కథ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కథ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జులై 2012, మంగళవారం

గురు పూర్ణిమ సందర్భంగా నా గురు దక్షిణ కథ ... ఆడియో కూడా ...



గురు పూర్ణిమ సందర్భంగా నా గురు దక్షిణ కథ చదవండి. ఈ కథ ఆంధ్రభూమి మాసపత్రిక 1980 లో ప్రచురణ.




ఈ కథ ఆడియో  ఇక్కడ వినండి ....



25, జూన్ 2012, సోమవారం

ఇబ్బంది కాదూ ?!



మనుసులను అంచనా వేయడంలో పొరబడటం వల్ల మనం ఒక్కోసారి మంచి వారినీ , సహృదయులనూ దూరం చేసుకుంటూ ఉంటాం. ఆ కథాంశంతో వ్రాసిన ఈ కథ ఈనాడు ఆదివారం పత్రికలో ప్రచురణ.

కథ ఆడియో ఇక్కడ  వినండి :




ఇక్కడ కథ చదవండి ....


23, జూన్ 2012, శనివారం

ఎక్కడున్నావు, గొంగళీ ... ?

ఇటీవల శరత్ ‘కాలమ్’ లో అవినీతిని చట్ట బద్ధం చెయ్యాలి అంటూ ఒక మంచి టపా పెట్టారు.  ఇక్కడ  నొక్కి ఆ టపా చూడ వచ్చును. అది సంగతమూ, జరిగే పనీ కాక పోయినా ఆ విధంగా రచయితలు తమ ఆవేదన వెళ్ళగ్రక్కుతూ ఉండడం పరిపాటి. అదొక విషాద వినోదం.

శరత్ గారు అవినీతిని చట్టబద్ధం చెయ్యమని భావిస్తే, నేను మన ఎన్నికల విధానం పూర్తిగా రద్ధు చేసి నాయకుల ఎన్నిక  టెండరు విధానంలో జరిగితే బావుండునని  తే 3 - 2  -1991  దీ ఈనాడు ఆదివారం వారపత్రిక  లో ఎక్కడున్నావు గొంగళీ ?! అని  ఒక కథ ప్రచురించాను.  ఆ కథ మీరు  ఈ టపాలో చదువ వచ్చును.

దిగజారుడు వ్వవస్థ మీద జనాల ఉక్రోషమే ఏదో ఒకనాడు తిరుగుబాటుగా పరిణమించడం చారిత్రక సత్యమే కదా !

ఇక, కథ చదవండి ...

శరత్ ‘ కాలమ్ ’

Open publication - Free publishing - More jogh

24, మార్చి 2012, శనివారం

కథా పార్వతీపురం


మా పార్వతీపురం కథా రచయితల కథల సంకలనం కథా పార్వతీపురం వెలువడింది !
ఈ పుస్తకం గురించి కాళీ పట్నం ఇలా అంటున్నారు ...

‘‘ఉత్తరాంధ్రకు ఉత్తర భూములు సారవంతమయినవి.
గిరులూ, తరులతో సంపన్నమయినవి.
అచ్చట పుట్టిన చిగురు కొమ్మయిన చేవ అన్నట్టుగా యోథులే కాదు, కలం యోథులు కూడా సామాన్యులు కారు.
కాలక్షేపం కోసం కాకుండా జీవితాన్ని చిత్రించిప్రశ్నించి ఆలోచనలు రేపే ఈ కథలు కేవలం పార్వతీపురం ప్రాంత కథలు మాత్రమే కావు. ఎల్ల ప్రాంతాల వారిని ఆలోచింప చేసే కథలు.
గత నూరేళ్ళలో తొలినాటి ఆచంట సాంక్యాయన శర్మ గారి నుండి, నిన్న మొన్నటి కలంపట్టిన చి. బెలగం గాయత్రి దాకా కథకుల కథలు ఇందులో పొందు పరిచేరు.
ఈ పొందిక నేటి సామాజిక అవసరమని భావిస్తూ అభినందిస్తున్నాను. ’’

‘‘ పార్వతీపురానికి సాహిత్య లోకంలోఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడీ కథా పార్వతీపురం ఉన్న ప్రత్యేకతలకు, మరో కొత్త చేర్పు అవుతుదంని మా విశ్వాసం !’’ అంటున్నారు, దీని ప్రచురణ కర్త శ్రీ గుడిపాటి.

‘‘ కథకు కొత్తందాలు తీరిచి
దిద్ది ముత్యాల్ సరులు కూరిచి
తెలుగు జాతికి వెలుగు బాటలు
వేసినావు మహా కవీ...’’

అంటూ, రెండు యాభైల తెలుగు కథకు వందనం. మూడు యాభైల గురజాడకు ఈ ‘‘కథా పార్వతీపురం’’ అంకితం చేసారు సంకలన కర్తలు అట్టాడ అప్పలనపాయుడు, గంటేడ గౌరునాయుడు గారలు.

కథా పార్వతీపురం ఆవిష్కరణ సభ పుస్తకాన్ని మా పార్వతీపురం వీథుల్లో మేళతాళాలతో ఊరేగిస్తూ మొదలై 10.3.2012 వ తేదీన ఘనంగా జరిగింది.

52 మంది మా ఊరి రచయితల కథలున్న ఈ కథా సంకలనంలో కీ.శే. ఆచంట సాంఖ్యాయన శర్మ ( తొలి తెలుగు కథా రచయితలలో ఒకరు), ఎస్.వి.జోగారావు, పంతుల విశ్వనాథరావు, రాళ్ళపల్లి గౌరీపతి శాస్త్రి,, భూషణం, వి.వి.బి.రామారావు, దాసరి రామ చంద్రరావు, వంగపండు ప్రసాదరావు, పంతుల జోగారావు, జయంతి వెంకట రమణ, చింతా అప్పలనాయుడు, ఓలేటి శ్రీనివాసభాను, పి.వి.బి.శ్రీరామ మూర్తి, బి.వి.ఎ.రామారావు నాయుడు, వాడ్రేవు చిన వీర భద్రుడు, వేదప్రభాస్, డా.బి.యస్.ఎన్. మూర్తి, మల్లిపురం జగదీశ్, సువర్ణముఖి, గొల్లపూడి మారుతీరావు, అరుణ పప్పు, ఎ.ఎన్. జగన్నాథ శర్మ, గణేశ్ పాత్రో, అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు మొదలయిన పార్వతీపురం రచయితల కథలు ఉన్నాయి.

సార్వతీపురంలో ఫుట్టిన వారివే కాకుండా, ఆ ఊర్లో కొన్నాళ్ళు నివసించిన వారి కథలు కూడా ఇందులో చోటు చేసు కోవడంతో ఈ సంకలనానికి ఒక సమగ్రత సిద్ధించింది.

స్నేహ కళా సమితి, పార్వతీపురం, కురుపాం వారు ప్రచురించిన ఈ కథా పార్వతీపురం కోసం ఈ క్రింది ఫోను నంబర్లలో సంప్రదించ వచ్చును.

9441415182

9848787284

లేదా, మెయల్ చిరునామాలలో సంప్రదించ వచ్చును.

langulya@gmail.com

palapittabooks@gmail.com
పుస్తకం వెల : రూ. 250 మాత్రమే.


23, మార్చి 2012, శుక్రవారం

30 కథల శ్రవణ సంపుటి ... పంతుల జోగారావు కథలు





కథా మంజరి బ్లాగు మిత్రు లందరకీ శ్రీనందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !

S.R. Communications, Hyderabad వారు ఇటీవల నా కథల ఆడియో కేసెట్ విడుదల చేసారు. తారంగం తారంగం , బుజ్జి మేక వంటి చక్కని పిల్లల ఆడియో వీడియోఏనిమేషన్ కేసెట్ లు విడుదల చేసిన వీరు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు గారి సౌందర్య లహరి మీద ప్రవచనాలు , బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శా స్త్రి గారి భారత, భాగవత, రామాయణ ప్రవచనాలు, శారదా శ్రీనివాసన్ గారి రేడియో అనుభవాలు, పెండ్లి పాటల సంప్రదాయ కీర్తనలు మొదలయిన చాలా ఆడియో కేసెట్ లు వెలువరించారు. నిర్వాహకులు శ్రీ మారేమండ సీతారామయ్య గారికి పత్రికా సంపాదకునిగా విశేషమయిన అనుభవం ఉండడం చేత, రచయితగా అనేక కథలూ, నవలలూ రాసిన వారు కావడం చేత తెలుగు కథ మీద మమకారం కొద్దీ ఇటీవల ఆయా రచయితల కథలను వారి సొంత గొంతుకలతో చదివించి, రికార్డు చేసి, శ్రవణ కథా సంపుటాలుగా వెలువరించే మంచి ప్రయత్నం తలపెట్టారు.

ఆ పరంపరలో భాగంగానే ఇంత వరకూ శ్రీయుతులు వీరాజీ. విహారి, అంగర వెంకట కృష్ణారావు, సలీం, కె.బి. లక్ష్మి, మొదలయిన రచయితల శ్రవణ కథా సంపుటాలు కొన్ని వెలువరించారు. ఒక వంద మంది రచయితల శ్రవణ కథా సంపుటాలు వెలువరించాలని వారి బృహత్తర ప్రయత్నం. త్వరలో ఆదూరి వెంకట సీతారామ మూర్తి గారి శ్రవణ కథా సంపుటి వెలుగు చూడ బోతున్నది.

ఇందులో భాగంగానే ఇటీవల నా కథలు ఓ 30 పంతుల జోగారావు కథలు

30 కథల శ్రవణ కథల సంపుటి పేర సీతారామయ్య గారి ముందు మాటలతో వెలువడింది. ఈ ఆడియో కేసెట్ వెల 75 రూపాయలు. ఆ ఆడియో కేసెట్ లో నా శ్రీమతి విజయ లక్ష్మి ముచ్చటగా వ్రాసిన మూడు కథలనూ ఆమె సొంత గొంతుక లోనే వినిపించారు.

కేసెట్ కోసం, ఇతర వివరాల కోసం కింది చిరునామాలో సంప్రదించ వచ్చును.

S.R.Communications

242 TRT Colony, Vidya Nagar, Hyderabad – 44

Ph. 040-65153327

E-mail : srmaiah@yahoo.com

12, జనవరి 2012, గురువారం

కథా రచయితలకు పెద్ద పండుగ

పండుగలలో పెద్ద పండుగంటే సంక్రాంతే. మూడు రోజుల పండుగ. ఎక్కడెక్కడి బంధువులూ చేరు కుంటారు. సందడే సందడి.
మా విజీనారం వాళ్ళ కయితే ఈ పెద్ద పండుగ కొంచెం సాగి, సరిగ్గా జనవరి పది హేడవ తేదీ నాడు ఖచ్చితంగా మరో పెద్ద వేడుకతో ముగుస్తుంది. అది, చా.సో స్ఫూర్తి అవార్డుల ప్రదానోత్సవం. ఎక్క డెక్కడి సాహితీ ప్రియులూ బిల బిలా విజీనారం చేరు కుంటారు. అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ఈ సాహితీ క్రతువు కథా రచయితలకు ఎంతో ఇష్ట మయిన వేడుక.
పండక్కి ముందే సున్నాలూగట్రా వేసి, తోరణాలూ గట్రా కట్టి ఇంటిని ముస్తాబు చేసి నట్టుగా , 17.1.2012 న జరుగ బోయే ఈ కథల పండుగకు ముందే, చాగంటి కృష్ణ కుమారి గారు ‘‘ వండనన్నావ్ ? ఎందుకొండేవ్?’’ కథను 18.1.2012 తేదీ నవ్య వార పత్రికలో ప్రచురించారు .

అచట పుట్టిన చిగురు కొమ్మ కథ యిది
.
తన కథా వారసురాలి వైపు చూపుడు వేలు పెట్టి చూపిస్తూ, ‘‘ నీకంటే’’ అంటూ ఆ వేలుని తన వేపుకి తిప్పి, ‘‘ ఇది బాగా రాయ గలదు’’ అని గడుసుగా మెచ్చుకున్న చా.సో గారిని మెప్పించాలంటే మన తరఁవా, యేఁవిటి !

చా.సో గారికి ఒక కథ ఫైనల్ వెర్షన్ వచ్చే వరకూ కనీసం నాలుగయిదు చిత్తు ప్రతులు రాసి చింపెయ్యడం అలవాటుగా ఉండేది. వారలా చెయ్యకుండా ఉంటే, ఒకే రచయిత ఒకే వస్తువుతో రాసి వదిలేసిన వాటికీ, ఫైనల్ వెర్షన్ కథకీ తారతమ్యాలు బేరీజు వేసుకొని మంచి కథలెలా రాయాలో బుర్రలు బద్దలు కొట్టుకునే కొత్త రచయితలకు మార్గదర్శకంగా ఉండేదేమా అనే ఆలోచనకు ఈ రచయిత్రి తెరతీసారు.

కథ చదవండి మరి ...

చిన్న సాంకేతిక సహాయం : ఒక వేళ కథ పేజీలలోని అక్షరాలు చదవడానికి చిన్నవిగా అని పిస్తే, ఆ పుట మీద మౌస్ ఉంచి నొక్కండి. ఇప్పుడు ఓపెన్ లింక్ ఇన్ న్యూ విండో (Open Link in new windo) అనేది సెలెక్ట్ చేసుకొని చూడండి. పేజీని జూమ్ చేసే అవకాశం వస్తుంది. బోధ పడిందా !

అప్పటికీ మన పప్పులుడకక పోతే సుబ్భరంగా నవ్య కొనుక్కొని చదివెయ్యడమే. అసలిదే ఉత్తమం. న్యాయం కూడానూ.





Posted by Picasa

6, జనవరి 2012, శుక్రవారం

ఈ ఏడాది జగన్నాథ శర్మకు చా.సో. స్ఫూర్తి అవార్డు ...


జగన్నాథ శర్మకి ఈ ఏడాది చా.సో స్ఫూర్తి అవార్డు లభించింది. తెలుగు కథకి తూర్పు దిక్కు శ్రీ చా.సో అవార్డు వీరికి లభించడం కథకి గర్వ కారణం.

శ్రీ జగన్నాథ శర్మ బుల్లి తెరకు (జెమిని, ఈ టి,వీ) కథా, మాటల రచయితగా చిర పరిచితులు. కొన్ని సినిమాలకు కథా సహకారం అందించారు, ప్రసిద్ధ పత్రికలకు సహ సంపాదకత్వ బాధ్యత వహించి, ప్రస్తుతం నవ్య వార పత్రికకు సంపాదకులుగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్ర జ్యోతి వారి నవ్య వార పత్రికను పాఠకుల పత్రికగానూ, రచయితల పత్రికగానూ కూడా సమర్ధ వంతంగా తీర్చి దిద్దడంలో వీరి కృషి అనన్య సామాన్య మైనది. నవ్యలో విశేష పాఠకుల ఆదరణ పొందిన పాలపిట్ట ప్రపంచ జానపద కథల ధారా వాహికం, కథా సరిత్సాగరం వీరి ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యాలు.
వీరి వచన మహా భారతం , జగన్నాథ రథ చక్రాల్ (మొదటి పేజీ సంపాదకీయ రచనలు) పాఠకులను విశేషంగా ఆకట్టు కొంటూ సాగుతున్నాయి.


అసంఖ్యాకంగా కథల పోటీలు పెడుతూ, కథా నీరాజనం శీర్షికను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తూ తెలుగు కథకు జయ కేతన మెత్తు తున్నారు. తెలుగు నాట ఎక్కడ కథా గోష్ఠులు నిర్వహించినా, వాటి వివరాలు ఫొటోలతో పాటు చక్కని వార్తా కథనాలు నవ్యలో ప్రచురిస్తున్నారు.

