తీపి గుర్తులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తీపి గుర్తులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, జులై 2015, బుధవారం

చిన్ని పుస్తకం ... పెద్ద మనసు ...చిన్ని పుస్తకం ... పెద్ద మనసు ...
నా పుస్తకాల గూటి లోకి, గువ్వ పిట్టలాగ ఒక చిన్న పుస్తకం వచ్చి చేరింది. పుస్తకం పేరు కామమ్మ కథ. వెల పన్నెండణాలు. రచయిత ఎవరో ఎక్కడా లేదు. చుక్కల సింగయ్య శెట్టి, యన్.వి.గోపాల్ అండ్ కో, మదరాసు వారి ప్రచురణ.
ముందుగా ఈ పుస్తకం నాకు దొరికిన వైనం చెబుతాను.
విజయ నగరం జిల్లా పార్వతీ పురం మా స్వగ్రామం. నేను పుట్టింది అక్కడే. హెచ్.స్. ఎల్.సీ వరకూ నా చదువు అక్కడే.
ఆ రోజులలో ఏ పుస్తకం కంట బడినా ఆత్రంగా చదివే వాడిని. ఇంటికి రెండు వార పత్రికలూ, ఒక మాస పత్రికా వచ్చేవి. ఊళ్ళో ఒక మనిసిపల్ లైబ్రరీ, మరో శాఖా గ్రంథాలయం ఉండేవి.
నా పుస్తక దాహార్తి అక్కడే తీరేది. ఇక మా చిన్న ఊళ్ళో రాధా గోవింద పాఢి గారని ఒక ఒరియా వ్యక్తి ఉండే వారు. తెలుగు మాట్లాడడం వచ్చు. కూడ బలుకుకుని చదివే వారేమో కూడా. రాయడం వచ్చేది కాదను కుంటాను. వారికి ఒక ఫొటో స్టూడియో ఉండేది. ఆ పనులతో తెగ బిజీగా ఉండే వారు. దానితో పాటు ఆయన ఆ రోజులలో వచ్చే అన్ని దిన, వార , పక్ష, మాస పత్రికలు అన్నింటికీ కూడా ఏజెంటుగా ఉండే వారు. మెయిన్ రోడ్డులో వారి ఫొటో స్టూడియో కమ్ పుస్తకాల షాపు నన్ను అమితంగా ఆకట్టు కునేది. ఎక్కవ గంటలు అక్కడే గడిపే వాడిని. వారు మా కుటుంబ మిత్రులు కూడానూ. పేపర్లూ, పీరియాడికల్స్ తో పాటు ఆయన ఎన్నెన్నో మంచి పుస్తకాలు కూడా అమ్మకానికి తెప్పించే వారు. జిల్లా వ్యాప్తంగా ఉండే పాఠశాలలకీ, ఆఫీసు లైబ్రరీలకీ వాటిని విక్రయించే వారు. మంచి పుస్తకాలు తెప్పించడం కోసం వారు ఒక పద్ధతి అవలంబించే వారు. పుస్తకాల ఏజెంటుగా వారికి ఎందరో రచయితలతోనూ, ప్రముఖ సంపాదకులతోనూ మంచి పరిచయాలు ఉండేవి. వారి షాపులోనే నేను చాలా మంది గొప్ప రచయితలను చూసేను. విద్వాన్ విశ్వం, రాంషా వంటి సంపాదకులనూ చూసేను. సోమ సుదర్ గారిని కూడా అక్కడే చూసినట్టు గుర్తు. పాఢి గారు ఆయా రచయితలనూ, సంపాదకులనూ కలిసినప్పుడు తెలుగులో ఏవి మంచి పుస్తకాలంటూ కేటలాగులు ఇచ్చి మరీ వారినుండి వివరాలు సేకరించే వారు. ఆ క్రమంలో నేను కూడా నాకు తోచిన గొప్ప పుస్తకాల గురించి చెప్పే వాడిని. ఈ విధంగా తనకు తెలుగు సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం లేక పోయినా అమ్మకం కోసం ఎన్నో గొప్ప పుస్తకాలను తెప్పించే వారు. చెంఘిజ్ ఖాన్, అతడు  ఆమె, నేరము శిక్ష , పెంకుటిల్లు, సమగ్రాంధ్ర సాహిత్యం సంపుటాలు, లత , రావి శాస్త్రి, ముళ్ళపూడి, బీనాదేవి, గోపీచంద్, తిలక్, శ్రీ.శ్రీ, మధురాంతకం రాజారాం, మొదలయిన గొప్ప గొప్ప రచయితల రచనలు తెప్పించే వారు. అనువాద సాహిత్యమయితే లెక్కే లేదు.శరత్ సాహిత్యమంతా ఉండేది.
ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే, వారి షాపుకి వచ్చే వార, మాస పక్ష పత్రికలన్నీ ఇలా బంగీ రాగానే ఒక కాపీ నాకు చదువుకోమని ఇచ్చే వారు. విజయ,నీలిమ , యువ, జ్యోతి వంటి మాస పత్రికలు, ఆంధ్ర పత్రిక, ప్రభ వంటి వార పత్రికలు షాపుకి రాగానే అమ్మకానికంటె ముందుగా నాకు ఇచ్చేసే వారు. ఏ రోజయినా, నేను షాపుకి వెళ్ళక పోతే, ఆ రోజు వచ్చిన కొత్త పత్రకలను మా ఇంటికి పంపించి వేసే వారు. వీటితో పాటు, అమ్మకానికి వచ్చిన నవలలు, కథా సంపుటాలు, సాహిత్య గ్రంథాలు అన్నింటి ప్రతులు ఒక్కొక్కటి చొప్పున నాకు చదువుకోడానికి అంద చేసే వారు. వీలయినంత వేగిరం, అంటే, తిరిగి ఆయా పుస్తకాలను అమ్ముకునేందుకు వీలుగా ఇచ్చి వేసే నియమం పెట్టే వారు. అలాగే మరో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, ఏ పుస్తకమూ నలగ కూడదు. చిరగ కూడదు.
ఈ నిబంధన కూడా చాలా సున్నితంగా చెప్పే వారు. నేనెక్కడ నొచ్చు కుంటానో అని తెగ బాధ పడి పోయే వారు కూడా.
హైస్కూలు చదువు చదువుకుంటూ, పైసా సంపాదన లేని నా బోటి వాడికి ఆ రోజుల్లో అన్ని పత్రికలు, విలువైన పుస్తకాలు, గొప్ప సాహిత్య గ్రంథాలు అన్నీ కేవలం ఉచితంగా చదివే వీలు కలగడం నా అదృష్టం కాక మరేమిటి చెప్పండి ?
నా పుస్తక దాహార్తిని తీరుస్తూ, నేనొక రచయితగా ఎదిగే క్రమంలో ఎంతగానో దోహద పడి, చేయూత నందించిన ఆ దయామయుని రుణం ఎలా తీర్చు కోగలను ?
ఇంతకీ ఈ కామమ్మ కథ అనే పుస్తకం నాకు ఎలా వచ్చి చేరిందో ఇంకా చెప్పనే లేదు కదూ ?
సరే, అలాగ, నా హైస్కూలు చదువు పూర్తయి, తరువాత విజయ నగరంలో భాషా ప్రవీణ చదువు నాలుగేళ్ళూ గడిచే వరకూ వారి దయ వల్ల అసంఖ్యాకంగా పుస్తకాలు ఉచితంగా చదివేను. చదువు ముగిసి, తెలుగు పండితునిగా ఓ చిరుద్యోగం లోకి ప్రవేశించాక కూడా మీరు ఊహించ లేనంత కమీషను డిస్కవుంట్ పొందుతూ వారి నుండి ఎన్నో చాలా మంచి పుస్తకాలు కొనుక్కున్నాను. చాలా వరకూ అరువు. నెలల తరబడి ఆ వాయిదాలు కడుతూ ఉండే వాడిని. నేనంటే వారికి ఎంత అభిమానమో. ఆ పుస్తకాలు చదివి నేను ఏదయినా పుస్తకం గురించి మెచ్చుకుంటూ పొగిడితే అతనూ పొంగి పోయే వారు. అప్పటి వారి చూపుల్లో అన్నం వడ్డించే అమ్మ కున్నంత ఆదరణ ఉండేది.
ఇంకా ఈ పుస్తకం నాకు ఎలా వచ్చి చేరిందో చెప్పనే లేదు కదూ.
మరింక విసిగించను లెండి. వారిచ్చిన ఉచిత పుస్తకాలతో నన్ను నేను ఉన్నతీకరించు కుంటూ ,ఇలా ఓ ముప్ఫయ్ ఏళ్ళు గడిచేక, నేను ఉద్యోగ రీత్యా మా ఊరికి దూరంగా ఉండి పోవలసి రావడం చేత వారిని ఒకటి రెండు సార్లు తప్ప మరి కలియడం జరుగ లేదు. వారి గురించిన వివరాలూ తెలియ రాలేదు.
ఉద్యోగ విరమణ చేసాక, మా అన్నగారితో పాటు మళ్ళీ మా ఊరు వెళ్ళాను. అప్పటికి అక్కడ మాకు ఇల్లూ, పొలాలూ అన్నీ చెల్లి పోయాయి. తెలిసిన వారు కూడా కొద్ది మందే మిగిలేరు. చాలా ఏళ్ళ అనతంరం మా ఊరు చూడాలనే కుతూహలంతో నేనూ మా అన్న గారూ అక్కడికి వెళ్ళాం.
మా పుస్తకాల మిత్రుడు రాధా గోవింద పాఢి గారిని చాలా సంవత్సరాల తరువాత చూడాలని వారింటికి వెళ్ళాం.
ఆయన లేవ లేని స్థితిలో మంచం మీద ఉన్నారు. మాట కూడా సరిగా రావడం లేదు. అప్పటికి పది, పదిహేను ఏళ్ళ క్రిందటే ఫొటో స్టూడియో, పుస్తకాల షాపూ మూసి వేసారుట. ఆయన బహు కుటంబీకుడు. ఆరుగురు కూతుళ్ళు. ఒక కొడుకు. అందరికీ వివాహాలు చేసారు. ఆర్ధికంగా ఇబ్బంది ఏమీ లేదు. శరీరం సహకరించక ఫొటోల బిజినెస్సూ, పుస్తకాల షాపూ మూసి వేసారుట. నాకీ వివరాలేవీ తెలియదు. తెలుసు కోడానికి కనీస ప్రయత్నం కూడా చెయ్య లేదేమో. ఉద్యోగం, పిల్లలు, వారి చదువులూ, బదిలీలూ, అమ్మాయిల పెళ్ళిళ్ళూ, పురుడు పుణ్యాలూ ... వీలు చిక్క లేదని సిగ్గు లేకుండా చెప్పడానికి కావలసినన్ని కారణాలు ఉన్నాయి.
మా రాక చూసి ఎంతగానో సంతోషించారు. నన్ను చూసి కన్నీళ్ళు పెట్టు కున్నారు. వారు పడుకున్న మంచం క్రిందకి సైగ చేసి చూపించారు. వంగి , అక్కడ ఏముందా అని చూసి, ఒక పెద్ద పుస్తకాల కట్ట ఉంటే దానిని ముందుకు లాగేను. దళసరి అట్టతో వాటిని పేక్ చేసి ఉన్నారు. వాటి మీద జోగారావు గారికి అని వచ్చీ రాని తెలుగులో రాసి ఉంది. ఉద్వేగం ఆపుకో లేక పోయాను. కళ్ళంట నీళ్ళు ఆగ లేదు. ఎప్పుడో, మామధ్య రాక పోకలు ఆగి పోయినా, దూరాలు పెరిగి పోయినా, వారు పుస్తకాల షాపు మూసి వేసే రోజులలో నాకు ఇవ్వడానికి కొన్ని పుస్తకాలు పదిలంగా పేక్ చేసి ఉంచారుట. ఆ తరువాత వారిని నేను కలవడానికి నాలుగు దశాబ్దులకి పైగా పట్టింది. అయినా, వారి మంచం క్రింద నా పేరు రాసి ఉంచిన ఆ పేకెట్ అలాగే పదిలంగా ఉంది. చెక్కు చెదరని వారి అభిమానం లాగా. తరగని ప్రేమలాగా.
వారి గురించిన వివరాలు ఎప్పటి కప్పుడు తెలుసు కోలేక పోయిన నా అల్పత్వం స్ఫురించి సిగ్గు కలిగింది.
వారు నాకోసం దాచి ఉంచిన ఆ పుస్తకాల కట్టలో సి.నా.రె. గారి ఆధునికాంధ్ర కవిత్వం , సీతా దేవి మట్టి మనుషులు, కుటుంబరావు చదువు, రావి శాస్త్రి గారి నిజం నాటకం, రక్తాక్షరాలు, ఏడుతరాలు, ఊహాగానం ...లాంటి మంచి మంచి పుస్తకాలు చాలా ఉన్నాయి. వాటితో పాటు ఎలా వచ్చి చేరిందో ఈ కామమ్మ కథ పుస్తకం కూడా ఉంది.
నా పుస్తకాల గూటి లోకి గువ్వ పిట్టలా వచ్చి చేరి పోయింది.
ఇదీ, కామమ్మ కథ పుస్తకం నా దగ్గరకు వచ్చి చేరిన వైనం.
అయితే, ఈ పుస్తకంలో ఏముందో కూడా చెప్పాలి కదూ. నిజానికి అంత గొప్పగా దాన్ని గురించి చెప్పడానికి లేదు.
శుభము కామమ్మ శుభము కామమ్మా కామమ్మ
శుభ మొంది సామర్ల కోటలో నమ్మా కామమ్మ ... అంటూ పాట రూపంలో సాగి పోయిన నలభై పుటల చిన్ని పుస్తకం ఇది.
సుకపట్ల లక్ష్మయ్య, వెంకమ్మ దంపతుల కుమార్తె కామమ్మ. తల్లి దండ్రులు చిన్నప్పుడే పోవడంతో పిన తండ్రి రామన్న ఇంట అల్లారు ముద్దుగా పెరిగింది. బాల్యం వీడక ముందే తిరుపతి మారయ్యతో వివాహం జరిగింది. పెళ్ళినాటికి భర్త కలక్టరు దొర దగ్గర నెలకు మూడు వరహాల జీత గాడు. దొరతో ఎందుకో మాటా మాటా వచ్చి, కొలువు చాలించు కున్నాడు. తరువాత తల్లి ఎంత వారించినా వినకుండా చెన్నపట్నం వెళ్ళి అక్కడ దొరల దగ్గర మంచి కొలువునే సంపాదించు కున్నాడు. కొన్నాళ్ళకి ఇంటి మీద మనసు పుట్టి, నాలుగు మాసాలు సెలవు పుచ్చుకుని, ఇంటికి తిరిగి వచ్చేడు. చిత్రమేమిటంటే, వివాహమయినా, అప్పటికింకా భార్య కామమ్మ కాపురానికి రానే లేదు. పెళ్ళవుతూనే కొలువులకి వెళ్ళి పోయేడు మరి. సరే, ఇంటికి చేరిన మారయ్య తీవ్రంగా జబ్బు పడ్డాడు. మరి కోలుకో లేదు. కామమ్మను చూడాలని కోరేడు. కామమ్మ సారె, సరంజామాతో తొలిసారిగా అత్తింట అడుగు పెట్టింది. తొలి సారి చూపు మంచాన పడిన భర్తను. అదే కడ సారి చూపు కూడా అయింది. తరువాత కామమ్మ జీవితం అనేక మలుపులు తిరిగింది. ఎన్నో కష్టాలు పడింది. ఎందరికో తలలో నాలుకగా మెలిగింది. చివరలో కామమ్మ మరణంతో ఊరు ఊరంతా విలపించింది. ఊరి ప్రజలు కామమ్మకు గుడి కట్టి గ్రామ దేవతగా ఆరాధించడం మొదలు పెట్టారు.
స్థూలంగా ఇదీ కామమ్మ కథ. పాట రూపంలో ఉన్న ఈ కథను గాయకులు అప్పట్లో గానం చేసే వారేమో తెలియదు. రచయిత పేరు ఎక్కడా కానరాక పోవడం వల్ల ఈ పాట పరంపరగా సామర్ల కోట ప్రాంతంలో పాడు కునే వారేమో కూడా తెలియదు.
ఈ పుస్తకం గురించి పరిచయం చేయడం ఎందుకయ్యా అని మీరడుగ వచ్చును.
చిన్ని పుస్తకమే కావచ్చును. కానీ, అది నా దగ్గరకు చేరిన వైనం నా వరకూ చాలా గొప్పది. విలువైనది.
ఒక తియ్యని ఙ్ఞాపకం. ఒక మరపు రాని అనుభూతి. ఒక కన్నీటి తరంగం. ఒక మధుమయిన హృదయ స్పందన.
ఈ చిన్ని పుస్తకం కామమ్మ కథను చూస్తూ ఉంటేనాకు నా మిత్రుని చూసి నట్టే ఉంటుంది. పలకరించి పులకరించి పోతున్నట్టుగా ఉంటుంది...
నా పుస్తకాల గూటిలో ఆ గువ్వ పిట్ట మంద్రంగా కువలాడుతూనే ఉంటుంది ...
అప్పటికీ ... ఇప్పటికీ ... ఎప్పటికీనూ ...5, జులై 2015, ఆదివారం

