పునర్ముద్రణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పునర్ముద్రణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, నవంబర్ 2015, శుక్రవారం

అదీ, అలా ఉండాలి !కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలంటారు.
ఆధునిక కవి కూడా కొడితే కొట్టాలిరా, సిక్సు కొట్టాలీ ... అని తెగేసి చెప్పాడు.

ఈ శ్లోకం చూడండి:

దధతో యుధ్యమానస్య, పఠత: పులకో2థ చేత్
ఆత్మనశ్చ పరేషాం చ , తద్దానం సౌరుషమ్ స్మృతమ్ .

దానమంటూ చేస్తే ఎలా చేయాలయ్యా, అంటే, ఇచ్చే వాడికీ, పుచ్చుకునే వాడికీ, ఇతరులకీ కూడా ఆ దాన వైభోగం చూసి గగుర్పాటు కలగాలి ! ఇంకోలా చెప్పాలంటే తల దిమ్మెత్తి పోవాలి దానం చేడమంటే ఇలాగుండాలి అని ఒక మేలు బంతిలాగ ఉండాలంతే. కుర్రకారు భాషలో చెప్పాలంటే కెవ్వున కేక పెట్టించాలన్న మాట.

అలాగే, యుద్ధం చేస్తే ఆ రణనైపుణ్యం తనకీ, శత్రువుకీ, చూసే వారికీ కూడా ఆశ్చరానందాలను కలిగించేలా ఉండాలి.

అలాగే, దేనినయినా చదివితే చదువరులకు మైమరుపు కలిగించాలి.

అలా ఉండని ఆ దానమూ, ఆ పౌరుషమూ, ఆ పఠనమూ ఒట్టి దండగ మాలి పనులు.

ముందుగా ఒళ్ళు జలదరించే దాన విశేషం గురించి చూదాం ...

వామనుడు రాక్షస రాజు బలి చక్రవర్తిని కేవలం మూడడుగు నేల దానమడిగాడు. సరే ఇస్తానని ఇవ్వడానికి సిద్ధ పడ్డాడు బలి. రాక్షస గురువు శుక్రాచార్యుడు అడ్డు తగిలాడు. అడిగింది ఎవరను కున్నావ్? అడిగింది ఏమిటనుకున్నావ్? అంటూ హెచ్చరించాడు.

మహా దాత బలి వెనక్కి తగ్గ లేదు. ఇలా అన్నాడు. భాగవతంలో పోతన వ్రాసిన గొప్ప పద్యాలలో ఇదొకటి.

ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ దనువుపై నంసోత్తరీయంబుపైఁ
బాదాబ్జములపైఁగపోల తటిపైఁబాలిండ్ల పై నూత్న మ
ర్యాదం జెందు కరంబు గ్రిందగుట, మీదై నాకరంబుంట మే
ల్గాదే ? రాజ్యము గీజ్యమున్ సతతమే ? కాయంబు నాపాయమే !?

ప్రియ సతి లక్ష్మీ దేవి శరీర భాగాలను నూతన మర్యాదతో తాకిన ఆ చేయి ఇప్పుడు దానం స్వీకరించడానికి క్రింద ఉంది. దానమిచ్చే నా చేయి ఇప్పుడు మీద ఉంది. ఇంత కంటె భాగ్యం వేరే ఏముంది? ఈ రాజ్యాలూ గీజ్యాలూ ఎల్ల కాలం ఉండి పోతాయా ? దేహం నశించ కుండా శాశ్వతంగా నిలిచి పోతుందా?

ఎంత గొప్ప దానశీలత్వమో కదూ ! దానం అంటే అలా ఉండాలి.

వచ్చిన వాడు ఇంద్రుడని తెలిసినా , సహజ కవచ కుండలాలను ఇచ్చిన కర్ణుడూ. తన శరీర భాగాన్నే కోసి ఇచ్చిన శిబి, తన వెన్నెముకను ఒక మహత్తర దేవ కార్యం కోసం అర్పించిన దధీచి, చాలా దినాలు క్షుద్బాధను అనుభవించి, తరువాత క్షుధార్తుడయిన తనకు లభించిన ఓగిరాన్ని కూడా అర్ధికి ఇచ్చి వేసిన రంతి దేవుడూ .... వీళ్ళూ దాతలంటే. దానం చేయడమంటే అలాగుండాలి.

ఇక యుద్ధం సంగతి చూదాం.

శ్రీనాథుడు చెప్ప లేదూ?

ఎవ్వనితో నెచ్చోటన్
చివ్వకు చేసాచ వలదు. చే సాచినచో
నివ్వల నవ్వల నెవ్వరు
నవ్వక యుండంగ పగ సనన్ తీర్పదగున్

ఎవరితోనూ ఎక్కడా కూడా యుద్ధానికి తలపడనే వద్దు. ఒక వేళ యుద్ధం చేయవలసిన అక్కర పడితే మాత్రం పగ వాడి అంతు చూడనిదే వదల వద్దు సుమా ! చుట్టు ప్రక్కల ఎవరికీ పరిహాస పాత్రమయ్యే లాగున మాత్రం రణం చేయ వద్దు.
యుద్ధ రంగంలో పగవారికి వెన్ను చూపడం కన్నా హీనం మరొకటి లేదు.

ఉత్తర కుమారుని యుద్ధ ప్రాగల్భ్యం తెలిసినదే కదా ?

యుద్ధం చేయకుండా మగిడి వచ్చిన ఖడ్గ తిక్కనను చూసి, రోసి, అతని తల్లి, భార్య వానికి పౌరుషం కలిగించేలాగున ప్రవర్తించారుట. తానమాడడానికి మరుగు, పసుపు ముద్ద సిద్ధం చేసి అవమానించారుట. భోనాల వేళ విరిగిన పాలు పోసారుట. ఎన్నడూ లేని ఈ అనాదరణకి విస్తు పోయి ఖిన్నుడయిన తిక్కనకు తల్లి సమాధానం చూడండి:
పగరకు వెన్నిచ్చినచో
నగరే నిను మగతనంపు నాయకులెందున్?
ముగురాడవార మైతిమి !
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్ ?!

అసదృశముగ నరివీరుల
మసి పుచ్చక విరిగి వచ్చు మగ పంద క్రియన్
గసవున్ మేయగఁబోయిన
పసులున్ విరిగినవి తిక్క ! పాలున్ విరిగెన్.

యుద్ధంలో పగ వారితో పోరాడ కుండా వారికి వెన్ను చూపి పారి వచ్చిన వాడికి మగతనం ఉండదు కదా నాయనా ! వీరత్వం ఉన్న వారు అలాంటి పందలను మెచ్చుకోరు. ఇప్పుడు ఇంట్లో నీతో కలిపి ముగ్గురం ఆడువారమైనాము కదా ?
ఆడుదానివలె తడికె చాటున ఆ పసుపు రాసుకుని తానమాడి రావయ్యా అని వెటకారం.

పగ వారిని వీరోచితంగా ఉక్కడగించి రానట్టి పిరికి పందని చూసి, పశువుల మనసులు విరిగి పోయాయి. అవి ఇచ్చిన పాలు కూడా విరిగి పోయాయి. ఈవేళకి విరిగిన పాలతో భోజనం కానిద్దూ ! అని అవహేళన.

ఇక, పఠనయోగ్యాలయిన గ్రంథాల గురించి.

మంచి పుస్తకం చదివితే, చదవడం పూర్తయాక కూడా అది మనల్ని వెంటాడి వేధించాలి. ఆలోచింప చేయాలి. అలజడి కలిగించాలి. ఆహా !అనిపించాలి. కానప్పుడు కాల హరణం తప్ప ప్రయోజనం ఉండదు.

అదండీ సంగతి !

స్వస్తి.

12, నవంబర్ 2015, గురువారం

ప్రయత్నించి చూస్తే పోయే దేముంది చెప్పండి ?!విజయ విలాసం లో చేమకూర వేంకట కవి ధర్మ రాజు సుగుణాలను ఎలా వర్ణించాడో చూడండి.

దేవ బ్రాహ్మణ భక్తి ప్రోవు, ప్రియ వక్తృత్వంబు కాణాచి, వి
ద్యా వైదుష్యము దిక్కు, ధర్మమునకున్ దార్కాణ, మర్యాదకున్
ఠా, వౌచిత్యము జీవగఱ్ఱ, హితశిష్ట వ్రాత సంతోషణ
శ్రీ వజ్రాంగి, యజాత శత్రుడు మహీభృన్మాత్రుడే చూడగన్.

దేవ బ్రాహ్మణుల పట్ల అమిత భక్తి శ్రద్ధలు కలవాడు. ప్రియమైన మాటలు పలుకుతాడు. విద్యా వైదుష్యాలకు గతి. ధర్మానికి అతడే ఉదాహరణ ప్రాయుడు. మర్యాద ,ఔచిత్యాలు ఎరిగిన వాడు. మంచి వారినీ, సజ్జనులనూ కాపాడే వాడు, శత్రువులంటూ ఎవరూ లేని వాడు. లోకంలో సాధారణ రాజులలాంటి వాడు కాదు.

ఆవలబోయిన వెన్క నాడుటెన్నడు లేదు
మొగము ముందఱ నంట మొదలె లేదు

మనవి చెప్పిన చేయ కునికి యెన్నడు లేదు
కొదవగా నడుపుట మొదలె లేదు

చనవిచ్చి చౌక చేసినది యెన్నడు లేదు
పదరి హెచ్చించుట మొదలె లేదు

మెచ్చినచో కొంచె మిచ్చుటెన్నడు లేదు
మొక మిచ్చకపు మెచ్చు మొదలె లేదు.

మఱియుఁ దొల్లిటి రాజుల మహిమ లెన్ని
యితఁడె పో సార్వ భౌముఁడత్ప్రతిముఁడనఁగ
బ్రజలఁబాలించె సకల దిగ్భాసమాన
కీర్తి విసరుండు, పాండ వాగ్రేసరుండు

ఎదుట ఒక మాట, వెనుక ఒక మాట అనే దుర్లక్షణం లేదు. కాస్త ముఖం చాటు కాగానే ఆడిపోసుకోడం లేదు. అలాగని ముఖం మీదనే ఫెడీల్మనేలా కటువుగా పలకడం కూడా లేదు.
మనవి చేసుకుంటే, సహాయం చేయక పోవడం ఎప్పుడూ లేదు. అలాగని ఎంతో కొంత ఇచ్చి, చేతులు దులుపు కోవడం కూడ లేదు. ఇచ్చెనా, ఏనుగు పాడి అన్నట్టుగా, ఇవ్వడంలో ఎప్పుడూ తక్కువ చేయడు.

ముందు బాగా చనువు ఇవ్వడం. ఆతరువాత చులకనగా చూడడం ఎన్నడూ లేదు. అలాగే, ఊరికే పొగడ్తలతో ముంచెత్తడం కూడా చేయడు.

మెచ్చు కుంటే ఏదో కొంచెం ఇచ్చి పొమ్మనే రకం కాదు. అలాగని ముఖ ప్రీతి మాటలాడడం, ఇచ్చకాలు పలకడం అసలే లేదు.

వెనుకటి రాజుల గొప్పతనాలు ఎటువంటివో ఆలోచిస్తే, ధర్మ రాజు మాత్రమే చక్రవర్తి అని అర్ధమౌతుంది.

ఎంత లెస్సగ నున్న నంత వేడుక కాని,
ప్రజలకల్మి కసూయ పడుట లేదు

తనుఁగొల్వ వలె నందఱను ప్రియంబె కాని
మానిసి వెగటించుకైనను లేదు

నిచ్చ వేడిన నర్ధి కిచ్చు చిత్తమె కాని
మునుపింత యిచ్చితి ననుట లేదు

రేవగల్ ధర్మ మార్జించు దృష్టియె కాని,
న్యాయంబు దప్పిన నడక లేదు

కలడె యిటువంటి రాజు లోకమున నెందు !
జలధి వలయిత వసుమతీ చక్రమెల్ల
యేల వలె శాశ్వతముగాఁగ నీఘనుండె
యేల వలె నన్యు లన నృపాలుఁడలరె

తన పాలనలో ఉన్న ప్రజలు ఎంత సంపన్నులయితే, ధర్మ రాజు అంతగా సంతోషించే వాడు. అంతే కాని, తన ఏలుబడిలో ఉండే వారికి ఇంత సంపదా ? అని అసూయ పడే వాడు కాదు. అందరూ తన పాలనలో తనని సేవిస్తూ ఉండాలనే రాచరికపు వేడుకే తప్ప, మనుషులంటే ద్వేషం ఎప్పుడూ లేదు. అడిగిన వాడికి అడిగింది ఇవ్వడమే కాని, లోగడ ఇంత ఇచ్చేను కదా, మళ్ళీ అడుగుతావేం !అంటూ కసురు కోవడం లేదు. రాత్రీ పగలూ ధర్మ బద్ధంగా ఉండాలనే ఆలోచనే తప్ప ఎన్నడూ న్యాయ మార్గాన్ని తప్పి ఎఱుగడు.

లోకంలో ఎక్కడయినా ఇంత గొప్ప రాజు ఉన్నాడా? సముద్ర వేలా సర్యంత మయిన ఈ భూమండలాన్ని ఈ ఘనుడైన ధర్మ రాజే శాశ్వతంగా పాలించాలి. వేఱొక ప్రభువు మన కేల? అని ప్రజలు అనుకునే లాగున ధర్మజుడు ఒప్పుతున్నాడు.

కోపమొకింత లేదు, బుధ కోటికిఁగొంగు పసిండి, సత్య మా
రూపము, తారతమ్యము లెఱుంగు స్వతంత్రుడు, నూతన ప్రియా
టోపము లేని నిశ్చలుఁడిటుల్ కృత లక్షణుఁడై చెలంగగా
ద్వాపర లక్షణుండనఁగ వచ్చునొకో యల ధర్మ నందనున్

కోపం ఇసుమంతయినా లేదు. పండిత వర్గానికి కొంగు బంగారం. సత్యమే ఆకారంగా రూపు దాల్చిన వాడు. మంచి చెడ్డలు, బాగోగులు బాగా తెలిసిన వాడు. ఎవరో చెబితే చెప్పుడు మాటలు తలకెక్కించు కోకుండా స్వతంత్రమైన భావాలు కలవాడు.నూతన ప్రయాడంబరాలు లేని వాడు.రాజానో బహు వల్లభా: కదా? కొత్త రుచుల కోసం వెంపర్లాడే వాడు కాదు.ధృడ చిత్తం కలవాడు. ఇన్ని కృత లక్షణాలు కల ధర్మ రాజుని ద్వాపర లక్షణాలు కల వాడని అనడం ఏమి సబవు? కృత యుగంలో వ్యక్తులకు ఉండే లక్షణాలు అన్నీ సంతరించుకున్న వాడని చమత్కారం.

చూడండి. ధర్మ రాజు ఎన్ని గొప్ప సల్లక్షణాలు కల వాడో ! అందులో అన్నో, కొన్నో మంచి లక్షణాలు మనమూ అలవరుచు కోడానికి ప్రయత్నించి చూస్తే పోయేదేముంది చెప్పండి?

3, అక్టోబర్ 2015, శనివారం

శేషం కోపేన పూరయేత్ !ఫ్రశ్నించడం మానవ నైజం, అది నైజమే కాదు; హక్కు కూడా. నిలబెట్టి అడిగితేనే కదా, నిజాల నిగ్గు తేలేది? ప్రశ్నించడం లోనుండే కదా, ప్రగతి ప్రభాత కిరణాలు పొడసూపేది?

కాదంటే ఎలా ? కోపగిస్తే ఎలా ? ఎందుకు? అనడిగే వారుంటేనే కదా, ఎందుకో తెలిసేది ?

అలా అడిగిన సందర్భాలు కొన్నింటిని ఇక్కడ చూదాం ...

అన్నమయములైన వన్ని జీవమ్ములు
కూడు లేక జీవ కోటి లేదు
కూడు తినెడి కాడ కుల భేద మేలకో?
కాళికాంబ ! హంస ! కాళికాంబ !

(కాళికాంబ శతకం - పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి)

లోకాన జీవ రాసులన్నీ తిండి తిని బతికేవే. తిండి లేక పోతే జీవ కోటి ఉనికే లేదు. మరి, మన మానవులలో తిండి తినేటప్పుడు కుల భేదం ఎందుకు చూపుతారో, తెలియదు.

ఎక్కడి మంత్రతంత్రము లవెక్కడి చక్రము లేడ పాచికల్
ఎక్కడి జ్యోతిషంబులవి యెక్కడి హేతువు లేడ ప్రశ్నముల్ ?
తక్కిడి గాక, పూర్వ కృత ధర్మ సుకర్మమె నిశ్చయంబు పో
పెక్కురు పొట్ట కూటికిది వేషమయా శరభాంక లింగమా !

మంత్రాలంటావు , తంత్రాలంటావు ! అన్నీ ఒట్టి అబద్ధాలు. చక్రాలు వేస్తావు.భవితవ్యాన్ని చెబుతానంటావు. పాచికలతో పరమార్ధం తెలిసి పోతుందంటావు. జ్యోతిషం చెబుతావు, జరిగినదీ, జరగబోయేదీ .. అంతా ట్రాష్. హేతువులంటావు, ప్రశ్నలు అడిగితే కనులు అరమోడ్చి, ఎక్కడికో వెళ్ళి పోయినట్టు అభినయించి, ఠక్కున భూత భవిష్యద్వర్తమానాలకు చెందిన వాటి గురించి జవాబులు చెబుతానంటావు. ఇదంతా మోసం. దగా. కుట్ర. మనం చేసుకున్న ధర్మాల పుణ్యమే సత్యం (?) ఈ మంత్రాలూ, తంత్రాలూ, చక్రాలూ, పాచికలూ, ప్రశ్నలు వేయడాలూ, జ్యోతిషాలు చెప్పడాలూ, అన్నీ కొంత మంది పొట్ట పోసుకోవడం కోసం వేసే వేషాలు తప్ప మరొకటి కాదు. అది నిజం. అంటాడు శరభాంకుడు.

ధూమ కేతువు కేతువనియో
మోము చందురు డలిగి చూడడు
కేతువా యది ? వేల్పు లలనల
కేలి వెలితొగ కాంచుమా !

అరుదుగా మిను చప్పరంబున
చొప్పు తెలియని వింత పొడమగ
చన్న కాలపు చిన్న బుద్ధులు
బెదిరి యెంచిరి కీడుగా ...

అంటూ తోక చుక్క కనిపించడం అనర్ధదాయకంగా భావించడాన్ని గురజాడ నిరసించాడు.
అదంతా కవుల కల్పన అన్నాడు. తోక చుక్క భూమికి దూరపు చుట్టం అని చెప్పాడు. దారిన పోతూ చుట్టపు చూపుగా చూసి పోయే తోక చుక్క గురించి ఆందోళన ఎందుకని అడిగేడు.

తుదకు, వర్ణ భేదాలు చెరిగి పోయి, మతము లన్నీ మాసి పోయి,తెలివి ఒక్కటే నిలిచి వెలుగుతుందనీ, ఎల్ల లోకం ఒక్క ఇల్లవుతుందనీ ఆశించేడు. కవి కామన ఇంకా సుదూర తీరం లోనే ఉన్నట్టుంది. అదలా ఉంచండి ...
ప్రశ్నించే సోక్రటీస్ ను, కందుకూరిని, రాజారామ మోహనుడిని, త్రిపురనేనిని ... ఇలా చాలా మందిని ఒక్క సారి స్మరించుకుని, మరి రెండు మూడు సంధించిన ప్రశ్నాస్త్రాలను కూడా చూదాం,

పశుశ్చే న్నిహిత: స్వర్గం , జ్యోతిష్ఠోమే గమిష్యతి,
స్వపితా యజమానేన, తత్ర కస్మా న్న హింస్యతే

స్వర్గం లభించాలని, యాగ పశువులను బలి చేస్తున్నావు. అవి నేరుగా స్వర్గానికే పోతాయని దబాయిస్తున్నావు. మరయితే, నోరు లేని ఆ జీవాలను బలి పేరిట చంపడం కన్నా, యాగంలో స్వయంగా నీ తండ్రి గారినే బలి ఇవ్వరాదూ ? చక్కా, సరాసరి స్వర్గానికి పోతాడు కదా ? అలా ఎందుకు చేయవయ్యా ?

స్వర్గ: క ర్తృ క్రియా ద్రవ్య , వినాశో యజ్వనాం,
తతో దావాగ్ని దగ్ధానాం , ఫలం స్యాద్భూరి భూరుహామ్

యఙ్ఞం లో సమిధలు, ఆజ్యం లాంటి హోమ ద్రవ్యాలను ఎన్నింటినో వ్రేల్చుతావు. అవి హుతమై, మీది కెగిసి, నీకు స్వర్గాన్ని ఇస్తాయంటావు ? తెలిక అడుగుతానూ , అలా చేయడం వల్ల నీకే స్వర్గం వస్తే, అడవిలో కార్చిచ్చు
చెల రేగినపుడు ఎన్నో చెట్లు అగ్నికి ఆహుతయి పోతూ ఉంటాయి. వాటన్నింటికీ అదే స్వర్గ ఫలం వస్తుందంటావా?

మృతానామపి జంతూనాం , శ్రాద్ధం చే తృప్తి కారణమ్
నిర్వాణస్య ప్రదీపస్య, స్నేహ: సంవర్ధయేచ్ఛిఖామ్

చచ్చిన వారికి పిండాలు పెట్టి, శ్రాద్ధ కర్మలు చేస్తే ఆ మృతులకు తృప్తి కలుగుతుందంటావు. మరయితే, ఆరి పోయిన దీపం నూనె పోయగానే వెలిగించకుండానే వెలగాలి కదా ?

(మీది మూడు శ్లోకాల కర్త కృష్ణ మిశ్రుడు - ప్రబోధ చంద్రోదయం)

ఇది చార్వాకం. వీటికి మన వాళ్ళు ఘూటుగానే జవాబులు చెప్పారనుకోండి ... ఏమయినా, నిలదీసి అడిగితేనే కదా, నిజాల నిగ్గు తేలేది?

జవాబులు చెప్పలేని చిక్కు ప్రశ్నలే అడిగాడనుకో, ఈ సూత్రం ఎలానూ ఉంది:
శేషం కోపేన పూరయేత్ ! ... ... ...

26, సెప్టెంబర్ 2015, శనివారం

పొగడ దండలు రెండవ భాగం లేదా గోకుళ్ళ భాగోతం ఇంకా కాదంటే భజంత్రీలు పార్టు టూ !


లోకంలో పొగడ్తకి లొంగని వాడు లేడు. బయటకి ’అబ్బే, మీరు మరీనూ ...‘ అంటూ సన్నాయి నొక్కులు నొక్కినా, లోపల లోపల ఆ పొగడ్తలకి పొంగి పోతూనే ఉంటాడు. మరి కాస్సేపు పొగిడితే బావుండునని అనుకుంటూ ఉంటాడు.తనని పొగిడే వాడి కోసం ఏం చేయడానికయినా సిద్ధ పడి పోతాడు.పొగడ్తల మహిమ అలాంటిది మరి !

ఆడవాళ్ళయితే ఈ పొగడ్తలకి మరింత తేలికగా వశులై పోతారనే అభిప్రాయం కూడా లోకంలో ఉంది. మగరాయళ్ళు ఆ బలహీనతను బాగా ఉపయోగించు కుంటూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.

పూర్వ కాలంలో రాజులు ఈ పొగడ్తలు చెవిని పడనిదే శయ్య దిగే వారు కాదు. కనులు తెరిచే వారు కాదు. భట్రాజులు రకరకాలుగా పొగుడుతూ ఉంటే కాని వారి అడుగు ముందుకి పడేది కాదు.

రాజకీయ నాయకుల చుట్టూ చేరే అనుచర గణం ఆ నాయకుని ప్రతి మాటకీ చర్యకీ వత్తాసు పలుకుతూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. దానితో సదరు నాయకమ్మన్యుడు భూమికి ఓ అడుగు ఎత్తున విహరిస్తూ ఉంటాడు.

పొగడ దలచిన వాడెప్పుడూ స్వీయ ప్రయోజనం నెర వేరాలనే ఆలోచిస్తాడు. ఎవడిని పొగుడు తున్నాడో వాడిలో అతనికి ఏ లోపాలూ కనిపించవు. అన్నీ సుగుణాలే మిల మిలా మెరిసి పోతూ ఉంటాయి. ధగ ధగా వెలిగి పోతూ ఉంటాయి.

కూరిమి గల దినములలో నేరము లెన్నడూ కనిపించవు కదా ! ఆ కూరిమి విరసమై నప్పుడే కదా, అన్ని దోషాలూ కనిపిస్తూ ఉంటాయి.

అందు వలన ఇవాళ పొగిడిన వాడు రేపు పొగుడుతాడనే గ్యారంటీ లేదు. పొగిడినా, మునపటి స్థాయిలో పొగుడుతాడనే భరోసా లేదు.

నీ ప్రభ వెలుగుతున్నంత కాలం నిన్ను పొగడ్తలతో ముంచెత్తిన వాడే రేపు నిన్ను నిర్ధాక్షిణ్యంగా తిట్టి
పోయడానికి వెనుదీయడు.

నువ్వు ఇంద్రుడివనీ, చంద్రుడివనీ, అదనీ ఇదనీ , తెగ పొగిడిన నోరే తెగనాడుతుంది.

నీ ముందు పాదాక్రాంతుడైన వాడే నీ ముఖాన ఛీత్కరించుకు పోతాడు.

సరే, ఇదంతా కాస్సేపు ప్రక్కన పెడితే.

ఎవరెవరిని పొగడాలో ఎవరిని అస్సలు పొగడ కూడదో కవి గారు ఒక శ్లోకంలో చెబుతున్నారు.

చూడండి:

ప్రత్యక్షే గురవ: స్తుత్యా:, పరోక్షే మిత్రబాంధవా:
కర్మాంతే దాసభృత్యాశ్చ, న కదాచన పుత్రకా:

గురువులను ఎదుట పొగడ వచ్చును.
బంధువులను, మిత్రులను వారి పరోక్షంలో మాత్రమే పొగడాలి.
సేవకులను, వారి విధి నిర్వహణ పూర్తయేక పొగడాలి.
పుత్రులను మాత్రము ఎన్నడూ పొగడ కూడదు సుమా !

గురువులు ఙ్ఞాన ప్రదాతలు. వారి గొప్పతనాన్ని వారి సముఖాన పొగిడితే దోషం కాదు. వారు స్థిత ప్రఙ్ఞులు కనుక మనం పొగిడినంత మాత్రాన పొంగి పోరు. పొగడక పోతే చిన్నబుచ్చు కోరు.

బంధువులు . స్నేహితులు ... వీరి గురించి ఎట్ట ఎదుట పొగడ కూడదు. మరీ అంత భజన పనికి రాదు. మరీ పొగుడుతూ ఉంటే వారి కళ్ళు స్థాన భ్రంశం చెందే అవకాశం కూడా ఉంది.

ఇక, పని వాళ్ళని ఎప్పుడు పొగడాలయ్యా, అంటే, వాళ్ళ పని, వాళ్ళు సక్రమంగా పూర్తి చేసిన తరువాత మాత్రమే పొగడాలి.

మా పనమ్మాయి అంత మంచిది, ఇంత మంచిది, అంత పనిమంతురాలు, ఇంత పనిమంతురాలు అంటూ ఆమె పని చేయక ముందే పొగిడితే ఉబ్బి తబ్బిబ్బయి పోయి మనతో పాటు టీ.వీ చూస్తూ కూర్చుంటుంది, కమ్మని కాఫీ ఇస్తే చప్పరిస్తూ ...

చివరిగా ఎవరిని ఎప్పుడూ పొగడ కూడదో కూడా చెబుతున్నాడు కవి, పుత్రులను అసలు ఎప్పుడూ పొగడనే కూడదట.

అలా పొగడడం వారికి ఆయుక్షీణం అని మన వారి నమ్మకం కూడానూ.

పుత్రులను పొగడరాదని చెప్పడానికి ప్రచారంలో ఉన్న ఓ కథని చూదాం ...

కిరాతార్జునీయమ్ వ్రాసిన భారవి గురించిన ఈ కథ లోకంలో ప్రచారంలో ఉంది.

యువకుడైన భారవి కవిత్వాన్ని, గొప్పతనాన్ని మెచ్చు కుంటూ అందరూ తెగ పొగుడుతూ ఉంటే, భారవి తండ్రి మాత్రం కొడుకు గురించి ఒక్క మెచ్చుకోలు మాటా అన లేదుట.

దానితో భారవికి విపరీతమైన కోపం ముంచుకు వచ్చింది. తండ్రి బుర్ర బ్రద్దల కొట్టేద్దామా అన్నంత ఆగ్రహం కలిగింది.

అదే పని మీద ఓ రాత్రి ఒక పెద్ద బండ రాయిని పట్టుకుని అటక ఎక్కి కూర్చున్నాడు. రాత్రి పూట తండ్రి గారి బుర్ర మీద దానిని గిరాటు వేసి, తనని పొగడని తండ్రి గారి మీద తన కసి తీర్చు కోవాలని అనుకున్నాడు.

సరే, రాత్రయింది. భారవి తల్లిదండ్రులు అక్కడకి చేరి మాట్లాడుకుంటున్నారు. అదను కోసం చూస్తున్న భారవి చెవిని ఆ మాటలు పడుతున్నాయి.

‘‘లోకమంతా మన భారవి కవిత్వాన్ని ఇంతలా మెచ్చు కుంటూ ఉంటే, మీరేమిటండీ వాడి గొప్పతనాన్ని గురించి ఒక్క మాటా అనరు ? వాడిని పొగిడితే మీ నోటి ముత్యాలేమయినా రాలి పోతాయా ? ’’ అని నిష్ఠూరంగా పలికింది తల్లి.

దానికాయన, ‘‘ పిచ్చి ముఖఁవా ! ( పెళ్ళాల వెప్పుడూ పిచ్చి ముఖా లే కదా, హత విధీ !!) భారవి గొప్ప తనం నాకు తెలియదుటే? వాడు ఎంత గొప్ప కవిత్వం వ్రాస్తున్నాడో చూస్తున్నాను. వాడి గొప్ప తనం చూసి ఎంతగా పొంగి పోతున్నానో, నీకేం తెలుసు? అయితే, మన బిడ్డని మనం పొగడ కూడదు. అది వాడికి శ్రేయస్కరం కాదు. అంచేత వాడిని పొగడడం లేదు కానీ , వాడంటే ఇష్టం లేక కాదు సుమీ ! ’’ అన్నాడు.

అంతే !

భారవి కవి ఆగ్రహమంతా మంచులా కరిగి పోయింది. పశ్చాత్తాపంతో ఏడుస్తూ తండ్రి కాళ్ళ మీద పడి తను చేయ దలచిన ఘోరకృత్యం గురించి చెప్పి, తన పాపానికి తగిన శిక్ష విధించ మని కోరాడు.
పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని తండ్రి ఎంత చెప్పినా విన లేదు. శిక్ష విధించి తీరాలని పట్టు పట్టేడు.

‘‘సరే, ఓ యేడాది పాటు మీ అత్తారింట గడిపి రా ! ’’ అని తండ్రి శిక్ష విధించాడు.‘ ఇదేం శిక్ష! ’ అనుకుని భారవి ఎగిరి గంతేసి, భార్యతో పాటు అత్తారింటికి వెళ్ళాడు.

కొన్ని రోజు పాటు అత్త వారింట సకల మర్యాదలూ జరిగేయి. తర్వాత మొదలయ్యేయి, విసుక్కోవడాలూ, సణుక్కోవడాలూ, పిల్లి మీదా కుక్క మీదా పెట్టి వ్యంగ్యాస్ర్తాలూ, సూటీపోటీ మాటలూ ...

కవి గారు ఏం చేస్తారు; భరించక తప్పదు, శిక్షా కాలం యేడాదీ ముగిసే వరకూ.

ఇలా ఉండగా భార్య ఏదో నోము చేయాలనుకుంది. చేతిలో ఎర్ర ఏగానీ లేదు. భార్య కోరిక ఎలా తీర్చడం ?

భారవి అప్పుడు తను వ్రాస్తున్న కిరాతార్జునీయమ్ కావ్యం లోనుండి ఓ శ్లోకం ఉన్న తాటాకు తీసి, ఆమెకి ఇచ్చి, ఎవరిదగ్గరయినా దానిని కుదవ పెట్టి ధనం తెచ్చుకుని నోము చేసుకొమ్మన్నాడు.

ఆమె దానిని ఊర్లో ఓ ధనవంతుడయిన ఒక వ్యాపారి వద్ద కుదవ పెట్టింది. అతడు ఆ శ్లోకం చూసి, భారవి కవిత్వం గొప్ప తనం తెలిసినవాడు కనుక, ఆమెకు చాలా ధనం ఇచ్చి పంపించాడు.

తరువాత, అతడు ఆ తాళ పత్రాన్ని ఒక కత్తి ఒర లో ఉంచి, గూట్లో పెట్టాడు. ఆ పిమ్మట ఆ వణిజుడు వర్తకం కోసం చాలా ఏళ్ళపాటు దూర దేశాలకు వెళ్ళాడు.

అలా దేశాలు పట్టి తిరిగి, చాలా ఏళ్ళకి ఇంటి కొచ్చిన అతనికి తమ పడక గదిలో ఎవరో పరాయి మగాడు ఉండడం గమనించి ఆగ్రహం కలిగింది. మరో ఆలోచన లేకుండా గూట్లో ఉన్న ఓర లోనుండి కత్తిని బయటకి లాగేడు. దానితో పాటు, ఎప్పుడో తాను అందులో పెట్టిన తాళపత్రం కూడా బయట పడింది. దాని సంగతే అతను మరిచి పోయాడు. ఏమిటా, అని చదివాడు.

అందులో భారవి వ్రాసిన ఈ శ్లోకం ఉంది:

సహసా విధధీత నక్రియామ్
అవివేక: పరమాపదాం పదాం
వృణుతేహి విమృశ్య కారిణామ్
గుణ లుబ్ధా: స్వయమేవ సంపద:

వేయి విధాలుగా ఆలోచించి కాని ఏ పనీ చేయ కూడదు. చక్కగా ఆలోచించి పని చేసిన వానికి సంపదలు తమంతట తామే సమ కూడతాయి. అని దీని భావం.

ఈ శ్లోకం చదివేక, అతని కోప తీవ్రత కొంత తగ్గింది. కాస్త చల్ల బడ్డాడు. ఈ లోగా భార్య లేచి, అతని రాకను చూసి అమితానందం చెంది, ఆ పురుషుని తమ బిడ్డగా పరిచయం చేసింది.చాలా ఏళ్ళ క్రింట తాను విదేశ గమనానికి సిద్ధ పడిన రోజులలో భార్య గర్భవతి అన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చిందతని.

తొందర పడి కత్తి వేటుకి చేజేతులా భార్యనీ కొడుకునీ కడ తేర్చే వాడిని కదా అని అతడు పశ్చాత్తాపం చెందాడు. తనని తొందర పాటు నుండీ, ఒక మహా విపత్తు నుండీ కాపాడిన ఆ శ్లోక కర్త భారవికి అతడు భూరి కానుకలిచ్చి సత్కరించేడు.


ఇక, పొగడడంలో ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్దతి అనే రకాలు కూడా ఉన్నాయండోయ్. అంటే, పొగుడు తున్నట్టుగా తిట్టడం, తిడుతున్నట్టుగా పొగడడం. వీటినే మన వాళ్ళు వ్యాజ స్తుతి, వ్యాజ నింద అంటారు. స్వస్తి.

21, సెప్టెంబర్ 2015, సోమవారం

సాహసం శాయరా డింభకా !సాహసం శాయరా, డింభకా ! అన్నాడు కదా, భేతాళ మాంత్రికుడు.


పిరికి గొడ్డులా ఉంటే లోకం తరిమి కొడుతుంది. అదే, బోర విరుచుకుని తిరిగేవనుకో లోకం సాగిల పడుతుంది. వెనుక బడితేను వెనకేనోయ్ అన్నాడు కవి. సాహసం చేయ లేక పోతే ఏదీ సాధించ లేం.‘ చెట్టు లెక్క గలవా ? పుట్ట లెక్క
గలవా ?..’’ అంటూ చెంచు లక్ష్మి కూడా ఓ క్వశ్చనీర్ హీరో గారి ముఖాన కొట్టడం తెలిసిందే కదా.

మా చిన్నప్పుడు ఊళ్ళోకి సర్కస్ కంపెనీ వచ్చిందంటే పండుగే, పండుగ ! పొద్దస్తమానం ఆ డేరాల చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉండే వాళ్ళం. సర్కసు చూసొచ్చిన కుర్రాళ్ళు ఇంటి వెనుక పెరళ్ళలో ఏవో ఫీట్లు ప్రాక్టీసు చేయబోవడం రివాజు. అలా, మా వీధి పిలగాయలు నలుగురైదుగురు కాళ్ళూ చేతులూ విరక్కొట్టుకున్న వాళ్ళూ లేక పోలేదు. సింహాలూ. పెద్ద పులులూ దొరికే ఛాన్సు ఎలాగూ లేదు కనుక,సీమ పందికి తర్ఫీదు ఇవ్వ బోయి అది భీకరంగా నిరాకరించడంతోను, తొడ కండ పీకేలాగున తన అసమ్మతి చూపడంతోను మంచాన పడిన కుర్రాళ్ళూ ఉండే వారు.

అలాగని సాహసాలు చెయ్యకుండా ఎలా ఉంటాం చెప్పండి?

సాహసాలంటే మంటల్లో దూకడాలూ, ఎత్తుల మీంచి దూకడాలూ మాత్రమే కానక్కర లేదు.

మా డింగరి బుచ్చబ్బాయ్ తనకి సున్నా మార్కులు వేసిన లెక్కల మాష్టారి మీదకి చాటుగా గురి చూసి మెట్లంగి రాయొకటి విసర లేదూ ? అప్పుడు వాడి సాహసానికి మేఁవంతా నోళ్ళు వెళ్ళబెట్టేం కదా. సాహసం కోసం మరీ ఇంతలేసి అకృత్యాలు చెయ్యమనడం లేదు కానీ, మీ పరిధిలో మీరు ఏవో ఒకటి రెండు సాహసాలయినా చేయక తప్పదు,జీవిత కాలంలో.

తెలుగు వర్ణమాల తెలిసిందే కదా, మరింకేం - ఏ కవితో రాసి పారెయ్యండి. ధైర్యంగా ఏ తలమాసిన పత్రికకో పంపించెయ్యండి. అచ్చోసిన వాడూ, చదివిన వాడూ వాళ్ళ ఖర్మానికి వాళ్ళు పోతారు. ఇలాంటి సాహసాలు చేయడం వల్ల ఇతరులకే కానీ మనకి ప్రమాదమేమీ లేదని ఢంకాభజాయించి చెబుతున్నాను.

ఇంటావిడ ధాం ధూమ్ లాడుతూ ఉంటే , పిరికి వాడిలా ముంగిముషాణంలా కూచో వద్దు. ఒక సారయినా సాహసోపేతంగా నోరు విప్పండి. మా సత్రాయిగాడు ఓ సారి ఇలాగే ధైర్యం చేసి వాళ్ళావిడ కన్నా పెద్ద నోరు పెట్టి ’’ నవ్వన్నది నిజమేనే ...‘‘ అని గాఠిగా అరిచేడు. వాడి ధైర్యానికి ఆవిడ మ్రాన్పడి పోయింది తెలుసా?

ఓ సారి మన జానపద బ్రహ్మ విఠలాచార్య గారి చిత్రరాజాలను గుర్తుకు తెచ్చు కోండి.మన ఎన్టీవోడినీ,

కాంతారావునీ,


రాజనాలనీ
వీళ్ళందరినీ ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. ( దేశ వాళీ వీరులనే కాక విదేశీ వీరులని కూడా స్మరించడం మీ యిష్టం)

సాహస వీరుడు, సాగర కన్య లాంటి సినిమాలు చూసి పిరికి తనం ఏ మూలనయినా ఉంటే పోగొట్టుకోండి అని నా ఉచిత సలహా. ఇంకా చాలా ఉన్నాయి కానీ మరింత వివరంగా చెబుతూ మీ సహనాన్ని పరీక్షించే సాహసం చేయ లేను.

నా బ్లాగే కదా అని ఇలా నానా చెత్తా రాసే సాహసం చేస్తున్నానని మీరనుకుంటున్నారు కదూ.అవున్నిజమే. ఇంతకీ సాహసం చెయ్యమని ఒక కవి శ్లోకంలో చెప్పిన విషయమే మీముందు ఇవాళ ప్రస్తావించ బోతున్నాను. చూడండి:

న సాహస మనారుహ్య, నరో భద్రాణి పశ్యతి
సాహసం పున రారుహ్య, యది జీవతి పశ్యతి.

ప్రమాదాలు ఎదుర్కోనిదే మానవులు కార్య సాఫల్యాన్ని పొంద లేరు .విజయాన్ని అందు కోలేరు.అందు చేత, సాహసం చేసి, జయించి, బ్రతికి ఉంటే శుభాలు పొంద గలరు అని దీని భావం.

బ్రతికి యుండిన శుభములు బడయ వచ్చు ... అనుకుంటూ ఏ సాహస కృత్యమూ చేయకుండా పిరికి తనంతో బతకొద్దని కవి ఉవాచ. సహసం చెయ్. శుభాలు పొందు. ఆ సాహసం చేయడంలో ఛస్తే పాయె. బతికి ఉంటే శుభాలు పొంద గలవు అని కవి గారు హామీ యిస్తున్నారు.

వెన్ను చూపడం, మడమ త్రిప్పడం ... వంటి జాతీయాలు కదన రంగంలో సాహసోపేతంగా ముందుకు పొమ్మని ప్రోత్సహించేవే కదా.

బ్రేవో. గో ఎ హెడ్.

సాహసాల పేరిట సొమ్ము చేసుకునే టక్కరి తనమూ సాహసమేనా? ఏమో, 1979 లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో నేను రాసిన ఈ సాహసాల కథ చదివే సాహసం చేస్తే మీకే తెలుస్తుంది. చదివేక, ధైర్యం ఉంటే సాహసంతో కామెంటండి.

నా కథ చూడండి:


అక్షరాలను జూమ్ చేసుకోవడానికీ పేజీని మనకు అనువుగా తిప్పుకోవడానికీ పేజీ పైన ఉన్న గుర్తులను పాటించగలరు

12, సెప్టెంబర్ 2015, శనివారం

గుడ్డి రాజుకి నిద్ర పట్టడం లేదు !సంజయుడు రాయబారిగా పాండవుల వద్దకు వెళ్ళాడు. తిరిగి వచ్చాడు. అక్కడి విషయాలు తెలుసు కోవాలని ధృతరాష్ట్రుడికి మహా తొందరగా ఉంది. ఐతే , తిరిగి వచ్చిన సంజయుడు అతనికి ఏమీ అప్పుడు చెప్ప లేదు. బడలికగా ఉందన్నాడు. మరు నాడు ఉదయమే అందరూ సభదీరే వేళ అక్కడ జరిగిన విశేషాలన్నీ చెబుతానని తన నివాసానికి వెళ్ళి పోయాడు.

అంతే !

మరింక కురు మహారాజుకి కంటి మీద కునుకు పట్ట లేదు. అశాంతితో అటూ ఇటూ దొర్లు తున్నాడే కానీ నిద్ర
 వస్తేనా ?
విదురుడిని తన దగ్గరకి పిలిపించు కున్నాడు. నాలుగు మంచి మాటలు చెప్పి తన అశాంతిని దూరం చేయమన్నాడు.

విదురుడు రాజుకి చాలా నీతులు బోధించాడు. అక్కడక్కడా చురకలు కూడా వేసాడు.

బలవంతుఁడు పై నెత్తిన
బలహీనుఁడు ధనము గోలు పడిన యతఁడు మ్రు
చ్చిల వేచు వాఁడు, గామా
కుల చిత్తుఁడు నిద్ర లేక కుందుదు రధిపా !


బలవంతుడు మీద పడిన బలహీనుడూ, డబ్బు పోగొట్టు కొన్న వాడూ, ఎప్పుడు ఎవడి సొమ్ము కాజేదామా అని కాచుకుని కూర్చునే వాడూ, కామం చేత మనస్సు కలత చెందిన వాడూ నిద్ర పట్టక అవస్థ పడతారు సుమీ ! అని
హిత బోధ చేసాడు విదురుడు.

నిద్రకు వెలియై

నే నొంటరినై

నా గది లోపడ చీకటిలో

చీకటి లోపల నాగదిలో ...  అంటాడు శ్రీశ్రీ.

నిద్ర మంచిదే కానీఅతి నిద్ర అనర్ధదాయకం !

జీవితమున సగ భాగం
నిద్దురకే పరి పోవు
మిగిలిన ఆ సగ భాం
చిత్త శుద్ధి లేక పోవు ..
అందుకే, మత్తు వదలరా ! అంటూ హెచ్చరిస్తాడు వో సినీ కవి.

సరే, ఎలాగూ నిద్ర పట్టడం లేదు కనుక తిక్కన భారతం తీసాను. చిన్న పద్యం వొకటి కనిపించింది. పద్యం చిన్నదే కానీ భావం అగాధం.  మీరూ చూద్దురూ ...


 గొప్ప తాత్త్వికార్ధాలతో కూడిన తిక్కన గారి మహా భారతం ఉద్యోగ పర్వం లోని  ఈ  చిన్న పద్యం చూడండి:

ఒకటిఁ గొని, రెంటి నిశ్చలయుక్తిఁ జేర్చి
మూఁటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి
యేనిటిని గెల్చి యాఱింటి నెఱిఁగి యేడు
విడిచి వర్తించు వాఁడు వివేక ధనుడు !

అధికారాన్ని చేపట్టి, మంత్రమూ ఉత్సాహమూ అనే రెండింటినీ నిశ్చలంగా ఉండేలా జత చేయాలి, మిత్రులూ, అమిత్రులూ , తటస్థులూ అనే మూడు వర్గాల వారినీ, సామ, దాన, భేద, దండములు అనే నాలుగు ఉపాయాల చేతా పూర్తిగా వశ పరచు కోవాలి. త్వక్కు ( చర్మం) ,చక్షువు ( కన్ను ) , శ్రోత్రము ( చెవి ), జిహ్వ ( నాలుక), ఘ్రాణం
( వాసన) అనే సంచేంద్రియానూ జయించాలి. సంధి , విగ్రహం, యానం , ఆసనం, ద్వైదీభావాలు(2) అనే ఆరింటినీ తెలుసు కోవాలి. వేట ,జూదం, పానం, స్ర్తీ , వాక్పారుష్యం ( కఠినంగా మాటలాడడం, ) దండపారుష్యం ( హింప చేయడం), అర్ధ దూషణం ( దుబారా చేయడం) అనే సప్త ( 7) వ్యసనాలనూ విడిచి పెట్టి ఎవడయితే ఉంటాడో వాడే వివేకవంతుడు.


స్థూలంగా ఈ పద్యానికి ఇదీ భావం. కానీ పెద్దలు ఈ చిన్న పద్యానికి వేరే తాత్త్విక పరమయిన అర్ధాలు చెబుతారు. వాటిని కూడా చూదామా ?

ఒకటి బుద్ధి. దీనికి వాక్కు , క్రియ, అనే రెండింటినీ నిశ్చలంగా ఉండేలా చేర్చాలి. అంటే ఏది చెబుతాడో అదే చేయాలి.
ఇక, ధర్మార్థ కామాలను మూడింటినీ బ్రహ్మచర్యం, గార్హస్థం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు ఆవ్రమవిధులతో వశం చేసు కోవాలి. కర్మేంద్రియాలు ( వాక్కు, పాణి, పాదం, వాయువు, గుహ్యం ) ఐదింటినీ గెలవాలి. యజన, యాజన, ఆద్యయన, దాన, ప్రతిగ్రహాలు అనే స్మార్త కర్మలను తెలుసుకొని, ఆవరణం ( పంచభూతాలు పృధ్వి, అప్,తేజస్సు, వాయువు, ఆకాశం) బుద్ధి, అహంకారం ఈ మొత్తం ఏటింటినీ విడిచి వర్తించే వాడు వివేకధనుడు.

పెద్దలు చెప్పే మరో తాత్త్వికార్ధం:

ఒకటి - సత్త్వం , రెండు -రజస్తమస్సులూ , మూడు -ధన, దార ( భార్య) పుత్రుల పట్ల మమకారం, నాలుగు - ధ్యానం, ధారణ, యోగం, సమాధి. తక్కినవి మీద చెప్పినవే.

మూల భారతంలో దీని శ్లోకం ఇలా ఉంది:

ఏకయా ద్వౌ వినిశ్చిత్య త్రీం శ్చతుర్భి ర్వశే కురు
పంచ జిత్వా విదాత్వా షట్ సప్త హిత్వా సుఖీ భవ !


ఈ టపా రాస్తున్నప్పుడు వచ్చేడు మా తింగరి బుచ్చిగాడు  ఏఁవిటి రాస్తున్నావని ఆరా తీసాడు.

అంతా చదివి వినిపించేను. నా ఖర్మ కాలి,

 ఏ కొంచెమైనా అర్ధమయిందా అనడిగేను.

భలే వాడివే , అర్ధం కాక పోవడమేం ! గుడ్డి రాజుకి పాపం నిద్ర పట్ట లేదు. అంతే కదా ! అన్నాడు. నా బుర్ర తిరిగి పోయింది.

ఓ నిద్ర మాత్ర వేసుకుంటే పోలా ! అని ముక్తాయించేడు.

ఇలాంటి సందర్భాల లోనే కదా, జీవితం మీద చెప్పలేనంత విరక్తి కలిగేది ?!11, సెప్టెంబర్ 2015, శుక్రవారం

ముఠా కవులు .. లేదా ... కవుల ముఠాలు !స్వాధీనో రసనాంచల: పరిచితా: శబ్ధా: కియంత: క్వచిత్
క్షోణీంద్రో న నియామక: పరషదశ్శాంతా: స్వతంత్రం జగత్
తద్యూనం కవయో వయం వయమితి ప్రస్తావనాహుంకృతిం
స్వచ్ఛందం ప్రతిసద్మ గర్జత వయం మౌనవ్రతావలంబిన:

(సాహిత్య శేఖరం)

నోటికి తలుపుల లేవు. ఏమైనా వాగ వచ్చును. ఏవో కొద్ది మాటల పరిచయం ఉంది.వద్దనే వాళ్ళు లేరు. శాసించే ప్రభువు లేడు. పండిత పరిషత్తులూ మూలన పడ్డాయ్. అంచేత పండితులైన వారు ఎదురు చెప్ప లేక నోరుమూసుకుని ఉండి పోతున్నారు. ఎవరికి వారు స్వేచ్ఛగా ఉండడానికి యిష్ట పడతారు కదా. అందు చేత మీరంతా మేం కవులం ! మేమే కవులం!!
అంటూ, అడ్డూ ఆపూ లేకుండా నోటికి వచ్చినట్టుగా ఇల్లిల్లూ మారు మ్రోగి పోయేలాగ అరుస్తున్నారు. ఇలాంటి గడ్డు పరిస్థితులలో మా వంటి వారు ఇక మౌనవ్రతం అవలంబించడం కన్నా వేరే దారి ఏముంది ?కవి ముఠాలు, లేదా, ముఠా కవులు అన్ని కాలాలలోనూ ఉండేవి / ఉన్నారు కాబోలు. ఈ శ్లోకం చూస్తే అదే అనిపిస్తున్నది. కావు కావుమని కాకులు అరచి ఊదరగొడుతూ ఉంటే, కోకిలలు బిక్కచచ్చిపోయి ఉండి పోక తప్పదేమో.

9, ఆగస్టు 2015, ఆదివారం

నా నరక లోక యాత్ర !నా నరక లోక యాత్ర !

ఓపిక లేని వారు దీనిని దాట వేయ వచ్చును.!

ముందుగానే విన్నవించు కుంటున్నాను. ఇది ఏ వర్గాన్నీ కించ పరచడానికి వ్రాస్తున్నది కాదు. పంచతంత్రంలో ఒక శ్లోకం ఉంది. అందులో పురోహితులూ, సన్యాసులూ తప్పకుండా నరకానికి పోయే అవకాశం గురించిన ప్రస్తావన ఉంది.

చూడండి:

నరకాయ తే మతి శ్చేత్,
పౌరోహిత్యం సమాచర
వర్షం యావత్ కిమన్యేన
మఠచింతాం దినత్రయమ్.

ఈ శ్లోకంలో కచ్చితంగా ఎవరు నరకానికి పోతారో బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు శ్లోక కర్త.

వారెవయ్యా, అంటే,

నీకు నరకానికి పోవాలని కోరిక ఉంటే ఒక యేడాది పాటు పౌరోహిత్యం చెయ్యి !

అంతకాలం ఓపిక లేదనుకుంటే దానికీ ఓ మార్గం ఉంది.

ఒక మూడు రోజులు మఠం గురించి ఆలోచించు. మూడు రోజుల పాటు మఠ ప్రవేశం చేసి చూడు. అంతే, నీకు నరకం తథ్యం !

పౌరోహిత్యం చేసే వాళ్ళూ, సన్యాసులూ తప్పులు చేసే అవకాశం పుష్కలంగా ఉంది కనుక, వారు తప్పకుండా నరకానికి పోవలసిన వారే అని దీని భావం.

నాకున్న ఒకటి రెండు అనుభవాలు ఆలోచిస్తే, కనీసం, నాకు అది నిజమే అనిస్తుంది.
నేను ఉద్యోగ రీత్యా పని చేసే ఒక ఊరిలో ఒక పురోహితుడు ఉదయాన్నే, నాతో పాటు గంగయ్య హొటల్ లో పెసరట్టూ ఉప్మా లు తృప్తిగా తిని, వేడి వేడి కాఫీ కులాసాగా సేవించి, ఆతర్వాత, అవి అరిగే వరకూ వీధరుగుల మీద చీట్ల పేకలో తరించి, ప్రొద్దు తిరిగి, మధ్యాహ్నంఏ మూడింటికో తద్దినం పెట్టడానికి తీరికగా బయలు దేరే వాడు. అంత వరకూ, తద్దినం పెట్ట వలసిన ఇంటి యజమాని, వారి బంధుగణం ఉదయం నుండీ అభోజనంతో ఆకలితో నకనకలాడి పోతూ. నీరసాలు ముంచు కొచ్చి, ఇతని కోసం ఎదురు చూపులు చూస్తూ శోష వచ్చి పడి పోయే స్థితికి చేరు కునే వారు...

ఓ సారి మా మామ గారి ఇంట్లో ఒక భోక్త తీరా భోజనానికి కూర్చున్నాక, తిన లేక తిన లేక నాలుగు ముద్దలు నోట పెట్టుకని భళ్ళున అక్కడే వమనం చేసుకున్నాడుట. కారణం మరేమీ కాదు, డబ్బు కక్కుర్తితో అప్పటికే వేరొక చోట ఆ వ్యక్తి భోక్తగా వెళ్ళి కడుపు నిండా తిని రావడమేనని తెలిసింది.

నేను ఓ కుగ్రామంలో పని చేసే రోజులలో ఒక బ్రాహ్మణ కుటుంబీకులు ఇంట్లో పితృకార్యం చేస్తూ సాయంత్రం ఐదయినా, పిలిచిన భోక్తలు ప్రక్క ఊరి నుండి ఎంతకీ రాక పోవడంతోదిగాలు పడి పోయి, చివరకి పెళ్ళయిన బ్రహ్మచారిగా ఆ ఊళ్ళో ఒంటరిగా ఒక గది తీసుకుని ఉంటున్న నన్ను భోక్తగా రమ్మని బ్రతిమాలేరు. అప్పటికే నేను మధ్యాహ్న భోజనం కానిచ్చి, ఏదో పుస్తకం చదువుతూ ఓ కునుకు తీస్తున్నాను. నా భోజనం అయిపోయింది కదా, నేనెలా పనికి వస్తాను ? అనడిగేను. ఆ కుగ్రామంలో మరొక బ్రాహ్మణ నలుసు లేక పోవడం చేత, పాపమో,పుణ్యమో తమ ఇంటికి వచ్చి భోక్తగా తమ తల్లి గారి ప్రసాదం తిని వెళ్ళమని కన్నీళ్ళతో వేడుకున్నారు. నాకిక తప్పింది కాదు.ఆ రోజు నేను వారింటి పితృకార్యంలో నిష్ఠగా పాల్లొన లేదు. వారి బలవంతం చేతనే కావచ్చు, తిండి తినీసి, వారింటికి భోక్తగా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఆచారం మంట కలపేను. ఆ కారణం చేత నాకు నరకం తప్పదని నేను ఇప్పటికే నిర్ణయానికొచ్చీసేను.

ఇప్పుడు చెప్పండి, నిష్ఠగా, శుచిగా, చిత్త శుద్ధితో చేయాల్సిన పురోహిత కార్యాలు మొక్కుబడిగా, అశ్రద్ధగా,తూతూ మంత్రంగా, పిండి కొద్దీ రొట్టె, యావత్ తైలం, తావద్వాఖ్యానమ్ లాగా , ఇచ్చే డబ్బు కొద్దీ చేయించే వారూ నరకానికి పోతారంటే, పోరూ మరి !

అలాగే, నిత్యానంద స్వాముల వంటి వారు మన వెర్రిభారతంలో వేలూ, లక్షలూనూ. వాళ్ళందరూ నరకానికి కాక పోతే, స్వర్గానికి పోతారా ! ఆలోచించండి.

అందుకే, శ్లోక కర్త అథమపక్షం ఓ ఏడాది పాటు పౌరోహిత్యం చేసిన వారూ, కనీసం ఓ మూడు రోజుల పాటు సన్యాసిగా ఉండే వారు సైతం నరకానికి పోవసిందే అని ఢంకా బజాయించి చెబుతున్నాడు ...

తప్పులు చేసే పురోహితులూ, సన్యాసులే కాదు, తాము స్వీకరించిన వృత్తిని ప్రేమించని వారూ, త్రికరణ శుద్ధిగా మెలగని వారూ,తమ వృత్తిని ద్వేషించే వారూ,వృత్తికి న్యాయం చేయని వారూ,న్యాయ మార్గంలో వృత్తి బాధ్యతలు నిర్వహించని వారూ .... వీళ్ళంతా వెళ్ళేది నరకానికే కదా ?!

సరే, అదలా ఉంచితే, నాకు నరక లోకపు బెర్తు ఖాయం అని తేలి పోయింది.

ఏం చేస్తాం చెప్పండి. అయితే, నాకు తోడుగా అక్కడ నాకంటె ముందుగానో, కాస్తంత అటూ యిటూ గానో, మిత్రుడు భీమ్ పాపాల శర్మ , కవితా కరవాలాలతో చెండాడే కుకవులూ, భార్యలను ఏడిపించుకుని తినే భర్తలూ, భర్తలను కాల్చుకు తినే భార్యలూ, రేగింగు వీరులూ, కల్తీ మందులూ వస్తువులూ విక్రయించే వ్యాపారులూ, అధిక వడ్డీలు గుంజే అధమాధములూ, ప్రజా సేవ పేరిట ప్రజా కంటకులైన నాయకమ్మన్యులూ ( రాజ్యాంతే నరకం ధృవమ్ కదా ) , పసి పిల్లలను గొడ్డుల్లా బాది పైశాచికానందం పొందే టీచర్లూ, క్షుద్ర సాహితీ సమరాంగణ సార్వ భౌములూ, నాలాగా చేతికొచ్చిన బ్లాగులు పెట్టి బాధించే బ్లాగు పిశాచులూ, హత్యలూ, దోపిడీలూ చేసే వాళ్ళూ, రాంగ్ కాల్స్ చేస్తూ విసిగించే ఫోనాసురులూ ... ... మరింక చెప్ప లేను ... ఇలా చాలా మంది వచ్చి చేరుతారనే నిబ్బరంతో నరక లోక యాత్రకు రెడీ అయి పోతున్నాను, మరి ... నరక లోకపు జాగిలమ్ములు మబ్బు చాటున ఖణేళ్ మన్నాయ్ !!

. మనకి స్వర్గమో, నరకమో ఇతమిత్థంగా ఇంకా తేలని స్థితిలో, ఎదుటి వాడికి నరకం ఖాయమని తేలి పోయేక , మనకి ఆనందం వెయ్యదూ?!


* * * * * * * * *

కళ్ళు తెరిచి చూద్దును కదా, నాకు తెలీని వేరే ఏదో లోకంలో ఉన్నాను. అక్కడంతా గలీజుగా ఉంది. నానా కంగాళీగానూ ఉంది. ఆర్తుల హాహాకారాలు మిన్నంటుతున్నాయి. వికటాట్ట హాసాలు కర్ణభేరి బ్రద్దలయ్యే లాగున ప్రతిధ్వనిస్తున్నాయి.సలసల క్రాగే నూనె బాణళుల నుండి వచ్చే ధూమం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొత్తానికి అక్కడ నానా బీభత్సంగానూ ఉంది. (ఐతే, ఒకటి, అదెంత భీకరంగా ఉన్నప్పటికీ హైదరాబాదంత గలీజుగా మాత్రం లేదనిపించడం విషయాంతరం)

కాస్త తమాయించుకుని, ‘‘ నేనిప్పుడెక్కడ ఉన్నాను?‘‘ అనడిగేను.
ప్రక్కనున్న రాక్షసాకారి వికటంగా నవ్వి, ’’ నరకంలో నయ్యా.‘‘ అని బదులిచ్చేడు.

’’ నరకం లోనా ! నన్నిక్కడి కెందుకు తెచ్చేరు? నేనేం పాపం చేసానని?‘‘ అనడిగేను గాభరాగా.

నాప్రశ్నకి వాడు జవాబు చెప్పే లోగానే, మరో ప్రక్క నుండి,’’ నరకానికి రాకేం చేస్తావురా,త్రాష్ఠుడా ! ‘‘ అనే మాటలు వినిపించేయి.

ఉలిక్కిపడి, అటు చూసేను. అక్కడ నా కథ లోని ప్రథాన పాత్రలలో ఒకడైన సర్వేశ్వర శాస్త్రులు కనిపించేడు. మనిషి కొంచె వడిలేడు. పూర్వపు నిగారింపు లేదు. దబ్బ పండులా ఎలా ఉండే వాడు ! పప్పూ. ఆవు నెయ్యీ, గోంగూర, ఆవకాయ పచ్చడీ, కంది గుండా, నువ్వుల నూనె, అప్పడాలూ, ఒడియాలూ, నాలుగు రకాల కూరలూ, పచ్చళ్ళూ, గారెలూ, నూలు పచ్చడీ, నువ్వులుండలూ, ముక్కల పులుసూ ....ఇవేవీ భోజనంలో అమరడం లేదు కాబోలు. కొంచెం జాలేసింది.

‘‘ మహానుభావా! మీరేమిటి ఇక్కడ ? క్రమాంతస్వాధ్యాయులూ, జటా,ఘనా,పనస తిరగేసీ మరగేసీ కూడా ఒప్ప చెప్పగల సమర్ధులూ,నిప్పును నీళ్ళతో కడిగే వంశీయులూ, ఇక్కడకి దయ చేసారేం?’’ అనడిగేను.

శాస్త్రుల వారి ముఖం మరింత దీనంగా తయారయింది.‘‘ నుదుటి రాత నాయనా ! నుదుటి రాత. ఆ వెంకన్న పంతులుగాడూ, వాడి మనుషులూ లేరూ, వాళ్ళ వల్ల వొచ్చింది నాకీ అరిష్టం. వాడు పెట్టిన పేచీయే కదా, నాచేత పాపం చేయించింది? అందుకే నన్నిక్కడికి లాక్కొచ్చేరు ...’’

‘‘ మరి ఆయనో ? ... ఆయనా ఇక్కడే ఉన్నారా? ...’’ అడిగేను, సంశయంగా.

‘‘ వాడి శ్రాద్ధం, ఉండకేం చేస్తాడూ ! అదిగో, ఆమూల అఘోరిస్తున్నాడు , మాష చక్రాలు (గారెలు) ఇక్కడ దొరక్క విలవిలలాడి పోతున్నాడు.’’

‘‘ఇంకా ఎవరెవరొచ్చేరో ...?’’

‘‘అంతా వచ్చేం నాయనా. బుచ్చి వెంకూ, చయనులూ, సొట్ట జగ్గడూ. బుచ్చబ్బాయీ, సూరిపంతులూ .. ఒహరనేమిటి? అంతా ఇక్కడే ఉన్నాం.’’

‘‘ గౌరీపతి రాలేదో? ...’’

‘‘ నీ పిండం కాకులకు పెట్టా. ఇలాంటి సందేహాలొస్తున్నాయేఁవిటయ్యా, నీకూ ..... గౌరీపతి గాడు రాకేం? మహా రాజు మొగుడిలా వచ్చేడు ... అడిగో ఆ ప్రక్కన జంద్యాలు వొడుకుతూ కూచున్నాడు, చూడు ...’’ అటు చూసేను. నిజఁవే. ఇంద్రుడూ వగైరాలు వెండివో, బంగారానివో జంద్యాలు వేసుకుంటారు కానీ , నూలు జంద్యాలు వేసుకోరు కదా? ఈ గౌరీపతి ఇక్కడ కూడా తాళం బిళ్ళ త్రిప్పుతూ నూలు జంద్యాలు వొడకడం ఎందుకో? నంగిరితనం. జడ్డితనం కాక పోతే, అనిపించింది.

నేనింకా ఏదో అడగబోయే లోగా శాస్త్రి గారే ఖంగున అడిగేరు: ‘‘ ఇక్కడి కొచ్చేటప్పుడు, చేతులూపుకుంటూ రాక పోతే, కాసిన్ని మాష చక్రాలు పట్టుకుని రాక పోయూఁవూ? నీ మొహం యీడ్చ. నోరు ఝలాయించి పోతోంది. ...’’ అన్నారు బాధగా.

‘‘ నాకో బీడీ కట్టయినా తెచ్చి ఉండాల్సింది ..’’ మరో ప్రక్క నుండి వెంకన్న పంతులు గొంతు పీలగా వినిపించింది.

మాట మార్చడానికి, ‘‘ అయితే, అంతా ఇక్కడకే చేరారన్న మాట ! ...’’ అన్నాను.

‘‘అఘోరిచావులే. యేళ్ళు ఎత్తికెట్టి కాల్చ. నీ పుట్టువు బూజు కాను. మేఁవే కాదు, అదిగో ఆ ప్రక్కన చూడు, మీ గురజాడా, వాడెవడూ? తల చెడిన ముండలకి మళ్ళీ పెళ్ళిళ్ళని , అదనీ ఇదనీ మన ఆచారాలని మంట కలిపేడు, వాడు, వీరేశలింగం కాబోలు వాడి పేరు ...వాడూ చాలా కాలమై ఇక్కడే ఉన్నాడు. వాళ్ళే అనేఁవిటి ? మీ కార్లమాక్స్ గాడూ, మావో గాడూ , వాళ్ళంతా ఆ సలసల మరిగే నూనెలో ఎలా వేగుతున్నారో చూడు !’’ అన్నారు అంతా ఉక్రోషంగా ముక్త కంఠంతో.

గాభరాగా అటు చూసేను. అక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళెవరూ లేరు. వీరప్పన్ లాంటి వాళ్ళెవరో కనిపిస్తున్నారు.

నన్నిక్కడికి తీసుకొచ్చిన యమ దూతలలో ఒకడు నా ప్రక్కలో పొడిచి, గుసగుసగా అన్నాడు: ‘‘ వాళ్ళెవరూ ఇక్కడ లేరు. అంతా హాయిగా స్వర్గంలో ఉన్నారు. ఈ ముసిలాయనకి తద్దినం బోయినాలు లేక, మతి భ్రమించి అలా మాట్లాడుతున్నాడు ....’’ అని.

రెండో భటుడు దానికి కొనసాగింపుగా చెప్పేడు: ’’ శాస్త్రి గారి భార్యా, రమణా, పరమేశూ కూడా అక్కడే ఉన్నారు ... నువ్వీయన మాటలు పట్టించు కోకు ... పద,నీ ఎంట్రీ ఇక్కడ రికార్డు చేయించాలి ...’’ అని.

‘‘మరి, మా తెల్లావో?’’ అడిగేను ఆత్రతగా.

ఈ సారి ఇద్దరు భటులూ ఏక కంఠంతో చెప్పారు: ‘‘ దానికేం ! అది కూడా అక్కడే నిక్షేపంగా ఉంది. ఇప్పుడు అసలక్కడ స్వర్గ లోకపు కేంటిన్ లో ఆ తల్లి క్షీరంతోనే కదా, అక్కడ ఇంద్రాదులకు కాఫీలూ గట్రా కాచేది !’’

నేను హమ్మయ్య ! అని ఊపిరి పీల్చుకున్నాను. ఇంతలో అక్కడికి వచ్చిన పురోహిత వర్గమంతా అక్కసు వెళ్ళ గ్రక్కుతూ గబగబా తలో మాటా అనడం మొదలెట్టేరు.

‘‘ మా మీద కథ రాస్తాడూ? అప్రాచ్యపు వెధవ. సలసలా మరిగే నూనె బాణలిలో పడెయ్యండి.‘‘

‘‘ వొళ్ళంతా శూలాలు గుచ్చండి’’

‘‘ కక్కకట్టుకి కొరత వెయ్యండి, తిక్క కుదురుతుంది’’

‘‘ వైతరణి నీళ్ళు బిందెల కొద్దీ త్రాగించండి.’’

‘‘ తెలుగు టీవీ ఛానెళ్ళు రాత్రీ పగలూ విడవకుండా చూపించండి.త్రాష్ఠుడు, కళ్ళు పేలిపోయి ఛస్తాడు.’’

‘‘ దిన పత్రికలలో నానా చెత్తా ఆచివరి నుండి, ఈ చివరి వరకూ అక్షరం విడవకుండా చదివించండి.’’

‘‘ కథా మంజరి బ్లాగు టపాలన్నీ కంఠోపాఠం చెయ్యమనండి.’’

నాకు నరక లోకంలో అమలు కావలసిన శిక్షలను వాళ్ళంతా అలా ఖరారు చేస్తూ ఉంటే నాకు వొళ్ళు కంపరమెత్తి పోయింది. వజవజ వణికి పోయేను.

యమభటులిద్దరూ నా భుజం మీద చరిచి, నాకు ధైర్యం చెబుతూ వాళ్ళతో ఇలా అన్నారు.’’ అబ్బే, అంత సీన్ లేదు లెండి. వీరిని ఆ కథ రాసినందుకు కాక, వేరే కారణం చేత ఇక్కడికి తీసుకుని వచ్చేం. ఇక్కడ అట్టే సేపు ఉంచం. ఇక్కడి రికార్డులలో వీరి పేరూ వివరాలూ మరో తూరి నమోదు చేసి, ఒక పేము బెత్తం దెబ్బ శిక్షతో సరి పుచ్చి, నేరుగా స్వర్గానికి బదిలీ చేస్తాం. అక్కడ కొలువు తీరి ఉన్న గురజాడ, చా.సో, విశ్వనాథ సత్యనారాయణ, దేవుల పల్లి , నండూరి, కవిత్రయం వారూ , పోతన ... ఓ ... ఇలా కోట్ల సంఖ్యలో ఉన్న మహానుభావులను చూసి తరిస్తూ, వారిని సేవించుకుంటూ , వారి దీవెనలు అందుకుంటూ అక్కడే ఉంటారు .......’’

‘‘ మరి మేఁవో ?!’’ ఏడుపు గొంతులతో ఒకేసారి అరిచినట్టుగా అన్నారంతా.

‘‘ మీరిక్కడే ఉండాలి. మీరిందాక చెప్పిన శిక్షలతో పాటు, అలాంటివే కొన్ని వేల వేల శిక్షలు మీకింకా అమలు పరచ వలసి ఉంది. వాటిలో మొదటి శిక్ష కథా మంజరి బ్లాగు టపాలన్నీ అక్షరం పొ్ల్లు పోకుండా కంఠోపాఠం చేసి గడగడా వొప్పగించడం!‘‘

‘‘ ఆఁ!!!‘‘ అంటూ, అంతా నోళ్ళు వెళ్ళ బెట్టీసేరు.

* * * * * * * * * *


గమనిక: :  ఇందులోనివన్నీ నా కథలోని పాత్రలు ! ఆ కథ రాసినందుకు కినిసిన కొందరు   అప్పట్లో నన్ను  ‘‘ నరకానికి పోతావ్  రా! నా కొడకా ! ‘‘ అని ప్రేమగా శపించేరు. అంచేత నా నరక లోక యాత్ర ఖాయమై పోయింది.

మరిన్నీ, ఇంత లేసి టపాలు పెట్టి విసిగించే వ్యక్తికి నరక లోకం లో తప్ప స్వర్గంలో బెర్తు దొరుకుతుందా చెప్పండి ?!

25, జులై 2015, శనివారం

మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోసె ! ఆహా ఏమి రుచి !

కాకినాడ కాజా. తాపేశ్వరం పూత రేకులూ, బందరు తొక్కుడు లడ్డూ లాగా కొన్ని అలా ప్రసిద్ధమౌతూ ఉంటాయి. ఆ ఊళ్ళ పేర్లు చెవిని పడగానే ముందుగా అక్కడ దొరికే ఆయా వంటకాల రుచులు మదిలో మెదిలి నోరూరి పోతూ ఉంటుంది.

పని మీదో, పనీపాటూ లేకనో, చుట్ట పక్కాలు లేని ఊరెళ్ళడనికి బయలు దేరే ముందు వెళ్ళ బోయే ఊర్లో వసతి సౌకర్యం, భోజనహొటళ్ళ గురించి ఆరా తీయక పోతే ఆరి పోతాం. ఆఁ ... ఏఁవుందిలే, ఒక్క రోజే కదా అని బుద్ధి గడ్డి తిని అక్కడ దొరికే నానా గడ్డీ తింటే ఇంటి కొచ్చేక పడకేయడం ఖాయం.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మీకివాళ మా విజీనారం దేవీ విలాస్ నెయ్యి దోశ ఘుమ ఘుమల గురించి పరిచయం చెయ్యడానికి. ఇప్పటి మాట కాదు లెండి. 60 – 70 ల నాటి ముచ్చట. ఇప్పుడా హోటలూ అక్కడ లేదు. ఆ కమ్మని నెయ్యి వాసనా లేదు. తలచుకుని లొట్టలు వేయడం కన్నా ఇప్పుడు మనం చెయ్యగలిగిందేమీ లేదు.

చాలా పాత కాలపు ముచ్చట అని చెప్పాను కదా ? అప్పట్లో మా విజీనారం లో ఒక్కో కాఫీ హొటలూ ఒక్కో టిఫినుకి ప్రసిద్ధిగా ఉండేది.

అందులో అగ్రపీఠం దేవీ విలాస్ నెయ్యి దోశెది. ఈ దేవీ విలాస్ కస్పా బజారు మధ్యలో ఉండేది.నెయ్యి దోశె ఆరోజుల్లోనే నలభై పైసలుండేది. వాహ్ ! ఏమి రుచి అనుకున్నారూ ? కమ్మని నెయ్యి వాసనతో ఘుమఘుమ లాడి పోయేది. దానికి తోడు చిక్కని కొబ్బరి చట్నీ. దేవీ విలాస్ నెయ్యి దోశె తినడం కోసం విజీనారం ప్రజలే కాకుండా ప్రక్క జిల్లాల నుండి కూడా జనాలు ఎగబడి వచ్చే వారంటే నమ్మాలి.అక్కడ నెయ్యి దోశె తిని, చెయ్యి రుద్దుకుని కడుక్కున్నా, చాలా సేపటి వరకూ ఆ కమ్మని నెయ్యి వాసన పోయేది కాదు. ఆ మజా అనుభవించ వలసినదే తప్ప మాటల్లో చెప్పేది కాదు. దేవీ విలాస్ లో నెయ్య దోశెతో పాటు మిగతా టిఫిన్లూ అంతే రుచికరంగా ఉండేవి. దానికి తోడు క్యాష్ కౌంటరు దగ్గర దేవీ విలాస్ వారు ప్రత్యేకంగా తయారు చేసి అమ్మే కాఫీ పొడి పొట్లాల వాసన ఘుమ ఘుమలాడి పోతూ ఉండేది. దేవీ విలాస్ కొబ్బరి చట్నీ రుచి చెప్ప నలవి కాదు.ముద్ద చట్నీయే తప్ప చట్నీ పలచన చేసి వేసే వాళ్ళు కాదు. అక్కడ నెయ్యి దోశె, కొబ్బరి చట్నీ కోసం విజీనారం వర్తక ప్రముఖులూ, న్యాయవాదులూ, గుమాస్తాలూ.కాలేజీ పిల్లూ. పంతుళ్ళూ క్యూ కట్టే వారు. పెద్ద ఆఫీసర్లూ. వాళ్ళూ కోరి మరీ నెయ్యి దోశె పార్శల్ తెప్పించుకు తినే వారు.

దేవీ విలాస్ తో పాటూ ఆ రోజుల్లో మా విజీనారం లో మరి కొన్ని మంచి కాఫీ హొటళ్ళు ఉండేవి. ఒకటీ అరా కొన్ని ఇప్పటికీ ఉన్నాయి. వాటి గురించి కూడా చెబుతాను.

కస్పా జారు లోనే కోట జంక్షన్ దగ్గర సుబ్రహ్మణ్య విలాస్ ఉండేది.ఆ ప్రదేశాన్ని ప్యారిస్ కార్నర్ అని కవులూ, రచయితలూ, సాహిత్యాభిమానులూ పిలుచు కునే వారు. సుబ్రహ్మణ్య విలాస్ లో కాఫీ పుచ్చుకుని, ఆ హొటల్ ముందు గుమి గూడి వాళ్ళంతా కవిత్వం గురించీ, కథల గురించీ కబుర్లు చెప్పు కునే వారు. ముఖ్యంగా సాయంత్రాల వేళ సుబ్రహ్మణ్య విలాస్ కిటకిటలాడి పోయేది. పతంజలి, దాట్ల నారాయణ మూర్తి రాజూ, కొడవంటి కాశీపతిరావూ, పంతుల జోగారావూ, సీరపాణీ, జగన్నాథ శర్మా నిష్ఠల వెంకటరావూ, అప్పుడప్పుడు చా.సో గారూ ... .... ఇలా అక్కడ పోగయ్యే వారి జాబితా పెద్దదే లెండి.

అయిందా ? సుబ్రహ్మణ్య విలాస్ దాటి కొంచెం ముందుకు మూడు లాంతర్ల వేపు వెళదాం. అక్కడ కోపరేటివ్ సెంట్రల్ బ్యంకు ప్రక్కన కుడి వేపు ఎత్తరుగుల  హొటల్   నేషనల్  కేఫ్ ఉండేది. . ఇది పేద విద్యార్ధులయిన సంస్కృత కళాశాల , సంగీత కళాశాల విద్యార్ధుల పాలిట కల్ప తరువు లాంటిదని చెప్పాలి. రుచికరమయిన టిఫిన్ లు

చాలా చవక ధరల్లో దొరికేవి. పావలాకి  నాలుగు  ఇడ్లీలు పెట్టే వారు.

అది దాటి వెళ్ళేక, అప్పటి హిమాంశు బుక్ డిపో దాటి, కస్పా స్కూలు సందు మొదట్లో శ్రీకృష్ణా హొటల్ డేది. ఇప్పుడది జిడ్డు వారి వీధి మొదట్లోకి వచ్చింది. అక్కడ ఇడ్లీ సాంబార్ స్పెషల్. ఏమి రుచో ! సాంబర్ బకెట్ టేబిలు మీదే ఉంచే వారు కనుక,  సాంబార్ ప్రియుడు మా శాష్త్రి లాంటి వాళ్ళు ఒక్క ప్టేటు ఇడ్లీకి కావలసినంత సాంబార్ జుర్రుకునే వాడు.


రాజా బజార్లో హొటల్ మిలాప్ చపాతీకి, కమ్మని టీకి ప్రసిద్ధి. అర్ధ రాత్రయినా కమ్మని చాయ్ దొరికేది. గంటస్తంభం ఎదురుగా హొటల్ అజంతా  పూరీ కూరాకి పేరు పొందింది. ఇవి కాక చిన్న వీధిలో వసంత విహార్. రైల్వే స్టేషను దగ్గర రామ కృష్ణా హొటల్ లో మంచి టిఫిన్లే దొరికేవి.చివరిగా అయ్య కోనేరు దక్షిణ గట్టు మీది వి.ఎస్.ఎన్. విలాస్ గురించి చెప్పక పోతే

అసలేమీ చెప్పనట్టే అవుతుంది. ఈ కాఫీ హొటలు చాలా చిన్నది. అయ్య కోనేరు గట్టున మొన్న మొన్నటి వరకూ ఉండేది. ప్రశస్తమయిన టిఫిన్లు దొరికేవి. అయ్య కోనేరు నాలుగు గట్టు వీధుల్లోనూ ఉండే వారంతా, ముఖ్యంగా, పురోహితులూ, బ్రాహ్మణ కుటుంబాల వారూ. మేష్టర్లూ తెల్లవారుతూనే ఇక్కడి కొచ్చి ఇడ్లీలు ఇష్టంగా తినేవారు. చాలా చవక. ఇక్కడి సందడి భలే ఉండేది. ఇంటి భోగట్టాల నుండి ఇంటర్నేషనల్ విషయాల వరకూ తెగ ముచ్చట్లు చెప్పు కునే వారు. మరీ ముఖ్యంగా పండుగ రోజుల్లో ఇళ్ళకొచ్చిన అల్లళ్ళూ, బంధువులూ బిలిబిలా ఇక్కడికి తప్పకుండా వచ్చే వారు. పిల్లలనీ, పెళ్ళాలనీ వెంట బెట్టుకుని !

చాలా వరకూ ప్రభుత్వ జీ.వోలూ నిర్ణయాలూ అనధికారికంగానూ, ముదస్తుగానూ ఇక్కడే తయారయి పోతూ ఉండేవి. రాజకీయాలూ, వేతన సవరణలూ, వగైరాల గురించి తెగ మాటలు దొర్లేవి. ఒక రకంగా చెప్పాలంటే, ఈ చిన్ని కాఫీ హొటలు ఆ రోజుల్లో తెరచిన వార్తా పత్రికలా ఉండేది. వాగుతున్న రేడియోలా ఉండేది.
ఇవండీ ,,, ,,, మా విజీనారం కాఫీ హొటళ్ళ ముచ్చట్లు ! ఎంత సేపూ టిఫిన్ హొటళ్ళ గురించే చెప్పావు, విజీనారంలో అప్పట్లో మంచి భోజన హొటల్ ఏదీ ఉండేది కాదా ? అనే సందేహం మీకు కలగొచ్చు.

ఉండే ఉంటాయి. కమ్మని భోజనం పెట్టే  హొటళ్ళు. నాకు తెలియదు. ఎందుకంటే , నేను ఆరొజుల్లో మహరాజుల వితరణ ఫలితంగా వెలసిన శ్రీ సింహాచల వరాహ నరసింహ విద్యార్ధి ఉచిత అన్నసత్రవు అన్న ప్రసాదాన్ని తిన్న వాడిని. ఎప్పుడూ హోటల్ భోజనం అక్కర లేక పోయింది. ఆ భోజన సత్రం విశేషాలు ఇక్కడ  నొక్కి చదవొచ్చు.

శలవ్.

23, జులై 2015, గురువారం

ప్రియురాలు ఎంత కఠినం !ప్రియురాలి సొగసు చూడ తరమా ? అపురూప లావణ్యవతి. ముగ్ధ మోహన రూపం. ఒప్పుల కుప్ప. ఒయ్యారి భామ.

లోకోత్తర సౌందర్యం. బాపూ బొమ్మ....

ప్రియుడు ప్రియురాలి సౌందర్యం చూసి పరవశించి పోయాడు. ‘నిన్ను చూడకుండాఒక్క క్షణం నేనుండ లేను ’ అనడాలూ, ‘నువ్వు నాకు లభించడం నా అదృష్టం’ అనడాలూ, ‘ దేవ కన్యలు కూడా నీ కాలి గోటికి సరిపోరు ’ అని పొగడడాలూ, ‘అచ్చం బాపూ బొమ్మలా ఉన్నావు సుమా !’’ అని మురిసిపోవడాలూ, సినిమాలూ, షికార్లూ, పార్కులూ, షాపింగులూ,రెండు స్గ్రాలతో ఒకే కొబ్బరి బొండమో, కూల్ డ్రింకో తాగడాలూ ... కను రెప్పలు బరువుగా వాలి పోవడాలూ, ఛాతీలు గర్వంతో పెరిగి పోవడాలూ , కలల విహారాలు చెయ్యడాలూ, బేంకు బేలన్సు తరిగి పోవడాలూ ...

అన్నీ అయ్యేక ప్రియుడుకి ప్రియురాలి అసలు స్వరూపం తెలిసి వచ్చింది. ఇలా వాపోతున్నాడు:

ఈ చాటు పద్యం చూడండి:

పల్లవము బూని సకియ మేనెల్ల జేసి
సద్మగర్భుడు లాదీసి వా గుడిచ్చి
మూ విసర్జించి యప్పుడప్పూవు బోడి
డెంద మొనరించె సందేహమందనేల ?

ఆ బ్రహ్మ దేవుడు ఈమె శరీరాన్ని లేత చిగురాకులతో తయారు చేసాడు. అందుకే అంత మృదుత్వం ! అంత సౌకుమార్యం !

అంత వరకూ బాగుంది. కానీ అక్కడే పాడు బ్రహ్మ దేవుడు పెద్ద కిరికిరీ చేసాడు ...

అదేమంటే ...

పల్లవము అనే పదంలో ‘‘ లా ’’ తీసేసాడు. దానితో ‘‘ ల్ల’’ అనే అక్షరం ఎగిరి పోయింది.

తర్వాత వా గుడిచ్చాడుట ! ‘‘ వ’’ కి గుడి ఇస్తే ‘‘ వి ’’ అయింది !

అక్కడితో ఊరుకోకుండా ‘‘ ము’’ అనే అక్షరాన్ని విడిచి పెట్టాడుట !

సరే, మరి ఇప్పుడు ఇన్ని తీసి వేతలూ, కలపడాలూ, జరిగేక, ‘‘ పల్లవము ’’ అనే పదంలో మిగిలినదేమిటీ ?!

‘‘ పవి’’ అనే పదం మిగిలింది ! ‘‘ పవి ’’అంటే ఇంద్రుని వజ్రాయుధం !

ప్రియురాలి  మనసు అంత కఠినం అన్నమాట !19, జులై 2015, ఆదివారం

ఈ కోతుల రాజ్యంలో కోతి మూకలను అదుపులో పెట్ట గలిగే కోదండ రాముడు లేడా !

కామెడీ ఛానెల్ పెట్టరా బాబూ ! అంటేమా కోనేటి రావు ఎప్పుడూ ఏదో న్యూస్ ఛానెల్ నే పెడతాడు.
ఇదేఁవిటిరా నాయనా అంటేచూడవోయ్బోలెడంత కామెడీ దొరుకుతుంది. పొట్ట చెక్కలై ఛస్తావ్ ! అంటాడు.
సరే చూదామనిచూడడం మొదలెట్టేను. క్రమేపీ కామెడీ కోసం ఆ ఛానెళ్ళు చూడడానికి ఎడిక్ట్ అయి పోయాను.
కామెడీ కాక పోతేమరేమిటి చెప్పండి మన నాయకమ్మన్యుల నటనా విలాసాలు. ఆంగిక వాచిక విన్యాసాలూఅభినయ విశేషాలూసంభాషణా చాతుర్యాలూ చూస్తూ ఉంటేమా కోనేటి రావు చెప్పింది నిజమే అనిపిస్తుంది.
వీధి కొళాయి దగ్గర తగవులు కూడా వారి వాదోపవాదాల దగ్గర దిగదుడుపే అనిపిస్తుంది.
ఏదో అంటాడు. అనలేదంటాడు. తిడతాడు. తిట్ట లేదంటాడు. మీరు నా మాటల్లో అంతరార్ధం అసలే అర్ధం చేసుకో లేదు పొమ్మని దబాయిస్తాడు. కాదంటే కోపంతో బుసలు కొడతాడు. అవినీతి కోట్లలో జరిగిందని అలిసి పోయే వరకూ అరుస్తాడు. ఆధారాలడిగితేసమయం వచ్చిప్పుడు బయట పెడతానంటాడు ( ఆ దిక్కు మాలిన సమయం ఎప్పుడు వచ్చి ఛస్తుందో విధాతకి సైతం తెలియదు) పెజా సేవ అంటూ శోష వచ్చే వరకూ గీ పెడతాడు. కుర్చీలాటలో తలముకలవుతాడు. అబద్ధాలను అవలీలగా కళాత్మకంగా వినిపించడంలో దిట్టలు. అర చేతిలోవైకుంఠాలు వారి మేని ఫెస్టోలు.
టీవీల్లో చర్చా వేదికలు కదన రంగాలను తల పోస్తూ ఉంటాయి. పార్టీ కార్య క్రమాల్లో సైతం పిశాచ సమవాకారాలు వినిపిస్తూ ఉంటాయి. బాహా బాహీ, కచ్చా కచ్చీ, దండా దండీ. అంతా శిఖ పట్ల గోత్రాలు.
సాయ్ లెన్స్ ! అని పంతులు అరిస్తే బడి పిల్లలయినా అల్లరి మానేస్తారేమో కానీవీళ్ళు మాత్రం అరచు కోవడాలు తగ్గించరు. ఎవరేం అంటున్నారో తెలియక జుట్టు పీక్కోవాలి మనం. అది మన ప్రారబ్ధ ఖర్మ.
ఒక సారి రాజకీయ పాప పంకిలంలోకి దిగేకప్రతి ఛోటా నాయకమ్మన్యుడూ తాను దైవాంశ సంభూతుడననుకుంటాడు. సకల సుగుణ శోభిత పురుషోత్తముడ ననుకుంటాడు. సమస్త శక్తులూ సంక్రమించాయనుకుంటాడు.వాడి నడకనడతమాట తీరుప్రవర్తన అన్నీ అనూహ్యంగా మారి పోతాయ్.
ఎక్కడికి పోతున్నాంమనం !
ఎక్క వలసిన ఎవరెస్టు శిఖరాల పైకా ?
దిక్కు మాలిన పాపాల పాతాల కుహరాల లోకా ?
(సి.నా.రె)
అని విస్తు పోతాం. దశాబ్దాలుగా అలవాటు పడి పోయాం. ధరలు పెరిగి పోతున్నాయని గగ్గోలు పెడతాం. నల్లాలో పది నిమిషాల పాటు నీళ్ళొచ్చాయని సంబర పడి పోతాం. కలల్ని జోకొడుతూ కమ్మగా నిద్ర పోతాం. నిద్ర మత్తు లోనే జోగుతూ బ్యాలెట్ బాక్స్ ల వద్దకు వెళతాం. మనం ఓటు వేసి గెలిపించు కున్న మకిలి వాసననే ఆఘ్రాణిస్తూ పరవశించి పోతాం.
అనంత విషాదమే జీవితానుభవం అనుకుంటాం. కారణాలు వెతకం. ఈ భగ్న జీవిత కుటీరాలను ఎలా మరమ్మతులు చేసు కోవాలో ఆలోచించం. గొంగళీ పురుగుల్లాగా ముడుచుకుని పడుకుంటాం. మరి లేవం. లేవడానికి ఇష్ట పడం. అంత కన్నా, లేవడానికి భయ పడతాం అనడం సమంజస మేమో ?
నాయకమ్మన్యులు ఇంత అహంకార పూరితులు కావడం ఎందుకు జరుగుతోందో ఆలోచిస్తూ ఉంటేఈ క్రింది శ్లోకాలు గుర్తుకు వచ్చేయి.
చూడండి:
యౌవనం ధన సంపత్తి: ప్రభుత్వ మవివేకితా
ఏకైక మస్యనర్ధాయ కిము యత్ర చతుష్టయమ్ ?
యౌవనం, ధన మదంఅధికారంతెలివి తక్కువ తనం ఇవన్నీ వేటి కవే ఒక్కొక్కటీ అనర్ధదాయకాలు. మరిఒకే చోట ఈ నాలుగూ కూడితేచెప్ప వలసిన దేముంది ?
మరో శ్లోకం చూడండి:
కపిరపి చ కాపిశాయన మద మత్తో వృశ్చికేన సందష్ట:
అపిచ పిశాచ గ్రస్త: కిం బ్రూమో వైకృతం తస్య.
అసలే కోతి ! అది కల్లు త్రాగిందిట. దాని మీద తేలు కుట్టిందిట. ఆ పైన పిశాచం పట్టిందిట ! ఇక చూడాలిదాని
చేష్టలు ! అంటున్నాడు శ్లోక కర్త.
ఈ కోతుల రాజ్యంలో కోతి మూకను అదుపులో పెట్ట గలిగే కోదండ రాముడే లేడా ?

16, జూన్ 2015, మంగళవారం

కుర్చీల కథ !


కప్పల కథా, చెప్పుల కథా రాయగా లేనిది కుర్చీల కథ రాస్తేనేం ?

అందుకే ఇప్పుడీ కుర్చీల కథ రాయడం జరుగుతోంది ... అవధరించండి ...

పెద్దలు కురిచీ అనే పదం దేశ్య విశేష్యమని చెబుతారు. కూర్చోడానికి వీలుగా ఉండే ఎత్తయిన పీఠమని నైఘంటుకార్ధం. కుర్చీ అని దీనికి రూపాంతరం కూడా ఉంది. అసలు కంటే కొసరు ముద్దనీ, కురిచీ అనే పదం కంటే కుర్చీ అనేదే బాగా వాడుకలోకి వచ్చింది.సరే, ఏదయితేనేం, డబ్బూ దస్కం, నీతి నియమాలూ, మనుషుల నడుమ ప్రేమాభిమానాలూ, ... ఇలా ఏవి లేక పోయినా, కనీసం కూర్చోడానికి వో కుర్చీ అంటూ లేని కొంప ఎక్కడా ఉంటుందనుకోను.

కుర్చీ మర్యాదకి చిహ్నం. ఆతిథ్యానికి ఆనవాలు. స్వాగత వచనానికి మారు పేరు. కాసేపు సేద దీరడానికి అనువైన ఉపకరణం. విశ్రమించడమే కాదు, కాలు మీద కాలు వేసుకుని కాస్త దర్పం ఒలకబోయడానికి కూడా తగినది కుర్చీయే కదా !

చెక్క బల్ల, పీట, స్టూలు మొదలయినవి కూడా కూర్చునేసాధనాలే. ఇలాంటివన్నీ కుర్చీలకి తమ్ముళ్ళు అనొచ్చు. చిన్న చిన్న కాకా హొటళ్ళలో కూర్చోడానికి కుర్చీలకు బదులు బల్లలే వేస్తారు. పోతే, సోఫాలూ అవీ మామూలు కుర్చీలకి పెద్దన్నలు. మహా రాజా కుర్చీలయితే మరీనూ, అవి కుర్చీల కుల పెద్దలు.

‘‘ కూర్చుండ మా యింట కురిచీలు లేవు ,,,’’ అంటారు కరుణ శ్రీ. మరీ చోద్యం కాక పోతే కనీసం వో పాత కాలపు ఇనప కుర్చీ అయినా ఉండి ఉండదా ?

వో సంగతి గర్తుకొచ్చింది. చెబుతా వినండి. కరుణశ్రీ గారు మా విజీనారం సంస్కృత కాలేజీకి వచ్చి నప్పటి సంగతి. వారు మాట్లాడుతూ వో సంగతి చెప్పారు. కొంత మంది కాలేజీ అమ్మాయిలు ఓ సారి వారింటికి వచ్చేరుట. అందులో వో గడుగ్గాయి కవి గారితో ‘‘ ఏఁవండీ ... మీ ఇంట్లో ఇన్ని కుర్చీ లున్నాయి కదా ... మరి

‘ కూర్చండ మా ఇంట కురిచీలు లేవు ! ’ అని రాసేరేఁవిటండీ అబద్ధం కాదూ ? ’’ అని అడిగిందిట. కవిగారు వెంటనే ‘‘ అమ్మాయీ, అది కవిత్వం. కుర్చీలు లేవంటే లేవని కాదు దానర్ధం. ఆ స్వామి కూచోడానికి తగిన చోటులు కురిచీలు కావు... అందుకే నా హృదయాంకమే సిద్ధ పరచ నుంటి అని చెప్పారుట.ఈ విరణ ఆ అమ్మాయికి  ఏమర్ధ మయిందో కానీ ‘‘సరే లెండి ఇంకెప్పుడూ అబద్ధాలు రాయకండి’’ అందిట. అంతే సభలో నవ్వులే నవ్వులు ! చప్పట్లే చప్పట్లు ! ...‘‘ కుర్చీలు విరిగి పోతే కూర్చోడం మాన నట్లు ...’’ అంటూ శ్రీ .శ్రీ  వో గేయంలో  కుర్చీల  ప్రస్తావన తెచ్చాడు. అగ్గి పుల్లనీ. సబ్బు బిళ్ళనీ వదలని కవి కుర్చీల మాట ఎత్తాడంటే అబ్బుర మేముంది లెండి ?

మీకు తెలిసిన పద్యమే ...

కనకపు సింహాసనమున
శునకము కూర్చుండ బెట్టి శుభ లగ్నమునన్
ఒనరగ పట్టము గట్టిన
వెనుకటి గుణ మేల మాను ? వినరా సుమతీ !

కుక్కని  బంగారు గద్దె మీద కూర్చో పెట్టినా, అది దాని ముందటి  నీచ గుణం మార్చుకోదు ...

థూర్జటి కవి ఒక పద్యంలో ‘‘ ఒకరిం జంపి పదస్థులై బ్రదుక నొక్కొక్కరూహింతు రేలకో ...’’ అంటూ ఆశ్చర్య పోయాడు. అంటే, ఒకడిని పదవి నుండి కిందకి లాగేసి, ఆ పదవి తాను దక్కించు కోవాలని ఒక్కొక్కడు ఎందుకో అనుకుంటాడు. అంటే, ఒకడిని వాడి కురిచీ మీద నుండి లాగీసి తాను ఆ కుర్చీ మీదకి ఎక్కడమే కదా ఎందుకో ఈ తాపత్రయం ... ‘‘తామెన్నడు చావరో ? తమకు లేదో మృతి ?’’ అని కూడా అడుగుతాడు కవి.

అదీ కుర్చీ మహిమ ! ప్రతి వాడికీ కుర్చీ కావాలి. అంటే పదవి కావాలి. నిన్నటి వరకూ టీ డబ్బులకి టికాణా లేని నిరుద్యోగి ఉద్యోగం రాగానే కుర్చీకి అతుక్కు పోయి దర్జా వెలిగిస్తాడు. రాజకీయ నాయకులూ అంతే. పదవి వచ్చే వరకూ కాళ్ళూ గడ్డమూ పట్టు కుంటారు. గద్దె నెక్కాక మరి పట్టించుకోరు.

భరతుడు శ్రీరామపాదుకలను సింహాసనం మీద ఉంచి రాజ్యపాలన చేసాడని రామాయణ గాథ. అంటే కుర్చీ మీదే కదా ? రామపాదుకలను వహించిన ఆ కుర్చీ భాగ్యమే భాగ్యం ...

తన కుర్చీని కాపాడు కోడానికే కదా ఇంద్రుడంతటి వాడు  తపోధనుల దగ్గరకి రంభా, మేనకా మొదలయిన దేవ వేశ్యలను పంపిస్తాడు ?కుర్చీ కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఎంత మారణ హోమం జరిగిందో లెక్క లేదు. గతమంతా తడిసె రక్తమున. కాకుంటే కన్నీళులతో .  ఒకప్పుడు మనిళ్ళలో గాడ్రెజ్ కుర్చీలని ఇనుప కుర్చీలు తెగ కనిపించేవి. ప్టాస్టిక్ యుగం మొదలయ్యేక మరుగున పడి పోయేయి..

కూర్చునేందుకు వీలుగా వాడే వన్నీ కుర్చీలే అయినా, కుర్చీల పెద్దన్నలది మరో దారి. సోఫాల పేరుతో వ్యవహరించ బడే వారి దర్జాయే వేరు. వాటిలో మళ్ళీ కుషన్ సోఫాలు మరీ ప్రత్యేకం. సగం ఇంటిని అవే ఆక్ర మిస్తాయి. పెద్ద పెద్ద ఇళ్ళలో అయితే ఫరవా లేదు కానీ, చిన్న కొంపల్లో కూడా దర్జా వెలగ బెట్టడం కోసం పెద్ద పెద్ద సోఫాలు ఇరుగ్గా ఇరకాటంగా కనిపిస్తూ ఉండడం చూస్తుంటాం.. ఆధిక్య ప్రదర్శనకి అదో సద్ధతి మరి ...
సన్మాన సభల్లోనూ, వివాహ వేడుకల్లోనూ ప్రత్యేకంగా ఉపయోగించేవి మహారాజా కుర్చీలు. ఇవి వెనుకటి రోజుల్లో రాజుల సింహాసనాల్లా గొప్ప హోష్ గా ఉంటాయి.


కృష్ణ దేవరాయల వారి సభా భవనంలో ఎనిమిది కుర్చీలను ప్రత్యేకంగా వేసే వారు. అందులో అష్ట దిగ్గజకవులు ఆసీనులయేవారు. అందులో పెద్ద కుర్చీ పెద్దనది.

వెనుకటి రోజులలో సినిమా హాళ్ళలో నేల, బెంచీ, కుర్చీ, బాల్కనీ అనే తరగతులుండేవి. నేలంటే నేలే. కటిక నేల మీదో, ఇసక మీదో కూర్చుని తమ చుట్టూ మరొకరు చేరకుండా ఉమ్మి వేసి ఆ స్థలాన్ని వో దుర్గంగా మార్చీసుకుని మహా విలాసంగా సినిమా చూసే వాళ్ళు.. సోడాల వాళ్ళూ, జంతికలు, కరకజ్జాలూ. వంటి తినబండారాలమ్మే వారి అరుపుల తోనూ నేల తరగతి నానా గలీజుగా ఉండేది. ఈలలూ. చప్పట్లూ తెగ బీభత్సం చేసేవి. మరో అణావో, బేడో పెడితే బెంచీ క్లాసు. ఆపైది కుర్చీ క్లాసు. బాల్కనీ తరగతి మరీ ధనవంతుల తరగతిగా ఉండేది. మరీ టూరింగు హాళ్ళలో నయితే, కొన్ని కుర్చీలు ఊరి పెద్ద మనుసుల కోసం స్పెషల్ గా వేసేవారు. అసలు, వారొచ్చి, ఆ కుర్చీలను అలంకరిస్తే కానీ ఆట మొదలయేది కాదు. సినిమాకే కాదు, నాటకాలకీ, హరికథలకీ, ఇతర సభలకీ కూడా అంతే.

సభలలో అయితే కుర్చీలను ‘‘ఆసనం’’ అని గౌరవిస్తూ ఉంటారు. ఫలానా వారు వచ్చి తమ ఆసనాన్ని అలంకరించాలని కోరుతున్నాము అంటే వచ్చి కుర్చీలో  కూచుని ఏడవరా నాయనా అనే అర్ధం.

భోజనం బల్లలని ( డైనింగు టేబిళ్ళని ) కుర్చీల సంఖ్యతోనే  చెప్పడం వొక రివాజు. గమనించేరా ? మా ఇంట్లో డైనింగు టేబిలు ఆరు కుర్చీలదండీ ... అంటే, మా ఇంట్లో నాలుగు కుర్చీలదే సుమండీ, అదయితేనే సౌకర్యంగా ఉంటుంది అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి ...

ఇంటర్య్యూలకి వెళ్ళే అభ్యర్ధులకి అధికారులకి ఎదురుగా ఖాళీగా ఉన్న కుర్చీలలో వెంటనే కూర్చోవాలా ? వాళ్ళు అనుమతిస్తేనే కూర్చోవాలా అనేది తెగని సమస్య. ఎంతకీ వాళ్ళు కనికరించకుండా కూర్చోమనక పోతే వాళ్ళడిగే చొప్పదంటు ప్రశ్నలకి కాళ్ళు పీకేలా నిలబడే జవాబులు చెప్పాలి.

టేకిట్ యువర్ ఛైర్ .. అంటే,  నీ కుర్చీ నువ్వుమోసుకొని ఫో అని అర్ధం ఎంత మాత్రమూ కాదు.

కుర్చీకుండే నాలుగు కాళ్ళూ సరిగా లేక పోతే దభాలున కింద పడడం తథ్యం. అందు వల్ల కొందరు బుద్ధిమంతులు ఎందుకయినా మంచిదని కూర్చునే ముందు కుర్చీని కొంచెం  లాగి, కదిపి మరీ చూసుకుని ఏ ప్రమాదమూ లేదని నిశ్చయించు కున్నాకే అందులో కూర్చుంటారు.

ఒకప్పుడు వీధి బడుల్లో తుంటరి పిల్లలు అయ్యవార్ల కుర్చీల కింద టపాసులు పెడుతూ అల్లరి చేసేవాళ్ళు.

కుర్చీలగురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది.పడక కుర్చీ వైభోగమే వేరు. అందులో ఉంటే సగం కూర్చున్నట్టూ, సగం పడుకున్నట్టూ ఉంటుంది. వయసు మళ్ళిన వారికి ఇది మరీ అనువైనది. పడక కుర్చీ కబుర్లు అనీ ... ఏ పనీ పాటూ లేని కబుర్ల గురించి హేళన చేయడం కూడా ఉంది. ఇప్పుడయితే రాత్రి వేళ తిరిగే దూర ప్రయాణాల బస్సుల్లో ఈ రకం కుర్చీలు కొద్దిపాటి మార్పుతో ఉంటున్నాయి. రైళ్ళలోనూ, విమానాల్లోనూ ఈ తరహా కుర్చీలను హాయిగా రిలాక్సింగ్ గా ప్రయాణం  కోసంఅమరుస్తున్నారు ...అయితే వాటిని కుర్చీలు అనకుండా, సీట్లు అని అంటారు లెండి...

ఇక, మీకు కుర్చీలాట తెలుసు కదా ? అదేనండీ , మ్యూజికల్ ఛైర్ ఆట ! గుండ్రంగా కుర్చీలను అమర్చి, దాని చుట్టూ లయబద్ధంగా వినిపించే సంగీతానికో, పాటకో అనుగుణంగా తిరుగుతూ ఉండాలి. ధ్వని ఆగి పోగానే చప్పున దొరికిన కుర్చీలో కూర్చోవాలి. తిరిగే వారి సంఖ్య కంటె అక్కడ పెట్టే కుర్చీల సంఖ్య ఒకటి తక్కువగా ఉండేలా చూస్తారు కనుక, తప్పని సరిగా ఒకరికి కూచోడానికి కుర్చీ దొరకదు. అతడు ఔటయినట్టే లెక్క. ఇలా తడవ తడవకీ ఒక్కో కుర్చీ తీసేస్తూ ఉంటారు. చివరకి ఇద్దరు వ్యక్తులూ, ఒక్క కుర్చీ మాత్రమే మిగలడం జరుగుతుంది. మళ్ళీ వారిలో ఒక్కరే విజేతగగా నిలుస్తారు ...ఈ ఆటలో  కుర్చీలకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు ! పాట ఆగిందా ! సీటు గోవిందా !! అనే పాటా, ఆ సన్నివేశం ఉన్న సినిమా గుర్తుందా ?

ఒకప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు మాత్రమే వాడే రివాల్వింగు కుర్చీలు ఇప్పుడు చాలా మందికి అందుబాటు లోకి వచ్చేయి. డెస్క్టాప్ ముందు అవి మరీ అవసరమయ్యేయి.

గవర్నమెంటు ఆఫీసుల్లో గుమాస్తాల కుర్చీలు పని వేళల్లో ఖాళీగా ఉండడం ఆఫీసర్ల చేతగాని తనానికి లేదా ఉదార స్వభావానికీ నిదర్శనం.


ఇక, కుర్చీ కింద చెయ్యి గురించి మనందరికీ తెలిసినదే. కుర్చీ కింద చేతిని తడిపితే కానీ పనులు జరగవు.

కూర్చున్న కుర్చీకి ఎసరు అంటే, ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియని స్థితి. ప్రైవేటు ఉద్యోగాల్లో, ముఖ్యంగా మీడియా రంగంలో పని చేసే వారికి ఈ భయం జాస్తి అంటారు ...

ఇక, రకరకాల డిజైన్లలో కుర్చీలకి కొదవే లేదు ...మచ్చుకి వొకటి చూడండి ..
పూర్వపు రాజుల రత్న ఖచిత సింహాసనాల్లాగా ఇప్పటికీ విలాసవంతులూ, జనం ధనం తెగ కాజేసిన వాళ్ళూ ఇళ్ళలో బంగారంతో చేసిన కుర్చీలని వినియోగించిన వైనం ఇటీవలి కాలంలో చూసేం.

‘‘ నిన్న మావారి సన్మానానికి జనం బాగా వచ్చేరుట ... సగం హాలు నిండిందిట !‘‘ అందొకావిడ గొప్పగా.

‘‘ పోదూ బడాయి !.. సగం కుర్చీలు ఖాళీయేనట ! మావారు చెప్పారు ’’ అని మూతి మూడు వంకర్లు తిప్పిందిట పక్కింటావిడ.

మరో ముఖ్య విషయం ... పార్టీ టిక్కెట్టు రాని అభ్యర్ధుల అనుచరగణం తమ అక్కసంతా ముందుగా కుర్చీల మీదే చూపిస్తూ ఉంటారు. కుర్చీలను విరిచి పోగులు పెట్టే దృశ్యం తరచుగా చూస్తూ ఉంటాం.. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు .. ఎవరి మీదనో కోపం కుర్చీల మీద చూపడం సబఁవా ? మీరే చెప్పండి ? అప్పుడే కాదు, సభల్లోనూ, ఆఫీసుల్లోనూ. ఆస్పత్రులలో, ఇక్కడా అక్కడా అనేమిటి లెండి, ఎవరికి కోపం వొచ్చినా విరిగేవి కుర్చీలే !

