చమత్కార పద్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చమత్కార పద్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, మార్చి 2012, బుధవారం

ఓ చమత్కార పద్యంలో కొన్ని చిక్కు ప్రశ్నలు ...


ఒక చక్కని చమత్కార పద్యం చూడండి :

ఆద్యంత మధ్య మాంతాది వర్ణంబులఁ
దేఁటి రక్కసిరాజు తెలియఁ దల్లి

ఆద్యంత మధ్య మాంతాది వర్ణంబులఁ
శివునిల్లు వరిచేను క్షీరధార

ఆద్యంత మధ్య మాంతాది వర్ణంబులఁ
భార్యయు ఖడ్గంబు పాదపంబు

ఆద్యంత మధ్య మాంతాది వర్ణంబులఁ
మార్వనె్న యీటె ధూమంబు దనరు

అన్నిటికిఁజూడ మూఁడేసి యక్షరములు
మొదలు తుదలును నడి తుది మొదలు నడుము
ప్రాణ రక్షను, లతలను పాదపముల
బరికరము లంద యీ పదాలమర వలయు !

ముందుగా కవి సంధిస్తున్న ప్రశ్న లేమిటో తెలుసు కుందామా ?

కవి ఇందులో మొత్తం నాలుగు ప్రశ్నలు వేస్తున్నాడు. వాటికి అన్నింటికీ జవాబులు మూడేసి అక్షరాలలో ఉంటాయి.

ఒకటి, మూడు అక్షరాలలో మొదటి దానికీ,
రెండు, మూడు అక్షరాలలో రెండవ దానికీ,
ఒకటి, రెండు అక్షరాలలో మూడవ దానికీ జవాబులు ఉండాలి.

మొదలు, తుది - నడి, తుది - తుది, మొదలు అక్షరాలను కలిపితే వరుసగా జవాబులు వస్తాయన్నమాట !

మొదటి దానికి వరుసగా తుమ్మెద. రాక్షస రాజు, అమ్మ అనే అర్ధాలు రావాలి.

రెండో దానికి వరుసగా శివ సదనం, వరి చేను, పాల ధార అనే అర్ధాలు రావాలి.

మూడో దానికి వరుసగా భార్య, కత్తి, ఒక చెట్టు అనే అర్ధాలు రావాలి.

నాలుగో దానికి వరుసగా మచ్చ, ఈటె, ధూమం అనే అర్ధాలు రావాలి.

మరింకా, జవాబులన్నీ లతలు, చెట్లు, పరికరాలు, మనుషులు మొదలయిన అర్ధాలు కలిగి ఉండాలని కొస మెఱుపుగా ఒక కండిషన్ కూడా కవిగారు పెట్టారండోయ్ !

ఇక జవాబులు చూడండి :

1. అంబలి - అలి ( తుమ్మెద) , బలి ( బలి చక్రవర్తి), అంబ ( తల్లి)

2. గుమ్మ డి - గుడి ( శివ సదనం) , మడి (వరిచేలు) , గుమ్మ ( గుమ్మ పాలు)

3. ఆవాలు - ఆలు (భార్య), వాలు (కత్తి), ఆవ ( ఒక దినుసు చెట్టు)

4. పొగడ - పొడ ( మచ్చ), గడ (ఈటె) , పొగ (ధూమం)


ఇదండీ సంగతి. ఇలాంటి తమాషాలు చెయ్యడం మన కవులకు కరతలామలకం.

ఈ పద్యం మీకు లోగడ తెలిసిందేనా ? పోనిద్దురూ , మరో సారి గుర్తు తెచ్చుకుంటే ఏం పోయింది !

19, జూన్ 2011, ఆదివారం

నీకంత సీన్ లేదు !!

‘‘ తాడిని తన్నే వాడు ఒకడుంటే, వాడి తల తన్నే వాడు వేరొకడు ఉంటాడు’’ అనే సామెత తెలిసినదే కదా !

అందుచేత, ఏదో సాధించేసాం అను కోవడం , విర్రవీగి పోవడం సరికాదు. ఎంత ఎదిగినా , కొంత ఒదిగి ఉండడం మంచిది. లేక పోతే ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అని దులపరించి పారేసే ప్రమాదం ఉంది.

ఈ చాటు పద్యాలు నాలుగూ చూడండి:


ఱంతుల్ మానుము కుక్కుటాధమ ! దరిద్ర క్షుద్ర శూద్రాంగణ
ప్రాంతో టాఖల మూల తండుల కణ గ్రాసంబు చే గ్రొవ్వి దు
దర్దాంతాభీల విశేష భీషణ ఫణాంతర్మాంసన సంతోషిత
స్వాంతుండైన ఖగేంద్రుని కట్టెదుట నీ జంఝాటముల్ సాగునే ?

ఈ పద్యం పెద్దన గారిదిగా ప్రసిద్ధం. కాగా, ఈ పద్యం శ్రీనాథునిదిగా కూచిమంచి తిమ్మకవి తన లక్షణసారసంగ్రహంలో పేర్కొన్నాడు.

ఓ అధమ కుక్కుటమా ! నీ తైతక్కలు ఇక చాల్లే ...దరిద్రగొట్టు తావుల్లో, చెత్తల్లో, పెంట కుప్పల్లో ఎంగిలి మెతుకులు ఏరుకుని తింటూ బలిసిన నువ్వెక్కడ ? కేవలం భీకరమయిన సర్పాల పడగలోని మాంసాన్ని తిని తృప్తి పడే ఖగరాజు ఎదుట నీ మిడిసిపాటు చెల్లదులే !


మరో పద్యం చూడండి:


స్థాన విశేషమాత్రమున తామరపాకున నీటి బొట్ట ! నిన్
బూనిక మౌక్తికంబనుచుఁ బోల్చిన మాత్రనె యింత గర్వమా !
మానవతీ శిరోమణుల మాలికలయందును గూర్ప వత్తువో ?
కానుకలియ్య వత్తువో, వికాసము నిత్తువొ , విల్వ దెత్తువో ?!

ఈ పద్యం ముక్కు తిమ్మన గారిదని చెబుతారు.

స్థాన విశేష మాత్రం చేత మాత్రమే కొందరకి, లేదా కొన్నింటికి గొప్పతనం చేకూరుతూ ఉంటుంది. తామరపాకు మీద నీటి బొట్టు ముత్యంలా మెరిసి పోతూ ఉంటుంది. అంత మాత్రం చేత అది మంచి ముత్యం ఎన్నటికీ కానేరదు కదా !
కవి అదే చెబుతున్నాడు : ఓ తామరపాకు మీద నీటి బొట్టూ ! నువ్వు తామరపాకు మీద నిలచి ఉండడం చేత నిన్ను ముత్యంతో పోలుస్తూ ఉంటారు. అది స్థానవిశేషం వల్ల వచ్చిన గొప్పతనం. అంత మాత్రం చేత నీకు ఇంత గర్వం తగదు సుమా ! నువ్వేమయినా లలనల శిరోరత్నాలలో కూర్చడానికి పనికి వస్తావా ? ఎవరికయినా కానుకగా ఇవ్వడానికి తగుదువా ? నీకు వికాసమూ లేదు, విలువా లేదు!

అంతే కదా, నీటి బొట్టు తామరపాకు మీద ఉన్నంత సేపే ముత్యంలా మెరిసి పోతూ ఉంటుంది. స్థానభ్రంశం చెందిందా, యిక దాని పని అంతే. వొట్టి నీటి బొట్టే. కదా.

మరో పద్యం చూడండి:తక్కక నేల ముట్టెగొని త్రవ్వగ నేర్తునటంచుఁదాకుతా
వొక్కటి జాతియందు మదమెక్కకు బుద్ధిని వెఱ్ఱిపంది ! నీ
వెక్కడ ! యాది ఘోణియన నెక్కడ ! యద్రి సముద్రదుర్గ భూ
ర్భాక్కు తలంబు నొక్క యరపంటినె మింటికినెత్త నేర్తువే ? !

ఓ వెఱ్ఱి వరాహమా ! నేలను ముట్టెతో త్రవ్వడంలో నాకు నేనే సాటి అంటూ గొప్పలు పోతూ గర్విస్తున్నావు.
నువ్వెక్కడ ? ఆదివరాహ మెక్కడ ? సముద్ర గర్భంలోని భూమిని ఒక కోరతో అవలీలగా ఆ తొలి కిటి మీదికి ఎత్తలేదూ ! ఆ ఆది వరాహం ముందు నువ్వెక్కడ, నీ ప్రతాపమెక్కడ !


ఈ పద్యం భట్టు మూర్తిదిగా చెబుతారు.

తమకు లేని పోని గొప్ప తనాన్ని ఆపాదించు కుంటూ. అహంకరించే అల్పులను అభిశంసిస్తూ కవులు చెప్పిన పద్యాలు చూసాం కదా.

సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని నిలదీస్తూ శ్రీనాథ కవి చెప్పిన ఒక చాటువు కూడా చూదాం. గమనిక: ఇక్కడ అల్పత్వమూ లేదు. అభిశంసనా లేదు. చమత్కారంగా కవి పరమ శివుని ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అంటున్నాడు. అంతే.


గరళము మ్రింగితి ననుచున్
పురహర ! గర్వింప బోకు, పో,పో,పో ! నీ
బిరుదింక గాన వచ్చెడి
మెఱసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ !

ఆ నాడు దేవాసురులు సముద్ర మధనం చేసేటప్పుడు ఉద్భవించిన విషాన్ని పరమశివుడు స్వీకరించాడు. లోకోపద్రవం నివారించాడు. అందుకే నీలకంఠుడిగా నామాంతరం పొందాడు.

ఓ పురహరా ! విషాన్ని మ్రింగాను కదా అని గర్విస్తున్నావు. చాలు . చాల్లే ! రేనాటి జొన్న మెతుకులు తిని చూడు నీ గొప్పతనమేమిటో తెలిసి వస్తుంది ! అని దీని భావం. రేనాటి జొన్న కూడు నోట పెట్టరానిదిగా ఉంటుందని కవి చమత్కారం.

ఇలాంటిదే శ్రీనాథుని మరో చాటువు చూడండి:


ఫుల్ల సరోజ నేత్ర ! యల పూతన చన్నుల చేదుద్రావి, నా
డల్ల, దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల ? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగ మ్రింగుము నీ పస కాననయ్యెడిన్ !

ఇది పలనాటి జొన్న కూడు గురించినది. కృష్ణా ! ఆనాడు రక్కసి పూతన విషపు చనుబ్రాలు త్రాగాననీ, అల్లప్పుడు విషాన్ని మ్రింగాననీ, గొప్పలు పోతున్నావు. చింతాకుతో కూడిన ఉడుకు బచ్చలి కూరను జొన్న కూటితో ఒక ముద్ద నోటిలో పెట్టుకో ! నీపస ఏమిటో తెలిసి పోతుంది.

ఇదీ, నీకంత సీన్ లేదు ! అని కుండ బద్దలు కొట్టిన పద్యాల కథ .

16, జూన్ 2011, గురువారం

ప్రియురాలు ఎంత కఠినం !


ప్రియురాలి సొగసు చూడ తరమా ? అపురూప లావణ్యవతి. ముగ్ధ మోహన రూపం. ఒప్పుల కుప్ప. ఒయ్యారి భామ.

లోకోత్తర సౌందర్యం. బాపూ బొమ్మ....

ప్రియుడు ప్రియురాలి సౌందర్యం చూసి పరవశించి పోయాడు. ‘నిన్ను చూడకుండాఒక్క క్షణం నేనుండ లేను ’ అనడాలూ, ‘నువ్వు నాకు లభించడం నా అదృష్టం’ అనడాలూ, ‘ దేవ కన్యలు కూడా నీ కాలి గోటికి సరిపోరు ’ అని పొగడడాలూ, ‘అచ్చం బాపూ బొమ్మలా ఉన్నావు సుమా !’’ అని మురిసిపోవడాలూ, సినిమాలూ, షికార్లూ, పార్కులూ, షాపింగులూ,రెండు స్గ్రాలతో ఒకే కొబ్బరి బొండమో, కూల్ డ్రింకో తాగడాలూ ... కను రెప్పలు బరువుగా వాలి పోవడాలూ, ఛాతీలు గర్వంతో పెరిగి పోవడాలూ , కలల విహారాలు చెయ్యడాలూ, బేంకు బేలన్సు తరిగి పోవడాలూ ...