వొక్క చెత్త కార్టూన్ వెయ్యడం రాదు ! నువ్వేం కార్టూనిష్టు వయ్యా ?! తర్వాత,  చెప్ప లేదంటనక పొయ్యేరు సుమీ ! .. ఈ టపా పాతదే ... కానీ. సరసి గారి గీతా ప్రపంచం నిత్య హరితం. నవ నవోన్మేషం. ఈ తర్వాత కూడా మన సరసి గారు వందలాది కార్టూనులు వేసారు. వేస్తూనే ఉన్నారు. ఇటు అచ్చులోనూ, అటు అంతర్జాల పత్రికలలోనూ  వీరి కార్టూనులు అసంఖ్యాకంగా వస్తూనే ఉన్నాయి. అంచేత, సరసి గారి పుట్టిన రోజు సందర్భంగా మరో సారి  ఈటపా మళ్ళీ వెలుగు చూస్తే తప్పు లేదు కదా !

చదవండి మరి .....

తాడు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచే వ్యక్తి, ఆ చివరి నుండి ఈ చివరి వరకూ ఎక్కడా తూలి పడి పోకుండా నడిస్తేనే కదా, అతడు ఆ విద్యలో విజయం సాధించి నట్టు !
రంజకం అంటుకుని, ఝయ్ ఝయ్ మని వెలగడం మొదలు పెట్టిన చిచ్చు బుడ్డి అంత లోనే తుస్సుమంటే అదోలా ఉంటుంది.
బ్రహాండమయిన పబ్లిసిటీ ఇచ్చిన చిత్రరాజం మొదటి రీలే మొహం మొత్తేస్తే రెండో ఆట వేసే ప్రసక్తే ఉండదు కదా.
గొప్ప ఆర్భాటాలకు నీరసమైన ముగింపులు అందగించవు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒక కార్ట్యూన్ల పుస్తకంలో మొదటి కార్టూను నుండి చివరి కార్టూను వరకూ కూడా పొట్ట పగిలేలా నవ్వించ గల కార్టూన్ల పుస్తకం దొరికితే ఎంత బావుంటుంది చెప్పండి?
ఆ ముచ్చట నిశ్చయంగా నూటికి రెండు వందల పాళ్ళు తీర్చ గల మంచి కార్టూన్ల పుస్తకాలు - సరసి గారి కార్టూన్ల పుస్తకాలు రెండూనూ.
సరస్వతుల రామనరసింహం గారు సరసి అనే కలం పేరుతో రెండు కార్ట్యూన్ పుస్తకాలు ప్రచురించారు.
ఇప్పటికే వందలాది కార్ట్యూన్ అభిమానుల పొట్టలు చెక్కలు చేసిన నేరానికి సరసి గారు ఇలాంటి కార్టూన్లు ఇంకా వేలాదిగా వేయాలని , ఆవిధంగా వీరికి కఠిన దండ (న) విధించాలని యువరానర్,
కోరుకుంటున్నాను.

సరసిజ మనువిద్ధం శైవలేనా2పి రమ్యం
మలినమపి హిమాంశో ర్లక్ష్మ లక్స్మీం తనోతి ...

అంటాడు శకుంతల గురించి కాళిదాసు. నాచు చేత కూడినదై నప్పటికీ పద్మం మనోహరంగా ఉంటుంది. మాలిన్యం కలదైనప్పటికీ చంద్రుని లోని మచ్చ శోభను విస్తరిస్తోంది అని శ్లోకంలో ఈ రెండు పాదాలకీ అర్ధం.

సరసి గారి కార్టూన్లు కూడా ఆయన మాటల్లోనే చెబుతే, ఆస్తిపాస్తులు అట్టే వున్నవి కావు. ఎక్కువగా మధ్య తరగతి ప్రాణులు. సూటు వేసుకో లేని బడుగు బనీను జీవులు. నేతల చుట్టూ తిరగకుండా , నేత బట్టలు చుట్టుకుని తిరిగేవి. సమస్యల్లో నవ్వులు వెదుక్కునేవి. తమ మీద తామే పడి నవ్వుకునేవి. ఆ విధంగా ఈ కార్టూన్లన్నీ బడుగుల జీవితాల్లో నుండి, వారి అలవాట్ల నుండి, ఆలోచనల నుండి, ఆశల నుండి, నిరాశల నుండి,మాటల్లోంచి, చేతల్లోంచి, వచ్చిన దినుసులే.

అలా ఈ రెండు పుస్తకాలలోని కార్టూన్లు ‘సరసి’జ మనువిద్ధాలు.

సరసి గారి కార్టూన్లు ఆంధ్ర ప్రభలో వచ్చే రోజులలో శ్రీ బాపు గారి నుండి ఆ పత్రికా సంపాదకులకు ఈ విధంగా ఉత్తరం వచ్చింది:

‘‘ మీ పత్రికలో సరసి అన్నతను ( లేదా, ఆమె) వేస్తున్న కార్టూన్లు చాలా బావుంటున్నాయి.
తెలుగు కార్టూనిస్టులలో ఆమాత్రం తెలివైన వానిని ఇంత వరకూ చూడ లేదు’’
బాపు గారి నుండి ఇంత గొప్ప కితాబు అందుకున్న సరసి గారి కార్టూన్ల గురించి వేరే చెప్పనవసరం లేదు.
ప్రతి పద్యము నుందు చమ
త్కృతి గలుగం చెప్ప నేర్తు వెల్లడ బెళుకౌ
కృతి వింటి మపారముగా
క్షితిలో నీ మార్గ మెవ్వరికిన్ రాదు సుమీ !

అని, నుతిస్తాడు రఘునాథుడు విజయ విలాస కర్త చేమకూరి వెంకన్నను.
చేమకూర కవి ప్రతి పద్యం లోనూ చమత్కారం చిలికిస్తే, ప్రతి గీత లోనూ, ప్రతి రాత లోనూ చక్కని చమత్కారాన్ని, వ్యంగ్యాన్ని, హాస్యాన్ని పండించిన అచ్స తెలుగు కార్ట్యూనిస్ట్ సరసి గారు. వారి కార్టూన్ లు తెలుగుతనంతో చక్కిలిగంతలు పెడుతూ ఉంటాయి.
మనమీదేనర్రోయ్ అనిపిస్తూ ఉంటాయి.
ఆ పుస్తకాలను చూస్తే ఈ రహస్యాన్ని మీరు కూడా నాలాగే కనిపెట్ట వచ్చును.
సరసి గారి గీతా మాధుర్యం రుచి చూడడం కోసం వారి కార్టూన్ పుస్తకాలలో ప్రచురించిన మొదటి, చివరి కార్టూన్ లు సరదాగా ఇక్కడ చూడండి:

ఇవి సరసి కార్టూన్లు మొదటి సంకలనం లోని తొలి పుట లోని కార్టూన్ లు.
అదే పుస్తకం లోని చివరి పేజీ కార్టూను ఇది!సరసి కార్టూన్లు - 2 పేరుతో వచ్చిన రెండవ సంకలనం లోని మొదటి కార్టూను ఇది !
ఆ కార్టూన్ల పుస్తకం లోని చివరి పేజీలో ఉన్న కార్టూను ఇది !
రెండు పుస్తకాల లోనూ తొలి , మలి కార్టూన్ ల రుచి చూసారు కదా ? ఇహ మధ్యలో ఉండే మాధుర్యాన్ని మీరే జుర్రుకోండి ...తనివి తీరా నవ్వు కోండి. అంత కంటె ముందు ఈ కార్టూన్ పుస్తకాలను కొనుక్కోండి. అది మాత్రం మరిచి పోకండేం?
ఎక్కడ దొరుకుతాయంటారా? అన్ని ప్రముఖ పుస్తక విక్రేతల వద్ద దొరుకుతాయి. వెల గురించి బెంగ లేదు. మీరు ఒక్కో పుస్తకానికీ వంద చొప్పున రెడింటికీ రెండు వందలు యిచ్చి, పాతిక రూపాయల చొప్పున మొత్తం ఏభై రూపాయలు ఇమ్మని దబాయించి మరీ వసూలు చేసుకోండి. కాదంటే సరసి గారికి కంప్లయింట్ చేయండి.
అన్నట్టు, ఈ కార్టూను పుస్తకాలు కొన్న వారికి కలకండల్లాంటి తియ్యని ముందు మాటలు - శ్రీరమణ,తనికెళ్ళ భరణి గార్లవి - పూర్తి ఉచితంగా ఇవ్వబడును. ఆలసించిన కార్టూన్ భంగం. ఆపైన మీ యిష్టం. నన్ననకండి.
సరసి గీతలే కాదు, రాతలు కూడా చక్కిలి గింతలు పెట్టేవే. వాటి గురించి మరో మారు ....
ఇంకా వివరాలూ గట్రా కావాలంటే సరసి గారితోనే నేరుగా మాట్లాడితే ఓ పనైపోతుంది ...

హాస్యానందం పత్రిక వారు మన సరసి గారి పుట్టిన రోజు సందర్భంగా వొక ప్రత్యేక సంచిక వెలువరించారు. ఆద్యంతం నవ్వులే నవ్వులు !    ఇక్కడ  నొక్కి చదువు కోండి,
వారి ఫోను: 09440542950 మెయిలెడ్రసు: sarasi-cartoonist@yahoo.comhttp://www.chamatkaram.com/home_page_main.jpg

29, మే 2015, శుక్రవారం

తెలుగు సాంఘిక నాటక రంగచరిత్రను మహోజ్జ్వలమైన మలుపు త్రిప్ప బోయి చతికిల పడ్డ వొకానొక నాటకం విశేషాలు ( లేక ) జోరా మేషారి నటనా ప్రతిభ !

నిజమే నండీ ..ప్రేక్షకులు సహృదయులయితే ఎన్ని నాటకాలయినా ఆడొచ్చు ! అందుకు మేం మా సాలూరు కాలేజీలో వేసిన వేషాలే నిదర్శనం. చెబుతా వినండి ...

విజయ నగరం జిల్లా సాలూరులో నేను ఏకబిగిని 1980 నుండి 2003 దాకా 23 ఏళ్ళు అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేసాను. అక్కడే జూనియర్ కాలేజీ కూడా ఉండడంతో హైస్కూలు ఉదయం పూటా, జూనియర్ కాలేజీ మధ్యాహ్నం పూటా నడిచేవి. రెండూ ఒక ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో నడిచేవి. మా హైస్కూలు స్టాఫ్, కాలేజీ లెక్చరర్లు, ఆఫీసు సిబ్బంది , అటెండర్లు అంతా కలిపి 70 మంది దాకా ఉండే వాళ్ళం. ఒకే కుటుంబంలా ఉండేది. కలిసే పిక్నిక్ లూ, కలిసే స్కూలు ఫంక్షన్లూ చేసుకునే వాళ్ళం. చివర్లో మూడు నాలుగేళ్ళపాటు కాలేజీ, హైస్కూలూ విడి పోయినా, పని వేళలలో మాత్రం మార్పు లేదు.

సరే, దీనికేం గానీ, సాలూరి ప్రజలు మమ్మల్ని ఎంతగా ప్రేమించే వారంటే, మాలో చాలా మందిమి, ముఖ్యంగా హైస్కూలు టీచర్లం సాలూరు వచ్చేక మరి కదిలే వారం కాము. ఎవళం పది పన్నెండు ఏళ్ళకి తక్కువ అక్కడ పని చేయ లేదు, అందరిలోకీ నేను మరింత సుదీర్ఘ కాలం పని చేయడం వల్లనూ, కథలూ కాకర కాయలూ రాసే వాడిని కనుకనూ, సాహిత్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వాడిని కావడం చేతనూ నన్ను మా సాలూరి వాళ్ళు మరింతగా అక్కున చేర్చు కున్నారు. అందుకే అక్కడి నుండి 24వ ఏట ట్రాన్సఫర్ అయి వెళ్ళి పోతూ ‘‘ మంచి గంధము సాలూరి మంచి తనము ’’ అన్నాను. ఇందులో రవంత అతిశయోక్తి లేదండీ.

ఆరుద్ర నవరసాలూరు సాలూరు ! అన్నారు. సాలూరి రాజేశ్వరరావూ , ఘంటసాల మాష్టారూ. సాలూరి చిన గురువు గారూ ఆ మట్టి వాసన పీల్చిన వారే కదా !

ఆ రోజుల్లో మా విద్యా సంస్థ ప్రతియేడూ ఠంచనుగా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించేది.

మా మినిష్టీరియల్ స్టాఫ్ లో చుక్కా దంతేశ్వర రావు అని ఒకాయన జూనియర్ అసిస్టెంట్ ఉండే వారు. అయనకు నాటకానుభవం మెండు. మంచి నటులు, పరిషత్ పోటీలలో కూడా చాలా బహుమతులు గెల్చకున్ననటులు. ఓ ఏడాది మా మేష్టర్లతో ఓ నాటిక కాలేజీ వార్షికోత్సవంలో వేసి తీరాలని పట్టు బట్టేరు. నాటిక పేరు ఇప్పుడు నాకు గుర్తు లేదు. కాలేజీ స్టాఫ్ నుండీ, హైస్కూలు సిబ్బంది నుండీ, ఆఫీసు సిబ్బంది నుండీ నటులను ఎన్నిక చేయడం జరిగింది. అంతా ఉత్సహంగా ముందు కొచ్చేరు.

‘‘ జోరా మేషారూ ! మీరూ ఓ వేషం వేసి తీరాలండీ ’’ అన్నాడు మా దంతేశ్వరరావు.

నా పేరు అసలే చాలా కురచ. నాలుగే అక్షరాలు . జో –గా – రా – వు. అంతే ! దానిని మా మేష్టర్లు మరింత కుదించి, జోరా మేషారూ అని పిలిచే వారు. నా పేరులో రెండక్షరాలు ఎలాగూ మింగేస్తున్నారాయె ! కనీసం మేష్టారులో ష కింద ట కూడా తినెయ్యాలా చెప్పండి అనేవాడిని.

ఎవరూ వినేవాళ్ళు కారు. నేను ఎప్పటికీ వాళ్ళకి జోరా మేషారినే.

‘‘ పోదూ, నేను వేషం వెయ్యడ మేఁవిటి ?’’ అన్నాను.

