లోకంలో ప్రతి దానికీ కార్యకారణ సంబంధం ఉంటుంది. ఒకటి జరిగిందంటే దానికి తగిన కారణం ఏదో ఉండే ఉంటుంది.ఒక శ్లోకంలో భర్తృహరి ఈ విషయమై ఏం చెబుతున్నాడో చూడండి:
దౌర్మంత్ర్యా న్నృపతి ర్వినశ్యతి, యతి స్సంగాత్, సుతో లాలనాత్
విప్రో2నధ్యయనాత్, కులం కుతనయా, చ్ఛీలం ఖలోపాసనాత్
హ్రీ ర్మద్యా, దనవేక్షణాదపి కృషి: ప్రవాసాశ్రయాత్
మైత్రీ చా2ప్రణయాత, సమృద్ధి రనయాత్ , త్యాగాత్ ప్రమాదా ద్ధనమ్
దుర్మార్గడైన మంత్రి వలన రాజు నాశనమై పోతాడు.
స్నేహాల వలన యతి (సన్యాసి) చెడి పోతాడు. అంతే కదా, సర్వసంగ పరిత్యాగికి ఇతర సాంగత్యాలు తగవు కదా?
గారం చేయడం వలన పుత్రుడు చెడతాడు. అతిగారాబం అనర్ధ హేతువు.
వేదాధ్యయనం చేయక పోవడం వలన బ్రాహ్మణుడు సంకనాకి పోతాడు. వాడికి విహితమైన వేదాభ్యసనం చేయకుండా, నిగమశర్మకి తమ్ముడిలా అడ్డమైన తిరుగుళ్ళూ తిరిగితే ఏం బాగుపడతాడు లెండి ?
కుపుత్రుని వలన కులం నశిస్తుంది. కులానికో చెడ్డ కొడుకు పుడితే ఇహ చాలు, జనాలు ఆ కులాన్నంతా తిట్టిన తిట్టు తిట్ట కుండా తిడతారు. ఒక విభీషణుడున్నా, రావణ కులానికి దూషణలు తప్ప లేదు కదా.
దుష్టులతో చెలిమి వలన శీలం నశిస్తుంది. అందుకే పెద్దలు నీ స్నేహితులని చూసి, నువ్వు ఎలాంటి వాడివో చెప్పొచ్చని అంటారు.
మద్యపానం చేత లజ్జ నశిస్తుంది. తాగుబోతుకి ఎగ్గూ సిగ్గూ ఎక్కడుంటాయి చెప్పండి ?
తరచుగా వెళ్ళి చూడని వ్యవసాయం తగలబడుతుంది. కాలు మీద కాలు వేసుకుని దర్జాలు ఒలక బోస్తే వ్యవసాయం పనులు కావు. కార్తె పోతే రాదు. అందుకే అదనెరిగి వ్యవసాయం పనులు చేయాలి.
దేశాంతరగమనం వలన స్నేహం చెడి పోతుంది. అంతే కదా, ఎప్పుడూ దేశాలమ్మట పట్టుకు తిరుగుతూ ఉంటే మిత్రులే కరువవుతారు.తరుచుగా పలకరింపులు ఉంటేనే కదా, స్నేహాలు నిలుస్తాయి?
కూరిమి చెడి పోతే మైత్రీభావం నశిస్తుంది. కూరిమి గల దినములలో నేరము లెన్నడును తోచవు. ఆ కూరిమి విరసమైతే ఎదుటి వాడిలో అన్నీ తప్పులే కనబడుతూ ఉంటాయని శతక కర్త చెప్ప లేదూ?
అవినీతిచే సంపదలు నశిస్తాయిట. ఇది కొంత విచార మూలకం.అడ్డూ ఆపూ లేని సంపదలు పోగు పడేది అవినీతి పనులు అధికంగా చేయడం వల్లనే కదా? కవి మరి యిలా అంటాడేం? అంటే అవినీతితో చేకూరిన సంపదలు ఒకనాటికి నశించక తప్పదని కాబోలు. ఎంతటి ధనాధికులూ పట్టువడి శ్రీకృష్ణ జన్మ స్థానం చేరు కోవడం ఇటీవలి కాలంలో చూడడం లేదూ?
దానం, ప్రమాదం - వీటి వలన ధనం నశిస్తంది. ప్రమాదం సరే, దానం చేయడం వలన సంపదలు నశిస్తాయిట. కన్నూ మిన్నూ కానక అపాత్రదానాలు చేస్తూ పోతూ ఉంటే చేతికి చిప్ప కాక మరేం మిగులుతుంది ?
కనుక, ఆయా సంబంధాలనీ, విషయాలనీ విడిచి పెడితే మంచిది. లేక పోతే నశించడం ఖాయం అని కవి హెచ్చరిస్తున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి