28, ఏప్రిల్ 2011, గురువారం

వలువల విలువలు


ఈ చాటువు విన్నారా ?

చాకి వాని తోడ జగడాలు పడ లేక
సిరి గలాడు పట్టు చీర కట్టె
శివుడు తోలు గట్టె సీ !యని మది రోసి
భైరవుండు చీర పార వైచె.

ఇప్పటి లో లాగా అప్పుడు ధనవంతులకి కూడా బీరువాల నిండా ఇన్నేసి బట్టలుండేవా ఏమిటి ?
కట్టుకో గుడ్డా, విడుపుకో గుడ్డా అన్నట్టుగా ఉండేవి. చాకలి చలువ చేసి బట్టలు తేడానికి చాలా ఆలస్యం చేసే వాడు. దానితో జనం విసిగి పోయే వారు. మనుషులే కాదు, దేవతలు కూడానుట !

అందు చేత, చాకి వానితో తంటాలు పడ లేక సిరి గల వాడు (శ్రీ మహా విష్ణువు - లక్ష్మీ దేవి భర్త) ఇలా లాభం లేదని చెప్పి పట్టు చీర ధరించాడుట. ఆ రోజుల్లో మగ వారు ధరించిన వస్త్ర విశేషానికి కూడా చీర అనే వ్యవహారం ఉండేది. పట్టు బట్ట అయితే చాకలికి వేయ నక్కర లేదు. ఒక సారి దులిపి కట్టుకుంటే చాలును. ఇక, శివుడు తోలు ధరించేడు. గజ చర్మధారి కదా, శివుడు ?
ఇది మరీనూ, మన కాలపు జీను బట్టలాగా ఉతుకులే అక్కర లేదు. అంత వేగం చిరుగులు పడవు కూడా. మాసినా అదో ఫేషను. మరి కాల భైరవుడయితే ఛ ! ఛ! అని విసుక్కుని కట్టిన చీర కాస్త పార వేసి దిగంబరుడైనాడట !

ఎంతయినా, వలువలకు విలువ హెచ్చు కదా ? ఎంత ఖరీదయిన దుస్తులు ధరిస్తే అంత గౌరవం.

ఒక సారి కామన్ వెల్త్ రౌండ్ టేబిల్ సమావేశానికి మహాత్ముడు వెళ్ళ వలసి వచ్చి నప్పుడు ముందు తన అలవాటైన అంగ వస్త్రంతో వెళ్ళాడుట. అతని వాలకం చూసి, కాపలాదారులు లోనికి రానివ్వ లేదుట. సరే , మహాత్ముడు బ్రిటిష్ వారిలాగ కోటూ, బూటూ వేసుకుని వెళ్ళాడుట. ఈ సారి అతనికి రాచ మర్యాదలతో స్వాగతం లభించిందిట. లోనికి వెళ్ళాక, అక్కడ జరిగిన ఒక విందులో బాపూజీ పదాదార్ధాలను తినడం మానేసి తన కోటు మీద జల్లు కోవడం మొదలు పెట్టాడుట. దొరలు ఆ చర్యకి విస్తు పోయి కారణం ఆరా తీసారుట.

మహాత్ముడు నవ్వి, ఇక్కడ మనుషుల కన్నా బట్టలకే విలువ అనుకుంటాను. అందు వలన ఈ విందు నాకు గాక నా బట్టలకు ఇస్తున్నట్టుగా భావిస్తున్నాను. అందుకే విందు ఈ సూటు, కోటుకి పెడుతున్నాను అన్నాడుట.

దొరల ముఖాలు మాడి పోయాయని వేరే చెప్ప నక్కర లేదు కదా ? ఈ కథలో నిజమెంతో నాకయితే తెలియదు కానీ, వలువలకు ఇచ్చే విలువ మనుషులకు ఇవ్వక పోవడ మనేది ఎప్పుడూ ఉన్నదే అన్నది మాత్రం పరమ సత్యం.

వలువల విలువల గురించిన మరో పద్యం చూడండి:

పీతాంబుని బిల్చి పిల్ల నిచ్చిన మామ
గజ చర్మ ధారికి గరళ మిచ్చె

దొర వేషమునకు విందు లొసంగు గేస్తు
చింపి గుడ్డల వాని సీత్కరించె

అద్దె గుడ్డల వాని కర్ధాసనంబిచ్చె
కౌపీన ధారిని కసిరి కొట్టె

జలతారు ముసుగున్న శిలను దైవమ్మనె
త్రోవ కడ్డ మైన తొలగ దన్నె

వలువలను బట్టి లోకాన విలువ హెచ్చు
వలువలకు విలువ హెచ్చు నీ చేతి చలువ వలన
అట్టి నీ చేతి చలువ మహత్య మెఱుగు
ఘనులకు గద నేడు సత్కార సభలు !

పట్టు పీతాంబరాలు కట్టిన శ్రీ మహా విష్ణువుకు సిరి దేవి ఇల్లాలుగా లభించింది. తోలు బట్ట కట్టిన శివుడికి అంతా కలిసి, తాగమని విషం ఇవ్వడం జరిగింది. దొర వేషంలో వస్తే విందులు, చింపిరి గుడ్డలతో వస్తే ఛీత్కారాలు. అద్దె గుడ్డలతో వస్తే అర్ధాసనం, గోచి ధరించి వస్తే కసుర్లు.
రాతి బొమ్మకు దేవుడని చెప్పి జలతారు మేలి ముసుగులు వేయడం,త్రోవకి అడ్డంగా ఉందని మామూలు బండ రాయిని తొలగదన్నడం.

లోకంలో బట్టలను బట్టి కదా మనుషులకు విలువ ! అట్టి బట్టలను చలువ చేసే మడివేలు వల్ల ఆ వలువలకు విలువ ఎక్కువ అవుతోంది. చక్కగా చలువ చేసిన బట్టలు ధరించిన వాడికే కదా సత్కార సభలు జరుగుతూ ఉన్నాయి ?