‘‘ మీరు వెయ్యందే మేమూ వెయ్యం, మీరు కాదంటే ప్రన్సిపాల్ గారితో చెప్పించి మరీ ఒప్పిస్తాం ’’ అని ముద్దుగా బెదిరించేరు.

‘‘ ఆ డైలాగులూ అవీ బట్టీ పట్టడం నా వల్ల కాదు. అదీ కాక మీకు తెలుసు కదా. నాకు మతి మరపు జాస్తి. ఏ డైలాగు తరువాత ఏది చెప్పాలో నాకు గుర్తుండి చావదు. నామానాన నన్నొదిలేద్దురూ ! ’’ అన్నాను.

అదేం కుదర్దు అన్నారంతా. ఏపుగా ఉంటారు కదా ఎస్ ఐ వేషం వెయ్య మన్నారు. నాటిక చూసేను. ఆ పాత్రకు డైలాగులు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నా వల్ల కాదు పొమ్మన్నాను. ఓ బంట్రోతు పాత్ర చాలా తక్కువ డైలాగులతో ఉన్నట్టుంది. అదయితే చేస్తానన్నాను.

‘‘ అదా ! పెద్దవాళ్ళు ... మీకు బావోదేమో ’’ అన్నాడు.

‘‘‘‘ నటన ప్రథానం కానీ వేషంతో పనేమి ’’ టన్నాను ఏదో తెలిసినట్టు.

‘‘ఏదో, మీరూ మాతో పాటే స్టేజీ ఎక్కుతున్నారు. అదే చాలు ’’అని అంతా సరే అన్నారు.

అందులో నావి మొత్తం ఆరు డైలాగులు.

1. చిత్తం

2. చిత్తం బాబయ్యా

3. చిత్తం ..అలాగే నండయ్యా, అలాగే కానియ్యండి

4. చిత్తం ... చిత్తం

5. చిత్తం ..అలా అనకండయ్యా ...

6. చిత్తం .. దండాలయ్యా.

సరిగ్గా ఇవే కాక పోవచ్చును కానీ, దాదాపు ఇవే పొడిమాటలు.

మరో సౌలభ్యం ఏమిటంటే, ఇవన్నీ వేరు వేరు చోట్ల ఒకేనటుడితో, అదే ఇంటి యజమాని వేషం వేస్తున్న మా దంతేశ్వరరావుతో నేను అనాల్సిన డైలాగులు.

‘‘ మొత్తం ఆరు చిత్తాలున్నాయి. ఏవి ఎక్కడ అనాలో గుర్తుకు రాక పోతే నన్నేం అనకూడదు. ’’ అని ముందే చెప్పాను.

నాటకం మొదలయింది. మేష్టర్లు నాటిక వేస్తున్నారని చెప్పి సాలూరి జనం విరగబడి పోయేరు.

నాపని రంగస్థలం మీదున్న బల్లలనీ వాటినీ తుడుస్తూ ఉండడమే

‘‘ జోరా మేషారూ ! ... జోరా మేషారూ ! ’’ అంటూ మా పిల్లలూ, ప్రేక్షకులూ ఒకటే చప్పట్లు. నాలో నటుడు పెట్రేగి పోయేడు. గబగబా అన్నింటినీ తుడిచేస్తూ వీర లెవెల్లో నటించేస్తున్నాను.

నాటిక మేం ఎంత ఛండాలంగా వేసినా, ఇక్కడి జనాలు అల్లరి చెయ్యరనీ, పైపెచ్చు సరదాగా చూస్తారనీ తెలిసి పోయేక ఇక నాకు ధైర్యం వచ్చీసింది.

ఆరు చిత్తాలు కాస్త పదిహేను ఇరవై చిత్తాలు వరకూ పెరిగి పోయేయి. లెక్క చూసుకో లేదు. సరదా పుట్టి నప్పుడల్లా చిత్తం అనేస్తున్నాను. నాలోని నటుడ్ని ఎవరూ ఆప లేక పోయేరు.

ఒక చోట టేబిలు మీద ఉన్న టెలి ఫోన్ ని రిసీవర్ మీదకెత్తి తుండు గుడ్డతో తుడుస్తున్నాను. . ఆ సన్నివేసంలో ఇంటి యజమానికి ఒక ముఖ్యమైన పోన్ కాల్ రావాలి. ఆ ఫోన్ కాల్ కథని మలుపు తిప్పుతుంది. రిసీవర్ ని మీదకెత్తి తుడుస్తూ ఎంతకీ క్రెడిల్ చేయడం లేదు నేను. నౌకరు పాత్రలో జీవించేస్తున్నాను. మా దంతి ‘‘ ఫోను పెట్టండి జోరా మేషారూ ’’ అని సైగలు చేస్తున్నా పట్టించు కోవడం లేదు. చివరకి నేను రిసీవరు పెట్టకుండానే తెర వెనుక నుండి కాలింగ్ బెల్ మ్రోగడం, నా చేతిలోని రిసీవరుని మా దంతేశ్వర రావు అందు కోవడం జరిగి పోయేయి. అంతా ఒకటే నవ్వులే నవ్వులు !

‘‘ నేనింక ఈ బాధలు పడ లేనురా ... ఏ రైలు కిందో తల పెట్టీవాలనుందిరా ... ’’ అని ఇంటి యజమానిగా మా దంతి డైలాగుకి ... నేను  ‘‘ అలా అనకండయ్యా ...’’ అనే డైలాగు చెప్పడానికి బదులు ... మరో చోట చెప్పాల్సిన ‘‘ చిత్తం ... అలాగేనండయ్యా ... అలాగే కానియ్యండి ... ’’ అనీసేను.!

దాంతో మా దంతి తెల్ల బోవడం, జనాలు కేరింతలు కొట్టడం ... మరడక్కండి ...

మొత్తం మా మేష్టర్ల నాటిక రసాభాసగా ముగిసింది.

వెన్న పూసలాంటి మనసున్న మా సాలూరి జనాలకి అదేమీ పట్ట లేదు. మేం నాటిక వేయడమే చాలునన్నంతగా ముచ్చట పడి పోయేరు.

ఇలా జరిగింది నా నాటక రంగ ప్రవేశం. మరెప్పుడూ నటుడిగా స్టేజి ఎక్కింది లేదు. అందు వల్ల తెలుగు నాటక రంగం ఇప్పటిదాకా బతికి బట్ట కట్టిందను కుంటాను.

స్వస్తి.

20, జనవరి 2015, మంగళవారం

అమ్మకి నచ్చిన అందమైన పాట !

ధన్యవాదాలు You tube


ఆ తోటలో నొకటి ...అనే ఈ పాట నేను చాలా చిన్నప్పుడు విన్నాను. అనంతపురం జిల్లా ఉరవ కొండలో మా మాతామహులు ( ముసిలి డాక్టరు గారు) ఉండే రోజులలో మా అమ్మ ( కీ.శే. పార్వతమ్మ) తో పాటు ఉరవ కొండ వెళ్ళే వాడిని. వెళ్ళి నప్పుడల్లా నాలుగయిదు నెలలకు తక్కువ ( అంత కంటె ఎక్కువ రోజులేనేమో ?) కాకుండా అక్కడ ఉండే వాళ్ళం.


మా తాత గారింట్లో ఒక గ్రాం ఫోను ఉండేది. దాని మీద కుక్క కూర్చున్న బొమ్మ నాకెంతో ఇష్టంగా ఉండేది.
అందులో మా అమ్మ తరుచుగా ... తరచుగా ఏమిటి, ఆ ఊళ్ళో ఉన్నన్ని రోజులూ కూడా ఈ ఆ తోటలో నొకటి ...
అనే పాట ఎంతో ఇష్టంగా వింటూ ఉండేది. అమ్మకి ఆ పాటంటే ఎంత ఇష్టమో చెప్ప లేను. అమ్మంటే ఇష్టం కనుక నాకూ ఆ పాటంటే ఇష్టంగా ఉండేది. చాలా రోజుల పాటు ఆ పాటంతా నాకు కంఠతా ఉండేది. కాని, క్రమేపీ మరిచి పోయాను.
అమ్మ పోయాక, ఆ పాట కూడా, ఒక్క - ఆ తోటలో నొకటి ... అనే ముక్క తప్ప, నా స్మృతి పథం లోనుండి జారి పోయింది. చాలా కాలం విచార పడ్డాను. అయితే, ఆ పాట బాల సరస్వతి పాడినట్టుగా గుర్తుంది. మళ్ళీ చాలా ఏళ్ళకి అంతర్జాలం వారి ధర్మమా అని, అమ్మకి నచ్చిన ఈ పాట విన గలిగేను. ఈ పాట నాకు అందించడానికి  నాలుగేళ్ళ క్రితం మిత్రులు చాలా మంది సహకరించారు కూడా ! వారందరికీ అప్పుడే ధన్యవాదాలు తెల్పు కున్నాను. ఈ పాట  నా బ్లాగు గాడ్జెట్ లో అమ్మకి నచ్చిన పాట అని, లింకు కూడా ఇచ్చాను, చూడండి. దాని కథా కమామీషూ మరోసారి మీతో పంచు కోవాలని ఇదంతా రాస్తున్నాను. అందరికీ తెలిసిన రామాయణమే మళ్ళీ చెప్పాలా అని అడిగితే విశ్వనాథ వారు అన్నట్టు, రోజూ తిన్న అన్నమే తినడం లేదూ ! ఎవరి రుచులు వారివి. రుచికర మయిన పాయసాన్ని జీవిత కాలంలో ఏ ఒక్క సారో  వో గ్లాసుడు తాగి ఊరు కోం కదా ! దొరికి నప్పుడల్లా  తాగాలనే ఉంటుంది. అలాగే, యిదీనూ ! మంచి పుస్తకాలు పున్ముద్రణలు వేయడం లేదూ ... అలాగే నచ్చిన బ్లాగు టపాలను మళ్ళీ మళ్ళీ పెట్టడంలో తప్పేమీ లేదనుకుంటాను ...
ఈ పాట సాహిత్యాన్ని చూస్తున్నా, పాట వింటున్నా, నాకు మా అమ్మను చూస్తున్నట్టే ఉంది.
దాదాపు ఏభై ఏళ్ళ క్రిందట, తడికెల ప్రహరీతో, ఆ మిద్దె ఇంటి మీదకి ఏపుగా అల్లుకున్న
సన్న జాజి పూ పొదలతో ఒక వింత గుబాళింపుతో కలగలిసిన నా బాల్యపు ఆనవాళ్ళు పోల్చుకో గలుగుతున్నాను. చిన్న చిన్న గ్రామ ఫోను ముల్లులు మారుస్తూ, పదే పదే దాని కీ త్రిప్పుతూ, పరవశంగా ఆ గాన మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ, దానితో గొంతు కలిపి , సన్నగా మా అమ్మ పాడిన పాట నాకు వినిపిస్తున్నట్టే ఉంది.
సాహిత్యం ఇది:
ఆ తోటలోనొకటి ఆరాధనాలయము
ఆ ఆలయములోని అందగాడెవరే,
అందగాడెవరే, అందగాడెవరే!
మన్మథుండనీ చెలియా
మనసు ఘోషించేనే
మరలీ వచ్చెదమన్నా మరపూ రాకున్నాడే
మరపు రాకున్నాడే II ఆ తోటలో నొకటి II

చంద్రబింబపు ముఖమూ
గండుకోకిల స్వరమూ
పండూ వెన్నెలలోlన
పవ్వాళించేనమ్మా...చెలియా
చుక్కల్లా రేడమ్మా ...సఖియా
చుక్కల్ల రేడమ్మా ... సఖియా
మరుని శరముల చేత మనసు నిలువక నేను
మల్లె మొల్ల మొగలి మాలతి మందార
మాలికను వాని మెడలోన వైచి నానే
మధురామూర్తి మేల్కొని మందహాసముచేయ
మకర కర్ణిక మెరసెనే , చెలియ
మది వెన్న చిల్కినదే , సఖియా
మెరపూ లోనా నేను మైమరచి వెంటనె
పేరేమిటని వాని ప్ర శ్నించినానే'--
పేరేమిటని వాని ప్రశ్నించినానే
మాయాదేవీ సుతునని మధురామూర్తీ పలికె
సిద్ధార్థుడే నాకు సిద్ధించెనే, చెలియా!
మది కోర్కె నెరవేరె, సఖియా!
ఆ తోటలో నొకటి ఆరాధనాలయము
ఆ ఆలయములోని అందగాడితడే...
(ఈ పాట రచయిత 'సాలూరి సన్యాసిరాజు)
ఈ విడ మా అమ్మ , పార్వతమ్మ

నాకు తెలుసులే, నీకిష్టమైన ఈ పాట వింటూ నీలో నువ్వే కమ్మని కంఠంతో పాడుకుంటున్నావు కదూ అమ్మా ?!

* * * *


1, సెప్టెంబర్ 2014, సోమవారం

నా ముచ్చట ముమ్మారు తీర్చిన శ్రీ బాపు గారికి అశ్రు నివాళి ...


శ్రీ బాపు ఇక లేరు ... అనుకోడానికే  చాలా బాధగా ఉంది. తెలుగుదనం అంటే పిసరంత  అభిమానం ఉన్న వాళ్ళెవరికయినా బాపు అంటే, కొండంత అభిమానం ...

అప్పుడు  ముళ్ళ పూడి వెళ్ళి పోయేక, ఇప్పుడు బాపూ కూడా వెళ్ళి పోయేరు.

మనకింక మిగిలిందేమిటి ?   బాపూ  గీసిన బొమ్మలూ, వారు తీసిన సినిమాలూనూ ...

తెలుగునాట కథలూ, నవలలూ రాసే రచయిత లందరికీ తమ రచనలకీ, పుస్తకాలకి ముఖ చిత్రాలుగానూ శ్రీ బాపూ గారు బొమ్మలు వేస్తే బావుణ్ణు అనేది ఒక  తీయని కోరిక ...  కొండొకచో దురదృష్టవశాన తీరని కోరికగా కూడా ఉండిపోతూ ఉంది ...

   రచన  కన్నా, ఎవరూ ఏమనుకోక పోతే,   వో మెట్టు  ఎక్కువగా అందమయిన బొమ్మ గీసే ఒడుపు బాపు గారికే చెల్లింది !

నా వరకూ ఆ కోరిక  ముచ్చటగా  ముమ్మారు తీరింది. ధన్యోస్మి !

ఆ మహా గీతకారునికి అశ్రు నివాళి అర్పిస్తూ ... ఆ మూడు ముచ్చట్లూ  మీతో పంచు కునీదా ?

చూడండి ...
21, మార్చి 2014, శుక్రవారం

అంతర్జాలమా !నీకు జోహార్లు ...అంతర్జాలంలోో ఎందుకో వెతుకుతూ ఉంటే ఈ ఆడియో కంట పడింది. మనిషిని ఫొటో చూసి వెంటనే గుర్తు పట్ట లేక పోయేను. తంపెళ్ళ మహదేవ రావు అని పేరు చూసి తటాలున పోల్చు కున్నాను.

పార్వతీపురంలో  మా చిన్నప్పుడు మా ఇంటికి అతి సమీపంలోనే వీరి కుటుంబం ఉండేది. పెద్దాయనను తంపెళ్ళ మాష్టారు అనే వారు. సంగీతం టీచరు. నాకయితే వారు తెలీదు. నా చిన్నప్పటికే పోయేరను కుంటాను. నా చిన్నప్పటికే వారి కుటుంబం పార్వతీపురం విడిచి వెళ్ళి పోయినట్టు గుర్తు. కానీ ఈ తంపెళ్ళ మహదేవరావూ, వీరి తమ్ముడు తంపెళ్ళ సూర్య నారాయణ గారూ మా ఊరు తరుచుగా వస్తూ ఉండే వారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజులలో వచ్చే వారు.

