కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కవితలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, సెప్టెంబర్ 2013, ఆదివారం

గణపతి కథ ..


అందరకీ వినాయక చవితి శుభాకాంక్షలు ... మీ కథా మంజరి.

మిత్రుడు ఓలేటి శ్రీనివాసభాను రాసిన గణపతి స్తుతి   చదవండి .. వినండి ..

ఇలాంటి చక్కని రచనలు మరిన్ని హాయిగా చదువుకొని ఆనందించాలంటే వెంటనే  గో తెలుగు డాట్ కామ్ కి    ( go telugu.com) కి వెళ్ళండి ...


అమ్మ పార్వతి జలకమాడగానెంచి
నలుగు పిండిని తాను బొమ్మగావించి
ఊపిరులు ఊదింది .. వాకిటను నిలిపింది
శంకరుని రాక తో కథ మలుపు తిరిగింది

అప్పుడే ఎదిగిన ఆ చిన్ని తండ్రి
తన కన్న తండ్రినే ద్వారాన నిలిపి
శూలి వేటుకు నేల కూలిపోయాడు
హస్తి ముఖమున తిరిగి లేచి నిలిచాడు

గుజ్జు రూపానికి బొజ్జొకటి  తోడు
వంకగా నెలవంక నవ్వుకొన్నాడు
గిరిజ కోపించింది శశిని శపియించింది
పాము మొలతాడుగా పనికి కుదిరింది

అన్ని లోకాలనూ తిరిగి రావాలి
తొలుత వచ్చిన వాడె నేత కావాలి
అమ్మ నాన్నలను  ముమ్మార్లు చుట్టి
గణనాథుడైనాడు పేరు నిలబెట్టి

చిటిబెల్లమిస్తేను  సిరులు కురిపించు
గరిక పోచే చాలు కరుణ చూపించు
ఇల లోన తొలి  పూజ  ఇంపుగా నీకె
విఘ్నాలు తొలగించి విజయాల నీవె




18, ఆగస్టు 2013, ఆదివారం

చాప చుట్టెయ్య కూడదూ ? !



చాప చుట్టెయ్య కూడదూ ?!

నీ అసాధ్యం కూలా !
నీ మొహం మండా ...

నువ్వూ కూర్చోవు,
నన్నూ కూర్చో నివ్వవు

మరెందుకయ్యా

చాప చుట్టెయ్య కూడదూ ; !

21, మే 2013, మంగళవారం

నీ మతం మండా ... పతంజలి కవిత ...




నీ మతం మండా 



కత్తి పెట్టి దేవుడ్ని

ఒక పోటు పొడిస్తే గానీ

పొడిచి, వాడి నెత్తురు

కళ్ళారా చూస్తే గానీ

నీ మతం నిలబడదు

నీ మొగం మండా

నీ మతం మండా

అప్పటిగ్గానీ నీ మతం నిలబడదు

నీ కాళ్ళు లేని మతం

నీ కళ్ళు లేని మతం

ముక్కూ మొగమూ లేని నీ

కదల్లేని మతం

( నీ పొగ మూజూడా)

అసియ్యకరమైన

నీ మతం ప్రాకటానికి

భగవంతుడి కళేబరం కావాలి

అది బలిసి పుర్రెల పూలు పూయడానికి

నరమాంసపు టెరువు కావాలి

ఛీ !

నువ్వూ నీ మతమూ

నీ మతమూ నువ్వూనూ

ఛీ ! ఛీ !

22, జూన్ 2012, శుక్రవారం

ఎంచక్కని కల !




ఎంచక్కని కల!
నేరమయ ప్రపంచంలో
ఎన్ని జైళ్ళూ చాలడం లేదు.

            - - -
క్షణ కాలంలో
లోకంలో ఇళ్ళన్నీ జైళ్ళు గానూ,
జైళ్ళన్నీ ఇళ్ళగానూ
మారి పోయినట్టు
గమ్మత్తయిన కల !
అప్పుడు
 ఇళ్ళగా మారిన  జైళ్ళన్నీ,

పసి పిల్లల నవ్వులతో
కళకళలాడి పోయినట్టు,
ఎంచక్కని కల !




