31, మార్చి 2013, ఆదివారం

తమాషాగా లేదూ ? ! ...




అతి సరిచయా దవఙ్ఞా అని చెబుతారు. అంటే,మరీ సన్నిహితంగా ఉండే దాని పట్ల కొంత ఉదాసీనభావం తప్పదు. ఎప్పుడూ దూరపు కొండలే నునుపు కదా !

వంట యింటి కుందేలు అని ఒక తెలుగు సామెత కూడా ఉంది. వంటింటి వాసనలకు మరిగిన కుందేలు ఎక్కడికీ పోదు. అక్కక డక్కడే తిరుగుతూ ఉంటుంది. అంచేత,ఎప్పుడు కావాంటే అప్పుడు దానిని పట్టు కోవచ్చును.
విజయ విలాసం అనే ప్రబంధంలో చేమకూర వేంకట కవి ఓ పద్యంలో ఈ సామెతను చక్కగా ఉపయోగించు కుని ఒక చక్కని పుర వర్ణన చేసాడు. ఇంద్రప్రస్థ పురంలో మేడలు ఆకాశాన్ని తాకుతూ ఉంటాయిట. అందు వల్ల ఆకాశంలో ఉండే చంద్రుడు తన దారంట తానుపోతూ ఆ మేడల కిటికీల గుండా పయనిస్తూ అవతలి వేపుకి పోతూ ఉంటాడుట. ఆ నగరు లోని రాణి వాసపు అమ్మాయిలకు ఆ చందమామ లోని కుందేలుని పట్టు కోవాలని కోరిక. కుందేలుని ధరిస్తాడనే కదా చంద్రుడికి శశాంకుడు అని పేరు కలిగింది. పూర్ణ శశాంకుడు అంటే నిండు చందమామ. సరే ఎక్కడి నుండో ఎక్కడికో వెళ్ళి నట్టున్నాం !
మళ్ళీ ప్రస్తుతానికి వద్దాం.
ఇలాంటిదే అర చేతిలో ఉసిరి కాయ అని కూడా ఒక జాతీయం ఉంది. దీన్ని సంస్కృతీకరిస్తే కరతలామలకం అవుతుంది. అర చేతిలో ఉసిరి కాయని ఎప్పుడేనా గుటకాయ స్వాహా అనిపించొచ్చును కదా !
ఇదంతా ఎందుకు చెబు తున్నా నంటే,
మనకి లభ్యమాన మయేదాని పట్ల అంతగా ఆసక్తిని చూపించం. చిన్న పిల్లాడు తన చేతిలో తాయిలం ఉంచుకుని,ఎదుటి వాడి చేతి లోని తాయిలాన్ని చూడడం లాంటి దన్నమాట.
మరి,కాక పోతే ఏమిటి చెప్పండి ?
మా స్వస్థలానికి అరకు లోని బొర్రా గుహలూ, హైదరాబాద్ కి బెల్లుమ్ గుహలూ

కొంచెం అటూ యిటూగా దాదాపు సమాన దూరంలో ఉన్నాయి.
మా స్వగ్రామం పార్వతీ పురం లోనూ,పని చేసి పదవీ విరమణ చేసిన విజయ నగరం లోనూ దగ్గర దగ్గర అరవై యేళ్ళ వరకూ గడిపానా ? దగ్గర లో ఉన్న బొర్రా గుహలు చూడనే లేదు !
అలాగే, ఉద్యోగ విరమణానంతరం భాగ్య నగరంలో నాలుగున్నరేళ్ళు గడిపానా ?బెల్లుమ్ గుహలు చూడనే లేదు.
నివాసం హైదరాబాద్ మార్చేక ,ఇహ లాభం లేదని మావేపు వచ్చి,అరకు లోని బొర్రా గుహలు చూసాము. అలాగే, హైదరాబాద్ వదలి ఇటీవల తిరిగి విజయ నగరం మకాం మార్చేసాక, మరో పని మీద హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుండి బెల్లుమ్ గుహలు చూసాము.
అంటే ఏమన్నమాటా ?. వొళ్ళు బద్ధకం. చూదాంలే అనే నిర్లిప్త ధోరణి. చూసేం కనుక సరి పోయింది. లేక పోతే ఎన్ని అందాలు చూసే అదృష్టాన్ని పోగొట్టు కునే వాళ్ళమో కదా !
అందు చేత,నేను అందరికీ చేసే విన్నపం ఏమిటంటే, దూరభారాలలో ఉండే వింతలనీ,చూడ తగిన ప్రదేశాలనీ చూడండి. ఆ అవకాశం లేక పోతే,కనీసం దగ్గరలో ఉన్న వాటిని వాయిదాలు వేయకుండా వెంటనే చూడండి. తర్వాత చూద్దాంలే అనుకుంటే చాలా కోల్ప,ఎలాగయితే నేం బెల్లుమ్ గుహలు చూశాం అన్నాను కదా ! వాటిని గురించి కొద్దిగా పరిచయం చేయడమే ఈ టపా ముఖ్యోద్దేశం.