ఈ ఏడాది చా.సో స్ఫూర్తి అవార్డు ఎ.ఎన్ జగన్నాథ శర్మకు ఇస్తున్నట్టుగా చా.సో గారి కుమార్తె ప్రముఖ రచయిత్రి, చా.సో స్ఫూర్తి పురస్కార ట్రస్టు వ్యవస్థాపకురాలు చాగంటి తులసి ఈ క్రింది ప్రకటన చేసారు :

ప్రముఖ కథారచయిత చాగంటి సోమయాజులు (చాసో) 18వ స్ఫూర్తి పురస్కారం 2012, జనవరి నెల 17వ తేదీన విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన ప్రముఖ కథా రచయిత అయ్యల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథశర్మకు వచ్చింది. . పేగు కాలిన వాసన కథలు, అగ్రహారం కథలు, మావూరి కథలు రచయితగా, అనువాదకుడిగా జగన్నాథశర్మ కథాభిమానులకు చిర పరిచితులు. ఆయన కథల్లో వాస్తవికత, మానవీయతల మేలుకలయిక కనిపిస్తుంది., వ్యవస్థలోని అవకతవకలకు అద్దం పట్టి , సామాన్య మానవుల పట్ల అపారమైన ప్రేమ ఉన్న రచయిత వీరు.. కథ అల్లి చెప్పే కౌశలంతో ఎదిగి ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నందున చాసో స్ఫూర్తి పురస్కారానికి జగన్నాథ శర్మను ఈ అవార్డు వరించింది. జనవరి 17న చాసో 97వ పుట్టినరోజు , ఆరోజు సాయంత్రం విజయ నగరం మహారాజ లేడీస్ రిక్రియేషన్ క్లబ్‌లో ఐఎఎస్ అధికారి కె.వి.రమణాచారి అధ్యక్షతన సాయంత్రం 6 గంటలకు జరిగే సభలో శ్రీ జగన్నాథ శర్మకి రూ. 10,000 ల నగదు పురస్కారంతో పాటు, ప్రశంసా పత్రం అంద.జేయడం జరుగుతుంది.

కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి ...



ఇంత వరకూ చా.సో అవార్డు అందుకొన్న రచయితలు :


ఇంత వరకూ పుస్తక రూపంలో వెలువడిన జగన్నాథ శర్మ రచనలు ...











1, జనవరి 2012, ఆదివారం

కొత్త జీవితానికో కొండ గుర్తు !




అందరికీ నూతన సంవత్సర ( 2012 ) శుభాకాంక్షలు ... ... మీ కథా మంజరి.

ప్రతి కొత్త సంవత్సరం ప్రారంభపు దినాన ( ఆమాట కొస్తే, ప్రతి ప్రత్యేక మైన దినాన కూడా ) మనలో చాలా మందిమి ఏవేవో కొ్త్త నిర్ణయాలు మన జీవితంగురించి తీసుకుంటూ ఉంటాము. ( వాటిని అమలు పరచ గలగడం, లేక పోవడం మన సంకల్ప బలం మీద ఆధార పడి ఉంటుంది. అలాగని కొత్త నిర్ణయాలను సంకల్పించు కోకుండా ఉండ లేం కదా! ఉండ కూడదు కూడా!

ఈ అంశం ప్రధాన ఇతి వృత్తంగా తీసికొని 11.4.1979 లో ఆంధ్ర ప్రభ సచిత్రవార పత్రికలో ప్రచురించబడిన నా కథ తిరిగి కథా మంజరి అభిమానుల కోసం ....


19, ఆగస్టు 2011, శుక్రవారం

అపురూపం. కథలసంపుటి




ఈ మధ్య కొత్త టపాలు ఏమీ రాయడం లేదు. పోనీ, నా కథల సంపుటి అపురూపం చూడండి.

పుస్తకం మీద మౌస్ పెట్టి నొక్కితే అక్షరాలు పెద్దవిగా కనబడతాయని చెప్ప నవసరం లేదు కదూ.

29, మే 2011, ఆదివారం

కామమ్మ కథ


చిన్ని పుస్తకం ... పెద్ద మనసు ...

నా పుస్తకాల గూటి లోకి, గువ్వ పిట్టలాగ ఒక చిన్న పుస్తకం వచ్చి చేరింది. పుస్తకం పేరు కామమ్మ కథ. వెల పన్నెండణాలు. రచయిత ఎవరో ఎక్కడా లేదు. చుక్కల సింగయ్య శెట్టి, యన్.వి.గోపాల్ అండ్ కో, మదరాసు వారి ప్రచురణ.

ముందుగా ఈ పుస్తకం నాకు దొరికిన వైనం చెబుతాను.

విజయ నగరం జిల్లా పార్వతీ పురం మా స్వగ్రామం. నేను పుట్టింది అక్కడే. హెచ్.స్. ఎల్.సీ వరకూ నా చదువు అక్కడే.

ఆ రోజులలో ఏ పుస్తకం కంట బడినా ఆత్రంగా చదివే వాడిని. ఇంటికి రెండు వార పత్రికలూ, ఒక మాస పత్రికా వచ్చేవి. ఊళ్ళో ఒక మనిసిపల్ లైబ్రరీ, మరో శాఖా గ్రంథాలయం ఉండేవి.

నా పుస్తక దాహార్తి అక్కడే తీరేది. ఇక మా చిన్న ఊళ్ళో రాధా గోవింద పాఢి గారని ఒక ఒరియా వ్యక్తి ఉండే వారు. తెలుగు మాట్లాడడం వచ్చు. కూడ బలుకుకుని చదివే వారేమో కూడా. రాయడం వచ్చేది కాదను కుంటాను. వారికి ఒక ఫొటో స్టూడియో ఉండేది. ఆ పనులతో తెగ బిజీగా ఉండే వారు. దానితో పాటు ఆయన ఆ రోజులలో వచ్చే అన్ని దిన, వార , పక్ష, మాస పత్రికలు అన్నింటికీ కూడా ఏజెంటుగా ఉండే వారు. మెయిన్ రోడ్డులో వారి ఫొటో స్టూడియో కమ్ పుస్తకాల షాపు నన్ను అమితంగా ఆకట్టు కునేది. ఎక్కవ గంటలు అక్కడే గడిపే వాడిని. వారు మా కుటుంబ మిత్రులు కూడానూ. పేపర్లూ, పీరియాడికల్స్ తో పాటు ఆయన ఎన్నెన్నో మంచి పుస్తకాలు కూడా అమ్మకానికి తెప్పించే వారు. జిల్లా వ్యాప్తంగా ఉండే పాఠశాలలకీ, ఆఫీసు లైబ్రరీలకీ వాటిని విక్రయించే వారు. మంచి పుస్తకాలు తెప్పించడం కోసం వారు ఒక పద్ధతి అవలంబించే వారు. పుస్తకాల ఏజెంటుగా వారికి ఎందరో రచయితలతోనూ, ప్రముఖ సంపాదకులతోనూ మంచి పరిచయాలు ఉండేవి. వారి షాపులోనే నేను చాలా మంది గొప్ప రచయితలను చూసేను. విద్వాన్ విశ్వం, రాంషా వంటి సంపాదకులనూ చూసేను. సోమ సుదర్ గారిని కూడా అక్కడే చూసినట్టు గుర్తు. పాఢి గారు ఆయా రచయితలనూ, సంపాదకులనూ కలిసినప్పుడు తెలుగులో ఏవి మంచి పుస్తకాలంటూ కేటలాగులు ఇచ్చి మరీ వారినుండి వివరాలు సేకరించే వారు. ఆ క్రమంలో నేను కూడా నాకు తోచిన గొప్ప పుస్తకాల గురించి చెప్పే వాడిని. ఈ విధంగా తనకు తెలుగు సాహిత్యంతో ఏ మాత్రం పరిచయం లేక పోయినా అమ్మకం కోసం ఎన్నో గొప్ప పుస్తకాలను తెప్పించే వారు. చెంఘిజ్ ఖాన్, అతడు ఆమె, నేరము శిక్ష , పెంకుటిల్లు, సమగ్రాంధ్ర సాహిత్యం సంపుటాలు, లత , రావి శాస్త్రి, ముళ్ళపూడి, బీనాదేవి, గోపీచంద్, తిలక్, శ్రీ.శ్రీ, మధురాంతకం రాజారాం, మొదలయిన గొప్ప గొప్ప రచయితల రచనలు తెప్పించే వారు. అనువాద సాహిత్యమయితే లెక్కే లేదు. శరత్ సాహిత్యమంతా ఉండేది.

ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే, వారి షాపుకి వచ్చే వార, మాస పక్ష పత్రికలన్నీ ఇలా బంగీ రాగానే ఒక కాపీ నాకు చదువుకోమని ఇచ్చే వారు. విజయ,నీలిమ , యువ, జ్యోతి వంటి మాస పత్రికలు, ఆంధ్ర పత్రిక, ప్రభ వంటి వార పత్రికలు షాపుకి రాగానే అమ్మకానికంటె ముందుగా నాకు ఇచ్చేసే వారు. ఏ రోజయినా, నేను షాపుకి వెళ్ళక పోతే, ఆ రోజు వచ్చిన కొత్త పత్రకలను మా ఇంటికి పంపించి వేసే వారు. వీటితో పాటు, అమ్మకానికి వచ్చిన నవలలు, కథా సంపుటాలు, సాహిత్య గ్రంథాలు అన్నింటి ప్రతులు ఒక్కొక్కటి చొప్పున నాకు చదువుకోడానికి అంద చేసే వారు. వీలయినంత వేగిరం, అంటే, తిరిగి ఆయా పుస్తకాలను అమ్ముకునేందుకు వీలుగా ఇచ్చి వేసే నియమం పెట్టే వారు. అలాగే మరో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే, ఏ పుస్తకమూ నలగ కూడదు. చిరగ కూడదు.

ఈ నిబంధన కూడా చాలా సున్నితంగా చెప్పే వారు. నేనెక్కడ నొచ్చు కుంటానో అని తెగ బాధ పడి పోయే వారు కూడా.

హైస్కూలు చదువు చదువుకుంటూ, పైసా సంపాదన లేని నా బోటి వాడికి ఆ రోజుల్లో అన్ని పత్రికలు, విలువైన పుస్తకాలు, గొప్ప సాహిత్య గ్రంథాలు అన్నీ కేవలం ఉచితంగా చదివే వీలు కలగడం నా అదృష్టం కాక మరేమిటి చెప్పండి ?

నా పుస్తక దాహార్తిని తీరుస్తూ, నేనొక రచయితగా ఎదిగే క్రమంలో ఎంతగానో దోహద పడి, చేయూత నందించిన ఆ దయామయుని రుణం ఎలా తీర్చు కోగలను ?

ఇంతకీ ఈ కామమ్మ కథ అనే పుస్తకం నాకు ఎలా వచ్చి చేరిందో ఇంకా చెప్పనే లేదు కదూ ?