20, మే 2012, ఆదివారం

నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా ...





ఒక వయసులో ఎంతో కొంత కవిత్వం అల్లకుండా ఉండడం సాధ్యం కాదేమో. అలా రాసిన కవిత ఇది. అప్పట్లో అందరిలాగానే నేనూ కవిత్వంలో కొంత నిప్పులు కక్కడానికి ప్రయత్నించాను. శ్రీ. శ్రీ జోక్ ప్రకారం నిప్పులు కక్కే కవిత్వం  కాదు కానీ,  నిప్పులలో కుక్క దగిన కవిత్వమే ఇది, అని త్వరలోనే తెలివిడి కలిగి, మరి కవితలు రాయడం మానేసాను.
అదన్నమాట, సంగతి.

3, నవంబర్ 2011, గురువారం

ఈ గేయం ఏ కవి రచించారో చెప్పండి చూదాం !

ఒకరి కొకరు

నువ్వూ నేనూ కలిసి
పువ్వులో తావిలా
తావిలో మధువులా !

నువ్వూ నేనూ కలిసి
కోకిలా గొంతులా
గొంతులో పాటలా !

నువ్వూ నేనూ కలిసి
వెన్నెలా వెలుగులా
వెలుగులో వాంఛలా !

నువ్వూ నేనూ కలిసి
గగన నీలానిలా
నీలాన శాంతిలా !

ఈ చిన్ని గేయ రచయిత ఎవరో చెప్పగలరూ ?

క్లూ ఏదేనా ఇమ్మంటారా ?

అతను గొప్ప కవి అని చిత్రకారులు అనేవారుట ! అతను గొప్ప చిత్రకారుడు అని కవులు పొగిడే వారుట.

ఇతని ఊహా ప్రేయసి చంద్ర సంబంధి.

పోనీ, మరో క్లూ ఇమ్మంటారేమిటి ?

ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు వారు ఒకసారి ఒక నవలల పోటీ లో మరొక ప్రముఖునితో పాటు, ఇతనికి బహుమతి పంచి ఇచ్చారు.

ఆ ప్రముఖుని ప్రముఖ పాటల పుస్తకంలో ( గేయ సంపుటి ) బొమ్మలు ఇతనే గీసారు.

ఈ క్లూలు చాలవూ !

పోనీ, వారి ఫొటో కూడా పెట్టేస్తున్నాను. చెప్పెద్దురూ ! అయితే, మరో అనుబంధ ప్రశ్న కూడా ఉందండోయ్ !

క్లూలలో చెప్పిన బహుమతి పొందిన నవల పేరూ, వారి ఊహా ప్రేయసి పేరూ, వారు బొమ్మలు వేసిన గేయ సంపుటి పేరూ కూడా చెప్పాలి. మరి.


30, ఏప్రిల్ 2011, శనివారం

చీకటి రోజుల చిరు కవిత


మహా కవి జయంతి నేడు.

చీకటి రోజుల్లో బరంపురం అఖిల భారత రచయితల మహా సభలో మహా కవి ఎదుట చదివి, వారి ఆశీర్వాదాన్ని పొందిన ఈ చిరు కవిత మరోసారి ...

ఈ కవిత చదివేక శ్రీ.శ్రీ నా చేతిలో కవిత ఉన్న కాగితం తీసుకుని దాని మీద తన సంతకం చేసి తిరిగి యిచ్చేరు.
ఉరకలు వేసే ఆ వయసులో అందుకు నేనెంత గర్వించేనో కదా !
అది నా వద్ద ఇంకా పదిలం. మరి ఆ చీకటి రోజుల కవితను చూడండి:

కంఠం మీద కత్తి


కంఠం మీద కత్తి
ఎలుగెత్తి పాడ లేను
ముంజేతికి బాండేజీ
చెల రేగి వ్రాయ లేను.

సిరా బుడ్డిలో సాలీడు
సిగరెట్టు నుసి రాల లేదు

అరరే ! చిక్కులు పడందయ్యా,
ఆలోచనల దారం.

22, జనవరి 2011, శనివారం

పాల పిట్ట కొత్త సంచికలో చెమట పూల చెట్టు కవిత ...


చెమట పూల చెట్టు

ఒక్కో విత్తనం ఒక్కో అక్షరంగా శుభ్ర పరచి
చాలు చాలునా మొలకల కవితలల్లి
మట్టిని మహా కావ్యంగా మలిచిన కవివి నువ్వు

చినుకులూ సూర్య కిరణాలూ పడుగు పేకలుగా
నేలమ్మకు చేల చీరలు నేసే నేతగాడివి నువ్వు

నాలుగు గట్లు నగిషీల ఫ్రేములుగా
దుక్కి బెడ్డలే రంగు ముద్దలుగా స్వేదజలంతో కలిపి
మడి చెక్క కేన్వాసు మీద
ఆకు పచ్చ చిత్రాలను అలవోకగా గీసే
చేయి తిరిగినచిత్రకారుడివి నువ్వు

నిత్యమూ నిరంతరమూ
సమస్త ప్రజలకూ నిశ్శబ్ద హరిత సందేశాన్నందించే
మహామహోనాధ్యాయుడు నీ కంటే
యింకెవరుంటారు?
ఆరు రుతువులు చెక్కిన అపురూప శిల్పమా !
మా అరుదైన నేస్తమా !

కళ్ళు మిరుమిట్లు గొలిపే నీ శ్రమ సౌందర్యం ముందు
నీడ పట్టున నునుపెక్కిన మా సోమరి దేహధావళ్యం
తెల్లబోయి తల వొంచుకుంటుంది.

చెమట పూల చెట్టువు నువ్వు
ప్రగతికి తొలి మెట్టువి నువ్వు

నేల అణువణువునా పరుచుకుంది నీ నవ్వే
భూగోళం నీ దోసిట విరిసిన పువ్వే.

పంట నీ భాష
స్వేచ్ఛ నీ శ్వాస
నీ అడుగు ఆకుపచ్చని మడుగు
నీ నీడ మాకు చల్లని గొడుగు

(రైతు మిత్రుడు నడిసొంటి వెంకట్నాయుడికి ఆత్మీయంగా )

గంటేడ గౌరునాయుడు.

పాల పిట్ట ( మాస పత్రిక) జనవరి 2011 సంచికలో ప్రచురితమైన ఈ కవిత నన్నుకొన్ని మినహాయింపులతో
ఆకర్షించింది.

ఆరుగాలం పొలంలో శ్రమించే రైతుని చెమట పూల చెట్టుగా అభివర్ణించడం పులకింప చేసింది.
గౌరునాయుడు మంచి భావుకత ఉన్న కవి. పల్లెల పునాదుల మీద మొలిచిన కవి. చెట్టు పాట, ఏటి పాట ఎరిగిన వాడు. ఉత్తరాంధ్ర భాష పుట్టక తోనే వంట బట్టిన వాడు. అక్కడి పల్లెల నిసర్గ సౌందర్యంతో పాటు, అనంత విషాదాలను, సమస్యల మూలాలను అనుభవించి పలవరించే కవి.

రైతు మిత్రుడిని చెమట పూల చెట్టుగానే కాక, మట్టిని మహా కావ్యంగా మలచిన కవిగానూ, నేలమ్మకు చేల చీరలు నేసే నేతగానిగానూ, మడి చెక్క మీద ఆకు పచ్చని చిత్రాలను గీసే అపురూప చిత్రకారుని గానూ, నిశ్శబ్ద హరిత సందేశాన్ని జాతి జనులకు చేర వేసే మహామహోపాధ్యాయునిగానూ, పేర్కొంటూ, ఆరు రుతువులు చెక్కిన అరుదైన నేస్తంగా .
అక్కున చేర్చుకుంటున్నాడు. అతని భాష పంట భాష అంటూ పాత విషయాన్ని కొత్తగా నిర్వచిస్తున్నాడు.

ఐతే, డిక్షన్ మోతాదు మించి, ‘నదిని దానం చేసాక ...’ వంటి గొప్ప కవిత్వం రాసిన గౌరునాయుడు కలం నుండి వచ్చిన కవితేనా యిది అనిపించింది.

అంత్య ప్రాసల మీద అక్కరకు మించిన మోజు చూపడం ఏమంత మెచ్చుకో లేం.

శ్రమ సౌందర్యం వంటి భావనలు గౌరునాయుడు వంటి కవికి రాతగ్గవి కావు.
నేల అణువణువునా పరుచు కుంది నీ నవ్వే అనడం సుదీర్ఘ రైతాంగ పోరాటాల నేపథ్యాన్ని కాస్సేపు విస్మరించడమే. అతని అడుగు ఆకు పచ్చని మడుగు కావచ్చు కానీ, అతని నీడ (ప్రాస కోసం) మాకు చల్లని గొడుగు అనడం మింగుడు పడదు. పెత్తందారీ పోకడలకు ఊతమిచ్చే మోసపూరిత భావమేదో ద్యోతకమౌతున్నది.

ఏమయినా, ఈ కవితలో రైతన్నను చెమట పూల చెట్టుగా చూడడం నన్ను అమితంగా ఆకర్షించింది. అందుకే దీనిని మీకు పరిచయం చేస్తున్నాను.

ఔత్సాహిక నాటక రంగానికి చెందిన కథా వస్తువుతో సాయి బ్రహ్మానందం, గొర్తి రాసిన ‘ నేను అహల్యను కాను’ అనే మంచి కథ కూడా ఈ సంచికలో చదవొచ్చును.

పాల పిట్ట ( మాస పత్రిక)

విడి ప్రతి: 30/- లు.

16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సి, సలీం నగర్, మలక్ పేట,
హైదరాబాద్ 500 036
ఫోన్: 9848787294
మెయిల్ : palapittabooks@gmail.com

15, ఆగస్టు 2010, ఆదివారం

అమ్మా, నీకు వందనం


స్వాతంత్ర్యం వచ్చినా
సమ భావం కలగ లేదు
ఇంటి లోని గొడవలు
ఇంకా చల్లార లేదు

మధు మాసం వచ్చినా
మల్లెలు వికసించ లేదు
భానూదయ మయెను కాని
మనుషులు మేల్కొన లేదు

కత్తి వైరము కాల్చండని
నుడివిన కవి దేశము
కత్తులపై నడయాడుట
నమ్మ లేని సత్యము

ప్రతి మనిషీ ప్రక్క వాని
పచ్చ దనం ఓర్చ లేడు
ఏ గుండె ఎదుటి వాని
దరహాసము శ్లాఘించదు

పదవి మీద వ్యామోహం
ప్రతి వాడూ వీడ లేడు
నాయకమ్మన్యులు అంతా
చేయబోరు సమన్యాయం !

అయినా మన పవిత్ర దేశం
ఎన్ని ఆటు పోటులనో తిన్నది.
అంతు లేని అవరోధాలను
శాంతంగా అధిగమించినది

కమ్ముకున్న ఈ చీకటి
కడ వరకూ ఉండ బోదు
చిమ్మిన ఈ ద్వేషానలం
వమ్మయి పోవక తీరదు

అద్యతన భావి లోన
అగ్ర గామిగా మన దేశం
విరాజిల్ల బోతున్నది.
అగ్ర రాజ్యాలు సైతం
విస్తు పోయే రోజున్నది !

