తమిళ నాడు యాత్ర చెన్నై దేవాలయ దర్శనాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తమిళ నాడు యాత్ర చెన్నై దేవాలయ దర్శనాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, మార్చి 2016, బుధవారం

మా తమిళ నాడు యాత్రా విశేషాలు .. .. చెన్నై దేవాలయ దర్శనం

మా తమిళ నాడు యాత్రా విశేషాలు  -  చెన్నై దేవాలయ దర్శనాలు
తమిళ నాడు వారి టూరిజమ్ పేకేజిలో మా యాత్ర ఫిబ్రవరి 27 తో మొదలవుతుంది. కాని,
తమిళ నాట మా దేవాలయ దర్శనాలు 26 వ తేదీ నుండే మొదలయ్యాయని చెప్పాలి. ఎదురు చూసిన
ప్రయాణపు తేదీ దగ్గర పడుతూ ఉండడంతో 24 వ తేదీ నాటికే రెండు  చిన్నసూట్ కేసులూ, వొక బేగ్ తో
బట్టలూ అవీ సర్దుకుని సిద్ధ మయ్యాము. రానే వచ్చింది 25 వ తేదీ. ట్రైన్లో రాత్రీ, మరునాడు ఉదయమూ
తినడానికి మా ఆవిడ టిఫిన్ పేకెట్ లు సిద్ధం చేసింది.
మేం ఎక్క వలసిన భువనేశ్వర్ – చెన్నై సూపర్ ఫాస్ట్ఎక్స్ ప్రెస్ సరైన సమయానికే అంటే, సాయంత్రం
 5గ.50 ని.లకి వచ్చింది. మా ఇద్దరివీ కూడా అప్పర్ బెర్తు లే! కానీ మిడిల్ బెర్తు  వ్యక్తి మా ఆవిడకు
అది యిచ్చి, తను అప్పర్ బెర్తులో సర్దుకున్నాడు.
 రాత్రి ఎనిమిదికి టిఫిన్ లు కానిచ్చి, నిద్రకు ఉపక్రమించాం, మర్నాడు ఉదయాన్నే లేచి ముఖాలు కడుక్కుని కాఫీలు సేవించి
కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే 8.50ని.లకి చెన్నై సెంట్రల్ స్టేషనులో సరైన టైముకే  ట్రైన్ చేరింది.

చెన్నైలో స్టేషనుకి అర కిలో మీటరు దూరం లోనే సిటీ హోమ్ హొటల్ లో వొక ఎ.సి రూమ్ ముందుగానే
నెట్ లో బుక్ చేసి ఉన్నాను కనుక, రైలు దిగి, కూలీని మాట్లాడుకుని స్టేషను వెలుపలికి వచ్చి, ఆటోలో
హొటల్ కి  చేరాం. గదిలో ప్రవేశించి స్నానాదికాలు ముగించుకుని టిఫిన్  కానిచ్చేం. ఇక మర్నాడు ఉదయం
వరకూ మాకు తీరికే. కనుక, మద్రాసులో ప్రసిద్ధ మయిన ప్రాచీన దేవాలయాలు చూసి వద్దాం అని
 నిర్ణయించు కున్నాం. మేం దిగిన సిటీ హోమ్ హొటల్ వారే ట్రావెలింగు ఏజెన్సీనిర్వహిస్తూ ఉండడంతో
వాళ్ళ టారిఫ్    సరి చూసుకుని, 5 గంటలకి వొక ఇండికా ఎ.సి. కేబ్ బుక్ చేసాను. రేటు 900లు.
కేబ్ మధ్యాహ్నం 3 గంటలకల్లా ఉండాలని చెప్పేను. రెండింటికి భోజనాలు కానిచ్చి, పేపరు చదువుకుంటూ
 విశ్రాంతి తీసుకున్నాం. మూడు గంటలకి బయలు దేరడానికి సిద్ధంగా ఉన్నాం.
చెప్పిన టైముకి కేబ్ వచ్చింది. బయట ఎండ కొంచెం ఎక్కువగానే ఉంది. ఎ.సి కేబ్ బుక్ చెయ్యడంతో
మాకు అలసట తెలియ లేదు.
ముందుగా అష్ట లక్ష్మీ దేవాలయానికి వెళ్ళాం. అంతస్థులుగా ఉండే ఈ దేవాలయం చాలా బాగా ఉంది.
మెట్లెక్కుతూ అష్ట లక్ష్ములనూ దర్శించు కున్నాం. అక్కడి నుండి ఎదురుగా సముద్రం కనబడుతూ
వాతావారణం ఆహ్లాదకరంగా అనిపించింది. తర్వాత పార్ధ సారధి టెంపుల్,  ఆ తరువాత కపాలేశ్వర స్వామి
దేవాలయాలను దర్శించు కున్నాం. ఈ మూడు దేవాయాలూ చెన్నై లో  చాలా ప్రసిద్ధ మయినవే కాక
తప్పకుండా చూడ తగినవి. వీటి గురించి మేం ముందుగానే విని ఉన్నాం.
దేవాలయాలను దర్శించు కున్నాక, మెరీనా బీచ్ కి వెళ్ళాం. అప్పటికి చీకటి పడింది. సముద్రం మసక
 మసకగా  కనిపిస్తోంది. అయితే నేం, సముద్రపు గాలి చల్లగా హాయిగా ఉంది.
ఎంత చూసినా తనివి తీరదు. ప్రతి సారీ కొత్త కొత్త పాఠా లేవో చెబుతూనే ఉన్నట్టుగా ఉంటుంది. కెరటాల
 చేతులతో ఆశీర్వదిస్తూ. తెల్లనినురుగు నవ్వులతో  సమ్మోహనపరుస్తూ, చల్లని గాలుల్తో సేద దీరుస్తూ,
 ఆ సంజె చీకట్లలో చీకట్ల దుప్పటీ కప్పుకుని సముద్రం మరింత కొత్తగా కనిపించింది. గరికపాటి వారి
 సాగర ఘోష కావ్యం లోని  కొన్ని చరణాలను గుర్తు చేసు కున్నాను. దానితో మనసు మరింత ప్రఫుల్ల
మయింది.
బీచ్ లో  రాత్రి ఎనిమిది వరకూ గడిపి హొటల్ కి చేరు కున్నాము. రాత్రి పెద్దగా ఆకలి లేక పోవడంతో
కొద్దిగా పెరుగన్నాలు మాత్రం తిని, నిద్రకు ఉపక్రమించాం.

27 – 02 -2016.
ఉదయాన్నే లేచి, 5.30కల్లా తయారయి పోయాం. కాఫీలు త్రాగి, ఆటోలో తమిళ నాడు టూరిజమ్ వారి
 ఆఫీసుకి  చేరు కున్నాం.

 TTDC  వారి ఆఫీసు మేం దిగిన హొటల్ కి నాలుగు కి.మీ.ల దూరంలో ఉంది.
No.2 Wallajah Road, Triplicane  లో ఉంది.మేము అక్కడకి చేరుకునే సరికే మా సహ ప్రయాణికులు
కొందరు అక్కడికి చేరుకుని ఉన్నారు. మేం వచ్చి నట్టుగా రిపోర్టు చేసి, వారిచ్చిన టిక్కెట్ అసలు
ప్రతి తీసుకున్నాం. దాని మీదే మా కోచ్ నబరు వేసి ఇచ్చారు. ఎ.సి కోచ్. 18 సీటర్ బస్.
ఐతే, 17 మంది మాత్రమే అయ్యేము.
మా సహ ప్రయాణికుల గురించి ఇక్కడ కొంత చెబుతాను. పాట్నా నుండి వచ్చిన బీహారీ కుటుంబ
సభ్యులు  3 జంటలూ, బొంబాయి నుండి వచ్చిన వొక జంట, వారి అమ్మాయి,కలకత్తా నుండి
బెంగాళీ దపతులు, ఢిల్లీ నుండి వొకామె, హైదరాబాదు నుండి అయ్యగారి మురళీ కృష్ణ, వారి శ్రీమతి రాధ
మరదలు విజయ లక్ష్మి ఉన్నారు. మాతో పాటు వొక తెలుగు కుటుంబం, మా సమ వయస్కులయిన వారు
ఉండడంతో చాలా సంతోషించేము. బస్ లో కూడా మా ముందు సీట్లే వారి వి కావడంతో  కబుర్లు
చెప్పుకుంటూ  కలసి పోయి మొత్తం టూర్ అంతా అందరం బాగా ఎంజాయ్ చేసాం.
(యాత్ర ముగిసేక, చివరి రోజు కూడా రైల్వే స్టేషన్ వరకూ మేమూ, మురళీ కృష్ణ గారి కుటుంబమూ,
బొంబాయి నుండి వచ్చిన దంపతులూ, వారి కుమార్తె ప్రియాంక అందరం కలిసే తిరిగేం. ఆరోజు
మా ట్రయిన్లు రాత్రి పదీ, పన్నెండు  గంటల మధ్య ఉండడంతో  మేమంతా మద్రాసులో ఎగ్జిబిషన్,
 మెరీనా బీచ్ లు తిరిగి వచ్చేము.  బాగా కాక్షేపం అయింది.ఆ విశేషాలు చివర్లో రాస్తాను.)

సరిగ్గా ఉదయం 7.30కి మా బస్ వచ్చింది. సామాన్లు డిక్కీలో పెట్టించి అందరం బస్ ఎక్కాం.
భాషలు వేరయినా, వొకరి నొకరు నవ్వుతూ పలకరించుకుని సీట్లలో కూచున్నాం. మాగైడ్ గణేశ్ తన
 గురించి పరిచయం చేసుకుని , డ్రైవరునీ, అతని సహాయకునీ మాకు పరిచయం చేసాడు.
మమ్మల్ని అందరినీ  పరిచయం చేసుకున్నాక 7.45 ని.లకి మా తమిళ నాడు యాత్ర మొదలయింది.
బస్ బయలు దేరింది. మొదటి రోజు యాత్రా విశేషాలు యిప్పటికి సశేషమ్!