సరే, అలాగ, నా హైస్కూలు చదువు పూర్తయి, తరువాత విజయ నగరంలో భాషా ప్రవీణ చదువు నాలుగేళ్ళూ గడిచే వరకూ వారి దయ వల్ల అసంఖ్యాకంగా పుస్తకాలు ఉచితంగా చదివేను. చదువు ముగిసి, తెలుగు పండితునిగా ఓ చిరుద్యోగం లోకి ప్రవేశించాక కూడా మీరు ఊహించ లేనంత కమీషను డిస్కవుంట్ పొందుతూ వారి నుండి ఎన్నో చాలా మంచి పుస్తకాలు కొనుక్కున్నాను. చాలా వరకూ అరువు. నెలల తరబడి ఆ వాయిదాలు కడుతూ ఉండే వాడిని. నేనంటే వారికి ఎంత అభిమానమో. ఆ పుస్తకాలు చదివి నేను ఏదయినా పుస్తకం గురించి మెచ్చుకుంటూ పొగిడితే అతనూ పొంగి పోయే వారు. అప్పటి వారి చూపుల్లో అన్నం వడ్డించే అమ్మ కున్నంత ఆదరణ ఉండేది.

ఇంకా ఈ పుస్తకం నాకు ఎలా వచ్చి చేరిందో చెప్పనే లేదు కదూ.

మరింక విసిగించను లెండి. వారిచ్చిన ఉచిత పుస్తకాలతో నన్ను నేను ఉన్నతీకరించు కుంటూ ,ఇలా ఓ ముప్ఫయ్ ఏళ్ళు గడిచేక, నేను ఉద్యోగ రీత్యా మా ఊరికి దూరంగా ఉండి పోవలసి రావడం చేత వారిని ఒకటి రెండు సార్లు తప్ప మరి కలియడం జరుగ లేదు. వారి గురించిన వివరాలూ తెలియ రాలేదు.

ఉద్యోగ విరమణ చేసాక, మా అన్నగారితో పాటు మళ్ళీ మా ఊరు వెళ్ళాను. అప్పటికి అక్కడ మాకు ఇల్లూ, పొలాలూ అన్నీ చెల్లి పోయాయి. తెలిసిన వారు కూడా కొద్ది మందే మిగిలేరు. చాలా ఏళ్ళ అనతంరం మా ఊరు చూడాలనే కుతూహలంతో నేనూ మా అన్న గారూ అక్కడికి వెళ్ళాం.

మా పుస్తకాల మిత్రుడు రాధా గోవింద పాఢి గారిని చాలా సంవత్సరాల తరువాత చూడాలని వారింటికి వెళ్ళాం.

ఆయన లేవ లేని స్థితిలో మంచం మీద ఉన్నారు. మాట కూడా సరిగా రావడం లేదు. అప్పటికి పది, పదిహేను ఏళ్ళ క్రిందటే ఫొటో స్టూడియో, పుస్తకాల షాపూ మూసి వేసారుట. ఆయన బహు కుటంబీకుడు. ఆరుగురు కూతుళ్ళు. ఒక కొడుకు. అందరికీ వివాహాలు చేసారు. ఆర్ధికంగా ఇబ్బంది ఏమీ లేదు. శరీరం సహకరించక ఫొటోల బిజినెస్సూ, పుస్తకాల షాపూ మూసి వేసారుట. నాకీ వివరాలేవీ తెలియదు. తెలుసు కోడానికి కనీస ప్రయత్నం కూడా చెయ్య లేదేమో. ఉద్యోగం, పిల్లలు, వారి చదువులూ, బదిలీలూ, అమ్మాయిల పెళ్ళిళ్ళూ, పురుడు పుణ్యాలూ ... వీలు చిక్క లేదని సిగ్గు లేకుండా చెప్పడానికి కావలసినన్ని కారణాలు ఉన్నాయి.

మా రాక చూసి ఎంతగానో సంతోషించారు. నన్ను చూసి కన్నీళ్ళు పెట్టు కున్నారు. వారు పడుకున్న మంచం క్రిందకి సైగ చేసి చూపించారు. వంగి , అక్కడ ఏముందా అని చూసి, ఒక పెద్ద పుస్తకాల కట్ట ఉంటే దానిని ముందుకు లాగేను. దళసరి అట్టతో వాటిని పేక్ చేసి ఉన్నారు. వాటి మీద జోగారావు గారికి అని వచ్చీ రాని తెలుగులో రాసి ఉంది. ఉద్వేగం ఆపుకో లేక పోయాను. కళ్ళంట నీళ్ళు ఆగ లేదు. ఎప్పుడో, మామధ్య రాక పోకలు ఆగి పోయినా, దూరాలు పెరిగి పోయినా, వారు పుస్తకాల షాపు మూసి వేసే రోజులలో నాకు ఇవ్వడానికి కొన్ని పుస్తకాలు పదిలంగా పేక్ చేసి ఉంచారుట. ఆ తరువాత వారిని నేను కలవడానికి నాలుగు దశాబ్దులకి పైగా పట్టింది. అయినా, వారి మంచం క్రింద నా పేరు రాసి ఉంచిన ఆ పేకెట్ అలాగే పదిలంగా ఉంది. చెక్కు చెదరని వారి అభిమానం లాగా. తరగని ప్రేమలాగా.

వారి గురించిన వివరాలు ఎప్పటి కప్పుడు తెలుసు కోలేక పోయిన నా అల్పత్వం స్ఫురించి సిగ్గు కలిగింది.