అలా వచ్చి నప్పుడు తెలిసిన మా కుటుంబాలలో అందరినీ పలకరించడానికి ఇళ్ళకు వచ్చే వారు.

నాకు బాగా గుర్తు,  మహదేవరావు ఇలా ఓ సారి పండుగకు  మా ఊరు వచ్చి నప్పుడు మా మేనత్త గారి ఇంటి చావిడీలో మా కోసం, మా వీధి వారి కోసం  గాత్ర  కచేరీ  చేసేరు. అప్పటికే వారు ప్రసిద్ధులు. మా తాత గారి మాట కాదనలేక  ఆ కచేరీ చేసారు. వీరి తమ్ముడు సూర్య నారాయణ మూర్తి  మంచి వయొలనిష్టు. ఆ రోజుల లోనే రాష్ట్రపతి అవార్డు  గ్రహీత.

మహ దేవరావుని, సూర్య నారాయణనీ  చూసి  నలభై ఏళ్ళవుతోంది. ఇంకా ఎక్కువే నేమో.  వారి గురించిన వివరాలేమీ తెలియదు.

కాదు ... కాదు ... మహదేవరావుని   మాత్రం 72 లో   ఓసారి చూసాను. ఎందుకో మా ఊరు వచ్చేరు. పెద్ద భత్వోద్యోగి.ఇంటెలిజెన్స్ అనుకుంటాను ... ఏమో ... కానీ ఆ ఏడాది భోగీ నాటి రాత్రి మాతో ఆయన పేకాట కూడా ఆడేరు ...  అమ్మకి నచ్చిన మంచి పాట ఇక్కడ చూడండి..

సరే, ఇంతకీ నేను చెప్పే దేమిటంటే  అంతర్జాలం వల్ల గత కాలపు మధుర స్మృతులు ఎన్ని నెమరు వేసుకో వచ్చునో కదా ...అందుకే అంతర్జాలమా ! నీకు జోహోర్లు ...

15, జనవరి 2014, బుధవారం

మా విజీనారం దేవీ విలాస్ నెయ్య దోశె... ఆహా ! ఏమి రుచి !కాకినాడ కాజా. తాపేశ్వరం పూత రేకులూ, బందరు తొక్కుడు లడ్డూ లాగా కొన్ని అలా ప్రసిద్ధమౌతూ ఉంటాయి. ఆ ఊళ్ళ పేర్లు చెవిని పడగానే ముందుగా అక్కడ దొరికే ఆయా వంటకాల రుచులు మదిలో మెదిలి నోరూరి పోతూ ఉంటుంది.

పని మీదో, పనీపాటూ లేకనో, చుట్ట పక్కాలు లేని ఊరెళ్ళడనికి బయలు దేరే ముందు వెళ్ళ బోయే ఊర్లో వసతి సౌకర్యం, భోజనహొటళ్ళ గురించి ఆరా తీయక పోతే ఆరి పోతాం. ఆఁ ... ఏఁవుందిలే, ఒక్క రోజే కదా అని బుద్ధి గడ్డి తిని అక్కడ దొరికే నానా గడ్డీ తింటే ఇంటి కొచ్చేక పడకేయడం ఖాయం.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీకివాళ మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోశ ఘుమ ఘుమల గురించి పరిచయం చెయ్యడానికి. ఇప్పటి మాట కాదు లెండి. 60 – 70 ల నాటి ముచ్చట. ఇప్పుడా హోటలూ అక్కడ లేదు. ఆ కమ్మని నెయ్యి వాసనా లేదు. తలచుకుని లొట్టలు వేయడం కన్నా ఇప్పుడు మనం చెయ్యగలిగిందేమీ లేదు.

చాలా పాత కాలపు ముచ్చట అని చెప్పాను కదా ? అప్పట్లో మా విజీనారం లో ఒక్కో కాఫీ హొటలూ ఒక్కో టిఫినుకి ప్రసిద్ధిగా ఉండేది.

అందులో అగ్రపీఠం దేవీ విలాస్ నెయ్యి దోశెది. ఈ దేవీ విలాస్ కస్పా బజారు మధ్యలో ఉండేది.నెయ్యి దోశె ఆరోజుల్లోనే నలభై పైసలుండేది. వాహ్ ! ఏమి రుచి అనుకున్నారూ ? కమ్మని నెయ్యి వాసనతో ఘుమఘుమ లాడి పోయేది. దానికి తోడు చిక్కని కొబ్బరి చట్నీ. దేవీ విలాస్ నెయ్యి దోశె తినడం కోసం విజీనారం ప్రజలే కాకుండా ప్రక్క జిల్లాల నుండి కూడా జనాలు ఎగబడి వచ్చే వారంటే నమ్మాలి.అక్కడ నెయ్యి దోశె తిని, చెయ్యి రుద్దుకుని కడుక్కున్నా, చాలా సేపటి వరకూ ఆ కమ్మని నెయ్యి వాసన పోయేది కాదు. ఆ మజా అనుభవించ వలసినదే తప్ప మాటల్లో చెప్పేది కాదు. దేవీ విలాస్ లో నెయ్య దోశెతో పాటు మిగతా టిఫిన్లూ అంతే రుచికరంగా ఉండేవి. దానికి తోడు క్యాష్ కౌంటరు దగ్గర దేవీ విలాస్ వారు ప్రత్యేకంగా తయారు చేసి అమ్మే కాఫీ పొడి పొట్లాల వాసన ఘుమ ఘుమలాడి పోతూ ఉండేది. దేవీ విలాస్ కొబ్బరి చట్నీ రుచి చెప్ప నలవి కాదు.ముద్ద చట్నీయే తప్ప చట్నీ పలచన చేసి వేసే వాళ్ళు కాదు. అక్కడ నెయ్యి దోశె, కొబ్బరి చట్నీ కోసం విజీనారం వర్తక ప్రముఖులూ, న్యాయవాదులూ, గుమాస్తాలూ.కాలేజీ పిల్లూ. పంతుళ్ళూ క్యూ కట్టే వారు. పెద్ద ఆఫీసర్లూ. వాళ్ళూ కోరి మరీ నెయ్యి దోశె పార్శల్ తెప్పించుకు తినే వారు.

దేవీ విలాస్ తో పాటూ ఆ రోజుల్లో మా విజీనారం లో మరి కొన్ని మంచి కాఫీ హొటళ్ళు ఉండేవి. ఒకటీ అరా కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. వాటి గురించి కూడా చెబుతాను.

కస్పా జారు లోనే కోట జంక్షన్ దగ్గర సుబ్రహ్మణ్య విలాస్ ఉండేది.ఆ ప్రదేశాన్ని ప్యారిస్ కార్నర్ అని కవులూ, రచయితలూ, సాహిత్యాభిమానులూ పిలుచు కునే వారు. సుబ్రహ్మణ్య విలాస్ లో కాఫీ పుచ్చుకుని, ఆ హొటల్ ముందు గుమి గూడి వాళ్ళంతా కవిత్వం గురించీ, కథల గురించీ కబుర్లు చెప్పు కునే వారు. ముఖ్యంగా సాయంత్రాల వేళ సుబ్రహ్మణ్య విలాస్ కిటకిటలాడి పోయేది. పతంజలి, దాట్ల నారాయణ మూర్తి రాజూ, కొడవంటి కాశీపతిరావూ, పంతుల జోగారావూ, సీరపాణీ, జగన్నాథ శర్మా నిష్ఠల వెంకటరావూ, అప్పుడప్పుడు చా.సో గారూ ... .... ఇలా అక్కడ పోగయ్యే వారి జాబితా పెద్దదే లెండి.

అయిందా ? సుబ్రహ్మణ్య విలాస్ దాటి కొంచెం ముందుకు మూడు లాంతర్ల వేపు వెళదాం. అక్కడ కోపరేటివ్ సెంట్రల్ బ్యంకు ప్రక్కన కుడి వేపు ఎత్తరుగుల  హొటల్   నేషనల్  కేఫ్ ఉండేది. . ఇది పేద విద్యార్ధులయిన సంస్కృత కళాశాల , సంగీత కళాశాల విద్యార్ధుల పాలిట కల్ప తరువు లాంటిదని చెప్పాలి. రుచికరమయిన టిఫిన్ లు

చాలా చవక ధరల్లో దొరికేవి. పావలాకి  నాలుగు  ఇడ్లీలు పెట్టే వారు.

అది దాటి వెళ్ళేక, అప్పటి హిమాంశు బుక్ డిపో దాటి, కస్పా స్కూలు సందు మొదట్లో శ్రీకృష్ణా హొటల్ డేది. ఇప్పుడది జిడ్డు వారి వీధి మొదట్లోకి వచ్చింది. అక్కడ ఇడ్లీ సాంబార్ స్పెషల్. ఏమి రుచో ! సాంబర్ బకెట్ టేబిలు మీదే ఉంచే వారు కనుక,  సాంబార్ ప్రియుడు మా శాష్త్రి లాంటి వాళ్ళు ఒక్క ప్టేటు ఇడ్లీకి కావలసినంత సాంబార్ జుర్రుకునే వాడు.


రాజా బజార్లో హొటల్ మిలాప్ చపాతీకి, కమ్మని టీకి ప్రసిద్ధి. అర్ధ రాత్రయినా కమ్మని చాయ్ దొరికేది. గంటస్తంభం ఎదురుగా హొటల్ అజంతా  పూరీ కూరాకి పేరు పొందింది. ఇవి కాక చిన్న వీధిలో వసంత విహార్. రైల్వే స్టేషను దగ్గర రామ కృష్ణా హొటల్ లో మంచి టిఫిన్లే దొరికేవి.చివరిగా అయ్య కోనేరు దక్షిణ గట్టు మీది వి.ఎస్.ఎన్. విలాస్ గురించి చెప్పక పోతే

అసలేమీ చెప్పనట్టే అవుతుంది. ఈ కాఫీ హొటలు చాలా చిన్నది. అయ్య కోనేరు గట్టున మొన్న మొన్నటి వరకూ ఉండేది. ప్రశస్తమయిన టిఫిన్లు దొరికేవి. అయ్య కోనేరు నాలుగు గట్టు వీధుల్లోనూ ఉండే వారంతా, ముఖ్యంగా, పురోహితులూ, బ్రాహ్మణ కుటుంబాల వారూ. మేష్టర్లూ తెల్లవారుతూనే ఇక్కడి కొచ్చి ఇడ్లీలు ఇష్టంగా తినేవారు. చాలా చవక. ఇక్కడి సందడి భలే ఉండేది. ఇంటి భోగట్టాల నుండి ఇంటర్నేషనల్ విషయాల వరకూ తెగ ముచ్చట్లు చెప్పు కునే వారు. మరీ ముఖ్యంగా పండుగ రోజుల్లో ఇళ్ళకొచ్చిన అల్లళ్ళూ, బంధువులూ బిలిబిలా ఇక్కడికి తప్పకుండా వచ్చే వారు. పిల్లలనీ, పెళ్ళాలనీ వెంట బెట్టుకుని !

చాలా వరకూ ప్రభుత్వ జీ.వోలూ నిర్ణయాలూ అనధికారికంగానూ, ముదస్తుగానూ ఇక్కడే తయారయి పోతూ ఉండేవి. రాజకీయాలూ, వేతన సవరణలూ, వగైరాల గురించి తెగ మాటలు దొర్లేవి. ఒక రకంగా చెప్పాలంటే, ఈ చిన్ని కాఫీ హొటలు ఆ రోజుల్లో తెరచిన వార్తా పత్రికలా ఉండేది. వాగుతున్న రేడియోలా ఉండేది.
ఇవండీ ,,, ,,, మా విజీనారం కాఫీ హొటళ్ళ ముచ్చట్లు ! ఎంత సేపూ టిఫిన్ హొటళ్ళ గురించే చెప్పావు, విజీనారంలో అప్పట్లో మంచి భోజన హొటల్ ఏదీ ఉండేది కాదా ? అనే సందేహం మీకు కలగొచ్చు.

ఉండే ఉంటాయి. కమ్మని భోజనం పెట్టే  హొటళ్ళు. నాకు తెలియదు. ఎందుకంటే , నేను ఆరొజుల్లో మహరాజుల వితరణ ఫలితంగా వెలసిన శ్రీ సింహాచల వరాహ నరసింహ విద్యార్ధి ఉచిత అన్నసత్రవు అన్న ప్రసాదాన్ని తిన్న వాడిని. ఎప్పుడూ హోటల్ భోజనం అక్కర లేక పోయింది. ఆ భోజన సత్రం విశేషాలు ఇక్కడ  నొక్కి చదవొచ్చు.

శలవ్.

14, జూన్ 2013, శుక్రవారం

చూసే వాళ్ళు మంచి వాళ్ళయితే ఎన్ని వేషాలయినా వెయ్యొచ్చునిజమే నండీ ..ప్రేక్షకులు సహృదయులయితే ఎన్ని నాటకాలయినా ఆడొచ్చు ! అందుకు మేం మా సాలూరు కాలేజీలో వేసిన వేషాలే నిదర్శనం. చెబుతా వినండి ...

విజయ నగరం జిల్లా సాలూరులో నేను ఏకబిగిని 1980 నుండి 2003 దాకా 23 ఏళ్ళు అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేసాను. అక్కడే జూనియర్ కాలేజీ కూడా ఉండడంతో హైస్కూలు ఉదయం పూటా, జూనియర్ కాలేజీ మధ్యాహ్నం పూటా నడిచేవి. రెండూ ఒక ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో నడిచేవి. మా హైస్కూలు స్టాఫ్, కాలేజీ లెక్చరర్లు, ఆఫీసు సిబ్బంది , అటెండర్లు అంతా కలిపి 70 మంది దాకా ఉండే వాళ్ళం. ఒకే కుటుంబంలా ఉండేది. కలిసే పిక్నిక్ లూ, కలిసే స్కూలు ఫంక్షన్లూ చేసుకునే వాళ్ళం. చివర్లో మూడు నాలుగేళ్ళపాటు కాలేజీ, హైస్కూలూ విడి పోయినా, పని వేళలలో మాత్రం మార్పు లేదు.

సరే, దీనికేం గానీ, సాలూరి ప్రజలు మమ్మల్ని ఎంతగా ప్రేమించే వారంటే, మాలో చాలా మందిమి, ముఖ్యంగా హైస్కూలు టీచర్లం సాలూరు వచ్చేక మరి కదిలే వారం కాము. ఎవళం పది పన్నెండు ఏళ్ళకి తక్కువ అక్కడ పని చేయ లేదు, అందరిలోకీ నేను మరింత సుదీర్ఘ కాలం పని చేయడం వల్లనూ, కథలూ కాకర కాయలూ రాసే వాడిని కనుకనూ, సాహిత్య కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వాడిని కావడం చేతనూ నన్ను మా సాలూరి వాళ్ళు మరింతగా అక్కున చేర్చు కున్నారు. అందుకే అక్కడి నుండి 24వ ఏట ట్రాన్సఫర్ అయి వెళ్ళి పోతూ ‘‘ మంచి గంధము సాలూరి మంచి తనము ’’ అన్నాను. ఇందులో రవంత అతిశయోక్తి లేదండీ.

ఆరుద్ర నవరసాలూరు సాలూరు ! అన్నారు. సాలూరి రాజేశ్వరరావూ , ఘంటసాల మాష్టారూ. సాలూరి చిన గురువు గారూ ఆ మట్టి వాసన పీల్చిన వారే కదా !

ఆ రోజుల్లో మా విద్యా సంస్థ ప్రతియేడూ ఠంచనుగా వార్షికోత్సవం ఘనంగా నిర్వహించేది.

మా మినిష్టీరియల్ స్టాఫ్ లో చుక్కా దంతేశ్వర రావు అని ఒకాయన జూనియర్ అసిస్టెంట్ ఉండే వారు. అయనకు నాటకానుభవం మెండు. మంచి నటులు, పరిషత్ పోటీలలో కూడా చాలా బహుమతులు గెల్చకున్ననటులు. ఓ ఏడాది మా మేష్టర్లతో ఓ నాటిక కాలేజీ వార్షికోత్సవంలో వేసి తీరాలని పట్టు బట్టేరు. నాటిక పేరు ఇప్పుడు నాకు గుర్తు లేదు. కాలేజీ స్టాఫ్ నుండీ, హైస్కూలు సిబ్బంది నుండీ, ఆఫీసు సిబ్బంది నుండీ నటులను ఎన్నిక చేయడం జరిగింది. అంతా ఉత్సహంగా ముందు కొచ్చేరు.

‘‘ జోరా మేషారూ ! మీరూ ఓ వేషం వేసి తీరాలండీ ’’ అన్నాడు మా దంతేశ్వరరావు.

నా పేరు అసలే చాలా కురచ. నాలుగే అక్షరాలు . జో –గా – రా – వు. అంతే ! దానిని మా మేష్టర్లు మరింత కుదించి, జోరా మేషారూ అని పిలిచే వారు. నా పేరులో రెండక్షరాలు ఎలాగూ మింగేస్తున్నారాయె ! కనీసం మేష్టారులో ష కింద ట కూడా తినెయ్యాలా చెప్పండి అనేవాడిని.

ఎవరూ వినేవాళ్ళు కారు. నేను ఎప్పటికీ వాళ్ళకి జోరా మేషారినే.

‘‘ పోదూ, నేను వేషం వెయ్యడ మేఁవిటి ?’’ అన్నాను.

‘‘ మీరు వెయ్యందే మేమూ వెయ్యం, మీరు కాదంటే ప్రన్సిపాల్ గారితో చెప్పించి మరీ ఒప్పిస్తాం ’’ అని ముద్దుగా బెదిరించేరు.

‘‘ ఆ డైలాగులూ అవీ బట్టీ పట్టడం నా వల్ల కాదు. అదీ కాక మీకు తెలుసు కదా. నాకు మతి మరపు జాస్తి. ఏ డైలాగు తరువాత ఏది చెప్పాలో నాకు గుర్తుండి చావదు. నామానాన నన్నొదిలేద్దురూ ! ’’ అన్నాను.

అదేం కుదర్దు అన్నారంతా. ఏపుగా ఉంటారు కదా ఎస్ ఐ వేషం వెయ్య మన్నారు. నాటిక చూసేను. ఆ పాత్రకు డైలాగులు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. నా వల్ల కాదు పొమ్మన్నాను. ఓ బంట్రోతు పాత్ర చాలా తక్కువ డైలాగులతో ఉన్నట్టుంది. అదయితే చేస్తానన్నాను.

‘‘ అదా ! పెద్దవాళ్ళు ... మీకు బావోదేమో ’’ అన్నాడు.

‘‘‘‘ నటన ప్రథానం కానీ వేషంతో పనేమి ’’ టన్నాను ఏదో తెలిసినట్టు.

‘‘ఏదో, మీరూ మాతో పాటే స్టేజీ ఎక్కుతున్నారు. అదే చాలు ’’అని అంతా సరే అన్నారు.

అందులో నావి మొత్తం ఆరు డైలాగులు.

1. చిత్తం

2. చిత్తం బాబయ్యా

3. చిత్తం ..అలాగే నండయ్యా, అలాగే కానియ్యండి

4. చిత్తం ... చిత్తం

5. చిత్తం ..అలా అనకండయ్యా ...

6. చిత్తం .. దండాలయ్యా.

సరిగ్గా ఇవే కాక పోవచ్చును కానీ, దాదాపు ఇవే పొడిమాటలు.

మరో సౌలభ్యం ఏమిటంటే, ఇవన్నీ వేరు వేరు చోట్ల ఒకేనటుడితో, అదే ఇంటి యజమాని వేషం వేస్తున్న మా దంతేశ్వరరావుతో నేను అనాల్సిన డైలాగులు.

‘‘ మొత్తం ఆరు చిత్తాలున్నాయి. ఏవి ఎక్కడ అనాలో గుర్తుకు రాక పోతే నన్నేం అనకూడదు. ’’ అని ముందే చెప్పాను.

నాటకం మొదలయింది. మేష్టర్లు నాటిక వేస్తున్నారని చెప్పి సాలూరి జనం విరగబడి పోయేరు.

నాపని రంగస్థలం మీదున్న బల్లలనీ వాటినీ తుడుస్తూ ఉండడమే

‘‘ జోరా మేషారూ ! ... జోరా మేషారూ ! ’’ అంటూ మా పిల్లలూ, ప్రేక్షకులూ ఒకటే చప్పట్లు. నాలో నటుడు పెట్రేగి పోయేడు. గబగబా అన్నింటినీ తుడిచేస్తూ వీర లెవెల్లో నటించేస్తున్నాను.

నాటిక మేం ఎంత ఛండాలంగా వేసినా, ఇక్కడి జనాలు అల్లరి చెయ్యరనీ, పైపెచ్చు సరదాగా చూస్తారనీ తెలిసి పోయేక ఇక నాకు ధైర్యం వచ్చీసింది.

ఆరు చిత్తాలు కాస్త పదిహేను ఇరవై చిత్తాలు వరకూ పెరిగి పోయేయి. లెక్క చూసుకో లేదు. సరదా పుట్టి నప్పుడల్లా చిత్తం అనేస్తున్నాను. నాలోని నటుడ్ని ఎవరూ ఆప లేక పోయేరు.

ఒక చోట టేబిలు మీద ఉన్న టెలి ఫోన్ ని రిసీవర్ మీదకెత్తి తుండు గుడ్డతో తుడుస్తున్నాను. . ఆ సన్నివేసంలో ఇంటి యజమానికి ఒక ముఖ్యమైన పోన్ కాల్ రావాలి. ఆ ఫోన్ కాల్ కథని మలుపు తిప్పుతుంది. రిసీవర్ ని మీదకెత్తి తుడుస్తూ ఎంతకీ క్రెడిల్ చేయడం లేదు నేను. నౌకరు పాత్రలో జీవించేస్తున్నాను. మా దంతి ‘‘ ఫోను పెట్టండి జోరా మేషారూ ’’ అని సైగలు చేస్తున్నా పట్టించు కోవడం లేదు. చివరకి నేను రిసీవరు పెట్టకుండానే తెర వెనుక నుండి కాలింగ్ బెల్ మ్రోగడం, నా చేతిలోని రిసీవరుని మా దంతేశ్వర రావు అందు కోవడం జరిగి పోయేయి. అంతా ఒకటే నవ్వులే నవ్వులు !

‘‘ నేనింక ఈ బాధలు పడ లేనురా ... ఏ రైలు కిందో తల పెట్టీవాలనుందిరా ... ’’ అని ఇంటి యజమానిగా మా దంతి డైలాగుకి ... నేను మరో చోట చెప్పాల్సిన ‘‘ చిత్తం ... అలాగేనండయ్యా ... అలాగే కానియ్యండి ... ’’ అనీసేను.!

దాంతో మా దంతి తెల్ల బోవడం, జనాలు కేరింతలు కొట్టడం ... మరడక్కండి ...

మొత్తం మా మేష్టర్ల నాటిక రసాభాసగా ముగిసింది.

వెన్న పూసలాంటి మనసున్న మా సాలూరి జనాలకి అదేమీ పట్ట లేదు. మేం నాటిక వేయడమే చాలునన్నంతగా ముచ్చట పడి పోయేరు.

ఇలా జరిగింది నా నాటక రంగ ప్రవేశం. మరెప్పుడూ నటుడిగా స్టేజి ఎక్కింది లేదు. అందు వల్ల తెలుగు నాటక రంగం ఇప్పటిదాకా బతికి బట్ట కట్టిందను కుంటాను.

స్వస్తి.


6, జూన్ 2013, గురువారం

అలమండయినా ... అమలాపురం అయినా ... వాళ్ళంతే ! ... సెబాసో ..పతంజలీ !కోనసీమలో 1996 లో పెద్ద గాలి ... వెర్రిగాలి వీచి లక్షలాది కొబ్బరి చెట్లు నేల కూలి, రవాణా వ్యవస్థ ఛిన్నాభిన్నమై పోయిన విషయం తెలుసు కదా ? అప్పటి వరకూ డబ్బుకు చింత లేకుండా హాయిగా గడిపిన వాళ్ళెందరో ఒక్క రోజులోకుదేలయి పోయేరు. అక్కడి వాళ్ళు అన్న పానాదులకు కూ డా విలవిలలాడి పోయేరు. ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాల నుండి ఎందరో వారిని ఆదుకోడానికి వచ్చేరు..

ఆ రోజులలో నేను విజయ నగరం జిల్లా సాలూరు ప్రభుత్వ కళాశాలలో అనుబంధంగా ఉండే ఉన్నత పాఠశాలలో పని చేస్తూ ఉండే వాడిని. మా సోదర ఉపాధ్యాయు లిద్దరితోనూ, మా సాలూరులో ఉన్న బాలికల పాఠశాలలో పని చేస్తున్న మరి ఒకరిద్దరు ఉపాధ్యాయులతొ కలిసి ఒక టీమ్ గా ఏర్పడి మొత్తం ఆరుగురం అక్కడికి సహాయ కార్యక్రమాలలో మా వంతు సాయం చేయడానికి బయలు దేరాం.

ఊర్లో చందాలు వసూలు చేసి మొత్తం ఇరవై వేల వరకూ పోగు చేసాం. మూడు బస్తాల పాత బట్టలు సేకరించాం. సాలూరు R.T.C డిపో మేనేజరు గారు మాకు వెళ్ళి రావడానికి ఉచితంగా బస్ పాస్ ఇచ్చి తన వంతు సాయం చేసారు.

సేకరించిన డబ్బూ, బట్టల మూటలతో తే 24 -11 -1996 దీన అమలాపురం బయలు దేరాం. ఆరు గంటల ప్రయాణంతో అక్కడికి చేరాం. దిగుతూనే పెను గాలి బీభత్సం మిగిల్చిన విషాదం చూసాం. మేం భోజనాల కోసం వెళ్ళిన హొటల్ లో సీలింగ్ ఫేన్లన్నీ రెక్కలు జడలు అల్లి నట్టుగా మెలి తిరిగి పోయి ఉన్నాయి. కిటికీ, తలుపుల రెక్కలు విరిగి పోయి ఉన్నాయి. వీధులన్నీ నానా బీభత్సంగానూ ఉన్నాయి.

మేం తెచ్చిన బట్టల మూటలు హొటల్ వారికి చూస్తూ ఉండమని అప్పగించి, దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మేం వచ్చిన పని చెప్పాం.

‘‘ మంచి దండీ ... రోజూ యిలా చాలా టీమ్ లు వస్తున్నాయి. వాళ్ళు తెచ్చిన బట్టలనూ, దుప్పట్లనూ మీద పడి జనాలు లాక్కు పోతున్నారు. అంత దుర్భర పరిస్థితిలో ఉన్నారు పాపం. ఒకప్పుడు నాకేమిటని బతికిన వాళ్ళు ... ఇప్పుడు తిండికీ గుడ్డకీ వాచి పోతున్నారు. మీరు ఈ మూటలని ఆటోలోనో, బస్ లోనే వేసుకుని వెళ్తారు ... మీరు పంచే లోపునే జనాలు కలియబడి పోయి ఎవరికి దొరికినవి వాళ్ళు తీసుకు పోతారు.. ఒక్కో సారయితే, ఎక్క డెక్కడి నుండో వారికి ఇద్దామని తెచ్చిన బట్టల మూటలని విధి లేక సక్రమంగా పంచే పరిస్థితి లేక మూటలు అక్కడే  విసిరేసి వెనక్కి వచ్చేస్తున్నారు.కొందరు ... ఎలా చేస్తారో ... జాగ్రత్త.

మరో విషయం లోతట్టు గ్రామాలకు ఎవరూ చేరు కోవడం లేదు. సహాయమంతా ఎంత సేపూ ఈ చుట్టు పట్ల గ్రామాల వారికే అందుతోంది.

ఎదుర్లంక లాంటి గ్రామాలకి అసలు సాయమే అందడం లేదు. అక్కడి వాళ్ళు లబోదిబో మంటున్నారు ...’’ అని ఎస్.ఐ చెప్పారు.

ఎలాగయినా ఆ ఎదుర్లంక గ్రామానికి చేరుకుని అక్కడి వారికే మేం తెచ్చిన సాయం అందించాలని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాం.‘‘ సరే, అక్కడికి వెళ్ళగానే రాజు గారుంటారు ... వారిని కలుసుకుని మాట్లాడండి ... మీకు ఆయన సహకరిస్తారు ... ’’ అని చెప్పారు పోలీసు వారు.

ఎలా వెళ్ళాలో భోగట్టా చేసాం. అమలా పురానికి పెద్ద దూరమేం కాదు.

ఓ ప్రక్క అఖండ గోదావరి, ఓ ప్రక్క పొలాలూ .ఊళ్ళూ ఉండే సన్నని గట్టు మీద ప్రయాణం. ఎదురుగా వచ్చే వాహనాలకు దారివ్వడమే కష్టం.ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా గోదారి పాలవుతాం. లేదా, ఇటు వేపు దొర్లి పడతాం. వాళ్ళకా దారంట ప్రయాణం అలవాటే. మాకు మాత్రం ఏక కాలంలో బీభత్స, అద్భుత, భయానక రసాలు అనుభవంలోకి వచ్చేయి.

బస్ లో ఎరుర్లంక చేరుకున్నాం. ఊరు చిన్నదే, కానీ అక్కడ నుండి గోదావరి నదిలో పంట్ మీద  యానాం చేరుకునే వీలుంది. ఇంకా  అక్కడ వంతెన రాని రోజులవి. మేం తెచ్చిన బట్టల మూటలకు మేమే గట్టి బందోబస్తుగా నిలిచేం.

ఇక పోలీసు వారు చెప్పిన రాజు గారిని కలవాలి. వారి సాయం తీసు కోవాలి. మేం సేకరించి తెచ్చిన బట్టలూ, డబ్బూ నిజమైన బాధితులకి చేరాలి. ఇదీ మా సంకల్పం,

రాజు గారి గురించి ఆరా తీసాం. అక్కడ పంచె. ధోవతి ధరించి, గుబురు మీసాలతో , కొన దేరిన ముక్కుతో కనిపించిన వ్యక్తిని చూసి రాజు గారి గురించి వాకబు చేయాలనుకున్నాం. పోలీసు వారు రాజు గారిని కలవమన్నారే కానీ, వారి పేరు చెప్ప లేదు. మేమూ అడగ లేదు. ఎంత తెలివి తక్కువ పని చేసామో తెలిసొచ్చింది.

‘‘ ఎవరండీ తమరు ? ’’ దర్పంగా అడిగేరతను.

‘‘ రాజు గారిని కలవాలండీ ’’ అన్నాం ఏక కంఠంతో.

ఆయన భళ్ళున నవ్వేరు,

‘‘ ఏ రాజు గారు కావాలండీ ? ఇక్కడ చాలా మంది రాజు లున్నారు. ఎలక్ట్రిక్ రాజున్నారు. వాటర్ రాజున్నారు. రోడ్ల రాజు గారున్నారు.గుడిసెల రాజున్నారు. బోయినాల రాజున్నారు. మందుల రాజున్నారు. క్రమశిక్షణ రాజున్నారు. రిపేర్ల రాజున్నారు . పంపిణీ రాజు గారున్నారు. ... ఇందరిలో మీకు ఏ రాజు గారు కావాలండీ ?... ’’ అనడిగేరు.

మేం తెల్లబోయి , నోట మాట రాకుండా ఉండి పోయేం.

ఏం చెప్పాలో తెలియక తలలు గోక్కున్నాం.

మా అవస్థకి జాలి పడి ఆయనే ఇలా వివరించేరు ...

‘‘ మరేం లేదు .. పెద్ద గాలికి  ఇక్కడి జనాల జీవితాలు ఎలా ఛిన్నా భిన్న మై పోయాయో కళ్ళారా చూస్తున్నారు కదా ? ఎక్క డెక్కడి నుండో వీళ్ళని ఆదుకోడానికి వస్తున్నారు. స్థానికంగా ఇక్కడి రాజులం మేం. మా వంతు సాయం అందించడం మాకు  విధాయకం కదా ? అందుకే రాజులందరం కలిసి మాకు మేమే రకరకాల కమీటీలు వేసుకుని వారం రోజుల నుండీ సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్నాం.

ఇక్కడి రోడ్లు ధ్వంస మయ్యాయి. అధికారుల చేత వాటిని యుద్ధ ప్రతిపదిక మీద బాగు చేయించే పనులను ఓ రాజు గారు తన బృందంతో పర్యవేక్షిస్తున్నారు. అంచేత ఆ రాజుగారు రోడ్ల రాజుగారన్నమాట ... అలాగే, తాగు నీటి అవసరాలు సత్వరం చూసే వాటర్ రాజుగారూ, పడి పోయిన ఎలక్ట్రిక్ స్తంభాలను నిలబెట్టించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనులను చూసే ఎలక్ట్రిక్ రాజు గారూ, ఆకలితో హాహాకారాలు చేసే జనాలకి బోయినాల ఏర్పాట్లు చూసే బోయినాల రాజు గారూ, అల్లర్లు జరక్కుండా చూసే క్రమశిక్షణ రాజు గారూ ... చిన్నా చితకా రోగాలకు వైద్య సాయం అందేలా చూసే మందుల రాజు గారూ, పడిపోయిన పాకలను లేవనెత్తించే పనులు చూసే గుడిసెల రాజు గారూ ... ఇతర చిన్న చిన్న రిపేర్లను దగ్గరుండి చూసుకునే రిపేర్ల రాజుగారూ ... సహాయ కార్యక్రమాలను సజావుగా జరిగేలా చూసే పంపిణీ రాజు గారూ ... ఇలా ఇక్కడ రకరకాల రాజులున్నాం. మీకు కావలసిన రాజుగారెవరో చెప్పండి ...’’ఇదంతా వింటూ ఉంటే, పతంజలి గారి రాజు గోరు నవలలో ఓ సన్నివేశం చప్పున గుర్తుకు రావడం లేదూ ? !

క్లుస్తంగా మరో సారి దాన్ని నెమరు వేసుకుందామా ?

కొత్త వలస సంత నాడు కనబడి. అత్త జబ్బుకి మందిస్తాను దివాణానికి వచ్చీ .. అని చెప్పిన రాజు గారిని వెతుక్కుంటూ వచ్చేడు కలగాడ చిన అప్పల నాయుడు.

తీరా వచ్చేక, ఆ మందు లిచ్చీ రాజు గారిని, తెల్లగా పొడుగ్గా ఉండే రాజు గారిని . ఎల్ల గుబ్బ గొడుగులా ఉండే రాజు గారిని, మీసాలుండే రాజు గారిని, మూరెడు ముక్కుండే రాజు గారిని అక్కడ పోల్చుకో లేక తికమక పడి పోతూ ఉంటాడు.

పల్చటి. తెల్లటి గ్లాస్కో జుబ్బా,నీరు కావి లుంగీ వేసుకుని.పావుకోళ్ళు తొడుక్కుని, వెడల్పాటి నుదురు మీద అగరు బొట్టు పెట్టుకుని చెవులకు ఎర్రపొళ్ళ తమ్మెట్లు కలిగి ఉన్న పెదప్పల రాజు కనిపిస్తే, నాయుడు ఇబ్బంది పడుతూ. తల గోక్కుని, ‘‘ రాజు గోరి ఇల్లెక్కడండీ ? ’’ అనడిగేడు.

అప్పుడు పెదప్పలరాజు హుక్కా గుడ గుడ పీల్చి, నవ్వుతూ ఇలా అన్నారు :

‘‘ సంతకి చీటి లచ్చికి గాజులు లాగుందోయి నీ ప్రశ్న. రాజు గారంటే ఏ రాజు గారు ?మా కుటుంబంలో గోపాల రాజు లున్నారు ...విజయ గోపాల రాజు లున్నారు ..వేంకట విజయ గోపాల రాజు లున్నారు ...సన్యాసి వేంకట విజయ గోపాల రాజు లున్నారు ...రంగ రాజు లున్నారు.పెద రాజు గారి చంటి బాబు గారి చిన రాజు లున్నారు ..చిన రాజు గారి తాత బాబు గారి చిట్టి రాజు లున్నారు ... పెద రాజు గారి పెద బాబుగారి పెద్ద అప్పల రాజంటే, నేను ... ఇందరు రాజుల్లో నీ కెవరు కావాలోయ్ నాయుడూ ! ’’

ఆ తర్వాత ఎలాగో వారి సాయం తోనూ. ఊరి పెద్దల సాయంతోనూ మేం తెచ్చిన బట్టలను కావలసిన వారికి అందించాం. ఇంటికో రెండు వేలు చొప్పున వారు సూచించిన బాధితులకు అందించే మనుకోండి ...


అదండీ సంగతి.

అలమండయినా, అమలా పురం అయినా రాజుల మాట తీరూ, ధోరణీ, , పెంకె తనాలూ .. అన్నీ ఒక్కలాగే ఉంటాయి కాబోలు ?

సెబాసో పతంజలీ ! .. భేష్ భేష్ ... ఏం రాసే వయ్యా దివాణాల జీవితాలని !

అందుకే నువ్వు వన్ అండ్ ఓన్లీ పతంజలివి !
31, మార్చి 2013, ఆదివారం

తమాషాగా లేదూ ? ! ...
అతి సరిచయా దవఙ్ఞా అని చెబుతారు. అంటే,మరీ సన్నిహితంగా ఉండే దాని పట్ల కొంత ఉదాసీనభావం తప్పదు. ఎప్పుడూ దూరపు కొండలే నునుపు కదా !

వంట యింటి కుందేలు అని ఒక తెలుగు సామెత కూడా ఉంది. వంటింటి వాసనలకు మరిగిన కుందేలు ఎక్కడికీ పోదు. అక్కక డక్కడే తిరుగుతూ ఉంటుంది. అంచేత,ఎప్పుడు కావాంటే అప్పుడు దానిని పట్టు కోవచ్చును.
విజయ విలాసం అనే ప్రబంధంలో చేమకూర వేంకట కవి ఓ పద్యంలో ఈ సామెతను చక్కగా ఉపయోగించు కుని ఒక చక్కని పుర వర్ణన చేసాడు. ఇంద్రప్రస్థ పురంలో మేడలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయిట. అందు వల్ల ఆకాశంలో ఉండే చంద్రుడు తన దారంట తానుపోతూ ఆ మేడల కిటికీల గుండా పయనిస్తూ అవతలి వేపుకి పోతూ ఉంటాడుట. ఆ నగరు లోని రాణి వాసపు అమ్మాయిలకు ఆ చందమామ లోని కుందేలుని పట్టు కోవాలని కోరిక. కుందేలుని ధరిస్తాడనే కదా చంద్రుడికి శశాంకుడు అని పేరు కలిగింది. పూర్ణ శశాంకుడు అంటే నిండు చందమామ. సరే ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్ళి నట్టున్నాం !
మళ్ళీ ప్రస్తుతానికి వద్దాం.
ఇలాంటిదే అర చేతిలో ఉసిరి కాయ అని కూడా ఒక జాతీయం ఉంది. దీన్ని సంస్కృతీకరిస్తే కరతలామలకం అవుతుంది. అర చేతిలో ఉసిరి కాయని ఎప్పుడేనా గుటకాయ స్వాహా అనిపించొచ్చును కదా !
ఇదంతా ఎందుకు చెబు తున్నా నంటే,
మనకి లభ్యమాన మయేదాని పట్ల అంతగా ఆసక్తిని చూపించం. చిన్న పిల్లాడు తన చేతిలో తాయిలం ఉంచుకుని,ఎదుటి వాడి చేతి లోని తాయిలాన్ని చూడడం లాంటి దన్నమాట.
మరి,కాక పోతే ఏమిటి చెప్పండి ?
మా స్వస్థలానికి అరకు లోని బొర్రా గుహలూ, హైదరాబాద్ కి బెల్లుమ్ గుహలూ

కొంచెం అటూ యిటూగా దాదాపు సమాన దూరంలో ఉన్నాయి.
మా స్వగ్రామం పార్వతీ పురం లోనూ,పని చేసి పదవీ విరమణ చేసిన విజయ నగరం లోనూ దగ్గర దగ్గర అరవై యేళ్ళ వరకూ గడిపానా ? దగ్గర లో ఉన్న బొర్రా గుహలు చూడనే లేదు !
అలాగే, ఉద్యోగ విరమణానంతరం భాగ్య నగరంలో నాలుగున్నరేళ్ళు గడిపానా ?బెల్లుమ్ గుహలు చూడనే లేదు.
నివాసం హైదరాబాద్ మార్చేక ,ఇహ లాభం లేదని మావేపు వచ్చి,అరకు లోని బొర్రా గుహలు చూసాము. అలాగే, హైదరాబాద్ వదలి ఇటీవల తిరిగి విజయ నగరం మకాం మార్చేసాక, మరో పని మీద హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుండి బెల్లుమ్ గుహలు చూసాము.
అంటే ఏమన్నమాటా ?. వొళ్ళు బద్ధకం. చూదాంలే అనే నిర్లిప్త ధోరణి. చూసేం కనుక సరి పోయింది. లేక పోతే ఎన్ని అందాలు చూసే అదృష్టాన్ని పోగొట్టు కునే వాళ్ళమో కదా !
అందు చేత,నేను అందరికీ చేసే విన్నపం ఏమిటంటే, దూరభారాలలో ఉండే వింతలనీ,చూడ తగిన ప్రదేశాలనీ చూడండి. ఆ అవకాశం లేక పోతే,కనీసం దగ్గరలో ఉన్న వాటిని వాయిదాలు వేయకుండా వెంటనే చూడండి. తర్వాత చూద్దాంలే అనుకుంటే చాలా కోల్ప,ఎలాగయితే నేం బెల్లుమ్ గుహలు చూశాం అన్నాను కదా ! వాటిని గురించి కొద్దిగా పరిచయం చేయడమే ఈ టపా ముఖ్యోద్దేశం.

బిలం అనే సంస్కృత పదానికి రంధ్రం లేదా కన్నం అని అర్ధం కదా. జనబాహుళ్యం నోటబడి అదే క్రమంగా బెల్లుమ్ గా ఈ గుహలు మన రాష్ట్రం లోని నంద్యాల పట్టణానికి 60 కి,మీ దూరం లోనూ,కర్నూలుకి 105 కి.మీ దూరం లోనూ. తాడిపత్రికి కేవలం 30కి.మీ దూరంలోనూ ఉన్నాయి !
ఆసియా ఖండంలో పొడవైన గుహలలో ఇది రెండోది మాత్రమే.దీనిని మొదటి సారిగా ఒక బ్రిటిష్ సర్వేయరు 1884 లో చూసాడుట. రాబర్ట్ అతని పేరు. తర్వాత 1982 – 84 ల మధ్య ఒక జర్మనీ దేశ బృందం దీనిని చూసిందిఈ గుహలు 1988 లో మన పర్యాటక శాఖ కంట పడడం దానిని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్ది,
ఎలాగయితేనేం,2002 నుండి పర్యాటకులను అనుమతించడం జరుగుతోంది ...

3.5 కి.మీ పొడవైన ఈ గుహలు ప్రస్తుతం 1.5 కి.మీదూరం వరకూ మాత్రమే చూడడానికి అవకాశం ఉంది.

ఈ గుహలు మానవ నిర్మితాలు కావు కదా. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి. నీటి కోత చేత,గాలి కోత చేత ఏర్పడిన పొడవైన అందమైన గుహలు యివి !

ఒక మోస్తరు కన్నం లోనుండి ప్రవేశించి ( మొదటి ఫొటో చూడండి.. )విశాలమైన బిలం లోకి నడుచు కుంటూ పోవడం నిజంగా ఒక మధురానుభూతి అనే చెప్పాలి ! విద్యద్దీపాలు అక్కడక్కడా ఉంచేరు కనుక సరి పోయింది కానీ,లేక పోతే గాడాంధకారమే !
ఇలా అన్నానని భయపడే పని లేదు. ఆ మాట టూరిజం వాళ్ళు ముందే చెప్పి తగిన భరోసా యిచ్చేరు. సైన్ బోర్డులు పెట్టి. కరెంటు పోతే ఎక్కడి వారు అక్కడే ఓ క్షణం నిలుచుండి పోతే సరి,జెనరేటరుతో వెల్తురు వస్తుంది. మరేం భయం లేదు.

గుహలలో చాలా చోట్ల కొంచెం దూరంలో కనబడే విద్ద్యుద్దీపాల కాంతులు మనకి మండే అగ్ని గోళాలలా కనిపిస్తాయి !
( ఫొటోలు చూడండి )

విశాలమైన ప్రాంగణాలూ,అక్కడ క్కడా ఇరుకైన తావులూ,నీటి ధారలూ ... ఓహ్ !

చెప్పడానికి మాటలు రావు ! వెళ్ళగా వెళ్ళగా ఎక్కడో చివర పెద్ద జలధార కనిపించడం చూసి మతి పోతుంది !