2, జూన్ 2015, మంగళవారం

అంతా బూతేనా ?!కవి చౌడప్ప పేరెత్తితే చాలును, థూ ... అంతా బూతు ! అనెయ్యడం తెలిసిన విషయమే.
చౌడప్ప నిజంగా అన్నీ బూతు పద్యాలే రాసాడా ? కాదనే చెప్పాలి. అందుకే మన సాహిత్య కారులు కవుల చరిత్రలు రాస్తూ కవి చౌడప్పకు సముచిత స్థానమే ఇచ్చారు.
కంద పద్యాలలో రచించాడు కవి తన చౌడప్ప శతకాన్ని. కవికి తనలా వేరొకరు కంద పద్యాలను రాయ లేరనే ఆత్మ ప్రత్యయం ఎక్కువ. అందుకే ఎంత థీమాగా చెప్పాడో చూడండి:
ముందుగ చను దినములలో
కందమునకు సోమయాజి ఘనుడందురు నే
డందరు నను ఘనుడందురు
కందమునకు కుందవరపు కవి చౌడప్పా.
భావం : పూర్వం రోజులలో కందపద్య రచనకు తిక్కన గారిది అందె వేసిన చేయి అంటారు. ఇవాళ నన్ను కంద పద్య రచనలో ఘనుడినని అంటారు.
కందము నీవలె జెప్పే
యందము మరిగాన మెవరియందున గని సం
క్రందన యసదృశనూతన
కందర్పా ! కుందవరపు కవిచౌడప్పా.
భావం: నీలా ఇంత అందంగా కందం చెప్పడం మరెవరికీ చాతకాదయ్యా ! నువ్వు ఇంద్రునితో సమానమైన నూతన మన్మథుడివి సుమీ ! అని కవి తన గురించీ, తన కంద పద్యం గురించీ చెప్పాడు.
కందముల ప్రాసగణయతు
లందముగా కవిత నెందరల్లరు విను నీ
కందంబులు రససన్మా
నందంబులు కుందవరపు కవిచౌడప్పా.
భావం: గణాలూ, యతులూ ,ప్రాసలూ కుదిరేలా చూసుకుని ఎందరు కంద పద్యాలను అల్ల లేదు ?
కాని, నీ కందాలు మాత్రం మహా రుచికరంగా భేషుగ్గా ఉంటాయి సుమీ !
నా నీతి వినని వానిని
భానుని కిరణములు మీద బారని వానిన్
వానను తడియని వానిని
గాననురా కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఈ కవికి ఎంత ఆత్మవిశ్వాసం అంటే, తను చెప్పే నీతులు వినని వాడూ, ఎండ వేడిమి తగలని వాడూ, వానలో తడవని వాడూ ఎవడూ ఉండడు. అలాంటి వాడిని తను చూడ లేదుట !
తెలుగులో పచ్చి బూతు కవిగా ముద్ర పడి పోయిన చౌడప్ప బూతులూ, అశ్లీల శృంగారం పెచ్చు మీరిన పద్యాలు రాయక పోలేదు. అయితే రాసిన వన్నీ బూతులే కావు. చక్కని నీతి పద్యాలూ మిక్కుటంగానే ఉన్నాయి.
హాస్యం కోసం బూతాడక తీరదనుకునే రోజుల వాడు మన కవి.
నీతులకేమి యొకించుక
బూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులురా! కుందవరపు కవిచౌడప్పా.
భావం: నీతులు చెప్పడానికేం ! ఓ ! చాలా ఉన్నాయి. కానీ కొంచెమయినా బూతు మాటలు పలుకక పోతేనవ్వు పుడుతుందిటయ్యా ? రాజులను నవ్వించాలి కదా ! నీతులు, బూతులు రెండూ సమానమైన లోకఖ్యాతికరాలే కదా !
పది నీతులు పదిబూతులు
పది శృంగారములు గల్గు పద్యము సభలన్
చదివిన వాడే యధికుడు
కదరయ్యా కుందవరపు కవిచౌడప్పా.
భావం: పది నీతులు, పది బూతులు , పది శృంగార పద్యాలు సభలో చదివిన వాడే గొప్పవాడు కదా.!
ఛీ ! బూతు ! అంటూ ముఖం వికారంగా పెట్టే వాళ్ళకి కవి ఓ గట్టి చురకే వేసాడండోయ్ !
బూతని నగుదురు గడు తమ
తాతలు ముత్తాత మొదలు తరముల వా
రే తీరున జన్మించిరొ !
ఖ్యాతిగ మరి కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఛీ ! పచ్చి బూతు ! అన్న వాళ్ళే ఆ బూతుని నవ్వుతూ వింటారు. వాళ్ళ తాతముత్తాతలు బూతు లోంచి కాక పోతే మరెలా పుట్టుకొచ్చారు ?
జానపదులలో విస్తారంగానూ, నాగరికులలో రవంత అరుదుగానూ వినిపిస్తూ, నిఘంటువులలో ఎక్కడో మారుమూల బిక్కు బిక్కుంటూ ఉండే బూతు మాటలను ఈ కవి నిర్భీతిగా, ఏ మొఖమాటాలకీ తావు లేకుండా, గుట్టూ మట్టూ లేకుండా చాలా పద్యాలలో వాడిన మాట నిజమే అయినా, చౌడప్ప వన్నీ బూతు పద్యాలే కావు. చక్కని కందాలూ, ఎంచక్కని వృత్త పద్యాలూ చాలా ఉన్నాయి.
నీచులనూ, నీతి బాహ్యులనూ, మేక వన్నె పులలనూ, కుహనా మేథావులనూ, ఈ కవి ఏ శషభిషలూ లేకుండా జలకడిగి పారేస్తాడు.
చూడండి:
వేడుక పడి వినవలెనా
దోడు కవిత్వంబునైన తులువ నలువురన్
గోడిగము సేయు వాడే
గాడిదరా ! కుందవరపు కవిచౌడప్పా.
భావం: కవిత్వాన్ని చదవాలి. చక్కగా ఆస్వాదించాలి. అంతే కానీ దానితో నలుగురినీ హేళన చెయ్య కూడదు. అవమానించ కూడదు. అలా చేసే వాడు తుంటరి గాడిద !
ఇయ్యా యిప్పించ గల
యయ్యలకే గాని మీస మన్యుల కేలా ?
రొయ్యకు లేదా మీసము
కయ్యానకు కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఇచ్చే వాడికీ, ఇప్పించగల వాడికీ మీసాలు ఉండాలి. కానీ మిగతా పనిమాలిన వెథవలందరికీ మీసాలెందుకూ దండగ ! రొయ్యకు బారెడు మీసం ఉంటుంది ! ఎందుకూ !
మునుపాడి వెనుక లేదను
పెను గొంటె గులాము నోరు పీతిరి గుంటే
యనిఘనుడు సత్య వాక్యమె
గన వలెరా కుందవరపు కవిచౌడప్పా.
భావం: ముందు ఇస్తానని మాట యిచ్చి , తరువాత లేదు పొమ్మంటాడే, వాడి నోరు అశుద్ధం గొయ్యితో సమానం ! ఈ మాటలు పూర్తిగా నిజం.
పెద్దన వలె కృతి చెప్పిన
పెద్దన వలె ; నల్ప కవిని పెద్దన వలెనా ?
ఎద్దన వలె, మొద్దన వలె
గ్రద్దన వలె కుందవరపు కవిచౌడప్పా.
భావం: అల్లసాని పెద్దన లాగా కవిత్వం చెప్పిన కవినే పెద్ద అనాలి కానీ, తక్కిన పనికి మాలిన కవులని అందరినీ పెద్ద అనాలా ? ఎద్దనాలి. మొద్దనాలి. గ్రద్ద అనాలి.
కీలెరిగి వాత పెట్టడ మంటే ఇదే కాబోలు.
తులసీదళముల హరిపద
జలజంబుల పూజసేయు సరసుల యమ దూ
తలుజూచిఏమి చేయం
గలరప్పా కుందవరపు కవిచౌడప్పా.
భావం: హరి పాద పద్మాలకు తులసీ దళాలతో పూజ చేసే వాడిని యమ దూతలు కూడా ఏమీ చెయ్య లేరు !
పరవిత్తము గోమాంసము
పరసతి తన తల్లి యనుచు భావించిన యా
నరుడు నరుండా రెండవ
కరి వరదుడె  కుందవరపు కవిచౌడప్పా.
భావం: పరుల సొమ్ము గోమాంసంతో సమానంగానూ, పరుల భార్యలను తల్లితో సమానంగానూ ఎవడయితే చూస్తాడో, వాడు అపర నారాయణుడే !
వానలు పస పైరులకును
సానలు పస వజ్రములకు సమరంబులకున్
సేనలు పస మృగజాతికి
కానలు పస కుందవరపు కవిచౌడప్పా.
భావం: పంటలకు వానలే పస. సానపట్టడం వల్ల వజ్రాలు కాంతితో మెరుస్తూ ఉంటాయి. యుద్ధాలకి సేనలు తగిన బలం. జంతువులకు క్షేమకరమయిన తావులు అవడులే.
పులి నాకి విడుచు దైవము
గల వానికి దైవ బలము గలుగని వేళం
గలహించి గొఱ్ఱె కరచును
కలియుగము కుందవరపు కవిచౌడప్పా.
భావం: దేవుని దయ ఉంటే, పులి కూడా వాడిని ఏమీ చేయదు. అలా తడిమి వదిలేస్తుంది. దైవ బలం లేక పోతే, గొఱ్ఱె కూడా కరుస్తుంది ! కలి కాలపు వింత అంటే ఇదే !
పాండవు లిడుమల బడరే
మాండవ్యుడు కొరత బడడె మహి ప్రాకృత మె
వ్వండోపు మీరి చనగ న
ఖండిత యశ కుందవరపు కవిచౌడప్పా.
భావం: చేసుకున్న వాళ్ళకి చేసుకొన్నంత ! పాండవులు ఎన్న కష్టాలు అనుభవించ లేదు ? మాండవ్య ముని కొరత పడ లేదూ ! పూర్వ జన్మలో చేసిన పాపాలు తప్పించు కోవడం ఎవరి తరమూ కాదు.
ఆడిన మాటను తప్పిన
గాడిద కొడకంచు తిట్టగావిని మదిలో
వీడా ! నా కొడుకని యేడ్చెను
గాడిదయును కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఆడిన మాటను తప్పిన వాడిని గాడిదా ! అని తిడితే వీడా నా కొక కొడుకు ! అని గాడిద కూడా ఏడిచిందిట !
మూలిక క్రియ కొదిగినదే
నాలుక సత్యంబు గలదె నడిపిన వాడే
యేలిక వరమిచ్చినదే
కాళికరా ! కుందవరపు కవిచౌడప్పా.
భావం: మందుకు పనికొచ్చేదే మూలిక. సత్యం పలికేదే నాలుక. చక్కగా పాలించే వాడే ఏలిక. వరమిచ్చేదే దేవత !
కుటుంబ వ్యవస్థ పట్ల కవి చౌడప్పకి ఎంత గౌరవమో చూడండి:
తన సతి యిడగా మనుమలు
తనయులు తలిదండ్రులన్న దమ్ముల్ బంధుల్
దినదినములు భుజియించుట
ఘనవిభవము కుందవరపు కవిచౌడప్పా.
భావం: భార్య వడ్డిస్తూ ఉంటే, మనుమలు, తల్లిదండ్రులూ, అన్నాదమ్ములు, బంధువులూ అందరూ కలిసి రోజూ భోజనం చెయ్యడం ఎంత వైభవంగా ఉంటుందో కదా !
సరసము చతురోపాయము
హరి భక్తియు శాంత గునము నర్థుల పట్లన్
పరమౌ చుపకారము విను
కరుణాకర కుందవరపు కవిచౌడప్పా.
భావం: సరసం, చతురోపాయం, హరి భక్తి, శాంత గుణం, ఉపకార బుద్ధి కలిగి ఉండాలి.
సీమ దయా పరుడేలిన
క్షేమంబగు దోసకారి సీమేలినచో
క్షామంబగు నతడేలే
గ్రామంబున కుందవరపు కవిచౌడప్పా.
భావం: దయాపరుడైన వాడు నేలను పరిపాలిస్తే అంతా సుభిక్షంగా ఉంటుంది. దుర్మార్గుడు పాలిస్తే అంతటా కరువే .
చౌడప్ప కవి వర్గ దృక్పథం ఎలాంటిదంటే,
ఎన్నగల యడవి మృగముల
కన్నీరేమైన వేటగానికి ముద్దా ?
నన్నాపు దొరకు బీదల
కన్నీరును కుందవరపు కవిచౌడప్పా.
భావం: వేట గాడికి అడివి జంతువు కన్నీళ్ళు ముద్దా యేమిటి ? వాటికతడు కరిగి పోతాడా ? అలాగే దోచు కునే దొరకు పేదవారి కన్నీళ్ళు ముద్దొస్తాయా ?
చౌడప్ప వృత్త పద్యాలలో మచ్చు కొకటి చూడండి:
ఆసలజేరి దుర్గుణ గణాఢ్యుని దాత వటంచు వేడినన్
మీసలము దువ్వుచున్ దిశల మీదన చూచుచు దుర్మథాంథుడై
మీసము నియ్య లేని నలు విత్త గులాము కీర్తి చేరునా ?
భూసుర వర్య కుందవర భూషణ చౌడ కవీశ్వరోత్తమా !
భావం: దుర్మార్గుడిని మన ఆశ కొద్దీ దాతవు అని వేడుకొంటే యేమవుతుంది ? మీసాలు మెలి త్రిప్పుతాడు. పైకీ కిందకీ చూస్తాడు. వీసం కూడా ఇవ్వడు. ఆ వెధవకి ఏం కీర్తి వస్తుంది చెప్పండి
కావాలనే చాలా బూతు పద్యాలు చెప్పాడు. అలాగే చాలా నీతులూ చెప్పాడు. ఆ సంగతి కవి ఇలా స్పష్టం చేస్తున్నాడు:
బూతులు కొన్నిట కొన్నిట
నీతులు చెప్పితి బుధులు నీతులబూతుల్
బూతుల మెచ్చందగు నతి
కౌతుక మతి కుందవరపు కవిచౌడప్పా.
భావం: నా పద్యాలలో కన్నింట నీతులు చెప్పాను. అలాగే, కొన్నింట బూతులూ చెప్పాను. తెలివైన వాళ్ళు నేను చెప్పిన నీతులతో పాటు ఆ బూతులనీ మెచ్చు కోవాలి సుమా !
చౌడప్ప కవి దెబ్బ ఎలాంటిదంటే ....
కాకులు వేవేలొక్క తు
పాకి రవము విన్న నులికి పడవా మరి ! నా
ఢాకకు తగు నాలాగే
కాకవులును కుందవరపు కవిచౌడప్పా.
భావం: ఒక్క తుపాకి చప్పుడు వినగానే వేల కొద్దీ కాకులయినా సరే తుర్రుమంటూ ఎగిరి పోతాయ్ ! కదా ! అలాగే, కువులు కూడా నా దెబ్బకు అదిరి పోవలసినదే !
ఏం పెంకెతనం !
ఈ టపా రాసి post చెయ్య బోతూ ఉంటే వచ్చేడు మా తింగరి బుచ్చిగాడు. వస్తూనే వంటింటి వాసలనలని పసి కట్టేసి, ఇవాళ టిపిను పెసరట్లలా ఉందే ! అని సంతోషంగా నవ్వీసి , నేను రాసినదంతా చదివేడు.
‘‘ ఛ ! నువ్వు కూడా ఇంత దిగజారి పోతా వనుకో లేదు. నీ దిక్కుమాలిన కథా మంజరి బ్లాగులో ఇంత కాలం ఏవో పద్యాలూ, శ్లోకాలూ పెడుతూ నీ చేతి దురద తీర్చు కుంటున్నావంటే పోనీ లెమ్మను కున్నాను.. చివరకి ఈ అప్ప కవిగాడి పద్యాలు పెట్టే స్థితికి వచ్చేవన్నమాట !’’
అంటూ ఘాటుగా విమర్శించాడు. నేను కొయ్యబారి పోయేను.
వాళ్ళక్కయ్య ( సొంత సోదరి కాదు లెండి. వరసకి అక్కయ్య. అదీ వాడు కలుపుకొన్న వరసే)
పెసరట్టూ, ఉప్మా టిఫిను పెట్టి, కమ్మని కాఫీ ఇస్తే తాగి నిమ్మళించేడు.
అప్పుడన్నాడు: ‘‘ హు ! నీ ఏడుపేదో నువ్వు ఏడువ్. నాకెందుకు గానీ, ఆ అప్ప కవిగాడి మిగతా పద్యాలన్నీ ఎక్కడ దొరుకుతాయ్ ?!’’ అన్నాడు సూటిగా.
ఈ మారు నిఝంగానే ( ఒక మేజా బల్ల చేయించు కోడానికి సరిపడేటంతగా ) కొయ్యబారి పోయేను.