వారు నాకోసం దాచి ఉంచిన ఆ పుస్తకాల కట్టలో సి.నా.రె. గారి ఆధునికాంధ్ర కవిత్వం , సీతా దేవి మట్టి మనుషులు, కుటుంబరావు చదువు, రావి శాస్త్రి గారి నిజం నాటకం, రక్తాక్షరాలు, ఏడుతరాలు, ఊహాగానం ...లాంటి మంచి మంచి పుస్తకాలు చాలా ఉన్నాయి. వాటితో పాటు ఎలా వచ్చి చేరిందో ఈ కామమ్మ కథ పుస్తకం కూడా ఉంది.

నా పుస్తకాల గూటి లోకి గువ్వ పిట్టలా వచ్చి చేరి పోయింది.

ఇదీ, కామమ్మ కథ పుస్తకం నా దగ్గరకు వచ్చి చేరిన వైనం.

అయితే, ఈ పుస్తకంలో ఏముందో కూడా చెప్పాలి కదూ. నిజానికి అంత గొప్పగా దాన్ని గురించి చెప్పడానికి లేదు.

శుభము కామమ్మ శుభము కామమ్మా కామమ్మ

శుభ మొంది సామర్ల కోటలో నమ్మా కామమ్మ ... అంటూ పాట రూపంలో సాగి పోయిన నలభై పుటల చిన్ని పుస్తకం ఇది.

సుకపట్ల లక్ష్మయ్య, వెంకమ్మ దంపతుల కుమార్తె కామమ్మ. తల్లి దండ్రులు చిన్నప్పుడే పోవడంతో పిన తండ్రి రామన్న ఇంట అల్లారు ముద్దుగా పెరిగింది. బాల్యం వీడక ముందే తిరుపతి మారయ్యతో వివాహం జరిగింది. పెళ్ళినాటికి భర్త కలక్టరు దొర దగ్గర నెలకు మూడు వరహాల జీత గాడు. దొరతో ఎందుకో మాటా మాటా వచ్చి, కొలువు చాలించు కున్నాడు. తరువాత తల్లి ఎంత వారించినా వినకుండా చెన్నపట్నం వెళ్ళి అక్కడ దొరల దగ్గర మంచి కొలువునే సంపాదించు కున్నాడు. కొన్నాళ్ళకి ఇంటి మీద మనసు పుట్టి, నాలుగు మాసాలు సెలవు పుచ్చుకుని, ఇంటికి తిరిగి వచ్చేడు. చిత్రమేమిటంటే, వివాహమయినా, అప్పటికింకా భార్య కామమ్మ కాపురానికి రానే లేదు. పెళ్ళవుతూనే కొలువులకి వెళ్ళి పోయేడు మరి. సరే, ఇంటికి చేరిన మారయ్య తీవ్రంగా జబ్బు పడ్డాడు. మరి కోలుకో లేదు. కామమ్మను చూడాలని కోరేడు. కామమ్మ సారె, సరంజామాతో తొలిసారిగా అత్తింట అడుగు పెట్టింది. తొలి సారి చూపు మంచాన పడిన భర్తను. అదే కడ సారి చూపు కూడా అయింది. తరువాత కామమ్మ జీవితం అనేక మలుపులు తిరిగింది. ఎన్నో కష్టాలు పడింది. ఎందరికో తలలో నాలుకగా మెలిగింది. చివరలో కామమ్మ మరణంతో ఊరు ఊరంతా విలపించింది. ఊరి ప్రజలు కామమ్మకు గుడి కట్టి గ్రామ దేవతగా ఆరాధించడం మొదలు పెట్టారు.

స్థూలంగా ఇదీ కామమ్మ కథ. పాట రూపంలో ఉన్న ఈ కథను గాయకులు అప్పట్లో గానం చేసే వారేమో తెలియదు. రచయిత పేరు ఎక్కడా కానరాక పోవడం వల్ల ఈ పాట పరంపరగా సామర్ల కోట ప్రాంతంలో పాడు కునే వారేమో కూడా తెలియదు.

ఈ పుస్తకం గురించి పరిచయం చేయడం ఎందుకయ్యా అని మీరడుగ వచ్చును.

చిన్ని పుస్తకమే కావచ్చును. కానీ, అది నా దగ్గరకు చేరిన వైనం నా వరకూ చాలా గొప్పది. విలువైనది.

ఒక తియ్యని ఙ్ఞాపకం. ఒక మరపు రాని అనుభూతి. ఒక కన్నీటి తరంగం. ఒక మధుమయిన హృదయ స్పందన.

ఈ చిన్ని పుస్తకం కామమ్మ కథను చూస్తూ ఉంటే, నాకు నా మిత్రుని చూసి నట్టే ఉంటుంది. పలకరించి పులకరించి పోతున్నట్టుగా ఉంటుంది...

నా పుస్తకాల గూటిలో ఆ గువ్వ పిట్ట మంద్రంగా కువలాడుతూనే ఉంటుంది ...

అప్పటికీ ... ఇప్పటికీ ... ఎప్పటికీనూ ...

22, మే 2011, ఆదివారం

హౌస్ ఫుల్ ... కథ


అమృత మథనం బ్లాగులో అంట్లు తోము కుంటున్న అక్కినేని నాగేశ్వర రావు, మా సికింద్రాబాద్ కథలు - 1 చదివేక,
( ఇక్కడ నొక్కి ఆ టపా చూడండి. ) సినిమా వాళ్ళ మీది వెర్రి వ్యామోహంతో, వారి ఫాన్సుమంటూ తిరుగుతూ తమ జీవితాలను పాడు చేసు కునే వారిని చూస్తే ఎవరికయినా బాధ కలగక తప్పదు. వారి పాట వారిది కాదు. వారి వీరోచిత కృత్యాలలో నిజం లేదు. వారి హీరోయిజంలో నిజాయితీ లేదు. కాని, ఆ హీరోలను ఆకాశానికి ఎత్తేస్తూ వాళ్ళని దేవుళ్ళలాగా చూడడం, వారి కోసం తమ జీవితాల్లో నిప్పులు పోసు కోవడం, మన దౌర్భాగ్యం.