పాతాళ గంగ అని దానికి పేరు. అంతే,అక్కడితో సరి. మరింక మనం ముదుంకి వెళ్ళేది లేదు. గుహలు మాత్రం ఇంకా చాలా పొడవుగా ఉన్నాయి. మనకి అనుమతి అంత వరకూ మాత్రమే. అదే చాల్లెండి. అప్పటికే ఒకటిన్నర కిలో మీటర్ల దూరం నడిచి వచ్చి ఉన్నాం. తిరిగి ఏదారిని వెళ్ళామో,అదే దారిని తిరిగి నడుచుకుంటూ బయటికి వస్తాం. బయటి కొచ్చేక ఒక్క సారిగా బాహ్య ప్రపంచం కనిపించి పులకించి పోతాం ! ఎక్కడో పాతాళం లోకాస్సేపు గడిపి వచ్చిన అనుభూతి కలుగుతుంది మనకి !
ఇంతకీ అంత దూరం గుహలలో నడిచామా ?మనం తిరుగుతున్న గుహల పైకప్పు మీద అంతా మామ్మూలే. జన సంచారమూ,వాహనాల రాకపోకలూ,అన్నీ ఉంటాయని తెలుసు కుంటే ... తమాషాగా లేదూ ?!27, మే 2012, ఆదివారం

కడుపు నింపిన కమ్మని పద్యం !
విద్యా లాభము నందగోరి యిటకున్ విచ్చేసి యున్నారమున్
విద్యా దేవి దయారసంబునన్జెప్పింపంగ నుప్పొంగుచున్
విద్యా బుద్ధియు నాయువున్ యశము సమ్యగ్వృద్ధి నారోగ్యమున్
విద్యా దేవతఁ గూడి మా కొసఁగు ముర్విన్ సింహశైలాథిపా !
ఈ పద్యం మా విజయ నగరం శ్రీ సింహాచల దేవస్థానం వారి ఉచిత విద్యార్ధి భోజన సత్రంలో రోజూ రెండు పూటలా భోజనాలకి ముందు విద్యార్ధులు పఠించే పద్యం. ఈ పద్యం గురించి తలచు కుంటేనే మాకు కడుపు నిండి పోయి నట్టనిపిస్తుంది.
ఎందుకో ఈ టపా కొంచెం ఓపికగా కడదాకా చదివితే మీకే తెలుస్తుంది.
వందేళ్ళ పైబడిన చరిత్ర కలిగిన ఈ భోజన సత్రంలో ఆ నాటి నుండి ఈ నాటి వరకూ వేల వేల విద్యార్ధులు రెండు పూటలా ఉచితంగా భోజనం చేసి, నగరం లోని వివిథ విద్యా సంస్థలలో చదువుకొని అభివృద్ధి లోకి వచ్చిన వారే. ఒక విధంగా ఈ భోజన శాల విద్యార్ధుల పాలిట కల్ప తరువు. ఇదే లేక పోతే ఎంత మంది చదువులకి దూరమై పోయే వారో. విజయ నగర ప్రభువుల వితరణకీ, వారు చేసిన విద్యా సేవకీ నిదర్శనాలుగా శతజయంతులు చేసుకొన్న పలు విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయి. ప్రభుత్వ మహా రాజా సంగీత కలాశాల, మహారాజా వారి డిగ్రీ కలాశాల, మహారాజా ప్రభుత్వ సంస్కృత కలాశాల, వాటి అనుబంధ పాఠశాలలూ ... ఇలా వివిధ విద్యా సంస్థలతో మా విజయ నగరం నిజంగా విద్యల నగరమే.
ఈ విద్యా సంస్థలన్నీ ద్వారం నాయుడు గారూ, గురజాడ అప్పారావు గారూ, ఆది భట్ల నారాయణ దాసు గారూ, తాతా సుబ్బరాయ శాస్త్రులవారూ వంటి మహా మహులు పని చేసినవే కావడం గమనించాలి. ఇలాంటి గొప్ప విద్యా సంస్థలలో చదువు కోవాలని ఎక్కడెక్కడినుండో వచ్చే పేద విద్యార్థులకు ధనాభావం వారి చదువుకు ఆటంకం కలిగించ కుండా శతాబ్ది కాలం పైబడి ఈ భోజన సత్రం అమ్మ లాగా, అన్నపూర్ణలాగా ఆదుకుంటోంది. వారి కడుపు నింపుతోంది.
విజయ నగర ప్రభువులలో 1883 -1922ల మధ్య కాలంలో జీవించిన 4వ విజయరామ గజపతి మహా రాజులవారు దీని స్థాపనకు కారకులు. వీరు 3వ విజయరామ గజపతుల వారి సతీమణి అలక్ రాజేశ్వరీ దేవి గారి మేనల్లుడు. దత్తుడు. వీరి దత్తనామం పూసపాటి 4వ విజయరామ గజపతి. వీరి అర్ధాంగి లలితకుమారి గారు. ప్రసిద్ధి చెందిన కోరుకొండ సైనిక్ స్కూలు, ఇంకా, విజయ నగరం లోని సంస్కృత కలాశాలల భవన నిర్మాతలు 4వ విజయరామ గజపతులే. వీరి దత్తత చెల్లదంటూ దాయాదులు తెచ్చిన దావాయే పెద్ద దావాగా చాలా సంచలనాత్మకమైన దావాగా అందరకీ తెలిసినదే. ఈ పెద్ద దావా విషయం లోనే గురజాడ అప్పారావు గారు చాలా కృషి చేసి దావా గెలవడానికి పాటు పడ్డారు.
ఈ ముచ్చట్లన్నీ ప్రక్కన పెడితే, ఈ భోజన సత్రం ఏర్పాటుకి చెందిన ఒక ఆసక్తికరమైన కథ పెద్దలు చెబుతూ ఉంటారు. ఒక రోజు సాయంకాలం 4వ విజయరామ గజపతి మహారాజుల వారు తమ కోట మేడ మీద చల్లగాలికి పచార్లు చేస్తూ ఉండగా బజారు వీధి గుండా నాటు బళ్ళు బారులు తీరి వెళ్తూ ఉండడం గమనించారుట. దివాన్ గారిని ఆ బళ్ళ గురించి ప్రభువులు ఆరాతీసారుట. సింహాచలం నుండి గజపతుల వారికి చెందిన భూముల పంటల నుండి వచ్చిన ఆదాయం రూపాయలలో ఆ బళ్ళ మీద రాజు గారి కోశాగారానికి తరలిస్తున్నారని దివాన్ చెప్పారుట. వెంటనే ప్రభువులు స్పందించి, సింహాచలం భూములనుండి సాలు సాలుకీ వచ్చే ఆ ఆదాయాన్ని తమ బొక్కసంలో కలిపేసు కోవడం సరికాదని, ఆ డబ్బుతో ఏదేని మంచి పని చేయాలని తలపెట్టారు. అలా వారి ఆలోచన నుండి ఆవిర్భవించినదే ఈ అన్నదాన సత్రం. తొలి రోజులలో విద్యార్ధులే కాక పేదలూ, యాత్రికులూ కూడా ఇక్కడి అన్నప్రసాదాన్ని స్వీకరించే వారుట. కాలక్రమంలో
శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి విద్యార్ధి భోజన వసతి గృహం గా మారి నగరంలోని పలు విద్యా సంస్థలలో చదువుకోడానికి వచ్చే విద్యార్ధినీ విద్యార్ధులకు భోజన వసతి చేకూరుస్తోంది.ఈ అవిచ్ఛిన్న అన్నదాన క్రతువు , తంజావూరి అన్నదాన సత్రం కంటె భిన్నంగా అన్న దానంతో పాటు విద్యా దానం కూడా చేస్తోంది. అందుకే తంజావూరి అన్నదాన సత్రం సోమరులు అనే కథలు వ్యాప్తి చెందినట్టుగా ఇక్కడి భోజన సత్రం గురించి అలాంటి కథలేవీ లేవు. పైపెచ్చు ఇక్కడి సత్రంలో భోజనం చేసి, ఇక్కడి విద్యాలయాలలో చదువుకొన్న వారిలో దేశదేశాలలో కీర్తినందిన మహా మహుల జాబితా, నాకు తెలిసినంతవరకూ చెప్పాలంటే కూడా ఈ చోటు చాలదు.

నేను మా విజయనగరం సంస్కృత కలాశాలలో (కళాశాల కాదు, కలాశాల అనేదే సరైనదని మా గురువులు చెబుతారు) భాషాప్రవీణ చదివే రోజులలో ఇక్కడ 69 నుండీ 72 వరకూ భోజనం చేసి, చదువుకొన్నాను.
ఈ విద్యార్థి భోజన వసతి గ హాన్ని చౌల్ట్రీ అని ఇక్కడ పిలుస్తూ ఉంటారు. ఆ రోజులలో ఇక్కడ ప్రతి రోజూ రెండు పూటలా వివిధ విద్యా సంస్థలకు చెందిన 100 మంది విద్యార్ధినీ విద్యార్ధులం భోజనం చేసే వాళ్ళం ( ఇప్పుడీ సంఖ్య రెట్టింపయిందని తెలిసింది) ఆ నాటి ముచ్చట్లు కొన్ని మీతో పంచు కోవాలని ఇది రాస్తున్నాను.
భోజనం ప్రతి రోజూ ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకీ, రాత్రి భోజనం 6 గంటలకీ పెట్టడం జరిగేది. ఈ వేళలు ఉదయం పూట పాఠశాలలకీ, కలాశాలలకీ వెళ్ళే వారికీ, రాత్రి చదువుకొనే వారికీ ఎంతో సదుపాయంగా ఉండేది. ఇక్కడి సమయ పాలన గురించి ఎంత చెప్పినా చాలదు. భోజనాలు వడ్డించే పెద్ద హాలులో విద్యార్ధలందరకీ సరిపడేలా పీటలు ఉండేవి. భోజనం అరిటాకులలో వడ్డించే వారు. ( ఇప్పుడు పీటలకు బదులు కూర్చోడానికి సిమెంటు బల్లలు కట్టారు. అరిటాకులకి బదులు స్టీలు కంచాలు వాడుతున్నారు. )
భోజనంలో అన్నం, పప్పు, నెయ్యి, ఒక కూర, పచ్చడీ, మజ్జిగా ఉండేవి. భోజనం ఏ విధంగానూ వంక పెట్టడానికి వీలు లేని విధంగా ఉంటుంది.
వేసవి శలవులు ముగిసి, నగరం లోని విద్యా సంస్థలలో అడ్మిషన్లు మొదలయ్యాక, అవసరం ఉన్న విద్యార్థులు ఈ సత్రంలో ఉచిత భోజనానికి కూడా అర్జీ పెట్టు కోవాలి. అలా వచ్చిన అప్లికేషన్ ల లో అర్హత గలవారికి, ఒక్కో విద్యా సంస్థకీ ఇన్ని సీట్లు చొప్పున సీట్లు కేటాయిస్తారు. మా రోజులలో ఈ చౌల్ట్రీ సీటు వచ్చే వరకూ చాలా మంది విద్యార్ధులకు మా గురువులే ఏదో ఒక త్రోవ చూపించే వారు. కొందరకి తమ ఇళ్ళ లోనే భోజనం ఏర్పాటు చేసే వారు. కొందరకి తామే స్వయంగా ఎవరింటి లోనో వారాలు కుదిర్చే వారు. ఇక సత్రం భోజనానికి సీటు వచ్చిందా, ఇక వాని చదువుకి ఏ అటంకమూ ఉండదు !
మా రోజుల సంగతి చెబుతాను ....
సరిగ్గా ఉదయం తొమ్మిది గంటల వేళకీ, సాయంత్రం ఆరు గంటల వేళకీ మా భోజన సత్రం కళకళ లాడిపోతూ ఉండేది.
శ్లోకాలు వల్లిస్తూనో, కౌముది సూత్రాలు మననం చేసుకుంటూనో, చిన్న చిన్న సాహిత్య చర్చలు చేస్తూనో మా సంస్కృత కలాశాల విద్యార్థలం సందడి చేసే వాళ్ళం. కొత్తగా పద్యాలు అల్లడం అలవరచు కొంటున్న మా చింతా రామకృష్ణ ( ఆంధ్రామృతం బ్లాగరు) లాంటి వారు ఆశుపద్యాలు అలవోకగా చెబుతూ ఉండే వారు. ఊగరా !ఊగరా !! కథల ఫేమ్ స్వర్గీయ దాట్ల నారాయణ మూర్తిరాజు ( మాకు బాగా జూనియరు) ఖాకీ నిక్కరొకటి వేసుకుని, చేతిలో తాను తయారు చేసిన ఒక లిఖిత పత్రికతో తిరిగే వాడు. అప్పటి నుండీ పత్రికా సంపాదకుడు కావాలనే ఉబలాటం అతనిలో ఉండేది. అనంతర కాలంలో అయ్యేడు కూడానూ. ఇక, నేనూ, మా పీ.వీ.బీ శ్రీరామమూర్తీ అచ్చులో వచ్చిన మా కొత్త కథల గురించి మహా ఉత్సాహంగా కలబోసుకునే వాళ్ళం. ఓ ప్రక్క మా సంస్కృత కలాశాల విద్యార్ధుల సందడి ఇలా ఉంటే, మరో ప్రక్క సంగీత కళాశాల విద్యార్ధులు ఏవేవో రాగాలాపనలతో హోరెత్తించే వారు. డిగ్రీకాలేజీ విద్యార్ధులు మాకు తెలియని పాఠ్యాంశాల గురించి సీరియస్ గా మాట్లాడుకునే వారు. ఇదంతా మా నాని బాబు గారు విద్యార్ధుల అటెండెన్సు తీసుకోడం ముగించి, ఇక వడ్డనలు మొదలెట్టండి అంటూ హోలు లోకి వచ్చే వరకూ. పులి లాంటి ఆ మనిషి రాగానే అంతా గప్ చిప్. వడ్డన బేచ్ వడ్డన మొదలెట్టేది. సత్రం భోజనం చేసే విద్యార్ధులలోనే పదేసి మందిని వారానికో సారి మారుస్తూ వడ్డన బేచ్ గా నోటీసు బోర్డులో ఉంచే వారు. దాని ప్రకారం ఆ వారం రోజులూ రెడు పూటలా ఆ విద్యార్ధులు ముందు బేచ్ కి వడ్డనలు చేసాక, లేట్ బ్యాచ్ విద్యార్ధులతో కలసి అన్నాలు తిని తమ విద్యాసంస్థలకి వెళ్ళాలి.
ఒక విద్యా సంవత్సరంలో ఒక్కో విద్యార్ధికీ ఈ వడ్డన బేచ్ లో వారం రోజుల పాటు వడ్డించాల్సిన పని రెండు మూడు పర్యాయాలు తగిలేది. కొంతమంది భోజన ప్రియులు ఐచ్ఛికంగా వడ్డన బేచ్ లో ఉండడానికి కుతూహలం చూపుతూ ఉండే వారు. అలాగయితే కావలసినతం తిన వచ్చునని వారి ఆలోచనగా ఉండేది. నిజానికి అక్కడ ఎవరికి కావలసినంత వారికి వడ్డన జరిగేది. వడ్డన బేచ్ కి ఉండే అవసరమే లేదు. కానయితే, కమ్మనయిన నెయ్యి కావలసినంత ముద్ద పప్పులో జారీతో ఒంపుకో వచ్చు ననే జిహ్వచాపల్యమే వారు
వడ్డన బేచ్ లో ఉండేందుకు ఇష్ట పడడానికి కారణమనుకుంటాను.
ఈ సత్రం భోజనాల నిర్వహణ చూసే మా నాని బాబు గారి గురించి చెప్పక తప్పదు !
కొంచెం మాసిన పంచె, తెల్లని పొట్టి చేతుల జుబ్బా, ‘సాదా సీదాగా కనిపిస్తూ,వృద్ధాప్యం మీద పడుతున్నట్టు కనిపించినా, కొంచెం బొంగురు గొంతుతో ఖణీమని మాట్లాడే పెద్ద గుమస్తా నాని బాబు గారంటే అందరకీ ఎంతో గౌరవం, భక్తీ ఉండేవి. అంతే ఇష్టం కూడా ఉండేది.
కర్తవ్య నిర్వహణలో నిబద్ధతా, గొప్ప మానవీయ దృక్పథమూ, కలిగిన నాని బాబు గారి గురించి ఒకటి రెండు మాటలు చెప్పాలి.
మొత్తం వందమంది విద్యార్ధులనూ వారి వారి రోల్ నంబర్లతో పాటూ వారి పేర్లతోనూ గుర్తుంచుకొని పిలిచే వారు. సమయపాలన ఎంత ఖచ్చితంగా పాటించే వారంటే, ఏ రోజయినా భోజనాల వేళలో ఒక్క నిముషం అటూ ఇటూ అవనిచ్చే వారు కాదు. అర నిముషం ఆలస్యంగా వచ్చినా సరే ఆ పంక్తిలో కూర్చోడానికి వీలు లేదంతే. లేట్ బేచ్ కి వేచి ఉండాల్సిందే. వడ్డనల బేచ్, లేట్ బేచ్ వాళ్ళూ కూడా తినడాలు పూర్తయాక వచ్చే వాళ్ళు ఆ పూటకి వెనక్కి తిరిగి పోవలసినదే. అలాంటి వాళ్ళని ఒక్కోసారి రహస్యంగా వెనక్కి పిలిచి, ఓ పావలా చేతిలో ఉంచుతూ ఏ పకోడీలో కొనుక్కు తినరా నాయనా ! రేపటి నుండి లేటుగా రాకేం !’’ అని హెచ్చరించే వారు. విద్యార్ధుల అటెండెన్సు విషయంలో ఇంత కఠినంగా ఉండే నాని బాబు గారు ఒక్కడి విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చే వారు. వాడే మా ఆచారి.
ఆ రోజుల్లో మా కలాశాల విద్యార్ధి ఒక ఆచారి ఉండే వాడు. ( పేరు కావాలనే చెప్పడం లేదు) వాడు అమిత భోజన ప్రియుడు. తిండి పుష్ఠి జాస్తి. అందు చేత పెద్ద గుమస్తా నాని బాబు గారు, వాడు సరైన వేళకే సత్రానికి వచ్చినా, ఎప్పుడూ కావాలనే లేట్ బేచ్ కి ఉంచేసే వారు ! ‘‘ నువ్వుండరా, లేటు బ్యాచ్ లో తిందువుగాని !’’ అంటూ ...
అలాగయితే వాడు కావలసినంత తింటాడని !
వాడు ఒక్కడూ ఒక మూలకి చేరి తనే స్వయంగా వడ్డించుకు తింటూ ఉంటే, ‘‘ ఒరే, ఆచారీ, ఆ నేతి జారీలో నెయ్యిని ఒక్క చుక్కయినా మిగిల్చేది ఉందా, లేదా !’’ అంటూ నవ్వుతూ, ఎంతో దయగా పలకరించే వారు !
వారి దయాస్వభావానికి మరో మంచి ఉదాహరణ చెబుతానఒక యేడాది సత్రం భోజనాలకి సెలక్టు చేసిన విద్యార్ధుల జాబితా సత్రం నోటీసు బోర్డులో ఉంచారు. అందులో పొరపాటున ఒక విద్యార్ధి పేరుకు బదులు ఇంకొక విద్యార్ధి పేరు టైపు చేయడం జరిగింది. ఇద్దరి పేర్లూ, ఇంటి పేర్లూ, తండ్రుల పేర్లూ ఒకలాగే ఉండడం వల్ల ఈ పొరపాటు జరిగింది. అయితే, ఆ విద్యార్ధులిద్దరూ ఒకే పాఠశాలకి చెందిన వారు మాత్రం కారు. లిష్టులో తను చదివే పాఠశాల పేరు తప్పుగా ఉన్నా, తన పేరు చూసుకొని ఒక విద్యార్ధి రోజూ వచ్చి భోజనం చేయడం మొదలు పెట్టాడు. అసలు సీటు వచ్చిన విద్యార్ధి మాత్రం తనకు సీటు లభించ లేదనే నిరాశతో వాడి స్వతం గ్రామం వెళ్ళి పోయాడు. వారం రోజులకి జరిగిన ఈ పొరపాటు ఎవరో గుర్తించడం జరిగింది. అంతే. ఇంత వరకూ వస్తున్న విద్యార్ధిని సత్రం నుంచి తొలగిస్తూ ఇకపై రావద్దని నోటీసు ఉంచారు. అసలు విద్యార్ధికి సీటు ఇచ్చినట్టుగా వర్తమానం చేసారు. ఇదంతా పై అధికారుల స్థాయిలో జరిగింది. అంతే పెద్ద గుమస్తా నాని బాబు గారు అగ్రహోదగ్రులయ్యేరు ! ‘‘ వాడికి సీటు రాక పోవచ్చును. ఏదో పొరపాటు జరిగి ఉండ వచ్చును. వాడు ఈ వారం రోజులుగా శ్రీ సింహాచల స్వామి వారి అన్న ప్రసాదం తింటున్నాడు. ఇవాళ వాడి నోటి ముందు కూడు తీసేస్తామనడం సరి కాదు. కావాలంటే వాడికీ వీడికీ కూడా సీట్లు ఇవ్వండి. ’’ అంటూ అధికారులతో వాదులాడేరు. అధికారులు అది సాధ్యం కాదు పొమ్మన్నారు. ‘‘ స్వామి ప్రసాదం తింటున్న వాడిని కాదని పొమ్మనడం నా వల్ల కాదు. వాడిని సత్రం నుండి తొలిగిస్తే, నన్నూ ఈ ఉద్యోగం లోనుండి తొలగించండి. నేను రాజీనామా చేస్తున్నాను ’’ అని నాని బాబు గారు పెద్దలతోకుండ బ్రద్దలు కొట్టేలా చెప్పారు. ఆ మానవతా దృక్పథానికి, న్యాయ పోరాటానికీ అధికారులు దిగి వచ్చేరు. సత్రం చరిత్రలో ఏ యేడూ లేని విధంగా ఆ ఏడాది నూటొక్క మంది కి సీట్లు ఇవ్వడం జరిగింది !
ఒక పేద గుమస్తా మానవత్వంతో సాధించిన గొప్ప నైతిక విజయమిది !
మేము భాషాప్రవీణ నాలుగో సంవత్సరంలో ఉండగా నాని బాబు రిటైరయి పోయారు. మేమంతా చందాలు పోగు చేసుకొని నాని బాబు గారి పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాం. సత్రంలో మేం భోజనాలు చేసే పెద్ద హాలు ఒక్కటే ఉంది. అక్కడే నాని బాబు గారి పదవీ విరమణ కార్యక్రమం జరుపు కోవాలని తలపెట్టాం. కార్యక్రమం సాయంత్రం అయిదింటికి మొదలయింది. పావు తక్కువ ఆరు అవుతోందో , లేదో,, ‘‘ ఇహ చాలు ! భోజనాలకి లేవండి !’’ అంటూ, తటాలున కుర్చీ లోనుంచి లేచి పోయేరు పెద్ద గుమస్తా గారు. మేమంతా బిక్క చచ్చి పోయేం.
ఇంకా సభా కార్యక్రమం చాలా ఉంది.
వేయాల్సిన దండలు ఇంకా చాలా ఉన్నాయి.
మా సంస్కృత కలాశాల విద్యార్ధి కవులు రాసు కొచ్చిన కవితలు చదవడం ఇంకా పూర్తి కానే లేదు.
సంగీతం కలాశాల పిల్లలు ఆయన గురించి స్వర పరచుకొని వచ్చిన పాటలు పాడడమే కాలేదు.
పెద్దల ప్రసంగాలు సగమైనా కాలేదు.
చదవాల్సిన సన్మాన పత్రాలు చదవనే లేదు.
మా అందరకీ ఎంతో అసంతృప్తిగా ఉన్నా, ఆయన మాటలు కాదన లేని స్థితి. అసలు సమ్మానితుడే స్టేజి దిగి పోయేక, ఇంకా సన్మాన కార్యక్రమ మేమిటి !
భోజనాలు రాత్రి తొమ్మిది వరకూ. లేటు బ్యాచి వాళ్ళూ, వడ్డన బ్యాచి వాళ్ళూ తినడాలు పూర్తయి,
పని వాళ్ళు హాలంతా శుభ్రం చేసాక కార్య క్రమం మళ్ళీ మొదలెడదామని ఉబలాట పడ్డాం. ఎలాగయితేనేం వారిని మరో గంట సేపు కార్యక్రమం జరపడానికి బలవంతం మీద ఒప్పించాం. అయిష్టంగానే ఒప్పుకొన్నారు.
ఆ కాస్సేపూ ముళ్ళ మీద కూర్చున్నట్టే కూర్చున్నారు. ఆ గంటా కాగానే ‘‘ ఇక ఈ ఆటా పాటా చాల్లెండర్రా !
ఇళ్ళకు పోయి చదువుకోండి ’’ అనేసి మళ్ళీ వేదిక దిగి పోయారు మా నాని బాబు గారు.
దండలు వేస్తామంటే ఒంటెల్లా మెడలు చాచుకు కొని తయారయి పోయే వాళ్ళని చూస్తాం. ఇలాంటి నిరాడంబర మయిన మానవతా వాదులనీ, కర్తవ్య పరాయణులనీ ఎక్కడో కానీ చూడం ! కదూ !
.కడుపు చల్లని తల్లి మా విజయ నగరం. అక్కడ భోజనం చేసి చదువుకొన్న వారెవరయినా, ఆ ప్రాంతాలకు వెళ్ళి నప్పుడు ఏమాత్రం వీలున్నా మా శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి విద్యార్ధి భోజన వసతి గృహాన్ని కళ్ళారా ఒక్క సారయినా చూసు కోనిదే రారు.
రోజూ కాక పోయినా, ఎక్కడయినా పంక్తి భోజనాలు జరిగే టప్పుడు అక్కడ భోజనం చేసిన వారికి ఈ పద్యం గుర్తుకు రాక తీరదు.
ఎందు కంటే, ఎందరికో కడుపు నింపిన కమ్మని పద్యం కదా యిది !

23, మే 2012, బుధవారం

కథా రచయితలు, కవులు కొలువుతీరిన ఈ అరుదైన ఫొటోకి ఇవాళకి అక్షరాలా ముప్ఫయ్ నాలుగేళ్ళు !బరంపురంలో 1979 జనవరి20, 21, 22 తేదీలలో అఖిల భారత రచయితల సమ్మేళనం వేడుకలు అపూర్వంగా జరిగేయి.
అప్పుడు తీసిన ఫొటో ఇది.
ఈ ఫొటోలో శ్రీ.శ్రీ, కాళీపట్నం రామారావు, వుప్పల లక్ష్మణ రావు, కె.వి.కృష్ణ కుమారి, చాగంటి తులసి, చాగంటి సోమయాజులు, బలివాడ కాంతారావు,  రామ మోహనరాయ్, శీలా వీర్రాజు, బలివాడ కాంతారావు, జ్వాలాముఖి, చలసాని ప్రసాద్. స్మైల్,  చెఱబండరాజు, వాకాటి పాండురంగారావు, కప్పగంతుల మల్లికార్జునరావు, భమిడిపాటి రామ గోపాలం, మంజుశ్రీ, అవసరాల రామ కృష్ణారావు, లత, వంటి ప్రముఖులతో పాటు వర్ధమాన రచయితలు దేవరాజు రవి, తాతా విశ్వనాథ శాస్త్రి,  మానేపల్లి సత్యనారాయణ, అరుణ్ కిరణ్, సస్యశ్రీ, ప్రసాద్, మల్లేశ్వరరావు, వంటి రచయితలు ఉన్నారు. విశాఖ నుండి రా.వి.శాస్త్రి ఈ సభలకు వచ్చినట్టే గుర్తు. వారు ఈ ఫోటోలో లేరేం చెప్మా ? 
ఈ సభలు జరిగేక, దాదాపు ఇరవై రెండేళ్ళ తర్వాత భ.రా.గో
 25 -4 -2002 తేదీ ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో దీనిని ప్రచురించారు. ఫొటో లోని రచయితలను తాను గుర్తించి నంత వరకూ పేర్లు ప్రకటించారు.  దాదాపు 43 మంది రచయితల పేర్లు తెలిసిన వారు తెలియజేయమని కోరారు. ఎక్కువ మంది పేర్లు చెప్పిన వారికి
వంద రూపాయల విలువగల కథా సంపుటాలను బహుమతిగా ఇస్తానని కూడా
ప్రకటించేరు.  అప్పట్లో వారి ప్రకటనకి ఎలాంటి స్పందన వచ్చిందో నాకు గుర్తు లేదు. ఎంత మంది ఎందరి పేర్లు చెప్ప గలిగారోకూడా నాకు తెలియదు.
ఈ సభలు జరిగన తీరు గురించి కళ్ళకు కట్టే విధంగా భరాగో అప్పట్లో 28-1-1979 నాడు ఒక దిన పత్రికలో చక్కగా చాలా విపులంగా రిపోర్టు చేసారు కూడా !
ఇదిలా ఉంచితే,  ఈ ఫొటో ప్రచురిస్తూ భ.రా.గో గుర్తించిన రచయితలలో  మీది వరసలోని 11 వ వ్యక్తిగా వారు నన్ను పేర్కొన్నారు.  పంతుల జోగారావు ? అని
కొంచెం సందేహంగానే అన్నారు.
 వారు అనుకొన్నది సరి కాదు. ఆ వ్యక్తిని నేను కాదు. ఎవరో నాకూ తెలియదు.
ఆ సభలలో నేనూ పాల్గొన్నాను. కానీ, ఈ ఫొటోలో లేను. ఆ రోజు ఫోటో సెషన్లో మొదట తీసిన ఫొటో ఇది.
ఆ వెంటనే మరో ఫొటో కూడా ఇంత మంది రచయితల తోనూ తీయడం జరిగింది. ఆ ఫొటోలో నేను ఉన్నాను. నాతో పాటూ ఈ ఫొటోలో లేని  నేటి నవ్య సంపాదకులు ఎ.ఎన్.జగన్నాథ శర్మ, ఆంధ్రభూమి ఉపసంపాదకులుగా చేసి ఇటీవల మరణించిన జ్యోత్స్న గారూ మొదలయిన మరికొంతమంది రచయితలం ఉన్నాం. మొదటి ఫొటోలో కనిపించని మరి కొంతమంది అందులో కనబడతారు. కొంత ఆలస్యంగా వచ్చి ఫొటోలో దిగిన ఆ రచయితలతో కూడిన ఫొటో ఎవరి దగ్గర దొరుకుతుందో తెలియదు. ఇప్పుడు భ.రా.గో గారూ లేరు. ఈ ఫొటో లోని చాలా మంది రచయితలూ లేరు. తక్కిన వారు ఎక్కడెక్కడ ఉన్నారో ?

ఏమయినా, ఈ అరుదైన ఫొటోకి ఇప్పుడు అక్షరాలా ముప్ఫయ్ నాలుగేళ్ళు !


23, జనవరి 2012, సోమవారం

మూడు అపురూప చిత్రాలు

విజయ నగరంలో తెలుగు కథకు వెలుగు జాడ గురజాడ స్వగృహం
విజయ నగరంలో చిన్నిపల్లి వారి వీథిలో తెలుగు కథకు తూర్పు దిక్కు చా.సో గారి ఇల్లు. చా.సో హవేలీ.

గురజాడ వారు రచనలు చేయడానికి ఉపయోగించిన టేబిలు, కుర్చీలు.


12, జనవరి 2012, గురువారం

నేను, చా.సో, మా విజయ నగరం ... ఙ్ఞాపకాల తోటలో ఆనంద విహారం !


విజయ నగరం మడి కట్టుకొన్న పెద్ద ముత్తయిదువులా ఉంటుంది.
కొసరి కొసరి గోరు ముద్దలు తినిపించే అమ్మలా ఉంటుంది.
చిటికెన వేలు పట్టుకుని బజారు వీధుల్లో వింతలు చూపించే నాన్నలా ఉంటుంది.
ఆ ఙ్ఞాపకాల తోటలో ఆనంద విహారం ఎలా ఉంటుందంటే,
నేను,చా.సో, మా విజయ నగరం అనే జగన్నాథ శర్మ గారి వ్యాసంలా ఉంటుంది.
ఆ వ్యాసం మీ కోసం. చూడండి:

నవ్య వార పత్రిక సంపాదకులు ఎ.ఎన్. జగన్నాథ శర్మ ఈ నెల 17 వ తేదీన విజయ నగరంలో ప్రతిష్ఠాత్మకమైన చా.సో స్ఫూర్తి అవార్డు స్వీకరించ బోతున్నారు. ఆ సందర్భంగా జగన్నాథ శర్మ ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో తెలుగు కథకు తూర్పు దిక్కు శ్రీ చాగంటి సోమయాజులు ( చా.సో) గారితో తన చిన్ననాటి అనుభవాలూ, ఙ్ఞాపకాలూ హృదయంగమంగా కలబోసుకున్నారు. ఆ వ్యాసమే యిది.
వ్యాసం పూర్తి పాఠం ఇక్కడ మరింత చక్కగా చదవొచ్చును :
అవార్డు కార్యక్రమం గురించిన ఇతర వివరాలు ఇక్కడ నొక్కి చూడ వచ్చును.

Posted by Picasa