అందుకే, అందాం
అందరమూ గళమెత్తి
భరత మాతా నీకు జయము !!
వందేమాతరమ్!!!


విజయ నగరం నుండి శ్రీ భాట్టం శ్రీరామ మూర్తిగారు బహుజన అనే ఓ వార పత్రిక నడిపేవారు. అందులో 1970 ఆగష్టు 15 వ తేదీ సంచికలో అప్పట్లో భాషా ప్రవీణ విద్యార్ధిగా ప్రాచ్య కళాశాలలో చదువుకొంటున్న నేను రాసిన కవిత యిది.


అసంఖ్య బ్లాగులో పెట్టిన ఈ క్రింది టపా (ఇక్కడ నొక్కండి) నన్ను అమితంగా ఆకర్షించింది. అందుకే, వారికి నా ధన్యవాదాలతో ...








19, జనవరి 2010, మంగళవారం

మానవ తప్పిదాలతో మరణ శాసనాలు ...


అమ్మా, ఇక్కడంతా చీకటిగా ఉందమ్మా,
భయమేస్తోందమ్మా .
మాతృగర్భంలో చీకటి గుయ్యారంలో ఉన్నా,
ఎప్పుడూ యింత భయం వేయ లేదే అమ్మా.
అప్పుడెంత వెచ్చగా, నిబ్బరంగా ఉండేదని !
ఇప్పుడేంటమ్మా,
చీకటి భయ పెడుతోందమ్మా.
ఆకలేస్తోందే అమ్మా,
ఊపిరాడడం లేదే అమ్మా !

భయం వేస్తోందే, అమ్మా !
గుండెలు అవిసి పోతున్నాయే అమ్మా !

మానవ తప్పిదానికీ, నిర్లక్ష్యానికీ, మూర్ఖత్వానికీ, సిగ్గు లేని తనానికీ
నిదర్శనంగా
అనాచ్ఛాదిత మృత్యు గహ్వరంలో
ఒక్కడినీ పడి ఉన్నానే అమ్మా.

ఆడుకుందామని వొచ్చేను
నాకేం తెలుసు !

మీ మతి లేనితనం
నా కోసం నిలువెల్లా నోరు చేసుకుని ఉందని !
నన్ను కబళించ బోతోందని.

భయం వేస్తోందమ్మా,
దేవుడి పిలుపయిందని కాదు -
మీ తెలివి తక్కువ తనంతో
మీ పతనానికి మీరే
ఇంత కన్నా ఎంత లేసి అగాధాలు
తవ్వుకుంటారో అని .

భయం వేస్తోందే, అమ్మా !
ఊపిరాడడం లేదే అమ్మా ...అమ్మా ...అమ్ ..మా ...అమ్ ..మా ...

-- -- -- --- --- ---

బోరు బావిలో కన్ను మూసిన చిన్నారి మహేశ్ తలుచుకుని ....

6, జనవరి 2010, బుధవారం

జీవిత సూత్రాలు

జీవిత సూత్రాలు

దు:ఖం
ఇది అధికార సూత్రం
అంతటా అనువర్తి వస్తుంది
అరుభవించు నరుడా !

ఆదర్శాల సూత్రాలు
అన్ని సమస్యలనూ పరిష్కరించ లేవు
సమత గ్రహణాన్ని
స్వార్ధం సర్వత్రా బాధిస్తోంది.

చూదామన్న బహుళ గ్రహణం చేత
నాయకుల వాగ్దానాల సూత్రంలో
కార్యాచరణ మాత్రం
నిఫేధంగా ప్రవర్తిస్తోంది.

సామాన్య సంసారి జీవితం
లాటరీలో ఏ లడాగమమో వస్తేకానీ
బాగు పడేలా లేదు.

కష్టాలు ఎప్పుడూ ఆగమంగానే వస్తాయి.
దరిద్రానికి రోగాలు
ఆమ్రేడితం
ఆకలి వేసేటప్పుడు
పస్తులతో సంధి నిత్యం!

జీతం అందిన మరునాడే
జేబులు స్వత్వ రూపం ధరిస్తాయి.
పైసలకి లోపం, నెత్తి మీద చుట్టాల సంశ్లేషం
ఒక్క సూత్రంలోనే విధించ బడ్డాయి.

ద్రుతం లాంటి విశ్వాసం
అందరి మీదా ఉండీ లేనట్టుంటుంది.

కార్యం తనదైతే మాత్రం - తప్పకుండా
మాయమై పోతుంది.

నా యిష్టం. ఇది నా కష్టం ! అనేవి
గ్రామ్య ప్రయోగాలు
అది
నీ లక్షణ విరుద్ధ మైన భాష !
తెలుసుకో
సామాన్య మానవుడా !
^ ^ ^

ఈ గేయంలో వాడిన సాంకేతిక పదాలు ... తెలుగు వ్యాకరణానికి చెందినవి. వ్యాకరణ పారిభాషికా పదాలతో పరిచయం ఉన్న వారందరికీ గేయం సుళువుగానే అర్ధం కాగలదు.

18, నవంబర్ 2009, బుధవారం

నగరం

నగరం
వేగమయ జీవితం
ఏక్సిలేటరు లో వినిపిస్తుంది.
ఏక్సిడెంటు లోకనిపిస్తుంది.

15, నవంబర్ 2009, ఆదివారం

బడికి సెలవు

బడికి సెలవు
అక్షరాల గుడికి సెలవు
బెత్తాల ఏలుబడికి సెలవు
పంతుళ్ళ పెత్తనాలకి సెలవు.

పూల బస్తాల రవాణా చేస్తునట్టు -
ఆటోలు, రిక్షాలూ -
వాటికి సెలవు.

టిఫిన్ బాక్సులకు సెలవు
వాటరు బాటిళ్లకు సెలవు

పుస్తకాల సంచీలకి
యూనిఫారాలకీ సెలవు

బడికి సెలవు
మోయలేని పెను భారాలకు సెలవు

సెలవుల్లో మూతబడిన బడి ఎలా ఉంటుందో?
పిట్టలెగిరి పోయినట్టి
వట్టి చెట్టులాగానో !
గల గలమని జల జలమని
పారే నీరింకిన ఏటి చాలు లాగానో!!

సందడి తగ్గిన పెళ్లి పందిరి
చందంగా ఉంటుందా? బడి!
ఎలా ఉంటుందో,మా బడి -సెలవుల్లో!!

బడిలో మొక్కల చుట్టూ ఎగిరే
మా రంగు రంగుల నేస్తాలు
అందమైన సీతాకోక చిలుకలు!!

ఎంత బెంగ పడ్డాయో! ఎచటి కెగిరిపోయాయో!
ఎక్కడికో ఎగిరిపోయి, ఇక్కడికే వస్తాయా?

ఆట స్థలం మా కోసం
ఆత్రంగా చూస్తుందో, అయ్యో , అనుకుంటుందో?

బడి గంటలు సడి చెయ్యక
మూగబోయి ఉన్నాయో, మా
ఆగమనం కోసం మూగ నోము పట్టాయో
ఎలా ఉంటుందో మా బడి సెలవుల్లో!!

సెలవుల పిమ్మట తెరిచిన
బడి ఎలా ఉంటుందా?

కొత్త నీరు చేరినట్టి
కొలను లాగా ఉంటుంది!

గుత్తులుగా పూసినట్టి
కొమ్మలాగా ఉంటుంది !

ఎగిరే రాయంచ లాగా
ఎంతో బాగుంటుంది !

విరిసే హరివిల్లు లాగ
వింత వింతగా ఉంటుంది
కురిసే చిరు జల్లులాగా
మురిపెంగా ఉంటుంది !!


ఆకాశవాణి.. విశాఖపట్నం కేంద్రం నుండి తే .. 7-6-2004 న ప్రసారం