బుద్ధా మురళి గారి ఈ టపా చూసాక, నేను ఇదే అంశం మీద 1982 లో విజయ మాస పత్రికలో రాసిన ఒక కథను మీతో పంచు కోవాలనిపించింది.

కథ చూడండి ...



కథ పెద్ద అక్షరాలతో కనబడడం కోసం కథ మీద నొక్కండి. పేజీలు త్రిప్పడానికి పేజీకి కుడి చేతి అంచు మధ్యలో ఉన్న గుర్తు మీద నొక్కండి. ( తెలియని వారి కోసం ఈ వివరణ.)

1, మే 2011, ఆదివారం

నా కథల సంపుటి వెలువడింది ...




నా కథల సంపుటి గుండె తడి 24 కథలతో విడుదలయింది.

ఈ కథా సంపుటిని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు. ముఖ చిత్రం శ్రీ రమణ జీవి.

వెనుక అట్ట మీద నవ్య వార పత్రిక సంపాదకులు, ప్రముఖ రచయిత శ్రీ ఎ.ఎన్.జగన్నాథ శర్మ గారు, మరో ప్రముఖ

రచయిత శ్రీ మధురాంతకం నరేంద్ర గారు నా కథల పై తమ అభిప్రాయాలు పొందు పరిచారు.

పుస్తకం పేజీలు: 156. వెల: రు.75లు.

ప్రతులు దొరుకు చోటు:

విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 4-1-435, విఙ్ఞాన్ భవన్, ఆబిడ్స్, హైదరాబాద్ - 001.
ఫోన్: 040 24744580 / 04024735905

E^mail: visalaandhraph@yahoo.com
www.visalaandhra.com

ఇంకా, విశాలాంధ్ర వారి సుల్తాన్ బజార్ శాఖ, హైదరాబాద్, విజయవాడ,విశాఖపట్నం, అనంతపురం, కరీం నగర్, తిరుపతి,గుంటూరు, హన్మ కొండ, కాకినాడ, ఒంగోలు, శ్రీకాకుళం బ్రాంచీలలో లభ్యం.


3, ఏప్రిల్ 2011, ఆదివారం

ఉగాది ఉదయం ... కథ


అందరికీ ఖర నామ సంవత్సర శుభాకాక్షలు.... మీ కథా మంజరి.

అందరకీ సమస్త శుభాలూ కలగాలని, అందరి మనుగడ హాయిగా సాగాలని కోరుకుంటున్నాను.

తే 27-3-1971 దీ కృష్ణా పత్రిక వార పత్రికలో , ఉగాది సంచికలో వచ్చిన నా కథ ఉగాది ఉదయం సరదాగా మీతో పంచు కోవాలని ఇక్కడ ఉంచుతున్నాను. ఈ కథ ను పెద్ద అక్షరాలలో చదవాలనుకుంటే కథ మీద నొక్కి చూడండి.

ఉగాది పండుగతో ముడి పడి ఉన్న కొన్ని మూఢ నమ్మకాల పర్యవసానాన్ని సున్నితంగా తెలియ జేయడమే ఈ కథ ఉద్దేశం. ఇది నా తొలినాటి కథలలో ఒకటి.

29, మార్చి 2011, మంగళవారం

అడ్రసు లేని మనుషులు ... కథ


గత టపాలో ( నొక్కి చూడండి) లేమి వల్ల , ఇతర మానసిక ఒత్తిడుల వల్ల ఇంటికి వచ్చే అతిథుల గురించి ఆందోళన పడుతూ, చుట్టాలను వదిలించు కోవాలనుకునే వారి గురించి కొంత వ్యంగ్యంగా రాసేను.

ఇదే ఇతి వృత్తంతో 15-2-1980 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో అడ్రసు లేని మనుషులు అనే కథ ఒకటి రాసి ప్రచురించేను. ఆర్ధిక కారణాల వల్ల ఇంటికి ఆత్మీయుల రాకను కూడ ఆమోదించ లేని వ్యక్తుల దయనీయమైన స్థితిని ఇందులో చూపించేననుకుంటాను. అదే కారణం వల్ల వ్యక్తులు ఆత్మీయతల నుండి, స్నేహాల నుండి, అనుబంధాల నుండి, చివరాఖరికి తమ నుండి కూడా తాము ఎలా పిరికిగా, దూరంగా పారి పోతున్నారో, ఎలా అడ్రసు లేని మనుషులుగా మిగిలి పోతున్నారో ఈ కథలో చెప్పడానికి ప్రయత్నించేను.

ఇదీ ఆ కథ. ( అక్షరాలు పెద్దవి చేసి చదవడానికి కథ మీద నొక్కండి)

2, మార్చి 2011, బుధవారం

21, ఫిబ్రవరి 2011, సోమవారం

శరణు !శరణు !!


మాతృభాషా దినోత్సవ సందర్భంగా నవ్య దీపావళి ప్రత్యేక సంచికలో వచ్చిన నా కథ మరొక్కసారి.