అన్నీ అయ్యేక ప్రియుడుకి ప్రియురాలి అసలు స్వరూపం తెలిసి వచ్చింది. ఇలా వాపోతున్నాడు:

ఈ చాటు పద్యం చూడండి:

పల్లవము బూని సకియ మేనెల్ల జేసి
సద్మగర్భుడు లాదీసి వా గుడిచ్చి
మూ విసర్జించి యప్పుడప్పూవు బోడి
డెంద మొనరించె సందేహమందనేల ?

ఆ బ్రహ్మ దేవుడు ఈమె శరీరాన్ని లేత చిగురాకులతో తయారు చేసాడు. అందుకే అంత మృదుత్వం ! అంత సౌకుమార్యం !

అంత వరకూ బాగుంది. కానీ అక్కడే పాడు బ్రహ్మ దేవుడు పెద్ద కిరికిరీ చేసాడు ...

అదేమంటే ...

పల్లవము అనే పదంలో ‘‘ లా ’’ తీసేసాడు. దానితో ‘‘ ల్ల’’ అనే అక్షరం ఎగిరి పోయింది.

తర్వాత వా గుడిచ్చాడుట ! ‘‘ వ’’ కి గుడి ఇస్తే ‘‘ వి ’’ అయింది !

అక్కడితో ఊరుకోకుండా ‘‘ ము’’ అనే అక్షరాన్ని విడిచి పెట్టాడుట !

సరే, మరి ఇప్పుడు ఇన్ని తీసి వేతలూ, కలపడాలూ, జరిగేక, ‘‘ పల్లవము ’’ అనే పదంలో మిగిలినదేమిటీ ?!

‘‘ పవి’’ అనే పదం మిగిలింది ! ‘‘ పవి ’’అంటే ఇంద్రుని వజ్రాయుధం !

ప్రియురాలి తనువూ, మనసూ అంత కఠినం అన్నమాట !
28, ఏప్రిల్ 2011, గురువారం

వలువల విలువలు


ఈ చాటువు విన్నారా ?

చాకి వాని తోడ జగడాలు పడ లేక
సిరి గలాడు పట్టు చీర కట్టె
శివుడు తోలు గట్టె సీ !యని మది రోసి
భైరవుండు చీర పార వైచె.

ఇప్పటి లో లాగా అప్పుడు ధనవంతులకి కూడా బీరువాల నిండా ఇన్నేసి బట్టలుండేవా ఏమిటి ?
కట్టుకో గుడ్డా, విడుపుకో గుడ్డా అన్నట్టుగా ఉండేవి. చాకలి చలువ చేసి బట్టలు తేడానికి చాలా ఆలస్యం చేసే వాడు. దానితో జనం విసిగి పోయే వారు. మనుషులే కాదు, దేవతలు కూడానుట !

అందు చేత, చాకి వానితో తంటాలు పడ లేక సిరి గల వాడు (శ్రీ మహా విష్ణువు - లక్ష్మీ దేవి భర్త) ఇలా లాభం లేదని చెప్పి పట్టు చీర ధరించాడుట. ఆ రోజుల్లో మగ వారు ధరించిన వస్త్ర విశేషానికి కూడా చీర అనే వ్యవహారం ఉండేది. పట్టు బట్ట అయితే చాకలికి వేయ నక్కర లేదు. ఒక సారి దులిపి కట్టుకుంటే చాలును. ఇక, శివుడు తోలు ధరించేడు. గజ చర్మధారి కదా, శివుడు ?
ఇది మరీనూ, మన కాలపు జీను బట్టలాగా ఉతుకులే అక్కర లేదు. అంత వేగం చిరుగులు పడవు కూడా. మాసినా అదో ఫేషను. మరి కాల భైరవుడయితే ఛ ! ఛ! అని విసుక్కుని కట్టిన చీర కాస్త పార వేసి దిగంబరుడైనాడట !

ఎంతయినా, వలువలకు విలువ హెచ్చు కదా ? ఎంత ఖరీదయిన దుస్తులు ధరిస్తే అంత గౌరవం.

