చెమట పూల చెట్టు
ఒక్కో విత్తనం ఒక్కో అక్షరంగా శుభ్ర పరచి
చాలు చాలునా మొలకల కవితలల్లి
మట్టిని మహా కావ్యంగా మలిచిన కవివి నువ్వు
చినుకులూ సూర్య కిరణాలూ పడుగు పేకలుగా
నేలమ్మకు చేల చీరలు నేసే నేతగాడివి నువ్వు
నాలుగు గట్లు నగిషీల ఫ్రేములుగా
దుక్కి బెడ్డలే రంగు ముద్దలుగా స్వేదజలంతో కలిపి
మడి చెక్క కేన్వాసు మీద
ఆకు పచ్చ చిత్రాలను అలవోకగా గీసే
చేయి తిరిగినచిత్రకారుడివి నువ్వు
నిత్యమూ నిరంతరమూ
సమస్త ప్రజలకూ నిశ్శబ్ద హరిత సందేశాన్నందించే
మహామహోనాధ్యాయుడు నీ కంటే
యింకెవరుంటారు?
ఆరు రుతువులు చెక్కిన అపురూప శిల్పమా !
మా అరుదైన నేస్తమా !
కళ్ళు మిరుమిట్లు గొలిపే నీ శ్రమ సౌందర్యం ముందు
నీడ పట్టున నునుపెక్కిన మా సోమరి దేహధావళ్యం
తెల్లబోయి తల వొంచుకుంటుంది.
చెమట పూల చెట్టువు నువ్వు
ప్రగతికి తొలి మెట్టువి నువ్వు
నేల అణువణువునా పరుచుకుంది నీ నవ్వే
భూగోళం నీ దోసిట విరిసిన పువ్వే.
పంట నీ భాష
స్వేచ్ఛ నీ శ్వాస
నీ అడుగు ఆకుపచ్చని మడుగు
నీ నీడ మాకు చల్లని గొడుగు
(రైతు మిత్రుడు నడిసొంటి వెంకట్నాయుడికి ఆత్మీయంగా )
గంటేడ గౌరునాయుడు.
పాల పిట్ట ( మాస పత్రిక) జనవరి 2011 సంచికలో ప్రచురితమైన ఈ కవిత నన్నుకొన్ని మినహాయింపులతో
ఆకర్షించింది.
ఆరుగాలం పొలంలో శ్రమించే రైతుని చెమట పూల చెట్టుగా అభివర్ణించడం పులకింప చేసింది.
గౌరునాయుడు మంచి భావుకత ఉన్న కవి. పల్లెల పునాదుల మీద మొలిచిన కవి. చెట్టు పాట, ఏటి పాట ఎరిగిన వాడు. ఉత్తరాంధ్ర భాష పుట్టక తోనే వంట బట్టిన వాడు. అక్కడి పల్లెల నిసర్గ సౌందర్యంతో పాటు, అనంత విషాదాలను, సమస్యల మూలాలను అనుభవించి పలవరించే కవి.
రైతు మిత్రుడిని చెమట పూల చెట్టుగానే కాక, మట్టిని మహా కావ్యంగా మలచిన కవిగానూ, నేలమ్మకు చేల చీరలు నేసే నేతగానిగానూ, మడి చెక్క మీద ఆకు పచ్చని చిత్రాలను గీసే అపురూప చిత్రకారుని గానూ, నిశ్శబ్ద హరిత సందేశాన్ని జాతి జనులకు చేర వేసే మహామహోపాధ్యాయునిగానూ, పేర్కొంటూ, ఆరు రుతువులు చెక్కిన అరుదైన నేస్తంగా .
అక్కున చేర్చుకుంటున్నాడు. అతని భాష పంట భాష అంటూ పాత విషయాన్ని కొత్తగా నిర్వచిస్తున్నాడు.
ఐతే, డిక్షన్ మోతాదు మించి, ‘నదిని దానం చేసాక ...’ వంటి గొప్ప కవిత్వం రాసిన గౌరునాయుడు కలం నుండి వచ్చిన కవితేనా యిది అనిపించింది.
అంత్య ప్రాసల మీద అక్కరకు మించిన మోజు చూపడం ఏమంత మెచ్చుకో లేం.
శ్రమ సౌందర్యం వంటి భావనలు గౌరునాయుడు వంటి కవికి రాతగ్గవి కావు.
నేల అణువణువునా పరుచు కుంది నీ నవ్వే అనడం సుదీర్ఘ రైతాంగ పోరాటాల నేపథ్యాన్ని కాస్సేపు విస్మరించడమే. అతని అడుగు ఆకు పచ్చని మడుగు కావచ్చు కానీ, అతని నీడ (ప్రాస కోసం) మాకు చల్లని గొడుగు అనడం మింగుడు పడదు. పెత్తందారీ పోకడలకు ఊతమిచ్చే మోసపూరిత భావమేదో ద్యోతకమౌతున్నది.
ఏమయినా, ఈ కవితలో రైతన్నను చెమట పూల చెట్టుగా చూడడం నన్ను అమితంగా ఆకర్షించింది. అందుకే దీనిని మీకు పరిచయం చేస్తున్నాను.
ఔత్సాహిక నాటక రంగానికి చెందిన కథా వస్తువుతో సాయి బ్రహ్మానందం, గొర్తి రాసిన ‘ నేను అహల్యను కాను’ అనే మంచి కథ కూడా ఈ సంచికలో చదవొచ్చును.
పాల పిట్ట ( మాస పత్రిక)
విడి ప్రతి: 30/- లు.
16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సి, సలీం నగర్, మలక్ పేట,
హైదరాబాద్ 500 036
ఫోన్: 9848787294
మెయిల్ : palapittabooks@gmail.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి