Day 04 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Day 04 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, మార్చి 2016, శనివారం

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు Day 04 (1 – 3 -2016 )

మా 8 రోజుల తమిళ నాడు యాత్రా విశేషాలు  Day 04 (1 – 3 -2016 )
మా తమిళ నాడు యాత్రలో ఈ రోజు మా ప్రయాణం కన్యా కుమారికి. అయితే, మా పేకేజీలో లేని మరో రెండు
ఆలయాలను మా గైడ్ చూపించాడు. వాటి వివరాలు చెప్పేక, కన్యా కుమారికి గురిచి చెబుతాను.
ఉదయం బ్రేక్ ఫాస్ట్  రామేశ్వరం లోని టూరిజమ్ వారి హొటల్ లోనే తీసు కున్నాము. కన్యా కుమారి అక్కడికి 350
350 కి.మీ దూరంలో ఉంది. ఉదయం 7.15ని.లకే టిఫిన్ లు కానిచ్చి బయలు దేరాము.

8.30 కి వొక చిన్న ఆలయం దగ్గర బస్ ఆగింది. అక్కడ వొక హనుమాన్ టెంపుల్ ఉది.
హనుమ విగ్రహం పెద్దదే. అక్కడే వొక వ్యక్తి మాకు నీటిలో తేలే రాళ్ళు చూపించేడు.
రాళ్ళు నీటిలో బెండుల్లా తేలడం అబ్బురమే. అలాంటి రాళ్ళు అక్కడ కొద్ది పాటి మాత్రమే ఉన్నాయి. అలాటి
రాళ్ళ మీదే శ్రీరామ అని వ్రాసి వానరులు సముద్రంలో వేసి లంకకు వారధి నిర్మించారుట!
వొక నీటి తొట్టిలో ఉన్న నాలుగయిదు రాళ్ళను కదిపి చూసేము.
రాముడు ధనుష్కోటి ప్రాంతంతలో నిర్మించిన సేతువు సమద్ర గర్భంలో కలిసి పోగా, అక్కడ నుండి
సేకరించి తెచ్చిన రాళ్ళు కొన్ని ఇక్కడ ఉంచి భక్తులకు చూపుతున్నట్టుగా చెప్పారు.
ఇది చూసేక, బస్ మళ్ళీ బయలు దేరింది. మరో గంట తర్వాత 9.30వొక చోట ఆది జగన్నాథ
స్వామి వారి కోవెల దగ్గర దర్శనార్ధం బస్ ఆగింది. ఈ ప్రాంతాన్ని దక్షిణ పూరి అని వ్యవహరిస్తారుట.
ఇక్కడ ఆలయంలో శయన ముద్రలో ఉన్న శ్రీరాముడు దర్శనమిస్తాడు. కుడి చేతిని తల కింద పెట్టుకుని
సీతాన్వేషణ ఎలా చేయాలా ! అని ఆలోచిస్తున్నట్టుగా శ్రీరామ మూర్తి శయన భంగిమలో ఆలోచనా ముద్రలో
కనిపిస్తాడు.  అర్చకులు ఆలయానికి చెందిన ఈ ఐతిహ్యం చెప్పారు. గర్భ గుడికి వెలుపల శ్రీరాముడిని
అవలోకిస్తూ శరణా గతి భంగిమలో విభీషణుని విగ్రహం ఉది. మరో ప్రక్క సముద్రుని విగ్రహం కూడా ఉంది.
మరో ప్రక్క పట్టాభిరాముని విగ్రహాలు చూడ ముచ్చటగా ఉన్నాయి.
సరే, ఇక్కడి నుండి బయలు దేరి, లంచ్ కి అవకాశం లేక పోవడంతో వొక చోట ఆపితే స్నాక్స్  అరటి
పళ్ళతో కడుపు నింపు కున్నాము.
నాలుగు గంటలకి కన్యా కుమారి చేరు కున్నాము.
కన్యాకుమారి చాలా అందమయిన ప్రదేశం. భారత ద్వీప కల్పానికి దక్షిణ దిక్కున గల చిట్ట చివరి ప్రాంతం.
అందుకే దీనిని కన్యా కుమారి అగ్రం అని అంటారు. ఇదొక ముఖ్య పర్యాటక కేంద్రం.పడమటి కనుమలలో
ప్రకృతి సిద్ధ మయిన అందాలతో అలరారే ప్రదేశం. ఇది బంగాళాఖాతం, అరేబియా మహా సముద్రం,
హిందూ మహా  సముద్రం కలిసే చోటు.  ఆ మూడు సముద్రాల జలాలు అక్కడ కన్యా కుమారిగా వెలిసిన
 పార్వతీ దేవి దివ్య పాదాలను తెల్లని కెరటాలతోనూ, నురుగులతోనూ  తడుపుతూ ఉంటాయి.
ఇక్కడి సైకత రేణువులుథోరియం ధాతువులతో కూడి ఉండడం వల్ల శక్తిమంతములై, పవిత్రమెలైనవిగా
భావిస్తారు. వారణాసి శివుడికీ, కన్యా కుమారి పార్వతీ దేవికీ నివాస స్థలాలుగా చెబుతారు.

