ఆలోచన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆలోచన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, సెప్టెంబర్ 2015, మంగళవారం

మనం రూపాయి బిళ్ళలం కాదు కదా ?!మనం తరుచుగా అతిథి, అభ్యాగతుడు అనే మాటలు వింటూ ఉంటాం కదా.
అతిథి అంటే తిథి, వార, నక్షత్రాలతో నిమిత్తం లేకుండా వచ్చే వాడు. అభ్యాగతుడు అంటే పర్వ దినాలలోను, భోజన కాలం లోను వచ్చే వాడు.
సరే, భారతీయ సాంప్రదాయంలో అతిథి సేవకు గొప్ప స్థానం యిచ్చారు. అతిథి సేవను నిష్ఠతో పాటించే వారు.

అతిథి సేవకు చెందిన కొన్ని మంచి మాటలు ఇక్కడ చూదామా?

అతిథిర్బాలక: పత్నీ, జననీ జనకస్తథా,
పంచైతే గృహిణ: పోష్యా , ఇతరే చ స్వశక్తిత:

అతిథులను, పిల్లలను, భార్యను, తల్లిదండ్రులను - ఈ ఐదుగురినీ గృహస్థు తప్పకుండా సేవించు కోవాలి. వీరిని నిష్ఠగా పోషించాల్సిన కర్తవ్యం ఇంటి యజమానిదే. ఇక తక్కిన వారినంటారా, యథా శక్తి పోషించ వచ్చును.

అయితే, కవి ఇక్కడ మరో విషయం కూడా హెచ్చరిస్తున్నాడు.

అతిథి ర్బాలకశ్చైవ స్త్రీజనో నృపతి స్తథా
ఏతే విత్తం న జానంతి, జామాతా చైవ పంచమ:

అతిథి, బాలురు, స్త్రీలు, రాజు, అల్లుడు - ఈ ఐదుగురున్నూ ఇంటి యజమాని ఆర్ధిక పరిస్థితిని గురించి ఎంత మాత్రం పట్టించు కోరు ! అంటే, గృహస్థు దగ్గర డబ్బు ఉన్నా , లేక పోయినా తమకి సేవలు చేయించు కుంటూ, వారిని ఒత్తిడి చేస్తూ , వేధిస్తూ ఉంటారుట.

అయినా, ఓరిమితో అతిథి సేవ చేయాలనేదే భారతీయ విశ్వాసం.

అతిథిర్యస్య భగ్నాశో, గృహాత్ ప్రతి నివర్తతే
స తస్మై దుష్కృతం దత్వా, పుణ్య మాదాయ గచ్ఛతి.

అతిథి సేవను సక్రమంగా చేయని వాడికి ఎలాంటి ఫలితం ఉంటుందో కవి చెబుతున్నాడు.

ఎవరి ఇంటి నుండి అతిథి అయిన వాడు ఆకలితో వెనుతిరిగి వెళ్ళి పోతాడో, ఆ అతిథి తాను వెళ్ళి పోతూ తన వెంట ఆ ఇంటి యజమాని చేసిన మంచి కర్మల ఫలితాన్ని తన వెంట తీసుకుని పోతాడు. అంతే కాదు, తన యొక్క చెడ్డ కర్మల పలితాన్ని ఆ యజమాని ఇంట విడిచి మరీ వెళ్ళి పోతాడు. అంటే, అతిథి సేవ చేయని వాడు మునుపు చేసికొన్న పుణ్య కర్మ ఫలాలను పోగొట్టు కోవడమే కాక, కొత్తగా చెడ్డ కర్మల ఫలితాలను మూటగట్టు కుంటాడని అర్ధం.

అతిథౌ తిష్ఠతి ద్వారి, హ్యాపో గృహ్ణాతి యో నర:
ఆపోశనం సురాపానం, అన్నం గోమాంసభక్షణమ్.

అతిథి వాకిట ఉండగా వానిని విడిచి పెట్టి గృహస్థు తాను ఒక్కడే భుజించడం మహా దోషం సుమా.
అలాంటి వారు అన్నం తినడానికి కూర్చుంటూ పట్టే ఔపోశనం సురాపానంతో సమానం. వాళ్ళు తినే అన్నం గోమాంసంతో సమానం.

మను చరిత్రలో పెద్దన గారి ప్రవరుని అతిథి సేవాతత్పరత ఎలాంటిదో చూడండి:

తీర్ధ సంవాసులే తెంచి నారని విన్న
నెదురుగా నేగు దవ్వెంత యైన

నేఁగి, తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చు
తెచ్చి సద్భక్తి నాతిథ్య మిచ్చు

నిచ్చి, యిష్టాన్న సంతృప్తులుగాఁజేయు
చేసి, కూర్చున్నచో చేర వచ్చు

వచ్చి, యిద్ధరఁ గల్గు వనధి పర్వత సరి
త్తీర్ధ మాహాత్మ్యముల్ తెలియ నడుగు

అడిగి యోజన పరిమాణ మరయు, నరసి,
పోవలయుఁజూడఁగా ననుచు నూర్పులు నిగుడ్చు
నను దినము తీర్ధ సందర్శనాభిలాష
మాత్మ నుప్పొంగ నత్తరు ణాగ్ని హోత్రి

తీర్ధ యాత్రలకు పోతూ ఎవరయినా వస్తున్నారని వింటే చాలు, నిత్యాగ్ని హోత్రడైన ప్రవరుడు ఎంత దూరమైనా సరే , వారికి ఎదురుగా వెళ్ళి, పాదాభివందనం చేసి తన యింటికి ఆతిథ్యం స్వీకరించడానికి రమ్మని వేడు కుంటాడు. వారిని తన యింటికి తోడ్చుకుని పోయి భక్తియుతంగా ఆతిథ్యం యిస్తాడు.ఇష్గ మృష్ఠన్నాలతో వారిని తృస్తి పరుస్తాడు. ఆతర్వాత వారి చెంత చేరి దేశ దేశాలలో ఉండే వింతలూ విశేషాలూ, పుణ్యతీర్ధాలూ వగైరాల గురించి అడిగి, తెలుసుకుని , ఓ సారి చూసి రావాలి అనుకుంటూ నిట్టూర్పులు విడుస్తాడు. అలా ఉండాలి , అతిథి సేవ అంటే.

భాగవతంలో రంతి దేవుని అతిథి సేవ ఎట్టిదో తెలిసినదే కదా

రంతి దేవుడు తన సంపదలన్నీ దాన ధర్మాదులకి సమర్పించి, నిరు పేదయై, భార్యా పిల్లలతోఎనిమిది దినాలు పస్తులు ఉన్నాడు. ఒక నాడు అతనికి దైవవశాన నెయ్యి, పాయసం, నీళ్ళు లభించాయి. భుజిద్దామని కూర్చున్నాడో, లేదో, ఒక అతిథి వచ్చేడు.

అతిథి భూసురుఁడొక్క డాహార మడగిన గడపక ప్రియముతో గారవించి

హరి సమర్పణ మంచు నన్నంబులో సగమిచ్చిన భుజియించి యేగె నాతఁ

డంతలో నొక శూద్రుఁడశనార్ధియై వచ్చి, పొడసూప లేదనబోక తనకు

నున్న యన్నము లోన నొక భాగ మిచ్చిన సంతుష్టఁడై వాడు సనిన వెనుక

కుక్క గమియు దాను నొక్కక డేతేర నా
యన్న శేష మిచ్చి, సన్నయమున
వాని మ్రొక్కి పంప వరుసతోఁజండాలుఁ
డొక్కఁడరుగు దెంచి, చక్క నిలిచి ...

రంతి దేవుడు అన్నదానాన్ని హరి సమర్పణంగా భావించి, తనకు లభించిన దానిలో కొంత అన్నమును వానికిచ్చి, వానిని సంతుష్టుని చేసి సాగనంపేడు. ఆ తరువాత శూద్రుడొకడు ఆకలితో వస్తే మిగిలిన దానిలో సగ భాగం యిచ్చి వేసి గారవించి పంపించాడు. తరువాత కుక్కల గుంపును వెంట నిడు కొనిన వాడొకడు రాగా, వానికి మిగిలినదంతా యిచ్చి వేసి భక్తితో నమస్కరించి పంపించాడు.

తరువాత క్షుద్బాధతో వచ్చిన నాలవ జాతి వానికి దండమిడి,

అన్నము లేదు, కొన్ని మధురాంబులున్నవి త్రావు మన్న ! రావన్న ! ... అంటూ వానిని సగౌరవంగా పిలిచి తియ్యని నీళ్ళు సమర్పించుకున్నాడు.

మన వారికి అతిథి మర్యాదలంటే ఇంత నిష్ఠ.

హర విలాసంలో చిరుతొండ నంబి భక్తికి ఆది దంపతులు పరీక్ష పెడితే, ఆ నంబి తన శివ భక్త్యాచార సంపత్తిని ఎలా నిరూపించుకున్నాడో తెలిసినదే కదా.

పదకొండు రోజుల పాటు ఎడ తెగని వర్షాలు శివ మహిమ చేత కురిస్తే, అతిథి సమర్పణకు వంటలు చేయడమే కష్టమై పోయింది. యింట ఎండిన వంట చెఱకు లేకుండా పోయింది. అయినా తైలంలో ముంచిన గుడ్డలకు నిప్పు అంటించి , పొయ్యలు వెలిగించి, వంటలు చేయించాడు.

అతిథులు భుజిచనిదే తాను ఔపోసన పట్టని వ్రతం కలవాడు. అష్టకష్టాలూ పడి వంటలు ముగించినా, ఒక అతిథీ
( జంగముడూ) కనిపించక ఆశ్చర్య పోతాడు.

ముసురు పట్టిన వేళ, తమ యింటి అరుగులు మీద, పంచల క్రిందా, భస్మం పూసుకున్న వాళ్ళూ, పరమ పావన మూర్తులు, మహా శివ భక్తులూ అయిన వారు అనేకులు ఉండే వారు. ఆ రోజు ఒక్కరూ కనబడక పోవడం చూసి నంబి ఆశ్చర్యచకితుడయ్యాడు. తర్వాత అతను భక్తి పరీక్షలో నెగ్గిన తీరు ఒళ్ళు జలదరింప చేస్తుంది.

భోజరాజీయంలో ఇంటికి పోయి, బిడ్డనికి పాలిచ్చి మగిడి వత్తునని శపథాలు చేస్తూ పులితో ఆవు పలికినది:
అపరాహ్ణ వేళ యందతిథి యాకొని వచ్చి
యడిగినఁ బెట్టక కడపు వాని
గతికి ... ... ... ...

బోవు దాన, నింటికి నేఁబోయి మరల
రాక తక్కితి నేఁబుండరీక వర్య !

ఓ పులి రాజా, నేనింటికి పోయి తిరిగి నీ వద్దకు రాక పోతే, మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టకుండా పంపించి వేసే వాడు ఏ దుర్గతి పాలవుతాడో నాకూ ఆ చెడ్డ గతే నాకూ పడుతుంది. అని ఆవు ఒట్టు పెట్టు కుంది. అతిథులంటే అంత శ్రద్ధాభక్తులు మరి.


ఇదంతా అలా ఉంచితే, ఈ కాలంలో అతిథి సేవలు చేయాలంటే మరీ అంత వీజీ కాదు.

గేస్ ఎప్పుడు అయి పోతుందో తెలీదు. నల్లాలో నీళ్ళు వస్తాయో రావో తెలీదు. ఆఫీసులో సెలవు దొరుకుతుందో లేదో తెలీదు. నగరంలో కర్ష్యూ ఎప్పుడు పెడతారో అసలే తెలీదు. కూరల ధరలు మండి పోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు నింగిని తాకుతున్నాయి....

చుట్టాల చిచ్చర పిడుగులు బంతాట ఆడుతూ ఏ టీవీ అద్దాన్నో ఎప్పడు బద్దలు కొట్టేస్తారో తెలీదు.
ముచ్చట పడి చేయించుకున్న కొత్త ఫర్నీచరు ఎంతలా నాశనం కానున్నదో తెలీదు

ఇలాంటి భయాలు ఎన్నో ! అందుకే అతిథి సేవా వద్దు, గాడిద గుడ్డూ వద్దు.

మన యింటి తలుపులు మనకే తెరుచు కోవాలని మనసారా కోరుకుంటూ ఉంటాం.

నిజానికి మీద చెప్పిన భయాలన్నీ కేవలం మన ఊహాపోహలు. కల్పనా కథలు. ముందు తరాల వారు ఇంత కంటె గడ్డు కాలం లో కూడా నిండు మనసుతో అతిథులను గౌరవించే వారు. మనుషులను ప్రేమించే వారు.

ఇప్పుడా సద్భావన ఎందుకు మృగ్య మౌతున్నదంటే,

కాలం మరి పోయి కాదు. కాని కాలం దాపురించీ కాదు.

మనలో ఉండాల్సిన దేదో మనం కోల్పోవడం చేత.గుండెలో తగినంత తేమ లేక పోవడం చేత. మనం మనుషుల కంటె కూడా రూపాయి నోట్ల లాగానో, రూపాయి బిళ్ళల లాగానో బతకడానికి తెగ యిష్ట పడి పోతూ ఉండడం చేత. అంతేనంటారా?

12, సెప్టెంబర్ 2015, శనివారం

చెట్లు కూలుతున్న దృశ్యాలు !కుమారుడు, తటాకము,కావ్యము,నిధానము,ఆలయము,వనము,భూదేవ స్థాపనము ఈ ఎనిమిదింటినీ మన పూర్వీకులు సప్త సంతానాలుగా పేర్కొన్నారు.

వీటిలో కొందరు కుమారునికి బదులుగా సత్ర ప్రతిష్ఠ ను సప్త సంతానాలలో ఒకటిగా భావిస్తూ ఉంటారు. అదలా ఉంచితే, వీటిలో వనము అంటే తోట అని అర్ధం. తోటలు పెంచడంలో మన పూర్వీకులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. అందులో ధార్మిక దృక్పథమూ, లోక కల్యాణ సంకల్పమూ తప్ప, వ్యాపార దృక్పథం ఇసుమంతయినా ఉండేది కాదు.

ఆర్ధిక ప్రయోజనం లేదనుకుంటే, ఎలాంటి చెట్లనయినా, అనాలోచితంగా మొదలంటా నరికి వేయడానికి సందేహించని ప్రవృత్తిని పెంపొందించుకున్నాం. ఎంత దురదృష్టమో కదూ?

ఈ సందర్భంగా మాకూ ఉన్నాయి స్వగతాలు పేరిట గోపీచంద్ వ్రాసిన తుమ్మ చెట్టు గుర్తుకు వస్తున్నది. అందులో భూకామందు తన పొలంలో పెంచుకున్న తుమ్మ చెట్టుని ఎంతో ప్రీతి పాత్రంగా చూసుకుంటాడు. కాని, అతను గతించాక, కాని కాలం దాపురించి, అతని అల్లుడు పొలం గట్టున ఆ తుమ్మ చెట్టు అసహ్యంగా ఉండడమే కాక, వ్యర్ధంగా ఉందని భావించి, నిర్దయగా దానిని కొట్టి వేయిస్తాడు. ఇందులో తుమ్మ చెట్టు ఆత్మగతం ఎంతో విఙ్ఞాన దాయకంగానూ, చాలా హృదయంగమంగానూ ఉంటుంది. తుమ్మ ముళ్ళు కాళ్ళలో దిగబడుతున్నా, దాని ఉపయోగం తెలిసిన రైతులు తుమ్మ చెట్టును ఎంతో ఆదరంగా చూసుకుంటూ ఉంటారు. దాని విశిష్టత తెలియని వ్యక్తుల దృష్టిలో తుమ్మ చెట్టు ఒక పనికి రాని చెట్టు. ఈ రచన చదివితే, ఒక్క తుమ్మ చెట్టే కాదు, ప్రతి చెట్టూ మానవాళికి ఎంతో ఉపయోగకారి అని గ్రహిస్తాం.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే ...

మన పెద్దలు వన దేవతలను కొలిచారు. చెట్లనూ, పుట్లనూ సేవించడం మన హైందవ సంస్కృతిలో ఒక ప్రథానభాగం.

మా చిన్నప్పుడు సోషలు పాఠంలో అశోకుడు రహదారికి ఇరు ప్రక్కలా చెట్లు నాటించెను. అనే అంశాన్ని ఎంతో ఇష్టంగా చదువుకునే వాళ్ళం. అశోకుడు రోడ్డుకి రెండు ప్రక్కలా చెట్లు ఎందుకు నాటించాడో తెలుసునా? అనడిగితే, దారి మధ్యలో అయితే ఇబ్బంది కదండీ అనే కొంటె కోణంగుల కాలమిది.

చెట్లను ప్రేమించడమంటే, ప్రకృతిని ఆరాధించడం.

ఎప్పుడో, ఏడాదికోసారి వన మహోత్సవాల తంతు తూతూ మంత్రంగా జరిపించి, చేతులు దులుపుకోవడం అనే ప్రహసనం మనకు తెలిసిందే.

కాని , మన పూర్వీకుల అలా కాదు. వృక్ష జాతిని దేవతాగణంగా తలపోసి ఆరాధించే వారు.
వాపీకూప తటాకాలు ప్రతిష్ఠించి, వనాలను అభివృద్ధి చేసే వారు. అటవీ సంపదకూ, వర్షాలకూ, భూసార పరి రక్షణకూ, సుఖతరమైన ప్రజా జీవితానికీ, చెట్లు ఆధారం అని ఏనాడో గ్రహించారు. అలాంటి వనాలను అభివృద్ధి చేసి ఆదర్శప్రాయులయ్యారు.

వృక్షో రక్షతి రక్షిత: అన్నారు.

ఈ శ్లోకం ఆ విషయాన్నే ఎలుగెత్తి చాటుతోంది. చూడండి:

దశకూప సమా వాపీ. దశ వాపి సమో హ్రద:
దశ హ్రద సమ: పుత్రో దశ పుత్ర సమో ద్రుమ:

పది నూతులతో ఒక దిగుడు బావి సమానం. నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె
సూనృత వ్రత యొక బావి మేలు .... అని నన్నయ గారు శకుంతలోపాఖ్యానంలో శకుంతల చేత చెప్పించిన పద్యం ఇదే విషయాన్ని వివరించింది.

ఇక, పది దిగుడు బావులతో ఒక చెఱువు సమానం. ఒక కుమారుడు పది చెఱువులతో సాటి రాగలడు.
పదిమంది పుత్రులతో సమాన మైనది ఒక మహా వృక్షం !!

అని, చెట్టు ప్రాముఖ్యం ఎలాంటిదో వివరించారు.

అంతే కాదు, ఏయే చెట్లు నాటి పోషిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందో కూడా వివరించారు.

చూడండి:

అశ్వత్థ మేకం పిచుమన్ద మేకం, న్యగ్రోథ మేకం దశతిన్త్రిణీకం
కపిత్థ బిల్వా2మలక త్రయంచ, పంచామ్రవాపీ నరకం న పశ్యేత్.

ఒక రావి చెట్టు, ఒక పిచుమంద వృక్షం ( అంటే, వేప చెట్టు. దీనినే నింబతరువు అని కూడా పిలుస్తారు), ఒక మ్రరి చెట్టు, పది చింత చెట్లు, మూడు వెలగ చెట్లు, మూడు మారేడు చెట్లు, మూడు ఉసిరిక చెట్లు, అయిదు మామిడి చెట్లు కలిగిన తోటను పెంచాలని ఈ శ్లోకంలో చెప్పబడింది. దానిలో ఒక దిగుడు బావిని తవ్వించమని కూడా చెప్పారు. అలా చేసిన వారు నరకం చూడరని దీని భావం ! అంటే, వారికి స్వర్ట ప్రాప్తి కలుగుతుందని ఆశీర్వదించారు.

స్వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని శ్లోకంలో చెప్పిన లెక్క ప్రకారం అవే చెట్లను అదే లెక్కతో నాటి, అక్కడ ఓ దిగుడు బావి తవ్విస్తే సరి పోతుంది కాబోలు అనుకో వద్దు. లెక్క కేం కానీ, వీలయినన్ని చెట్లను పెంచి తగిన నీటి వసతి ఏర్పరచ మని చెప్పడమే ప్రధానోద్దేశం.

చెట్లు కూలుతున్న దృశ్యాలు మనకింక కనిపించ కూడదు. కదూ?

స్వస్తి.

15, ఆగస్టు 2015, శనివారం

అనంత పద్మనాభుని సాక్షిగా గజపతుల ఆత్మ బలిదానాలు !అనంత పద్మనాభుని సాక్షిగా అభిమానధనుల ఆత్మ బలిదానాలు !

పద్మనాభ యుద్ధం ! అదే ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం అని కొందరు చరిత్రకారులు భావిస్తారు. విభేదించే వారూ లేక పోలేదు. కాని, విభేధించే వారు కూడా ప్రాణాలను పణంగా పెట్టి, అభిమాన ధనులైన గజపతులు చేసిన ఈ యుద్ధం ప్రభువుల శౌర్యానికీ, ఆత్మాభిమానానికీ జయకేతన మెత్తిందని ముక్త కంఠంతో కీర్తిసారు !
మానధనులైన విజయ నగర ప్రభువుల  వలె యుద్ధభూమిలో మృత్యువును చేజేతులా ఆహ్వానించి వీర స్వర్గమలంకరించిన క్షాత్రం చరిత్రలో అరుదుగా కనబడుతుంది !

కేవలం గంట వ్యవధి లోపల ముగిసిన ఈ పద్మనాభ యుద్ధ సన్నదధానికి ముందు చిన విజయ రామరాజు గారు చేసిన ఉత్తేజపూరిత మయిన మహోపన్యాసం వొక వీర చారిత్రక ఘట్టం !  ఆ గజపతి ప్రభువు చేసిన ఉపన్యాసం నుండి కొన్ని భాగాలు చూదాం !
అంతకు ముందు  పద్మనాభ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులను క్లుప్తంగా .. ...
విజయ నగరం సంస్థానం వారు కంపెనీ వారికి  బాకీ పడిన ఆరు లక్షల ఏభై వేలు వెంటనే చెల్లించాలనీ, లేక పోతే చిన విజయరామరాజు రాజ్యం విడిచి విశాఖ వెళ్ళాలనీ మద్రాసు నుండి కంపెనీ దొరవారు తెలియ జేసారు. పాత లెక్కలన్నీ సవివరంగా చూపుతూ కంపెనీయే తమకు 3,50,000 బాకీ అని పేర్కొంటూ , ఆ మొత్తాన్ని తీసి వేస్తే తాము చెల్లించ వలసినది స్వల్పమే నంటూ, అది కూడా మూడు వాయిదాలలో కట్టడానికి సిద్ధమేనంటూ విజయరామరాజు లెక్కల పత్రం కంపెనీకి పంపించేరు !  ఆ వివరణని అంగీకరించని కంపెనీ వారు 13-06-1794న విజయ నగరం కోటను ఆక్రమించు కున్నారు. చిన విజయ రామరాజు విశాఖ తరలి పోయారు.
పూసపాటి ప్రభువల పట్ల స్వామి భక్తి చాటుకుంటూ సంస్థానంలో యావన్మంది రైతులూ శిస్తులు కట్టకుండా కంపెనీ వారికి నిరసన తెలియజేస్తూ తిరుగుబాటు చేసారు !  విదేశీయుల పెత్తనం మీద రైతువారీ తిరుగుబాటు కంపెనీ వారిని నివ్వెర పరచింది.
చిన విజయ రామరాజును విశాఖలో ఉండనివ్వడం కూడా తమకు క్షేమకరం కాదని భావించి, కంపెనీ వారు  కుట్ర పూరితమయిన ఆలోచనతో రాజుని విశాఖ విడిచి మచిలీ పట్నం వెంటనే వెళ్ళి పోవాలని ఆదేశించారు.
కంపెనీ వారి దురహంకారం సహించ లేక రామరాజు వారితో యుద్ధానికి సిద్ధ పడ్డారు.
రాజ బంధువులనూ, సర్దారులనూ, హితులనూ పద్మనాభంలో సమావేశ పరచి వారిని యుద్ధోన్మఖులుగా చేస్తూ ఉత్తేజ పూరిత మయినప్రసంగం చేసారు

అపజయం అనివార్యమనీ, వీర మరణం తథ్యమనీ తెలిసి కూడా దొరల వంచనకు ప్రతీకారంగా ఆత్మాభి మానాన్ని నిలుపుకుంటూ వారంతా యుద్ధ సన్నద్ధులు కావడానికి ఆ ప్రసంగం  ఎంతగానో దోహద పడింది !

ఒక యోద్ధ, ఒక ఆత్మాభిమాన దురంధరుడు తన వారిని ఎలా తన ఆశయానికి అనుకూలురుగా చేసికో గలడో చెప్పడానికి ఈ మహోపన్యాసం ఒక సజీవ ఉదాహరణగా నిలుస్తుంది
నాడు పద్మనాభంలో చిన విజయ రామరాజు చేసిన ఉత్తేజ భరిత  సుదీర్ఘమయిన ఉపన్యాసం నుండి కొన్ని భాగాలు :
( శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరం నుండి )

‘‘శ్రీ విజయ నగర సంస్థాన గౌరవ పరిపాలనా తత్పరులగు యోధాగ్రేసరులారా ! మన మిప్పుడు విజయ నగర గౌరవ సంరక్షణార్ధమై కంపెనీ వారితో యుద్ధం చేయ వలసి వచ్చింది ’’

‘‘మనచే పునరుద్ధరింప బడిన ఒకానొక పాశ్చాత్య వర్తక సంఘములో అడుగులకు మడుగులొత్తి చేతులార మన సామ్రాజ్య లక్ష్మిని వారి కప్పగించిన రాబోవు చరిత్రకారులు మనలను గురించి ఏమని వ్రాయుదురో యూహింపుడు.’’

‘‘ చతుర్మండల  మండలేంద్ర కోటీర  స్థగిత  రత్నా ప్రభా విభాసిత  పాద పీఠమగు  విజయ నగర సామ్రాజ్య లక్ష్మిని పాశ్చాత్య వర్తకులకప్ప చెప్పి,  దీనులమై బందరు లంకలలో   ‘‘ నీచపు చావు చచ్చుట మేలో ’’  లేక, బహు సామంత రాజ విరాజమానయగు శ్రీ విజయ నగర రాజ్య లక్ష్మి గౌరవ సంరక్షణార్ధమై ఆత్మ ప్రాణ పరిత్యాగ మొనరించి నిమిషములో వీర స్వర్గము చూరగొని అఖండాఖండల రాజ్య లక్ష్మీ కృపావీక్షణముల కర్హుల మగుట మేలో  ? బాగుగా యోజింపుడు !’’

‘‘ ఆలోచించిన మనకీ యుద్ధమున జయము సిద్ధించుట దుర్లభము.ఏలయన మొదట మన స్వకుటుంబము నందే ద్రోహులు బయలుదేరిరి.  ... ... ఏది ఎట్లున్నను హీనపు చావు చచ్చుట కంటె స్వకుల మర్యాలను నిలువ బెట్టి రాచ కులము వారికి విహిత మయిన మరణమును రణ రంగమున బొందెదము గాక !
పద్మనాభ యుద్ధము చిరస్మరణీయమై యుండక పోదు ! యోధాగ్రేసరు
లారా !  ఇప్పుడు మనము చేయ వలసిన పని ఇంతకు మించి వేరొండు గోచరించుట లేదు. కావున మీ యభిప్రాయములను తెలియ జేసి వెంటనే విజయ నగర రాజ్య లక్ష్మీ గౌరవము నిలుపుటకు పూనుకొనుడు !’’

రాజ బంధువులు, సరదారులనూ ఈ ప్రసంగం కదిల్చి వేసింది. అనంత పద్మనాభ స్వామికి నివేదించ బడిన మహా ప్రసాదాన్ని చేతిలో పట్టుకుని ‘‘ విజయమో, వీర స్వర్గమో తేల్చు కోడానికి  అంతా నడుం కట్టారు.

పద్మనాభ యుద్ధంలో విజయ రామ రాజు పక్షాన  శ్రీయుతులు పూసపాటి విజయ గోపాల రాజు గారు, వత్సవాయి నరస రాజు గారు, నడిపిల్లి రామ భద్ర రాజు గారు, చింతలపాటి నీలాద్రి రాజు గారు, దాట్ల అప్పల రాజు గారు, దాట్ల చిన వెంకటపతి రాజు గారు, తిరుమల రాజు, కొండ్రాజు గారలు, సాగి గోపాల నరస రాజు గారు, జంపన వెంకట రామ రాజు గారు, దంతులూరి అప్పల రాజు గారు, దంతులూరి రాఘవ రాజు గారు, భూపతి పద్మనాభ రాజు గారు  నిలిచారు ! ఇంకా, వేజర్ల వారు, గొట్టి ముక్కుల వారు, పెనుమత్స వారు  మొదలయిన క్షత్రియ వీరులు పాల్గొని వీర మరణం చెందారు.

మృత్యువును ఆహ్వానించి ఆలింగనం చేసుకున్నారు ! ఆత్మాభిమానం ముందు ఆత్మార్పణ తృణ ప్రాయంగా భావించారు !

పద్మనాభ యుద్ధంలో అద్భుతాలేమీ జరుగ లేదు.
అనుకున్నట్టే అయింది.  ఫిరంగులు పేలాయి !  యుద్ధం అంతా కేవలం 45 నిమిషాలలో ముగిసి పోయింది.
అభిమాన ధనులు నేలకొరిగారు. చిన విజయరామరాజు ‘‘ రంగ రంగా ’’ అని ఇష్ట దైవాన్ని  స్మరిస్తూ వీర స్వర్గం పొందారు.

విజయ నగరానికి కూతవేటు దూరంలో  వెలసి న్నఅనంత పద్మనాభ స్వామి నాటి గజపతులు ఆత్మబలిదానాలకు సాక్షీభూతంగా నిలిచాడు.

భావి  స్వాతంత్ర్య సమరాగ్ని జాజ్వల్యమానమై రగులుకోడానికి ఈ పద్మనాభ యుద్ధం వొక చిన్న పాటి నిప్పు రవ్వ కాకుండా పోలేదు .

27, అక్టోబర్ 2014, సోమవారం

అనుకోని అతిథితో అర క్షణం సేపు !

ఇవాళ మా ఇంటికి వో అనుకోని అపురూప మయిన అతిథి రావడం జరిగింది. ఆ అతిథితో  కాస్సేపు జనాంతికంగా సాగిన సంభాషణ సారం మీ ముందు ఉంచుతున్నాను.
అతిథి :  ‘‘ బావున్నారా ? ! ’’
నేను : ‘‘ ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు ! నన్ను నేనే నమ్మ లేక పోతున్నా ననుకో !
నా కళ్ళు నిజమే చెబుతున్నాయా ! ఎప్పుడో, చిన్నప్పుడు  పల్లెటూర్లో మా యింటి నడి వాకిలిలో  మీరంతా పిల్లా పీచూతో సమావేశ మవుతూ ఉండే వారు కదూ !  అప్పుడు మురిపెంగా మిమ్మల్ని చూసే వాళ్ళం ! తరువాత చూడ్డమే అరుదయి పోయింది ... ఎలా ఉన్నారు ? ’’
అతిథి : ‘‘ ఎందుకులే, చెప్పు కుంటే కడుపు తరుక్కు పోతుంది. ఎందుకో తెలీదు కానీ,  మేం పిట్టల్లా రాలి పోతున్నాం ! మా కుటుంబాలకు  కుటుంబాలే కూలి పోతున్నాయి. ఆ దేవుడికి మా మీద దయ లేదు ! అక్కడా అక్కడా ఒకటీ అరా మిగిలేం.’’
నేను: ( బాధగా ) అవును .. నేనూ విన్నాను,  అంతర్జాలంలో ఆ వివరాలు చదివేను కూడా
అతిథి : ‘‘  ఏం రాసేరేం ? ’’
నేను: అంతర్జాలం నుండి నేను సేకరించిన కథనం ఇలా ఉంది చూడు ...

‘‘పిచ్చుకలు మన చిన్ననాటి నేస్తాలు. పదిహేను, ఇరవై యేళ్ళ క్రితం వరకూ పిచ్చుకలు లేని చోటంటూ కనపడేది కాదు. ముఖ్యంగా భారత దేశ గ్రామాల్లో అవి దాదాపు పెంపుడు పక్షులుగా కనపడుతుండేవి. పొద్దున లేచింది మొదలు దైనందిన జీవితంలో మనుషులు చేరే ప్రతి చోటా పిచ్చుకలూ చేరి తమ కార్యకలాపాల్లో మునిగితేలుతుండేవి. ఇంటి చూరులో, కిటికీ తలుపులపైనా, స్కూలు గది గోడలపైనా, చెట్ల కొమ్మల చివర్లలో, బట్టలు ఆరేసుకునే దండేలపైనా, పొట్ట పోసుకున్న వరి చేలల్లో, బిళ్లంగోడు ఆడే తుమ్మ తోపుల్లో, ఎండాకాలపు సీతమ్మ చెట్లపైనా, గుళ్ళు గోపురాలపైనా ఎక్కడికెళ్ళినా పలకరిస్తుండేవి.
పరిశీలనా పరులకి పిచ్చుకల జీవనం ఆసక్తిగా ఉండేది. స్నేహం చేయడం, జంట కట్టడం, సందర్భానికి తగినట్లు కిచ కిచచప్పుళ్లు మార్చడం, ఆడ మగ పిచుకలు ఊసులాడుకోవడం, చిన్న చిన్న పురుగుల్ని ముక్కున పట్టి పిల్ల పిచ్చుకల నోట్లోకి నెట్టడం, నిపుణులైన ఆర్కిటెక్చర్ ఇంజనీర్లలా ఒక్కో పుల్లా, పీచూ తెచ్చి గూళ్లు అల్లడంఎన్నని? పరిసరాల్ని మర్చిపోయేలా చేసేవి. ఒక్కో మనిషీ పెరిగి పెద్దయ్యే క్రమంలో వివిధ సందర్భాల్లో పిచ్చుకలతో అనుభవం కొండ గుర్తులుగా ఉండేవి.
ఇప్పుడు పిచ్చుకలు దాదాపు కనుమరుగైనాయి. ప్రకృతినంతటినీ అదుపులోకి తెచ్చుకున్న మనిషి అవసరాలకు మించి ప్రకృతి వనరుల్ని ఖర్చు చేసేస్తున్నాడు. ఇతర పశు, పక్షు జాతులకి ప్రకృతిని దూరం చేస్తున్నాడు. భూ వాతావరణాన్ని తోటి జీవజాలానికి పనికి రాకుండా చేస్తున్నాడు. పరిమితికి మించి వనరుల్ని తవ్వి తీస్తూ వాతావరణ వ్యవస్ధని అస్తవ్యస్తం చేయడంతో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయి పిచ్చుకలకి మరణ శాసనంగా మారింది. మారుమూల ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకుపోయిన సెల్ టవర్లు పిచ్చుకలు అంతరించిపోవడానికి కారనమని పరిశోధనలు చెబుతున్నాయి. టవర్ల నుండి వచ్చే విద్యుదయస్కాంత తరంగాల ధాటికి సున్నిత ప్రాణులైన పిచ్చుకలు చనిపోతున్నాయని ఆ పరిశోధనలు చెబుతున్నాయి.
ప్రపంచం మొత్తం మీద పిచ్చుకల సంఖ్య ఎనభై శాతం పడిపోయిందని ఆర్నితాలిజిస్టులు సర్వే చేసి లెక్కతేల్చారు. పిచ్చుకల దైన్యానికి ఇక్కడ మనిషికారణంగా జనరలైజ్ చెయ్యడం కూడా సరికాదేమో. ఎందుకంటే మనుషుల్లో తొంభై శాతం మంది పశు పక్ష్యాదులకు స్నేహ శీలురే. భూములూ, కంపెనీలు అదుపులో పెట్టుకున్న కొద్ది మందే భూ వినాశనానికీ, వాతావరణ విధ్వంసానికీ కారణం అవుతున్నారు. వీరి లాభాపేక్ష మెజారిటీ ప్రజలతో పాటు ఇతర జీవ జాలానికి కూడా ప్రాణాంతకంగా మారింది.
ఈ నేపధ్యంలోనే 2012, మార్చి 20 తేదీని ప్రపంచ పిచ్చుకల రోజుగా ప్రకటించారు. ఎన్ని రోజులుప్రకటించినా పర్యావరణాన్ని విధ్వంసం చేసే ఆర్ధిక దోపిడీ విధానాలు అంతం అయ్యేవరకూ ఈ పరిస్ధితి కొనసాగుతూనె ఉంటుంది. మనిషి సుఖ జీవనానికి పశు, పక్ష్యాదులు కూడా దోహదం చేస్తున్నాయన్న స్పృహ లాభాపేక్ష కు ఉండదు. ఏం చేసయినా, శ్రామికుల సుఖ సంతోషాల్నీ ప్రాణాల్నీ కబళించయినా, పశు పక్ష్యాదుల వాటాని లాక్కునయినా లాభ శాతం పెంచుకోవాలని చూసే పెట్టుబడిదారీ వ్యవస్ధకు తనకు తాను మరణ శాసనం లిఖించుకుంటోదన్న సృహ కూడా ఉండదు. మేల్కోవలసిందే శ్రామికులే. ’’

అతిథి: ‘‘ ఇంత  చక్కని సమాచారాన్ని అందించిన వారికి నీతో పాటూ మేము కూడా ఋణ పడి ఉంటాము. సరే ... మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకునేందుకు వచ్చేను. ఇక్కడ మీ జనావాసాల మధ్య ఈ మధ్య వో సెల్ టవరు కట్టేరు. పూర్తయిన ఆ టవరుని ఏమయిందో, ఏమో నాలుగు రోజులకే  తొలిగించి వేసారు కదూ ... ఇక్కడి వాళ్ళంతా అంగీకరించక పోవడంతోనే దానిని తొలగించారని చెబుతున్నారు.  అందుకే మీకు ధన్యవాదాలు చెప్పు కుందామని ఇలా వచ్చేను. మరి వెళ్తాను ...’’
నేను : ‘‘ అదేం, వచ్చి అర క్షణం కాలేదు ..కాస్సేపు ఉండ రాదూ ; ...’’
నా మాటలు ఇంకా పూర్తి కానే లేదు, మా  ఇంటి కొచ్చిన అపురూప అతిథి తుర్రున ఎగిరి పోయింది !
మా చిన్నప్పుడు మా పల్లెలో మా ఇంటి నడి వాకిలిలో మా నాయనమ్మ కట్టిన వరి కంకుల మీద గుంపులు గుంపులుగా వచ్చి సందడి చేసేవి. మా రైతులు బళ్ళతో ధాన్యాన్ని తోలు కొచ్చి, మా వీధిలో మా ఇంటి ముందు  నిల బెట్టే వారు. మా ఇంట్లో ముత్తయిదువులు ఎద్దులకి పసుపు కుంకుమలు పూసి, హారతి ఒచ్చి పూజలు చేసాక, ధాన్యం బస్తాలను ఇంట్లోకి తెచ్చి, గాదె గదిలో కుమ్మరించే వారు . ధాన్యం బస్తాలతో పాటు ఆనప కాయలూ, బీర కాయలూ వంటి కూరలు కూడా  తెచ్చే వారు. ధాన్యం బస్తాలన్నీ ఇంట్లో చేరాక, పెరట్లో నుయ్యి దగ్గరకి వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కునే వారు రైతులు . నలుగు రయిదుగురు ఉండే వారనుకుంటాను. ఒక ప్రక్క ధాన్యం బస్తాలు ఇంట్లోకి పెరుగుతూ ఉండగానే ఇంట్లో మా నాయనమ్మా , వాళ్ళూ రైతుల కోసం వేడి వేడి అన్నం, సాంబారూ  ( పప్పు పులుసునీ ) వండి సిద్ధం చేసే వారు. పెరటి వాకిలి గచ్చు మీద విస్తరాకులు వేసి వడ్డించే వారు. ఆ వంటని మా రైతులు ఎంత ఇష్టంగా తినే వారో ! ‘ బుగతమ్మ చేతి వంట అమృతం ! ’ అంటూ మెచ్చుకునే వారు. మా నాయ నమ్మ పోయాక, మా మురళీ పిన్నీ, తర్వాత, మా ఆవిడా, కటి రెండేళ్ళు ఆ బాధ్యత కొత్తగా కాపురాని కొచ్చిన మా ఆవిడ తీసు కుని చేసేరు


ఇదంతా చెప్పడం దేనికంటే, ఇంటికి ధాన్యం బస్తాలు వచ్చిన రోజునే, పొలం నుండి రైతులు తెచ్చిన వరి కంకుల గుత్తులను మా వాళ్ళు మా ఇంటి నడి వాకిట్లో కట్టే వారు. అది మొదలు ! ఆ రోజు నుండీ పిచ్చుకలు గుంపులు గుంపులుగా వచ్చి వాలేవి.  అలా,  అప్పుడు మా ఇళ్ళలోనూ. పెరళ్ళలోనూ విరివిగా కనబడే పిచ్చుకలు ఇప్పుడు  చాలా ఏళ్ళుగా  కనబడడమే మానేసాయి. పొలాలు అమ్ము కున్నాక, మా నడి వాకిలిలో రైతులూ లేరు, ధాన్యం బస్తాలూ లేవు, వరి కంకులూ లేవు. పిచ్చుకలూ లేవు !. 
చాలా ఏళ్ళకి మా కంట పడిన అపురూప అతిథిని మీకూ చూపించాలని ముచ్చట కొద్దీ ఇంత వివరంగా రాసేను.

ఇదిగో  ! మా ఇంటి కొచ్చిన అపురూప అతిథి ఫొటో ... చూడండి ....
నిర్మాణం పూర్తయి, తిరిగి నాలుగు రోజులలోనే తొలగించిన సెల్ టవర్ అవశేషాలు యివే ... ( దీనిని తొలగించిన మరు నాడే అతిథి రావడం  జరిగింది. యాదృచ్ఛికమే కావచ్చు కానీ అదొక అందమయిన భావనకు బీజం వేసింది ) చిత్రం  చూడండి.26, జూన్ 2013, బుధవారం

ఇల్లు కొంప ఎప్పు డవుతుంది గురూ ...సమ్యక్ భాషణం వ్యక్తికి భూషణం.

కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్జ్వలా

న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా:

నాన్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే

క్షీయంతే2ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్.

ఎన్ని మణిమయ హారాలు ధరించినా అవి మనుషులకు అలంకారాలు కావు. ఎన్ని సుగంధాలు పూసుకొన్నా, ఎన్ని పూవులు ధరించినా, అవి మనిషికి అలంకారాలు కావు. చక్కని వాక్కుకి మించిన అలంకారం లేదు సుమా ! వాక్ భూషణమే భూషణం.

ఈ సంస్కృత శ్లోకానికి ఏనుగు లక్ష్మణ కవి తెలుగు అనువాదం :

భూషలు కావు మర్త్యులకు భూరి మయాంగద తార హారముల్

భూషిత కేశపాశ మృదుపుష్ప సుగంధ కలాభిషేకముల్

భూషలు కావు, పూరుషుని భూషితుఁ జేయు ( బవిత్రవాణి వా

గ్భూషణమే భూషణము భూషణముల్ నశియించు నన్నియున్.

అంచేత, మంచిగా మాట్లాడడమే మనిషికి అలంకారం. దేవుడు నోరిచ్చాడు. మాట యిచ్చేడు, ఆలోచన యిచ్చేడు ... కాస్త నాలుగు మంచి మాటలు మాట్లాడితే పోయేదేమీ లేదు కదా.

నోరు నొచ్చేలా శ్రీహరిని కీర్తించవయ్యా మగడా అని చెప్పేడు పోతన. మనం వింటామా. అంత సీన్ లేదు కానీ, రోజూ నాలుగు మంచి మాటలయినా పలుకుతున్నామా ? ఆలోచించాలి.

మృదువుగా మాట్లాడితే ఎవరయినా వింటారు. అలాగని పలుకులలో తేనె లొలుకుతూ, మదిలో విషాన్ని నింపుకొని ఉండడంకూడా సరికాదు.

అసలు మన మూడ్స్ బట్టి మనం మాట్లాడే ధోరణి కూడా ఉంటుందేమో ...

విసుగ్గా ఉన్నప్పుడు ఇల్లు కాస్తా కొంప అవుతుంది !

భోజనం కాప్తా పిండాకూడవుతుంది !

ఊరు కాప్తా వల్లకాడవుతుంది !

ఎదుటి వాళ్ళంతా ఎగస్పార్టీ వాళ్ళే అవుతారు !

అంచేత విసుగుని తగ్గించు కొని శాంతంగా అందరితో మంచిగా మాట్లాడడానికి ప్రయత్నించాలి.
22, జూన్ 2013, శనివారంహిమవత్పర్వత సానువుల్లో మును పెన్నడూ ఎరుగని ఘోర విపత్తు సంభవించింది. వేలాది మందిని గంగమ్మ          పొట్టన పెట్టు కుంది. ఆ విపత్తు వివరాలు అందించడంలో మన తెలుగు టి.వి లు అత్యుత్సాహంతో కొంత మదర్యాద కోల్పోతున్నాయి. వాటికి సంబంధించిన వార్తలను ప్రసారం చేసేటప్పుడో, చర్చా కార్యక్రమాలు నిర్వహించే టప్పుడో తమ పైత్యం ఒలకబోస్తూ పెడుతున్న పేర్లు అభ్యంతర కరంగా ఉంటున్నాయి. ఉదాహరణకు నిన్న దానికి చెందిన ఒక కార్యక్రమానికి యమలోకం అని శీర్షిక ఉంచేరు. చర్చలో పాల్గొన్న ఒక పెద్దాయన అది దేవ లోకం కానీ యమ లోకం కాదనీ అసలే ఆ ప్రాంతమంతా అనుకోని ఘోర విపత్తుతో దయనీయంగా ఉంటే ఇలాంటి పేర్లు పెట్టడం తగదని హెచ్చరిండం జరిగింది. అలాగే వరద బీభత్సానికి బదరీనాథ్ అంతా బురద మయమై పోయిందని చెబుతూ ‘‘ బురదీనాథ్’’ అని శీర్షిక ఉంచి తన అతి తెలివిని మరో టీ.వీ. ప్రకటించుకుంది. ఈ జాడ్యం మన వాళ్ళకి వదిలేదెలా ? మీరూ ఆలోచించండి ...

25, ఏప్రిల్ 2013, గురువారం

కథా మంజరి బ్లాగు పేరు త్వరలో మార బోతోందా ?! ....బ్లాగు టపా ఏదో రాసుకుంటూ ఉంటే, ఎప్పు డొచ్చేడో తెలియదు. వచ్చి, నా వెనకాల నిలబడి నేను టైపు చేయడం పూర్తి చేసే లోగా అంతా చదివేసాడు. రాయడం, అదే, టైపు చేయడం ముగించాక , వాడి శ్వాస వెచ్చగా తగలడంతో తుళ్ళి పడి వెనక్కి తిరిగి చూసాను, పళ్ళికిలిస్తూ కనబడ్డాడు. వెనకాల నుంచి మనకి తెలియ కుండా అంతా క్షణంలో చదివెయ్య గల వాడి  ప్రావీణ్యం  అంతా యింతా కాదు ! అసలు ఆ విద్య తోనే వాడు పరీక్షలన్నీ గట్టెక్కాడు. ఖర్మకాలి ముందు వాడు శుంఠ అయితే పాపం వీడూ పరీక్ష తప్పాల్సి రావడం కూడా అప్పుడప్పుడూ జరిగేదనుకోండి ! అది విషయాంతరం.

‘‘నువ్వెప్పు డొచ్చావు ? ’’ అన్నాను ఆశ్చర్యంగా,

‘‘నువ్వు రాయడం మొదలు పెట్టడం నేను రావడం ఒకే సారి జరిగేయి . అంతా చదివేసాను.’’

‘‘ఎలా ఉంది ? ’’ అడిగేను, మానవ సహజమయిన చాపల్యంతోనూ, కుతూహలంతోనూ, ఇంకా చెప్పాలంటే కుతి తోనూ.

చాక్లెట్ చప్పరించీసి నట్టు చప్పరించీసేడు.

గాలంతా తీసీసేడు. ఇంతకీ ఈ వచ్చిందెవరో ఇంకా చెప్పనే లేదు కదూ ? గుర్తు లేదూ ?! మా తింగరి బుచ్చి గాడు. వాడి గురించి ఇంకా ఎక్కువ వివరాలు కావాలంటే ఇక్కడ నొక్కి చదవండి ,,,

సరే , ప్రస్తుతానికి వద్దాం. ..

‘‘ఐతే ఏమీ బాగు లేదంటావ్ ? ’’ అన్నాను నీరసంగా.

‘‘బాగుండడం, బావు లేక పోవడం నీ చేతిలో లేదు. అందుకే మార్చెయ్ ! వెంటనే మార్చెయ్ ! ’’ అన్నాడు.

‘‘ ఏమిటి మార్చేది ? నీ తలకాయ్ ’’

‘‘ మార్చ వలసి వస్తే అదీ మార్చాలి. ముందు నీ బ్లాగు పేరు మార్చెయ్ ’’ అన్నాడు ధృఢంగా.

‘‘ ఎందుకూ ? ’’ అన్నాను కోపంగా.

‘‘ న్యూమరాలజీ ప్రకారం. కథా మంజరి పేరులో అక్షరాలు సరిగా లేవు. కొంచెం మార్చాలి. అందుకే సరైన టపాలు పెట్ట లేక పోతున్నావు. ఆ పెట్టిన వాటిని కూడా ఎవరూ చదవడం లేదు. కంటి తుడుపు కోసం అన్నట్టుగా ఒకరో ఇద్దరో తప్ప ఎవరూ కామెంట్ లు పెట్టడం లేదు ... అవునా ? ’’అడిగాడు.

నా ఇగో మీద వాడలా దెబ్బ తీసాక, కొంచెం నీరసం వచ్చి, ‘‘ అయితే ఇప్పుడేం చేయాలంటావ్ ’’ అనడిగేను.

‘‘వెంఠనే మార్చెయ్ ! కథా మంజరి పేరు మార్చెయ్ ! ‘‘

‘‘ మార్చడం ఎందుకూ ? ’’

‘‘ ఎందుకంటే, న్యూమరాలజీ ప్రకారం నీ కథా మంజరి బ్లాగు పేరు ఏమీ బాగా లేదు. అందుకే నీ దశ అలా తగలడింది. అందుకే దాని పేరు నేను చెప్పి నట్టుగా మార్చి పారెయ్. అప్పుడు చూసుకో ! నీ బ్లాగు దశ వెలుగుతుందీ ... హిట్టులే హిట్టులు ! కామెంట్ లే కామెంటులు ! వాటిని ప్రచురించ లేక నీ చేతి వేళ్ళు నొప్పి పుడతాయనుకో ! ఒక్క రోజు కొత్త టపా వెయ్యక పోయినా మొత్తం తెలుగు బ్లాగు ప్రియులందరూ నీమీదకి దండెత్తి వచ్చే ప్రమాదమూ ఉంది ! అందు చేత వెంటనే నేను సూచించే విధంగా నీ బ్లాగు పేరు మార్చెయ్ ’’ అన్నాడు.

‘‘ ... .. ...’

‘‘ అప్పుడిక తెలుగు బ్లాగర్లు నీ ధాటికి తట్టుకో లేక బ్లాగులు రాయడం మానుకుంటారు. బ్లాగు లోకంలో నువ్వొక్కడివే మహా రాజులా వెలిగి పోతావ్ ’’

‘‘ బ్లాగులే లేక పోతే ఇక సంకలిను లెందుకూ వాళ్ళూ మూసేస్తారు కాబోలు’’

‘‘ హ్హ ! హ్హ! హ్హ! ... అంచేత, నేను చెప్పినట్టు చెయ్. ముందో కాగితమూ పెన్నూ తీసుకుని కథా మంజరి అని ఇంగ్లీషులో రాయ్ ...’’

ప్రయత్నించి చూస్తే పోలా ? అనే బలహీనత ఆవరించి కలం కాగితం తెచ్చు కున్నాను. వాడు చెప్పి నట్టుగా రాసేను.

Katha manjari

‘‘ బావుంది. ఇప్పుడు ఆ పేరులో నేను చెప్పిన ఇంగ్లీషు అక్షరాలు చేర్చు. నేను తీసెయ్య మన్నవి తీసెయ్ ...‘‘ అంటూ నా బ్లాగు పేరుకి శస్త్ర చికిత్స మొదలెట్టాడు.

ఇంగ్లీషు పేరులో వాడు చెప్పిన చోటల్లా కొత్త అక్షరాలు ఉంచేను. పాత అక్షరాలు కొన్ని తొలగించేను.

‘‘ ఇప్పుడీ ఇంగ్లీషు పేరుని తెలుగులో ఎలా ఉచ్చరిస్తావో ఒక్క సారి చదువు ’’ అని ఆదేశించాడు

కూడ బలుక్కుని చదివాను తెలుగు పేరు.

‘‘ ఖ్ఖదా మంఝరి ’’ ... అని తయారయింది.

‘‘ వెరీ గుడ్ ! ఇక నుండీ నీ బ్లాగు పేరు ఇదే ! ఇక చూస్తో ! నీకింక తిరుగు లేదు .. ... ...అన్నట్టు ...’’

‘‘ ఇంకా ఏఁవిటి ; ’’ అడిగేను నీళ్ళు నములుతూ ...

అబ్బే, చిన్న విషయమే ... ఈ కంప్యూటర్ ఉంచిన చోటు కూడా వాస్తు ప్రకారం సరిగ్గా లేదు. అంచేత ఈ గోడ కొట్టించీసి, కంప్యూటర్ని ఆ మూలకి ఉండేలా  పెట్టుకో ! అప్పుడింక నీ ‘‘ ఖ్ఖదా మంఝరి ’’ వెలిగి పోతుందీ ...’’

నా కళ్ళు బైర్లు కమ్ము కొస్తున్నాయి. నేనేదో అనబోయే లోగా ...

‘‘ చెల్లెమ్మా ! పెసరట్టు రెడీయేనా ?!’’ అనరిచేడు వంట గది వేపు తొంగి చూస్తూ.

లోపలి నుంచి వాడి ప్రసంగ మంతా వింటున్నట్టే ఉంది ... ‘‘ఆఁ ! వచ్చె ... వచ్చె ... ఒక్క నిముషం అన్నయ్య గారూ ! ’’ అంటూ వినిపించింది మా ఆవిడ గొంతు.

అనతి కాలంలో తన భర్త ప్రపంచ ప్రఖ్యాత ఏకైక తెలుగు బ్లాగరు కాబోతున్నాడని ఏవేవో ఊహించు కుంటూ కలలు కంటోందేమో , ఖర్మ !నా  వెర్రి బాగుల శ్రీమతి

( సంఖ్యా శాస్త్రం పేరుతో మూఢనమ్మకాల విషాన్ని జన బాహుళ్యం లోకి వెద జల్లుతున్న ఓ తెలుగు ఛానెల్ వారికి స ‘ భక్తి ’ కంగా ఈ టపా అంకితమ్. )