24, మార్చి 2012, శనివారం

కథా పార్వతీపురం


మా పార్వతీపురం కథా రచయితల కథల సంకలనం కథా పార్వతీపురం వెలువడింది !
ఈ పుస్తకం గురించి కాళీ పట్నం ఇలా అంటున్నారు ...

‘‘ఉత్తరాంధ్రకు ఉత్తర భూములు సారవంతమయినవి.
గిరులూ, తరులతో సంపన్నమయినవి.
అచ్చట పుట్టిన చిగురు కొమ్మయిన చేవ అన్నట్టుగా యోథులే కాదు, కలం యోథులు కూడా సామాన్యులు కారు.
కాలక్షేపం కోసం కాకుండా జీవితాన్ని చిత్రించిప్రశ్నించి ఆలోచనలు రేపే ఈ కథలు కేవలం పార్వతీపురం ప్రాంత కథలు మాత్రమే కావు. ఎల్ల ప్రాంతాల వారిని ఆలోచింప చేసే కథలు.
గత నూరేళ్ళలో తొలినాటి ఆచంట సాంక్యాయన శర్మ గారి నుండి, నిన్న మొన్నటి కలంపట్టిన చి. బెలగం గాయత్రి దాకా కథకుల కథలు ఇందులో పొందు పరిచేరు.
ఈ పొందిక నేటి సామాజిక అవసరమని భావిస్తూ అభినందిస్తున్నాను. ’’

‘‘ పార్వతీపురానికి సాహిత్య లోకంలోఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడీ కథా పార్వతీపురం ఉన్న ప్రత్యేకతలకు, మరో కొత్త చేర్పు అవుతుదంని మా విశ్వాసం !’’ అంటున్నారు, దీని ప్రచురణ కర్త శ్రీ గుడిపాటి.

‘‘ కథకు కొత్తందాలు తీరిచి
దిద్ది ముత్యాల్ సరులు కూరిచి
తెలుగు జాతికి వెలుగు బాటలు
వేసినావు మహా కవీ...’’

అంటూ, రెండు యాభైల తెలుగు కథకు వందనం. మూడు యాభైల గురజాడకు ఈ ‘‘కథా పార్వతీపురం’’ అంకితం చేసారు సంకలన కర్తలు అట్టాడ అప్పలనపాయుడు, గంటేడ గౌరునాయుడు గారలు.

కథా పార్వతీపురం ఆవిష్కరణ సభ పుస్తకాన్ని మా పార్వతీపురం వీథుల్లో మేళతాళాలతో ఊరేగిస్తూ మొదలై 10.3.2012 వ తేదీన ఘనంగా జరిగింది.

52 మంది మా ఊరి రచయితల కథలున్న ఈ కథా సంకలనంలో కీ.శే. ఆచంట సాంఖ్యాయన శర్మ ( తొలి తెలుగు కథా రచయితలలో ఒకరు), ఎస్.వి.జోగారావు, పంతుల విశ్వనాథరావు, రాళ్ళపల్లి గౌరీపతి శాస్త్రి,, భూషణం, వి.వి.బి.రామారావు, దాసరి రామ చంద్రరావు, వంగపండు ప్రసాదరావు, పంతుల జోగారావు, జయంతి వెంకట రమణ, చింతా అప్పలనాయుడు, ఓలేటి శ్రీనివాసభాను, పి.వి.బి.శ్రీరామ మూర్తి, బి.వి.ఎ.రామారావు నాయుడు, వాడ్రేవు చిన వీర భద్రుడు, వేదప్రభాస్, డా.బి.యస్.ఎన్. మూర్తి, మల్లిపురం జగదీశ్, సువర్ణముఖి, గొల్లపూడి మారుతీరావు, అరుణ పప్పు, ఎ.ఎన్. జగన్నాథ శర్మ, గణేశ్ పాత్రో, అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు మొదలయిన పార్వతీపురం రచయితల కథలు ఉన్నాయి.

సార్వతీపురంలో ఫుట్టిన వారివే కాకుండా, ఆ ఊర్లో కొన్నాళ్ళు నివసించిన వారి కథలు కూడా ఇందులో చోటు చేసు కోవడంతో ఈ సంకలనానికి ఒక సమగ్రత సిద్ధించింది.

స్నేహ కళా సమితి, పార్వతీపురం, కురుపాం వారు ప్రచురించిన ఈ కథా పార్వతీపురం కోసం ఈ క్రింది ఫోను నంబర్లలో సంప్రదించ వచ్చును.

9441415182

9848787284

లేదా, మెయల్ చిరునామాలలో సంప్రదించ వచ్చును.

langulya@gmail.com

palapittabooks@gmail.com
పుస్తకం వెల : రూ. 250 మాత్రమే.