ఇక్కడ కన్యా కుమారి ఆలయ దర్శనంతో పాటూ విశేష ఆకర్షణగా నిలిచేవి సముద్ర జలాలలో
కనుల పండువుగా కనిపిస్తూ ఉండేవివేకానంద  స్వామి మెమోరియల్ రాక్ టెంపుల్. 1892ప్రాంతంలో
వివేకానందుడు సముద్రాన్నిఈదుతూ వెళ్ళి అక్కడి కొండమీద ధ్యానం చేసే వారట!
స్వామి స్మారకార్ధం ఆ కొండ మీద వొక చలువ రాతి ధ్యాన మందిరాన్ని నిర్మించారు.
దానికి కొంత సమీపంలో  తమిళ కవి తిరువళ్ళవర్ భారీవిగ్రహం అబ్బుర పరుస్తూ ఉంటుంది.
133 అడుగుల ఎత్తుతో, ఏడున్నర టన్నుల బరువుతో ఉండే ఆ విగ్రహాన్ని 2000సం.లో
ముఖ్య మంత్రి కరుణా నిధిఆవిష్కరించారుట. ఇక్కడకీ,సముద్రలో రాక్   టెంపుల్ వద్దకూ వెళ్ళడానికి
పడవలలోనే వెళ్ళాలి.  ఫెర్రీ సర్వీసులు ఉంటాయి.  కానీ, ఆ రోజు సాయంత్రం అలల ఉధృతి ఎక్కువగా
 ఉడడంతో ఫెర్రీ సర్వీసులను రద్దు చేసారు. అందరం ఎంతో నిరుత్సాహ పడ్డాం. కానీ మా గైడ్ నిరుత్సాహ
 పడ వద్దనీ, యాత్రలో చిన్న మార్పు చేసి మరునాడు 5 వరోజు యాత్రలో  ఉదయం చూడ వసి ఉన్న
సుచీంద్రానికి ఆ సాయంత్రమే తీసుకుని వెళ్తాననీ, అందు వలన సమయం కలసి వచ్చి,
మరునాడు ఉదయం ఫెర్రీ సర్వీసులు పునరుద్ధరిస్తే వివేకానంద రాక్ టెంపుల్ ని చూడ వచ్చనీ చెప్పాడు.

అందు చేత  సుచీంద్రం వెళ్ళడానికి ముందుగా కన్యా కుమారిలో గాంధీ మెమోరియల్ భవనం చూసేము.
అక్కడ మహాత్ముని అస్థికలుంచిన పాత్ర నిక్షిప్తం చేసిన పాల రాతి కట్టడం ఉంది. దాని మీద గాంధీ
జయంతి అక్టోబరు 2న  మాత్రమే సరిగ్గా పన్నెండు గంటలకి నేరుగా సూర్య కిరణాలు పడడం విశేషమని
 చెప్పారు. తర్వాత ఇక్కడ కన్యా కుమారి ఆలయాన్ని దర్శించు కున్నాం.ఆతర్వాత అంతా బస్ ఎక్కాము .
 బస్ 5.45 ని.లకి సుచీంద్రం చేరింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇక్కడ దర్శనమిస్తారు. ఈ కోవెలలో
 విశేషాంశం ఏమిటంటే, సంగీతం వినిపిచే స్తంభాలు. గైడు వాటి మీద లయ బద్ధంగా వాయించేడు. స్తంభాల
నుండి చెవి వొగ్గితే  మూడు నాలుగురకాల వాయిద్యాల సంగీతం ప్రతిధ్వనించింది. రాళ్ళు కూడా రాగాలు
పలకడం అంటే ఇదే కదా అనుకున్నాము.

సుచీంద్రం చూసుకుని 7.30కి తిరిగి కన్యాకుమారి చేరు కున్నాము. టూరిజమ్ వారి హొటల్ గదులలో
చేరి, విశ్రాంతి తీసుకుని ఎనిమిదిన్నరకి వారి హొటల్ లో డిన్నరు తీసు కున్నాము.

మర్నాడు ఉదయమే లేచి,  కన్యా కుమారిలోసూర్యోదయాన్ని చూడాలని, ఫెర్రీలు తిరిగితే
వివేకానంద మెమోరియల్ రాక్ టెంపుల్ చూడాలనీ ఉవ్విళ్ళూరుతూ నిద్రకి ఉపక్రమించాము.
శలవ్.