ఒక సారి కామన్ వెల్త్ రౌండ్ టేబిల్ సమావేశానికి మహాత్ముడు వెళ్ళ వలసి వచ్చి నప్పుడు ముందు తన అలవాటైన అంగ వస్త్రంతో వెళ్ళాడుట. అతని వాలకం చూసి, కాపలాదారులు లోనికి రానివ్వ లేదుట. సరే , మహాత్ముడు బ్రిటిష్ వారిలాగ కోటూ, బూటూ వేసుకుని వెళ్ళాడుట. ఈ సారి అతనికి రాచ మర్యాదలతో స్వాగతం లభించిందిట. లోనికి వెళ్ళాక, అక్కడ జరిగిన ఒక విందులో బాపూజీ పదాదార్ధాలను తినడం మానేసి తన కోటు మీద జల్లు కోవడం మొదలు పెట్టాడుట. దొరలు ఆ చర్యకి విస్తు పోయి కారణం ఆరా తీసారుట.

మహాత్ముడు నవ్వి, ఇక్కడ మనుషుల కన్నా బట్టలకే విలువ అనుకుంటాను. అందు వలన ఈ విందు నాకు గాక నా బట్టలకు ఇస్తున్నట్టుగా భావిస్తున్నాను. అందుకే విందు ఈ సూటు, కోటుకి పెడుతున్నాను అన్నాడుట.

దొరల ముఖాలు మాడి పోయాయని వేరే చెప్ప నక్కర లేదు కదా ? ఈ కథలో నిజమెంతో నాకయితే తెలియదు కానీ, వలువలకు ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వక పోవడ మనేది ఎప్పుడూ ఉన్నదే అన్నది మాత్రం పరమ సత్యం.

వలువల విలువల గురించిన మరో పద్యం చూడండి:

పీతాంబుని బిల్చి పిల్ల నిచ్చిన మామ
గజ చర్మ ధారికి గరళ మిచ్చె

దొర వేషమునకు విందు లొసంగు గేస్తు
చింపి గుడ్డల వాని సీత్కరించె

అద్దె గుడ్డల వాని కర్ధాసనంబిచ్చె
కౌపీన ధారిని కసిరి కొట్టె

జలతారు ముసుగున్న శిలను దైవమ్మనె
త్రోవ కడ్డ మైన తొలగ దన్నె

వలువలను బట్టి లోకాన విలువ హెచ్చు
వలువలకు విలువ హెచ్చు నీ చేతి చలువ వలన
అట్టి నీ చేతి చలువ మహత్య మెఱుగు
ఘనులకు గద నేడు సత్కార సభలు !

పట్టు పీతాంబరాలు కట్టిన శ్రీ మహా విష్ణువుకు సిరి దేవి ఇల్లాలుగా లభించింది. తోలు బట్ట కట్టిన శివుడికి అంతా కలిసి, తాగమని విషం ఇవ్వడం జరిగింది. దొర వేషంలో వస్తే విందులు, చింపిరి గుడ్డలతో వస్తే ఛీత్కారాలు. అద్దె గుడ్డలతో వస్తే అర్ధాసనం, గోచి ధరించి వస్తే కసుర్లు.
రాతి బొమ్మకు దేవుడని చెప్పి జలతారు మేలి ముసుగులు వేయడం,త్రోవకి అడ్డంగా ఉందని మామూలు బండ రాయిని తొలగదన్నడం.

లోకంలో బట్టలను బట్టి కదా మనుషులకు విలువ ! అట్టి బట్టలను చలువ చేసే మడివేలు వల్ల ఆ వలువలకు విలువ ఎక్కువ అవుతోంది. చక్కగా చలువ చేసిన బట్టలు ధరించిన వాడికే కదా సత్కార సభలు జరుగుతూ ఉన్నాయి ?
23, ఏప్రిల్ 2011, శనివారం

ఓసింతేనా?!


ఈ పద్యం చూడండి:

హరి కుమారుడై యొప్పునాతడు హరి
హరికి దక్షిణ నేత్రమౌ నాతడు హరి
హరికి శిరము తోడ వరలు నాతడు హరి
హరికి వామాక్షమౌ యొప్పునాతడు హరి

హరికి ( శ్రీ మహా విష్ణువునకు) కొడుకు హరి.

హరికి కుడి కన్ను హరి.

హరికి శిరస్సుతో ఒప్పువాడు హరి.

హరికి ఎడమ కన్ను హరి.

ఏమిటో అంతా గోలగా ఉంది. కదూ. అబ్బే మరేమీ లేదు.


హరి అనే పదానికి విష్ణువు అనే అర్ధమే కాక, కోతి, సూర్యుడు,సింహము, చంద్రుడు అనే యితర అర్ధాలు కూడా ఉన్నాయి. వీటినే నానార్ధాలు అంటారు. వాటి సాయంతో ఇప్పుడు పద్యానికి అర్ధం చూడండి:

ఇప్పుడు చూడండి:

మొదటి పాదంలో తొలి పదం హరికి సూర్యుడు అనీ, పాదం చివర గల హరి అనే పదానికి కోతి అనీ అర్ధం చెప్పుకోవాలి.


ఇప్పుడా పాదానికి హరి కొడుకు హరి. అంటే, సూర్యుని కొడుకు కోతి ( సుగ్రీవుడు ) అనే అర్ధం వస్తుంది. సుగ్రీవుడు సూర్య తనయుడే కదా.

రెండవ పాదం. హరి కుడి కన్ను హరిట. ఈ పాదంలో చివర గల హరి అనే పదానికి సూర్యుడు అని అర్ధం చెప్పాలి.

ఇప్పుడా పాదానికి శ్రీహరికి కుడి కన్ను సూర్యుడు అని అర్ధం వస్తుంది. నిజమే కదా.

మూడవ పాదం లో చివర గల హరి శబ్దానికి సింహం అని అర్ధం చెప్పాలి.

ఇప్పుడా పాదానికి హరికి తలతో ఒప్పు వాడు సింహం అని అర్ధం వస్తుంది.


సింహం తలతో తిరిగే వాడు. నరసింహావతారం. హరి నారసింహుడు అని అర్ధం వస్తుంది.

నాలుగవ పాదంలో చివర గల హరి అనే పదానికి చంద్రుడు అని చెప్పుకోండి.

ఇప్పుడా పాదానికి హరికి ఎడమ కన్ను చంద్రుడు అని అర్ధం సిద్ధిస్తుంది. నిజమే కదా.

అబ్బచ్చా, యిదా అర్ధం ! అనుకుంటున్నారా? ఇలాంటి తమాషాలు మన కవులు చాలా చేసారండోయ్.

స్వస్తి.20, ఏప్రిల్ 2011, బుధవారం

ముఖే ముఖే సరస్వతీ ...


ఒక చక్కని దత్తపదిని చూదామా?

పృచ్ఛకుడు అవధానిగారిని పాలు, పెరుగు,నేయి, నూనె అనే పదాలను ఇచ్చి, భారతార్ధంలో పద్యం చెప్పమని కోరాడు.

అవధానిగారి పూరణ చూడండి:

పాలు పంచడు రారాజు పాండవులకు
పెరుగుచున్నది వానిలో దురితము గన
నే యిలను గల్గ దిట్టి యహితము వాని
నూనె మూర్ఖత తప్పదు యుద్ధమింక !

పృచ్ఛకుడు కోరిన నాలుగు పదాలూ పద్యం నాలుగు చరణాలలో మొదటి పదాలుగానే వచ్చేయి కదా?

ఇక భావం చూడండి:

రారాజు ( దుర్యోధనుడు) పాండవులకు పాలు పంచడు. రాజ్య భాగం ఇవ్వడు. ఐదూళ్ళు కాదు కదా, సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వనని తెగేసి చెప్పనే చెప్పాడు కదా?

వానిలో ( ఆ దుర్యోధననునిలో) దురితము నానాటికీ పెరుగుతోంది. దుర్మార్గం ఎక్కువవుతోంది.

ఇలాంటి అహితము ( చెడ్డ నడవడిక) లోకంలో ఎక్కడయినా చూసామా ? (కన నేయిలను?) లేదు కదా !

వానిన్ (మూర్ఖత) ఊనెన్ = వానినూనె మూర్ఖత = వాడిని మూర్ఖత్వం పట్టుకుంది. ఒట్టి మూర్ఖపు ముండాకొడుకయ్యేడు.

యుద్ధం ఇంక తప్పదు

పాలు, పెరుగు, నేయి నూనె అనే పదాలను అవధాని గారు దుర్యోధనుడు పాండవులకు రాజ్యం పాలు పంచడు అనీ,

వాడిలో నానాటికీ అహంకారం పెరుగు తోందనీ,

ఎక్కడయినా ఇలాంటి దుశ్చేష్టితం లోకంలో చూసామా (కన నేయిలన్) అనీ,

ఆ దుర్యోధనుడి మనసులో మూర్ఖత్వం చోటు చేసుకుందనీ (వాని నూనె మూర్ఖత) అనీ

అందు వలన కురు పాండవ సంగ్రామం తప్పదనీ ఎంత చక్కని పద్యం చెప్పాడో చూసారా?స్వస్తి.

17, జనవరి 2010, ఆదివారం

గంజాయి మీద పద్యం ...


కాశీ కృష్ణమాచార్యులు గంజాయి మీద చెప్పిన సీస పద్యం ...

తన్నుఁబట్టిన వారిఁదాఁబట్టి నవ్వించు
పచ్చి
బోగము లంజ పాడు గంజ
తనుఁద్రావు వారి నందరి నటేశులఁజేసి
యాడింపఁగల
లంజ పాడు గంజ
తుది మొదల్లేని యున్మదపు పల్కుల పంట
పండ
బారిన గింజ సాడు గంజ
పలు తావులకుఁబారు బైరాగులను మంద
పసుల గట్టెడు గుంజ పాడు గంజ

త్రావు వారికి గుడ గుడ ధ్వనులఁదనదు
జాడ సూచింప గల రుంజ పాడు గంజ
తప్పద్రావిన వారల తలల మిత్తి
పాదు కొల్పిన కుడియంజ పాడు గంజ !!

గంజాయి ప్రభావం ఎలాంటిదో చూడండి ...అది సేవిస్తే ఒకటే నవ్వడం ! నవ్వే నవ్వు ! పిచ్చి నవ్వు !!
ఇక వారి తైతక్కలకి అంతే ఉండదు.
పిచ్చి వాగుడు వాగుతూనే ఉంటారు.
బైరాగులయితే, ఒక చోట చేరి గంజాయి దమ్ము సేవిస్తూ గడుపుతూ ఉంటారు. గుడ గుడ ధ్వనులతో తనని పట్టిచ్చేపాడు గంజాయి సేవించడం దేనికి ? ప్రాణం మీదకి తెచ్చు కోవడం దేనికి ?!

31, డిసెంబర్ 2009, గురువారం

శ్లోకానికి పేరడీ !

మన కవులు శ్లోకాలలో, పద్యాలలో అన్య భాషా పద విన్యాసాలతోచాలా తమాషాలు చేసారు. నేను సేకరించిన వాటిలో కొన్నింటినిఇక్కడ ఉంచుతున్నాను.
ముందుగా మూల శ్లోకాన్ని చూదాం ...
క్షుధాతురాణాం నరుచిర్న పక్వ:
అర్ధాతురాణాం నగురుర్నబంధు:
నిద్రాతురాణాం సుఖం శయ్యా
కామాతురాణాం నభయం లజ్జా

దీనికి మరొ కవి గారి పేరడీ చూడండి ...

క్షుధాతురాణాం నవుడికర్నవుడక:
అర్ధాతురాణాం చెల్లిర్న చెల్లక:
నిద్రాతురాణాం మెట్టర్నపల్లం
కామాతురాణాం నముసిలిర్న పిల్ల:

అలాగే, ఒక కవి గారు తన దరిద్రాన్ని గురించి వాపోతూ ...

తిండికైతే పదిమంది వసంతి
తండులాలు గృహమందు నసంతి
కుండ బొచ్చెలు పరం విలసంతి
రండ నా కొడుకులెల్ల హసంతి.
ఇందులో అశ్లీల పదం బాధాకరమే, అయినా, దరిద్రం అలా కవి చేత అనిపించింది కాబోలు.

పెద్ది భట్టు మురికి బట్టలు వేసుకుని రాజదర్శనానికి వెళ్తూ తన పాండిత్యమే తనకి తోడు అని చెప్పినది ...

కిం వాససా చీకిరి బాకిరేణ?
కిం దారుణా వంకరటింకరేణ?

దీనికి పెద్ది భట్టు సమాధానం ...

శ్రీసింగభూపాల విలోకనార్ధం
వైదుష్యమేకం విదుషా సహాయ:కవులు నిరంకుశులు కదా? గొప్ప ఆత్మాభిమానధనులు కూడ...
‘‘ రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయంబు ..... ’’ అనినా, ‘‘ కావ్య కన్యకన్ కూళులకిచ్చి యప్పడుపు కూడు ....‘‘ తిననొల్లనని ఖండితంగా చెప్ప గలిగినా వారికే చెల్లింది. ‘‘ యుగం నాది ’’ అని సగర్వంగా ప్రకటించుకో గల ధీమంతులుకూడ వారే కదా !

కాఫీ పురాణం

కాఫీ గురించిన ఈ పద్యం చూడండి ...

తరుణుల మోవి పానకము త్రాగక పోయిన నేమి గాక, యా
సురపతి వీటియందు సుధ జుర్రక పోయిన నేమిగాక, యా
కరుణ గభస్తి బింబ ముదయాచలమెక్కక మున్నె వెచ్చనై
గరగరలాడు కాఫి యొక కప్పిదిగోనని అయ్యరిచ్చినన్ !

30, డిసెంబర్ 2009, బుధవారం

సరదా సరదా సిగరెట్టు ...
సిగరెట్లు త్రాగడం మానెయ్యడం చాలా సులభం ! నేను చాలా పర్యాయాలు మానేసాను ! ఇది ఆంగ్ల మేధావి చతురోక్తిసరే, అదలా ఉంచి మన వాళ్ళు పొగాకు గురించీ, ధూమ పానం గురించీ పద్యాలలో ఏం చెప్పారో చూదాం ... ...

ఖగపతి యమృతము తేగా
భుగ భుగమని పొంగి చుక్క భూమిని పడగా
పొగ చెట్టై జన్మించెను
పొగ తాగని వాడు దున్న పోతై పుట్టున్ !

ఇతి గిరీశమ్ ఉవాచ. బృహన్నారదీయం నాలుగో ఆశ్వాశంలో ఉంది, వెతుక్కోండి ...

ఇక మరో చక్కని పద్యం ...
భుగ భుగమని పొగలెగయగ
నగణితముగ నాజ్యధారలాహుతి కాగా
నిగమాది మంత్రయుతముగ
పొగతాగని వాడు దున్న పోతై పుట్టున్ !


ఓరి! వీడి అసాధ్యం కూలా ! ... మహా మునులు యాగం చేస్తూ వ్రేల్చిన ఆజ్య ధారలు పొగలై మీదికెగసివర్షుకాభ్రుములవుతున్నాయా !
ఋణానందలహరిలో ముళ్ళ పూడి వారి ఋణ సిద్ధాంతం గుర్తుకొస్తోందా ?

పరే, మరో కవి గారి పద్యాన్ని కూడా చూదాం ... ఇది మాత్రం ధూమపాన దురలవాటుని ఖండిస్తూ చెప్పినదేనండోయ్!

పదపడి ధూమపానమున ప్రాప్తము తా నొనగూడు చేటులున్
మొదలు ధనంబు వోవుట, నపుంసకుడౌట, విదాహమౌటయున్
వెదకుచు జాతి హీనులను వేడుట, తిక్కట చొక్కుటల్, రుచుల్
వదలుట, కంపుగొట్టుట, కళల్ తొలగించుట, రిమ్మ పట్టుటల్
పెదవులు నల్లనై చెడుట, పెద్దకు లొంగుట,బట్ట కాలుటల్ !!


డబ్బు పోతుంది, నీరసం కమ్ముకొస్తుంది, దాహం వేస్తుంది, పిగరెట్ ముక్క కోసం ప్రతీ అడ్డ గాడిదనీ అడుక్కో వలసివస్తుంది, కలవరపాటు కలుగుతుంది, నాలుక్కి రుచీపచీ తెలియదు, నోరూ ఊరూ కంపు కొడుతూ ఉంటుంది, ప్రేత కళముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది, రిమ్మ పడుతుంది, పెదవులు నల్లగా వికారంగా తయారవుతాయిఆత్మన్యూనతాభావం ఎక్కువవుతుంది, ఏమరు పాటు వల్ల బట్ట కూడా కాలుతుంది ...
ఇన్ని అనర్ధాలున్న కంపు సిగరెట్టు తాగక పోతేనేం?
శ్రీ.శ్రీ గారు సిగెరెట్ మీద పాట రాస్తూ ...‘‘ సరదా సరదా సిగరెట్టూ ...కంపు గొట్టు సిగరెట్టూ ...’’ అంటూ చివర్లో దీన్నికాల్చకోయి నాపై ఒట్టూ ! అన లేదూ?
స్మోకింగ్ కిల్ల్స్