బిలం అనే సంస్కృత పదానికి రంధ్రం లేదా కన్నం అని అర్ధం కదా. జనబాహుళ్యం నోటబడి అదే క్రమంగా బెల్లుమ్ గా ఈ గుహలు మన రాష్ట్రం లోని నంద్యాల పట్టణానికి 60 కి,మీ దూరం లోనూ,కర్నూలుకి 105 కి.మీ దూరం లోనూ. తాడిపత్రికి కేవలం 30కి.మీ దూరంలోనూ ఉన్నాయి !
ఆసియా ఖండంలో పొడవైన గుహలలో ఇది రెండోది మాత్రమే.దీనిని మొదటి సారిగా ఒక బ్రిటిష్ సర్వేయరు 1884 లో చూసాడుట. రాబర్ట్ అతని పేరు. తర్వాత 1982 – 84 ల మధ్య ఒక జర్మనీ దేశ బృందం దీనిని చూసిందిఈ గుహలు 1988 లో మన పర్యాటక శాఖ కంట పడడం దానిని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్ది,
























































ఎలాగయితేనేం,2002 నుండి పర్యాటకులను అనుమతించడం జరుగుతోంది ...

3.5 కి.మీ పొడవైన ఈ గుహలు ప్రస్తుతం 1.5 కి.మీదూరం వరకూ మాత్రమే చూడడానికి అవకాశం ఉంది.

ఈ గుహలు మానవ నిర్మితాలు కావు కదా. ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవి. నీటి కోత చేత,గాలి కోత చేత ఏర్పడిన పొడవైన అందమైన గుహలు యివి !

ఒక మోస్తరు కన్నం లోనుండి ప్రవేశించి ( మొదటి ఫొటో చూడండి.. )విశాలమైన బిలం లోకి నడుచు కుంటూ పోవడం నిజంగా ఒక మధురానుభూతి అనే చెప్పాలి ! విద్యద్దీపాలు అక్కడక్కడా ఉంచేరు కనుక సరి పోయింది కానీ,లేక పోతే గాడాంధకారమే !
ఇలా అన్నానని భయపడే పని లేదు. ఆ మాట టూరిజం వాళ్ళు ముందే చెప్పి తగిన భరోసా యిచ్చేరు. సైన్ బోర్డులు పెట్టి. కరెంటు పోతే ఎక్కడి వారు అక్కడే ఓ క్షణం నిలుచుండి పోతే సరి,జెనరేటరుతో వెల్తురు వస్తుంది. మరేం భయం లేదు.

గుహలలో చాలా చోట్ల కొంచెం దూరంలో కనబడే విద్ద్యుద్దీపాల కాంతులు మనకి మండే అగ్ని గోళాలలా కనిపిస్తాయి !
( ఫొటోలు చూడండి )

విశాలమైన ప్రాంగణాలూ,అక్కడ క్కడా ఇరుకైన తావులూ,నీటి ధారలూ ... ఓహ్ !

చెప్పడానికి మాటలు రావు ! వెళ్ళగా వెళ్ళగా ఎక్కడో చివర పెద్ద జలధార కనిపించడం చూసి మతి పోతుంది !

పాతాళ గంగ అని దానికి పేరు. అంతే,అక్కడితో సరి. మరింక మనం ముదుంకి వెళ్ళేది లేదు. గుహలు మాత్రం ఇంకా చాలా పొడవుగా ఉన్నాయి. మనకి అనుమతి అంత వరకూ మాత్రమే. అదే చాల్లెండి. అప్పటికే ఒకటిన్నర కిలో మీటర్ల దూరం నడిచి వచ్చి ఉన్నాం. తిరిగి ఏదారిని వెళ్ళామో,అదే దారిని తిరిగి నడుచుకుంటూ బయటికి వస్తాం. బయటి కొచ్చేక ఒక్క సారిగా బాహ్య ప్రపంచం కనిపించి పులకించి పోతాం ! ఎక్కడో పాతాళం లోకాస్సేపు గడిపి వచ్చిన అనుభూతి కలుగుతుంది మనకి !
ఇంతకీ అంత దూరం గుహలలో నడిచామా ?మనం తిరుగుతున్న గుహల పైకప్పు మీద అంతా మామ్మూలే. జన సంచారమూ,వాహనాల రాకపోకలూ,అన్నీ ఉంటాయని తెలుసు కుంటే ... తమాషాగా లేదూ ?!







2 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...




అరకు (బొర్రాకేవ్స్)గుహల్ని చూసాము కాని,బెలుం గుహలు చూడలేదు;నంద్యాల,శ్రీశైలం,మహానంది చూసినా.అప్పటికి బెలుం గుహల గురించి తెలియదు.ఇటీవలనే ప్రసిద్ధిలోకి వచ్చాయి.సౌకర్యాలు కూడా కల్పించారు.వాటిని గురించి తెలిపినందుకు ధన్యవాదాలు.ఫొటోలు కూడా బాగున్నవి.

www.apuroopam.blogspot.com చెప్పారు...

మంచి పరిచయమండీ.ఏదయినా అంతే.దగ్గరుంటే దాని విలువ తెలియదు. మలయ పర్వతం మీద ఉండే ఆటవిక స్త్రీలు మంచి గంధం చెట్లను వంట చెరకుగా వాడుతారట.అలాగే మన రాష్ట్రంలో చిత్త్రూరు జిల్లా ఆడవులలో లభ్యమయ్యే ఎర్రచందనం ఎంతో విలువైనది.లక్షలూ కోట్లూ చేసే ఈ ఎర్రచందనాన్ని మనవాళ్లు రోకళ్లూ, పందిరి గుంజలూ పిల్లలాడుకునే కట్టె బొమ్మలూ చేయడానికి వాడుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి