16, జూన్ 2015, మంగళవారం

కుర్చీల కథ !


కప్పల కథా, చెప్పుల కథా రాయగా లేనిది కుర్చీల కథ రాస్తేనేం ?

అందుకే ఇప్పుడీ కుర్చీల కథ రాయడం జరుగుతోంది ... అవధరించండి ...

పెద్దలు కురిచీ అనే పదం దేశ్య విశేష్యమని చెబుతారు. కూర్చోడానికి వీలుగా ఉండే ఎత్తయిన పీఠమని నైఘంటుకార్ధం. కుర్చీ అని దీనికి రూపాంతరం కూడా ఉంది. అసలు కంటే కొసరు ముద్దనీ, కురిచీ అనే పదం కంటే కుర్చీ అనేదే బాగా వాడుకలోకి వచ్చింది.



సరే, ఏదయితేనేం, డబ్బూ దస్కం, నీతి నియమాలూ, మనుషుల నడుమ ప్రేమాభిమానాలూ, ... ఇలా ఏవి లేక పోయినా, కనీసం కూర్చోడానికి వో కుర్చీ అంటూ లేని కొంప ఎక్కడా ఉంటుందనుకోను.

కుర్చీ మర్యాదకి చిహ్నం. ఆతిథ్యానికి ఆనవాలు. స్వాగత వచనానికి మారు పేరు. కాసేపు సేద దీరడానికి అనువైన ఉపకరణం. విశ్రమించడమే కాదు, కాలు మీద కాలు వేసుకుని కాస్త దర్పం ఒలకబోయడానికి కూడా తగినది కుర్చీయే కదా !

చెక్క బల్ల, పీట, స్టూలు మొదలయినవి కూడా కూర్చునేసాధనాలే. ఇలాంటివన్నీ కుర్చీలకి తమ్ముళ్ళు అనొచ్చు. చిన్న చిన్న కాకా హొటళ్ళలో కూర్చోడానికి కుర్చీలకు బదులు బల్లలే వేస్తారు. పోతే, సోఫాలూ అవీ మామూలు కుర్చీలకి పెద్దన్నలు. మహా రాజా కుర్చీలయితే మరీనూ, అవి కుర్చీల కుల పెద్దలు.

‘‘ కూర్చుండ మా యింట కురిచీలు లేవు ,,,’’ అంటారు కరుణ శ్రీ. మరీ చోద్యం కాక పోతే కనీసం వో పాత కాలపు ఇనప కుర్చీ అయినా ఉండి ఉండదా ?

వో సంగతి గర్తుకొచ్చింది. చెబుతా వినండి. కరుణశ్రీ గారు మా విజీనారం సంస్కృత కాలేజీకి వచ్చి నప్పటి సంగతి. వారు మాట్లాడుతూ వో సంగతి చెప్పారు. కొంత మంది కాలేజీ అమ్మాయిలు ఓ సారి వారింటికి వచ్చేరుట. అందులో వో గడుగ్గాయి కవి గారితో ‘‘ ఏఁవండీ ... మీ ఇంట్లో ఇన్ని కుర్చీ లున్నాయి కదా ... మరి

‘ కూర్చండ మా ఇంట కురిచీలు లేవు ! ’ అని రాసేరేఁవిటండీ అబద్ధం కాదూ ? ’’ అని అడిగిందిట. కవిగారు వెంటనే ‘‘ అమ్మాయీ, అది కవిత్వం. కుర్చీలు లేవంటే లేవని కాదు దానర్ధం. ఆ స్వామి కూచోడానికి తగిన చోటులు కురిచీలు కావు... అందుకే నా హృదయాంకమే సిద్ధ పరచ నుంటి అని చెప్పారుట.ఈ విరణ ఆ అమ్మాయికి  ఏమర్ధ మయిందో కానీ ‘‘సరే లెండి ఇంకెప్పుడూ అబద్ధాలు రాయకండి’’ అందిట. అంతే సభలో నవ్వులే నవ్వులు ! చప్పట్లే చప్పట్లు ! ...



‘‘ కుర్చీలు విరిగి పోతే కూర్చోడం మాన నట్లు ...’’ అంటూ శ్రీ .శ్రీ  వో గేయంలో  కుర్చీల  ప్రస్తావన తెచ్చాడు. అగ్గి పుల్లనీ. సబ్బు బిళ్ళనీ వదలని కవి కుర్చీల మాట ఎత్తాడంటే అబ్బుర మేముంది లెండి ?

మీకు తెలిసిన పద్యమే ...

కనకపు సింహాసనమున
శునకము కూర్చుండ బెట్టి శుభ లగ్నమునన్
ఒనరగ పట్టము గట్టిన
వెనుకటి గుణ మేల మాను ? వినరా సుమతీ !

కుక్కని  బంగారు గద్దె మీద కూర్చో పెట్టినా, అది దాని ముందటి  నీచ గుణం మార్చుకోదు ...

థూర్జటి కవి ఒక పద్యంలో ‘‘ ఒకరిం జంపి పదస్థులై బ్రదుక నొక్కొక్కరూహింతు రేలకో ...’’ అంటూ ఆశ్చర్య పోయాడు. అంటే, ఒకడిని పదవి నుండి కిందకి లాగేసి, ఆ పదవి తాను దక్కించు కోవాలని ఒక్కొక్కడు ఎందుకో అనుకుంటాడు. అంటే, ఒకడిని వాడి కురిచీ మీద నుండి లాగీసి తాను ఆ కుర్చీ మీదకి ఎక్కడమే కదా ఎందుకో ఈ తాపత్రయం ... ‘‘తామెన్నడు చావరో ? తమకు లేదో మృతి ?’’ అని కూడా అడుగుతాడు కవి.

అదీ కుర్చీ మహిమ ! ప్రతి వాడికీ కుర్చీ కావాలి. అంటే పదవి కావాలి. నిన్నటి వరకూ టీ డబ్బులకి టికాణా లేని నిరుద్యోగి ఉద్యోగం రాగానే కుర్చీకి అతుక్కు పోయి దర్జా వెలిగిస్తాడు. రాజకీయ నాయకులూ అంతే. పదవి వచ్చే వరకూ కాళ్ళూ గడ్డమూ పట్టు కుంటారు. గద్దె నెక్కాక మరి పట్టించుకోరు.

భరతుడు శ్రీరామపాదుకలను సింహాసనం మీద ఉంచి రాజ్యపాలన చేసాడని రామాయణ గాథ. అంటే కుర్చీ మీదే కదా ? రామపాదుకలను వహించిన ఆ కుర్చీ భాగ్యమే భాగ్యం ...

తన కుర్చీని కాపాడు కోడానికే కదా ఇంద్రుడంతటి వాడు  తపోధనుల దగ్గరకి రంభా, మేనకా మొదలయిన దేవ వేశ్యలను పంపిస్తాడు ?



కుర్చీ కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఎంత మారణ హోమం జరిగిందో లెక్క లేదు. గతమంతా తడిసె రక్తమున. కాకుంటే కన్నీళులతో .  ఒకప్పుడు మనిళ్ళలో గాడ్రెజ్ కుర్చీలని ఇనుప కుర్చీలు తెగ కనిపించేవి. ప్టాస్టిక్ యుగం మొదలయ్యేక మరుగున పడి పోయేయి..

కూర్చునేందుకు వీలుగా వాడే వన్నీ కుర్చీలే అయినా, కుర్చీల పెద్దన్నలది మరో దారి. సోఫాల పేరుతో వ్యవహరించ బడే వారి దర్జాయే వేరు. వాటిలో మళ్ళీ కుషన్ సోఫాలు మరీ ప్రత్యేకం. సగం ఇంటిని అవే ఆక్ర మిస్తాయి. పెద్ద పెద్ద ఇళ్ళలో అయితే ఫరవా లేదు కానీ, చిన్న కొంపల్లో కూడా దర్జా వెలగ బెట్టడం కోసం పెద్ద పెద్ద సోఫాలు ఇరుగ్గా ఇరకాటంగా కనిపిస్తూ ఉండడం చూస్తుంటాం.. ఆధిక్య ప్రదర్శనకి అదో సద్ధతి మరి ...




సన్మాన సభల్లోనూ, వివాహ వేడుకల్లోనూ ప్రత్యేకంగా ఉపయోగించేవి మహారాజా కుర్చీలు. ఇవి వెనుకటి రోజుల్లో రాజుల సింహాసనాల్లా గొప్ప హోష్ గా ఉంటాయి.


కృష్ణ దేవరాయల వారి సభా భవనంలో ఎనిమిది కుర్చీలను ప్రత్యేకంగా వేసే వారు. అందులో అష్ట దిగ్గజకవులు ఆసీనులయేవారు. అందులో పెద్ద కుర్చీ పెద్దనది.

వెనుకటి రోజులలో సినిమా హాళ్ళలో నేల, బెంచీ, కుర్చీ, బాల్కనీ అనే తరగతులుండేవి. నేలంటే నేలే. కటిక నేల మీదో, ఇసక మీదో కూర్చుని తమ చుట్టూ మరొకరు చేరకుండా ఉమ్మి వేసి ఆ స్థలాన్ని వో దుర్గంగా మార్చీసుకుని మహా విలాసంగా సినిమా చూసే వాళ్ళు.. సోడాల వాళ్ళూ, జంతికలు, కరకజ్జాలూ. వంటి తినబండారాలమ్మే వారి అరుపుల తోనూ నేల తరగతి నానా గలీజుగా ఉండేది. ఈలలూ. చప్పట్లూ తెగ బీభత్సం చేసేవి. మరో అణావో, బేడో పెడితే బెంచీ క్లాసు. ఆపైది కుర్చీ క్లాసు. బాల్కనీ తరగతి మరీ ధనవంతుల తరగతిగా ఉండేది. మరీ టూరింగు హాళ్ళలో నయితే, కొన్ని కుర్చీలు ఊరి పెద్ద మనుసుల కోసం స్పెషల్ గా వేసేవారు. అసలు, వారొచ్చి, ఆ కుర్చీలను అలంకరిస్తే కానీ ఆట మొదలయేది కాదు. సినిమాకే కాదు, నాటకాలకీ, హరికథలకీ, ఇతర సభలకీ కూడా అంతే.

సభలలో అయితే కుర్చీలను ‘‘ఆసనం’’ అని గౌరవిస్తూ ఉంటారు. ఫలానా వారు వచ్చి తమ ఆసనాన్ని అలంకరించాలని కోరుతున్నాము అంటే వచ్చి కుర్చీలో  కూచుని ఏడవరా నాయనా అనే అర్ధం.

భోజనం బల్లలని ( డైనింగు టేబిళ్ళని ) కుర్చీల సంఖ్యతోనే  చెప్పడం వొక రివాజు. గమనించేరా ? మా ఇంట్లో డైనింగు టేబిలు ఆరు కుర్చీలదండీ ... అంటే, మా ఇంట్లో నాలుగు కుర్చీలదే సుమండీ, అదయితేనే సౌకర్యంగా ఉంటుంది అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి ...

ఇంటర్య్యూలకి వెళ్ళే అభ్యర్ధులకి అధికారులకి ఎదురుగా ఖాళీగా ఉన్న కుర్చీలలో వెంటనే కూర్చోవాలా ? వాళ్ళు అనుమతిస్తేనే కూర్చోవాలా అనేది తెగని సమస్య. ఎంతకీ వాళ్ళు కనికరించకుండా కూర్చోమనక పోతే వాళ్ళడిగే చొప్పదంటు ప్రశ్నలకి కాళ్ళు పీకేలా నిలబడే జవాబులు చెప్పాలి.

టేకిట్ యువర్ ఛైర్ .. అంటే,  నీ కుర్చీ నువ్వుమోసుకొని ఫో అని అర్ధం ఎంత మాత్రమూ కాదు.

కుర్చీకుండే నాలుగు కాళ్ళూ సరిగా లేక పోతే దభాలున కింద పడడం తథ్యం. అందు వల్ల కొందరు బుద్ధిమంతులు ఎందుకయినా మంచిదని కూర్చునే ముందు కుర్చీని కొంచెం  లాగి, కదిపి మరీ చూసుకుని ఏ ప్రమాదమూ లేదని నిశ్చయించు కున్నాకే అందులో కూర్చుంటారు.

ఒకప్పుడు వీధి బడుల్లో తుంటరి పిల్లలు అయ్యవార్ల కుర్చీల కింద టపాసులు పెడుతూ అల్లరి చేసేవాళ్ళు.

కుర్చీలగురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది.



పడక కుర్చీ వైభోగమే వేరు. అందులో ఉంటే సగం కూర్చున్నట్టూ, సగం పడుకున్నట్టూ ఉంటుంది. వయసు మళ్ళిన వారికి ఇది మరీ అనువైనది. పడక కుర్చీ కబుర్లు అనీ ... ఏ పనీ పాటూ లేని కబుర్ల గురించి హేళన చేయడం కూడా ఉంది. ఇప్పుడయితే రాత్రి వేళ తిరిగే దూర ప్రయాణాల బస్సుల్లో ఈ రకం కుర్చీలు కొద్దిపాటి మార్పుతో ఉంటున్నాయి. రైళ్ళలోనూ, విమానాల్లోనూ ఈ తరహా కుర్చీలను హాయిగా రిలాక్సింగ్ గా ప్రయాణం  కోసం



అమరుస్తున్నారు ...అయితే వాటిని కుర్చీలు అనకుండా, సీట్లు అని అంటారు లెండి...

ఇక, మీకు కుర్చీలాట తెలుసు కదా ? అదేనండీ , మ్యూజికల్ ఛైర్ ఆట ! గుండ్రంగా కుర్చీలను అమర్చి, దాని చుట్టూ లయబద్ధంగా వినిపించే సంగీతానికో, పాటకో అనుగుణంగా తిరుగుతూ ఉండాలి. ధ్వని ఆగి పోగానే చప్పున దొరికిన కుర్చీలో కూర్చోవాలి. తిరిగే వారి సంఖ్య కంటె అక్కడ పెట్టే కుర్చీల సంఖ్య ఒకటి తక్కువగా ఉండేలా చూస్తారు కనుక, తప్పని సరిగా ఒకరికి కూచోడానికి కుర్చీ దొరకదు. అతడు ఔటయినట్టే లెక్క. ఇలా తడవ తడవకీ ఒక్కో కుర్చీ తీసేస్తూ ఉంటారు. చివరకి ఇద్దరు వ్యక్తులూ, ఒక్క కుర్చీ మాత్రమే మిగలడం జరుగుతుంది. మళ్ళీ వారిలో ఒక్కరే విజేతగగా నిలుస్తారు ...ఈ ఆటలో  కుర్చీలకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు ! పాట ఆగిందా ! సీటు గోవిందా !! అనే పాటా, ఆ సన్నివేశం ఉన్న సినిమా గుర్తుందా ?

ఒకప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు మాత్రమే వాడే రివాల్వింగు కుర్చీలు ఇప్పుడు చాలా మందికి అందుబాటు లోకి వచ్చేయి. డెస్క్టాప్ ముందు అవి మరీ అవసరమయ్యేయి.

గవర్నమెంటు ఆఫీసుల్లో గుమాస్తాల కుర్చీలు పని వేళల్లో ఖాళీగా ఉండడం ఆఫీసర్ల చేతగాని తనానికి లేదా ఉదార స్వభావానికీ నిదర్శనం.


ఇక, కుర్చీ కింద చెయ్యి గురించి మనందరికీ తెలిసినదే. కుర్చీ కింద చేతిని తడిపితే కానీ పనులు జరగవు.

కూర్చున్న కుర్చీకి ఎసరు అంటే, ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియని స్థితి. ప్రైవేటు ఉద్యోగాల్లో, ముఖ్యంగా మీడియా రంగంలో పని చేసే వారికి ఈ భయం జాస్తి అంటారు ...

ఇక, రకరకాల డిజైన్లలో కుర్చీలకి కొదవే లేదు ...మచ్చుకి వొకటి చూడండి ..




పూర్వపు రాజుల రత్న ఖచిత సింహాసనాల్లాగా ఇప్పటికీ విలాసవంతులూ, జనం ధనం తెగ కాజేసిన వాళ్ళూ ఇళ్ళలో బంగారంతో చేసిన కుర్చీలని వినియోగించిన వైనం ఇటీవలి కాలంలో చూసేం.

‘‘ నిన్న మావారి సన్మానానికి జనం బాగా వచ్చేరుట ... సగం హాలు నిండిందిట !‘‘ అందొకావిడ గొప్పగా.

‘‘ పోదూ బడాయి !.. సగం కుర్చీలు ఖాళీయేనట ! మావారు చెప్పారు ’’ అని మూతి మూడు వంకర్లు తిప్పిందిట పక్కింటావిడ.

మరో ముఖ్య విషయం ... పార్టీ టిక్కెట్టు రాని అభ్యర్ధుల అనుచరగణం తమ అక్కసంతా ముందుగా కుర్చీల మీదే చూపిస్తూ ఉంటారు. కుర్చీలను విరిచి పోగులు పెట్టే దృశ్యం తరచుగా చూస్తూ ఉంటాం.. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు .. ఎవరి మీదనో కోపం కుర్చీల మీద చూపడం సబఁవా ? మీరే చెప్పండి ? అప్పుడే కాదు, సభల్లోనూ, ఆఫీసుల్లోనూ. ఆస్పత్రులలో, ఇక్కడా అక్కడా అనేమిటి లెండి, ఎవరికి కోపం వొచ్చినా విరిగేవి కుర్చీలే !

















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి