక్కలు విరిచేస్తాను జాగ్రత్త ! ’’ అన్న పో.బా. మాటలు వినిపించి వాడి నిక్కరు తడిసి పోయింది.   అవి పో.బా. తనని గురించి అన్న మాటలేనని వాడు వెనక్కి తిరగ నక్కర లేకుండానే పోల్చుకున్నాడు.



 అంతే ! ... ఇల్లు చేరే వరకూ పరుగో ... పరుగు !  పరుగో, పరుగు !!



ఇదండీ మా తింగరి బుచ్చిగాడి సామాజిక స్పృహ అను ఇంగ్లీషు పాండిత్యం !